కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/162వ మజిలీ

వికీసోర్స్ నుండి

ముల వ్యాకులపెట్టుచున్నాఁడు అని మల్లిక చెప్పినది.

ఆనాలుగుశ్లోకములలో మల్లిక చేసినశ్లోకమే చాల రసవంతముగా నున్నదనితలంచి భోజుండు దాని కక్షరలక్ష లిచ్చుటకు మనంబున నిశ్చయించి యెల్లరు విన మల్లికను బెద్దగాఁ బొగడి మేము కొలఁదిదినములలో ధారానగరము వత్తుమనియు నప్పుడు తిరుగా దర్శనము చేయుదుమని చెప్పి బ్రహ్మదత్తుని యనుజ్ఞపుచ్చుకొని భోజుండు ఘోటకముఖునితోఁగూడఁ బురందరపురమున కరిగెను.

బ్రహ్మదత్తుండు కుటుంబముతో ధారానగరంబునకుఁ బోయెను. అని యెఱింగించి యవ్వలికథ మఱల నిట్లు చెప్పదొడంగెను.

162 వ మజిలీ.

−♦ పురందరపురము. ♦−

పురందరనగరాధీశ్వరుండగు హిరణ్యగర్భుండు ధర్మసందేహమొండుతీర్పదలంచికొని సుప్రసిద్ధులగు పండితులను బండితప్రభువులను రమ్మని యాహ్వానపత్రికలు వ్రాయించెను. సభాదివసంబునకు నానా దేశములనుండి రాజులు కవిరాజులు తమతమ బిరుదములతో వచ్చి పురము నిండించిరి. దానంజేసి యాపట్టణ మప్పుడు బహుజనాకీర్ణమై రథహస్తి పత్తిసంకులంబై భేరీపటహవేణువీణాది మంగళవాద్యముఖరితంబై యొప్పుచుండెను.

భోజుండును ఘోటకముఖుండును దైవికముగా నాఁటికే యవ్వీటికిం బోయిరి. వీధులలో జనులు గుంపులుగుంపులుగా మూగికొని సరస్వతిమాటలం జెప్పుకొనుచుండిరి. కొందఱు కుచుమారుని గుఱించి ముచ్చటింపుచుండిరి. ఒకచోటఁ గొందఱు శృంగారపురుషులు సరస్వతీవివాహమును గుఱించి యిట్లు సంభాషించిరి.

ఒకఁడు - నేఁటితో నేదోయొకటి తేలఁగలదు. అతండు జామాతయో ప్రేతయో కాఁగలఁదు. వే̃ఱొకఁడు - అతండు కుచుమారుఁడు కాడని యెవ్వరు నిర్థారణచేయఁగలరు?

ఒకఁడు – నిర్ధాణకొఱకు కాదే యీసభజరగుచున్నది.

ఇంకొకఁడు - గొప్ప గొప్ప మహారాజులు విద్వాంసులు చాల మంది వచ్చిరి. తిరిగి పరీక్షించుట కొడంబడి విజయమందినచో జామాతయే లేనిచో ప్రేతయే యగును.

ఒకఁడు - అఱువదినాలుగువిద్యలయందుఁ బరిచయము గలిగిన భోజమహారాజు సరస్వతియపరావ తారమైన కాళిదాసకవితో వచ్చి యీసభాధిపత్యము వహించునఁట. నిజము తేలకుండునా ?

మఱియొకఁడు — ఏమీ? భోజమహారాజే అగ్రాసనాధిపతి ? కాళిదాసకవికూడ వచ్చునా ? ఆహా ! ఆమహాసభ చూడవలసినదే. చోటు దొరకదేమో ముందుగాఁ బోవలయును.

ఇంకొకఁడు — చోటా ? భూమండలమందలి జనులందఱు వచ్చినను సరిపడును. మహారాజుగారు మంచియేర్పాటు చేయించిరి. ఆసభాభవనము మనపట్టణమంత యున్నది. ఎందుగూర్చుండినను సమముగాఁ గనంబడును.

మఱియొకఁడు. -భోజుఁడును గాళిదాసకవియు వచ్చినచో నీపాటికిఁ దత్ప్రభ పట్టణమంతయు వ్యాపింపకుండునా? ఆమాట యెవ్వరును జెప్పుకొనుటలేదేమి ?

ఒకఁడు వారు సభాసమయమునాఁటికిఁ దిన్నగా సభకే వత్తురు. ముందుగా వచ్చి కూర్చుందురా యేమి?

మఱియొకఁడు - ఎట్లైనను ముందుగాఁబోయి యామహనీయుల దర్శనముసేసి కృతార్థులమగుదుముగాక.

