Jump to content

కాశీమజిలీకథలు/ఆరవ భాగము/91వ మజిలీ

వికీసోర్స్ నుండి

మన్నింపవలయును. వసుంధరుని మామ కుముద్వంతుండు నాకుఁ బినతండ్రి కుమారుండు. వసుంధరుని పాండిత్యప్రకర్షము మేము విని యుంటిమి. అతండు లోకప్రసిద్దుండు, రామలింగ కవికుమారుఁడు వానిశిష్యుడఁవు. నీ వంతకంటె నధికుండవైతివి. నీకుఁ గొన్ని యగ్రహారములీయఁ దలచికొంటి. నాయొద్దఁ బండితుఁడవుగా నుండుమని కోరికొనియెను.

అని వినిపించి యయ్యతి ప౦చాననుండు తరువాత చరిత్ర మవ్వల నున్న యునికియం దిట్లు చెప్పఁదొడంగెను.

తొంబది యొకటవ మజిలీ

మంజరికా ! ఈ సరోజిని కౌముది పోలికగా నున్నది చూచితివా? ఈ చిన్నది యింద్రదత్త కేమి కావలయును ? ఒకవేళ నా బాలిక బ్రతికి యిక్కడికి రా లేదుగదయని పాటలిక చెప్పిన విని మంజరిక అవును నాకును సందియము కలుగు చున్నది. నడక యచ్చుగ నట్లే యున్నది. ఇప్పుడు రాజపుత్రిక యొద్దనే ముచ్చటింపుచున్నది. దాపునకుఁ బోయి యాకర్ణింతము రమ్ము. యని పలుకుచు మంజరికయుఁ బాటలికయు మాటునఁ గూర్చుండి వారి మాటలు వినుచుండిరి. అప్పుడు సరోజిని రాజపుత్రికతో నిట్లు చెప్పుచుండెను.

దేవీ ! నేనించుకయు నసత్యము లాడుదానఁ గాను. ఘటదత్తుఁడు త్తమవంశ జాతుఁడు. వసుంధరుఁడను రాజునొద్దఁగొన్ని నాళ్ళుమంత్రి యైయుండి యాతని కేదియో కోపమువచ్చిన నందు నిలువక దేశాటనముఁ జేయుచు మహారణ్యమధ్యమునఁ బడియుండి యెకనాఁడు దొంగలచే రక్షింపఁబడెను. వాండ్రు తమవృత్తిఁ గైకొనుమని నిర్భంధించిరి. ఇష్టము లేకున్నను వారితోఁ గొన్ని దినములు తిరిగెను. చంద్రవతి యను వేశ్య నన్నుఁ బెంచికొన్నదని నీకిదివరకే చెప్పితినిగదా ? నన్ను వేశ్యా వృత్తికై బోధించినది. నే నంగీ‌కరింపక యెదురాడుచుంటిని. ఘటదత్తునకు రాజవేషము వైచి యానలువురు దొంగలు మాయింటికిఁ దీసికొనివచ్చిరి. నాఁడు చంద్రవతి నన్నుఁ బెద్దగా నిర్భంధించి వానితోఁ గూడుమని బోధించి వాని నా గదిలోనికి బంపినది. నేను దుఃఖించుచు వాని పాదముల మీదఁ బడి నా చిత్తవృత్తి నెరింగించితిని.

