Jump to content

కాశీమజిలీకథలు/ఏడవ భాగము/110వ మజిలీ

వికీసోర్స్ నుండి

మంత్రరహస్య విశేషము లుపదేశించెద నని పలికిన నాకలికి ఇంచుక కన్నులు తెరచి చూచి సన్యాసులందఱుఁ గపటాత్ములని నిశ్చయించుకొనియున్న కతంబున వాని మన్నింపనొల్లక మరల కన్నులు మూసికొని యేమియు మాట్లాడినదికాదు.

అప్పుడాసన్యాసి మోమున నలుకదోప సెభాసు ? మంచియోగినివే. నా మహిమ యెఱుంగక యవమానము జేయుచున్నదానవు నీ పులి క్రౌర్య మడంచినట్లె నీగర్వ మడంచెదను చూడుము అబ్బా జేగురుగుడ్డఁ గట్టినంతమాత్రమునఁ బెద్దలఁ దిరస్కరింపవలయునా ? యిప్పుడు నాపాదములంబట్టి శరణుజొచ్చిన మంచిది. లేకున్న నిన్నిప్పుడు కుక్కను జేయిదు చూడుము. అని పలుకుచు భస్మ మరచేతిలోఁ బోసికొని యేదియో యుచ్చరించుచు నాపైదలిమీది కూదెను. అప్పుడా చిన్నది మోము చిట్లించుటఁజూచి యాపులి విలయకాల వరాహకము భంగి బొబ్బఁబెట్టుచుఁ గొబ్బున నాసన్యాసితొడఁ బట్టికొని నేలం బడద్రొసి యవ్వలి యావరణలోని కీడ్చుకొనిపోయినది.

అప్పు డప్పడఁతి అయ్యయో ? చంపకు చంపకు మృగరాజమా విడు విడు అని కేకలు వైచుచు వెంటఁబడినది ఆసన్నగ్రహించి యా సన్యాసి నాసన్నమరణుం జేసి యంతటితో విడిచి యప్పడఁతి యొద్దకు వచ్చినది అప్పు డందున్న వారందరు పెద్దపులి సన్యాసిం జంపినది చంపినది అని యరచుచుఁ దమ్ముఁగూడఁ జంపునను వెరపుతో గోడలెక్కియు ద్వారముల దూరియు నవ్వలకుఁ బారిపోయిరి.

అని యెఱింగించి - ఇట్లని చెప్పందొడంగెను.

110 వ మజిలీ.

ప్రభాకరుని కథ

ప్రద్యోతనుఁడు - తరువాత తరువాత

అర్చకులు -- దేవా ! రాజయోగి వట్టి డాంబికుఁడు. అతని మంత్రమువలన బులి నిలిచిన దనుకొంటిమి. యేమియునులేదు. అ త్తాపసిపైఁ బూతి నూదినం జూచి గాండ్రుమని యరచి తొడఁగరచి యీడ్చుకొని పోయినది. ఆచిన్నది అడ్డ పడకున్న నీపాటి కాసన్యాసి సమాధిలో నుండును‌ దేవా !

రాజు - రాజయోగి బ్రతికియున్నవాఁడా ?

అర్చకులు - చావుతప్పినదికాన గాయము లింతటిలో గుదరవు.

రాజు - అయ్యోపాపము వానికిఁ దగిన నుపచారములు జరుగు చున్నవియా? ఇప్పు డెందున్నవాఁడు ? అర్చ - గోపురము వేదికపైఁబడి మూల్గుచున్నవాఁడు. అది యట్లుండె. నేఁడు స్వామికి నైవేద్యములేదు. గుడిలోనికిఁ బోవుటకు భయమగుచున్నది. ముఖ మంటపములో నాపులి గద్దెవైచుకొని కూర్చున్నది. యేమిచేయవలయునో చెప్పుడు అని నుడివిన విని యారాజు కమారుని రప్పించి ప్రభాకరా ! యోగినీచరిత్రము వింటివా ? పులితో యమునలోఁ గొట్టికొనివచ్చి మన శివాలయములోఁ బ్రవేసించిన దఁట యోగినీప్రభావమున నాపులి యజేయంబై చూచినవారినెల్ల జంపుచున్నదఁట. గుడిలోనున్న రాజయోగిం గరచి ప్రాణావసిస్టుం జేసినదఁట నీవువోయి యా యుపద్రవమునాపి ప్రజలం గాపాడుము. పులి దాపునకుఁబోక వినయముతో నాయోగినిని బ్రార్దించి యవ్వలికిఁ బంపుము. నేఁడుస్వామికి నైనేద్య మాగిపోయినదని పలికిన విని ప్రభాకరుఁ డిట్లనియె.

