Jump to content

కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/150వ మజిలీ

వికీసోర్స్ నుండి

శ్లో. ఫాలేన ముగ్ధ చపలేనవిలోకనేన
    మన్మాన సె కిమపిచాపలముద్వహంతం
    లోలేన లోచన రసాయన మీక్షణేన
    లీలాకిశోర ముపగూహితు మత్శుకోస్మి.

అని యెఱింగించి తదనంతరచరిత్రము పై మజిలీయందుఁ జెప్పుచుండెను.

147 వ మజిలీ.

−♦ అగ్నిశిఖునికధ. ♦−

చిత్రసేనా! చింతామణీ సదుపదేశంబునంగాదే లీలాశుకుండు పరమభక్తాగ్రేసరుండై శ్రీకృష్ణదయాపాత్రుం డయ్యె నక్కాంత కులకాంతాతిశయనయస్ఫూర్తిఁ బేర్పొందినది సౌశీల్యంబు సహజంబుగాని కులానుగతంబుగాదని యెఱింగించినవిని చిత్రసేన పరమానంద భరితహృదయయై మహాత్మా! చింతామణి యుదంతము మిక్కిలి సంతసము గలుగఁజేసినది. మఱియు లీలాశుకుండు విరక్తుండై యరిగిన తరువాతఁ జింతామణి యెట్లు ప్రవర్తించినది ? వారిరువురు మఱల నెన్నఁడైనఁ గలిసికొనిరా? తదనంతర వృత్తాంత మాలింప వేడుకయగుచున్నది. వివరింతురే? యని యడిగిన నప్పుడమి వేల్పిట్లనియె.

బాలా ! లీలాశుకుండు. మహాభక్తుండైన పిమ్మటఁ దిరుగాఁ జింతామణి యింటికిరాలేదు. చింతామణియు నతండుత్తమవ్రతుండైం భగవంతు నారాధించుచుండెనని విని సంతసించుచుఁ దన్నుఁజూచి యతండు చాంచల్యమును నేమోయని యెన్నడు నతని దాపునకుఁ బోయినదికాదు. మఱియులీలాశుకునకు విరక్తి గలుగఁ జేయతలంపుతో నాటిఁరాత్రి వేసిన వేసమే వేషముగా తిరుగా దివ్యమణిభూషాంబరాదుల ధరింపలేదు. మేనికి నాఁడుబూసినబూడిదయే బలపరచి కాషాయాంబర ధారిణియై ప్రాగ్భవప్రభోధోద్భావంబునఁ దనయాస్తి యం తయు నర్ధిసాత్కృతముగావించినాఁడు సుతసువిరక్తయై క్రుమ్మఱుచుండెను.

అగ్నిశిఖుండను యతీశ్వరుఁడా ప్రయాగమున వ్యాసమఠములోవసించి కుతపకాలముదనుక గంగాజలంబులఁ దపంబు జేసికొనుచుఁ బిమ్మట మఠమునకువచ్చి కందమూలాదులు దిని యాఁకలి యడంచు కొనుచు నాత్మావలోకనమునఁ గాలము గడుపుచుండెను. చింతామణి యొకనాఁడా యోగిచెంతకుఁబోయి పాదంబులంబడి మహాత్మా ! నాకు విజ్ఞాన ప్రవృత్తియెఱిఁగింపుఁడని వేడుకొనునది బాహ్య ప్రచారము లేనివాఁడగుట నతనికి దానిమాట వినంబడలేదు. తనమనంబున ధ్యానించుచున్న విషయానుగుణ్యముగా.

శ్లో. యాంతేమతిస్సాగతిః .

అని చదివెను. ఆశ్లోకమువిని చింతామణి మహాత్మా ! నేను జ్ఞానాతీతమైన విజ్ఞానప్రవృత్తి యెట్టిదో యెఱింగింపుఁడని కోరికొంటిని. దేహాంతమందు మనసెట్టి గతి ననుసరించునో యట్టి గతివచ్చునని యుత్తరముచెప్పితిరి? నాప్రశ్నమున కీయుత్తరము సరిపడలేదు లెస్సగావిచారించి సదుపదేశము గావింపుఁడని వేడికొనినది. ఆమాటయు నయ్యతికి వినంబడలేదు. తనతలంపున

శ్లో. ప్రారబ్ధంభోగతో నశ్యేత్.

అను శ్లోకపాదమును చదివెను. అప్పుడవ్వారాంగన అయ్యో ఈ మాటలు వాడుకగా నందఱు చెప్పుకొనునవియే ఇవి నాకుఁ గ్రొత్తలుకావు. విధింపఁబడిన కర్మఫలం బనుభవమూలమున గాని నశింపదు. అతీతజ్ఞాన ప్రకారం బెఱింగింపవలయుఁగాని సామాన్య వాక్యములు నాకవసరములేదని పలికినది. దానియునికియు మాటలుం గూడ నతండెఱుగఁడు తానేదియో మనంబున ధ్యానించుచు

శ్లో. బుద్ధిఃకర్మానుసారిణీ

అని మఱలఁ జదివెను. అప్పుడు చింతామణి అయ్యగారూ ! మీమాటలో నొకదాని కొకటి సందర్భముగాలేదు. నామాట వినుపించుకొనకుంటిరా ? మీరు విజ్ఞానసంపన్నులని విని మీవలన నతీత జ్ఞానవిశేషంబెఱుంగు తలంపుతో వచ్చితిని. మీరు సామాన్యులు చెప్పుమాటలే చెప్పుచుంటిరి ? తగుసమాధానము చెప్పుడని ప్రార్ధించినది. అదియేమియు నతండెరుఁగక కన్నులు మూసికొనియె.

శ్లో. యోగినాంభోగినామపి

అని చదివినంతఁ జింతామణి యయ్యతి తన్నవమానించెనని యభిమానము జెందినది. తోడనే క్రోధోదయమైనది. అసూయ దానింబెని వైచికొనియె. యుండుంగదా ? నిర్మలమైన చింతామణి చిత్తమును గ్రోధాదులు స్వాయత్తమును జేసికొనినవి. ఎట్లైన నయ్యతీశ్వరుని వంచింపవలయునని యన్నెలంతకు సంకల్పము జనించి మఱి పల్కరింపక యింటికింబోయినది.

