కాశీమజిలీకథలు/ఏడవ భాగము/106వ మజిలీ
రమానందునితో నోరీ ! ఈమోసకాఁడు మనసొమ్మూరక తినవలసినదేనా? అడుగక యూరకవచ్చితివేల. రెంటికిం జెడుదుమా? యనుటయు నేమిచేయుదుము గట్టిగా నడిగినఁ బ్రయోగము జేసి మనలఁ జంపగలఁడు. వానిచేతిలో నెప్పుడు పెట్టితిమో యప్పుడే మనసొమ్ము పోయినది. పరిచయము గలుగఁజేసికొనివచ్చిన నేదియో చేయునని చెప్పుచున్నాఁడుకాదా ? అప్పుడే చూతము అని వాఁడు వానికి సమాధానము జెప్పెను. అప్పుడు చిదానందుఁడు యిఁక మనము నిత్యము నామత్త కాశినులు చేయు కృత్యములఁ బరీక్షించి పిమ్మటఁ జేయఁదగినపని యాలోచింతము. రహస్యముగా వారి వెనువెంటఁ దిరుగుచుండుమని బోధించిన రమానందుఁ డట్లుచేసి యొకనాఁడు చిదానందునితో నిట్లనియె.
మిత్రుఁడా ! నిన్న నే నొకవిశేషము దెలిసికొనివచ్చితిని వారిలో రెండవ యోగిని నిన్న బ్రహ్మానందయోగియొద్దకు వచ్చి వసిష్టమహర్షి యాశ్రమమునకు మార్గ మెట్లనియు నతని యాశ్రమమునకుఁ బోవలయుననియు నడుగుచున్నది. దారి చూపువారికిఁ గొంత ధనసహాయము చేయుదునని సూచించినది. ఆ యోగి వృద్దుండైనను గడు టక్కరియగుట నా ముని యిప్పు డెందున్నవాఁడో విచారించి తెలియఁ జేసెద రెండు మూఁడు దినములలో రమ్మని యుత్తరము జెప్పెను. ఇదే సమయము నే నొక వ్యూహము పన్నదలంచి యుంటి. విరివిగ సొమ్మువ్యయ పెట్టవలసియున్నది. నీ వంగీకరింతువేనిఁ గార్యసాఫల్యముగాఁగలదు అని పలుకుటయు చిదానందు డిందుల కెంత సొమ్ము వ్యయమైనను సగబాలు భరింతు గార్యము నెరవేరు తెరవాలోచించుమని యుత్తరము చెప్పెను. అప్పుడు రమానందఁడు వాని చెవిలో నేదియో చెప్పెను. చిదానందుం డంగీకరించెను.
అని యెఱింగించువరకు వేళ యతిక్రమించుటయు మణిసిద్దుండు అవ్వలికథఁ బై మజిలీయం చెప్పఁదొడంగెను.
106 వ మజలీ.
బ్రహ్మానందయోగికథ
రోహిణీ ? మన మీ ప్రయోగము వచ్చి పది దినములైనది. తీర్థసేవ గావించి కృతార్ధుల మైతిమి. పయనము మాట యేమి జేసితివి కాదు యోగులు చాలమంది గలరు. వారు దేశసంచారము చేయుదుందురు. వారికి -------------- మార్గము దెలియకపోదు. ఎవ్వరినైన యడిగితివా అని ప్రయోగమున జితపతి ------------- రోహిణితో ముచ్చటించిన నది యిట్లనియె. సఖీ ! మన మీ పురము చేరినది మొదలు ప్రతి దినము తద్విషయమే విమర్శింపు చుంటిని. ఇందుండు సన్యాసులు బైరాగులు పరివ్రాజకులు కపటచిత్తులు గాని మంచివాండ్రుగాఁ దోచలే. శివరాత్రికి నందుగల మఠమునకు వేనవేలు జేరిరి. నే నా మఠములోనికి నిన్నఁబోయితిని. నన్నుఁజూచి పెక్కండ్రు కామాకుల చిత్తులైనట్లు నేను గ్రహించితిని. అట్టివారి నేమని యడుగుదును. ఆ మఠమంతయు దిరుగనొక