కాశీమజిలీకథలు/ఎనిమిదవ భాగము/153వ మజిలీ

వికీసోర్స్ నుండి

    మనుచు నెఱింగించెఁ దత్తత్క్రియావిశేష
    గతుల జూపుచు రతుల నాయతివ కపుడు.

మున్నుతానా యువతి కెఱింగించిన శాస్త్ర లక్షణంబులకు లక్ష్యంబులు సూపుచు నత్తన్వితోఁ బరమానంద మనుభవించెను అని యెఱింగించువఱకు.

150 వ మజిలీ.

−♦ యక్షిణీగానముకథ. ♦−

తెల్లవారక పూర్వమే రుక్మిణి యంతఃపురమునకుఁ దిరుగాఁ జారుమతివచ్చిన దనువార్త రాజపుత్రునకుఁ దెలిసినది. అతండప్పుడ యయ్యంతిపురికిఁ గ్రొత్తకావలి వారల నియమించి సెలవులేనిదే యెవ్వరి నవ్వలకుఁ బోనీయవలదని శాసించి వెంటనే దత్తకాదులఁ దీసికొనిరమ్మని యొక పరిచారకునిఁ బంపెను.

గడచిన సాయంకాలమునుండియు దత్తకునిజాడ దెలియక కుందుచున్న గోణికాపుత్రుండా దూతతో రాజపుత్రునియొద్ద కరిగెను. చారుమతి రుక్మిణి యంతఃపురమునకు మరలవచ్చినదఁట. మనమిత్రుడు దత్తుఁడేమయ్యెను? అతని ప్రతిజ్ఞఁజూపింపవలసిన సమయమువచ్చినదని మదనోన్మాదంబునఁ బలికిన రాజపుత్రుని మాటలవిని గోణికాపుత్రుండు విన్ననగు మొగంబుతో దేవా ! అతండు నిన్ననొకపనిమీఁద నూరికిఁ బోయెను. రెండుమూఁడు దినంబులలో రాఁగలడు. ఆమెరాక వానికిఁ దెలిసినఁ బోకుండునుగదా? యని చెప్పినవిని రాజపుత్రుఁడు సరి. సరి. ఏదియో యంతరాయము వచ్చుచునేయున్నది. మీరతండెందుండెనో యక్కడికేపోయి శీఘ్రమ తీసికొని రావలయును. జాగు సేయకుఁడు పొండు. కనంబడలేదని తిరుగావచ్చిన ననుమతింప, నిదియే మీరు నాకుఁ జేయునుపకారమని పలికి వానినంపివేసెను.

అతండింటికిఁబోవుచు నక్కటా! ఇతని యిక్కట్టు మిక్కుటము గానున్నది. చారుమతి ధీరమతి. ఔపనిషత్క్రియలకు వశపడునది కాదు. తత్వమెఱుఁగక దత్తుఁడాడినమాటల కాసపడి యూరకయుఱ్ఱూట లూగుచున్నాఁడు. దత్తుఁడుమాత్రమువచ్చి యేమిచేయఁగలడు ? అతఁడు వారస్త్రీల పటుఁడు. ఏ వేశ్యయింటికిఁ బోయెనో తెలియదు. ఎట్లో వానివెదకి తీసికొని పోవలయునని యాపట్టణమంతయు వెదకెను కాని యతండు గనంబడలేదు.

మఱికొన్ని దినంబులు గడచినంత నొకనాఁడుదయంబున దత్తకుఁడా నెలవునకువచ్చెను. అతనింజూచి గోణికాపుత్రుఁడు నిక్షేపము దొరకినట్లు సంతోషించుచు మిత్రమా ! ఇదియేమికర్మము. మాతోఁ జెప్పక యెక్కడికిఁ బోయితివి? రుక్మిణి యంతఃపురమునకుఁ జారుమతి మఱల వచ్చినదఁట. రాజపుత్రుండు నీకొఱకు వర్తమానముపై వర్తమానము పంపుచున్నాఁడు. నీవులేక నే నక్కడికిఁ బోయిన మండిపడుచున్నాఁడు. నీ నిమిత్తమై పట్టణమంతయు గాలించితిని. ఎందువోయితివి? పద పద, రాజకుమారుని కన్నులంబడినఁ గొంతపరితాప మడఁగగలదని పలుకుచు నతని వెంటఁబెట్టికొని యప్పుడే రాజభవనమునకుఁ బోయెను.

