Jump to content

కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/163వ మజిలీ

వికీసోర్స్ నుండి

కుచుమార గోనర్దీయులతో మిత్రులారా ! మీరిరువురు మహారాజులైరి. మీకతంబున మేము నట్టివారమే యగుదుము. మనమిత్రులు మననిమిత్తమై ధారానగరంబున వేచియుందురు. మీ రందుఁ బోవుఁడు. భైరవుం డేకశిలానగరంబుదెస కరుగుచున్నాఁడని వింటిమి. ఈతండును నేను నందుఁబోయి వానివార్తఁ దెలిసికొని ధారానగరంబున కరుదెంతుము. ఈతఁడు మనకు నెనిమిదవమిత్రుఁడు. తానుగూడ నన్నగరమువచ్చి మనమిత్రులం జూతునని చెప్పుచున్నాఁడు. మనవేడుకలు చూచి చూచి రమ్మనలేక మొగమోటపడుచున్నాఁడు. మే మందుఁబోవుటకు సమ్మతింపుఁడని కోరిన వా రెట్టకే యంగీకరించి రాభోజుండును ఘోటకముఖుండు నటఁగదలి యల్లాణక్షోణిపాలుని పట్టణంబునకుఁ బోయిరి.

అని యెఱింగించి మణిసిద్ధుండు మిగిలినకథ దరువాతిమజిలీ యందుఁ జెప్పదొడంగెను.

163 వ మజిలీ.

అళ్లాణరాజుకథ.

శా. అల్లాణుండను భూమిపాలుఁడు వదాన్యత్వప్రభావంబునన్
     ముల్లోకంబులఁ బేరుపొంది సతతంబున్ శంభుభక్తార్చనా
     సల్లాపంబులఁ ప్రొద్దుపుచ్చుచును సంస్థానంబునం దార్యవి
     ద్వల్లోకంబులు సత్కవుల్ వెలయ నింద్రప్రాభవం బొప్పఁగాన్ .

ఏకశిలానగరంబు రాజధానిగాఁ జేసికొని ధర్మంబునఁ బ్రజలఁ బాలింపుచుండెను. అతనికే భళ్ళానుండను నామాంతరము గలదు. అతఁడు సంతతము మహేశ్వరార్చన సేయుచుండును. సర్వవిద్యాలాలసుండై, కవీంద్రులఁ బండితులఁ బెద్దగా నాదరించును. శిబికర్ణదధీచుల మించినవదాన్యుఁడు నిత్యము పదుగురమహేశ్వరుల నర్చించి యిష్టా పూర్తములచేఁ దృప్తిబొందింపు చుండును. ఏమహేశ్వరుఁ డేదికోరినను నిచ్చుట వ్రతముగా నియమము సేసికొనియెను. ఆక్షితిపతి యర్ధాంగలక్ష్మి సువ్రత. ఆపతివ్రత యరుంధతికిఁ దప్పులుపట్టఁగలదు. రూపంబున రతియు విద్యల భారతియు నామెం బోలఁజాలరు. ఆమెసుగుణంబులు వర్ణింప సామాన్యునికి శక్యముగాదు. ఆపుణ్యవతి పతికిఁ బ్రాణములోఁ బ్రాణమై నియమములకు సహకారిణియై వర్తింపుచుండెను.

ఒకనాఁడు పశుపతియను మహేశ్వరుం డతనియింటి కతిథిగా వచ్చెను. అతనిప్రాయము ముప్పదియేండ్లకు లోపుగా నుండును. రూపము సామాన్యమైనను తేజము విద్యావంతుఁడని సూచించుచుండెను. విభూతిరుద్రాక్షమండితప్రతీకుండై రెండవమహేశ్వరునివలె నొప్పుచుండెను. భళ్లాణుం డా పశుపతినిఁ బశుపతిగాఁ దలంచి యథావిధిగా నర్చించి సుఫలము గోరునప్పుడు వాడుకప్రకారము నమస్కరించి యిట్లనియె.

మహాత్మా! నీ వపరశివుండవలె మాయింటికి వచ్చి మమ్ముఁ గృతార్థులఁ గావించితివి. మీపాదరేణువు సోఁకి నేను గులజులతోఁ గూడఁ బవిత్రుండనైతిని. మీ కత్యంతప్రియంబైన కామ్యంబు వక్కాణింపుఁడు. అక్కార్యంబుదీర్చి నంత సుఫలంబు వడసెదనని ప్రార్థించిన విని యామహేశ్వరుం డించుక ధ్యానించి యిట్లనియె.

నరేంద్రా ! కామితంబన మనంబునంబుట్టిన కోరికగదా ? హృదయంబున ననేక సంకల్పములు గలుగుచుండును. వానినన్నియు బయలుపఱచిన వెఱ్ఱివాఁడందురు. ఆసంకల్పములలోఁ గొన్ని పుట్టినతోడనే నశించుచుండును. ఇప్పుడు మీరు నీ కామితమేమని నన్నడిగితిరి. మనంబునఁబుట్టిన యభిలాష మఱుగుపఱచి వేఱొకటి చెప్పుట న్యాయము కాదు. అట్టిదానిం దీర్చినఁగాని, మీవ్రతము సఫలముకానేరదు. ఇప్పుడు నాచిత్తమునంబుట్టిన యభిలాష యొరులతోఁ జెప్పఁదగినదికాదు. కావున మీకు సుఫలమిచ్చెద నా కనుజ్ఞయిండు. పోయివచ్చెదఁ గామ్యముమాట యడుగవలదని పలికినవిని యానృపతిలకుం డిట్లనియె. మహేశ్వరా ! నే నొకదేశమున కధిపతిని మీకామితమే తీర్పఁజాలనా ! మీరు కోరినవస్తువు నాదేశమం దెందున్నను దెచ్చి యీయఁగలను. సందియమందక కోరికొనుఁడు. ఆనియడిగిన నతండు నిట్టార్పు నిగుడించుచు అయ్యో నే నేదియో కోరక మీతో నేను నిజమేమిటికి జెప్పితిని. నాకోరిక కడునీచమైనది. నాప్రారబ్ధమువలన నేఁడు నా కట్టియభిలాష గలిగినది. చెప్పుటకు వాకురాకున్నది. మీ రూరక నన్ను నిర్బంధించుచున్నారు. నాకోరికవిని సీ, సీ, అని నామీఁద నుమియుదు రేమో? అసహ్య మసహ్య మపకీర్తి నేఁ జెప్పుజాలనని చెవులుమూసి కొనియెను.

