Jump to content

కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/164-167వ మజిలీలు

వికీసోర్స్ నుండి

164 వ మజిలీ.

యక్షునికథ.

దత్తునివలనఁ దనయక్కయగు రత్నపదికయున్నయిక్క యెఱింగినదిమొదలు సువర్ణపదిక యామెం జూచువేడుక పెచ్చు పెరుగఁ భర్తతో మనోహరా ! మన మిప్పు డాయక్షశైలమునకుం బోవలయును మీమిత్రుఁ డాకథ యెఱింగించి మఱలఁ గనంబడలేదేమి? మనతో వచ్చి యాపర్వతమును జూపించునేమోయని యడిగిన సువర్ణనాభుండు ప్రాణేశ్వరీ ! అతం డామాటచెప్పినతరువాత నిదిగోవత్తునని యెందోపోయెను. తిరుగాఁ గనంబడలేదు. వానినిమిత్తము పట్టణమంతయు వెదకితిని. తక్కినమిత్రులం జేరలేదు. గోణికాపుత్రుఁడు రాజపుత్రునకు మిత్రుఁడైయున్న వాడని యాతఁడే చెప్పెను. వానింజూడ నేఁడు పోయితినికాని యంతఃపురములోనుండుటచే నావార్త. వానికిఁ దెలియఁజేయువారే లేకపోయిరి. మఱల రేపు పోయిచూచెద. నామిత్రులందఱు వచ్చువఱకు నిందుండవలయును. తరువాత మీయక్కం జూడఁబోవుదము. గుఱుతులు వ్రాసికొంటినని చెప్పిన విని యమ్మగువ దిగులుదోఁప నిట్లనియె.

బుధప్రవరా ! మేమిద్దఱ మేకగర్భజాతలము. చిరకాలము క్రిందట విడిపోతిమి. దైవికముగ దానిసేమము దెలిసినది. కాలవ్యవధి సహింపఁగలనా ? మీరే చెప్పుఁడు. నన్నక్కడఁ జేర్చి మీరు వెంటనే రావచ్చును. మీమిత్రులందఱును గలిసినవెనుక నందుఁ దీసికొనిరండు. బయలుదేరుఁడు. అని దైన్యముదోఁపఁ బ్రార్థించినది. అతం డంగీకరించెను.

వారిద్దఱు శుభముహూర్తమున నుత్తమతురగారూఢులై దత్తుఁ డెఱింగించినమార్గము ననుసరించిపోవుచు గుఱుతులుజూచుచు నుత్తరముగాఁ బోయిపోయి యేఱుల విమర్శించి మెట్టల దాటి వృక్షలతాదులఁ బరిశీలించుచుఁ దిరిగితిరిగి పదిదినముల కాశైలము గనుంగొనిరి. రాత్రి దత్తునికిఁగనంబడినట్లె విద్యుత్ప్రభ వారికిఁ గనంబడినదికాని యప్పుడు పోలేక యారేయి నందు వసించిరి.

రాత్రియెల్ల సువర్ణపదిక నిద్రబోవక రత్నపదిక నెప్పుడుజూతును, ఎప్పుడు కౌఁగిలించుకొందు నెప్పుడు మాటాడుదునని తలంచుచు జాగరము జేసినది. సూర్యోదయ మైనది. చీఁకటు లంతరించినవి. బాలా తపముచే దిక్కులెఱ్ఱఁబడినవి. పక్షులు కులాయములవిడిచి నలుదెసలకుఁ బారుచుండెను. అప్పుడు సువర్ణ పదిక సువర్ణ నాభుని చెట్టఁ బట్టికొని యామెట్ట నెక్కుటకుఁ బ్రారంభించినది. దారి లేదు. విషమ పాషాణకంటకాదులచే దుర్గమమైయున్నను జేతులతో నాని కొమ్మలఁ బట్టికొనుచుఁ గొందెల దుముకుచు మెట్టల నెక్కుచుఁ బొదల దూరుచు జాముప్రొద్దెక్కువఱకు నెగఁబ్రాకి యతికష్టముమీదఁ యక్షాలయ ప్రాంగణవేదికకుఁ జేరిరి.

ఒడలు చీరికొనిపోయినది. మోమున రక్తము స్రవించుచున్నది. కట్టినవలువలు పీలికలైనవి. ఒకచో సువర్ణ పదిక కాలుజాఱి పడినది. మోకాలునకు ఱాయితగిలి రక్తముగారుచుండెను. సోదరీదర్శన లాలసయగు నాసతి కావెతలేమియు నాటలేదు. ఆకుట్టిమము స్ఫటికమణి శిలచేఁ గట్టఁబడి సూర్యకాంతులు ప్రతిఫలింప మిఱుమిట్లుగొల్పుచున్నది. అలకాపురంబునంగల పుష్పజాతులన్నియు నందు నాటఁబడియున్నవి. షడృతువుల నందుఁగట్టిపెట్టిన ట్లన్నికాలముల పూవులు వికసించి వాసనల వెదజల్లుచున్నవి. ముహూర్తకాలమందు విశ్రమించినంత వారి యాయాసమంతయు నంతరించినది.

యక్షాలయమున ద్వారశాఖలుగా నమర్పఁబడిన రత్నముల యందు లోపలివిద్యుద్దీపములు ప్రతిఫలించి రాత్రుల విశేష తేజము వ్యాపింపఁజేయుటచే నాగిరిక్రింద నొకచక్కి వసించినఁ గనంబడును. ఆ తేజమేలేనిచో నాయక్షాలయ మందున్నదని బ్రహ్మ తెలిసికొనఁజాలఁడు. అందున్న రత్నకాంతులు పుష్పవాసనలు సువర్ణనాభునిహృదయమునకు మిక్కిలి యక్కజము గలుగఁ జేయ దాపునకుఁ బోయి పరీక్షించుచుండెను.

అప్పుడు సువర్ణపదిక మెల్లగా గుహాముఖద్వారంబున నిలువంబడి అక్కా ! రత్నపదిక ! అక్కా ! రత్న పదిక ! అని పెద్దయెలుంగున యక్షభాషతోఁ బిలిచినది. ఆధ్వనివిని రత్నపదిక తటాలున లేచివచ్చి తలుపుతీసి యెదురనున్న సువర్ణ పదికంజూచి నీవెవ్వ తె వనఁబోయి యంతలో అమ్మనేజెల్ల ! నాముద్దుచెల్లెలు సువర్ణపదికయే. తల్లీ ! యెట్లు వచ్చితివేయని గాఢాలింగనము సేసికొనియెను. సువర్ణ పదిక నానంద బాష్పములతోఁ బ్రత్యాశ్లేషము గావించి సంతోషముచేఁ గంఠమురాక డగ్గుత్తికతో అక్కా ! సేమముగా నుంటివా? బావ యేఁడి ? నిన్నుఁజూచి మూఁడుసంవత్సరములైనది. ఇఁకఁ జూపు దొరకదేయనుకొంటిని దైవికముగా వచ్చితినని చెప్పినమాటయే చెప్పుచు నడిగినమాటయే యడుగుచుండ రత్న పదిక యానందబాష్పములచేఁ జెల్లెలిశిరము దడువుచు నిట్లనియె.

సహోదరీ ! అక్కటా! నీకొఱ కెంతపరితపించుచుంటినను కొంటివి ? మీబావయు నీమాట దలపెట్టినప్పుడెల్ల కన్నుల నీరునింతురు. మే మిందుంటిమని యెవ్వరుచెప్పిరి? ఎందుండివచ్చితివి? అలకాపురంబున మనబంధువులు స్నేహితులందఱు కుశలముగా నున్నారా? కుబేరధూర్తుఁ డేమిచేయుచున్నాఁడు ? ఎన్నఁడైన మమ్ముఁ దలపెట్టునా ? మే మిందుఁజేరి హాయిగా సుఖించుచున్నాము. ఈగుహామందిరము లోపలఁ బెద్దపట్టణమంత యున్నది. అలకాపురంబునంగల వింతవస్తువులు రత్నంబులు మీబావ తీసికొనివచ్చి యిందుంచిరి. నీవు దాపునలేనికొదవతప్ప నేలోపము లేదు. నీ వప్పుడు మాతో రమ్మనిన సంగీతలాలసవై వచ్చితివికావు. మేమువచ్చినతరువాత జరిగినకథయంతయుఁ జెప్పు మని యడిగిన సువర్ణపదిక యిట్లనియె.

మీరులేనినగరములో నేనుమాత్రము వసింతునా ? సంగీతాభ్యాసవ్యసనంబునంజేసి మీతో రానంటి. రాజరాజు మనకుటుంబముపై నీసుబూని యపరాధముల విమర్శింపఁడయ్యె. వానిబానిసవాఁడు నన్ను నిర్బంధింప నిష్టపడక వానియపరాధము ఱేనికిఁ దెలియఁజేయ వినుపించుకొనలేదు. మీ రెందుండిరో యెఱుఁగను. అప్పు డొకసిద్ధుని యుపదేశంబున నొకశైలమున కరిగి శంకరు నారాధించితిని. దైవవశమున నందువచ్చిన సువర్ణ నాభుఁడను మహాపండితుం బెండ్లియాడితిని. వారితో దేశములు దిరుగుచు థారానగరంబునకు వచ్చితిమి. అందు వీరిమిత్రుఁడు దత్తకుండనువాఁడు మీశైలవృత్తాంతమంతయు నెఱింగించిన వచ్చితిమని పలుకుచు అక్కా.! వారన్న ట్లే చేసితిని. మీయక్కం జూచినతోడనే నామాట మఱచిపోవుదువని యాక్షేపించిరి. నాభర్త వాకిటఁ బుష్పవాటీవిశేషములఁ జూచుచున్నారు. వచ్చి యాతిథ్యమిమ్మని చెప్పిన సంతసించుచు నాకాంత లేచి యర్ఘ్యపాద్యాయులుగొని ద్వారముఖంబునకుఁ బోయి సువర్ణనాభు నాదరించుచు లోపలికి రమ్మని చెల్లెలిచేఁ జెప్పించినది.

సువర్ణనాభుండు మందిరాంతరమ్మున కరిగి రత్నపదిక జూప భార్యతోఁగూడ నందలివిశేషములన్నియుఁ జూచుచు విభ్రాంతినొందుచు నయ్యనస్థ స్వప్న గతంబని తలంచుచుండెను. రత్నపదిక వారిరువుర మృష్టాన్నములచే సంతృప్తులం గావించినది. ఇష్టాలాపములచే వారు నాఁటిదివసము దృటిగా వెళ్లించిరి. దివసకరుం డపరగిరిపరిసరము సేరునంత యక్షుం డాకాశమార్గంబున నొకమయూరమును జేతంబూని యాత్మీయనివాసమున కరుదెంచెను.

రత్న పదిక సువర్ణ పదికతోఁగూడ భర్తయొద్దకుఁ బోయి పాద్య మిచ్చి ముసిముసినగవులు వెలయింపుచున్న సువర్ణపదికం జూపుచు నిది యెవ్వతెయో యెఱుఁగుదురా? అని యడిగిన నతం డామెంజూచి యో హోహో ! సువర్ణపదికయా ! యెప్పుడువచ్చినది? ఎట్లువచ్చినది ? మగని సంపాదించినదా? ఏమి? యని పలుకుచు దగ్గిరకుఁ జేరదీసికొని గారవించెను.

సువర్ణపదికయు నతనికి నమస్కరించుచుఁ దనవృత్తాంతమంతయు నెఱింగించినది. యక్షుండు మందహాసముగావించుచు నా పండితుండేఁడి? ఇందున్న వాఁడా? అని యడిగిన రత్నపదిక పుష్పవాటికలోనున్న వారని చెప్పినది. సువర్ణపదిక పోయి తీసికొనివచ్చినది. అతండు యక్షునకు నమస్కారము గావించెను. యక్షుండు నారించుచు మీరు భూసురులు పండితప్రవరులు మీరు మాకు వందనీయులు మే మాశీర్వచనపాత్రులమని పలికిన సువర్ణనాభుండు భూసురలకన్న దివిజు లెక్కువవారుకారా ? మనుష్యులకు దేవతలు వంద్యులని యుక్తియుక్తముగా ననువదించెను.

