కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/151వ మజిలీ

వికీసోర్స్ నుండి

నేడువఁదొడంగిరి. చింతామణియుఁ బ్రాజ్ఞురాలయ్యు దేహవాసనంజేసి వారితోగూడఁ గొంతసేపువిలపించి పిమ్మటవారి నూరడించుచు నతండు మహర్షి యనియుఁ బాదరక్షలమూలమున మీయింటబుట్టెననియు మీ ఋణముతీర్చుకొని ముక్తుడయ్యెననియు నావృత్తాంతమంతయు నెఱిఁగించి వారికిశోకోపశమనము గావించినది. వాండ్రును తదుపదేశబలంబున విరక్తిజనింప నిల్లువిడచి తీర్థయాత్ర సేవించి ముక్తులైరి.

చింతామణియు నామహాత్ముండుచెప్పిన నాలుగుశ్లోకముల యందును బ్రస్థానత్రయమందుఁగల తాత్పర్యముండుటంబట్టి వానినే స్మరించుకొనుచు మహాయోగినియై దేశపర్యటనము గావించుచు ముక్తురాలయ్యెను.

చిత్రసేనా ! వేశ్యయైనను జింతామణి వైరాగ్యబుద్ధిచే నెట్లు వర్తించెనో చూచితివా ? ఎటువంటిజ్ఞానవంతు రాలయ్యెనో తెలిసికొంటివా! అని గోణికాపుత్రుఁడు చింతామణి యుదంతమెఱింగించిన విని యాగణికా పుత్రిక లిరువురు పరమానందపూర్ణహృదయులై యతని నగ్గించిరి.

అని యెఱింగించునంత సమయాతీతమగుటయు మణిసిద్ధుం డవ్వలికధ యనంతరపుమజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.

148 వ మజిలీ

−♦ ఢాకినీదేవతకథ ♦−

ఒకనాఁడు మతంగయోగిని యిరువురు రాజభటులతో నొకమార్గంబునంబడిపోవుచు నిట్లు సంభాషించినది. దూతలారా! మన మహారాజుగారి దేశావసాసము సమీపించుచున్నది. వాండ్రీపాటి కీదేశము దాటిపోవుదు రేమో? అన్యదేశమున మనము వారింబట్టి కొనవచ్చునా ? అని యడిగిన రాజకింకరులిట్లనిరి. దేవీ! మన మితరదేశమున వారింబట్టికొనరాదు. అందున్న యధికారులకు మనరాజశాసనము జూపి వారివలన మఱియొకశాసనము వడసి యప్పుడు వారింబట్టికొన వలయును. వెనుకటి గ్రామస్థులు జెప్పిన మాటలంబట్టి వారింకను మనదేశము దాటిపోవఁజాలరు. నీవు నడువజాలమింజేసి యింతయాలస్య మగుచున్నది. మేమైనచో నీపాటికే వారింగలసికొందుము. వేగమునడువుము. అని పలుకుచు నారాజప్రణిధులు యోగినితోఁగూడ తొందరగాఁ బయనము సాగించుచు జాముప్రొద్దువేళకు ముందరపల్లెఁ జేరిరి.

అందలి వారిఁజూచి పురుషవేషములు వైచికొనిన యిరువురు చక్కని స్త్రీలతో నొకబ్రాహ్మణుఁ డీదారింబోవుచున్నాడు. మీకుఁ గనంబడెనా? అని యడిగినవాండ్రు ఓహో ! వారుస్త్రీలా? పురుషులను కొంటిమి ఇంతకుముందే యీయూరుదాటిపోయిరి. బండిమీఁద బోవుచున్నారని చెప్పిరి.

