Jump to content

కాశీమజిలీకథలు/ఆరవ భాగము/84వ మజిలీ

వికీసోర్స్ నుండి

వట్టిగోల ఏకర్మము నెరుఁగదు. చెప్పినం దెలిసికొనఁ జాలదు. మందారవల్లి గట్టి మందు పెట్టినది. దాని వలలోఁ జిక్కినది. మనమేమి చేయుదుము పోనిండు ప్రసవ‌ మక్కడనే కానిండు. మే యిరువురు కూడ నుందురు గదా? మీకంటె నాప్తులెవ్వరు ? లోపమేమియుఁ గలుగదు. కాని మరియొక లాఘవము మనకుఁ గలుగఁ గలదు. అది మీరు లెస్సగా నాలోచింపుడని కొన్ని రహస్య వచనంబు లుపదేశించుటయు మంజరిక యించుక వితర్కించి అమ్మా ? మొదటినుండియు మనము ప్రయోగించు కపట క్రియలన్నియు మనకే తగులుచున్నవి. ఊరకఁ యొరుల కపకారము సేయుట నీతి కాదని పలికిన మంజరికను వారించుచుఁ బల్లవిక యిట్ల నియె.

పుత్రీ ! పిల్లదానవు. దివాణపు చర్యలు నీవేమి యెరుంగుదువు. అంతఃపురకాంతలు సంత తికై యెంతెంత లేసి పనులఁ గావింతురో పలుక శక్యమా ? పుణ్యపాప వివక్షతతోఁ బనిలేదు. సాగునది యాలోచింపవలయును. ఇప్పుడమ్మగారు సెప్పిన మాట గూఢముగా మనకు జేయకతీరదు. మన భర్తృదారిక పుత్రునే చక్రవర్తిగా నాచరింపవలయును. ఇందులకుఁ బ్రతికూలము సెప్పక యుపాయ మాలోచింపుమని పలుకుచుఁ గళానిలయకుఁ సంతోషముఁ గలుగఁ జేసినది. మంజరికయు వారి మాటల కెదురాడ వెరిచి యట్లుచేయుట కొడంబడినది. పిమ్మట నిరువురు గళావతితోఁ గూడఁ గుముద్వతీ నగరమున కరిగిరి.

అని యెరిగించి మణిసిద్దుండు ప్రొద్దు మిగలుటయు నవ్వలి వృత్తాంతము తరువాతి మజిలీయందుఁ జెప్పఁ దొడంగెను.

ఎనుబది నాలుగవ మజిలీ.

ఘటదత్తుని కథ

అన్నన్నా ! భగవంతుడు సర్వసముండని వాడుకయేకాని యంత పక్షపాతి యెవ్వడును లేడు. నా తోడికోఁడలికి గడుపునిండఁ బిల్ల లనిచ్చి నాకొక్క బిడ్డనైన నీయకపోయెనే. నే నేమి యపకారముఁ జేసితిని. కావలసినంత భాగ్యమిచ్చినవాఁడీ యుపకార మేమిటికి జేయఁగూడదు? అన్నిప్రక్రియలు కావించితిని దేనివలనం బ్రయోజనము లేక పోయినది. యోగిని చెప్పినపని కడమగా నున్నయది. అప్పని యాడువాండ్రు చేయుట కష్టము. అర్దరాత్రమున శ్మశానభూమి కేగి స్నానముఁజేసి కాలుచున్న కుణపము నారిపి తత్కపాలచూర్ణమును దానిచ్చిన మంత్ర భస్మముతో గలిపి తినమని చెప్పినది. రాత్రి కాటిమాఁట దలపెట్టినంతనే మేను ఝల్లుమనును. పీనుగను జూచినఁ బ్రాణములు నిలుచునా> పోనిమ్ము. నావంటిది బ్రతికియున్న నేమిలాభము? గుండెరాయిఁ జేసికొని యిప్పనియుం గావించి చూచెదం గాక నేఁడు పర్వదినంబుగదా? మృతయైనం గావలయు నక్షిమతమైనం దీరవలయును. అని కుముద్వితీ నగరంబున శారదయను బ్రాహ్మణపత్ని యాలోచించుకొనుచు నొకనాడు నడిరేయి నొరులెఱుంగకుండ నిల్లు వెడలి మెల్లగ నగడ్త ప్రక్కనున్న ------ భూమికిం బోయినది.

