కాశీమజిలీకథలు/ఏడవ భాగము/109వ మజిలీ
సియే దాటించిరి? కావున మీకు మేమిచ్చిన లంచపు సొమ్ము మాకీఁయుడు. లేకున్న వారి నప్పగించుడు. ఈ రెంటిలో నేదికావింతురో చెప్పుడని యడిగిన బ్రహ్మానందయోగి యిట్లనియె.
మీరు మాకు నియమించిన వేషములు వైచితిమి. చేయవలసిన పని యభినయించితిమి. వారిం గాచి తిరుగుటకు మేము పూటకాపులము కాము. వారు మీరు చేయు కపటము దెలిసికొని పారిపోయిరి? మేము పెద్దవాండ్రము అడవులలోఁ దిఱుగఁజాలము. మిమ్ము దైవము తోడుగా మోసము చేయలేదు. మీకు సొమ్మియవలసిన యవసరము లేదని పలికిన విని చిదానందుఁ డిట్లనియె.
మా వలన మీరిద్దరు జాల లంచము తీసికొంటిరి. ఫలముదక్క లేదు మా సొమ్మంతయు వృధయై పోవలసినదియే ఇట్టి యన్యాయ మెందైనంగలదా ప్రద్యుమ్నయోగి యొద్దకు బోవుదము రండు అతండు చెప్పినట్లు చేయుదము. అనుటయు బ్రహ్మానందయోగి అక్కడికే వత్తము పదుఁడు పదుఁడు అతఁడు మాత్రము మీ యొద్ద లంచము తీసికొనలేదా? అని పలుకుచుండ నందరు ప్రద్యమ్నయోగి యొద్దకు బోయిరి.
109 వ మజిలీ.
యమునాదీరంబునఁ బ్రద్యోతన నగరము వికాజిల్లు చున్నది. అందలి ప్రజలు అకస్మాత్తుగాఁ బొంగిన యమున వృత్తాంతమువిని యావింత జూచుటకై వేకువజామున లేచి తీరమున కరుదెంచిరి. పాతాళము నుండి జలంబుపై కులుకుచున్నదియో యన వలవైచినట్లు చుట్టును జేరి సుడిగుండములతో నంచుదేరిన నురగలం జదునై వట్రువట్రువుగా నీరు బొంగుచుండ నత్తరంగిణీ విశేషంబుల జనులు వీక్షింపుచుడిరి.
“భూధరసమితి” మగనికడ కరుగు మిత్రనందునకుఁ గానుక లొసంగఁ దీసికొని పోవుచున్నదియో యన మధురఫలపీతారుణ కుసుమదళ మనోహరములై నమూలపతితంబులగు మహావృక్షంబు లెన్ని యేని బ్రవాహమున గొట్టుకొని పోవుచుండెను. ఈతగాండ్రు పెక్కండ్రు విప్లవంబురాకుండఁ బ్లవంబుల నురంబుల నానుకొని యీదికొనిపోయి పెద్ద పెద్ద మ్రానుల దీరంబునకుఁ త్రోసికొని వచ్చుచుండిరి. మఱికొందఱు ద్రోణివిశేషంబులచేఁ గట్టెలం దీయుచుండిరి.
అట్టితరి, నదిగో పెద్ద దారువు గొట్టికొని వచ్చుచున్నది. వడిగా నీదుము. ఈదుము. దానికొఱ కవ్వలనుండి యెవ్వడోఁ తెప్పవాల్చుచున్నాఁడని యొడ్డునం గూర్చుండి స్నేహితులు ప్రేరేపింప నొక యీతగాఁడు తెప్పవాల్చి తెప్పున నొక కర్రకొర కీదికొని పోవుచుండెను. దానికొఱకే అవ్వలి రేవునుండి మఱియొకఁ డీదు చుండెను. తీరస్థులు వానికి వానికిఁ దొరకునని పందెములు వైచికొనుచుండిరి. వాండ్రిద్దరు నొక్కసారియే యద్దారవునొద్దకుఁ బోయి నాది నాదియని కేకలు వైచుచు దానిపై జేతులు వైచిరి.