ఏమీ ? యీయూర నాఘాతుకమృగ మింతక్రౌర్యము జరుపుచుండ నాకేలఁ జెప్పితిరికారు అక్కటా ! రాజయోగిం గరచినదియా ? అయ్యయ్యో ? అతండు బహు తంత్రవేదినని నాతోఁ జెప్పెనే ఆయోగిని వానికన్న నధికురాలు కాఁబోలు. పోయివచ్చెద ననుజ్ఞయిండు. అని పలికిన ప్రభాకరునితో బాబూ పదిలముసుమీ ? మహాత్ముల ప్రభావమచింత్యము. శాంతమునఁబోయి ప్రజల యుపద్రవ ముడిపి రమ్మని చెప్పినంత నా రాజనందనుం డప్పుడ తగుపరివారముతో నర్చకులవెంట శివాలయమున కరిగెను.

గోపురము వేదికపై మూల్గుచున్న రాజయోగిం గాంచి ప్రభాకరుఁడు జాలి పడుచు మహాత్మా ? మీరు పులివాత నేమిటికిఁ బడితిరి ? ఆ యోగిని మహిమ తెలియక నిందించితిరఁట కాదా ? ఇది యొక ప్రారబ్దము చింతింపకుడు అని యూరడించి యుపచారములఁ జేయ గొందఱఁ బరిచారకుల నియమించి వేరొక మందిరమునకు బంపెను.

తరువాత అతండు గుడిలోపలి యావరణలోనికిం బోవ బ్రయత్నించిన అర్చకులు వారించిరి. అప్పుడు గోడ యెక్కి లోపలి విశేషంబులఁ బరికింపు చుండెను.

అప్పుడా చిన్నది తన రెండు చేతులతో నాపులినోరు పెకలించి ఫలముల లోనికిఁ జొనుపుచు మృగేంద్రమా ! నన్నేల వేపెదవు ? ఆహారము దినక యెన్ని దినము లిట్లుపవాసము జేయుదువు? ఈ ఫలముల భక్షింపుము అయ్యో ? నీ డొక్కలు రెండు అంటుకొనిపోయినవిగదా నా కర్మము నీ సహవాసము నాకేల రావలయును యోగసక్తను శాపగ్రస్తం జేసితివి నీవునుం గుడువక గెడసితివేని నాచెలిమి సాద్గుణ్య మగును తినుము తినుము. అని బ్రతిమాలికొనుచు నాఫలముల నోటిలోనికిఁ ద్రోసినది.

ఆ పులియు నాచెలి చేయి నోటిలో నున్నంతసేపు నోరు దెరచికొని చేయి తీసినతోడనే యా ఫలముల గ్రక్కివేసినది.

ఆ వింతయంతయుఁ బ్రాంతముననుండి చూచుచున్న ప్రభాకరుడు విస్మయము జెందుచు నౌరా ! యిది యెక్కడి సౌందర్యము ? యెక్కడి పులి ? యోగిని యన నేమియో యనుకొంటిని ఇది యోగిని కాదు జగన్మోహిని. ఆమె పులినోటిలోఁ జేయి పెట్టినను గరువకున్నది. రాజయోగి నెట్లు కరచినదియో ? తపఃప్రభావసంపన్నురాలగు నీ యోగినినిం జూడ నాడెందము కందర్పశరాయత్త మగుచున్న దేమి పాపము ! ఈమగువ నెప్పుడో చూచినట్లున్నదే ? యిట్టి శాంతురాలు పులిచే బ్రజలం బాధింపఁజేయునా? పులి నన్నుఁ జంపినం జంపుఁగాక దాపునకుఁ బోయి యా యింతి వృత్తాంతమడిగి తెలిసికొనియెదం గాక అని తలంచి యా గోడ గుభాలున నురికి యా కలికి దాపునకుం బోయెను.