వృద్దుఁడు నాకుఁ గామవికారము లేనివాఁడుగాఁ దోచెను. ఆ బైరాగి చుట్టును పాపము ప్రజ్వరిల్ల గౌపీనము ధరించి యొడలెల్ల విభూతియు రుద్రాక్షలు నిండియుండఁ రెండవ శంకరుండువలేఁ బ్రకాశించుచుండెను. వేషమునకుఁదగిన చిత్త నైర్మల్య మున్నదియో లేదో తెలిసికొనుట దుర్ఘటము. నేనా యోగి పాదములకు నమస్కరించి స్వామీ! మాది దక్షిణదేశము. మా దేశములో వసిష్టమతమని యొక మతము కలదు. మే మామతము వారము. మే మమ్మహర్షి యాశ్రమము జూడ వేడుక వడి వచ్చితిమి. మార్గమెట్లో చెప్పఁగలరా ? మీకుఁగృతజ్ఞులమై యందుమని పలుకుటయు నతండు కన్నులం దెరచి నన్నుఁజూచి విచారించి చెప్పెద ఱేపురమ్మని యానతిచ్చెను. అతని మాటలు కపట శూన్యములుగాఁ దోచినవి. ఱేపుపోయి తెలిసికొని వచ్చెదనని చెప్పుటయు జితవతి నీకెవ్వరును నచ్చరు. అందఱిని గపటాత్ములందువు వారిలో మహానుభావు లుందురు? వినయ విధేయతలు గనపరచి యడుగవలయుంగాని నీరాజ స్వభావము జూపింపకుము. వేగఁబోయి యాదారి దెలిసికొని రమ్మని నియమించినది.
రోహిణి యమ్మరునాఁడు ప్రాతఃకాలమునఁ ద్రివేణిలో స్నానముజేసి విభూతి బూసికొని యా వృద్దయోగి యొద్దకుఁబోయి నమస్కరింపుచు నతండు గన్నుల మూసికొని యండుటచే సమయ మరయుచు నోరగా నిలువం బడినది. ఇంతలో రమానందుఁడు తెల్లని భస్మంబు మేనెల్లడలం బూసికొని పులితోలు వెనుకవ్రేలాడుచుండ రుద్రాక్ష మాలికాలంక సర్వప్రతీతుండై కౌపీనము ధరించి మూర్తీభవించిన వైరాగ్య ప్రతిపత్తియో యను నొప్పుచు నా వృద్ధసన్యాసి కడకు వచ్చి స్వామీ ! నేను రమానందుఁడ మీ ప్రియశిష్యుఁడఁ బెద్దకాలమునకు మిమ్ముఁ జూడగంటి నిదే మీకు నమస్కారము లర్పించు చుంటినని పలుకుచు సాష్టాంగముగాఁ బండుకొనియెను.
అప్పుడా యోగి కన్నులం దెరచిచూచి లెమ్ములెమ్మని పలుకుచు రమానందుఁ డనఁగా నాకు గురుతు తెలియలేదు. నీ విప్పుడెక్కడనుంటివి? ఎందుండి వచ్చితివి. చెప్పుమని యడిగిన నతం డిట్లనియె.
స్వామీ ! నన్ను మరచితిరా? నేను మీ మిత్రులగు బ్రహ్మానందయోగి శిష్యుఁడను గానా? మా గురువుగారితో వచ్చి వెనుకఁ గొన్ని దినము లిందుండి పోలేదా? అద్వైత తత్వమును గురించి మీకును వారికినిఁ బ్రసంగముజరుగలేదా ? యని చెప్పిన విని అతండు ఆ! జ్ఞాపకమువచ్చినది. జ్ఞాపకమువచ్చినది. నీవా ! బాబూ ! నీవుగడు బుద్దిమంతుఁడవు నీకు శీఘ్రకాలములో నాత్మజ్ఞానము పూర్ణమగునని యప్పుడను కొంటిని నిన్నుఁ జూచుటచే సంతోషమైనది. మీ గురువు బ్రహ్మానందయోగి యిప్పుడెక్కడనున్నాఁడు? బదరికారణ్యమునకో యిఁక బైకెక్కడికో వెళ్ళెనని వింటినిప్పుడు కుశలియై యుండెనా అని అడిగిన వాఁడిట్లనియె.
