కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/152వ మజిలీ

వికీసోర్స్ నుండి

ప్రకారంబుల గొనియాడుచుండ నతనిచెవులకు విద్వాంసుఁడా! నీవచిరకాలములో మిత్రులంగలసి యత్యంతసంతోషంబులం జెందకలవు. అనుమాటలు వినంబడుటయు నతండు గన్నులందెరచిచూచి యామాటలాడిన వారిఁగానక దేవీప్రోక్తంబుగాఁదలంచి యమ్మించుబోఁడుల కత్తెరం గెఱింగించె నప్పుడు చిత్రసేన యిట్లనియె.

ఆర్యా! ఇందలిశిలాశాసనము జదివిజూచితిని. మనోహరరూప యౌవన ద్యోతినియగు వారయువతింబలియిచ్చినవారి కీదేవికోరినవరంబుల నిచ్చునఁట. అందులకే యాయోగినిపలుమారు మాచెంతకువచ్చి ఢాకినీదేవియొద్దకుఁ దీసికొనిపోయెదనని చెప్పునది. దైవము దానికిబ్రతికూలుఁడై యుండ గోరికయెట్లుతీరును. విపరీతము జరగినది. దానిం జంపక విరూపంజేసి విడిచితిరి. శూర్పణఖ రావణునికిఁబోలె నిది యా రాజునకుబోధించి మఱలఁ జిక్కు దెచ్చిపెట్టునేమో ? వేగమీదేశము దాటిపోవుట లెస్సయని యుపదేశించుటయు నతండామాటల కంగీకరించెను. బండివానికిఁజెప్పి వారుబండియెక్కి హుటాహుటి పయనంబుల నాదేశముదాటి యొకనాఁటిరాత్రికి ధారానగరంబు సేరిరి. అని యెఱిగించి తరువాతికథ పైమజిలీయందిట్లు చెప్పందొడంగెను.

146 వ మజిలీ

దత్తకశాపవిముక్తి కథ.

చారుమతియు రుక్మిణియు నెప్పుడు నొక్క మంచముమీఁదనే పండుకొనుచుందురు. ఒకనాఁటిరాత్రి యిరువురు పండువెన్నెలలోఁ బూవుపానుపునఁబండుకొని ప్రొద్దుపోవువఱకు విద్యావిషయంబుల ముచ్చటించుచుండిరి. రుక్మిణిసూత్రవిషయంబులన్నియు స్మరణకుఁదెచ్చికొని సఖీ! ఛారుమతీ! నీవంటి విదుషీమతల్లివలనఁగాని యీ సాంప్రదాయములు తెలియఁబడునా; మొదటఁజూచిన నీపుస్తకమేమియుం దెలిసినది కాదు. ఇప్పుడంతయుం గరతలామలకముగా నున్నది. ఇందులకు దగిన పారితోషికము నీకిచ్చుటకు నాయొద్ద నేమియులేదు. ఇదిగో ప్రీతిపూర్వకముగా నిన్నాలింగనము సేసికొనుచుంటిని. ఈపరిష్వంగమే మన ప్రేమానుబంధమును దృఢపరచుఁగాక యని కౌఁగలించుకొనుచు జెక్కులుముద్దుపెట్టుకొన్నది.

చారుమతియుఁ బ్రత్యాశ్లేషముగావించి రాజపుత్రీ! నీసౌందర్య చాతుర్యాది విశేషంబుల కనుగుణుండగు భర్తలభించి యతనితో నతను క్రీడలఁ దేలుచున్నప్పుడు నన్ను స్మరింతువుగాక. నాఁడుగదా నాయుపదేశమునకు ఫలము. అని యుత్తరముచెప్పినది. ఆబోఁటి సిగ్గుపెంపున నేమియు మాటాడినది కాదు. అట్లు వారు పెద్దతడవు సంభాషించుకొనునంతలో నన్యోన్యాలింగితాంగలై నిద్దురవోయిరి.

నాఁటి యపరరాత్రంబున రుక్మిణికి మెలకువవచ్చినది. తనపైఁ జేయివైచుకొని నిద్రించుచున్న చారుమతిచేయియుఁ బాదంబులు బరువుగాఁదోచుటయు రాజపుత్రిక మెల్లగలేచి యందొక చక్కని పురుషుండు పండుకొని యుండుటంచూచి యబ్బురపాటుతో అహా ! ఈ మోహనాంగుఁ డెవ్వఁడు? చారుమతి యేమైనది? ఈసుందరు నాముందరఁ బవ్వళింప జేసి తా నెందో డాగియున్నదా ? వీని నీశుద్ధాంతమున కెట్లు తీసికొనివచ్చినది ? తలంచికొన నేదియు సరిపడకున్నది ? కానిమ్ము. ఏదియెట్లైనను వీనిమేనిసంపర్కము నాకుఁ గలిగినదికదా ? వీఁడే నాభర్తకావలయును. ఆహా! వీని సౌందర్య మెంతచూచిన తనివితీరకున్నవి. చారుమతి నాకు మంచి యుపకారము గావించినది. వీని లేపి నీవెవ్వఁడవు? ఎట్లువచ్చితివని యడుగుదునా ? అయ్యో ! ఊరక వీనికి సుఖనిద్రాభంగము సేయనేల ? తెల్లవారదా తొందరయేల ? అనితలంచుచు వానినాపాదమస్తకముగాఁ బరీక్షించి యుత్తమ పురుష లక్షుణంబులుండుట గ్రహించి యమ్మించుబోఁడి వేరొకమంచముపైఁ బండుకొని ధ్యానించుచుండ నంతలో నిద్రపట్టినది. పిమ్మట నాపురుషునకుమెలకువవచ్చినది. నలుమూలలు సూచుచు నాహా ! నేఁటితో నాకు యక్షశాపము సమాప్తినొందినది. సంవత్సరమైనది కాఁబోలు. జరగిన చర్యలన్నియు నాకుస్వప్నప్రాయములుగానున్నవి. ఇప్పుడీ రాజపుత్రిక నిద్రించుచున్నది లేపి నావృత్తాంతముజెప్పి యేగుదునా ? ఏమో? దానికేమి కోపమువచ్చునో ? స్త్రీలు చపలహృదయలుగదా ? చెప్పకబోవుటయే లెస్స చీకటియుండగనే యొరులెరుఁగకుండ నీశుద్దాంతము దాటిపోవుటమంచిది. దీనిసౌందర్యముచూచి విడిచి పోవలయునని మనసురాకున్నది. ఇదిలేచి నాయందనురాగముచూచించిన మేలగు లేకున్న ప్రమాదమగు నప్రత్యక్షమగు పరబుద్ధినమ్మి యిందుంట నీతికాదు అని తలచుచు నాదత్తకుండు తెలతెలవారుచుండ నంతర్భవనములుదాటి యవ్వలికింబోయెను.

