కాశీమజిలీకథలు/అయిదవ భాగము/51వ మజిలీ

వికీసోర్స్ నుండి

శ్రీ రస్తు

కాశీమజిలీకథలు

51వ మజిలీ

చతుర్థోల్లాసము

అట్లు శంకరయతిచంద్రం డమరకనృపశరీరంబు బ్రవేశించి తత్కాంతారత్నములతో గంతుక్రీడావిశేషంబు లనుభవించుచున్నంత నియమించినసమయ మతిక్రమించుటయు నచ్చట గొండబిలంబునం గళేబరమును గాచికొనియున్న శిష్యులు విచారముతో నొండొరు లిట్లు సంభాషించుకొనిరి.

పద్మపాదుడు :- అయ్యో! మనయాచార్యుండు నియమించిన యవధి దాటి యైదారు దినములైనది. యిప్పటికిని దనశరీరమున బ్రవేశించి మరల సనాథులం జేయకున్నాడు ఏమి చేయుదము? ఎందు వెదుకుదుము? అతనిజాడ జెప్పువా రెవ్వరు? అన్యశరీరమున నిగూఢుడైన యతని గురుతు పట్టుట యెట్లు?

వామదేవుడు :- పద్మపాద! ఆ తీర్ధపాదుని దర్శనము మనకు వెండియుం గలుగునా?

గుణనిధి - దుర్జనుల యవినయముల బోగొట్టుచు సజ్జునుల సంసారాగ్నిం జల్లార్చునమ్మహాత్ముండు మనల నుపేక్షజేయునా?

హంసుండు - ఓహో సకలదురితంబుల విలయము నొందింపుచు నవనవాహ్లాదముల గలుగజేయు యతీంద్రచరణసేవకన్న మిన్నయగు వ్రత మేమి యున్నది?

చిత్సుఖుడు :- హా! గురువరా! నీవు శీఘ్రముగా రాకపోయితివేని మా శోకమును బోగొట్టువా రెవ్వరు?

చిత్రభానుడు :- మేమెల్ల నిన్ను నమ్మియున్నవారము. అనాథులము. సాధుమతీ! వేగము వచ్చి మ మ్మోదార్పవా?

పద్మపాదుడు :- మిత్రులారా! మీ రూరక చింతించినం బ్రయోజనము లేదు. నే నొకయుపాయంబు వచించెద. వినుడు. మన మీపుడమి నెల్లబర్వతగుహారణ్యములు వెదకి యందు గనఁబడినచో స్వర్గపాతాళముల సైతము వెదకుదము గాక.

చిత్రభానుడు :- మూడులోకములు వెదకినను అన్యశరీరనిగూఢు నతని నెట్లు గ్రహింపగలము?

పద్మపాదు :- అయ్యో! రాహుగ్రస్తుం డైనను జంద్రుండు తత్ప్రకాశగుణములచే దెలిసికొనబడుచుండలేదా? అమ్మహాత్ముని యునికి తద్గుణములే వెల్లడి చేయగలవు.

చిత్సుఖుడు :- సందేహమేల? మేఘచ్ఛన్నుండైనను సూర్యుని తేజము తెల్లముగాకున్నదియా?

పద్మ :- మన్మథకళాపాండిత్యము సంపాదింప నకాముఁడైనను కామినీజనప్రియమగు శరీరమును ప్రవేశించియుండబోలు. అతం డుండుదేశమున బ్రజలకు రోగశోకాదిబాధలు గలుగక నిత్యతృప్తులై స్వధర్మనిరతులై యుందురు. వర్షములు చక్కగా వర్షించును. భూమి తృణకాష్ఠజలసమృద్ధి గలిగియుండును. ఇవియే గురుతులు.

చిత్రభానుడు :- అట్లైన నాలస్య మేమిటికి? యిప్పుడే పోవుదము రండు. వృథా కాలక్షేపము చేయనేల?

పద్మపాదు :- ఆచార్యశరీరము రక్షించుచు గుణనిధ్యాది విద్యార్ధు లిందుండవలయును. మనమందరము వెదుకవలయు నిదియే నా యభిప్రాయము.

చిత్సుఖు :- అందులకు మేమందరము సమ్మతించితిమి. అని యొండొరులు మాట్లాడికొని పద్మపాదాది శిష్యులందు గొందరినుంచి గురు నన్వేషించుతలంపుతో నక్కొండ దిగి యా ప్రాంతారణ్యభూముల నరసికొనుచు నరిగి యరిగి కనంబడిన గ్రామములలో నెల్ల విశేషముల నడిగి తెలిసికొనుచు దేశాటనము గావింపుచుండిరి.

గీ. శంకరాచార్యశిష్యు లాశ్చర్యలీలఁ
   బురనదీపక్కణారణ్యభూము లట్లు
   వెదకికొనుచును ధిక్కృతవిబుధదేశ
   ములగు నమరుకనృపదేశములకుఁ జనిరి.

తచ్ఛాత్రోత్తము లద్దేశంబు సంపన్నత్వంబు గాంచి వెరగుపడుచు గ్రమంబున దద్రాజధాని కరిగి యొకభూసురుని యింటి కతిథు లగుటయు నతండు వారి నుచితసత్కారంబుల నాదరింపుచు మృష్టాన్నసంతృప్తులం గావించి పిమ్మట వినయముతో వారి కిట్లనియె. అయ్యా! మీ నివాసదేశ మెచ్చట? ఎందుబోవుచున్నారు? ఇచ్చటి కేమిటికి వచ్చితిరి? భవదీయచరణరజస్సంపర్కమున మద్దేహంబు పవిత్రమైనదిగా! యని యత్యంతస్తోత్రపూర్వకముగా నడిగిన విని యా శిష్యులిట్లనిరి. గృహమేధీ! మాది కాశీదేశము. గుదువిత్తార్ధులమై మేము వచ్చితిమి. యీ దేశ మెవ్వరిది? తన్నామధేయ మెట్టిది? మీ రాజు పండితుల గౌరవించునా? సరసత్వ మున్నదియా! అతం డేవిద్యయం దిష్టము గలవాడు? ప్రాయ మెంత? విశేషము లేమి? యని యడిగిన విని యాబ్రాహ్మణుం డిట్లనియె, ఆర్యులారా? అమరుకుండను నృపాలుం డీదేశమును బాలించుచున్నాడు. అతనిని గడుధర్మాత్ముండనియే చెప్పదగినది. యీ నడుమ నొక విశేషము జరిగినది వినుడు. అతనికి నాభేటనక్రీడయందు మిగులవేడుక యగుటచే నా జనపతి తరచు వేటలాడుచుండును. కొన్నినెలలక్రిందట నొకమహారణ్యములో గ్రూరసత్త్వములు మిక్కుటముగా నున్నవని విని కతిపయపరిచరపరివృతుండై గుర్రమెక్కి యత్కాంతరమునకుం జని యజ్జనపతి యొకచెట్టుక్రిందం గూర్చుండి యర్ధరాత్రంబునం మృగములజాడ నరయుచుండెను,

అంతలో నత్యంతశిరోవేదన యావిర్భవించుటయు నా వ్యధ సైరింపలేక యాతరువుక్రింద బరిచారిక విరచితపత్రశయ్యను శయనించి యారాజ పంచాననుండు వారు చూచుచుండగానే రెండుగడియలలో బంచత్వము నొందెను. అట్లు విగతచేతనుండై పడియున్న యన్నరపతిం జూచి చింతాసంతాపితస్వాంతులై కింకరు లార్తనినాదములతో వచ్చి యవ్వార్త నిప్పురంబంతయు వెలయజేసిరి. అమరుకుండు రూపయౌవనకళాన్వితలగు యువతుల నేరి నూర్గుర బెండ్లియాడియున్నవాడు. కావున వారెల్ల నయ్యుపద్రవమును వినినతోడనే కరవాలఖండితకదళీప్రకాండంబువోలె నేలం బడి దారుణశోకాయత్తములగు చిత్తముల నుత్తలమందుచు మంత్రిసామంతపౌరదాసదాసీజనంబులు వెంట నరుదేర నప్పు డయమ్మహారణ్యంబునకుం బోయి యం దొకచెట్టుక్రింద స్వర్గపదభ్రష్టుండైన పుణ్యపురుషుండువోలె నేలంబడియున్న యన్నరేంద్రుం గాంచి యక్కాంచనగాత్రులొక్క పెట్టున నయ్యరణ్యంబు ప్రతిధ్వనులీయ నతని గాత్రముపైఁ బడి యేడవ దొడంగిరి. రెండుదినంబు లేకరీతి నట్లు నిద్రాహారంబులు మాని యమ్మించుబోణు లానృపతి కళేబరము విడువక శోకించిరి. అప్పుడు మంత్రు లెట్టకేని వారినూరడింపుచు నిఁక శరీరము నిలువదు. ఇతండు పుణ్యపురుషుండు. అగ్నిసంస్కారములు గావింపవలయునని పలికి యథాశాస్త్రముగా సంస్కారములు గావింపఁ జేసి యతని శరీరమును జితిపై నెక్కించిరి.

అట్టిసమయమున నే నందే యుంటిని. తత్కాంతారత్నమునెల్ల జితివిడువక మమ్ముఁగూడ నిందుఁ గప్పిఁ యగ్గినంటిపుఁడని పలుకుచుండ మంత్రులు వారించుచు వారినూరడించి తీసికొనిరండని తగువారిని నియమించుచుండిరి ? అంతలో నమ్మేదినీకాంతునియంగము గదలినట్లు పొడకట్టినది. అత్తెఱఁగరయ నత్తరుణులు రొదచేయక యట్టే నిలువంబడి చూచుచుండఁ గొండొకవడిక్కి నూపిరి విడుచుచున్నట్లు తోచుటయు సంభ్రమముతో నుండుఁడు ఉండడు. మనపుణ్యము బయలుపడ చున్నట్లున్నది. అనిపలుకుచుజేతులుసాపుచు బరీక్షింపుచుండ నిట్టూర్పు నిగడింపుచు నొత్తిగిల్లెను. అప్పుడు రాజు బ్రతికె బ్రతికె నను నినదము లయ్యారణ్యమంతయు వ్యాపించినవి. పిమ్మట నమ్మనుజపతియు నిద్రించి మేల్కొనినట్లు లేచి కూర్చుండి కన్నుల నులిమికొనుచు నేమి యిట్లేడ్చుచున్నవారని యడిగెను అప్పు డప్పడఁతులు ప్రాణనాథునిపైఁ బడి యేడ్చుచు దద్వృత్తాంతమంతయుం జెప్పిరి తరువాత నాభూనేత వారినెల్ల నోదార్చుచు నమా త్యాదిమిత్రవర్గముతోఁ గూడికొని మెండువేడుకతో వెండియు నిప్పురి కరుదెంచి పట్టాభిషిక్తుండై రాజ్యము గావింపుచుండెను. నాటంగోలె నానృపతి పుటంబువడిన పసిండి వోలె వన్నెగలిగి యత్యంతతేజంబు మెఱయ నొప్పుచుండెను. ప్రజలు రోగశోకాదివ్యధలు వహింపక ధర్మతత్పరులై మెలంగుదురు. ఇదియే మానృపతి వృత్తాంతము. మరియు భార్యల సంతసపరుప నిప్పుడు రాజ్యంబు మంత్రుల యధీనముఁజేసి తాను కేళీశైలంబున విహరింపుచున్నవాఁడు. శృంగారలీలాకలాపంబున నానందింపుచు భార్యలతో వేడుక లనుభవింపుచుండుటంబట్టి యిప్పుడు మీవంటివా రాయనను దర్శించుటకు సమయముకాదు. సంగీతవిద్యాప్రవీణులకు గాక యితరులకు నమరుకుం డవసర మిచ్చుటలేదని వాడుకయున్నది. ఇదియే నాయెరింగిన వృత్తాంతమని చెప్పి బ్రాహ్మణుం డూరకుండెను.

ఆ కథవిని పద్మపాదాదు అత్యంత సంతోషసాగరంబున మునుంగుచు అవును నాఁడు నాతో నతనిపేరే చెప్పిన జ్ఞాపకము. అయ్యారే మనయయ్యవారే యితండు సందియములేదు. తరుణీసక్తుండై యున్నవాఁడని యొండొరుల చెప్పుకొనుచు వీణలు సంపాదించుకొని గాయక వేషములు వైచుకొని గీతంబులఁ బాడికొనుచు నప్పట్టణవాసులనెల్ల రంజింపజేయుచుఁ గ్రమంబున నానృపాలుని శ్రుతిపథంబుఁ బ్రవేశించి యతనిచే నాహూయమానులై యొకనాడు తదాస్థానమున కరిగి యందు,

సీ. ఇరుగెలంకుల నిల్చి కరకంకణధ్వనుల్
            బరగఁ జేడియలు చామరము లిడఁగ
    ధర్మదండసితాతపత్రరత్నద్యుతు
           ల్మకుటమాణిక్యదీపికలఁ బెనుప
    శరదిందుముఖులు కొందరు ముందరను గాన
           తాసస్వనముల నుత్సవము సేయ
    వాకామిను లొక్కవంక శృంగారలీ
          లాతిచాతుర్యనృత్యములు జరుప

గీ. ఆకృతిం గని భువిఁ జేరినట్టి మదనుఁ
   డనఁగ యువతీతాళవృతుం డగుచుఁ దార
   కావృతుండగు హిమకరుకరణిఁ గొలువు
   కూటమున నొప్పు నృపుఁ గనుగొనిరి వారు.

కనుంగొని తదీయశృంగారలీలావినోదంబుల కచ్చెరువందుచుఁ దదాజ్ఞ నందరు నుచితపీఠంబులం గూర్చుండి యాసభాసదులన పూర్వగాంధర్వవిద్యాకౌశలంబున మోహింపంజేయుచు భృంగకైతవంబున నమ్మహారాజున కి ట్లాత్మవృత్తాంతంబు బోధపరచిరి.

ఉ. భృంగమ నీవు భూధరదరీవవరంబున మేనువైచి యా
     సంగతి నించుకంతయొ విచారముసేయక యిందుఁగామవృ
     త్తింగుతుకంబుఁజెందెదవు ధీరతయే నినుఁగాంచియున్న యా
     భృంగములెల్ల నీకొఱకు ఖేదముజెందుచునుండ నయ్యాయ్యో.

క. మదనకళాపాండిత్యం
   బొదవఁగఁ దొలిమేనునువిడిచి యొగి నిచ్చట ష
   ట్పదమా! క్రుమ్మరెదవు నీ
   వది యెరుఁగక యిట్లు మోహమందుట తగునే.

