కాశీమజిలీకథలు/ఏడవ భాగము/102వ మజిలీ

వికీసోర్స్ నుండి

ప్రభా — శా. ఏమీబాలక ! మామకప్రధిత దివేడ్య ప్రభావంబు వి
               శ్వామిత్ర క్షితినేతృ నీచబలసామ్యప్రక్రియన్ బల్కెదా
               హా! మాప్రజ్ఞ వెఱుంగవీవరయబ్రహ్మర్షుల్ మముంగూర్చికా
               దే ! మోక్షాస్థపంబు సేయుదురుధాత్రిన్ వ్యక్తసర్వార్ధులై.

శిష్యు — గీ. అనిమిషప్రజ్ఞ మేమెఱుంగనిది కాదు
              పుడమి జడదారి కపకారముగఁ జరించి
              కాదె తెరఁగంటి యెకిమీడునికాయమెల్ల
              గన్నులై పోవ శప్తుఁడౌ టెన్నరొక్కొ.

అని పలుకుచుండ నమ్ముని బాలకుని మాటలఁ బాటింపక వసువుల సదృశ వేగంబున నాసౌరభేయిందీసికొని తమ కంబున కేగిరి.

అని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలికథ పైమజిలీయం డిట్లు చెప్పండంగెను.

102 వ మజిలీకథ.

సఖీ ! జితవతీ ! నీపుణ్యము ఫలించినది. అనుకూల వాల్లభ్యంబు సంప్రాప్తించెనని యెల్లరుఁ జెప్పుకొనుచున్నారు. దివ్యరూపసంపన్నుఁడైన వరుండు లభింప నాకిప్పుడు వివాహ మక్కరలేదంటివఁట యేమిటికి? రహస్య మేమైనంగలదా యని యొకనాఁడు రోహిణి జితవతి నడిగిన నప్పఁడఁతి యిట్ల నియె. రోహిణీ ! అల్లనాఁడు మేడ మీఁద మనము సంగీతము బాడుకొనుచున్నప్పుడు యోగసక్తయను దేవకాంతవచ్చి ముచ్చటించినమాట నీవు మఱచితివి కాఁబోలును. ఆవసుపత్ని పెద్దతడవు నాతో నేకాంతముగా మాట్లాడునప్పుడు మనుష్యయోషల యస్థిరయౌవనత్వము దెలిసికొని నాకు దేవత్వము బ్రసాదింతునని వరమిచ్చి తాను వచ్చుదనుకఁ బెండ్లి యాడవలదని చెప్పి పోయినది. ఆ సుందరి నామాట మరువదు. ఎప్పుడోవచ్చి తానిచ్చిన వరము సఫలము జేయక మానదు. నాకట్టి విశ్వాసము గలిగియున్నది. ఆమె యాజ్ఞలేక నేను వివాహ మాడను. మాతల్లి తోఁజెప్పి యిప్పుడా సన్నాహము మానిపింపుము. నామాట పరిహాసముగా నెంచి లక్ష్య పెట్టకున్నదని పలికినది.

అంతలో జితవతితల్లి అక్కడకువచ్చి రోహిణీ ! అమ్మాయితో బెండ్లిమాట జెప్పితివా ! ఏమన్నది వరుని చిత్రఫలముం జూచితివా? ఈతని పేరు ప్రభాకరుఁడఁట. ఈనామ మీతనికి సార్ధకముగా నున్నది. ఇంతకంటె సుందరుఁ డీపుడమలో లేఁడని చెప్పుము. అని పలికిన నారోహిణి అమ్మా! భర్తృదారికతోఁ జెప్పితిని. ఆమె సంకల్పము వేరుగా నున్నది. యోగసక్తకథ మీకునుం జెప్పియున్నదిగదా? ఆమె వచ్చి యాజ్ఞ నిచ్చుదనుకఁ బెండ్లియాడదట. పెక్కులేడికి జితవతి సంకల్పము మేము ద్రిప్పఁ జాలమని చెప్పినది.

ఆమాటవిని జితవతి రోహిణీ ! అంతరిక్షమునుండి యోగసక్త వచ్చినది. నీవు చూడలేదా? మే మిద్దరము మిద్దెపయిం గూర్చుండి పెద్దతడవు సంభాషింపలేదా? ఏమియు నెఱుఁగనట్లు చెప్పుచుంటిమేమి? నిజ మెఱింగించి మాతల్లి యుల్లము మఱలింపుమనుటయు అప్పడఁతి యిట్లనియె.

జితవతీ ! నీమాట కాదనిన నీకుఁ గోపము వచ్చును. నిజముగా యోగసక్త నీ యొద్దకు వచ్చినదనుకొంటినవా? నాఁటి చర్యలన్నియు స్వప్నగతములని సఖురాండ్రందరు నిశ్చయించిరి. మన మందరము భ్రాంతిపడి యట్లనుకొంటిమి, ఆపలుకు నమ్మి యిప్పుడు సిద్ధమైన వివాహమునకు భంగంబు గలిగింపరాదు. మనుష్యులు దేవతలెప్పుడును కాఁజాలరు. ఈదేహము విడచి దేవతాదేహముం దాల్తురు. ఇదియే నిక్కువమని పెద్దగా సుపన్యసించినది.

