కాశీమజిలీకథలు/ఆరవ భాగము/79వ మజిలీ
కొనియెద నిందులకు నీవు చింతిల్ల వద్దని కాంతిసేన తల్లికి బోధించినది. అని యెరింగించి కాలాతీతమైనంత నవ్వలి వృత్తాంత మ య్యతిపతి తదనంతరావ సంథంబున నిట్లుజెప్పఁ దొడంగెను.
డెబ్బది తొమ్మిదవ మజిలీ
కాంతి సేన కథ
శంతనా ! నీ వింత మతిహీనుఁడ వై తివేమిఁ కాంతిసేనను గరభునకుఁ నిశ్చయింప నీ వేల యూరకుంటివి? నీవు బ్రాహ్మణుండవుగావా ? బానపాత్రుండవుగావా ? ఈ ఫలము చిరకాలమునుండి యాశ్రయించుకొనియున్న నీ వనుభవింపక మొన్న వచ్చిన కరభున కేలఁ గట్టిపెట్టు చుంటివి. అతఁ డెవ్వఁడు ? నీకంటె విద్వాంసుడాఁ సొగసుకాఁడా ? మీ యిరువురకు నేమైన సాంకేతికమున్నదా ? రాజ పుత్రికకు వానియందిష్టములేదఁట. నిన్నీ విషయమడిగి రమ్మన్నదని కేసరిణి యను పరివారిక యొకనాడు నడి తెఱవులో నిలువంబెట్టి శంతను నడిగినది.
ఆ మాటవిని శంతనుండు కేసరిణీ ! నీ వన్నమాట సత్యమే ? రాజునకు నాయం దాదరము కలిగియున్నది. నా మాట నే నతనియొద్ద నుడువుటలెస్సగాదు గదా? కరభుం డింద్రజాలవిద్య నెరింగిన కతంబునఁ దత్ప్రభావంబున రాజును వంచించుచున్నాము. నీవు నా కాప్తురాలవు కావున జెప్పుచుంటి. ఎవ్వరితో ననవద్దు. ఆ యింద్రజాలము నా కిచ్చునట్లును వానికిఁ గాంతిసేనను బెండ్లిఁ జేయునట్లును మే మిరువురము శపధములు చేసికొంటిమి. దానంజేసి వానికిచ్చునట్లు నిశ్చయించితి నని యా రహస్యము లన్నియుఁ దెలియపరచెను.
అప్పడతి అయ్యో ? వెఱ్ఱిపారుఁడా ? రాజవైభవముకన్న నింద్రజాల మెక్కువదియా ? తొందరపడి వారికిఁ బెండ్లి చేయింపకుము. మరి రెండు దినములు గడుపుము. నీవే పెండ్లియాడునట్లు చేసెదనని యేమేమో బోధించి యతని దన చుట్టును దిరుగునట్లు చేసినది.
మఱియొకప్పుడు కరభుఁ డంతఃపురమున కరుగుచుండఁ జూచి కేసరిణి అడ్డముగా నిలువంబడి నమస్కరింపుచు దేవా ! నీవు నన్నెరఁగవు. రాజపుత్రిక సఖురాలను. కేసరిణి యండ్రు. నీవు భర్తృదారికను పాణిగ్రహణముఁ జేయ నిశ్చయించినట్లు తెలిసినది. ఆమె నీతోఁ గొన్ని రహస్య వచనములు చెప్పి రమ్మన్నది. వినుము. మీ యొద్ద నద్భుతమైన యింద్రజాలవిద్య యున్నదట. ఆ విద్య శంతనున కీయ నిశ్చయించితివని తెలిసినది. ఎవ్వరికి నీయ వద్దన్నది. నీ కంత మొగమాటమేనిఁ దనయొద్ద దాచమన్నది. అని యుక్తి యుక్తముగాఁ జెప్పి వాని వలలోఁ బడవేసినది. అతండా మాటవిని యుప్పొంగుచు నోహో ? నా కింతకన్న భాగ్యమే మున్నది ? ఆమె నిమిత్తమే యీ విద్య శంతనున కీయఁ దలంచుకొంటిని. ఆమె వలదన్నపని చేయుదునా ? నా యర్ధ శరీరము కాదా ? ఇష్టమైనచో నిప్పుడే ఆ విధ్య యామె కిచ్చుచున్న వాఁడ. పోయి చెప్పుమని పలుకుటయు నతనివెంటఁ బెట్టుకొని యప్పుడే యప్పూబోడి కాంతిసేనవద్దకుఁ దీసికొనిపోయి యా విద్య యా చిన్నదాని చేతిలో ధారవోయించినది.