అప్పుడు రాజు మహాత్మా! నీవు పరమోత్తముఁడవు. మనంబున నొక్కటి వాక్కున నొకటి పెట్టికొని చెప్పుచున్నవాఁడవుకావు. నీహృదయము కడుపరిశుద్ధమైనది. నీకోరిక తీర్పక నేను భూజించువాఁడను కాను. ఇప్పుడు పొద్దుపోయినది. సంశయింపక నీయభీష్ట మెఱిఁగింపుము. ఎంతనీచమైనదైనను నిందింపక యొసంగెదనని బ్రతిమాలికొనియెను.

అప్పుడామహేశ్వరుండు మహారాజా! నన్నుఁ జెప్పుమని గట్టిగా నిర్బంధించుచున్నారు. ఇక చెప్పకతీరదు. వినుండు. ఆహారనిద్రామైధునక్రియలు జంతువులకు సహజములుగదా? నేను బ్రహ్మచారిని. భార్యలేదు. మీరువెట్ట సంతుష్టిగా భుజించితిని. ఇప్పుడు తృతీయ పురుషార్ధము నన్ను గట్టిగా బాధించుచున్నది. మీ రేమికావలయునని యడిగినంత నాచిత్తము సంభోగాయత్తమైనది. ఆమాట యెట్లు చెప్పఁగలను. అది యసభ్యముకాదా? దానిం గప్పిపుచ్చి మఱియొకటి కోరుట కపటమగుచున్నది. ఈకోరిక మీ రెట్లుతీర్పఁగలరు? నాదారి నన్నుఁ బోనిండు. సిగ్గు సిగ్గు మహానుభావులు మీకడ నిట్టితుచ్ఛపుకోరిక కోరినందులకు నాతప్పు మన్నింపుఁడు. అనిపలికిన విని నరంద్రుడు మందహాసము గావించుచు నిట్లనియె. మహేశ్వరా ! నీవు యథార్థవాదివి. నీమాటలు నాకు సంతోపమును గలుగఁజేసినవి. నీ వేమియు సంశయింపకుము. నీకోరిక తప్పక తీర్పించెద. పరాశరప్రభృతిమహర్షులు కామమునకు దాసులైరనుచో నితరులమాట చెప్పనేల ? ఇందుఁ దప్పేమియు లేదు. వేశ్యకాంతలు వివాహమాడక కన్యలైయుండుట మీవంటివారినిమిత్తమే? మాయూరఁ జక్కఁదనంబునఁ బేరుపొందిన వారసుందరులు పెక్కండ్రు గలరు. వారిలోఁ జక్కనిదానినొక్క తె రప్పించి నీయభీష్టము దీర్పించెద నంగీకారమేనా? అని యడిగిన నతం డిట్లనియె.

మహారాజా ! నేను వేశ్యకాంతంగాక కులకాంతం గోరుదునా ? మఱియొకమాట జ్ఞాపకముంచుకొన వలయును. నీవు శాసనకర్తవు. నీయాజ్ఞ నెల్లరు శిరసావహింతురు. నేఁటిరాత్రి యొకవిటుని యధీనములో నున్న వారాంగనం దీసికొనిరాఁగూడదు. కామము సర్వసాధారణము. ఇప్పుడు నే నెట్లుపరితపించుచుంటినో యావిటుఁడు తద్వియోగమున నట్లు పరితపింపఁగలఁడు. ఒరులబాధపెట్టి యనుభవించినసుఖము సుఖముకాదు. విమర్శించి రప్పింపుఁడని చెప్పెను.

ఆమహేశ్వరునియుపన్యాసమునకు మిగుల సంతసించుచు భళ్లాణుండు నీవుకోరినరీతినే కావించెద సంశయింపకుమని పలుకుచుఁ దన గృహంబున నొకగది యలంకరింపఁజేసి యనల్పశిల్పికల్పితంబగు హంసతూలికాతల్పంబున నతనిం గూర్చుండఁబెట్టి యుత్తమలక్ష్మణోపేతయై యొకరి యాధీనములో లేని వారకాంతం దీసికొనివచ్చి యప్పగింపవలయునని మంత్రులకు నియోగించి తాను దేవతా గృహంబునకుఁ బోయెను.

మంత్రులు శృంగారపురుషులఁ గొందఱ వెంటనిడుకొని యా పురివేశ్యవాటికకుఁ బోయి యందొకచో నిలువంబడి యిందు రూపయౌవన విద్యావిశేషములచేఁ బేరుపొందిన వారసుందరు లెందఱుగలరు? వివరింపుఁడని యడిగిన నందొక విటప్రముఖుం డిట్లనియె. ప్రభువులారా ! వినుఁడు మనపురంబునంగల వారాంగనల కచ్చరలు దాస్యముసేయఁ బనికిరారు. చంద్రలేఖ, తారావళి, పద్మగంధి, మణిమంజరి, మధురాధర, విద్రుమోష్టి, శరచ్చంద్రిక, హేమలత, నవమల్లిక, కాంతిమతి, లోనగు మగువలు ప్రముఖులు. కావలసిన వారిం దీసికొనివచ్చెదము. సెలవీయుఁడని యడిగిన మంత్రు లిట్లనిరి.

మా కెందఱో అక్కఱలేదు. మంచి చక్కని దొక్కరితయ చాలును. ఆకసంబడు పెద్దమేడ యెవ్వరిదని యడిగిన విటుండు, అయ్యా! అది చంద్ర లేఖయిల్లు. అది రూపమునందు నాటపాటలయందును బ్రముఖురాలే. తీసికొనిరానా ? అనిపలుకుచు వారియనుమతివడసి చంద్రలేఖ నక్కడకుఁ దీసికొనివచ్చెను. మంత్రుల కది నమస్కరించినది. దానిం జూచి సచివు లాశ్చర్యమందుచు వలసినంత ద్రవ్య మిప్పింతుము నేఁటిరాత్రి నొకమహేశ్వరుని యాధీనములో నుండవలయు నిది రాజుప్రీతి కరమైనపనియని విటుముఖముగా నడిగించిన నవ్వెలయాలు రాజశాసనమునకు బద్ధులమే. నావిటుండు మంచముపై నున్న వాఁడు. వానితోఁ జెప్పి యంగీకరింపఁజేసివత్తు నంతవఱకు నవకాశమీయుఁడని కోరికొనినది.