అప్పుడు జితవతి ముక్కుపై వ్రేలిడుకొని ఔరా ! నీవెంత భ్రాంతిపడుచుంటిని. స్వప్నమో సత్యమో తెలియక నేనిట్లు చెప్పుచుంటిననుకొంటివా? నాఁడు మనము నిద్రబోయితిమా ! జాగ్రదవస్థయందు స్వప్నము వచ్చునా? ముదితా? అది కలకాదు సత్యము సత్యము. ముమ్మాటికిని సత్యము. అట్లు జరిగితీరును నాకిప్పుడు పెండ్లి యక్కరలేదని కచ్చితముగా నుత్తరము చెప్పిన విని రాజపత్ని నవ్వుచు నిట్లనియె.

బిడ్డా ! కొన్నికలలు నిజముగా జరిగినట్లే యుండును. మొన్నటి రేయి నాకొక కలవచ్చినది వినుము. నేను దేవలోకమున కఱిగితినఁట శచీదేవి కాంతలు సేవింపఁ గొల్వుడి నారాకఁయక జూచి గద్దిదిగ్గి నాకెదురువచ్చి నాచేయి పట్టుకొని ముద్దుఁ పెట్టుకొనుచు దీసికొనిపోయి తన యర్దాసనములం గూర్చుండఁ బెట్టుకొనినది. ఇరువురు తరుణులు వింజామరల విసరుచుండిరి దేవకన్యలు నాట్యము సేయుచుండిరి. కొందరు సుందరులు వీణాగానము వెలయింపుచుండిరి. అట్టితరి యింద్రాణి ముక్తా దామ మొకటి నామెడలోవైచి విడిమిచ్చి కృపారసదృష్టుల నాపైఁ బరగింపుచు మించుఁబోడి ! నీవు ప్రతిదినము వచ్చుచుం బోవుచుండుము. నిన్ను సఖురాలిగా నెంచితినని పలుకుచు నన్ను సాగనంపినది. అంతలో మేల్కొంటి. నావైభవమంతయుఁ దలంచికొనిన నిక్కముగా జరిగినట్లే తోచుచున్నది. పుత్రీ ! నాకిపుడు స్వర్గ గమనాలాభ మెట్టిదో నీకోరికయు అట్టిదే. నీవు చిన్నదానవగుటఁ గలలు సత్యములని నమ్ముచుంటివి. మేము వానిలక్ష్యము పెట్టము నీవు చక్కగా విచారించి భ్రాంతి వదలుము. అని చెప్పినవిని తల్లికి బుత్రిక యిట్లనియె. అమ్మా ! కల లెట్టివో నేనెఱుంగ నివియా? ఇంత జెప్పితివి ! చాలు, చాలు. అందరు మూఢులైన నేమందును. ఆయోగసక్త తన శిరోమణి జారిపడిన, దానిం గ్రహించుటకు మా యొద్దకు వచ్చినది. ఆమండనము నాదోసిటం బడినప్పుడు కలిగిన చిహ్నమిప్పుడును గనం బడుచున్నది చూడుము. ఆమె నీ తల్లి జరాధికారముం జూచి మిక్కిలి యాశ్చర్యపడినది. దేవలోకములో ముదిమియు నాధివ్యాధులును లేవఁట దేవలోకచరిత్ర మంతయుఁ బూసఁగ్రుచ్చినట్లు చెప్పినది తానాజ్ఞ నిచ్చుదనుకఁ బెండ్లియాడవద్దని ముమ్మాటికిం జెప్పి పోయినది రోహిణీ ! లెస్సగా విమర్శించి యా మాటలు కలలో సత్యములో చెప్పమనుటయు అయ్యువతి దృష్టులు పైకి నిగుడించుచు నౌను. కొంత జరిగినట్లే తోచుచున్నదని పలికినది.

అప్పుడు రాజపత్ని పుత్రీ ! పోనిమ్ము. నీమాట సత్యమనియే నమ్మెనను నిక్కముగా నామెకు నీయెడఁ గనికరము గలిగినచో నీభర్తకు మాత్రము దేవత్వ మాపాదింపలేదా? నీవు బెండ్లి యాడినం దప్పేమి? ఆసంబంధము మిగిలెనేని అట్టి వీరుఁడు దొరకుట దుర్ఘటము. ఆకాశవచనముల నమ్మి ప్రస్తుత విభవముల విడనాడుట తగదు ఆమె గడు వెద్దియేనిఁ జెప్పిపోయినదా? లేదుగదా? యెంత కాల మిట్లుందువు? వెఱ్ఱియూహల విడువుము. ఆమె యోగసక్త. నీవు జితవతివి. మీయిద్దరి నామములకు సఖ్యము కుదిరినది వార్దక్యంబున నామెతో గలసికొందువుగాక. ఇప్పుడు వలదని బోధించిన విని జితవతి యేదియో చెప్పఁబోవు సమయంబున నొక పరిచారిక వడివడి జనుదెంచి సంతోష మభినయించుచు నిట్లనియె.

