కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/168వ మజిలీ

వికీసోర్స్ నుండి

168 వ మజిలీ.

ఘోటకముఖుని కథ.

మఱునాఁడుప్రొద్దుట గోనర్దీయ, కుచుమార, గోణికాపుత్ర, సువర్ణనాభ, చారాయణులు మిత్రులేవురును నాయింటిచావడిలోఁ గూర్చుండి దత్తకఘోటకముఖుల రాకనుగుఱించి ముచ్చటించుకొనుచుండఁగాఁ బ్రతీహారి చనుదెంచి దేవా ! ఘోటకముఖుండఁట బ్రాహ్మణుం డొకండు బండిమీఁద నిరువురుస్త్రీలతో వచ్చి వాకిట నిలువంబడియెను. మీదర్శనము సేయఁగోరుచున్నాఁడు. సెల వే మనవుఁడు నైదుగురును దటాలున లేచి మాప్రాణమిత్రుఁ డేఁడీ ? అనిపలుకుచు గుమ్మమునొద్దకుఁ బోయిరి.

అతండు వారింజూచి మోము వికసింప నోహోహో! నేఁటికిఁ గృతకృత్యుండనై తినని పలుకుచు వారిం గౌఁగిలించుకొనియెను. వారును బ్రత్యాశ్లేషము గావించి లోనికిఁ దీసికొనిపోయిరి. అప్పుడు గోణికాపుత్రుఁడు బండిమీఁదనున్న యాఁడువాం డ్రెవ్వరని యడిగిన నయ్యో! వారిమాట మఱచితినే ! వారు రతిమంజరీచిత్రసేనలను వేశ్యాపుత్రికలు. ఔరా ! నీతోఁ గ్రొత్తగాఁ జెప్పుచున్నా నే. అందొకతె దత్తుని భార్య. ఒకతె నీభార్య. పాపము వాండ్రు మనమూలమునఁ జాలయిడుములం గుడిచినారని చెప్పుచుండఁగ నే గోణికాపుత్రుండు ఆఁ ! ఏమేమీ! రతిమంజరీచిత్రసేనలే యని పలుకుచుఁ దటాలున లోనికింబోయి బండిలోనున్నవారిద్దఱం గాంచి తద్దయుంబ్రీతి నబలలారా! వచ్చితిరా ? మీనిమిత్తమై భూమి తలక్రిందు సేయఁదలఁచుకొన్నాము. కానిండు. లోపలికి రండు. మనవారందఱు నిందున్నారని పలికిన నక్కలుకులు కనుఁగొలుకుల నశ్రుజలకళికలు రాల నతనిం జూచుచుఁ హృద్గతంబగు శోకమును వెలిబుచ్చిరి. వారి నూఱడింపుచు గోణికాపుత్రుండు లోపలికిఁ దీసి కొనిపోయి సరస్వతీప్రముఖయువతీమతల్లికలతో వారితెఱం గెఱింగించి పరిచయము గలుగఁజేసెను.

ఆయంతఃపురకాంతలు వారిసోయగము వింతగాఁ జూచుచుఁ దమకుఁగలబంధుత్వము వారికిఁ దెలిపి వారివృత్తాంత మడిగి తెలిసికొని తదీయమనస్థైర్యమున కాశ్చర్యపడఁజొచ్చిరి. కుచుమారుండు ఘోటకముఖుంజూచి వయస్యా! నీవు నాఁ డామిత్రునితోఁ గూడికొని పురందరపురమునుండి యరిగితివిగదా! ఎందెందు సంచరించితివి? ఏమేమివింతలఁ జూచితివి? సవిస్తరముగాఁ జెప్పుము. నీతో వచ్చినపురుషుఁ డెవ్వఁడో తెలిసికొంటివా ? యని యడిగిన ఘోటకముఖుం డిట్లనియె.

మిత్రులారా ! నాతోవచ్చిన పురుషుఁ డెవ్వఁడో నా కిప్పటికిని దెలియదు. ఏకశిలానగరంబున కరుగుచుండ నొకయరణ్యమధ్యంబున భైరవుఁడను తాంత్రికుఁడు మాకుఁ గనంబడియెను. ఆపురుషుని భార్యను హరించినమాయావి వాఁడేయని తెలిసికొని మేము నిలునిలుమని పలుకుచు వాని కడ్డమై యాపితిని. వాఁడు తనపరివారమును గేక పెట్టెను. పదుగురు దుడ్డుకఱ్ఱలుతీసికొని మాపైకి వచ్చిరి. మేము నిరాయుధులమగుట వారికి వెఱచి పారిపోవఁ బ్రయత్నించుచున్న సమయంబున నాక్రూరాత్ముఁ డాపురుషునిఁబట్టికొని నెత్తిపై నేది యోపసరు రుద్దెను. అంతవట్టు చూచితిని. తరువాత నతండు గనంబడలేదు. వాఁడు నామీఁదికి వచ్చునని యటుచూడక డొంకలమాటుగా నవ్వలికిఁ బోయితిని. ఒక కుడుంగముచాటున ఘోటక మొకటి మేయుచుండెను. అది వానిమృగ సంఘమునుండి తప్పించుకొని యందు మేయుచున్నది. దానింజూచి వేఱొకయుపాయము దోఁపక గుఱ్ఱమునెక్కుపాటవము గలదు కావునఁ దటాలున దానిపై కెక్కి కళ్ళెము జీను లేకుండఁగ నేనడిపింపదొడంగితిని. ఆహయంబు రయంబున నందుఁగనంబడినమార్గంబునంబడి పోవఁదొడంగినది. వాఁడు వెనుకనుండి తఱిమికొనివచ్చునని వెఱపుతో మిక్కిలి వేగముగాఁ దోలితిని. అదియుఁ బశ్చిమోత్తరముగాఁ బోయి పోయి యా యడవిలో నొకగుడిసియొద్ద నిలువంబడినది. అప్పటికి జాముప్రొద్దున్నది. నాకు దాహమగుచున్న ది కావున నాకుటీరమునందు మనుష్యు లుందురనితలంచి గుఱ్ఱముదిగి తలుపుదగ్గరకుఁ బోయి లోపల నెవ్వరండో యని యఱచితిని. ప్రతివచనమేమియు వినఁబడలేదు. తలుపునకు బీగములేదు. త్రోసినంతనే తెఱువఁబడినది. లోపలికిఁబోయి నలుమూలలు సూచితిని. ఎవ్వరుఁ గనుబడలేదు. స్వల్పముగా సామాగ్రి యున్నది. తిన్నగాఁ బెరటిలోనికిం బోయితిని. అప్రాంతమందొకనూయి యున్నది. తోడికొనుటకుఁ జేద యున్నది. దానితో నీళ్ళుచేదుకొని యమృతోపమానంబులగు తజ్జలంబులు కడుపునిండఁ ద్రావితిని. తిరుగా లోపలికివచ్చి నలుమూలలు పరికింప నొకగది బీగమువేయఁబడియున్నది. ఇందలివా రెందుఁబోయిరో యని యాలోచించుచు వాకిటకు వచ్చితిని. ఆయశ్వ మందే నిలువంబడి యున్నది. నన్నుఁజూచి సకిలించినది.

