కాశీమజిలీకథలు/ఏడవ భాగము/104వ మజిలీ

వికీసోర్స్ నుండి

104వ మజిలీ

జితవతీ ప్రవాసము కథ

రోహిణీ! మిన్ను విరిగి మీదఁబడిన ట్లిప్పుడు వచ్చినవార్త వింటివా ? పాప మా వసుపత్ని నా నిమిత్తము వశిష్టమహర్షి హోమధేనువునుఁ దీసికొని రమ్మని భర్తను బ్రోత్సాహపరచిన దఁట అతం డన్నలతోఁగూడ నా మొదవుం బట్టికొని పాలు పితికించెనఁట. అవియే నాయెద్డ కనిపినది. వశిష్టమహర్షి యలిగి యా యపరాధ మూలమున వసువుల కెల్ల నేదియో శాపమిచ్చెనఁట. వసువు లందరు దఃఖించుచు నాజడదారి యాశ్రమమున‌ కరుగుచున్నారఁట. యిప్పుడే యోగిసక్త పరిచారిక యా కథగల పత్రిక మేడమీఁదికి విసరి పోయినది. క్షేమ సమాచారము లేమియు వ్రాయక పోవుటచే యోగసక్తయు దుఃఖించుచున్నట్టే తోచుచున్నది. అయ్యో ! నే నెంత పాపాత్మురాల నైతిని నాకతంబున దేవతా శ్రేష్ఠులు శప్తులై పోయిరే. భర్తచేఁ జేయఁగూడని పని నా నిమిత్తము చేయించిన యోగసక్తవంటి సఖురా లెందైనం గలదా। ఆమె రుణ మెట్లు తీర్చుకొందును? ఏమని శపింపఁబడిరో వ్రాసినదికాదు. పుడమి వశిష్ఠమహర్షి యాశ్రమ మెందున్నదియో తెలిసికొనిరమ్ము నే నక్కడికి బోయి యమ్ముని వరేణ్యుని పాదంబులంబడి వసువుల కిచ్చిన శాపము నాపై వ్యాపింపఁజేయుమని ప్రార్దించెదను. మరియొక తెరవున నాకు నిష్కృతి గలుగదు మారుమాట పలికితివేని నీ మొగము జూడను. ఈ పయిన మెవ్వరికిఁ దెలియనీయరాదు. ఇఁక నేను భోగములొల్లను. కాషాయాంబరములు దాల్చి యోగినీ వేషముతో నత్తాపససత్తము నాశ్రయించి వారి శాపము క్రమ్మరించెదను. లేదా, నేను భరించెదను. ఇది నిశ్చతము. అని యొకనాఁడు సాయంకాలము జితవతి రోహిణితోఁ బలికినది.

ఆ మాటలు విని రోహిణి యొక్కింతతడవు వివశమై యేమియుం బలుకక తొట్రుపాటుతో జితవతీ ! నీ కృతజ్ఞత కొనియాడఁదగి యున్నది. ఇట్లు పలుకుట నీకే చెల్లును. కాని యందలి ప్రయోజన మించుక విచారింపవలసి యున్నది. వసిష్ఠమహర్షినిఁ బ్రసన్నుఁజేయుటకై వసువులు తదాశ్రమమున కరిగిరిగదా? ప్రసన్నుఁ డయ్యెనేని వారు శాపముక్తు లగుదురు. కానిచో శాపఫలం బనుభవించి యుందురు. ఈ సరి కెద్దియో యొకటి జరగియే యుండును. భూమిలో వశిష్ఠాశ్రమమెందున్నదో తెలిసికొని కష్టనిష్ఠురముల కోర్చి మనమచ్చటికి వెళ్ళిన లాభమేమి యున్నది ? లెస్సగా విచారించి చెప్పుమని పలికిన జితవతి యిట్లనియె