సింహద్వారమునఁ గాచియున్న భటులతనింబట్టికొని నీ వెవ్వఁడవు ? అంతఃపురమున కెట్లుపోయితివి ? ఇది గొప్పతప్పితము నీకథ జెప్పుమని యడిగిన నతండేమి చెప్పుటకుం దోచక తబ్బిబ్బుమాటాడెను అప్పుడతని నపరాధిగాభావించి బధ్ధుం జేసి నారాజభటులు భోజుండు కాళిదాసుందీసుకునిరా దేశాంతరమరిగియున్న కతంబున నప్పుడు రాజకార్యముల విమర్శింపుచున్న రాజపుత్రుఁడగు చిత్రసేనుని మేడకుం దీసికొనిపోయి యయ్యపరాధ ప్రకారమంతయుఁ బత్రికాముఖంపున నతనికిఁ దెలియఁజేసిరి.

రాజపుత్రుండు మంచముపై బండుకొని యొక బ్రాహ్మణ మిత్రుండు ప్రక్కంగూర్చుండి మంచిమాటలు చెప్పుచుండ నాలించుచు దండనాధుండు పంపిన పత్రికనువిప్పి చదివి విసువుతోప మిత్రమా! దండనాధుఁ డపరాధినెవ్వనినో తీసికొనివచ్చెను. నీవువోయి విమర్శించి రమ్ము నా కోపికలేదని యాచీటి సతనిపైఁ బడవైచి తానవ్వలి మొగంబై పండుకొనియెను. ఆ బాహ్మణపుత్రుండా పత్రికనందుకొని వాకిటకువచ్చి రాజ పురుష వేష్ఠితుండగు దత్తకుంజూచి సంభ్రమాశ్చర్యములతో నాప్రాణమిత్రుఁడు దత్తకుఁడా? అయ్యో! శుద్ధాంతమునకేమిటికి పోయితివి? అని యడిగిన నతండు గోణికాపుత్రుఁడా ! ఔరా? యెంతచోద్యము అని పలుకుచు నతనిం గౌఁగలించికొని మిత్రుఁడా! వీండ్రు నన్నూరక నిర్బంధించినారు అపరాధమేమియుఁ జేయలేదు. దారి తెలియక లోపలికి గొంచెము దూరముబోయితిరిగి యప్పుడేవచ్చితిని. అని చెప్పినవిని గోణికాపుత్రుఁడు చాలు చాలు. ఈతఁడా? అపరాధి ఇతఁడు రాజపుత్రుని మిత్రుఁడు పో. పొండని యదలించిన రాజకింకరులు మారుమాట పలుకనేరక యవ్వలికి పోయిరి. పిమ్మట దత్తకుండు గోణికాఁపుత్రుని హస్తము గైకొని మిత్రమా ! నీవెప్పుడు వచ్చితివి? రాజావలంబన మెట్లుగలిగినది? మనమిత్రులలో నెవ్వరైన వచ్చియుండిరా? విశేషము లేమని యడిగిన నతండిట్లనియె.

నేను శుభముహూర్తంబునఁ గాశీపురంబు బయలువెడలి పూర్వ దక్షిణముగాఁ బోవుచు నొకయగ్రహారంబున గోమఠుండను బ్రహ్మచారికి వివాహముగావించి యటఁగదలి యనేక జనపదంబులు జూచుచు నీ జన్మభూమియగు పాటలీపుత్రనగరంబున కరిగితిని అందు రతినూపురయను వేశ్యయింటి కతిధిగా బోయితిని. దాని పెద్దకూఁతురు చిత్రసేన బాల్యంబున నీతోఁ జదివికొనినదఁట నిన్నేగాని పెండ్లియాడనని నియమము చేసికొనినది. రెండవదియగు రతిమంజిరి నన్ను వరించినది. వారిరువురు సర్వైశ్వర్యములువిడిచి నాతో బయలుదేరిరి. మార్గమధ్యంబున మతంగయోగిని బన్నినకపటంబునంబడి ప్రాణసంకటంబగు నిడుమలం గుడిచితిమి. దైవకృప నావెతల నతిక్రమించి యొకనాఁటి రేయికి నీ యూరుచేరితిమి. పురవిశేషములఁ దెలియని వారమగుట నాఁటి రేయినూరి బయిలనున్న సత్రములోఁ బండుకొంటిమి. ఆరాత్రి నాకు గాఢముగా నిద్రపట్టినది. తెల్లవారి చూచువఱకు నాతరుణు లిరువురును వాకిట దింపిన బండియు బండివాఁడునుంగూడఁ గనంబడలేదు.

