Jump to content

కాశీమజిలీకథలు/ఆరవ భాగము/71వ మజిలీ

వికీసోర్స్ నుండి

డెబ్బది యొకటవ మజిలీ.

సత్వవంతుని కథ

దూరమునందుండిన కొండలోయనుండి జలపూరితమగు వెదురుబొంగు భుజంబున నిడికొని లోపల కైపారు మెకంబుల యర్పులు వినుచుఁ గేసరుఁడను బిల్లుఁ డల్లంత ప్రొద్దువేళ నాదారిఁ బోవుచుఁ బిపాసాపీడితుఁడైయున్న మకరాంకుని జూచి వెరఁగుపడుచు బాలుఁడా ! నీ నెవ్వండ వేమిటికిట్లు పడియుంటివని యడిగెను. ఆ ధ్వనివిని తన సఖురాలు దాహ మిచ్చుచున్నదని తలంచి యా మకరాంకుండు కన్నులం దెరువకయే నోరుఁ దెరచెను. అప్పుడా కిరాతవరుం డాసంజ్ఞ గ్రహించి వెదురుబొంగు చీలదీఁసి మొగమున నీళ్ళుఁజల్లి ధారగా నోఁటిలోఁ బోసెను. చల్లని యా తోయముఁ గడుపునిండాద్రావి మేనంతయుఁ జల్లఁబడి చెమ్మటలు గ్రమ్మఁ గన్నుల నులిమికొనుచు మకరాంకుఁడు మెల్లగా లేచి కూర్చుండెను.

సుకుమారుఁడా ! నీ వీ మహారణ్యమున కొక్కరుడ నెట్లువచ్చితివి ? నీ విందేల పడియుంటివి ? నీ పేరేమిటి ? యని యడిగిన మకరాంకుఁడు పుణ్యాత్మా ! నేఁడు నీవు నాకుఁ బ్రాణదానముఁ గావించితివి. మే మిద్దరము బ్రాహ్మణ కుమారులము. స్వదేశమునకుఁ బోవుచుఁ దెలియక నీ దారిం బడితిమి. నన్ను వరాహము తరిమిన నేలంబడి మూర్చిల్లి తిని. నా స్నేహితుఁడు నాకు దాహముఁ దేఁబోయెను. ఈ యరణ్యమున నతండెందుఁ జిక్కు పడియెనో తెలియదు ఇదియే నా వృత్తాంతము. ఆకారణ బంధుండనై జీవనమిచ్చిన నీ కులశీల నామంబులు వినఁ గోరెద నుడువుమని పలికిన నతండు నవ్వుచు నిట్లనియె.

అయ్యా ! నీకు నేనేమి యుపకారము సేసితినని నన్నింతగాఁ గైవారము సేసెదవు? నేను బోయవాఁడను. మా పట్టణ మీ ప్రాంతమందే యున్నది. నా పేరు కాసరు డందురు. పొద్దు వాలుచున్నది. ఒక్కడ విందుండలేవు. నావెంట మా యింటికిరమ్ము రేపు దారిఁజూపి యం పెదనని చెప్పిన సంతసించుచు మకరాంకు డప్పుడు నేదియుఁ గర్తవ్యము తెలియక యక్కిరాతునివెంట బిల్ల పల్లి కరిగెను. శరభ శార్దూలాది మహాసత్వంబుల కృత్తి విశేషంబుల బటంబులుగను గటంబులుగను వితానంబులుగను జేసికొనుచు మృగప్రధాన కరణకీకసంబుల సుపకరణంబులుగా నొప్పార ఫల దర కుసుమ కిసలయాదికములు రవణములుగా ధరించి చెంచు మించుబోణు లందంద యొయ్యారముసూప సింహ నఖర విదళిత గజదండ ఫలితంబులగు మొత్తంబులతో నత్తించినఁ గురువింద పూసల పేరు లరుతమెరయ నాడుకొను డిలధికులచే శోబిల్లు బిల్ల పల్లెంజూచి యతం డొక్కింత సంతసముతో నిట్లు దలంచెను.

