కాశీమజిలీకథలు/ఆరవ భాగము/85వ మజిలీ

వికీసోర్స్ నుండి

ఎనుబది ఐదవ మజిలీ

సరోజినికథ

పుత్రీ ! సరోజినీ ! నీవు నామాటఁ బాటింపక వేశ్యావృత్తి గర్హితమని నిందించుచుంటివి సృష్ట్యాదినుండియు వారాంగనలకథలు వ్రాయఁబడియున్నవి. దేవలోకముననున్న రంభోర్వశీ మేనకా తిలోత్త మాదులు వేశ్యలనియే చెప్పుదురు. మనము తత్సంతతివారమే. అదియుంగాక పౌండరీకమను క్రతువునకు వెలయాండ్రు గూడఁ గొండొక సాధనముగా నిరూపింపఁబడి యుండిరి. వేదచోదితములై న గణికాగుణ ప్రవర్తనములు నీకు మాత్రము దోషపాత్రములై నవి. మనకుఁ గల గౌరవము నీ వేమెరుంగుదువు ? అతి పవిత్రమైన గీర్వాణభాష స్త్రీలలో మన మొక్కరమే చదువఁదగియుంటిమి. పురాణగాథ లన్నియు నాలించియు నీ వింత మూర్ఖత గావించిన నాకుఁ గోపమురాక మానునా ? ఇప్పుడు త్రిలోకాభి రాముఁడగు రాజపుత్రుఁ డొకఁడు నలువురు పరిచారకులతో నీ యూరు వచ్చి నీ రూపగౌరవములు విని తాంబూలమిచ్చి పోయెను. ఆసేచకములై న తదీయ రూప రేఖా విలాసములుచూచి విడువలేక యతనిరాక కంగీకరించితిని. వానిం జూచితివయేని నీ నియమంబులన్నియుఁ బటాపంచలై పోఁగలవు. నీవు వానికిం దగియుంటివి. నిన్నుఁ జూచిన నతండు తన రాజ్యమంతయు నీ యధీనము సేయక మానఁడు. భవదీయ శృంగార తిలా చాతుర్యములు చూపింప నవసరము వచ్చినది. ఇంత దనుకఁ దగిన విటుండు దొరకమి నీ మాటలకుఁ దాళి యుంటిని. ఇప్పు డంగికరింపవేని నింతకన్న నధికశిక్షఁ గావింపక మాననని కాళిందీపురంబున జంద్రపతియను వృద్ధవేశ్య సరోజనియును తన కూఁతు నిర్బంధించిన నమ్మించుబోణి కన్నీరుఁ గార్చుచు నిట్లనియె.

తల్లీ ! నీయుల్ల మింత పాషాణమైనదేమి ? నీవు పెక్కండ్ర ధనికుల మోసపుచ్చి కావలసినంత ధనము సంపాదించితివి. అదియే మూడు తరంబులదాక యధేష్టముగా వాడుకొనినను దరగదు. ఎల్లకాల మొక పగిదియే దుష్కృత్యము జేయవలయునా ? నీవు పరమున కేమి సంపాదించుకొని పోయెదవు? ఇఁక నెన్ను నాళ్ళు బ్రతికెదవు? దుర్వృత్తిగా నార్జించిన ద్రవ్యము దొంగల వలననో దొరల వలననో నాశనము నొందక మానదు. లేని మక్కువలు ప్రకటించి వలపుఁ గలుగఁజేసి పలుకుల నమృతముఁ దొలిగించుచుఁ జిట్టమువంటి మనసుతోఁ గుటిల ------- వర్తనముల విటుల ద్రవ్యముల దోచికొను పాటవము నాకులేదు. మన వృత్తి సవ్వృత్తి యని పొగడుచుంటివి. పెద్దపులికైన నయగలదుగాని‌ వెలయాలికి దయలేదు. అట్టి ------ ప్రవర్తనమునకు నా మనసు దొరకున్నది. నన్నొతనికిచ్చి పెండ్లిచేయుము. వానినే దైవముగాఁ జూచుకొనుచుఁ బతివ్రతనై పేరు ప్రతిష్ఠల సంపాదించెద నిదియే నా కోరిక. మన్మధుండు విటుండై వచ్చినను నంగీకరింపను. కురూపియైనను బెనిమిటిని మన్మధునిగాఁ జూచుకొనియెదను. ఇష్టమున్న నట్లుచేయుము. లేకున్నఁ జంపివేయము. అని ప్రత్యుత్తరము చెప్పినది.