అది మొదలు కరభ శంతను లిరువురు నొకరికిఁ దెలియకుండ నొకరు శుద్ధాంతమునకు వచ్చి కేసరిణితో ముచ్చటించి పోవుచుందురు. ఒకనాఁడు రాజు శంతనునితోనే డా యుద్యానవనమునకుఁ బోవలయుననిచెప్ప నతండు కరభుని వెనుకటిజాలము పన్నుమని నియోగించెను. కరభుఁడు కేసరిణీముఖంబున రాజపుత్రికకుఁ దెలియజేయుటయు నా తరుణి యతి మనోహరముగా నా జాలముఁ బ్రయోగించిన కరభ శంతనులకు మరికొన్ని యుపాయములు చెప్పి పంపినది.
శంతనుఁడు వాడుకప్రకారము రాజుందీసికొని యా తోట కరిగెను. కరభుఁడు రహస్యముగా వారి వెంటఁ బోయెను. ఆ మాయావతి నాడు శృంగారలీలల వేనవేలు ప్రకటించుచు రాజును మోహసముద్రములో ముంచినది. అతండు తమినిలుపలేకఁ దన్నుఁ బెండ్లి యాడుమని నిర్భందించుచు జాలములో వరించిన చిన్నదానికేలు పట్టుకొనియెను.
అప్పుడా చిన్నది మనోహరా ! నాకొక నిక్షేపము కలదు. చిరకాలము నియమముఁబూని దాని సంపాదించుకొంటిని. ఈ బాలుఁ డదియున్న తా వెరుఁగును. వీడు హఠాత్తుగా మృతినొందెను. వీనితో మూడుమాట లాడవలసియున్నది. దీనిం బ్రతికించి మాటాడింతువేని నిన్నిప్పుడే పెండ్లిఁ చేసికొనియెదనని మోహోద్రేకములైన పలుకులు పలుకుచు నతనికి వలపు బలియ జేసినది. అతం డిదియెంత పనియని పలుకుచు నప్పుడు తన దేహము వేరొకచక్కి దాచి యా చిన్నది చూపిన బాలశవములో బ్రవేశించి నన్ను నీవేమి యడిగెదవని నుడివెను. ఆయ్యవకాశము గ్రహించి కరభుఁడు వెదకి రాజశరీరమును రెండు ఖండములుగా నరికి యవ్వలికిఁ బారిపోయెను.
శంతనుఁడు అయ్యో ! అయ్యో ! రాజు నెవ్వఁడో వధియించెను. చచ్చి పడియున్నవాఁడని పలుకుచు నీవలకువచ్చెను శరభుఁడు తొట్రుపడుచు రాజ దేహములోఁ బ్రవేశింపవలయునని తలఁచెను. కాని అది ఖండములై యుండుట వీలుపడినదికాదు. అప్పుడు గోలున నేడ్చుచు బాలశవములోనుండి శంతనుతోఁ దన భంగపాటుఁ జెప్పుకొనియెను.
శంతనుఁడు అయ్యో ! నీ వెంత ప్రమాదము జేసితివి. నాతో జెప్పక యా దేహమును విడుతువా? కానిమ్ము ? ఇప్పుడైన నీ గుట్టుఁ దెలియనీయకుము. కాంతిసేనను నీకే యిప్పించి పెండ్లి చేయించెదనని యాస పెట్టెను.
