Jump to content

కాశీమజిలీకథలు/ఆరవ భాగము/70వ మజిలీ

వికీసోర్స్ నుండి

సోమభట్టారకుఁడు అయిదుదినములు వెనుకటికన్నఁ బెద్దగా నుత్సవములు కావించెను. దీక్షావసానంబున సత్యవతిరూప మెట్లుమారునో చూడవలయునను తలంపుతో బంధువులందరు వేచియుండిరి విద్యాభాస్కరుఁడును సోమభట్టారకుడును గులదేవతను బ్రార్ధించుచు సత్యవతిరూప మిమ్మని గోరికొనిరి. అప్పుడు మరల భట్టారకుని భార్య యావేశముఁ దెచ్చుకొని బాలిశుఁడా ! నీవు పండితుండవయ్యు దేవతా మహిమ యించుకయు దెలిసికొనలేక పోయితివి. నన్ను క్షుద్ర దేవతవలెఁ బూజించితివి. అనాచారములు చాలఁ గావించితివి. ఇఁక నాకు నీ యందుఁ గనికరము రాదు. నీ కూఁతురీ జన్మమునందిట్లే యుండును. పో పొమ్ము అని పలికి నిందింప దొడంగినది. భట్టారకుఁడనేకముగా నపరాధములు సెప్పు కొనియెంగాని ప్రత్యుత్తర మిచ్చినది కాదు అప్పుడతండు గోలు గోలున నేడ్చుచు అయ్యో ! నా పుత్రిక యిట్లువికృతాంగియైన నెవ్వరు భరింతురు. దీనికాల మెట్లు గడచును? దిక్కెవ్వరు? అని యూరక పలవరించుచుండ నల్లుడతని చేతులు పట్టుకొని మామా? దుఃఖింపకుఁడు. కట్టికొనినందులకు దీని కష్టము లన్నియు నావికాక మీకేమి భారతము, భారమంతయు నామీదఁ బడినది. స్వతంత్ర ప్రేమతోఁ జూచుచుండెదను దైవికమునకు మన మేమిచేయఁగలము. అని ప్రమాణికము చేయుదనుక నతండేడ్పు మానలేదు. యజ్ఞదత్తుండును అతని దుఃఖముఁ జూచి అయ్యో ! నే నెక్కడికి వచ్చిన నక్కడనే కష్టములు గలుగుచున్నవి. ఇందుండనని భట్టారకునోదార్చి తానచ్చటఁ గదలి భార్యతోఁగూడ నెందేనిం జనియెను.

అని యెఱింగించువరకుఁ గాలము మిగులుటయుఁ గథఁజెప్పుట మానివైచి మణిసిద్ధుండు తదనంతర వృత్తాంత మవ్వలి యవసధంబునఁ జెప్ప దొడంగెను.

డెబ్బదియవ మజిలీ.

శశాంకమకరాంకుల కథ

సఖీ ! రూపవతీ ! మన మిల్లు వెడలి మూడుదినములయినది. యంత్రయానమునఁ బెద్దదూరము వచ్చితిమి. ఆ బ్రాహ్మణదంపతు లెందును గనబడలేదు. ----------- దోవంబోయి యుందురు మనమిఁక నీదారింబోవుటమాని తూరుపుగా బోవుదము . మనసఖురాండ్రు మనకై వేచియుందురు. అయ్యో ! మనము వత్తుమన్న దినమునకుఁ బోలేక పోయితిమిగదా ? వారేమి చేయుదురో తెలియదు మన మొండొరులముఁ గలసి కొనక చిక్కులు పడియెదవేమో ? ఆహా ! బుద్ధిః కర్మానుసారిణి యను వచనము సత్యమగును. వారిరువురు పెండ్లి యాడుచుండ వారించి యద్భుత కల్పనలఁ జేయుటకు మన మిట్టి సంకల్పము పట్టుటకుఁ గారణమేమియో తెలియకున్నది. తలంచికొన నాకే విస్మయముగానున్నదిగదా? పుత్రికకై శోకవార్ధిలో మునిఁగిన గురునోదార్చలేక పోతిమేల? ఆ దంపతుల గర్భశోక మూరక చూచుచుంటిమిగదా ? పోనిమ్ము. పిమ్మటనైన మా తండ్రి కెఱింగింప మనము స్వతంత్రులమై కులపాలికా విరుద్ధముగా నిల్లు వెడలి వచ్చితిమి. ఇదియంతయు దైవమాయవలె గనంబడుచున్నది. మనకొరకు తల్లిదండ్రులు దుఃఖించుచుందురు. వెండియు నింటికిఁబోయిన లెస్సయగునేమో యాలోచించి చెప్పుము. నాకేమియుం దోచుకున్నది, అని యడిగిన కళావతికి రూపవతి యిట్లనియె.