ఆ మాటవిని యా వేశ్య చాలుఁజాలు. ఇదియా నీ యభిలాష ? నేనెన్నియో యిడుమలంబడి గడియించిన విత్తమంతయు నీ వొకమగనితోఁ గులుకుచుఁ గఱచు పెట్టెదవా ? అమ్మా ! ఎంతకాణాచివే. నీ మాత్రపు గడుసుఁదనము నాకుఁ జిన్నప్పుడు లేక పోయినదిగదా ? నేనునుం బెండ్లి యాడిన నీ పని యేమగునో ? మేడలును మిద్దెలును నీ పాటికిఁగూటికి లేక నమ్ముకొని పోకుందుమా ? ధనము ప్రోగు చేయఁబట్టియే యిన్ని పోకడలు పోవుచున్నావు. నీకు హితముఁ జెప్పినది దెలియకున్నది. ఏమి సేయుదును? పెండ్లి యాడినచో మగనియానతికిలోనై వర్తింపవలయుం గదా? దాన స్వేచ్చకు భంగము కలుగును. మరియు నత్తకును మామకునుమరదులకును లొంగి తిరుగవలయును. హావభావముల వెలయించుటకు నవకాశములేదు. అభిలాషలు మనసుననే జీర్ణము కావలయును. విద్యలకు ఫలము లేదు. ఇతరులఁ గన్నెత్తిచూచినఁ దప్పుసేయుదురు. పెండ్లి పెండ్లి యని యూరక పలవరింపుచుంటివి. అదెన్ని దోషములు కలిగియున్నది. అంగహీనులకును రూపహీనులకుం బెండ్లి కాని నీ వంటి జగన్మోహన రూపముగల కలకంఠికిఁ బెండ్లి యేమిటికి ? నిన్నుఁ జూచిన నింద్రుండైనను సంకిలి కాకుండునా ? నాకుఁ జిన్నతనమునం దిట్టి రూపమే యుండినచో భూమండల మంతయు నేలకపోవుదునా ? గ్రుడ్డికన్ను తెలియ నీయక చెవుడుఁగప్పిపుచ్చి మొగము రాచి రాచి యొడలు తోమి తోమి‌ లేనియందముఁ దెచ్చి పెట్టుకొని యింతద్రవ్యము సంపాదించితిని. నా చూడని విటులును నే నెరుఁగని సుందరులును లేరు. రూపము లేకున్నను మాటల చేతనే వలపుఁ గలుగ జేయుదానను. ఆహా ! వేశ్యాజన్మముకన్న నుత్తమమైన జన్మముకలదా ? స్త్రీలలో గణికయే పొగడఁదగినది. నా హితము విని వివాహాభిలాషవిడిచి వేశ్యాధర్మముల నవలంబింపుము. ప్రాయము రిత్త సేయకుము. ఇంతయేల? నేడు వచ్చిన రాజపుత్రుఁడు నీకు నచ్చనిచో నా మాట యెన్నఁడును వినవద్దు. వాని నీవు చూచి వరింపవేని నీకుఁ దప్పక పెండ్లి జేసెద నిదియే శపధమని బోధించిన విని‌ యాతరుణీరత్న మేమియు మాటాడక యూరకున్నది.

అదియే యంగీకారసూచనమని సంతసముఁ జెందుచు నా వృద్ద వేశ్య సాయంకాలమునఁ బడకగది యద్భుతముగా నలకరించినది. సరోజిని వలదనుచుండ మెడ మణిహారముల వై చినది. తలపై రత్నంబులు జతపరచినది. మేన ---------- దొడిగినది. ఇట్లు సన్నద్దంబుఁ గావించి తదాగమన మభిలషింపుచున్నంత-

అ. ఒకడు గొడుగు బట్ట నొకఁడు --------
     బాదుకల నొకండు బట్టి నడువ
     నొకనికేలునట్టి యొయ్యారముగ వచ్చె
     బొందు గోరి రాజనందనుండు.

అట్లు భయభక్తి విశ్వాసములలోఁ బరిచారకు లనుసరింప రాజు పుత్రుండా వేశ్యయింటికి వచ్చుటయు నది యెదురు వచ్చి హారతియిచ్చినది. ఆ పళ్ళెరమందు నూరుమాడలు కానుకగా నొకపరిజనుఁ డుంచుటయు నాభోగముది యాబూవికి వెరగు పడుచు లోనికిం దీసికొనిపోయి యుపచారములఁ బెక్కుఁ గావించి యా వయసుకాని దన కూతురున్న గదిలోనికిం ద్రోచి తలుపువై చినది.