ఒఁకడు -- ఇందలి నిజ మేమనియెదరు ? ఈరాజపుత్రిక విభూతిరాయనిఁ బతిగాఁ బడయ నిష్టములేక యట్లనుచున్నదేమో? స్త్రీలచేష్టి తముల నెవ్వఁడు గ్రహింపఁగలడు ?

మఱియొకఁడు - నిజముగాఁ గాళిదాసేవచ్చినచో నిజము బయల్పడకపోవునా? ఆమహాకవిని గుఱించి యనేకకథలు చెప్పుకొనుచుందురు. ఈకుచుమారునిమూలమున నాపుణ్యపురుషుల దర్శనము కలుగు చున్నదిగదా !

అని మాటలాడుకొనుచు నాపురుషులు నిష్క్రమించిరి. వారి మాటలు విని భోజుండు ఆహా ! మహానుభావుఁడగు కాళిదాసునిమూలమున నాపేరుగూడ వాడుక పడినది. అట్టియుత్తముని నవమానపఱచిన నాపాపమునకు నిష్కృతి గలదా ? అందులకే యిట్లిడుములం గుడుచుచున్నాను. ఇఁక గాళిదాసకవి యుండు నెల వరయవలయునని యాలోచించుకొనుచు ఘోటకముఖుంజూచి ఆర్యా ! నీ వాపురుషులతో నేదియో మాటలాడుచుంటివి. విశేషము లేమైనం దెలిసినవియా? అని యడిగిన నతం డిట్లనియె.

కుచుమారుండు నామిత్రుఁడని మీ కెఱింగించితినికదా? అతం డఱువదినాలుగువిద్యలు వచ్చినప్రోడ సరస్వతి నతఁడే జయించెను. చిలుకచేత వాదము చేయించెనఁట. ఆవిద్య మాకుఁగాక యొరులకు రాదు. అతం డేమయ్యనో తెలియదు. మఱియొకఁడువచ్చి నేనే కుచుమారుండనని చెప్పుచున్నాఁడఁట. అఱువదినాలుగువిద్యలు భోజునకు వచ్చునని కాళిదాసకవితోఁగూడ రమ్మని వార్తల నంపిరఁట, వారు వత్తురఁట. ఆవింత మనముగూడఁ జూడవలసినదే. ఆమాటలే వారు నాతోఁ జెప్పు చున్నారని పలికెను.

భోజుండు విషాదమేదురహృదయుండై వా రెక్కడవత్తురు ? వీరికంటె వారు గొప్పవారా ఏమి ? అదియట్లుండె మీరుకూడ పండితులేకదా ? ధర్మనిర్ణయము సేయునప్పుడు మీరును గొంతభారము వహింపవలసినదే. పోవుదము పదుఁడు అని ప్రబోధించెను.

అని వారిద్దఱు ముచ్చటించుకొనుచుఁ బట్టణవిశేషములఁ జూచి కొనుచు సభజేయుసమయము దెలిసికొని సభాకార్యదర్శియొద్దకుఁ బోయి పండితులమని చెప్పి యనుమతిపత్రికలం దీసికొని (టిక్కెట్టు) ముందుగనే సభకుఁ బోయి యొకచోటఁ గూర్చుండిరి.

ఆసభాభవనము సుధర్మవలెఁ గమనీయరత్నవితానకల్పితసోపానములచే విరాజిల్లుచున్నది. క్రమోన్నతమగు పీఠ శ్రేణులచే (గేలరీలు) నొప్పుచు వేలకొలఁదిజనులు కూర్చుండుటకుఁ దావుగలిగియున్నది. క్రమంబున విద్వాంసులు విద్వత్ప్రభువులు పౌరులు ప్రేక్షకులు వేనవేలు వచ్చి సభ నలంకరించిరి. సభాభవనమంతయు జనులచే నిండింపఁబడి చిత్రితంబో యన నిశ్శబ్దంబై యుండెను.