సఖీ ! కళావతీ ! నీవనినట్లు మన ప్రయత్నమంతయు నిరర్ధకమైనదే అయినను నిప్పుడు పశ్చాత్తాపపడినఁ బ్రయోజన మేమి? మనమిప్పుడింటికింబోయి నిజమెఱింగించితిమేని ప్రజలును బంధువులును జాల నిందింతురు మరియు రాజదండనకుఁ బాత్రుల మగుదుము. మనకట్టిబుద్ధి పుట్టించిన భగవంతుని యెత్తికోలు సఫలము చేయవలయును. దైవము పంచినట్లు నడుచువారము గాక మనము స్వతంత్రులమా ! లెమ్ము. వెరవకుము. ధైర్యమూనుము. తూరుపుదెసకరిగి సఖురాండ్రం గలసికొని కొంతకాలము దేశాటనము చేయుదముగాక పురుషవేషములు వైచితిమిగదా? మనల నెఱుఁగువారుండరు. మన మొండొరులమే గురుతుపట్టుట దుర్ఘటముగానున్నది. నీ పేరు శశాంకుఁడనియు నా పేరు మకరాంకుఁడనియుఁ జెప్పుకొందుము. మన విద్యల దేశ యాత్రచేఁ గృతార్ధములఁ చేయుదుము. అని యత్యంత సాహసోత్సాహములతోఁ బలికిన విని కళావతి యిట్లనియె.

చెల్లీ ! మనకు బాల్యము వదలుచున్నది. యౌవనారంభమున మనలఁ గారా గారంబులంబోని యంతఃపురంబులు ప్రవేశ పెట్టుదురు. దేశములెట్లు చూడఁగలము, కావున మననడక యొక తెరవున ననువైనదనియే దలంపవలయును. నీ పలుకులచే నాయెడఁదఁ గలకతీరినది పయనము సాగింపుము. యానసాధనములు వికలమైనవి. గావున నిఁకపదములచేతనే నడువవలెను. తొలుతఁ దూరపుదెసకరుగుదము. సఖులు తూరుపు మార్గముననే యుందుమని చెప్పిరిగదా ! ఆదెస నడవులు మెండుగలవని చెప్పుదురు. మొదట నత్తె రంగెఱుంగక వారి నాదెస పోవలయునని మనమే చెప్పితిమి. ఎట్లయినను నట్లుపోవక తప్పదు. అని యుపన్యసించినది. అట్లిరువురును తలంచుకొని యాదారి విడిచి తూరుపుదెసకు మరలి నడువందొడంగిరి అప్పటికి జాము ప్రొద్దెక్కినది. ఖరఖఁరుడు తనవేడి కిరణములచేఁ గ్రమంబు జగంబునఁ బరితపింపఁ జేయఁదొడంగెను. అయ్యండజగమన లాయెండలో నడువలేక మ్రానునీడలనిలుచుచు మరల నడచుచు నీరీతిఁ గొంతపయనము సాగించిరి. మిట్టమధ్యాహ్నమున నొక చెట్టునీడ వసించి తాను దెచ్చుకొనిన యాహారపదార్ధములు భుజించి యాకలి యడంచుకొనిరి.

చండభానుఁడు కొండొకదూర మరిగిన మరల నడువ మొదలు పెట్టిరి. క్రమంబుననాయడవి బలియ చున్నది కాని తెరపి కనంబడుటలేదు. సాయంకాలమున ------------------దలఁచి వడివడి నడిచిరి. పల్లెయేదియుం గనంబడినదికాదు. అప్పుడుమిక్కిలి భయఁపడుచు గుండెలు రాయిచేసికొని యొకచెట్టుక్రిందఁ బండుకొని యెట్టకేఁ దెల్ల వార్చిరి.

అట్లు వారు నాలుగుదినములు పయనము సాగించిరి. అయ్యరణ్యమునకు నాద్యంతములు కనంబడలేదు. పోయినకొలది యగమ్యగోచరముగాఁ గనంబడు చుండెను. ఆహారపదార్ధములు సరిపడినవి. పాదములు పొక్కులెక్కినవి. నాలుగవ నాఁడు జాము పొద్దెక్కినప్పుడు అడుగులు తడఁబడ నీడ్చుచు నొకతరువునీడఁ జతికిలపడి నిట్టూర్పులు నిగిడింపుచు మోమునం గ్రమ్మినఁ జెమ్మటఁ బైటచెఱంగున నద్ది కొనుచుఁ గళావతి రూపవతి కిట్లనియె.