పిమ్మట నారాజదూతలు నలువురు గృహవిశేషములం జూచుచుఁ జంద్రవతి యొద్దకుఁ బోయి యోహో ? భాగ్యశాలినీ ! నీ గేహము రాజభవనము కన్న విన్నాణముగా నున్నది గదా ? ఈ యలంకారములు మాకును విస్మయముఁ గలుగఁ జేయుచున్నవి ? అయ్యారే ? ఈ పటము కల్కేడ సంపాదించితివి ? ఈ మంచములు నీ మందసములు వెలఁ గట్ట నశక్యములని తోచ్చచున్నది మా రాజపుత్రుఁడు శిబికర్ణ దధీచులకన్న నీత నధికుండు సుమీ ? నీ యుపచారముల కానందించి గ్రామము లిచ్చుననితలంచు కొనుచున్నారమని యూరక పొగడుచుండుటయున ది యుబ్బుచు నిట్లనియె.

సుభగులారా ! నా యీ భవనాలంకారమునకే మెచ్చుకొనుచున్నారు. లోపలి విశేషములం జూచిన మరియుం గొనియాడుదురుగదా ? రండు చూడుఁడు అని లోపలికిఁ దీసికొనిపోయి గదుల తాళములు దీసి యంతర్భవనములు మేడలు రహస్యగృహములు లోనగు వింతలన్నియుం జూపుచు మీతోఁజెప్పకేమి ? మీ రాజనందనుడు తగిన సరసుఁడనియే నే నొడం బడితిని. సామాన్యుఁడు మావాకిలిఁ ద్రొక్కగలఁడా? ఎంత వాఁడు నా కిచ్చి మెప్పు వడయగలడో మీరే చెప్పుడు. పెక్కులేల ? ఈ పట్టణ రాజకుమారుఁడు వత్తునని వార్త నంపిన నాకూఁతు రంగీకరించినది కాదు. అని యాత్మస్తుతి పూర్వకముగా నుడివిన వారిట్లనిరి.

చంద్రవతీ ! నీ వింత చెప్పవలయునా ? యేమీ రాజపుత్రునితోఁ గూడ నిల్లు వెడలి యారునెలలైనది. పది నగరములు సూచితిమి విద్యాధనరూపంబులఁ బేరుపొందిన వారసుందరులఁ బెక్కండ్రఁ గాంచితిమి గాని నీ యైశ్వర్యముగల వెలయాలినిఁ జూచి యెరుఁగము. నీ వాడుక వెనుకటి నగరములయందే వినియుంటిమి. అందులకే వెదకికొనుచు ముందుగనే నీ మందిరమున కరుదెంచితిమ. ఇఁక నీ యిల్లు బంగారమైనదని తలంపుము. రేపీపాటికి మా యీవి విశేషములఁ దెలిసికొనఁగలవు. అని దానిమాట లందుకొని యూరక స్తుతిఁ జేయుచుండిరి‌.

అదియు వారిమాటల కలరుచుఁ దనయింటఁగల రహస్య విశేషము లన్నియుం జూపినది. వారు సూచి యానందించుచు నిఁక మేమువోయి పండుకొనియెదము. మా రాజపుత్రుండు వేకువజామున లేచును. కాచికొని యుండవలయునని పలుకుచు ముందరచావడిలోనికిం బోయి యాపరిచారకులు నలువురు బండుకొనిరి. ఆ రాజపుత్రుం డిట్లు గదిలోఁ బ్రవేశించి హంసతూలికాతల్పంబునఁ గూర్చుండి ఇట్లు ధ్యానించెను. ఆహా ! నాయుదంతము తలంచికొనఁ గడు వెరగు గలుగుచున్నది. ఉత్తమ బ్రాహ్మణ కుమారుండనై విద్యలం జదవి రాజావలంబనముఁ బొందియు జివురకుఁ జోరులలోఁ గలసి విటుఁడనై దీనియింటికి వచ్చితిని. అయ్యో ? నమ్మి యిల్లి చ్చిన యిమ్మచ్చకంటి నెట్లు వంచించువాఁడనో తెలియదు. విశ్వాసఘాతుక పాతకముకన్న ఘోరమైనది వేరొకటి లేదుగదా! మరియు విటులఁజూచి వెలయాండ్రు మురియుచుందురు. ఇప్పడతి విలాసములు చూపక నేలంబండికొని దుఃఖించుచున్నట్లు కనంబడుచున్నది. ఇదియుం జోద్యముగానే గానే యున్నది. అని తలంచుచు నా జవరాలింజూచి యిట్లనియె.

తరుణీ ! నీ పేరేమి ? నీవు వారాంగనవుకావా ? గణికాధర్మములు నీ యందుఁ గనంబడవేమి ? అట్లు విచారించుచుంటివేల ? నీ వృత్తాంత మెరిగింపుమని యడిగిన నప్పఁడతి కన్నీరు దుడిచికొనుచు నమస్కరించి యిట్లనియె.

