కాశీమజిలీకథలు/ఏడవ భాగము/107వ మజిలీ

వికీసోర్స్ నుండి

సఖీ ! యా మహాత్ముని యుపన్యాసము వినంబడుచున్నదా? చెవి కమృతబిందువులవలె సోకుచున్నది గదా ! బ్రహ్మానందయోగిని బ్రహ్మవేత్తలలో నగ్రగణ్యుఁడని చెప్పఁదగినది. అట్టివాఁడు వారి మాటలు విని మనలఁ గపటముజేసి దీసికొని పోవు చున్నాఁడని చెప్పుదువు. నీమాట యెంత నమ్మదగినదో చెప్పుము. ఇఁక శంకవిడిచి నిర్భయముగా వారివెంట నడువుము. మన కార్యసిద్ధి శీఘ్రముగాఁ గాగలదని పలికిన విని రోహిణి యేమాటయుంబలుక కూరకుండెను. అట్లు వారు పోయిపోయి రెండు మూడుపయనంబులకుఁ జంపకారణ్యము జేరిరి.

అని యెఱింగించి --యిట్లనియె.

107 వ మజిలీ

మాయా వసిష్ఠుని కథ

డెబ్బదియేండ్లు మించినవి. నల్లని దేహము. పండ్లూడినవి. చప్పిదవడలు. కన్నులు లోతునకు బోయినవి. ఒడలంతయు ముడుతలు వారినది. మేనంతయు విభూతిబూసి రుద్రాక్ష మాలికలు జుట్టి మహర్షి వేషము వేసినను దర్శనీయముగా లేదు. బట్టతలపై నంటగట్టిన జడల చుట్ట కృత్రిమమని చూచువారికిఁ దెలియక మానదు. అట్టి యోగి యొకఁ డొక యరణ్య మధ్యంబున నొక చెట్టుక్రింద వ్యాఘ్రాజితముపై గూర్చుండి జపము జేసికొనుచుండెను. దండము కుండిక శాటిపటములు గొన్ని యా ప్రాంతమం దున్నవి. ఆ యోగి కన్నులు మూయుచుఁ దెరచుచు నలుదెసలం జూచుచు జపము జేయుచున్న సమయంబున జితవతియు. రోహిణియు వెంటరా నిరువురు శిష్యులతో బ్రహ్మానందయోగి యచ్చోట కరుదెంచెను. ఆ యోగి యంతలోఁ గన్నులందెరచి యోహో? బ్రహ్మానందుఁడా ? ప్రయోగమున నింత జాగు జేసితి వేమిటికి ? నీ కొరకు నిరీక్షించు చున్నానని యడుగుటయు నతం డిట్లనియె.