గీ. శాంతిదాంత్యాధికాచారసరణి విడిచి
    గర్వమున నాత్మవస్తువు గానవేమి
    తలఁచికొనుము మనంబులోపల నిజంబు
    దెలియ మామాటలను భృంగకులవరేణ్య.

గీ. నేతినేత్యాదివాగ్రీతిబుధులు
   ధృతిజగంబంతయును నిషేధించి యందు
   సోహమనిదేనినాత్మకా నూహసేయు
   దు రదియేసూవె నీవు బంధరవరేణ్య.

గీ. దంచి ధాన్యంబుఁ బొల్లు వర్ణించి తండు
   లములఁ గైకొనురీతి సత్తములు యుక్తిఁ
   బంచకోశమ్ములను వివేకించి దేని
   నేరికొందురొ తత్త్వ మీవె భృంగ.

చ. సరయతి నింద్రియాశ్వములు స్వైరగతి న్విషమప్రదేశముల్
    దిరుగఁగ దోషదర్శనసుతీప్రకశాపరితాడనంబుల
    న్మరల చిస్వాంతలక్షణసమంచితరశ్ముల దేనియందు సు
    స్థిరముగఁ గట్టివేయుదురు ధీరులు నీ వది కావె భృంగమా.

గీ. అరయ నేది జాగ్రదాచ్యవస్థల నను
   స్యూతమై యుపాధి జారమంట
   క సరులందు దార మట్లవేరుగనుండు
   నట్టితత్త్వమీవె యళివతంస.

సీ. శమదమోపరమాది సాధనంబులచేత
           స్వాత్మచేతనె తమ యాత్మయందు

    విద్యాంసు లెద్దాని వెదకి శ్రద్ధాభక్తి
           విశ్వాసయుక్తి దద్విధ మెరింగి
    యధిగతామితసచ్చిదానందరూపులై
           సంసారమున వెండి జననమరణ
    లక్షణక్లేశంబులను జెంద కెప్పుడు
           నిత్యసౌఖ్యోన్నతి నెసఁగుచుందు

గీ. రట్టితత్త్వంబు నీ వౌదు వళివతంస
   తలఁచికొమ్ము మనంబులోపల నిజంబు
   దెలియుమాటలను దేటతెల్లముగను
   మోహమందుట తగదు నీ కైహికమున.

వ. అని యిట్లు వీణాతంత్రీస్వానంబులతో గంఠనాదంబుల మేళగించి యాయంతేవాసు లత్యంతమనోహరస్వరంబుల గాంధర్వంబు బాడి తత్సభాసదుల మోహవివశులం గావించిరి. అమరకుండును దద్గానామృతంబు గ్రోలి వివశుండయ్యెనో యనఁ దద్వాక్యంబులంగల యభిప్రాయంబు హృదయంబునకుఁ బశ్చాత్తాపము గలుగజేయ నప్పుడ యప్పీఠంబుదండకు మేను జేర్చి విగతచేతనుం డయ్యెను.

అవ్విధంబు సూచి యతండు నిద్రించుచున్నవాఁడని తలంచి రాజభటులు సద్దుచేయవద్దని సభ్యులకెల్ల దెలియజేసిరి. అప్పు డొక్కింతసేపు తత్సభాభవనము చిత్రతంబaయిన నిశ్శబ్దమైయుండెను. ఆ నృపాలుం డెంతసేపటికిని లేవక యట్లనే పడియుండుటఁ దిలకించి మించుబోణులు కొందరు దాపునకుఁ బోయి వికృతవదనముతో కళదప్పియున్న యతని యాకృతిం జూచుచు "అయ్యో! యిది యేమి చిత్రము? ఈ ధాత్రీపతి మఱల మూర్ఛ నొందినట్లున్నవాఁడ"ని పెద్దయెలుంగునం బలికిన నాధ్వని విని యందున్న రాజభార్యలెల్ల బెల్లుగా నేమియేమి యని యరచుచు దాపునకుం బోయి చూచి గుండెలు బాదుకొనుచు, హా! యింకేమి యున్నదనువారును, యిట్టి ప్రాణనాథుఁడు మన కేమిటికిఁ దక్కుననువారును, ఆ గండముదాటి యింతలో మరల నిట్లయ్యె నేమనువారును, మునుబోలె మరల బ్రతుకునేమో యనువారును, మన కట్టియదృష్టము పట్టునా యనువారును, ఎంతలో నెంత సంతోషము పెట్టె నిట్లయ్యెనే యనువారును, ఈ నడుమ నీ సుఖము చేయకపోయినను నింతవిచారము లేకపోవుననువారును నారాజకాంతలెల్ల నానెలదినములలో నతండు గావించిన కృత్యములన్నియు స్మరించుకొనుచు నుచ్ఛస్వరంబుల నేడుఁవదొడంగిరి. అంతలో నా వృత్తాంత మాలించి సామంతమంత్రిపురోహితాదు లచ్చోటికి వచ్చి యతండు చచ్చుటం జూచి యచ్చెరువందుచు నంతకుఁబూర్వము జరిగిన కథయంతయు విమర్శించి బుద్ధిమంతులగు మంత్రు లాగాయకు లెచ్చట నున్నారని కేకవేసిరి.

గాయకులు -- (ముందరికి వచ్చి) అయ్యా మేమే గాయకులము.

మంత్రులు - మీదే దేశము ?

గాయకులు - మా కొకదేశము విషయములేదు. సర్వదేశములు మావే. అన్నిదేశములు తిరుగుచుందుము.

మంత్రులు - మీరి క్కడికి వచ్చి యెన్ని దినములైనది?

గాయకులు - నాలుగు దినములైనది.

మంత్రులు — మీ రెవ్వరియాజ్ఞఁ బూని యీ లోపలకు వచ్చి సంగీతముఁ బాడిరి?

గాయకులు — ఱేనియానతిమీదఁనే పాడితిమి.

మంత్రులు — మీరేమి గీతములు పాడితిరి!

గాయకులు — భ్రమరగీతములు లోనగునవి పాడితిమి.

మంత్రులు — వానిలో నిపు డొకగీతము నుచ్చరింపుఁడు.

గాయకులు — ఏమిటికి ?

మంత్రులు — పనియున్నది.

గాయకులు — గీ. శాంతిదాంత్యాదికాచారసరణి విడిచి
                      గర్వమున నాత్మవస్తువు గానవేమి
                      తలఁచికొనుము మనంబులోపల నిజంబు
                      దెలియు మా మాటలను స్సంగ కులవరేణ్య.

మంత్రులు — (ఒండొరుల మొగములు చూచుకొనుచు) ఇంతకుఁ బూర్వము ప్రారంభమునఁ జదివిన గీతముఁ జదువుఁడు.

గాయకులు — ఉ. భృంగమ? నీవు భూధరదరీవివరంబున మేన వైచి యా
                       సంగతి నించుకంతయు విచారముసేయక యిందు గామవృ
                       త్తిం గుతుకంబుఁ జెందెదవు ధీరతయే నినుఁ గాచియున్న యా
                       భృంగములెల్ల నీకొఱకు ఖేదము జెందుచునుండ నయ్యయో.

మంత్రులు - అయ్యా దీని కర్థ మేమియో చెప్పుము.

గాయకులు — దీనియర్థము మాకుఁ దెలియదు. మూలము మాత్రము పాఠముఁ జేసితిమి.

మంత్రు - మీ రర్ధముఁ దెలియకయే వీనిం జదివితిరా? ఈ గీతము లెవ్వరు రచించినవి?

గాయకులు — అదియుం దెలియదు. మాకు సాహిత్యము లేదు. మేము వట్టి మూఢులము. మ మ్మిన్నిప్రశ్నములు వేయుటకుఁ గారణ మేమి యున్నది.

మంత్రులు — మీరు మూఢులా సత్యము చెప్పుడు.

గాయకులు — ప్రపంచకమే యసత్యమైయుండ మా మాటలు సత్యములని మిమ్మెట్లు నమ్మింతుము? సత్య మసత్యము, అసత్యము సత్యము నెన్నఁడును కానేరదు గదా.

మంత్రులు — ఓహో మీరు గాయకులమని మోసపుచ్చి లోపలకు వచ్చి మా రాజుగారి ప్రాణములు గ్రోలితిరే.

గాయకులు — అయ్యో! మేమేమి చేసితిమి. దూరముగా నుండియే పాడితిమి. గానాంతరమున విమర్శింప నవసరము గలుగదయ్యె. మాయపరాధ మేమియున్నదియో యంతఃపురకాంత నడిగి తెలిసికొనుఁడు.

మంత్రులు — అంతయు నెరుంగుదుము. ఎవ్వరిని నడుగనక్కరలేదు. కానిండు, మీ యపరాధము ముందు విమర్శింతుము. మా యానతిలేక యెందునుం బోవలదు.

అని పలికి వారిం గాంచియుండఁ గొందరఁ గింకరుల నియమించి యా మంత్రులు రాజభార్యలనెల్ల నూరడింపుచు నా నృపతికి శాస్త్రగతి నపరసంస్కారాదికృత్యంబులు నిర్వర్తించి సమంచితమగు ముహూర్తంబునఁ దత్పుత్త్రులం బట్టాభిషిక్తుం గావించిరి. ఇంతలోఁ బూర్వ మమాత్యప్రేషితులగు భృత్యులు కొందరు వచ్చి మంత్రులతో నిట్లనిరి. అయ్యా మేము మీయానతి నరిగి యరణ్యములు, కొండలు, గుహలు లోనగు రహస్యస్థలంబులెల్ల నరసితిమి. నరసింహశైలంబున మాత్ర మొండువింత గంటిమి చిత్తగింపుడు. అత్యున్నతంబగు తదీయశిఖరం బెక్కి నలమూలలు వెదకితిమి. ఒక గుహాముఖంబునఁ గొందరు బోడిబాపనయ్యలు జేగురగుడ్డలు కట్టికొని నివసించియుండిరి.

వారిం జూచి మీరిందేల యుంటిరి? ఈ గుహ విమర్శింపవలయు లోపలికిఁ బోవలె నడ్డము లెండని పలికిన విని మఱేమియు నుత్తర మియ్యక వారు లోనికి బోవలదని సంజ్ఞ జేసిరి. వారి మాటలు పాటింపక మేము ద్రోసికొని లోనికిం బోయితిమి. అందొక పాషాణముమీఁద జేగురువస్త్రము ముసుంగిడుకుని యొకఁడు శయనించి యుండెను. వాని ప్రాయం బిరువదియేండ్లకు లోపుగానున్నది ఆయనను జూచి మేము లెమ్ము లెమ్ము నీ విం దేమిటికిఁ బరుండితివని యెంత బిగ్గరగా నరచినను లేవక మాటాడక యట్లే పడియుండెను.

అప్పుడది శవమని తలంచి మేము మీ యానతి చొప్పున దానిని దహింప యత్నింపుచుండ నందున్న బాపనయ్యలు మాతోఁ గలహించి యతండు తమ గురువనియు ముట్టగూడదనియు యోగనిద్రఁ జెందియున్నవాఁడనియుఁ బెద్దతడపు చతురు పాయములచే నాటంకము పెట్టిరి. కాని వారి మాటలు లెక్క సేయక యది నిద్రకాదని యట్లు తల్లక్షణము లన్నియుఁ బరీక్షించి యాశవమును బలాత్కారముగాఁ బట్టుకొని యందొక చితి యేర్పరచి వానింపై బెట్టి యగ్ని యంటించితిమి.

ఆ బాపనయ్యలు తమ శక్తికొలది నాశవమును గాల్పకుండు బ్రయత్నములఁ జేసిరి. కాని వారికంటె మేమెక్కుడుగా నుండుటచే వారి యుద్యమములేమియుఁ కొనసాగినవికావు. చిటచిటారావములతో నగ్నిప్రజ్వరిల్లుచుఁ బెల్లగుజ్వాల లుప్పతిల్ల నా శవమును చేతులు మాత్రమంటుకొనువఱకుఁ దటాలున లేచి కూర్చుండి ప్రాణములతో నాయన చితినుండి నేలకురికెను. అప్పుడు మేము భయపడుచు బాఱిపోయి యీ ప్రాంతమందున్న కుంజంబుల దాగి చూచుచుంటిమి.

అప్పు డాయనను జుట్టుకొని యాబ్రాహ్మణు లెద్దియో ప్రసంగముఁ గావించిరి. పిమ్మట నతండు కన్నులు మూసికొని యేవియో కొన్ని శ్లోకములు చదివెను. అంతలో నతని చేతులు యథాపూర్వముగా విరాజిల్లినవి. ఇంతపట్టు చూచి వేగముగా నా వృత్తాంతము మీకెఱింగింప వచ్చితిమి. అతఁడు మిక్కిలి మహానుభావుండని తోచుచున్నది. తెలియక యపరాధము గావించితిమి. మాలో నొకని కింటికి వచ్చుసరికిఁ గన్నులు పోయినవి. వాఁడా బ్రాహ్మణులతో నెక్కుడుగాఁ గలహించి వారిం దిరస్కరించుకొఱకు ముట్టవలదనుచుండ నాశవమునుఁ బాదముతో దాకెను అదియేకదా మూఢత్వము, గర్వము యుక్తాయుక్తవివేకము గలుగనీయదు. ఆ సాధువును దహించినందుకు మాకేమి ముప్పువచ్చునో యని వెఱచుచున్నవారము. ఇదియే మాయెఱిగించు విజ్ఞాపనమని చెప్పి యాదూతలు తమ నెలవునకుంబోయిరి.

అప్పు డామంత్రు లొండరు లాలోచించుకొని యోహో! అతండే యీతండు. వీండ్రుచెప్పిన సమయమున రాజు సమసిన సమయము నొక్కటియేయైనది. మన మనుకొనినట్లే జరిగినవి. ఈ గాయకు లాతనికాప్తులై యుందురు. వీరిలో వీరి కెద్దియో సాంకేతికము గలిగియున్నది. ఏది యెట్లైనను వీరి నిఁక మనము నిర్బంధింపరాదు. వీరు మహాత్ములని తద్గీతములే చెప్పుచున్నవి. అని నిశ్చయించి యప్పుడే పద్మపాదాదుల రప్పించి యపరాధముఁ జెప్పికొనుచు యథేష్టగమనంబున కనుమతించిరి.