రాజపుత్రుఁడు దూరమునందే దత్తునిఁజూచి మేనుప్పొంగ నెదురువోయి యాలింగనముచేసికొని మిత్రమా ! దయ తప్పినదియా యేమి? ఇన్నినాళ్ళెందు బోయితివి? నీకొఱ కెదురు చూచువఱకు కన్నులు కాయలు కాచుచున్నవిగదా? రుక్మిణి యంతఃపురికిఁ దిరుగాఁ జారుమతి వచ్చినది. నీమాట చెల్లించుకొనవలసిన సమయమువచ్చినది ఇఁక వర్తమానములతోఁ బనిలేదు. మనమిప్పుడే యక్కడికిఁ బోవుదము. ఏదియో మిషపన్ని చారుమతిని నీకన్నులంబడఁజేసెదను. చాలునా? అని యడిగిన నతండు అంతియచాలు ఆప్రోయాలి నీకు వశ్యురాలిగాఁజేయకున్న నన్నీపేరునఁ బిలువవద్దు అనిమరల శపథము జేసెను. -అప్పుడతండు శారికం జీరి నీవు ముందుగా రుక్మిణియంతఃపురమున కరిగి పండితునొకని వెంటఁబెట్టుకొని నేనక్కడికి వచ్చుచున్నాననియుఁ జారుమతిని రుక్మిణిని ముందరిచావడిలోఁ గూర్చుండమనియుఁ జెప్పుము. పొమ్మని దానినంపి తాను దత్తునిమాత్రము వెంటనిడికొని యారాజపుత్రుఁడు రుక్మిణియంతఃపురమున కరిగెను

రుక్మిణి శారికవలన నావార్తవిని యన్నను ముందరిచావడిలోఁ గలిసికొని నమస్కరించినది. అతండత్యంత సంభ్రమముతోఁ గాశినుండి మఱియొక పండితుఁడు వచ్చెను. చారుమతి యతనితోఁగొంచెము ప్రసంగింపవలసియున్నది. ఆసుందరి యెందున్నది? అనియడిగిన నప్పడఁతి విన్ననగు మొగంబుతో నన్నా ! నీవు పలుమారాచెలువను గుఱించి వితర్కించుచుంటివని తెలిసి యామె యిందునిలుచుటకు వెఱచి నిన్న నుద్యానములోనుండియే నాకుఁజెప్పక యెక్కడికోపోయినది. తిరుగా నాలుగుదినములలో రాఁగలదు. వచ్చినతోడనే నీకుఁదెలియఁజేసెదనని చెప్పుచుండగనే యారాజపుత్రుని మొగము వెలవెల బారినది. ఒక్కింతసేపు ధ్యానించి చాలు చాలు రుక్మిణీ ! దాని కీటక్కులు నీమూలముననేవచ్చినవి సభలలోనాడెడు వెలయాలికి నంతఃపురవాసమేల? నీకతంబునంగానిదానిబలవంతముననైనఁ దీసికొనిపోకుందునా? విద్వాంసురాలనియుఁ బండితులతోఁ బ్రసంగించునని వేడుకపడి పలుమారు తత్ప్రసక్తిఁ దెచ్చితిని. లేకున్న దానిగొడవనాకేల? ఈసారి వచ్చినవెంటనే నాకుఁ దెలియఁజేయవలయుం జుమీ? తప్పితివేని నాయానయని యొట్టుబెట్టి యామెచేననిపించుకొని మొగసాలనిలువంబడియున్న దత్తునితో నావర్తమానముజెప్పి నిజనివాసంబున కఱిగెను.

దత్తుఁడు రాజపుత్రా ! ఆకనికగాత్రి వచ్చినవెంటనేవత్తు నాకిప్పుడనుజ్ఞయిమ్మని యడిగిన నతండు చాలు చాలు. నిన్నుఁ బోనీయను. దానిరాకయెప్పుడో దెలియదు. సర్వదా నీవు నాయొద్ద నుండవలయు నని గట్టిగా నిర్బంధించెను. అతం డేమాటయుఁ జెప్పుటకు శక్యమైనది కాదు. భోజన సమయములఁదప్ప సంతతము దత్తుఁ డా రాజపుత్రునొద్దనే వసియించి యిష్టాలాపములచేఁ గాలక్షేపము జేయుచుండెను.

ఒకనాఁడు రాజపుత్రుఁడు దన యిరువురుమిత్రులతోఁగూడుకొని వేడుకలు ముచ్చటింపుచున్న సమయంబున నమాత్యుం డరుదెంచి వినయ వినమితోత్తమాంగుండై భర్తృదారకా! తండ్రిగారు కాళిదాసమహాకవిం దీసికొనిరా దేశాంతరమరిగినదిమొదలు మీ రస్వస్థులైయున్నారు. మీవ్యాధి దినదినాభివృద్ధి వహింపుచున్నదిగాని తఱుగుట లేదు. ఇది పితృవియోగజన్యదుఃఖంబు గావచ్చును. రాజుగారు కొలఁదిదినములలో వత్తురనువార్తలు వచ్చుచున్నవి. మీరు విచారింప నవసరములేదు. మఱియు మనస్సంతోషప్రదాయకములగు వినోదములఁ జూచుచుండినచో మీవంత శాంతించును. ఉత్తరదేశమునుండి వచ్చిన యొకవాల్గంటి మనవీఁటినాటకశాలలో మొన్న సంగీతము పాడినది. వేనవేలుజనులు పోయిచూచిరి. దానిగానము దేవగానమని స్తోత్రములు చేయుచున్నారు. అత్తరుణి నేఁటిరాత్రి మరల సంగీతము బాడునఁట. చాటింపుచున్నారు. మీ రాప్తులతో వచ్చి తద్గానసారస్యము గ్రహించి యానందింపఁ గోరుచున్నాము. అని యెఱింగించిన నారాజనందనుం డనుమోదించి నాఁటిరాత్రి నియమితకాలంబునకు మిత్రులతోఁ గూడుకొని నాటక శాలకుం బోయి నిర్దిష్టవిష్టరంబున నుపవిష్టుండై యావిద్రుమోష్టిరాక కెదురుజూచుచుండెను.