అప్పుడు రాజభటులా గ్రామాధికారులకు రాజుశాసనము దెలియఁజేసి కొందఱి మనుష్యుల సహాయముగాఁ దీసికొని వడివడిగపోయి క్రోశదూరములో వారింగలసికొని బండికడ్డముగానిలువంబడి నిలువుఁడు నిలువుఁడని యదలించినవిని గోణికాపుత్రుఁడు బండిదిగి ముందరికి వచ్చి మీరెవ్వరు ? మమ్మాపెద రేల ! అని యడిగిన రాజభటు లిట్లనిరి.

పాటలీపుత్రవాస్తవ్యురాలగు రతినూపురయను వేశ్య తనపుత్రికల మిక్కిలి వెలగల మండనములతోఁ దనకు దెలియకుండ నీవు తీసికొనిపోవుచుంటివని నీపైనీదేశప్రభువగువిపులునియొద్ద నభియోగము దెచ్చినది. నీయపరాధము విమర్శించుటకై మిమ్ముఁబట్టి తీసికొని రమ్మని మాఱేఁడాజ్ఞాపత్రిక వ్రాసియిచ్చెను. ఇదిగో చదివికొమ్ము. అని పలికి యా శాసనపత్రిక నిచ్చిరి. దానింజదివికొని గోణికాపుత్రుఁడు మందహాసము గావింపుచు మీఱేని న్యాయాథిపత్యము స్తుత్యమై యున్నది ఇదియంతయు మతంగయోగిని కావించిన కల్పితము. కానిండు రాజ శాసనమునకు బద్ధులము కావలసినదే అట్లెవత్తుము పదుఁడు అని పలికి, బండివానితో వెనుకకుఁ ద్రిప్పుమని నియమించెను.

అంతలో మతంగయోగిని యక్కడకువచ్చి వారిం జూచి దొంగలు దొరకిరా? కానిండు. వీరిం బదిలముగాఁ దీసికొనిపోవలయు రూపులుమార్చి తిరుగుచున్నారని గంభీరముగఁ బలికినది గణికాపుత్రిక లాయోగినింజూచి యోసీ! మాయావినివై కపటయోగవతివని గ్రుమ్మఱుచున్న నీవు మోసకత్తెవు కాని మేము కానేరము. మేమెవ్వరిసొమ్మును దీసికొనిరాలేదు. మమ్ము రాజన్యాయముగా శిక్షింపఁబూనిన దైవములేడా? కపటముచేసి చెప్పినట్లు చేయలేదని నీవే యిట్టి కల్పితము చేసితివి. కానిమ్ము, అని ఏమేమో నిందింపఁబూనిన యోగిని రాజభటులఁ బురికొలిపినది.

వాండ్రు క్రోధముఖులై యదలించుచుఁ జాలుఁజాలు మాటాడకుఁడు ఇంటికడ సుఖముండలేక తల్లిమాట వినక బోడిబాపనవానిఁ దగిలికొనిపోవుచు నేమేమో యరచెదరేల? పదుఁడు పదుఁడు. మీపాటులు ముందున్న వి. ఇప్పటికైన వీనిని విడిచి మీతల్లి సెప్పినట్లు విందురేని బ్రతికిపోవుదురు. అని విచ్చుకత్తులు చేతంబూని బెదరించిరి గోణికాపుత్రుండు వారిమాటల కడ్డమువచ్చి మీ రేమియుఁ జెప్పనవసరములేదు. రాజునొద్దకువచ్చి వారికిఁ దోచిన మాటలఁ జెప్పుదురు. అన్యాయముండిన శిక్షించుఁగాక యపరాధులమని తోచిన దండించుఁ గాక మీ కాగొడవలేమిటికి? పదుఁడని యుపన్యసించెను.