పిమ్మటఁ బద్మబాదాదు లతిరయముగా నరశింహశైలమున కరుగుచుండ దారిలోఁ గొందరు శిష్యు లెదురుపడి యెహో మీరింత జాగుచేసితిరేల? మన గురువు గారు జీవించిరి. మీరాక కెదురుచూచుచున్నారు. కొందరుక్రూరులు మేమున్న గుహకు వచ్చి యందాచార్యశరీరమునుఁ జూచి దహింపఁజేయ దొడంగిరి. ఇంతలో నమ్మహానుభావుండు శరీరమునఁ బ్రవేశించెను. దగ్ధములైన యవయవముల రక్షించుటకై నరహరి స్తుతి గావించి తత్ప్రసాదంబున నగ్నిబాదం బొరయక యథాపూర్వావయములతో విరాజిల్లుచున్నారు. తత్కృతస్తుతిశ్లోకంబుల మేమెల్లరము వర్ణించితిమి. మిక్కిలి వైరాగ్యోపభోదకములై యున్నవి వినుండు.

శ్లో॥ శ్రీమత్పయోనిధినివేశనచక్రపాణి
     భోగీంద్రభోగమణిరాజితపుణ్యమూర్తి
     యోగీశశాశ్వతశరణ్యభవాబ్దిపోత
     లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం॥

శ్లో॥ సంసారసాగరవిశాలకరాళకాల
     నక్రగ్రహగ్రసననిగ్రహవిగ్రహస్య
     వ్యగ్రస్యరాగలసదూర్మినిపీడితస్య
     లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం॥

శ్లో॥ లక్ష్మీపతె కమలనాభసురేశవిష్ణో
     వైకుంఠకృష్ణమధుసూదనపుష్కరాక్ష
     బ్రహ్మణ్యకేశవజనార్దనవాసుదేవ
     లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం॥

అని తచ్ఛ్లోకంబులనెల్లఁ జదువుటయు నాలించి పద్మపాదాదు లత్యంతసంతోషముతో గురుప్రభావ మగ్గింపుచు నరగి యరగి యగ్గిరిశిఖరంబునకు జని యం దాచార్యవర్యుం గాంచి మేనం బులక లుద్గమింప నానందబాష్పములచేఁ గంఠంబు డగ్గుత్తిక బొరయ నరయముగాఁ దచ్చరణరాజీవంబుల కెరంగుటయు నమ్మహాత్ముండు వారినెల్ల లేవనెత్తి మన్నించుచుఁ బెద్దతడువ వారితో వియోగచింతాసంతాపంబు వాయ ముచ్చటించెను.

పదంపడి యయ్యతిపతి శిష్యులతోఁ గూడికొని సనందనాది యోగులం గూడిన సనకమహర్షియుంబోలె విరాజిల్లుచు యోగంబున నెగిరి యల్పకాలములో మండనమిశ్రుఁమందిర మలంకరించెను. అట్లాకాశమార్గమున వచ్చిన శంకరుం జూచి మండనమిశ్రుఁడు ప్రాంజలియై వినయమున నతిథిపూజ గావింపుచుఁ బాదంబులం బడి, మహాత్మా! మదీయగృహశరీరాదికములు నీ యధీనములు. నీకు నేను ప్రేష్యుండఁ గర్తవ్య ముపదేశింపుమని పలికెను. అప్పు డుభయభారితిచే నర్పింపబడిన శంకరయతిచంద్రుం జూచి మహాత్మా! నీవు పరమేశ్వరుండవు. నన్ను సభలోఁ గామశాస్త్రప్రసంగములో నోడింపక వాని నేర్చుకొనువాడుంబోలె మితిఁగోరి యరుగుట మర్త్యవిడంబన కాని నీ యెఱుంగనిది కాదు. నీచే మేము పరాజితులమైతిమని యించుకయు సిగ్గు వహింపము సహస్రకరునిచే నభిభవముఁ బొందుట చంద్రాదులకు నపకీర్తి హేతువగునా? నీవు సర్వేశ్వరుండవు నీ యెఱుంగనిదిలేదు. నేను సత్యలోకమున కరిగెద ననుజ్ఞ యిమ్మని పలికి యంతర్హితత్వము వహించియున్న యవ్విరించిపత్ని యోగశక్తిచే నవలోకించుచు నాభాష్యకర్త యిట్లనియె. దేవీ! నిన్ను విధాతపతివ్రతవైన వాగ్దేవతఁగా నెఱుంగుదు. నీవు చిత్స్వరూపిణివి. లక్ష్మ్యాదిరూపంబుల నీవ తాల్తువు నీ వాది దేవతవు. అస్మత్కల్పితములగు ఋష్యశృంగాదికక్షేత్రములయందు శారదాభిఖ్య వహించి సన్నిహితవై యిష్టార్థముల నొసంగుచుండవలయును. ఇదియే నా ప్రార్థన యని పలికిన విని యప్పలుకులవెలంది కులుకుచు నయ్యతిపతి కట్టివరం బిచ్చి యచ్చిగురుబోణి బ్రహ్మలోకంబునకుం జనియెను.

ఆత్మీయసన్యాసస్వీకారంబునం గలుగు వైధవ్యవ్యధ నెరుంగకుండ నుభయభారతి యంతర్హితయయ్యెనని మిగుల సంతసించుచు మండనమిశ్రుండు విధిపూర్వకముగా నప్పుడ ప్రాజాపత్యేష్టిఁ గావించి ధనకనకవస్తువాహనాదికమంతయు బ్రాహ్మణులకుఁ బంచిపెట్టి యగ్నుల నాత్మారోపణఁ జేసికొని యాశాపాశంబులం ద్రెంచి శంకరాచార్యునొద్ద కరిగెను.

గీ. ఘనత సన్న్యాసగృహసూక్తవిధిచిత
    సకలకర్మలఁ దీరిచి శంకరుండు
    ప్రౌఢి జపియించె సంసారభయము వాయ
    తత్త్వమసి యనువాక్య మత్తపసిచెవిని.

ఉ. మండనమిశ్రుఁడు న్విహితమార్గమునం జరమాశ్రమవ్రత
    స్థుం డగుచు న్నియామకముతో హితభిక్షను గోర నయ్యతీ
    శుండును నాత్మతత్త్వమును సూచనఁజేయుచు వేదమస్తకో
    న్మండనమైన తత్త్వమసి నాఁ జను వాక్యమె పల్కెఁ గ్రమ్మఱన్.

శంకరుఁడు — తత్త్వమసియ నఁగా అయ్యాత్మ తత్త్వము నీవయితివని యర్ధము.

మదనుఁడు - నీవనఁగా నీ దేహమేనా ?

శంకరుఁడు — కాదు. కాదు. జాతిరూపాదికము గలుగుటచేతను దేహ మనాత్మ యైన ఘటాదికము వంటిది అదియునుంగాక యీ దేహము నాదియను భేదప్రథ గలిగియుండుటంబట్టి నీవను శబ్దార్థము దేహమునకుఁ జెల్లదు.

మండనుండు — పోనీ యింద్రియములకు వర్తించునా యేమి?

శంకరుఁడు — ఇంద్రియములకును వర్తించదు. ఇంద్రియములు దాత్రాదికము వలెనే సాధనములైనవి. అవియు ఘటాదికము వంటివే ఈ చక్షురాదికము నాయది యనుభేదభావము వానియందు సైతము పొడముచుండలేదా? కావున నింద్రియముల నాత్మగాఁ జెప్పరాదు.

మండనుఁడు — మనస్సు నాత్మయని చెప్పిన దోషమేమి?

శంకరుఁడు — అదియు నింద్రియమే. నా మనస్సు మరియొకలాగునఁ బ్రసరించుచున్నదను భేదభావము వానియందునుఁ గలుగుచున్నది. సుషుప్తియందు మనస్సు లయమగుచుండుటచేఁ జిన్మనస్సులకు వైలక్షణము గనుక మనస్సు ఆత్మగా నంగీకరింపఁబడదు.

మండనుఁడు - అహంకారమో.

శంకరుఁడు — అది యెన్నఁడును కానేరదు.

మండనుఁడు — సుషుప్తియందు సైతము లయమొందని ప్రాణంబులనైన నాత్మయని చెప్పవచ్చునా?

శంకరుఁడు — సర్వోపసంహారకమగు సుషుప్తియందు నిలిచియున్నను, ఇవి నా ప్రాణములను భేదభావము వానియందును గలుగుచుండలేదా? ప్రాణము లాత్మ యెట్లగును?

వినుము వివేకింప దేహేంద్రియాది విలక్షణమగు నాత్మయేత్వ శబ్దవాచ్యము తత్పదార్థము జగత్కారణమైన బ్రహ్మము. అసి యనునది యారెంటికి నైక్యానుసంధానము చేయుట. ఇదియే తత్త్వమసి యనర్థము.

మండనుండు — సర్వజ్ఞత్వాది పదవాచ్యమగు తత్పదార్థమునకును మూఢత్వాది పద వాక్యమగు త్వం పదార్ధమునకును నైక్యానుసంధాన మెట్లు? తేజస్తిమిరముల కెన్నఁడైన నైక్యము గలుగునా?

శంకరుఁడు — ఒకనాఁడు సాయంకాలమున నొకక్షేత్రంబున నొకరూపంబున గనంబడిన పురుషుండు మరియొకనాఁడు ప్రొద్దుట మరియొక చోట మరియొకవేషముతోఁ గనంబడినప్పుడుఁ గురుతెరింగినవాఁడుఁ అతఁడే యీతం డనికొనినట్లు దేశకారాదివైపరీత్యము గలుగుటచే వాచ్యార్ధమునకు దోషము వచ్చినను లక్ష్యార్థమున కెన్నఁడును బాధకము రానేరదు గనుక నీవును దేహాదులయం దహంభావమును నిడువుము. వివేకబుద్ధిచే సంతతము నాత్మభావనఁ జేయుచుండుము కాక జంబుకాదుల యధీనము కానున్న తుచ్ఛశరీరమున దుఃఖహేతువగు మమత్వమును విడువుము. సమస్తశంకాకళంకవినిర్ముక్తమును నిజాతీయప్రత్యయరహితంబునగు చిత్తమును బరమాత్మయందు వ్యాపింపఁజేయుము. తీరమునుండి మరియొక తీరమునకుఁ గ్రుమ్మరుచు మత్స్యము తత్తీరముకంటే భిన్నమై దానినంటనట్లే దేహిజాగ్రదాద్యవస్థల ననుభవించుచున్నవానికి వేఱై తద్ధర్మముల నంటడు అనుభూయమానంబులగు జాగ్రదాద్యవస్థ లెవ్వని కంటివేని వినుము.

రజ్జువుం గని బ్రమసినప్పుడు భూచ్చిద్రసర్పదండాదులు కల్పితములైనట్లు భ్రాంతునకే యవస్థాత్రయము గలుగుచున్నది. కాని యాత్మవేత్త కీయవస్థలు లయమగుచున్నవి సుమీ. కావున నీవును బ్రహ్మవైతివి పూర్వభ్రమ విడువుము. ఆహా! సచ్చిదానందస్వరూపమగు చైతన్యము బాహ్యాభ్యంతరముల యందంతటను నిండియుండ మూఢమతులు దెలసికొనఁజాలకున్నారు. ఆత్మమహిమ యెట్టిదోకదాయని యుపదేశించి మరియును.

గీ. గరిమఁ బానీయశాలఁ బెక్కండ్రు గూడి
   యంతలో భిన్నమార్గులై యరుగునట్లు
   పెక్కుపేరుల నింటిలోఁ బెరిగి పెరిగి
   సమయుదురు దేహు లాత్మీయసమయమైన.

గీ. భువిసుఖంబుకొఱఁకు బొనరింతురుద్దాని
    దాన వెతయకాని తగదుసుఖము
    కారణంబులేక కలుగదు సుఖవృత్తి
    హేతువునకు నొండు హేతు వుండు.

క. పరిపక్వమతికి నొకమా
   టరసిన శ్రుతివచనసరణి యవబోధ మగున్
   బరి మందమతికి మెల్లన
   గురుపాదాంభోజసేవ గూర్చున్ దానిన్.

ఇందులకు గురుబోధము ప్రధానకారణం బని యాత్మతత్త్వప్రకారం బంతయు బోధించినం దెలిసి మండనమిశ్రుం డయ్యతీంద్రునిచరణపద్మంబుల వ్రాలి, మహాత్మా! నీ కటాక్షంబున నజ్ఞానంబు వాసితి నద్వైతతత్వంబు దెల్లమైనది. కృతికృత్యుండ నైతినని పలుకుచు తత్ప్రసాదలబ్దజ్ఞానుండై యదిమొదలు సురేశ్వరుం డనునామము వహించి శ్రీ శంకరాచార్యుని పాదసేవ గావింపుచుఁ బద్మపాదాది శిష్యులతోఁ జేరి యతని సేవింపుచుండెను.

శంకరయతిచంద్రు డట్లు మండనమిశ్రునకు బ్రహ్మతత్త్వం బుపదేశించి ప్రధానశిష్యుంగాఁ జేసికొని యందు శిష్యులతోఁ గూడ బయలువెడలి మహారాష్ట్రదేశమున కరిగి యందు భాష్యం బెల్లెడల వ్యాపింపఁజేసెను. అందుఁ గొన్నిదినంబు లుండి యచ్చటనుండి శ్రీశైలమునకుం జని యందుఁ బాతాళగంగాంబువులఁ దీర్థములాడి మల్లిఖార్జునలింగము నర్చింపుచు శివానందలహరి యను స్తోత్రశ్లోకంబుల స్తుతియించెను.

శ్లో॥ సంధ్యారంభవిజృంభితం శ్రుతిశిరస్థానాంతరాధిష్ఠితం
     సప్రేమభ్రమరాభిరామ మనకృత్సద్వాసనాశోభితం
     భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజం గుణావిష్కృతం
     సేవే శ్రీగిరిమల్లిఖార్జునమహాలింగం శివాలింగితం.

శ్లో. భృంగీచ్ఛానటనోత్కటఃకరిమదగ్రాహి స్ఫురన్మాధవా
    హ్లాదోనాదయుతో మహాసితవపుఃపంచేషుణాదాదృత
    సత్ఫక్షస్సుమనోవనేషు నపునస్సాక్షాన్మదీయే మనో
    రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీవిభుః.

మఱియు నం దష్టాదశపీఠంబులలోఁ బ్రధానమగు భ్రమరాంబాదేవి నాగమోక్తవిధానంబున మహాశక్తిగా స్థాపనం జేసి యందు శిష్యులతోఁ గూడఁ గొన్నిదినంబులు వసియించెను. ఒకనాఁడు శంకరయతీంద్రులు పద్మపాదాదిశిష్యులతోఁ భాష్యంబు ముచ్చటింపుచుండ నాకర్ణించి యందున్న పాశుపతులు వైష్ణవులు వీరశైవులును మాహేశ్వరులు దాని నధిక్షేపించి తచ్ఛిష్యులచేతనే పూజితులై కొంద రతనికి శిష్యులైరి. మరికొందరు కోపమువిడువక వారికి సమాధానము చెప్పలేక తదీయమరణావసానసమయ మరయుచుండిరి.