ఉ. దానము థర్మమున్ జపము తర్పణముల్ శుచివృత్తి స్నానసం
    థ్యానియమంబు లెన్నియయినం బొనరింపఁగ వచ్చుగాని వి
    ద్యానిధులైన యోగయుతులైన మహామునులైన జన్మలో
    మానసమంటియున్న యభిమానము వీడఁగ లేరు ధారుణిన్.

-♦ మాతంగుని కథ. ♦-

ఆప్రయాగమున కుత్తరముగా గ్రోశదూరములో నొక మాలపల్లెకలదు. అందు మాతంగుఁడను పుల్కసుఁడు మాలినియనుభార్యతోఁ గాపురముచేయుచుండెను. వాఁడు నిత్యము సూర్యోదయ కాలమున గంగలో మునింగి రవిబింబమునకు మ్రొక్కి యింటికివచ్చి పట్టెవర్ధనములుపెట్టి తనగుడిసెలో నొకమూలవేదికపై దేవతగా నిలిపియున్న మట్టి విగ్రహమును బూజించి పిమ్మటఁ గులవృత్తి జేసికొనుచుండును.

వాని పెండ్లాము మాలినియు వాని చిత్తవృత్తి ననుసరించి నిత్యము శుచిగా వాఁడు గంగకుఁబోయి వచ్చులోపల గుడిసెయుఁ జుట్టువేదికయు నలికి మ్రుగ్గులు పెట్టుచుండును. కోడి, కుక్క, పంది లోనగు నీచజంతువుల నాప్రాంతము చేరకుండఁ గాపాడుచుండును. పంచములలో సంతానశూన్యులుండుట యరుదు ఆపల్లెలో మాతంగుఁ డొక్కఁడే యనపత్యుఁడు ఒకనాడు మాలిని మగనితో నాథా! మనకులము వారందఱికి సంతతి పూర్తిగాఁ గలిగియున్నది. ఇందు మనమే బిడ్డలులేనివారము. నీవు కులవిరుద్ధముగా స్నానము జపము పూజలు సేయుచుండుటచేఁ బిల్లలు గలుగలేదని యెల్లరు చెప్పికొనుచున్నారు. తండ్రితాత లెఱుంగని యీనియమబులు మనకేల? ఇదిబెడిసికొట్టిన దేమో మానివేయరాదా ? అని యుపదేశించిన మాతంగుఁడిట్లనియె.

ఓసీ! వెఱ్ఱిదానా! మనము పెట్టిపుట్ట లేదు. చేసికొనక యేదియు రాదు. స్నానము పూజయు బిడ్డల కడ్డుపెట్టునా ? మన కులమువారు తెలియనివారగుట నట్లనుచున్నారు ఆమాటలఁ బాటింపకుము. యోగముండిన మానదని సమాధానముజెప్పెను. హిందూమతములో నెట్టి యల్పులకైన వేదాంతము సహజముగానుండును. ప్రారబ్ధమన నెట్టిదో యెఱుఁగని వారైనను నాపదలు వచ్చినప్పుడు ప్రారబ్ధమని పలుకుచుందురు.

మఱియొకనాఁడు మాలిని మాలనితో నాధా ! మొన్న నొక నూనిగుడ్డలవాఁడు కిన్నరమీటుచుబిచ్చమునకై మనయింటికివచ్చెను. తోడికోఁడలి నిర్బంధమునఁ బిల్లలు కలుగుదురా? అని వానిశకునమడిగితిని వాఁడు మంత్రములఁబాడుచు నాచేయిచూచి నీకుగాలిసోకి పిల్లలు గలుగకుండ నడ్డుపెట్టుచున్నది. రచ్చ రేకు గట్టికొనినం బుట్టుదురు. కుంచెడు ధాన్యమిచ్చినచోఁ దాయెత్తిచ్చెదనని చెప్పిననొప్పుకొనక రేపురమ్మని యంపివేసితిని. ఇందులకు మీరేమందురు. తాయెత్తు గట్టి కొనవచ్చునా? అని యడిగిన మాతంగుఁడు నవ్వుచు బిచ్చగాండ్రమాటలు నమ్మరాదు. నీకుఁ గావలసిన నూరిలోనికిఁబోయి గొప్పవారల డిగి మంచి రచ్చ రేకులఁదెచ్చి యిచ్చెదఁ దొందరపడకుమని బుజ్జగించెను.

నిత్యము భార్య వేపుచుండ మాతంగుఁడొకనాఁడు గంగాస్నానముచేసి నామములుదిద్ది నిత్యపూజ చేసికొని రక్ష రేకు నిమిత్తమై త్రివేణికిఁ బోవుచుండ దారిలో నొకమాలదాసరి యెదురుపడి మాతంగా యెందుఁబోవుచున్నావని యడిగెను.

మాతం - దాసరీ! నీవు దేశములు తిరుగుచుందువు? పెక్కండ్ర నెఱింగియుందువు? నాభార్యకు గాలిసోకినదఁట రచ్చ రేకు నిమిత్తమై యరుగుచుంటిని. అట్టి వారెందుండిరో చెప్పఁగలవా ?

దాసరి - రచ్చ రేకా? నేనేకట్టఁగలను ఎక్కడికో పోవనేల?

మాతం – నీమాట యటుండనిమ్ము. త్రివేణిలో జపము చేసికొనుచున్న బైరాగుల నడిగిన నీయరా ?

దాసరి -- కాదు. కాదు. అట్లైన నేనొక్కటి సెప్పెదవినుము. ఈపయాగలోఁ బల్లపువీధిని చింతామణియను బోగమామెగలదు. ఆమె ఇరక్తి జెంది నగలు గుడ్డలు ఆవులు ఎడ్లు గుఱ్ఱములు అడిగినవారి కెల్ల బంచిపెట్టి జేగురుగుడ్డగట్టికొని బూడిద బూసుకొని తిరుగుచున్నది. ఆమె మా తెలిసినదంట అక్కడికిఁ బొమ్ము. నీకీబూతియియ్యఁగలదు. అని యుపదేశించిన సంతసించుచు మాతంగుఁడు గురుతులు తెలిసికొని తిన్నగాఁ జింతామణి యింటిముంగలకుఁబోయి వీథి నిలువంబడి జింతామణిగారో యని పెద్దకేక పెట్టెను.