అన్నా ! నీవు నాకు సహోదరుఁడవు. నిన్నుఁ దోబుట్టువుగా జూచి మన్నించెదవని నీ మొగము జూచి నా వృత్తాంతముఁ జెప్పెదను. లేనిచో నిట్లే దుఃఖించుచుండెదనని పలికిన విని యతండు వెరగుపాటుతో సహోదరీ ! నీ వునన్నన్నాయని పిలిచినపిమ్మట నీ యందు నాకుఁ వేరొక బుద్ది యెట్లు పొడమెడిని. అదియునుంగాక నిన్ను నేఁ గామించి వచ్చిన వాఁడనుగాను. నాకు నదియొక ప్రారబ్దమే. పిమ్మట నా కథయుంజెప్పెద నీ తెరఁ గెట్టిదో నుడువు మనుటయు నప్పొలతి తల యించుక యెత్తియిట్లనియె.

అన్నా ! నాకులమేదియో నాకుఁ దెలియదు. నా తలిదండ్రు లెవ్వరో నే నెరుంగును. నా కెనిమిదేండ్ల ప్రాయము వచ్చినది మొదలు నా కథ జ్ఞాపకమున్నది. అంతకుముందొక గ్రామము నుండి యొక గ్రామమున కొకరి యొద్ద నుండి వొకరి యొద్దకుం దిరిగితిని యది యంతయు స్వప్న ప్రాయముగానున్నది. విశాల యను పట్టణములో నేనొక తంతు నాయకుని యింటిలో నాడుకొనుచుండగా నొకనాఁ డొక యాడుది వచ్చి నన్నెత్తుకొని ముద్దాడుచు బాలా నీ వెవ్వరి దానవు? నిన్ను మేము పెంచుకొనెదము వత్తవా? యని; యడిగిన నేను జడియుచు గిలగలఁ గొట్టికొంటిని. అపుడది నన్ను దింపి మీలోపలికిఁ బోయి మిక్కిలి సిరిగల వేశ్యకుఁ చక్కనిపిల్ల కావలసియున్నది. అట్టి బాలిక యిందుఁ గలదని వినివచ్చితిని. అమ్మెదరా ? యని యడిగిన నా పెంపుడు తల్లి వాకిటకు వచ్చి నీదేయూరు ? ఎంత వెల యియ్యగలవు ? ఎవ్వరికి గావలయునని యడిగిన నాదూతిక కాళిందీపురంబునఁ జంద్రవతి యను వేశ్యకు గావలసియున్నది. దాని భాగ్యమునకు మితిలేదు. పిల్లలు లేరు. బాలికం జూచి మాకు నచ్చెనేని వెలమాట మాటాడుకొందమని పలికినది.

అప్పు డా యిల్లాలు నన్నుఁ బిలిచి యిది నాకూఁతురు. దీని చక్కఁదనముఁ జూచినవారెల్ల దీనికి విద్యఁజెప్పింపుమని మమ్ము నిర్భంధించుచున్నారు. మా కట్టి సామర్ధ్యము లేదు. వేశ్యల కిచ్చితిమేని నన్ని విధముల సుఖింపగలదని నిశ్చయించి యట్లు ప్రకటించితిమి. మీకిది నచ్చకుండునా? దీనివెల నూరుమాడలు




సత ఇ4 మీ కిష్టమున్న నా సొమ్మిచ్చి దీనింగొనిపొమ్ము. లేకున్న నూరక పొమ్మని పలికిన విని యా దూతిక సంతసించుచు నప్పుడు యప్పఁడతి కావెల యిచ్చి నన్నెత్తికొని లాలించుచు నీయూరుఁ దీసికొని వచ్చి యీ చంద్రవతి కిచ్చినది.