స్వామీ ! మీ దయవల్ల మా యాచార్యుండు భద్రముగా నున్నాఁడు. నే నాయనతోనే తిఱుగుచుంటిని. నరుఁడు బదరికారణ్యమున కరిగి యందుఁ గొన్ని నాళ్ళుండి యందుండి వసిష్టాశ్రమమున కరుగఁ బ్రయత్నించు చుండగనే వసిష్ట మహర్షి బదరీవనమునకు విచ్చేసెను. అప్పుడు మిగుల సంతసించుచు వారితోఁగూడ మా దేశికుండు ఆత్మజ్ఞానాతత్వమును గూర్చి ముచ్చటించుచుఁ గొన్నిదినములుండిరి. తరువాత వారివురుంగలసి చంపకారణ్యమునకు వచ్చి యందుఁ గొన్ని మాసములు వసించిరి. మొన్నటి మహాశివరాత్రి కీ పుణ్యక్షేత్రమునకు రాఁదలంచి పయనము గావించిరి. కాని వసిష్ట మహర్షి యిందు జనసంబాధ మధికముగా నుండునని తలంచి యా ప్రయాణము మానివేసి యందే యుండెను. మా యొజ్జలు బ్రహ్మానందయోగియు నేనుమాత్ర మీ శివరాత్రి కీ క్షేత్రమునకు వచ్చితిమి. మా గురు వా పశ్చిమభాగమున యమునానదీతీరమున నున్నవారు. ఒండు రెండు దినములలో మరల జంపకారణ్యమున కరుగుచు రిదియే మా వృత్తాంతమని యాకథలో చెప్పెను.
అప్పు డావృద్ధయోగి యేమీ ? వసిష్టులపారు చంపకారణ్యమునకు వచ్చిరా ? ఆ యరణ్య మిచ్చట కనతి దూరములోనే యున్నది కదా? అయ్యో? పాపము నిన్న నెవ్వరో నా యొద్దకువచ్చి వసిష్ట మహర్షి యాశ్రమమునకు మార్గ మెఱింగింపుఁడని యడిగిరి వారక్కడికిఁ బోవుదురు కాఁబోలు. తొందరలో వారికేమి జెప్పితినో జ్ఞాపకములేదు. వారి కాసంగతి దెలిసినఁ జాల సంతసింతురుగదా ? అని యాలోచించుచుండ వెనుక నిలువం బడియున్న రోహిణి యెదురుకువచ్చి స్వామీ ! నేనే మిమ్మా మార్గ మడిగినదాన. నిందేయుంటి మీసంపాదము వింటిని. మీ దర్శనమున మా కార్యసిద్ధియైనదని తలంచుచుంటి. సాధుసాంగత్య మూరకపోవునా యని స్తుతియించినది. అప్పుడు రమానందుడు స్వామీ ! ఈ బాలయోగీని యెవ్వతె. వసిష్టాశ్రమమున కేమిటికై యరుగుచున్నది. అని యేమేమో యడుగఁ బోయినంత వారించుచు వృద్ధయాగి యిట్లనియె.
నీ వద్వైతతత్వవేదియ్యువ బ్రహ్మానందయోగి శిష్యుఁడవయ్యు నిట్లడుగుచుంటి వేమి? మన మెవ్వరమో ఆమెయు వారే. యంతయుఁ బరబ్రహ్మస్వరూపము ఆత్మకు స్రీపుం వివక్షతయుఁ గులశీలనామంబులుం గలిగియున్నవియా? అమె విరక్తురాలు. ఈశ్వరమహిమఁ దెలిసికొన నెవ్వరి శక్యము? ఏ జీవుల కే కాలమున నెక్కడ నేది కావింపవలయునో ఆ జీవుల కా కాలమున నక్కడ నది కావింపకతీరదు. వారికి వారియందు భక్తిగుదిరినది వారిం జూడఁబోవు చున్నారు. సాధువులకుఁ బరోపకారము కన్నఁ బుణ్యకార్యము లేదు. ఆశ్రితరక్షణము సహప్రయాగఫలదంబని కృతులు ఘోషింపుచున్నవి మీరు నామిత్తముగా వీరికొక యుపకారము చేయఁగోరుచున్నాను. మీ గురువుగారితో నామాటగాఁ జెప్పుము. వీరిని జంపకారణ్యమునకుఁ దీసికొనిపోయి వసిష్టమహర్షి దర్శనము చేయింపుఁడు. చెంతఁజేరిన వారి కోరిక తీరుపక నాచిత్తము సంతసింపదు. నేను వృద్దుండనగుట రాలేను. దైవికముగా నమ్మునిపతి ఈప్రాంతమునకు వచ్చుట వీరి యదృష్టమే. అమ్మా ! యోగినీ ! ఈతండు ప్రాయంబునఁ జిన్నవాఁడైనను సకల ధర్మములు దెలిసినవాఁడు వీని గురువు వసిష్టుని మిత్రుఁడేకదా. కనుక నీవును నీబంధువులును వీనివెంట బ్రహ్మానందయోగియొద్దకుఁ బోవుఁడు ఆయన మిమ్ము దీసికొని పోఁగలడని చెప్పెను.