యథాకాలమునకే గంట మ్రోగినది. తెర లాగఁబడినది. దివ్యమణిభూషాంబరముల ధరించి యొకమించుఁబోడి రంగాంగణ మలంకరించుచు సభ్యులకు మ్రొక్కి సమంచితవిపంచికాతంతువుల మ్రోగించుచు,

శ్లో. అనంత విద్యాకలిత ప్రభావం
    భావే ధరాదేవ కులప్రదీపం

    భజేహ మాదౌ జితపాపలోభం
    సువర్ణ నాభం మమజీవనాథం.

అని ప్రార్థించి యద్భుతగాంధర్వమున సభాసదుల హృదయంబులు నీరుగావించినది. పాడినరీతిపాడకుండ రెండుయామములుదనుక సంగీతవిద్యాపాటవము చూపి శ్రోతల గానామృతహ్రదంబున ముంచి వేసినది. మంగళగీతములు పాడినంత తెర వేయఁబడినది సభ్యులకరతాళధ్వనులు స్తుతివాక్యనినదములతోఁ గలిసికొని నింగిముట్టిసవి.

రాజపుత్రుఁడు మిత్రులతో నింటికిఁబోయి నిద్రబోక యాసంగీత ప్రశంసయే గావింపుచు దత్తునితో మిత్రమా! అది చారుమతి యను నాసతోఁ బోయితిని. సువర్ణనాభుఁడను బ్రాహ్మణుని భార్యయైనట్లు తెల్లమైనది. చారుమతిగూడ నిట్లు బాడఁగలదుసుమీ ! యనిపలికిన నవ్వుచు దత్తుం డిట్లనియె.

రాజపుత్రా ! నీ వది చారుమతిగాదని యప్పుడే నిశ్చయింపవలదు. వేశ్యకువిటుఁడే ప్రాణనాథుఁడగును. సువర్ణ నాభుఁ డట్టివాఁ డగునేమో. రేపు వారినాటకశాలకుంబోయి పూర్వోత్తరమంతయుఁ దెలిసి కొనివచ్చెద ననుజ్ఞయిమ్ము. అనుడు నతండు: నీవు వెళ్లిన మఱలరావు. నిన్నువిడువను. అది చారుమతిగాదు. అని పలికినవిని దత్తకుండు మీకడ శపథముజేసినతరువాత రాకపోవుదునా?' నాఁడు నా కావిధము దెలియక యూరికిఁబోతిని. రేపు తప్పక వారితెరగరసి వెంటనే మీ కడకు వత్తునని నచ్చఁబలికి తదానతి నింటికిఁ బోయెను.

సువర్ణనాభునిపేరువినినది మొదలాపండితుల కతండు తదుమిత్రుఁడేమోయని, భ్రాంతిగలిగినది. మఱునాఁడుదయంబున దత్తుఁడు గోణికాపుత్రు రాజపుత్రునొద్దకుఁ బంపి తాను సువర్ణనాభునివార్త నారయుటకై నాటకశాలకుం బోవుచు దారిలోఁగనంబడిన సత్రములోపలికిఁ బోయి తత్కుడ్యభాగములన్నియుఁ జూచుచుండెను. తారువ్రాసిన వ్రాఁతక్రిందనే సువర్ణనాభుడు తానా నగరమునకు వచ్చినట్లుగా వ్రాసి మఱల నాదివసమునందువచ్చి చూచెదనని కూడ తెలియపఱచెను. ఆసమయము దత్తుఁడువచ్చు సమయము నొక్కటియే యైనది. దత్తుఁడక్కడ నుండగనే సువర్ణనాభుఁడు వచ్చెను. దత్తుఁడతని గురుతుపట్టలేకపోయెను. అతనిది వెనుకటివేషముగాదు. దివ్యరత్నభూషాంబరములు దాల్చియున్నాఁడు. వెనుక శుద్ధశ్రోత్రియ వేషముతో నుండువాఁడు: దత్తుఁడెప్పుడు విలాసపురుషుఁడే. దత్తుని గుఱుతుపట్టి సువర్ణనాభుఁడు మిత్రమా! వచ్చితివా ! అని కౌఁగలించుకొనియెను. అతఁడే సువర్ణనాభుఁడని గ్రహించి దత్తుఁడును బ్రత్యాశ్లేషము గావించుచు వయస్యా ! నీ నిమిత్తమే వచ్చుచ్చుంటి: నీ వ్రాత యిప్పుడే చూచితిని. నిన్న నాటకశాలలో జరిగిన సంగీతసభకు వచ్చి నీపేరు వింటిమి. ఆగాయనీరత్నము నీకళత్రమైనట్లు స్తుతిగీతమునుబట్టి గ్రహించితిమి. అట్టికలకంఠి నెట్లుపరిణయంబైతివి ? నీవు వారణాశీపురంబు విడిచినది మొద లెందెందు సంచరించితివో నీ యుదంత మెఱింగింపుమని యడిగిన నతఁడొక రమ్యప్రదేశమునఁ గూర్చుండి యిట్లు చెప్పఁదొడంగెను.