ఆవిషయమై యిరువురకుఁ గొంతసేపు ప్రసంగము జరగినది. అందు సువర్ణనాభుని విద్యాపాటవము తేటపడుటయు యక్షుఁడు మిగుల సంతసిచుచు నతనిఁ బెద్దగా గౌరవించి యర్చించెను. సువర్ణ పదిక యక్షునితో బావా ! నీవు నిత్యము నెందుఁబోవుచుందువు? నీవు తీసికొనివచ్చిన మయూర మెక్కడిది? వింత లేమని యడిగిన నతం డిట్లనియె.

మీసందడిలో నామాట చెప్పుట మఱచిపోయితిని. నేను భూమి యంతయుఁ దిరిగి వచ్చుచుందును. వినుము. నేఁడొక యరణ్యమార్గంబున వచ్చుచుండ నొకచోట మృగముల నాడించువాఁ డొకఁ డీ నెమలి కాలిత్రాడు జారిపోయిన నిది యెగిరి వృక్షాగ్రముల వసించినది. దానిం బట్టికొనలేక విసిగి చంపుటకు రాళ్ళు విసరుచుండఁ జూచి దీని నెత్తుకొని తీసికొనివచ్చితిని. ఇదియే దీనికథ. పెంపుడిదో యడవిదో నాకుఁ దెలియదు. దీనిం దెచ్చినవేళ మంచిది. మిముఁ జూడఁగంటిమి. నీకుఁ గానుక గా నిచ్చెదఁ గైకొనియెదవా? యని యడిగిన సంతసించుచు సువర్ణ పదిక దానిం దీసికొనివచ్చి విమర్శించుచు నీలకంఠమా ! నీ వభిఖ్యచే శంకరుం బోలితివి. బర్హ మువిప్పి తాండవముసేయుము. అని పలుకుచు నాహా ! భగవంతుఁడను చిత్రకారుఁడు దీని కెన్నిరంగులువై చెనో! అని వింతగాఁ జూచుచు నది బెదరకున్న మెడ దువ్వి దువ్వి మెడకుఁ గట్టఁబడియున్న తాయెత్తును సడలించినది.

అప్పు డామయూర మొకసుందరియై నిలువంబడినది. అయ్యువతీవతంసమును జూచి రత్నపదికయు సువర్ణ పదికయు వెఱఁగుపడుచు సమీపించి యిట్లనిరి. తల్లీ! నీ వెవ్వనియిల్లాలవు? నీపేరేమి? ఇట్టినిగూఢపురూపు ధరించియుంటివేల ? నీయుదంత మెఱింగింపుమని యడిగిన నాప్రోయాలు నలుమూలలు సూచుచు విభ్రాంతితోఁ గాంతలారా ! మీరెవ్వరో నే నెఱుంగ నకారణవాత్సల్యముతో నన్ను బ్రతికించితిరి. మీకడ నిజము దాచరాదు. వినుండు. నేను ధారానగరాధీశ్వరుండైన భోజమహారాజు భార్యను. నాపేరు లీలావతి యందురు. నే నభాగ్యవశంబున భర్తకెడమై యడవిలోఁ గ్రుమ్మరుచు ఘోటకముఖుండను విద్వాంసునియాశ్రయమున నరుగుచుండ నొకతంత్రజ్ఞుని మాయామహిమచే మయూరమునై తినని తనకథయంతయు నెఱింగించెను.

ఆవృత్తాంతము విని యక్షుండు గుండెపైఁ జేయివైచుకొని అబ్బా ! రండాపుత్ర! నీవెట్టిక్రూరుఁడవురా? నీకడనున్న మృగములన్ని యు నిట్టివెకాఁబోలు ! నిన్ను వెదకి పట్టికొని శిక్షింతును చూడుము.

తల్లీ ! లీలావతి ! మహానుభావుండైన కాళిదాసుం బాలించుచున్న భోజభూభుజుని యిల్లాలవా ? అయ్యా రే! మే మెంత ధన్యులము. నీపాదధూళిసోకి మాయిల్లు పవిత్రమైనది. అమ్మా! నీకు వచ్చినభయము లేదు. నిన్నుఁ బ్రాణపదముగాఁ జూచుచుఁ దీసికొనిపోయి నిన్ను నీభర్తతోఁ గూర్తుము అని యూఱడించెను. సువర్ణ నాభుం డావార్త విని అమ్మా ! నీకు సహాయముచేసినవాఁడు ఘోటకముఖుండంటివి. అతఁడు నామిత్రుఁడు. తరువాత నతం డేమయ్యెనో యెఱుంగుదువా? యని యడిగిన నామె నా కేమియుం దెలియదు. కుక్కలు తఱుముకొనిపోయి కఱచినవి. నేలంబడిపోయె. పిమ్మట నేనొడలుతెలియక నెమలినై పోవుటచేఁ బూర్వస్మృతి తప్పినదని చెప్పి మీరెవ్వరు? కాళిదాసు నెఱిఁగినట్లు మాట్లాడుచున్నారు. వారితో మీకుఁ బరిచయ మెక్కడకలిగినది ? మీవృత్తాంతము చెప్పి యానందింపఁ జేయుఁడని వేడిన సువర్ణ పదిక తమవృత్తాంతమంతయు నెఱింగించినది.

ఆకథ విని లీలావతి వారిరువురం గౌఁగిలించుకొని పడఁతులారా ! మీరు దేవతలు. మీదర్శనముచేసి మనుష్యులు కృతార్థులగుదురు. నేను ధన్యురాలనని పొగడుచు భోజునివృత్తాంతము మీ కేమైనఁ దెలిసినదియా? యని యడిగిన యక్షుండు రేపు వోయి తెలిసికొనివచ్చెద నీవు విచారింపవలదని యాదరించెను.

రత్నపదిక యారాజభార్యను గుహాంతరమునకుఁ దీసికొనిపోయి యందలివింతలన్నియుం జూపెను. మనుష్యలోకములో నట్టియలంకారము లుండవు కావున వానింజూచిన విభ్రమము గలుగకమానదు. వా రా రాత్రి విందు లారగించి గుహాప్రాంగణమందున్న స్ఫటికశిలావేదికపైఁ గూర్చుండి యిష్టాలాపము లాడికొనుచున్న సమయంబున రత్నపదిక భర్త కిట్లనియె.

మనోహరా ! ఇక్కందరమందిరము మనుష్యులు తెలిసికొనఁ జాలరనియు నేకాంతప్రదేశమనియుం జెప్పితిరే? ధారానగరంబున వీరి మిత్రుఁ డెవ్వఁడో చెప్పెనఁట ! వాని కెట్లు తెలిసినది ? మీరు నాతో నన్నమాట యసత్యమా? అనియడిగిన యక్షుండు తరుణీ! మఱచితివా? నాఁ డొకబ్రాహ్మణుఁడు దారితప్పి రాత్రివేళ మనయింటికి రాలేదా? వానింజూచి నీవు సిగ్గున లోపలికిఁ బోయితివి జ్ఞాపకములేదా ? తరువాత వాని నాఁడుదానిగా శపించితిమి. ప్రార్ధింప సంవత్సరమే యాఁడుతన ముండునట్లు కరుణించితిని. ఆతండే వీరి కీవార్త చెప్పియుండును. అనిపలుకుచు సువర్ణనాభునితో నార్యా! మీతో మాయున్నయిక్క యెఱింగించినవాఁడు ఏమయ్యెను ? ఆఁడుది కాలేదా ? అనియడిగిన సతండు హాహా కారము గావింపుచు నిట్లనియె.

అయ్యో ! నామిత్రుఁడు సంతోషాతిశయంబున శాపప్రవృత్తి మఱచి మీ తెఱం గెఱింగించె నది మన కుపకారమైనది. అతండు స్త్రీయై పోయినది యెఱుంగక పెద్దతడవు వెదకితిని. ఎందునుం గనంబడలేదు. ఆహా! దైవనియోగము. అఖండపాండిత్యధురంధరుండగు నామిత్రుఁడు దత్తుం డిప్పుడు మత్తకాశినియై పూర్వస్మృతిలేక చరించుచున్నాఁడా ? కట్టా ! ఆయిక్కట్లు వాని కెట్లుపాయును. మహాత్మా! అతనిమూలముననేకదా మనమందఱము గలిసికొంటిమి. నన్నుఁబట్టి యాతండును మీ కాప్తుండయ్యెను. తచ్ఛాపవిముక్తిఁ గావింపవలయునని వేఁడుకొనియెను.

రత్నపదిక యాతఁడా ? అయ్యో ! పాపము స్త్రీయైపోయెనా ? అట్టిహితుండు మఱియొకఁడు మనకు లేఁడు. వానిం గాపాడకతీరదు. వేగమ శాపనివృత్తిఁ గావింపుఁడని నిర్బంధించినది. సువర్ణ పదికయు నా మాటయే బలపఱచినది. అట్లుచేయుట కతం డంగీకరించెను. ఆ రేయి సుఖముగా వెళ్లించిరి.

మఱునాఁడు యక్షుండు వాడుకప్రకారము బయలుదేరి యా తంత్రజ్ఞుఁడుచేయు కపటంబులం దెలిసికొనుటకై యాతఁడున్న యరణ్యమునకుం బోయి ప్రచ్ఛన్నముగా మృగములను బక్షులను బరామర్శింపుచుఁ గావలివారలు సూడకుండ నొకచిలుక నెట్లో పట్టికొని చేతిపై కెక్కించుకొని నాఁడు పెందలకడ నింటికివచ్చి సువర్ణ పదికం జీరీ బాలా ! యీవేళ నీ కీకీరమును దెచ్చితిని. దీనింగూడ స్త్రీని గావింతునా ? యని పరిహాస మాడుటయు సువర్ణ పదిక యాచిలుకనందికొని ముద్దాడుచుఁ గీరమా! నీవుగూడ మయూరమువలె మనుష్యకాంతవు కావుగద ! అవును. సందియమేలా? ఇదిగో మెడకుఁ దాయెత్తు గట్టఁబడియున్నది. అనిపలుకుచు నాతాయెత్తు లాగిపారవైచినది.

దివ్యమంగళవిగ్రహము సర్వావయసుందరము గలిగి యక్షకాంతల సిగ్గుపఱచుచు నొకసుందరి వారిముందర నిలువంబడినది. పదునాలుగేఁడులప్రాయము చక్కనిమొగము సంపూర్ణ లావణ్యము గలిగి మెఱయుచున్న యాబాలికారత్నమును జూచి వెఱఁగుపాటుతో లీలావతి పుత్రీ ! నావలె నీవుగూడ నాకపటాత్మునిచేతిలోఁ బడితివా? అయ్యో! చిన్నదానవు. తలిదండ్రులచాటుదానవు. నీపేరేమి? ఎవ్వనిభార్యవు ? నీవృత్తాంతము చెప్పుము. వీనిచే నెట్లుచిక్కితివి? అనియడిగిన నాచిన్నది తెలతెల్లపోయి చూచుచు నిట్లనియె.

దేవీ ! ఇప్పుడు నామది భ్రమజెందుచున్నది. ఇది స్వప్నమా ? నిజమా ? ఇది యేదేశము ? నే నిక్కడి కెట్లువచ్చితీని ? మాతలిదండ్రు లేరీ? అడవిలోఁ గ్రూరాత్ముఁ డెవ్వఁడో మమ్ము వెఱిపించెనే. అమ్మా! నాపేరు మల్లిక. బ్రహ్మదత్తుండను విప్రునికూతురను. చారాయణుఁడను పండితునిభార్యను. నాభర్త నన్ను వివాహమాడి తనమిత్రుల దత్తకాదులంజూడ ధారానగరంబున కరిగి వెండియు రాఁడయ్యె నాయననిమిత్తమై నాతలిదండ్రులు నన్ను వెంటఁబెట్టుకొని ధారానగరంబున కరుగుచుండ దారిలో నొకక్రూరుఁడు మా కడ్డమై యదలించెను. అంతవఱకు జ్ఞాపకమున్నది. తరువాత నేమిచేసెనో యేమైతిమో తెలియదని తనకథ యంతయుం జెప్పినది.