అతండు నన్నుఁ దోబుట్టువుగాఁ దలంచి మన్నించెను. అంతలో దొంగలు లోపలికివచ్చి వానిందిట్టుచు నన్ను బట్టికొని యొకడెత్తు కొనిపోయెను. గ్రామ ప్రాంత కాంతారమున నన్ను బలవంతము సేయుచుండ నతండు వారినందరం గడతేర్చెను. పెక్కులేల ? అతని పరాక్రమము చూచి తీరవలయును అని తలచి కథ ------------ కథయుం జెప్పి రాజపుత్రీ 1 మా చరిత్ర యింతయున్నది. సామాన్యముగా నతని దొంగయనియు నన్ను లంజయనియుఁ దలంపక మానరు. సత్యము చూచిన నతని వంటి బలశాలియు గుణశాలియుఁ బుడమిలో లేడు. అతఁడే నీకుఁ దగినవాఁడు. నీవే వానికిఁ దగుదువు. నీ వీవిషయమై చింతింపవలసిన పనిలేదని చాలసే వుపన్యసించినది. ఆ యుపన్యాసము విని మంజరికయు, బాటలికయు, నురములమీదఁ జేతులు వైచుచు అమ్మయ్యో ? ఘటదత్తుఁ డిక్కడికే వచ్చెనా. ఈ రాజపుత్రిక వాని వలచినదని తోచుచున్నది. అతండు రాజపుత్రుఁడని తెలిసిన మిక్కిలి సంతసింపఁ గలదు. జెప్పుదమా? చెప్పినచో మన ద్రోహము బయల్పడ గలదు. మన కంత యవసర మేల వచ్చినది? చెప్పరాదు. ఈ చిన్నదియు గౌముదికూఁతురే అయ్యారే ? దైవఘటనము. ఇద్దరినొక చోటికే చేరఁదీసెనుగదా ? అని యిరువురు ముచ్చటించుకొనిరి.

అప్పుడు పాటలిక యోసీ ! మంజరికా ! ఈ వృత్తాంతము చెప్పుదనుక నా నాలుక గులగుల లాడుచున్నది. కడుపులో నిలుచునట్లు లేదు. దీన నింద్రదత్త కేమి లోపమున్నది ? చెప్పుదును. అని యడిగిన వద్దు వద్దు అని వారించినది. అయ్యో ! మనము వచ్చుచున్నట్లు రాజపుత్రికతో నావార్త చెప్పవలదని‌ యెంత యాపినను నిలువకున్నది. నే నేమి చేయుదును? ఎట్లు చెప్పవలయునో యుపాయము బోధింపు మనుటయు మంజరిక యిట్లనియె.

ఈ కథఁ జెప్పిన మనకు శిరచ్ఛేదము కాదా ? మనము కావించిన పని సామాన్యమా ? ఇరువురి శిశువులం జంప బూనితిమి. వారి జీవితములు దృడమైనవి. కావునఁ జావరైరి. పైన దైవము లేడాఁ మన ప్రయత్నములు వృధలు. వృధలు. మన కించుకయు స్వతంత్రము లేదు. నా కీ ద్రోహకృత్యములు మొదటినుండియు నిష్టము లేదు. నీవును మా తల్లియు నింతఁ జేసిరి. మన చేసిన మోసము మనలనే కొట్టినది. స్థానభ్రష్టుల మైతిమిగదా? నిజ మెరింగిన వీరుమాత్ర మిందుండ నిత్తురా ? తిరిపె మెత్తుకొని తిరగవలసి వచ్చును. కావున మౌనము వహంచి యుండుమని యెంతయో బోధించినది గాని స్త్రీ చాపల్యంబునం జేసి యొకనాఁడా పాటలిక యింద్రదత్తతో రహస్యముగా నిట్లనియె.

రాజపుత్రీ ! ఘటదత్తుని గురించి నీ వూరక వితర్కించి యా చిన్నదాని నడుగుచుండ వినుచుంటి. నా నెరింగిన విషయ మితరులు వేరొక తెరవున శంకించుకొనుచుండనిజము చెప్పువరకు నెవ్వెరికిం దోచదుగదా ! అతని వృత్తాంతము నాకు సొంతముగాఁ దెలియును. విను మతండు కృష్ణదేవరాయల దౌహిత్రుండు వసుంధరుని కుమారుండు. అతండు పుట్టినప్పుడు దాది కపటముఁ జేసి కందకములోఁ బారవేయఁ దీసికొని పోవుచుండ శారదయను బ్రాహ్మణపత్ని వానిం గైకొని పెంచుకొన్నది. అక్కథ కడు గూఢమైనది. ఆ దాదివలన నాకుఁ దరువాత దెలిసినది. ఆతండును దనజననోదంత మించుకయు నెరుంగఁడు. ఈ సరోజినియుఁ గౌముది కూతురు. ఈ