అప్పుడు సరస్వతితండ్రియగు హిరణ్యగర్భుండు సమున్నతవిశాలంబగు నగ్రవేదికపై నిలువంబడి యెల్లరు విన నుచ్చస్వరంబున నిట్లుపన్యశించెను. సభ్యులారా ! నాకొక ధర్మసందేహము గలిగి దానిం దీర్చుకొనుటకై మిమ్మునెల్ల రావించితిని. నాయందు దయయుంచి మీరెల్ల విచ్చేసినందులకు మీయెడ నేను గృతజ్ఞుఁడ నయ్యెద. మఱియుఁ జతుష్టష్టికళావిశారదుఁడగు భోజమహారాజుగారి నీసభాధ్యక్షునిగాఁ జేయఁదలంచి వారికి వర్తమానము సేసితిని. వారు గ్రామాంతర మరిగినట్లు వార్తవచ్చినది. కాళిదాసమహాకవియు నిప్పు డాభోజునియాస్థానమున లేఁడనియు నల్లాణభూపతియొద్ద నున్నాఁడని తెలియవచ్చుటచే నక్కడికి దూతలం బుచ్చితిని. ఆమహాకవి రాఁజాలనని తెలియపఱచెను. ఇప్పు డీసభాధ్యక్షు నెన్నుకొనవలసియున్నది. అందులకు సమర్ధుఁ డెవ్వఁడో తెలియదు. సభాసదులే యట్టిసమర్థుని నిరూపింపవలయును. అతండు సెప్పినట్లు నడుచుకొనువారమని పలికి యొకపీఠంబునఁ గూర్చుండెను.

అప్పుడు కొందఱు విద్వాంసులు లేచి అయ్యా ! గోనర్దీయుండను మహారాజు గొప్పవిద్వాంసుఁడు. అఱువదినాలుగువిద్యలు నేర్చిన ప్రోడ. భోజునికన్న నధికుండు. ఆక్షితిపతిని సభాధ్యక్షునిగాఁ జేయుఁడని చెప్పిరి. మఱికొందఱు మఱియొకనిఁ బేర్కొనిరి. అప్పుడు భోజుఁడు లేచి దక్షిణహస్త మెత్తి మహారాజా ! ధర్మసందేహమును గుఱించి వితర్క,మువచ్చినప్పు డెఱిఁగినమాట చెప్పకతీఱదుకదా ? ఘోటకముఖుండను మహాపండితుండు వచ్చియున్నవాఁడు. చతుష్టష్టికళా పాండిత్యము గలిగి యున్న వాఁ డాతఁడే సభాపతిత్వమున కర్హుండని పెద్దకేక పెట్టెను.

హిరణ్యగర్భుండు వారివారిమాటలు విని సభ్యులచే నెన్నఁబడిన వారినందఱను ముందరకు రప్పించి వారిలో నధికవిద్వాంసుఁ డెవ్వఁడో వారినే యేరికొనుమని నిరూపించెను. అందు రత్నకిరీటకటకాది భూషణ భూషితుండగు గోనర్దీయుం జూచియు ఘోటకముఖుండు గుఱుతుపట్ట లేదు. గోనర్దీయుఁడు ఘోటకముఖునిగుఱుతుపట్టి ప్రక్కనున్న కుచుమారుని గోకుచు, అదిగో ఘోటకముఖుండు నన్నుఁ దెలిసికొనలేదు వానికే సభాధిపత్యమిప్పింతము ఎట్లుచెప్పునో చూతుముగాక అని మెల్లఁగాఁ బలికెను. ఎవ్వరు నెవ్వరిని నేరుకొనలేదు. అప్పుడు సరస్వతితండ్రి పూజ్యులారా! మీమహిమ మీకకాక యితరులకుఁ దెలియదు. అఱువది నాలుగువిద్యలు నెఱింగినప్రోడగాని యీసభాధిపత్యము వహింప సమర్థుఁడు కాఁడు. కావున నట్టివారెందఱుండిరో చేతు లెత్తవలయునని పలికిన గోనర్దీయుఁడు ఘోటకముఖుండుమాత్రమే చేతులెత్తిరి.

వారిద్దఱిలో నెవ్వని నధ్యక్షునిగాఁ జేయవలయునోయనియాలోచింపుచుండ గోనర్దీయుఁడు ఘోటకముఖుండే సమర్థుండని చేయెత్తి చెప్పెను. ఎల్లరు కరతాళములు వాయించిరి. రాజు లేచివచ్చి ఘోటకముఖునిమెడలోఁ బుష్పమాలికవైచి యగ్రపీఠమునఁ గూర్చుండఁబెట్టెను.