మంత్రులు పో, పొమ్ము, నీవు పనికిరావు. విటునియధీనములోలేనిబోగముదాన కావలయునని పలికిన బాబూ ! తారావళి కాళిగా నున్నది. దానిం దీసికొనిపొండు అనిచెప్పి చంద్రలేఖ సెలవుపుచ్చుకొని వెళ్లి పోయినది. విటుఁడు తారావళియింటి కరిగి, మంత్రులసందేశ మెఱింగించి యక్కడకుఁ దీసికొనివచ్చెను. దానిఁజూచి మంత్రులు నేఁటిరాత్రి నీవువిడిగానుంటివేని కానుక లిప్పింతుము మాతో రమ్ము. పనియున్నదని యడిగించిరి. అది స్వామీ! నే నింతదనుక విడిగానేయుంటిని. ఇప్పుడే యొకపల్లవుఁడు తాంబూల మిచ్చిపోయెను ఈఱేయి తీరిక లేదని చెప్పినది. మంత్రులు విటునిపై నలుగుచు నీవు విటయు క్తలం దీసికొనిరావలదు వారివారియిండ్లకుఁ బోయి విడిగానున్న పడఁతిం దీసికొనిరమ్ము. వలసినంత ద్రవ్య మిప్పింతము. అనినియోగించి మంత్రు లందే నివసించిరి. పిమ్మట నావిటుఁడు నీలవేణియింటికిఁ బోయిచూచిన నా వెలఁది భుజంగుఁడు తనతొడ శిరంబిడికొని యాలింప హాయిగా సంగీతము పాడుచుండెను. ఆవింతజూచి యతండు గిరుక్కున మఱలి యాచక్కి నున్న పద్మగంధియింటికిఁ బోయి తలుపుగొట్టెను. దానిం గళత్రముగా స్వీకరించిన రంగాచార్యులువచ్చి తలుపుతీసి యేమిపనియనియడిగిన నేమియులేదని యవ్వలికిఁ బోయెను. ఆచార్యు లనుమానము జెంది లోపలికిఁ బోయి పద్మగంధింజూచి యౌరా ! నీవెంతదానవు ? ఎవ్వరు నాయింటికి వచ్చుటలేదని ప్రమాణికము చేసితివే ? ఇప్పు డాతుంటరి నీయింటి కింత ప్రొద్దుపోయి యేమిటికిరావలయును ? పాపము వాఁడు నేను లేననుకొనెనుకాఁబోలు. నన్నుఁజూచి యేమియుమాటాడక యవ్వలికిఁ బోయెను. వాఁడు వచ్చినకారణము జెప్పుమని నిర్బంధించెను.

పద్మగంధి – రామ రామ మీతోడు నేనేమియు నెఱుఁగను. వాఁడెవ్వఁడు ?

ఆచార్యులు - వాఁడా? పోకిరీతనముగాఁ జెడ్డవేషమువైచికొని యీవేశ్యవాటికలోఁ దిరుగుచుండెడి పారుబోతు. కనకాచలము మూలముగా మాయిరువురకు నొకప్పుడు ముష్టియుద్ధము జరిగినది. నాదాయ వాఁ డిందేల రావలయును?

పద్మగంధి — ఎందులకువచ్చెనో తెలియదు. నమ్మిన నమ్ముఁడు లేకున్న నే నేమిచేయుదును ?

ఆచార్యులు — మఱియెవ్వరిని రానీయననియేకదా! నావలన నిబ్బడిగా ధనముదీసికొంటివి ? ఆతొత్తుకొడుకు నాయింటి కేమిటికి రావలయునో చెప్పుము. ఈరాత్రికి నేను రాననుకొని రమ్మంటివి. మీసంగతి యెఱిఁగియే వెళ్ళినపని కాకున్నను సత్వరముగా వచ్చితిని. నేఁడు రాకున్న నెంతమోసము జరుగును ? పద్మగంధి — అబ్బా ! నీవు మాదిట్టవు. నాయపరాధము గనుపెట్టితివి. నీవిచ్చుబత్తెముతో నే జీవించుచుంటిమి. ఇష్టముండిన నుండుము లేకున్న పొమ్ము. మాయింటికి స్నేహితులు పరిచితులు వచ్చుచుదురు. మాటిమాటికి శంకలుసేసిన నుత్తరముసెప్పువారు లేరు.

అని కసరిపలికినది. ఆచార్యులు త్రాగియుండుటచే నొడలెఱుంగక కోపముతో నోసిరండా! ఎంతక్రొవ్వి పలుకుచుంటివి ? పుట్టెడు మాన్యమమ్మి తెచ్చియిచ్చినసొమ్ము నీయబ్బగడించినదనుకొంటివా ? అని పలుకుచు వీపుపై నొకగ్రుద్దుగ్రుద్దెను. అది మొఱ్ఱోయని యఱచినది. రాక్షసివంటిదానితల్లి యాకలహము విని వచ్చి ఓరి సిగ్గుమాలినకుక్కా! నాకూఁతుం గొట్టుచుంటివిరా ? నీచేతులు మాడిపోను, దున్నపోతువలె నున్నావు. ఆవచ్చినవాఁడెవ్వఁడో చూపుము. వానిజుట్టో నీజుట్టో గొరిగించెదనని పలుకుచు నాయాచార్యుని జుట్టుపట్టుకొని వీధిలోని కీడ్చుకొని పోయి యేఁడీ ! చూపుము. చూపు మని పెద్ద కేకలు పెట్టుచుండెను. బాబో ! చచ్చితిఁ జచ్చితినని యాచార్యు లఱచుచుండెను.

ఆప్రాంతమందున్న మంత్రు లాకోలాహలము విని దాపునకుఁ బోయి వాని నట్లుకొట్టుచుంటివేమని వేశ్యమాత నడిగిరి. అది బాబూ ! ఎవ్వఁడోవచ్చి మాయింటివీధితలుపుఁ గొట్టెనంట. వాఁడెందులకుఁ గొట్టెనని వీఁడు నాకూఁతుం జావమోదం జూడుఁడు. అని యావృత్తాంతము చెప్పినది. మంత్రులు నవ్వుచు, ఆతలుపుగొట్టినవాఁడు మేముపంపినవాఁడు మఱియొకఁడుకాఁడు పొండు పొండు తగవులాడకుఁడు అని మందలించి వారి సంపివేసిరి.

ఆవిటశిఖామణి యటనుండి మణిమంజరియింటికరిగి యది సరసునితో సొగటాలపాళియాడుచున్న దని దాదివలనవిని యందుండి మంజువాణియింటి కరిగెను. మంజువాణి తలుపుతీసి యోహో భావగారా! దారితప్పివచ్చితిరేల ? మధురాధర జూచిన మోసమువచ్చుంజుఁడీ ! అని పరిహసించిన నవ్వుచు నతఁడు ఓసీ ! నీవలనఁ బనిగలిగియే వచ్చితిని. ప్రభుకార్యము సద్యోఫలము. అరవుకాదు. ఈరాత్రి గాళీచేసికొనిరాఁ గలవా ? అని యడిగిన నప్పడఁతి భావా! యింతప్రొద్దువోయివచ్చి యీమాటచెప్పెదవా ? నేఁడు శివరాత్రియే యనుకొంటిని. రాజుగారి చేత నర్చితుండగు నొకలింగధారి యిప్పుడేవచ్చి తాంబూలమిచ్చి లోపలికిఁబోయెను. గడియదాటినది. లేకున్న మాటదక్కుంగదా! పోనీ! యాయననడిగి రానాయేమి ? అనుటయు నతఁడు అట్లైనఁ బెక్కండ్రఁ దీసికొనిపోవుదును. రాజశాసన మట్లులేదు. కాళీగానున్న వారాంగన కావలయునని పలుకుచు నటనుండి శరచ్చంద్రయింటికిఁ బోయెను. అది వయసుకానితో ముచ్చటలాడుచుండెను. పేక్కేల నాభుజంగుఁ డా యూరనున్న వారకాంతలగృహములన్నియుఁ ద్రొక్కిచూచెను. ఒట్టు పెట్టిన ట్లొక్కరితయు విడిగాఁ గనంబడలేదు. అతఁ డావార్త మంత్రులకుఁ దెలియఁజేసెను.