ఓహో ! బాపనవాఁడు పొగరెక్కి కూయుచున్నాఁడు. తానపరాధియని యెఱుఁగఁడు ఇదియెట్టి నేరమో తెలిసికొనకున్నాఁడు పారిపోవఁగలఁడు చేతులకు నిగళములు దగిలింపుఁడు. అని యదలింపుచుండ వారికిఁ దోడువచ్చిన గ్రామాధికారులతఁడు మహాపండితుఁడని తెలిసికొని యతండు పారిపోవకుండ తాము పూటకాపులుగా నుందుమని బోధించి యెట్టకే విడిపించిరి. తరువాత వారి వీణాదిగానసాధనము లన్నియు నందలిపల్లెలోఁ బడవైచి వేశ్యాపుత్రికల నిరువురను యోగినిని నొకబండిలో నెక్కించి గోణికాపుత్రుని వెనుక నడిపించుచు విచ్చుకత్తులఁ జేతులఁబూని ముందొకఁడు వెనుక నొకఁడు నడుచుచు మహాపుర నగరాభిముఖులై పోవుచుఁ గొన్ని పయనంబులు సాగించిరి.

ఒకనాఁడొక యరణ్యమార్గంబునం బోవునప్పుడ మతంగయోగిని రాజభటుల రహస్యముగాఁ జీఱి దూతలారా ! రాజు మీతో నేఁ జెప్పినట్లు చేయుమనికదా ఆజ్ఞాపించెను. ఈప్రాంతమందు ఢాకినీదేవి యాలయమున్నది. అమ్మహాదేవిని దశిన్ంచి సేవించి యరుగుదము గాక. మనము దలఁచినకార్యము సఫలము గాఁగలదని నియమించిన వా రంగీకరించి యాదారినే బండిని నడిపింపజేసిరి. అమ్మవారి యాలయము కొంచెము దూరములో నుండఁగ బండియాపించి యోగిని రాజభటులతో నేకాంతముగా నిట్లు చెప్పినది..

నేను మహారాజు నిమిత్తమై యీగణికలలో నొకదానింగూర్ప నింతప్రయత్నము చేసితిని అతండు పెద్దదాని దాను స్వీకరించుటకును రెండవదానిని నాకిచ్చుటకు నంగీకరించెను. నేను ఢాకినీదేవతను జిరకాలమునుండి యారాధించుచుంటిని చక్కని వేశ్యాపుత్రిక నొకదానిం బలియిత్తునేని యమ్మవారు నేను గోరినవరము లీయఁగలదు. అందులకే నేనీ విశ్వప్రయత్నము చేసితిని. మీ దయవలన నా మనోరధము దీరఁగలదు వినుఁడు మీకంటె రాజు నా కెక్కుడు చుట్టము కాఁడు మీకును నాకును నుపకారమగు తెరువాలోచించితిని. ఈ బ్రాహ్మణుఁడు చాలగట్టివాఁడు రాజునొద్దకుఁ దీసికొనిపోయినఁ దనపాండిత్యము చూపి ఱేనిమతి త్రిప్పఁగలడు కావున నిప్పుడే మనయభీష్టము దీర్చుకొందము. పెద్దదాని మీయిరువురు తీసికొనిపొండు. రంభవంటిదాని పొందుగాంచి యానందింపుఁడు రెండవదానిని నాకిండు అమ్మవారికి బలియిచ్చి కోరికలఁబడసెద నిట్లుచేయుఁడు. అని యేమో బోధించిన వాండ్రు తలయూచి యాలోచించి చిత్రసేనసోయగము దలంచి యనుమోదించిరి. వాండ్రు మీసములుదువ్వుచు బండిదగ్గిరకువచ్చి బాపనోడా ! యీ యాఁడువాండ్రు మువ్వురు నీదాపుననున్న యమ్మవారి గుడికిఁబోయి వత్తురు. బండివాఁడును నీవు నిందుండుఁడు.

వారు వచ్చినతరువాత నవ్వలపోవుదమని పలికిన గోణికాపుత్రుండు మేము మాత్రమురాఁగూడదా? ఢాకినీదేవిమాకు సేవ్యురాలు కాదా! అని యడిగిన కింకరులు మగవారందుఁ బోరాదు మీరిందే నిలువవలయుననుటయు నతండు మీరు మగవారుకారా ? మీరెట్లు పోయెదరు? అని యడిగెను.