సువర్ణ నాభుం డావార్తవిని యేమేమీ ! నీవు చారాయణుని భార్యవా ? ఆతండు నామిత్రుఁడు. అన్నన్నా ! యెట్టియాపదంజెందితివి? నీతల్లిదండ్రులుగూడ వానికట్టులోఁ బడియుందురు. నీవు చింతింపకుము. మేము ధారానగరంబున కరుగుదుము. నామిత్రునితోఁ గూర్తుము అని యూఱడంబలికి యక్షేంద్రా ! ఆపాపాత్మునొద్దనున్న మృగములన్నియు నిట్టివేసుఁడీ ! మీరువోయి మఱికొన్నిమృగములం బట్టుకొనిరావలయు నీయుపకారము సేయవలయు వాని శిక్షించునుపాయ మరయవలయునని ప్రార్థించెను.

సువర్ణ పదికయు రత్న పదికయు లీలావతియు నామల్లికకుఁ దమ బంధుత్వము దెలియఁజేసి యాదరించి యూ ఱడించిరి.

ఆమఱునాఁడుదయంబున యక్షుండు వెండియు బయలుదేరి యాభైరవుఁడున్న యడవికిఁబోయి తిరోహితుండై వాఁడు చేయుపనులఁ బరీక్షించి చూచుచుండెను. ధారానగరమునఁ గాళిదాసుం గౌరవించు నిమిత్తము గొప్పసభ జరగుననియు నప్పటికి మృగములతోఁగూడ నీవువచ్చి వినోదములఁ జూపించి గొప్పకానుకలంది పొమ్మని భోజనృపాలునిమంత్రు లాభైరవున కాహ్వానపత్రిక నంపిరి.

ఆభైరవుం డందుల కామోదించి నాఁటిమధ్యాహ్నము బరువు మోసెడుగాడిద నొకదానిమెడలో వేఱొకతాయెత్తును గట్టి మేకను గావించి దీనింగోసి నేఁడు కూరగావండుమని వంటవాని కర్పించెను. వాఁడు దానిగోయుటకుఁ జెట్లమాటునకుఁ దీసికొనిపోయెను. ఆమార్పులన్నియుం జూచుచున్న యక్షుం డావంటవానింజేరి యోరీ ! నీ కీరత్నకంకణ మిచ్చెద నీమేకం జంపక నాకిత్తువేయని యడిగిన వాఁడు కనుసన్న సేయుటయు రహస్యముగా నాకడియము వానికిచ్చి యామేక నెత్తికొని గగనమార్గంబునఁ దనయింటికిం బోయెను.

బానిసవాఁడు వేఱొకమేకను స్వల్పవిత్తమునకుఁ గొని కోసి వండి భైరవున కాహారముగా నిడియెను. యక్షుం డామేకతో నెలవునకరిగి నంత నందఱు మూగికొని వీఁడెవ్వఁడో యని యాలోచించుచు మెడ లోనియోషధి లాగిపారవైచిరి. ఆమేష మొక్క చక్కనిపురుషుండై నిలువంబడి నలుమూలలు సూచి హా పాపాత్మా ! ఎంతపనిజేసితివిరా? చీ, చీ, నీ వేనరకమునకుఁ బోవుదువో గురుద్రోహీ ! దయాసింధువగు నిమ్మహాత్ముశిరంబు పగుల నెట్లు పాషాణమువైచితివిరా? కృతఘ్నా ! కనంబడవేమి ? యెందుఁబోయితివి? అయ్యో ! నాగురువు నాదైవము బలవన్మరణమునొందె నతనికళేబర మేమి సేసితివిరా ? అని యూరక దుఃఖించుచుండెను. సునర్ణనాభుండు విమర్శించిచూచి యోహో ! వీఁడు నామిత్రుఁడు చారాయణుఁడు. వానిచేతిలోఁ బడెనా? అయ్యో! పాపము మల్లిక వీఁడు ధారానగరమున కరిగెనని చెప్పినది. ఈయంతరాయ మెఱుఁగదు. చారాయణా! నాదెస జూడుము. నే నెవ్వఁడనో యెఱుఁగుదువా? ఎవ్వనినో నిందించుచుంటివి ! వాఁడెవ్వఁడు ? నేను నీమిత్రుఁడ సువర్ణనాభుఁడనని పలికినతోడనే యతండు కన్ను లెత్తిచూచి యౌరా! ఏమిచిత్రము! నీ వెక్కడినుండి వచ్చితివి? తక్కినమిత్రు లిందుండిరా? అని పలుకుచు సువర్ణనాభుని గౌఁగిలించుకొని హృదయంబునఁగల ప్రీతిని వెల్లడించెను.

పిమ్మట సువర్ణనాభుండు మిత్రమా! నీవృత్తాంతము కొంత మేము నీభార్యవలన వింటిమి. ఆవాల్గంటి యిందున్నది. మీయిద్దఱు నొక్కనిచేతిలోనే చిక్కి యొక్క చోటనే యుంటిరి. అని యక్షునివలన రక్షింపఁబడినవిధ మెఱింగించెను. తనభార్యవృత్తాంతము విని చారాయణుం డామెంజూచుటకు మిక్కిలి తొందరపడియెను. ఇంతలో నావార్తవిని మల్లిక గుహాముఖంబునకువచ్చి భర్తంజూచి సిగ్గుచే దాపునకుఁ బోలేక కన్నీరుగార్చుచు దుఃఖించినది.

చారాయణుండు తటాలున నారమణిం గౌఁగిలించుకొని యక్కునంజేర్చికొని కన్నీరుదుడుచుచు సాధ్వీ ! నీతెఱంగు వింటిని. నన్ను వాఁడు గాడిదంజేసి బరువు మోయించుచుండెను. చంపుటకై మేకంజేసెను. క్షణముదాటిన శాకఘటంబునం జేరువాఁడనే. యక్షుండు రక్షించె. నీకును నాకునుగూడ నాయనయే తండ్రి. దుఃఖింపకుము. మాతలిదండ్రులఁగూడ దీసికొనిరాఁగలండని యోదార్చుచు యక్షకాంతల బంధుత్వము దెలిసికొని లీలావతివృత్తాంత మాకర్ణించి పరమానందభరితుండై యాభైరవునికథ యంతయుం జెప్పి వాని సంహరించుటకుఁ దోడు రమ్మని యక్షుం బ్రార్థించెను.

యక్షుండు చారాయణునిమాట విని బాబూ ! వాఁడు మంత్ర తంత్రముల నెఱింగినవాఁడు. వానిచేతఁజిక్కెనేని నాపనికూడ పట్టఁగలఁడు. వానిని బరిభవించుతెఱఁగు మఱియొకటి గలదు వినుము. వాఁడు పదిదినములలో ధారానగర మరుగఁగలఁడు. కాళిదాసుం గౌరవించునిమిత్తమై పెద్దసభ జరగునఁట. ఆసభకు వీఁడు పోవుచున్నాఁడు మనముగూడ నాఁటి కవ్వీటికిఁబోయి వీనిదుర్నయమంతయు నారాజున కెఱింగించి యానృపతిచే వాని శిక్షింపఁజేయుద మిదియే నాకుఁ దోఁచినయూహ. మీరుగూడ నాలోచింపుఁడని పలికెను. అందఱు నందుల కొప్పుకొని ధారానగరమ్మునకుఁ బోవ ముహూర్తము నిశ్చయించుకొనిరి.

ఈలోపల నాభైరవుం డెందున్నాఁడో? యావీటి కరుగుచున్నాఁడో లేదో చూచివచ్చెద ననిపలికి యమ్మఱునాఁడు యక్షుండు మఱల నాతఁడున్న యడవికింబోయెను వాని పరివారమంతయు ధారానగరంబునకుఁ బోవుచుండెను. నడుమనడుమ నివసించుచుండిరి.

మేకనమ్మి రత్నకంకణముసంపాదించి మఱియొకమేకమాంసము పెట్టెనని వేఱొకపరిచారకుఁడు భైరవునితోఁ జెప్పి యాతప్పు పట్టియప్పగించెను. భైరవుఁడు క్రోధభైరవుండై బానిసవానిని శిక్షించి అక్కటా! ఎవ్వఁడో నామృగములరహస్యము దెలిసికొని వెనువెంటఁ దిరిగి మృగములఁ బక్షులం దీసికొనిపోవుచున్నాఁడు. తెలిసికొనలేకపోయితిని. అక్కటా! ఆబ్రాహ్మణబ్రువునిమాంసము దిని కసిదీర్చి కొంటిననుకొంటి. తప్పినది. అని వానింబట్టికొనుటకు రహస్యముగా బెక్కండ్రగూఢచారుల నియోగించి పట్టియిచ్చినవానికి గొప్పపారితోషికమిత్తునని దెలియఁ జేసెను.

ఆరహస్యము యక్షుం డెఱుఁగడు. తిరోహితుండుగాక మెల్లఁగా మృగములతో నడుచుచున్న సమయంబున వానివెంట నడుచుచుండెను. గూఢచారుం డొకఁ డతనిఁబట్టికొని భైరవుని కర్పించి వీఁడే మేషచోరుఁడు వెంటవెంటఁ దిఱుగుచున్నాడని తెలియఁజేసెను. అప్పుడు భైరవుఁడు కోపముతోఁ దొత్తుకొడుకా ! మృగముల నెత్తికొనిపోవుచున్నావా ? నీపని యిఁకఁ జూచుకొమ్ము అనిపలుకుచు గట్టిగఁబట్టికొని నెత్తిపై మందురుద్ది తాయెత్తుగట్టి పెద్దగాడిదం గావించెను.

యక్షుం డైననేమి? యింద్రుం డైననేమి? ప్రారధ్ధ మనుభవింపవలసినదేకదా! భైరవుం డట్లు పెక్కండ్ర మృగములఁజేసి తనకుఁ బెద్ద కానుక దొరకునని యాసతో నామృగసమూహముతోఁగూడ ధారానగరమున కరిగెను.

యక్షుం డా నాఁడును రాలేదు. మఱునాఁడును రాలేదు. మూఁడవనాఁడును రాలేదు. యక్షపత్ని మిక్కిలి దుఃఖించుచు సువర్ణ నాభునితో నార్యా! నాభర్త యెంతపనియున్నను వరుసగా రెండురాత్రుల కన్న నెందును నిలువరు ? ఏదోయాటంకము గలిగినది. ఆపాపాతుఁడు వారింబట్టుకొని బంధించెనుకాఁబోలు. అయ్యో ! దైవమా! నే నేమిచేయుదును. మహాత్మా! యుపాయ మాలోచింపవా? అని శోకించుచుఁ బలికిన. నూఱడింపుచు సువర్ణనాభుఁ డిట్లనియె.

తల్లీ! నీవువిచారింపకుము. యక్షుం డెందున్నను వెదకి తీసికొని రాఁగలము. మఱియు వాఁడు మృగములతోఁగూడ సభాదివసంబునకు ధారానగరంబున కరుగునని నీభర్త చెప్పియున్నాఁడు. మనమందఱము నాఁటి కందుఁ బోవుదము. అన్ని కార్యములు దీరఁగలవని చెప్పెను. ఆ మాట కందఱు నేకగ్రీవముగా నంగీకరించిరి. మంచిముహూర్తమున బయలుదేరి యందఱును కొన్నినాళ్ళకు ధారానగరంబు చేరిరి.

అనియెఱింగించువఱకు వేళ యతిక్రమించినది. తదనంతరోదంతం బవ్వలిమజిలీయందుఁ జెప్పదొడంగెను.

165 వ మజిలీ.