ఆహా ! యీ కిరాతు లవక్రవిక్రమశాలురై నను విద్యాబుద్ధిబలసూన్యులగుట మృగప్రాయులై యున్నారు. అయ్యారే ! ఈ శబరపురంధ్రులు నాగరికత యెరుఁగకున్నను స్వభావ సుందరులగుట దర్శనీయలై యుండిరి. ఈ పల్లె వెదురు తడకలచే నల్లబడిన గుడిసెలు కలదైనను నందుగల వస్తువిశేషములచే మనోహరమై యున్నది. అని తలంచుచు గాసరునివెంట వానియింటి కరిగెను

సీ. తోలుమూసిన మంచి తుంబీఫలంబులు పైడి గంగాళముల్పగిదిగ్రాల
    పునుగుజవ్వాది కప్పురముగస్తురి గమగమలాడు వెదురుగొట్టములనొప్పి
    గురువిందపూసలు గూర్చిగట్టిన మంచిముతైపు తోరణంబులఁజెలంగి
    పరచిన రత్నకంబళులట్ల బహుచిత్రమృగకృత్తులెదల భ్రమింపజేయ.

గీ. చాయలీనెడు నెమలిపించములు గలిగి
    ధవళచామర చయధగద్ధగిత మగుచు
    మురువుఁగాంచెడు రాజమందిరముపగిదిఁ
    గరము దనరారు నాభిల్ల వరునిగృహము.

మకరాంకుఁ డందలి విశేషంబులం జూచుచు నిలువంబడినంత గాసరుఁడు గుడిసెయొద్ధకరిగి పింగళికా ! యిటురా యని పిలిచినంత వానిభార్య తడకఁదెఱచికొని వాకిటకువచ్చి మగనికి నమస్కరించుచు మకరాంకునిజూచి యీతఁ డెవ్వండని యడిగిన వాఁడిట్ల నియె.

ఈతఁడొక బాటసారి. అడవినడుమ వ్రేటు తినినపోత్రిచే నడపబడి యాత్రముఁ జెందియున్నవాడు. దప్పిఁదీర్చి యిచ్చటికిఁ దీసికొనివచ్చితిని. పాప మాకలి యగుచున్నది. తడవుసేయక వేగమ వెదురు బియ్యము వండుము. కుడువఁ గలఁడని నుడువుటయు నప్పడతి కులుకుచుఁ దృటిలో వంటఁజేసి కుడవ రమ్మని పిలిచినది.

ఆ చెంచతగావించు నుపచారముల కలరుచు మకరాంకు డౌరా ? కృప యెట్టిదో యెరుంగని యెరుకవంగడములో నుదయించిన మీ దంపతుల కీ గృహస్థ ధర్మంబు లెట్ల లవడినవో తెలియదు. మృగతూల్యయైన పింగళిక పతిభక్తియు నతిధిభక్తియు నెవ్వరియొద్ద నేర్చుకొన్నదో విచారణీయమై యున్నది. అని యాశ్చర్య మందుచు బింగళికచే వడ్డింపఁబడిన యన్నము తేనెపండ్లులోనగు పదార్ధములు భుజించి తృప్తుండై పింగళిక కిట్లనియె.

సాధ్వీమణీ ! నీవు శాపోపహతవై యిక్కులంబులఁ బుట్టితివని తోచుచున్నది. కాక శ్రీరామునకు ఫలంబులనిచ్చి యాకలి యడంచిన యా శబరివైనం గావలయును. సామాన్య బిల్ల పల్లవాధరి కీ యౌధార్య మెట్లుగలుగును ! నీ చేతి యన్నంబుఁదిని నేను ధన్యుఁడనైతినని పొగడుచు నీకు సంతానమున్నదియా యని యడిగిన నా యిల్లాలు అప్పా ! మమ్మొక గొప్పఁజేసి పొగడుచుంటివా ? చాలుచాలు మాకును మృగములకును నించుకయు భేదము లేదు. మేము స్తుతి పాత్రులముగాము. అని పలుకుచు నాకొక కుమారుఁడు గలఁడు. వాఁడింతకుముందే యడవికిఁబోయి యున్నవాఁడు ; వచ్చువేళయైనదని చెప్పుచుండగనే యా భిల్లకుమారుం డొక శార్దూలశాబకమును వింటికొనకు దగిలించుకొని యింటికివచ్చెను.

