కాశీమజిలీకథలు/ఏడవ భాగము/112వ మజిలీ

వికీసోర్స్ నుండి

గృహస్తునింట బండుకొంటిని. దొంగలా రేయి వారిల్లు కొల్ల బెట్టినమాట వాస్తవము ఆ నేరము నాయందు మోపి రాజభటులు నన్ను మీ యొద్దకుఁ దీసికొనివచ్చిరి. అదియే నావృత్తాంతము అని యెఱింగించిన విని యా రాజపుత్రుఁడు ముక్కు పై వ్రేలిడుకొని పెద్దతడ వట్టె నిలువంబడి ధ్యానించచు నౌరా? యెట్టిచిత్రము వింటిని. ఆ యోగిని జితవతియా? చిత్రఫలకము చూచి యుండుటంబట్టి యామె రూపమెప్పుడో కాంచినట్లే యున్నది. భళిరే? యెంత చోద్యము? బాపురే? యెంత యాశ్చర్యము? అట్టి కృతజ్ఞురాలికి దైవము తోడుపడకుండునా? క్రూరమృగము లూడిగములు జేయుట యబ్బురమా? అని యూరక వెరగుపడుచు నయ్యయో ? అంతఃపురముల మెలంగెడిమీరెక్కడ? వసిష్ఠమహర్షి యాశ్రమ మెక్కడ? జితవతికి వెఱ్ఱియెత్తిన నీవు వలదనక పెద్దవారలకుఁ జెప్పక యట్లు చేయుదువా? ఆమెంగానక తల్లిదండ్రు లెంత చింతించుచుందురో? కానిమ్ము గతంబునకు వగచినం బ్రయోజనములేదు. ఇప్పుడామె యుత్తర దిశనున్న అరణ్య మార్గమునఁ బోయినదని జాడలు దెలిసినవి మనము పోయి పట్టుకొని కట్టి పెట్టి బలవంతమున నామె నింటికిం దీసికొని పోవుదము. జితవతియని తెలిసిన నేనప్పుడే చేయిపట్టుకొని యాటంకము చేయకపోవుదునా? అని చెప్పి అతండు తండ్రి కా తెరం గెఱిగించి యుచిత పరివారముతోఁ గూడికొని రోపాణి వెంటబెట్టుకొని యుత్తర దేశారణ్యములు తిరుగుచు నామెను వెదకుచుండెను.

అని యెఱింగించి మణిసిద్దుండు - ఇట్లని జెప్పందొడంగెను.

112 వ మజిలీ.

సన్యాసుల కథ

అమ్మా! లెమ్ము లెమ్ము. ఎన్ని దినము లిట్లాహారము గుడువక కృశించెదవు? జితివతి రోహిణియుఁ బ్రయాగమున కవ్వల అడవులలో దిరుగుచున్నట్లు జాడలు తెలిసినవట. ప్రయాగ నగరాధీశ్వరుండు కొందఱ సన్యాసుల మన రాజధానికిఁ బంపెను. వారి అభియోగము విచారించుచు అయ్యగారు మీకీవార్త దెలుపుమని పరిచరునిఁ బంపిరి. అనుటయు జితవతితల్లి అట్లే లేచి యేమీ! నాపట్టి బ్రతికి యున్నట్లు వార్తలు వచ్చినవియా? అయ్యయ్యో ? అరణ్యములలో దిరుగుట కేమి కారణము? ఎవ్వరు చెప్పిరి? ఏమని చెప్పిరి? అని అడిగినఁ దిలక యను పెద్దదాసి అమ్మా ! పరిచరుఁ డీమాట చెప్పెను. అతఁడు ద్వారమున నున్నవాఁడు రప్పింపనా? అనుటయు నామె వాని రాక కనుజ్ఞ యిచ్చినది. తిలక పోయి వానిం దీసికొనివచ్చి అమ్మగారితో సవిస్తరముగాఁ జెప్పుమని నియోగించిన నాకింకరుం డిట్లనియె. అమ్మా ! ప్రయాగమునుండి సన్యాసులు కొందఱు సంకెళులు వేయఁబడి తీసికొని రాఁబడిరి. వారేమి నేరము జేసిరో తెలియదుకాని అమ్మాయిగారును రోహిణియు నా దేశములో దిరుగుచున్నట్లు వారివలన నొక ప్రతీతి బయలు వెడలినది. ప్రయాగాధి పతి అయ్యగారి కేదియో జాబువ్రాసి పంపిరి. ఆ పత్రికం జదివికొనినతోడనే మీకీ వార్త జెప్పిరమ్మనిరి. ఇంతకన్న నాకేమియుం దెలియదని యా కింకరుఁడెఱింగించెను.