అలయికలుదీర నా దారువుపైఁ గాళులు మోసికొని యున్న యొక పులి వారి రొదవిని గాండ్రుమని అరచినది. ఆ ధ్వని విని యా యీతగాండ్రు బాబో పులి పులి అని అరచచు మరలి దరిదెన కిడికొని పోవుచుండిరి. అంతదనుక నా దారువు నూతగాఁ ప్రవాహవేగంబునం పోవు వ్యాఘ్రం బప్పుడా కాష్టంబు వదలి యా యొడ్డు వైపున కీద మొదలు పెట్టినది. అది వారిం దరిమికొని వచ్చుచున్నదని తలంచి తటస్థులు పులి పులి అని పెద్దకేకలు వైచుచు ధాసి ధాసి అని అందలించుచుఁ జప్పటులు గొట్టఁ బ్రారంభించిరి.
ఆ పులి మూపుపై శిరంబు మోపి పండుకొనియున్న యువతి యొక తె యా చప్పుడులు విని అదరిపడి లేచి తీరము వంక జూచుచుండెను. ఆ మృగంబు వారి అరపులకు బెదరక పదిలముగా నీదికొని పోయి వీపుపైనున్న మదవతి కదలకుండ నొకచో గట్టెక్కి నిలువంబడినది.
దానిం గాంచి యందున్న వారెల్ల పికాపికలై తలయొక్క. దెసకుఁ బారిపోఁ దొడంగిరి. వివిక్తమైయున్న యా ప్రదేశమున నా యువతి పులిందిగి తడి పుట్టంబు బిండికొని పైట చెరఁగుటచే నా పులిమేని తడి అద్దుచు నేటివంక జూచి యేదియో ధ్యానించుచుండెను.
మఱియు నా పెద్దపులిని ముద్దుపెట్టుకొనుచు మృగరాజమా। నీకు నే నేమి యుపకారము జేసితినని నన్నుఁ జంపక ముంపక యీదరి జేర్చితివి? నేను గృతఘ్ను రాలనని యెఱుంగవు కాబోలును. అందఱి వలనం బనులుగొనుటయే వాని యొక్కరికిం ప్రత్యుపకారము జేయఁజాలను. నీతోడి పులియు నాతోడి చెలియుం గొట్టికొని పోయిరి. వారింగలసికొందము పద పద అని పలుకుచు నా జవరాలు ఏటి తీరమున మెల్లగా నడువం దొడంగినది. ఆ పులియుఁ దోఁక యాడించుచు నామె మేను మూర్కొనుచు వెనువెంట దూడవలె నడచుచుండెను.
ఆ వింత దవ్వులనుండి చూచి పౌరులు వెరఁగుపాటుతో నోహో! యిది పెంపుడు పులి కాఁబోలు తెలియక భయపడితిమని పలుకుచు మెల్ల మెల్ల దాని దాపునకుఁ జేరికొని వెంట నడువఁ దొడంగిరి. పులి యేమియు బెదరక అమ్మదవతి వెనుక నడుచుచుండెను.
గ్రమంబున బౌరులు భయము విడిచి పడతిని బులిని వింతఁగా జూచుచుఁ జుట్టును మూఁగికొని నడుచుచుండిరి. వారిలో నెవ్వఁడో కొంటెతనమునకై పులిపై ఱాయిరువ్వెను. అప్పుడవ్వనచరంబుదురంత క్రోధంబున గాండ్రుమని అరచుచుఁ గొట్టిన వానిం దరిమికొని పట్టి పొట్టఁ జీల్పబోవుఁడు నానెలత ఆఁ ఆఁ వలదు వలదు. అని పలుకుచు బరుగునఁ బోయి యా యాపదఁ దప్పించినది.
అప్పుడు ప్రజలు భయోద్రేకంబునఁ ద్రోకఁదెంపిన పిట్టలవలె నూరుదెసలకుఁ బరుగిడఁదొడఁగిరి. అమ్మగువయు నా మృగముపైఁ జేయి వైచి మెల్లన నడుచు చుండెను. “కాళిందీ ప్రవాహంబున నొక యోగిని పులితోఁ గొట్టికొనివచ్చి గట్టెక్కినది. కనంబడిన వారినెల్ల నా పులి చంపుచున్నది. యమున కెవ్వరునుఁ బోగూడ"దని పట్టణ ప్రజలొకరితో నొకరు జెప్పుకొనుచుండిరి.