వానింజూచి పింగళిక నాయనా ఈ బాల శార్దూలము నేమిటికిఁ జంపితివి? దీనికొరకు దల్లి యెంత పరితపించుచుండునోకదా ! మృగంబులం జంపునెడ నానుడివిన మాటలను మరచితివా ? అని యడిగిన నా బాలుండు అమ్మా ! నీమాటలే నేమిటికి మరచువాఁడ. విను మీ వ్యాఘ్రడింభకంబు తల్లి తో విడిపోయి యేకతమ తిరుగుచు నా కడ్డము వచ్చినది. అప్పుడిది నిసువని తలంచి దానిజోలికిబోక నేను వేరొక తెరవునఁ దప్పించుకొని పోఁదలంచితిని. ఈ పులిపిల్ల నన్ను విడువక మీదికి లంఘించి పరాక్రమముఁ జూపుటయు నేను చంపక పెద్దతడుపు పారఁదోల వలయునని యదలించితిని. నా యదపులు లక్ష్యము సేయక మీదికురికినది. అప్పుడు ప్రాణసంకటముగాఁ దోచిన వింటికొన వ్రేటున దీనిం గడతేర్చితిని తప్పా ! చెప్పుము అని చెప్పిన నా యిల్లాలు తండ్రీ ! తప్పులేదు. ప్రాణసంకటమైనప్పు డెట్టి దానినైనఁ జంపవచ్చును. రమ్ము. రమ్ము. జలక మాడుము. కుడువుము ప్రొద్దుపోయినదని పలకినది. అప్పు డా సంవాదమంతయు విని మకరాంకుండు.

శా. తారాచంద్ర సముజ్వల న్ముఖముతోఁ బ్రాంచల్ల లాటంబుతో
    నాకర్ణాంత విశాలనేత్రములతో నాజానుబాహాయుగ
    శ్రీకమ్రాంగముతో మనోహర రధశ్రేణి న్విరాజిల్లు మూ
    రాకారున్ శబరీకుమారుఁ గని యోహాక్రాంత చిత్తంబుతో.

ఔరా ! వింతలపై వింతలు గనంబడుచున్నవి. ఇమ్మహారణ్య మధ్యమునఁ బచ్చిమాంసము భక్షించెడి కిరాతకములో నిట్టిగుణవంతు లుండుటయే యాశ్చర్యము. ఉండెఁబో. ఇట్టివారికి నిట్టి యద్భుతరూప సంపన్నుండైన కొమరుఁ డుదయించుట మిక్కిలి యబ్బురముఁ గలుగుచున్నది. ఆహా ! విధివిలసితములు వినిమయోపగతములుగదా ! అయ్యో ! పరమేష్టి యిక్కుమారశేఖరుని సార్వభౌముని యింటఁ బుట్టింపక యిట్టి నికృష్టజాతియందుఁ బుట్టించునా. అన్నన్నా ! ఈపిన్నవాఁడు పాదచారియై యీ కుటీరములో సంచరింపఁ దగినవాఁడా ! ఇట్టి సుందరుని గని విని యెరుంగనుగదా! ఏమిచిత్ర మేమిచిత్రముఁ మదీయ దేశాటనోద్యమ మిప్పటికి సాద్గుణ్యము నొందినది. కన్నులు గలిగి నందులకు ఫల మనుభవించితిని వీని రూపమున కనురూపములైన గుణములు గలిగియున్నవి. కాని వీఁడు విద్యాగంధరహితుండని తోచుచున్నది. పరీక్షించి చూచెదంగాక యని తలంచుచు మకరాంకుఁడు, మిత్రమా ! యిటురా ! నీ పేరేమని యడుగుటయు నతండు నవ్వుమోముతోఁ దల్లివంకజూచి అమ్మా ! యీతడు యెవ్వరు ? నన్నుఁబేరేమని యడుగుచున్నాఁడు. ఏమని చెప్పవలయు నని యడిగెను. అప్పుడు పింగళిక యీతఁ డొకమార్గస్తుఁడు. దారితప్పి మనయింటి కతిధిగా వచ్చెను. పేరడగినం దప్పా ? చెప్పుము చెప్పుము. అని సంజ్ఞచేసిన నాబాలుఁడు అయ్యా ! నా పేరు సత్యవంతుఁడు. అని పలికెనుఁ బాపురే ! కుమార మంచిపేరు పెట్టుకొంటివి. అందులకుఁ దగిన వాఁడ వగుదువు. అని మెచ్చుచ్చు వయస్యా ! నీ వేమైనం జదివితివా ! యని యడిగిన నమాట వాని కర్ధముకాక దిక్కులు సూచుచు నదియేమని మరల నడిగెను.

భుజింపుము. పిమ్మట నతైరం గే నెరింగించెదనని పలికిన నా బాలుండు తృటికాలంబులోఁ గుడిచి యతనివద్దకువచ్చి అయ్యా ! అది యేదియో చెప్పెద నంటివి. చెప్పెదవాయని యడిగిన మకరాంకుడు విద్యావిషయమైన పద్ధతు లన్నియుం జెప్పి దానియందు వాని కాసక్తి గలుగునట్లుఁ జేసెను.