అప్పుడు నేను దానిదాపునకుఁబోయి మోము దువ్వుచు లక్షణములు పరిశీలింపుచుండ దానిమెడలో నేదియోతాయెత్తు గనంబడినది. దానింద్రెంపి పారవైచితిని. ఆగంధర్వం బంతలో నదృశ్యమై యొక ముసలమ్మయై నిలువంబడినది. ఆమెం జూచి నేను వెఱఁగుపడుచు, అవ్వా! నీవెవ్వతవు ? ఇట్లు గుఱ్ఱమవై యుంటివేల ? నీవృత్తాంతము సెప్పుమని యడిగిన నాయవ్వ యిట్లనియె.

బాబూ! ఈకుటీరము నాదే. ఈప్రాంతభూమి తృణకాష్టజలసమృద్ధి గలిగియున్నది. మేము సారస్వతబ్రాహ్మణులము. నాభర్తతో నే నీకుటీరమునఁ బెద్దకాలము కాపురముసేసితిని. పశువుల మేపుకొనుచు వ్యవసాయముచేసి జీవించువారము. నాభర్త చనిపోవునప్పటికి నాకొక కూఁతురుగలదు. దానికి మూఁడేండ్లున్నవి. భర్తృమరణానంతరముగూడ నే నీయిల్లువిడువక యిందే కాలక్షేపముసేయుచుంటిని. నాపేరు రాధ యండ్రు. నాపుత్రికపేరు మిత్రవింద. నే నాబాలికను బ్రాణముపోలికఁ జూచుకొనుచు హృదయంబునం బెట్టుకొని కాపాడుచుంటిని. నాకూన మిక్కిలి చక్కనిది. దినదినప్రవర్ధమాన యగుచుఁ బండ్రెండేఁడులప్రాయము వచ్చునప్పటికి మిక్కిలి లావణ్యముగలిగి ప్రకాశింపఁజొచ్చినది.

నాపుత్రికకు యౌవనాంకూరమైనది మొదలు తగినభర్త యెవ్వఁడు దొరకునని యాలోచించుచుంటిని. దైవమే యన్నియుం గూర్చును. కూడినవానిం జెఱచుచుండును. వరాహద్వీపాధిపతి బ్రాహ్మణప్రభువు వేటకై యొక నాఁ డీయడవికి వచ్చెను. గొప్పగాలివాన పట్టినది. బలములన్నియుఁ దలయొకదెసకుఁ జెదరిపోయినవి. ఇంతలోఁ జీకటిపడినది. మెఱపులు మెఱయుచుండెను. ఆవెలుఁగునఁ దడిమికొనుచు నెట్లో యాఱేఁడు మాకుటీరమున కరుదెంచి యెవరయ్యా ! లోపలనని యఱచెను. నా కింకను నిద్రపట్టలేదు. నేను బోయి తలుపుతీసితిని. కట్టిన గుడ్డలన్నియుఁ దడిసినవి. వజవజ వణఁకుచుండెను.

నన్నుఁజూచి యతండు ఆమ్మా ! యీరాత్రి మీయింట వసించి చలిఁ బాపుకొనియెదఁ గొంచెము తావిచ్చెదవా ? అని యడిగెను. రండు రండు నిశ్శంకముగా వసింపుఁడు. అని పలుకుచు నాయొడయని లోనికిఁ దీసికొనిపోయి కట్టుకొనుటకుఁ బొడిగుడ్డలిచ్చి కాచుకొన నిప్పురాజ వైచి వేడినీళ్లు పెట్టి వంటఁజేసి పాలు పెరుఁగు మీగడతోఁ దృప్తిగా భోజనము పెట్టితిని. పండుకొన మంచ మిచ్చితిని.

ఆనృపతి యప్పుడపరిమిత సంతోషము చెందుచు నవ్వా ! నేఁడు నీవు నాకు మంచియుపకారము గావించితివి. ఆజన్మాంతము నిన్ను మఱువను. నీ వొంటిగా నీయరణ్యమధ్యమున నుండనేమిటికి ? నీకుఁ బిల్ల లెందఱు ? నీయుదంత మెఱిగించి నాకు శ్రోత్రానందము గావింపుమని యడిగిన నే నిట్లంటిని అయ్యా ! జన్మభూమి యెంతసంకటమైనదైనను విడువబుద్ధిపుట్టదుకదా ? మా కిక్కడ స్వర్గఖండమువలె నున్న ది. మాకుఁ జాలపశువులు గలవు. వానికిఁ గావలసినంతపచ్చిక యున్నది. మాకుసరిపడిన ధాన్యములు ఫలించును. ఒకరితో మాకుఁ బనిలేదు. నాకు మిత్రవింద యను కూఁతురు గలదు. దానికిఁ బెండ్లిచేయవలసినసమయము వచ్చినది. అనుకూలుఁడగు వరుఁడు దొరకవలయు నిదియే నాకుఁగలిగిన చింత. ఇందులకై మీకు శక్యమైన సహాయముచేయుఁడని పలుకుచు నావృత్తాంతము చెప్పితిని.

ఏదీ ? నీకూఁతురు. ఎన్నియేండ్లున్నవి ? అనియడిగినఁ బండుకొని నిద్రబోవుచున్న ది. యౌవనోదయ మగుచున్నది. చక్కఁదనముగుఱించి నేను జెప్పనవసరములేదు. చూచిన మీకే తెలియఁగలదు. అని పలుకుచు అమ్మాయీ ! మిత్రవిందా ! లేచి యిటురా, అని పిలిచితిని. అది యంతకుముందే లేచి మాసంవాద మాలించుచు నాగదిలోఁ గూర్చున్నది. నామాట విని ఇదిగో వచ్చుచున్నా నని యించుక సిగ్గుదోఁప వచ్చి యొక్క ప్రక్క నిలువంబడినది. దీపమువెలుఁగున దానిసోయగము చూచి యతం డక్కజపడినట్లు నాకుఁదోఁచినది.

బాలా ! పోయి పండుకొనుము. రేపు జూచెదనులే యని పలుకుచు నవ్వా ! నీకూఁతురు మంచిచక్కనిది. మిత్రవిందయేకదా ? యేకృష్ణుఁడో వచ్చి పెండ్లియాడఁగలఁడు, ఇందులకై నీ వాలోచింపవలసినపని లేదని పలుకుచు నతండు నిద్రఁబోయెను. అతని కులశీలనామాదు లేమియు నప్పటికిఁ దెలియవు. మఱునాఁడు సూర్యోదయము కాకపూర్వమే యతని వెదకికొనుచు జతురంగబలములు నాకుటీరము నొద్దకు వచ్చి చక్రధరభూపాలుం డిందువచ్చెనా? అని యడిగిరి.