సఖీ ! మనము విద్యామదము యౌవనమదముతో వియ్యమందఁగా వరించి యింటికడ సుఖం బుండనేరక వెడలి వచ్చితిమి. చివరకు మన జీవితాంత మీ విపినా నంతరమున జరుగునట్లు తోచుచున్నది. అడుగు నడుచుటకు శక్తిలేదు. ఇంతయడవి యున్నది. తినుట కేమియుం దొరకదు. దారి కాని దారింబడితిమి. కౄరమృగముల యార్పుల వినంబడుచున్నవి. నేడుగడుచుట గష్టముగాఁ దోచుచున్నది మనమించుకయు నాలోచింపక బాల్యచాపల్యంబున వట్టి చెడుప్రయత్నముఁ జేసితిమిసుమీ ? యని యధైర్యముఁజెంది శోకోపహతచిత్తమైయున్న యమ్మత్తకాశిని నూరడించుచు రూపవతి యిట్లనియె.

ప్రియసఖీ ! జీవులకు రెండుచావులు లేవని మనము చదివితిమిగదా? అకాలమున మరణము రాదనియు మన మెరింగిన విషయమే. ఇఁక విచారమేమి? అదిగో యీప్రాంతమున ఫలవృక్షము లేవియో యున్నవి. పోయి ఫలములంగోసికొని వచ్చెద నిందుఁగొంతసేపు విశ్రమింపుము. చింతింపకుమని బోధించి యా మించుబోణి నలుమూలలు దిరిగిఁ వెలగపండ్లుఁ గోసికొని వచ్చినది. పండ్లుతిని యా రాచపట్టి యాకలి యడంచుకొని రూపవతి ధైర్యసాహసాదుల మెచ్చుకొనుచు దమపయనము విషయమైన యాలాపములు ముచ్చటింపుచున్నది.

ఇంతలో నొకదెస నేయుఁడు ! కొట్టుడు ! పట్టుడు ! పొడువుడు ! అను కోలాహలధ్వనియొకటి దూరముగా వినంబడినది. ఆ రొదవిని యమ్మదవతి లదరిపడుచు లేచి మృగముల కేకలువలె వినంబడుచున్నవి. పలాయమానంబులగు జంతువు లిందు రాగలవు.మనము కాచుకొని యుండవలయునని యాలోచించుచున్నంతలో నొక వరహ మాప్రాంతమునకుఁ బారివచ్చుచున్నట్లు కనంబడినది.

దానింజూచి యా చిగురుబోణు లిరువురు చెరియొకదెశకుఁబారిపోవ యత్నించు చుండ నక్కిటివరంబు పటువేగంబున నరుదెంచి రూపపతి వెంటఁబడి తరుముచుండెను. ఆబాల కోలముకందక నొక మాను చుట్టుదిరుగుచుండెను. ఆ యుపద్రవముఁ జూచి రాజపుత్రిక వెరువక సాహసముతో నొకబడియఁ దీసికొని యాపోత్రిం బెదరించుచు వెన్నంటి తరుమ మొదలు పెట్టినది. అయ్యడవి పందియు నాసుందరులును నత్తరు స్కందముచుట్టును గొరవి తిప్పినట్లు తిరగఁజొచ్చిరి. రాజుపుత్రిక చేతి దండతాడనములు లక్ష్యము సేయక నవ్వరాహంబు రూపవతిని విడువక తరుముచుండెను. అయ్యబల కొంతసేపు తిరిగి తిరిగి నిలువలేక యొడలుతిరుగ నలసటతో నిలువలేక పుడమింబడి మూర్చిల్లినది. అప్పుడా సత్వం బియ్యంబుజాక్షి వీఁపు పై గోళ్ళు నాటించి దండతాడన భయంబున నట నిలువక యవ్వలికిఁ బారిపోయినది. కళావతి కప్పు డట్టిబలమెట్లు వచ్చినదో తెలిసి కొనుట దుర్ఘటము.