అది మొదలు సత్వవంతుఁడు తనకావిద్య చెప్పుమని మకరాంకుని నిర్బంధింప దొడంగెను. మకరాంకుఁడు తొలుత నక్షరములు గుణితము పేరులు లోనగు పద్ధతు లన్నియు వ్రాసి యిచ్చుటయు సత్వవంతుఁ డవియన్నియు నొకసారి వినియే గ్రహించెను. మకరాంకుఁ డారీతి ప్రతిదినము చెప్పుచు నొక సంవత్సరము నాటికిఁ దనకు వచ్చిన విద్యయంతయు నేరిపి సత్వవంతు నధికవిద్యాపరిపూర్ణుం జేసెను. స్వల్పకాలములో ననవద్యమగు విద్యసంగ్రహించి యొకనాఁడు శబరకుమారుండు మకరాంకుఁడు వినుచుండ తల్లితండ్రుల కిట్ల నియె.

ధాత్రీతలంబున నెన్ని యేనిఁ జిత్రంబులు గలిగియున్నవి. మనము విద్యా విహీనుల మగుటఁ బశుప్రాయులమై యీ మహారణ్యంబునఁబడి యున్నవారము. మనుష్యులందరు నేకజాతివారైనను సేవ సేవక న్యాయంబులు బుద్ధిబలము ననుసరించి గలుగుచున్నవి. అందులకు విద్యయే మూలకారణము. విద్యలేనివాఁడు కన్నులున్నను గుడ్డివాఁడేసుడీ ? ఈ మహాత్ముని కృపావిశేషమున నేను సకల విద్యా మర్మంబులం దెలిసికొంటి. మనమిఁక విందుండ నవసరములేదు. జనపదంబుల కరుగుదము రండు మదీయ విద్యాబుద్ధి బల విశేషంబుల మిమ్ము రాజతుల్యులం గావింతునని పలికిన విని నవ్వుచు శబరదంపతు లిట్లనిరి.

అబ్బా ? ఆపాడుపట్టణము లొకసారి పోయి చూచితిమి డొంకయుఁ జా టును మాటును లేవుగదా? పెద్ద పెద్దమిద్దెలంట. వాకిట నిలువఁబడనీయరు. పొండు పొండని పలుకుచుందురు. అవి మనకొండలకన్న పెద్దవియాయేమి ? ఎక్కడజూచినను మేకల తెగలపోలిక నరులే తిరుగుచుందురు. అంతకన్న నరకమే మేలు. చీకాకులేని యీ యడవియే స్వర్గమని పలికిన నవ్వుచుఁ బోనిండు. నే నొకసారిఁ జూచివచ్చెద ననుజ్ఞ యిండని వేడుకొనుటయు నెట్టకేని వా రంగీకరించి మకరాంకున కప్పగించి నగరముఁ జూపించి వెండియుఁ దీసికొనిరమ్మని చెప్పిరి.

మకరాంకుఁడు పరమ సంతోషముతో నందుల కియ్యకొనినాఁడే పయన మునకు సత్వవంతుని తొందర పెట్టెను. ఏనుగులవలెఁ బలిసియున్న యెనుబోతులనెక్కి యిరువురు ధర్మదేవతలవలె నొప్పుచు నతిజవంబున నయ్యరణ్యంబులు దాటి యనేక జనపదంబులు సూచికొనుచు నొకనాడు మధ్యాహ్నమునకు శోభావతీయను పట్టణంబునకుం బోయి యందు విఫణి మార్గంబుల సంచరింపుచుండిరి.

విద్యారూప పరాక్రంబుల గురుస్మరనరులం దిరస్కరించుచు విలు నమ్ములు ధరించి రాజమార్గంబునఁ దిరుగుచున్న సత్వవంతుంజూచి ప్రజలు విస్మయపడఁ జొచ్చిరి. పురరక్షకులు దిరియుటకు వెరచుచుండిరి. అంతలో నొకదెస కోలోహలధ్వని వినంబడినది. అందరు నా దెశకుఁజూచుచుండ గొందరు రాజభటులు యుద్ధసన్నాహములతో వచ్చుచుండిరి. అ వీరభటులు సత్వవంతునింజూచి నీ వెవ్వఁడవు? ధనుర్బాణములు ధరించితివి. నీవు వీరుఁడవా? లేక పిట్టలం గొద్దెదవా? యని సపరిహాసముగా నడిగిన నతండు మొగమంతయుఁ గన్నులు చేయుచు ఏమీ? మీ కండకావరము కానిండు నేవీరుఁడ గానుగాని మిమ్ము బిట్టలం గొట్టినట్టు కొట్టగలనని తిరస్కార భావముతోఁ బ్రత్యుత్తరమిచ్చెను.