మంత్రులు ఔరా ! ఇది వింతగానున్న ది. వేయిగడపగల వేశ్యవాటికలో భుజంగసంగరహితయగు గణిక దొరక లేదే. మనమెవ్వతెనో తీసికొనివత్తుమని రాజు గంపెడాశతో నుండును. మనముపోవువఱకు భుజింపఁడు. ఇప్పు డేమిచేయుదుము. అని విచారించుచు మఱలమఱల నావిటు నంపి వారుగూడఁ బరీక్షించిచూచిరి. విడివెలయాలు దొరకలేదు. కపటముచేసి తీసికొనిపోయినచో రాజునకుఁ దెలిసిన శిక్షించును. యథార్థము సెప్పుటయే మంచిదని తలంచి మంత్రులు రాజునొద్ద కరిగి యాతెఱం గెఱింగించిరి.

భార్యతోఁగూడ దేవగృహంబున శివపూజజేయుచున్న భళ్లాణుం డావార్తవిని హాహాకారము సేయుచుఁ బుడమింబడి మూర్ఛిల్లెను. సువ్రత పతిపాటుజూచి వెఱపుతో లేవనెత్తి శైత్యోపచారములు సేయుచుఁ దెప్పిరిల్లి తనవంకఁజూచుచున్న భర్తతో మహాత్మా ! ఇట్లకారణ ముగాఁ బడిపోయితి రేల ? మంత్రులుపంపిన పత్రికలో నేమియున్న ది ? నిజముచెప్పుఁడని యడిగిన నయ్యొడయం డిట్లనియె.

తరుణీ ! నీతో నేమిచెప్పుదును ? మహేశ్వరునికోరికఁ దీరుపలేక యపరాధినైతిని. వారకాంత నర్పింతునని యతని శయ్యపైఁ గూర్చుండఁ బెట్టితిని. దేహధర్మములు దుర్భరములు. నేఁటితో నావ్రతవిఘ్న మైనది. ఇఁక నేను గుడువను. ప్రాయోపవిష్టుండ నయ్యెదనని భార్య కావృత్తాంత మంతయుం జెప్పెను.

ఆమె యించుకథ్యానించి ప్రాణేశ్వరా ! మీయర్ధాంగలక్ష్మిని వశవర్తి నేనుండ మీకుఁ జింతయేటికి ? మహేశ్వరునికామితము దీర్చుట కితరాంగనలఁ బంపుటకు మీకేమి యధికారమున్నది ? వ్రతవిఘ్నమగు నని విచారింపనేల ? నన్ను నియోగింపుఁడు. నే నతనియభీష్టము తీర్చెదఁ దొల్లియిక్ష్వాకునిభార్య భర్తయనుమతి నతిథిని సత్కరింపలేదా ? అట్లే నేనునుగావించి కృతకృత్యురాల నయ్యెద నాజన్మము సాద్గుణ్యము నొందఁగలదని ప్రార్థించినది.

ఆబోఁటిమాటలు విని యాక్షితిపతి యపరిమితానందము చెందుచు నత్తలోదరిం గ్రుచ్చియెత్తి మత్తకాశినీ ! నీపలుకులు మినుపలుకుల కనుకూలించియున్నవి. ప్రియురాలన నిన్నే చెప్పవలయును. పూర్ణముగా సంతోషించితిని. వెలయాండ్రు విడిగా లభించిరికారు. మఱియొక యువతిని వ్యభిచారమునకు నియోగించుట యధర్మము. వ్రతము విడువవలసిన సమయములో మంచియుపాయముచెప్పితివి. నీవుపోయి మహేశ్వరుని కామ్యమును దీర్పుము. నీ కేమియు దోసములేదు. పొమ్ము. మఱియు రాజభార్యవని చెప్పఁగూడదు. వారాంగనననియే చెప్పుము. లేకున్న నతం డంగీకరింపఁడుసుమీ! అని యుపదేశించి యంపెను.

సువ్రత పాతివ్రత్యభంగంబుకాదను దృఢనమ్మకముతో నూత్న భూషాంబరంబులు ధరించి కస్తూరిచందనచర్చి తాంగయై మేవాసనిను నలు దెసలవ్యాపింప నామహేశ్వరుఁడు పండుకొనియున్న గదిలోనికిం బోయి యతనికి నమస్కరించి మహాత్మా ! నేనొక వారకాంతను. భల్లాణభూపాలునిపంపున మీకడకు వచ్చితిని. నావలన మీయభీష్టము దీర్చుకొనుమని పలుకుచు నెదుర నిలువంబడినది.

అతం డామె నెగాదిగఁజూచి మంచముడిగ్గనుఱికి యామెపాదంబులంబడి నమస్కరించుచు దేవీ ! నీవు వారకాంతనని చెప్పుచుంటివేల? పార్వతివలెఁ గనంబడుచుంటివే? అదిగో ఫాలనేత్రము. తెఱవకుమీ ? నేను భస్మమైపోయెదను అయ్యో ! నీవెక్కిన సింహంబు నాపై తీక్ష్ణ దృష్టులు వ్యాపింపఁజేయుచున్నది. తల్లీ ! ఆదరింపవా ? నీచేతనున్న త్రిశూలముజూడ వెఱపుగలుగుచున్నది. తుచ్ఛపుకోరిక కోరినందులకు నన్ను శిక్షింపవచ్చితివా ? లోకమాతా ! నీకు నమస్కారము. నాతప్పు మన్నింపుము. ఎఱుఁగ కట్టిమాట పలికితినని ప్రార్థించుచుండెను.