ఆమె యప్పుడాపులి మొగము తనతొడపై నిడుకొని లాలించుచుండెను. ప్రభాకరుం డామె యెదుటకుఁబోయి వినయవినమితో త్తమాంగుఁడై మ్రొక్కి దేవీ నీవు త్రిభువన పూజ్యురాలవు. నీ దర్శనముఁజేసి నేను గృతార్దుండనైతిని. నాకన్నుల కలిమి సార్ధకమయ్యెను. నేనీ నగరాధీశ్వరుఁడగు ప్రద్యోతనుని‌ కమారుండను. నా పేరు ప్రభాకరుడందురు. ఈపులి ప్రజలం బాధింపుచున్నదనియు రాజయోగిం గరచినదనియుఁ జారు లెఱింగింప నన్నానృపతి నీ యొద్దకు బుత్తెంచెను. విన్నతెరంగు కల్లయని తలంచుచుంటిని. నీవంటి తపశ్శాలిని లోకములకు గీడు పాటించునా? మఱియు నీపులిని ఫలముల దినుమని బ్రతిమాలుచుంటివి. ఇది బేలతనము కాదా? మాంసము తినెడి పెద్దపులి పండ్లు తినునా ? బాగు బాగు. నీవలె నిదియు వ్రతము వహించినదియా యేమి? దీనికి మాంసముఁ దెప్పించి యిచ్చెద. నీవు విచారింపకుము. మఱియు నీ ప్రాయమా ! మొదటిది. రూపమా ! త్రిభువననా సేచనకము. వ్రతమా ! అనన్య దుర్లభము. ఇట్టి నీ వృత్తాంతము విన నెవ్వరి కుత్సుకత్వముగాకుండును ? నీ మొగ మెన్నఁడో చూచినట్లున్నది. నీ జన్మ దేశ మెయ్యది?! తల్లిదండ్రు లెవ్వరు ? ఏమిగోరి యిట్టి కర్కశవ్రతము బూనితివి. అయ్యయ్యో ? ఈ నారచీరలేడ? ఈ దేహ లత యేడ? ఈ జటాకలాపమేడ? పరిష్కరణోచితమగు నీమె నిట్లు శుష్కోపవాసములచేఁ గృశింపఁ జేయుచుంటివేమి? నీ తేజము జూడ నుత్తమవంశ సంజాతురాలవని తోచుచున్నది. విన నే నర్హుండనేని నీ వృత్తాంత మెఱింగింపుమని వినయముతోఁ బ్రార్థించెను. అప్పుడా చిన్నది వానిం జూచియుఁ జూడనట్ల భినయించుచు మా తల్లిదండ్రు లితనికే నన్ను, బరిణయముజేయ నిశ్చయించిరి. నా చిత్రఫలకము చూచియున్న కతంబున నిట్ల నెను. ఔరా! దైవ నియోగము యిన్ని దేశములుండ నీ పురమే రావలయునా? అని తలఁచుచు మేము సకల సంగత్యాగినులమగు యోగినులము. మా వృత్తాంతముతో మీకేమిపని? ఈపులి ఘాతుకమైనదికాదు. తన కపకృతి జేసిన వారిం గరచును. ఇతరులజోలికిఁబోవదు. అదియుంగాక రేపో నేడో చావనున్నది. దీనిబాధ మీకుండదు. పొండని పలికి యక్కలికి కన్నులు మూసికొన్నది.

ఆమాట లాబోటి నోటనుండి వెల్వడిన వీనుల కమృతము సోకినట్లు ముఱియుచు నాహా ! ఇట్టి మోహనాంగితో నిమిషము సంభాషించినం జాలదా ? ఇంద్రలోక సౌఖ్యమేమిటికి ? అయ్యో యీమె తపశ్శాలిని అని యెఱిఁగియు నే నిట్లు మోహమందెద నేమిటికి ? ఇది మహాపాతకము. పాతకము శమించుగాక. అని అతండు తలంచు చుండెను.