అట్లు నేలంబడియున్న రూపవతింజూచి రాజపుత్రిక యురము బాదికొనుచు మొగమున మోముఁజేర్చి సఖీ ! రూపవతీ ! అని పలుమారు పిలిచియుఁ బ్రతివచనంబుఁ గానక సమసెఁగా నిశ్చయించి నేలంబడి హా ! ప్రాణసమప్రియా ! త్రిలోకసుందరీ ! నన్నీ యరణ్యంబునఁ బారవైచి నీవొక్కరితవు పరలోకమున కరిగితివా ? అయ్యో ? ఇంతకుముందే నేనధైర్యము పడుచుండ నాకెన్నియో మాటలు చెప్పితివే నీ యూహ లన్నియు నెందుఁబోయినవి. అక్కటా ! తలిదండ్రుల లెక్క సేయక గృహసుఖంబులఁ దృణముగా నెంచి నా వెంటనడవులకు వచ్చిన నీ విట్లు మృతినొందఁ గన్ను లార చూచి యున్నదాన నావంటి కృపనాత్మ యెం దైనంగలదా ! సేవించుక యలసిన పాదములొత్తుచు విసరుచు నాకలిఁ దీర్చుచు నెన్నియో యుపచారములు సేయుచుందువు. ఇప్పుడు నా ముపచార మొక్కటియుం గొనవేమిఁ ఇది సహవాసధర్మమే. తల్లీ ! చూడుము. మాట్లాడుము. నేనుగూడ నీతో వచ్చుదాననే. ఇంచుకసేపు నిలువుము. ఆపాదవగాహము నాపైబడక నిన్నేమిటికిఁ దరిమి నది. అట్లయిన నీచావు నేను చూడక పోవుదునుగదా? అని దెసలు ప్రతిద్వను లిచ్చునట్లు యేడ్చుచు రూపవతిపైఁ బడి యవయవముల ముద్దిడుకొనుచుఁ గౌఁగలించుచు మరల మరలఁ బిలుచుచు నిరీతిఁ గొంతతడవుఁ గడిపినది.

కొంతదరి కత్తలోదరి యదటుదిగి మెల్లనఁ గన్నులుఁ దెరచి కరసంజ్ఞచే శోకింపవలదని తెలుపుచు దాహముఁదెచ్చి యిమ్మని సూచించినది. ఆ సన్న గ్రహించి యాపన్న గవేణి యుబ్బుచు గొబ్బునలేచి లేడివలె మిట్టపల్లంబుల గణింపక దుముకుచు ముల్లుకంపల గణింపక నెగురుచు మృగబాధ తలంపక జలంబులదేర నూరక పరుగిడుచుండెను.

మరియు నొకతెరవునుండి వేరొక తెరవునకుం బోవుచు బల్లంబులఁ బరిశీలింపుచుఁ గోనల విమర్శింపుచు నిట్లు పెద్దదూరము తిరిగినది. నీటిజాడయేమియుం గనంబడినదికాదు అప్పుడు మిక్కిలి పరితపించుచు అయ్యో ! నే నింత వెర్రిపని చేసితినేమి? నే నేమూలనుండి వచ్చితినో యించుకయు గురుతు తెలియకున్నది. చాల దవ్వరుదెంచితినని తోచుచున్నది. జలములు దొరకలేదు. అందుఁగూర్చుండి యుపచారమైనఁ జేయక ప్రాణసఖి విడిచివచ్చితినికదా. ఆహా ! మోసపోయితిని వేగమచ్చటికే పోవలయు నేమిచేయుదును. వచ్చినదారియేదియో పోవలసినదారి యేదియో తెలియకున్నది. అన్నన్నా ! అని తలంచుచు నొకదారింబడి కొంతదూరము పరుగెత్తి నిలువంబడి యిది వచ్చిన త్రోవకాదు. మరియొకటి అని వెనుకకుఁదిరిగి మరికొంతదూరము పరుగెత్తినది. ఆధారియు గురుతు తెలిసినదికాదు. కొంచెము దూరముపరుగెత్తి నిలువంబడి రూపవతీ ! యని పెద్దయెలుంగునం బిలుచుచు జెవియొగ్గి ప్రతివచనంబు వినరామి నిఁకయెక్కడి రూపవతి ? ఈపాటి కేమృగమో భక్షించిపోవును. సీ ! సీ ! నావంటి బుద్దిహీనురా లెందునులేదు. ఇంచుకయు నాలోచింపక యప్పటికిఁ దోచినట్లు చేయుచుందును. అందులకే ముప్పులకెల్ల కారణమైతిని. నీరుండు తా వెరుగునట్లే పరుగిడి వచ్చితిని. దాపునఁ గూర్చుండి విసరుచు మోముఁదుడుచుచు మెల్లగ లేవనెత్తి తీసికొనిరాక నూరక యీరాకఁ గావించితినని పెక్కుగతులఁ దలపోయుచు నొక చెట్టెక్కి నలుమూలలు పరికించినది.

అప్పుడు దూరములో నొకదెస వేటకాండ్ర సందడి వినంబడినది. ఆ దెస గురుతు చూచుకొని యా పాదపము దిగి యమ్మగువ తిన్నగా నాదిక్కునకు నడువఁ దొడంగినది. పోయినకొలఁది యాధ్వనులు సమీపించుచుండెను. అప్పుడు వడివడిఁ బోయి యప్పడతి జనసమూహములోఁ జేరినది. విశాలమగు నెడారిలో గుడారములు పెక్కులు వేయఁబడియున్నవి. చుట్టును సైన్యము నిలువంబడి యున్నది. గజతురగ స్యందనాదులం బయనమునకు సన్నాహము సేయుచుండిరి. అట్టి సేనానివేసముఁ జేరి యా నారీ రత్నము జలము జలము అని యరచినది. అట్లుపొమ్ము. అనికొందరు ప్రత్యుత్తర మిచ్చిరి. ఆ చిన్నది కొంతదూరము లోనికింబోయి అయ్యా ! దప్పికొట్టి నామిత్రుఁడొక డీయడవిలో బడిపోయెను. వేగము మంచినీ రెండున్నదో తెలుఁపుఁడని పెద్ద యెలుంగునఁ బలికెను.