రోహిణి వృద్ధయోగిని స్తుతియించుచు బ్రహ్మానందయోగి యెంతదూరములో నున్నవాఁడని అడిగిన గ్రోశదూరములో నుండెనిప్పుడేపోయి చూడవచ్చునని రమానందుఁ డుత్తరము జెప్పెను.
అప్పుడు రోహిణి యించుక యాలోచించి ఆర్యా ! మీదేశికుఁడు చంపకారణ్య కెప్పుడు పోవునో మారాక కనుమతించునో తెలిసికొని వత్తురేని మీకు గృతజ్ఞురాలనై యుండెద నిప్పటినుండియు నందువచ్చి యేమిచేయఁగలము. అని యడిగిన రమానందుఁడు అబలా ! మీకా సందియము వలదు. మాగురువుగారు సహజముగా నుపకారశీలురు వీరియాజ్ఞ యయ్యెనేని చెప్పిన మఱియు సాహసింతురు. మీరెప్పుడు వచ్చిన అప్పుడే బయలుదేరుదురు. మీబంధువులం దీసికొనిరండు పోవుదమనుటయు రోహిణి జితవతియొద్డ కరిగి యిట్లనియె.
సఖీ ! జితవతీ ! ఇప్పుడు వసిష్టమహర్షి చంపకారణ్యమునకు వచ్చియుండెనని శుభవార్త యొకటి వింటి. అది సత్యమేయైనచో మనము కృతార్దులమే. అని తాను బోయి విన్నకథ అంతయుం జెప్పినది అప్పుడు జితవతి మూపు లెగరవైచుచు, రోహిణీ ! నియమితచిత్తులగు దైవము సహాయము చేయకపోవునా ? ఆత్మజ్ఞాన వేదియగు అత్తపసి మనరాక విని యెదురువచ్చుచున్నాఁడని నమ్ముము ఇది యంతయు వీరు కల్పించిరని నీకనుమాన మున్నట్లు తోచుచున్నది. అట్టి కల్పన లతో వారి కేమిప్రయోజనము ? మనయొద్దఁ దొడవులైన లేవుగదా ? బూడిద బూసికొని తిరిగెడి మన చక్కదనము వలచుఁ వారెవ్వరు ? ఆ మాట సత్యమని ముమ్మాటికి నమ్మదగినది. బోవుదము లెమ్ము బ్రహ్మానందయోగిపాదంబులం బడి వేగ దీసికొనిపొమ్మని ప్రార్థింతమని తొందర పెద్దనది.
రోహిణియు నంగీకరించినది. అప్పుడే యిరువురు బయలుదేరి వృద్ధయోగి కరిగిరి. నిరీక్షించుకొని రమానందుఁ డందేయుండెను. వృద్దయోగి వారింజూచి సుమతులారా ! మీ రిద్దరేనా వారియొద్దకుఁ బోవ నిశ్చయించుకొంటిరి శుభము శుభము. శీఘ్రముగా వీనివెంటఁ బొండు బ్రహ్మానందయోగియొద్దకుఁ దీసికొనిపోవును. తరువాత అతండన్నియుం జెప్పగలండని పలికి వారి మ్రొక్కులు గైకొని దీవించుచు సాగనంపెను.
రమానందుఁడు ముందు నడుచుచుండ ఆయ్యండజగమన లిరువురు కొంచె మెడముగా నడువఁదొడంగిరి. రెండుగడియలలో నా బ్రహ్మానందయోగియొద్ద కరిగిరి.