వారిమాటలచే నతండు ప్రభువని తెలిసికొని విస్మయము జెందుచు వారెవ్వరో నాకుఁ దెలియదు. రాత్రి యొకపురుషుండు జడిగొట్టి యిందువచ్చెను. పండుకొనియున్నవాఁడు ఇంకను లేవలేదు. అని చెప్పితిని. వాండ్రు తొందరపడుచు మహారాజుగా రిందున్నారా? అని యందఱు నందు మూఁగికొనిరి.

అంతలో నతండు లేచెను. నేను మిత్రవిందచేతనే యతని కుపచారములు సేయించితిని. బాబూ ! చెప్పనేల ? నాకూఁతురు చక్కఁదనంబున కతండు వలచి మూఁడుదినము లందుండి కదలఁడయ్యెను. తదీయహావభావవిలాసాదు లతనిహృదయము నాకర్షించినవి. నే నది యెఱింగి యక్కురంగ నయనను సంతత మతనియంతికముననే యుండ నియమించితిని. మిత్రవిందతో సరససల్లాపము లాడుచుఁ జివర కొకనాఁడు మిత్రవిందను దనకుఁ బెండ్లిచేయుమని నాతో సూచించెను. నేను ప్రహర్షసాగరమున మునుఁగుచుఁ బుష్పములతో మిత్రవిందం దీసికొనిపోయి యతనితొడపైఁ గూర్చుండఁ బెట్టితిని. అతండు గాంధర్వవిధి నా వధూరత్నమును స్వీకరించెను. అప్పుడే యప్పడఁతిఁ దనగ్రామమునకుఁ దీసికొనిపోయెను. నేనును దానితోఁబోయి కొన్నిదినము లందుండి వెండియు నింటికివచ్చితిని.

నాకూఁతురు మిత్రవింద వరాహపురంబున భర్తతో స్వర్గసౌఖ్యము లనుభవింపుచుండెను. దానికి జూంబవతి యనుకూతురుమాత్రమే యుదయించినది. అది యట్లుండె న న్నందు రమ్మని యెంతయో నిర్బంధించుచున్నదికాని నా కీభూమి విడిచిపోవ నిష్టములేకున్నది. అప్పుడప్పుడుపోయి చూచి వచ్చుచుందును. ఈనడుమ గడ్డము తలయుంబెంచుకొని జటలతో మహర్షివలె నొప్పుచున్న యొకదుర్మార్గుఁడు పశువులును బక్షులును మృగములును పలురకము లొప్పుచుండ నీయడవిలో నొకనాఁడు బసజేసెను. నే నతనియొద్దకుఁబోయి నమస్కరించుచు మహాత్మా ! ఈ యరణ్యమంతయు నాది. నేను గుత్తకుఁ దీసికొన్నాను. నాకుఁ జాలపశువులు గలవు. మాపచ్చికయంతయు మీపశువులు మేయుచున్నవి. కావున నొకటిరెండుదినములకంటె మీరిందుండఁదగదు. అని వినయముతోఁ బ్రార్థించినఁ గన్నులెఱ్ఱజేయుచు నాజటాధారి నన్నుఁ జూచి యోసీ! అడవి యొకరు పెంచినదికాదు. అందఱకు సమానమగు నధికారము గలిగియున్నది. నాశక్తి యెఱుంగక యిట్టు పలుకుచున్నావు. నే నిందు నాయిష్టమువచ్చినన్నిదినము లుందు వలదనుటకు నీవెవ్వతె వని గద్దించి పలికెను.

అప్పుడు నేను మెల్లఁగా స్వామి ! యీయరణ్యముపై మీ కథికారము గలిగియున్న చో మీపశువులపై మృగములపై నా కధికారము గలిగియున్నదని చెప్పిన మీకుఁ గోపమువచ్చునేమో? భగవత్సృష్టి యందఱకు సమానముగదా? అని ప్రత్యుత్తరమిచ్చి తిని. అప్పు డాయనకు నాపైఁ బెద్దకోపము వచ్చినది. ఏదియో పసరు నానెత్తిపై రుద్ది నన్నొక గుఱ్ఱముగాఁ జేసెను. తరువాతిచర్యలన్నియు స్వప్నప్రాయములుగా నున్నవి. ఇంచుకించుక తెలివితో వానిబారి తప్పించుకొనివచ్చి పారిపోవుదమని ప్రయత్నించుచుండఁగా నింతలో మీరువచ్చి నన్నిక్కడికిఁ దీసికొనివచ్చితిరి. మీకరుణావిశేషంబునంజేసి స్వస్వరూపము గైకొంటి లేనిచో వారువమనై యుండవలసివచ్చును. కృతార్థురాలనైతి నిదియే నావృత్తాంతమని యెఱింగించిన విని నే నాశ్చర్యమందుచు నవ్వా ! వాఁడు మహాపాపాత్ముఁడు. స్త్రీలను జెఱపెట్టుట కించుకయు వెఱవఁడు. ఒక పతివ్రత నట్లే కావించెను. వానినిమిత్తమే తిరుగుచుంటిమి. నామిత్రునిగూడ నిట్లే కావించెనుకాఁబోలు. న న్నవమానించునని మాటునకుఁ బోయితిని నీమూలమున నతనిచేతఁ జిక్కకుండ నిందు రాఁ గలిగితిని. ఆక్రూరుండు ఇంక నెందఱను బరిభవించునో తెలియదు. పాపము నామిత్రుఁడు వాని తాంత్రికమెఱుంగక చిక్కుకొనియెను. శూరుల కెఱింగించి వాని శిక్షింపఁజేసెద. వాని చేష్టలు తెల్లమైనవని పలుకుచు మఱియు నిట్లంటిని. అవ్వా! ! నీయల్లుఁడు రాజుగదా ? నీ వావరాహపురంబున కరిగి యందు సుఖింపక యిం దొంటిగా నుండనేమిటికి ? అని యడిగిన నామె బాబూ ! చెప్పలేదా ? నాపశుబలము జూతువుగాని రమ్ము, నా దొడ్డి యీప్రాంతమందే యున్నది అని పలుకుచు నన్ను వెంటఁబెట్టికొని యచ్చటి కనతిదూరములో నున్న మందలోనికిఁ దీసికొనిపోయినది.

ఆమెంజూచి యందున్న పెద్దపెద్దయావులు దూడలు గిత్తలు అంభారవంబులు గావింపుచు దాపునకువచ్చి యామెను నాకుచు ముట్టెలతోఁ బొడుచుచు వియోగశోకమును వెలిబుచ్చినవి. ఆమెయు వాని నెల్ల గోకుచు ముద్దుపెట్టుకొనుచుఁ గొన్నిటిఁ బేరులుపెట్టి పిలుచుచు దాపునకు రప్పించుకొని కొన్నిటి పొమ్మని పేరులతోఁ జెప్పిన దూరముగాఁ బోయినవి. ఆవింత నాకుఁ జూపుచు నాయవ్వ బాబూ ! ఈ పశుమోహమే నన్నిచ్చటినుండి కదలనీయకున్నది. వీనిఁ బిల్లలగాఁ జూచుకొనుచున్నానని చెప్పినది.