దాసీ :పకంకుత్వుముననే బరినినున సు సంజీోషాంబుంథి కిట్రీల;పుల నోలండుటు సిటి టు పాపలా । సత్య ఏష ఏమునచో నావంటి ధన్యులు పుతమిలో 'కేదుగదా। ఎట్టుమై మరియుఁ జెప్పుము. ఈతండు పుత్రుఁడని వనుంధరుఁడెరుఁగడు కాబోలు ? బాపురే ? ఎట్టివింత వినంబడి నది. ఈ సరోజిని నిక్క_ముగాఁ దోబుట్టువనియతం డెరుఁగడు. సరోజినికిం దెలియదు. ఈ పూర్వోదంత మంతయు మీకెట్లు తెల్ల మైనది. అందులకే సరోజిని యిట్టిబుద్ధిశాలినియైనది. అని యడిగిన మాటయే యడుగుచు వినిన మాటయే వినుచుఁ బెద్దతడవు దానితో సంభాషించినది.

అట్టి సమయమున విజయదేవుఁ డా ఇంద్రదత్త యంతఃపురమునకు వచ్చి భార్యనుగూడరప్పించి సంతోషం బభినయించుచు మన ఇంద్రదత్త వరించిన ఘటదత్తుడు దొంగయని మన మదివర కనుమానముఁ జెందుచుంటిమి. అతండు బ్రాహ్మణుఁడట. భూలోకములో నతనివంటి పండితుఁడును పరాక్రమవంతుండును లేడఁట. మున్ను మన కతఁడు తస్కరుఁడని తెలియపరచిన కీర్తి సేనుఁడే క్రమ్మర నిప్పుడా వార్తఁ దెలియఁ జేసెను. వానికిఁ దన రాజ్యములో సగ మిచ్చివేసితినని తెలియఁ జేయు చున్నాఁడు. సుముఖుఁ డనువాఁడు మంత్రిత్వాధికారమిచ్చెనఁట. వాని కిప్పుడింత యేలవచ్చినది. నా రాజ్యమున కే యధికారిం జేయుచున్నానని తెలియఁ జేసెదను. సత్వరముగా రమ్మని యుత్తరము వ్రాయచున్నానని తన యభిప్రాయము తెలియఁ బరచుటయు నెక్కుడు మురిపెముఁ జెందుచు నా రాజపుత్రికతండ్రి కిట్లనియె. తండ్రీ ! నీవు నీ యల్లుఁడు బ్రాహ్మణుఁడని విననంతనే సంతసించు చుంటివి. ఆతని యధార్థ చరిత్రము వినిన నెంత యానందింతువో ? వినుము. ఆ వీరుఁడు కృష్ణదేవరాయల దౌహిత్రుండు. తెనాలిరామలింగకవి పౌత్రుండు. వసుంధరుని పుత్రుండు. మనము బోగముదాన యని వినిన సరోజని నిజముగా వాని చెల్లె లే. కుముద్వంతుని దౌహిత్రి వారిరువురు గ్రహచార దోషంబునఁ దల్లి దండ్రులనుఁ బాసి యిడుమలం గుడుచు చున్నారు. సరోజని సౌందర్యమునను బుద్ధికౌశల్యమునను ననన్య‌ సామాన్యమై యున్నదిఁ ఆమె రాజపుత్రికయగు కేమియు సందియములేదు. అని పాటలిక వలనఁ దాను వినినకథ యంతయుం జెప్పుటయు విజయదేవ భూపాలుండ పార కౌతూహలముతో నోహో ? మన భాగ్యమేమని కొనియాడఁదగినది. మహాత్ములతో సంబంధముఁ గలుపుకొంటిమి. అని పలుకునప్పుడే సరోజిని యిందున్నదనియు ఘటదత్తుం దీసికొని రమ్మనియు వేవుర దూతలంగీర్తి సేను నొద్దకు బంపెను.