అప్పుడు మిక్కిలి పరితపించుచు నీ నగరమంతయు వెదకితిని. వారిజాడ యేమియుం డెలిసినదికాదు. క్రమ్మరమేము వచ్చినదారి కొంతవఱకు వెదకితిని. కార్యము లేక పోయినది. అది దైవకృతముగాఁ దలంచి పరితపించుచు మఱల నీనగరమునకువచ్చి దేవాలయ గోపుర సత్రకుడ్య భాగంబులు పరీక్షించితిని. మన మిత్రులెవ్వరువచ్చిన చిహ్నమ లేమియుఁ గనంబడలేదు. ఇందూరకుండనేలయని యొకనాఁడు ప్రాతఃకాలమునఁ బండితవేషముదాల్చి రాజదర్శనార్ధమై నగరి కరిగితిని భోజభూపతి దేశాంతరమరిగియున్న కతంబున నతని పుత్రుండు చిత్రసేనుండు పండితుల నాదరించుచున్నవాఁడని విని యతండున్న నెలవునకుఁబోయి కొన్నిశ్లోకములు రచించి స్తుతియించితిని.

రాజపుత్రుండప్పుడొక మంచముపైఁ బండుకొని యుండెను. తనకు దేహములో స్వస్థతలేదనియు నిప్పుడు మీకవితాచమత్కృతి వినుటకు సమయముగాదనియుఁ బలుకుచుఁ గొన్ని దీనారములు నాకుఁ గానుకగా నిప్పించెను. వానిని నేనందుకొనక రాజపుత్రా! నేను విత్తార్ధినై రాలేదు. మీసంస్థానమున విద్వాంసులుండిరని విని ప్రసంగింప వచ్చితిని. వాద పారితోషిక మిప్పింపుఁడు మఱియు మీదేహకృశత ముఖపాండిమముజూడ మీరోగము శరీరజన్యము కానట్టు తోచుచున్నది. ఇది శరీరజకృతమగుట నిక్కువము. ఆవ్యాధికిమందు నేనెఱుంగుదునని పలికినంత నానృపసూనుండు తెలిసికొని చెంతనున్న వారి నవ్వలికిం బొమ్మని నన్నుఁదనప్రక్కఁ గూర్చుండబెట్టికొని యిట్లనియె.

మహాత్మా! నీవు నావ్యాధి గ్రహించితివి. దీనిబాధ యిట్టిదని చెప్పఁజాలను. ప్రతీకారమెట్లు ? ఔషధమేమి ? అని యడుగుటయు నేను మెల్లగా నీవెవ్వతెంజూచి యీవిరాళిం గుంధుచుంటివి ? అది యేమిటికి లభ్యముకాలేదు? చెప్పుమనుటయు నతండిట్లనియె. చారుమతి యను వేశ్య నాహృదయ మాకర్షించినది. అది త్రిభువన యువతి జనాతీతసౌందర్యంబునం బ్రకాశించుచున్నది. అందరానిఫలమై నాసహోదరి యంతఃపురమున వసించియున్నది. దానింజూచినది మొదలు నన్నీ వ్యాధి బాధించుచున్నదని యావృత్తాంతమంతయు నెఱింగించెను. ఆ మాటవిని నేనాపడఁతి నొకసారి నాకన్నులంబడునట్లు చేయగలరా? అని యడిగిన నతండాలోచించి యట్లెకావించెదఁ దగినతంత్రమాలో చింపుఁడు. అని పలికి నాకుఁ దగిన నెలవు నిరూపించి యంపించెను.

కాశినుండి యొకపండితుండు వచ్చెననియు నతనికి సంస్థానకవులకు రేపుప్రసంగముజరుగుననియు నందులకుఁదగిన మధ్యవర్తి లేడనియు నీయొద్దనున్న చారుమతి మహావిద్వాంసురాలని వింటిమికావున నాపూవుఁబోఁడిని మధ్యవర్తినిగానుంచి జయాపజయంబులు నిరూపించుటకై కోరితిమి కావున సభవేళకుఁ బంపవలయునని యాతండు చెల్లెలికిఁ జీటివ్రాసి యంగీకరించినట్లు ప్రత్యుత్తరము దెప్పించుకొని యా వాతన్ తమపండితులకుఁ దెలియఁజేసెను.

మఱునాఁడు యధాలమునకు సభకూడినది. అయ్యోలగములోనే యొకదెసఁ దెరగట్టించిరి. రాజపుత్రికతోఁ గూడఁ జారుమతి యా తెరలోఁ జేరినది.. యవనికాముఖంబునం గూరుచుండి మావాదము లాలించినది. నాకును సంస్థానవిద్వాంసులకు రెండుగడియలు ప్రసంగము జరగినది. మధ్యవర్తిని చెప్పకుండఁగనే తామోడిపోయినట్లొప్పుకొని యాపండితులు నన్ను స్తుతిజేసిరి.

