Jump to content

కాశీమజిలీకథలు/ఆరవ భాగము/86వ మజిలీ

వికీసోర్స్ నుండి

చుండ మండల పరిభ్రమణంబున నరికి యొకవేటున మ్రుచ్చునొకనిం గడతేర్చుటయు మిగిలినవారు వెఱచి తలయొక దెసకుం బరిగిడిరి. అనివార్యములైన తదీయ విక్రమ సాహస ధైర్యంబుల గాంచి నక్కాంచనగాత్రి విస్మయహర్ష పులకితగాత్రయై యతని యడుగుదమ్ముల మ్రోలం జాగిలిపడి మహాత్మా ! నీవు బ్రాహ్మణ మాత్రుడవు కావు పరశురామునందువోలె క్షాత్రతేజముకూడ నీయందు బొడగట్టుచున్న యది‌. దైవమాపత్సముద్రమున మునుగుచున్న నాకునిన్ను దెప్పగా జూ పెను. తోబుట్టువుగా దలంచి నన్ను నీవెంట గొనిపొమ్ము. మరల నేనావేశ్య యింటికరుగ వెరచుచున్న దాననని యత్యంత వినయ విశ్వాసములతో బ్రార్దించిన నతండాదరించుచు నిట్ల నియె.

పోలతీ నిన్ను జెలియగా మొదటనే తలంచితిని. నీవు తలకకుము. నిన్ను వెంటబెట్టుకొనిపోయి తగినవానికిచ్చి నీకు వివాహముచేసి విడిచి పెట్టెద. తరువాత నీ పుణ్యమని పలుకుచున్నంతలో నొకదెస నుండి పురరక్షకు లత్యంత వేగమున నరుదెంచి యందున్న చౌర్యవస్తువులంగాంచి యహంకరించుచు నతనే సత్కరుండని నిశ్చయించి పట్టుకొనుటకు బ్రయత్నించిరి. కాని యతండు కృపాణ పాణియై వారినెల్ల బలాయితులం గావించెను.

అప్పటికి నీభోకిరణంబులు కొన్ని యాకసంబున బ్రాకినవి. ఇక నందుండ రాదని నిశ్చయించి యతం డమ్మించుబోణితోఁడ రా నటఁగదలి యొక మార్గంబునబడి యెందేనిం బోయెను.

అని యెరింగించువరకు వేళ యతిక్రమించుటయు తరువాత యవసధంబున నయ్యతిపతి యవ్వలి కథ యిట్లని చెప్పదొడంగెను.

ఎనుబది యాఱవ మజిలీ

సుమేధుని కథ

చెల్లీ సరోజినీ! మనకిపుడు గమ్యస్థాన మేదియు గనంబడకున్నది. నేను తల్లితండ్రులకైన జెప్పక పారిపోయి వచ్చితిని. నా నిమిత్తము వారు మిక్కిలి పరితపించుచుందురు. నాపై నతం డలిగిన కారణమేమియో తెలియకున్నది. ఇప్పుడా కుముద్వతినగరంబున కఱుగుట యుచితమేమో యాలోచింపుము. నీకును వివాహముఁ జేయవలసి యున్నది నాకు మరల రాజావలంబనముఁ గలిగెనేని నీ పెండ్లి సీతాకళ్యాణమువలెఁ జేయుదునుగదా? అని నుడువుటయు ఘటదత్తునికి సరోజిని యిట్లనియె.

అన్నా ! స్త్రీమూలముననే నీపై అతండలిగియుండును. నీ వెన్నఁడేని వానియింటి కరిగితివా ? వారి తరుణులతో సంభాషించితివా ? యని యడుగుటయు నతండు నన్నొకతెప నాభూపతి యంతఃపురమునకుఁ దీసికొనిపోయి తన యిరువురు భార్యలకుం జూపించెను. నాఁడు తప్ప వేరొకప్పుడు నేనక్కడికిఁ బోయి యెరుంగనని చెప్పెను. ఆ మాటవిని యాఁబోటి నవ్వుచుఁ చాలుజాలు నాగమనమే నీకీముప్పుఁ దెచ్చినది. రాజులు దీర్ఘక్రోధులు. వారిని నమ్మి యంతికమున నుండరాదు. మరికొన్ని నాళ్ళరిగినఁగాని యాయలుక యుడుగదు మన మిప్పుడందుఁ బోవుట తగదు. వేరొక దేశమునకుఁ బోవుదమని యుపదేశించినది.

అట్లు వారు సంభాషించుకొనుచు నొకతెరువునంబడి నడచుచుఁ గొన్ని పయనంబులకుఁ శింశుమార నగరంబునకుం బోయిరి. అప్పుఱ భేదనంబు చంద్రకేతుఁ డను రాజు సుమేధుఁడను మంత్రితోఁ గూడికొని పాలించుచుండెను. అమ్మహారాజునకు సుముఖ పద్మనాభ చారుకర్ణ పింగళాక్షులను నలువురు కొమరులు గలరు. వారు విద్యారూప సౌశీల్యాది గుణంబులఁ బేరుపొంది ధనుర్విద్యయం దసమానమైన నై పుణ్యము సంపాదించి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులవలె మిక్కిలి ప్రఖ్యాతి వడసిరి. వారు నలువురు నాఁడు తురగారూఢులై విహరింప నరుగుచుఁ బట్టణాభిముఖులై పోవుచున్న సరోజినీ ఘటదత్తులం గాంచిరి.

సుము - తమ్ములారా ! ఈ పోవువారిం జూచితిరా ? వీ రొండొరులేమగుదురో చెప్పుకొనుఁడు.

పద్మ -- భార్యాభర్తలని తలఁచెదను.

చారు --- కారు. ప్రాయము సమముగా నున్నది. వేరొక్కవాని యేదియో యుండును.

పింగ - అన్నా చెల్లెండ్రేమో ?

చారు -- అట్టిభేద మేమియుఁ గనంబడదే.

సుము -- ఏకులము వారని తోచుచున్నది ?

పద్మ -- ధూళిచ్చన్నులై మలినాంబరధారులై యున్నకతంబున నిరూపింప శక్యము గాకున్నారు.

పింగ - బ్రాహ్మణులని నా యభిప్రాయము.

సుము - ఆమాటయే నిక్కువము. ఆకారసాదృశ్యముఁ గలిగి యుండుటంబట్టి యన్నా ! చెల్లెండ్రేయై యుండును. నివురుగప్పిన నిప్పు వలె నట్లున్నదిగాని యా చిన్నది కడుచక్కనిదిసుమీ ? క్షత్రియకన్యకయే యైనచో నేను తప్పకఁ బెండ్లి యాడుదును.

పింగ --- రంభవంటి కన్యలం దెచ్చి చూచిన వంకలు పెట్టితివిగదా ? వీ యిట్టి పేద పైదలియందు వ్యాపించినదేమి? అది యొకటే --------- యేమో ? అట్లు వరించుట తప్పుగాదా? సుము -- నాబుద్ధి ప్రసరించుటచేతనే యది పతిపత్ని కాదని దలంచుచున్నాను. తత్సౌందర్య మనన్య సామాన్యమని నిరూపించి చూచినంగాని తెలియదు.

పద్మ -- అట్లయిన మనము వెనుకకుమరలి వారివృత్తాంతమడిగి తెలిసి కొందముగాక.

అందుల కందరును సమ్మతించి గుర్రముల మరలించుచుఁ బట్టణాభిముఖులై యతివేగముగాఁ బోయిరికాని వారజాడ యేమియుం గనంబడినది కాదు. వారంతకుమున్ను యొకవిప్రగృహంబునం బ్రవేశించిరి. ఆ యింట భుజించునప్పుడు బ్రాహ్మణులు మంత్రి వృత్తాంతమేదియో చెప్పుకొనుటయు ఘటదత్తుఁడు శంకాకుల స్వాంతుఁడై యది యెట్టిదని యడిగిన నాయింటి యజమానుం డిట్లనియె.

అయ్యా ! మా రాజునకు నలుగురు కుమారులు కలరు. వారు నాలుగుదేశములను బాలింప సమర్దులై యుండిరి. రాజు వారిలో బుద్ధిమంతుఁ డెవ్వఁడో వానికే రాజ్య మిత్తునని వారిం బరీక్షించి తారతమ్యముఁ దెలిసికొనం జాలక మంత్రిని వారి హెచ్చు కుందులు చెప్పుమని యడిగెను. అయ్యమాత్యుఁడు తెలిసియో తలియకయో పెద్దవాఁడు సుముఖుఁడే బుద్దిమంతుడు. వానికే రాజ్య మిమ్మని రాజుతోఁజెప్పెను. ఆ మాట విని తక్కిన రాజపుత్రులు మువ్వురు కోపించుచు వానికి రాజ్యమిచ్చిన నిచ్చును గాఁక. అర్హుండనిన ననుఁగాక నలువురలో బుద్ధితారతమ్యమేమి గ్రహించి మంత్రి యట్లు చెప్పెను? అవ్విషయము పరీక్షించి దెలుపవలయునని తలంచుచు నతనియొద్దఁ దగవు పెట్టిరి.

మంత్రి -- కారణ మేమియుం జెప్పక మీలో నాతండే బుద్ధిమంతుఁడని వారితో వాదించెను. అప్పుడు వారలీర్ష్యాకషాయిత చిత్తులై మంత్రిని వంచించు నుపాయ మరయుచు కనకమణి దాపితమగు తండ్రిగారి ముద్రాయంత్రము వారిలో నెవఁడోహరించెను. వారు నలువురుంగాక యారహస్య మందిరములోని కితరులెవ్వరును బోవరు. మరునాఁడు రాజపేటికలో మణిముద్రికం గానక పరితపించుచుఁ బుత్రునింజీరి నా రత్నముద్రిక యెవ్వరు తీసిరని యడిగెను. అ మాట మేము చెప్పఁజాలము. ఎవ్వరు తీసిరో సర్వజ్ఞశిఖామణియగు మీ మంత్రి నడిగి తెలిసికొనుఁడు. అతండతీంద్రియ విషయంబుల గ్రహించుంగదా? ఈ వస్తుచోరుంజెప్ప నేరఁడేని వాని నీ యుద్యోగము నుండి తొలఁగించవలయును ముందు వెనుకలు విమర్శింప నోటికి వచ్చినట్లెల్ల సంభాషించువాఁడు మంత్రిపదవి కర్హుఁడుకాడని పలికినరాజు బాలవాక్యములని వాని నిరసింపక మన్నించుచు నప్పుడే మంత్రిని రప్పించి యావార్త యెరింగించి నీ కిందుల కొకనెల గడువిచ్చితిని. ఈ లోపల నాముద్రికం దీసికొనిన వానిఁ బేర్కొన లేకపోయితివేని నీ యధికారము విడిచి మెందేనిం బోవలయు నిదియే ముమ్మాటికి యాజ్ఞయని పలికి యతం డంతఃపురమునకుఁ బోయెను.

ఢా ముద్రిక నెవ్వఁడుతీసెనో మంత్రియెట్లు చెప్పగలడు ? అధార మేమి యున్నది? అతం డామాట విని యేమియుం దోచక యింటికివచ్చి మంచముపై బండుకొని విచారించుచుండెను. అతండు మిగుల ధర్మాత్ముఁ డగుట పౌరులెల్లరు గుమిఁగూడి యెవ్వరికింజెప్ప శక్యముగాని విషయముల నడిగి‌ ప్రధానిని వంచించుట రాజనీతికిఁ గళంకమగుచున్నది. మంత్రివిషయమై చేసిన యాజ్ఞ మరలించు కొనఁగోరుచున్నామని రాజునకు విజ్ఞాపనపత్రికఁ బంపికొని యేకగ్రీవముగా మనవిఁ జేసికొనిరి. కాని రేడేమియు మన్నింపడయ్యెను. మంత్రియు మంచముఁ బట్టి మిక్కిలి దుఃఖించుచున్నాఁడు. రేపటితో నామితి సరిపోయినది ఆ దయాశాలి ప్రధానపదవినుండి తొలఁగి పోగలఁడని మేము విచారించుచున్నారమని యాకథ యంతయుం జెప్పెను. ఛీ ! ఛీ ! రాజుల కింతయు విశ్వాస ముండదుగదా? వారు వ్యాఘ్రములకంటెఁ గ్రూరులు. నమ్మియుండరాదు. అని ఘటదత్తుఁడుత్తరముఁ జెప్పెను. భోజనమైన వెనుక ఘటదత్తుఁడు సరోజినితో చెల్లీ ! నావలెనే యీ వీటి రేని ప్రగ్గడయు నిష్కారణమ యవమానితుం డగుచున్నవాఁడట. వింటివా ? యని యావృత్తాంత మెరిగించెను.

సరోజని నవ్వుచు నోహో? నలువురిలో వస్తుచోరునే నిరూపింపలేక పోయెనా? ఆ మంత్రి యంతబుద్దిమంతుండు గాఁడని యాక్షేపించుటయు ఘటదత్తుఁడు వెరగుపడుచుఁ జెప్పుటకెట్లు శక్యము? నీవు చెప్పఁగలవా? యని యడిగిన నప్పడఁతి చిరునగవుతోఁ జెప్పవచ్చును. అదియొక గొప్పపని కాదని‌ యుత్తరముఁ జెప్పినది.

ఆ సంవాదము విని యా యింటి యజమానురాలు అమ్మా ! నీవు సరస్వతివలె నుంటివి. అందుల కెద్దియేని యుపాయముఁ జెప్పితివేని నీకు మంచి పుణ్యము రాగలదు. ఆ మంత్రిభార్య యనసూయ వంటిది. నిత్యము వ్రతములని చెప్పి పేరంటాండ్రఁ బిలిచి దానధర్మము లూరక చేయుచుండును. ఆమెకు నాయందుఁ కడునక్కటికముఁ గలిగియున్నది. ఆమెను నీయొద్దకుఁ దీసికొని రానా? యని యడిగిన సరోజిని యేమియు మాటాడక ఘటదత్తువంకఁ జూచినది అతండు మందహాసమును గావించెను. ఆ మౌనమే యంగీకారమని తలంచి యా బ్రాహ్మణి వడివడి మంత్రిభార్య యొద్దకరిగి అమ్మా ! మాయింటికి నేఁ డొకచిన్నది వచ్చినది దాని మొగము చూడ రాచకుమార్తె వలె నున్నది. దానియన్నయు నద్భుత తేజంబునఁ బ్రకాశించుచుండెను. మాతో బ్రాహ్మణులమని చెప్పిరి. .మీకథ విని యావిధుంతుదవదన యదియొక గొప్పపని కాదని యాక్షేపించినది. తానవలీల నామ్రుచ్చెవ్వఁడో వాక్రుచ్చునట. నీ ఒకసారి యచ్చటికి రమ్ము. ఈ యాపద దాటఁగలదని తొందర పెట్టినది.