ఆ కేకవిని చింతామణి వాకిటకువచ్చి వానింజూచి నీవెవఁడవు? నన్నేమిటికిఁ బిలిచితివని యడిగెను. దాని యోగినీవేషముజూచి మాతంగుఁడు దండములుపెట్టి తల్లీ ! నేను నీదాసుండ మాతంగుఁడను వాఁడ నాకుఁ బిల్లలులేరు. నాభార్యకు గాలిసోకి యడ్డుపెట్టుచున్నదఁట. రచ్చ రేకుకొఱకై వచ్చితిని నీవు గొప్పదానవంట నాకీయుపకా

రము సేయుము. నాకుఁ బుట్టినబిడ్డకు నీపేరు పెట్టెద. నీకు దాసుండనై యుండెదనని వినయముగా వేడికొనియెను.

చింతామణి వాని యాకారలక్షణంబు లుపలక్షించి తలయూచుచు మాతంగా! నీకు సంతానము కావలయునా? అట్లయిన రక్షరేకుతో బనిలేదు. వినుము. ఆమూలగదిలో నొకఋషి జపము జేసికొనుచు మిట్టమధ్యాహ్న మెండలో మఠమునకు బోవుచుండును. రేపువచ్చు వేసవిలో నాయన మఠమునకు బోవుదారిలో నక్కడక్కడ బాదరక్ష లమరించియుంచుము. నీపుణ్యవశంబున నెప్పుడైన నతం డాబాదరక్షలలో గాలిడెనేని నీకు దప్పక సంతతి గలుగగలదు. అట్లు చేయుము. రక్షరేకుతో బనిలేదని యుపదేశించిన విని సంతసించుచు మాతంగు డయ్యంగనకు మ్రొక్కి యావాక్యమునందు గురి గలిగి యింటికిబోయి భార్య కవ్విధ మెరింగించెను.

మరియు బ్రయత్నపూర్వకముగా మెత్తనితోలుతో మూడుజతలు పాదరక్షలు కుట్టి యాయేటిగ్రీష్మకాలమున నయ్యోగి గంగనుండి మఠమునకు బోవు నిసుకదారిలో నందందు నెదురుగా నునిచి యామాతంగుఁడు తన్ను గృతార్థుఁగా దలంచికొనియెను.

గీ. చండకరకిరణజాలము
    మెండుగ సైకతము లెల్ల మృగతృష్ణలచే
    నిండింప వేడిగాడ్పులు
    దండిగ నిప్పులను గ్రక్కదగె గ్రీష్మ మటన్.

అయ్యెండాకాలమున నగ్నిశిఖుం డొకనాఁడు వేడిగాడుపులు నిప్పులు గుప్ప నిసుకరేణువు లగ్నితప్తంబులగు నినుపశకలములవలె గ్రాగ మధ్యందివసంబున జపంబు ముగించుకొని మఠంబునకుఁ బోవుచుఁ జుర్రుమని కాళు లంటికొన వడివడి బరుగులిడుచు నడుగులు మరియు భగ్గున మండి ప్రొక్కులెక్క నత్తాపంబు సైరింపనోపక యత్తాపసుండు తాపోపశమనోపాయం బరయుచు ముందువెన్కల చూచి దైవవశంబున నొకచో నమ్మాతంగు డుంచినపాదరక్షలు గనంబడుటయు విధిప్రేరితుండై చేరి సైరింపలేక రెండునిమిషంబు లాపాదరక్షలలో దనపాదంబు లిడి నిలువంబడియెను.

అడుగులు చల్లబడినతోడనే యతండు చెప్పుల విడిచి క్రమ్మఱ నడచుచు దప్తవాలు కామార్గం బతిప్రయత్నంబునం దాటి మఠంబునకు బోయెను. కాని యాయతి కారాత్రి నిద్రపట్టలేదు. ఆపాదరక్షలగురించి వితర్కించుచు నక్కటా నే నొక తాపసుండనే? యించుకయు దితిక్ష లేక యొరులుంచిన పాదరక్షలలో బాదము లుంచి పాదుకాకరులకు ఋణస్థుండనైతింగదా? ఛీ! ఛీ! శీతోష్ణసహనము లేని నాతప మేటికి? అయ్యయ్యో! దేహరక్షణకై యధముండనైపోయితినే యని విచారించుచుండెను.

ఆయతిమదిలో నాకళంక మామరణాంతము వదలలేదు. ప్రాణోత్క్రమణసమయంబున నాముని కాపాదరక్షలే జ్ఞాపకము వచ్చినవి. శ్లో॥ యాంతేమతి స్సాగతిః॥ అనుశాస్త్ర మాతనియందే వర్తించినది. ఆపారికాంక్షి యాకల్మషమునే తలంచుకొనుచుఁ బ్రాణములు వదలెను. ఎట్టియోగులకైనను బ్రారబ్ధ మనుభవింపక తీరదు. కర్మానుగుణ్యమైన బుద్ధి పుట్టుచుండెను.

ఆయతి పరమపదించిన కొన్నాళ్ళకు మాతంగుడు చింతామణి ఇంటికి వచ్చి నమస్కరింపుచు దల్లీ! నీవు జెప్పనట్లు చేసితిని. నీమూలమున మాకులము వర్ధిల్లును. నాభార్యకు నెలదప్పినది. గర్భచిహ్నములు గనంబడుచున్నవని చెప్పినంత జింతామణి యొకింత ధ్యానించి తల కంపించుచు నోరీ! నీమాట వినుటచే గడుసంతోషమైనది. నీకు మంచికుమారుఁడు పుట్టగలడు. నీభార్య నొప్పులు పడుచున్నప్పుడు నాతో చెప్పుము. నేను వచ్చి చూచెద. పో పొమ్మని పలికి అప్పుడు

వ్యాసమఠంబునకుఁబోయి యగ్నిశిఖునిగుఱించి వితర్కించిన నతండు పరమపదించినట్లు తెలిసినది.