బాగు బాగు. మాకాజ్ఞాపింప నీ వెవ్వఁడవు ? పాఱుఁడవుగదా యని సంకెళ్లువైవక విడిగాఁదీసికొనిపోవు చుండఁ బొగరెక్కిపోయితివే మేము కావలివారము పోవచ్చును. మీరు రారాదు. నిలునిలుమని పలుకుచు నదలించి గట్టిత్రాళ్ళచే నతని నొకచెట్టునకుఁగట్టి కదలకుండ బారిపోవకుండ జూచుచుండుమని బండివానికి నియమించివాండ్రాయాఁడువారిం దీసికొని యమ్మవారి గుడియొద్దకుఁ బోయిరి.

పిమ్మట గోణికాపుత్రుండు బండివానితో నోరీ ! యారాజభటులు కడుదుర్మార్గులు. ఆసుందరుల మానభంగముగావింప మనల నిందునాపి వారిందీసికొనిపోయిరి. మనయెదుట నక్రమముజరగుచుండ నూరకుండుట ధర్మముగాదు. నీకుమాత్రము ధర్మాధర్మ వివేచనము లేదా? నీవు జూచుచునేయుంటివి. ఆబాలిశులు యోగినియు గుజగుజ లాడుచు, గపటముచేయుచుండలేదా! నీవిప్పుడొకయుపకారము సేయ వలెను. నాకట్టుల విప్పుము. మనమిరువురముపోయి వారినదలింతము. గ్రుక్కెడుప్రాణము లెప్పుడుపోయినను పోవునవియేకదా. అబలలకు నన్యాయము జరగుచుండఁ గన్నులారఁజూచుచుండట నీతీయా ? అని వానికి జాలిపుట్టునట్లు పన్యసించిన విని యాబండివాఁడు సాహసముతో నాతనికట్టులన్నియఁ ద్రెంపి పారవైచెను.

అప్పుడు గోణికాపుత్రుఁడు బండివాని వెంటఁబెట్టికొని వీరావేశముతో నారసింహమంత్రము జపించుచు నాఢాకినీదేవిగుడి దాపునకుఁ బోయెను.

విశాలశాఖలచే దిగంతములనావరించిన వటతరువుక్రింద పృధుశిలానిర్మితమగు నాలయములో ఢాకినీదేవి యొప్పుచున్నది. నాలుక జ్వాలికవలె వ్రేలాడ దంష్ట్రాకరాళవదనయగు నాదేవివిగ్రహము చూచువారికి వెఱుపుగలుగక మానదు. మెడఁ గపాలమాలికయు హస్తంబుల ససిగదాతోమరాద్యాయు ధంబులును వెలయ సింహాసనమున నాసీనయై యొప్పుచుండెను.

శక్తి గుడిమ్రోలనున్న నేలయంతయు నరులచే బలులొసంగిన జంతువులరక్తముచే సిక్తమై యట్టకట్టఁబడి యున్నది. మఱియు నట్టిఢాకినీదేవి కట్టెదుటఁ గాలుసేతులుగట్టఁబడి మెడనుగట్టినవేపరొట్ట మోము దమ్మికి మెత్తనిపానుపై యొప్ప సాష్టాంగముగాఁ బండుకొనఁ బెట్టిన రతిమంజరియు రతిమంజరికంఠము త్తరింపఁ గత్తిపైకెత్తి శక్తిదెస దృష్టులు వ్యాపింపఁజేసి ధ్యానించుచు నేయగమకించు మతంగయోగినియు వారి కన్నులఁబడిరి.