రోహిణీ ! నిన్ను నేనీ పయనముగరించి యడిగినప్పుడు యిందలి గుణదోష ముల నిరూపింపవలయు. ఆ మాట అడుగనిదే యేలచెప్పెదవు. వసిష్ఠముని యాశ్రమ మేదిక్కున నున్నది ? మార్గమెట్లు ? ఇది నీవు తెలిసికొనవలసిన పని. అందుల కిష్టవడియెదవా ? లెస్స. లేకున్న జెప్పుము, నాకుఁ దోచినట్లు కావించు కొనియెదనని పలికిన విని యక్కలికి యులికిపడి సఖీ! నీ వింత నిరూఢముగాఁ జెప్పినఁ గాదందునా ? నీవు కుసుమ కోమలి వగుటఁ బయనమందలి కష్టములు గ్రహించి యామాటాడితి. పోనిమ్ము నీ యిచ్చవచ్చినట్లే కావించెద నిప్పుడేపోయి దెలిసికొని వచ్చెదనని చెప్పి రోహణి యటఁ గడలి నాలుగుదినము లాగ్రామమంతయు విమర్శించే క్రమ్మర జితవతి యొద్దకువచ్చి యిట్లనియె.

రాజపుత్రీ ! అమ్మహర్షి యాశ్రమము హిమగిరి పరిసరమున నున్నదని కొందఱు, వేరుపాదప్రాంతమం దున్నదని కొందఱు, నయోధ్యానగర సమీపమున నున్నదని కొందఱుం జెప్పిరి. యట్లైన నుత్తర దేశమునకుఁ బోవలయును. ఆ దేశమంతయు నరణ్యభూయిష్టమై యన్నదట. యేమిజేయవలయునో చెప్పుము నీయాజ్ఞ వడువునఁ గావించెదనని పలికినది. అప్పుడు జితవతి రోహిణీ ! వసిష్ఠాశ్రమమునకుఁ బోవుటతప్ప నొండుపనికి నామానసం బొల్ల కున్నది. కాషాయాంబరములు రుద్రాక్ష మాలికలు లోనగు యోగినీవేషసంభారము లన్నియుఁ దీసికొనిరమ్ము. ఱేపురాత్రియే పోవలయును. గఱ్ఱమెక్కి కొంతదూరము పోవుదము తరవాత సమయానుకూలముగాఁ జేయుదము. ఇంతకన్నఁ జెప్పునదిలేదు. వేరొక యాలోచనము గావింపవలదు. అని నిరూపించటయు నందులకా పడఁతి యొడఁబడినది. ఆ దివసంబంతయు నా కాంత పయనమునకుఁ గావలసిన వస్తువు లన్నియు సంగ్రహించుకొనినది.

మఱునాడర్ధరాత్రంబున నయ్యంబుజాక్షి లిరువురు నశ్వారూఢులై యెవ్వరికిం తెలియకుండఁ బురంబు వెలువడి యుత్తరాభిముఖులై యరిగిరి. తన నిమిత్తము వసువులు శపింపఁబడిరని వినినది మొదలు అమ్మదవతి నిద్రాహారములు సేయక యేకరీతిఁ జింతింపుచు నెట్లయిన వసిష్టమహర్షి యాశ్రమమునకుంజని యజ్జడదారి యడుగు లంబడి వారి శాప విముక్తులం జేయ నిశ్చయించుకొని యున్నది. తానుఁ కన్యకననియు రాజపుత్రికననియు, నిల్లు గదలరాదనియు నించు. కంతయుఁ దలపదయ్యెను. గృదజ్ఞురాలన నామెనే చెప్పవలయును.