అప్పుడప్పడఁతి మిక్కిలి పరితపించుచు నాహా ! నేను మహా పాపాత్మురాలను. మహానుభావుండైన యతీశ్వరునిఁ బుల్కసునియింట బుట్టఁజేసితిని నాప్రాజ్ఞత్వంబు గాల్పనా ? చీ చీ ! నేనొకమానిసినే. నన్నతం డవమానించెనని యీసుబూనితిని. కోపము పాపమునకుఁ బ్రాపుగాదే ప్రమాదము జరగినదని యనేకప్రకారములఁ బరితపించుచు తదుత్పత్తిప్రకారంబు దెలిసికొననెలలు లెక్క పెట్టుచుండెను.

ఒకనాఁడామాతంగుఁడు వాకిటనిలువంబడి చింతామణిగారూ! మాయాఁడుది బాధపడుచున్నది. వచ్చిచూడుఁడని కేకపెట్టెను ఆమాట విని యాఁబోటి సంభ్రమముతో నప్పుడే వానివెంట మాలపల్లెకరిగినది. అప్పటికామాలిని ప్రసవమై గడియయైనది. మగశిశువుగలిగెను పాలు త్రాగుటలేదని తల్లిదఃఖించుచున్నది.

చింతామణి మాలెతప్రక్కలోనున్న బాలకునెత్తికొని ముద్దాడుచు నాకారలక్షణంబులు పరీక్షించి యయ్యతియే యిట్లుపుట్టెనని నిశ్చయించి

చింతామణి - శ్లో॥ కస్త్వంబాలక ! బాలుఁడా! నీవెవ్వఁడవు?

శిశువు - బాలికె! యతిరహం, బాలామణీ ! నేను యతిని

చింతా – కస్మాదిదం జన్మతె, నీవిందేమిటికి జనించితివి ?

శిశువు - వక్ష్యేపూర్వము పానహౌ విధివశాత్ప్రాస్తోస్మిగృహ్ణన్ మఠం! ప్రాప్తోస్మీతిమతిం విధాయనితరాం సంత్యక్త దేహాస్మియ! చ్చండాలస్యసుతో స్మ్యహం తదబలె యాం తెమతిస్సాగతిః॥

చెప్పెదవినుము నేను బూర్వజన్మంబున వేసవిలో గంగనుండి మఠమునకుం బోవుచు చండాలుడుంచిన పాదుకలలోఁగాళ్లుంచి వానికి ఋణస్థుండనైతినని తలంచుచు దేహమును విడిచితి దానంజేసి వానికిఁ బుత్రుండనై యదయించితిని. ప్రాణోత్క్రమణసమయంబున బుద్ధి యెట్లుండునో యట్టి జన్మమే సంప్రాప్తించునని శాస్త్రములు చెప్పు చున్నవిగదా?

అని యాబాలుండు చింతామణి కుత్తరముచెప్పి కేరుమని యేడ్వఁ దొడంగెను అప్పుడది కన్నీరుగార్చుచుఁ దండ్రీ! వీండ్రపవిత్రులని పాలుగ్రోలుట మానితివా? అయ్యో! నిన్నీ శ్వపచునింటఁ బుట్టఁ జేసితి నేనెంత పాపాత్మురాలనో? విధికృతంబనతిక్రమణీయమని విచారించుచుండ మాతంగుఁడు అమ్మా ! వీఁడు బ్రతుకునా ? నీవుగూడ గన్నీరు విడుచుచుంటివేమి? నిజముజెప్పుము. దేవతలకు మీదుగట్టుము. తల్లీ ! వీనిభారము నీదని దానిపాదములంబడి వేడికొనియెను.

చింతామణి మాతంగా ! వీనికేమియుభయములేదు. మీశిశువునకుఁ దల్లిపాలుపడవు. ఆవుపాలు కావలయును నేనువోయి తీసికొనివత్తు వెఱవకుమనిపలికినవాఁడు తల్లీ! ఆవుపాలు మాయింటనే యున్నవి. త్రాగింపుమని గిన్నెతో నావుపాలు దెచ్చియిచ్చెను. దానింబోసినఁ ద్రాగఁడయ్యెను. అప్పుడా పుల్క సదంపతులు గోలుననేడ్చుచుండ వారించుచుఁ జింతామణి యాలోచించి తానొక బాహ్మణగృహంబున కరిగి యాచించి యావుపాలుతెచ్చి పోసిన నవ్వుచు నాబాలుండు గుటుగుగుటుగునఁ ద్రాగెను.

ఆయావుపాలె మఱునాఁడు పోసినఁ ద్రాగడయ్యే నప్పుడు చింతామణి గ్రహించి దినమునకొక విప్రగృహంబునకరిగి యాచించి తెచ్చి తానేస్వయముగాఁ బోయుచుండ గ్రోలుచుండెను మాతంగుఁ డా వారాంగన తనయందలి ప్రేమచే ననుదినమువచ్చి యాబాలున కుపచారములు సేయుచున్నదని తలంచి దానిం దల్లిగా గురువుగా దైవమునుగానెంచి స్తుతియింపుచుండును.

ఆబాలుండు దినదినాభివృద్ధి వడసి నవ్వుటయు దొర్లుటయు గూర్చుండుటయు బ్రాకుటయు దప్పటడుగులిడుటయు మాటాడుటయు లోనగు బాలక్రీడల జూపుచుండ నమ్మాతంగదంపతులు బ్రహ్మానందము చెందుచుండిరి. ఆశిశువునకు యుక్తకాలమున నన్నప్రాశనము చేయ వలయునని తలంచిరి. చింతామణియాలోచించి బాహ్మణగృహంబు నుండి పాయసము దెచ్చిపెట్టినదికాని యామాణవకుఁడు నోరెత్తడయ్యెను.