అప్పుడు రాజపత్ని తిలకా! నీవు సభకుఁ బోయి సన్యాసు లేమి జెప్పెదరో విని నాకు వచ్చి జెప్పుము. పొమ్మని యాజ్ఞాపించుటయు నా తిలక వానివెంట నోలగంబునకుఁ బోయినది. అప్పు డుశీనర నరపతి సన్యాసుల విచారింవుచున్నవాఁడు.

రాజు - నీ వెవ్వఁడవు?

మఠాధిపతి - ప్రయాగములోనున్న మాధవ మఠమునకు ధర్మకర్తను.

రాజు - మాధవ మఠములో సన్యాసు లెందఱుందురు?

మఠాధిపతి - వేయిమందికి తక్కువ యుండరు.

రాజు - వాండ్రకు భోజనమెట్లు.

మఠా - ఆ మఠమునకు రాజదత్తములైన యగ్రహారములు పెక్కుగలవు. తదాదాయమువలన సన్యాసులకు జీవనోపాధి జరుగును. ఆరునెలలు దేశాటనము చేసి వచ్చినవాఁ డారునెలలందు గూర్చుండి కుడువ వచ్చును.

రాజు - మీ కలహము లేమిటికి వచ్చినవి ?

మఠా -- దేవా ! కొందఱు దుర్మతులు మఠములోఁ జేరుటచే మాకును మఠమునకుఁ గూడఁ జాల అపకీర్తివచ్చినది. వినుండు. కడచిన శివరాత్రికి నిరువురు బాల యోగినులు త్రివేణిలో స్నానము చేయుచుండ చిదానంద రమానందులు మోహించి వసిష్ఠాశ్రమమున కరుగుచున్న వారి సంకల్పము దెలిసికొని ఈ బడుగువానిచే వసిష్ఠ వేషము వేయించి ఈ బ్రహ్మానందుని మూలమున జంపకారణ్యమునకుఁ దీసికొనిపోయి యా యోగినులకు వీడే వసిష్ఠుఁడని చూపిరట. “ఆ బాల యోగినులు వీరి కపటము దెలిసికొని యెందో పారిపోయిరఁట.” అందుండి యీ యోగులిద్దరు తిరుగ మఠమునకు వచ్చుటయు వారినెల్ల వెదకి కొనుచు వీరిద్దరు మఠములో దగవుబెట్టి యిచ్చిన లంచము తమకిమ్మని పోట్లాడిరి. వాండ్రిచ్చిరికారు. దానకోపించి ఈ రమానందుఁడు దుడ్డుకఱ్ఱతో ముసలివాని నెత్తిమీదఁ గొట్టెను. బ్రహ్మానందుఁ డడ్డమురా వానిం గొట్టి నేలఁబడవేసెను. వృద్ధయోగు లిద్దరు బడినతోడనే అందున్న సన్యాసులు కొందఱు వారి వక్షముజేరి రమానంద చిదానందులఁ జావమోదిరి. అప్పుడందున్న సన్యాసులెల్ల రెండు పక్షములై పెద్ద యద్ధము గావించిరి. రాజభటులువచ్చి అందఱిం బట్టుకొని సంకెళులు వైచి కారాగారంబునఁ బడవేసి కొన్నిదినము లందుంచి చివరకు మాఱేడు ఏలినవారి యొద్దకుఁ బంపిరి. ఇదియే జరిగిన కథ యని యెఱింగించెను.

రాజు -- ఇందుఁ బ్రద్యుమ్నయోగి యెవ్వడు?

ప్రద్యుమ్న -- దేవా! నేను అని యెదురు నిలువం బడియెను.

రాజు - నీవు ఆ యోగినుల బ్రహ్మానందు నొద్ద కనిపితివిగదా! అందులకు బాలసన్యాసులు నీకేమి లంచమిచ్చిరి?

ప్రద్యు -- దేవా! నాకు లంచముగా నీయలేదు జ్ఞానపత్రి నమిత్తమేదేని అప్పు డప్పు డిచ్చుచుందురు. అదియే వారు నాకిచ్చినది.

రాజు - పాపము! నీవు జేసినపని వారల కుపచరించినది కాదు కాబోలు.

ప్రద్యు - చిత్తము చిత్తము. నే నేమియుఁ జేయలేదు.

రాజు - కానిమ్ము. చిదానంద రమానందు లెవ్వరు?

చిదా - రమా - మేము దేవా! మేము అని ముందరకు వచ్చిరి.

రాజు - మీరా యోగినుల నెందుఁ జూచిరి?

రమా - ప్రయాగములో గంగాస్నానము జేయుచుండఁ జూచితిమి.

రాజు - వారికై యెంతసొమ్ము వ్యయపరచితిరి.