మహాత్మా ! పోయినది పుణ్యతీర్థముగదా ? చదివినది వేదాంతము తపశ్చరణమే కృత్యము ఇట్టి మన కెందుండిన నేమి? ఒకచో నొక ప్రయోజనముగలదా యేమి ? మీరిందునాకు నేనింతకన్న కొంతకాలమందే యుండువాఁడను. అది అట్లుండ నిండు. ఇప్పుడు వేరొకకార్యము మీతోఁ చెప్పవలసియున్నది.. ఈ బాలయోగినులు సకలభోగముల నిడిచి పెద్దదూరమునుండి మీ దర్శనమునకై యరుదెంచిరి. మీరున్న నెల వెఱింగింప నన్నాశ్రయించుటచే వెంటఁ దీసికొని వచ్చితిని. మీకోరిక యెద్దియో తెలిసికొని సఫలము గావింపవలయు. నిదియే నా హెచ్చరిక యని చెప్పుచు నా జవరాండ్ర నిరువుర వాని యెదుటకు రప్పించెను. అప్పుడు జితవతి నిరతిశయభక్తి విశ్వాసములతో అతని పాదంబులం బడి మహాత్మా! కరుణించి నా విన్నప మాలింపవలయను. మీరు సర్వజ్ఞులు. దివ్యదృష్టిసంపన్నులు. దయాహృదయులు. తేజోనిధులు. మీరెఱుంగని ధర్మంబులు మర్మంబు లుండవు. వసుపత్నియగు యోగసక్త సత్యవతియు విద్యావతియు జ్ఞానవతియు అని చేయెత్తి శపధముచేసి చెప్పఁగలను. అ సాధ్వీతిలకముతో దైవవశంబున‌ మశక శిశువునకు మాతంగముతోడంబోలె నాకు మైత్రి గలిగినది. నేనామెను మానవదుర్లభమగు వరం బడిగితిని. నాకోరిక నీడేర్చు తలంపుతో నా పుణ్యాత్మరాలు మీయావుం గట్టి తెమ్మని వసువుల నియమించినది. అమె స్యార్ధపరురాలై అప్పని చేయింపలేదు. అప్పని తప్పని యెఱుంగదు. చౌర్యము జేసియైనఁ బరోపకారము చేయుట పుణ్యమని పెద్దలు చెప్పుదురుగదా ? పరోపకారపారీణు లగునట్టి వసువుల మీరు శపించినట్లు వింటిని. ఆశాప మెట్టిదో తెలుపుఁడు. వారింగనికరించి శాపవిముక్తులఁ జేయుట యుచితము. అదియు నా యభిమతము. కాదంటిరేని అందులకు మూలహేతువునగు నా పైనా శాపము వ్యాపింపఁజేయుఁడు. నే నది యెట్టిదైన భరించుదాన. నిరపరాధులగు వసువులు దండింపఁబడిరని వినినదిమొదలు నాహృదయము భేదిల్లుదున్నది. నాకేపనియుం దోచదు నేను నట్టి పాపాత్మురాల మఱియొకటి కోరక అట్టివరం బడుగ నేలఁ నే నడుగకున్న వారికీయిక్కట్టు రాదుగదా? అక్కటా ? నేను మనుష్యులలోఁ గడు హీనురాలనైతి. నా బ్రతుకు నిరర్థకమైనది. మిమ్ము శరణుజొచ్చితిని. వారి శాపవిముక్తులం జేయుదు ననుదనుక మీ పాదములనుండి లేవను. మీ పాదమూలమునఁ బ్రాణముల బాపికొందునని పలుకుచు నుచ్చస్వరంబున గోలుగోలన నేడువ దొడంగినది.

అప్పు డాయోగి యబలా ? వసువులుజేసిన అపరాధము కనికరింపఁదగినది కాదు. వారిపేరు దల పెట్టినంత నాకినుక బ్రబలుచున్నది నీవిప్పుడేమియు వారి విషయ మడుగవలదు. కొన్నిదినము లిందుండుము. చిత్తము విశ్రాంతి పడిన పిమ్మట అంతయుం జెప్పెదను. నీవు విచారింపవలదు. లేలెమ్ము. నీయెడ మా కనుగ్రహము గలిగినది. అని పలికిన విని అక్కలికి వెండియు స్వామీ ! వారిప్పు డెక్కడ నున్నారు వారితో యోగసక్త వచ్చినదా? ఏమని శపించితిరి. యోగసక్త నాకన్నులంబడునా ? అని యడిగిన నా బడుగు సన్యాసి యేమియు మాటాడక కన్నులు మూసికొనియెను.

అప్పుడు బ్రహ్మానందయోగి నలినాక్షీ ! నీవిప్పు డతి ప్రసంగము గావింపకుము. వారికిఁ గోపము రాఁగలదు. వసువులవృత్తాంత మిప్పుడేమియుఁ నడుగవలదని చెప్పలేదా ? క్రమ్మర నా ప్రనంగమే తెచ్చిదవేమి? కొన్నిదినము లిందుండి శుశ్రూష గావింపుము. వారికే దయవచ్చి నీవు చెప్పినట్లు చేయఁగలరు. తాపసు లల్పసంతోషులని విని యుండలేదా ? పాదముల విడువుమని యుపదేశించిన విని యవ్వనితామణి యట్లు చేసినది. రోహిణి యాబడుగుజడదారి మొగము జూచుచు నట్లే నిలువంబడి యుండెను. బ్రహ్మానందుఁడు వారిం గూర్చుండ నియమించెను. అందరుగూరుచుండిరి. అప్పుడు జితవతి మెల్లగా యోగీంద్రా అరుంధతీమహాదేవికూడ రాలేదాయేమి యని అడిగిన బ్రహ్మానందుఁడు యువతీ ! అద్దేవి వారి యాశ్రమములొనే యున్నది. ఇందు రాలేదు. వీరు విలాసముగాఁ దీర్ఘాటనము సేయ బయలు వెడలిరి. కొలది తరిలో వీరింటికిఁ బోవుదురు. మీ పుణ్యమువలన నిచ్చటికి వచ్చిరి. కాని యిది వీరి నెలవు కాదని యేమేమో చెప్పెను. కాని యమ్మానినుల కనుమానము తీరినది కాదు.