ఆ ప్రాంతమందలి శిబిరములో వేటకాండ్రు చుట్టునుబలసి వేటమాటలు సెప్పుచుండ వినోదముగా వినుచున్న కిన్నరదత్తుఁడను నృపాలుండు దైనముగా నా యార్తధ్వనిని విని యెవ్వఁడో దాహమని యరచుచున్నాడు. వాని నిచ్చటికిఁ దీసికొని రమ్మని యొకపరిచారకు నంపెను. వాఁడు వోయి యా రాజపుత్రికను దీసికొని వచ్చి రాజునెదుటఁ బెట్టెను. తదీయ ముఖవిలాసములు రూపరమణీయమును జూచి వెఱగుపడుచు నయ్యొడయుడు బాలుఁడా ! నీ వెక్కడివాడవు? ఇక్కడి కేమిటికి వచ్చితివి ? ఈ దాహము పుచ్చుకొని యిందు విశ్రమించి నీ వృత్తాంత యెరిగింపు మని యడిగిన మాటలు తడఁబడఁ గళావతి, దేవా ! ఇది నాకు విశ్రమింప సమయము కాదు. బ్రాహ్మణ కుమారుల మిరువురము కాశీలో విద్యాభ్యాసముజేసి యింటికిఁ బోవుచు నీ యడవిదారిం బడితిమి నా మిత్రుడు వరాహపాతితుండై మూర్చ మునిఁగి యున్నవాఁడు. వానికి దాహము దే నరుదెంచితిని. ఈ యడవిలో నెందును జలములు దొరకినవికావు. ఆలస్యమైన నతఁడు బ్రతుకఁడు నా పేరు శశాంకు రందురు. దేవర యనుగ్రహించి యొక పాత్రతో జల మిప్పింతురేని తీసికొనిపోయి మిత్రుం బ్రతికించుకొనియెద. రక్షింపుడు. రక్షింపుఁడు అని దీనముఖముతోఁ బ్రార్థించెను.

దయాహృదయుండగు నజ్జనపతి యా మాటలువిని జాలివొడమ శశాంకా ! నీ మిత్రుఁడు బ్రతుకఁడని చెప్పుచున్నావు. నీ మొగముఁ జూడ నీ యలసట ప్రమాదము చేయునట్లు తోచుచున్నది. ముందు జలములం గ్రోలి యాహారమునఁ దృప్తుండవై విశ్రమింపుము. నీ సఖుని దూతలంబుచ్చి రప్పించెదనని చెప్పిన సమ్మతింపక దేవా ! ప్రాణములైన విడుతునుగాని నా మిత్రుని దప్పి తీర్పక నే నాహారముఁ గొను వాఁడనుకాను. అయ్యో ! ఆ తా విచ్చటికిఁ జాల దవ్వున్నది. ఎప్పుడు పోపుదును. ఎప్పుడు వానినిం జూతును. మరల నాతఁడు నా కన్నులం బడునా ? అని పలవరింపుచు నాలుక యెండ, మాటరాకఁ దప్పిగొని నేలంబడి మూర్చిల్లెను.

అప్పు డా నరపతి పరితపించుచు నతని దనశయ్యపైఁ బరుండబెట్టించి శైత్యోపచారము లెన్ని యేని గావించుచు జంబీరరసమిశ్రితమైన తక్రసారంబు బలవంతమున నోట పట్టించి విశ్రాంతికలుగఁ జేసెను. మరియు నాచేత నిరువుర వారు వపురౌతులకుఁ బానియపాత్రముల నిప్పించి శశాంకుఁ డెరింగించిన గురుతులుచెప్పి యా మకరాంకుని సేదఁదీర్చి యిచ్చటికిఁ దీసికొనిరండని నియమించుటయు వా రతి జవంబున నరిగి యయ్యరణ్యంబంతయుం దిరిగి యెందును నా మకరాంకునిజాడఁ గానక విసిగి మరల సంజవేళకు గుడారములయొద్ద కరుదెంచి యా వార్త భూభర్త కెరింగించిరి.