ఆ బాలుండొక కుమ్మరివాఁడు. వాఁడు సర్పదష్టుండై మృతినొంది పొలములోఁ బడియుండఁ గరభుఁడు చూచి యట్టిశవ మేదేని గనంబడినప్పుడు తనతోఁ జెప్పుమని కాంతిసేన నిరూపించియున్నది. కావున నాఁడు కరభుఁ మతెఱగు కాంతిసేన కెరింగించెను. రాజపుత్రికయే వాడికట్లు చేయుఁడని నియమించినది. కరభుఁడు పన్నిన జాలమేయని శంతనుం డా సన్నాహ మంతయుఁ గావించెను.
పిమ్మట వారు రాజుదేహ మంతఃపురమునకు దీసికొనిపోయిరి. రాత్రి సర్పదష్టుడై రాజు మృతినొందెనని ప్రతీతిఁ బుట్టించిరి. అప్పుడు రాజపత్నియు బుత్రికయు నా కళేబరముపైబడి విలపించుచు నపర సంస్కారములన్నియు విధి యుక్తముగాఁ జేయించిరి. వెనుకటి మంత్రులనెల్ల రప్పించి తదనుమతిని రాజ పుత్రికయే పట్టాభిషిక్తు రాలయ్యెను.
శంతనుండు కుమ్మరిబాలు నంతఃపురమునకుఁ దీసికొనిపోయి రాజపుత్రికకుఁ జూపెను. ఆమె వానికి శాలివాహనుడని పేరుపెట్టి తన యాస్థానమునకు వచ్చుచుండుమని నియమించినది. మరియొకనాడు కేశరిణి శాలివాహానుని చేయి పట్టుకొని యేకాంతముగా నెమ్మెకాఁడా? నీ రూపముఁ జూచి మా రాజపుత్రిక మిగుల మోహమందుచున్నది. శంతనుండు నీ మాట పలుమారు చెప్పుచుండెను. నీ యొద్ద నసామాన్యమైన విద్దె యున్నదఁట. అది రాజపుత్రికకుం కుపగా నిత్తువేనిఁ దప్పక నీకుఁ బెండ్లి చేయఁగలరు. రాజ్యముతో నీ కా చిన్నది దక్కఁగలదని యక్కలికి వలపులు మొలకలెత్తు పలుకుల నతనిం గలకపరచినది.
వాఁడా మాటలు సత్యములనినమ్మి కొమ్మా ? అమ్మానవతీ శిరోమణి నా యర్దదేహ మగచుండ నా విద్య యిచ్చుటకు యబ్బురమా ? ఇప్పుడే ధారవోఁసెద. దీసికొని రమ్మని పలికెను అప్పుడా కేసరిణి వాని నంతఃపురమునకుఁ దీసికొనిపోయి రాజోపచారములు సేయుచు నప్పుడే పెండ్లి కొడుకగునట్లు లాసఁ గొలిపి యా విద్య కాంతిసేన కుపదేశము సేయించినది.
అది మొదలు శాలివాహనుఁడు తానే రాజని తలంచుచు వీధిం బోవునపుడు సగర్వముగా నడచుచుండును. దేహబంధువులువచ్చి పిలిచిన వానిఁగన్నెత్తి చూడఁ డయ్యెను. కరభ శంతనుల కంతకుపూర్వమే ప్రభువులమని యభిప్రాయము గలిగినది. ఒకనాఁ డాకస్మికముగా శాలివాహనుఁడు కరభుం జూచి గురుతుపట్టి అయ్యో ? నా శత్రువు కరభుండిట కెప్పుడు వచ్చెను? వీడు వచ్చియే కాబోలు నా గుట్టుఁ దెలియఁ జేసెను. కానిమ్ము. నాకు రాజ్యము సంక్రమించనీ ? ముందుగా వీనిఁ గారాగారమున బెట్టించెదనని తలంచుచు వానితో నేమియు మాటాడక యెందేనిం బోవుచుండెను.