అప్పుడు హిరణ్యగర్భుండు అయ్యా ! వినుఁడు. సరస్వతి నా కూఁతురు. విద్యలలో నామెను జయించినవానికి వివాహముచేయుదునని ప్రకటించితిని. కుచుమారుండను బ్రాహ్మణకుమారుండు వచ్చి చిలుక చేతనే నాకూఁతు నోడించెనఁట. ఆమె వానివిద్యాపాటవమునకు మెచ్చికొని చిలుకచేతనే ముత్యాలహారముపంపి నీవే నాభర్తవని తెలియఁజేసినదఁట. తరువాత నాశుకము మార్జారభక్షితమైన దనిచెప్పి యాతఁడు నేను కుచుమారుండనని ప్రకటించెను. అతఁడు వీఁడుకాఁడని యనుమానముచెంది తిరుగా మఱికొన్ని ప్రశ్నములిచ్చి సమాధానము జెప్పుమని యడిగిన నందుల కితం డొప్పకున్నాఁడు. చిలుకచేతనంపిన ముక్తాదామం బితనియొద్ద నున్నది. కుచుమారుం డతఁడుకాఁడని దాదులు చెప్పుచున్నారు. ఈసందియము మీరే తీర్పవలయునని పలికి రాజు తనపీఠంబునఁ గూరుచుండెను,

అప్పుడు సరస్వతిసఖురా లొకతె నిలువంబడి ఆర్యులారా ! ఈతఁడు చిలుకచేతఁ బ్రసంగింపఁజేసిన కుచుమారుఁడు కాఁడు. ఆతని నేను జూచితిని. వానిరూపలక్షణములు మనోహరములుగా నున్నవి. ఈతఁడే యాతఁడైనచోఁ దిరుగాఁ బ్రశ్నల నడుగ నేమిటికిఁజెప్పకుండెడిని ? మే మిచ్చినప్రశ్నములకు సమాధానము చెప్పించిన నీతని మన్నింతుము. లేకున్న శిక్షింపఁజేయుదు మిదియే మారాజపుత్రిక యభిప్రాయమని చెప్పినది.

తరువాత సభాపతి నీవేమి చెప్పెదవని కపటకుచుమారు నడిగెను. వాఁడు లేచి నిలువంబడి గద్గదస్వరముతో నిట్లనియె. నేను జిలుకకు నావిద్యలన్నియు నుపదేశించితిని. తన్మూలమున సరస్వతి నోడించితిని. దైవికముగా నాచిలుక పిల్లిచేఁ జంపఁబడినది ఆమె నీవే నాభర్తవని యీహారము నాకుఁ బంపినది. గడియగడియకుఁ బరీక్షింపుచుండ నుత్తరము చెప్పుటకు నా కవసరములేదు. వాదమున జయమో యపజయమో యొకసారిగాక పలుమారు గలుగునా? ఇఁక పదింబదిగఁ జెప్పనవసరము లేదు. వారు ప్రకటించినరీతిగా నాసరస్వతి నోడించితిని ఇష్టముండిన బెండ్లిచేయుమనుఁడు లేకుండిన నాకనుమతి నిప్పింపుఁడు నాదారిని నేను బోయెద. తిరుగాఁ బ్రసంగించుట కొడంబడను. ఇదియే నేను జెప్పునది. అని పలికి యూరకుండెను.

సభాపతి — (నవ్వుచు) కుచుమారునిచే నోడింపఁబడితిని. ఈతఁ డాతఁడు కాఁడని రాజపుత్రిక చెప్పుచున్నది. ఇందుల కేమందువు ? కుచు - అది యిష్టములేనిమాట. కానని యామె యెట్లు నిదర్శనము చూపఁగలదు?

సభాపతి -- నీవు తిరుగాఁ బ్రసంగించుట కొండంబడనికారణము చేత.

కుచు -- అది నా కవమానకరమని మానివేసితిని.

సభ - ఆమాట యేమియు సమంజసముగా లేదు. ప్రసంగాధిక్యంబున విద్యలకు మెఱుఁగువచ్చునుగాని త్రుప్పుపట్టనేరదు. పోనీ యామెగాదు మే మడిగెదము సమాధానము చెప్పెదవా ?

కుచు - నే నెవ్వరికినిఁ జెప్పఁదలఁచుకొనలేదు. (సభాసదులందఱు పక పక నవ్వుచున్నారు.)

సభాపతి -- నీవు చదివినవిద్యలన్నియుఁ జిలుక కుపదేశించుటచే మఱపుజెందితివేమో యాలోచించుకొని చెప్పుము.

కుచు - ఆమాటయు వాస్తవమే.

సభ - పోనీ, నీకుఁ గుచుమారుండని పేరున్నట్లు మీగ్రామస్థులచేఁ జెప్పించెదవా?

కుచు - చిత్తము. చెప్పింపగలను

సభా - ఆగ్రామ మేదియో చెప్పుమిప్పుడే వారినిందు రప్పింతును.

అనుటయు వాఁ డేమియుఁ జెప్పలేక తబ్బిబ్బుపడఁజొచ్చెను. అప్పుడు సభాపతి లేచి యిట్లుపన్యసించెను.