సీ. సగము బూడిచిన పీనుగుల నీడిచికొని
            పోవు నక్కల ఘోషముల కులుకక
    చిభిచెంతఁ బోవుచో శిభి పెరేల్లని ప్రేలి
            ఏడుకపాలముల చప్పుడుల బెదర
    కడుగు జారిన గోతఁబడి మేనుదుస్సిన
            శవముల జేతుల నవలఁద్రోచి
    యతిభీమ భూతాట్టహాస నిస్వనముల
            కోసరిల్ల క చెవుల్మూసికొనుచు

గ. చరణములుఁ గ్రూచ్చికొను గీకసములఁ బెరికి
    తెరువెరుంగుచుఁ జితివహ్ని తేజమునను
    గుణపదాహకులకుఁ గొంత కొంకుచచట
    దిరిగె నొక కొంత సేపు భూసురవధూటి.

అట్లు తిరిగి తిరిగి వెర పుడిపికొని తెగువ నప్పడఁతి యప్పరిఘా జలంబున మునింగి యొ‌డలెల్ల బసపుఁ బూసికొని తల విరియఁబోసికొని మండుచున్న యొక కాఁటినికటంబునకుం బోయినది. అందుఁ గూర్చున్న శవదాహనకు లామెంజూచి దయ్యమనుకొని వెరపు జెందుచుఁ దల యొక దెసకుం బారిపోయిరి. అప్పుడా శారద యా చిత్రగ్నిఁ జల్లార్చు తెర వరయుచు నలుమూలలు సూచుచుండ నొక దండ నుండి శిరంబున ఘటం బిడికొని యొక యాఁడుది వచ్చుచుండెను.

దాని నెత్తిపై నున్న కడవ లాగికొను తలంపుతో నెదురుగాఁబోయి యది బెదరునట్లు గాండ్రుమని యరచినది. ఆ పడఁతి యడలిపోయి గడగడ వడంకుచు గడవ నేలపైఁ బారవిడిచి వెనుక తిరుఁగక కాలికొలఁది పరువెట్టినది. ఘటము శకలము లగుటయు నందుండి యొక శిశువు నేలంబడి యేడువఁ దొడంగెను. శారద దాపునకుఁబోయి చూచి యా బాలు నెత్తికొని కాటివెల్తురున వాని లక్షణములు బరీక్షించినది. చేరలకు మీరిన కన్నులు, వెడద యరము, ముద్దుమోము నద్భుత తేజముం గలిగి త్రిజగన్మోహన రూపమునం బ్రకాశించు నా పాపనిం జూచి యాశ్చర్య సాగర కల్లోలముల నోలలాడుచు ఆహా ! ఏమి యీ విచిత్రము. అర్దరాత్రమున నీకాంత యేకాంతముగా ఘటంబున నీ డింభకు నిడికొని రానేల? త బాలుండు మృతుం డయ్యెనని తలంచి యచ్చటికిఁ దీసికొని వచ్చినదా ? అవును. ఆ మాటయే నిక్కువము కావచ్చును. యోగినీ కధిత నియమమునకు మెచ్చి దైవము వీనిం బ్రతికించి నాకిచ్చెనన తోచుచున్నది. వీడు దేవతానుగ్రహముననే నాకు లభించెను. నా నియమముని కిదియే ఫలము. కడుపునం బుట్టినవాఁ డింతకంటె నధికుండా యేమి? ఏశ్రమయు లేక లభించెను. వీనిం బెంచుకొని కృతార్దురాల నగుదునని యెంతేని సంతసముతో నా బాలు నెత్తికొని ముద్దాడుచు నతిరయంబున నింటికి జని భర్తనులేపి యా పాపంజూపుచు జరిగిన వృత్తాంత మంతయుం జెప్పినది.