అయ్యాశయముగ్రహించి చింతామణి వానికిఁ బండ్లుపెట్టనలవాటుచేసినది. ఫలములు పాలుగాక యాడింభకుండు మఱియేదియుఁ దినఁడు కావున నాయాహారమే చింతామణి పెట్టుచుండెను. ఆశిశువునకుఁ జింతామణియనియే నామకరణము జేసియున్నారు. వానినెప్పుడు బయటకురానీయక సంతతము లోపలనేయుంచి వాని యాటపాటల బంగారుమూటలవలె నెంచుచు మిక్కిలి సంతోషముతోఁ గాలము గడుపుచుండిరి. చింతామణియు నిత్యమువచ్చి వానిసంరక్షణ గనుం గొనుచుం బోవుచుండెను

ఆమాతంగునకుఁ బ్రయాగములో నెలకొకరాత్రి గస్తుదిరుగవలసినవంతుకలదు. ఆవంతునాఁడు వాఁడుగస్తుదిరుగనిచో నందులకై వానికిచ్చిన మాన్యము లాగికొందురు. కావున వాఁడేయూరికేగినను గస్తువంతునాఁడు తప్పక యూరిలోనుండితీరును.

ఒకనాఁడుఅగత్యమైన పనివచ్చినమాతంగు డూరికిఁబోయి గస్తువంతునాడు రాత్రికింటికి రావలయునని బయలుదేరెను దారిలో గంగానదిపొంగి వానిపయనమున కాటంకము గలుగఁజేసినది. కాలాతీతమగుటచే రేవుదాటించు నావయుం దొరికినదికాదు. మాన్యము పోవునని వాఁడుమిక్కిలి పరితపించుచు నవ్వలియొడ్డున బరుండెను.

ఇంటికడ మాతంగుభార్య మాలినియు దీపములు పెట్టువఱకు దనమగఁడు వచ్చుననునాసతోనుండి చీఁకటిపడినంత నిఁకరాడని నిశ్చ యించి మాన్యమువోవునని విచారించుచు నవ్వలికిఁబోయి మగనిజాడ చూచి కేకవెట్టుచు మరల నింటికి వచ్చుచు నించుకసేపు కూర్చుండి యంతలోలేచి పొరుగింటికేగి చూచుచు నడుగుచుఁ దొట్రుపడుచుండెను. ఆయారాటముజూచి యాబాలుండు అమ్మా ! నేఁడు నీవిట్లు బాబాకొఱకుఁ బరితపించుచుంటివేల ? నేఁడురాకున్న రేపురాడా? అనియడిగినఁ బుత్రునెత్తుకొని ముద్దాడుచు మాలిని నాయనా! నీతండ్రి నేఁటిరేయి నీవీటిలో గస్తుతిరుగవలసి యున్నది. ఏకారణముచేతనో రాలేకపోయిరి. మూఁడుతరములనుండి గస్తుమాన్యము మనకు జరగుచున్నది. నేఁడాపనిచేయకున్న నామాన్యములాగి కొందురు. అందులకై విచారించుచుంటినని యావృత్తాంత మెఱింగించినది.

పిల్లవాఁడు - అమ్మా ! గస్తు అననేమి ?

తల్లి --- బాబూ ! ప్రజలు నిద్రించుచుండ రాత్రి నాలుగు జాములు నాలుగువీధులకుంబోయి డప్పువాయించుచు నింటిలో దొంగలుదూరి వస్తువులు దొంగిలింతురు. జాగ్రతగా మేలుకొనియుండుఁడో యని కేకపెట్టవలయును. దీనికే గస్తు అనిపేరు.

పిల్లవాఁడు - తల్లీ ! ఈమాత్రముపని నేనుజేయలేనా ? నన్ను నియోగింపరాదా ! విచారించెదవేమిటికి ?

తల్లి - అయ్యో! తండ్రీ! నీవిదివఱకిల్లు కదలియెఱుఁగవు చీఁకటిలోఁ గ్రొత్తవీధులకుఁబోయి ప్రజల నెట్లు ప్రబోధింతువు ? జడిసి కొంటివేని భూతములు సోకును మాన్యముపోయినం బోవుగాక నీకా పనివలదు.

పిల్లవాఁడు - అమ్మా ! నాకేమియుభయములేదు. డిండిమము వాయింపఁగలను. ఏవీధులకుఁబోవలయునో గురుతులు సెప్పుము పోయెదంగాక.

తల్లి — పట్టీ ! నీకట్టియూహ యుండినచో డప్పుతీసుకొని నీ వెంటవచ్చి వీధులం జూపెద బిగ్గరగాఁ గేకవేయఁగలవా పిల్లవాఁడు - నీవు నాతోనుండి వీధులం జూపుమంతియచాలు నేను ప్రజలఁ బ్రబోధింపఁగలను.

అనిపలుకుటయు సంతసించుచు మాలిని యారాత్రి గోటలోఁ బదిగంటలు గొట్టినతోడనే కుమారు నొకచంకనెత్తుకొని యొక చంక డప్పుదగిల్చికొని బయలుదేరెను. అమ్మా ! నేనడువఁగలను దింపుము. దింపుము. నీవుమోయఁజాలవని కొడుకుపలుకుచుండ జిన్ని నాయనా ! నీవునాకుభారమగుదువా ? నిన్నీ రాత్రినిల్లుకదల్చుటయే తప్పు పైగాఁ జీఁకటిలో నడిపింపనా? నీతండ్రివినిన నన్నుబ్రతుకనిచ్చునా ? అనిపలుకుచుఁ దొలుతఁ గోటకుఁ దూరుపుననున్న వీధికిఁదీసికొనిపోయి యొకచోదింపి తానేడప్పు వాయించుచుఁ బ్రజలుమేలుకొనునట్లు కేక వేయుమని కుమారునికి బోధించినది. ఆప్రాజ్ఞుండు

శ్లో॥ కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్ఠంతి తస్క.రాః
     జ్ఞానరత్నాపహారేణ తస్మాజ్జాగృధజాగృథ.

ఓజనులారా ! కామక్రోథలోభమోహాదు లార్వురు దొంగ లీదేహమను గేహంబునఁ దిఱుగుచున్నారు. వారు జ్ఞానరత్నమును హరింతురు కాచికొనియుండుఁడో ! అని పెద్దకేకపెట్టెను.