అక్కాంతయు గొంతదూరము నదీతీరమున దక్షిణముగాఁ బోయి పోయి యా మార్గంబు పడమరగానున్న నీటిలోనికి మఱలుటయు దానింబడి నడుచు చుండెను. ఆమె వెంటఁ గుక్కవలె వచ్చుచున్న పులింజూచి పశువులు పారిపోవు చుండెను. యెదురుపడిన జనులు సదనంబుల దూరుచుండిరి. శకటంబులు లాగికొనివచ్చు ఘోటకంబులు బాటనమ్మేటి మెకంబు గనంబడినతోడనే బెదరి సాదులు మేదిని కురుకబండ్లు తబ్బిబ్బులుగాఁగఁ బగ్గంబులం ద్రెంచుకొని పెడత్రోవలం బారి పోవుచుండెను.
అప్పుడా అలజడివిని వీరభటులు పెక్కండ్రాయుధ పాణులై యడ్డము వచ్చి మచ్చెకంటీ ? నీ వెవ్వతెవు? క్రూరమృగము నీవిటు లేమిటికిఁ దీసికొని వచ్చితివి ? దీనింజూచి పౌరులు బెదరుచున్నారు. నీవు నగరములోనికి రావలదు పోపొమ్ము దీని మేము జంపెదమని పలుకు చుండఁగనే యాసత్వంబు సత్వరము వారి పయింబడి తొడలంగఱచి పిక్కలంబట్టిగొని మెడలఁ గోరలఁజొనిపి, దవడలఁ గోళ్ళఁగ్రుచ్చి వీపులఁగాళ్ళఁ జదిమి వీఁక నమ్మూకలఁ దృటిలోఁ జీకాకుపరచుటయు నాభటు లాయుధంబులఁ బారవైచి కేశపాశములు వీఁడ గట్టుపుట్టంబులు జార వేరుజూడక కాలి కొలది నలుదెసలకుం బారిపోయిరి.
అ త్తెఱవయు నత్తెరఁగరిసి కరసరసిజంబున దాని మేను నిమురుచు మృగ శార్దూలమా ? నీవట్లు ఘాతుక కృత్యంబులు గావించినఁ బ్రజలు నిన్ను బ్రతుక నిత్తురా ? అయ్యో ? నా ప్రాణ బంధువురాలనగు నీవు సమసిన నా బ్రతుకేమి కావలయు? తొలుత నన్నుఁ బరిమార్పుము. అక్కటా ! నీవంక జూడకున్న నీవెవ్వరి జోలికిం బోవు కొట్టిన వారింబట్టుదువు ఆ తెర వెఱుంగక జనులూరక నిన్నుఁ జూచి వెఱచి పఱుచుచున్నారు ఔరా? ఈ వీధి ఆంతయు నిర్జనంబై నది. ప్రజలు లోపల దూరి తలుపులు వైచుకొనిరి. వీరి కందఱకు బాధలు గలుగఁజేయనేల ? మఱియొక చోటికిం బోయెదంగాక అని తలంచుచు వెనుకకు మరలి మరియొక దారిం బోవుచుండ నొకదండ సమున్నతప్రాకార గోపుర మండితంబగు దేవాలయమొకటి యామెకుఁ గన్నుల పండువు గాంచినది. అందున్న నెవ్వరికి బాధ గలుగదని తలంచి యా చెలి పులితోఁగూడ లోపలం ప్రవేశించినది.
రాజయోగి కథ
రాజయోగియను సన్యాసి యొకఁడా దేవాలయములో నుత్తర దెస చావడిలో నివసించియుండెను. అతండు ప్రాయంబునఁ జిన్నవాఁడైననుఁ బ్రగల్భ వచనములచే మహానుభావుడని తోచునట్లు జనులు కడ లుపన్యాసము లిచ్చుచుండెను మంత్రములకుఁ గొందరు తంత్రములకుఁ గొందరుఁ సంతతికిఁ గొందరు, సంపదలకుఁ గొందరుఁ దన్నాశ్రయింప అందఱకు నాస జూపుచుఁ ద్రిప్పుచుండును.