కిన్నరదత్తుం డుత్తలమందు చిత్తముతో మంత్రిసత్తములం గాంచి యిట్లనియె. అమాత్యులారా ! ఈ భూసురకుమారుండు కడు సుకుమారుండువలె గనంబడుచున్నవాఁడు. ఎంతసేదఁదేర్చినను దెలివిఁ జెందకున్నవాఁడు. వైద్యులు పరీక్షించి వీఁడు జాలదినములనుండి నిద్రాహారములు లేక బడలియున్నాడనియు నింక రెండు మూడు దినములవరకుఁ దెలివిఁ జెందఁడనియుఁ జెప్పిరి. ఈతఁ డత్యంత గుణసంపన్నుండని వానిమాటలే చెప్పుచున్నవి. ప్రాణము పోవుచున్నను మిత్రుని నిమిత్తము దాహముఁ గ్రోలఁదయ్యెగదా ! ఇంతకన్న సౌశీల్యమేమియున్నది? వీనియందు నాకెంతేని యక్కటికము గలుగుచున్నది. వీని మనవీటికిఁ దీసికొనిపోయి యున్నత దశ నొందించెద. వీఁ డనినట్లు మకరాంకుఁడు క్రూరసత్వంబుల పాలయ్యెనని తోచెడిని. వీని కాతెరఁ గెరింగింపరాదు. ఈతఁడు మిత్రుని నిమిత్తము ప్రాణములు విడువఁగలఁడు. ఉత్తముని లక్షణము లవియే కదా యని పలుకుచు నాఁటిరాత్రి పయనము బోవుటకు యాజ్ఞాపించి కుదుపుఁ జెందకుండఁ దా నెక్కి వచ్చిన యందలముపై


బరుండఁబెట్టి దీసికొనిరమ్మని నియమించి తాను దురగారూడుండై బయలు వెడలెను.

నాఁటి వేకువజామునఁ జతురంగబలముతోఁ బయలుదేరి యజ్ఞనపతి కతిపయ ప్రయాణంబుల శోభావతియను బేరంబరగు తన రాజధాని కరిగెను. సామంతాది పరిచారకులు రాజనుమతిని శశాంకుని యందలముకూడ శద్దాంతమందిరమునకుఁ దీసికొనిపోయి యందు వేరొక శయ్యపైఁ బవ్వళింపజేసిరి అప్పుడు కిన్నరదత్తుఁ డత్యంత సంతోషముతోఁ దన పట్టమహిషి కక్కు మార శేఖరుంజూపుచు దేవీ ! యీతండొక మహీదేవేంద్రుని కుమారుఁడు. వీనిపేరు శశాంకుఁడు వీని సౌందర్యముకన్న విద్యలును విద్యలకన్న సుగుణములును స్తోత్రపాత్రములై యున్నయవి. మేము స్వయముగాఁ బరీక్షించి చూచితిమి. దైవికముగా వీఁడు దారితప్పి మా సేవలోఁ జేరికొనియెను. అనపతుల్యమగు మనకు వీని దైవమే తీసికొనివచ్చి యిచ్చెనని సంతసించుచు నా రాజ్యము వీని యధీనము సేయ నిశ్చయించితిని. వీఁడే మనకుఁ బుత్రుఁడు. నీవు మాతృ విహీనయైన నీయన్నకూఁతురు తారావళిఁ బెంచుచుంటివిగదా. ఈ సుగుణనిధికిఁ దారావళినిచ్చి పెండ్లిఁ జేసికొనుము. దానంజేసి నీ పెంపు సాద్గుణ్యము కాఁగలదు. ఇన్నియు నాలోచించియే యిప్పనిఁజేయఁ బూనికొంటిని. అట్లయిన నిరువుర రూపములు సఫలములగునని చెప్పిన విని సంతసించుచు నారాజపత్ని యందుల కంగీకరించి యా కుమారునికి స్వయముగా నుపచారములు సేయఁదొడఁగినది శశాంకుఁడు తల్పంబునఁ బండుకొని నడుమనడుమ హా రూపవతీ ! బాపురే ! సఖీ ! రూపవతీ; యని పలవరింపుచుండెను రాజపత్ని యాశ్చర్యముగా వినుచు నిట్లు పలవరింప నేమిటికోయని వితర్కింపుచుండెను.

అంత నాలుగవనాడు శశాంకునికి దేహస్మృతికలిగినది. కన్నులందెరచి యెదురునున్న రాజపత్నింజూచి విభ్రాంతిఁ జెందుచు అమ్మా ! నీవెవ్వతెవు ? నే నిచ్చటి కెట్లువచ్చితిని? ఇది కలయా? నిజమా? ఇంద్రజాలమా ! ఎరింగింపుమని యడిగిన నామె యిట్లనియె.