అప్పుడు బ్రహ్మానందయోగి అల్లంతదూరమున నొకపర్ణశాల వేయించి వారి నందుండ నియమించెను. అందుఁ బ్రవేశించి రోవాణి యేకాతముగా జితవతీ ! యీతండు వసిష్ఠ మహర్షియని నీకు నమ్మకము దోచినదా ? వాని మొగమందుఁ దేజమేమైనం గలదా ? బడుగు వాని నెవ్వనినో దీసికొనివచ్చి యిట్టి వేషము వైచి యీ పిన్న సన్యాసులీకల్పతమును చేయుచుండిరి. మనము వీరివలలోఁబడి యీ ఆరణ్యమునకు వచ్చితిమి. వీరి యభిలాషలు వేరుగా నున్నవి, ఇప్పు డేమిచేయఁ దగినదో వితర్కింపుమని పలికిన విని జితవతి యిట్లనియె.

సఖీ ! ఈ విషయము నాకును ననుమానము గలుగుచున్నది. వాని మొగమునఁ దేజము లేకపోవుట యొకటి యరుంధతీ మహాదేవి యెన్నఁడును భర్తను విడిచి యుండదని జగత్ప్రతీతికాదా ? కానిమ్ము ఏమి చేయుదుము. బరమేశ్వరుడు లేడా ? ఇట్టి కల్పితము చేసినంత వీరి కేమి లాభము వచ్చినది. మనము వీరికి వశుల మగుదుమా? మునుపే చావఁ దెగించియుంటిమి. అయినను రహస్యముగా వారి చర్యలఁ బరీక్షించిరమ్ము అని బోధించినది.

మరియొకనాఁడు రాత్రి చీకటిలో నాపర్ణశాల దాపునకుఁబోయి గూఢముగా గూర్చుండి వారిమాట లాలించినది.

రమానందుఁడు -- ఏమిరా బడుగ ? ఆపడతులలో దిట్టముగా మాట్లాడలేవేమి ? మే మే యని నోటిలో నేదియో గొణికికొనియెదవేమిటికి ? నీవు వసిష్ఠుడవు కావని యాపూవుబోణుఁ లనుమానము జెందుచున్నట్లు తోచుచున్నది.

యోగి - నే నేమి చేయుదును. బోసినోరు మూలమున మాట స్పష్టముగా రాదు. వాండ్రు మిగుల గండ్రలు. మాటాడిన దప్పులు బట్టుదురు. దానంజేసి, మౌనమే యవలంబించితిని.

చిదానందుఁడు -- వీఁడీ వేషమునకుఁ దగఁడు బ్రహ్మానందయోగి కీ వేషము వేయవలసినది, తప్పు జేసితిమి వీనిం జూడ మనకే యసహ్యముగా నున్నాఁడు. వారి కెట్లుండును.

రమా - బ్రహ్మానందుఁడు మొదట నంత యభినయముచేయనిచో వారు నమ్మి యింతదూరము వత్తురా? ఇప్పుడా యెట్లయిన మనచేతిలోనివారే. యెక్కడికి బోఁగలరు ?

బ్రహ్మా - ఈ వేషమునకు వీఁడుతప్ప మఱియెవ్వరును దొరకలేదా? వీని వేషభాషలు బాగులేవు. నిజముగా వసిష్ఠుఁడు వచ్చి యచ్చట నిలుచున్నట్లు మాట్లాడవలదా ?

రమా - ఏమి చేయుదుము. మరియెవ్వరును దొరకలేదు. ఈ విధవకైనను నిరువదిమాడ లిచ్చుటకు నిశ్చయించితిమి. సగము సొమ్ము చేతిలో వైచినంగాని బయలుదేరనేలేదు.