కరభుఁడు వాని యభిప్రాయము గ్రహించి వెన్నంటి నడిచెను. అంతలో శంతనుఁ డెదురుపడుటయుఁ గరభుఁడు పరిహాసముగా వానితో సంభాషించెను. వా రిరువురు మైత్రియుం గినియుచు శాలివాహనుఁడు నిలువంబడినంత శంతనుఁడు నవ్వుచు మిత్రమా ! శాలివాహనా ! పల్కరించకయే నిలువం బడితివేల ? నాపైఁ గోపము వచ్చినదా యేమి? ఈ కరభు నెరుఁగుదురా యని నాక్షేపముగాఁ బలికిన వాఁ డిట్లనియె.
నేను గరభుని నిన్నును నెరుఁగుదును. నీవు చేసిన యపకారమును దెలయనివాఁడగాను. దైవానుగ్రహ ముండిన మనుష్యులేమి చేయఁగలరు. ఇఁక మూడు దివసము లరిగిన వెనుక నా మహిమ మీ రందరుఁ జూతురుగాక. నాకుఁ జేసిన యపకారములకుఁ బ్రతిఫలం బనుభవింతురుగాక యని మీసములు దువ్వుచు బెదరించిన విని కరభుఁడు శంతనా ! యిక మాకుఁ గుండలు దొరకవు సుమీ! కాచికొని యుండుమని పలికెను.
ఆ మాటలువిని యాజ్యమువోసిన యగ్నివోలె మండుచు వాఁడు శంతనా! ఘటము లిఁక నిందు నిలువవని చెప్పుము. నెవ్వడోఁ యెరుఁగక మాట్లాడుచున్నాడు. కారులు ప్రేలిన నోరు మూయింతి జుమీ! కాంతిసేన నా భార్య. ఉంకువయిచ్చి పెండ్లియాడ నిశ్చయించుకొంటినని పలుకగా నాకసంబంటుచుఁ గరభుం ఢిట్లనియె.
నే నామెచే వరింపఁబడిన భర్తను. నా యెదుట నేమంటివి? ఇంకొకసారి కాంతిసేన పేరెత్తినచో నీ నెత్తి రెండువ్రక్కలు చేయకుందునా ? కుమ్మర గురువా? నీ కులం బెరిగి మాట్లాడుమని పలికిన విని శంతనుండు, ఇంచుక యలుకఁ దోపఁ గరభా ! అప్పుడే కాంతిసేన నీకుమాత్రము భార్యయైనదా యేమి? నేను లేనప్పుడొకసారి యంతఃపురమున కరిగినంతనే స్వతంత్రుఁడవైతివి కాబోలు. నీ విషయమై కాంతిసేన యొప్పుకొనలేదు. నీ జాలము నాకీయ నక్కరలేదు. అని యేమేమో యుపన్యసించిన విని కరభుం డిట్లనియె.
మన కింత సంవాద మేమిటికి? కేసరిణి నడుగుము. అంతయు జెప్పఁగలదు. నా విద్య యిదివరకే యుంకువగా నిచ్చితిని. అసత్యముకాదు. నీతోడు. మంచి ముహూర్తము కొరకెదురు చూచుచున్నామని పలుకగా విని శాలివాహనుఁడు తన పరకాయ ప్రవేశవిద్యయు నుంకువగాఁ గైకొన్నదని చెప్పెను.
అప్పుడు మువ్వురు తగపులాడుచుఁ గేసరిణియొద్దకరిగి నేను కాంతిసేనకు భర్తనుగానా యని యడిగిరి. ఆ మాటలువిని యది నవ్వుచు మీ మువ్వురు రేపు సూర్యోదయ సమయమున కిచ్చటికిరండు మీ మువ్వురులో భర్త యెవ్వఁడొ చెప్పెదనని పలికినది.