యమున యొడ్డుననున్న యొక తోటలో మఱ్ఱిచెట్టు క్రింద వ్యాఘ్రాజినముపై గూర్చుండి కన్నులు మూసికొని యాబ్రహ్మానందస్వామి జపము జేసికొనుచుండెను. అతని ప్రాయము ఏబదియేండ్లకు మించియున్నట్లు సగము సగముగాఁ దెల్లబడుచున్న జడలచేఁ దెలియబడుచున్నది. దేహము దృఢముగా నున్నది విభూతి రుద్రాక్షలు నిబ్బడిగా ధరింపబడియున్నవి. చూచువారి కతండు మహానుభావుండని తోచక మానదు. ఆయోగి ప్రక్క నొక శిష్యుఁడు గూర్చుండి జపమాల ద్రిప్పుచుండెను. శాటీపటములు కొన్ని శాఖలకు నారవేయఁబడియున్నవి. ఈతఁడే మా యాచార్యుండని రమానందుఁడు చెప్పినంత నక్కాంత లిరువురు భయభక్తి విశ్వాసములతోఁ బ్రదక్షిణ నమస్కారములు గావించి యోరగా నిలువంబడిరి.
అప్పుడు రమానందుంజూచి అందున్న శిష్యుఁడు మిత్రమా ! ఈ యాఁడు వాండెవ్వరు ? ఇక్కడి కేమిటికి వచ్చిరి. స్త్రీ ప్రసంగమన మండిపడియెడు మన జడదారి దారియెఱింగియు నీ నారీమణుల నేమిటికి వెంటఁబెట్టుకొని వచ్చితివి ? ఇది కడు ప్రమాదముసుమీ ? అని పలికిన విని రమానందుఁడు చిదానందూ ! వీరు లోకసామాన్య యోషలుగారు మహాయోగినులు దృఢవ్రతలు. క్రియాశూరులు. వీరిప్పుడు వసిష్ఠమహర్షి యాశ్రమమున కరుగ నిశ్చయించుకొనిరి. మనగురుని కటాక్షముండినంగాని అట్టిపని కొనసాగదని తలంచి వీరి నాశ్రయింపవచ్చిరి వృద్ధయోగియు వీరికిట్టి యుపకారము చేయుమని మన యాచార్యునితో జెప్పమనియెను. నీ విందులకు సహాయము చేయవలయునని చెప్పెను. చిదానందుఁడు సందియమేలా ? అట్లే చేయుదము. సుందరులారా ! యిందుఁ గూర్చుండుడు యోగి కన్నులం దెరచు సమయమైనదని చెప్పుచుండఁగనే అతండు కన్నులువిప్పి జపమాల జెవులకుఁ దగిల్చికొని కమండలూదకమున నేత్రములఁ దుడిచికొనుచు శిఘ్యని వంకజూచి రమానందా ! త్రివేణి కరిగి యింత యాలస్యము చేసితివేమి ? నామిత్రుఁడు ప్రద్యుమ్నయోగి కనంబడెనా ? యని అడిగిన వాఁడు వినయ మభినయించుచు స్వామీ ! చూచితిని. మాట్లాడితిని. గురుకటాక్షము గలిగినది. మీ చంపకారణ్య గమనవృత్తాంతము విని ఈ యోగినుల మీయొద్ద కనిపిరి. అందునను వసిష్టమహర్షి యొద్దకు వీరిం బదిలముగాఁ దీసికొని పొమ్మని మఱియు మఱియుం చెప్పుమనిరి. వీరి కతంబున నించుక యాలస్యమైనదని చెప్పినవిని బ్రహ్మానందయోగి యాయోగినులపై చూడ్కులు వ్యాపింపజేసెను.
అప్పుడమ్ముద్దుగుమ్మ తద్దయు భయభక్తి వినయవిశ్వాసములతో నయ్యోగి పాదమూలమున వ్రాలి మహాత్మా ! రక్షింపుము రక్షింపుము. నీకు శిష్యురాండ్రమైతిమి వసిష్ఠమహర్షి దర్శనము జేయింపుమని ప్రార్థించిరి. ఆసమయమున నాశిష్యు లిద్దరు నెద్దియో పని కల్పించుకొని దూరముగాఁ బోయిరి.