బ్రహ్మా - నాతోఁ జెప్పినఁ బదుగురం గుదురుతునుగాదా ? వీఁడు చాల పెద్దవాఁడు కావున నేమియు మాట్లాడలేకున్నాడు.

రమా - వసిష్ఠ వేషమునకుఁ జిన్నవారలు పనికివత్తురా ? జడలు నెఱియ వలయుంగదా ?

చిదా - పోనిండు. ఇప్పుడేమి యనుకొన్నను లాభము లేదు. మాచేతి సొమ్ము వదలినది ఫలము గలుగలేదు. వాండ్రీ దినమున నిచ్చటికి రానేలేదు. మొదట నున్న భక్తి జతవతికిని లేదు.

రమా -- బ్రహ్మానందా ! మేమీ వేకువజామునలేచి ప్రయాగమున కరిగి మనోహరదాసుతో మాట్లాడి సాయంకాలమునకు వత్తుము. మీరీ లోపల నాచపలనేత్రల నిచ్చటికిఁ బిలిచి చెప్పవలసిన మాటలన్నియుం జెప్పుఁడు. ఒడంబడినసరే లేకున్న బలాత్కారమే కావింతుము.

చిదా -- మేము లేకున్న వారిందువచ్చి నిర్భయముగా మాట్లాడుదురు.

బ్రహ్మా -- మనోహరదాసుతో మాట్లాడవలసిన అగత్య మిప్పుడేమి వచ్చినది ?

రమా - వాఁడును మావలనఁ గొంత సొమ్ము తిని కపటము జేసెను. ఆఁడువాండ్రతోఁ గలసి మెలసి తిరుగుచున్నప్పుడు వచ్చిన నేవియో తంత్రములు చెప్పెదనని చెప్పెను. మాకట్టి అవకాశ మిప్పుడు గలుగుచున్నది కావున వాని యొద్ద కరిగి వశ్యౌషధములు గొన్ని సంగ్రహించుకొని వత్తుము. అని చెప్పి యాపిన్న యోగు లిరువురు నాఁవేకువజామున లేచి ప్రయాగమున కరిగి మనోహరదాసుం జూచి యిట్లనిరి.

ఆర్యా ! కార్యావసరమిప్పటికి వెండియు మాకుఁ గలిగినది. ఆ కొమ్మల నెట్లో మాతోఁగూడ సంచరించునట్లు చేసితిమి. కాని వాండ్రు మాట్లాడరు. ఇప్పుడు వారినెట్లు వశము చేసుకొనవలయునో చెప్పవలయును మీ యొద్ద నున్న తంత్రములన్నియుఁ బరిశీలించి మాయభీష్టము తీర్పవలయును. మునుపటివలెనే కాక మీఁద జల్లి నంత మోహపరవశయై మీఁద బడునట్టు మందీయవలయునని మిక్కిలి వినయముతోఁ బ్రార్థించిరి.

ఆ మనోహరదాసు మరల వారివలనఁ గొంత సొమ్ము దీసికొని సుమతులారా ? మీ యందలి ప్రేమచే నీసిద్ధౌషధం బిచ్చుచున్నవాఁడ నింతకుముందీమందెంతవారికి నీయలేదు. దీని ప్రభావ మద్భుతము. ఈయాకు నీటిలోముంచి పసరు వచ్చునట్లు తడిపి కోరిన నారీమణి యురోభాగంబున వైచి రుద్దవలయును. ఆ ద్రవ మేమాత్రమైనను మేనిలో మిళితమయ్యెనేనినిఁక చెప్పనేల నా లలనకు మేను బరవశమై అతఁడే మన్మదుండుగాఁ దోఁచును. అతం డెక్కడికిఁబోయిన అక్కడికిఁ గుక్క లాగున వచ్చును. దీనిం గొనిపొండు. మీ యభీష్టము దీర్చుకొండని పలికి యొక యాకిచ్చి వారినం పెను.

వాండ్రిద్దరు కడు సంతసముతోఁ జంపకారణ్యమునకుఁ బోవుచు దారిలో నిట్టి సంవాదము గావించిరి.