−♦ సువర్ణ నాభునికథ. ♦−

మిత్రమా! నాఁడు " మిమ్మందఱ విడచి యుత్తరభూములఁ జూడవలయునని యభిలాషజనింపఁ దెంపునఁ జలికివెఱవక కష్టముల సహించుచు నేనును గుచుమారుండును గొన్నిపయనంబులు సేసితిమి. కుచుమారుండు సుకుమారుండగుట కష్టములకోర్వఁజాలక వెనుకకు మఱలిపోయెను. నేనుత్తరాభిముఖండనై పోయిపోయి మహారణ్య దుర్గమములగు పర్వతమథ్యముల సంచరించుచుఁ దీసికొనిపోయిన యాహారపదార్థములు సరిబోయినవెనుక ఫలములచే నాకలి నడచికొనుచు మఱికొన్నిదినంబులకు నాకులుదిని యాకలి దీర్చుకొనునలవాటు జేసికొంటిని. పర్ణములు జీర్ణములైన కొలది నా మేనికి మంచిబలము గలిగి నది. అమృతపానంబుచేసిన ట్లాకలియే కలుగునదికాదు. తృప్తిగా భుజించినట్లె యుండునది. రోగవికారము లేమియును లేవు. దేహమున వింతకాంతి మెఱయఁజొచ్చినది. అప్పుడు నే నెద్దియో యమృతతుల్యమైన యోషధిని దింటినని నిశ్చయించి మిగుల ధైర్యముతో నదులదాటి యేరులతిక్రమించి పర్వతములెక్కి యొక్కఁడనే పెక్కుదూరమరిగితిని.

వయస్యా ! జనసంచారశూన్యములగు నమ్మహాకాంతారాంతరముల సంచరించుచున్న నా కొక సిద్ధుండుగాని యొక యతీశ్వరుండు గాని, యొక తపస్విగాని గనంబడలేదు. దేవతామహిమయేమియుఁ గానుపింపదు. కొండలు నేఱులు తరులతాగుల్మాదులుగాక మఱేమివిశేషము గోచరము గాలేదు. తత్ప్రదేశమంతయు మంచుగడ్డలచే నావృతమై యున్నది. మట్టమధ్యాహ్నమునఁగాని సూర్యప్రకాశమే యగపడదు. మఱియును-

సీ. ఘనశైలతుంగశృంగము లెక్కినప్పు డా
                 కసముజేరినయట్లు . కానుపించుఁ
    బాతాళమునఁ ద్రొక్కఁబడినట్లు దోచుబల్
                తెగువ లోయలలోన దిగినయపుడు
    పెనుసముద్రమున మున్గినయట్లు భ్రమదోచు
                మంచువర్ష ము గ్రుమ్మరించునపుడు
    కాంతారమే భూమియంతయు ననఁగఁ దో
                పించుఁ గానలసంచరించు నపుడు

గీ. అంధకారమయంబులై యఖిలదిశలు
    కాటుకలుబూసినట్లు భీకరములగుచు
    బేఱుకొనియుండ నిఁకఁ దెల్లవారదనుచు
    వెఱపుజనియించు నొక్కొకవేళలందు.

అట్టికష్టంబులఁబడుచుఁ దిరుగుచుండ నొకనాఁడొక కొండశిఖ . రముమీఁద నిలువఁబడి దారికై నలుమూలలు సూచుచుండ నా ప్రాంతమందెవ్వరో సంగీతము పాడుచున్నట్లు మనోహరనినాదము వినంబడినది. ఆపాటవీతెంచినదెసకుఁ జెవియొగ్గి విని యాగానస్వాన మమృతకల్పమై సంతసముగలిగింప నానందపరవశుఁడనై యాగాంధర్వ మమానుషమని నిశ్చయించి యందుఁబోవసమకట్టి యాశృంగముచుట్టును దిరిగితిని. ఎక్కుట కెందును మార్గ మగపడినదికాదు. బొంగరమువలె వట్రువైయున్నది. దూరదూరముగాఁ జిన్నచిన్నరుప్పలుమాత్రమున్నవి.