అప్పుడు బ్రహ్మానందస్వామి తరుణులారా ! లెండు లెండు. కుసుమకోమలమైన యీ ప్రాయమున మీరిట్టి యోగినీవేషము ధరించుటచే మీవ్రతపటుత్వము వేర యిట్టిదని పొగడ నవసరము లేదు. విరక్తిచే యోగినులై తిరిగెడు మీ పూర్వ వృత్తాంత మడుగుటకు తప్పుగదా? మీ నియమప్రచారములు సోత్రపాత్రములై యున్నవి. మీ రిప్పుడు తత్వ శ్రవణేచ్ఛచే వసిష్ఠుం జూడఁబోవుచున్నారా యేమి? వేరెద్దియేనిఁ గారణ మున్నదియా? ఆ యతిపతి యిప్పుడు చంపకారణ్యములో నున్నవాఁడు. అయ్యడవి యిక్కడికి రెండు పూటలు పయినములో నున్నది. పోవచ్చును. మీ అభిలాష యేమి అని అడిగిన జితవతి రోహిణి మొగము జూచుటయు నా చంద్రవదన యిట్లనియె.
స్వామీ ! యిప్పుడు మీతో యదార్థము చెప్పక తీరదు. యోగిసక్త యను వసుపత్ని ఈమెతో మైత్రిజేసినది. ఆమె ఈమె నిమిత్తమై వసిష్ఠమహర్షిచే శపింపఁబడినదఁట. ఆకథవిని ఈ వనిత వారి శాపము గ్రమ్మరింవ అమ్మునిపతిం బ్రార్థింప నరుగుచువ్నది. తత్వశ్రవణేచ్ఛగాదు. మాకు వారి దర్శనము జేయించి పుణ్యము గట్టి కొనుఁడు అని ప్రార్థించినది.
ఆ కథవిని బ్రహ్మానందయోగి శిరఁకంపము జేయుచు నయ్యారే నీ కృతజ్ఞత మిక్కిలి కొనియాడఁ దగియున్నది. అప్పారికాంక్ష దయా హృదయుఁడగుట నీ కాంక్ష నెరవేర్పవచ్చును. ఇప్పుడే పోవుదము. ఇందులకు నన్నంతగాఁ బొగడ నవసరములేదు. తత్వవేత్తలగు సాధువులకుఁ బరోపకృతికన్న ముక్తిసాధన మేమి యున్నది. కూర్చుండుఁడు, అని యాదరించుటయు నాతని మాటలు విని జితవతి యుప్పొంగుచు నిట్లనియె.
స్వామి ! అమ్మాహర్షితో మీరు కొంతకాలము సహవాసము చేసితిరఁట కాదా ? చంపకారణ్యమున మనము పోవుదనుక నుందురా? అరుందతీ మహాదేవికూడ వచ్చినదా ? వారి హృదయ మెట్టిది? మమ్ము గనికరించునా ? వసువుల విడుచుట యొండె తచ్చాపము నాపై వ్యాపింపఁజేయ వసువుల విముక్తులఁజేయుట యొండె గావింపవలయును. అని యేమేమో యడుగఁబోవుచుండ వారించుచు రోహిణి యిట్లనియె.
జితవతీ ! నీవేటికి వీరి నిట్లు ప్రశ్న శ్రవణాయాన పాత్రులం గావించెదవు? వారి యొద్దకుఁ బోయిన వెనుక మనకే దెలియనగు. విచారింపకుమని బోధించినది. అప్పుడు బ్రహ్మానందయోగి అబలలారా ? వినుండు మీరు మిక్కిలి శ్రమపడి యడవులదాటి నిద్రాహారములు విడచి తనకడ కరుదెంచిన మిమ్ము కనికరింప వసిష్షమహర్షి లోకనింద పాలుపడునా యేమి అదియును గాక.
శ్లో॥ అతిధిర్యస్యభగ్నాశో గృహత్ర్పతి నివర్తతెఁ
సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాయుశ్చగచ్చతి॥
అతిధి యెవని యింటికివచ్చి కామ్యమును బొందక విచారముతోఁ గ్రమరునో యా గృహపతికిఁ దన పాపమిచ్చి వాని పుణ్యమును గైకొని పోవునని శాస్త్రములు చెప్పుచున్నవి. కావున వసిష్టుండు మీ వాంచితమును దీర్పఁగలడు. మనము పోవు దనుక నందే యుండును. మీరు చింతింపవలదని బోధించుచు శిష్యులతో నప్పుడే పయనము గావింపుడని నియమించెను.