అప్పుడుబోయి వారు మువ్వురు మరనాఁ డరుణోదయము కాకమున్న వచ్చి యందుఁ గూర్చుండిరి. కేసరిణి నిగళహస్తులైన నలువుర రాజభటులు నచ్చటికిఁ దీసికొనివచ్చి వీరే పెండ్లికొడుకులని వారిఁ జూపినది. అక్కింకరుల నిగళంబుల వారి పాదంబులకుఁ దగిలించుచు పదుడు పదుఁడు. మీకుఁ బెండ్లిఁ గావింతుమని పలుకుచు వారిని గెంటుకొనిపోయిరి. అప్పుడు కరభ శరభ శంతనులిట్లు విచారించిరి. ఉ. హా ! యిఁక నేమిసేతు వితతాద్భుతజాలను యింద్రజాలమా !
పోయితివే3 ననున్విడిచి భూవరపుత్రిక నంటితే తృణ
ప్రాయముగాఁ దలంచితి భవద్వరశక్తి జగంబు నంతయుం
బోయెగదా ? మదీయకృషి బూడెదఁబోసిన నేయికై వడిన్.
ఉ. నీ వచనంబులెల్ల మది నిక్కములంచుఁ బరాంగసంగ వి
ద్యావభవంబు నీ కొసఁగితా నృపపుత్రి ! వశించెవిద్య ధా
త్రీవిబుధత్వముం జెడియె దేహ ధనంబులు వోయె నింత మా
యామినివంచు నే నెరుఁగ కక్కట భ్రష్టుండనైతి నన్నిఁటన్.
వ. మీ యిరువురవల నా భూ
నాయక వరపుత్రి మంతనంబునఁ బ్రియురా
లై యుండెద నీకనుచుం
ద్రోయించె దుదికి నన్నధోగతి కాఁగన్.
ఆ జవ్వని మన మువ్వురకు నెఱవైచి వంచించినది. ఇందుల కొండొరుల ననవలసినదిలేదు. ఒకరి గొంటరితనము గిటగిట యొకరి వంచనము గుడి గుడియుం గాదు. ఈ యుపద్రవము మనమే తెచ్చి పెట్టికొంటిమి. ఆందలి యత్నములు తాపమునకే కారణములైనవి. ఈ వేగిరులు మనల గెడ్డంగిం బెట్టంగాబోలు తీసికొని పోవుచున్నారు ? ఈ దొసఁగు దాటించుకొను తెరఁ వరయవలయుఁ జింతించినఁ బ్రయోజనములేదు. వెనుకటి వైరము లెత్తఁ జనదు. అని శంతనుండు పలుకుటయు గరభుం డిట్లనియె.
శంతనా ? కొండిక నాటినుండియు శరభుండు నేను నెక్కువ నేస్త ముతో నేకదేహమట్లు మెలఁగితిమి. పెద్దకాలము చదివితిమి. విద్య యేమియు నంటినది కాదు. ఇట్టి మాయొద్ద బెద్ద పెద్ద నాసల నాడినఁ జెప్పికొనఁ గలమా ! గిబ్బలవలె గురుపులు వారుచు గురువులకడ గులాములమై యాకలియుం గిలియుం జెందక తిరిగి గిడిగిళ్ళతోనే కాలక్షేపముఁ జేసితిమి. నడిమంతరమునఁ జెడువిద్యలు రెండు సంపాదించి విరోధులమైతిమి. ఇప్పుడు రెండును బోయినవి కావున విహితులమై యుండ వచ్చును. బళి బళి ? మనకు మంచి ప్రాయచిత్తమైనది. అని సంతోషముతోఁ వారు కావించిన రహస్యక్యత్యములు కాంతిసేన చెప్పిన మాటలును దలఁచి తలఁచి నవ్వ దొడంగెను. రాజభటులు క్రమంబున వారిం దీసికొనిపోయి యోడ నెక్కించి ద్వీపాంతరమందు దింపివచ్చిరి.
అని యెరింగించి యాతం డవ్వలికథ మరల నిట్లు చెప్పం దొడంగెను.