ఉగ్రభైరవుని కథ

ఒకనాఁడు శంకరాచార్యవర్యుండు పాతాళగంగానదీతీరంబున వసియించి భాష్యరహస్యంబు లాలోచించుచున్న సమయంబున గాపాలికుఁ డొకడు సీతాపహరణార్థమై యరుదెంచిన రావణుండు వోలె నవధూతవేషము వైచికొని యమ్మహాత్ముని యొద్దకు వచ్చి మిగుల సంతసించుచు నల్లన నిట్లనియె యతీంద్రా! సర్వజ్ఞత్వానద్యత్వాది భవద్గుణవిశేషంబు లెల్లెడం జెప్పుకొన మిగుల వేడుకపడుచు మిమ్ముఁ జూడ నిచ్చోటి కరుదెంచితిని. నిరస్తమోహుండవన నీవొక్కండవే కదా దేహాభిమానాదుల విడిచి భేదబుద్ధి నించుకయుం బూనక శుద్ధాద్వైతసిద్ధిం బొందితివి. నీవు పరోపకారమునకై యవతరించిన మూర్తివని నీకిర్తి యమర్త్యలోకములవఱకు వ్యాపించియున్నది నీ కటాక్షపాతమాత్రంబున సజ్జనులయార్తి పోవుచున్నది నీవు గుణాకరుండవు. సర్వజ్ఞుండవును జితేంద్రియుండవు. వదాన్యుండవు నగుటచే భువనైకమాన్యుండవై యుంటివి పరాపరజ్ఞులును సమస్తకల్యాణగుణనిలయలును నగు భవాదృశులు లోకంబున బ్రకాశింపుచుండ నర్థిజనుల కామ్యంబు లెట్టివైనను సమకూరకుండునా? నే నొక్కకార్యంబు కొఱకు నీ పరిసరంబున కరుదెంచితి దాని సఫలమైనదానిఁగా నేఁదలంచుచుంటిని. వినుము.

నేనీ దేహముతోఁ గూఢఁ గైలాసంబున కరిగి యగ్గిరియం దీశ్వరునితో సమముగా విహరింప నుత్సకముఁజెంది శతాబ్దంబు లుగ్రతపం బీశ్వరునిఁగూర్చి కావించితిని అమ్మహాత్ముండు ప్రత్యక్షంబై మత్కామితంబు దెలిసికొని యొక్కింత యూహించి యోహో! నీ వసాధ్యపుకామంబు గోరికొంటి వైనను నీ వ్రతంబులు మదీయహృదయంబు నచ్చెరువు పరచెం గావునఁ దీరుపకతీరదు. పుడమియందు సార్వభౌముని శిరంబుగాని లేక సర్వజ్ఞుండైన యతీశ్వరుని శిరంబుగాని నా నిమిత్త మగ్నియందు హోమముఁ జేసితివేని నీ కార్యంబు సాఫల్యంబు నొందఁగలదని పలుకుచునే యంతర్హి తుండయ్యెను.

నాటంగోలె నే నీభూమియంతయుం దిరుగుచుంటిని. సార్వభౌమశిరంబు నా కెట్లు లభించెడి? సర్వజ్ఞుండగు యతియు నింతకుము న్నెందునుం గనబడలేదు. నేఁడు నా పురాకృతంబున జేసి లోకహితమునకై సంచరించెడు సర్వజ్ఞుండవగు ని న్నిందుఁ బొడగంటిని. నాకార్య మింక దీరఁగలదని యుత్సుకముఁ జెందుచుంటిని. సజ్జనదర్శన మూరకపోవునా? ఇటుపిమ్మట మత్కార్యసిద్ధికి నీవే ప్రమాణము. శిరఃప్రధానంబున నాకుఁ గార్యలాభమును నీకు శాశ్వతకీర్తిలాభముం గలుగఁగలదు. ఈ దేహముయొక్క దశ్వరత్వ మాలోచించి యెట్లు తోచిన నట్లు చేయుము. నీ శిరం బిమ్మని కోరుటకు నా మనంబున మిగులఁ గ్లేశముఁ జెందుచున్నది. దేహపాతంబున కెవ్వఁడైన సమ్మతించునా? నీవు విరక్తుండ వనియు దేహాభిమానశూన్యుండవనియుఁ బరోపకారమునకై యవతరించిన మూర్తివనియు విని యీ సాహసమునకుఁ బూనుకొంటిని జనులెల్లరును స్వార్థపరులై పరక్లేశముల గణియింతరుగదా! తొల్లి యింద్రుండు శత్రుజయమునకై దధీచిమహామునిని వజ్రాయుధమును యాచింపలేదా? దధీచిప్రముఖులును క్షణభంగురమగు తుచ్ఛశరీరమును విడిచి పరోపకారపారీణులై శాశ్వతకీర్తిదేహంబులం దాల్చి పుణ్యలోకంబు లలంకరింపుచుండలేదా? దయామతులై కొందఱు పరహితమునకై దేహత్యాగము జేయుదురు. దయాహీనులై మా వంటివారు స్వార్థైకపరులై కొందరు పుడమి నుందురుగదా! పరోపకారము వినగా నీకించుకయు ప్రయోజన మీ పుడమిని లేదుగదా! కామవశులగు మావంటివాండ్ర కన్నియుం బ్రయోజనములే కనంబడును విరక్తి పూర్వపుణ్యంబునంగాక లభించునే? నాగోరిక గర్హితమే యైనను విరాగముగల పరమార్ధవేత్తల కీయరానిది గలదే? భవచ్చిరంబుకన్న మదీయకామితం బీడెర్చునది వఱియొకటిలేదు తప్పక నీ శిరం బిమ్ము. నీకు నమస్కారమని పలికి యమ్మహాత్ముని పాదంబుల మ్రోలంబడియెను. అప్పుడా శంకరయతిపుంగవుండు దయాళుండగుట నక్కాపాలికుని లేవనెత్తి యల్లన నిట్లనియె. "ఆర్యా! నీ కామితవిషయము నా కించుకయు నసూయ జనింపదు. సంతోషముతో నాశిరంబు నీకిచ్చెదను. తెలిసియు నేప్రాజ్ఞుండు బహ్వప్రాయముగల కాయంబు నర్థిసాద్గుణ్యము గావింపకుండెడిని? ఎంత రక్షించినను గాలమాసన్నమైనచో నీ శరీరము నశించునదియేకాని నిలుచునదియా? అట్టిదానిచేతనే పరంబు సాధింపఁబడినచోఁ బురుషుని కంతకంటెఁ బురుషార్ధమేమి యున్నది? కావున సిద్ధుఁడా ? నీ సమాధి విజనప్రదేశమునఁ గావింపుము. రహస్యముగా నాశిరంబు భేదించి అగ్నియందు వేల్చుకొనుము. నేను ప్రకాశముగా నప్పనిసేయ సమ్మతింపను. ఏమిటి కంటివేని మదీయశిష్యు లెఱింగిరేని నిప్పని కొనసాగనీయరు. మదేకశరణులై యున్నారు కావున వాం డ్రిందులకు సమ్మతింపరు.

స్వశరీరమును విడుచుటకును స్వనాథశరీరమోక్షమునకును నెవ్వఁడైనను సమ్మతించునా? యని పలికిన విని యాకాపాలికుండు మిగుల సంతసించుచు శంక రుండు నియమించిన సంకేతసమయమునకు వచ్చునట్లు నిశ్చయించి యెచ్చటికో పోయెను. పదంపడి శంకరయతి యా రహస్యం బెవ్వరికిం దెలియనీయక యమ్మరునాడు శిష్యులందరు స్నానాది వ్యాపారతంత్రులై తలయొకచోటికిం బోవ నిరూపింపబడిన రహస్యప్రదేశంబున సనందనుండు దెలిసికొనునేమోయను వెరపుతో నిగూఢుండై యున్న సమయంబున.

క. కేలఁ ద్రిశూలము గొని కం
   కాళాలంకృతులు మేనఁ గ్రాలఁ ద్రిపుం డ్రో
   త్కీలితఫాలుండై కా
   పాలికుఁ డేతెంచె నరుణభయదాక్షుండై.

అబ్భైరవాకారు రాకంజూచి యమ్మహాత్ముం డింద్రియముల నుపసంహరించుకొనుచు స్వాత్మను బరమాత్మయం ధైక్యానుసంధానము గావించి జత్రుప్రదేశంబున గడ్డంబు మోకాళ్ళమీఁద మూచేతులు నునిచి మోము దెరచుచుఁ గన్నులు సగము మూసికొని సిద్ధాసనమున గూర్చుండి సమాధిచేఁ బ్రపంచకమంతయు మరచి యున్న సమయంబున నా భైరవుం డయ్యతీంద్రుఁ జంపుటకు నించుకయు సంశయింపక సంతోషముతోఁ ద్రిశూలమెత్తి యతని కంఠం బుత్తరింపఁబోవునంతలో దైవప్రేరితమైన బుద్ధిచేతఁ బద్మపాదుం డేమిటికో యచ్చటి కరుదెంచి గురుని శిరంబు దరుగఁ బ్రయత్నించు నా క్రూరుని యుద్యమంబు జూచి తొందరపడుచు నాత్మీయాభీష్టదేవతయైన శ్రీమన్మనృసింహు సమంత్రకముగా ధ్యానించుటయు.

సీ. భూరిసటాద్ఛటాస్పోటవంబుల మింట
           జీమూతసంఘము ల్బెదరిపోవ
    దంష్ట్రాకరాళవక్త్రచ్ఛిద్రసంజాత
           పావకార్చుల జగత్ప్రతతి గమలఁ
    బెడుబొబ్బ వెట్టి కుప్పించి దాటినవేగ
          మున భూతసంతతు ల్మూర్ఛనొంద
    నిది యేమి యని వేల్పులెల్ల దల్లడమంద
          జలనిధు ల్మిగుల నాకులత నొందఁ

గీ. బద్మపాదుండు నరసింహవర్యరూపుఁ
    డగుచు రయమున నురికి శూలాయుధమున
    నాత్మగురుఁ జంప గమకించు నద్దురాత్ము
    పొట్టఁ జీలిచి వెసఁ గాలుప్రోలి కనిచె.

అమ్మహారవం బాలించి యందున్న శిష్యులెల్లరుఁ దల్లడిల్లుచు నచ్చోటి కరుదెంచి చచ్చిపడియున్న కాపాలికుని నృసింహాకృతితోనున్న పద్మపాదుని సమాధిలోనున్న గురువరునిం గాంచి విస్మయాకులహృదయులై చూచుచున్న సమయంబున శంకరయతివర్యుండును సమాధి చాలించి కన్నులం దెరచి యందు జరిగిన వృత్తాంత మంతయు శిష్యులవలనం దెలిసికొని పద్మపాదు నావేశించియున్న నరసింహమూర్తి నిట్లని స్తుతియించెను.

శ్లో॥ కల్పాంతోజ్గృంభమాణప్రమథపరిపృఢప్రౌఢలాలాటవహ్ని
     జ్వాలాలీఢత్రిలోకీజనితచటచటధ్వానధిక్కారధుర్యః
     వధ్యేబ్రహ్మాండభాండోదరకుహరమనైకాంత్యదుస్థ్సామవస్థాం
     స్త్యానస్త్యానోమమాయందళయతుదురితం శ్రీనృసింహాట్టహాసః॥

వ. అని యనేక ప్రకారంబుల నమ్మనుజసింహమూర్తిని స్తోత్రముఁజేయుటయు నాభక్తప్రియుండు నుగ్రమూర్తి నుపసంహరించుకొని యంతర్ధానమునొందెను. పిమ్మట శాంతుండైయున్న పద్మపాదుం జూచి వెరఁగు పడుచు శిష్యులెల్లరు "ఆర్యా! నీ వీదేవు నెటు ప్రసన్నుం జేసికొంటి నీకపటం బెట్లెఱింగితివి? ఇద్దురాత్ముం డెవ్వండని" యడిగిన నతం డిట్లనియె.

అహోబల నృసింహునికథ

నేను బూర్వమొకప్పు డహోబలశైలంబున కరిగి యందొక యరణ్యంబున భక్తవశ్యుండగు నరసింహమూర్తిఁ గురించి పెక్కుదినంబులు తపంబు గావింపుచుంటిని. అట్టిసమయంబున నొకదినమున నాయెద్ద కొకకిరాతకుమారుం డరుదెంచి "అయ్యా నీవెవ్వఁడవు? ఒక్కండ విక్కొండబిలంబున నేమిటికి వసియించెదవు? నీవు చేయుపని యేమి?" యని యడుగుటయు వానిమాటఁ బాటింపక మౌనముతోఁ బోపొమ్మని హస్తసంజ్ఞ చేసి నిరాకరించితిని.

వాఁ డంతటితో బోక యప్పుడప్పుడు నాకుఁ గనబడుచు నా రీతినే యడుగు చుండ నొకనాఁ డిట్లంటిని ఓరీ! నీవు మూఢజాతివాఁడవు. మఱియు బాలుండవు. ఇట్టి నీకు మాబోంటివారిం బల్కరింప నుచితముకాదు విను మీయరణ్యంబునఁ గంఠమున సింగమును గ్రింద మానిసిరూపుంగల సామియొకం డుండవలయును అట్టివాని నెందేనిఁ గంటివేనిఁ జెప్పుము. వానిం జూచు తలంపుతోడనే నేనిందున్నవాఁడ. అతండు నాకుఁ జుట్ట మిదియే నాపని వానిం దీసికొని రాఁగలవా? యని పరిహాసముగా నడిగితిని.

అప్పు డబ్బాలుండు నవ్వుచు నోహో! యీపనికేనా యింత శ్రమపడుచుంటివి. నా కీపని మొదటనే చెప్పితివేని యప్పుడే తీసికొని రాకపోవుదునా? ఆయనను నే నెఱుంగుదును. తరుచు మే మిరువురము కలిసికొని యాడుకొనుచుందుము. ఆయన యున్నచోటు నే నెఱుంగుదునని పలికిన విని నేను వెరఁగందుచు వానిమాట నమ్మక, మఱియు నిట్లంటిని.