దర్గమంబగు నాగిరికూట మెక్కుటకుఁ బదిదినములలోచించితిని. ఏయుపాయము దోచినదికాదు. అందువసింప ననవరత మాగానస్వానము వినంబడుచునేయున్నది. భగవంతునిధ్యానించుచుండ నొక యుపాయము దోచినది. అందలిమ్రానులవలనఁ గొంతనారఁదీసి యది త్రాడుగాఁజేసి యుచ్చుగట్టి యెగరవైచి దూరముగానున్న మొక్కల మొదళ్ళకుఁదగిలించుచు దానింబట్టికొని యెగఁబ్రాకుచు నీరీతి మూఁడు దినముల కాకొండశిఖర మెక్కఁగలిగితిని.

దత్తకా! ఆమూఁడుదినములు నేనుపడినకస్తికి మేరలేదు. రాత్రిపడినతోడనే కదలకనిలువంబడియున్న రుప్పనంటి కూర్చుండి తెల్లవారువఱకు జాగరముజేసితిని. కన్నుమూతపడినఁ జేయిపట్టువదలి క్రిందికిజారిపడుదును. ఒకసారి త్రాడుపట్టుకొని యెగఁబ్రాకుచుండఁ జెట్టునకుఁదగిలించిన యుచ్చుముడి వదలినది. జారి క్రిందకుదొర్లితిని. దైవవశమున నొకరుప్పకొమ్మ చేతికిఁదొరకుటచే నాగితినికాని లేనిచో గ్రిందఁబడినం దల వేయిముక్కలైపోవును. చచ్చినఁజత్తుఁగాక, గిరిశిఖర మెక్కి యాపఆటఁబాడినవారలం జూడకమాననని నిశ్చయించి క్రమ్మఱ వెనుకటిరీతినే యుచ్చువైచుచు మూడుదినముల కెక్కఁగలిగితిని.

ఆహా ! విశాలసమతలంబైన యాశృగంబున శృంగాటకంబునంబోలె మనోహరతరులతావితాన వేష్టితమైన పద్మాకరమొండు నేత్ర పర్వముగావించినది.

ఆసరోవరము చుట్టును మలచిన శిలలచే సోపానములు, గట్టఁబడియున్నవి. ఫలకుసుమధళ ప్రధానములగు తరులతాగుల్మాదులు శ్రేణులుగాఁ జుట్టును వెలయుచున్నవి. జలఖగముల నాదములు శ్రోత్రపర్వము సేయ కైరవకల్హారపరిమళ చోరకములగు మందవాయువులు మార్గశ్రమంబు బోకార్ప భృంగనాదంబు లాలించుచుఁ దత్తీరవిశేషంబులు సూచుచుఁ దటాకంబునకుఁ బ్రదక్షిణము గావించితిని.

ఒకదెస నాజలాకరంబున కల్లంతదవ్వులో నొక సిద్ధాయతనంబు ముఖమంటపమున నొకచిన్నది వీణపాడుకొనుచున్నది. చూచి విస్మయపడి మెల్లన దాపునకుఁబోయి యోరగా నిలువంబడితిని. ఆమె సంగీతము తొందరలో నన్ను విమర్శించలేదు. కొంతసేపటికి - వినమ్రుఁడనైయున్న నన్నుఁజూచి యదరిపడి యట్టెలేచి, దేవభాషతో—

చిన్నది — క స్త్వం - నీ వెవ్వఁడవు?

నేను - మహీసురేంద్ర నందనొహం. సువర్ణనాభ - ఇతి మాం జల్పతి "నేనొక - బ్రాహ్మణపుత్రుండ, సువర్ణనాభుఁడని నన్నుఁ బిలుతురు.″

చిన్నది — కిమర్థమాగతోసి. "ఎందులకై యిక్కడికి వచ్చితివి?"

నేను - భవాదృశ సుదృగ్దర్శనార్ధం దేశాన్ పర్యటామి. మీవంటి విద్వాంసులఁ జూచుటకై దేశములు దిరుగుచుంటిని.

చిన్నది - ఇహతవకిమస్తి - ఇక్కడ నీ కేమియున్నది ?

నేను - త్రిలోకదుర్లభవస్తుదర్శనమేవా గమనఫలం మమ.

చిన్నది - అహో! వాచాలతాతవ. ఏకాంతవనాంతరనివాసినాం కాంతానామంతిక మాగంతన్యంవా ? యింత రహస్యస్థలమందుండు స్త్రీలకడకు రావచ్చునా?

నేను - విధిరేవాత్రకారణం నోచెన్మానుషాణాం ద్రష్టుం శక్యం. వా. ఏతత్ప్రదేశం.

చిన్నది - కోవావిధిః

నేను - అఘటిత ఘటనాసమర్ధః పూర్వసుకృత మంగళవిధిః ........ అనియిట్లు మేము కొంతసేపు సంవాదము గావించితిమి. పిమ్మట నాకొమ్మ నాకతిథిపూజఁ గావించి భక్షింప ఫలములఁ దెచ్చియిచ్చినది. వానిందిని తృప్తుండనై విశ్రాంతివడసిన పిమ్మట నల్లన నామె యొద్దకుఁబోయి విషయముదోప నిట్లంటి.