ఆమహేశ్వరుని పిచ్చిమాటలువిని రాజపత్ని వెఱఁగుపడుచు సౌమ్యా ! నేను బార్వతినికాను లక్ష్మినికాను సరస్వతినికాను. ఒక వేశ్యకాంతను. రాజుగారిని నీవు కోరితివఁట. నాకు సొమ్మిచ్చి యీరాత్రి మీ యొద్దకనిపిరి. ఇదియు నిజము. మీరు బ్రాహ్మణులు నేను సానిదానను. నాకు నమస్కరింపరాదు. వేగము మీయభీష్టము దీర్చుకొండని క్రమ్మఱఁబలికినది. అతండు బాబో ! నీమాటలు మెత్తగానున్నవి. నీరూపము జూడ మహాశక్తివలెఁ గనంబడుచుంటివి. అమ్మో! నీవదనబిలము పాతాళమువలెనున్నది. నాలుక జ్వాలికవలె వ్రేలాడుచున్నది. నీచూపులు శూలములవలె నన్నుఁ బొడుచుచున్నవి. అంబా ! నీభయంకరమూర్తి నుపసంహరింపుమని ప్రార్థించుచు కన్నులుమూసికొని పాదంబులం బడియెను.

అప్పు డామె అయ్యో ! మహేశ్వరా! నీవు మహేశ్వరుండవగుటఁ బార్వతిరూపమున వచ్చితిని. నీకామ్యము దీర్చుకొనుము. లేకున్నఁ గపటముచేసితినని రాజుగారు నన్ను నిందింపఁగలరు. అని ప్రబోధించుటయు నతఁడు మెల్లన కన్నులందెఱచి మెఱపుతీఁగెవోలెఁ దత్తనుకాంతి మిఱుమిట్లుగొలుపఁ జూడఁజాలక అయ్యో తల్లీ ! నీవేడి యుపసంహరింపుము. శాంతురాలవుకమ్మని ప్రార్థించెను. సువ్రత యతనిమాటలు విని “అయ్యో! ఇదియేమికర్మము. నన్నుఁజూచి యితఁ డూరక వెఱచుచున్నాఁడు. నాకు లేనిపోనిరూపులఁ గల్పించుచున్నాఁడు. నాకేమియుం దెలియదు. నే నేమిచేయుదును? ప్రాణనాథుండు నన్నుఁ గపటాత్మురాలని నిందించునేమో? వీనికి నేను వికృతరూపముగాఁ గనంబడుచున్నాను కాఁబోలు. ఈశ్వరమాయఁ దెలియ నెవ్వరితరము” అని ధ్యానించుచు నతని మఱియు మఱియు బోత్సాహపఱచినది.

ఆమెమాటాడిన శూలమువలె వానికి గ్రుచ్చుకొనుచుండెను. అతఁడు కన్నులుమూసికొని తల్లీ! తల్లీ! రక్షింపుము. రక్షింపుమని వేఁడుటతప్ప వేఱొకమాట లేదు. ఈరీతిని వారిరువురు సంవాదము సేయుచుండ నింతలోఁ గోడికూసినది. అప్పు డారాజు వా రేమిచేయుచున్నారో చూడవలయునని యాగదిదాపునకు వచ్చి లోపలివాక్యము లాలించెను. దేవీ! నన్ను మన్నింపవా? నీవేడికి నాయొడలు మండిపోవుచున్నది. శాంతింపుము. అయ్యో ! మహారాజా ! నాకామితము దీర్తుననిచెప్పి యిట్టి దారుణము సేసితివేల? మహాశక్తిని ప్రయోగింతువా ? ఇదియా నీవ్రత పరాయణత్వము. నాకామితము దీర్చుటకంటెఁ బెద్దగా సంతసింతును ఈయాపద దాటింపుము. అని పెద్దయెలుంగున మొఱవెట్టుచుండెను.

ఆమాటలువిని రాజు వెఱవకుము వెఱవకుము. ఇదిగో నేను వచ్చుచున్నాను. అని గుభాలునఁ దలుపుదెఱచుకొని లోనికింబోయెను. సువ్రత మంచముదాపున నిలువంబడియున్నది. కన్నులుమూసికొని మహేశ్వరుం డామెపాదంబులదాపునఁ బడియుండెను. ఆ ! ఆ ! ఏమీ? ప్రేయసీ ! అతిథిని భయపెట్టుచుంటివా? అట్లు వేఁడుచున్నాఁడేమి? అని యడిగిన విని యామహేశ్వరుండు తటాలునవచ్చి యారాజుం గౌఁగిలించుకొని మహారాజా! నన్ను రక్షింపుము. ఈమె తేజము నామేను మండఁజేయుచున్న ది. నీదరిజేరుటచేఁ గొంచెము చల్లఁబడినది నాకేమియు నక్కఱలేదు. నాదారిని నన్నుఁ బోనీయుఁడు అని పలికెను.

రాజు వానివీపుగొట్టుచు మహేశ్వరా ! ఊరక వెఱచెదవేల ? మహాశక్తి యెక్కడ? దివ్యమంగళవిగ్రహయగు నాయువతిం జూడుము. అభీష్ట మేమిటికిఁ దీర్చుకొంటివికావు? ఇది గణికాత్మజ- కన్నులం దెఱచి చూడుము. అనిపలికిన నతం డిట్లనియె.

అమ్మయ్యో! రెప్పలు బరువెక్కినవి. ఆమెతేజము కన్నులఁ దెఱవనీయకున్నది. అదిగో త్రిశూలము కదల్పుచున్నది. బాబూ! మహాశక్తినిఁ బ్రయోగించితి వెట్లుతాళఁగలను ? రాజా ! రక్షింపుము. మేను భగ్గున మండిపోవుచున్నది. అనిపలుకుచు గంగవెఱ్ఱులెత్తినవాఁడుంబోలె నిటునటు గంతులు వేయుచుండెను.

రాజు వానింబట్టుకొని అయ్యో ! ఇదియేమికర్మము ? ఏమియు లేనిదే భ్రమపడుచుంటివేల ? నిలు నిలు కన్నులెత్తి చూడుమని యోదార్చెను. అతఁడు కన్ను లెత్తిచూచి బాబో ! కన్నులుపోయినవి గ్రుడ్డివాఁడనై పోయితిని. చెడుకోరికకోరినందులకు నా కిట్టిశిక్ష విధించితివి. బుద్ధివచ్చినది. ఇఁక నెన్నఁడు నిట్టియభిలాషపడను. అని లెంపలువాయించుకొనుచుండెను.

మహేశ్వరా ! ఇది గణిక. నేను రాజును. మేముగాక యిందెవ్వరునులేరు. ఆదిశక్తి యెక్కడనున్నదియో చూపుమనియడిగిన నతండు దేవా ! వేశ్యనని నామంచముదాపునకువచ్చి నిలువఁబడిన యామెయే ఆదిశక్తి. పార్వతి భవాని దుర్గ త్రిశూలధారిణి అదిగో యెదురనుండ నేదియని యడిగెదవేమిటికి ? వేగ మామెపాదరజంబుదీసి నామేనికి రాయుము. నామేను జల్లఁబడఁగలదు. లేకున్న గడియతాళలేనని బ్రతి మాలికొనిన నాయెకిమీఁ డేమియుఁదోఁచక యట్లుకావించెను.