ఆ బ్రాహ్మణుఁ డపరిమితానందముఁ జెందుచు నా రహస్యము వెల్లడింపక‌ నప్పుడే భార్యను బుట్టినింటి కనిపి శారద గర్భవతియైనదని ప్రధ గలిగించి తరువాత బుత్రుఁడుదయించెనని వాడుకఁ బుట్టించి కొన్ని మాసములు చనిన పిమ్మటఁ గుమారునితోఁ గూడ భార్య నా పురము దీసికొనివచ్చెను. వానికి ఘటదత్తుఁడనిపేరు పెట్టెను. చక్రవర్తిలక్షణ లక్షితుండఁగు నాబ్రాహ్మణపుత్రుం జూచి‌ జనులు శారద కావించిన పూర్వసుకృతమును గొనుయాడుచుండిరి. ఘటదత్తుని తల్లి తండ్రులు ప్రాణములలోఁ బెట్టుకొని పెంచుచుండిరి. అయిదేండ్ల ప్రాయము వచ్చినది మొదలు వానికిఁ దండ్రి విద్యాభ్యాసము చేయించుచుండెను. తదీయకళాగ్రహణ సామర్ద్యము జూచి యా డింభకుని గారణజన్మునిగాఁ దలంచుచుఁ దండ్రి తగు నుపాధ్యాయుల నియమించి పదియేండ్ల వయసు వచ్చువరకు బహు విద్యలయందుఁ బాండిత్యముఁ గలుగఁ జేసెను. పదియేండ్లలోపల నుపనీతుఁడై యద్భుత విద్యారూప సంపన్నుండై న ఘటదత్తుని ప్రఖ్యాతి లోకులవలన విని వసుంధరుఁ డొకనాఁడు తండ్రితోఁ గూడ నా బాలుని దన యాస్థానమునకు రప్పించుకొని వాని విద్యలం బరీక్షించి వెరగుపడుచు నిట్లు దలంచెను.

అన్ననా! ఇట్టి రూపము విద్యాబుద్దులు తేజంబుఁ గలిగిన బాలుని జక్రవర్తికిఁ బుట్టింపక పేదపారునింటఁ బుట్టించిన బ్రహ్మకంటె నిందాపాత్రుఁ డెవ్వఁడు కలఁడు. కటకటా! ఇరువురు భార్యలు గర్భవతులైనను నాకిట్టి సంతానమును బడయు యోగ్యత లేకపోయినదిగదా? అని యించుక విచారించుచు నతనిఁదొడలపై నిడుకొని ముద్దు పెట్టుకొనుచు అప్పా! నీకుఁ గడమ విద్యలన్నియు నేను చెప్పెద. నా యొద్దఁ జదివెదవా యని యడిగిన నమ్మాణవకుండు భక్తి విశ్వాసములతోఁ జదివెదనను‌ గ్రహింపుఁడని యుత్తరముఁ జెప్పెను. వసుంధరుఁ డదిమొదలు ఘటదత్తుని కుపాధ్యాయుండై తాను గ్రహించిన విద్యలన్నియుం జెప్పుచుండెను. మఱియు నాయుదసాధనము, అశ్వారోహణకౌశలము లోనగు వ్యాయామవిద్యలుకూడ నేర్చించుచుండెను. అయిదారేఁడులలో నతం డఖిలవిద్యా పారంగతుఁడై వసుంధరునికే తప్పులుదిద్దఁ బ్రారంభించెను.

వసుంధరుడు వాని బుద్ధిబలమున కెంతేని వెరగుపడుచు ననుదిన వర్ధమాన ప్రేమలతాదోహల హృదయాల వాలుండై యతనినిఁ బ్రధానమంత్రిగాఁ జేసికొని సంతతము రాజ్యాంగ విషయముల నతనితో ముచ్చటించుచుండెను పెక్కులేల? వసుంధరు డతనిజూడక గడియయైన నోపలేడు, ఆహారశయ్యా విహారాదిక వ్యాపారములు రాజు మందిరములోనే చేయునట్లు నియమించెను. ఒకనాఁడు వాని నంతఃపురమునకుఁ దీసికొనిపోయి యిరువురు భార్యలకుంజూపి తదీయగుణ గౌరవముల స్తుతిపూర్వకముగా వక్కాణించెను. వానిం జూచి కళావతి కన్నీరు నించినది. కౌముది తలయూచుచు నించుక మందహాసముఁ గావించినది. ఆ రెండు చిహ్నమును చూచి వసుంధరుఁడు శంకాకళంకిత స్వాంతుఁడై మరియొకప్పుడు కళావతిం జూచి నాఁడు నీవు ఘటదత్తుం జూచి కన్నీరు దెచ్చుకుంటి వేమిటికని యడిగిన నప్పడఁతి యిట్లనియె.