దేవీ ! ఇది మనుష్య సంచారశూన్యంబైన దేవభూమియగుట నీ విందుండుటచే దేవకన్యవని తెల్లమగుచున్నది. సురగరుడోరగ విద్యాధరాధులలో నీవు జునించిన కులమెయ్యది ? నీ పేరేమి ? ఒక్కరిత వీ విందుండఁ గారణమేమి ? నీయుదంతం బెఱింగించి నన్ను నీకృపాత్రుం గావింపుము. పదిమాసములనుండి యీ యరణ్యములలో దిరుగుచుండెడి నాకు నేఁటికి సాఫల్యము గలిగినది. నేను గృతార్థుండ నైతిని మనుష్యులలో నధికుండవని నీవు నాతో సంభాషించుటచేతనే గర్వపడుచుంటిని. నా విద్యయు సఫలము నొందఁగలదని యత్యంత వినయవిశ్వాసములతో నడిగిన నా చిన్నది. మందహాసము గావింపుచు నిట్లనియె.

−♦ సువర్ణపది కథ. ♦−

భూసురోత్తమా! వినుము. నా కాపుర మలకాపురము నే నొక యక్షకన్యకను, నాపేరు సువర్ణ పదిక యండ్రు. మేమిరువుర మక్క చెల్లెండ్రము. మాయక్కపేరు రత్నపదిక. ఆమె భర్తతో నలకాపురంబునఁ గాపురము సేయుచుండ నే నామెయొద్దనే పెరిగితిని మేమిద్దర యొక మునివలనఁజనించితిమఁట మాతల్లి నా చిన్నతనమునందే మృతినొందినదిగమా యక్కయు బావయు నన్ను గారాబముగా బెనుచు చుండిరి. కుబేరుండొక నెపంబున సంవత్సరము భార్యతో వియోగము గలుగునట్లు మా బావనుశపించెను. ఆశాపం బతికష్టంబున ననుభవించి సంవత్సరాంతమున నింటికివచ్చి యందుండ నిష్టములేక కాపుర మెత్తి వైచి భార్యతోఁగూడ భూలోకములో నొకానొక పర్వతకందరమున వసించెను. ఆ దంపతులు నన్నుఁగూడ రమ్మని నిర్బంధించిరి. కాని నా కిష్టములేక యందేయుండి సంగీతవిద్య నేర్చుకొనుచుంటిని. నా యసహాయత బరీక్షించి కుబేరుని వంటవాఁడొకండు తన్ను వివాహమాడుమని నన్ను నిర్బంధించెను. నేనుఁ గొంతచదివినదాన నగుట నామూర్ఖునిఁ బెండ్లియాడనొల్లక నాయసమ్మతిని దెలియఁజేసితిని.

అతం డంతటితో విడువక పలుమారు నన్నందులకై వేధింపం దొడంగెను. నాని నపరాధిఁగానెంచి కుబేరునికిఁ దెలియఁజేసితిని. మా కుటుంబముపైఁగల యీసునంజేసి యారాజరాజు నా మొరవిచారింపఁ డయ్యెను. ఆ బానిసకాని రాయిడికి నేనందు నిలువలేక మాయక్కయున్న యిక్క యెఱుంగక తలపోసి తలపోసి యొక వృద్ధయక్షుని యుపదేశంబున నీ శిఖరప్రదేశంబున కరుదెంచి యిందుఁగల యిందుశేఖరుని లింగం బారాధించుచుంటిని. నాఁటితుదినేఁటిదనుక మఱియే పురుషుండు నిందురాలేదు. నీ వుత్తమ బ్రాహ్మణుండవని తోచుచున్నది. చంద్రశేఖరుండు స్వప్నంబున సాక్షాత్కరించి నీకుఁ బండితుండు బ్రాహ్మణుండు భర్తయగునని యానతిచ్చియున్న వాఁడు. అమ్మహాత్ముని వాక్యమున కన్యధాత్వ మెట్లుకలిగెడిని ? నీవు పండితుండవేని నిన్ను బెండ్లి యాడెదనని పలుకుచు గొన్నివిద్యలలో నన్నుఁ బరీక్షించినది.

అన్నిటికిని సమాధానము చెప్పితిని. అప్పుడు మెచ్చుకొనుచు నామెడలోఁ బుష్పదామంబువైచినది. నాకప్పటియానందము శెప్పుటకుఁ దగినమాటలురావు. మహానందసాగరంబున మునింగి యయ్యంగన మెడలో వేరొకపుష్పదామంబువైచితిని ఇరువురము పూవులే తలం బ్రాలుగా విరజిమ్ముకొంటిమి. ఇరువురము గలిసికొని మన్మథకళాకౌశలంబుమీఱఁ గ్రీడాపరవశులమై నూఱహోరాత్రంబులు గడియవలె వెళ్ళించితిమి. ఆప్రమదారత్వమువలనఁ గొన్నిసాంప్రదాయములు దెలిసికొని సాంప్రయోగికప్రకరణము వ్రాసితిని.