అప్పు డామహేశ్వరునిమేను వెన్న బూసినట్లు చల్లఁబడినది. అమ్మయ్యా! ఇప్పటికి బ్రతికితిని. తాపము తగ్గినది. చూపులు కనంబడు చున్నవి. ఆహా ! దేవీ ! నీమహత్మ్య మగ్గింప బ్రహ్మాదులకు శక్యముకాదు. నే నీమహారాజును దుచ్ఛకార్యము గోరినందులకు శిక్షింపవచ్చితివి. బుద్దివచ్చినదని పలుకుచుఁ దత్పాద ప్రాంతభూరజంబు మఱికొంత దీసికొని శిరమునకు నొడలికి రాచుకొని సంతసముతో మహారాజా ! నే నిష్పటికిఁ బూతుండనైతిని. నా కనుజ్ఞ యిమ్ము పోయివచ్చెదను, శివపూజాధురంధరుండవగు నిన్నిట్టికోరిక కోరవచ్చునా? తలంచుకొనిననాకే తప్పుగాఁదోఁచుచున్నది. దైవమువలననే నా కట్టిసంకల్పము పుట్టినది. నీవు ధన్యుఁడవైతివి. అని స్తుతియించుచు నామహేశ్వరుం డటనిలువక రాజు నాఁటి కుండుమని బ్రతిమాలుకొనిన వినక యెందేనిం బోయెను.

రాజు సువ్రతపాతివ్రత్యప్రభావమున కచ్చెరువందుచుఁ బెద్దగా స్తుతియించి యాదరించెను.

సీ. సకలదేవమయంబు సాధ్వీలలామంబు
                 దేహంబు పావనతీర్థమట్లు
    ప్రళయాగ్నికల్పంబు పతిదేవతా దీప్తి
                 దహియించు ఖలుల దుర్దాంత మగుచు
    సాధుల కొదవించు సకలార్థములు పతి
                 వ్రత దివ్యసురభికైవడిని వడిని
    శమమొప్ప నుభయవంశములఁ బూతముసేయు
                  సుసతీవతంస జహ్నుసుతలోలె

గీ. నమరు ప్రతికృతి పిడుగునకైన వజ్ర
    మునకునైనను గాకోలమునకునైన

    లేదు సతికిన్క కాటంక మేదియైన
    కనలినఁ ద్రిమూర్తులకుఁ గడగడలుకావె ?

గీ. ఒకతె భాస్కరు నుదయింపకుండఁ జేసె
    నొకతె చల్లార్చె దావాగ్ని హోత్రు నొకతె
    బ్రాహ్మణుని తేజమడఁచె దర్పంబడంగ
    నేమి గావింపనోప దీభూమి సాధ్వి.

భళ్లాణునిఁ బరీక్షింప నీశ్వరప్రేరితుండై యామహేశ్వరుఁ డట్లు కో రెనని కొందఱును, సహజకామాతి రేకంబున మహాపుణ్యాత్మునిఁ దుచ్ఛభోగంబుకోరుటచే ధూర్తవిప్రుండు పరాభవింపఁబడెనని కొందఱును పలుకఁజొచ్చిరి.

అట్టిసాధ్వీమణిం గూడికొని యల్లాణభూపాలుండు ధర్మంబున బ్రజలం బాలింపుచుఁ గవుల నాదరింపుచు దిగంతవ్యాప్తకీర్తియైయొప్పు చుండెను. భోజునిచే నవమానింపఁబడి కాళిదాసకవి నానాదేశములు దిరుగుచు నొకనాఁ డమ్మహారాజుగారియోలగంబున కరిగి యాత్మీయ తేజంబున కచ్చెరువందుచు సభ్యులు సూచుచుండఁ గుడిహస్తమెత్తి,

శ్లో॥ అల్లాణక్షోణిపాల త్వదహితనగరే సంచరంతీ కిరాతీ
      కీర్ణాన్యాదాయ రత్నాన్యురుతరఖదిరాంగారశంకా కులాంగీ।
      క్షిప్త్వా శ్రీఖండఖండం తదుపరి ముకుళీభూతనేత్రా ధమంతీ
      శ్వాసామోదానుయాతైర్మధుకర నికరైర్ధూమశంకాం బిభర్తి ॥

ఓమహారాజా ! నీచేనోడింపంబడి పారిపోయిన శత్రురాజుల పట్టణమందు సంచరించుచున్న కిరాతకాంతలు అక్కడ్కడ దొరకిన రత్నములను జండ్రనిప్పులనుకొని ప్రోగుచేసి వానిపై మంచిగంథపు సమిథలవైచి కన్నులమూసికొని యూదుచుండఁగాఁ దదీయశ్వాసానిలముల కావరించుచున్న తుమ్మెదగుంపులనుజూచి యూదగా రాదుచున్న పొగయని భ్రాంతిపడుచుందురు. లోకోత్తరమైన యాశ్లోకమును విని యల్లాణుండు విస్మయము చెందుచు నక్కవిం గౌఁగిలించికొని మహాత్మా! నీపేరేమి ? నన్నుఁ గృతార్థుంజేయ నరుదెంచిన నీకులశీలనామాదు లెఱింగింపుమని ప్రార్థించినఁ దనపేరు కాళిదాసనియు భోజునియాస్థానమున నుండువాఁడననియు దేశములు సూడ బయలువెడలితిననియుం జెప్పెను. అల్లాణుండు నిటలతఘటితాంజలిపుటుండై కవీంద్రా! మహేశ్వరపదాంభోజప్రియుండవగు నీప్రఖ్యాతి యిదివఱకే మాకు శ్రోత్రామృతమైయున్నది. మదీయపురాకృతసుకృతవిశేషంబునంజేసి నీవునాకడ కరుచితివి. నేను గృతార్థుండ నైతి. నాసింహాసన మధిష్టించి నీ వీరాజ్యము పాలించుకొనుము. నీకు దాసుండనై పరిచర్య గావింతునని ప్రార్థించినఁ గాళిదాసు బ్రాహ్మణులకు రాజ్యమేల ? మఱియు భార్యాపుత్రహీ నుండ నే నేమిసేసికొందును? ఊరక వసించెద నన్నవస్త్రము లిచ్చినం జాలునని పలుకుటయు నతండు సంతసించుచు నతని కొకదివ్యభనము గట్టి యిప్పించి తనతోసమానమగు గౌరవముతోఁ జూచుచు విద్యావినోదములతోఁ గాలక్షేపము సేయుచుండెను.

సర్కస్సుకథ.