అప్పుడు గోణికాపుత్రుఁడు రౌద్రావేశముతో నొడలెఱుఁగక నారసింహము జపించుచు నొక్కడుగులోఁబోయి యోగినియెత్తినకత్తి నట్టెపట్టుకొనిలాగి యోసీ ద్రోహురాలా ! యెంతపనిచేయుచుంటివి ? నీవంటి పాపాత్మురాలెందైనంగలదా? నీవెత్తిన కత్తియే నీకుమిత్తియైనది. నీవారాధించినదుర్గకే నిన్ను బలియిచ్చుచుంటిని. నీయభీష్ట దేవతల స్మరించుకొనుము. అని యెడమచేతితోఁ దచ్ఛిరోజములు బట్టి లాగుటయు నయ్యోగిని పెద్దయెలుంగున చచ్చితి చచ్చితి నన్ను జంపుచున్నారు. రండోయని రాజకింకరులగుఱించి యాక్రోశించినది.

అయ్యాక్రందనము విని యనతిదూరములో జత్రసేనను బలవంతపెట్టుచున్న రాజభటులు పటురయంబు శక్తి గుడి నికటంబున కరుదెంచిరి. వారింజూచి గోణికాపుత్రుండు యోగినినివిడిచి మదపుటేనుగపైగవియు సింగంబు కొదమయుంబోలె గరవాలంబు నవలీలఁ దిప్పుచు ముప్పిరిగొను కోపముతో గుప్పనవారిపై కురికెను. తోడనే బండివాఁడును రెండవవానిపయింబడియెను.

నిరాయుధులగు నాయోధు లాయసిథారులకువెఱచి యందు నిలువక వెన్నిచ్చిపరవఁదొడగిరి. వారాబంటుల విడువక వెన్నంటి తరిమికొనిపోయి నూఱడుగులలోఁ గలిసికొని యసిధారల వారల తలల నరికివైచిరి. రాజప్రణిధులు శమనలోకాతిధులైనవెనుక గోణికాపుత్రు డాప్రాంతమందు వెదకి యొడలెఱుఁగక యొకచో నేలంబడియున్న చిత్రసేనంగాంచి శోకగద్గదకంఠుండై కలకంఠీ ! లెమ్ము లెమ్ము. దైవము నీయిక్కట్టుతొలగించెను. శత్రువులు నాశనమైరి. నేను నీమిత్రుండ గోణికాపుత్రుండని పిలిచినంత నమృతమువర్షంచునట్లు మురియుచు బోగముపట్టెయట్టెలేచి యతనింగౌఁగలించికొని మహాత్మా! ఎట్లువచ్చితివి ? శత్రువులెట్లుహతులైరి ? అయ్యో ! మనకెట్లు చిక్కుదినములు వచ్చినవి. మమ్మందుఁగట్టి నప్పుడే మాకు దెలివిదప్పినది. రతిమంజిరిని శక్తికిబలియియ్య యోగినికప్పగించి యాపాతకులు నన్నుదూరముగాఁ దీసికొనివచ్చి మచ్చికగా నేమేమో ముచ్చటించిరి. కాని యామాటలేమియు నాజెవింబడ లేదు. వివశనైపడిపోయితిని. ఇప్పుడు మీమాట వినినంత స్మృతివచ్చినని. నాముద్దుచెల్లెలు బ్రతికియున్నదా? అనియడిగిన గోణికాపుత్రుండు దానికిపెద్దగండము దాటినది. శక్తికి బలియియ్య కత్తి యెత్తి యేయబోవునంతలో నేనుబోయి బట్టుకొంటిని. అరనిమిషముదాటిన నాబోఁటి జమువీటికరుగవలసినదే పైనదైవము లేడా అనిపలికినవిని యక్కలికియులికిపడి అయ్యో! నాసోదరి నాదరింపక విడిచివచ్చితిరా ? ఆదుష్టురాలు మఱల నేమిచేయునో పదుఁడని నొడివి వడివడివారితో నమ్మవారిగుడికడకుఁ బోయినది.