భర్తృదారికా ! నీవు నన్నాయుప్పరిగపై సంతతము వసియించి యాదేవకాంత రాక నరయుచుండు మని నియమించితివి గదా? నీయాజ్ఞ శిరంబునం బూని నేనందుఁ గాచికొనియుండ నేఁటి యుదయంబున నాఁడువచ్చిన చేడియ దగ్ధపూరితమగు నీకనక కలశంబు జేతఁబూని మన మేడమీఁదకు వచ్చి యల్లంతదవ్వున నిలువంబడి జితవతీ ! జితవతీ ! యని పిలిచినది. అప్పుడు నే నెదురుపడి దేవీ ! మా రాజ పుత్రిక యిప్పుడే క్రిందకుఁ బోయినది. వేగఁబోయి తీసికొని వచ్చెద నంతదనుక నిందు నిలువుం డని ప్రార్థించితిని. అప్పు డామె యించుక యాలోచించి యోహో ! నాకిందు మసలరాదు. పోనిమ్ము. ఈ దుగ్ధ కలశం బీచీటితోఁగూడ నారాజపుత్రిక కిమ్ము. దీన నంతయుం దెలియఁ గలదని పలుకుచు వీని నాకిచ్చి యచ్చేడియ నాకమునకు నిర్గమించినది పిమ్మటఁ బదిలముగా వీనిని మీ యొద్దకుఁ దెచ్చితి నివిగో చూడుఁడని వానికి నర్పించినది. అప్పుడు జితవతి యపరిమితానందముతో ఆఁ ! ఆఁ ! ఏది ! ఏది ! అని దానిం గైకొని యాజాబు విప్పి యిట్లు చదివినది.

సఖీ ! జితవతీ ! నీకిచ్చిన వరము జెల్లించుకొనఁ జాలప్రయత్నము సేయవలసి వచ్చినది. నీకిప్పుడు పంపిన పాలు దివ్యమహిమోపేతంబులు. వీనిం గ్రోలినవారు జరామయములు లేక దివ్యరూపధారులై పెద్ద కాలము జీవింతురు. శుభముహూర్తంబున నీవీ దుగ్ధంబులం ద్రావుము. నే నచిరకాలంబులో వచ్చి కర్తవ్యాంశములఁ బిమ్మట నుపదేశించెదను. పెద్దతడ విం దాలసింప రామింజేసి నిన్నుఁ జూచుట తటస్థించినది కాదు.

ఇట్లు నీ ప్రాణసఖురాలు,

యోగసక్త.

అని యున్న యాలేఖం బలుమారు చదివిచదివి జితవతి కన్నుల కొద్దికొనుచు నమ్మకచెల్లా ! అద్దేవికి నాయందెట్టి యనురాగము కలిగి యున్నది ! నాఁటిమాట మరువక స్వయముగా నీ దుగ్దంబులం దెచ్చియిచ్చినది? ఆమె దయకు మేరలేదు. అక్కటా నేనెంత పాపాత్మురాలను నిత్యము నచ్చటనే వసింపుచు నేఁడీ క్రింద మేఁడకు రానేల? నా సఖురాలిం గ్రమ్మరఁ జూచు భాగ్యము లేకపోయినదిగదా యని పశ్చాత్తాపము జెందుచు తల్లీ ! ఇప్పుడైన నా మాట నమ్ముదువా? స్వప్నమనియుఁ గల్ల యనియు భ్రాంతి యనియు నా కథకుఁ దలయొక పేరుం బెట్టితిరి గదా ! ఆదయా శాలిని నానిమిత్తమై దివ్యౌషధమును బంపినది. నన్నీ పాలం గ్రోలుమని వ్రాసినది. కాని నా పరిణయము మాట యేమియుఁ దెలిపినదికాదు. కర్తవ్యాంశము లన భర్తృవిషయములనియే తలంపవచ్చును. ఆమె వచ్చి యనుజ్ఞ యిచ్చుదనుక నేను గూడ నీక్షీరంబులం ద్రావను. వీనిం భద్రముగాఁ గాపాడుచుండుమని రోహిణి చేతి కిచ్చినది.

రాజపత్నియు నాజాబుఁ గన్నులారాఁ జూచుటచే నేమియుం బలుకనేరక కుమారిక మది ననుసరించియే కావించుటకు నిచ్చయించుకొని లోపలకుం బోయినది.

అని యెఱింగించి మణిసిద్ధుండు తదనంతర వృత్తాంతంబు పై మజలీయం డిట్లని చెప్పదొడంగెను.

103వ మజలీ.

నారధునికథ

అయ్యో ! యీ చెడువార్త నాచెవి నేమిటికిఁ బడవలయును? నేనా భూలోకమున కేమిటికిఁ పోయితిని! వారి కీవార్త జెప్పనేల ? మఱియొక చోటినిఁ బోవుద మను