బాబూ ! నేనుజెప్పినట్లుకాక వేరొకరీతిజదివితివేల ? ఈచదువు నీకెట్లువచ్చినది? క్రొత్తమాటలు సెప్పఁగూడదు. దొంగలు పడుదురు మేల్కొనియుండుఁడని కేక వేయుమని తల్లిపలికిన నామాటయే చెప్పితినని కుమారుఁడు సమాధానమిచ్చెను.

మాలిని యా బాలకుని రెండవజామున దక్షిణపువీధికిఁ దీసికొనిపోయి యొకచోనిలువంబెట్టి తాను డిండిమము గొట్టుచుఁబ్రజలఁ గేక వేయమని బోధించినది. ఆమాణవకుండును

శ్లో. మాతా నాస్తి పితా నాస్తి నాల్తి బంధుః సహోదరః
    అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మా జ్జాగృధజాగృధ.

తల్లి దండ్రులు అన్నఁదమ్ములు భార్యాపుత్రాదులు ధనగృహ పశ్వాదులన్నియు నస్థిరములు క్షణభంగురములు వానినమ్మియుండక నిత్యమగువస్తువుం దెలిసికొనుటకై మేలికొనియుండుడో ! అనిమరల కేకపెట్టెను.

పుత్రా ! క్రొత్తమాటలాడుచున్నావు. రాజుగారివలన మాట వచ్చుఁజుమీ! ఇఁక నీవారీతి పలుకవలదని మందలించిన దల్లికిఁ బుత్రుఁ డివి ప్రాతమాటలేయని సమాధానము చెప్పెను.

మూఁడవజామున మాతంగిని గుమారుఁ బడమరవీధికిఁ దీసికొనిపోయినది. అందతండిట్లు కేక పెట్టెను.

శ్లో॥ జన్మదుఃఖం జరా దుఃఖం జాయాదుఃఖం పునఃపునః
      సంసార సాగరందుఃఖం తస్మాజ్జాగృధజాగృధ

జాయా పుత్రాది సంగభంగురంబై జన్మ జరామరణ వ్యాకులంబై యొప్పు సంసారసాగరము దుఃఖప్రదమైనది. దీనిందాటు తెరు వరయుచు మేలికొనియుండుఁడో యని కేకపెట్టెను.

నాలుగవజామున నుత్తరపువీధికింబోయి యందు.

శ్లో॥ ఆశయా బద్ధ్యతెలోకో కర్మణా బహుచింతయా।
     ఆయుక్షీణం నజానాతి తస్మాజ్జాగృధ జాగృధ॥

లోకమున తనకాయువు దినదినముక్షీణించుచున్నదని తెలిసికొన లేక పెద్దయాసచేఁ గట్టఁబడి గొప్పగొప్ప పనులుచేయుటకుఁ బ్రయత్నించుచుండును మృత్యుదేవత యెప్పుడోవచ్చి గుటుక్కున మ్రింగి వైచును కావున నావిషయమై యప్రమత్తులై మేలికొనియుండుఁడో యని కేకపెట్టెను. తల్లియునట్లుచెప్పినందుల కేమిమూడునోయని వెఱచుచుఁ గుమారు నెత్తికొని యింటికిం బోయినది.

ఆపట్టణపురాజు మొదటిజామునఁ జల్లగాలి సేవింపదైవికముగా నుప్పరిగపై వసించి యామాతంగబాలుఁడుచదివిన మొదటిశ్లోకమును విని వెరగుపడుచు నిద్రబోక తక్కినమూడుజాములయందును జదివిన మూడుశ్లోకములు చెవియొగ్గియాలించి యాహా ! ఇది యేమివింత గస్తు తిరుగు పుల్కసునకీ వైరాగ్యశ్లోకము లెట్లువచ్చినవి ? అని సంశయింపుచు మఱునాఁడుదయమున రాత్రిగస్తుతిరిగిన మాలవానిదీసికొని రమ్మని రాజభటునొకనిం బంపెను.

రాజసేవకుఁడు మాలపల్లెకుఁబోయి రాత్రిగస్తుతిరిగిన వాఁడెవఁడని యడుగుచు మాతంగునియింటికిం బోయెను. మాతంగుఁ డూరినుండి యప్పుడేవచ్చి రాత్రిజరిగినపనులు భార్యజెప్పుచుండ నాలింపు చుండెను. రాజభటుడట నిలువఁబడి రాత్రి గస్తుతిరిగినవాఁడెవఁడురా? యిటురా. అని కేకపెట్టెను. మాతంగుడు జడియుచు బాబూ ! నేను నేనని యెదుటకుఁబోయెను. నీమూలమున నాకర్మము మూడినది నిన్ను వెదకుచు నీమాలపల్లెయంతయు దిరిగితిని. పదపద. రాజుగారి సెలవైనదని పలికిన వాఁడు గడగడలాడుచు బాబూ! ఎందులకో తెలియునా? అని యడిగెను.

భాంచోత్ అది నా కేమియుఁదెలియదు నడువుమని వానివెంటఁ బెట్టికొని రాజసభకుఁ దీసికొనిపోయెను. సేవకుఁడు వాని నెదురనిలువం బెట్టి దేవా! వీఁడే రాత్రిగస్తుదిరిగినమాలఁడని యెఱిగించుటయు నారాజు వానిఁబరిశీలించిచూచి రాత్రి గస్తుతిరిగినవాఁడవు నీవేనా అని యడిగెను. సిత్తము సిత్త ము మాప్పభో ! నేనే యని వాఁడుత్తరము చెప్పెను.

రాజు - నీవెంతకాలమునుండి గస్తుతిరుగుచుంటివి ?

మాతం - ఏలికా! నలువదియేండ్లనుండి తిరుగుచుంటిని.

రాజు -- నీవు రాత్రి గస్తుతిరిగితివా ? నిజమ చెప్పుము. చెప్పకున్న దండింతుఁజుమా? మాతం - (గడగడ వడంకుచు) సామీ! తప్పు జేసితిని మన్నింపవలయు. నేటియాటంకమున నేను రాత్రి నింటికిరాలేకపోయితిని. మాన్నెముపోవునని మాయాఁడుది బిడ్డనెత్తుకొని రాత్రిగస్తుత్రిప్పినదఁట తండ్రీ ! ఇదియే నిజము. వాఁడేమితప్పు జేసెనో తెలియదు. లేక లేక యొక్కఁడే కలిగెను. ఆసిచ్చ నాకు విధించి వానింగాపాడుఁడు అని యేడ్చుచు నేబంజాగిలిబడి నమస్కరించెను.