అ ట్లాసుందరీరత్నముతో నాలుగునెల లందువసియించి యడవిఁగాసిన వెన్నెలవలె నాదివ్యస్త్రీభోగ భాగ్యంబులు జూచి యానందించు మిత్రులు దూరమందుండుట తలంచి యమ్మించుఁబోఁడిం బ్రార్థించి భూలోకసంచారమున కనుజ్ఞ వడసితిని. ఆచిన్నది యక్షకాంతయైనను గుబేరశాపంబునంజేసి దేవతాశక్తి వెలితిపడియున్నది. భూమియం దెక్కడనో తనయక్క యున్నదికావున నామెం జూచువేడుక దీపింప నాతో దేశసంచారముచేయుట కంగీకరించినది. మేమిరువుర మాగిరిశిఖర మతికష్టమున దిగి కొండలోయల దాటి యరణ్యంబు లతిక్రమించి మెట్టల మీఱి క్రమంబున నాఱుమాసములకు జనపదంబులు సేరితిమి.

ఆయరణ్యములు దాటునప్పు డాకోమలిపడినవెత లేతాదృశములని చెప్పఁజాలను. ఎట్లో సహించి నాతో వచ్చినది. నడుమనడుమఁ బట్టణంబుల సభలఁగావించుచు ద్రవ్యముపార్జించితిమి. మన మనుకొనినకాలము దాటినది మీరీయూర నుందురో లేదో యని సందియముతోనే వచ్చి పాండిత్యవేషము విడిచి సంగీతప్రసంగంబున విత్తము సంపాదించు చుంటిమి. ఇదియే మావృత్తాంతము. నిన్న నే యీసత్రంబున గోడపై మీవ్రాఁతఁ జూచితిని. నిన్న పాడినది నీమిత్రునిభార్య సువర్ణ పదిక. నిన్నుఁ బొడగంటి కృతకృత్యుండనైతిని. తక్కిన మనమిత్రులు గనం బడిరా? విశేషము లేమియని యడిగిన నతండు నివ్వెఱఁపడి భళిరా దైవనియోగము. ఎంతసంతోషవార్తవింటిని. నేఁ డెంతసుదినము. ఆహా నీయదృష్టము. అని కొనియాడుచుఁ దనవృత్తాంతము కొంతకొంత చెప్పి యతనికి సంతోషము గలుగఁజేసెను. పిమ్మట సువర్ణ నాభుండు నాటకశాలకుఁబోదము రమ్ము. సువర్ణ పదికం జూతువుగాక. ఆచిన్నది నాతోఁగాక యొరులతో మాటాడదు. దేవభాషగాక యేభాషయు రాదు. అని పలుకుచుఁ జేయిపట్టుకొని యచ్చటికిఁ దీసికొనిపోయెను. అప్పుడాచిన్నది పార్వతీపూజఁ గావించుచున్నది. దత్తకుంజూపుచు “దేవీ ! ఏషఏవమమమిత్రః దత్తకః పండిత శిఖామణి" అని చెప్పినంత నాకాంత యత్యంతసంభ్రమముతో లేచి నమస్కరించినది.

దత్తకుం డత్తలోదరిం దీవించుచుఁ బ్రస్తావవశంబున మీయక్కయు బావయునున్న యిక్క నే నెఱుంగుదునని చెప్పెను. ఆమాట విని యాబోఁటి తత్తరపాటుతో మహాత్మా ! వారెందున్నవారో వేగమ చెప్పుడు. వారింజూడ నాకుఁ జాలవేడుక గలిగియున్నది. మీకు మంచి సుకృతమురాఁగలదని బ్రతిమాలుకొనినంత నతండు విమర్శింపక తెరువెఱింగింపుచు గురుతులు సెప్పి యందలి పర్వత గుహయందు వసియించి యున్నవారని యెఱింగించెను.

ఆవృత్తాంతము సెప్పుచుండఁగనే చిత్తచాంచల్యము గలిగినది. మదిలో వికారముదోఁప నిలువుం డిప్పుడేవత్తునని యచ్చోటువెడలి యెక్కడికో పోదొడంగెను. కొంతసేపటికి స్త్రీయైపోయెను. అతనికి వెనుకటిస్మృతి యించుకయు లేక , యెందుఁబోవలయునో తెలియక యలవాటుచొప్పున రుక్మిణి విహరించు నుద్యానవనముదెసకుఁ బోవుచుండెను. ఆయుద్యానపాలురు చారుమతి చారుమతి యని కేకలు వేయుచు నామె యెవ్వరికిఁ జెప్పకయే వెళ్ళిపోయినదని వినియున్నవా రగుటఁ గొందఱు పరుగునఁబోయి రాజపుత్రునకుఁ దెలియఁజేసిరి. ఆవార్త విని రాజపుత్రుం డత్యంతసంభ్రమముతో గుఱ్ఱపుబండియెక్కి దత్తకాదులకు వర్తమానముచేసి యతివేగముగాఁ బోయి యుద్యానవనములోఁ బూవులుగోయుచున్న చారుమతింగాంచి పంచశరవిద్ధహృద యుండై సిగ్గువిడిచి దిగ్గున బండిదిగి తానొక్కరుండ యావేదండగమన యొద్దకుఁ బోయి చేయిపట్టుకొని -