ఓరీ ! నీచా ! మే మెవ్వరమో తెలిసికొనక దురభిమానమునఁ బ్రేలితివి. రాజుగారి ప్రధానవీరులమని తెలిసికొనుము. సంగరమునకే యరుగుచున్న వారము. తప్పుఁ బల్కితివని మాకు మ్రొక్కుము. మ్రొక్కవేని నీశిరము భూతబలిగానిత్తుము. అప్పుడు మాకేమియు నడ్డములేదని బెదిరించిన నతండలుగుచు నిలుఁడని యదలించుచు వారిసంధించి పది వాడితూపుల నేసి వారినెల్లఁ బలాయితులం గావించెను. ఆ వీర యోధులు శరబాధ సైపక కాందిశీకులై రాజునొద్దకరిగి య త్తెరం గెరింగించిరి. ఆ నృపతి యపరిమితముగా నాశ్చర్యమందుచు మి మ్మందర నొక్కఁడు పారదోలెనని చెప్పుచున్నారు. అది కడుచోద్యము. అయ్యసహాయశూరునిపై మనము కినియరాదు. సానునయముగా రప్పించి కార్యము సాధించుకొనవలయు నతం డర్జునుఁ డంతటివాఁడు కానిచో నొక్కరుఁడు పదుగురతో ఢీకొనునా? అని యాలోచించి రా జతనిం దీసికొని రండని తనమంత్రులకు బోధించి యంపెను.

ఆ ప్రధానులా సత్వవంతునొద్దకరిగి తదాకారగౌరవము గౌరవము సూచింప వినయముతో మ్రొక్కుచు సుబలా ! ఇవ్వీఁతు శశాంకుడనురాజు పాలించుచున్నాడు మీపరాక్రమమువిని యమ్మహారాజు మిగుల సంతసించుచుఁ దమయోధులఁ చాల మందలించెను. మీవలన నొకసహాయము కోరఁదలఁచి మిమ్మిచ్చటికిఁ తీసుకొనిరమ్మని పుత్తెంచే. పోవుదము రండని వేడుకొనుటయు నవ్వు మొగముతో నోహో! మీరు నన్నంతగాఁ బొగడవలదు రాజాజ్ఞకు బద్ధుఁడనై యరుదెంచెద. మీరు పదుఁడు. నా ------------- పనిమీద నవ్వలికింబోయె నతండు వచ్చినతోడనే వచ్చువాడనని ----------------------------

అయ్యా ! మేము మీరువచ్చుదనుక నిందేయుండెదము మీ మిత్రుడు రానీ యడు, వచ్చినతరువాతనే పోదుమని పలుకుచు నందు నిలువంబడి యతనిఁతో బరిచయము గలుగుటకై కుశల ప్రశ్నపూర్వకమైన ప్రసంగముఁ గొంత గావించిరి. సత్వవంతు డెంత సేపటికి మిత్రుండు తనయొద్దకు రామింజేసి పరితపించుచుఁ గౌరవనీయులగుమంత్రులు తన నిమిత్తము వేచియుండిరని మోమాటముఁ బెంచుచుఁ బోనిండు. నా వయస్యుం డేదియో పనిమీద జాగుచేయుచున్నాడు. ఈ కథయెరుఁగడు. మీ యేలికతో మాట్లాడి వేగమే వత్తునని పలికి వారితోఁగూడ రాచనగరి కరిగెను.

శశాంకుఁ డల్లంత దవ్వుననే యాతనింజూచి మోహ మావేశింప నవ్వికారముఁ దెలియనీయక యెదురునడచి గౌరవింపుచు పాణిగ్రహణముఁజేసి యొక పీఠంబునం గూర్చుండబెట్టి తా నభిముఖంబుగాఁ గూర్చుండెను. అప్పుడు మంత్రు లతని పరాక్రమ విశేషంబులను గుణసంపత్తి యుఁ గుణశీల నామంబులును స్తోత్ర పూర్వకముగా నివేదించిరి.