ఆ మాటవిని యాబోఁటి వెర్రిదానా ! ఆ చిన్నదిమాత్ర మెట్లుచెప్పగలదు. శకునముఁ జూడఁగలదా యేమి? ఇది యడుగవలసిన విషయమా? మాగ్రహచార దోషంబునఁ రాజునకట్టిబుద్ది పుట్టినదని కన్నీరుఁ గార్చుటయు నా బ్రాహ్మణి అమ్మా ! కాదు కాదు. ఆమె యెట్లో చెప్పగలదని నాకు దృఢవిశ్వాసము కలిగియున్నది. ఈ వితర్కము వారిలోవారి కక్కడ‌నే జరిగినది అది యెంతపని యని యవ్వనిత చెప్పి నది. నీవు రాకతప్పదు. జాగుచేసిన వారెందేనిం బోవుదురని పెద్దగా నిర్భంధించుటయు ననుమతించి మంత్రి భార్య యప్పడే బండియెక్కి యామెతోఁగూడ వారింటి కరిగి సరోజనిం గాంచి వెరగుపడుచు నిట్లనియె.

బాలా ! నీ శీల ప్రవృత్రి యంతయు నీయిల్లాలు చెప్పినది. నీవు మా యాపద దాటింప నరుదెంచిన సరస్వతివో పార్వతివో కావలయు. ఇతరు లాప్రశ్నమున కుత్తరముఁ జెప్పలేరు. నీ వెద్దియేని తెరువూహించితేమో యెరింగింపుమని మిక్కిలి దైన్యముగాఁ బ్రార్దించిన నాలించి యమ్మించుబోణి యిట్లనియె.

అమ్మా ! దీనికిఁ బెద్దయాలోచన యక్కరలేదు. ఆ నలువురను నొక గడియ నాతో మాట్లాడునట్లు చేయుము. ఆ ముద్రిక యెవ్వరుఁ దీసినది చెప్పెదనని కొన్నిమాటలుచెప్పి యా మంత్రిభార్య నంపినది. ఆమె యింటికిఁ బోయి సరోజిని చెప్పినమాట లన్నియుం జెప్పుటయు మంత్రి విస్మయ సంతోష శంకాసమన్విత మతియై యందలములు పంపి యప్పుడే వారిని దమయింటికి రప్పించుకొనియెను. ఎట్లు చెప్పెదవు ? ఏలాగున గ్రహింతువు ? నీయొద్ద నేదియైన ప్రభావమున్నదియా? చెప్పుమని యా మంత్రి సరోజనిని భార్యచే నడిగించుచుండ నా యొద్ద నేశక్తియును లేదు. అప్పటికిఁ దోచినట్లు వక్కాణించెదనని సమాధానము చెప్పుచుండెను.

మరునాఁడు మంత్రి రాజునొద్దకుఁబోయి దేవా! మీ రడిగిన మాటలకు నా కూఁతురు సమాధానముఁ జెప్పఁగలదు నేడు సభఁ జేయింపుము. నీ నలువుర కుమారులనందు రప్పింపుము. యవనికాంతరవర్తి వియై నాకూఁతురు నీ పుత్రులతో నించుక సంభాషించి ముద్రికా తస్కరుం జెప్పునని‌ నుడువుటయు నా భూవల్లభుండు వల్లె యని మంత్రిచెప్పిన వడువున సభఁ గావింప జేసెను.

సరోజిని యందలమెక్కి వచ్చి యా సభాభవనంబునఁ దెఱచాటునఁ గూర్చుండెను. రాజపుత్రులు నలువురు నగ్రభాగంబునఁ గూర్చుండిరి. ఇఁక నీ యుపన్యాసము ప్రారంభింప వచ్చునని మంత్రి సరోజనికిఁ దెలియఁ జేసినంత నా కాంతారత్న మిట్లని చెప్పదొడంగెను.

ప్రభావతికథ

దేవప్రస్థ మను పట్టణంబునఁ గీర్తి చంద్రుడను రాజుగలఁడు. అ న్నరేంద్రునకుఁ బ్రాయము మిగిలిన తరువాత ప్రభావతియను కూతురు గలిగినది. మనుష్యులలోనేకాక సురగరుడోరగ విద్యాధర గంధర్వాది వియచ్చరులలోసైత మట్టి సుందరి లేదని చెప్పవచ్చును. ఆ బాలకుఁ బంచవర్ష ప్రాయము వచ్చినతోడనే యా రేఁడు సకలకళా నిపుణుండగు కళానిధియను బ్రాహ్మణు నుపాధ్యాయునిగా నియమించి చదివింపు చుండెను. సూక్ష్మమతియగు నా యవతియు నేడెనిమిదేఁడులలోఁ బదునాల్గు విద్యల సాంప్రదాయములం దెలిసికొని విదుషీమ తల్లియను వాడుక వడసినది. అంతలో నా పూవుబోణి మేన యౌవనము పొడసూపినది. ఉపాధ్యాయునకు దక్షిణమిచ్చి యంతఃపురముఁ బ్రవేశింపుమని తండ్రి యాజ్ఞాపించి నంత నయ్యింతి యొకనాఁడు సాయంకాలమున మణిభూషావిశేషంబులఁ గైసేసికొని పీతాంబరము ధరించి పసిఁడి పళ్ళెరమునిండ దీనారములఁ బోసికొని గురువింటి కరిగినది. అప్పుడా యొజ్జ వేదిక వజ్జం గూర్చుండి‌ యేదియో పుస్తకముఁజూచు కొనుచు మహలక్ష్మి వలెఁ దనయింటి కరుదెంచిన యమ్మించుబోణిం గాంచి మేను ఝల్లుమన నోహో ! ఈ మోహనాంగి యలంకరించుకొని వచ్చుటచే గురుతుపట్టలేక పోయితిని. నిత్యము చూచుచున్నది యైనను నేఁడు నాకు గ్రొత్త వింత గలుగఁజేయుచున్నది అయ్యారే ? ఈ సోయగము వేల్పు జవరాండ్రకైనఁ గలదా ? దీనిం బత్నిగాఁ బడయువానికి ద్రిలోకాధిపత్యమేమిటికి ? సీ ? నేనింతఁ జదివితిని. ఇట్టి భార్య లభించినదికాదు. నా జన్మము కాల్పనా? అయ్యో ? దీనిం జూచుచుండ నా మనసు వికారము నొందు చున్నది. శిష్యురాలని విరక్తిఁ జెంద డేమిపాపము ? త్రిభువనాశ్చర్యకర శోభా విరాజితమగు నీ యువతి యందమంద యా దోషమున్నది. మున్ను విధాత భారతిం జూచి మోహింపలేదా? నే నతనికన్నఁ దెలిసినవాఁడనా యేమి? ఏమైనను సరే నా మనోరధము వెల్లడింతునా ? ఇసిరో ! ఇది కడు తుచ్చేచ్చగదా ? కుసుమశర ప్రహార జర్ఝ రిత హృదయులకు వావులు నిలువవు సిగ్గు తెలియదు. ఇది నా మరణమునకే వచ్చినదని యనేక ప్రకారముల మోహపరవశుండై చింతించుచుండెను.

అప్పూబోణి దాపునకుఁ బోయి నమస్కరించుచు నార్యా ! నీవు నాకుఁ దండ్రియుంబోలెఁ గారవించుచు సకల విద్యలుం గరపితివి. నా జీవనము దారఁబోసినను నీ ఋణముఁ దీర్చుకొనఁజాలను. దేహమునకు మాత్రమే హేతుభూతుండగు తండ్రికంటె విద్యయను నేత్రముల నొసంగి యజ్ఞానాంధత్వము నశింపఁ జేసిన గురుం డెక్కొవయని పెద్దలు చెప్పుదురు. నీ శిష్యురాలిపైన ననుగ్రహముంచి యిఁక నంతఃపురవాసమున కనుజ్ఞయిమ్ము. గురుదక్షిణ స్వీకరింపుము. అని అత్యంత వినయ విశ్వాసములతో బ్రార్థించిన నా బ్రాహ్మణబ్రువుం డిట్ల నియె.

రాజపుత్రీ ! నీ వనినట్లు గురువు దైవముకన్న నధికుఁడు భక్తి గల శిష్యుండు గురుఁ డేమిచెస్పిన నట్లు చేయును. గుర్వాజ్ఞకుఁ గార్యా కార్య వివక్షతలేదు. గురువు కోరికఁ దీర్చుటే శిష్యుకృత్యమైయున్నది. నీ వట్టి దానవని నే నెరుంగుదును నాకీ దీనారములతోఁ బనిలేదు. నీ వంతఃపురమున బ్రవేశింతునని చెప్పినంతనే నా గుండె పగిలిపోవుచున్నది. ఏమి చేయుదును? ఎవ్వరియందును మమకారము బెట్టుకొన గూడదు. ఈ ప్రీతి మరణమునకే హేతువయని యనేక దీనాలాపము లాడుటయు నా కలకంఠి యిట్లనియె.

తండ్రీ ! ఉత్తములగు గురువులు పుత్రులకన్న శిష్యుల నెక్కు డు వాత్సల్యముతోఁ జూచుచుందురు. గురువు తండ్రివంటివాడగుట నెప్పుడును గురుదర్శనము దూష్యముగాదు. నే నంతఃపురమునఁ బ్రవేశించినను మీరు వచ్చుట కభ్యంతరము లేదు. మీ యింట నేకార్యమైనను నేను వచ్చుచుం బోవుచుండెదను. ఇందులకు మీరు విచారింప నక్కరలేదు. గురుదక్షిణ స్వీకరించి నన్నాశీర్వదించి యంపుఁడని మరియుఁ బ్రార్థించినది.

బాలా ! నీతో నేమనుటకును నాకు వాక్కురాకున్నది. ఉపేక్షించితివేని నీకు గురువధ మహాపాతకము రాగలదు. ఈ రెంటిలో నేది యధికమో యాలోచించు కొనుము. అని యర్దోక్తిగాఁ బలుకుటయుఁ నయ్యువతీరత్నము తండ్రీ ! నాకడ నింత సందియముగా మాట్లాడుచుంటిరేమి ? నీ కామితమేదియో చెప్పుము. నా తండ్రితోఁ జెప్పి తీర్పించెదను. నా ప్రాణమిచ్చియైనను నీ యభిమతముఁ దీర్పగల దాన నుడువుమని యడిగినది.

అతండు చేతులు నలుపుకొనుచు ముదితా ! యిదిగో నీ చేతిలోఁ జేయివైచుచున్నవాఁడ నసత్యము లాడువాఁడనా ? చెప్పుటకు నోరురాదు. నీవే గ్రహించి తీర్పవలయు. అన్నన్నా ! అతను విలాసములు విచిత్రములుగదా ? యని యభిలాష సూచించుటయు నయ్యిందువదన యది యేదియో తెలిసికొనఁజాలక తండ్రీ ! భూములుగాని, గ్రామములుగాని, గనకమణిభూషణాదులుగాని కావలసిన నిప్పింతునని జెప్పినది. ఇంతకన్న వేరొక కామితమేదియో తెలియకున్నది. మొగమాటమేల? విప్పి చెప్పుమని యడిగిన నతం డిట్లనియె ?

గజగామినీ ! నిజము దాచనేల ? వినుము. అద్భుత లావణ్య రూపరేఖావిలాసములచే నలరుచున్న నిన్నుఁజూచిన శ్రీశుకు౦డైన వలపుఁ జెందక మానఁడు మదనుఁడు నీ రూప మెరవైచి కుసుమనారాచముల నా పీచ మడఁచుచున్నవాఁడు. ఒకసారి నీ యధరామృత మిచ్చితివేని బ్రతికిఁ బోదును. లేనిచోఁ జావు సిద్దమైయున్నది. శరణమవై మరణముఁ దప్పింపుమని ప్రార్దించిన నాలించి యా చంచలాక్షి నేలఁ బళ్లెరము పారవైచి ముక్కు పై వ్రేలిడికొని యొక్కింత తడవు ధ్యానించి యిట్లనియె.

ఆర్యా ! శిష్యురాలికిని గూఁతునకు నింతయేని భేదమున్నదియా ? ఎట్టి నీచుఁడైనను బుత్రికను మోహించునా ? నీ చేతిలోఁ బెరిగి విద్యలం గరపిన నాపై నీకు వ‌లపెట్లు గలిగినది ? విద్యానిధివైన నీవు పస్తుతత్వ మెరుంగవా ? ధర్మాపరాధమునకు భూతములు కినియకుండునా ? చాలుఁ జాలు. మేదోమాంసరుధిరాస్థి పూర్ణణై కాయంబగు కాయంబుజూచి భ్రమఁజెందుట విచక్షణ పద్ధతియా ? ఇంద్రియముల నియమింపుము. దుర్గతిఁ బొరయకుము. అని నయకళా విదగ్దములగు మాటలచే నతని సిగ్గుపడఁ జేసినది.