జితవతి యాశ్వారోహణ శిక్షయం దారి తీరినదగుట నా ఘోటకమును బాటవముతో నడిపించుటంజేసి తెల్లవారునప్పటికి వారు బెద్ద దూరము పోయిరి. నడచునప్పుడు జితవతి రోహిణీ ! మనము చాలదూరము వచ్చితిమి. వశిష్టమహర్షి యాశ్రమ మింక నెంతదూరమున్నదియో! యెన్ని దినములకుఁ బోవుదమో ? యాయతిసత్త ముండు నామాట మన్నించునా ? మహర్షులకు దయయుండదా ? మనసుకఱుగునట్లు పాదంబులంబడి ప్రార్థించెదను. కనికరించి వారిని విడిచిన ధన్యులమే యగుదుము. విడువకున్న నాశాపము నేను భరింతునన్న నట్టు చేయకుండునా ? అత్తపసి భార్య యరుంధతీ‌ మహాదేవి కడుయిల్లాలని చెప్పుకొనియెదరు ఆ సాధ్వీమణియైన నన్నను గ్రహింపదా ? ఒక్క యక్కటికము లేక తక్కిన సుగుణములెన్ని యున్నను నిరర్దకములు. వసువులు పరోపకారమునకై చేసినపని తప్పని యెంచి శపించుట వశిష్ఠునిది తప్పు. మునులు ముక్కోపులు. చిన్న తప్పునకే పెద్దగా నలుగుదురు. అతండలిగి శపించుచుండ దాపుననుండి వారింపక యూరక వినుచుండిన యరుంధతీదేవికి రెండవ తప్పు సంతతము భర్త పాదంబులపై దృష్టుల నిడి కూర్చుండినంతనే యుత్తమురాలై పోయినదాయేమి ? భూవదయ సర్వగుణ శ్రేష్ఠమని గ్రంధములుద్ఘోషింపుచున్నవి. ఒకవేళ నీవార్త యరుంధతి వినలేదేమో ? ఇందులకు వేరెద్దియేనిఁ గారణ మున్నదేమో? యని యనేక ప్రకారములఁ దలపోయుచు రోహిణితో నుపన్యసించుచు నడుచుచుండెను

రోహణి :- సఖీ ! జితవతీ ! నీమాటలన్నియు సత్యములే. మహర్షులు శాంతులయ్యు నవమానతు లైనప్పుడు క్రోధరూపముదాల్తురు. వసువులు చోరకృత్యముగావించిరి. ఎట్లైన మ్రుచ్చలించుట తప్పుగాదా అది అట్లుండనిమ్ము. మనము గుమ్మిడికాయలో నావగింజంత పయనము చేయలేదు. అయ్యాశ్రమ మెంతదూరమం దున్నదని యడుగుచుంటివి. హిమవత్పర్వతము దాటి పోవలయనఁట. ఇట్టి కష్టముల నీవెప్పుడైన బడియుంటివా? అప్పుడే నీ మొగము సరసింబాసిన తమ్మివలె వాడఁజొచ్చినది మన యుద్యమము సముద్రమున కేతామెత్తి నట్లున్నది. పరదేశవాశ క్లేశము సామాన్యము కాదు. అని యేమేమో చెప్పుచుండ వినిపించుకొనక? జితవతి మధ్యాహ్నముదనుక నేక దృష్టితో గఱ్ఱమును నడిపించుచుండెను. గ్రామమేదియుఁ గనంబడినదికాదు. పోవం బోవ నయ్యరణ్యాంతరంబున నితాంతశీతల మధురసలిల విలసితంబగు కాసారంబు తీర భూరుహశాఖా సమాచ్చాదితంబై వారికి గన్నుల పండువ గావించినది. తత్తటనికటవట విటపిచ్ఛాయ నా యబలలు గుఱ్ఱము దిగి గమనాయాసము వాయ నాతటాక తోయమున నవగాహన స్నానము గావించిరి.