అప్పుడా శిష్యులిరువురు శాటీపటములు కమండలువులు నాగ బెత్తములు లోనగు వస్తువులన్నియు మూటగట్టుకొని స్వామీ ! లెండు లెండు. సమయమైనది. అని చెప్పిన నయ్యోగి యోగదండంబూతగా బూని యుత్తరాభిముఖుఁడై యమ్మత్త కాశినులు వెంటరా మెల్లగా నడువజొచ్చెను..
అట్టితరి రోహిణి మనంబున నిట్లు తలంచెను. ఆహా ! విధి పరిపాకము కడు చోద్యమయినదిగదా? పెక్కండ్రు చేడియ లూడిగము సేయ పోతుటీగకైనఁ బ్రవేశింప శక్యముగాని శుద్దాంత సౌధాంతరంబుల వసించు నీ మించుబోఁణి యిట్లు పాదచారిణియై మహారణ్యములోఁ గంటక ప్రదేశముల నెరుగని సన్యాసులవెంట నరగుచున్నది. ఇంత కంటె విపరీతమేదియైనఁ గలదా? ఔరా తలంప మాయత్నము చిత్రముగాక యేమి యిది? ఇప్పుడీ పడుచు బైరాగు లిద్దరు సుక్కిపము జేసి యెక్కడికో లాగికొని పోవుచున్నారు. చిదానందుని చేష్టలన్నియు హావభావ గర్భితములై యున్నవి ఈ బ్రహ్మానందయోగి నాశ్రయించి యిట్టి కల్పనజేసి యుందురు. యేమి చేయుదును? పోవలదని చెప్పినను జితవతి వినిపించుకొనదు. నా బుద్దిబలంబంతయు నేటిపాలుఁజేసి వీరి వెంటఁ బోవుచుంటిని. వసిష్ఠుడీ యడవిలో నుండుట కల్ల. మోహాందులై వీరిట్టి సన్నాహము గావించి యుందురు. కానిమ్ము. ఏమి జరుగునో చూడవలసినదేకాని దైవమును మీరగలమా అని అనేక ప్రకారములఁ దలంచుచు వారివెంటఁ గొంచె మెడముగా నడచుచుండెను. బ్రహ్మానందయోగి నడుచునప్పు డేవేని తత్వవిశేషము లెఱింగింపుఁడని శిష్యు లడిగిన నిట్లుపన్యసించెను.
వత్సలారా ! ఈ ప్రపంచకము మాయాకల్పితము. దృశ్యమంతయు నశ్యమే సుఁడీ? ఈశ్వరుఁడొక్కడే నీతుఁడు. ఈశ్వరుఁడు ప్రకృతియందుఁ ప్రతిఫలించి జగంబుల రచించుచున్నట్లు తోచుచుండును కాని కర్తృత్వ భోక్తృత్వము లేవియు లేవు. అదియు నింద్రజాలము వంటిది. ఆ రూఢులకుగాని యీ రహస్యము దెలియదు. ప్రపంచకమే యసత్యమనుచుండ దేహముమాట జెప్పనేల? స్వప్నంబునఁ దోచిన వస్తువు లన్నియు మేల్కొనిన గనంబడనియట్లు ఆత్మవేత్తయగు జ్ఞాని కీ లోకమేలేనట్లు తోచును. ఇంద్రియ సంమోహము వలననే యీ యజ్ఞానము గలుగుచున్నది. (వెనుక జూచి మెల్లగా, వారీ మాటలు వినుచున్నారా) అని మరియు.