సరోజినియు మాటుననుండి వారి మాటలువిని యుబ్బుచు బాటలికం జీరి నీవు మా వృత్తాంత మెట్లు తెలిసికొంటివి. నీకుఁ జెప్పిన దాది యెవ్వతియ? నీకును దానికిని నెట్టి సంబంధము కలిగియున్నది. అని వితర్క పూర్వకముగా న‌డిగిన నదియు నా చిన్నదానికి నమ్మకముఁ గలుగునట్లు చెప్పినది. సరోజిని యప్పుడే యా కృత్యముఁ గావించినవారు మీరేయని దానిమాటలచే సందేహము కలిగినది. ఇంద్రదత్తయు సరోజిని --------- గరింగించి నీవు నా కాడుబిడ్డ వైతివి. నీ కథ యెరుఁగక నిన్నుఁ దూలనాడిన నా తప్పు మన్నింప వలయునని ప్రార్దించినది. అట్లు వారు పరమసంతోషముతో నేపారుచుండ రెండు దినంబులకు రాజ దూతలవలన సరోజినియందున్నదని విని ఘటదత్తుండును సుముఖుండును కీర్తి సేనుఁడును వారివారి వారమును గమలాపురంబునకరుదెంచిరి. విజయదేవ భూపాలుండు వార లందరకుఁ బ్రత్యుత్తానాది సత్కారములఁ గావించి మిక్కిలి గౌరవింపుచు నానందింపఁ జేసెను.

అప్పుడు ఘటదత్తుఁడు సరోజినిం జూచు నుత్సకముతో నంతఃపురమున కరిగెను. సరోజినియు నతని రాక విని యెదురు వచ్చి పాదములంబడి నమస్కరించుచు నశ్రుజల పూర్ణనయనయై డగ్గుత్తికతో వియోగ దుఃఖమును దెలిపెను.

ఘటదత్తుండును గ్రుచ్చియెత్తి చెల్లీ ! నీ నిమిత్త మీదేశ మంతయుఁ దిరుగుచున్నాను. క్రూరసత్వంబుల కాహారమైతివని వగచితిని. నిన్ను వెండియుం జూతునని తలంచికొనలేదు. అని తాను పడిన యిడుములన్నియుం జెప్పుకొనియెను. ఆ చిన్నదియుఁ దనకథ యెరింగించి మొగంబున సంతోష మభినయించుచుఁ దండ్రీ ! ప్రీతులకు బాహ్యోపాధులు కారణములు కావుసుమీ? అనిర్వాచ్యమైన హేతువేదియో పదార్థములను గూర్చుచుండును. నీకు నా యందింత యక్కటిక మేల కలిగినదో యూహింపవలయునని పలుకుచుండగ మంజరిక యేమిటికో యక్కడికి వచ్చినది.

దానింజూచి గురుతుపట్టి ఘటదత్తుఁడు ఓసీ ? నీవు మంజరికవుకావా ? కళావతీసఖురాల విందేమిటికి వచ్చితివని యడిగిన ఘటదత్తుం జూచి యించుక వెరచుచు దేవా! మే మిప్పుడక్కడ పనిమానితిమి. కాశికింబోయి వచ్చుచు నీ దివాణము నాశ్రయించితిమి. కూలివాండ్రకొకతావు నిత్యమా? యని విని పలికిన సరోజిని అన్నా వీరిని నీ వెరుంగుదువా ? వీ రిందుమతీదేవి పరిచారికల మని చెప్పిరే ? కళావతి నెట్లెరుగుదురని యడిగిన గళావతీ పరిచారిక లనియే చెప్పెను.

ఆ మాట దానిని ముదలకించినది. అదియొక మాటకు వేరొకమాట చెప్పినది. అంతకుముందే వారియం దనుమానముఁ జెందియున్న సరోజిని యప్పు డాపని వీరే చేసినవారని ధ్రువపరచినది.

తరువాత సరోజిని తమకథ యంతయు ఘటదత్తున కెరింగించి నీవు కళావతి కుమారుఁడవట. నేను గౌముది పుత్రికనఁట. వసుంధరుడే మన తండ్రియట. ఈ వృత్తాంత మీ దాదులు చెప్పియున్నారు. ఈ కపటక్రియలు చేసినదియు వీరేసుఁడి యని చెప్పి వాని నానంద సాగరమున దీర్థమాడించిరి.