శ్లో॥ ఆబద్ధకృత్రిమసటాజటి లాంసభిత్తి
      రారోపితో యదిపదం మృగవైరిణ శ్శ్వా।
      మత్తేభకుంభతటపాటన లంపటస్య
      నాదం కరిష్యతి కథం హరియూధపస్య॥

కుక్కకు కృత్రిమకేసరములుగట్టి సింహవేషమువైచి సింహంబు గూర్చుండుస్థానమునఁ గూర్చుండబెట్టినంత, మదపుటేనుఁగుల గండస్థలముల వ్రక్కలుచేయు సామర్థ్యముగల సింహముగర్జించునట్లు గర్జింపఁ గలదా? వినుండు. ఈతఁడు కుచుమారుఁడు కాఁడు. కుక్క కును సింహమునకు నెంతతారతమ్యము గలదో వీనికిఁ గుచుమారునికి నంతతారతమ్యము గలదు. కుచుమారుఁడు మహాపండితుఁడు. నే నెఱుఁగుదు, అతండు నామిత్రుఁడు వానిపేరు వినియే నే నిందు వచ్చితిని. మే మేడ్వురము సహాధ్యాయులము. కాశీలో నొక్కగురువునొద్ద జదివికొంటిమి. (శుకసారికాప్రలాపనం) అనువిద్య మాకుఁగాక యొరులకుఁ దెలియదు. నామిత్రుఁడే రాజపుత్రిక నోడించినమాట వాస్తవము. వీని కీయౌన్నత్వంబు గలుగఁజేయుతలంపుతో నాతఁడు మఱుగుపడి వీని నిట్లుచెప్పుటకుఁ బ్రోత్సహించెనని తలంచెదను. వాని కీయైశ్వర్య మొకలెక్కలోనిది కాదు. వీఁడు వట్టిశుంఠ వీనికడ నేమియు సంస్కారము లేనియట్లు వీనిమాటలే చెప్పుచున్నవి. రాజపుత్రిక బుద్ధిమంతురాలు కావున నిజముగ్రహించి యొడంబడకున్న ది. ఆవిద్వాంసురా లీమూడునిం బెండ్లియాడుట సమంజసముకానేరదు. కుచుమారుఁడే తగినవాఁడు. వాని వెదకి తెప్పించుట యుక్తము. వీఁడు కుచుమారుఁడు కాఁడు కాఁడు అని ముమ్మారు పలికి కూర్చుండెను. అప్పుడు సభ్యులెల్లరు నతని వక్తృత్వ మగ్గించుచుఁ గరతాళములు గొట్టిరి.

తరువాతఁ గోనర్దీయుఁడు లేచి సభ్యులారా ! సభాధ్యక్షుఁడు నిజముదెలిసికొనియెను. సత్యము చెప్పెను. వీఁడు గుచుమారుఁడు కాఁడు మిత్రద్రోహి, కృతఘ్నుండు. మహాపాపాత్ముఁడు. యథార్థము చెప్పెద వినుండు. వీఁడు కుచుమారునితో వంటజేయుటకై వచ్చిన బానిసవాఁడు. వీనిపేరు శంబరుఁడు. ఈదుర్మార్గుఁడు సరస్వతి తన్నుఁ బెండ్లియాడునని యాసజెంది నిద్రించుచుండఁ గుచుమారునితలఁ బెద్దశిలచే నలియఁ గొట్టి కందకములోఁ బారవైచెను అని పలికి కన్నుల నశ్రువులు గ్రమ్మ! గంఠము డగ్గుత్తికబడ సవరించుకొనుచున్నంత ఘోటకముఖుండు ఆఁ! ఏమీ? నామిత్రుండు కుచుమారుఁడు మృతుండయ్యెనా? హా మిత్రమా ! హా వయస్యా ! అని పెద్దయెలుంగున దుఃఖింపుచుండెను. రాజును సభ్యులు శోకారావములు వెలయింపుచుండ గోనర్దీయుఁడు హస్తసంజ్ఞచే వారించుచుఁ గొంతువు సవరించుకొని వెఱవకుఁడు. వెఱవకుఁడు. కుచుమారుండు బ్రతికియేయున్నవాఁడు. వినుండు. దైవికముగా నాఁడు పల్లెవాండ్రు వలవైచి వానిం బైకిదీసి తమపల్లెకుఁ దీసికొనిపోయి కాపాడిరి