భోజరాజపుత్రుండు చిత్రసేనుఁ డొకనాఁడు గోణికాపుత్రునితో నేకాంతప్రదేశమునఁ గూర్చుండి యిట్లు సంభాషించెను. మిత్రమా! పూర్వజన్మకర్మఫలంబులు కడువిచిత్రములు సుమా! సుఖమిళితమైన దుఃఖము! దుఃఖమిళితమైనసుఖము గలుగుచుండును కాని కేవల మేదియోయొకటి దిరముగానుండదు. చారుమతిసంయోగంబు సంతోషదాయకంబు. దాన నానందింపుచుండ నిపు డొకదుర్వార్త వినంబడినది. అది పరమరహస్యమైనను నీ వాప్తుండవుగావునఁ జెప్పుచుంటి వినుము. నాచెల్లెలు రుక్మిణిచరిత్రము శంకాస్పదమై యున్నది. అది గర్భవతియై నట్లు తెలియవచ్చినది. వెనుక దానిగుఱ్ఱమెక్కి యొకపురుషుఁ డుద్యానవనములోనికివచ్చెను. ఆపరీక్షకై నేనుబోయినఁ జారుమతిం జూపుచు నిదియే వచ్చినదని బొంకినది. స్త్రీలెఱింగినమాయలు బృహస్పతికిని శుక్రాచార్యునికిఁగూడఁ దెలియవని శాస్త్రములు చెప్పుచున్న యవి. మా తండ్రి దాపునలేకపోవుటచేత నీభారము నామీఁదఁ బడినది. చారుమతి మోహములోఁబడి నే నొండు విచారించితిని కాను. ఇప్పు డేమిచేయఁదగినది ? యుపాయ మేమి ? ఈయల్లరులువినినఁ దండ్రిగారు చాల కోపింతురు. వయస్యా ! కర్తవ్య మెఱుగింపుమని యడిగిన గోణికాపుత్రుం డిట్లనియె. రాజపుత్రా ! సోదరీగర్భకారణుఁ డెవ్వఁడో తెలిసికొని వానికే యామానవతినిచ్చి వివాహము గావింపవలయు. రుక్మిణి సామాన్యుని వరింపదు. రాజకన్యలకు గాంధర్వవిహహం బుత్తమముకాదే? మఱియు మీతండ్రిగారివార్త మఱలఁ దెలిసినదా? మొన్నటిజాబులోఁ జాలదాపునకు వచ్చితిమని వ్రాసిరే. కాళిదాసమహాకవి నందలముపై నెక్కించి తాను పల్లకీతో నడిచివచ్చుచున్నారఁట కాదా? తరువాతివార్త లేమని యడిగిన రాజపుత్రుఁ డిట్లనియె.

మొన్నటివార్తకన్నఁ గ్రొత్తవార్త లేమియుఁ దెలియవు. నేఁడో రేపో రాఁగలరు. వత్తురనిన నాకు గుండెలు కొట్టుకొనుచున్నవి. అని మాటాడుకొనుచున్నసమయంబునఁ బ్రధానామాత్యుఁ డరుదెంచి రాజపుత్రు నాశీర్వదింపుచు భర్తృదారకా ! మహారాజుగారు రేపుసూర్యోదయమునకు వత్తుమని యిప్పుడే వార్తనంపిరి. వెనుక వారువ్రాసినప్రకారము పట్టణమంతయు నలంకరింపఁజేసితిమి. నానాదేశ భూపతులకు నాహ్వానపత్రికల నంపితిమి. పండితులు కవీంద్రులు వేనవేలు వచ్చియుండిరి, వచ్చుచున్నారు.

భైరవుండను మృగవినోదకారుని వారే రప్పింపుమని వ్రాసియున్నారు. వాఁడును వచ్చి తోటలో విడిసియున్నాఁడు. నాటకులు పాటకులు లక్షోపలక్షలు వచ్చుచున్నారు. వెనుక సంగీతముపాడిన చేడియ సపరివారముగా వచ్చినది. మహాసభాదివసంబున నూరకయే సంగీతముపాడి యాకాళిదాసకవి యాశీర్వచనమునకుఁ బాత్రురాల నగుదునని తెలియఁజేసినది. మఱియు గోనర్దీయుఁడు కుచుమారుఁడు లోనగు విద్వత్ప్రభువులు వచ్చియున్నారు. వారందఱకుఁ దగిననెలవు లేర్పఱచితిమి. పట్టణమంతయుఁ గ్రొత్తవారిచే నిడింపఁబడియున్నది. రేపుప్రొద్దున్న మేళతాళములతో వారికి మస మెదురేఁగవలయును. మీరుగూడ రావలయునని నివేదించిన సంతోషించుచు రాజపుత్రుఁ డంగీకారము సూచించుచు మంత్రి నభినందించెను.

గోణికాపుత్రుఁడు గోనర్దీయునిఁ గుచుమారుని రాజులంటివి. వారియుదంత మెఱుఁగుదువా ? అనియడిగిన మంత్రి పేరులుమాత్రము వినియుంటిని. మరియుదంతము నాకేమియుం దెలియదని యుత్తరమిచ్చెను. రాజపుత్రునకుఁ జేయఁదగినకార్యములన్నియు నెఱింగించి ప్రధాని యరిగెను. పిమ్మటఁ జిత్రసేనుం డారాత్రియెల్ల రుక్మిణీగర్భధారణముగుఱించియుఁ జారుమతీసంబంధము గుఱించియు రాజు విని యేమనునో యనువెఱపుతో నాలోచించుచు నిద్దురబోవఁడయ్యెను.

మఱునాఁ డరుణోదయముకాకమున్న మంత్రిసామంతహితపురోహితప్రముఖులు మంగళవాద్యములతోఁ బట్టభద్రగజంబు నలంకరించి తీసికొని యూరిబయలనున్న యుద్యానవనమున కరుగుచున్నారు. దేవర విచ్చేయవలయునని యమాత్యప్రేరితుండగు పరిచరుం డెఱింగింప సంభ్రమముతో రాజపుత్రుండు దివ్యాలంకారభూషితుండై మిత్రులతోఁగూడ బయలుదేరి సామంతవర్గముం గలసికొని నగరబాహ్యోద్యానవనంబునం దదాగమనం బభిలషించుచున్నంత భేరీభాంకారధ్వనులు వినంబడినవి. అప్పుడు,

సీ. బంగారురతనాలపల్లకీ యెక్కించి
                  కాళిదాసుఁ గవీంద్రమౌళికలిత
    పాదభాసురు దండిబట్టుచు నొకచేత
                 నొకచేతఁ జామరం బొగిధరించి
    విసరుచు భోజుండు గసవు ముల్లును ఱాయి
                 మిఱ్ఱుపల్లముల రొంపియు గణింప
    కోరమితోఁ బాదచారియై యరుగుచు
                 వైదికు లిరుగడల్ స్వస్తిచెప్ప

గీ. దైవముబోనులె సద్భక్తిభావ మలరఁ
    బూజసేయుచుఁ దనగ్రామమునకు విభుఁడు

    దీసికొనివచ్చె నతనిఁ దద్విధము జూచి
    జనము లాహా యటంచు సం స్తవముసేయ.

అట్లు కాళిదాసకవితోఁగూడ నిజనగరబాహ్యోద్యానవనంబు సేరి యందు మహావైభవముతోఁ దమరాక వేచియున్న మంత్రిసామంతపండితపురోహితత్రభృతులఁ గాంచి ప్రహర్షాంచితస్వాంతుఁడై వారినెల్ల వేఱు వేఱ నభినందించుచుఁ బుత్రుం గౌఁగిలించుకొని సేమం బడిగి బ్రాహ్మణులకు నమస్కరించి యాశీర్వచనంబు వడసి మంత్రులతోఁ దనయభిలాషప్రకారము గావింపవలయునని యానతిచ్చెను.

కాళిదాసకవియుఁ బల్లకీదిగి కొందఱకు నమస్కరించుచుఁ గొందఱ నమస్కారంబు లంది దీవించుచు భోజుండు తనకుఁగావించిన యపూర్వసపర్యావిశేషమునుంగూర్చి పెద్దగా నుపన్యసించెఁ దదనంతరంబ.

సీ. ఒకవంక దర్శనోత్సుకతఁ బౌరులు మూఁగి
                కొనుచుఁ గోలాహలధ్వనులు సేయ
    నొకమూల మాగధప్రకరము ల్వందిబృం
               దమ్ములు విజయనాదములు నెఱప
    నొకచాయ రాగంబు లొలయఁ గానలయగా
               యనగాయనీగాననినద మమర
    నొకచక్కి సామంతసుకవిమంత్రిపురోహి
               తవిహితప్రకరమున్ తగభజింప

గీ. భద్రదంతావళేంద్రంబుపైఁ గవీంద్ర
    మండనునిఁ గాళిదాసుఁ గూర్చుండఁజేసి
    మ్రోల గాణిక్యనృత్యవిస్ఫురణగ్రాల
    సభకుఁ గొనిపోయి రూరేగి సచివు లతని.

సభాభవనద్వారంబున గజావరోహణంబు గావింపఁజేసి జయ జయధ్వానములతో ననర్ఘ రత్నసింహాసనమునఁ గాళిదాసుం గూర్చుండఁబెట్టి భోజుండు పుత్రుఁ డొకవంకఁ దా నొకచక్కి నిలువంబడి వింజామరలు విసరుచుండి రట్టియెడ,

సీ. విరివాన గురిపించి రురుభక్తి సభ్యులు
                  మొరసెఁ దూర్యధ్వనుల్ ధరఁ జెలింపఁ
    గవిశిఖామణులు శ్లోకములు పెక్కు రచించి
                  వినుతించి రురుకళావిభవ మమర
    గాంధర్వవిద్యాప్రగల్భంబు గాన్పింప
                 గాయకుల్ బాడిరి హాయి మీఱ
    వారాంగనాతాండవములు గన్నులపండు
                 వుగ నొప్పె నభినయస్ఫురణ వెలయ

గీ. హారతుల నిచ్చి రెలమిఁ బుణ్యాబ్జముఖులు
    వందిబృందమ్ము జేసెఁ గైవారములను
    గాళిదాసకవీంద్ర శేఖరుఁడు సభ న
    నూనసింహాసనాసీనుఁ డైనయపుడు.

అప్పుడు భోజుండు సభ్యులదిక్కు మొగంబై యార్యులారా ! నాదేశంబంతయు నీదేశికోత్తమున కిచ్చివేసితిని. ఇదిమొద లితండే దేశాధిపతి. ఇంతటినుండియు నితనియాదేశమునఁ బ్రజలు వర్తిల్లుదురుగాక యని ప్రకటించిన విని సభ్యులెల్లరు నోహో హో ! యని యానృపతి వితరణమును వినుతించిరి. అప్పుడు కాళిదాసు లేచి నిలువంబడి,

శ్లో॥ నాహం భూధూర్వహోరాజన్ నాహం సత్పాలనెక్షమః
     క్షత్రియస్త్వం సమర్ధస్త్వం స్వీకురుష్వవునర్భువం!

కం. ఏ నీధాత్రీభారము
     బూని ప్రజలఁ బ్రోవఁజాల భూవర ! నీకే
    దీనిం గ్రమ్మఱ నిచ్చితిఁ
    గానఁ దదీయోరుభరము గైకొను మనఘా !

అని పలుకుచు నప్పటికిఁ గరతాళములతో సెబాసు ! భళా ! యనుమాటలు బయలుదేరినవి. ప్రజాభిప్రాయము ననుసరించి భోజభూపతి తిరుగా ప్రజాపాలనమున కంగీకరించెను. అప్పటికిఁ గాలాతీత మగుటయు నంతటితో సభముగించుచుఁ బ్రతిదినము నొక్కొక్కవినోదము ప్రదర్శించునట్లు నిశ్చయించి తమతమ నెలవులకుఁ బోయిరి.

అని యెఱింగించువఱకు వేళమిగిలినది. అవ్వలికథఁ బైమజిలీయం దిట్లు చెప్పమొదలుపెట్టెను.

166 వ మజిలీ.

సువర్ణ నాభుండును జూరాయణుఁడును మల్లిక సువర్ణ పదిక రత్న పదిక లీలావతి మొదలగుసఖులతో ధారానగరంబున కరుదెంచి యొకచో వసించియుండిరి. పురుషులుమాత్రము సభకుఁబోయి విశేషములు చూచి యింటికివచ్చినతోడనే మల్లికయు సువర్ణ పదికయు వారిం జేరుకొని లీలావతీరత్న పదికలు దూరదూరముగానుండి విచారముఖంబులతోఁ జూచుచుండ నార్యులారా ! సభ యెట్లుజరిగినది? కాళిదాసుం గౌరవించిరా? భైరవునివార్తదెలిసినదా? వానివృత్తాంతము దెలిసికొనివచ్చితిరా? అని యడిగినఁ జారాయణుం డిట్లనియె.