అప్పుడా యువతియే రోసమెక్కి రాజుపుత్రిక పోత్రాహామున వాదమునకుఁ బూనికొనినది. మాయిద్దరకుఁ బెద్దతడవు ప్రసంగము జరగినది. వయస్యా ! నీతో నేమనిచెప్పుదును. మనమెన్ని చదివితిమో యదియు నన్నిచదివినది. మనయుపాధ్యాయులే దానియుపాధ్యాయులని తలఁచెదను. నేనువేశినశంకలన్నియు నదిసమాధానము చెప్పినది. దాని శంకలు నాకుసులువు గానే బోధపడిసవి. మావాదమున జయాపజయంబు లెవ్వరును నిరూపింపకలేకపోయిరి. అది నన్ను నేనుదానిని స్తుతియించుచు నంతటితో సభముగించితిమి. మిత్రమా ! దానిమొగము జూడ నీమొగముజూచినట్లే యున్నది. పెక్కేల ప్రసంగము గూడ యుక్తిప్రయుక్తులతో నీవుచేసినట్లేచేసినది. రాజపుత్రునకు దానివిద్యా ప్రౌఢిమజూచినతరువాత మఱియు విరహపరితాప మధికమైనది. మఱునాఁడు నేనుబోయినంత ఆర్యా! మీరన్నకార్యము తీర్చితిని. ఇఁక నా కార్యము గావింపవలయును. ఏమితంత్రమాలోచించితిరి? అనియడిగిన నేను నిట్టూర్పునిగుడించుచు రాజపుత్రా ! అయ్యంబుజనేత్ర నాతంత్రములకు లోఁబడునదికాదు. ప్రతితంత్రములు దానికిఁ దెలియును. నా మిత్రుఁడు దత్తుఁడనువాఁడు నేఁడో రేపో రాఁగలఁడు అతండుమంచి ప్రౌఢుండు వాఁడు తృటిలో వశవర్తినిఁ జేయఁగలఁడని చెప్పితిని. అతండు నీయాగమన మభిలషించుచున్నాఁడు దైవికముగ నేఁడేవచ్చితివి ఇదియేనావృత్తాంతము. ఈకారణమున రాజపుత్రునితో మైత్రిగలిసినది. గడియగనంబడకపోయితినేని పదివర్తమానములు పంపును. చాల మంచివాఁడు చూతువుగాని రమ్ము. అనిపలికి గోణికాపుత్రుండు దత్తుని లోపలికిఁ దీసికొనిపోయి రాజపుత్రునకుఁజూపుచు నితఁడే నామిత్రుఁడు దత్తుఁడు అని యతనియాగమనప్రకారమంతయుఁ దెలియఁజేసెను,

అప్పుడు రాజపుత్రుండు విస్మయముతో లేచి నమస్కరించుచు మహాత్మా ! మీప్రభావ మిదివఱకే వినియుంటిని. మీదర్శనమైనది. నామనోరధము సఫలముగాఁగలదు. నన్నుమిత్రునిగాఁ బుత్రునిగా భావించి కాపాడుము కడమసంగతులన్నియు నీతఁడే యెఱింగించును. అని పలికి శయ్యపైఁ బండుకొనియెను. తరువాత గోణికాపుత్రుఁడు వెండియు చారుమతివృత్తాంతమంతయు నతనికెఱింగించెను. దత్తకుఁడా కథవిని కనుబొమ్మలెగరవై చుచు ఆ ! ఏమీ ! ఆగణిక యంతనిపుణికయా? వేశ్యలకు వ్రతముకూడనా? ఔ'రా! ఎంతచోద్యము వెలయాలట పురుషులఁజూడదఁట మీరుదాని టక్కులలోఁ జిక్కితిరి. సీ ! సమయమునకుఁ బనికిరాని మీచదువేమిటికి ? అనిమిత్రు నాక్షేపించుచు రాజపుత్రా ! నీవిఁకకుందకుము. రేపురాతిరికి నానాతి నీశయ్యఁజేరునట్లు చేసెదను నాప్రజ్ఞజూడుము అనుటయు నతండు తటాలున లేచి వచ్చి దత్తునిగౌఁగిలించుకొని వీఁడు నీమితుఁడు కనికరింపఁ బాత్రుడు. సిగ్గువిడిచి చెప్పుచుంటిని. ఆవాల్గంటి కంటికిఁగట్టినట్లు సర్వదా కనఁబడుచుండును. నీవిప్పుడాడినమాట జెల్లించుకొని నీయాప్తుని బ్రతికించు కొమ్ము అని వేడికొనియెను.

దత్తుఁ డతనిమంచముపైఁ గూర్చుండి యతనిచేయిఁ బట్టుకొని యుపలాలించుచు మిత్రమా ! నీవాత్రపడకుము. అయ్యంబుజనేత్ర నొకసారి నాకగపడునట్లుచేయుము . నీకోరికదీర్తునని చెప్పెను రాజపుత్రుఁడాలోచించి యొకచీఁటివ్రాసి చెల్లెలియంతఃపురమునకుఁ బంపెను. దానికిఁ బ్రత్యుత్తరమిట్లు వచ్చినది. సహోదరా! క్రొత్త పండితునితో బ్రసంగింప జారుమతిం బంపమని వ్రాసితివి. ఆయన్నుమిన్న మొన్నటినుండి కనంబడుటలేదు. ఆసుందరి యెందుఁబోయినదో తెలియకున్నది. వచ్చినవెంటనే పంపఁగలను. ఇట్లు మీప్రియసహోదరి రుక్మిణి.

రాజపుత్రుఁ డాయుత్తరముచదివి నాలుకగోసిన మూగవలె మాటాడక దత్తునిమొగము జూచెను. అతండతని దైన్యము గ్రహించి రాజనందనా ! మిమ్మాసుందరి వెఱపించుటకు నందే డాగియుండును. ఎందుబోఁగలదు? నేఁడుగాకున్న రేపాయెను. మేమిందేయుండెదము గదాయని పలికినఁ జిత్రసేనుఁడు ఇది నాప్రారబ్ధముకాఁబోలు. అనివగచుచు వచ్చుచు బోవుచుండుఁడని చెప్పి వారినెలవున కనిపెను.

గోణికాపుత్రుండు దత్తునితనబసకుం దీసికొనిపోయి చారుమతి విద్యారూపములం గూర్చి పెద్దగాఁ బొగడుచుండ దత్తుఁడునవ్వుచుఁ జూచినంగాని నమ్మనని యుత్తరము చెప్పెను.

మఱునాఁడు వాడుకప్రకారము నగరికరుగుచు గోణికాపుత్రుండు దత్తునితో మిత్రమా ! నీవు రాజపుత్రునొద్దకు వత్తువా ? అని యడిగిన నతండీనగరవిశేషములం జూడఁబోయెద. నీవేపోయిరమ్ము. రాజపుత్రునితోఁ జెప్పుము. అని పలుకుటయు గోణికాపుత్రుండట్లు కావించెను.