ఓరీ! నీ వతండు సామాన్యు డనుకొంటివి కాబోఁలు. నే నన్నమాట నీకు దెలిసినదా? కంఠమువఱకు మనుషుఁడు శిరము సింగము ఇదియే పోలిక. అట్టివాని నిశ్చయముగాఁ జూచితివా? యెట్లు నీకుఁ గనంబడియెను. నిజముఁ జెప్పుమని యడిగిన దిరుగ వాఁ డిట్లనియె అయ్యా! నాతో నిన్నిమాఱులు చెప్పనక్కఱలేదు. మీమాట నాకర్ద మైనది. మీరడిగినవాఁడు నేనాడుకొనువాఁడే సందియములేదు. ఇంతయేల? ఇప్పుడే పోయి నీయొద్దకుం తీసికొనివచ్చెదం జూడుము. అప్పుడును నామాట నమ్మకపోవుదువా? యని పలుకుచుఁ దటాలునలేచి యాయరణ్యములోని కరిగి రెండుగడియలలో నక్కిరాతుం డానరసింహమూర్తి నొకలతాపాశంబునం గట్టి భుజముమీదఁ పెట్టికొని యమ్మహాత్ము నాయొద్దకుఁ దీసికొనివచ్చి ముందుఁబెట్టి యీతండేనా నీయడిగిన యతండని పలికెను. అప్పుడు నే నమ్మహాత్ముం జూచి యాశ్చర్యసంభ్రమసాధ్వసంబులు మనంబున నొక్కసారి యంకురించి తొట్రుపరుప నిరుపమానకౌతూహలంబుతో మేనం బులక లుద్భవింప సాష్టాంగనమస్కారము గావించి చేతులు జోడించి.

సీ. నిరుపమాత్మసమాధినిష్టులయోగిచే
          జనులాత్మ నెవ్వానిఁ గనగనోప
    రామ్నాయతత్త్వరహస్యంబు లెవ్వాని
          సన్మహత్త్వము దెల్పఁజాలవయ్యె
    బ్రహ్మాదినిర్జరుల్ ప్రౌఢనెవ్వాని మా
         యాజాలములఁ దెలియంగలేరు
    బ్రహ్మాండములనెల్ల రచియింపఁ బాలింపఁ
         బొలియింప నెవ్వాఁడు మూలకర్త

గీ. అట్టి నీ విప్పు డొక్కమూఢాత్ముఁడైన
   బోయిబాలున కగ్గమై పోయితేమి
   చిత్ర మిది యెట్టిపుణ్యంబుఁ జేసెవాఁడు
   పూర్వభవమున గరుణాప్రపూర్ణహృదయ.

వ. అని నేను వేఁడుకొన నమ్మహాత్ముండు నవ్వుచు వత్సా! వీనికి నాయందు గల భక్తివిశ్వాసములు బ్రహ్మాదులకులేవు. నిరుపమానైకాగ్రచిత్తముతో వీఁడు నన్నారాధించెను దానంజేసి వీని కింతవశ్యుండ నైతిని నేను భక్తికి వశ్యుండనైనట్లు తపోదానయాగాదులకుంగారు. నీవును నాకుభక్తుండవైతిని. అవసరంబైనప్పుడెల్లఁ దలంచు కొనుము. ప్రసన్నుండనై కామ్యంబు లీడేర్తునని పలుకుచు నానృసింహదేవుం డంతర్హింతు డయ్యెను. నాటంగోలె నా కమ్మహానుభావుం డభీష్టదేవతయై తోడ బల్కుచుండును. ఇందాక యిద్దురాత్ముండు మనయాచార్యుని మోసముచేసి శూలంబున శిరంబు దరుఁగ బ్రయత్నించుచున్న సమయంబున నే నేమిటికో యచ్చటి కరిగి యయ్యుపద్రవము గాంచి మదభీష్టదేవతం దలంచితిని. అతండు న న్నావేశించి శత్రువధ గావించెను. యించుక దడసినఁ గార్యంబు మిగిలి మనయాచార్యుండు మనకుఁ దక్కకపోవును. ఇప్పటికి దైవము మనయందే యుండెను. వాదవిజితులు పెక్కండ్రు మనయాచార్యునికి మోసము చేయదలంచుచుండిరి. మనము ఏమరక కాచియుండవలయు. నగ్నిం గీటకములు చేరిన నశింపకుండునా? యవతారమూర్తి యగు మనయాచార్యు నెవ్వ డేమి చేయఁగలఁడని పలుకుచుఁ బద్మపాదుండు వారికెల్ల నామోదము గలుగఁజేసె. అట్లు శంకరాచార్యుండు శ్రీశైలంబునఁ గొన్నిదినములు గడిపి యటఁ గదలి శిష్యులతోఁగూడ ననేకపుణ్యతీర్థంబులు సేవించుకొనుచు గ్రమంబున గోకర్ణక్షేత్రంబున కరిగెను. కైవల్యకల్యాణలాభం బొనఁగూర్చి నద్దివ్యక్షేత్రంబున మూఁడుదినంబులు వసించి మహాకాళనాథు నారాధించి యచ్చటి కనతిదూరములో నున్న హరిశంకరంబను దివ్యస్థలంబున కరిగి యం దద్వైతబుద్ధితో హరిహరస్తుతి గావించెను.

పదంపడి మూకాంబికాగేహమున కరిగినంతఁ దదీయద్వారదేశంబున బ్రాహ్మణదంపతులు మృతుండైన కుమారుని కళేబరమును వైచికొని యిట్లు విలపించుచుండిరి.

ఉ. హాకులదీపకా! హిమకరాధికతేజ! కళానిధాన ల
    క్ష్మీకరమూర్తి సద్గుణనికేతన హాసుకుమార హాకుమా
    రా! కడతేర్చెనే నిను దయూరహితుండు కృతాంతుఁ డయ్యయో
    యేకడ కేగువారము త్వదేకశరణ్యుల మేది దిక్కిఁకన్.

క. నీవలనఁ గులము దీపక
   మై వర్ధిల్లెడు నటంచు నౌత్సుక్యం బెం
   తే వెలయ నలరుచుందు మిఁ
   కేవిధమున బ్రతుకువారు మేము కుమారా!

అని యనేకప్రకారంబుల దుఖించు నద్దంపతుల పరిదేవనంబు విని దయాళుండైన శంకరాచార్యుండు సైరింపక తాను వారికన్న నెక్కుడు విలపించుచున్న సమయంబున నాకాశవాణి యిట్లు విననయ్యె.

క. అనఘా! ప్రోవఁగన సమ
   ర్థునిదయ కేవలము శోకదోహలమగుఁగా
   వినిజప్రజ్ఞాన్వితుఁడవు
   చనునే నీ కిట్లు వగవ సామాన్యుక్రియన్.

అని వినంబడిన యద్దివ్యవాణి నాలించి యమ్మహాత్ముండు చేతులు జోడించి వెండియు నిట్లు వక్కాణించె.

గీ. ఎల్లలోకంబులను బేర్మి నేల నేర్పు
    గలుగనీయను కంపకుఁ గాక యట్టి
    నిరుపమప్రజ్ఞ గలుగునే యెరులదయకు
    ద్రికరణాగోచరోరుశక్తిప్రభావ
    ప్రోవు మీబాలుఁ గరుణాప్రపూర్ణహృదయ.

అని యనేకప్రకారంబుల నయ్యతిచంద్రుడు ప్రార్ధించుటయు నావిప్రకుమారుండు నిద్రించి మేల్కొనునట్లే లేచి కూర్చుండెను. అప్పు డాప్రాంతమం దాయద్భుతము చూచినవారు శంకరాచార్యుని దైవప్రభావమును వేతెఱంగులఁ గొనియాడిరి ఆ బ్రాహ్మణదంపతులును శంకరాచార్యుఁ బ్రస్తుతించుచు నాపుత్రు నెత్తుకొని యింటికిం జని తద్వృత్తాంత మెల్లరకుఁ జెప్పిరి. శంకరాచార్యుండును నమ్మూకాంబ నిట్లు స్తుతియించెను.

శ్లో॥ అష్టోత్తరత్రింశతియాఃకలాస్తాస్త్వర్ధ్యాఃకలాః
     పంచనివృత్తిముఖ్యాః | తాసాముపర్యంబతవాంఘ్రిపద్మం
     విద్యోతమానంవిబుధాభజంతే
     యేప్రత్యభిజ్ఞామతపారవిజ్ఞాధన్యాస్తు తేప్రాగ్వివితాంగురూక్త్యా
     సైనాహమస్వీతి సమాధియోగాత్త్వాం ప్రత్య
     బిజ్ఞావిషయం విదఢ్యుః.
     శ్రీ చక్రషట్చక్రకయోః పురోధశ్రీ చక్రమన్వోరపిచింతి తైక్యం
     చక్రస్య మంత్రస్యతత స్తదైక్యంక్రమాదన ధ్యాయతిసాధకేంద్రః॥

అని పెక్కుభంగుల నమ్మహాదేవిని శ్రీచక్రయంత్రోద్ధారణప్రకారంబునం బ్రస్తుతిజేసి ప్రసన్నురాలిం జేసికొని యయ్యతిపతి యటఁగదలి శిష్యులతో నాప్రాంతమందుయున్న శ్రీబలియను నగ్రహారమునకుం జనియెను. అయ్యగ్రహారంబున నాహితాగ్నులును శ్రుతిపాఠకులు నిగమచోదితక్రియాతంత్రులునగు బ్రాహ్మణులు వేనవేలు గలిగియుండిరి. నిజకర్మనిష్టులు ప్రమాదశూన్యులునగు నందలి బ్రాహ్మణుల నియమమునకు వెఱచి యపమృత్యు వప్పురంబుఁ ప్రవేశింపనేరకున్నది. స్వాహావషట్కారనినందంబు లెల్లప్పుడు నప్పురంబున మ్రోగుచుండును. సకలకళానిలయంబగు నయ్యగ్రహారము శంకరుండు శిష్యులతోఁ బ్రవేశించినంత నంతకుమున్న తద్విఖ్యాతి వినియుండిరి కావున నందలి బ్రాహ్మణులు సగౌరవముగా నతని కెదుర్కొని పెక్కుతెఱంగులఁ గొనియాడుచు నాయకమణియుంబోలె నందు విరాజిల్లు పినాకపాణియాలయంబునం బ్రవేశపెట్టఁ దీసి కొనిపోవుచున్న సమయంబున వీథుల నిలువంబడి పౌరకాంతలెల్ల నిట్లు చెప్పుకొనఁదొడంగిరి.

సీ. ఇతఁడటే పేదపారుతనింట గనకామ
          లకవృష్టి గురిపించిన కరుణాత్ముఁ
    డితఁడఁటే తనతల్లివెత వాయుఁ బూర్ణాన
          దిని వీటిదరికిఁ దెచ్చిన మహాత్ము
    డితఁడఁటే యద్భుతగతిం బొంగు నర్మదా
          ధునిఁ గుంభమున నిమిడ్చిన ఘనుండు
    ఇతఁడఁటే యద్వైతమతము నిల్పఁగ వాద
          మున సరస్వతి జయించిన మనీషి.

గీ. ఇతఁడఁటే మొన్నమూకాంబయింటిమ్రోలఁ
   గాలగతి నొందు బాహ్మణబాలకు గని
   గరిమఁ బ్రతికించినట్టి విఖ్యాతయశుఁడు
   శంకరాచార్యుఁ డితఁడఁటే చంద్రవదన.

అని యిట్టు పౌరకాంతలు కొనియాడచుండ శంకరాచార్యుండు శిష్యులతోఁ గూడఁ బినాకపాణియాలయంబునఁ బ్రవేశించి బృందాకరబృందపరివృతుండగు పురుహూతుండువోలె నాబ్రహ్మణబ్బందము నడుమ విరాజిల్లుచు నల్ల ననయ్యతితల్లజుండు వారికిట్లనియె.

ఆర్యులారా! యీ యగ్రహారమున బెక్కండ్రు పండితు లుండవలయును. అద్వైతమార్గనిరోధకుడై ప్రవృత్తిశాస్త్రరతుండైన పండితుం డెవ్వడేని గలండేని వక్కాణింపుడు. అట్టివారితో వాదించి వారి దురూహలం బోగొట్ట నరుదెంచితిమి. అని యడిగిన నా బ్రాహ్మణులు సవినయముగా నిట్లనిరి. ఆర్యా! భవదీయప్రజ్ఞాప్రభావంబు లింతకు బూర్వమే మేము వినియున్నవారము బృహస్పతియు ఫణిపతియు సరస్వతియు మీకు జాలరనుచో మా బోటులమాట జెప్పనేల. మా యగ్రహారంబున బ్రభాకరుండను

పండితుం డొకండున్నవాడు. అతండు ప్రవృత్తిశాస్రైకరతుండై కర్మకాండయందు మిగుల నాసక్తి గలిగి యనేకాధ్వరములు సేసి వేల్పులం దృప్తిపరచి యున్నవాడు. ధనభూకనకవస్తువాహనసమృద్ధి యద్ధరణీసురవరున కెంతేనిం గలిగియున్నది. అతండు భట్టపాదుని శిష్యుండై పూర్వము దిగ్విజయము చేసినాడు. కాని యతనికి లేక లేక కలిగిన పుత్రు డున్మత్తుం డయ్యెను. కావున నిప్పు డతం డాచింతచే నేపనికి బూనుకొనకున్నవాడని చెప్పుచుండగానే యా ప్రభాకరుడు కుమారునితో కూడ నచ్చటికివచ్చి యుపాయనార్పణపూర్వకముగా శంకరాచార్యునికి నమస్కరించెను.

హస్తామాలకుని కథ

పిమ్మట దన కుమారునిసైత మతని పాదంబులకు నమస్కరింపజేసెను. అప్పుడు శంకరుం డతని లేవనెత్తుచు నాదరముగా నాగమనకారణం బడిగిన నతం డిట్లనియె. ఆర్యా! వీడు నా కుమారుండు వీనికి బదమూడేండ్లు దాటినవి. వీడు పుట్టిననాటంగోలె నిట్లే యుండెను. ఎవ్వరితో నేమియు మాటాడడు. ఎవ్వడు పల్కరించినను బల్కడు. మందమతియై యెద్దియో ధ్యానించునట్లుండును. రూపము తేజము నద్భుతమై యున్నవి. మొగముజూడ జంద్రబింబమును దిరస్కరింపుచున్నది. ఇది గ్రహదోషమో స్వభావమో పూర్వకర్మప్రారబ్దమో యున్మత్తవికారమో తెలియదు. వీని కక్షరాభ్యాసమైనం జేయలేదు. చదువుమాట చెప్పనేమి యున్నది. ఉపనయనసంస్కారము మాత్రము గావించితిని. ఆడుకొనుటకు బాలురు పిలిచినను వెళ్ళడు. వాండ్రు వీనింగొట్టినను గోపము జెందడు. వాని కిష్టమైనప్పు డెప్పుడో భుజించును. చెప్పినట్లు చేయడని వానిపై నాకు గోపము వచ్చును గాని కొట్టుటకు జేతులురావు. లేక లేక నా కీకొమరుండు గలిగె నిది యేమి పాపమో తెలియదు. ఎన్నియో వైద్యములు చేయించితిని. ఎన్నియో రక్షలు గట్టించితిని ఎన్నియో జపములు చేయించితిని యెందరికో సిద్ధులకు జూపించితిని. ఏ క్రియవలన నేసిద్ధుని వలనను నుపయోగము లేకపోయినది. నీవు పరోపకారపారీణుండవు. దయాళుండవని వింటిని. మృతుండైన విప్రకుమారుని బ్రతికించితివట. నీ చర్య లద్భుతముగా జెప్పుకొనుచున్నారు. నీ కటాక్షలేశము వీనిపయిం బ్రసరింపజేసితివయేని వీని మాంద్యము సడలిపోవును. మహాత్మా! వీని శిష్యునిగా ననుగ్రహింపుమని యనేకప్రకారముల బార్ధించి వాని నయ్యతిపతి పాదంబుల వెండియుం బడవైచెను.