తరువాతఁ గొన్ని నెలల కతండు చక్కఁబడి యొక రేవులో నావికాధిపతియైయుండఁ గుచుమారుని వివాహవార్త బ్రాహ్మణులు చెప్పిన విని పరివారముతో నే నిందువచ్చుచు దారిలో నతనిం గలిసికొని యథార్థము దెలిసికొని పరితపించుచు నాతనితోఁగూడ నిందువచ్చితిని. ఆపురుషసింహుఁ డీసభలోనే యున్నవాడు. అని తనప్రక్కనున్న కుచుమారుం జూపుచు,

మ. ఇతఁడే నిర్మలశేముషీవిజితవాగీశుండు నానాకళా
     ద్భుతపాండిత్యవిశేషసంభృతయశస్త్సోమావృతాశాంతుఁ డూ
     ర్జితవిద్వజ్జనవందితాంఘ్రియుగుఁ డుర్వీదేవుఁ డాకారని
     ర్జితమారుం డగు కుచుమారుఁడు గుమారీదత్తహారుం డిలన్.

సీ. అఱువదినాల్గువిద్యలు నాఱుశాస్త్రంబు
                లును సొంతముగఁ బఠించినఘనుండు
    సిద్ధాస్థిలబ్ధవశిత్వమహత్వాప్తి
                తనవిద్య మెఱుఁగువెట్టినతపస్వి
    వరకళాజితసరస్వతి సరస్వతి వార్త
                విని ప్రసంగింపవచ్చినసుబుద్ధి
    చిలుకచేతనె కళల్ పలికించి నెఱిమించు
               కలికి మెప్పించినలలితమూర్తి

గీ. శంబరునిద్రోహమునఁ జచ్చి శబరకరుణ
    మఱల బ్రదికిన విప్రకుమారుఁ డంగ
    జితసుమారుఁడు కుచుమారుఁ డితఁడెసుండి !
    అరి గురుద్రోహి శంబరుఁ డతఁడుసుండి !

అని చదివినంత సభ్యులెల్లరు లేచి నిలువంబడి ఆమహానుభావుఁ డేడీ ! కుచుమారుఁ డేడీ ! అని కలకలము చేయమొదలుపెట్టిరి. కొందఱతనిపైఁ బుష్పములు జల్లిరి. హిరణ్యగర్భుఁ డాసంకులము వారింపుచు గోనర్దీయుం గౌఁగిలించుకొని మహాత్మా! మీ రెవ్వరో నే నెఱుంగను. మీకు వర్తమానమైనఁ జేయలేదు. ఆపద్భంధువులై వచ్చి నాయిక్కట్టు బాపితిరి. నిజము దెలియఁజేసితిరి. మీకుఁ గృతజ్ఞుండనై యుండెదను. మీకులశీలనామంబు లెఱింగించి నాకు శ్రోత్రపర్వము గావింపుఁడని వేడుకొనియెను. గోనర్దీయుఁ డిట్లనియె.

రాజా ! మే మేడ్వురము సహాధ్యాయులము. కాశిలో నన్ని విద్యలం జదివితిమని చెప్పితినిగదా ? దిగ్విజయముకొఱకుఁ దలయొకదారిం బోయి దేశాటనము చేయుచుంటిమి. ఇందు మువ్వురము వచ్చితిమి. ఈ సభాధ్యక్షుండు ఘోటకముఖుఁ డొకఁడు నేనొకఁడ నీతఁడు కుచుమారుఁడు నీయల్లుఁడని చూపుచుఁ దమవృత్తాంతము కొంత వివరించెను.