అప్పుడు నేను అవ్వా ! నీమాట సత్యమే. పశుపత్నిసుతాలయములు ఋణానుబంధరూపములని పెద్దలు చెప్పుచుందురు. పోనీ నీయల్లుఁడు భాగ్యవంతుఁడుగదా? ఇం దీగుడిసె దీసి మంచియిల్లు గట్టికొన రోదా ? అని యడిగిన నామె నాచేయిపట్టికొని తన గుడిసెయొద్దకుఁ దీసికొనిపోయి దానిలో నొకమూలఁ జాటుగా నమరింపఁబడియున్న చిన్నతలుపు తీసి నేలసొరంగము జూపినది. దానిలోనికి దిగితిని. ఆహా ! లోపల మిక్కిలి విశాలముగానున్నది. ఇంద్రభవనమువలె విరాజిల్లుచున్నది. వింతవింతవస్తువులు గలవు.

వాని వాని వేఱు వేఱ నిరూపించి చూపుచు నార్యా ! ఇది మహారణ్యప్రదేశ మగుటయు నొంటిగా నుండుటంబట్టి వట్టి పేదదాని వలెఁ గనంబడుదును ఈగుడిసెజూచి నాజోలి కెవ్వరును రారు. నాపశు ధన మెవ్వరు దీసికొనిపోవఁజాలరు. బలవంతమునఁగాని దొంగతనమునఁ గాని దేనినేని తోలికొనిపోయినచో నాపశు వెందున నిలువదు. వెంటనే పారిపోయివచ్చి మందలోఁ గలియును. ఒకయె ద్దొకప్పుడు మూఁడుమాసము లెందోయుండి వచ్చినది. నాయింటనున్న వస్తువులు కుబేరునింట లేవు. నాయల్లు డీవైభవమంతయుఁ జూచినతరువాతనే నాపిల్లను సేసికొనియెను. చాల వింతవస్తువు లాతఁడు తనగ్రామమునకుఁ దీసికొనిపోయెనని చెప్పినది.

ఆపాతాళగేహాలంకారములు చూచి నేను విస్మయము చెందుచు నామెచెప్పినమాటలు విని ఆహా ! అవ్వా! నీవు పైకిఁజూడ వెఱ్ఱిదానివలెఁ గనంబడుచుంటివి. నీవైభవము పెద్దది. నీగుట్టు తెలిసికొని దుర్మార్గులెవ్వరైన బాధింతురేమో? ఈరహస్యము నాకుఁ జెప్పినంజెప్పితివి కాని యితరుల కెన్నఁడును జెప్పరాదుసుమీ? అనవుఁ డాయవ్వ నవ్వుచు నిట్లనియె.

సౌమ్యా ! నీయింగితాకారచేష్టలఁ బరిశీలించి యీగుట్టు చూపితినిగాని యితరులకుఁ జెప్పుదునా నాఁడు మాయల్లుఁడు చక్రధరునకుఁ జూపితిని నేఁడు నీకుఁ జూపితిని. నాఁకూతురుగూడ బాగుగా నెఱుఁగదు. నీవు విద్వాంసుఁడవు చాలమంచివాఁడవని తోఁచినది. నన్ను రక్షించితివి. నీకొక యుపకారము చేయుతలంపుతో నే రహస్యము నివేదించితిని. అని పలుకుచు నాకవాటము మూసి యంతలో వంట జేసి తృప్తిగా భోజనము పెట్టినది. రెండుమూఁడుదినము లందుండి నేను ధాగానగరమునకుఁ బోవలసియున్నది. మఱియు నాతాంత్రికుని శిక్షింపఁజేయవలసి యున్నది. మిత్రులఁగలిసికొని యుపాయ మాలోచించెద. పోయివచ్చెద ననుజ్ఞయిమ్ము, నా కేదియో యుపకారము సేసెదనంటివి.

ధనముతో నాకు నిమిత్తములేదు. మామిత్రులిర్వురు మహారాజులై యున్నవారు. వారిధనమంతయు నాయిచ్చవచ్చినట్లు వాడుకొనవచ్చును. నీయుపచారమునకుఁ జాల సంతోషించితిని. కృతజ్ఞతకు మెప్పువచ్చెనని పలికిన నాయవ్వ యిట్లనియె. మీరు మహావిద్వాంసులు. దేశమే మీధనము. నేను మీకు ధనమిచ్చుదానను గాను. వరాహపుర మిక్కిడికిఁ బదియోజనముల దూరములో నున్నది. ఆదీవికి రెండుయోజనములుమాత్రమే సముద్రము దాటవలసియున్నది. నిన్నక్కడికిఁ దీసికొనిపోయి నీవు సేసినయుపకారము మాయల్లునితోఁ జెప్పి వారికిని మీకును మైత్రి గలుపవలయునని యభిలాషయున్నది. ఇదియే నాతలంపు. నాలుగు దినములలో బోఁగలమని పలికిన విని నేను గ్రొత్తవింతలం జూచుతలుపుగలవాఁడనగుట నామెమాట నంగీకరించి నాఁడే పయనము సాగింపుమని కోరితిని.

అప్పు డామె మందయొద్దకుఁబోయి రెండుదున్నపోతుల వెంటఁ బెట్టుకొనివచ్చినది. వానివీపుపై మెత్తనియాకులుఁ జిగుళ్ళును జీనులాగునఁ గట్టినది. ఒక దానిపైఁ దానెక్కి రెండవదానిపై నన్నెక్కుమన్నది. నాకుఁ బక్కున నవ్వువచ్చినది. అంతకన్న వేఱొకసాధనము లేక పోవుట నట్లుచేయక తప్పినదికాదు. ఆ కొండలలోఁ బాదచారియైపోవుట చాలకష్టమఁట. యముఁడంతటిమహాత్ముఁడు దాని యానసాధనముగాఁ జేసికొనియె. మనమాట లెక్క యేమని దానిపై నెక్కితిని. మిత్రులారా! నే నేమనిచెప్పుదును ? గుఱ్ఱములు నేనుఁగుల నెక్కినప్పుడుగూడ నంత సౌఖ్యము గలుగలేదు.