రతిమంజరి యట్టెపండుకొని బాహ్యప్రచారములేక యంతరాత్మ నీశ్వరునర్చింపుచుండెను చిత్రసేన దానిస్థితినరసి యురమునఁ గరంబిడి అమ్మయ్యో యెట్టియాపదదాటినది. తల్లీ ! చెల్లీ ! లెమ్ము లెమ్ము. తల్లికడుపున వెండియు బుట్టితివి. అనిపలుకుచుఁ జేతులాని దానిలేవనెత్తి విలపింపఁ దొడంగినది. అప్పుడు రతిమంజరి కన్నులందెరచి అక్కా ! మీరిక్కడికెప్పుడువచ్చితిరో నేనెఱుంగనుసుమీ? నాకాళ్లు సేతులుగట్టి మెడకువేపరొట్టగట్టి బలవంతమున నేలఁబండికొనఁబెట్టిరి. అంతవఱకు నెఱుంగుదును. పిమ్మటనేమయ్యనో తెలియదనిపలుకుచు దనకట్టులువిప్పుచున్న గోణికాపుత్రునికి నమస్కరించి కన్నులనశ్రువులు విడిచినది.

అప్పుడతండామచ్చెకంటి గ్రుచ్చియెత్తి కన్నీరుదుడుచుచు మనము భగవదాజ్ఞకు బద్ధులము సంసారనాటకమునకతండ సూత్రధారుఁడు. జీవులకుఁగీడుమేళులు క్రమోపగతములు రెండుగడియలక్రిందట మనము మహావిపత్సముద్రములో మునిఁగియుంటిమి ! ఇప్పుడు మబ్బువిడినట్లు మనయాపదలు పటాపంచలైపోయినవి. కపటయోగినిని లక్ష్మణుఁడు శూర్పణఖనువోలె ముక్కు చెవులుగోసి విరూపనుజేసితిని అదియిందునిలువక యెందోపారిపోయినది. రాజభటుల నిద్దరను మేమిద్దరము క్రుద్ధులమై యీకత్తులచేఁ గడతేర్చితిమి? ఇంతకు నీబండివాఁడు నాకుమంచిసహాయముగావించెను. నాకట్టులవిప్పి -తోడునీడై శత్రుసంహారముగావించెను. కత్తి ద్రిప్పుటలో వీనికిఁగలనైపుణ్యము నకులునకులేదనిచెప్పఁగలను. ఎప్పుడునేర్చెనో తెలియదనిపలికినవిని బండివాఁడు కత్తిక్రిందబెట్టి చేతులుజోడించుచు మహాత్మా! నేనేసాధనము నెఱుఁగను. బండితోలుటతప్ప వేరొకపని నాచేతగాదు నేనువట్టి పిరికివాఁడను రాజభటులఁజూచి గజగజలాడుచుందును. అదియేమి మహిమయో తెలియదు మీకట్టులువిప్పినప్పుడే నామేననేదియో యావేశమైనది. మీరాయోగినిపైకురికినప్పుడు, నామేను పొంగిపోయినది. ఏనుగంతబలమువచ్చినది. తటాలునఁబోయి యందున్న కటారింగైకొని గిరగిరదిరుగుచు నాభటునెట్టువ్రేసితినో యెఱుఁగను. ఇప్పుడే నాయావేశముడిగినది. నేజేసినపనితలంచికొన నాకే యబ్బురముగా నున్నదని యాశకటచోదకుఁడు చెప్పెను.