హిరణ్యగర్భుండు మారసన్నిభుండగు కుచుమారుం జూచి సంతోషపారావారనిమగ్నుండై యతనిపాదంబులంబడి మహాపురుషా! రాహుగ్రస్తుండైన సూర్యుండువోలె మఱుంగువడి మాపురాకృతవిశేషంబును జేసి యిప్పుడు మా కాలోకోత్సవము గావించితివి. మేము కృతకృత్యుల మైతిమి. నాపుత్రిక మిమ్ము మునుపే వరించినది. రాజ్యలక్ష్మితోఁగూడ సరస్వతిం బరిగ్రహింపుఁడు అని పలుకుచు నొకపుష్పమాల యతనిమెడలో వైచెను. అప్పు డగ్రాసనాధిపతిగానున్న ఘోటకముఖుఁడు సంతోషము పట్టఁజాలక గద్దియ డిగ్గనురికి మిత్రులారా ! వచ్చితిరా! అని పలుకుచు గోసర్దీయునిఁ గుచుమారునిఁ గౌగిలించుకొని యానందబాష్పములచే వారిం తడిపెను. వారును సంతోషముతోఁ బ్రత్యా శ్లేషము గావించిరి. అప్పుడు గోనర్దీయుఁడు వయస్యా ! నిన్ను మేము గుఱుతుపట్టితిమి. నీవు మ మ్మానవాలు పట్టలేకపోతివి. ఈసందేహము గుఱించి నీ వెట్లుచెప్పెదవో యని మేము నీతో మాట్లాడలేదు. నిజము గ్రహించి చెప్పితివి. మనకుచుమారుఁడు పునర్జన్మమెత్తెనని యావృత్తాంతము మరల వానితోఁ జెప్పెను. తాను రాజైన తెరంగును సంక్షేపముగాఁ జెప్పి మేమువోలె నీవుగూడ నింకను ధారానగర నురుగ లేదా? దత్తకాదిమిత్రులు మననిమిత్తమై వేచియుందురు. నేను సింహాసన మెక్కి యందుఁ బోవలయునని ప్రయత్నముచేయుచుండ నంతలోఁ గుచుమారుండు సరస్వతిని వివాహమాడుచున్నాఁడనువార్త విని యిందువచ్చితిని. కుచుమారునివివాహ మైనతరువాత మన మందుఁ బోవుదము. ఈరాజ్యములు మనమేడ్వురము సమముగాఁ బంచుకొనవలయును. అని పలికిన విని సంతసించుచు ఘోటకముఖుండు సుఖదుఃఖసములమగు మన కీభేద మేలకల్గెడిని ? మనచారాయణుఁ డొకపండితపుత్రికం బెండ్లియాడి ధారానగరమున కరిగెను. నే నీపాటికి ధారానగర మరుగవలసిన వాఁడనే. ఒకస్నేహితునిభార్య నొకతాంత్రికుఁడు హరించెను. వాని మూలమున దేశాటనము చేయుచుంటిని. ఆమహనీయుని కులశీలనామములు నాకుఁ దెలియవు. ఆతఁడు సెప్పలేదు. నే నడుగలేదు. ఆకూర్చున్నవాఁడే యతఁడని నిరూపించిచెప్పెను. అంతలో భోజుండు వారికడకువచ్చి నమస్కరించుచుఁ దత్పాండిత్యముగుఱించి మిక్కిలి యగ్గించెను.

వారునలువురు జనాంతికముగా మాట్లాడికొనుచుండఁగాఁ గొంతసే పుపలక్షించి హిరణ్యగర్భుండు వారితో నార్యులారా ! కాలాతీతమైనది. చెప్పవలసినమాటలం జెప్పితిరి. చేయవలసినవిధానము తేలినది. నిజము బయలుపఱచితిరి. ఇఁక నీశంబరుని కేమిశిక్షవిధింపవలయునో సభాధ్యక్షుఁడు చెప్పవలసియున్నది. ఆమాట వినుటకు సభ్యులు తొందఱ పడుచున్నారని పలికిన విని ఘోటకముఖుఁడు వెండియుఁ బీఠమెక్కి యెల్లరు విన వీఁడు మిత్రద్రోహి. పాపమునకు వెఱచువాఁడు కాఁడు. ఇట్టి వాఁడుండిన లోకమున కపకారమగును. వీని కుఱిశిక్ష విధించుట యుచితము. వీఁడు తన కేమియుపకారము సేయుదువని కుచుమారు నడిగెనఁట. అతఁడు నామిత్రులతో నాలోచించి నీకుఁ దగినయుపకారము సేసెద నని చెప్పెనఁట. అట్లుచెప్పినను విశ్వాసములేక పరమశాంతమూర్తి విద్యాస్వరూపుని జంప యత్నించిన యీకృతఘ్నుని కరుణింపరాదని పలికెను. సామాజికులెల్ల సది యుచితముచితమని యేకగ్రీవముగాఁ గేకలుపెట్టిరి.

కుచుమారుం డందుల కీయకొనక వీనితలిదండ్రులు చాలమంచివారు. నాకు భోజనముపెట్టి సరస్వతీవృత్తాంతము చెప్పుచు సహాయముగా నా వెంట వీని నంపిరి. జాగ్రత్తగాఁ గాపాడుమని చెప్పిరి. వీఁడు దుర్మార్గుఁడైనను వారింజూచి వీనిని మన్నింపుఁడని వేఁడుకొనుచున్నాను. వారింటగుడిచిన విశ్వాసము నన్నిట్లు చెప్పుటకుఁ బ్రేరేపించుచున్నది. ఏమిచేయుటకును మనము కర్తలముకాము. భగవంతుఁ డొకనివలన భయము గలుగఁజేసి మఱియొకనివలన నాభయము పోఁగొట్టుచుండును. అని యుక్తియుక్తముగా నుపన్యసించి వాని శిక్షింపకుండఁ గాపాడెను. ఆతని కృపాళుత్వ మెల్లరు స్తుతియించిరి. అంతటితో సభముగించి హిరణ్య గర్భండు కుచుమార గోనర్దీయ ఘోటకముఖ భోజులకుఁ బ్రత్యేకము దనకోటలో విడిదలనియమించి యందుఁ బ్రవేశపెట్టి గౌరవింపుచుండెను.