రాజు -- (నవ్వుచు) రాత్రి గస్తుతిరిగినవాఁడు నీకొడుకా? వాని కెన్ని యేండ్లున్నవి?

మాతం - బాబూ ! ఎనిమిదేండ్లికను వెళ్ళలేదు.

రాజు - నీవు వాని నిటకుఁదీసికొనిరా. పో పొమ్ము.

మాతం - తండ్రీ ! ఆసిచ్చ నాకువిధింపుఁడు. వాఁడు కుఱ్ఱవాఁడు. ఎఱుఁగనివాఁడు. తప్పుమన్నించి రచ్చింపుడు. అని కన్నీరుగార్చుచు వేడుకొనియెను.

రాజు - మాశిక్షలు పడువాడుకాడు. మమ్ము వాఁడే శిక్షించును. పోయి తీసికొనిఁరా.

అనిపలికిన నేదియో చెప్పుకొనఁబోవుటయు మాటాడనీయక రాజభటుఁడు పదపద అని గెంటుకొనిపోయెను. వాఁడు దిగులుమొగముతో నింటికింబోయి పెండ్లాముపైఁ జిరాకుపడుచు ఛీ! నీమూలమున నింతముప్పు వాటిల్లినది. మాన్నెము పోయినంబోవుఁగాక కన్నులుదెరవని బాలునిం దీసికొనిపోయి యర్ధరాత్రము గస్తుత్రిప్పింతువా! రాజుగారు వీనిమాటలు వినెనుగాఁబోలు గట్టికోపమేవచ్చినది. వాఁడుమమ్మె శిచ్చించునని వెటకారములాడిరి. అనిచెప్పిన భార్య గోలుననేడ్చుచు బిడ్డంగౌఁగిలించుకొని బాబూ! నేజెప్పినట్లు కేక వేయక యేదియోచదివితివి? రాజుగారికిఁ గోపమువచ్చినదఁట. నీకు శిరచ్చేదము చేయింతురఁట వింటివా! అనిపలికిన విని కుమారుఁడు నవ్వుచు నిట్లనియె. తల్లీ ! నేనేమితప్పుచేసితినని రాజునాకుశిరచ్ఛేదము చేయించును? నేనన్నమాటలు నీవువినలేదా ! వెఱవకుఁడు అనికుమారుఁడు ధైర్యము గఱపుచుండెను.

తల్లిదండ్రులిద్దరు వానింగౌఁగిలించుకొని దుఃఖించుచుండిరి. అప్పుడు రాజకింరుండు వాకిటనిలువంబడి మాతంగా! నీకుమారుఁడు రాక జాగుచేయుచున్నాడేమి? ఆలసించిన రాజుగారికిఁ గోపమురాదా వేగమురమ్మనియదలించిన సిత్తము సిత్తమనుచు నిదిగోవత్తున్నామని పలుకుచు మాతంగుఁడు.

గీ. నెండిమురుగులు కంటెయు వింతచెలువు
    గొలుపగజ్జెల మొలత్రాట గోచివెట్టి
    చుంచుదువ్వి మొగంబునఁ జుక్క దిద్ది
    ముద్దుబాలునిఁ గై సేసి మోహమమర.

చంకవెట్టుకొని యాబంటువెంటవాఁడా నృపతియొద్దకుఁబోయెను. వానిభార్యయు నింటనుండలేక వారిపజ్జన యరిగినది. అట్లాశ్వపచదంపతు లక్కుమార శేఖరునెత్తుకొని కొల్వుకూటంబునకుఁ బోయి రాజునెదుర నిలువంబెట్టి బాబా! వారే పబువువారు జోహారు సేయుము అని పలుకుచు మ్రొక్కించుటయు

ఉ. బాలకుఁజూచిచూచి నరపాలశిఖామణి భూరివిస్మయా
     లోల మనస్కుఁడై భళిర లోకములేలఁగఁ జాలువీఁడు చం
     డాలకులంబునన్ బొడముట ల్విపరీతముగాదె సత్తప
     శ్రీలవనోరు విఘ్నమది చేకురునేయతికో తలంపఁగన్.

కానిచో నుపనిషత్ప్ర తిపాదకంబులగు నట్టిశ్లోకంబులెట్టుచదివెడిని? వీఁడుకారణజన్ముఁడు. పాప మేతపోథియో విధిబద్ధుండై వీని యింటఁబుట్టెనని వితర్కించుచు సింహాసనముడిగ్గి వానిచెంతకరుదెంచి సాదరముగా మాణవకోత్తమా! రాత్రి గస్తుతిరిగినవాఁడవు నీవేకాదా? యని యడిగిన నేమియుమాటాడక శిరఃకంపమునఁ నంగీకారము సూచించెను.

నీవేమి చదివికొంటివి? యుపాధ్యాయుఁ డెవ్వడు? అనియడిగిన నాబాలుఁడేమియు మాటాడక యూరకుండెను. ఏమియుఁజదువుకో లేదని వానితండ్రి సమాధానము సెప్పెను.

రాజు - మాతంగా ! నీకుఁ బిల్లలెందఱు?

మాత - దేవా ! వీఁడొక్కడే. సింతామణికృపచేఁ గలిగెను

రాజు - చింతామణి యెవ్వతె?

మాత - బోగమామిడ. మా తెలిసినది బాబూ!

రాజు - ఏమి సెప్పినది ?

మా - ఎవ్వడో రుసి గంగలో సెపము చేసికొనుచుండగా మండువేసవిని పాదరచ్చలు దారిలోనుంచమని చెప్పినది. అట్టుసేసితిని వీఁడుగడుపునఁబడియెను.

రాజు - వీఁడు మాంసము తినునా ?

మా - దేవా! మాంసముగాదు అన్నమునుతినఁడు పాలు ద్రాగడు సింతామణిగారే పాలు పండులు తెచ్చి పెట్టుచుండును. తండ్రి! ఇంతే సత్తెము.