పులివార్త విని పౌరులు కొందఱా యతి యొద్దకుఁ బోయి “మహాత్మా ! కాళిందీ ప్రవాహంబున నొక పులియుం జెలియుం గొట్టికొని వచ్చి మనయూరఁ గట్టెక్కిరి. అయ్యోష కాషాయాంబరధారిణియై జటాకలాపములతోఁ దపంబు జేయం బూనిన రెండవ పార్వతి వలెఁ బ్రకాశించుచున్నది. ఆ పులి యాచెలికడ దూడవలె మెలంగుచు మృత్యువువలెఁ బ్రజలపైబడి కఱచుచున్నది. వీరభటులఁ బెక్కండ్రఁ జంపినది. దానికా యోగినీ ప్రభావంబున నెక్కడలేని బలము వచ్చినది. వీరభటులు వెరచి పారిపోయిరి. మీరు వచ్చి యా పులి యుపద్రవము దప్పింపవలయును. మీ తంత్రము ప్రదర్శింప అవసరము వచ్చినది. కౄర మృగముల దూడలవలె వశము జేసికొందుమని యింతకుముందు మీరీవీఁటఁ బ్రకటించి యున్నారు గదా! లెండు రండు అని పలికిన విని యా యోగి అబ్బురపాటుతో విని యేమీ ? యోగినియా ? పులితో వచ్చినదియా ? కానిండు అందులకు మీరింత వెరువనేల? పులినిఁ జెలినింగూడ మంత్రబద్ధులం జేసి యిందు రప్పించెదఁ జూడుడు. అని పలుకుచుండగనే యాచిన్నది పులితో గుడికిఁ బ్రదక్షిణము చేయుచు నుత్తర దెసకుఁ బోయినంత నందున్న ప్రజలు బాబో బాబో పులి యిక్కడికే వచ్చినది అని కేకలు వైచుచు మూలమూల స్థంభములచాటున దలుపులవెనుక దాగఁదొడంగిరి. ఆయోగి అందఱకన్న ముందు యందున్నగదిలో దూరి తలుపువైచుకొని గవాక్షము నుండి చూచుచుండెను.
పులి యెవ్వరివంకంజూడక యా యబల వెంట మెల్లన నవ్వలికిం బోయినది. అప్పుడు ప్రజలు తమ్ముఁ బునర్జీవితులుగాఁ దలంచుకొని స్వామీ ! మీరిన్నియుంజెప్పి పులింజూచి లోపలదూరితిరేల ? పులియావలఁ బోయినది తలుపులు తీయుఁడని పలుకుటయు నయ్యోగి కవాటములఁ దెరచి లోనికిరండు అది క్రమ్మర నిటు రాఁగలదు భస్మము జల్లి వశపరచెదఁ జూడుడు నామహిమచేతనే యిందు వచ్చినది. క్షణ మోర్వుఁడని పలికి వారినందఱ లోపలికి రమ్మని తలుపువైచి భస్మము మత్రించు చుండెను.
అంతలో నాతలోదరి రెండవ ప్రదక్షిణము చేయుచుఁ బులితో నీదరిం బోయినది అప్పుడా మంత్రభస్మము పులిపైఁ జల్లుచు నాయోగినీ సౌందర్య మక్కజ పాటుతోఁ జూచిచూచి కందర్పభల్లముల కుల్లము వశపరచి పరవశుండై యుండెను.
ప్రజలు స్వామీ ! మంత్రభస్మము జల్లితిరిగదా. ఇఁక మేము పోవచ్చునా యని యడిగిన పొండు పొండు ఆపులి మీజోలికి రాదని యుత్తరము జెప్పెను
మూఁడవ ప్రదక్షిణములో నాపులి వారికన్నులం బడినతోడనే వారిలో నొక మొండివాఁడు చొరవజేసి దానివెంబడి నడువసాగెను. అది వాని నేమియుం జేయకుండుటఁజూచి మరికొందఱు మెల్ల మెల్ల వెనుక నడువజొచ్చిరి. ఆపులి యెవ్వరి వంక జూడక యాచేడియ వెనుక సడుచుచుండెను. క్రమంబు నందున్నవారందఱు రాజయోగి మంత్రబద్ధంజేసెనని నిశ్చయించి వెరపుడిపికొని యాపులి దాపునకుఁ బోయి చూచుచుండిరి.
ఆపూవుఁబోణియు దేవుని ముమ్మారు వలఁగొని స్వామియెదుర నిలువంబడి కన్నులు మూసికొని ధ్యానించుచుండెను. అప్పుడాపులి యాచెలిమ్రోల గద్దెవైచుకొని కూర్చుండెను. ప్రజలు వింతగాఁ జూచుచుండిరి.