ఆవృత్తాంతమంతయు సఖురాలివలన విని సరస్వతి మిగుల నా నందించుచు మఱియొకచిలుకను విద్యలుగఱపుమని చెలికత్తెచేతికిచ్చి కుచుమారునొద్ద కనిపినది. కుచుమారుం డాకీరమును దువ్వుచు నస్తిమాలఁదగిలించి నవ్వుమాటలగా దానికి విద్యల నుపదేశించి పంపెను.

ఆచిలుక వెనుకటిచిలుకకన్నఁ బ్రౌఢముగా సరస్వతితోఁ బ్రసంగించి యోటుపఱచినది. అప్పుడప్పడఁతి ప్రహర్ష సాగరమున మునుఁగుచుఁ దనసంతోషమును బత్రికాముఖముగా నతనికిఁ దెలియఁజేసెను.

హిరణ్యగర్బుండు శుభముహూర్తమున సరస్వతినిఁ గుచుమారునికిచ్చి వివాహము గావించెను. భోజుండు ఘోటకముఖుండును గోనర్దీయుఁడుఁ బెండ్లిపెద్దలై మహోత్సవములఁ బెక్కులు గావింపఁజేసిరి. వేడుకలతో గొన్నిదినములు గడిపి ఘోటకముఖుం డొకనాఁడు కుచుమార గోనర్దీయులతో మిత్రులారా ! మీరిరువురు మహారాజులైరి. మీకతంబున మేము నట్టివారమే యగుదుము. మనమిత్రులు మననిమిత్తమై ధారానగరంబున వేచియుందురు. మీ రందుఁ బోవుఁడు. భైరవుం డేకశిలానగరంబుదెస కరుగుచున్నాఁడని వింటిమి. ఈతండును నేను నందుఁబోయి వానివార్తఁ దెలిసికొని ధారానగరంబున కరుదెంతుము. ఈతఁడు మనకు నెనిమిదవమిత్రుఁడు. తానుగూడ నన్నగరమువచ్చి మనమిత్రులం జూతునని చెప్పుచున్నాఁడు. మనవేడుకలు చూచి చూచి రమ్మనలేక మొగమోటపడుచున్నాఁడు. మే మందుఁబోవుటకు సమ్మతింపుఁడని కోరిన వా రెట్టకే యంగీకరించి రాభోజుండును ఘోటకముఖుండు నటఁగదలి యల్లాణక్షోణిపాలుని పట్టణంబునకుఁ బోయిరి.

అని యెఱింగించి మణిసిద్ధుండు మిగిలినకథ దరువాతిమజిలీ యందుఁ జెప్పదొడంగెను.

163 వ మజిలీ.

అళ్లాణరాజుకథ.

శా. అల్లాణుండను భూమిపాలుఁడు వదాన్యత్వప్రభావంబునన్
     ముల్లోకంబులఁ బేరుపొంది సతతంబున్ శంభుభక్తార్చనా
     సల్లాపంబులఁ ప్రొద్దుపుచ్చుచును సంస్థానంబునం దార్యవి
     ద్వల్లోకంబులు సత్కవుల్ వెలయ నింద్రప్రాభవం బొప్పఁగాన్ .

ఏకశిలానగరంబు రాజధానిగాఁ జేసికొని ధర్మంబునఁ బ్రజలఁ బాలింపుచుండెను. అతనికే భళ్ళానుండను నామాంతరము గలదు. అతఁడు సంతతము మహేశ్వరార్చన సేయుచుండును. సర్వవిద్యాలాలసుండై, కవీంద్రులఁ బండితులఁ బెద్దగా నాదరించును. శిబికర్ణదధీచుల మించినవదాన్యుఁడు నిత్యము పదుగురమహేశ్వరుల నర్చించి యిష్టా పూర్తములచేఁ దృప్తిబొందింపు చుండును. ఏమహేశ్వరుఁ డేదికోరినను నిచ్చుట వ్రతముగా నియమము సేసికొనియెను.