అళ్లాణభూపతి సకలవిద్యాపరీక్షకుఁడను వాడుక యున్నది. ఒకనాఁ డమ్మహారాజు పేరోలగమున్న సమయంబున సింహశార్దూలాది క్రూరమృగంబులు కుక్కలవలె వెంటనంటి రా భైరవుండను తాంత్రికుఁ డరుదెంచి నృపతికి మ్రొక్కుచు దేవా ! నేను మృగము చేఁ బరిజనుల చేతంబోలె నద్భుతవినోదకార్యంబులఁ జేయించెద. గొప్పగొప్పసంస్థానముల కరిగి నాయాటఁ జూపి పెక్కుబిరుదముల నందియుంటిని. ఆటకు సెలవీయుఁడు. మీవలనఁగూడ ననంతపారితోషికము లందఁగలనని ధైర్యముగాఁ బలికిన నయ్యొడయఁ డంగీకరించి నాఁటిరాత్రియే కాళిదా సాదిమహాకవులతోఁగూడికొని పురబాహ్యోద్యానవనంబున నమరింపఁబడియున్న డేరాలోనికిం జని యావినోదము సూచుచుండెను.

సీ. గొఱ్ఱెవీపున మేటిగుదెగాఁగ రెండుదూ
                 లములు వైచి తదంతరమున నొక్క
    యేనుఁగ నెక్కించి దానిపై రెండుసిం
                 గముల నిల్పి తదగ్రకాయములను
    జేర దూలమువైచి శ్రేణిగా దానిపైఁ
                 బులుల నావులను దుప్పులను నిల్పి
    తచ్ఛిరంబులఁ బెద్దదారువు ఘటియించి
                యుష్ట్రత్రయం బందు నొదుగనిల్పి

గీ. వానిచరమాంగముల వలమైనరెండు
   దూలములువైచి యందుఁ గోతులను మహిష
   ములను భల్లూకములను వర్తులముగాఁగ
   నిలిపి నాట్యము సేయించె లలితఫణితి.

ఆవ్యూహచమత్కారము చూచి విస్మయముచెందుచు నల్లాణుండు ప్రక్కనున్న కాళిదాసకవిం జూచి,

శ్లో॥ కవీంద్ర ! పశ్య మేపోయ మల్పసారోపి ధైర్యయుక్ ।
     వహ త్య శేషజంతూనాం భారంమేరురినాఖిలం॥

కవీంద్రా ! ఈగొఱ్ఱె స్వల్పబలముగలదైనను లోకముల మేరువు పర్వతము ధరించినట్లు ఈమృగముల బరువంతయు మోయుచున్నది. చూచితివా? అనిపలికినవిని కాళిదాసకవి యీక్రిందిశ్లోకమును జదివెను.

శ్లో॥ కిమేషో మేషోయత్సకలమృగ భారంవహతిత
     ద్విచిత్రం త్రైలోక్య స్థిరతర ధురంధారణ పటోః।
     మహారాజశ్రీమన్మకుటతట భాస్వద్వరమణీ
     ప్రభారాజత్పాదాంబుజయుగళ ధారాపురపతెః॥

త్రిభువనభారవాహకుండైన భోజునకు నీమృగములభారము వహించుట యొకచిత్రమా? అనిచెప్పుటయు నళ్ళాణుండు వెఱగుపాటుతోఁ గవీంద్రా ! ఈమేషము ధారానగరాధీశ్వరుండని పలికితివేల ? అమ్మహారాజు శప్తుండయ్యెనా యేమి ? నిజముచెప్పుము. అనుటయు నక్కవిశేఖరుం డది నాకునుందెలియదు. దైవికముగా మీరడిగిన ప్రశ్నమున కట్టిసమాధానము నానోటినుండి యప్రయత్నముగా వచ్చినది. అనిచెప్పుటయు నాజనవల్లభుం డంతటితో నాయాట జాలింపుమని యాజ్ఞాపించి యేకాంతముగా వానిఁ దనయంతికమునకు రప్పించుకొని యీ మృగములన్నియు నెక్కడసంపాదించితివి? ఈసాధనము లెట్లు నేర్చితివి? అనియడిగిన భైరవుండు వీనినెల్లఁ బిల్లలుగానున్నప్పుడు సంపాదించి యాట నేర్పుచుందునని యేమేమో బొంకెను.

వలసినంతద్రవ్య మిప్పించెద నాగొఱ్ఱెను మాకిత్తువా? అనియడిగిన నాబ్రతుకంతయు దానితోనున్నది. ఇయ్యఁజాలనని వాఁ డుత్తరము చెప్పెను. ఆవిషయమై వారిరువురకుఁ బెద్దసంవాదము జరిగినది. భైరవుఁడు రాజును వంచించుతలంపుతో నట్లేయిత్తుననిచెప్పి కొన్ని కానుక లంది యఱేయి వేకువజామున నొరులెఱుఁగకుండఁ బ్రయాణమగుచుండ రాజకింకరులు వోయి యూటంకపఱచి బలవంతమున నాగొఱ్ఱెను లాగికొనివచ్చి రాజున కర్పించిరి.

కాళిదాసకవి యాగొఱ్ఱెయొద్దకుఁబోయి దువ్వుచు మహారాజా! సత్కవికల్పభూజా ! నీవిట్లు మేషమవై పోయితివేమి ? నిన్నేవ్వ రిట్లు కావించిరి ? భూభారం బెవ్వరిపైఁ బెట్టివచ్చితివి ? అటఁ గవుల కాధార మెవ్వరు ? ఏదోయనినంతమాత్రముననే యందునిలువక విశ్వాసము లేక చిరకాలస్నేహము గణింపక లేచివచ్చిన యీకపటమిత్రునిఁ జూడ వచ్చితివా ? తండ్రీ! నీ వజాతశత్రుండవే ని న్నెవ్వరిట్లువంచించిరి? వదాన్యా ! నన్నుఁజూడక రెండుగడియలు నిలువలేకుండువాఁడ విప్పు డెట్లు

మెలంగుచుంటివి బాబూ ! అని దానిపైఁబడి యూరక దుఃఖించు చుండెను.

మఱియు మెడం దడుముచు మోము మూర్కొనుచుఁ జెవుల దువ్వుచు మెడ గోకుచు నిమిరినిమిరి దానిమెడలోఁగట్టిన తాయెత్తు నంటి చూచి లాగి పారవై చెను. అప్పు డామేష మదృశ్యమై భోజుండై నిలు నిలు మూర్ఖా! యెందుఁబోయెదవు.? నీపీచ మడంచెదఁ జూడుమని పలుకుచు నలుమూలలు సూచి యెదుటఁ గాళిదాసకవిం గాంచి పులకాంచితశరీరుడై ఓహోహో ! యీతఁడు నాపాణమిత్రుఁడు కాళిదాసకవియే ! ఆహా ! నేఁ డెంతభాగ్యము ? నే నిక్కడి కెట్లువచ్చితిని ? ఘోటకముఖుఁ డేడీ ! మహాత్మా! రక్షింపుము. నాయపరాధము సైరింపుము. అని యాతనిపాదంబులఁ బడియెను.