దత్తుండును రుక్మిణీ విరహపరితాపము చిత్తంబుత్తలపెట్ట నావీటిలోని యంగళ్ళవెంట దిరిగితిరిగి యందొకదేవాలయము గోపురద్వారమునఁ గూర్చుండి యచ్చటివింతలం జూచుచుండెను. అంతలో నొక పరిచారిక యాప్రాంతములందిరుగుచు నతనియొద్దకువచ్చి యెగాదిగఁ జూచి తనచేతనున్న చిత్రఫలకము పరికించి మఱల నతని మొగము సూచి తలయూచుచు స్వామీ! మీదేయూరని యడిగినది.

అతండు దానివంక జూచి నీవుచిత్రలేఖనా ! యేమి ? నన్ను సవితర్కముగాఁ జూచుచుంటివేల ? నాకులగోత్రనామములతో నీకేమిపని ? అనియడిగిన నాజవ్వవి నవ్వుచు మీరనిరుద్ధులైనచో నేనుజిత్రలేఖనే. పనియుండియే మిమ్ముఁ బలుకరించితిని. ఈచిత్రపటమును జూడుఁడు? మీప్రతిబింబముకాదా? అనుటయు నతండు దాని బరికించి యిది నాయాకృతియే దీనివ్రాసిన యాకృతులెవ్వరు? అని యడిగిన నాపరిచారిక మెల్లగ మీరెప్పుడైన భోజరాజపుత్రికయగు రుక్మిణీ యంతఃపురమునకు వచ్చితిరా ?

దత్తకుఁడు -- (నగు మొగముతో) శుద్ధాంతముసకు నే నెట్టు రాఁగలను?

పరిచారిక --- పోనీ చారుమతి నెఱుంగుదురా?

ద -- ఎఱుఁగుదును ఆమెయే నేనుగాఁ గొన్నినాళ్లు మెలంగితిని. పరి – మిమ్మాకొమ్మ మాభర్తృదారిక యంతిపురికిఁ దీసికొని వచ్చి విడువలేదా ?

ద — విడిచినదేమో జ్ఞాపకములేదు.

ప - అబ్బా! మీకునమస్కారము నిజమేదియోయెఱింగింతురు!

ద -- ఎఱింగించిన ఫలమేమి?

ప -- ఫలము చూపుదును కాదా !

ద -- దారితప్పి మీయంతఃపురమునకు వచ్చితిననుకొనుము. అందుల కేమంచువు ?

ప - మఱల నామెకొకసారి నేత్రపర్వము గావింపుమని.

ద - అది యెట్లుశక్యము ?

ప -( చెవిలో) ఇటునటుయని యేదియోజెప్పినది. అతండంగీకరించెను. పరిచారిక యతని యనుమతివడసి యతఃపురమున కరిగి యావృత్తాంతమంతయు రుక్మిణి కెఱింగించినది.

రుక్మిణియుఁ బరిచారికయగు రేవతిచెప్పిన మాటలు విని పర మానంద సంభృతహృదయయై మనోహరమణిభూషాంబరధారిణియై నాఁటిసాయంకాలమునఁ బెందలకడ నశ్వశకటమెక్కి రేవతి తోడరాఁ గేళీవనంబున కఱిగినది భర్తృదారిక నేఁడు వేగమువచ్చినదని తొందరపడుచు వనపాలికలు పీఠాదికముల సవరింప వారిదెసంజూడక నితర విశేషము లేవియు బరిశీలింపక నాచంపకగంధి తిన్నగాఁ గేళీసౌధంబునకుంబోయినది.

పుష్పపాలికలు మాలికలుగుత్తులులోనగు పూవుటెత్తులఁ గాను కలగాఁ దీనికొనివచ్చి మూఁగి యందీయుఁడు నందుకొని వారినందఱ దూరముగాఁ బోవునట్లు పనులునియమించి రేవతితో సౌధాంతరమున వసించి యేకాంతమాడుచు నాపురుషునితో నేమనిచెప్పితివి? ఏమని యుత్తరమిచ్చెను ? మఱలనొకసారి చెప్పుమని యడిగిన నాపడఁతి యిట్లనియె. దేవీ ! యాచతురుండు నన్ను వేపి వేపి చివరకు యధార్ధము జెప్పెను. చారుమతిమాట యేమియుఁ జెప్పలేదుకాని తాను స్త్రీవేషముతో నీయుద్యానవనమున సాయంకాలమున వచ్చుటకంగీకరించెను నన్ను ద్వారమునొద్దఁ గాచిగొనియుండుమనియెను. ఈచిత్రఫలక మతనిదే. స్పష్టముగాఁ జూచితినని యాకథయంతయు నెఱింగించిన మేను పులకింప నా కురంగనయన వేళయైనది. నీవు గుమ్మముదాపునకుఁ బోయి కాచికొనియుండుము. నీవు లేకున్న జిక్కు పడఁగలఁడు. క్రొత్త వాఁడుగదా.? యని రేవతికి నియమించి యతండువచ్చిన తరువాతఁ దాను గావింపవలసిన కృత్యములగుఱించి యాలోచించుచుండెను.

రేవతియుఁ దోటగుమ్మముదాపునకుఁబోయి యతనిరాక కెదురుచూచుచుండెను. సూర్యుండపరగిరిశిఖర మలంకరించు సమయమున నొకరమణీమణి యాద్వారముదాపునకు వచ్చినది.