భోజుండు మిగుల తేజశ్శాలి. శౌర్యవంతుఁడు, మంచివక్త. ఆహా! రూప మాసేచనకమైయున్నది. నదాన్యత యనన్యసామాన్యమే ! కాళిదాసకవినిఁ దనసింహాసనముపైఁ గూర్చుండఁబెట్టి పట్టభద్రుం గావించి రాజ్య మిచ్చివేసెను. అతం డంగీకరింపక తిరుగా నిచ్చి నీవే పాలింపవలయు నేనర్హుండఁగానని యుపన్యసించెను. దాతృప్రతిగృహీతల యౌదార్యమును సభ్యులు స్తుతియించిరి. గోణికాపుత్రుఁడు రాజపుత్రునకు మిత్రుఁడై యందుఁ బెద్దయై తిరుగుచున్నాఁడు. గోనర్దీయుఁడు కుచుమారుఁడు ప్రభువేషములతోవచ్చి సభ నలంకరించిరి. అప్పుడు మే మొకరి నొకరు పల్కరించికొనుట కవకాశము లేకపోయినది. దినమున కొక వినోదము జూచుట కేర్పాటుచేసిరి. సోమవారము విద్వత్ప్రసంగము, మంగళవారము వాహ్యాళి, బుధవారము గానసభలు, గురువారము భైరవుని మృగములయాట జరగునఁట. వీనినిమాత్రమే వ్రాసికొనివచ్చితిమి. రేపు మామిత్రులతోఁ గలిసికొని భైరవునిదుర్నయము రాజున కెఱింగించి శిక్షింపఁ జేయుదుము. భైరవుండున్న తోటలోనికింబోయి చూచితిమి మృగములు పక్షులు పలురకములు చాలగలవు. వానిలోమన వారుందురు. మీరు విచారింపవలదని పలికిన విని సువర్ణపదిక యిట్లనియె.

మాబావ యక్షుండు పక్షియో మృగమో యైయుండఁ బాడుటకు నాకు నో రెట్లువచ్చును? రేపటిగానసభకు నేను బోవఁజాలను. పిమ్మట విచారింతముగాక. వారిం దీసికొనివచ్చుదనుక యేవినోదమునకుం బోఁగూడదు. మఱియు నీలీలావతినిగుఱించి యేమియాలోచించితిరి? ఈమహాసాధ్వి మీరు భోజునివార్తలు సెప్పుచుండ నూరక దుఃఖించుచున్నది. ఆవినోదములలో నీమెగూడఁ బాలుగొనవలసినదేకదా? అన్నిటికంటె ముం దీమె కుపకారముసేయవలయును. అని చెప్పిన విని యామె కన్నీరు దుడిచికొనుచు నిట్లనియె.

బిడ్డలారా! నేను వట్టిపాపాత్మురాలను. నాపూర్వకృతము కడు చెడ్డది. నాకు వీ రేమియు నుపకారము సేయఁజాలరు. నాభర్త నాయం దేదియో యనుమానముజెంది యడవులకుఁ ద్రోయించెను. నేను మొండికట్టియనుకావున జీవించితిని. ఇప్పుడు నాసుగుణ మేమిపరీక్షించి మహారాజు నారాక కంగీకరించును? మఱియుఁ బ్రతికియుంటినని వినినఁ జెప్పినవారిపయిఁ గుపితుండగును. నామాట యటుండనిచ్చి యక్షవిముక్తికై ప్రయత్నింపవలయును. అతండు కడుదయావంతుఁడు అని చెప్పిన విని చారాయణుఁ డిట్లనియె.

తల్లీ ! నీవల్లభుఁడు భవద్వియోగమున కెల్లపుడు దుఃఖపుచున్నట్లు ప్రజలు చెప్పుకొనుచున్నారు. అట్టి యుత్సవసమయమందుఁగూడ నతనిమొగము చిన్నబోయియున్నట్లే మేము గనిపెట్టితిమి. నీవిషయమై పశ్చాత్తాపము చెందియున్న వాఁడు. నీకు తప్పక భర్తృసమావేశము గలుగఁగలదు. అని పలుకుటయు నామె యుల్లమురంజిల్ల నార్యా ! నా కట్టిభాగ్యము పట్టునా? నే నంతపుణ్యాత్మురాలనా? యనుచు సంతోషమును సూచించినది.

అప్పుడు చారాయణుండు తల్లీ ! నగరిలో నీకు నమ్మకమైనవా రెవరైన నుండిరా? వారిం బేర్కొనుము. వారితో మైత్రిచేసి తన్ముఖముగా రాజుగారి హృదయాశయము దెలిసికొందము. అనుటయు రాజపత్ని సాపత్నిపుత్రికయగు రుక్మిణి తనకు హృదయస్థానమనియుఁ దన్ను గుఱించి యాచంచలాక్షియే చింతించుచుండుననియుఁ దనరాక నాకోకస్తని కెఱింగింపవచ్చుననియుం జెప్పినది. మఱియు నారుక్మిణి కాంత రంగికసఖురాలు రేవతియను యువతికడకుఁబోయి మాట్లాడిన నగరిలోని విశేషము లెఱుంగవచ్చును. అనిచెప్పిన విని చారాయణుండు సంతసించుచు గుఱుతులడిగి యాయింటికిం బోయి దానితో నిట్లుసంభాషించెను.

చారా - రేవతీ ! నీతో నా కొకపనిగలిగి వెదకికొనుచు వచ్చితిని. నిన్నుఁ జూచినతోడనే నాకార్య మీడేఱునని తోఁచుచున్నది.

రేవ - అయ్యా ! తమరెవ్వరు ? ఏయూరు? నావలనఁ దమకుఁ గావలసినపని యేమియున్నది?

చారా — నేనొక బ్రాహ్మణుఁడ. పండితుఁడ. కాశీనివాసుఁడ. ఈయూర విద్వత్సభలు జరగునని విని ప్రసంగింప వచ్చితిని. నీవలనఁ గావలసినపని మఱేమియును లేదు. ని న్నొకమాట యడుగఁ దలంచితిమి.

రేవ - (లేచి నమస్కరించుచు) పండితోత్తమా! కించిజ్ఞురాలనగు నన్నడుగవలసినమాట యేమున్నది ? అవశ్యము తెలిసినది వక్కాణించి కృతకృత్యురాల నగుదును.

ఆహా ! నీసుగుణంబులు నేవినినవానికన్న మిన్నగానున్నవి. బ్రా హ్మణభక్తి నీయందు మూర్తీభవించియున్నదని చెప్పిరి. అందుల కే నీ కిట్టి రాజావలంబనము గలిగినది. రాజపుత్రిక నీకు ప్రాణమిత్రమఁట సత్యమేనా ?

రేవ -- అవును. ఆమెకు నాయందనుగ్రహమే నన్నింత మీరు పొగడుట కర్హురాలనుగాను. కింకరురాల. కర్తవ్యమునకు నియోగింపుఁడు.

చారా -- మఱేమియును లేదు. రాజుగారికి నలుగురుభార్యలని వింటిమి. పెద్దభార్య లీలావతి యెందున్నదో యెఱుఁగుదువా?

రేవ - (నోరుమూసికొని) బాబూ! అది రహస్యము. ఎఱిఁగి యున్నను నామాట జెప్పుకొనఁగూడదు. ఇప్పు డామెప్రస్తావముతో మీ కేమిపనిగలిగినది ?

చారా - పనిగలిగియే యడుగుచుంటిని. ఇక్కడ యితరులెవ్వరును లేరు. నిజము చెప్పవలయును.

రేవ - (మెల్లగా దిక్కులుసూచుచు) రాజుగారి కేమిటికో కోపమువచ్చి యామె నడవికిఁబంపి చంపించిరఁట. ఇది పరమరహస్యము. నే నంటినని యెవ్వరితోఁ జెప్పఁగూడదు.

చారా - అయ్యో ! పతివ్రతాశిరోమణియగు నామెయందును దప్పులు గణించెనా ? ఆమెసేసిన యపరాధమేమో నీకుఁ దెలియునా?

రేవ - ఏమియునులేదు. వెఱ్ఱియనుమానము. ఆమెపురాకృతము.

చారా - ఆమెను జంపించినపిమ్మట నమ్మనుజపతిహృదయ మెట్లున్నది?

రేవ - చచ్చినతరువాత ననురాగము పెరుఁగునుకాదా ? ఆయన యేభార్యయొద్దకుం బోక లీలావతియంతఃపురమందే యెప్పు డామెనుగూర్చి దుఃఖింపుచున్నాఁడని తెలిసినది. చారా - ఇప్పు డామె బ్రతికివచ్చిన నతం డంగీకరించునా ?

రేవ - చచ్చినవారు బ్రతుకుటెట్లు ? మీ రామెవిషయమై గ్రుచ్చి గ్రుచ్చి యడుగుచున్నారు. ఆమె బ్రతికియున్నదా యేమి ? బ్రతికియున్న చో రాజుగారిమాట చెప్పఁజాలనుగాని మారుక్మిణి ప్రహర్ష సాగరంబున మునుఁగఁగలదు.

చారా - నే నామాటయే వింటిని. ఆమెయు నట్లే చెప్పినది. అందులకే నీకడ కరుదెంచితిని. అదియే నీవలనఁ గాఁదగినపని.

అనుటయు రేవతి యుబ్బుచు నేమేమీ ! ఆమె యన్నట్లే యన్నదంటిరి. ఆమె యెందున్నది ? ఎట్లుబ్రతికినది ? ఆమెవృత్తాంతము చెప్పిన మీకు పదివేలనమస్కారములఁ గావింతును. ఈవార్త మారుక్మిణి వినినఁ దనజన్మావధిలో నింతసంతోషము మఱియొకటిఁ బొందనేరదు. నిజ మెఱింగింపుఁడని ప్రార్థించినది. అతఁడు మెల్లగా నామె బ్రతికేయున్న ది. నూఱేండ్లు బ్రతుకఁగలదు. ఈపురమునందే యున్నది. ఈరహస్యము నీకుఁ జెప్పిరమ్మన్నది. తరువాతకృత్యమునకు నీవును నీసఖురాలు రుక్మిణియునుఁ బ్రమాణములు. అనిచెప్పిన నప్పడఁతి బాబూ ! మీ రిందుండుఁడు. రుక్మిణి కీశుభవార్త స్పెప్పివచ్చెద ననిపలికి యత్యంతవేగముగా నంతఃపురమున కరిగి యావృత్తాంతము రుక్మిణి కెఱింగించినది.

ఆఁ ! ఆఁ ! ఏమీ ! ఈమాట సత్యమే ! అని రుక్మిణి విస్మయ సంతోషము లభినయించుచు నావార్త చెప్పినందులకుఁ దనచేతిరత్న కంకణము దానికిఁ గానుకగానిచ్చుచు నామె యెందున్నదో నీవు స్వయముగాఁబోయి చూచివచ్చి చెప్పుము. నాకు నమ్మకము కుదురకున్నది. అని తొందరపెట్టుటయు నాకుందరదన యమందగమనంబున నాధరణీ బృందారునికడ కరుదెంచి వందనముసేయుచు పదుఁడు. పదుఁడు. నా కయ్యిందువదనం జూపుఁడు అని పలికినది. అతండు రేవతిని వెంటఁబెట్టుకొని తనయింటికిం దీసికొనిపోయి లీలావతియెదురం బెట్టెను. రేవతి లీలావతింజూచి పాదములవ్రాలి గోలుగోలున నేడువఁ దొడంగినది. ఆమె దానినిలేవనెత్తి కన్నులనీరుగ్రమ్మ నమ్మాయి రుక్మిణి సేమముగానున్నదా? రాజభార్యలు సుఖులైయుండిరా? విశేషము లేమి ? విచారింపకుము. రాజుగారివార్త లెట్టివి యెఱింగింపుమని యడిగిన నది కన్నీరుదుడిచికొనుచు నిట్లనియె.

అమ్మా ! రుక్మిణి సంతతము నిన్నుఁగూర్చియే విచారించుచుండును. రాజభార్యల కానందముగాక యేమి ? నిన్నడవికంపినదిమొదలు మేదినీపతి నీసదనము వదలియుండలేదు. తొందరపడి నిన్నుఁ జంపించి పశ్చాత్తాపముచెందుచున్నట్లు చెప్పికొనిరి. కాళిదాసకవినిఁ దీసికొనివచ్చునెపంబున రాజుగా రూరువిడిచి దేశములు దిరిగి తిరిగి మొన్ననే యిందువచ్చిరి. వచ్చినదాదిగా నీయంతఃపురమందే యున్నారని విన్నాను. ఇంతవఱకు రాజభార్య లెవ్వరు నాఱేనియొద్దకుఁ బోవ లేరు. పోవుటకు వెఱచుచున్నారు. అనియెఱింగించినది.

