కాశీమజిలీకథలు/ఆరవ భాగము/80వ మజిలీ
ఎనుబదియవ మజిలీ
వీర సేనుని కథ
అయ్యో ? పురోహితుండనని యించుకయుఁ గనికరింపక నాకుఁ గూడ ద్వీపాంతరశిక్ష విధించినది. రాజపుత్రిక యెంత కఠినాత్మురాలు. అక్కటా ? ఇఁక నీ జన్మమునకు జన్మభూమిఁజూచు భాగ్యమునాకు లభింపదు కాబోలు. అన్నన్నా పెండ్లి యనిన నలంకరించుకొని పోయితినిగాని యీ యిక్కట్టుఁ దెలిసికొననైతిని. మా తల్లి తో నైన జెప్పుట కవకాశ మిచ్చినదికాదు. మా యుసురు కాంతిసేన కెప్పుడు తగులునో ? యని శంతనుఁడు దుఃఖింపుచుండఁ గరభ శరభు లోదార్చుచు నిట్లనిరి.
శంతనా ! నీకేమి కొఱంత వచ్చినది. పంచాంగముఁ జెప్పుకొని యెక్కడ బ్రతుకలేక లేవు ? మా మాటఁజెప్పుము. అలోకసామాన్యములైన విద్యలు రెండును కోలుపోయి రెక్కలు విరిగిన పక్షులవలెఁ బడిపోయితిమి. ఆ విద్యలే మాచేతిలో నుండిన నీ ద్వీపముఁ బాలింపకపోవుదుమా ఇంతకును నీ వంతకు నంతఃకలహములు కారణములు పోనిమ్ము. బ్రాహ్మణులముగదా? ముష్టిఎత్తుకొని బ్రతుకుదముగాక. చింతించిఁ బ్రయోజనములేదు. అదీగో ? అల్లంతదూరములో నేదియో పల్లె కనంబడుచున్నది. పోవుదము పదుఁము. అని ధైర్యముఁ గరిపిరి.
మువ్వురును గలసి యా జనపదంబున కరిగిరి. అందున్న వారందరు గిరాతులుఁ వారి చర్యలు, కడు క్రూరములు. ఒకప్పుడు మనుష్యులనే తినుచుందురు. సముద్రములో వలలం బన్ని చేపలం బట్టి జీవింతురు. మిట్టమధ్యాహ్న మగుడు వీరు దాహ మిమ్మని యొకయింటికిం బోయి యడిగిరి. వీరిమాట లంతగాఁ దెలియకున్నన్ను సజ్ఞలవలన గ్రహించి యా యింటి యజమానురాలు పాలు తెచ్చి యిచ్చినది. వా రా దుగ్దంబులంగ్రోలి యాకలి యడంచుకొనిరి పిమ్మట నాగేస్తురాలు వెలయిమ్మని యడిగినది. తనియొద్ద నేమియు లేకపోవుటచే దయా పూర్వకముగా విడువమని ప్రార్దించిరి. కాని యది యనుమతించినది కాదు.
ఏదియో మిషఁ బన్ని వారొక్క రొక్కురుగా నవ్వలకు దాటిరి. అప్పుడు యింటి యజమానుఁడువచ్చి వారి వెదకి పట్టుకొని న్యాయసభకుఁ దీసికొనిపోయి వారి యపరాధ మెరింగించెను. అధికారి వారియొద్ద నేమియును లేకపోవుట విమర్శించి విడిచివేసెను. అది కారణముగా నా పల్లె లోని ప్రజలు రెండు తెగలై కలహింపఁ దొడంగిరి. ఆ కలహములు క్రమంబున యుద్దములై యొకరినొకరు చంపుకొన మొదలు పెట్టిరి.
ఆ సంగర వృత్తాంతముఁ దెలిసికొని యా కుళద్వీపాధిపతి కుళధ్వజుండు దండనాధులఁ బనిచి వారి నెల్లఁ బట్టి తీసికొని రమ్మని నియమించెను. ఆ సేనాధి పతులు సేనలతో వచ్చి యిరుదెగలవారిం బట్టుకొని యా బ్రాహ్మణులతోఁగూడ గుశధ్వజునొద్దకుఁ దీసికొనిపోయిరి.