శ్లో॥ శారీరై ర్మానిసైర్దుఃఖైః సుఖై ర్వాప్య సుఖోదయైః।
లోకసృష్టిం ప్రపశ్యంతో నముహ్యంతి విచక్షణాః।
తత్రదుఃఖ విమోక్షార్థం ప్రయతేత విచక్షణః।
సుఖంహ్య నిత్యం భూతానా మిహలోకె పరత్రచ।
రాహుగ్రస్తస్య సోమస్య యథాజ్ఞోత్స్నా సభాసతే।
తదా తమోభి భూతానాంనస్యతే సుఖం॥
శరీర సంబంధములు మనస్సంబంధములగు సుఖదుఃఖములచే లోకసృష్టి ప్రకారమంతయుం జూచుచుండిన విద్వాంసు లెప్పుడును మోహమును బొందరు. రెండును ననిత్యములని యెరింగి తజ్జన్యంబులైన సంతోషశోకముల జెందరు. రెండు లోకము లందు సుఖమనిత్యమని తెలిసికొని దుఃఖవిమోచనార్థమే ప్రవర్తింతురు రాహుగ్రస్తుండగు చంద్రునియొక్క వెన్నెలవలెనే యజ్ఞానాభిభూతములగు భూతములకు ధనము నశించును. కావున లోక ప్రవృత్తి దెలిసికొని దుర్గుణముల విడిచి శమదమాది సంపత్తిచే నొప్పుచుండువాఁడు. ముక్తుండగునని యెఱింగించుచుండ నాలించి జితవతి రోహిణి కిట్లనియె. సఖీ ! యా మహాత్ముని యుపన్యాసము వినంబడుచున్నదా? చెవి కమృతబిందువులవలె సోకుచున్నది గదా ! బ్రహ్మానందయోగిని బ్రహ్మవేత్తలలో నగ్రగణ్యుఁడని చెప్పఁదగినది. అట్టివాఁడు వారి మాటలు విని మనలఁ గపటముజేసి దీసికొని పోవు చున్నాఁడని చెప్పుదువు. నీమాట యెంత నమ్మదగినదో చెప్పుము. ఇఁక శంకవిడిచి నిర్భయముగా వారివెంట నడువుము. మన కార్యసిద్ధి శీఘ్రముగాఁ గాగలదని పలికిన విని రోహిణి యేమాటయుంబలుక కూరకుండెను. అట్లు వారు పోయిపోయి రెండు మూడుపయనంబులకుఁ జంపకారణ్యము జేరిరి.
అని యెఱింగించి --యిట్లనియె.
107 వ మజిలీ
మాయా వసిష్ఠుని కథ
డెబ్బదియేండ్లు మించినవి. నల్లని దేహము. పండ్లూడినవి. చప్పిదవడలు. కన్నులు లోతునకు బోయినవి. ఒడలంతయు ముడుతలు వారినది. మేనంతయు విభూతిబూసి రుద్రాక్ష మాలికలు జుట్టి మహర్షి వేషము వేసినను దర్శనీయముగా లేదు. బట్టతలపై నంటగట్టిన జడల చుట్ట కృత్రిమమని చూచువారికిఁ దెలియక మానదు. అట్టి యోగి యొకఁ డొక యరణ్య మధ్యంబున నొక చెట్టుక్రింద వ్యాఘ్రాజితముపై గూర్చుండి జపము జేసికొనుచుండెను. దండము కుండిక శాటిపటములు గొన్ని యా ప్రాంతమం దున్నవి. ఆ యోగి కన్నులు మూయుచుఁ దెరచుచు నలుదెసలం జూచుచు జపము జేయుచున్న సమయంబున జితవతియు. రోహిణియు వెంటరా నిరువురు శిష్యులతో బ్రహ్మానందయోగి యచ్చోట కరుదెంచెను. ఆ యోగి యంతలోఁ గన్నులందెరచి యోహో? బ్రహ్మానందుఁడా ? ప్రయోగమున నింత జాగు జేసితి వేమిటికి ? నీ కొరకు నిరీక్షించు చున్నానని యడుగుటయు నతం డిట్లనియె.
మహాత్మా ! పోయినది పుణ్యతీర్థముగదా ? చదివినది వేదాంతము తపశ్చరణమే కృత్యము ఇట్టి మన కెందుండిన నేమి? ఒకచో నొక ప్రయోజనముగలదా యేమి ? మీరిందునాకు నేనింతకన్న కొంతకాలమందే యుండువాఁడను. అది అట్లుండ నిండు. ఇప్పుడు వేరొకకార్యము మీతోఁ చెప్పవలసియున్నది.. ఈ బాలయోగినులు సకలభోగముల నిడిచి పెద్దదూరమునుండి మీ దర్శనమునకై యరుదెంచిరి. మీరున్న నెల వెఱింగింప నన్నాశ్రయించుటచే వెంటఁ దీసికొని వచ్చితిని. మీకోరిక యెద్దియో తెలిసికొని సఫలము గావింపవలయు. నిదియే నా హెచ్చరిక యని చెప్పుచు నా జవరాండ్ర నిరువుర వాని యెదుటకు రప్పించెను.