రమా - దేవా! దాచనేల వేయిమాడలు వ్యయమైనవి. యా మఠములో మా వలన లంచము తిననివాఁడులేడు. మఠాధిపతికిఁ బదిమాడల నొసంగితిమి దేవా!

రాజు - పిమ్మట నా బాలయోగిను లేమైరో వెదకితిరా?

రమా - లేదు దేవా! తరువాత బద్దులమై చెరసాల నుంపఁబడితి మెట్లుపోయిరో తెలియదు.

అని యీ రీతి నా నృపాలుండు సన్యాసు లందరివలన సాక్ష్యము పుచ్చుకొని తన్మూలమున రోహిణీ జితవతుల మనశ్శుద్ధియు సన్యాసుల క్రౌర్యములు దెల్లముగాగ వాండ్రనెల్లఁ గలయ గనుంగొని యిట్లనియె.

ఓ దురాత్ములారా? మీరు సన్యాసులమని పేరు పెట్టికొని మఠంబునం గూర్చుండి శాల్యన్నంబులం భుజించి మత్తి ల్లి యధమకృత్యములు జేయఁ దొడంగిరి మీ రధోగతి పాలగుటయేకాక యా జాతికిఁ గూడఁ గళంకము దెచ్చితిరి. మీ మేనులు తునకలుజేసి యుప్పుపాతర వేయించినను నిష్కృతి గలుగదు. మీకుఁ దగినశిక్ష యేది వేయుటకుం దోచకున్నది. ముందు విచారించెదనని పలుకుచు రాజభటుల వెంట వాండ్రనెల్లఁ జెరసాల కనిపి తాను విచారగ్రస్త మానసుండై యంతఃపురమున కరిగి భార్యతో నా వృత్తాంతమంతయు నెరింగింపు చుండెను. ఆ వెతలోఁ బ్రద్యోతన నగరమునుండి రోహిణిరాజదూతల వెంటనందు వచ్చిన దను వార్త యెవ్వరో చెప్పినంత రాజపత్ని లేచి యేది యేది నాబిడ్డకూడ వచ్చినదా ? అని యడుగుచుండ రోపోణి వచ్చి యామె పాదంబులంబడి గోలున నేడువ దొడంగినది.

అప్పుడు శీనరుఁ డూరడింపుచుఁ రోహిణి ! లెమ్ము లెమ్ము. శోకించినం బ్రయోజనంబులేదు నీ విప్పు డెందుండి వచ్చితివి? జితవతి యేమైనది? వసిష్ఠాశ్రమమునకుఁ బోయితిరా ? మీ వృత్తాంతము కొంత తెలిసినది. సన్యాసుల విడిచిపోయిన పిమ్మట నేమిజరిగినదియో చెప్పుమని యడిగిన వెరగుపడుచు లేచి కన్నులం దుడిచికొని నమస్కరించి యిట్లనియె.

దేవా ! జితవతికి వసిష్ఠునిఁ జూడవలయునని తలంపుతప్ప వేరొక తలంపులేదు. నా యావచ్చక్తి నా పయనము మానిపింప‌ వలయునని చూచితిని సాగినదికాదు. నిప్పునకు జెదలుపట్టిన నదియే నశించును. యోగు లామె నేమి సేయగలరు? ఆమె శీలమునకు మెచ్చికొని పెద్ద పులులు భృత్యకృత్యములు నెరవేర్చనవి. యమునలో మేము విడిపోయితిమి. ఆమె పులితోఁ బ్రద్యోతన నగరము జేరినది. పౌరులకుఁ దదీయ మహిమాతిశయము విస్మయము గలిగించెను.

రాజపుత్రుఁడు ప్రభాకరుఁ డామెతో ముచ్చటించెను. పులి సమసిన దాని తోలు శిరంబునంబూని యావీడు విడచి య యుత్తర ప్రదేశమున కరిగినఁదట. నన్ను దొంగగా నెంచి యారాజు నొద్దకుఁ దీసికొనిపోయిరి. నేనా రాజకుమారునికి యదార్థము జెప్పి వైచితిని. ఆ యోగి జితవతియని వినిన పిమ్మటఁ బ్రభాకరుఁడు మిక్కిలి పరితపించుచు నన్ను వెంటఁబెట్టుకొని యుత్తర దేశారణ్యము లన్నియుం దిరిగెను.

ఎందును నామె గనంబడినదికాదు. ఆ యడవులలో దిరిగినట్లు కొన్ని జాడలు దెలిసినవి. గురుతులు జూచికొనుచుఁ బోవంబోవ యమునానదీ పరిసరమున దట్టముగా గుమురుకొనియున్న చెట్లనడుమ నొక వృక్షశాఖకుఁ పాదములు దగిలించి తలక్రిందుగాఁ దపము గావింపుచున్న యొక యోగి మా కన్నులం బడియెను.