అవ్వ ముందునడుచుచుండ నేను వెనుకఁ బోవుచుంటిని. కుదుపు కొంచెమైన లేదు. చాలవేగముగా నడుచుచుండెను. ఏమియు నదలింప నవసరములేదు. మెట్ట లెక్కునప్పుడు పూర్వకాయము వంచుచుఁ బల్లమునకుఁ దిగునప్పుడు చరమకాయము వంచుచు మాకేమియు నాయాసము లేకుండ నడుచునవి. మూఁడుదినము లట్లు పయనముసాగించి సముద్రతీరముననున్న యొకపల్లె చేరితిమి. ఆమె యొక పల్లెవానింజీరి వరాహపురంబునకు నోడగట్టుమని నియోగించినది వాఁ డప్పుడే యొకచిన్న ప్రవహణము సన్నాహముసేసి తీసికొనివచ్చెను. మేము పెందలకడ భోజనము చేసి యోడ యెక్కి తిమి. ప్రొద్దుక్రుంకకపూర్వమే యవ్వలియొడ్డు చేరితిని, వెంటనే యొకబండియెక్కి వరాహపురమున కరిగితిమి. ఆనగరము మహోన్నతములగు సౌధములచేతను సమస్తవస్తుపూర్ణ ములగు విఫణి మార్గములచేతను బ్రకాశింపుచున్నది. రాజమార్గంబునఁ బోయిపోయి రాజుగారికోట చేతిమి. ఆయవ్వ నందఱు నెఱింగినవారగుట దౌవారికు లేమియు నాటంకము సెప్పలేదు. కక్ష్యాంతరములు గడిచి తిన్నగా లోపలి భవనమునకుం బోయితిమి. తల్లివచ్చుచున్నదనువార్త విని పుత్రిక మిత్రవింద కొంతదూర మెదురువచ్చినది. ఆమె నన్నుజూచి యించుక తొలఁగిన వలదు వలదు. ఈయన మన కాంతరంగిక బంధువుఁడు. అర్చనీయుఁడు. పాద్యము దెమ్మని పలుకుచు నాయవ్వ కుమారితచేత నా కుపచారములు చేయించినది.

నా కించుకమాటుగా నిలువంబడి మిత్రవింద అమ్మా ! యింత వేగిరము వచ్చితివేమి ? రెండు నెలలవఱకు రావనుకొన్నాము వారెవ్వరు? అనియడిగిన నామె పుత్రికతో భైరవుండు తనయడవికి వచ్చుటయుఁ దన్ను గుఱ్ఱముగాఁ జేయుటయు నేను విడిపించుటయు లోనగువృత్తాంతమంతయు నెఱింగించినది. మిత్రవింద యురముపైఁ జేయి వైచికొనుచు హా! హంత ! యెంతగండము గడిచినది ? నే నేమిచేయుదును. నీవు చెప్పినమాట వినవు. నీ కా యడవిలోనే చావుమూడినది. ఇట్టి యైశ్వర్య మనుభవించుచున్న ను నాబుద్ధికి స్థిమితము లేదు. నీకొఱకే చింతించు చుందును. నిన్ను వాఁడు గుఱ్ఱముగాఁ జేసెనుగాని, చంపిన నేమిచేయుదువు ? వలదనువారెవ్వరు ? ఇప్పుడైన బుద్ధిగలిగి యాకాపుర మెత్తి పెట్టి యిక్కడికి రమ్ము. అని యేమేయో మందలించినది.

అవ్వ పుత్రికమాటలు విని కానిమ్ము. ఏదోయొకటి చేయుదము. నీభర్త యూరనున్నాఁడా? అనియడిగిన పుత్రిక లేరు. వారిమిత్రుఁడు విపులుఁడు వర్తమానముసేయ మహాపురంబున కరిగిరి. ఱేపు రాఁగల రని చెప్పినది. జాంబవతికి వివాహ మెక్కడనైనఁ గుదిరినదియా ? ఈ యేఁడు చేయుతలంపు గలదా? అనియడిగిన నామె యుక్తవయసువచ్చినది. చేయ కేమి ? తగినవరుఁడు కనంబడుటలేదు. పలుచోటులు చూచిరి. విద్యయుండిన రూపములేదు. రూపమున్న విద్య సున్న. ధనముతో మనకుఁ బనిలేదు. అని యావిషయముగుఱించి ముచ్చటించుకొనిరి. తరువాత నేదియో గుజగుజలాడుచు న న్నాయవ్వ లోపలికిఁ దీసికొనిపోయినది.

అంతలో భోజనమునకు లెమ్మని పరిజనులు వచ్చి చెప్పిరి. పలురకముల పిండివంటలతో నే నారాత్రి భోజనముసేసితిని. రాజోపచారములు గావించిరి. హంసతూలికాతల్పంబునం బండుకొన నియమించిరి. నామంచముదాపునఁ గూర్చుండి యాయవ్వ యిష్టాలాపముల నాడుచుండ నారాత్రి సుఖముగా వెళ్లించితిని.

మఱునాఁడు మంగళగీతములచే మేల్కొంటిని. పరిజను లనేకోపచారములు సేయుచుండిరి. అంతలో నవ్వవచ్చి కుశలప్రశ్న చేయుచు మాయల్లుఁడు నేఁటిమధ్యాహ్నమునకే వత్తుఁరట. ఇప్పుడే వార్తవచ్చినది నామనుమరాలిఁ జూచితిరా ? జాంబవతీ ! ఇటురా. అనిపలుకుచు నొక చిన్నదానిం బిలిచినది. అప్పు డొకబాలిక యచ్చరమచ్చెకంటిపోలిక నొప్పుచు నాప్రక్కవచ్చి నిలువంబడినది. తద్రూపాతిశయంబు నాకు మోహాతిరేకము కలుగఁ జేసినది. తదవయవంబులన్నియు సాముద్రికశాస్త్రలక్షణలక్షితంబులైనవి. తత్సౌందర్యవిశేషంబు పరిశీలింపుచుండ నా యవ్వ మనుమరాలితో జాంబవతీ ! ఆయన మంచిపండితుఁడు నమస్క,రించుము. అనుటయు నాబాలిక చేతులెత్తి మ్రొక్కినది. అనుకూలభర్తృ లాభసిద్ధిరస్తు అని యాశీర్వదించితిని. ముసిముసి నగవులు నవ్వుచు నా బాలిక యవ్వలికిఁ బోయినది.

ఇంతలో గ్రామాంతరమునుండి యొడయం డరుదెంచెను. మిత్ర వింద భర్త కెదురువోయి పాదములుగడిగి శిరంబుపైఁ జల్లుకొనుచు స్వాగతమడిగి నిలువలేక తనతల్లిరాక యెఱింగించినది. ఆప్రభువు మందహాసము గావించుచు ఏమీ ! నీతల్లియేవచ్చినదా ! పశువు లేమగునో గదా ! అని పరిహాసమాడుచుండ నయ్యో ! దాని కెట్టిగండముగడిచినదనుకొంటిరి. ఘోటకముఖుండను పుణ్యాత్మునివలన విముక్తినొందినది. ఆయనగూడ నిందువచ్చిరని యాకథయంతయు జెప్పినది.