నాధా! నాఁడు నా కానుపట్లు చెడినది. కానిచో నీపాటి కింత ప్రాయముగల కమారుం డుండునుగదా? ఇట్టి కుమారుండే మన కుండిన మీరెట్టి యానంద మనుభవింతురో? సమాదానపరిచయముననే యింత మురియుచున్నారని వెనుకటి కథ జ్ఞాపకము వచ్చుటచేఁ గన్నీరు నించితిని. ఇంతకన్న వేరొక కారణము లేదని చెప్పినది తరువాతఁ బ్రత్యేకము కౌముదిం బిలిచి నీవా ఘటదత్తుంజూచి తల యూచుచు నవ్వితివేల? నిక్కము జెప్పుమని యడిగిన నాచతుర యిట్లనియె

దేవా ! దేవరవారు సకల విద్యాపారంగతులు వసుంధరాధురంధరులై యున్నారు. ఇట్టివారు మమ్మల్వ విషయములకు శంకించిన నేమి చెప్పఁగలము? ఎట్టి హితుండైను దరుణవయస్కుండైన రూపవంతు నంతఃపురమునకు క్షత్రియుం డెన్నఁడును దీసికొని వచ్చుటకు సమ్మతింపఁడు. బ్రాహణప్రభువులు గావున మీరిట్టిపని చేసితిరని నవ్వు వచ్చినది. మరియుం దదీయరూప వైభవము లో సేచనకములై యున్నవి కావున విస్మయముఁ జెంది తల యూచితిని. ఇదియే కారణమని చెప్పిన విని యతం డసూయాగ్రస్తమానసుండై యిట్లు తలంచెను.

ఔరా ! నన్నీ రాచపట్టి యెట్టి యాక్షేపణఁ జేసినది. అవును. వయసువాని నంతఃపురమునకుఁ దీసికొనిపోవుట నాదియేతప్పు. స్త్రీహృదయ మతి చంచలమని యెరింగియు వెర్రిపని చేసితిని. అతి సుందరుండైన పరపురుషనిఁ జూచినప్పు డెట్టి యువతికిని మనసు వ్యభిచరింపక మానదు. నా శాస్త్రపరిశ్రమ యంతయు నిష్పలముఁ జేసితిని. మత్తకాశినిని విత్తముంబోలె నొరులవలన నపాయము నొందకుండఁ గాపాడుకొనుచుండ వలయునని యార్యులు సెప్పియున్నారు. ఆ మాట మరచి పుత్రతుల్యుండు గదాయని తీసికొని పోయితిని వీనియందుఁ గౌముదిడెందముఁ దగిలికొనినది. సందియములేదు. చూపుల చాపల్యమే తద్వికారముఁ దెలియఁ జేసినది. మాటలలోఁ గూడ నట్టి తొణకు తేటపడుచున్నది. కానిమ్ము. మరియొకసారి పరీక్షంచి కర్తవ్యమాలోచించెదంగాక యని నిశ్చయించి నాటంగోలె నంతర మరయుచుండెను.

మరి యొకనాఁడు వసుంధరుఁడు రాయల వారియొద్ద కరుగవలసిన పని వచ్చుటయుఁ గౌముది నందుంచి కళావతిని మాత్రముఁ తీసికొనిపోవుచు ఘటదత్తునిఁ గూడ రమ్మని పయనముఁ జేసెను. అతండు మొదట నంగీకరించి ప్రయాణ సమయ మునకు దైవికముగా శూలనొప్పి వచ్చుటచే నక్కారణముఁ జెప్పి యప్పుడు వారితో నావీటి కరుగుట మానివేసెను.

వసుంధరుఁడు సముచితపరివార సమేతముగా రాయలవారియొద్ద కరిగి యన్నరపతిచే నర్చితుండై పదిదివసంబు అప్పురంబున వసించి మరల నింటికి వచ్చెను. మరునా డతండు పండుకొనుతల్బంబు తలవైపు యొక పత్రిక గ్రుచ్చఁబడి యున్నది. అది యేమియో యని చదువుటయు నందిట్లున్నది.