అప్పుడు కాళిదాసకవి యతని లేవనెత్తి కౌఁగిలించుకొనుచు నరేంద్రా ! అని కన్నీరుగార్చుచు డగ్గుత్తికతో,

శ్లో॥ స్నేహెూహి వర మఘటితో నవరం సంజాత విఘటితస్నేహః।
     హృతనయనోహి విషాదీ నవిషాదీభవతి జాత్యంధః॥

స్నేహముకలిసి విడుచుటకంటెఁ గలియకుండుటయే శ్రేష్ఠము! నడుమఁ గన్నులుపోయినవాఁడు చాలవిచారించును. జాత్యంథున కేచింతయు నుండదు. మహారాజా! నీ వీతాంత్రికునిచేతిలోఁ జిక్కితివేమి ? నీవృత్తాంత మెఱింగింపుమని యడిగిన భోజుండునాకిది దిగ్భ్రమగానున్నది. ఇది యేదేశము? ఇది యేకశిలానగరముకాదా? అల్లాణభూపతియేకాఁడా దీనిం బాలించువాఁడు? మహాత్మా! నీ విందుంటివని విని పురందరపురము నుండి వచ్చుచుండ దారిలో మృగసమూహంబు సేవింప నెందేనింబోవుచున్న భైరవుండను తాంత్రికుండు మాకుఁ గనంబడియెను. వాఁడు స్త్రీలఁ జెఱవెట్టుచున్నాడని విని వాని శిక్షింపందలంచి తిరుగుచుంటిమి కావున వాఁడు గనంబడినతోడనే కోప మాగినదికాదు. పాపాత్మా ! నిలు నిలు, నీపీచ మడంచెద; లీలావతి నెందుదాచితివో చెప్పుమని యదలించుచు నడ్డముగా నిలువంబడితిని ఘోటకముఖుండు నడుముగట్టుకొని నాతో నిలువంబడి వాని మందలింపు చుండెను. దండధరుండనై యున్న నన్నుఁజూచి మృగములు పారిపోవఁజూచెను. అంతలో వానిపరిజనులు మూఁగికొని మాతోఁ గలియఁబడుటకు నాయత్తపడిరి. చేత నాయుధము లేకున్నను వెఱవక మేమిరువురము వెనుకకు మఱలక చేతనున్న కఱ్ఱలతో వారి నాపితిమి.

ఆతాంత్రికుఁ డెఱ్ఱనిగుడ్లతో నన్నుఁజూచుచు నేదియో పసరు నామీఁదఁ జల్లి నాకు స్మృతిలేకుండఁ జేసెను. అంతవట్టు జ్ఞాపకమున్నది. తరువాత నేమిజరిగినదియో నాకుఁదెలియదు. నామిత్రుఁడు నాపాటుజూచి చేయునదిలేక పారిపోయియుండును. ఇదియే నావృత్తాంతమని చెప్పిన విని కాళిదాసు కన్నీరుగ్రమ్మ వాఁడు గొఱ్ఱెగాఁజేసి యచ్చటికిఁ దీసికొనివచ్చి యాడించినవిధము మొదలగు వృత్తాంతమంతయు నెఱిఁగించెను.

అప్పుడల్లాణుం డుల్లమున సంతోషవిస్మయములు వెల్లివిరియ భోజునిఁ గౌఁగిలించుకొని మహానుభావా ! కవిజనానీతంబులగు భవదీయయశోవిసరంబులు సంతతము మదీయకర్ణ పర్వములు గావింపుచునే యుండెను. కాని దర్శనలాభంబెన్నండును గలుగలేదు. తాంత్రికుం డీ రూపమున నాకు మహోపకార మొనరించెను. మీదర్శనము సేసి నేను గృతార్థుండ నైతిని. కింకరుండఁ బనులకు నియోగింపుము. పట్టభద్రుండవై యీకవిసార్వభౌమునితోఁగూడ నీరాజ్యము పాలింపుమని యత్యంతవినయముతోఁ బ్రార్థించిన భోజుం డిట్లనియె. .

వదాన్యోత్తమా! ఇట్లనుటకు నీకకాక యొరులకు శక్యమా? ఇట్టి వాఁడవగుటచే యీమహాకవి మీకడఁ జేరెను. మిమ్ము రాజ్యముకన్న నధికమైనవస్తు వొండు యాచించుచున్నాను. అది నాకు దయచేయుఁడు. పరమానందభరితుండ నగుదునని యడిగిన నతండు చిఱునగవుతో నీరాజ్యమే మీయధీనమనిన నన్నొండు యాచింపవలసిన వస్తువేమున్నది ? అనుటయు భోజుండు దేవా ! మఱేమియునులేదు. ఈమహాకవిచంద్రుఁడు నాకుఁ బ్రాణము. ఈతని నాకు దయచేయఁ బ్రార్థించుచున్నాను. మీకుఁ బ్రాణదానఫలంబు రాఁగలదని పలికిన నవ్వుచు నళ్లాణుండు,

ఓహో ! ఇదియా మియాశయము. ఇందులకు నాసెలవేమిటికి? మీకు నేను బ్రేష్యుండఁగానే ? మీయభీష్ట మెట్లో యట్లే కావించెద నని వినయవినమితోత్తమాంగుడై పలికెను.

తరువాత భోజుం డంజలిపట్టుకొని కాళిదాసకవితో,

శ్లో॥ గచ్చత స్త్సిష్టతో వాపి జాగ్రతస్స్వప్నతోపివా
     మాభూన్మనఃకదాచిన్మె త్వయావిరహితంక వే॥

ఆర్యా ! నడుచుచున్నప్పుడును గూర్చున్నప్పుడును మేల్కొనునప్పుడును నిద్రబోవునప్పుడును నామనస్సు నీవియోగమును సహింపదు. నాతప్పులన్నియు మన్నించి ధారానగరంబునకు రావలయు. నీవు లేనినగరంబు నేను సొరనొల్లనని వేఁడుకొనియెను. అతండును బ్రేమానుబంధ బంధురములగు నృపతిమాటల కంగీకరించెను.

అల్లాణుండు భోజునకు గొప్పవిందు గావించెను. భోజుండు శుభముహూర్తమునఁ గాళిదాసు నొకపల్లకిపై నెక్కించి తాను పాదచారియై దండిపట్టుకొని నడుచుచు నాపురంబు బయలువెడలెను.

అని యెఱింగించి పిమ్మట నిట్లు చెప్పుచుండె.


___________