కుశధ్వజుండు వారినెల్ల మందలించి యనిపి యా విప్రకుమారుల మువ్వురం జేరఁజీరి మీ రెవ్వరు ? ఏదేశము? ఈ దీవి కేమిటికి వచ్చితిరి? నిజముఁ జెప్పుడని యడిగిన శంతనుఁ డిట్లనియె. దేవా! మాది జంబూ ద్వీపము. మేము బ్రాహ్మణులము. నేను రాజ పురోహితుండను. వీ రిరువురు నింద్రజాలము పకారయప్రవేశవిద్యల నెక్కడనో యుపదేశముఁ బొంది మా వీఁడు వచ్చిరి. రాజపుత్రిక కపటముఁజేసి యా విద్యలు లాగికొని యిక్కడికిఁ బంపినది. వీరికి విహితుండని నన్నుఁగూడ దేశమునకుఁ బాపినది. తండ్రీ ! ఇదియే నిజము. నిరపరాధులమైన బ్రాహ్మణులకు బాథఁ గలుగజేసిన పాపమునకు ఫలం బనుభవింపక పోవదు. అని తమ కథయంతయు నెరింగించెను.
దయాహృదయుండగు నాదయితుండు వారి మొఱలువిని వెఱవకుడని యభయహస్త మిచ్చి వీరసేనుండను తన కుమారుని రప్పించి పుత్రా ! వీరి చరిత్రమును వింటివా కాంతిసేనయను రాజపుత్రిక పెండ్లి యాడెదనని చెప్పి వీరి విద్యల లాగికొని శిక్షించినదఁట. ఇట్టి యన్యాయ మెందైనం గలదా ? బ్రహ్మాణుల హరించినఁ గులనాశనము కాదా ? నీవు మహేంద్రజాల విద్యా పారంగతుండవు. కావున నీ కడ దాని మాయలు సాగవు. వీరిని వెంటఁ బెట్టుకొని పోయి యా రాచపట్టిని మందలించి వీరి విద్యల వీరి కిప్పింపుము అని యాజ్ఞాపించెను.
వారివలన వీరసేనుం డారాజకుమారి చారిత్రమంతయు విని యబ్బుచు నప్పుడే తగుపరివారముతోఁ బురివెడలి కరభ శరభ శంతనులు తన్నాశ్రయించుకొని రా నోడయెక్కి సముద్రముదాటి జంబూద్వీపముఁజేరి క్రమంబునఁ గొన్ని సమయములకు నానగర వరంబుఁ జేరెను.
మహేంద్రజాలవిద్యాపాటవంబున నా వీటికి రెండుయోజనములు దూరములో నోక యద్యానవనముఁ గల్పించుకొని అందు మహేంద్ర భవనవిభవ విరాజమానంబగు ప్రాసాదరాజంబున వసియించి యా రాజపుత్రుఁడు పట్టణమర్మంబులం దెలిసికొనిరండని గూఢముగాఁ గింకరుల నియమించెను. కరభ శరభ శంతనులు గడ్డములు పెంచికొని యోగులవలె నందుఁ గూర్చుండి జపముఁ జేసికొనుచుండిరి.
కాంతిసేన చారులవలన నా యుద్యానవన వృత్తాంతమునువిని వెరగుపడుచు నవ్విశేషములం దెలిసికొని రమ్మని కేసరణి నంపినది. ఆ పరిచారిక వినీతవేషముతోఁజని యవ్వనమంతయుం దిఱుగుచు నొకచోటఁ గరభ శరభ శంతనులంగాంచి గురుతుపట్టి యోహో ? మా పురోహితులు కాబోలు. సేమముగానున్నారా ? యని నమస్కరించినది. అప్పుడు శంతనుఁడు కన్నులెత్తి చూచుచు నోసీ ? మేము పురోహితులమో ? అహితులమో తెలిసికొందువుగానిలే. తొందరపడకుము. ఇది యింద్రజాలముకాదు. మహేంద్రజాలము. కాంతిసేనం గాచికొమ్మని చెప్పుము. అని మీసములు దువ్వుచు పలికన విని యక్కలికి లేతనవ్వుమొగమున మొలగ లెత్త బావా ! నీ వింతకోపము సేసిన నెట్లునిలువఁగలము. రాజపుత్రిక తొందరపడి నీ కపకారముఁ జేసినమాట వాస్తవమే. ఇప్పుడే పశ్చాత్తాపముఁ జెందుచున్నది. నిన్ను రప్పింపవలయునని ప్రయత్నము చేయుచున్నది. ఈవన మెక్కడిది ? ఈతఁడెవ్వఁడు? ఈతండు మహేంద్రజాలవిద్యానిపుణుండా యేమి? నిజముజెప్పుమని యడిగిన శంతనుం డిట్లనియె.