మహారాజా ! సకలకళారహస్యవేదివయ్యును రూపవంతుఁడైన ఘటదత్తు నంతఃపురమునకుఁ దీసికొని పోయితివి. శుద్దాంతమునకుఁ బోతుటీగనైన క్షత్రియులు పోవనిత్తురా ? అదియే ప్రమాదము జరిగినది. ఘటదత్తుఁడు కపటవ్యాధిఁ గల్పించుకొని మీతో మొన్నరాక పోవుటకుఁ గారణ మూహించుకొన వలయును. మీరు లేనప్పుడు డతండు నగరికి వచ్చుట తప్పు. అతండు మీయంతవాఁడై యుండ నతనిఁ గాదను వా రెవ్వరు? మీ కత్యంతాప్తుఁడ గావున మీ క్షేమముఁగోరి యిట్లు వ్రాసితిని. తప్పులు మన్నింప వలయును. అట్టి యుత్తరముఁ జదివికొని వసుంధరుఁ డసమాన క్రోధ వివశ మానసుండై కటంబులదర దంతంబులు పటపటం గొరుకుచు నౌరా ? దురాత్మా ? ఘటదత్త? ఎంత కృతఘ్నుండవైతివి. ఇందులకా నీవు నాతో వత్తునని ప్రయాణమై మిషఁబన్ని మానితివి యౌవన మదము యుక్తా యుక్త వివేకము నిలువనీయదు. బ్రాహ్మణుడవై పోతివికాని లేనిచో నిప్పడే నీ శిరంబు నూరువ్రక్కలు సేయింపకపోదునా. అని యనేక ప్రకారముల ఘటదత్తుని నిందించుచుఁ గాలసర్పము భంగి బుస్సురని నిట్టూర్చు నిగుడించుచు శయ్యఁ బొరలుచుఁ గత్తిఁ దీసి మంచము డిగ్గనురికి యంతలో విమర్శించుకొని మరల నయ్యసివరలో నమర్చుచు నీ రీతి రాత్రియల్ల నుల్లము వ్యాకులమంద నిద్రఁజెందక యనేక‌ యూహలు కావించుచుండెను. అంతలోఁ దెల్లవారినది. వాడుక ప్రకారము ఘటదత్తుఁడు వసుంధరుఁడు పండుకొన్న గదిలోనికి వచ్చి యతండు లేవ కుండుటకు శంకించుకొనుచు మెల్ల గా మంచము దాపునకుం బోయి మహారాజా ! నేఁడు సూర్యోదయమైనను లేవకుంటివేమి ? నిత్యకృత్యముల కవసరము మిగులదా యని యడిగిన నతని ధ్వని విని సంవర్తసమయ నిర్ఘాతగర్భ దుర్భరాభ్రఘోషంబు వోలే బొబ్బవెట్టి ఛీ ? ఛీ ? గురుద్రోహీ ? నీ మొగము చూడరాదు. నీవు మహా పాపాత్ముండవు. ఈ క్షణము నా గృహమునుండి నా పురమునుండి నా దేశమునుండి లేచి పోవలయును. అట్లు చేయవేని గడియలో నీ తలఁ గోటగుమ్మమునఁ గట్టఁ యిత్తు. ఇదియే ముమ్మాటికి నాజ్ఞ. అని పలికి పెడమోమువెట్టి యా మంచమునఁ బండుకొనియె.