చిదా -- ఓరీ ? యామందు నా కిచ్చుచుండ అడ్డము వచ్చి నీవందుకొంటివేమి ? నాయొద్ద నుండఁదగదా యేమి? నీ యభిప్రాయమేమి?

రమా - అట్లు కచ్చితముగా అడుగుచుంటివి. నే నందుకొననర్హుఁడగానా ?

చిదా - ఇరువురము సమానులమే. ఇందు న్యూనాధిక్యములు లేవు. నా కడ్డము రానేల అని అడిగితిని.

రమా -- అడుగవచ్చును. మొగము చిట్లింపనేమిటికి ?

చిదా - కానిమ్ము. ఆమెపై పసరుపిండివా రెవ్వరు ?

రమా - నేను నీకంటెఁ జిన్నవాఁడను కావున నేను బిండెదను. వశవర్తిని యైన పిమ్మట నీ కర్పించెదను. మన యిద్దరిమధ్యను పాండవులను ద్రౌపదివలె అయ్యండజగమన యుండఁగలదు.

చిదా -- అబ్బో ! ఈ కపటోక్తుల కేమిలే. నేనంత యెఱుంగని వాఁడను కాను అమ్మదవతి పసరు పిండిన వానికే తగులమగును. రెండవ వానిం జూడదని మనోహరదాసు జెప్పలేదా.

రమా - నేను బలవంతము జేసి వినిపించనా ? నన్ను మిత్రద్రోహునిగాఁ దలంచుచుంటివా యేమి.

చిదా - నాకామాట లేమియుం జెవి కెక్కవు నీవు బిండిన నీకే. నేను బిండిన నాకే వశమగును. చెప్పి పెట్దిన ప్రీతియేమి నిలుచును ? అట్టి నమ్మకము నీకుండిన నన్నే పిండనిమ్ము.

రమా -- నీమాత్రము తెలివితేటలు నాకునుం గలిగియున్నవి. నీవు నాకంటెఁ బలవంతుఁడవుగావు. నామాట నమ్మిన నమ్ముము. పసరు మాత్రము నీకీయను.

చిదా - బాగు. బాగు. మంచినేర్పరివే బలముగల వాఁడవని నన్ను మోసము జేయుదువా?

రమా - నీకేమి మోసము జేసితిని. చేసిన పిమ్మట అడిగిన బాగుండును.

చిదా - చేతిలోఁ బడినదని పసరీయకపోవుట మోసముకాదా. కానిమ్ము. నామేనిలోఁ బ్రాణము లున్నంతసేపు నిన్నాపసరు పిండనీయను చూడుము.

రమా - రమ్ము. రమ్ము. నీబలమెట్టిదో చూతునుకాదా.

అని పలుకుచు రమానందుఁడు వడివడిగా ముందు పరుగిడఁ దొడంగెను. వాని వెంటఁ జిదానందుఁడు కేకలువేయుచుఁ బరుగెత్తుచుండెను. ఇరువురు కొంత సేపటికిఁ బర్ణశాల జేరిరి. అందెవ్వరు గనంబడలేదు. కపట వసిష్ఠుని బ్రహ్మానందయోగిని యెలుగెత్త పిలిచిరి. ప్రతివచనము లేదు. యోగినుల పర్ణశాల శూన్యమైయున్నది. ఆ ప్రాంత మార్గమంతయు వెదకిరి. ఏజాడయుం దెలియలేదు.