ఆయువతీమతల్లినిఁ జారుమతిగాఁ దెలిసికొని రేవతి యబ్బురపాటుతో నోహో ! మోహినీ! క్రొత్తదానవువలెఁ జంకుచుంటివేమి? నెందుబోయితివి. రాజపుత్రిక యిందేయున్నది. రమ్ము. నీవియోగమున మిక్కిలి పరితపించుచున్నదని పలుకుచుఁ జేయిపట్టుకొని లోపలీకిఁ దీసికొనిపోయి రుక్మిణికడఁ జేర్చినది.

రుక్మిణి యాముద్దియంజూచి దద్దరిల్లుచు నద్దిరా! మాపుణ్యము సఖీ ! నన్నెంతమోసము జేసిపోయితివి ! యీనాలుగుదినములు దుదిన్‌నములైనవిగదా ? యని పలుకుచు గాఢాలింగనము జేసికొని మంచముపైఁ గూర్చుండఁబెట్టికొని యెక్కడికిఁబోయితివో చెప్పుమని గట్టిగా నిర్భధించుటయుఁ జారుమతి నవ్వుచు జవ్వనీ ! నేనిఁక నీకడ నుండనోప. మీయన్న నన్నుఁగన్నది మొదలు మదనవేదనంబొదలుచు ననేకవార్తల నంపుచున్నాడు. ఆప్రమాదమెఱిఁగి నీ కెఱిఁగించిన బోనీ యవని నాఁడు చెప్పకయే తప్పించికొనిపోయితిని. అక్కటా ! స్నేహానుబంధము కడుచిక్కనిదికదా ? కాశికింబోవలయునని తలంచియుఁ గాళ్ళురాక యిందు నీరాకవిని మఱియొకసారి చూచిపోవలయునని వచ్చితిని. కన్నులు చల్లబడినవని పలికిన విని రుక్మిణి యిట్లనియె.

సఖీ నన్ను వియోగసాగరంబున మునుంగఁజేసి యేగితి వది యట్లుండె నాప్రక్క నెవ్వనినో పరుండఁబెట్టిపోయితి నతం డెవ్వఁడు? అంతలో స్మృతినభినయించుచు రేవతీ! యీయుత్సవములో నామాట మఱచిపోయితివిగదా ? నీవువోయి ద్వారమున వేచియుండుమని దాని నియోగించి మఱియు నామెతో నేనది స్వప్నమనుకొనుచుఁ గొంతసేపు తొట్రుపాటు చెందితిని. అతనిరూపు కన్నులకుఁ గట్టినట్లుండుటఁ జిత్రఫలకమువ్రాసితి నిదిగోచూడుము. నీవలె నతండును తెల్లవారక పూర్వమే యెందో పోయెను.

అది యింద్రజాలమో స్వప్నమో నిజమో తెలియకున్నది. ఆపురుషుఁడెందైనఁ గనంబడునేమోయని రేవతిచేతికాచిత్రఫలకమిచ్చి పట్టణమంతయుఁ ద్రిప్పించితిని. నీయొద్దదాచనేల ? ఆతండొకచోటఁ గనంబడి యాఁడువేషముత నీయుద్యానవనమునకు వత్తుననిచెప్పెనఁట అందులకే మేము పెందలకడవచ్చితిమి వానినిమిత్తముబంపిన నీవు గనంబడితివి. ఇప్పుడు వెండియు రేవతి యందులకేపోయినది. ప్రియ సఖీ ! యిఁకనాకుఁ గొదవయేమియున్నది. నీవేవచ్చితివిగదా ? ఆపురుషునివృత్తాంతము చెప్పుమని గడ్డముబట్టుకొని బ్రతిమాలికొన్నది.

చారుమతి నవ్వుచు నతండొక దివ్యపురుషుఁడు నీకట్టివాఁడు భర్తగానుండిన బాగుండుననితలంచి తారతమ్యపరీక్షకై నీప్రక్కఁబరుండ బెట్టితిని. నీవు జూచుకొంటివిగదా?, నీకనుకూలుఁడనితోచెనా? సౌందర్యమెట్లున్నది ? చెప్పుమనియడిగిన నాపడఁతుక అబ్బా! యీమాటలకేమి ? సఖీ ! వాఁడెందువోయెనో చెప్పుము. అనుకూలుఁడనితోచి యేకాదా నీవు వాని నాప్రక్కఁబరుండఁబెట్టితివి. నీకంటే నేనెఱింగిన దాననా? వానింజూపుమని మఱియును బలవంతపఱచెను,

అట్లున్మత్తాలాపము లాడుచుండఁ బకపక నవ్వుచు జారుమతి యూరక తొందరపడియెద వేమిటికి? యీరేయి నిందువత్తునని యతండే చెప్పెనుగదా ! రానప్పుడు చూతుముగాని వానింగూడిన నిఁకనాతో మాటాడవేమో ? వాఁడువచ్చిన నేమిచేయుదువు ? నిజము చెప్పుము ? అని యడిగిన నమ్మగువ సిగ్గుతోఁ బోనిమ్ము నేనేమియు మాటాడను. అంతకును నీదేభారము అని యూరకొన్నది. అంతలోఁ జీఁకటిపడినది. రేవతి యరుదెంచి దేవీ! నియమించిన సమయము దాటినది. ఇఁకరాడు. అది కపటపుపలు కేమోయని నివేదించినది. రుక్మిణి దైన్యముదోప నంతయు నీమెలోనున్నది. మనము వెఱ్ఱిపడుచుంటిమి. ఈమె సెలవులేక యాపురుషుండు మనచెంతకువచ్చునా ? అందుల కీమెనే యారాధింపవలయుననిపలుకుచు నామెకైదండఁగొని బండి యెక్కించి యంతఃపురమునకుఁ దీసికొనిపోయినది.