అతం డొక్కింతతరి యధోముఖుండై ధ్యానించి దీర్ఘనిశ్వాస పూర్వకముగా రాజపుత్రీ ! నీ వనినమాట లన్నియుఁ దథ్యములు సకల శాస్త్రపురాణములం దెలిసిన నా కిట్టి నికృష్టబుద్ధి పుట్టుట పురాకృత పాతకముగాక వేరొకటి కాదు. ఇంద్రియములు నా యధీనములో లేవు. నేనేమిచేయుదును ? బ్రహ్మ కూతురు భారతిని వరించుటయు గౌతముండ అహల్యను వరించుటయు లోనగు చరిత్రాంశముల గ్రహించి నన్ననుగ్రహించిన ననుగ్రహింపుము. లేకున్న మన్మదాగ్నిచే భస్మమై నీ యెదుటనే మృతి నొందెదను. బ్రహ్మహత్యాపాతక మెక్కుడో యకార్యకరణ మెక్కుడో విచారించుకొనుమని పలికిన నక్కలికి యీషత్కోపవికృత మగుస్మితముఁ గావించుచు నిట్లనియె.

పాఱుడా ! గౌతము౦ డహల్యం బెండ్లి యాడి కామితముఁ దీర్చి కొనియెను. అది దూష్యము కాదు. నీవును మాతండ్రి నడిగి నన్నుఁ బెండ్లి యాడితివేని నీ యిష్టము వచ్చినట్లు వర్తించెదను. ఇప్పుడు నేను స్వతంత్రు రాలును కాను. ధర్మ విరుద్ధమగు కార్యము నే నెన్నఁడును జేయను. అక్రమముగా నా నిమిత్తము మరణము నొందకు మనుటయు నగ్గురుండు ప్రభావతీ ! నీ వన్నియు నెఱింగి యనిన నే నేమని యుత్తర మిత్తును ? నీ తండ్రి నాకు నిన్నిచ్చి పెండ్లి చేయునా ? అది పొసఁగెడు తెరువే‌ ? నన్ను సంతసపరుపనట్లంటివి. ధనవయోరూప విశేషాదుల నీకును నాకును జాలవ్యత్యాసము కలిగియున్నది. పద్మినీ కాంతుఁగుంతియుంబోలె నీవు నన్నుఁన్గూడుము. ఇంతకన్నఁ జెప్పఁజాల బిమ్మట నీ యిష్టమనుటయు నక్కటిలకుంతల యిట్ల నియె.

కుంతికి గలిగిన వరములు నాకున్నవియా ? నే నిప్పుడు నీ యిష్టముఁ దీర్చితి నేని నుభయముల్లోకములకుం జెడుదును. తలిదండ్రు లసహ్యించుకొందురు. కులటనైన నన్ను మగడు పరిగ్రహింపడు. చుట్టాలు పరిహసింతురు. అన్నిటి కంటె నసుచితక్రియాకరణమునకు నాయంతఃకరణము పరితపించుచున్నది. నీ చిత్తము మరలించు నిశాంతింబొందుమని బోధించిన వినియాజన్ని గట్టు వేడినిట్టూర్పులు నిగుడించుచు నిట్లనియె.

‌తరుణీ ! యుక్తులచేతను శాస్త్రములచేతను నీకు నేను సమాధానముఁ జెప్పఁజాలను. ధర్మమో యధర్మమో నాకీ బుద్ది పుట్టినది. గురుఁడనియు బ్రాహ్మణుఁ డనియు నాశ్రితుడనియుఁ బండితుఁడనియుఁ గనికరించి నన్నుఁ బ్రతికింపుము. లేకున్న నిప్పుడే నీ పాదములమ్రోలఁబడి కడతేరుచున్నానని పలుకుచు నక్కలికి యడుగులకడ జతికిలఁబడియెను.

అప్పు డప్పడతి యించుక మోకరిల్లి అక్కటా ! ఇంద్రియములు పండితునైన మోసముఁ జేయుననుమాట సత్యము. ఆహా ! యెటువంటి పండితుఁడు తుచ్చ క్రియ కుద్యోగించుచుండెను ? వీనిం బరిభవించి యరగితినేని దప్పక మృతి నొందును. అయ్యో ! దైవమా ! నే నీ యాపదనెట్లు తప్పించుకొందునని యొక్కింత సేపు తలంచి గురువర్యా? లెమ్ము లెమ్ము. ధర్మసూత్రము విచారించితిని. నీ యభిమతము వేరొకగతిఁ బరిపూర్తి నొందించెద. నా వుఁడు తటాలున లేచి చిగరుకుబోణీ ! నీ వార్తాత్రాణపలాయణవు. ఎట్లు తీర్తునో చెప్పుమని యడిగిన నయ్మెలనాగ యిట్ల నియె.

సతికిఁ బతి యనుమతిని బరపురుషుఁ గూడినఁ బాతకము లేదు గదా ? నాకు వివాహమైన పిమ్మటఁ బ్రధమసంగ మదిపసంబురాత్రి బ్రాణేశ్వరుం గూడక మున్న పతింబ్రార్దించి నీ పజ్జ కరుదెంతు నప్పుడు నీయభిలాషఁ దీర్చుకొమ్ము. దాన ధర్మలోప ముండదని పలికిన నతండు రాచపట్టీ ! నా కర్మము వేరొకరీతినుండ నీచిత్తవృత్తి యెట్లు మరలును ? పతియనుమతి వత్తునన్నమాట నా గన్నీరు దుడుచుటకుఁ గాని వేరొకటి కాదు ఎట్టివాడైన మఁగడిందులకు సమ్మతించునా ? పోనిమ్ము నీ వింటికిం బొమ్ము. నేగాటికిం బోయెదనని గన్నీరుఁ గార్చుచు వాక్రుచ్చెను.

అప్పుడాచిన్నది పదిమాటలతోఁ బనిలేదు. నాఁడురాత్రి నేను మీయొద్దకు రాకపోయితినేని గురుహత్యాపాతకమునకుఁ బాత్రురాలనగుదును. ఇంతకన్నఁ జెప్ప వలసిన పనిలేదని పలుకుచుఁ తాను దెచ్చిన దీనారములు (మొహరీలు) అందుఁ బోసి యతం డర్దినిమీలనదృష్టులతోఁ జూచుచుండ నింటికిం బోయినది.

వెంటనే యావాల్గంటినిఁ తండ్రి భానుమంతుఁడను రాజకుమారునకిచ్చి వివాహము కావించెను. మరియుఁ బ్రధమ సంగమదివసంబున

సీ. చలువజల్తారు దువ్వలువ కుచ్చెలయంచు
             ముత్తెముల్‌ నఖరదీపులకు మ్రొక్క
    మలచి నిద్దంపుకమ్మలఁ జెక్కు మగరాల
             తల్కులక్ష్మి ప్రభావతి నుతింప
    నెరిచొకాటంపు కస్తురిబొట్టు కుంతల
             చ్ఛవులతోఁ గలసి యిచ్చకములాడ
    గులుకుగుబ్బలహోయుల్‌ వెలయించు పసిఁడి కం
             చుళీ నిగ్గులొడలి రోచుఁభజింప

గీ‌ గిలుకుమట్టెల నినదంబు లలితకనక
   నూపురారావములును మనోజ్ఞరత్న
   సారసన కింకిణి థ్వనుల్మీరభర్త
   సెజ్జ కరుదెంచె నా సరసీరుహాక్షి .

అప్బప్మోఃవ వరఠియు( గొంత సెపు?ల. ఏం నంంచులంి సం పతి 8336 (పీతి గలుగ చేయుచు. గొంతపంచయము; గలిగిన పిమ్మట ళన మ్మాంనం వేస్పకొన చెప్కులు నంద్దు. పెట్టుతప హస్‌? క. గజ 1 పసేళ్ళిం.. థన్‌ మాస కపుూత బ్రలనుప్కంపంపాం వి సుం 492 లోపలపలన వసి: సా పంటి ఫా టిని. మఱియు నిట్టి సమయమున సిగ్గువిడచి మాట్లాడుచుంటినని నన్ను సిగ్గులేని దానిగా భావింపవలదు. అందులకొక కారణ మున్నది. నాయభిమతముఁ దీర్తుమంటి రేని వెల్లడించెదను. సకల విద్యాపారంగతులు మీ యెరుంగని ధర్మములుండవని మిక్కిలి‌ వినయముగాఁ బ్రార్దించుటయుఁ దదీయ మృదుమదుర వచనోపన్యాసమునకు వెరగుపడుచు నా రాచకుమారుండు లేత నవ్వుతో నిట్లనియె.

బోఁటీ? యిట్టితరి నీ నోటిమాటలు వినుటచేఁ బరమానందమైనది. నీ కోరిక యేదియో వేగిరము వచియింపుము. అడిగినదాని కిబ్బడి యిచ్చి నీవలన మెప్పు వడయుదునని పలుకుచు మోము ముద్దిడుకొనుటయు నక్కుటిలకుంతల కొంత తొలగి తల నించుకి వంచి మాటలు తడఁబిడఁ బ్రాణేశ్వరా ! నాకామితము మీ కమితకోప కారణ మని యెరింగియుఁ దెగించి నుడువుచుంటి ధర్మసూక్ష్మము విచారించి నా తప్పు మన్నింప వలయును.

నే నై దేఁడులు వచ్చినది మొదలు కళానిధియనుగురువునొద్ద విద్యాభ్యాసము జేసితిని. ఆతండు గుట్టువిడచి నాకు సమస్త విద్యలు జెప్పెను. యౌవనారంభమందు గురుదక్షిణఁ గొని యరిగిన నన్నుఁ జూచి మోహించి వివేకము లేక యతండు తన యభిలాష వెల్లడించినఁ జింతించుచు నప్పని కడు బాపహేతువని పెక్కుభంగుల బోధించితి. అతండు నా మాటలు పాటింపక చచ్చుటకు సిద్ధమయ్యెను. ధర్మ సూక్ష్మము విమర్శించి పెండ్లి యాడిన పిమ్మటఁ బతియాజ్ఞ గైకొని నీ కామితము దీర్తునని శపథముఁ జేసి వచ్చితిని యా వృత్తాంత మంతయు నుడివి, దేవా ! ఆడి తప్పుటకంటె మహాపాతకము లే దండ్రు సత్యమందు సమస్త ధర్మములు నున్నవని శాస్త్రములు చెప్పుచున్నవి. ఇదియే నా కోరిక. అప్పని కనుజ్ఞ యిచ్చి నన్ను సత్యవచనురాలిం జేయుడని ప్రార్దించినది.

అప్పు డతండు ముక్కు పై వ్రేలిడికొనుచు బళిరా ? యిదియా ? నీ కోరిక వస్తువులో వాహనములో యనుకొంటి. చాలుఁజాలు సంతోషమైనది. మంచిమాట నగుదువు, కానిచోఁ దొలికూటమునందే సిగ్గులేక నింత చొరవగా మాట్లాడుదువా ?. అన్నా ఆడువాండ్ర మాయల సృష్టించిన విరించికే తెలియ వనినచో నితరులమాటఁ జెప్ప నేల? అని మిక్కిలి యెకసక్కెము లాడిన విని యక్కలికి యెడల గడగడ వడంక బాష్పగద్గదస్వరయై యిట్ల నియె.

ఆర్యపుత్రా ? సతులకుఁ బతికన్న దైవము లేదు. త్రికరణంబులకు భిన్నముగాఁ మీతోఁ బలికితిన యేని నేను రౌరవాదిఘోరనరకయాతనల ననుభవించి -------కాది జన్మము కెత్తకపోవుదునా ? భూతదయ బాధించుటచే గురుమరణమునకు వెరచి ధర్మమనియే యట్లు పలికి వచ్చితిని. నన్నుఁ గామతంత్రురాలిగాఁ దలంతురేని నిప్పుడ మీ పాదమూలమునఁ బ్రాణములు విడుచుదాన. పతి మెచ్చని మచ్చకంటి జీవితముకంటె నీచమున్నదియా ? అని ధర్మప్రతిపాదకములగు వచనంబు లుచ్చరింపుచు నా సతీరత్నము వెక్కి వెక్కి యేడువఁ దొడంగినది.

సుగుణశాలియగు నతం డామెశీల మట్టిదికాదని నిశ్చయించి సంతసముతో నక్కునం జేర్చి యోదార్చుచు ప్రేయసీ ! పెండ్లియాడకమున్న మగనిశీల మెట్టిదియో తెలియక పూర్వమే యిట్టి శపధము చేయుట నాశ్చర్యముగా నున్నది. మగడు విననివాఁడైన నేమి సేయుదువని యడిగిన నమ్ముదిత ముదితమనస్కయై దృఢవ్రత యగు‌ మగువకు దైవ మేల తోడ్పడకుండెడిని. త్రికరణంబుల దైవముగా నెంచి పూజించెడి భార్యమాటఁ బతి యేమిటికి వినకుండెడిని. మదీయ చిత్తశుద్ధియే యిట్టి శపధముఁ జేయించినదని పలికిన నా రాజనందనుండు తనభార్య ధర్మస్వభావమునకు భావమునఁ దద్దయు మురియుచు రమణీ ! బోయిరమ్ము నీ ప్రతిజ్ఞఁ జెల్లించుకొను మని యానతిచ్చెను.

అప్పు డాసుందరియుఁ బరమసంతోషముతో ఫలహారములఁ బసిడిపళ్ళెరము నిండఁ గైకొని గూఢముగాఁ బెరటిమార్గంబున నిల్లు వెడలి గాంఢాంధకారములో ధారాధరంబులోని మెఱుఁగు తీగెయుం బోలె మెఱయుచు మెల్లన నరుగు చుండెను.

సీ. ఆపాదమస్తకం బలఁదిన మసినూనె
            చాయతోఁ జీకటుల్‌ సరసమాడ
    గనులఁబ్రామిన కాటుకల మీటికొని భీక
            రారుణాక్షిద్యుతి ల్వేరుగాఁగ
    నసమానవారుణీ రసపాన మత్తతా
            వశమున గమనముల్‌ వాసిదొఱగ
    గరదీపితాభీల కరవాలహేతి చ్చ
            టారుక్తళత్తళల్‌ దారిసూప

గీ. జెట్టిలాగులపై గాళజుట్టి సుషిర
   కర‌ణసాధనముల జాల సరల జొనిపి
   కడు భయంకరులైన తస్కరులు నల్వు
   రెదురపడి రవ్వధూమణి యదరిపడగ.

