కాశీమజిలీకథలు/ఏడవ భాగము/103వ మజిలీ

వికీసోర్స్ నుండి

అప్పుడు జితవతి యపరిమితానందముతో ఆఁ ! ఆఁ ! ఏది ! ఏది ! అని దానిం గైకొని యాజాబు విప్పి యిట్లు చదివినది.

సఖీ ! జితవతీ ! నీకిచ్చిన వరము జెల్లించుకొనఁ జాలప్రయత్నము సేయవలసి వచ్చినది. నీకిప్పుడు పంపిన పాలు దివ్యమహిమోపేతంబులు. వీనిం గ్రోలినవారు జరామయములు లేక దివ్యరూపధారులై పెద్ద కాలము జీవింతురు. శుభముహూర్తంబున నీవీ దుగ్ధంబులం ద్రావుము. నే నచిరకాలంబులో వచ్చి కర్తవ్యాంశములఁ బిమ్మట నుపదేశించెదను. పెద్దతడ విం దాలసింప రామింజేసి నిన్నుఁ జూచుట తటస్థించినది కాదు.

ఇట్లు నీ ప్రాణసఖురాలు,

యోగసక్త.

అని యున్న యాలేఖం బలుమారు చదివిచదివి జితవతి కన్నుల కొద్దికొనుచు నమ్మకచెల్లా ! అద్దేవికి నాయందెట్టి యనురాగము కలిగి యున్నది ! నాఁటిమాట మరువక స్వయముగా నీ దుగ్దంబులం దెచ్చియిచ్చినది? ఆమె దయకు మేరలేదు. అక్కటా నేనెంత పాపాత్మురాలను నిత్యము నచ్చటనే వసింపుచు నేఁడీ క్రింద మేఁడకు రానేల? నా సఖురాలిం గ్రమ్మరఁ జూచు భాగ్యము లేకపోయినదిగదా యని పశ్చాత్తాపము జెందుచు తల్లీ ! ఇప్పుడైన నా మాట నమ్ముదువా? స్వప్నమనియుఁ గల్ల యనియు భ్రాంతి యనియు నా కథకుఁ దలయొక పేరుం బెట్టితిరి గదా ! ఆదయా శాలిని నానిమిత్తమై దివ్యౌషధమును బంపినది. నన్నీ పాలం గ్రోలుమని వ్రాసినది. కాని నా పరిణయము మాట యేమియుఁ దెలిపినదికాదు. కర్తవ్యాంశము లన భర్తృవిషయములనియే తలంపవచ్చును. ఆమె వచ్చి యనుజ్ఞ యిచ్చుదనుక నేను గూడ నీక్షీరంబులం ద్రావను. వీనిం భద్రముగాఁ గాపాడుచుండుమని రోహిణి చేతి కిచ్చినది.

రాజపత్నియు నాజాబుఁ గన్నులారాఁ జూచుటచే నేమియుం బలుకనేరక కుమారిక మది ననుసరించియే కావించుటకు నిచ్చయించుకొని లోపలకుం బోయినది.

అని యెఱింగించి మణిసిద్ధుండు తదనంతర వృత్తాంతంబు పై మజలీయం డిట్లని చెప్పదొడంగెను.

103వ మజలీ.

నారధునికథ

అయ్యో ! యీ చెడువార్త నాచెవి నేమిటికిఁ బడవలయును? నేనా భూలోకమున కేమిటికిఁ పోయితిని! వారి కీవార్త జెప్పనేల ? మఱియొక చోటినిఁ బోవుద మను కొన్నను నామన సటే లాగుచున్నది. దేవసభావిభూషణులైన వసుపులు తమ మానిసి పుట్టుకతెరం గెఱింగిన నెంతవగతురో ! పోనిమ్ము. చెప్పుటయే మంచిది. ఎప్పుడైన శాపమనుభవించి తీరవలసినదేకదా? ముందుగాఁ దెలిసినచోఁ బ్రతీకార మేదియైనఁ జేసికొందురేమో ? తప్పక వేగఁబోయి చెప్పవలసినదే. అని నారదమహర్షి యొకనాఁడు పెక్కు తెరంగుల వితర్కించి దివ్యమార్గంబున వసులోకమున కరిగెను.

వసువు లమ్మహర్షి రాకవిని దూరముగా నెదురువోయి యర్ఘ్య పాద్యాదివిధుల నిర్వర్తించి తోడితెచ్చి యుచితాసనాసీనుం గావించిరి. అప్పుడిద్దరు వింజామరల విసరిరి. ఇరువురు పాదము లొత్తిరి. మఱి యిరువురు పుష్పములఁ బూజించిరి. యొకఁ డాతపత్రము పట్టెను. ధరుండెదుర నిలువంబడి వినయవినమితోత్తమాంగుఁడై యల్లన నిట్లనియె.