మిక్కిలి యభినందించుచు శశాంకుఁడు మేము కోరదగిన కల్పకము పెరటికే వచ్చినదే. మహారాజా ! వినుము. ఇప్పటికి బదియోజనముల దూరములో సౌగంధికమను నగరము కలదు. అప్పురమును ప్రభాసాగరుండనురాజు పాలించు చుండెను. అతండు నా తండ్రి కత్యంత ప్రియుండు. ఇప్పుడు తనపైఁ బెక్కండ్రు నరపతులు విరోధించి నిరోధింపఁ బ్రయత్నించుచున్నారట తత్సంగరమునకు మమ్ము సహాయము రమ్మని కోరికొనెను. మేమిప్పుడు కొంతసైన్య మచ్చటికిఁ బంపుచున్నారము. నీవు సర్వ సేనానాయకుండవై యవ్వీటికరిగి శత్రువులం బరిభవించి మిత్ర కార్యము సాధించుకొనిరమ్ము. నిన్నాత్మ సమయముగాఁ జూచికొనియెదమని స్తుతియించుటయు నతం డుబ్బుచు నప్పని కొడంబడినపిమ్మట నప్పుడే సర్వసేనాధిపత్యమునకు నతనిఁ బట్టాభిషిక్తుఁగావించి నూతనాంబర మాల్యాను లేపనాదులచే నలంకరించి యతఁ డెక్కను చ్చైశ్రవంబునుం బోలిన హయరత్న మొకదాని నిచ్చెను

సత్వవంతుం డాతురగమెక్కి దళంబులెల్ల దన నాజ్ఞకు లోనై వర్తింప రాజాజ్ఞబూని శుభముహూర్తంబున బయలుదేరి భూమి యదరునట్లు సేనల నడపించుచు గొన్ని పయనములు సాగించెను. ఆతని కా సందడిలో మా -------------- జ్ఞాపకము వచ్చినదికాదు.

ఒకనాడు సౌగంధిపురమునుండి రాజప్రతిణిధులు కొందరెదురువచ్చి జోహారుఁజేయుచు దేవా ! మా రేఁడు మీరాక కెదురుచూచుచున్నాడు. రాజపుత్రు లెల్ల నేకమైవచ్చి ప్రభాసాగరునితో యుద్ధము సేయుచున్నారు. శత్రుసేనలు సముద్రమువలె విరిగి పురముమీద బడుచున్నయవి. వాని నాప నోపునావికులు మా యొద్దలేవు. మీరు వచ్చుచున్నారను వార్తవిని మా యొడయఁడు ---------------- వేగఁజేసికొని రమ్మని మమ్ముఁ బుత్తెంచె. లెండు లెండని నుడువిన విని మందహాసముఁ గావించుచు నతండిట్లనియె. మీఱేని కేమియు నుపద్రవము లేదు. నేనువచ్చి విజయముఁ గలుఁగఁ జేసెద. ఇందరితో మీ రాజునకు వైరమేమిటికిఁ గలిగినది. వారికేమి యపకారము గావించెనని యడుగ నాదూత లిట్లనియె.

సౌగంధికకథ

దేవా! వినుండు. మా పభువుగారికిఁ జిరకాలమునకు సౌగంధికయను పుత్రిక యుదయించినది సంతత తదీయ హాససల్లాప క్రీడావిశేషంబుల నిక్షేపములుగాఁ దలంచుచు నతండు ప్రాణపదముగా నమ్ముద్దులపట్టిం బెనుచుచుండెను. అప్పంకజాక్షి యౌవనమంకురించు సమయమున కంగనాజనదుస్సాధ్యమగు విద్యాసంపత్తి నవఘటించి దేశమునఁ బొగడ్త కెక్కినది. చదువుకొనిన యాఁడువాండ్రు పెద్దలకుఁ దప్పులు దిద్దుచుందురుగదా ? ఆ పూబోణి యౌవనారంభమందుఁ ద్రిజగన్మోహన సౌందర్యంబునఁ బొలుపొందుచుండుటయు మా రేఁడు వేడుకతో సుందరంబునం బేరుపొందిన రాజనందనులం గొందర నేరి వారి చిత్రఫలకముల నా యువతీ తిలకమునకుఁ జూపిన వారినెల్లఁ బరిహాస పూర్వకముగా నిరసించినది.