అప్పుడు శంకరాచార్యుండు దయామేదురములగు దృష్టులు వానిపై బరగింపుచు శిరంబున జేయిడి, డింభకా! నీ వెవ్వడవు? జడునిభాతి నిట్లు బ్రవర్తించెద వేమిటికి? చెప్పుమని యడిగిన నతండు గురుండా! నేను జడుండగాను. జడంబు మత్సన్నిధిం బ్రవర్తింపుచున్నయది షడూర్మిషడ్భావవికారరహితంబగు తత్పదార్ధంబు నే నైతిని. ఈ నా యనుభవము మురువర్గమునకు గలుగుగాక యని యప్పు డాశుకవిత్వముగా బండ్రెండు శ్లోకములు రచించెను.

శ్లో. నిమిత్తంమనశ్చక్షురాది ప్రవృత్తా
     నిరస్తాభిలోపాధిలౌకాశకల్పః
    రవిర్లోకచేష్టానిమిత్తం యధాయ
    స్సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా 1
    యమగ్న్యుష్ణవన్నిత్యబోధస్వరూపం
    మనశ్చక్షురాదీన్యబోధాత్మకాని

     ప్రవర్తంత ఆశ్రిత్యనిష్కంపమేకం
     సనిత్యోపలబ్దిస్వరూపోహమాతా.2

     ముఖాభాసకోదదర్పణేవృశ్యమానో
     ముఖత్వాత్పృ ధక్వైననైవాస్తివస్తు
     చిదాభాసకోధీమజీవోపితద్వత్
     సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా3

     యథాదర్పణాభావ ఆభాసహానౌ
     ముఖంవిద్యతే కల్పనాహీనమేకం
     తథాధీవియోగే నిరాభాసకోయః
     సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా4

     మనశ్చక్షురా దేర్వేయుక్తస్స్వయంయో
     మనశ్చక్షురా దేర్మనశ్చక్షురాది
     మనశ్చక్షురాదేర గమ్యస్వరూప
     స్సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా5

     యఏకోవిభాతిస్వతశ్శుద్ధచేతాః
     ప్రకాశస్వరూపోపి నా నేవధీషు
     సఏవోదకస్దోయథాభానురేక
     స్సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా6

     యథానేకచక్షుః ప్రకాశోరవిర్న
     క్రమేణప్రకాశీకరోని ప్రకాశ్యం
     అనేకాధి యోయస్తదైక ప్రబోధ
     స్సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా7

     వివస్వత్ప్రభాతంయథారూపమక్షం
     ప్రగృహ్ణాతినాభాంతమేవంవివస్వాన్
     తథాభాత అభాసయత్యేకమక్షం
     సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా8

     యథాసూర్యఏకోప్యనేకశ్చలాసు
     స్థిరాస్వప్యనవ్వగ్ని భావ్యస్వరూపః
     చలాసుప్రభిన్నా స్వధీష్వేక ఏవం
     స్సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా9

     ఘనచ్చన్నదృష్టిర్ఘనచ్ఛన్న మర్కం
     యథామన్య తెనిప్ప్రభంభాతిమూఢః
     తదాబద్ధవద్భాతి యోమూఢదృష్టే
     స్సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా10

     సమస్తేషువస్తుష్యనుస్యూతమేకం
     సమస్తానివస్తూనియంనస్పృశంతి
     వియద్వత్సదాశుద్ధమచ్ఛస్వరూప
     స్సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా11

     ఈపాదౌయథాభేదతాసన్మణీనాం
     తథాభేదతాబుద్ధిభేదేషుతేపి
     యథాచంద్రికాణాంజలే చంచలత్వం
     తథాచంచలత్వంతవాపీహవిష్ణోః12

పరమాత్మతత్త్వమును హస్తామలకములభంగి నీ శ్లోకములు దెలుపుటచే వీనికి హస్తామలకశ్లోకంబులని వాడుక వచ్చినది. మఱియు నిట్టిశ్లోకంబుల నుపదేశము లేకయే రచించుటచే నా బ్రాహ్మణకుమారునికిని హస్తామలకుడని పేరు వచ్చినది. అట్టి శ్లోకంబులం జదివి యా బ్రాహ్మణపుత్రుండు తన యింటికిం జనియెను. అంతకుబూర్వ మక్షరమైనం దెలియని యత డట్లు శ్లోకములు రచించుట జూచి యెల్లరు విస్మయమును జెందుచు నది శంకరాచార్యుని యనుగ్రహలాభమని నిశ్చయించిరి. తరువాత శంకరాచార్యుడు ప్రభాకరునిం జూచి, "ఆర్యా! నీ కుమారుండు నీయొద్ద నుండ నర్హుండు కాడు. వీనితో నీకేమి ప్రయోజనమున్నది? వీడు పూర్వభవాభ్యాసవశంబున సర్వము నెరుంగును. ఎరింగియే లోకమునకు గల యజ్ఞానమును గురించి చింతించుచు నిట్లు జడునిభాతి గ్రుమ్మరియెను. వీనికి గృహాదికమందు మమత్వము లేదు. తన శరీరమునే యెరువుగా జూచుకొనుచుండ బాహ్యవస్తువుల మాట జేప్పనేల? వీడు నీ కేమియు నుపచరించడు. వీని నే దీసికొనిపోయెదం బంపు" మని పలికిన విని ప్రభాకరుండు సంతసించుచు దన కుమారుని రప్పించి శంకరునికి శిష్యునిగా నప్పగించెను శంకరాచార్యుండును వానికి హస్తామలకుండని పేరు పెట్టి బ్రహ్మభావ ముపదేశించి తన ప్రధానశిష్యులలో జేర్చికొనియెను. బదంపడి యతం డచ్చోటు గదలి క్రమంబున నరిగియరిగి.

సీ. తుంగభద్రానదీతుంగతరంగశీ
          తలమారుతప్రమోదప్రదంబు
    దర్శనమాత్రవిధ్వంసితాఖిలఘోర
          పాతకం బమృతసంపాదకంబు
    అభ్యాగతజనార్చనార్పితమందార
          పాదపంబు తీర్థపాదపంబు
    అద్వైతవిద్యారహస్యజ్ఞ గురుతపో
          ధనజనాంచితము బాధారహితము

గీ. ఋష్యశృంగమహాతాపసేంద్ర భూరి
   తరతిపఃపావనంబు సుందరవనంబు

   దురితభంగకమగు శృంగగిరివరంబు
   శంకరాచార్యు డరిగె సచ్ఛాత్రు డగుచు.

వ. అమ్మహాస్థలంబు శృంగేరియనియు శృంగగిరియనియుం బ్రఖ్యాతి వహించియున్నది. అప్పవిత్రక్షేత్రంబు బ్రవేశించి శంకరాచార్యు డందుగల సత్పురుషులను దా రచించిన భాష్యాది గ్రంథము లన్నియు జదివించి వ్యాపింపజేసెను. మరియొకనాడు శంకరుండు పద్మపాదుం జూచి "వత్సా! యీ పుణ్యస్థలంబు శారదాంబను నిలుపుట కుత్సాహము గలుగుచున్నది. తత్పరికరములు సమకూర్పవలయును. ఇందు మఠము గట్టింపవలయును" నని పలుకుచు సర్వశిల్పములు నావిర్భవింప నింద్రవిమానకల్పమగు ప్రాసాదమొకటి కల్పించి బ్రహ్మాది దేవతలకు సైతము వందనీయ యగు మహాదేవిని ప్రార్ధన జేసెను.

అమ్మఠంబున నా శారదకు విద్యాపీఠపూజ గావింప దన శిష్యులలో బ్రధానుండగు సురేశ్వరుని నధ్యక్షునిగా నియమించెను. ఆ శారదాంబ మున్ను దాఁ గావించిన ప్రతిజ్ఞ పరిపాలించుచు నిప్పటికి శృంగేరిపురంబున భక్తాభీష్టప్రదానకల్పకంబై విరాజిల్లుచున్నది.

తోటకాచార్యుని కథ

శంకరార్యు డందు శిష్యులతో గొన్నిదినంబులు వసియించియుండ నొకనా డొకబ్రహ్మచారి వచ్చి యతని పాదంబులం బడి, "మహాత్మా! నేను మూఢుంఢ, విద్యాశూన్యుండ, బశుప్రాయుండ, నీకు శిష్యత్వము జేయుతలంపుతో నరుదెంచితి. నాపే రానందగిరి యండ్రు విద్యాగంధరహితులగువారు బెక్కండ్ర శిష్యులగా స్వీకరించి విద్వాంసులం జేసితి వనినఖ్యాతి విని ని న్నాశ్రయింపవచ్చితిని నీవు పరమకారుణికోత్తముడవట. నిన్ను శరణు జొచ్చితిని. నన్ను రక్షింపుము. శిష్యునిగా ననుగ్రహింపు"మని యనేకప్రకారంబుల బ్రార్థించెను. అప్పుడు శంకరాచార్యుడు మందహాసము జేయుచు వాని శిష్యునిగా గైకొనియెను. అది మొదలా బహ్మచారి గురుండు గూర్చుండ గూర్చుండును. నిలఁబడ నిలువంబడును. నడిచిన ననుగమించి నడుచును. బరుండిన మెల్లగా బాదము లొత్తును. చెప్పినపని శ్రద్ధాపూర్వకముగా గావించును. ముందుగా స్నానము జేసి గురుండు గూర్చుండుటకు గంబళాదికమును పరుచును శాటీచేలముల భక్తితో నుదుకును. గురుండు బాహ్యాదిక్రియల కరిగినంత దంతకాష్ఠాదికము దెచ్చి యమరించియుంచును. గురుని సమీపమున నెన్నడు నావులించడు. పాదముల జాచఁడు. పెక్కులు పలుకడు. ఛాయవలె గురు ననుసరించి తిరుగుచు భక్తిపూర్వకముగా శుశ్రూషఁ గావింపుచుండెను. చిత్తానువర్తియైన యా శిష్యుని నిష్కాపట్యభక్తివిశ్వాసములకు శంకరాచార్యు లంత రంగమున మెచ్చుకొనుచుండెను. ఇట్లుండ నొకనాడు శంకరుండు వాడుకసమయమునకు మఠంబునం గూర్చుండి శిష్యులకు బాఠము జెప్పబోవు సమయమున నా బ్రహ్మచారి యెందు బోయెనని యడిగెను. అప్పుడు మరియొక శిష్యుడు స్వామీ యతండును నేనును దమ శాటీపటంబుల నుదుకుటకై తుంగభద్రకుం బోయితిమి. నేను నా పని వేగముగా దీర్చుకొని పాఠము చదువువేళ మిగులునను వెఱపుతో వడిగా జనుదెంచితిని. వా డూరక యుదికినదే యుదుకుచు గాలహరణము జేయుచున్నాడు. నేను బాఠము చదువ రమ్మని పిలిచినను వినుపించుకొనక యిదిగో వత్తు నదిగో వత్తునని నన్నుఁ గూడ రెండు గడియలు నిలిపెను. వానికిఁ బనియందుఁగల శ్రద్ధ చదువునం దుండదు. కాకున్న నింతజాగు సేయునా? యని పలికి యూరకుండెను. అప్పు డాదయాళుండైన శంకరుండు వానిరాక నిరీక్షించుచు రెండుగడియలు పాఠము చెప్పుట నిలిపివేసెను. వాఁ డప్పటికిని రాకున్నఁ బద్మపాదుండు లేచి స్వామీ! యతండు మందబుద్ధి. గోడవంటివాఁడు. ఏమియుం దెలియదు. ఊరక వినుటయేకాని విద్యాగ్రహణశక్తి యించుకయునులేదు, శబ్దములైనను రావు. అట్టి మూఢునకు మాపాఠములను వినుటవలనం బ్రయోజన మేమి యున్నది? వానికి శాస్త్రాధికార మెక్కడ నున్నది? మాకుఁ జెప్పుడని పలికిన విని పద్మపాదుని గర్వోక్తులఁ బరిహసించు తలంపుతో శంకరుం డిట్లనియె.

పద్మపాదా! వానిసామర్ధ్య మేమి యరసి నీ వట్లంటివి. వాఁడు మీయందరికన్న విద్యలలో నధికుండు. కవి, వక్త, ప్రోఢుండు, అంతర్ముఖుండగుటచే వాని మహిమ మీకుఁ దెలిసినదికాదు. వచ్చిన తరువాతఁ బరీక్షించి చూడుఁడని పలుకుచుండఁగనే యుదికిన కషాయచేలంబులు బుజములమీద నిడికొని యచ్చోటి కరుగుదెంచెను.

వానింజూచి గురుండు గిరీ? పాఠము చదువవలయు వడిగా రమ్ము శాటులఁ బిమ్మట నారవేయుదువుగాని యని చీరినను వాఁడు విడువక శ్రద్ధగా బట్టలు నారవేసి యచ్చోటి కరుదెంచెను. అప్పుడు శంకరుండు వానికి మనసుచేతఁ బదునాలుగువిద్యలు వచ్చునట్లనుగ్రహించెను. అప్పుడు వా డఁఖిలవిద్యాప్రవీణుండై చేతులు జోడించుచు శంకరాచార్యునిఁ దోటకవృత్తములచే నిట్లు స్తుతిఁజేసెను.