ఉ. పావనమయ్యె మాకులము పండెఁ బురాకృతపుణ్యముల్ యశ
    శ్రీ విలసిల్లెఁ గామ్యఫలసిద్ది ఘటిల్లెఁ దపంబునిండె నో
    దేవమునీంద్ర ! నీ వరుగుదెంచుటచే నిటకుం ద్వదంఘ్రీసం
    సేవయొనర్చి యేమిఁక విశేష మదేమి భజించువారమో ?

మహాత్మా ! మీరిప్పు డెందుండి వచ్చితిరి? మూడులోకములలో మీకుఁ దెలియని రహస్యము లుండవుగదా ? ఎందేని విశేషములున్న వక్కాణింపుఁడు. అని అడిగిన నారదుండు వసు ప్రవరా ! నే నిప్పుడు భూలోకమునుండి వచ్చుచుంటిని. విశేషము లన్ని చోట్లం గలవని పలుకుచుండఁగనే ధరుండు వెండియు నిట్లనియె

మునీంద్రా ! మర్త్యలోకము కడు శోకాకులమని మా ప్రభాసుని భార్య చెప్పినది. అక్కడి కష్టము లెట్టివి? ముదిమియఁట యెట్లుండును. ఎన్ని యేండ్లకు వచ్చును. రోగములప్రవృత్తి యెట్టిది ? మనకును వారికినిఁ గల భేద మెయ్యది? తెల్ల ముగ నెఱిగించెద రేయని యడిగిన నారదుం డాత్మగతంబున నయ్యా ! వీరు తమ మనుష్య లోక జననోదంత మెఱుంగక నన్నడుగుచున్నారు. ఉపశ్రుతివలె నాలోక ప్రస్తావమే తేవలయునా ? కొంత ప్రసంగ మైనవెనుక జల్ల గా నెఱింగింతు. తొందర పడరాదని తలంచుచు నిట్లనియె.

మనుష్యులకు దుఃఖాధిక్యమున్నమాట నిజమే వారిభోగములు క్షణభంగురములు. జరా మరణ రోగములు సంతతము బాధించుచుండును. కాని మనకన్న వారి కొక్కవిశేషము గలదు. మనుష్యులు తపంబుచేసి మనకును బొందశక్యముగాని యుత్తమలోకంబుల నందఁ గలరు. అనుటయు ధరుండు స్వామీ ! వాండ్రుత్తమలోకం బుల బొందియు మనవలె స్థిరులై యుండరు. ఇందులకు మహాభీషుండే సాక్షి అని ప్రత్యుత్తర మిచ్చెను.

అప్పుడు నారదుఁడు అక్కటా ! వీరు తమకు రాఁబోవు నిక్కట్లు తెలిసికొన లేక మానవులకై చింతించుచున్నారు. అయ్యో! ఆకథ వినిననెంత పరితపింతురో, ఏమిచేయుదును? ఆ మాట నా నాలుకను నిలువ కున్నది. ఇఁక దాచలేను. చెప్పదనని యాలోచించుచున్నతరి ధరుండు స్వామీ ! మీ మానసమం దేదియో ధ్యానించుచున్నారు. ఎవ్వరి విషయము. నామాటకు సదుత్తరం బీయరైరి. అని అడిగిన నారదుండిట్లనియె.

వసూత్తమా? మీరు దేవతలమని గర్వించి బ్రహ్మర్షివరేణ్యుండైన వసిష్ట మహాముని యాశ్రమమున కరిగి యవ్వన ముద్యాన వనముగాఁ దలంచి పుష్పాపచయాది క్రీడలఁ గావించి విచ్ఛిన్నము జేసితిరఁట నిజమేనా?

అంతటితో విడువక యమ్మునిసత్తముని ప్రాణ సమమగు హోమధేనువును శిష్యుఁడు వలదనుచుండ బలత్కారముగాఁ దీసికొని పోయితిరఁట. ఇది యేమి యాగడము ? మీ బుద్ధులు సురిగిపోయి నవియా యేమి ? మీ దేవభావము ఋషులకడఁ జూపఁదగినదియా ? అయ్యో ? హాయిగా విమానము లెక్కి సంచారముజేయు సుఖమంతయు పాడుజేసి కొంటిరే అని పలికిన విని యులికిపడుచు ధరుఁడు స్వామీ ! ఆయనకు మాపైఁగోపము వచ్చినదా యేమి. నేను వలదని చెప్పుచునేయుంటిని. భార్యాలోలుండైన ప్రభాసుని మూలమున నాపని చేసితిమి ఇప్పుడు య మ్మొదపు నాముని సదనంబునకుఁ దీసికొనిపోయి యర్పింతుమా? మీ మాటలు విని మాహృదయములు బేదిల్లుచున్నవి? అక్కడ నేమి జరిగినదియో వివరించ మనుటయు నారదుం డిట్లనియె.