అప్పుడు జితవతి రోహిణితో, సఖీ ! ఇంతవేళ మిగిలినను నాకు నాకలియు దప్పియుఁ గొంచమైనఁ బొడమినది కాదేమి ? దేవతా శ్రేష్ఠులైన వసువుల వాత్సల్యమున నేమో? అనుటయు రోహిణి నవ్వుచు బూవుఁబోణీ ! సందియమేలా ? కాకున్న నీవింత సేపు నిలువఁగలవా? వినుము నిన్న నీవు త్రాగినవి వాడుకగాఁ బుచ్చుకొను పాలుగావు. ప్రవాస క్లేశ మనుభవింపఁ జాలవని యాదివ్యదుగ్ధంబుల నీకుఁజెప్పకయే త్రాగనిచ్చితిని నీవు దొందరగా గ్రోలుచు రుచి గ్రహింప నేరవైతివి. మధురాధిక్యంబునఁ దృప్తివడసి కొన్ని దిగవిడిచితివి. జ్ఞాపకములేదా? అదిశర్కరాగుణంబని నీతోఁ బొంకితిని ఈ తప్పు క్షమింపుమని పలికిన విని జితివతి యబ్బురపాటుతో నిట్లనియె.

అహా ! ఆ క్షీరమహాత్మ్య మేమని కొనియాడఁదగినది? పంచ భక్ష్యపరమాన్నములఁ దృష్తిగా భుజించినంత బలము గలిగియున్నది. యోగసక్తా ! నా నిమిత్తమై యెట్టి యమృతము దెచ్చియిచ్చితివి. తల్లీ ! యిప్పు డెట్టి యిడుమలం గుందుచుంటివో? నాకు ఱెక్కలు లేక పోయినవిగదా ఎప్పుడు మీశాపము గ్రమ్మరింతునో. అని యుచ్చరింపుచు రోహిణి! మంచిపనియే చేసితివి. ఇది మనకుఁ బ్రయాణోప కరణమైనది. కాని నీవుఁగూడఁ ద్రాగితివా లేదా? అనుటయు నది అమ్మా ! నీవు దిగవిడచిన పాల నేను ద్రాగితిని. నీకుఁబోలె నాకును దృప్తిగా నున్నదని పలికినది

అప్పుడు జితవతి రోహిణిం గౌఁగలించుకొని సఖీ ! ఇప్పటికి మనము ధన్యులమైతిమి ఇఁక మన యుద్యమము కొనసాగఁ గలదు. క్షుత్పిపాసలు బాధింప నర్జరారణ్యములు దాటిపోవుట కష్టము గాదా. ఆవెత వదల్చితివి. సంతోషమైనది. అని యుబ్బుచుఁ బలికినది. అందుఁ గొంతసేపు జలక్రీడలాడి‌ తత్తీరంబుజేరి మఱియు -

సీ. అంగరాగంబెల్ల గంగపా ల్గావించి
            మేనెల్ల బసుమంబు మేదురించి
    యొడలి భూషలనూడ్చి కడిఁది రుద్రాక్షదా
            మముల సర్వప్రతీకములఁదాల్చి
    విరులు రాలించి కురుల్‌ విరజిమ్మి మఱ్ఱిపా
            ల్దగిలింత జడలు గట్టఁగబిగించి
    చీనాంబరము విసర్జించి మించినవేడ్కఁ
            గాషాయచేలము ల్గలియఁగట్టి

గీ. గురుతరవిరక్తి రూపు గైకొని యెనసఁగ
    విషయ విముఖత మూ ర్తీభవించెననఁగ
    యోగినీవేషములఁ బూని‌ రుచితరీతి
    నాతలోదరులురు వివేకాభిరతిని.

అట్లాకాంతారత్నము లిద్దరు యోగినీవేషము దాల్చి వసిష్ఠాశ్రమ దర్శనవ్యగ్ర గమనలై యుత్తరముగాఁ బోయిపోయి కొన్ని దినంబులకు బ్రాయాగనగరంబు జేరిరి.

అని యెఱింగించి మణిసిద్ధుండు--ఇట్లని చెప్పందొడంగె