శ్లో॥ భగవనుదధౌమృతి జన్మఝలె
     సుఖదుఃఖఝరె పతితంవ్యధితం
     కృపయాశరణాగతముద్దరమా
     మనుశాధ్యుపపన్నమనన్యగతిం॥ 1

శ్లో॥ వినివర్త్యతరీం విభయేవిషమాం పరిముచ్యశరీరవిబద్ధమతిం॥
     పరమాత్మ పదెభవనిత్యరతోజహి మోహామయం బ్రమమాత్మమతే॥ 2

     విసృజాన్నమయాదిషు పంచసుతామయమస్మిమమేతిమతిం సతతం।
     దృశిరూపమనంతమజం విగుణం హృదయస్థమనేహిస దాహమితి॥ 3

     జలభేదకృతా బహుతేవరదేర్ఘటికాదికృతానభ సోపియథా।
     మతిభేదకృతానుతథాబహుతాతవబుద్ధికృతో వికృతస్యసదా ॥ 4

     దినకృత్ప్రభయాసద్స శేనసదా
     జనవిత్తగతం సకలం స్వచితా।
     విదితం భవతావికృతేనసదా
     యతఏవమతోసి సదేవసదా॥ 5

అని యి ట్లద్వైతమతప్రతిపాదకంబులగు తోటకవృత్తములచే నా యానందగిరి యాచార్యుని స్తుతియించుటయు నాలించి పద్మపాదాది శిష్యులు తెల్లవోయి చూచుచు నిది యస్మద్గురుకారుణ్యమహిమకాక వేఱొండుకాదని నిశ్చయించి సిగ్గుపడి యూరకుండిరి.

పిమ్మట శంకరుండు గటాక్షాంకురముల వానిపై వెలయఁ జేయుచుఁ దోటకాచార్యులని పేరు పెట్టి పద్మపాదాది ప్రధానశిష్యులలోఁ జేర్చుకొనియెను. పద్మపాదసురేశ్వరహస్తామలకతోటకాఖ్యలచే నొప్పుచుండెడి శంకరాచార్యుని నలువురశిష్యులను ధర్మార్థకామమోక్షములనియు ఋగ్యజుస్సామాధర్వణవేదములనియు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యనామకముక్తిభేదంబులనియు బ్రహ్మముఖంబులనియు విద్వాంసులు సంతతము వర్ణింపుచుందురు. అట్టి శిష్యులతోఁ గూడికొని శంకరాచార్యుండు శృంగగిరియందు వసియించి భాష్యవ్యాపకము చేయుచున్న సమయంబున భారతీపీఠస్థుండగు సురేశ్వరుం డొకనాఁడు శంకరాచార్యుం జూచి నమస్కరింపుచు, మహాత్మా! నేను నీవలనఁ బరమార్ధోపదేశము వహించి కృతార్థుండనైతిని. నీరచించిన శారీరకసూత్రభాష్యమునకు వార్తికముచేయు నుత్సుకత్వము నాకుఁ గలిగి యున్నది. గంభీరవాక్యయుక్తమగు భవదిని భాష్యమును జూచుటకైనను నాకు సామర్థ్యములేదు. అయినను భవదీయకటాక్షలేశపాతంబునం జేసి యథాశక్తి నాచరింతు ననుజ్ఞ యిత్తురేయని యడిగిన శంకరుండు సంతసించుచు నీవు నా భాష్యమునకు వార్తికముఁ జేయుట నాకెంతయు సమ్మతమైయున్నది. అట్లవశ్యము గావింప వలసినదే యని శిరఃకంపమున నంగీకారము సూచించెను.

అవ్వార్త విని పద్మపాదుని కత్యంతమిత్రులును సతీర్థులునగు చిత్సఖుఁడు మొదలుగాఁగల మరికొందరు శిష్యు లొకనాఁడు శంకరాచార్యునితో రహస్యముగా నిట్ల నిరి. గురువర్యా! ఇప్పుడు తమ భాష్యమునకు సురేశ్వరుని వార్తికము గావింపుమని యానతిచ్చినట్లుగా వింటిమి. యప్పని మన మనోరథము సఫలము గావింపనేరదు. ఏమిటికంటిరేని వినుండు. ఈ సురేశ్వరుండు, కర్మయే స్వర్గనరకాదిఫలము నిచ్చునని వాదించుచు యుక్తిప్రయుక్తులచే బ్రహ్మాదులకుసైత మీశ్వరుండైన పరమేశ్వరుని నిరాకరించెను. ప్రత్యక్షసన్నిహితంబగు జగంబులకుఁ బ్రళయము పురాణములు చెప్పుచున్నవి. అట్టి పురాణకర్తయగు వ్యాసమహర్షికి శిష్యుండైన జైమినిముని మతము విరుద్ధ మేమిటి కంటివేని గురుశిష్యమతములు రెండును పరస్పరవిరోధకములై యున్నవి గదా. దానంజేసి శిష్యునిమతము పూర్వపక్షమైనదానిఁగాఁ దలంపవలయు అట్లు తలంపక సురేశ్వరుండు పుట్టినది మొదలు కర్మలయం దిష్టము గలిగి సంతతకర్మలం జేయుచు నెల్లరను "గర్మలంజేయుఁడు స్వర్గాదిఫలంబులం బొందుఁడు. వృథాగా మరియొకమార్గంబునం బడి చెడిపోవకుఁడు" అని బోధించుచుండెడివాఁడు. అట్టివాఁడు మీయానతిఁ బొంది భాష్యమునకు వార్తికము రచించినను దానిఁ గర్మపరత్వముగా సూచించక మానఁడు. మరియు సన్న్యాఁసి యయ్యు గర్మరతుండగునా? యంటిరేని యితండు బుద్ధిపూర్వకముగా సన్న్యాసమును స్వీకరించినవాఁడు కాఁడు. వాదంబున నోడి బలవంతమున నట్టి నియమమును స్వీకరించినది మీ యెరింగినదేకదా. కావున నితనియందు విశ్వాసము సేయరాదు. ఇతనిచే వార్తికము రచించుకొనుట లెస్సగాదు. మీ యెరుంగనిది కలదా? కర్మాసక్తుం డెన్నఁడైనఁ గర్మ విడుతునని చెప్పుట కిష్టపడునా? భట్టమతపక్షపాతియగు నితని సన్న్యాసము జాత్యంధాదుల సన్న్యాసమువంటిది కాని మరియొకటికాదు.

మీ రిప్పనిఁ జక్కగా నాలోచించి చేయవలయును. మీ శిష్యులలోఁ బ్రధానుండగు పద్మపాదుని సామర్థ్యము మీరెరుంగనిదియా ?

సీ. గురుభక్తి నవ్వలిదరినుండి పిల్చినం
          తన వచ్చెఁ గంగఁ బాదముల నిడుచు
    నరయక వ్యాసమహర్షితో వాదించు
          నప్పుడు నేర్పుతో నతనిఁ దెల్పె
    నమరుక నృపశరీరమున నున్నప్పుడు
          గాయకుండై బోధ గలుగఁజేసెఁ
    గాపాలికుఁడు మస్తకముఁ ద్రెంపఁ గమకింప
          నరసింహుఁడై వానిఁ బరిభవించెఁ.

గీ. జాయపోలిక మీవెంట సంచరింపు
   చాంతరంగికభక్తుఁడై యలరె నట్టి

   పద్మపాదుండు గలుగ మీ భాష్యమునకు
   వార్తికము సేయ నల సురేశ్వరుఁడు దగునె?

మహాత్మా! పద్మపాదుండే మీ భాష్యమునకు టీక రచించవలయును. కానిచో నుగ్రతపంబున సరస్వతిం బ్రసన్నురాలిం గావించిన యానందగిరి కప్పని సేయ నిరూపింపుడు. అంతియకాని కర్మైకతానమతియగు సురేశ్వరునియం దట్టియనుగ్రహము గలిగించుట యుచితము కాదని చెప్పుచుండగానే పద్మపాదుం డచ్చోటి కరుదెంచి వినయవినమితశిరస్కుండై యాచార్యున కిట్లనియె ఆచార్యా! భవదీయకృపారసవిశేషంబునం జేసి పదునాలుగువిద్యలును హస్తామలకంబు భాతి దెలియబడెను. గావున హస్తామలకుడని సార్థకనామము వహించిన శిష్యవరుండు మీ భాష్యమునకు వార్తికము జేయుట కర్హుడు కాడా? కర్మప్రియుండై బలత్కారంబున సన్న్యాసియైన సురేశ్వరుని యందట్టి యనుగ్రహమేమిటికి గలుగవలయునని యడిగిన మందహాసశోభితవదనారవిందుఁడై శంకరాచార్యుం డిట్లనియె.

వత్సా! పద్మపాద! హస్తామలకు డట్టివాఁడే కాని యితనికి బాహ్యప్రచార మించుకయు లేదు. బాల్యమునుండియు నాత్మప్రచారముగల యీతం డత్యుదారమగు మదీయభాష్యమునకు వార్తికమెట్లు చేయగలడు. ఇతండు బాల్యంబున నేమియుం జదువనివాడు. వీనిచర్యలన్నియుం జూచికదా భూతగ్రస్తుండని తలంచి వీని తండ్రి నాయొద్దకు దీసికొనివచ్చెను. నేను వీని శిరంబున గరంబిడి నీ వెవ్వండవని యడిగినప్పుడుకాదే యానందఘనస్వరూపం బ్రకటింపుశ్లోకముల జదివెను. దీని కొకయద్భుతకారణ మున్నదని చెప్పిన విని శిష్యులెల్లరు నమస్కరింపుచు స్వామీ! యీతండు బోధలేకయే యిట్టి ప్రజ్ఞావంతు డెట్లయ్యె నెరిఁగింపుడని యడిగిన నయ్యాచార్యుండు వారికిట్లనియె.

హస్తామలకుని పూర్వకథ

కొన్నియేండ్లక్రిందట బ్రభాకరుని భార్య రెండేడులు ప్రాయముగల బాలు నెత్తుకొని యమునానదికి స్నానార్ధమైయరిగినది. అమ్మహానదీతీరంబున సంసారవిరక్తుడై యొకసిద్ధుండు తపంబు గావింపుచుండెను. ప్రభాకరుని భార్య తన కుమారుని నా సిద్ధుని మ్రోల నునిచి మహాత్మా! నేను స్నానమునం జేసి వచ్చునందాక యీ బాలుం జూచుచుండుడు. ఎత్తుకొనువార లెవ్వరును లేరు తృటిలోవత్తు. దయాహృదయులగు మీ యెరుగనిదికలదే! యని వేఁడుకొనిన నతండు తలయూచుచు నందుల కియ్యకొనినట్లు సూచించెను.

అయ్యువతియు సుతు నతనిముందర నాడుకొన విడిచి ముద్దిడుకొని వడిగా సఖులతో స్నానముచేయ నది కరిగినది.

అంతలోపల దైవవశంబున నా బాలుం డాడుకొన నిటునటు దిరుగుచు దభాలున నిన్నికటంబుననున్న యమునానదింబడి ప్రాణములు విడిచెను. అప్పుడు తదాప్తు లాక్రందనము చేయుచు వడివడిం బోయి నీటినుండి యబ్బాలుం దీసి ప్రాణములు పోవుట చూచి గోలున నేడ్చుచు నా సిద్ధునిమ్రోల నా బాలశవమును బడవైచిరి. ఇంతలో బ్రభాకరుని భార్య యవ్వార్తవిని యడలుచు నచ్చోటికివచ్చి చచ్చియున్న సుతుని కళేబరముపై బడి అయ్యో! నా ముద్దుకూన! యెంతలో నీల్గితివిరా! నీ మొద్దుమో మెంతలో గళదప్పినది నీ చిట్టిపలకులు విని యెన్ని యో దినములైనట్లున్నదియో అన్నన్నా. యీ సిద్ధుండు మమ్మెంత మోసము చేసెను. తాను మొదట సమ్మతింపకున్నను మా కీముప్పు రాకపోవునే ఇంత దయాహీనుండని యెరింగినచో నితనికురంగట విడువకపోవుదునే. ఇంతలో నెంతపుణ్యము సంపాదించుకొనవలయు ననియో యీ సిద్ధుండు వీనింజూడ కుపేక్షించెను. ఇట్టి కఠినాత్మునకు దపంబెట్లు సిద్దించును? నియమంబు లేమిటికి? సమాధి కాల్చనా? యీ బాలఘాతకుని మొగంబు జూచిన, బాతకము రాదా! కటకటా పెక్కేండ్లు తపంబు జేసి కన్న ముద్దులపట్టిని వీని పొట్టం బెట్టితినే ఏమి చేయుదును. దిక్కెయ్యది? పతి కేమని వక్కాణింతును? సుతుం డేమయ్యెనని చెప్పుదును? ఈ పాడునది కేమిటికి మునుంగవచ్చితిని; హా దైవమా! యని ప్రకారంబుల వగచుచు నా సిద్ధునిం దిట్టుచు నాకాంత బిట్టు వాపోవజొచ్చెను.

అప్పు డమ్మహర్షి తదీయశోకాలాపంబు లాకర్ణించి వగచుచు దన యుపేక్షకుఁ బశ్చాత్తాపము జెందుచు నయ్యపవాదము సైరింపక సమాధి విడిచి యా బాలుని బరీక్షించుచు అయ్యో వీనికొరకు జింతించెదరేల? వీడు బ్రతుకగలడు. క్షణకాలము నిరీక్షించుచుండని పలికి యవ్వల నెక్కడనో తనకాయంబు పాఱవైచి యోగసామర్ధ్యంబుల బరకాయప్రవేశవిద్యానైపుణ్యంబు దీపింప నబ్బాలుని యందు బ్రవేశించెను.

అప్పు డయ్యర్భకుండు కదలి యేడ్చుటయుం జూచి సిద్ధునికృపావిశేషంబునం బాలుడు బ్రతికెనని సంతసించుచు దల్లి యాప్తులతో గూడ నాపుత్రు నెత్తికొని తన నెలవునకుం బోయినది. పిమ్మట నక్కుమారుండు శిశువిలక్షణవ్యాపారములతో మెలంగుట చూచి ప్రభాకరుం డున్మాదవికారంబు లనుకొని యెన్నియో ప్రక్రియలు గావించెను. తరువాయి వృత్తాంతము మీరెరింగినదేకదా! ఆతడే హస్తామలకుండు దానంజేసియే యుపదేశము లేకయే సర్వజ్ఞుండయ్యెను. ఇతం డెరుగనిది యేమియు లేదు. కాని యీతండు బాహ్యప్రవృత్తిశూన్యుం డగుటచే భాష్యంబునకు వృత్తి రచించుటకుం దగడు. సమస్తశాస్త్రసముద్రపారంగతుండగు సురేశ్వరుండ యప్పని కర్హుండు. అతం డొడంబడనిచో దదన్యుం డంతవాడు మరియొకడు గానరాడు. పెక్కండ్ర కిష్టములేని కార్యము కావించుట నా కిష్టములేదు. ఒక మహాకార్యమునకు బెక్కు విఘ్నములు సమకూడుచుండునని పలికిన శిష్యులు వెండియు నిట్లనిరి. స్వామీ! హస్తామలకునిమాట యటుండనిండు. మీ సెలవైనచో బద్మపాదుండు వార్తికము సేయ నోపడా? అతండు బ్రహ్మచర్యము నుండియే సన్న్యసించిన ధన్యుండనియు లోకమాన్యుం డనియు బుద్ధిమంతుడనియు జగద్విదితమైనదియే కదా! తమకు వానియం దనుగ్రహమేమిటికి గలుగలేదని యడిగిన శంకరుం డిట్లనియె. మీ కందరికి నట్టి యభిప్రాయము గలిగియుండినచో బద్మబాదుండు మదీయభాష్యమం దొకనిబంధము రచించుగాక. వార్తికము మాత్ర మాసురేశ్వరుండే చేయవలయునని చెప్పి యంతటితో నా ప్రస్తావము గట్టిపెట్టెను.