నన్నుఁ జూచి యీవేశ్య యాశ్చర్యమందుచు దూతికకుఁ బారితోషిక మిచ్చి నా మేనంతయు బంగారమయముఁ జేసి నా ముద్దు మాటలచేఁ గాలక్షేపముఁ జేయుచుఁ గన్నపుత్రిక కన్న నెక్కుడు గారాబముగాఁ బెంచుచుఁ దగు గురువుల నియమించి సంగీతము సాహిత్యము నృత్యము నభినయములోనగు విద్యలెల్ల నేర్పించినది అల్పకాలములోఁ బెక్కు విద్యలలోఁ బాండిత్యమును సంపాదించితిని. అంతలో నా మేన బాడు యౌవనము పొడసూపినది. నాకు గన్నెరికము చేయుటకుఁ బెక్కండ్రు ధనికులు వార్తల నంపిరి అదియు నాకు బోధించినది. నేనందుల కంగీకరింపక పెండ్లిఁ జేయుమని ష్రార్ధించితిని. వేశ్యావృత్తిగా నుండుమని నన్ను నిర్భందించుచున్న ది. ఈ విషయ మిరువురకు నేఁటివరకుఁ దగవు జరుగుచునే యున్నది. నాకది యేమియోగాని పెండ్లి యాడి పతివ్రతనై కీర్తి సంపాదింపవలయునని యభిలాష కలుగుచున్నది. చావునకైన నొప్పెదనుగాని నీమాట కంగీకరింపనని చెప్పితిని. నేఁడు మీ నిమిత్తమై నన్నెంతేఁ బ్రతిమాలినది నిర్భంధించినది. తర్జించినది. ఆ మూర్ఖురాలితోఁ బ్రసంగించుటకంటే మీ పాదములమేదనేపడి బ్రతిమాలుకొనుట యుచితమని తలంచి యేమియు మాటాడితినికాను. ఇదియే నా వృత్తాంతము. మదీయ పూర్వపుణ్య పరిపాకంబునంజేసి కరుణారసపూరిత హృదయులగు మీరు దయచేసి నా మాట మన్నించితిరి మీ యెడఁ గృతజ్ఞురాలనై యుండెదను. నాయెడ నకారణ వాత్సల్యముఁ జూపిన మీ కుల శీలనామంబులు‌ విన నామది తొందరపడుచున్నది ఏ దేశపు ప్రజలు మీ వియోగమునకు దుఃఖించుచున్నారు? ఏ మహారాజు మిమ్ముఁ బుత్రుగాఁ బడసి కృతార్దుఁడయ్యెదను ? మీ యభిధాన వర్ణంబు లెట్టివి? మీ వృత్తాంతముఁ జెప్పి మదీయ‌ శ్రోత్రానంద మాపాదింపుఁడని వేడుకొనిన విని యతండు విస్మయ లజ్జా విషాద సంభ్రమంబులు మనంబునం బెనంగొన నొక్కింత ధ్యానించి యిట్లనియె.

చెలీ! నా కథ వినిన నీకును వ్యధఁ గలుగక మానదు. నేను క్షత్రియకులుఁడఁగాను. బ్రాహ్మణ పుత్రుండ నాపేరు ఘటదత్తుఁడండ్రు. నాకు దేశములు లేవుగాని చిన్నతనమందే రాజావలంబనముఁ గలిగి ప్రధాన పదవి నదిష్టించితిని అకారణముగా నాపై రాజునకుఁ గోపమువచ్చి నిరాకరించిన నూరు విడచి తలిదండ్రులకుఁజెప్పక యొక్కరుండ నొక్క మహారణ్యంబునం బడిపోయితిని నాటి మద్యాహాతపమునాటి యొడలెఱుంగక నొకచెట్టు నీడంబండుకొని నిద్రఁ బోయితిని.

దైవికముగా నలువురు దొంగలాయుధపాణులై యా మార్గముఁ బోవుచు నేను బడియున్న చెట్టు నీడకు వచ్చి నన్నుఁ జూచి నిలువంబడి యిట్లు సంభాషించుకొనిరి.

ఒకడు -- ఒరేయ్ ! వీనిం జూచితివా ? వీఁడు చచ్చిపడి యుండెనా యేమి?

మరియొకఁడు - లేదు. లేదు. కడుపు కదలుచున్నది. వీనింగడ తేర్చుదుమా ?

వేరొకఁడు - వీని రూపము మిక్కిలి చక్కగా నున్నది. వీఁడిక్కడి కేమిటికి వచ్చెనో తెలిసికొని పిమ్మటఁ గర్తవ్యమాలోచింతము.

ఇంకొకఁడు -- అదియే యుచితము. వీనిం జంపుటవలన మనకేమి లాభము ? కుట్టుకాడలై న లేవుగదా ?

అని మాట్లాడికొనుచు వారిలో నొకఁడు నా మొగముపై నీళ్ళు చల్లెను. అప్పుడు నేనదరిపడి లేచి కూర్చుంటిని. వాండ్రు నన్నుఁజూచి నీ వెవ్వడవు ? ఎందు బోవుచున్నావు? ఈ కారడవి కేమిటి కరుదెంచితివని యడిగిన వారింజూచి భయపడుచు నేనొక బ్రాహ్మణ కుమారుండ. నా పేరు ఘటదత్తుఁ డందురు. అకారణముగా నేను ప్రాణ బంధువులకు విరోధినై విరక్తిజెంది చావవలయునని ఈ యరణ్యంబునం బ్రవేశించితిని. నన్ను మీరు జంపి యవ్వలికిఁ బొండు. ఇదియే నా వృత్తాంతమని చెప్పితిని.