సకలాభరణ భూషితయై వచ్చుచున్న యాచిన్నదానిం గాంచి యమ్ముచ్చులు ముఱియుచు దెరపున కడ్డముగా నిలిచి తెఱవా ? యెందేగెదు నిలునిలు. నీ యొడలి తొడపు లిం దిడుమని యదలించుటయు నదరపడి యయ్యబల కనులు మూసికొని కొండొకవడికి యుదుటఁబూని అన్నలారా ! గురుకార్యార్దినై యరుగుచుంటి. నా యొడలి తొడవులన్నియు మీ వియే? నా కెర వీయుడు. రెండుగడి యలలో వచ్చి మీ నగలు మీ కిచ్చు దాననని పలికిన బకాపక నవ్వుచు నాతస్కరు లిట్లనిరి.

చ. గురుపనిదీర్చి వేగనిదిగో ? చనుదెంచదనంచు బల్కెదీ
    వరుదుగ నీ నయోక్తు లెవరాత్మల నమ్మెదరమ్మ చెల్ల త
    స్కరులము మేము మా కడన సాగునె నీ కపటంబు లక్కటా ?
    యరమరలేక మండనము లన్నియు నిక్కడ బెట్టిపొమ్మికన్‌.

క. దొంగలకు గలుగునేదయ
   యంగనలకు డలదెసత్య మహహా ? నీమా
   యం గలుదుమేఁ మేమీ
   వుంగమలదాళాక్షి యిచ్చిపొమ్ము విభూషల్‌.

గీ. గురువుపని యీ విభూషలు కొదవయైన
   సాగదే ? యీ గదే వేగ సరసముగను
   గురువు దైవముగద వానిదరికిఁ నరుగ
   నగ లివేటికి గణికవే ? వగలుసూప.

అని యాక్షేపించుటయు నాచంచలాక్షి తనపోయెడి తెర గంతయు వారి కెరింగించినది. వాండ్రు మరియు నవ్వుచు--

క. ఇల్లాలువోలె బల్కెదు
   కల్లలు మా యెదుట వావిగాని యతనితో
   జిల్లరిపనులకు నరిగెదు
   ప్రల్ల దురాలవుగ నిన్ను బాటింతు మికన్‌.

అయ్యారే ! నీ పలుకులు కడువిపరీతము. పతివ్రతలు పరపురుషుం గూడునా ? మగని యనుమతిని గురుని గూడ నరుగుచుంటివని పల్కుచుంటివి. ఇట్టి రంకులాడి నుడుపులు సత్యములని నమ్మవచ్చునా ? నగలీయక పోనీయమని పలికిన నా కలికి వెండియు నిట్లనియె.

అన్నలారా ! నేను బంచభూతములు సాక్షిగాఁ జెప్పుచున్నాను. నా మాట నించుకయు నసత్యము లేదు. నేను గామాభిలాషతో నరుగుటలేదు. మున్నన్నమాట నిలుపుకొనుటకై పోవుచుంటిని. మీ రనుగ్రహించితిరేని కార్యసాఫల్యము కాగలదు. అలంకారశూన్య నైతినేని గురుఁడు నన్ను వేరొకరీతిఁ దలంపగలడు. అస్థిరములైన దేహసుఖములకై స్థిరసుకృతములఁ బోగొట్టికొందునా ? రక్షింపుడని యనేక ప్రకారముల మొఱ పెట్టినది.

ఆ బోటిమాటలు వినుటచే‌ గటికవాండ్రకే దయ వచ్చినది. వేగఁబోయి రమ్ము. మే మిందే యుండెదము. రాకపోయితివేని నీ పని పట్టక విడువము సుమీ ? యని పలుకుచు ముచ్చు లప్పొలతుకను విడిచిరి. అట్లు పాటచ్చరుల నిర్భం ధము వాసి యాసీమంతినీమణి వడివడ నడచుచు గురుమందిరమున కరిగి యతండు పండుకొను నెల వెరిగిన దగుట నటకేగి గుర్రు వట్టి నిద్రపోవుచున్న యాచార్యు మేనిపై మెల్లనచేయి వైచి ఆర్యా ? ఆర్యా ? లెమ్ము లెమ్ము అని పిలిచినది. అతం డదరిపడి లేచి కన్నులు నులిమికొనుచు నెదుర విభూషణప్రభలచేఁ గన్నులకు మిరుమిట్లు గొల్పుచున్న ప్రభావతిం జూచి గురుతుపట్టనేరక భూతమో కామినియో తన్నుఁ జంపవచ్చినదని నిశ్చయించి మాటరాక యదరిపాటుతోఁ బారిపోవ నటునిటు చూచుచున్నంత నక్కాంతారత్నంబు ఆర్యా ! వెరవకుడు. నేను మీ శిష్యురాలను బ్రభావతిని. నాడు మీతో నాడిన మాటవడువునఁ బతియనుమతి వడసి మీ యొద్ద కరదెంచితిని. మీ యిష్టముఁ దీర్చుకొండని పలికిన నులికిపడుచు నప్పండితుం డయ్యండ జగమనపాదంబులకు సాష్టాంగ మొరగుచు నిట్లనియె

తల్లీ ! నీవు త్రిలోకమాతవు. నీ శీలం బెరుఁగక మదాంధుఁడనై నిన్నుఁ గామించినందులకు నా తల నూరువ్రక్కలు కావలసినది. నీ యక్కటికంపు పెంపున నప్పని జరిగినదికాదు. నా చదువంతయు గంగపాలు సేసితిని. వివేకము నీటఁ గలిపితిని. సీ ! నే నొక బ్రాహ్మణుఁడనా ? పుత్రికవోలెఁ జేతిలోఁ బెరిగిన నిన్నుఁ గామింతునా ? అయ్యారే ? నీ సత్య వాక్ప్రౌడిమ హరిశ్చంద్రాదులకుఁ గలదా ? అయ్యో ? ఇట్టి యర్దరాత్రమునఁ బాదచారిణివై యీ కటికిచీకటిలోనిక్కడికి వచ్చితివా ? మహాపతివ్రతవు, నిన్ను నేను ముట్టిబ్రతుకఁగలనా ? నీ పాదరేణువు నా శిరంబున సోకింపుము. నా పాపంబు లెల్లఁ బటాపంచలై పోవగలవని యనేకవిధముల స్తుతియించుచుఁ దన్ను నిందించుకొనుచున్న కళానిధి నుపలక్షించి యాపద్మాక్షి యిట్లనియె.

ఆర్యా ! నీవు మది కుదురు పరచికొమ్ము. కొంకవలదు. నీ యభీష్టముఁ దీర్చికొమ్ము. నీ నిమిత్తమై నా ప్రాణేశ్వరు నెంతయో బ్రతిమాలికొంటినని పడింబదిగ బోధింపఁ దొడంగినది. అతం డేమియు నంగీకిరింపక యప్పుడే లేచి పసపును చీరలను గానుకగా నిచ్చి తల్లీ ! నీవు మా యింటికి వచ్చితివి వీనిం గొని పొమ్ము. పుత్రికాతుల్య వగు నిన్నర్చింపతీరదని పలుకుచు బ్రతిమాలికొని యాపతివ్రత నింటి కనిపెను.

ఇట్లు ప్రభావతి విప్రభావంబు భావజక్రీడావిముఖం బగుటకు మిగుల సంతసించుచు నటఁ గదలి దొంగలున్న నెలవునకు వచ్చి వారిజాడ నరయుచున్నంత నొకదెసనుండి వాండ్రు పరమసంతోషముతో వచ్చిరి. అన్నలారా ? యిదుగో నేను వచ్చితిని. మీయాభరణములం దీసికొనుడు వేగ నింటికిఁ బోవలయు. మీకుక్కటికంబువలన నేఁ బోయినకార్యంబు వేరొకరీతిం దీరినది యనుటయు నా ------- గాండ్రిట్లనిరి.

అమ్మా ! నీవు పార్వతివో లక్ష్మివో కాక సామాన్యస్త్రీవి కావు. నీ దర్శనంబున నేడు మాకుఁ జాల ధనము దొరికినది. నీ సత్యమునకు మెచ్చుకొంటిమి. నీ సొమ్ములు మే మొల్లము. నీవు మాకుఁ దోబుట్టువవు కావున మరికొన్ని నగలు నీకుఁ గానుకలిచ్చుచుంటిమి. కైకొనుమని పలుకుటయు నక్కలికి మరల నిట్లనియె.

అన్నలారా ? చోరులకు దయాదాక్షిణ్యము లుండవు మీరు మీ వృత్తికి మించిన యుపకారముఁ గావించితిరి. ఇదియనాకుఁ బదివేల కట్టనములు. ఉపకారము సేసిన సోదరుల కీపాటిసొమ్ము లిచ్చుట యబ్బురముకాదు. రవణంబులం గొనుడు పోయి వచ్చెదనని వాక్రుచ్చిన నమ్ముచ్చులు కట్టా! నీ నగలు ముట్టిన మేము జీవింతుమా ? వలదు వలదు. వీనిం గొనుమని పలుకుచు గొన్ని మండనములు బలవంతమున గొంగున ముడివైచి యా చిగురుబోణి నింటిదనుక సాగనంపి పోయిరి.

ప్రభావతి భర్త భానుమంతుడు తనభార్య చర్య లెట్టివో పరిశీలించు తలంపుతోఁ గుప్తముగా వెనువెంటఁ దిరుగుచు నా విశేషము లన్నియుం జూచి తదీయ పారిశుధ్యమునకు నెంతేని సంతసింపుచు నేమియు నెరుంగనివాఁడుం బోలె మరలఁ బోయి మంచముపైఁ బండుకొని నిద్రవోవున ట్లభినయించుచుండెను.

ప్రభావతి మెల్లగాఁ దలుపుఁ దెఱచుకొని గదిలోనికిం బోయి మగఁడు నిద్రించుచున్నవాఁడని తలంచి విపంచి మేలగించి సంగీతము పాడఁ దొడంగినది. ఆతం డదరిపడునట్లు లేచి తల్పముపై గూర్చుండి బోఁటీ ? పోయివచ్చితివా ? గురుని సంతోష పెట్టితివా ? గురుదక్షిణ సాంతము ముట్టఁజెప్పితివా ? యని యడిగిన నప్పడఁతి లేచి నిలువంబడి యించుకసిగ్గుతో దాను బోవుచుండ దారిలోఁ జోరు లడ్డ గించుటయు వారి బ్రతిమాలుకొని గురునొద్ద కరుగుటయు నతండు పశ్చాత్తాపముఁ జెందుటయు లోనగు వృత్తాంతమంతయు నెఱింగించిన నతండు నవ్వుచు నిట్లనియె.

అహా ! పంకజాక్షులు బొంకులకు నెలవు లనుమాట నేటికి దృఢమైనది. మొదట సెప్పితినికాదా ? చేసినపని చెప్పినం దప్పా ? దానిలోఁ గొంచెము నేర్పరితనముఁ జూపెద వేమిటికి ? నిన్నుఁగన్న కన్నగాండ్రు విరక్తిఁ జెందిరా ? ఏమి నిన్నేమియుం జేయక యూరక నగలిచ్చి యంపుదురా ? మొదట వరించిన గరుం డింతలో వృద్దుఁ డయ్యెనా ? నీ మాట లెట్లు నమ్మనగు. నీవు భూతదయగలదాన వగుట దొంగల కామితమును దీర్చియే యుందువు. కామధేనువువలె నడిగిన వారి కామము లెల్ల దీర్చుచుందువు. నిన్నుఁ గొనియాడఁ దగినదే యని సాక్షేపముగాఁ బలికిన విని యవ్వనితామణి యొక్కి౦తసే పేమియు మాటాడక యశ్రుపూర్ణవదనయై మెల్లన నిట్లనియె.

ప్రాణేశ్వరా ? నా చెప్పిన కథ నిక్కువమని నాచేత నగ్నిం బెట్టి పరీక్షించు కొనుడు. ఊరక నన్నేల పరితపింపజేసెదరు ? మీ సూటి మాటలు నాహృదయము నుడికింపుచున్న యవి. నా యెడ మొదటంజూపిన కనికరము కర మభివృద్ధి సేయఁ గోరుచున్న దాననని దీనవదనయై ప్రార్దించుటయు నతం డక్కలికిం గౌఁగలించుకొని ప్రేయసీ ! నీవు చింతవిడువుము. నీ వెను వెంటఁ దిరిగి నీ శీలముఁ బరీక్షించితిని. నీవు గడు సత్యసంధురాలవు. అరుంధతి మెదలగు పతివ్రతలు నీ కెన యగుదురా ? నిన్నుఁ బెండ్లియాడి నేను ధన్యుఁడ నైతిని మావంశం బెల్ల బావనమైనది. నీవంటి భార్యను బడయ ననేక జననకృతసుకృతమునఁ గాక శక్య మగునా ? యని బహువిధంబుల నగ్గంచుచు నగ్గజగామినింగూడి‌ పెద్దకాల మీభూతలంబున సుఖియించెను.

అని యెరింగించి సరోజిని రాజపుత్రులారా ? ఈకథ యంతయును వింటిరి గదా. ప్రభావతియు భర్తయు నుపాధ్యాయుండును దొంగలును వీరిలో నెవ్వరుత్తములో గుణదోషములు విమర్శించి మీరిప్పుడు నాకుఁ జెప్పవలయును. మీ బుద్దికౌశల్య మెరింగెదగాక‌ యని యడిగినది.

అప్పుడు సుముఖుఁడు వారిలోఁ ప్రభావతియే కడు నుత్తమురాలు. ఆమె వంటి గుణవంతురాలీ జగములో లేదు. సత్యమున హరిశ్చంద్రాదుల మించినదని పొగడెను. ఆ మాట విని రెండవయతండు ప్రభావతి శీలవతియని యొప్పుకొనఁ దగినదే. అట్టి పతివ్రతలైన యువతులు పుడమిఁ బెక్కండ్రుకలరు. కాని దానిభర్తవంటి శాంతము గల మగవాఁడెందును గలుగ నేరడు. తొలికూటమినాడు తన్నుఁ బొందక యెవ్వనికోమాట యిచ్చితినని భార్య చెప్పినంతనే పోయి రమ్మని పలుకుట కతనికాతడే సాటి. భానుమంతుఁడు పరమోత్తముఁడని బద్మనాభుండు వాదించెను.