అప్పుడు ఘటదత్తుఁడు మే నెల్ల నీరై చెమ్మటలుగ్రమ్మ మ్రాన్పడి చేతన నిలుబడి మేను గడగడ వడంక నే మాటయు బలుకుటకు నోరురాక యొక్కింతసేపు నిలువంబడి చిరాలున మరలి లోపలికినిబోక నగరువెడలి రాజమార్గముంబడి ఎక్కడికో పోవుచుండెను. అప్పుడు రాజభటులు తొందరపడుచుఁ బాదుకలుగొనియు ఛత్రములు పట్టియు వాహనములఁ దీసికొనివచ్చియు వెంటఁబడిరి. ఓహో ! మంత్రిగారెక్కొడికో పాదచారులై పోవుచున్నారు. అనుసరించి యేగవలయునని కొందరు సామంతులు వెన్నంటి కలిసికొనిరి. మరికొంద రాయుధముల ధరించి తోడపోయిరి. కొందరు తూర్య నినాదములు మ్రోయించిరి. కొంద రెదురుపడి నమస్కరించిరి. కొందరు దీవించిరి. ఇట్లు కనంబడినవారెల్ల నతని మన్నించుచుండ నందరిని హాస్తసంజ్ఞచే వారించుచునే వావానము నెక్కక యెవ్వరిందోడ రానీక యెవ్వరితో మాటాడక నొక్కరుండ యొక దారింబడి నడచుచుఁ గ్రమంబున నగరంబు దాటి, తోట లతిక్రమించి క్రీడాగిరులు గడచి విశాచావిష్టుండు వోలె నొండుచూడక తలవంచికొని యూరక నడచుచు మహారణ్యములోఁ బ్రవేశించెను.

మిట్ట మధ్యాహ్నముదనుక క్షుత్పిపాసల గణింపక యట్లు నడచుచు నతండు పెద్దదూరము పోయి తీవ్రాతపసంతాప ప్రతాపితప్రతీతుండై యలయిక జనింప నడువలేక నొక చెట్టునీడం‌ జతికిలంబడి యిట్లుఁ జింతించెను. ఆహా ! దురదృష్ట దేవత నా కెంతలోఁ బ్రసన్నమైనది. నేఁటి యుదయముదనుక మహారాజ్య వైభవమనుభంచి గడియలోఁ బరమ నిర్భాగ్యుండనై పోతినిగదా ? అమ్మహారాజు నన్నుఁ బుత్రుండువోలె గారవించుచు శిష్యుండట్లు మన్నించుచు మిత్రుని పగిది నాచరించుచు గరుణారస తరంగితములగు చూపులు నాపైఁ బరగించుచుఁ నుల్లంబునం గలయక్కటికంబు వెల్లడించు చల్లనిమాటల నా కాహ్లాదము గలిగించువాఁడు. ఆ దయాశాలి నోటినుండి యెట్టి పరుషాక్షరములు వింటిని. అయ్యో ? నన్నుఁ బొమ్మన్నప్పుడు దేవా ! నేనేమి నేరముఁ జేసితిని. నా యపరాధము నిరూపించి తగినకిక్ష విధింపుమని చేయిఁ బట్టుకొని యడుగక యూరక పందవలెఁ బరుగిడి వచ్చితిని. ఇంత మూర్ఖుఁ డెందైనం గలఁడా ? అక్కటా ? నన్నొక థీవసము చూడక మిక్కిలి పరితపించు తలిదండ్రులకై నఁ జెప్పివచ్చితిని కానేమి? హా ? జగదీశ్వరా ! నా కసమాన విద్యా రూప వైభవముల నిచ్చి నచ్చి యిప్పు డధోగతిం బొందించితివిగదా ? ఎట్లయినను గరుణా సాగరుండగు నా వసుంధరునకు నాయెడ నేదియో యనుమానముఁ గలిగినది. అక్కళంకము వాయఁజేయ నిన్నుఁ బ్రార్ధించుచున్నవాఁడ. అయ్యో ? తలఁచికొన్న నా డెందము పగిలిపోవుచున్నది ఆ ? ఏమి ? నిజముగా నేనీ యరణ్యమునకు వచ్చితినా ? లేదు లేదు. ఇది స్వప్నము. ఓ పాడుస్వప్నమా ! వేగము నన్ను వదలిపొమ్ము. మరల నమ్మహారాజునొద్ద కరుగవలయును. అక్కటా ! ఎక్కడిరాజు ? అతని వేడిమాటలం దలంచికొని నేడుపు వచ్చుచున్నది. నా కిది యెక్కడి స్వప్నము. జీవితాంత మీ యాతనాశరీరము ధరించి పరలోకమున కరుగుచున్నవాడనని యనేక ప్రకారముల దుఃఖించుచు మూర్చాలసవివశ మానసుండై యొడ లెరుంగక నేలం బడియుండెను.

అని యెరింగించి యవ్వలికథ మరల నతం డిట్లని‌ చెప్పందొడంగెను.