అట్లు పలుమారు జేయుటయు నా వసుమతీపతి విసిగి స్వయంవరముఁ జాటించెను. అ మ్మహోత్సవమునకు రాజపుత్రులు వేనవేలు చనుదెంచి సభాభవన మలంకరించిరి. అప్పుడు రాజుపుత్రిక సఖీపరిపృతయై పుష్పదామంబుఁ జేతంబూని దమయంతివలె నొప్పుచు నా సభాంతరాళమున కరుదెంచి రాజులనెల్లఁ గనుంగొనుచు నంతకుముందు దెలిసికొని వచ్చిన సఖీజనంబు వారివారి కులశీలనామ విద్యా బల పౌరుషాదుల నెరింగింపుచుండ నాలించుచుఁ బరీక్షించి తిరిగి తిరిగి చూచిచూచి యందెవ్వఁడు దానుఁ గోరదగిన వీరుఁడు లేడని నిరసించి తిరస్కార భావముతో నా సభా భవనము దాటి యవ్వలికిఁ బోయినది. అప్పుడే రాజపుత్రుల హృదయంబులఁ గోపానలం బుదయించి రవులుకొనఁ దొడంగినది. అయ్యువతీమణి యింటికిబోవునప్పు డొక యశోక పాదపముక్రింద నిలువబడి యా వింతఁ జూచుచున్న విప్రకుమారు నొకనిఁజూచి తలయూచుచుఁ గులశీలాదు లడుగక సఖులఁ జూడక నొడలెరుఁగక మోహవివశయై తనచేతనున్న పుష్పదామ మతని కంఠమునవైచి వరించినది. అంతకన్న నవివేక మెందైనం గలదా ? భర్తృదారిక యగుట నేమాట యనుటకుం గాదుకాని రాజపుత్రులకన్న నా చిన్నవా డేమిట నధికుండు? అప్పుడు పరిచారికలెల్ల వానిపైఁ బూవులు చల్లుచు నందలమెక్కించి యంతఃపురంబునకుఁ దీసికొనిపోయిరి. అతఁడానాడు లేచిన వేళ మంచిది. అంతకన్న వేరొకటిలేదు విమర్శింప తన మరకారుని కుమారుంట: సద్యార్థులు కాపురంచున్నాడట. నిప్పల్ల --ధరి సూరకంటింప చ ఏలికయు లజర్లు పుప్రకావాత్సల్యము పెంపగు నేమియు న జాలక పరితపించుచుండెను. మమ్మెల్లఁ బరిభవించి యా రాచపట్టి ముష్టిభాపనయ్యం జేపట్టె. ముందు వానిపని పట్టవలయునని తలంచుకొని రాజపుత్రు లందరు నేకమై మావీఁడు ముట్టడించిరి.

అప్పుడు ప్రభాసాగరుం డొక్కరుండు పెక్కండ్రతోఁ బోరఁ వెరచుఁ గిన్నరదత్తుం డత్యంతమిత్రుండగుట నతని పుత్రున కీవార్త దెలియఁ జేసెను. అమ్మహారాజు మిమ్ముఁ బంపుచున్నారుగదా ఇదియే యచ్చటి కథయని చెప్పిన విని సత్వవంతుడుఁ తొందరపడుచు నప్పుడే తన బలమునెల్లఁ బయనము సేయించి వేగముగా నడిపించుచుండెను. అంతలో మరికొందరు సాహిణు లెదురువచ్చి సత్వవంతునకు నమస్కరింపుచు దేవా ! శత్రురాజపుత్రులు ప్రభాసాగరు నోడించి సభాంధపముగాఁ గారాకారంబునఁ బెట్టించిరి. కోట యాక్రమించి వస్తువాహనములఁ గొల్ల గొట్టుచున్నారు.తరువాతకృత్యమునకు దేవరయే ప్రమాణము. పౌరులెల్ల నీదిక్కునే చూచుచున్నారని చెప్పుటయుఁ బరితాపముఁ జెందుచు సత్వవంతుఁడు సేనల నతిక్రమించి తురగమెక్కి యా రౌతులతోఁ గూడ రెండు గడియలలో సౌగంధికనగరము ప్రవేశించి యడ్డము వచ్చిన వారినెల్లఁ బరిభవించుచు నిరాఘాటముగాఁ గోటలోఁ బ్రవేశించి రాజ్యవిభాగా యత్త చిత్తులైయున్న రాజపుత్రుల నందరఁ జూచి కొందరు జంపియుఁ గొందరఁ బారఁదోలియుఁ గొందరం గొట్టియు గొందరఁ బట్టియు నీరీతి నర్థదివసంబులో శత్రువులనెల్ల జయించి ప్రభాసాగరుని బంధువులతోఁ గూడ విముక్తునం గావించి సింహాసనాసీనుం గావించెను.