కేసరిణీ ! రాజపుత్రిక నా విషయమై పశ్చాత్తాపముఁ జెందుచున్నదిగదా కానిమ్ము. యీతఁడు కుశద్వీపాధిపతి కుమారుఁడు. వీరసేనుఁడు రూపంబున మన్మధుని మించినవాఁడు. మహేంద్రజాల మీతనిచేతిలో నున్నది. మీ రాజపుత్రిక కల్పనలేమియు నిందు సాగవు. బుద్ధి కలిగిన నా మాటలు వినుము. మా విద్యలు మా కిచ్చి య చ్చిగురుబోణి నీ రాజపుత్రిని బెండ్లియాడమని చెప్పుము. అట్లయిన నే కొఱంతయు నుండదు. లేనిచో మీ రాజ్యము నధీనము జేసికొందుము. అని వీరావేశముతో నుడివెను.
ఆ మాటలు వినియు వినిపించుకొన నట్లభినయించుచుఁ గేసరిణి మెల్లన వీరసేనుఁడున్న మేడకుఁ బోయినది. అతండు దానిం జూచి నీవెవ్వతెవు ? ఏమి వచ్చితివని యడిగిన నది నమస్క_రించుచు దేవా! నేను గాంతిసేన పరిచారికను. నా పేరు కేసరిణియండ్రు. మా రాజపుత్రిక మీ రాక విని సంతసించుచు నన్ను మీకడ కంపినది. మీరే మాకుఁ బూజ్యులుగదా ! యని పలికిన మందహాసముఁ జేయుచు నతం డిట్లనియె.
కేసరిణీ ! మీ రాజపుత్రిక విప్రస్వములు హరియించిన దఁటకాదా ? అట్టిపాతకుల పూజ మేమంగీకరింపము. కరభ శరభ శంతనులు మమ్ము శరణుఁ జొచ్చిరి. సామమున వారిసొత్తు వారికిచ్చిన లెస్సయే ! లేకున్న బలాబలములు చూచు కొందము. నీవు పోయి నామాటగాఁ జెప్పుమని పలికిన నక్కలికి యిట్లనియె.
మీరు వారు సెప్పినమాటలే విని మా రాజపుత్రికపై నలుగుచున్నారు. ఆమె కడు నుత్తమురాలు. వీరిలో నొకఁడు కుమ్మరియు నిరువురు పంచాగము చెప్పెడి బ్రాహ్మణులు. ఇట్టివారు పెండ్లియాడమని నిర్భంధించిన
| రత్నము రాజులమొద్దనే యుంపంపగినటి.. 1; యళ్య-కువకంటి ఎ వంటి సుందరపుకుః ఫలనుపిలి యాపేడపాజలుల వరింపండగినవా ? ఇది చక్కగా నాటీచంది పం, కాజప్పుతిక ముప్పుదు. తగల. నరయుకున్నం స్తం టరే భర్డలు తభగలరు, ౧-౧: మ్య మాలలు తా న. గలుగ జేసినది.
అట్రిపొత ఆ మాటలువిని యతండు కానిమ్ము. చూతముగాఁ బోయి చెప్పుమని పలికి లోపలికిం బోయెను. అప్పు డాకేసరిణిపోయి రాజపుత్రితో నంతయుం జెప్పినది. కాంతిసేన మరునాడు సఖులతో నఱిగి యా రాజపుత్రుని మేడ కనతిదూరములో నొక యుపవనము గల్పించి యందుఁ బుష్పాపచయముఁ జేయుచుండెను.
ఆ వనముఁ జూచి రాజపుత్రుఁడు, యింద్రజాలకల్పితమని నిశ్చయించి మహేంద్రజాల విద్యాపాటవంబున జంఝామారుతంబు నుఱుములు మెఱుములు గలిపి పిడుగులు పడియెడు వర్షంబును గలుగజేసి ముహూర్తకాలములోఁ గాంతిసేన నిర్మించిన వనమును నాశనము నొందించెను. అప్పుడాచిన్నది మరల మాయఁబన్ని అనేకక్రూరసత్వములచే భయంకరమై యొప్పుకాంతారము సృష్టిఁజేసినది. అందలి మృగంబుల సూచి శంతనాదులు గంతులువైవఁ దొడంగిరి.