భయభక్తి సంభ్రమములతో నా చెట్టుచెంతకుఁ బోయి శిరంబునఁ జేతులు జోడించి వినయముతోఁ బ్రార్దించుచు నందు నిలువంబడితిమి. సాయంకాలమున కయ్యోగి తపంబు జాలించి‌ యోగంబు వదలి చెట్టుదిగి యమునకుం బోవుచుండ నడ్డమువచ్చి పాదంబులఁబడి మహాత్మా ! జితవతియను రాజపుత్రిక వెఱ్ఱియెత్తి యీ యడవుల దిఱుగుచున్నది. . ఆ చిన్నది మీ యొద్దకు రాకమానదు. వసిష్టమహర్షి యాశ్రమమున కరుగ సంకల్పించుకొని యన్నది. ఆ ముగుద మీకుఁ గనంబడి నదియా? అని యడిగిన యోగి అగును. ఆ ముద్దుగుమ్మ నా యొద్దకు వచ్చినది. దాని చిత్తశుద్ది యరసి యది కోరినరీతి నతివేగముగా వశిష్ఠుని యాశ్రమమున కరుగునట్లు చేసితిని. మీ రెవ్వరని యడిగిన విని నే నాతురతజెంది యిట్లంటిని.

మహాత్మా ! నేనామె సఖురాలను. ఆమెతోగూడ నిల్లు వెడలితిని. కష్టముపడితిని. యమునలో విడిపోయితిమి. నన్నుఁ గూడ నందు జేర్పరా? అని మొర పెట్టుకొనిన నతండు చాలు జాలు మా కిదియే పనియా పోపొమ్ము. నీవందఱుగ నర్హురాలవు కావని పలికి యా తపసి స్నానమునకై యరిగెను.

అప్పుడు మేము దారి గాచుకొని యతండు మరల వచ్చుదనుక నందుండి పాదముల కడ్డముపడి నమస్కరింపుచు మునివర్యా ! ఆ చిన్నది యెన్నటికైన నింటికి వచ్చునా ? ఇది యొక్కటియే చెప్పుఁడు. ఇఁక మాదారి మేము పోయెదమని పలికిన నతం డించుక ధ్యానించి యింటికి రాకేమగును. పోపొండు అని పలికి వెండియు వృక్షారోహణము గావించెను. మేము సంతోషము జెందుచుఁ గ్రమ్మరఁ బ్రద్యో తన నగరమునకు వచ్చితిమి. అవ్వార్త మీకుఁ దెలుపుటకు దూతలవెంట వెంటనే యిందు బుచ్చితిని. ఇదియే నావృతాంతమని యాకథయంతయు రోహిణి వారి కెఱింగించెను.

అని యెఱింగించి మణిసిద్దుండు-ఇట్లని చెప్పఁదొడంగెను.

113 వ మజిలీ.

వసిష్ఠుని కథ

అహా ఆమహర్షి ప్రభావ మేమని కొనియాడఁదగినది? కన్నుల మూసికొని తెరచి చూచినంతలో నెంత సంతోషము గలుగఁజేసెను? అయ్యారే? యిది మేరు పార్శ్వ భూభాగమునందలి వసిష్ఠమహర్షి యాశ్రమము గావలయును. ఔరా? బహుయోజనదూరములో నున్న వనిష్ఠాశ్రమము రెప్పపాటులోఁ జేర్చిన యా సిద్ధతాపసుని తపః ప్రభావము అవాజ్మానసగోచరముగదా? తాపసులు లోకోద్దరణమునకై తపంబు గావింపుచుందురు. తపోధనప్రభావంబునంగాక యీ ప్రదేశము మనష్యులకుఁ జేర శక్యమా? ఇది దేవతాభూమివలెఁ గనంబడుచున్నది. బళిరే యిచ్చటి భూమియంతయు రత్నమయమైయున్నది వృక్షములు సువర్ణచ్ఛాయలచే విరాజిల్లుచున్నవి. జాతివైరములు లేక మృగములు దిరుగుచున్నవి. ఇది తప్పక వసిష్ఠాశ్రమమే నా కోరిక ఫలించు సూచనలు గనంబడుచున్నవి. అదిగో మునిబాలుఁ డెవ్వఁడో నాదెసకు వచ్చుచున్న వాఁడు. వానివలన నీదేశవృతాంత మడిగి తెలిసికొనియెదంగాకయని యొకనాఁడు ప్రాతఃకాలమున నొక వనములో నిలువంబడి జితవతి తలంచుచుండెను.