ఇంతలో బలము లా నగరములోఁ బ్రవేశించినవి. విజయనాదంబులు పట్టణమెల్ల వ్యాపించినవి. పౌరులు సత్వవంతుల బార్దుండని వినుతింపం దొడగిరి. అప్పుడు ప్రభాసాగరుఁడు సత్వవంతుం గౌగలించుకొనుచు మహాత్మా! నీవు మా కిన్నరదత్తున కెట్టిబంధుండవో తెలియదు. నా పాలిటికి దైవమునైతివి. నీ కులశీల నామంబు లెరింగించి శ్రోత్రపర్వముఁ గావింపుము. ఇది మొదలులు నా యర్ధరాజ్యంబు నీవు పాలింపుము. రాజ్యప్రాణదాతవైన నీ కేమిచ్చినను ఋణవిముక్తుఁడ కానని కృతజ్ఞతాపూర్వకముగాఁ బ్రార్థించిన విని సత్వవంతుం డిట్లనియె. నరేంద్రా! నేను కిన్నరదత్తుని పుత్రునకు మిత్రుఁడు. నాపేరు సత్వవంతుఁడందురు. మిత్రచోదితుండనై మీ కార్యంబుఁ జక్క చేసిన నన్నింత యుగ్గింపవలయునా? విధికృతంబులు స్తుతి పాత్రములుకావు. నేవచ్చినపని తీరినది. నాకు మీరాజ్యముతోఁ బనిలేదు. పోయివత్తు నానతీయుఁడని పలికిన నన్న రేంద్రుం డిట్లనియె.

మహాత్మా ! యుత్తము లసమానకృత్యములు నిర్వహించియు స్వాధిక్యతను బ్రకటించుకొనరు. నీవు మాకును మా ప్రజకును జేసిన యుపకార మితన్మాత్రంబుగాదు. నీవు డెదసముడవు. కానిచో నొక్కరుఁడవు పెక్కండ్రం గీటడగించగలవా ? భవదీయ విజయాభినందనమునకై యెల్లుండి యొకసభఁ జేయఁబోవుచున్నారము. అందు మాయిచ్చు నాతిధ్యమంది మమ్మానంధింపఁ జేయవలయునని యెంతయో వినయ విశ్వాసములతోఁ బ్రార్థించిన నాలించి సంతసించుచు సత్వవంతుండందుల కనుమోదించెను. అని యెఱింగించువరకు వేళ యతిక్రమించినఁ గథ విరమించి పై మజిలీయం దిట్లని చెప్పందొండగెను.

డెబ్బది రెండవ మజిలీ.

కమలకథ

ప్రభావతీ పురంబున విశ్వేశ్వరునియాలయ మొకటికలదు. ఆ దేవళము నాలుగు దెసలను నొప్పుచున్న గోపురములు గోపురమునకు సోపానములోయన విరాజిల్లుచున్నవి. ప్రాకారమంటపాదుల యతిశయము వర్ణింపఁ బదిదినములు పట్టును. దాని గాశీక్షేత్రముగాఁజేయు తలంపుతో నాదేశపు రాజులలో నొకఁ డయ్యాలయాదులఁ గట్టించి యా లింగమునకు విశ్వేశ్వరుఁడను పేరు పెట్టెను. ఆ క్కో వెల యావరణములో గంగయను బేర నొక పెద్ద తటాకముఁద్రవ్వించెను అందలి జలంబు లగాధంబులై నిర్మలంబులై మధురంబులై యొప్పుచుండును కాశింగల తీర్థంబులును లింగంబులు నా యా చోటుల నా యలయాంగణములందు నిర్మింపఁబడి యున్నవి. అవి యట్లుండె వ్యాసమఠమను బేరుతో నొక మఠముఁ గట్టింపబడి యున్నది. సన్యాసులు, బైరాగులు, యోగులు, యోగినులు లోననుజ్ఞాన వాసనగల విరక్తులకొరకా మఠము గట్టింపఁబడినది. అట్టివారికి భోజన భాజన సత్కారములు సేయుటకై ప్రత్యేకము నందొక సత్రమును స్థాపించిరి. తనంబనియు యోగంబనియు హోమంబనియుఁ బేరులు పెట్టుకొని భార్యాపుత్రాదులఁ బోషించుకోలేక విరక్తులై పొట్టనిండఁ గాలక్షేపముఁ జేసికొను డాంబికు లందు బెక్కండ్రు గలరు. చౌర్యాది దుష్టక్రియలు గావించి రూపుమార గడ్డములు పెంచికొని యోగులవలె జపముసేయు వారు గొందరుందురు. మరియు -

సీ. ఒకమూలమ్రోలఁ బావకముంచికొని యర్ధ
              దృష్టి మాలికలను ద్రిప్పువారు
    ఒకవంక నూర్ద్వ ఔహుపులుగా యో
              గము ల్వెలయించి తపముఁ గావించువారు
    ఒకచెంత నిగమాంత యు క్తితత్వముల నం
              తేవాసితతికి బోధించువారు
    ఒకచక్కి గురుభక్తియుక్తిఁ బూజలు సేసి
              దేవతావళులఁ బూజించువారు