ఆ మాటలు విని మూడవ రాజపుత్రుడు కాదు కాదు. నామాట వినుండు. తెరగంటి మచ్చకంటివంటి వాల్గంటివచ్చి మచ్చికలు సూపుచుఁ బచ్చవిల్తుకేళికిఁ జేరిన వలదని విడిచిన నుపాధ్యాయుండు ప్రవరుని కన్న నుత్తముఁడని నా యభిప్రాయము. మగవాని కట్టితరి ధర్మబుద్ధి నిలుచుట దుస్తరముగదా యని పలికిన నాక్షేపించుచు నాలుగవరాజ కుమారుండు పింగళాక్షుం డిట్లనియె.

అన్న లారా ! మీరించుకయు విమర్శింపక పలుకుచుంటిరి. రాజపుత్రికయు భర్తయు నుపాధ్యాయుండును సర్వశాస్త్ర పురాణాదుల నెరింగిన వారగుట వారినీతివర్తనము లోకమున కంత వింతఁగలుగఁ జేయనేరదు. వినుండు. ధర్మాధర్మవివక్షతలేక‌ క్రూరమృగంబుల భాతి యెదురఁ బడిన మునులనైన దలలు వ్రక్కలు చేసి వస్తువులు దోచికొనెడు దొంగ లయ్యంగన పలుకులు నమ్మి కనికరించి కానుకలిచ్చి యంపిరి. వాండ్రకన్న నుత్తము లెందైనఁ గలరా? చోరులే గుణవంతులని యతండు సంవాదముఁ గావించెను. ప్రస్తుతాంశములు మరచి యా విషయము నలువురు పెద్దతడవు ప్రసంగించిరి.

ఆ ప్రసంగ మంతయును విని సరోజిని వారిని వారించుచు బింగలాక్షు నుద్దేశించి రాజపుత్రా ! నీవే యా ముద్రికం దీసితివి వేగముదెచ్చియిమ్మని యడిగినది. ఆ మాట విని యతండు తెల్లతెల్లపోవుచు నన్నల మొగముఁ జూచెను. వారు నీవు తీసితివేని నిజముగా దాచఁగూడదు. మంత్రి పుత్రిక కడు బుద్దిమంతురాలని సంతసింప వలసినదేయని పలుకుటయు నా పింగళాక్షుండు దేవీ ! నీవు నన్ను ముద్రిక తీసితివని పలికితివి. అందులకు నిదర్శన యేమియో చెప్పవలయునని యడిగిన నా సరోజిని రాజపుత్రా ! సూక్ష్మవిషంయంబులు విచారించి బుద్ధిమంతులు దోష విమర్శనము సేయుచుందురు. అందలి కారణంబులు హృదయైక వేద్యంబు లగుచుండును. మా తండ్రి మీలో సుముఖుని బుద్ధిమంతుఁడని చెప్పినట్లే నేనును నిన్ను నిరూపించితిని. అందలి నిజానిజంబులు మీకే విశదముగాఁ గలదని పలికిన సంతసించుచు నతం డిట్లనియె.

దేవీ ! నీ బుద్ధి బలమునకు మిక్కిలి మెచ్చుకొంటిమి. ఆ ముద్రికను నేను దీసినమాట వాస్తవమే. నీ వీ రహస్య మెట్లఁ దెలిసికొంటివో వినవలయునని మిక్కిలి కుతూహలముగా నున్నది. చెప్పుము చెప్పుమని నిర్భంధించి యడిగిన నామె రాజపుత్రా! నే నీ విషయ మెట్లు గ్రహించితినో మీ నలువురు విచారించి చెప్పవలయును చెప్పినవాఁడే బుద్ధిమంతుఁడని పలుకుటయు బద్మనాభ చారుకర్ణ పింగళాక్షులు మువ్వురు విమర్శించి మా కేమియుం దెలియ లేదని చెప్పిరి.

అప్పుడు సుముఖుండు చక్కగా నాలోచించి స్మృతి నభినయించుచు దేవీ ! నీవు చెప్పినకథలో బింగలాక్షుండు దొంగల మంచివారని చెప్పుటచే నతఁడే యీ దొంగతనముఁ గావించెనని యూహించెనని పలికెను. ఆ మాట విని యా బోటి అవును అదియే యధార్థము. ఏ పని చేయువారి కాపని చేయువారిపై దరుచు మనసు వ్యాపించు చుండును. దానంజేసియే నీపింగలాక్షుండు దొంగల మంచివారని నుడివెను. సుముఖుండాసూక్ష్మము గ్రహించెను దానంజేసియే మీతండ్రి సుముఖుండు బుద్దిమంతుడని నుడివెను. మీ రిప్పుడైన నిందులకు సమ్మతింతురా? యని యుపన్యసించిన విని యా రాజపుత్రులు మువ్వురు సిగ్గుపడి యూరకుండిరి.

అప్పుడు చంద్రకేతుఁడు మంత్రిం గౌగలించుకొని నేను నీ బుద్ధిబల మెరింగియే యీ పిల్లవాండ్రకుఁ దెలియుటకై యట్టికట్టడిఁ గావించితి. నీ వొండు నీ పుత్రిక యుండె. వీండ్రకు మంచి బుద్దిఁజెప్పఁ గలిగితిరి. ఒకవేళ నీ వెరింగింపలే కున్నను నిన్నటిపనిఁ జేయింతు ననుకుంటివా? యని యోదార్చుచు నప్పుడే సుముఖుని యువరాజు పట్టాభిషిక్తుఁ జేయుటకు నిశ్చయించెను.

అంతటితో నాసభ ముగించిరి. సరోజిని యందల మెక్కిమంత్రిగారియింటి కరిగినది. అని యెరిగించి మణిసిద్దుం డవ్వలికథ మరల నిట్లు చెప్పుచుండెను.

సుముఖుని కథ

పూవుబోణి - చకోరాక్షీ ! యెంత చోద్యమో వింటివా? ఔరా? ఎట్టిచిత్రములు వినంబడుచున్నవి ?

చకో - ఇక్కడనా? మరియొక చోటనా ?

పూవు -- ఇక్కడనే. మొన్న మంత్రికూఁతురని పేరు చెప్పికొని మన రాజపుత్రులలోఁ బింగలాక్షుడే మణిముద్రికను దీసేనని చెప్పిన చిన్నది యెవ్వతెయో యెరుంగుదువా ?

చకో - ఎరుఁగ నెరుఁగ మంత్రి పుత్రికయనియే వింటిని. ఆమె మిగులఁ జక్కనిదిగదా ? ఆమె మాట యేమిటికి?

పూవు - ఆమె బుద్దికుశలతకు సౌందర్యమునకు వలచి మన సుముఖుఁడు పెండ్లియాడ నిశ్చయించుకొనియెను.

చకో - ఆ చిన్నది క్షత్రియ కన్యకయా యేమి?

పూవు - ఎవ్వతెయో చెప్పెద వినుము. ఘటదత్తుఁడను చిన్నవాఁడును నా చిన్నదియు నీయూరు వచ్చి బ్రాహ్మణుల మనియు నన్నా చెల్లెండ్ర మనియుం జెప్పికొని యీ వీటిలోఁ గ్రుమ్మరుచు మన ప్రధాని గారికి వచ్చిన యాపద విని యా పైదలి మంత్రి కూతుఁరనని చెప్పి యా విపత్తు దాటించినది.

చకో - ఆమె బ్రాహ్మణకన్యయా ?

పూవు - కాదు. కాదు తరువాత వినుము. సుముఖుండా పద్మముఖి యద్భుత కళా వైదగ్ద్యములఁ గాంచి మోహించి వెనువెంట దిరుగుచు మంత్రి నాశ్రయించి నీకు సంతతి లేదని వింటిమే ? ఆ వాల్గంటి నీకొమార్తె యెట్లయ్యనని వినయముగా నడిగెను.

చకో - తరువాత తరువాత.

పూవు - మంత్రి నిజమెరింగించుటయు నతండు మరియు విరహాతురుండై యత్తలోదరిం బెండ్లి యాడినగాని జీవంపనని మంత్రితో జెప్పెను.

చకో - నేను చూచితిని అకుందరవదన సౌందర్య మట్టిదే. తరువాత ?

పూవు - ప్రధాని దాని యన్నతో సుముఖుని చరిత్రముఁ జెప్పి తరువాత నొప్పించి యమ్మి౦చుబోణిని సుముఖునకుఁ బెండ్లిఁ జేయుటకు నిశ్చయించెను.

చకో - బ్రాహ్మణకన్యకను క్షత్రియుండెట్లు పెండ్లియాడుటకు నిశ్చయించి కొనియెను ? అన్న యెట్లంగీకరించెను ?‌

పూవు - సాంతముగా వినక శంకలు సేయుచుందువుగదా ? ------------ విప్రకన్యక కాదు. కాదు. వెలయాలు చంద్రవతి యను బోగము దానికూఁతురట. ఘటదత్తుఁడు దానియన్న కాడట. చకో - మరి యెవ్వఁడు ? దాని కేమి కావలయును ?

పూవు - ఇక్కడనే చిత్రము. వినిన నవ్వకమానవు. ఘటదత్తుండే కులమువాఁడో తెలియదు కాని దొంగలకు నాయకుఁడట. సరోజిని తల్లి చంద్రవతి మిక్కిలి భాగ్యవంతురా లగుట ఘటదత్తుఁడు రాజకుమారుఁడని చెప్పి నలుగురు దొంగలతోఁ జంద్రవతి యింటి‌ విటధర్మమున కఱిగి యింటిలోఁ బ్రవేశించి దానిం గట్టిపెట్టి ద్రవ్యమంతయుం దోచికొని యీ చిన్నదాని నెత్తుకొని పారిపోయి వచ్చెనఁట.

చకో -- బళా బళి ! యిుదియా? వేషము సరి సరి ఆ మర్మ మెట్లు తెలిసినది ?

పూవు - చంద్రవతి యప్పుడే యాదేశప్రభువునితోఁ జెప్పికొనిన నతండు నలుదెసలకు వారిగురుతులు సెప్పి దూతలం బుచ్చెను. వెదకికొనుచు గొందరు రాజభటులు జాడతీసి మొన్న నీయూరు వచ్చి ఘటదత్తుని బట్టుకొనిరి.

చకో - ఆహా ! మంచి సమయములో నంతరాయముఁ గలిగినదిగదా. తరువాత.

పూవు - మంత్రి పత్రికలవలన వారి చరిత్రముఁ దెలిసికొని యక్కడి రాజశాసనమునకు వెరచుచు దూతలకు లంచము లిచ్చియా యిరువురను నెక్కడికో రహస్యముగాఁ బంపివేసెను.

చకో - తనకు వారు చేసిన యుపకారమునకు మంత్రి ప్రత్యుపకారముఁ గావించెను. మంచిపనియే, తరువాత.

పూవు --- ప్రధాని యాపద్మనేత్ర వేశ్యాపుత్రిక యనియుఁ బెండ్లి యాడఁ దగినది కాదనియు వా రెందేనిం బోయిరనియు వారి చరిత్రము సుముఖని కెఱింగించెను.

చకో - సుముఖుఁ డంతటితోఁ జిత్తమును మరలించుకొనియెనా ?

పూవు - లేదు, లేదు. సరోజిని వేశ్యాపుత్రికయని విని మఱియుం గుందుచు వారి ననుగమించి యెందేనిం బోయెను.

చకో - అవును. కుల స్త్రీలకన్న బోగముదానలకు హావభావ లీలావేతృత్వ మధికముగా నుండును. అందులకే యా చిన్నది యంత సుందరముగా నున్నది. తరువాత.

పూవు -- తరువాత నేమి యున్నది ? అమ్మగా రా పెద్దకుమారునికొరకుఁ బరితపించుచున్నది.

చకో - అది యుచితమే. కాని ఘటదత్తుఁ డామత్తకాశినిని వలచి తీసికొని వచ్చినచోఁ జెల్లెలని ఊరిలో చెప్పెడిని. సుముఖునకు వివాహముఁ జేయుట నెట్లు సమ్మతించెను. పూవు - గడుసుప్రశ్నమే వేసితివి. వినుము. చెల్లెలని చెప్పినంగాని సుముఖుడు పెండ్లి యాడుట కనుమతింపడు. యౌవరాజ్యపట్టాభిషిక్తుండైన సుముఖుని వల్ల భునిఁ జేయుటకంటె నాధిక్య మే మున్నది ? అగ్గణికయే పట్టమహిషి యైనచోఁ దరువాత ఘటదత్తునకుం దగిన యుపకారము సేయకపోవునా ? ఇవి యన్నియు నాలోచించుకొనియే వా రట్టి వూహ్యముఁ బన్నిరి.

చకో - అదిగో ? అమ్మగారు విచారముఖముతో నిట్లే వచ్చుచున్నది. మనము పోవుదము లెమ్ము అని యిరువురు నిష్క్రమించుచున్నారు.

ఘటదత్తుడును సరోజినియు సుమేధునిచే నట్లు రాజభటులవలనఁ బట్టుబడ కుండ గాపాడఁబడి యేకాంతముగా నవ్వీఁడు వెడలి యెందేనిం బోవుచుండిరి. నడుచునప్పుడు ఘటదత్తుఁడు చెల్లెలా ? నీకు ననుకూలవరుండు లభించెనని మిగుల నానందించితిని. నీ పెండ్లి అయినచో నీ బరువు నాపైఁ దొలఁగిపోవును. దైవమంతరాయముఁ గలిగించెను. విద్వత్ప్రముఖుఁడగు నా సుముఖుఁడు మనకు నా సుముఖుఁడైనను భాగధేయము విముఖ మైనది. నీవు వేశ్యాపుత్రిక యనిన పిమ్మట నిన్ను భోగినీకళత్రముగా సుముఖుఁ డంగీకరించునని సుమేధుఁడు నాతోఁ జెప్పెను కాని నే నందుల కొప్పుకొనలేదు. పోనిమ్ము. మరియొక తెఱవాలోచించు కొందమనుటయు నా కుటిలకుంతల తల యించుక వంచుచు అన్నా ! నన్ను గురించి నీవును నంగదఁ గుడుచుచుంటివి. నా దురదృష్టదేవత నా నెత్తిపై నాట్యమాడుచుండ నీ వేమి చేయఁ గలవు ? పోనిమ్ము. నీ వెందైన‌ నుద్యోగము సంపాదించి చక్కని కన్యకం బెండ్లి యాడుము. మీ కడ వరవుడనై దేహయాత్ర నడిపికొనియెదనని పలికినది.