ఆమాటలువిని యారాజు మిక్కిలి విచారించుచు నప్పుడపసిండి పళ్లెరమున వేయుదీనారములు బోసికొని యాబాలునకుఁ గానుకగా నర్పించుచు బాలకా ! వీనినీకుఁ బారితోషికముగా నిచ్చితిని నీవురాత్రి గస్తుతిరిగినందులకు గైకొనుమనిపలికి యర్పించుటయు నామాణవకుఁడు ఆపళ్లెరము రెండుచేతులతో గ్రహించి అమ్మా! వీనినేను మోయఁజాలను గైకొనుమని పలుకుచు వారికందిచ్చెను.

చండాలదంపతులు పరమానందభరిత హృదయులై యాపళ్లెరమందుకొని మొహిరీల మూటగట్టుకొనిరి రాజు వారికింటికి బోవుటకు సెలవిచ్చెను. బాలకునితోఁగూడ వారింటికి బోయి బాలునకు దృష్టి దీసి పండుకొనబెట్టిరి. అంతలోఁజింతామణి యచ్చటికివచ్చి యావృత్తాంతమంతయువిని ముక్కుపై వ్రేలిడికొనుచు మాతంగుడా! ఎంతపని చేసితిరా ? అసిపలికిన వాఁడు అమ్మా ! మేము మొదట జడిసితిమి కానిరాజుగారు నాకుమారుని మెచ్చుకొని కానుకలిచ్చిరి. చూచితివా! ఇదియంతయు నీ యనుగ్రహమనిపలికి యానందించుచుండెను.

మాతంగదంపతులు పుత్రప్రేమదలంచి చింతించుచు, యతి సత్తముని బంధవిముక్తనిదలంచి సంతసించుచుఁజింతామణి యా బాలుఁ డెందున్ననాఁడని యడిగిన మాతంగి అమ్మా ! మా కుమారుఁడుగొప్ప కానుకలదెచ్చెనని మా పల్లెవాండ్రందఱు కంట్రగించుచుఁ జూడ వచ్చుటం జేసి దిష్టితగిలి మేనికివేకిసోకినది దిగదుడిచితిమి. ఆగుడిసిలోఁ బండుకొనఁ బెట్టితిమి నిద్రించుచున్నాడని చెప్పినవిని చింతామణి తొందరగా లోపలికిఁబోయి బాబూ ! 'బాబూ ! నిద్రించుచుంటివా ! అయ్యో ! యెక్క డినిద్ర యోగనిద్రయా యేమి ! మాటాడవేమి ! అనియెంతపిలిచినను బలుకలేదు.

మహాత్మా ! స్వస్వరూపము వహించితివా! అకటా! నీవలన మంచి మాటలు వినవలయునని యెంతయో యాసతో నుంటిని. ఈ కంటకురాలితో నిఁక మాటాడవా అని దుఃఖించిన విని మాతంగదంపతులు అట్లడలుచుంటివేల? ముద్దులనాయన లేవలేదా? అని యడుగుటయుఁ జింతామణి తెలిసినదైనను గన్నీరుగార్చుచు నింకెక్కడి ముద్దుల నాయన మీనాయన పరమపదించె. వానిచే నేదియు స్వీకరింప వలదని చెప్ప లేదా? రాజువానికిచ్చిన కానుకలేలపుచ్చుకొంటిరి? మీ బుణముతీరిపోయినది. వానిదారివాఁడు పోయెనని చెప్పినది.

గుండెలు బాదుకొనుచువచ్చి యాచండాలదంపతులు వానిఁ జాచి గతాసుండగుట తెలిసికొని వానిపయింబడి పెద్దయెలుంగున నేడువఁదొడంగిరి. చింతామణియుఁ బ్రాజ్ఞురాలయ్యు దేహవాసనంజేసి వారితోగూడఁ గొంతసేపువిలపించి పిమ్మటవారి నూరడించుచు నతండు మహర్షి యనియుఁ బాదరక్షలమూలమున మీయింటబుట్టెననియు మీ ఋణముతీర్చుకొని ముక్తుడయ్యెననియు నావృత్తాంతమంతయు నెఱిఁగించి వారికిశోకోపశమనము గావించినది. వాండ్రును తదుపదేశబలంబున విరక్తిజనింప నిల్లువిడచి తీర్థయాత్ర సేవించి ముక్తులైరి.

చింతామణియు నామహాత్ముండుచెప్పిన నాలుగుశ్లోకముల యందును బ్రస్థానత్రయమందుఁగల తాత్పర్యముండుటంబట్టి వానినే స్మరించుకొనుచు మహాయోగినియై దేశపర్యటనము గావించుచు ముక్తురాలయ్యెను.

చిత్రసేనా ! వేశ్యయైనను జింతామణి వైరాగ్యబుద్ధిచే నెట్లు వర్తించెనో చూచితివా ? ఎటువంటిజ్ఞానవంతు రాలయ్యెనో తెలిసికొంటివా! అని గోణికాపుత్రుఁడు చింతామణి యుదంతమెఱింగించిన విని యాగణికా పుత్రిక లిరువురు పరమానందపూర్ణహృదయులై యతని నగ్గించిరి.

అని యెఱింగించునంత సమయాతీతమగుటయు మణిసిద్ధుం డవ్వలికధ యనంతరపుమజిలీయం దిట్లు చెప్పఁదొడంగెను.

148 వ మజిలీ

−♦ ఢాకినీదేవతకథ ♦−

ఒకనాఁడు మతంగయోగిని యిరువురు రాజభటులతో నొకమార్గంబునంబడిపోవుచు నిట్లు సంభాషించినది. దూతలారా! మన మహారాజుగారి దేశావసాసము సమీపించుచున్నది. వాండ్రీపాటి కీదేశము దాటిపోవుదు రేమో? అన్యదేశమున మనము వారింబట్టి కొనవచ్చునా ? అని యడిగిన రాజకింకరులిట్లనిరి. దేవీ! మన మితరదేశమున వారింబట్టికొనరాదు. అందున్న యధికారులకు మనరాజశాసనము