ఓహో ? వెరవకుఁడని పలుకుచు నా మృగములకుఁ బ్రతిమృగములఁ గల్పించుచు నల్పకాలములో వానినెల్ల నంతము నొందించెను. అప్పుడు రాజపుత్రిక తనమాయ నిలువకుండుటకు జింతించుచు అన్నన్నా ఒకదివసమెల్ల లోకుల మోహింపఁజేయు నామాయ గడియయైన నిలువకున్నది. అతఁడు రచించిన వనము చెక్కుచెదరక ప్రకాశించుచున్నది. ఎప్పటికప్పుడే నేనొక్కరితను మిగులుచుంటిని. మహేంద్రజాలము నాచే భేదింప శక్యముగాకున్నది. వీని నెట్టు జయించుదాననని యాలోచించుచు మరియు ననేకమాయలు కల్పించి వారిని మోహపెట్టినది. కాని వాని నెల్లఁ బ్రతిమాయలచే నతఁడు రూపు మాపఁజేసెను.
రాహువిముక్తయగు చంద్రరేఖవోలె మాయావిముక్తయై ప్రకాశించుచున్న కాంతిసేనుఁడు మార వికార దూషిత స్వాంతుండై తదాకారచేష్టావిలాస విభ్రమంబుల సంభ్రమముతో నుపలక్షించుచు నొండెరుంగక తన్మయత్వము నొందెను స్త్రీమాయ యెల్ల మాయలకు మీరినదికదా ?
వీరసేనుఁడు మేడనుండి తన్న సాభిలాషగాఁ జూచుచున్నాడుగదా యని తెలిసికొని కాంతిసేన విలాసముల నభివ్యక్తము సేయుచు నందలమెక్కి సఖులతో నింటికిబోయినది. పిమ్మటఁగేసరిణి రాజపుత్రునొద్ద కరిగి నమస్కరించినది. అతండు దానింజూచి చిగరుబోణీ! మీ దేవి నాతో మాటాడక యింటికిఁ బోయినదేమి ? నిన్ననేమా చెప్పితివే ? నా సామర్ధ్యముఁజూచినదిగద ! మెచ్చి కొన్నదియా ? ఏమన్నదియో చెప్పుము. ఇందుగూర్చుండుము. నీ సఖురాలు మంచి చక్కనిదే ? యేమో యనుకొంటిని. అని అడిగినమాటయే యడుగుచుఁ జెప్పినమాటయే చెప్పుచు నున్మత్తవికారము సూచించెను. అప్పుడు కేసరిణి యతనిఁ తమవలలోఁ బడినవానిగాఁ దలంచుచు ముసిముసి నగవుతో దేవా! మా రాజపుత్రిక మొదటనే యోడిపోయితినని చెప్పమన్నది. మీ సామర్థ్య -------------- ? మెచ్చుకొనుట మిమ్ము పెద్దగా స్తుతియించినది మిమ్ము భర్తగా వరించినది. ఇక మీ యొద్ద దాచనేల ? ఆమె జవ్వనము రూపము సాద్గుణ్యము నొందుట మీ రంగీకరించిన నప్పుడుగదా ? అని అత్యంత చాతుర్యముగాఁ బొగడుటయు నతం డుబ్బుచు నిట్లనియె.
కేసరిణీ ! కాంతిసేన యందరివలె నన్ను మోసముఁజేయలేదు గదా ? ఇంతకుముందు పెక్కండ్ర నిట్లే పెండ్లి యాడెదననిచెప్పి బద్దులం గావించినదట. నిజముఁ జెప్పుమనుటయు నది దేవా ! మనోహరాకారముగల దేవరను వరించుటకంటె భాగ్య మేమియున్నది. అది యెవ్వరినో పెండ్లి యాడవలసినదియేకదా ? వంచకుల వంచించినను దోసములేదు. కోరఁదగినరత్నము వడిలోఁ బడుచుండ త్రోసివేయు వెంగలి యెందైనం గలఁదా ? మీ కిట్టి సందియము కలుగరాదని మోహం బొదవించెను.
సరే అట్లయిన మేమంగీకరించితిమి. ఆమె కిష్టమున్నట్లు నీవే చెప్పుచుంటివిగదా ? ఇఁక జాగుసేయ నేమిటికి ? ముహూర్తము నిశ్చయింపుమని చెప్పు చుండఁగఁ గరభ శరభ శంతనులు వచ్చి దేవా! ఇదియేమి పాపము? మా కోరికలు తీర్పకయే పెండ్లి నిశ్చయించుకొనుచున్నా రేల ? మీరును దానిమాయలోఁ బడిపోవుచున్నారు. సుఁడీ యని పలికిన నతఁ డిట్లనియె.