విజయదేవభూపాలుండును ఘటదత్తుఁడు వసుంధరుని కుమారుఁడని కీర్తి సేనున కెరింగించి తనకూతు రింద్రదత్త యతని వరించిన కథయుంజెప్పి యతనికి సంతసము గలుగుఁ జేయుచు నతని యనుమతి నా చరిత్ర యంతయుఁ బత్రికలపౌ వ్రాయించి దూతలకిచ్చి వివాహశుభలేఖలతోఁ గూడ వసుంధరునొద్ద కనిపెను.

వసుంధరునిభార్య కళావతి మంజరికయుఁ బాటలికయుఁ బారిపోయిరను వార్త విని యంతఃపుర పరిచారికనెల్ల రప్పించి తర్జించి యీ పత్రిక వ్రాసి రాజుగారి శయ్యపై నిడినవా రెవ్వరో చెప్పుడని యడిగిన వారందరు గుమిఁగూడి దేవీ ? మాకీ తెరంగేమియు దెలియదు. పాటలిక కూతురు మాధవిక కంతయుం దెలియునని యేకవాక్యముగాఁ జెప్పిరి. అప్పుడు మాధవికను జేయవలసినంత తర్జనముఁ జేసి యడుగుటయు నది వెరచుచు మంజరికయు దన తల్లి యు దొరికిన కానుకలు సమముగా బంచికొను తలంపుతో నిరువురకుఁ బుట్టిన బిడ్డల దీసికొని పోయిరనియ ఘటదత్తుఁడు కళావతి కుమారుఁ డనియు గళా లయ యంతఃపురంబున మంజరిక యట్టిచీటిని వ్రాసి పఱపుక్రింద నిడినదనియు జరిగినకథ యంతయుఁ బూసఁ గ్రుచ్చినట్లు వక్కాణించినది.

ఆ కథ విని వసుంధరుఁడు సంతోషశోక సంభ్రమములతో నప్పటి వారిం బిలిపించి యా బాలిక వృత్తాంతమును గురించి యడుగుటయు నొక కుమ్మరిది వీధిలో నా పిల్ల నాకుఁ దొరికినది నేను నెలదినములు పెంచి సంతతి శూన్యురాలగు నా మేనత్త కూతునకిచ్చితిని. దాని కాపుర ముజ్జయినీపురము. అదియు మూఁడేండ్లు గారాబముగఁ బెంచి స్వర్గస్తురాలై నదట. తరువాత దాని బంధుపు లెవ్వరో తీసికోని పోయిరని చెప్పినది.

అప్పుడతం డా యుజ్జయనీపురమున కరిగి యా కులాల కులస్థులనెల్ల రప్పించి యా చిన్న దానివార్త నడిగినఁ బెంపుడుతల్లి చచ్చిన వెనుక నా పిల్లను తంతువాయ కులస్థుల కెవ్వరికో పెంచుకొన నిచ్చినట్లు తెల్ల మైనది.

వారికులశీల నామంబులఁ దెలిసికొని యక్కడికిఁ బోయి యడిగిన జివరకుఁ గాళిందీపురమునఁ జంద్రవతియను వేశ్యతీసికొనిపోయి పెంచుకొన్నదని తెలియవచ్చినది. వసుంధరుఁడు తన యిద్ధరి భార్యలతో నా పురమున కరిగి యా చంద్రవతి యింటికిఁబోయి నీవు పెంచుకొనిన కూఁతురేమైనదని యడిగిన నది గోలుగోలమన యేడ్చుచు ఘటదత్తుఁడను జోరుఁడు నా యింటికి విటవేషముతో వచ్చి నా యిల్లంతయు బంగారముకాజేసి నా కూఁతుం దీసికొనిపోయెనని చెప్పినది.