అప్పుడు లీలావతి మెల్లగా రాజు పశ్చాత్తాపము చెందియున్నాఁడని చెప్పితివి. అది యెంతనిజమో యేకాంతముగా నాభూకాంతుచెంత కరిగి తెలిసికొనిరావలయు. ఇందులకు నీకంటె నా కాప్తులు లేరు. రుక్మిణిం గౌఁగిలించుకొని ముద్దుపెట్టుకొంటినని చెప్పుము. తరువాతకర్తవ్య మాలోచింతముగాక. అని నియోగించుటయు రేవతి లీలావతికి నమస్కరించి చారాయణు ననుజ్ఞగైకొని తొలుత రుక్మిణియంతఃపురమునకుఁబోయి యావార్తనంతయుఁ జెప్పినది.

రుక్మిణి మురిపెంపుపెంపున వివశయై యంతలోఁ దెప్పిరిల్లి ముప్పిరిగొనువేడుకతో నామెపంపు గావింపుమని నియోగింప సమయమరసి యాసరసిజానన భూజానియంతఃపురమున కరిగి రహస్యముగా నందలి విశేషములన్నియుఁ దెలిసికొనివచ్చి లీలావతి కిట్లు విన్నవించినది.

అమ్మా ! నీక్షేమవార్తవిని రుక్మిణి బ్రహ్మానందము జెందుచు నప్పుడే యిందు రావలయునని తలంచినది. ఎట్టకే నామె నందాపి భూపాలుని శయ్యాగృహ సమీపంబున కరిగితిని. అతఁ డందులేఁడు. నీపడకగదిలో నీపర్యంకముపైఁ బవ్వళించి నీచిత్రఫలకము జూచుచు హా ! ప్రేయసీ ! హా ! లీలావతి ! హా ! సతీలలామ ! నిన్ను నిరపరాధినిఁ బరిభవించితిని. పాపాత్ముండ నే నేనరకమునకుఁ బోవుదునో ! అక్కటా ! తొలుత నీవు నన్నుఁ బరిణియమగుటకు నడవులలో నెన్నియోయిడుములం గుడిచితివి. నడుమ నేమిసుఖించితివో గడియలాగైనది. తుదకు నిన్నడవులపాలు సేసితిని. ఈశయ్య నీతో నెన్నఁడుసుఖించితినో ! ఆహా! మోహనాంగీ ! నాతో మాటాడవా ? కోపమా ! ఓరీ ! భైరవా ! నా ప్రియురాలి నేమిచేసితివిరా ! మూర్ఖా ! నీపని నిఁకఁ బట్టించెదఁ జూడుము. ఈసందడిలో నీమాట మఱచితిని. నీయాట కింకను వ్యవధియున్నది కాఁబోలును. అంతవఱకు నిలువనేల నిప్పుడేపోయి వానిం బరిభవింతునా ? అని లేచి కత్తిదూసి యంతలో మఱల నయ్యసి వరలోఁ జొనిపి వాఁడు తాంత్రికుఁడు ఇంతలోఁ దొందరపడనేల ? వెనుకటివలెనే యాలోచింపక చేసితిమేని ప్రమాదము రాఁగలదు. అనిపలుకుచు వెండియు శయ్యపైఁ బండుకొనిరి.

అమ్మా ! భైరవుఁ డెవ్వఁడు. ఆకథ నాకేమియు నర్థమైనదికాదు. అనిచెప్పిన లీలావతి ముప్పిరిగొను మురిపెముతో నిట్లనియె. ఏమీ! ఆ మూఢునిదుర్ణయ మాయనకుఁ దెలిసినదా ! ఔను. ఆబ్రాహ్మణకుమా రుండు చెప్పియుండునేమో? రేవతీ.! నీమాటవలన నానోములు ఫలించునట్లేయున్నవి. అని దానితోఁ దగురీతి ముచ్చటించెను.

రేవతియుఁ బెద్దతడ వందుండి తదామంత్రణంబువడసి రుక్మిణి యొద్దకరిగి జరగినవృత్తాంత మంతయుఁ జెప్పినది,

రుక్మిణి యామెంజూచుటకు కాలవ్యవధి సహింపక రేవతితోఁ ద న్నామెయొద్ద కప్పుడే తీసికొనిపొమ్మని చెప్పినది. రేవతియు నుద్యా నవనంబునకుఁ బోవుసమయంబున మఱియొకశకటంబుదెచ్చి యందుఁ గూర్చుండఁబెట్టి యొరులెఱుంగకుండ లీలావతియున్న భవనంబునకుఁ దీసికొనిపోయిరి.

లీలావతియు యక్షకాంతలును మల్లికయును రుక్మిణిరాక విని యామెనుజూచుట కత్యంతసంతోషము జెందుచుండ నయ్యండజయానవచ్చి లీలావతియడుగులంబడి దుఃఖించినది. రాజపత్ని పుత్రికం గ్రుచ్చి యెత్తి కన్నీటిధారచేఁ దచ్చిరంబు దడుపుచు అమ్మా ! దుఃఖింపకుము. నాకొఱకుఁ బరితపించు దానవు నీవొక్కరితవే. దైవప్రతికూలదినములలో మన మేమి చేయఁగలము. ఎప్పటికైన మంచిదినములు రాకపోవునా ? వీరు యక్షకాంతలు. నాతోఁగూడ నిడుమలం గుడుచుచున్నారు. ఈరత్న పదిక భర్తయే న న్నా భైరవధూర్తునివలన విడిపించి రక్షించెను. ఉపకారమునకుఁ బోవ నపకారమైనట్లు మానిమిత్త మతం డెందో చిక్కువడెను. వీరికతంబున నే నీయూరు సేరఁగలిగితిని. అని తనవృత్తాంతము కొంత కొంత వివరించినది.

యక్షకాంతలసౌందర్యముపకు రుక్మిణియు రుక్మిణిచక్కఁదనమునకు యక్షకాంతలును నక్కజము జెందుచు నొండొరులు స్నేహము గలుపుకొని ముచ్చటింపజొచ్చిరి. ఆసమయంబున లీలావతి రేవతితో జనాంతికముగా నోసీ ! రుక్మిణిమొగము వేఱొకలాగున నున్నదేమో! పెండ్లియైనదా యేమి? దౌహృదచిహ్నములు గనంబడుచున్న వే ! యని మెల్లగా నడిగిన నది యించుకసిగ్గుతోఁ దలయూచుచుఁ దల్లీ ! నీతో నేమని చెప్పుదును. నాటకములో నిది యొక యంతర్నాటిక. నీకూఁతురు గంధర్వప్రాయుఁడగు నొక దివ్యపురుషుని గాంధర్వవివాహమునఁ బరిగ్రహించినది. ఆగంధర్వుండు గంధర్వుండేయై మఱలఁ గనంబడలేదు. అని యావృత్తాంతంబు సంక్షేపంబుగా నెఱింగించినది. లీలావతి యాచరితము విని అయ్యో ! అతం డెవ్వఁడో తెలిసికొనలేదా? ఎందుఁబోవును ? వాని కులశీలనామంబు లడుగలేదా? ఇది వినినవారు పరిహసింపకమానరు. కాని రుక్మిణీయం దేమియు దోసములేదు. దైవికముగా సంపర్కము గలిగినవానినిఁ బరిగ్రహించుట దూష్య మెట్లగును. ఆదివ్యపురుషుండు పుత్రునైనఁ జూచుటకు రాకుండునా?

అని సమాధానముగాఁ బలికినది. రేవతి అమ్మా! ఆతని కులశీలనామంబులఁ దెలిసికొనలేదుగాని వానిచిత్రఫలకము వ్రాసికొంటిమి. ఇదిగో చూడుము. అని యొకప్రతిబింబ మామె కందిచ్చినది. లీలావతి తదీయరూపలావణ్యాదివి శేషంబుల కచ్చెరువందుచు రుక్మిణి చాల చదువుకొన్నది. సామాన్యుని వరించునా ? అనుకూలవాల్లభ్యంబే లభించినదని సంతసించినది.

అంతలోఁ బ్రొద్దుపోవుటయు రుక్మిణి వారలెల్లరకుఁ జెప్పి తల్లికి నమస్కరించి యెల్లి మరల వత్తునని చెప్పి గూఢముగా బండియెక్కి యింటికిఁ బోయినది. లీలావతిచేతినుండి యాచిత్రఫలకమును, మల్లిక యందుకొని వింతగాఁ జూచుచు యక్షకాంతలచెంత నిడినది. వారును దానిసౌరునకు వెఱఁగందుచుండ సువర్ణనాభుం డదియందుకొని యో హోహో ! వీఁడు మాదత్తుఁడు, దత్తుఁడు అని కేకపెట్టెను. చారాయణుండు జూచి ఔను. ఇది దత్తునిరూపమే. దీని నెవరుతెచ్చిరని యడిగిన మల్లిక, రాజపుత్రికసఖురాలు రేవతి లీలావతి కిచ్చినదని చెప్పినది. ఆ మాటవిని సువర్ణనాభుండు ఓహో ! ప్రేయసీ ! దత్తుఁడన నెవ్వఁడో యెఱుంగుదువా? మనకు మీయక్కయు బావయు నున్న యిక్క నెఱింగించిన పుణ్యాత్ముఁడు. నాప్రాణమిత్రుండు. వాఁడెందెందో సుందరియై శాపఫలం బనుభవింపు చున్నాఁడు. వానిని దెలిసికొనవలయును అని పలికెను. ఆమాట విని రత్నపదిక కన్నుల నీరునించుచు నయ్యో ! పాప మాతఁడా ? వాని శాపప్రవృత్తినిమిత్తమై నాభర్త యెంతయో విచారించెను. తనపాటు తనకుతెలియక పెరవారింగురించి చింతించెను. అయ్యో ! ఇంక నెన్నినాళ్లిందుందును. చెల్లీ ! సువర్ణపదికా ! వారి విముక్తింగూర్చి నీభర్త యేమనుచుండెను. అనుటయు సువర్ణపదిక నాలుగు దినములలో నన్నియుఁ జక్కపడునని యక్క నోదార్చినది.

వారి సంభాషణములన్నియు విని లీలావతి దత్తునియుదంత మంతకుమున్ను కొంతకొంత వినియున్నదగుట రాజపుత్రికవరించినవాఁడు దత్తుఁడేయని నిశ్చయించి యావృత్తాంత మప్పు డెవ్వరికిం జెప్పినది కాదు.

మఱునాఁ డరుణోదయంబున లేచి చారాయణసువర్ణ నాభులు తత్పురప్రధానదేవాలయగోపురంబున కరిగి తత్కుడ్య భాగంబులు పరీక్షించి సువర్ణనాభాదులు వెనుకవ్రాసిన వ్రాఁతలక్రింద గోనర్దీయుఁడునుఁ గుచుమారుఁడు ధారాపురంబున కరుదెంచినట్లు వ్రాసినవ్రాఁతలఁ జూచిరి. అప్పుడు ప్రభుచిహ్నములతో నున్నవారే తమమిత్రులని నిశ్చయించి వెదకికొనుచుఁ దిన్నఁగా వారివిడిది కరిగిరి.

వారు నివసించియున్న గృహప్రాంగణంబు భేరీపటహాదిమంగళధ్వానములచే ముఖరితం బగుచున్నది. విచ్చుకత్తులం బూని రాజభటులు పారా యిచ్చుచుండిరి. ఆవైభవమంతయును జూచి మిగుల సంతసించుచు వారిరువురుఁ దమరాక ప్రభువులకు నివేదింపుఁడని దౌవారికులఁ గోరికొనిరి. ప్రతీహారులు లోపలికిఁ వోయి బ్రాహ్మణులంట, ఇరువురు విద్వాంసులంట మీదర్శనమునకై వచ్చిరంట, ద్వారదేశమునఁ బ్రతిక్షించియున్నారు. సెలవేయని యడిగిన వారు ప్రవేశపెట్టుఁడని యజ్ఞాపించుటయు రాజకింకరులు వారిం దీసికొనిపోయి ప్రభువులయెదుట నిలిపిరి.