ఆవార్తవిని యతం డామె కట్లుకావలసినదే! ఈసారియైన నిందుండునేమో యడిగితివా? ఆపండితుం డెందున్న వాఁడు. అని యడుగుచుండ నాయవ్వ న న్నతనియొద్దకుఁ దీసికొనిపోయి యీపుణ్యాత్ముఁడే నన్ను రక్షించినవాఁడని యెఱింగించినది.

రాజు నాకు నమస్కరించుచు నతం డడుగ వెండియు నావృత్తాంతము భైరవునివృత్తాంతమును జెప్పితిని. ఆఱేఁడు నన్ను మిగుల గౌరవించుచు విద్యలలోఁ గొంతముచ్చటించి నేనిచ్చిన ప్రత్యుత్తరమున, కచ్చెరుపడఁజొచ్చెను. తరువాత మేమిరువురము నొకపంక్తినిగూర్చుండి భుజించితిమి. భుజించునప్పు డతనిభార్య ప్రక్కనిలువంబడి తాళవృంతమున విసరుచు మనోహరా ! విపులుఁడు మీ కంతయవశ్యకముగా రమ్మని వార్తనంపెఁ గారణ మే మనవుడు నతం డిట్లనియె.

లోకమంతయు స్త్రీప్రచారముతోఁ గూడికొన్నది వినుము. విపులుఁడు నిష్కాముండైనను మతంగయోగిని ప్రోత్సాహమున నిరువుర వారకాంతల వరించి వారిని బలవంతమున రప్పించుకొనుటయు నయ్యం గన లంగీకరింపక యల్లరిచేసి యెట్లో భోజునిపుత్రునకుఁ దెలియఁజేసిరి కాఁబోలు. భోజపుత్రుండు చిత్రసేనుఁడనువాఁడు విపులున కిట్టిసందేశమును బంపెను.

రాజా ! రాజు ప్రజల న్యాయాన్యాయంబుల విచారించి దుర్జనుల శిక్షించి సజ్జనుల రక్షించుచుండవలెను. నీ వామాట మఱచిపోయి యిరువుర వారవనితల బలవంతమునఁ జెఱపట్టితివఁట. అది యెంతపాపము. సీతను జెఱపట్టిన రావణుం డేమయ్యెనో యెఱుంగుదువా ? నీవీజాబు చూచినతక్షణము వేశ్యాపుత్రికల నిరువురను విడిచివేయుము. అట్లు వెంట నే మాకుఁ దెలియఁజేయుము. నీసదుత్తరము రానిచో నుత్తర కాలమందే నీపై యుద్దము బ్రకటించుచున్నాము. నీరాజ్య మన్యాక్రాంతము గావింతుము. అని జాబువ్రాసి విపులునొద్ద కనిపెనఁట. విపులుఁడు భోజునికంటె దుర్బలుఁడగుట నాపత్రికం జదివికొని భయపడుచుఁ బ్రత్యుత్తర మిట్లు వ్రాసి పంపించెనఁట.

మహారాజా ! నాశత్రువు లెవ్వరో మీకట్టివార్త తెలియపఱచి యున్నారు. వేశ్యాపుత్రికల నిరువుర నే నెన్నఁడును దీసికొనిరాలేదు. వారు నాదేశములో లేరు. మీకు నామాటయందు విశ్వాసములేనిచో మీదూతలం బంపి వెదకింపుఁడు. అట్టివేశ్యలు నావిషయమం దెందున్నను మీరుచేసినశిక్షకుఁ బాత్రుండనగుదును. అని భోజునకుఁ దెలియఁజేసి వెంటనే యతండు నాకు వర్తమానముసేసెను.

నేనుబోయి పనియేమని యడిగిన జరగినకథయంతయుం దెలియఁ జేయుచు నేను మతంగయోగి మూలమున బలవంతముగా నిరువురగణికాపుత్రికలఁ జెఱదెచ్చినమాట వాస్తవము. గడిచినదానికి వగచినఁ బ్రయోజనములేదు. ఇప్పుడు వీరినివిడిచితినేని నాయక్రమకార్యము వెల్లడికాకమానదు. వెలయాండ్రుగదా? యని రప్పించితిని. వాండ్రు కులస్త్రీలకన్న నెక్కుడుపరితాపము చెందుచున్నారు. కావున వారు వీరిని మీదేశమునకుఁ దీసికొనిపోయి కొన్నిదినములు కాపాడవలయును. ప్రస్తుతోపద్రవము దాటినపిమ్మటఁ గర్తవ్య మాలోచింతముగాక. నీవు నాకు మిత్రుఁడవు. ఈసమయంబున నీయుపకారము గావింపుము. నీకడ నుండినచోఁ బరమేశ్వరుఁడు దెలిసికొనఁజూలఁడు అని ప్రార్థించెను.

అక్రమమైనను మిత్రునికార్యము సేయఁదగినదని తలంచి యతని మాట కడ్డుసెప్పక యంగీకరించి యావారకాంతలనిరువుర నిక్కడికిఁ దీసికొనివచ్చితిని. వారు చావడిగదిలో నున్నారు. అని యారాజు భార్యకుఁ జెప్పెను.

ఆమాటలు విని మిత్రవింద ఓహో ! మీసాధుత్వము మిక్కిలి కొనియాడఁదగియున్నదిగదా ? విపులునిఁ జేసినపనికి మందలింపక యనుమోదించి యాసుందరుల నిందుఁ దీసికొనివచ్చితిరా ? చాలు; చాలు. ఈవార్తవినిన భోజుండు మిమ్ముఁగూడ నపరాధిగా నెంచి మీపైఁ గత్తికట్టకమానఁడు. మీదుర్నయ మెల్లరకుఁ దెల్లమగును. అదియునుంగాక,

శ్లో॥ కర్తా కారయితాచైవ ప్రేరక శ్చానుమోదకః
      సుకృతె దుష్కృతెచైవ చత్వారః సమభాగినః ॥

పుణ్యపాపములు చేసినవాఁడును, జేయించినవాఁడును, బ్రేరకుఁడు, ననుమోదించినవాఁడును సమముగాఁ దత్ఫలమును బంచుకొందురని పెద్దలు చెప్పుదురు. పూర్వ మొకబ్రాహ్మణుఁడు వాచాదోషంబుననే యతిహత్యాపాప మనుభవించె నాకథ నా కొక పండితుం డెఱింగించెఁ జెప్పెద నాలింపుఁడు.

కౌశికునికథ.