ఆ మాటవిని యతండు మిక్కి.లి పరితపించుచు నా పురనాధుండు కీర్తి సేనుండు తనకుఁ బంధువుడగుట నతనికోటకుం బోయి విమర్శింప ఘటదత్తుఁ బట్టుకొను తలంపులో నా దేశమునకుఁ బోయెనని జెప్పిరి. ఘటదత్తుండు సరోజిని తన చెల్లెలని యెరుఁగక దానిం దీసికొనిపోయెనని మది విచారించుచు వసుంధరుఁడు వారినిమిత్తమై తిరుగుచుండ విజయదేవ భూపాలునిచేఁ బంపబడిన దూత లతనిని వెదకికొనుచు మార్గమధ్యంబునం గలసికొని యా శుభలేఖల నిచ్చిరి.

ఆ పత్రికలం జదివికొని వసుంధరుఁడు పరమానందభరిత హృదయుండై తన భార్యలకుంజూపుచు వారు పడిన యిడుమలకు వగచుచు వారి సుగుణములకు మెచ్చికొనుచు వారి కౌశల్యమునకు నానందించుచుఁ కతిపయప్రయాణములఁ గమలా పురమునఁ కరుదెంచెను. వారిరాక విని జయదేవుఁ డెదురువోయి సపరివారముగాఁ దోడ్తెచ్చి యనేక సత్కారములం గావింపుచుఁ దమప్రాసాదనమున విడియఁ జేసెను.

భార్యలు సంతానమునుజూడఁ దొందరపడుచుండఁ శర్వాణివారి నంతఃపురమునకుఁ దీసికొని పోయినది. వసుంధరుఁడును దోడన చని తన కెదురువచ్చి నమస్కరింపుచున్న ఘటదత్తుఁ గ్రుచ్చి యెత్తి పుత్రా ! నీ వృత్తాంతముఁ దెలియక నీ సుగుణములు పరిశీలింపక చేతికి దొరకిన రత్నమును శిలయని పారవై చినట్లు నిన్ను విడనాడి యతికష్టంబులఁ బెట్టితినిగదా! నీ పరాక్రమము నీ సౌశీల్యము లోకములు కొనియాడుచున్నవి. నిన్నుఁ గని ధన్యుఁడ నై తినని‌ యనేక ప్రకారముల నగ్గించెను.

తరువాత నతం డిరువుర తల్లులయొద్దకుఁ బోయి నమస్కరించుటయు వారు గ్రుచ్చియెత్తి గారవించిరి. కళావతి యతఁడు పడిన యిడుమలం దలంచి శోకించుచుఁ దండ్రీ! నీవు మహారాజుకుమారుండ వయ్యుఁ బుట్టిననాడుంగోలె నించుకయు సుఖపడక యడవులపాలై కడు నిడుమలం గుడిచితివిగదా! నీవు దొంగవని పట్టుకొని సంకెళులు వైచినప్పుడు నీవెంత చింతించితివో పట్టీ? నిన్ను గనియు నీ ముద్దుముచ్చటలు చూచుభాగ్యము నాకు లేకపోయెంగదాయని క‌న్నీరు మున్నీరుగాఁ జింతించుచున్న తల్లి నూరడించుచు నతండు తని ముద్దుచెల్లెలు చేసిన పనులన్నియుఁ జెప్పుచు వారికి సంతోషముఁ గలుగఁజేసెను.

సరోజినియు నిద్దరితల్లులచేఁ గారవింపఁబడియున్న తన్నుఁ గాపాడిన విషయము చెప్పుచు నతని సుగుణంబులఁ గొనియాడినది. ఆ లోపలనే మంజరికయుఁ బాటలికయు వారిరాక విని యెక్కడికో పారిపోయిరి సావధానముగా గూర్చుండి ఘటదత్తుఁడు సరోజినియుఁ దల్లిదండ్రు లడుగుచుండఁ వారు పడిన యిడుమ లన్నియుం జెప్పుచు వారికి దుఃఖమును సంతోషమును విస్మయమును గలుగఁ జేసిరి‌.

అంతట విజయదేవభూపాలుండు ఘటదత్తుని సుగుణ విశేషము లగ్గించుచు వసుంధరుని యనుమతి వడసి బంధువుల నందరి రప్పించి శుభముహూర్త మందింద్రదత్తాఘటదత్తులకు దేవ వైభవములతో వివాహముఁ గావించెను.