తల్లీ ! నీ కంతకర్మమేల వచ్చినది ? నీ విద్యకును నీ బుద్ధికిని నీ రూపమునకుం దగినవరుం బెండ్లిచేసి తీరెదను. నీ వుత్తమరాజ్యపట్టభద్రునకు మహిషివి కాఁదగిన లక్షణంబులు నీ‌ యందుఁ బొడగట్టుచున్నవి. నీవు చింతింపవలదని యూరడించెను. అట్లు వారు కొన్ని పయనంబులు నడచి యొకనాఁడు సాయంకాలమునకుఁ గమలయను పట్టణంబునకుం బోయిరి. వారు మొగంబుల కేదియో భస్మ మలందుకొనిరి. దానంజేసి వారి సౌందర్యవిశేషంబు లంతగాఁ దెల్లము కాకున్నవి. ఎఱిగిన వారైన వారింగురుతుపట్టఁ జాలరు. వా రప్పురంబున సుమతియను వర్తకుని యింట బసఁ జేసిరి. ఆ సుమతి యాత్రాపరులకు నెలవులిచ్చి యన్నసదుపాయము సేయుచుండును. అతండు పదిదినములు వారి యింటఁ బెట్టుకొని పోషించెను. ఆ వర్తకుఁడు ఘటదత్తుని వికృతరూపముఁ జూచి మొదట సామాన్యుఁ డనుకొని యపేక్షగాఁ జూచెను. నాలుగుదినములు పరిచయము గలిగి సంభాషించిన తరువాత నతనివిద్యా పరిశ్రమమునకు మిక్కిలి మెచ్చుకొనుచు నతనితోనే ముచ్చటించుచుఁ గొన్నిదినము లందుండమని‌ కోరికొనియెను.

ఘటదత్తుఁడు పగ లెల్ల నా రాజధాని నాలుగువీధులం దిరిగి వింతలంజూచి రాత్రులయందు సుమతితోఁ బురాణగాధలఁ ముచ్చటించుచుండును. ఒకనాఁడు పురీ విశేషములం దెలిసికొని వచ్చి సరోజినితో నిట్లనియె.

ఇంద్ర దత్తకథ

కుమారీ ! ఇన్నగరము విజయదేవుఁడను రాజు శర్వాణియను భార్యతోఁ బాలించుచుండెను. అతం డనపత్యుండై పది సంవత్సరములు మహేంద్రయాగంబున శచీపురందుల నారాధించి సకలలోక మోహనరూప విద్యావిశేషంబుల ననవద్య యగు పుత్రికం బడసెనట. అహా ! అతండు త్రిలోకాధిపతియగు నింద్రుని దయకుఁ బాత్రుడైనను బుత్రుంబడయలేకపోయెను. పురాకృతము ననుసరించియే వేల్పులును వరములిత్తురుగదా ? ఇంద్రదత్తయగుట నా మత్తకాశిని కింద్రదత్త యని‌యే పేరుఁబెట్టిరి. ఆ రాజపుత్రిక చిత్రఫలకము నేను చూచితిని. పుడమిఁగల రూపవతులలో నొకదానిగాఁ జెప్పవచ్చును. లావణ్యము మిగుల మెచ్చుకొనఁ దగియున్నది. నలువ యచ్చెలువమొగము తగు ప్రయత్నముతోఁ జేసినట్లు తలంచెదను. నొసటి తీరు, చెక్కులయందము, కనుల సొగసు మనసు నచ్చినవగుట నటనుండి కదలి రానిఁచ్చినవి కావు. అని యూరకఁ బొగడుచుండ నవ్వుచు నా జవ్వని యిట్లనియె.

అన్నా ! నేడు నీ నోటినుండి వింతలు వింటినిగదా? నీ వింతగా నా వాల్గంటిం బొగడుచుంటివేల ? దానిం బెండ్లి యాడవలయునని యభిలాష గలిగినదియా యేమి? సెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

దానిచరిత్రము నీవు వినలేదు. అస్థిరయౌవనులగుట మనుష్యులవది పెండ్లి యాడఁదట. కంతుఁడో వసంతుఁడో జయంతుఁడో నలకూబరుఁడో తన్ను వలచివచ్చిన పెండ్లి యాడుదునని చెప్పుచున్నదట. తనరూపమునకుఁ దనవిద్యకు మానసు లన నెంత? దేవదానవగంధర్వాదులయందును సమానులు లేరని గరువముఁ జెందుచుండు నట. తండ్రి వేయి విధంబుల భూలోక చక్రవర్తులం బెండ్లియాడుమని బ్రతిమాలినను వినక వేల్పుల నిమిత్తమై యెదురు చూచుచున్నది. అట్టి రాచపట్టిం జేపట్టుదునని నీతో నెట్లు చెప్పుదును ! అందని ఫలముల కఱ్ఱులు సాచవచ్చునా యని పలికిన నవ్వుచు సరోజిని యిట్లనియె.

అన్నా ! నీ సహోదరిబుద్ధి సామర్థ్య మెరింగి యుండియు నిట్లనవచ్చునా? నీ కట్టి కోరికయే యుండినచో నల్పకాలములో నా ప్రోయాలి నీ పాదముఁ జేర్చెదఁ జూడుము. అనవగత లోకవృత్తియగుట నమ్మగువ యట్లనుచున్నదని చెప్పిన నతం డుబ్బుచు నట్లేని నీ యిష్టము వచ్చినట్లు చేయమని యుత్తర మిచ్చె. సరోజిని యొకనాఁడు లేపన సామగ్రి సంపాదించుకొని కుంచెయు రంగులభరిణియుఁ జేతంబూని మలినాంబరధారిణియై వికృతవేషముతో నింద్రదత్త యున్న ప్రాసాదముదాపునకుం బోయి పరిచారికవలనం దనరాక రాజపుత్రిక కెరింగించెను. దాదులు చెప్పినమాట విని యాబోటి యేద ? యేదీ ? ఆ చిత్రలేఖ నిట్లు తీసికొనిరండని పరిజనులఁ దొందరపెట్టినది వారు వోయి యాయింతిం దీసికొని పోయిరి. రాజపుత్రిక యామె వికృతవేషముఁ జూచి యిసిరో ? ఈ మాత్రము దానికే నన్నింత శ్రమపెట్టితిరి. చాలుఁ జాలు దీనిరూపమే క్రియాగౌరవమును సూచింపు చున్నది. ఇఁకఁ జూడనక్కరలేదు. పంపివేయుడు. ఏమో యనుకొంటినని పలికిన సరోజిని యించుక దాపునకుఁ బోయి అమ్మా ! నే నందముగా నుండుటకు బోగము మగువను కాను. నా విద్య పరీక్షింతువని వచ్చితిని. చిత్రలేఖన విద్యలోఁ బుడమిలో నన్ను మించినవారు లేరని గరువముఁ జెందుచుంటిని. పరీక్షించి చూడుము. అని సాతిశయముగాఁ బలికిన విని యవ్వనితామణి యోహో ? నీ వంతదానవా ? అట్లయినఁ బరీక్షి౦చెదఁ గాక రమ్ము, ఈ పటంబుల వ్రాయుము. నీ ప్రజ్ఞఁ జూతుము గాక యని నొడివి తనయెదుర నిలఁబెట్టి చూచుకొనుచున్న కంతు వసంతు జయంత నలకూబరుల చిత్రఫలకముల నందిచ్చినది.

సరోజిని ముహూర్తకాలమున నా చిత్తరువుల నచ్చు గుద్దినట్లు వ్రాసి యమ్ముద్దియకుఁ జూపినది ఆ నాతివ్రాఁతశక్తికి మిక్కిలి యక్కజముఁ జెందుచు రాజపుత్రి యా చిగురుబోణి సవిమర్శముగాఁ జూచి యోసీ ? నీ మొగమున కేదియో రంగుఁ బ్రామికొనినట్లున్న దేమి ? నీ పలువరుస మిక్కి.లి చక్కగా నున్నదిగదా ? యని యడిగిన నామె అమ్మా ! రంగులు తరచు వేయుచుందుము గదా ? అది మొగమున కంటుకున్నవి కాబోలు. నాయందము జోలి నీ కేల? పోనిమ్ము. నా చేత వ్రాయించిన చిత్రఫలకము లెవ్వరివని యడిగిన నమ్ముదిత యిట్లనియె.

గీ. పాకశాసను ముద్దులపట్టి యితడు
    కంతు నెయ్యంపు సఖుఁడు వసంతుఁ డాతఁ
    డితఁడు నలకూబరుండు విత్తేశసూనుఁ
    డతఁడు మదనుండు లక్ష్మిప్రియాత్మజుండు.

వీరినే యెరుంగక చిత్రలేఖనమందు నా యంతవారు లేరని పలుకుచుంటినా? యని యాక్షేపించిన విని సరోజిని అమ్మా ! వీరి నేనెరుఁగని దానను గాను. వీరి నింత వింతగాఁ జూచుచుంటివేమి యని యడిగితిననుటయు వీ రట్లు చూడఁదగని వారా యేమి? సౌందర్యనిధులు కారా ? వీరి నెంతసేపు చూచినను దృప్తి గలుగునా యని బెద్దగాఁ బొగడఁ దొడంగినది. ఆ విషయమై వారి కిట్టి సంవాదము జరిగినది. సరోజిని - అమ్మా ! నీవు దేవతలు మనుష్యులకన్న జక్కనివారని పురాణవాఖ్యములు విని భ్రమపడుచున్నావు. అది వట్టిమాట సుమీ ?

ఇంద్రదత్త - ఓహో ! నీ వ్యవాహారంబులు కళాబాహుళ్య వేతృత్వంబు సూచింపుచున్నవి. ఏ మైనం జదివితివా ?

సరో - ఏమియు జదువక లేఖవిద్యలో నాయంతవారు లేరని గర్వపడు చందునా ?

ఇంద్ర --- ఏమి చదివితివి ?

సరో - పదునాలుగువిద్యలు కొంచెము కొంచెము తడవి చూచితిని.

ఇంద్ర -- అందులకా ? మనుష్యులకన్న దేవతలు రూపహీనులని చెప్పు చుంటివి ?

సరో -- సందియమేలా ? తారుణ్యహీనులే ? పీనుగుల కన్నులవలె ఱెప్పపాటులేక తెఱచికొని చూచుచు బొల్లి తెవులనం బోలె నొడలెల్ల తెల్లఁబడియుండ నిద్రాహారములు లేక యేకరీతినున్న వేల్పులు చూచు వారికి వెరపుఁ గలుగఁజేయక మానరు. మన పెద్దలు వారిపైగల గౌరవమునం బట్టి వికృతరూపులైనను బురాణాదుల సుందరులని వర్ణించి యుండిరి. అంతియకని వారియం దట్టి సౌందర్యము లేదు. ఇంతయేల ? మరియొక నిదర్శనముఁ జెప్పెద వినుము. దేవకన్యకలు సుందరులైన మన రాజపుత్రులం జూచి రేని స్వర్గమున వసింతురా ? అర్జునుఁ నొకసారి జూచినంతనే యూర్వశి వావి కాకున్నను మోహించిన దనమాట నీవు వినియే యుందువు. మరియు నత్తరుణి పురూరవునితోఁ బెద్దకాలము పుడమిఁగాపురము సేయలేదా ? తిలోత్తమ శుచికుఁడను సుందరుని వరించిన కథ నీవు వినకపోవచ్చును. గంథర్వరాజపుత్రి యగు మహాశ్వేతయుఁగాదంబరియు దేవతలలోఁ జక్కనివారే యైయుండినచోఁ బుండరీకుని కొరకును జంద్రాపీడును కొరకును నన్ని బాము లేలఁ బడియెదరు. అశ్వముఖులగు కిన్నరలయందము గురించి విస్తరించి చెప్పనక్కరలేదు. మరియుఁ ద్రిలోకాధిపతియగు మహేంద్రునికన్న నధికుండు లేడని నీ వొప్పు కొనక తీరదుగదా ? దేవకన్యక లందరు నతనికి వశవర్తినులై యుందురనుట యతశయోక్తికాదు. అట్టి యింద్రుం డహల్యనిమిత్తము గౌతము పంచ కోడియై వేయిగన్నులుం దెచ్చికొనిన గాథ నీవు నమ్మితివేని యిట్టి వెఱ్ఱిబూనకుందువు. తమ భార్యల కన్నఁ జక్కనిది కానిచో దమయంతిం బెండ్లియాడు తలంపుతో దిక్పతి ప్రముఖులు నలుగురు బుడమి కేమిటికి వత్తురు ? దమయంతి యింద్రాది దిక్పతుల విడచి నలుని వరించినకథ దేవతలకన్న మనుష్యులే సుందరులని వేనోళ్ళజాటి చెప్పుచుండలేదా ? రాజపుత్రీ , నీ వోపికతో వింటివేని నిట్టి నిదర్శనములు వేనవేలు సూపఁగలను.

ఇంద్ర - (విస్మయముతో) ఓహో ? నీ యుపన్యాస మప్రతిహతమై యున్నదిగదా ! వినుము. మనవారు సుందరుల వర్ణించునప్పుడు కంతుడనియు వసంతుడనియు జయంతుఁడనియు నలకూబరుఁడనియుఁ బొగడుచుందు రేమిటికి ?