మీ కే కొఱంతయు రానీయను. పెండ్లి యాడిన వెనుక నది మనకు విధేయురాలై యుండక తీరదుగదా ? అప్పుడు దానితోఁ జెప్పి యొప్పించి మీ విద్యలు మీ కిప్పింతు. మీరు చింతింపకుఁ డని యోదార్చెను. అప్పుడు కేసరిణి జనాంతికముగా రాజపుత్రా ! గాంధర్వ వివాహంబునకు విథినియమంబులులేవు. నీవు రేపు ప్రొద్దుట నిక్కడికి దక్షిణముగానున్న పూఁదోటకు రమ్ము. అందు మీ యిరువురు గలసికొని మాట్లాడికొందురుగాక యని జెప్పి యొప్పించి చేతిలోఁ జేయి వైపించుకొని గురుతులు చెప్పి యప్పొలఁతి కాంతిసేనయొద్ద కరిగి జరిగిన కధయుం జెప్పినది.
మరునాఁ డరుణోదయమునఁ గాంతిసేన నిద్రజాలంబున నొక పూఁదోటఁ గల్పించి యం దనల్పశిల్పాకల్పభాసమానంబై జయంతకల్పంబగు సౌధంబువిరాజిల్లం జేసి నిజప్రతిబింబంబోయన నొప్పారు నొప్పులకుప్ప నప్పూఁదోట విహరించునట్టు జాలముపన్నెను. దానిననుసరించి కేసరిణి తిరుగుచుండెను. ఇంతలో రాజకుమారుఁడు దివ్యమణి భూషాంబరంబుల దాల్చి యొయ్యారముగా నా పుష్పవనంబున కరుదెంచెను.
కేసరిణి యెదురువచ్చి యర్ఘ్యపాద్యాదివిధులు నిర్వర్తించి నివాళులిచ్చి యొక గద్దియంగూర్చుండబెట్టెను. ఇంతలో నా మయావతి యరుదెంచినది. అమ్మించుబోణిం జూచి యతండు మోహపరవశుండై యది ------- స్వప్నమో నిజమో తెలిసికొనలేకపోయెను. అప్పుడు కేసరిణి యా మాయావతిచే నొకపూదండ నతనిమెడలో వేయించినది. అతండు పరవశుండై యా చంద్రముఖి పాణిగ్రహణముఁ గావించెను. అట్లు కేసరిణి వారికి మాయావివహాహముఁగావించి యిద్దరి నేకశయ్యాగతులం గావించి వాకిట కరిగినది. అప్పుడతండు మోహాతిశయంబున -
సీ. లలితహారముల చిక్కులుదీర్చు నెపమున
గులుకుగుబ్బలకుఁ జేతులు దగుల్చు
జిరిచెమ్మటలుఁ దుడిచెడి కైతపంబున
నిద్దంపు చెక్కులు ముద్దునెట్టు
నవల రేగినశయ్య సవరించు నెపమున
గదిసియొయ్యనఁ బ్రీతి గౌఁగఁలించు
నెరికురు ల్ముడివైచు నెపమున దరిఁజేరి
గిలిగిలింతలువెట్టి కేరఁజేయు
గీ. తెలువఁ గీలంటి వాతెర తేనెఁగ్రోలు
నళుకు దీరంగ నఖరచిహ్నములనాటు
సురటిఁ గైకొనివీఁచు సుందరముఁజూచుఁ
జేతిబంధంబు సడలించు సిగ్గుతోడ.
అట్లు మోహపరవశుండై యారాజపుత్రుండు రతిక్రీడ కుద్యోగించుటయు నక్కలకంఠికుంఠీభూతాలాభిష యై యతని యుత్కంఠ కంతరాయముఁ గలుగజేయు చుండెను. అది యెరింగి అతఁడు మదవతీ ! కొదువ యేమున్నది. వెనుతీసెద వేమిటికి ? నీ యభిలాషయెద్దియేనిం గలిగిన నుడువు మనుటయు నక్కుటిలాలక యలతినగవు మొుగమున మొలకలెత్త నభినవచిత్తజా ! మా కోరికలం దెలిసి తేలిక పడనేల ? తప్పక తీర్తునంటివేని వక్కాణించెదనని పలికినది.