వసుంధరుఁడా వివాహపరివారము నంతయుఁ దమపురంబునకుఁ దీసికొని పోయి భూమి యంతయు మోగినట్లు సరోజినిని సుముఖునిని పెండ్లిఁగావించెను. ఘటదత్తుఁడు చంద్రవతికి మ్రుచ్చిలింపఁబడిన ధన మంతయు నిప్పించి సంతోషపెట్టెను. తన్నుఁ బెంచినఁ దల్లిదండ్రులు శారదయు భర్తయుఁగన్న వారి కన్న నెక్కుడు గారాబముగాఁ జూచుచుండ వారియెడ గృతజ్ఞుండై పితృభక్తిగలిగి యుత్తమగుణవంతులలో మొదటివాఁడుగా నెన్నుకొనఁ బడుచుండెను.

మనుమని చరిత్ర మంతయును విని కృష్ణదేవరాయలును రామలింగకవియు సపరివారముగా సౌగంధిక నగరమున కరుదెంచి వసుంధర మన్నించుచుఁ దమకు ------------------- ఘటదత్తుం గ్రుచ్చి యెత్తి మిక్కిలి గారవించిరి. అప్పుడు రామ లింగకవి వత్సా ! నీవృత్తాంతమంతయు వింటిని బ్రాహ్మ్యక్షత్ర తేజంబులు రెండును నీయందు పొలుపొందు చున్నవి. నీ పరాక్రమమునకు క్షత్రియులును బాండిత్యమునకు విద్వాంసులును బొగడుచున్నారు. నీ కతంబున మా వంశంబు పవిత్రమైనది. అని కొనియాడుచుఁ గొన్ని శాస్త్రములయందుఁ బరీక్షంచెను.

ఘటదత్తుఁడు యుక్తియుక్తముగా గంభీరవాగ్గుంభనలచే నుపన్యసించి రామలింగకవికి విస్మయముఁ గలుగజేసెను. కృష్ణదేవరాయలును బరమానంద భరితుండయ్యెను. అప్పుడు మంజరికయుఁ బాటలికయు గావించిన క్రూరకృత్యములవలన వీరికి యిక్కట్టు గలిగినదని విని రాయలు మిక్కిలి యాగ్రహించుచు వారింబట్టికొనికట్టి తీసుకొని రావలయునని కింకరుల కాజ్ఞాపించుటయు రామలింగకవి వారించుచు నదికేవలము వారి దోషముకాదు అందు మనవారును గలిసియుందురు. విమర్శింపం బనిలేదు. దైవవియోగమున కొకరి నన నేమిటికి? పోనిండు. రత్నమునకు రాచినకొలది వన్నెఁ గలుగునట్లు వీరి దేశసంచారముమూలమున శీలప్రభావముల తెల్లమైనవని సమాధానముఁ జెప్పెను. రామలింగకవియు సరోజినియు నుక్తియుక్తులతో నొకనాఁడు సంభాషించిరి. సరోజినియుక్తియే పైనగుటయు రామలింగకవి‌ సంతసించుచు నన్నిగతుల నిన్నుఁ జనమందారవల్లి యని పిలువవచ్చును. గణికాధర్మము లిరువురయందును వర్తించినవి గదాయని పరిహసించుటయుఁ బండితులే పంగ్వంధబధిరభావము వహింప వారియాఁడువారు గణికలగుటయబ్బురమా యని సమాధానముఁ జెప్పినది. ఈ రీతిఁ గొన్నిదినంబు లందుండి మనుమలతో ముచ్చటించుచు రామలింగకవియుఁ గృష్ణ దేవరాయలును దమపురమున కరిగిరి. ఇంద్రదత్తా ఘటదత్తులును, సరోజినీసుముఖులును సర్వ సౌఖ్యములు చెందుచుఁ బెద్దకాలము భూలోకమును బాలించిరి.

గోపా ! యాకథ‌ నీ వడిగిన ప్రశ్నమునకు సమాధానమైసదాయని పలుకుచు మణిసిద్ధుండు వానితోఁగూడి యా యవసధమున సుఖముగా వసియించెను.