సరో - తల్లీ ! వారియం దొకలోప మున్నది. నీవు గ్రహింపలేకున్నావు. వినుము. కంతు వసంత జయంతాదు లేనాఁటివారు ! అతి వృద్దులు. వెండ్రుకలు పండకున్నను రదసము లూడ కున్నను వొడలు ముడుతలు పడకున్నను జిరకాలము వారగుట నంతస్సారము చెడకమానదు. వారియందు నవనవోన్మేషము లేదు. ఎప్పుడు నొక్కరీతినే యుందురు. ఆ పురాణపురుషులు చూచుటకు వయసుకాండ్రవలెఁ గనంబడుదురు. కాని లోపల లొటార మేసుమీ ? అని యయ్యువతీరత్నము యుక్తిప్రయుక్తులచే నింద్ర దత్తకు వేల్పులయెడంగల గౌరవమంతయు బాయఁజేసినది. అవ్విషయమున నిరువురు బెద్దతడవు విద్యాప్రసంగముఁ గావించిరి. ఇంద్రదత్త యెందును సరోజినికి నుత్తరముఁ జెప్పఁజాలక విద్యలలోఁ దనకు సాటిలేరని గలిగియున్న గర్వము విడిచి‌ యప్పర్వేందు ముఖునిఁ దద్దయుం గౌరవింపుచు మానినీ ! నీ యాకృతిఁ జూచి సామాన్యురాల వనుకొంటిని. అయ్యారే? నీ సామర్థ్యమక్కజముఁ గలుగఁ జేయుచున్నది గదా ? నీ విన్నివిద్యలం జదివి యీవ్రాతపనిలో నధికురాలనని చెప్పుకొనుచుంటి వేల ? సరస్వతి నీ యెదుట మాట్టాడగలదా ? ఆహా నీ వాగ్దోరణి యెంత మాధుర్యముగా నున్నది ? అని పొగడుచుండవిని యయ్యెలనాగ యిట్లనియె.

అమ్మా ! ఆఁడుది యెంతఁజదివినను విద్వాంసురాలని చెప్పికొనఁగూడదు. ఏదియోవృత్తి గల్పించుకొని యుండవలయును. మగవారివలె సభలఁ కేగి వాదింతుమా యేమి ? యనుటయు నామెఁ నీవు పెండ్లి యాడితివా ? భర్త యెందున్న వాడు ? నీ కాపురమెచ్చట ? నీకుఁ దగినవేతన మిచ్చుచుందు నా యొద్దనుండి నీ విద్యల నేర్పెదవా ? యని యడిగిన సరోజిని యిట్లనియె

బోటీ ? నా మాటలయందు నీకు విశ్వాసముఁ గలిగినదియా ? సౌందర్యమున బృందారకులు మానవులకన్న హీనులని యొప్పుకొని యెదవా ? అట్ల యిన నీ యొద్ద నుండెదనని పలికిన నక్కలికి సంతసించుచుఁ గాంతా ! నీతోబంతములాడఁ బూనితి యేమి? పురాణములం జదువుటచే నామనసు వారియందు వ్యాపించినది. నీ మాటలచే నా యనుమానము వదలినది. అవును. దేవకన్యలు మానవుల వరించుటయు దేవా‌ధి పతులు మానవ మానవతుల వరించుటయు౦ జూడ మనుష్యులే చక్కని వారని తోచుచున్నదని యుత్తరము జెప్పినది.

ఆ మాట విని సరోజిని అమ్మా ! యిప్పుడు నీ వుపదేశార్హు రాలవైతివి. నీకిఁక గావలసిన విద్యల నేర్పెదనని పలుకుచు నీ చిత్ర ఫలకముఁ జూచితివా ? నీవేల్పు ------- పురుషునిం దొరయుదురేమో చూడుమని ఘటదత్తుని యా లేఖ్యముఁ దీసి యామె కిచ్చినది.

ఆ పద్మనేత్ర‌ యా చిత్రము నాశ్చర్యముగా జూచుచు నురముపైఁ జే యిడి కొని యేమీ ? యిది నిజముగా బ్రతిరూపమే ? కాదు. ఊరక యూహించి వ్రాసితినని తలంచెదను. బుడమి నిట్టిరూపవంతుడే కలిగినచో వేల్పు లందరు వీని పాదసేవఁ జేయఁదగినదియే ? సౌందర్యమన నిట్లుండవలయును. నీ వన్నియు దిద్ది వ్రాసితివి కావున నీ చిత్రమింత చిత్రముగా నున్నది. బ్రహ్మ సృష్టించునప్పుడు ని‌న్ను దగ్గిర నుంచుకొనినచో నిట్టి సుందరపురుషుల నిర్మించుచుందువుగదా ? యని పరిహాస మాడినది.

సరోజిని నవ్వుచుఁ దరుణీ ? నీవు విద్వాంసురాలవుగదా ? ప్రతి రూపమని చెప్పుచు నెక్కువ కల్పించి యెట్లు వ్రాయుదు ననుకొంటివి ? మనుష్యులలో నెంతెంత సుభగు లుండిరనుకొంటివి ? ఈ మహాపురుషుని చరిత్రము కడు నద్భుత మెనది. ఇట్టి దయాశాలి పుడమిలో లేడు. రూపంబునఁగాక పరాక్రమమున నితని ననన్య సామాన్యుఁడని చెప్పనోపునని పొగడుచు అమ్మా ! నేను‌ బోయివచ్చెదను ననుజ్ఞయిమ్ము. కాలాతీతమైనది. సెలవైనచో మరల రేపు వత్తునని పలుకుటయు నింద్ర దత్త యీ చిత్రఫలక మిందుండనిమ్ము. తప్పక రేపు రమ్ము. నీతోఁ గొంత ముచ్చటింపపలసిన పని‌ యున్నదని పలికెను.

సుమతి యను వర్తకుని సత్రములో బసఁ జేసితిమనియు మరల వత్తుననియుం జెప్పి సరోజిని యింటికివచ్చినది. ఘటదత్తుఁ డెదురువోయి చెల్లీ ! ఏమి జరిగినది? కనంబడినదా. మాట్లాడితివా ? అని యడుగుటయు సరోజిని అన్నా ! తొందర పడియెద వేమిటికి ? కనంబడక యెక్కడికిఁ బోవగలదు. మాట్లాడక యేమి చేయును? నీ వనినట్లు దాని రూపము త్రిలోకమోహజనకమై యున్నది. రెండుగడియలు సంభాషించి శిష్యురాలిగాఁ జేసి కొంటినని యచ్చట జరిగినకథ యంతయుం జెప్పినది‌.

అతండు ముప్పిరిగొను సంతోషముతో నెప్పుడు తెల్లవారు నప్పఁడఁతి యెప్పుడుపోవునని గడియ యుగముగా గడుపుచుండెను. మరునాఁడు మరల నత్తరలాక్షి యింద్రదత్త యొద్ద కరిగినది. అప్పుడా చిన్నది యా చిత్రఫలకము వీక్షించు చున్నది. సరోజినిం జూచి యెదురువచ్చి కరగ్రహణముఁ జేసి తోడ్తెచ్చి పీఠంబునం గూర్చుండఁబెట్టి బోఁటీ ! నాకీ మాటఁ జెప్పుము. నీ వితనిఁజూచి వ్రాసితివా ? చూచిన వారు సెప్పగా వ్రాసితివా ? నా కింకను నిట్టి చక్కని పురుషుఁ డున్నాడని నమ్మకము గలుగకున్నది. నీ వా లేఖ్య పాండిత్య మిందుఁ జూపితివని పలికిన నక్కలికి మందహాస భాసుర వదనారవిందమై యిట్ల నియె.

ఇంద్రదత్తా ! నీ కెన్నిమారులు సెప్పవలయును ? అధికముగా వ్రాయ నా కవసర మేమి వచ్చినది ? అతం డీ యూరనే యున్నఁవాడు. వావలసినం జూడవచ్చు. నావుడు మోమింత యెత్తి రెప్ప లప్పగించుచు నితం డీ వీటికి నేమిటికి వచ్చెను? ఏ దేశపు రాజకుమారుండు ? వాని పేరేమి? ఎట్లు చూచుదాననని యత్యుత్సుకముతోఁ బలికినది. అతని కులశీల వృత్తాంతంబులు నా కంతగాఁ దెలియవు. ఒక యింట నుండఁ జూచి వాని సొబగునకు మెచ్చుకొనుచు నీ చిత్రఫలకమును వ్రాసితిని. నీవు కోరితివేని దూతికాకృత్యమునిర్వర్తించుచు నీకు వానిం జూపించెదనని చెప్పినది. ఆ మాట విని యా పాటలగంధి యొక్కింత యాలోచించి సరోజినీ ! నే నెల్లుండి శుక్రవారమునాఁడు సాయంకాలమున దుర్గాదేవి యాలయంబునకు నరుదెంచి నప్పటి కిప్పురుషరత్నము నచ్చటికిం దీసికొని రాఁగలవా యని యడుగుటయు నప్పొన్నికొమ్మ ప్రయత్నించి చూచెదం గాక నాకును గ్రొత్త వాఁడు గదా యని కొంత యాసఁ గొలిపి సెలవంది‌ యింటికివచ్చి య‌త్తెరఁ గంతయు ఘటదత్తున కెరింగించినది.

అతం డత్యంత్సుకముతో నా రెండు దివసంబులును గడిపి శుక్రవారమునాఁడు మనోహరముగా నలంకరించుకొని దుర్గాలయమునకుం బోయి యింద్రదత్త రాక కెదురు చూచుచుండెను. సరోజినియు నంతకుముందే రాజపుత్రికయొద్ద కరిగినది.

ఆ పురుషసింహుఁడు గనంబడెనా ? మాటలాడితివా ? రమ్మని చెప్పితివా? యని యడిగిన నప్పడఁతియు అబ్బా ! ఇందునిమిత్త మై గ్రామమంతయుఁ దిరిగి చాల శ్రమపడితిని. ఎట్టికే నతని వెదకి పట్టుకొంటిని. అతండు సామాన్యముగా నాతోమాట్లాడునా ? మహావిద్వాంసుఁ డతనియొద్ద మర్మ ముంచి చెప్పనలవియా ? అతఁడొక మహాదేవేంద్రుని కుమారుఁడఁట. నీ యదృష్టము పండినదిలే. ఎట్లో యొప్పించితిని. నీ జవ్వనము నీ రూపము నీ విద్యలు గురించి పెద్దగాఁ గై వారముఁ జేసితిని. లెమ్ము లెమ్ము. జాగుఁ జేసితియేని యతండు మఱియెక్కడకేని‌ బోఁగలఁడని సరోజిని చెప్పినది.

ఆ మాట విని యాబోటి సంభ్రమముతో నలంకారముల వ్యత్యాసముగా ధరించుచుఁ దెలిసికొని నవ్వుచు వినిమయము సవరించుకొనుచు నద్దముఁ జూచుకొని మరియు మరియు దిద్దుకొనుచుఁ జీరయు రవికెయుఁ బలుమారు మార్చిమార్చి కట్టి కట్టి యెట్టకే నొకదినుసు సింగార మంగీకరించి జగన్మోహనాకారముతో నొయ్యారముమీర నుత్తమాశ్వంబులఁ బూన్చిన యరదంబెక్కి సరోజినితోఁగూడ నక్కోవెల కరిగినది. అప్పుడు రాజభటులు అమ్మవారిసేవకై భర్తృదారిక వచ్చినది. పురుషు లెవ్వరు నిందుండఁగూడ దవ్వలికిఁ బొండని కేకలు వైచుచు వెదకి వెదకి యందున్న వారినెల్ల వెధికి గెంటుకొనిపోయిరి.

ఘటదత్తుఁ డంతకమున్న యా యావరణములోనున్న భైరవాలయములోఁ జేరి తలుపులుఁ జేరవైచికొని విగ్రహముమ్రోల వేదికపైఁ గూర్చుండెను. ఇంద్రదత్తయు వాడుకప్రకారము పదక్షిణపూర్వకమగా గుడిలోఁ బ్రవేశించి స్తుతిపూర్వకముగా సహస్రనామార్చనఁ జేయుచుండెను. ఘటదత్తుఁడు కవాటరంధ్రమునుండి

నష్ట దా చిని ఆచి చంచర్న కరచిధిం ఎ, ఎవయంపై కా

ఇంద్రదత్తయు నట్లమ్మవారి నర్చించి ప్రసాదము స్వీకరించి సరోజిని మొగముఁ జూచుచు నికమనమేమి చేయుదమని యడుగుటయు నామె రాజపుత్రికకై దండఁగొని దేవీ ! ఆవరణ దేవతా విశేషములం జూచివత్తము రారమ్మని పలుకుచుఁ దీసికొని పోయినది. అప్పు డర్చకులను గొందరు పరిచారకులును వెంటఁ బడుటయు రాజపుత్రి వారి కందరకు దలయొక పనిఁ గల్పించి యవ్వలకుం బంపినది.

అత్త రుణు లిరువురు దేవళము చుట్టును దిరిగి యందలి విశేషంబులు చూచు చుండిరి. అప్పుడు సరోజిని దేవీ ! ఇది భైరవాలయమువలె నున్నది. ఇందు మహేశ్వరుని కుమారుం డున్నవాఁడు. ఈతని ప్రభావ మద్భుతమని లోకులు సెప్పుకొను చుందురు. ఈ బలశాలిం జూడక పోయితిమేని దలచినపని నెరవేరదు. చూతము రమ్మని పలుకుచు నక్కలికిచేయి పట్టుకొని గుడితలుపులు తెరచికొని లోపలికిఁ దీసికొని పోయినది. కంతు వసంత జయంతాదుల సోయగము మించి ప్రకాశించుచున్న యా వన్నెకానిం జూచి యా చిగురుబోణి సిగ్గున కగ్గమగు మనసుతో నిలువంబడి యేమి చేయుటకుం దోచక యపాంగ విలోకనముల నతనిం జూచుచు సాత్విక వికారంబులు మేనం బొడసూప మోహవివశయై యేదియో ధ్యానించు చుండెను.