వత్సా ! నీవునన్నుఁ జూచినతోడనే యమ్మా ! యని చీరితివిగదా ! నీకు నేను దల్లినే. నీవునాకుఁ బుత్రుండవు ఇదిగో తారావళి నీభార్య. నీయంద మూరక పరీక్షించుచున్నది. నీవు చాల నలసితివి. మధురా హారములఁ దృప్తుండవుగమ్ము. నెమ్మది నంతయుం జెప్పెదనని పలికిన నతం డున్మత్తుండువోలె నొం డెరుఁగ నేరక తద్దత్తములైన మృష్టాన్నముల సంతృప్తివడసి విశ్రాంతిబొందిన పిమ్మట నాత్మీయవృత్తాంతమును దలంచుకొనుచు నోహో! నేనడవిలో నుంటినికాదా? అవును రూపవతికి దాహముఁ దెచ్చి యిచ్చుటకై యొక రాజుగారి శిబిరమునకు వచ్చితిని. తరువాత నేమిజరిగినదో జ్ఞాపకములేదు. అయ్యో ! రూపవతిమాట యేమైనది. నేనిందు జాగుచేసితినిగదా ! అని లన లేచి యెసులకుఁ బడుగిడంఁ దొడంగెను. గన్న గదత్తుడు వాసికధ యంతయు భార్య తెలింగించి యొన్న డు కావున నా చర్యలన్నియు గ్రహించుచు నా యోషామణి కూసి కడ్డము వోయి చిన్న ఛాతం నిలువలు ఎక్కడి3 బోయెనవు అని యడిగిన నతడిట్లనియె. అమ్మా: నా సఖుఁడొకఁ డడివిలో పాసితుడై యున్నవాడు. నేనిక్కడికి వచ్చి నిద్రపోయితిని. చాలసేపయినది. అతం డేమయ్యెనో తెలియదు. జలములు తీసికొని పోవలయును. నా శిబిర మేమైనదని యడిగిన నవ్వుచు నాసుందరి యిట్లనియె. పుత్రా ! నీ యాత్ర వేమిటికి వినుము. నీమిత్రుని నిమిత్తము దూతలం బుచ్చిరి. ఇక్కడికే రాఁగలడు. చింతింపకుమని పలుకుచుండగనే యతండు లేచెనను వార్తవిని కిన్న రదత్తుం డచ్చటి కరుదెంచెను.

ఆ నృపతిని గురుతుపట్టి రాచపట్టి తండ్రీ ! నాసఖునొద్దకు జలంమంపితిరా ? అతండేమయ్యెనని యడుగుటయు నతండు వత్సా ! నీకు వానియందుఁగల ప్రీతి నీయందు వానికి లేదుగదా? మరౌతువోయి వానిని వెదకిపట్టుకొని దప్పితీర్చి నీ మిత్రుఁ డందున్న వాఁడు రమ్మని యెంత చెప్పినను వినక వేరొక తెరువునఁ బోవుటకు బ్రయత్నించెనట అప్పుడు మారౌతు నీవొక్కరుఁడ నీయడవిలో నడువలేవు. ఈ గుఱ్ఱముపై కూర్చుండుము. అడవిదాటించెదమని చెప్పి యతనిఁ దనవారువముపై నెక్కించుకొని వేరొకమార్గమున నరణ్యముదాటించివచ్చిరి. ఇదియే నిమిత్రవృత్తాంతము నీవువానికొరకుఁ జింతింపఁబనిలేదని చెప్పిన శంశాంకుడు అవును. నన్నుఁగృతఘ్నుగాఁదలచి యట్లు చేసెను. సఖుఁడాపదఁ జెందియుండ నేనఁటఁ బోక వేరొకరిం బనిచిన ననుమోదించునా? ఇది నాతప్పే. దేవా ! మీరునాకుఁ బ్రాణదానముఁ గావించిరి. నా జీవితాంతముదనుక మీకుఁ గృతజ్ఞుఁడనైయుండెద నిఁకపోయివచ్చెద ననుజ్ఞయిండని ప్రార్ధించిన నవ్వుచుఁ గిన్నరదత్తుం డిట్లనియె

శంశాంకా ! నీ యంకములన్నియు సార్వభౌమత్వము సూచింపుచున్నది. నాకు సంతతిలేదు. నిన్నుఁ బుత్రునిగానెంచి రాజ్యము నీ కిచ్చివేసితిని. నేను వృద్ధుఁడనగుట రాజ్యంబేలఁ జాల ప్రాయము చిన్నదైనను నీ బుద్దిబలము పెద్దది. నీ గుణములువిని ప్రజలు నిన్ను రాజుగాఁ గోరికొనిరి. ఆ తారావళియే నీకుఁ బట్టమహిషి కాగలదు. స్వస్థుండవై రాజ్యం బేలుకొనుమని నయకళా కౌశల్యముతోఁ జెప్పిన నతండంగీకరింపక నెన్నియో ప్రతికూల వాక్యములం జెప్పెను.