ఇంటికిఁబోయినదిమొదలావాల్గంటి యొండుతలంపులేక చారుమతితో సఖీ ! ఆపురుషుడెవ్వడు ? ఎక్కడనుండితీసికొనివచ్చితివి ? ఎక్కడికిఁబంపితివి? అతండు స్త్రీ వేషముతో వత్తుననినమ్మించి యేటికి రాలేదు ? అందునీప్రోత్సాహము కొంతయుండవచ్చును. మొదటఁ గావలివారలఁదప్పించి యెట్లులోపలికిఁ దీసికొనివచ్చితివి ? నీవుసర్వదా మాయొద్దనేయుండుదానవే ! యవ్వలికెట్లుపోయితివి ? తలంచికొన నేమియు సందర్భముకలియుటలేదు నీశిష్యురాలిం గనికరించి నిక్కము వక్కాణింపుము. దాచనేల? ఆ దివ్యపురుషునిఁ జూచినది మొదలు నామదినేదియో పరితాపము జనించుచున్నది నీపాదంబులకు మ్రొక్కెద నీబోధ వోగొట్టుమని యడుగులంబడి గట్టిగా నిర్బంధించినది.

అప్పుడు చారుమతినవ్వుచులేవనెత్తి గౌఁగిటజేర్చుకొని చెక్కులు సవరింపుచు మానినీ ! వానింజూపించిన సంతసింతువా ! ఏమి చేయుదువు ! ఇప్పుడే మఱలఁ దీసికొనివచ్చెద నేమి పారితోషికమిత్తువో చెప్పుము. అతండు దివ్యుఁడనిచెప్పలేదా? వానిరాకకుఁ గోటలు నగడ్తలు నాటంకములుకావు. అదియోగశక్తి యని పలికిన నక్కలికి మఱియు వివహాతురయై నీకు వాని నిప్పుడు తీసుకొనివత్తువేని నిత్యము నీ పాదసంవాహనము గావించుచుండెద నింతకన్న వేరేమిచ్చినను నీకు సంతసము గాదుగద. నాదేహము నీకర్పించెద నీకు దాసురాలినైయుండెదనని చెప్పినవిని యాచారుమతి కానిమ్ము ఎట్లైన నీయభీష్టము తీర్చుట ముఖ్యము ఇప్పుడే రప్పించెదఁ గన్నులుమూసికొమ్ము. తెరచినఁ బ్రమాదముసుమీ? యని చెప్పిన నప్పడఁతి కరతలములఁ గన్నులపైఁ గప్పికొని గట్టిగా మూసికొన్నది.

అప్పుడు చారుమతి

గీ. దివ్యపురుష ! రమ్ము ! ధృతివాయ రుక్మిణీ
    రమణి నిన్నుఁగూర్చి రక్త యగుచు
    విరహబాధఁ జెంది పరితాప మందెడు
    గరుణ వేగవచ్చి కావుమయ్య.

అని చదువుచుఁ దన స్త్రీవేషముదీసి తొంటిపురుష వేషమును ధరించి యందున్న పుష్పమాల్యాను లేపనాదుల నలంకరించుకొని రుక్మిణి ప్రక్కంగూర్చుండి సన్నని యెలుంగుతో అబ్బా! యీచారుమతి పలుమారు రప్పించి వేపుచున్నది గదా! యామెమాట నతిక్రమించుటకు మనసొల్లకున్నది చారుమతీ! నీవు వెళ్ళుచుంటివి? నన్నేమిచేయుమనియెదవు ! అదియా ! సరేపొమ్ము. అనిపలుకుచున్న సమయంబున నిలువలేక రుక్మిణి కన్నులం దెరచినది. చారుమతీయందులేదు. నాఁటిరాత్రి తన ప్రక్కఁబండుకొనియున్న పురుషుఁడతఁడే తనయెదుటఁబ్రత్యక్షమయ్యెను. అప్పుడామెమేనసాత్విక వికారములన్నియుఁబొడసూపినవి సిగ్గుచేఁ గొంతసేపేమియు మాటాడినదికాదు. తలవంచికొని యేదియో ధ్యానించుచు నోరచూపులనతనిఁ జూడఁదొడంగినది. అప్పుడా పురుషుఁడు మందస్వరముతోఁ దలోదరీ ! బెదరెదవేల ? నన్ను రప్పింపుమని చారుమతి నెంతయో ప్రార్థించితివఁటకాదా ! సన్నిహితుఁడనైన నాతో మాటాడవేమి ? నీకామితమేమియో చెప్పుము. నే నిందు మసలరాదు వేగఁ బోవలయుననుటయు నారమణి యెట్టకే సిగ్గుదిగంరింగి యిట్లనియె.

మనోహరా ! మీరును జారుమతియు నింద్రజాలవిద్యల నెఱింగిన ప్రోడలు. మీ రాకపోకలు గ్రహించుట దుర్ఘటముగా నున్నది. ఇంతలో జారుమతి యెందుబోయినది? మీ రెక్కడినుండి వచ్చితిరి ? మొదట నామెమిమ్ము నాప్రక్కబరుండఁబెట్టిన యభిప్రాయమేమియో చెప్పినచో నామనోరధ మెఱిగింతు. నామాట యడుగుటకే మిమ్ము రప్పింపుముని ప్రార్థించితినని చెప్పిన నతండు మేలు మేలు. ఆమాట యామెనడుగవలయుంగాని నన్నడుగనేల? ఆమె యభిప్రాయమునకు నేనెట్లు సమాధానము చెప్పువాఁడ? అని యుత్తరమిచ్చిన నమ్మత్తకాశిని మఱల నిట్లనియె.