ఓహోహో !! ప్రాణమిత్రులే! అనుధ్వానంబులు నింగి ముట్ట పరస్పరాలింగితాంగులై సంతోషబాష్పస్థంభితగద్గిదికకంఠులై యొక్కింతతడ వేమియు మాటాడనేరక యెట్ట కేఁ దెమల్చుకొని సుఖాసనోపవిష్టులై ప్రహర్షమును బ్రకటించిరి. అప్పుడు కుచుమారుండు మిత్రమా సువర్ణనాభా ! నీ వుత్తరదేశారణ్యముల తుదిఁజూచి వచ్చితివా? అందు విశేషములేమైనం గనంబడినవా? ఈచారాయణుతో నెందుఁ గలిసికొంటివి? ఇం దెప్పుడువచ్చితిరి? యెఱింగింపుఁడని యడిగిన సంక్షేపముగాఁ దమవృత్తాంతము జెప్పుచు మీ రీప్రభుత్వ మెట్లుసంపాదించితిరని యడిగిన వారును దమకథనంతయు నెఱింగించిరి.

అప్పుడు సువర్ణనాభుండు మిత్రులారా ! మనస్నేహితులలో దత్తుఁడును ఘోటకముఖుడునుందక్క తక్కినవారమందఱమునిందుఁ జేరితిమి. గౌణికాపుత్రుండు రాజపుత్రునకు మిత్రుండై వర్తించుచున్నట్లు నిన్నసభలో మీరును జూచియేయుందురు. మనయందఱకన్న ముందే దత్తుఁ డీపత్తనంబుఁ బ్రవేశించినాఁడు. వెనుక నే నతనితోఁ గలిసికొని మాట్లాడితిని. ఆక్షణమందే యెందోబోయి తిరుగాఁ గనంబడలేదు. యక్షశాపోపహతి యువతియై యతండు పరిభ్రమించుచుండవలెను. వారిరువురజాడయే మన మెఱుంగవలసియున్నది. మఱియు మనకుఁ బరమోపకారియైన యక్షుండు భైరవశిక్షితుం డైనట్లు తలంచుచుంటిమి. మనుష్యుల మృగములుగను పక్షులుగను జేయు తంత్ర మామాంత్రికుఁ డెఱిఁగియున్న వాఁడు. వాఁడు పరమతపోనిధియగు సిద్ధునిం బరిమార్చి మనచారాయణుని గార్ధభముగావించిన క్రూరుండు, చారాయణు నత్తమామలును గనంబడుటలేదు. వీ రెల్ల నక్క పటాత్మునిచేఁ జిక్కిరనియెంచి యిం దరుదెంచితిమి. మనమందఱమునుఁ గలసి భోజనృపపురందరునకు వానిదుర్ణయ మెఱింగించి శిక్షింపఁజేయవలయును. అనిపలికిన విని కుచుమారుం డిట్లనియె.

అయ్యయ్యో ! ఆసిద్ధుం బరిమార్చినవాఁడు వీఁడా ! అక్కటా ! అమ్మహానుభావుని చరిత్రమంతయును నేను జదివితిని. ఈమాలిక తదస్థి జాలమే. తత్ప్రభావంబుననే వశిత్వవిద్యాప్రౌఢిమ సంపాదించితిని. ఆభైరవునిఁ బరిభవించుట నాకు గోటిలోనిపని. అందుల కెవ్వని నాశ్రయింప నవసరములేదు. అదియట్లుండెఁ బురందరపురములో ఘోటకముఖుండు మమ్ములం గలసికొనియెను. ఒకస్నేహితునిపనిమీఁదఁ దిరుగుచుంటినని మాతో నప్పుడు చెప్పెను. ఆస్నేహితుండు భోజుండైనట్లు మా కిప్పటికి తెల్లమైనది. ఆమిత్రుండు భోజుండని ఘోటకముఖుండును నెఱుంగఁడు. వానివృత్తాంతము భోజునకుఁ దెలిసియుండును. అతనినడిగిన నంతయుం జెప్పఁగలఁడు. అని యుపన్యసించెను.

అప్పు డాగోనర్దీయుఁడు మల్లికాప్రభృతయువతీమతల్లికల నప్పుడే యక్కడకుఁ దీసికొనివచ్చుటకై శిబికాశకటాదియానములతోఁ బెక్కండ్ర రాజభటులతో మిత్రుల నందంపి వారినెల్లఁ దమ నెలవునకు రప్పించికొనియెను. అని యెఱింగించువఱకు.

167 వ మజిలీ.

భోజభూపతి లీలావతిమందిరమందే వసించి యామెం దలంచుకొని దుఃఖింపుచుండెను ఆపరితాపము చెప్పికొనఁదగిన యాంతరంగిక మిత్రుఁ డెవ్వఁడును లేఁడు. కాళిదాసకవి నవమానించుటుజేసి మునుపటివలె నాయనతోఁ జనువుగా మాటలాడుటకు సిగ్గుపడుచుండును. వేడి నిట్టూర్పుల నిగుడింపుచు శయ్యపై దొర్లుచుండ నతనిగాత్రంబు నొక పత్రిక నొత్తుటఁయు నదియేమియోయని యెత్తిచూచెను. అం దిట్లు వ్రాయఁబడియున్నది.

రాజా ! నీవు విదేశమున కరిగినవెనుక నీసంతానము గంతువిలాసములకులోనై ప్రవర్తించెను. నీకుమారుం డొకవారకాంతతో సంతత మంతఃపురము విడువక క్రీడాభిరతుండై రాజకార్యముల విమర్శింపఁ డయ్యె. నీకూఁతురు రుక్మిణికి నెలతప్పెనని చెప్పుకొనుచున్నారు. ఈ రెండు విషయములం బరీక్షించిన నీకే తెలియఁగలవు. నీ కాప్తులమగుట నట్లు తెలుపుటకుఁ జింతిల్లుచున్నాము.

ఆపత్రికంజదువుకొని ధాత్రీపతి కలుద్రావినకోఁతివలెఁ జికాకు వడుచు నక్కటా ! నా కింటికివచ్చిన నన్నియు దుఃఖములే కలుగుచున్నవి. అందులకే పెద్దలు సంసార మతిగహనమని చెప్పిరి. నాసంస్థాన మందు దుర్మార్గులు బెక్కండ్రు గలరని తోఁచుచున్నది. వెనుక లీలావతినిగుఱించియు నిట్లే వ్రాసిరి. ఇదియు నసత్యమేయని తలంచెదను. నరు లసూయాపరులుగదా? అని తలంచుచున్న సమయంబునఁ బ్రతీహారి చనుదెంచి దేవా ! ముఖ్యాదూత్యుండు వచ్చియున్నాఁడు. ప్రవేశమునకు సెలవా ? యని యడిగి తదనుజ్ఞఁగైకొని యతనిం బ్రవేశపెట్టెను.

ప్రధాని నమస్కరించుచు పర్యంకముదాపుననున్న పీఠముపైఁ గూర్చుండి దేవరవా రస్వస్థులైయున్నట్లు కనంబడుచున్నారు. ఇదియంతయుఁ బయనపుబడలిక గావలయును. అని సమయోచితముగాఁ బల్కరించుటయు నాపుడమియొడయండు శయ్యపైఁగూర్చుండి పయనమన నేల ? జన్మయే బడలిక. కానిమ్ము, నేనులేనప్పుడు చిత్రసేనుండు రాజకార్యముల నేమైన విమర్శించెనా ? పండితుల నాదరించెనా ? వానిప్రవర్తన మెట్లున్నదో సత్యము జెప్పుము. మఱియు సందేహాస్పదములైన యభియోగము లేమైనం దేఁబడినవా ? అనియడిగిన నించుక జడుపు దోఁప నాప్రధాని యిట్లనియె.

దేవా ! దేవరయరిగినదిమొదలు భర్తృదారికునకు శరీరములో నన్వస్థత కలిగినది. దానంజేసి సంతతము శుద్ధాంతమునందే వసించి యుండిరి. రాజకార్యము లంతగా విమర్శించుట కాయన కవకాశము గలిగినది కాదు. తగురీతి మేమే పరిష్కరించుచుంటిమి. దేవరవలె పండిత సత్కార మెవరుసేయఁగలరు? అదియట్లుండె నొకనాఁ డొకపురుషుండు తురగమెక్కి వచ్చుచు నెఱుఁగకయో యెఱిఁగియో భర్తృదారిక విహరించునుద్యానవనములోనికిం బోయెను. ద్వారపాలకు లాటంక పఱచినను నిలువఁడయ్యె.. ఆవార్త నామెకుం దెలియఁజేయ నాహయంబెక్కి వచ్చినది మచ్చెకంటిగాని పురుషుండుగాఁడని తమ్ము గద్దించి యాతనిఁ దనబండిలోనెక్కించుకొని యంతఃపురమునకుఁ దీసికొనిపోయినదని వాండ్రు మాతోఁ జెప్పిరి. ఆవిషయము విమర్శింప మేము కుమారరాజుగారిని బ్రార్థించితిమి. ఆయన సోదరీనికాయంబున కరిగివచ్చి యది యాఁడుదియే యని నిర్ధారణసేసిరి. ప్రతీహారులు మఱికొందఱు రాజభటులు ఘోటకారూఢుఁడు పురుషుఁడేగాని స్త్రీగాదని వాదించుచున్నారు. ఇదియే దేవరయరిగినవెనుక జరిగిన యభియోగసందేహమ). అని చెప్పినవిని యజ్జనపతి తనమతిం బత్రికావిషయము సత్యమేమోయని సందేహ మంకురింపఁ గలంకముజెందుచు నొక్కింతతడవు ధ్యానించి కానిమ్ము ఆవిషయ మానక విమర్శింతముగాక యిప్పుడు నీవు వచ్చినపని యేమో చెప్పుమని యడిగిన నాప్రగ్గడ యిట్లనియె.

మహారాజా ! నేఁడు విద్వత్సభ జరుగుటకు నియమించితిమి. దూరదేశములనుండి మహాపండితులును గవీశ్వరులును బెక్కండ్రు వచ్చియున్నారు. కొందఱు కాళిదాసకవితోఁ బ్రసంగించుటకు నుత్సాహపడుచున్నారు. కాళిదాసకవి సరస్వతియపరావతారమని యెఱుంగక యతనికి శాస్త్రములేమియు రావనియు కవిత్వముమాత్రము జెప్పఁ గలఁడనియు వాదించుచున్నారు. దేవర వా రాసభకు విచ్చేసి వాదిప్రతివాదుల నిరూపింపవలయును. మాధ్యస్థుల నేర్పఱుపవలయును. అని యెఱింగించిన భోజుండు నిమీలితనయనాంభోజుండై అయ్యో ! నేఁడే తత్ప్రసంగము బెట్టితిరా? నామనసు దిరముగాలేదు. భైరవునిమాట యేమైనది ? అనుటయు నతండు భైరవునియాట ఇఁక మూఁడుదినములలో జరుగును. విద్వత్సభకు మీరురానిచో సమంజసముగా నుండదు. ఎట్లయినను దయచేయకతీరదని బలవంతపెట్టెను. నృపతి యంగీకరించి యా సభాసమయంబునకు పోయి సభ నలంకరించెను.

అందొకమూల కుచుమార గోనర్దీయ చారాయణ సువర్ణ నాభ గోణికాపుత్రులును మఱొకవైపున దండి భవభూతి శంకరప్రభృతిమహా కవులును భోజునకు ప్రక్కనున్నపీఠముపైఁ గాళిదాసమహాకవియును నాప్రాంతములయుదు. నానాదేశాగతవిద్వత్కవులును గూర్చుండిరి. అప్పుడు భోజుండు లేచి విద్వద్బృందమున కెల్ల నమస్కరించుచు మద్భాగ్యవశంబున నేఁ డీసభకు మహావిద్వాంసులెల్లరు విచ్చేసి నన్నుఁ గృతార్థుం గావించిరి. మీమీప్రసంగముల విని శ్రోత్రానందము గావించికొనియెదంగాక. మీ రన్యోన్యము మత్సరగ్రస్థులుగాక విద్యావైభవములు దేటపడఁ బ్రసంగింపఁ గోరుచున్నాఁడను. ఎవ్వరెవ్వరితోఁ బ్రసంగింప నభిలాషగలిగియున్నదో ప్రకటించినచో నందులకుం దగినమాధ్యస్థు నేర్పఱతుము. అనిచెప్పి కూర్చుండెను.