భటుడు వలదనుచుండఁ బ్రభాకరుడు గోడదుమికి గుడిలోనికిం బోయెననియుఁ బులియాతనిం గరచినదియనియు నెవ్వరో పోయి ప్రద్యోతనున కెఱింగించిరి. ఆ వార్త విని యొడయఁడు కడునడలుచు నపరిమిత పరివారముతో నాయాలయము దాపునకు వచ్చెను. అంతకు పూర్వమే పులి యీవలకు వచ్చునని తలుపులు మూయబడి యున్నవి.

వీరభటులు పటుధైర్యముతో గోడలెక్కి. నలుమూలలు చూచుచుఁ ప్రభాకరుని జాడ నరయుచుండిరి. వింట శరము సంధించి పులిం గురిజూచి వారిలో నొకఁడు వేయుటయు నాబాణ మాపులి కాలికిం దగిలి క్షతము గావించినది.

అప్పుడా వ్యాఘ్రం బదభ్ర విలయాభ్రంబు పగిది నార్చుచుఁ బేర్చిన క్రోధంబున విచిత్ర లంఘనంబుల నాతూపువచ్చిన దారినిపోయి యేసినవానిం బట్టికొని నేలం బడద్రోసినది. అప్పు డందున్న వీరు లందఱు దద్దరిల్లి భయకంపితగాత్రులై నేల కురికి నాయుధంబులఁ జారవిడిచి యధాయధలై పారిపోయిరి.

అప్పుడు జితవతి లేచి యాపులిం జీరినది. అది తృటిలోవచ్చి అందు నిలువం బడినది. దానికాలి వ్రణముజూచి యాచిగురుఁబోణి దుఃఖించుచు వ్యాఘ్రారాజమా? నీకుఁ గౌర్యము సహజమగుట నీవు సాధువైయున్నను నసాధువుగానే తలంతురు. నీమీఁదికి రానిదే నీవెవ్వరికిని హానిసేయవు. ప్రజలు నిన్నెట్లును బ్రతుకనీయరు నీకర్మము నే నేమి సేయుదు నని పలుకుచు నాపుండునుండి రక్తము గారుచుండఁ దన పయ్యెదచే నద్దుచు గట్టుగట్టి మంట తగ్గుటకు నోటితో నూదుచుండెను. ఆవింతయంతయు దాపుననుండి కన్నులార జూచుచుఁ బ్రభాకరుఁడు దేవీ ! నీవింక విచారింపకుము. దీనికిఁ దగిన యాహారము పెట్టించెదను. ఎవ్వరు దీనిజోలికి రాకుండఁ జేసెదను. నీవూరడిల్లుము. దీని కొరకు నీవు గంటఁ దడిపెట్టుట ధర్మమా? సర్వసంగములు విడిచితివి. ఆశ్రితవత్సలతగాని నీకిది మమత్వముగాదు. నేఁబోయి వచ్చెద ననుజ్ఞ యిమ్ము అని పలుకుచు నతండఁటఁ గదలెను.

పులి లోపల నల్లరిజేయుచున్నదని విని కుమారున కేమి మోసము వచ్చునో యని వెరచుచు దలుపులు తీయించి లోపలఁ బ్రవేశించి యెదురు వచ్చుచున్న ప్రభాకరుం జూచి యత్యంత సంతోషముతోఁ గౌఁగలించుకొని నాయనా ! యీపులి నిన్ను గరచినదని చెప్పిరి. యెట్లు తప్పించుకొని వచ్చితివని యడిగిన రాజకుమారుం డిట్లనియె.

తండ్రీ ! మనము వినినదంతయు నసత్యము. తప్పంతయు మనయందే యున్నది. ఆపులి సాధువులలో సాధువు. ఆయోగిని కడు మహాన భావురాలు అని యచ్చటఁ జరిగినకథయంతయుం జెప్పెను.

ప్రద్యోతనుఁడా యుదంతము విని మిక్కిలి యక్కజము జెందుచు నందెవ్వరిం బోవలదని యాజ్ఞాపించి కుమారునితో నామెకుఁ గావలసిన సంభారములు తీసికొని స్వయముగా నర్పి౦పుమని చెప్పుచు నందఱితో నింటికిం బోయెను.