వాండ్రు ముక్కు పై వ్రేలిడికొని ఔరా! మేమంత పాపాత్ముల మనుకొంటివా? మేము రాకున్న దేవుఁడే నిన్నుఁ జంపును. మావలనం బ్రతికితివి. కావున నిన్ను మేము రక్షించెదము. మాతో రమ్ము మేము సెప్పునట్లు వినియెదవేని నీకు మా వృత్తిలో భాగము పంచిపెట్టెదము. మా మాట మీరితియేని గరతేర్పక మానమని పలికిరి. ఎట్టి యిడుములలోనయిన మరణమనిన వెరపుఁ గలుగక మానదు. నా కప్పుడు వేరొక తెరువులేక వారు సెప్పినట్లొప్పుకొనక తీరినది కాదు. నాచేఁ బ్రమాణికము చేయించి తరువాత వారు చోరులమనియుఁ దమతోఁ జౌర్యమునకు రావలయుననియు నది కృష్ణపక్షమగుట గ్రామములమీదికి బోవుచున్నామనియుఁ దమ కథ యంతయుఁ జెప్పిరి. మది నిష్టము లేకున్నను నప్పుడు వాండ్ర ననుసరించి తిఱుగక తప్పినది కాదు. వారిచ్చిన తేనెవలన నాకలియడంచుకొని వారి వెంటఁబడి నడువఁ దొడంగితిని. క్రమంబున నయ్యరణ్యము దాటి జనపద మార్గంబునఁ బ్రవేశించితిమి వాండ్రు నాకుఁ జౌర్యదర్మంబు లన్నియు నుపదేశించిరి. మరియును.

సీ.‌ గట్టి గోడలుమీటి కన్నముల్‌ ద్రవ్వుట
            లంఘించి దాటుట లాఘవమున
    కనులఁ గాటుగఁ బామి కటికి చీకటిలోని
            వస్తువుల్గని పాటవమునఁ గోనుట
    ఎదురైన జనుల భీ తొదవఁ గన్నులదుమ్ము
            పొదవి యవ్వల పారిపోవుటదిమి

    పట్టిజనుల దర్పమునఁ జేతులుగాళ్ళు
              గొఱికి కన్నముదూఱి యుఱికిచనుట

గీ. యొడలి తొడవులు దెలియక యుండఁ గత్తె
   రించుటయు వెరపించుటయును
   నాదిగా గల చౌర్య క్రియావిశేష
   ముల నశేషముగా వాండ్రు దెలిపి రపుడు.

ఏ నట్టి విశేషము లన్నియుం గ్రహించి తత్ర్కూర చేష్టితములకు వగచుచు చేయునదిలేక వారితోఁగూడ గొన్ని దినములు దశాటనముఁ గావించితిని. ఇక తరువాయి కథ నీకుఁ జెప్పరాదు అయినను నీ సుగుణంబులను మెచ్చికొని వక్కాణింపుచుంటి వినుము. మే మీగ్రామమువచ్చి బది దినములై నది. ఈయూరఁగల భాగ్యవంతుల మర్మము లన్నియు గ్రహించితిమి ఈ యారికెల్ల నీ తల్లి సంపద యతిశయిల్లి యుండుటఁ దిలకించి దానిపని పట్టఁదలంచి మొన్ననొక చాకలివాని‌ యింటికిఁ గన్నము వైచి మంచి మంచి పుట్టములఁ దోచికొని వచ్చిరి. ఆ దుస్తుల నన్నలంకరించి నాకు రాజవేషము వైచిరి. వాండ్రు పరిచారిక వేషములు వైచికొనిరి మేము నిన్నరాత్రికి మీ యింటికి వచ్చి తాంబూల మిచ్చితిమి. మా వేషములు చూచి నీ తల్లి యుల్లము వికసింప గ్రామములు దొరుకునని సంతసించుచు మారాక కంగీకరించింది మేమందరము లోపలఁ బ్రవేశించితిమి. వాండ్రు నలువురు గజదొంగలు. గృహ మర్మము లన్నియుం దెలిసికొని మీ సొమ్మంతయుఁ గొల్లబెట్టఁ దలచికొన్నారు. ఇదియే నా వృత్తాంతమని చెప్పుచుండగనే యా తస్కరులక్కడికి వచ్చి ఘటదత్తా ! తలుపు తీయుమని యరచిరి. అదరిపడి లేచి ఘటదత్తుఁ డాగది తలుపు దీసెను. సరోజిని జడిసి తలుపుచాటున దాగికొన్నది. వాండ్రు నలువురు లోపలఁ బ్రవేశించి యోహో ? నీవింత జాగు చేయుచుంటివేమి? దానికూతు రెందున్నది ? మేమవ్వలిపని యంతయుం జక్క పెట్టితిమి. చంద్రవతిం బట్టికొని చేతులు విరిచి స్తంభమునకుం గట్టి బంగారము మణులును పోగుచేసి మూటలంగట్టి వచ్చితిమి‌. ఇఁక నిందలి మండవములం గొనవలయు. నీవిందేమి చేసితివి ? దానితోఁ గ్రీడించుచుంటివా యేమి యనియడిగిన నతం డిట్లనియె.