మ. లలనా ! యేమిటి కిట్లు నీవు లలితాలంకారశూన్యాంగవై
     చెలులంగూడక యొంటిఁ గ్రుమ్మఱుచు గాసింజెందె దాత్మీయకో
     మలదేహప్రభ గంద ; రమ్ము నిను సన్మానింతుఁ గై సేయు ము
     జ్వలమాణిక్యవిభూషణావళుల నిష్టంబైన చందంబునన్ .

క. వెరపించుటకా? ననుఁ బ
    ల్మరు నీ విటు డాగి డాగి మఱి గాన్పింపం
    దొరకొంటివి ? మేల్ నీ నే
    ర్పరితనమెల్లం గ్రహింపఁబడె విడు మింకన్ .

ఉ. ఏపడఁగంగ న న్నలరతీశ్వరుఁ డుద్ధితిమై లతాంతపుం
     దూఁపులఁ జిత్తమెల్లఁ బలుతూటులువారఁగఁ గొట్టుచున్నవాఁ
     డోపఁగఁజాల నిన్ శరణునొందెదద నన్గరుణించి నాదుసం
     తాపము వాయ వాతెఱసుధారసము ల్దయసేయుమీ సఖీ.

చ. గణికవుగాని నీవు కులకాంతవు గా వదిగాక యొక్క నిన్
    గణుతియొసర్ప భర్తగను గైకొన నద్భుతరూపసత్కళా
    గుణమణివంచు నిన్ను మదిఁ గోరితి రాజసుతుండ నేమికా
    రణమున నన్నుఁ గైకొనక ఱాపిడిఁ బెట్టెద విట్లు చెప్పుమా?

అని యనేక విధుంబులం బ్రతిమాలుటయు నాకురంగనయనయు నయనాంచలంబుల నతని నిరీక్షించుచు నిట్లనియె.

క. రాకొమరుఁడవో మారుఁడ
    వో కన నలకూబరుండవో చంద్రుఁడవో
    నా కేమియెఱుక నన్నుం
    జేకొ నెదవటంచు నెవరు సెప్పిరి నాతోన్.

గీ. గణికయైనను మఱి కులకాంతయైన
    వనిత కొకభర్త యుండంగవలయుఁ గాదె

    యందు నరనాథనందనుం డబ్బుచుండ
    నొడఁబడమి కేను సన్యాసినో మహేశ !

అని యంగీకారము సూచించుటయు నారాజనందనుం డమందానందకందళితహృదయారవిందుండై యయ్యిందువదన నక్కునఁ జేర్చి చెక్కులు ముద్దుపెట్టుకొనుచు మేనం బులకాంకురములు బొడమ బండి యెక్కించి యంతఃపురమునకుఁ దీసికొనిపోయెను.

అని యెఱింగించి.

151 వ మజిలీ.

-♦ కుచుమారునికథ. ♦--

కుచుమారుండు దత్తకాదిపండితు లేడ్వురలో నొకఁడు. దత్తునికంటె రెండేండ్లు చిన్నవాఁడు. మిక్కిలి చక్కనివాఁడు. విద్యలలో దత్తునితో సమానుఁడు. అతనికి మహారణ్యసంచారము గావించి యోషధీ విశేషముల సంగ్రహింపవలయునని చిన్నతనమునుండియు నభిలాష గలిగియున్నది. ఈమిత్రులలో నొకఁడగు సుపర్ణ నాభునికి నట్టియభిలాషయే కలదు. వారిరువురు శుభముహూర్తంబునఁ గాశీపురంబు బయలువెడలి యుత్తరదేశారణ్యమార్గంబులంబడి పోయిరి.

కుచుమారుండు మారుఁడువోలె సుకుమారుం డగుట దుస్తర ప్రస్తర హిమానీ కంటక దుర్గమంబగు కాంతారమాగన్ంబున నడువ నోపక యొకనాఁడు నేలం జదికిలంబడి వయస్యా ! నీ బలవంతమున నింతదూరము వచ్చితిని. మంచుగాక మన కేవిశేషము గనంబడలేదు. ఇఁక మనము మఱలి పురవిశేషంబులం జూచుచు నియమితకాలమునకు ధారానగరంబునకుఁ బోయి మిత్రులం గలిసికొందము. ఇక నే నడుగు నడువజాలను. ముందుఁజూడ మహారణ్యభీకరములై హిమచ్ఛన్నములగు పర్వతశిఖరములు గనంబడుచున్నవి. పోవఁజూలమని పలికిన విని సువర్ణ