అప్పుడు చిదానందుఁడు దైవములేడా. మిత్రద్రోహము చేయువారికి విఘ్నములు గలుగఁజేయఁడా ? నీవేయాపసరురాచి యాచిగురుఁ బోడిం గూడుము. నేనూరాక విచారించుచుం బోయెదను ఎన్నడుననుభవంచినంగాని తెలియదు. అని వానిం దూఱుటయు రమానందుఁడు మిత్రమా ! నేనూరాక యట్లంటినిగాని నిన్ను ద్రోహముచేయుదునా, మనస్నేహ మీనాఁటిదియా. నామాటలు నీవు మనసులో నుంచకుము పరిహాసమున కంటిని. ఇదిగో పసరు నీయొద్దనే యుంచుము. ఆయువతి కనంబడినతోడనే నీవే పిండుము అనిపలుకుచు వాని చేతం బెట్టెను. చిదానందుఁడు తలకంపించుచు బిచ్చుకల పోరు పిల్లితీర్చినట్లు మనల మోసముజేసి బ్రహ్మానందయోగి యయ్యిందుముఖుల నెందోతీసికొనిపోయెను. ఆపొలఁతుక కనంబడనినాఁడు నాకాపసరేపటికి అసవ యెఱింగియే నాకిచ్చితివి. నే నెఱుంగననుకొంటివా? కానిమ్ము ఎట్లైన లెస్సయే అని యాయాకు మూటగట్టికొని రమానందునితోఁ గూడ నాయడవియంతయుఁ బెద్దతడవు వారిని వెదకెను. ఎవ్వరి జాడయుఁ గనంబడినదికాదు. బ్రహ్మానందయోగియే కపటముజేసి యాకాంతల దాటించెనని నిశ్చయించి వాండ్రిద్దరు మరునాఁడు ప్రొద్దు గ్రుంకక పూర్వము అడవి తెఱవులన్నియు వెదకుచుఁ గ్రమ్మర బ్రయాగమున కరుదెంచి మాధవమఠంబునకుఁ జని యందు బ్రద్యుమ్నయోగింజూచి మహాత్మా! బ్రహ్మానందయోగి యెట్టిపని చేసెనో చూచితిరా మీకేదియో తృణము సొమ్మర్పించి మీమూలమున నాయోగినుల బ్రహ్మానందయోగి వశముగావించితిమి. అతండు నమ్మకముగానే నాటకము నడిపించి నిన్న మేమీయూరు వచ్చినంత నా కాంతలం దీసికొని యెందో పోయెను. బ్రహ్మానందునకు నేబదిమాడలిచ్చితిమి మాసొమ్మంతయు హరించి చివరకు మాకపకారము గావించెను. అని చెప్పినవిని ప్రద్యుమ్నయోగి అయ్యో ? మీకార్యము సఫలము కాలేదా! బ్రహ్మానందయోగియు ముసలియోలయు బ్రొద్దుటనాకు గనంబడిరే ? నేనేమియు వారినడుగలేదు. బ్రహ్మానందయోగికట్లు చేసిన లాభమేమి? వృద్దుఁడుకాఁడా అని పలుకటయు

వాండ్రు ఏమీ ? బ్రహ్మానందయోగి యిందుజేరెనా. ఎందున్న వాఁడో వెదకి మీయొద్దకుఁ దీసికొని వచ్చెదము. న్యాయము విచారించి మాసొమ్ము మా కిప్పింప వలయును. వ్యర్దముగా రుణము పాలైపోయితి మని పలుకును వాండ్రిద్దరు కదలి యా మఠమంతయు వెదకి యొకచోటఁ బండికొనియున్న బ్రహ్మానందయోగిని కపటవసిష్ఠునిం జూచిరి.

బ్రహ్మానందుఁడు వారిఁ జూచి లేచి యోహో వత్సలారా ! మీకొరికై యరయు చుంటిమి. మీరు వెళ్ళినవెంటనే నేనా నారిమణుల బిలుచుటకు వారి పర్ణశాల కరిగితిని. తెల్లవారక పూర్వమే యాయలి వేణు లెందో పారిపోయిరి. ఆ యడవి యంతయుఁ వెదకితిమి ఎందునుం గనంబడలేదు. ఇఁక మేమందుండనేల నని యీ బడుగువాని వెంట నిడుకొని యాదారులన్నియుం జూచుచు నేఁటి మధ్యాహ్నము యిందు జేరితిమి. మీరందు బోయివచ్చితిరా? ఆ యాఁడువాండ్రు మన కపటము గ్రహించిరిసుఁడీ ఈ బోసునోటి బడుగువాని మూలమువ నీగుట్టు తెల్లమైనది. మంచి కల్పనయే చేసితిమి. ప్రయోజనము లేకపోయెనని యూరఁటబలికిన విని రమానందుఁ డిట్లనియె.