రాజు వాని యుక్తులన్నియు ఖండించి యతని నిరుత్తరుంజేసెను. శంశాంకుం డప్పటికేదియుఁ దప్పించుకొను నుపాయంబుఁ గానక పిమ్మట విచారించుకొనవచ్చునని యంగీకారము సూచించెను.

ఉత్తమ పుత్రుండు లభించెనని యా నృపోత్తముం డధిక కౌతూహలముతో నొప్పుచుండ నొండురెండు నాళ్ళరిగినంత నాధరా కాంతుఁ డాకస్మికముగా సర్పదష్టుండై ప్రాణములు విడుచుసమయమునఁ బ్రకృతి వర్గమును కానించి గన్నీరుఁ కులపుట తడే నా కొమురుడు. సకల ద్యా పరిపూర్ణుడు. రదుడగుట న్యాయంబన రాజ్యం చేసింది.. నన్ను. గర సౌఖ్యను లండఁగలరని చెప్పుచునే నిశ్చేష్ఠకు చెయ్యను. శశాంకుఁడు మిక్కిలి దుఃఖింపుచు నతని కపర సంస్కారములు నిర్వర్తించి యనంతరము మంత్రి సామంత పురోహితాదులచే నిమంత్రితుండై పట్టాభిషిక్తుండయ్యెను. అతండట్లు రాజ్యభారము మీదవైచికొని లోపములు సవరించుచు చట్టములు నిర్మించుచు దుర్జనుల శిక్షించుచు సుజనులను రక్షించుచు చిరకాలములో నధిక విఖ్యాతి సంపాదించెను.

కొంతకాల మరిగినవెనుకు కిన్నరదత్తునిభార్య శశాంకునొద్ద కొకలేఖ నంపినది. వత్సా ! శశాంకా ! నీవు శశాంకునిపగిది ప్రజలకుఁ జల్లనివాఁడవై రాజ్యంబేలుచు మీ తండ్రికీర్తి వర్ధిల్లజేసితివి. ఇందుకు బ్రకృతివర్గము చాలా సంతోషించుచున్నది. అది యటుండె నాయన్న కూఁతురు తారావళినిఁ దల్లి లేనిదానిని జిన్నతనమునుండి నేను పోషించి పెద్దదానిం జేసితిని. దాని చారిత్రము నీవదివరకు వినియే యున్నావు. వృద్ధరాజు అది నీ పట్టమహిషియని చెప్పియే యున్నాడు. ఇప్పడా చిన్నది సమారూఢయౌవనయై యున్నది. కావునఁ బెండ్లియాడి గృహస్థు డిపుఁగమ్ము. నేను మిగుల సంతసించెదనని తల్లివ్రాసిన కమ్మను గన్నుల కద్దికొని శశాంకుఁడు తనపూర్వోదంత మంతయు నంతఃకరణ గోచరమగుటయు నప్పుడామెకు సమాధానముగాఁ బ్రతిలేఖనంపి యాత్మగతంబున నిట్లు తలంచె

ఆహా ! రాజ్యమదాంధులు తమ్ముఁ దామే యెరుఁగనిచో నొరులనెట్లు తెలిసికొనఁ జాలుదురు. ఆఁడుదానను మగరూపున రాజ్యం బేలుచున్నదాన ననుమాటయే మరచిపోయితిని. ఔరా ! ఎంతచిత్రము. రాజ్యభోగ వ్యసన మెట్టి మైకము కలుగఁజేసినది? అయ్యో ? యిప్పుడుపోయి వయస్యలఁ గలసికొందమన్నను నీ రాజ్యము నాకుఁ బాదగళమైనదిగదా. కానిమ్ము. వారినిచ్చటికి వచ్చునట్లు చేసెదనని యాలోచించి యొక పత్రికయం దీ పద్యము వ్రాయించెను.

ఆ. వె. పిన్నపాపనలనఁ గన్నెలు మువ్వురు
         గలిగి రట్టివారు కన్మొఱంగి
         దెసలఁ గొసలఁ దెలియఁ దిరుగుచు నున్నారు
         వారిజాడఁ దెలియవలయు మాకు.

అని వ్రాయించి కింకరులకిచ్చి మీరు దేశదేశముల దిరుగుచు నీ పద్యముఁ జదువునది. దీనికి సానుభవముగాఁ బ్రత్యుత్తర మిచ్చినవారి సబపఱమానముగా నా యొద్దకుఁ దీసికొనిరండని యాజ్ఞాపించి పంపించి తా నంతఃపురమునకుఁ బోయెను. అని యెరింగించి మణిసిద్ధుం డవ్వలికథ తరువాతి యవసధంబునఁ జెప్పం దొడంగెను.