కౌశికుండను బ్రాహ్మణుఁడు ఒకనాఁ డొకసన్యాసిని బిక్షకై నిమంత్రించెను. తనకు వాడుకగాఁ బెరుఁగునుం బాలును దెచ్చుచున్న గొల్లదానితో నోసీ ! రేపు మాయింట యతిభిక్ష జరగును. నీకు నిబ్బడిగా సొమ్మిచ్చెదను. నీరుగలుపకుండ గట్టిపెరుఁగు తోడుపెట్టి తెమ్మనిచెప్పి యంపుటంజేసి యాగొల్లది యట్లే మంచిపెరుఁగు ముంతలోఁ దోడుపెట్టి యది గంపలోఁబెట్టి పైన గడ్డ మూతవైచి తెచ్చుచుండెను. గాలిచే నా గుడ్డ పెరుఁగుముంతమూతినుండి తొలంగినది. ఆకసమున నాసమయమున నొకగరుడపక్షి తెల్లత్రాచుం బట్టికొనిపోవుచుండెను. ఆపాము గరళము గ్రక్కినది. ఆవిషము దైవికముగావచ్చి గొల్లదితెచ్చుచున్న పెరుఁగుముంతలోఁ బడినది. ఆవిషయ మించుకయు గొల్లది యెఱుంగదు. ఆ పెరుఁగుముంత కౌశికుఁ డందుకొనిచాల సంతోషించుచు దాని కెక్కువగా సొమ్మిచ్చి తరువాత యథాశాస్త్రముగా నాసన్యాసి నర్చించి పిండివంటలతో భోజనముపెట్టెను. కడపట నాపెరుఁగు వడ్డించెను. దానిరుచికి మెచ్చుచు యతీశ్వరుఁడు మఱికొంచె మెక్కువగాఁ బుచ్చుకొనియెను. అతనినాలుక పూచియుండుటచేఁ బుండుపడియున్నది. భుజించినకొంచెముసేపునకే యాయతి విషముఘాటుతగిలి పరమపదించెను.

యతిచావు జూచి గృహపతి యపరిమితముగా దుఃఖించుచుఁ దత్కారణము దెలియక పరిపరిగతులఁ దలంచుచు గ్రామస్థులసహాయమునఁ దద్దేహము గంగార్పితముగావించెను. ఆయతిహత్యాపాతకము నెవరనుభవించునట్లు వ్రాయవలయునో తెలియక సంశయించుచుఁ జిత్రగుప్తులు యమధర్మరాజు సడిగిరి. అతం డావిషయము విమర్శించి సందియమందుచు ధర్మకర్తల నడిగెను.

ధర్మకర్తలు తత్పాపభర్తలగుఱించి వితర్కించి కౌశికుండు శ్రోత్రియుఁడు. శ్రద్దాభక్తిపూర్వకముగా యతిభిక్ష గావించెను. గొల్లది తెచ్చినపెరుఁగులో విషముగలిసిన ట్లెట్లుతెలిసికొనఁగలఁడు ? కావున నతని కీపాపము విధించుట యుచితముగాదు. గొల్లది కులోచితాచార ప్రకారము తోడుపెట్టి మూతవైచి తట్టలోఁబెట్టి పెరుఁగు తీసికొనివచ్చినది. గుడ్డ గాలిచేఁ గదలి యెగురుట యెఱుఁగదుగదా ! ఇందు దానిలోప మేమియున్న ది. చెప్పినరీతిగాఁ దెచ్చియిచ్చుటచే నీపాపము గొల్లదానికి విధించుట యుక్తముగాదు.

ఆచ్ఛాదనవస్త్రమును ముంతమూతినుండి కదిల్చినవాయువున కీయఘము విధింతమన్నఁ జలన మతనికి సహజము. కావున నట్లుచేయుట తప్పు. విషముగ్రక్కిన సర్పమునకే యీదోష మర్నింతమన్న గరుడ పక్షిచేత నొక్కఁబడి యది యట్లు చేసినది. అస్వతంత్రుఁడు పాపభర్త కానేరఁడు. ఈదోసము గరుడపక్షిమూలమున వచ్చుటచే నతని కే విధింతమనిన సర్పమునుదినుట దానికిఁ దప్పుగాదు. ఈపాప మెవ్వరికివిధింపవలయునో మాకునుం దెలియలేదని ధర్మకర్తలు సెప్పిరి.

అప్పుడు యముఁడు సంశయడోలాయితహృదయుండై యాపాప మెవ్వరిపేరను వ్రాయవలదని చిత్రగుప్తులకుఁ జెప్పి వైకుంఠమునకుం బోయి శ్రీమహావిష్ణునికడ నివేదించెనఁట. అమ్మహాత్ముండు గొప్పసభ చేసి యాధర్మసూక్ష్మము చెప్పుఁడని మహర్షుల నడిగెనఁట. దేవతలు మహర్షులుగూడ నాసందేహము తీర్పలేకపోయిరి. శ్రీమన్నారాయణుఁడు లోకములు తిరిగి పెద్దల నరసి యీధర్మసూక్ష్మము దెలిసికొనవలసియున్నది. ప్రస్తుత మెవ్వరికిని విధింపవలదు. దూతలంబంపి మూఁడు లోకంబులంగల పెద్దలతో విచారించి తగినవిధి నాచరింపుమని యముని కాజ్ఞ యిచ్చెను. యముండును ధర్మసూక్ష్మము గ్రహించుటకై తన దూతల లోకములఁ ద్రిప్పుచుండెను.

వైకుంఠములో సభజరగినప్పుడు గరుత్మంతుఁ డావార్తవిని కులస్థులకెల్ల నీయపకీర్తివచ్చినదని పరితపించుచు నీదోస మాపతగమునకు ఘటింపఁజేయుడురేమో యని మిక్కిలి వెఱచుచుండెను. ఆవార్త గరుడ పక్షిజాతికెల్లం దెలిసినది. భూలోకములో నొకవృక్షశాఖలవసించి రెండు గరుడపక్షు లామాటలే చెప్పుకొనుచు నిలిపి నిలిపి చివర కీదురితము మనపక్షి కే విధింతు రేమో యని చింతించుచుండెను.

ఆసమయమువ దైవికముగా నాచెట్టుక్రిందఁ బండుకొనియున్న యొకబ్రాహ్మణుఁ డాపక్షి వాక్యము లాలించి యాభాష తాను జదివి యున్నవాఁడగుట దదర్థముగ్రహించి తనతోనున్న రెండవబ్రాహ్మణుని కాకథయంతయుం జెప్పుచు నీవిషయము దేవతలు మహర్షులు సెప్పలేక పోయిరఁట నన్నడిగిన నేను జెప్పుదునుకాదే యని పలికిన విని రెండవ పారుఁడు నీ విందుల కేమిచెప్పెదవు ? ఆపాప మెవరికి విధింతువని యుడిగిన నతం డిట్లనియె. ఎవ్వరికిని విధింపను. విషముగలిపినపెరుఁగును బరిశీలింపకుండ నాసన్యాసికిఁబోసిన యజమానుఁడే యాపాపము భరింపవలయును. వస్తుశోధనము సేయవలదా? గరుడపక్షి యించుకయు భరింపనర్హము గాదని కచ్చితముగాఁ జెప్పెను. విధివశంబున నామాట లాకసంబున నాప్రాంతముగాఁబోవుచున్న యమదూతలు విని యాపాఱుం బట్టికొని యమునియొద్దకుం దీసికొనిపోయి యతం డాడినమాటల నివేదించిరి.