నే నేమియుం జేయలేదు. దాన కూతుఁరు కడు ముద్దరాలు. దాని యిడుములఁ జెప్పుకొనుచుండ వినుచు నప్పనికి జాగు చేసితిని మన్నింపుఁడు. అనుటయు చాలుఁజాలు ఇదియా ? నీ వేషము ఏది దానిం జూపుమని పలుకుచు నలువురు ---------- తలుపు వెనుక నాకనకగాత్రిం జూచి తలయూచుచు నిట్లనిరి.

ఏరా ? నీ వెంత ద్రోహివిరా ? చక్కని యి క్కుసుమకోమలితోఁ నీవేమిచేయుచుంటివి ? మన మనుకొనిన మాట యేమి ? నీవు చేసిన పనియేమి? కానిమ్ము. తర్వాత విచారింతుములే. పదపద. వస్తువుల మూట గట్టుము. అని యదలించుచు నత్తలోదరి నొకఁడదిమి పట్టుకొని మొఱపెట్టుచుండ నోరునొక్కి బుజము మీద నెక్కించుకొను సీతను రావణుండువోలె నెత్తికొని యతిజవంబునఁ బారిపోయెను. తక్కిన తస్కరులును ముల్లెల్ల నెత్తిపై నిడికొని ననుసరించి యేగిరి.

ఘటదత్తుండును తనవంతు వచ్చినమూట శిరంబున నిడికొని వారివెంట నఱిగెను. అందరును దెల్ల వారకపూర్వ మా నగర ప్రాంత కాంతారములోఁ గలిసికొనిరి. అంతలోఁ దెల్లవారినది. తస్కరులా చక్కెర బొమ్మఁ చక్కదనమునకు మిక్కిలి‌ యక్కజ మందుచు మదన శరవశంవద హృదయులై తమ్ముఁ బెండ్లి యాడుమని కేలువట్టి తిరుగుచుండ నయ్యువతీ రత్నము గుండె పగుల నేడ్చుచు ఘటదత్తుని రాకఁజూచి అన్నా! వీండ్రు నన్నుఁ బీడించుచున్నారు. రక్షింపుము రక్షింపుము. అని మొర వెట్టినది.

అప్పుడు ఘటదత్తుఁ డడ్డమువోయి నా మిత్రులారా ? ఈ చిన్నది కడు నుత్తమురాలు. దీని జోలికిఁ బోవలదు. మనకుఁ దోఁబుట్టువగునని పలికిన వెక్కిరించుచు వాండ్రు బాపురే ? నీవావులు వింతగా నున్నవి. నిన్న రాత్రియెల్ల‌ దీనిం గూడితివి. నీ వంతు తీరినది. మాకు వంతువచ్చినఁ దోఁబుట్టువైనదా ? ఇది నీకుఁ జెల్లెలైనచో నీవు మాకు బావ వగుదువు. నీ చెల్లెలిని మా‌ కర్పింపుము. మేము నీ మాత్రముఁ దెలియని వారముకాము. బోగమువాండ్రకు వావులు కల్పించు చుంటివా ? చాలుఁజాలు. అడ్డము లెమ్ము మాకతంబున నిన్న రాత్రియెల్ల దీని ననుభవించితివి. అప్పుడే నీ సొమ్మయినట్లే యడ్డు పెట్టుచుంటివి. ఇట్లయిన మా జట్టులోనుండి నిన్నుఁ దొలగింతుము సుమీ? యని బెదరించిన నవ్వుచు నతండిట్ల నియె.

ఇత్త లోదరిని నేను సోదరిగాఁ జూచితిని. నమ్మకున్న నే నేమి సేయువాఁడ నది యుంగాక నిది నన్ను శరణు జొచ్చినది. నాకు రక్షింపక తీరదు. నన్ను మన్నించి యిమ్మించుబోణిం గాపాడుడని వేడికొనుటయు నాముచ్చు లిట్లనిరి.