ఆ మాట విని యతండు స్మారవికారంబున మైకముజెందియున్న కతంబున నొడ లెరుంగక ఆహా ? సుందరీ ? ఇందులకు నీ డెందమున సందియ మేల గలుగవలయును. నా ధనము నీ ధనము కాదా? కోరు మేదియైన నిచ్చెదనని యొత్తిపలికిన నక్కలికి యిట్లనియె.
గీ. ఓమహేంద్ర నందనోపమపరరూప
యా మహేంద్రజాల మన్మదీయ
కామితంబుఁ దీరఁ గౌతుకం బేపార
థార వోయుమయ్య థర్మబుద్ధి.
అని కోరుటయు నతం డొం డెరుఁగ కున్నవాఁడు కావున మరుమాట పలుకక యిదిగో యిచ్చుచున్న వాఁడ. నీరుఁ దెచ్చుకొమ్మని పలికినంత కంతకుమున్ను యాప్రాంతమందు వేచియున్న కాంతిసేన తన శాంబరీపాటవంబున మాయావతిని నీరుదేర నీవలకు రప్పించి తానత్తోయంబుఁ గైకొని యతనియొద్దకుఁబోయి ధారవోయుమని యడిగిన నతం డించుకయు సంశయింపక నా మహేంద్రజాల మా లల నకు జలధారాపూర్వకముగా నిచ్చివేసెను.
కాంతిసేన అప్పుడేయాజాల ముపసంహరించినది. పుష్పవచనము పొధము నంతరించినవి. రాజపుత్రుండు తెల తెల్లపోవుచు నలుదిక్కులు సూచుచున్నంత నంతకుఁ బూర్వమక్కాంతిసేనచే రప్పించియుంచిన రాజభటు లతనిం బట్టుకొని రెక్కలు గట్టి కరభ శరభ శంతనులతోఁగూడ జెఱసాలం బెట్టిరి.
అప్పుడు రాజపుత్రుఁడు అయ్యో ? అయ్యో ? ఎంతమోసముఁ జెందితిని. అది యింద్రజాలమని యించుకయు విచారింపక చెల్లించితినిగదా ? అన్నన్నా ! అది మాయావతియని యెరింగినచో నాకాంతిసేనను గొప్పుఁపట్టి యీడ్చుకొని పోకపోయితినా ? ఆహా ? యేమి నామోహము ? చేత దీప ముండియుఁ జీకటిలోఁ బడిపోయితిని. భార్యయైనదిగదాయని యావిద్య యిచ్చితిని. శంతనా! నీ మాట వింటిని కాను నీ వని నట్లే చేసినది. ఇప్పుడేమి చేయదము. కోరలు తీసిన పాముల మైతిమి. మా తండ్రి కీవార్తఁ జెప్పువారెవ్వరు ? మాకు స్నేహితులు టక్కరిటమారియని యిరువురు దొంగలు కలరు. వారికడ నీమాయ లేమియు నుపయోగింపవు. వారు వచ్చిన మనల విడిపింపఁగలరని దుఃఖించుచున్న వీర సేను నూరడించుచు శంతనుఁ డిట్లనియె.
మిత్రమా ! పాపము నీవు మా నిమిత్తమువచ్చి యాపత్తునొందితివి. పుడమిలో దానిం జయించువారు లేరు. నీతో మేమన్ని యుంజెప్పిన దాని వలలోఁబడి నిక్షేపమువంటి విద్యఁగోలుపోయి వచ్చితివి. నీ టక్కరి టమారీలు వచ్చినను వారి అబ్బలు వచ్చినను నాబింబోకవతిని మోసపుచ్చలేరు. ఇఁక దానిజోలికిఁ బోవద్దు. మనమీ చెఱసాలనుండి తప్పించుకొనిపోవు నుపాయ మరయుము. మన దారిని మనము పోవుదము. మరియు మీ తండ్రికీవార్త దెలియక మానదు. కొందరు మీ పరిచారికులా తోటలోఁ గలరు. వారింబట్టుకొన లేదు. వారుపోయి చెప్పుదురు. అని యాలోచించుకొనుచు నందుఁ గొన్ని దినంబులుండిరి.
అని యెరిగించి అతండవ్వలి కథ మరల నిట్లు చెప్పదొడంగెను.