అప్పుడు యముఁడు తిరుగా నీవట్లుచెప్పితివా? అనియడుగుటయుఁ జెప్పితిని. అట్లుచేయుటయే విధియని నిర్భయముగాఁ బలికెను. అప్పు డాధర్మరాజు దధిపూర్ణఘటంబుల రెంటిఁ దెప్పించి యొకదానిలో గరళముగలిపించి చూపి వీనితారతమ్యము చెప్పుము. దేనిలో విషముగలిపితిమో యెఱిఁగింపుమని యడిగిన నాబ్రాహ్మణుఁడు చూచి చూచి తెల్లపోయి సత్యము చెప్పలేకపోయెను.

అప్పుడు యముండు వానిపై నలుగుచు ధర్మసూక్ష్మము గ్రహించుట కష్టము. తెలియనప్పుడు ఇదమిద్ధమని నిరూపింపరాదు. అసత్యముగా దోషారోపణము జేసినవాఁడు తత్ఫలం బనుభవింప వలసియున్న ది. కావున పారుఁడా ! నీవుసెప్పినది యసత్యమైనది. తత్ఫలంబు నీ వనుభవింపుము. నీకు విధించితినని పలుకుచుండఁగనే యమదూత లతని నిరయంబునకుఁ దీసికొనిపోయి యాఫలము గుడిపించిరఁట.

ప్రాణేశ్వరా ! ధర్మ మింతసూక్ష్మములో నున్నది. నిష్కారణ మాఁడువాండ్ర బాధించినపాతకము మీరుగూడఁ బంచికొందురేమో యని వెఱచుచున్నాను. అని మిత్రవింద చెప్పినయుపన్యాసము విని రాజు మందహాసము గావించుచు నిట్లనియె.

శ్లో॥ శోకారాతి పరిత్రాణం ప్రీతి విస్రంభభాజనం
     కేనరత్న మిదంసృష్టం మిత్రమిత్యక్షరద్వయం ॥

సాధ్వీ ! మిత్రకార్య మెట్టిదైనను దీర్పవలయునని శాస్త్రములు ఘోషించుచున్నవి. అందులకు నాకేమియుఁ బాతకములేదు. మఱియు నాతరుణుల యభిప్రాయము ననుసరించి యుపకారము గావించెదనని సమాధానము సెప్పెను. వారిసంవాద మాలించుచు నే నేమియు మాటాడక భుజించుచుంటిని.

అప్పు డాయవ్వ యల్లునితో మీ రీవిషయము తగవులాడనేల ? ఘోటకముఖుండు మహాపండితుండు. ఆయన నడిగి యేది న్యాయమో యట్లు కావింపవలయునని చెప్పినది. రాజు నాదిక్కు మొగంబై, ఆర్యా ! నేఁజెప్పినమాటలలో నన్యాయ మున్న దా? అని యడిగిన నేనది సమంజసముగానున్నది. ఆగణికలయుదంతము దెలిసికొని వారి యాప్తులం జేర్చుట యుచితమని పలికితిని

భోజనానంతరము విశ్రమించినతరువాత రాజు నన్ను వెంటఁబెట్టికొని యాగణికలున్నగదిలోనికిం దీసికొనిపోయెను. మిత్రవిందయుఁ దల్లియు నంతకుముందే యందువచ్చి యాసుందరులతో ముచ్చటించు చుండిరి. రాజు వారింజేరి మీ దేదేశము, ఎవ్వనిభార్యలు, విపులుఁ డేమిటికి మిమ్ము బంధించెను, మీవృత్తాంత మెఱింగింపుఁడని యడిగిన నమస్కరించుచుఁ జిత్రసేన యిట్లనియె.

మహాశయా ! మాజన్మభూమి పాటలీపుత్రము. మేము రతినూపురయను వేశ్యపుత్రికలము. నాపేరు చిత్రసేన ; దీనిపేరు రతిమంజరి. నాభర్త దత్తుఁడను విద్వాంసుఁడు ; దీనిభర్త గోణికాపుత్రుఁడు. మేము తల్లి సంపదల విడిచి గోణికాపుత్రువెంట ధారానగరమున కరుగుచుండ మతంగయోగిని దుర్బోధముచే విపులుఁడను రాజు మమ్ము బలవంతముగా గోణికాపుత్రునికిఁ దెలియకుండఁ దననగరమునకు రప్పించుకొని తన్ను వరింపుమని నిర్బంధించెను.

మేము బ్రాహ్మణుల సొత్తులమైతిమి, మగ నాలులము, వేశ్యాధర్మముల విసర్జించితిమి. మమ్మువరించుట నీకుఁ దగదని యెంతచెప్పినను వినక తనతోఁ గలియమని మమ్ముఁ బెక్కు బాములం బెట్టెను వెలయాండ్రకు నీతియెక్కడవని యాక్షేపించెను. మమ్ముఁ గారాగార ప్రాయమైన నికాయంబున నుంచి నిర్బంథించెను. మే మొప్పుకొనలేదు. తరువాత నేమిటికో మీ రిక్కడికిఁ దీసికొనివచ్చితిరి. ఇదియే మాకధయని యాజవరా లెఱింగించుచుండఁగనే నేను మేనుఝల్లుమన నోహో! వీరు నామిత్రులకళత్రములని మనవృత్తాంత మంతయు నతని కెఱింగించితిని.

నాపేరు ఘోటకముఖుండని విని యావనితారత్నములు మేను లుప్పొంగ నేమీ! నేఁ డెంతసుదినము. మీపేరు గోణికాపుత్రుండు చెప్పుచుండఁ బలుమారు వింటిమి. మహాత్మా! మీ రిక్కడి కెట్లువచ్చితిరి? మీయుదంత మెఱింగింపుఁ డనవుఁడు నాకథ వారికి వెండియుం జెప్పితిని. రాజపత్ని వారివృత్తాంతము విని జాలిపడుచు మిమ్ము మీభర్తల యొద్ద కనిపెద విచారింపవలదని యోదార్చినది. నాఁడు ఇష్టగోష్ఠీవినోదములతోఁ గాలక్షేపము గావించితిమి.

అని చెప్పెనని చెప్పువఱకు వేళ యతిక్రమించుటయు మణిసిద్ధుం డవ్వలికథ తదనంతరనివాస ప్రదేశంబున నిట్లు చెప్పుచుండెను.

________

169 వ మజిలీ.

మదాలసకథ.

చక్రధరనరనాయకునిపత్ని మిత్రవింద చాల గుణసంపత్తిగలది. నే నమ్మఱునాఁడే యిందువచ్చుటకుఁ బయనమైతిని. తనతల్లి కుపకారము గావించితినని నన్ను మిక్కిలి పొగడుచు నారాజపత్ని నన్నట నుండి కదలనిచ్చినదికాదు. దినమున కొకరకము పిండివంటలు సేయుచు నా కత్యంతగౌరవము గావించినది.