కొందఱా రాజయోగియొద్డకుఁబోయి మహాత్మా ! నీమంత్రమహిమ మిగులఁ గొనియాడఁదగియున్నది. ఆపులి చూచినంతనే మీదఁపడి చంపుచున్నదని చెప్పుకొనుచున్నారు అట్టిజంతు విప్పుడు దూడవలె నెవ్వరిజోలికిం బోక దేవునిమ్రోల గద్దె వైచుకొని కూర్చున్నది. మీరువచ్చి చూడుఁడని చెప్పిన నుబ్బుచు నాసన్యాసి ఇసిరో! యిది యొక యబ్బురమా ! పులిమాటయేమి ? చెలింగూడ శిష్యురాలిం జేసికొనియెదఁ జూడుఁడు అని పలుకుచు నందుండిన ముఖమంటపము దాపునకువచ్చి యచ్చిగురుబోణి నెగాదిగఁ జూచి కనుబొమ్మ లెగరవైచుచు నిట్లనియె.
యోగినీ ! నన్నిటు చూడుము నీకంటెఁ బెద్ధలమగు యోగుల మిందుండ వచ్చి నమస్కరింపకుండుట తిరస్కారభావముగదా ? ఇది యోగినీధర్మమే ? నే నుత్తరదేశారణ్యములలోఁ బెద్దకాలము తపముజేసి ప్రస్తుతము లోకోపకారమునకై దేశాటనము చేయుచున్నవాఁడ. నా పేరు రాజయోగియండ్రు. నా నెలవునకురమ్ము. మంత్రరహస్య విశేషము లుపదేశించెద నని పలికిన నాకలికి ఇంచుక కన్నులు తెరచి చూచి సన్యాసులందఱుఁ గపటాత్ములని నిశ్చయించుకొనియున్న కతంబున వాని మన్నింపనొల్లక మరల కన్నులు మూసికొని యేమియు మాట్లాడినదికాదు.
అప్పుడాసన్యాసి మోమున నలుకదోప సెభాసు ? మంచియోగినివే. నా మహిమ యెఱుంగక యవమానము జేయుచున్నదానవు నీ పులి క్రౌర్య మడంచినట్లె నీగర్వ మడంచెదను చూడుము అబ్బా జేగురుగుడ్డఁ గట్టినంతమాత్రమునఁ బెద్దలఁ దిరస్కరింపవలయునా ? యిప్పుడు నాపాదములంబట్టి శరణుజొచ్చిన మంచిది. లేకున్న నిన్నిప్పుడు కుక్కను జేయిదు చూడుము. అని పలుకుచు భస్మ మరచేతిలోఁ బోసికొని యేదియో యుచ్చరించుచు నాపైదలిమీది కూదెను. అప్పుడా చిన్నది మోము చిట్లించుటఁజూచి యాపులి విలయకాల వరాహకము భంగి బొబ్బఁబెట్టుచుఁ గొబ్బున నాసన్యాసితొడఁ బట్టికొని నేలం బడద్రొసి యవ్వలి యావరణలోని కీడ్చుకొనిపోయినది.
అప్పు డప్పడఁతి అయ్యయో ? చంపకు చంపకు మృగరాజమా విడు విడు అని కేకలు వైచుచు వెంటఁబడినది ఆసన్నగ్రహించి యా సన్యాసి నాసన్నమరణుం జేసి యంతటితో విడిచి యప్పడఁతి యొద్దకు వచ్చినది అప్పు డందున్న వారందరు పెద్దపులి సన్యాసిం జంపినది చంపినది అని యరచుచుఁ దమ్ముఁగూడఁ జంపునను వెరపుతో గోడలెక్కియు ద్వారముల దూరియు నవ్వలకుఁ బారిపోయిరి.
అని యెఱింగించి - ఇట్లని చెప్పందొడంగెను.
110 వ మజిలీ.
ప్రభాకరుని కథ
ప్రద్యోతనుఁడు - తరువాత తరువాత
అర్చకులు -- దేవా ! రాజయోగి వట్టి డాంబికుఁడు. అతని మంత్రమువలన బులి నిలిచిన దనుకొంటిమి. యేమియునులేదు. అ త్తాపసిపైఁ బూతి నూదినం జూచి గాండ్రుమని యరచి తొడఁగరచి యీడ్చుకొని పోయినది. ఆచిన్నది అడ్డ పడకున్న నీపాటి కాసన్యాసి సమాధిలో నుండును దేవా !
రాజు - రాజయోగి బ్రతికియున్నవాఁడా ?
అర్చకులు - చావుతప్పినదికాన గాయము లింతటిలో గుదరవు.
రాజు - అయ్యోపాపము వానికిఁ దగిన నుపచారములు జరుగు చున్నవియా? ఇప్పు డెందున్నవాఁడు ?