అమ్మక చెల్లా ! ఎంతవాడవైతివి. మా దయవలనం బ్రతుకుచు నిప్పుడెదురాడుచుంటివా ? పొమ్ము. ఇక నీ‌ మాట బాటించువారము కాము. మాకు గోపము వచ్చుచున్నది. కాచికొమ్మని యదలించిన గదలక నితం డిట్ల నియె.

నాకు మీయెడంగల విశ్వాసమునంజేసి యింత జెప్పవలసివచ్చినది. మీకు గోపము వచ్చినందులకు వెఱసువాడను కాను. నామేన ప్రాణము లున్నంతసేపు‌ మీరీ పొలతిని ముట్టలేరు. ఊరక మన నేస్తమేల విథ్వస్తము సేసెదరు. దూరము తొలగుడని యోహటించెను.

అట్ల తండు వాండ్రతో బెద్దగా దగవులాడెను. వాండ్రకు కోపమెక్కి యతనిపై గలియబడిరి. అప్పుడతండు లేడివలె నతిలాఘవంబున నెగిరి యొకని చేతనున్న చంద్రహాసంబు లాగికొని శిరఃకరచరణోదరకక్ష రక్షకముగా ద్రిప్పు చుండ మండల పరిభ్రమణంబున నరికి యొకవేటున మ్రుచ్చునొకనిం గడతేర్చుటయు మిగిలినవారు వెఱచి తలయొక దెసకుం బరిగిడిరి. అనివార్యములైన తదీయ విక్రమ సాహస ధైర్యంబుల గాంచి నక్కాంచనగాత్రి విస్మయహర్ష పులకితగాత్రయై యతని యడుగుదమ్ముల మ్రోలం జాగిలిపడి మహాత్మా ! నీవు బ్రాహ్మణ మాత్రుడవు కావు పరశురామునందువోలె క్షాత్రతేజముకూడ నీయందు బొడగట్టుచున్న యది‌. దైవమాపత్సముద్రమున మునుగుచున్న నాకునిన్ను దెప్పగా జూ పెను. తోబుట్టువుగా దలంచి నన్ను నీవెంట గొనిపొమ్ము. మరల నేనావేశ్య యింటికరుగ వెరచుచున్న దాననని యత్యంత వినయ విశ్వాసములతో బ్రార్దించిన నతండాదరించుచు నిట్ల నియె.

పోలతీ నిన్ను జెలియగా మొదటనే తలంచితిని. నీవు తలకకుము. నిన్ను వెంటబెట్టుకొనిపోయి తగినవానికిచ్చి నీకు వివాహముచేసి విడిచి పెట్టెద. తరువాత నీ పుణ్యమని పలుకుచున్నంతలో నొకదెస నుండి పురరక్షకు లత్యంత వేగమున నరుదెంచి యందున్న చౌర్యవస్తువులంగాంచి యహంకరించుచు నతనే సత్కరుండని నిశ్చయించి పట్టుకొనుటకు బ్రయత్నించిరి. కాని యతండు కృపాణ పాణియై వారినెల్ల బలాయితులం గావించెను.

అప్పటికి నీభోకిరణంబులు కొన్ని యాకసంబున బ్రాకినవి. ఇక నందుండ రాదని నిశ్చయించి యతం డమ్మించుబోణితోఁడ రా నటఁగదలి యొక మార్గంబునబడి యెందేనిం బోయెను.

అని యెరింగించువరకు వేళ యతిక్రమించుటయు తరువాత యవసధంబున నయ్యతిపతి యవ్వలి కథ యిట్లని చెప్పదొడంగెను.

ఎనుబది యాఱవ మజిలీ

సుమేధుని కథ

చెల్లీ సరోజినీ! మనకిపుడు గమ్యస్థాన మేదియు గనంబడకున్నది. నేను తల్లితండ్రులకైన జెప్పక పారిపోయి వచ్చితిని. నా నిమిత్తము వారు మిక్కిలి పరితపించుచుందురు. నాపై నతం డలిగిన కారణమేమియో తెలియకున్నది. ఇప్పుడా కుముద్వతినగరంబున కఱుగుట యుచితమేమో యాలోచింపుము. నీకును వివాహముఁ జేయవలసి యున్నది నాకు మరల రాజావలంబనముఁ గలిగెనేని నీ పెండ్లి సీతాకళ్యాణమువలెఁ జేయుదునుగదా? అని నుడువుటయు ఘటదత్తునికి సరోజిని యిట్లనియె.

అన్నా ! స్త్రీమూలముననే నీపై అతండలిగియుండును. నీ వెన్నఁడేని వానియింటి కరిగితివా ? వారి తరుణులతో సంభాషించితివా ? యని యడుగుటయు