అప్పుడు చిత్రసేన గోణికాపుత్రునితో నార్యా ! మీరుమాత్రము కత్తిసాధనముచేసియున్నారా! యోధులపైఁబడి యెట్లుపరిమార్చితిరి ? ఇది వింతగానున్న దే యనియడిగిననతండు ఇది మదియాభీష్ట దేవత నారసింహ ప్రభావంబుగాక యొండుగాదు. నన్నువాండ్రుగట్టి నప్పుడే సకవచంబుగా నరసింహమంత్రంబు జపించితిని అమ్మహాత్ముండావేశించి మాచేనిట్టిపనిగావింపఁజేసెనని యెఱింగించెను. పిమ్మట వారుమువ్వురు నొండొరుల నూరడించుకొని యాయమ్మవారిగుడికిఁబోయి యెదురనిలువంబడి చేతులుజోడించి పెక్కువిధంబుల స్తుతియించిరి. అందుమఱియు గోణికాపుత్రుఁడు

శా. దేవీ ! నీనికటంబుసేరుటఁ గడుందీర్పంగ రానట్టి మా
    యావళ్లెల్లఁ దొలంగె నిప్పుడు ప్రహపాన్ పారవారాశిడో
    లావీచీతతి నూగుచుంటి మహితుల్ పంచత్వముం బొందిరం
    బా ! విశ్రాంతిగ నీదురూపమిటఁ ప్రత్యక్షంబుగాజూచి సం
    సేవింపందొరకొన్న మాకిచట నేసిద్ధుల్ ప్రసాదింతువో ?

అని భక్తివివశుఁడై కన్నులుమూసికొని ఢాకినీదేవత ననేక ప్రకారంబుల గొనియాడుచుండ నతనిచెవులకు విద్వాంసుఁడా! నీవచిరకాలములో మిత్రులంగలసి యత్యంతసంతోషంబులం జెందకలవు. అనుమాటలు వినంబడుటయు నతండు గన్నులందెరచిచూచి యామాటలాడిన వారిఁగానక దేవీప్రోక్తంబుగాఁదలంచి యమ్మించుబోఁడుల కత్తెరం గెఱింగించె నప్పుడు చిత్రసేన యిట్లనియె.

ఆర్యా! ఇందలిశిలాశాసనము జదివిజూచితిని. మనోహరరూప యౌవన ద్యోతినియగు వారయువతింబలియిచ్చినవారి కీదేవికోరినవరంబుల నిచ్చునఁట. అందులకే యాయోగినిపలుమారు మాచెంతకువచ్చి ఢాకినీదేవియొద్దకుఁ దీసికొనిపోయెదనని చెప్పునది. దైవము దానికిబ్రతికూలుఁడై యుండ గోరికయెట్లుతీరును. విపరీతము జరగినది. దానిం జంపక విరూపంజేసి విడిచితిరి. శూర్పణఖ రావణునికిఁబోలె నిది యా రాజునకుబోధించి మఱలఁ జిక్కు దెచ్చిపెట్టునేమో ? వేగమీదేశము దాటిపోవుట లెస్సయని యుపదేశించుటయు నతండామాటల కంగీకరించెను. బండివానికిఁజెప్పి వారుబండియెక్కి హుటాహుటి పయనంబుల నాదేశముదాటి యొకనాఁటిరాత్రికి ధారానగరంబు సేరిరి. అని యెఱిగించి తరువాతికథ పైమజిలీయందిట్లు చెప్పందొడంగెను.

146 వ మజిలీ

దత్తకశాపవిముక్తి కథ.

చారుమతియు రుక్మిణియు నెప్పుడు నొక్క మంచముమీఁదనే పండుకొనుచుందురు. ఒకనాఁటిరాత్రి యిరువురు పండువెన్నెలలోఁ బూవుపానుపునఁబండుకొని ప్రొద్దుపోవువఱకు విద్యావిషయంబుల ముచ్చటించుచుండిరి. రుక్మిణిసూత్రవిషయంబులన్నియు స్మరణకుఁదెచ్చికొని సఖీ! ఛారుమతీ! నీవంటి విదుషీమతల్లివలనఁగాని యీ సాంప్రదాయములు తెలియఁబడునా; మొదటఁజూచిన నీపుస్తకమేమియుం దెలిసినది కాదు. ఇప్పుడంతయుం గరతలామలకముగా నున్నది. ఇందులకు