ఏమని చెప్పుదును. చేయు గాలిన వెనుక నాకు పట్టిన లాభమేమి ? వినుండు. ఇంతదనుక మీరు దురంత దుఃఖభాజనమని నిందించిన మనుష్యలోకములో జనించు నట్లు వసిష్ఠుఁడు మిమ్ము నందఱ శపించె తెలిసికొంటిరా ? అని చెప్పినంత హాహాకారముతో నందఱు మూర్ఛ నొందిరి.

అప్పుడు నారదమహర్షి వారినెల్ల నోదార్చుచు వసువులారా ! మీరెన్నఁడు నిడుముల గుడిచి యెఱుంగరు కుడిని కూర్చుండి యీ యాపద దెచ్చుకుంటిరి. హరిహర బ్రహ్మలకైనఁ దాపసశాప మనుభవింపక తీరదు. తొల్లి విష్ణుండు ముని శాపతప్తుం డగుట వినలేదా ? పెక్కులేల మీ యెకిమీడుఁ గౌతమశాపతప్తుండై సహస్రాక్షుండగుట త్రిలోక విదితముకాదా ? చేసిన కర్మకు ఫలం బెంత వారికిని గుడువక విడువదు. తప్పక మీరు శాపఫలం బనుభవింపవలసినదే యని యుపన్యసించిన విని ధరుఁడు కన్నీరు గార్చుచు నారదున కిట్లనియె.

సీ. పరమదుర్భరగర్భ నరకవాసము పున
             ర్భవభేద మనుభవింపగ వలెనె
    మలమూత్రమిళిత శయ్యల దొర్లి దొర్లి బా
             ల్యదశఁ గుంద(గం దగునయ్య మాకు
    వాతపైత్యాది ప్రభూతరోగములు బా
             ధింపఁదాల్తుమె తుచ్చ దేహములను
    పితృమాతృజాయావిహిత వియోగక్లే శ
             మోరాంబునిధి మునుంగుదుమె యింక

గీ. మిక్కుటంబగు జర తలకెక్క. దేహ
    ధారణముజేసి మనియెడు వారమయ్య
    అక్కటా ? మమ్ము రాయిగానై నఁ జేయ
    కవనిఁ బుట్టఁగఁ దిట్టెనేమయ్య తపసి.

మునీంద్రా ! భూలోకవాసుల క్లేశములఁ దలంచికొనిన గుండెలు పగిలిపోవు చుండును. అట్టి జగమున మే మెట్లు పుట్టువారము. ఈ యిక్కట్టు దాటు తెరవెద్ది ? అయ్యో ! వసిష్ఠమహర్షి యెంత కఠినాత్ముడయ్యెను. మేము వేల్పులమని యించుకయు విచారింపక పోయెనే ? మా ప్రభాసుని మూలమున నింత మూడినది. అతండు భార్యాలోలుండై యిప్పనికిఁ బురికొల్పెను. తలంచికొన మా తప్పు ప్రత్యక్షముగాఁ గనంబడుచునే యున్నది. బ్రహ్మస్వహరణ మూరక పోవునా మహాత్మా ? ఇప్పుడు మేమేమి జేయఁదగినది. కర్తవ్య ముపదేశింపుము. మా కేమియుఁ దెలియకున్నదిఁ నీపాలఁ బడితిమని యమ్మునిపతి యడుగులఁ బడి. గోలగోలున నేడువ దొడంగెను.

నారదుం డతని లేవనెత్తి వసూత్తమా ! ఊరడిల్లుము. ఇందుప్రభాసుని యపరాధ మధికముగాఁ గనంబడుచున్నది. మహేంద్రాదులమ్ముని శాపము క్రమ్మరింప జాలరు. మీరిప్పుడు చని యా యరుంధతీ మనోహరుని పాదంబులంబడి ప్రార్దింపుఁడు. ఆ దయాహృదయుఁ డేదేని సదుపాయము చేయకమానడు. శాప ప్రతిగ్రహణకాలము సమీపించుచున్నది. పో పొండని యపదేశించి నారదుం డెందేనింబోయెను.

పిమ్మట వసువు లయ్యతివతి హాతోపదేశమునఁ గొంత శోకోపశమనము గావించుకొని యా క్షణము హోమధేనువుతోఁ గూడ వశిష్ఠమహర్షి యాశ్రమమున కరిగిరి. అని యెఱింగించి.