అదియంతయు నిజమే కాని మేము వచ్చుదనుక మీరందుండక యిందేల వచ్చితిరి. ఈ తప్పు మీయందున్నది మేము మీకు కప్పగించి వచ్చితిమి. మీకుఁ దెలియకుండఁ బారిపోవుటకు వారికి రెక్కలు వచ్చినవియా యేమి? చీఁకటిలోఁ బోలేరుగదా. తెల్ల వారి పోయినచో మీరు వెంటఁబోయి పట్టుకొనఁజాలరా? మీరు తప్పక వారిందెలి సియే దాటించిరి? కావున మీకు మేమిచ్చిన లంచపు సొమ్ము మాకీఁయుడు. లేకున్న వారి నప్పగించుడు. ఈ రెంటిలో నేదికావింతురో చెప్పుడని యడిగిన బ్రహ్మానందయోగి యిట్లనియె.

మీరు మాకు నియమించిన వేషములు వైచితిమి. చేయవలసిన పని యభినయించితిమి. వారిం గాచి తిరుగుటకు మేము పూటకాపులము కాము. వారు మీరు చేయు కపటము దెలిసికొని పారిపోయిరి? మేము పెద్దవాండ్రము అడవులలోఁ దిఱుగఁజాలము. మిమ్ము దైవము తోడుగా మోసము చేయలేదు. మీకు సొమ్మియవలసిన యవసరము లేదని పలికిన విని చిదానందుఁ డిట్లనియె.

మా వలన మీరిద్దరు జాల లంచము తీసికొంటిరి. ఫలముదక్క లేదు మా సొమ్మంతయు వృధయై పోవలసినదియే ఇట్టి యన్యాయ మెందైనంగలదా ప్రద్యుమ్నయోగి యొద్దకు బోవుదము రండు అతండు చెప్పినట్లు చేయుదము. అనుటయు బ్రహ్మానందయోగి అక్కడికే వత్తము పదుఁడు పదుఁడు అతఁడు మాత్రము మీ యొద్ద లంచము తీసికొనలేదా? అని పలుకుచుండ నందరు ప్రద్యమ్నయోగి యొద్దకు బోయిరి.

109 వ మజిలీ.

యమునాదీరంబునఁ బ్రద్యోతన నగరము వికాజిల్లు చున్నది. అందలి ప్రజలు అకస్మాత్తుగాఁ బొంగిన యమున వృత్తాంతమువిని యావింత జూచుటకై వేకువజామున లేచి తీరమున కరుదెంచిరి. పాతాళము నుండి జలంబుపై కులుకుచున్నదియో యన వలవైచినట్లు చుట్టును జేరి సుడిగుండములతో నంచుదేరిన నురగలం జదునై వట్రువట్రువుగా నీరు బొంగుచుండ నత్తరంగిణీ విశేషంబుల జనులు వీక్షింపుచుడిరి.

“భూధరసమితి” మగనికడ కరుగు మిత్రనందునకుఁ గానుక లొసంగఁ దీసికొని పోవుచున్నదియో యన మధురఫలపీతారుణ కుసుమదళ మనోహరములై నమూలపతితంబులగు మహావృక్షంబు లెన్ని యేని బ్రవాహమున గొట్టుకొని పోవుచుండెను. ఈతగాండ్రు పెక్కండ్రు విప్లవంబురాకుండఁ బ్లవంబుల నురంబుల నానుకొని యీదికొనిపోయి పెద్ద పెద్ద మ్రానుల దీరంబునకుఁ త్రోసికొని వచ్చుచుండిరి. మఱికొందఱు ద్రోణివిశేషంబులచేఁ గట్టెలం దీయుచుండిరి.

అట్టితరి, నదిగో పెద్ద దారువు గొట్టికొని వచ్చుచున్నది. వడిగా నీదుము. ఈదుము. దానికొఱ కవ్వలనుండి యెవ్వడోఁ తెప్పవాల్చుచున్నాఁడని యొడ్డునం గూర్చుండి స్నేహితులు ప్రేరేపింప నొక యీతగాఁడు తెప్పవాల్చి తెప్పున నొక కర్రకొర కీదికొని పోవుచుండెను. దానికొఱకే అవ్వలి రేవునుండి మఱియొకఁ డీదు