ప్రభాకరుఁడు నాఁటి సాయంకాలమున మాంసము ఫలములు పాలు బట్టించుకొని యక్కడికిఁ బోయెను. పులి చచ్చినది. దానిపైబడి యోగిని యిట్లువిచారించు చున్నది.

ఉ. అక్కట! నీవు నన్విడిచి యవ్యయ సౌఖ్యములందఁ బోయితే
    యక్కడ నీపరోపకృతి నాత్మలనెంచి నిలింపు లెల్ల ని
    న్మిక్కిలి గౌరవింతురుసుమీ! మృగరాజమ ! దిక్కుమాలి నే
    నొక్కతె నేమిసేయుదనయో యిటఁగుందుచు మిత్రఘాతినై.

సీ. తెరవుగానక కానఁ దిఱిగెడుతఱి దారిఁ
                  జూపి యథ్వశ్రమ బాపినావు
    యమునానదీ ప్రవాహమునఁ గొట్టికొనిపో
                  వఁగఁ దెప్పవగుచుఁ గాపాడినావు
    తలవరుల్‌ నిలిపి పోవలదన్న హుం కార
                 మొనరించి యాటంక ముడిపినావు
    దుష్టాత్ముఁడగు యోగి ధూళి మీఁదకు నూదఁ
                 దొడబట్టి యవ్వల దోలినావు

గీ. దరికిరాకుండఁ గ్రూరుల దరిమినావు
    కనిన కూఁతురువలె ననుఁ గాచినావు
    పోయితివె నన్నువీడియా పుణ్యసీమ
    సకలగుణధామ! యోమృగ సార్వభౌమ.

చ. విడచితి సర్వబంధువుల వివేకములేక పురంబుబాసి కా
    ఱడవుల సంచరించితి మహావ్యధలందితిఁ గార్యసిద్ది జొఁ
    ప్పడ దదిగాక ప్రాణములఁ బ్రాణముల రోహిణి గోలుపోయితిన్‌
    గడపటిమిత్రు నన్నును బోకార్చె విధాత యిఁకేమిజేసెడిన్.

గీ. తండ్రి కరణి మేటిదాదియట్లు నినేయు
    బాతి, బిడ్డవోలె మాత రీతి
    నిన్ని నాళ్ళు కాచితీవెన్న నెయ్యంపు
    చెలివిగాక పెద్దపులివె నాకు.

గీ. త్యక్త మొనరించి తల యోగసక్త చెలిమి
    పురము బాపితి రోహిణి బొలియఁజేసి
    తాత్తమగు దీని గెడపితి వహహ దిష్ట !
    యేమి కావింపఁగలవు నన్నింకమీద‌.

అని అనేక ప్రకారముల నప్పులి కళేబరముపై దుఃఖింపుచుఁ గన్నీటిధారచే దానియొడలు దడుపుచుండెను.

అని యెఱింగించి - ఇట్లని చెప్పదొడంగెను.

111 వ మజిలీ.

పెద్దపులుల కథ

తండ్రీ ! వినుము పులి చచ్చినది. యా చిన్నది దాని మేనిపైఁబడి యూరక వగచుచున్నది అబ్బా! యెట్టి యాప్తబంధువులకైనను నట్లు విదారింపరు దానిగుణంబులం దలంచుకొని కన్నుల నశ్రుజలంబులు ప్రవాహముగాఁగార వెక్కి వెక్కి యేడ్చు చుండెను. ఆమె దుఃఖముజూడ నాకును శోక మాగినదికాదు. ఎన్నియో శోకోపశమములగు మాటలు జెప్పితిని కాని యామె వినిపించుకొనలేదు.

అప్పుడు నే నాలోచించి దేవీ ! నీకు దీనిచర్మము దీయించి యిచ్చెదఁ బరిధానముగా ధరింపుము. అని పలికిన నంగీకారము సూచించినది. అందే చర్మము దీయించి పరిశుభ్రము చేయించి యామె కర్పించితిని ఆమత్తకాశిని యాకృతి నాస్తరణగా నుపయోగింపక మడతపెట్టి దేవుని పెట్టివలెఁ బూజించుచుండెను. ఆమెకు దానియందు గట్టి