అప్పుడు కుచుమారుండు లేచి మహారాజూ ! మేము కాశీపురంబునఁ జదువుకొంటిమి. మీసంస్థానపండితుల ప్రఖ్యాతి విని వారితోఁ బ్రసంగింప వేడుకగలిగి వచ్చితిమి. మే మేడ్వురము సహాధ్యాయులము. మా కన్ని విద్యలయందును బాండిత్యము గలిగియున్నది. ఇందు మే మేవుర ముంటిమి. మాలో నెవ్వరితోనైననుసరియే మీసంస్థానపండితులలోఁ బ్రముఖునిఁ బ్రసంగించుటకు నియమింపవలయును. ఇదియే మా యభీష్టమని పలికిన విని శంకరకవి లేచి యిట్లనియె.

అయ్యా ! నీమాటలు గడు గర్వభూయిష్ఠములై యున్నవి. కాశీపురమునుండి ప్రత్యేకము భోజభూజాని యాస్థానమునఁ గవులతో ముచ్చటింప నుత్సుకతఁజెంది వచ్చితిమని చెప్పితివి. నీయుత్సాహము వీరు దీరుపఁగలరు. కాళిదాసకవిప్రవరునిప్రభావము మీరు వినినచో నింత దూరము రాకుందురుగదా? అతండు విద్యలసృష్టించిన మహానుభావుండు. ఈసంస్థానపండితులలో నతండే ప్రముఖుండు. అతఁడే మీకు ప్రతివాదిగా నుండఁగలఁడు. మాధ్యస్థుని మీరు కోరుకొనుఁడు. అనిపలికి కూర్చుండెను.

ఆమాటవిని గోనర్దీయుఁడు లేచి విద్యాస్వరూపుండగు కాళిదాస కవిసార్వభౌమునిమహిమను మే మీదివఱ కే వినియుంటిమి. భూమండలమంతయుఁ దద్యశోవిసరములు వ్యాపించియున్నవి. ఆయనతోఁ బ్రసంగింప మేముకాదు వాణీధవుండైన సమర్ధుండుగాఁడని చెప్పఁగలము. ఆయనకు మావిద్యాపాటవము జూపి మెప్పుబడయవచ్చితిమి గాని గెలుపుగొనుటకుఁ గాదు అందులకే యనుజ్ఞనీయ వేఁడుచున్నాము. అని పలుకుటయు సభాసదు లామాటలువిని కాళిదాసకవి యిందుల కేమని ప్రత్యుత్తరమిచ్చునో యని చూచుచుండిరి.

అప్పుడు భోజుండు లేచి కుచుమారగోనర్దీయాదిపండితులచరిత్రము లోకాతీతమైనది. కాళిదాసమహాకవి త్రిభువనైకవంద్యప్రభావ సంపన్నుఁడు. వారు ప్రసంగింప మాధ్యస్థముసేయటకుఁ దగినవిద్వాంసుం డుండవలదా? భారతియో భారతీపతియో కావలయు, నట్టిసమర్థుండు దొరకువఱకు నావాదము నిలుపుమని కోరుచున్నాను. తక్కిన పండితులు ప్రసంగింపవచ్చునని యానతిచ్చెను. తదానతి శిరసావహించి గోనర్దీయాదు లేమియు మాటాడలేదు.

తరువాత నితరపండితులప్రసంగములు చాల జరిగినవి. పెక్కండ్రకు బిరుదములు కానుకలు వేనవేలు పంచిపెట్టిరి. సభ ముగిసినతరువాత భోజుండు గోనర్దీయకుచుమారులఁ బ్రత్యేకముగాఁ బ్రశంసింపుచు మిమ్ము నేను బురందరపురములోఁ జూచితిని. జ్ఞాపకమున్నదా ? అని యడిగినఁ గుచుమారుండు మిమ్ముఁజూచినప్పుడే తెలిసికొంటిమి. అప్పుడు మీకులగౌరవనామముల మఱుఁగుపఱచితిరి. మీతో మామి త్రుండు ఘోటకముఖుండు వచ్చెంగదా? అతఁ డిందు రాలేదేమి ? ఎందైనం బంపితిరా? అతఁడును దత్తకుఁడునుందక్క తక్కినవారము గలిసికొంటిమి. వానివృత్తాంత మెఱింగిపుఁడని యడిగిన నయ్యొడయండు స్మృతినభినయించుచు నయ్యో అప్పరమపవిత్రు స్నేహపాత్రుఁ బరార్థపరు నీసభలో స్మరింపక నేను గృతఘ్నుండ నైతింగదా? (జనాంతికముగా) నొకపాపాత్మునిమూలమున నేను స్మృతిచెడి రూపాంతరము వహించియుండిన నాతం డెందుఁబోయెనో తెలిసికొనలేకపోయితిని. అప్పుణ్యాత్ముం డెందుఁ జిక్కు పడియెనో తెలియదు. ఈపాటి కీవీఁటికి రావలసినవాఁడే యని విచారము సూచించెను.

అప్పుడు సువర్ణ నాభుండు రహస్యముగా మహారాజా ! మృగ సమూహములతో వినోదములఁ జూపుటకై వచ్చి మీతోటలో విడిసిన భైరవుండు కడుదుర్మార్గుఁడు, గురుద్రోహి. మనుష్యులఁ బశుపక్షిమృగాదులఁ గావించి వంచించుచున్నాఁడు. వానియొద్దనున్న జతువులన్నియు నట్టివే. మాకుచుమారుఁడు వానిం బరిభవింపఁగలఁడు. మీరు వాని మృగవినోదములఁ జూచుటకై ప్రత్యేకము రప్పించితిరి. తత్పరిభవము మీ కసమ్మతమేమోయుని తలంచి చెప్పుచుంటిమి. మాయాప్తులఁ బెక్కండ్రఁ బక్షులనో మృగములనో చేసి త్రిప్పుచున్నాఁడు. వానిని శిక్షించి వానియొద్దనున్న పశుపక్షి మృగంబుల వశపఱచుకొనవలయునని తెలిపిన విని భోజుండు వానిచరిత్రము మీకునుం దెలియునా ? అందఱ కన్న నన్నెక్కుడుగాఁ బరాభవించెను. వానిని శిక్షించుటకే యిందు రప్పించితిని. వానియాటనాఁడు మన మందులకుఁ దగినప్రతీకారము యోజింతము. ఇప్పుడు వెల్లడింపకుఁడు. పారిపోవఁగలడు. అని పలుకుచు నప్పటికిఁ జాలప్రొద్దుపోవుటచే వారినెల్ల సగౌరవముగా విడిదల కనిపి తా నంతఃపురమున కరిగెను. అందుఁ గ్రమ్మఱ లీలావతీవియోగ విషాదంబు హృదయంబున నావేశించినది. ప్రధానుం డెఱింగించినవిష యంబులంబట్టి రుక్మిణీచిత్రసేనుల చారిత్రములు కళంకపాత్రములైనట్లు నిశ్చయించుకొని చిరాకుపడఁజొచ్చెను. మంచముపైఁ బండుకొని ధ్యానించుచుండ ననేకవిషయములు జ్ఞాపకము వచ్చినవి. అంతలో నిద్ర బోయెను.

గోనర్దీయాదిమిత్రులు గోణికాపుత్రునితోఁ గూడికొని తమ విడిదలకుం బోయిరి. గోణికాపుత్రుండు వారివారి చరిత్రముల విని విస్మయసంతోషంబులు వెల్లివిరియ దత్తునిగుఱించి తా నెఱింగినకథయంతయుఁ జెప్పెను. దత్తుఁడు యక్షశాపంబున స్త్రీరూపమ వహించియున్నవాఁడు. ఇందో యెందో వెదకి వానిం దెలిసికొననలసియున్నది. యక్షుండు వానిశాపము గ్రమ్మఱింపఁగలఁడని సువర్ణ నాభుడు పలికెను.

యక్షుండు భైరవశిక్షితుండైనట్లు చెప్పితివిగదా. ఆమాటయే నిక్కమైనచో నిప్పుడేపోయి యాభైరవునిఁ బరిభవింతము రండు. రేపటి వఱకు నిలువనేల ? తృటిలో వానిం బంధించెదనని కుచుమారుండు పలికిన గోనర్దీయుండు తొందరవలదు. వానియాట జూచి సమయోచితముగాఁ గావింతముగాక. ఘోటకముఖునిమాట యేమి ? రాజు తన కేమియుఁ దెలియదనుచున్నాఁడు. వాఁడుగూడ వినిచేతఁ జిక్క లేదుగదా? అనుటయు నన్నియు రేపు తేలునుకాదా? తొందరవలదని గోణికాపుత్రుఁడు చెప్పెను.

వా రట్లు మాట్లాడుకొనుచుండఁగాఁ జత్రసేనుఁడు శకటమెక్కి యక్కడికివచ్చి దౌవారికునివలనఁ దనరాక గోణికాపుత్రునకుఁ దెలియఁజేసెను. గోణికాపుత్రుఁడు తొందరగా ద్వారదేశమున కెదురువోయి రాజపుత్రుం కోడ్తెచ్చి యుచితాసనాసీనుం గావింపుచుఁ దమ తమమిత్రులకథయంతయుం జెప్పి యన్యోన్యమైత్రి గలుగఁజేసెను.

రాజపుత్రుఁడు వారినెల్ల నగ్గించుచు నే నిదివఱకు దత్తుని నీగోణికాపుత్రుని నెఱుంగుదును. మీచరితములు వీరివలన వింటిని. దత్తుఁడు కొన్నిదినములుమాత్రము నాయొద్దనుండి తరువాతఁ గనంబడలేదు. ఎందుఁబోయెనో తెలియదు. గోణికాపుత్రుఁ డందుల కే విచారించుచున్నాఁడు. అని యతనిగుఱించి ప్రస్తాపించెను గోణికాపుత్రుండు చిత్రసేనునితో మిత్రమా ! విపులునొద్దనుంచి , ప్రత్యుత్తరమువచ్చినదా ? గణికాపుత్రికలవార్త లేమైనం దెలిసినవియా? విపులుఁడు గావించిన దుర్నయమునకుఁ బ్రతిక్రియఁ జేసితీరవలయు. నామిత్రులు గోనర్దీయ కుచుమారులు చెరియొకదేశమునకు నధికారులు చతురంగబలములతోఁ బోయి వాని బంధించిరాఁగలరు అనిచెప్పిన రాజపుత్రుం డౌను ప్రత్యుత్తరము వచ్చినది. నీకుఁ జెప్పలేదుకాఁబోలు నీసందడిలో మఱచితిని. వినుము.

మనము వ్రాసినపత్రికకు జడుపుజెందుచు నత్యంతవినయముతోఁ బ్రత్యుత్తరమిచ్చెను. ఆగణికాపుత్రిక లెవ్వరో తానెఱుఁగఁడఁట. తనదేశమం దెచ్చటనున్నను జూపినచో మనముసేసినశిక్షకు బాధ్యుఁడగునఁట. వచ్చి వెదకికొనుమని వ్రాసెను. ఆవెంటనే కొందఱదూతల నందుఁ బంపితినని యావృత్తాంతము చెప్పెను.

గోణికాపుత్రుండు ప్రస్తావముమీఁద మీతల్లి లీలావతి యిందున్నదని చెప్పుటయు నతండు వెఱఁగుపాటుతో మాతల్లి లీలావతియే ! యెట్లువచ్చినది? బ్రతికియున్న దా? అనియడుగుచుఁ దనకుఁ జూపుమని కోరికొనియెను. స్త్రీసంఘమధ్యంబున నుండుటచే నప్పుడు పోవుటకు సమయముకాదని సువర్ణ నాభుఁడు చెప్పెను. మఱునాఁడైనను జూపింపకతప్పదని బ్రతిమాలికొని రాజపుత్రుం డింటికిఁ బోయెను. వా రట్లు పెద్దతడవు ముచ్చటలాడికొనుచు నాదివసము వెళ్లించిరి.

అని యెఱింగించునంతఁ గాలాతీతమైనది. తరువాతికథ పైమజలీయం దిట్లు చెప్పఁదొడంగెను.


____________