బాగుబాగు మీరేమిటికివచ్చితితో మీకే తెలియదా? అట్లైన నామెనడిగెద రప్పింపుఁడు లేకున్న మిమ్మిప్పుడే యంతఃపురావరోధాపరాధమునకు బద్ధుంజేయించెద నేమి జెప్పెదరని యడిగిన నతండు నవ్వుచు నిదివఱకే భవదీయ మంజులవాంఙ్నిగళ బద్ధుండనైతిని మఱల బద్ధుంజేయ నేమిలాభము అని యీరీతి వారిరువురు గొంతసేపు పరిహాస వచన రచనలతో గాలక్షేపముచేసిరి.

ఆసంవాదములో పలువరుసతీరు కనుదమ్ములసొంపు. చెక్కుల గురుతులు స్వరమాధుర్యములోనగు విషయంబులన్నియు బరీక్షించుచు నాఁడు ద్వారపాలు రాడినమాటల స్మరించుకొనుచుఁ దనయన్న యంతఃపురమునకువచ్చి యడిగిన సంగతుల జ్ఞాపకము చేసికొనుచు జారుమతివేషముతో నాపురుషుఁడు తన్నుమోసముచేసెనని నిశ్చయించుకొని యతని మొగము పలుమారు చూచిచూచి యా నిశ్చయము దృఢపరచుకొని సంతసము పట్టఁజాలక గుభాలున నతనిచేయింబట్టుకొని అమ్మ నేజెల్ల? చారుమతీ ! నన్నెంతమోసము జేసితివి? నీ మాయలన్నియు నాలోచించుచునే మాటాడుచుంటిని. దొంగతనము బయలైనది ఇఁకనీగుట్టుదాగదు అంతయు నేనేచెప్పెదవినుఁడు మీరు నా గుఱ్ఱమెక్కి యాఁడువేషముతో నాయుద్యానవనమునకు వచ్చితిరి. నాఁటనుండియుఁ దెలియకుండ మెలఁగితిరి. ఇఁక నిలువలేక బయల్పడిరి. మీరు రేవతితోఁ జెప్పినట్లుగా స్త్రీవేషము వై చికొని యాతోటకు వచ్చితిరి. చారుమతియనుకొని భ్రమసితిమి. ఇక్కడ మీకపటమంతయు నభినయించితిరి. తెలిసికొంటినా! ఇఁక నాకువెఱపు లేదు. చనువుగలిగి యున్నవారగుట నాయిష్టమువచ్చినట్లు మాట్లాడవచ్చును. అమ్మా! నా గుట్టులో మీగుట్టుచెప్పరా! అనిపలికి యతనిం గౌఁగిలించుకొన్నది.

అతండును తమినిలుపలేక తదనుగుణక్రీడా విశేషములచే నమ్మదవతిని నానందసాగరమున ముంచివై చెను.

సీ. ఇది లతావేష్టితం బిది క్షీరనీరంబు
                  నమితక స్ఫురితక సమము లివియ
    యిది యర్ధచంద్రిక యిది శశప్లుతకంబు
                  మణిమాల యిది బిందుమాలయిదియ
    యిది భుగ్నకంబిది యింద్రాణికముపిడి
                  తకవేష్టితక సంపుటకము లివియ
    యిది వృషాఘాతకంబివి మంధనవరాహ
                 ఘాతనిర్ఘాత ప్రేంఖతకములు.

గీ. భ్రమరకంబిది సందంశ భావమిదియ
    యిదియ స్తనితంబు కూజితంబిదియ రుదిత

    మనుచు నెఱింగించెఁ దత్తత్క్రియావిశేష
    గతుల జూపుచు రతుల నాయతివ కపుడు.

మున్నుతానా యువతి కెఱింగించిన శాస్త్ర లక్షణంబులకు లక్ష్యంబులు సూపుచు నత్తన్వితోఁ బరమానంద మనుభవించెను అని యెఱింగించువఱకు.

150 వ మజిలీ.

−♦ యక్షిణీగానముకథ. ♦−

తెల్లవారక పూర్వమే రుక్మిణి యంతఃపురమునకుఁ దిరుగాఁ జారుమతివచ్చిన దనువార్త రాజపుత్రునకుఁ దెలిసినది. అతండప్పుడ యయ్యంతిపురికిఁ గ్రొత్తకావలి వారల నియమించి సెలవులేనిదే యెవ్వరి నవ్వలకుఁ బోనీయవలదని శాసించి వెంటనే దత్తకాదులఁ దీసికొనిరమ్మని యొక పరిచారకునిఁ బంపెను.

గడచిన సాయంకాలమునుండియు దత్తకునిజాడ దెలియక కుందుచున్న గోణికాపుత్రుండా దూతతో రాజపుత్రునియొద్ద కరిగెను. చారుమతి రుక్మిణి యంతఃపురమునకు మరలవచ్చినదఁట. మనమిత్రుడు దత్తుఁడేమయ్యెను? అతని ప్రతిజ్ఞఁజూపింపవలసిన సమయమువచ్చినదని మదనోన్మాదంబునఁ బలికిన రాజపుత్రుని మాటలవిని గోణికాపుత్రుండు విన్ననగు మొగంబుతో దేవా ! అతండు నిన్ననొకపనిమీఁద నూరికిఁ బోయెను. రెండుమూఁడు దినంబులలో రాఁగలడు. ఆమెరాక వానికిఁ దెలిసినఁ బోకుండునుగదా? యని చెప్పినవిని రాజపుత్రుఁడు సరి. సరి. ఏదియో యంతరాయము వచ్చుచునేయున్నది. మీరతండెందుండెనో యక్కడికేపోయి శీఘ్రమ తీసికొని రావలయును. జాగు సేయకుఁడు పొండు. కనంబడలేదని తిరుగావచ్చిన ననుమతింప, నిదియే మీరు నాకుఁ జేయునుపకారమని పలికి వానినంపివేసెను.

అతండింటికిఁబోవుచు నక్కటా! ఇతని యిక్కట్టు మిక్కుటము