అంతలో నామెను వెదకికొనుచు బరిచారిక లచ్చటికి వచ్చుచుండుటయు జూచి ద్వారదేశమున నిలువంబడి యున్న సరోజిని యింద్రదత్త కత్తెరగు సూచించినది. ఆమెయు నేమియు మాటాడక దేవునికై తెచ్చిన పుష్పదామం బా ఘటదత్తుని కంఠమునవై చి నమస్కరించుచు నీవలకు వచ్చినది. పరిజనులు అమ్మా ! నేడింత జాగుచేసితి వేమిటికి ? వేళ మిగిలినది. ఎరుంగవా ? పోవుదము రమ్మని పలుకుచు నరదము చెంతకుఁ బోయిరి.

రాజపుత్రిక స్యందన మెక్కుచు సరోజినీ ! రేపు వేగము రావలయుం జుమీ ? నీతోఁ బెక్కులు చెప్పవలసి యున్నవని పలుకుచు రధాధిరోహణముఁ గావించి యంతఃపురమున కరిగినది. సరోజినియుఁ ధిరుగ భైరవాలయముదాపునకుం బోయి అన్నా ! ఘటదత్త చీకటి పడుచుచున్నది. పోదము రమ్ము. రాజపుత్రిక యింటి కరిగినదని పిలుచుటయు నతం డతికష్టమున నింద్రదత్తాయత్తమైన చిత్తమును మరలించుకొని యీ వలకు వచ్చి చెల్లీ ! తరువాత నా చిన్నది యేమన్నది ? యనుమతించినదియా ? యని యడిగిన నమ్మగువ నవ్వుచు నేమన్నదియు నీ మెడలోని విరి దండ నడుగుము. అంతయు నదియే చెప్పఁ గలదని యుత్తరముఁ జెప్పినది. పరమ సంతోషముతో వారు నెలవునకుం బోయిరి. మరునాఁ డచ్చేడియ యింద్రదత్త మేడకుం బోయి మేనంబులక లుద్భవిల్ల నా చిత్రఫలకమే చూచుచున్న రాచకన్నియం గాంచి వెరగుపాటుతో నెదుర నిలువం బడినది. పెద్దతడ‌ నమ్ముద్దియ వచ్చినది యెరుగక రాజపుత్రి తన యెదుట ప్రకటించుచు నప్పటంబుఁ గౌగిఁటం జేర్చి ముద్దు పెట్టుకొనుచు సరోజినిం గాంచి సిగ్గుపడుచు దిగ్గునలేచి చిత్రపటము దాచి యోహో ? దొంగ లాగున యెప్పుడు వచ్చితివి? పల్కరించితివి కావేమని యడిగిన సరోజిని దేవీ! నీ వెద్దియో ముందిడుకొని యభిలాషతోఁ జూచుచుంటివి. నీ యానందమున కంతరాయమగునని మాటాడితినికాను. మిగిలిన దేమియున్నదని పలుకుచు నవ్వినది.

రాజపుత్రీ ? న న్నెక్కసము లాడుటకా ? ఇట్లు వచ్చితివి. పోనిమ్ము నీవు సకలవిద్యా పారంగతురాలవు. నీ యాలోచన సమంజసమై యుండును ఈ పురుషసింహుఁడు నా కనుకూలుఁడని నీకుం దోచినదా ? వీనిం బెండ్లి యాడుమనియెదవా? కులము రూపము విద్యయు మా త్రము వెదకవలసియున్నది. ఈ మూఁడును వీనియం దసాధారణములై యున్నవని నీవ చెప్పితివిగదా ? ధనముతో నాకు నిమిత్తము లేదు. మా తండ్రి రాజ్యమున కాతఁడే నేతయగు నేమి చెప్పెదవని యడిగిన నప్పఁడతి ముసిముసి నగవుతో నిట్లనియె.

తరణీ ! నన్నడిగియే నీ వాతనిమెడలోఁ పూవుదండ వైచితివా యేమి? చేసినపనికి వితర్కము లేమిటికి ? ఇప్పుడు నే వలదన్న మానెదవా ? ప్రత్యక్షముగా నాతనిం జూచితివిగదా ? ఇప్పుడైన నా చిత్రపఠము సత్యమని యొప్పొకొనియెదవా? యని యడిగిన నయ్యువిదచేతులు జోడించి సరోజినీ ! యిదిగో నీకు వందనము లర్పించుచున్న దాన. నీవు వ్రాసిన దంతయు యదధార్థము. అచ్చు గుద్దినట్లే యున్నది. సంతోషమైనది. ఇఁక దాచనేల? తరువాతిపనిగూడ నీవే చేయవలసియున్నది. మా తల్లిదండ్రులతో నాకు నేనై చెప్పుట కులపారికాధర్మము కాదుగదా? ఈ తూరి వారు నన్నుఁ బెండ్లికిఁ బ్రోత్సాహపరచినప్పు డితని వృత్తాంతముఁ జెప్పి యొప్పించెద నంతదనుక నా వీరుఁ డీయూరనుండునట్లు చేయుమిదియె నీవు నాకుఁ జేయదగిన యుపకారమని కోరినది.

సరోజిని దేవీ ! నీ దృష్టిగళంబు నిలతనిపాదంబులకుఁ దగిలికొన్నవి. ఎక్కడికిఁ బోఁగలడు. ఇందే యుండునని యుత్తరము చెప్పి యింతలో వేళ యగుటయు నామె యనుజ్ఞఁ బుచ్చికొని యింటికి వచ్చినది. మొగంబున విన్నదనంబుదోప నేదియో యాలోచించుచున్న ఘటదత్తునింజూచి అన్నా ! నీ‌ మొగ మిట్లున్నదేమి ? నీకు వివాహము నిశ్చయించితిని. నీ కంటె రాజపుత్రిక కెక్కుడు తొందరగా నున్నది ఇఁక పదిదినములకు నీవే యా దేశమునకు రాజగుదువని పలుకుటయుం దలయూచుచు నతండు నిట్టూర్పు నిగుడించి యిట్లనియె

చెలీ ! మన కింకను మంచిదినములు రాలేదు విధివ్యతిరేకుఁడైయుండ మన ప్రయత్నములు కొనసాగునా ? వినుము. కాళిందీపురమునుండి మనల వెదకుచు వేగురు రాజభటు లీపట్టణమున కరుదెంచిరి. వేశ్యాపుత్రికం దీసికొని దొంగ యొకఁడు పారిపోయి వచ్చెను. పట్టియిచ్చినవారికిఁ బారితోషిక మిప్పింతుమని వీధులఁ జాటింపుచున్నారు. నీవు వేశ్యవనియు నేనే దొంగననియు నీ యూరఁ దెలిసినచో మనగౌరవమునకుఁ భంగము కాగలదు. ఈ కళంక మెట్లు పాపికొందుమో తెలియదు. రాజపుత్రిక కీమాట తెలిసెనేని నీచులుగాఁ దలంపక మానదు. కావున మన యపయళంబు వెల్లడి కాకమున్న యిన్న గరమునుండి దాటిపోవుటయే కర్జము. ఇందులకు నీ వేమని యెదవని యడిగిన నప్పడఁతి ముక్కు పై వ్రేలిడికొని యౌరా ! ఒట్టు పెట్టినట్టీ రాజకింకరులు మనతోడన వచ్చి శుభకార్యములకు విఘ్నముఁ జేయు చున్నవారు అయ్యో ? పదిదినములు దాటిన నీవు చక్రవర్తి వగుదువు. మనము చెప్పకయే యరిగితిమేని‌ రాజపుత్రిక మిక్కిలి పరితపించగలదు. చెప్పిన సమ్మతింపదు. నిజముఁ చెప్పితిమేని‌ గార్యమున కే హాని రాఁగలదు. ఎట్లయిన నిప్పు డిక్కడనుండి యెక్కడికేనిం బోవుటయే మేలు. రాజభటులకుఁ జిక్కితిమేని జిక్కు రాక మానదని పలికినది అది తెరవని తలంచి యిరువురు నాటి వేకువజామున సుమతితో నైనఁ జెప్పక యప్పురము విడిచి యొక యడివిమార్గంబునంబడి నడచుచుండిరి.

అప్పుడు ఘటదత్తుఁడు సరోజినీ ! మనపురాకృతము కడు విపరీతమైనది సుమీ ? ఇరువురకు సిద్ధమైన వివాహములు చెడిపోయినవి. అహ ? కాలమహిమ. ఎంతకాల మిట్లు పారిపోవుచుందుము. మన విద్యామహిమలకు వినియోగ మేమి ? భూచక్రమంతయు నేలుటకు నీ బుద్దిబల మొక్కటి చాలదా ? ఇట్టి దానవు నాతో నడవుల వెంబడి తిరుగుచు నిడుములం గుడుచుచుంటివి. ఇంతకన్న నద్భుత మేదియైనం గలదా ? మరిఁయు బరదారలఁదల్లులగతి బరద్రవ్యంబుం లోష్టముల చందంబునం జూచు నాకు దొంగయనియు జారుఁడనియు నిందఁ గలుగఁజేసిన భగవంతుని యెత్తికో లేమియో తెలియదు. వేగురు వచ్చిననుగృపాణపాణినై యెదురుకొని పరిభవంపఁగల బలము నాకుఁ గలిగియున్నను బిరికివానివలె వెఱచి పారిపోవుచుంటి. ఇది యేమి కర్మమో తెలియదని విచారించుటయు వారించుచు నమ్మించుబోణి‌ యిట్లనియె.

అన్నా ! నీవు ప్రాజ్ఞుండవయ్యుఁ గడగండ్లఁ జెందియున్న కతంబున వివేకము మరచితివి. మనమనగ నెంతవారము. హరిశ్చద్రాదులు పడిన యిడుము లెవ్వరైనం గుడిచిరా ? కాల మెల్లకాల మొకరీతి నుండదు. మంచిసమయము రాకపోవదు. అని యూరడించినది. ఆ రీతిఁ బోయిపోయి వా రొకనాఁడు మిట్టమధ్యాహ్న మొక వటవృక్షమునీడఁ బండుకొని గమనాయాసము వాయ దమ చరిత్రమే చెప్పుకొనుచుండిరి. అప్పుడా మ్రానికొమ్మలపై దాగియున్న నూర్వురు వీరభటులు వారిమాటలు విని వీఁడే యా గజదొంగ వేశ్యాపుత్రికను వెంటఁ బెట్టుకొని తిరుగుచున్నాడు. పట్టుడు పట్టుడని పలుకుచు నేల కురికి నలుమూలలు నాదరించిరి. అప్పు డతం డదరిపడి లేచి సరోజిని కపాయము రాకుండ నుపాయ మరయుచు నెట్లో యతిలాఘవంబున నయ్యంబుజనేత్ర నవ్వలకు దాటించి మించిన పౌరుషముతో దండజరుచుచు రండు రండు. మీ కందరకుఁ గాలంబు మూడినది. నిరపరాధుల మమ్ముఁ బట్టికొనఁబూనిరని పలుకుచు నెదురుకొనుటయు రాజభటు లిట్లనిరి.

తులువా ? నీవు రాజువలెవచ్చి బోగముదాని మచ్చ మాపుటయె కాక కూతుంగూడ నెత్తికొని - పోయితివి నీ నిమిత్తమై పుడమి యెల్లడం గాలించుచున్నారము. మా యెకిమీడు నిన్నుఁ బట్టికొని తీసికొని వచ్చినవానికి‌ మూడుగ్రామములు కట్టన మిత్తునని ప్రకటించియన్నాఁడు నీవు మా బారిఁ బడితివి. పోనీయమని పలుకుచు నందరు నొక్కట వచ్చి యతనిం జుట్టుకొనిరి.

నిరాయుధుండైనను హస్తపదతాడనంబుల నవ్వీరుండు వారిలో ముప్పది గుండ్రజముప్రోలి కనిపెను మిగిలినవారు పౌరుషము మీరఁ గలియఁబడి యెట్టకే నతనిం బట్టికొని కరపాదంబులకు నిగళంబులు తగిలించి సరోజినిజాడ యేమియుం దెలిసికొనఁజాలక నతనితోఁ గూడ గాళిందీపురాభిముఖులై యరుగుచుండిరి.

అని యెరిగించువరకుఁ బ్రయాణసమయ మగుటయు జాలించి తదనంతర వృత్తాంత మా తపోధనుం డవ్వలిమజిలీయం దిట్లు చెప్పుచుండెను.

ఎనుబది ఎనమిదవ మజిలీ

ఇంద్రదత్త - సఖీ ! మురళీ ! సురకుమారులపై నా మనసు మరలినది నేనొక సుందరపురుషుని వరంచితిని. నీకు జెప్పకున్న గోపింతువు గదా ?

ముర - ఎట్టెట్టూ ? నీవు వరింపదగిన పుణ్యశాలి యెందుండి వచ్చెను. అతని పేరేమి ? ఎప్పుడు వరించితివి ? మాకు రవ్వంతయు దెలిసినది కాదే? ఆతం డిపు డెం దున్నవాఁడు ?

ఇంద్ర - సరోజినియను లేఖకురాలీ సంబంధము మొన్న నే పొసగించినది. వానిపేరు ఘటదత్తుఁడు. ఇప్పుడీవీటనే యున్నాఁడు.

ముర - నెలవెరింగింతువేనిఁ బోయిచూచి యానందింతుముగా ?

ఇంద్ర - వానియునికి నాకుఁ దెలియదు. సరోజిని సుమతియను వర్తకునిసత్రములో బసచేసి యున్నది. దానిం గలసికొనిన నంతయుం జెప్పఁగలదు.

ముర - అతం డేదేశపు రాజకుమారుండో యడుగలేదా ? అట్టి యుదారండు మనవీటిలో బసఁజేసిన వెల్లడి కాకుండునా ? వానిరూప మెట్లున్నది ?

ఇంద్ర - వాని చిత్రపట మిదిగో చూడుము. నీకునుం దెలియఁగలదు.

ముర ‌- (నాశ్చర్యముగాఁజాచుచు) నిక్క ముగా నిట్లున్నవాఁడా ?

ఇంద్ర - ఇంతకన్న నొకవన్నెవాసిగానే యున్నవాఁడు? సందియమున్నఁ బోయి చూచి రమ్ము.

ముర - ఈ శుభవార్త నమ్మగా రెరుఁగుదురా ?