మరియొకనాడు శంకరాచార్యులు సురేశ్వరుం జూచి "ఆర్యా దుర్విదగ్ధులగు మదీయశిష్యులెల్లరు నీవు వార్తికము జేయుటకు సమ్మతింపకున్నవారు. నీవు కర్మతంత్రుడవనియు గృహస్థధర్మరతుండవనియు నిన్ను శంకించుచున్నారు. కావున భాష్యమునకు వార్తికము రచింపకుము. భవదీయసామర్ధ్యము దెలియనట్లుగా ముందుగా నధ్యాత్మతత్త్వంబు దేటపడునట్లు స్వతంత్రముగా నొక గ్రంథము రచించి నాకు జూపుము. నీ గ్రంథరచనాసామర్ధ్యము జూచి యీ శిష్యులకు నమ్మకము గలుగనట్లు చేయు"మని యానతిచ్చి అయ్యో ! మదీయభాష్యమునకు వార్తికము లేకపోయెనే యని యించుక విచారించెను.

అట్లు శిష్యుల ప్రేరణమువలన శంకరాచార్యుండు తన్ను వార్తికము చేయ వలదనియు స్వతంత్రముగా నద్వైతగ్రంథమొకండు రచింపుమని చెప్పిన విని సురేశ్వరుండు మిగుల నీసుంజెందియు నేమియుం బలుకక యల్పకాలములో నైష్కర్మసిద్దియను గ్రంథమొకండు రచించి యాచార్యునికి జూపెను. అట్టిగ్రంథమును జూచి శంకరుండు మిగుల విస్మయము నొందుచు దానిని శిష్యులకు జూపి పెక్కుతెరంగులం గొనియాడెను. ఇప్పటికిని యతీశ్వరు లాగ్రంథమునం దెక్కుడు విశ్వాసము చేయుచుందురు. అట్లు తన గ్రంథమునుజూచి యాచార్యుఁడు సంతసించినంత సురేశ్వరుం దలుకతో నాహా! యీ లోకమున మత్సరగ్రస్తులు పెక్కండ్రు గలిగియుందురు. నే నాచార్యవాక్యంబునం జేసి వార్తికము సేయ నుద్యోగించినంత ననవసరముగాఁ గొందరు విఘ్నము గావించిరి. కానిమ్ము మదన్యుం డెవం డాగ్రంథమునకు వార్తికము జేసినను నిలువక నశించెడుఁ గాత యని శాపం బిచ్చి యల్లన నాచార్యున కిట్లనియె. గురువర్యా! నేను గీర్తికొఱకుఁగాని లాభముకొఱకుఁ గాని వార్తికముచేయ నుద్యోగింపలేదు. గుర్వాజ్ఞ యనుల్లంఘనీయమని యప్పనికిఁ బూనుకొంటిని. పూర్వ మితండు గృహస్థుండనియుఁ గర్మరతుండనియు నాక్షేపించుచు నీశిష్యులు నన్నప్పని కనర్హునిగాఁ దలంచిరి. ఇంతకన్న నవివేక మెందైనం గలదా? అనుభూతంబులైనను బాల్యచేష్టలు యౌవనంబునం బొడకట్టునా? వార్థకంబున యౌవనచిహ్నములు దోచునా? అట్లే సన్యసించిన తరు వాతఁ బూర్వధర్మములయం దాసక్తి యేమిటికిఁ గల్గెడిని? గృహస్తుండైనను సన్యాసి యైనను మనస్సే కదా ప్రధానము. నీచే వాదంబున నోడిపోయి దృఢమైన బుద్ధితోఁ దురీయాశ్రమము స్వీకరించితిని. పూర్వభ్రమ విడిచితిని పూర్వము నేను గృహస్తుండై యున్నతరి నైయాయకాది గ్రంథములయం దెక్కుడు నమ్మకము కలుగునది భవదీయపాదసేవ లభించిన పిమ్మట నా యనుమానమంతయు వదలిపోయినది. అద్వైతమతమునం దెక్కుడు విశ్వాసము గలిగియున్నది. అట్టి నామనోధర్మముఁ దెలిసికొనలేక నీశిష్యులు నన్ను నిరాకరించిరని పలుకుచున్న సురేశ్వరభారతీస్వాముల వారి కోపవహ్నిని వివేకోదకములచే నడంచుచు శంకరుం డిట్లనియె.

ఆర్యా! నీవు తొందరపడి మదీయసూత్రభాష్యమునకు వార్తికము నిలువకుండునట్లు శపించితివి. అది దైవకృతము. సూత్రభాష్యమునకు వార్తికము లేదనుచింత మదీయాంతఃకరణమున మిక్కిలి బాధింపుచున్నది. ఏమి చేయుదును? కానిమ్ము నేను మదీయశాఖయగు తైత్తిరీయోపనిషత్తునకుఁ ద్వితీయశాఖయగు కాణ్వోపనిషత్తునకు భాష్యములు చేసియుంటిని. ఆరెంటికిని నీవు వార్తికములు రచియింపు మాచంద్రతారకములై పుడమి వెలయునని యానితిచ్చెను. సురేశ్వరుండు గురునానతి శిరంబునం బూని యప్పుడ పూనికతోఁ దైత్తిరీయకాణ్వోపనిషత్తులకు శంకరాచార్యుండు రచించిన భాష్యములకు వార్తికములు రెండు విద్వాంసులు మెచ్చునట్లు కావించి యవి యాచార్యునిపాదమూలమునఁ గానుకగా సమర్పించి యతని కామోదము గలుగఁసేసెను. పిమ్మటఁ పద్మపాదుండును శారీరకసూత్రభాష్యమునకు నాత్మకీర్తి విజయడిండమమగు టీకను నిరవద్యయుక్తిసూత్రమైనదానిఁగా రచియించి గురుదక్షిణగా సమర్పించెను. అందు బూర్వభాగము పంచపాదికయనియు, నుత్తరభాగము వృత్తియనియుఁ బ్రఖ్యాతిఁబొందినది. పిమ్మట హస్తామలకాది శిష్యులును గుర్వాజ్ఞఁ గైకొని మరియు నాత్మతత్త్వప్రఖ్యాపకములగు గ్రంథంబు లనేకములు రచించిరి. అట్లు శంకరాచార్యులు శిష్యులచేఁ బెక్కు గ్రంథములు రచియింపఁజేసి కొన్నిదినము లాశృంగగిరియందు సంతోషముతోఁ గాలక్షేపము జేసిరి. ఒకనాఁడు హస్తామలకుండును జిత్సుఖుండును దుంగబద్రకు స్నానార్థమై యరిగి యిట్లు సంభాషించుకొనిరి.

చిత్సుఖుండు — హస్తామలకా! మన యాచార్యుఁడు నేఁడేమియో ఖిన్నమానసుండై యున్నవాఁ డేమి? పద్మపాదుండు సేతుయాత్ర కరిగెననియా యేమి? మనయందరికన్న వానియం దెక్కుడు తాత్పర్యము సుమీ!

హస్తామలకుఁడు - అగు నందులకే కావచ్చును. పద్మపాదుండు సేతుయాత్ర కరిగెదనని యడిగినప్పుడు మార్గగమనము కష్టమనియు నొంటరిగా పరదేశయాత్రచేయుట క్లేశకరమనియు దారిలో రోగాదికములు బాధించునప్పుడు సహవాసము కావలయునని నాత్మతీర్థ మాడువారికిఁ దీర్థయాత్రవలనం బ్రయోజనము లేదనియుఁ బెదతడవు చెప్పి పోవలదని బోధించెను.

చిత్సఖుఁడు — గురువచనము తిరస్కరించి పద్మపాదుం డేమిటికిఁ దీర్థయాత్ర కరిగెను.

హస్తామ — తిరస్కరించి యరుగలేదు. తీర్ధసేవవలన మనస్సు నిర్మల మగుట, దేశవిశేషదర్శనలాభము, అనర్ధములు పోవుట, సజ్జనసాంగత్యము, పండితవిశేషసంవాదలాభము లోనగు కార్యములు సంఘటించును గావున నందుల కాజ్ఞ యిమ్మని పద్మపాదుండు గురునిఁ బెక్కుగతులఁ బ్రార్ధించిన నాయన యంగీకరించి యతం డరుగునప్పు డి ట్లుపదేశము గావించెను.

సీ. అరుగకు మొక్కండ వధ్వనెన్నడుఁ బహు
          బ్రాహ్మణు ల్గలుగునూరనె వసింపు
    తరుచు సజ్జనులతోఁ బరిచయం బొనరింపు
          మతిమార్గఖేదంబు నపనయించు
    జలమైనఁ గొనకుము దెలియకుండఁగ దాన
          సర్వస్వహరణదోషము ఘటించు
    గూఢరూపములఁ గైకొని దారిఁ దోడ
         వత్తురు చోరు లట్టిధూర్తుల గ్రహింపు

గీ. మరుగునప్పుడు దారిలో నడ్డపడిన
    బిక్షుకుల నాదరింపుము పృథుమనీష
    ధ్యాన మొనరింపు మెప్పడ ధాత్మతత్త్వ
    మనఘ సుఖమగు దారిని కట్టలైన.

చిత్సుఖుండు — ఓహో మనగురువరునకుఁ బద్మపాదునియం దెట్టితాత్పర్య మున్నదియో చూచితివా? యతండు తిరుగ నెన్నిదినములకు మనలం గలిసికొనునో తెలియునా?

హస్తామలకుఁడు - రెండునెలలలోపున వత్తునని చెప్పిపోయెను. అదిగో తోటకాచార్యులు స్నానమునకు వచ్చుచున్నాఁడు. మన గురుండు సమాధినుండి లేచె నేమో యడుగుదము.

తోటకుఁడు — బ్రవేశించి అయ్యో మీరిందు జాగుసేయుచున్నా రేమి మన యాచార్యుఁడు యోగశక్తిచే మాతృవృత్తాంత మెద్దియో యంతఃకరణగోచరముఁ జేసికొని యచ్చటికిఁ బోవలయునని ప్రయత్నము చేయుచున్నాఁడు. త్వరగా రండు సురేశ్వరునితో నెద్దియో ముచ్చటింపుచున్నాఁడు.

చిత్సుఖుఁడు - హస్తామలకా! మనసందియము దీరినది. యందులకే మన గురుండు సమాధి గైకొనియె. మన కేమి చెప్పునో వడిగా బోవుదుము లెమ్ము.

అని పలికికొని తోటకునితోఁగూడ నిష్క్రమించిరి. పిమ్మట శంకరాచార్యులు ప్రాణోత్క్రమణసమయ మగుచుండ స్మరింపఁబడి యందు బోవుచుఁ శిష్యులనెల్లఁ దాను వచ్చునందాక నందుండ నియమించి యోగశక్తిచే గగనమార్గంబున ముహూర్తకాలములోఁ దల్లియున్న నెలవునకుం జని "అయ్యో! కుమారా! యిట్టి సమయమున నీవు నాయొద్ద లేకపోయితివే. నీవంటి యుత్తమపుత్త్రుం గనియు గొడ్డురాలిపోలిక ననాథనై పొలియవలసెనే! కటకటా! భవద్దర్శనలాలసంబులై యీ బొంది విడువక కృపణప్రాణంబులు నన్నూరక శ్రమనొందుచున్నవి. హా! యెంత పాపాత్ము రాలనైతిని. నందనా యెందుంటివి? ఎవ్వరికి బోధ సేయుచుంటివి? ఒక్కసారి వచ్చి నాకన్నులం బడరాదా? నిన్ను జూచినంత నాయావడులన్నియు నుడిగిపోవకుండునా? నాతో నెన్నియో చెప్పిపోయితివే అవి యన్నియు మఱచితివి కాఁబోలు తండ్రీ యీ వృద్థమాతయం దింత యక్కిటకము లేకపోయినే ఆహా! మరణకాలంబున స్మరించినంతనే వచ్చి యూర్థ్వదైహికక్రియలు గావింతునని శపథముగాఁ బలికితివే నాయనా! యేమిటికి రావు? ఎందున్నావు క్షేమముగానుంటివో లేదో హాపుత్రా! హాపుత్రా!" యని పలవరింపుచున్న తల్లింజూచి శంకరుండు నిస్సంగుడైనను దయాళుండగుటఁ గన్నుల నీరు గార్చుచు నిట్లనియె.

అమ్మా! ఇదిగో నేను వచ్చితిని. నీపుత్త్రుండ శంకరుండ ఇక నీవు విచారింపకుము. నీయభీత్స మెద్దియో చెప్పుము చెచ్చెరం గావింతునని పలుకుచుఁ బాదంబులకు నమస్కరించెను. అప్పు డామె నిదాఘార్తు డంబుదనాదంబునంబోలె నాత్మీయపరితాపంబు వదలి సంతోషముతోఁ బుత్త్రుం గౌఁగిలించుకొని తండ్రీ నాయీయవస్థలో నీవు కుశలముగా వచ్చి నాకన్నులం బడితివి. ఇంతకన్న సంతోష మేమి యున్నది? పుత్రా! జరాశీర్ణంబగు నీగాత్రంబింతమీఁద వహింపలేకున్నదాన. యథాశాస్త్రముగా నా దేహము సంస్కరించి పుణ్యలోకముల నొందింపుము. ఇదియే నా కోరిక యని పలికినది.

తల్లి మాట విని శంకరాచార్యుం డంతర్భూతసర్వలోకసుఖమగు బ్రహ్మానందము నొందింపు తలంపుతోఁ దల్లికి స్వప్రకాశమగు శుద్ధనిర్గుణతత్త్వ ముపదేశించెను. అప్పు డయ్యంబ శంకరునితో, నాయనా! నీవేమో నాకుఁ జెప్పితివికాని యేమియుం దెలిసినదికాదు ఇట్టిసమయమున నిర్గుణుని నెట్లు మనస్సునం బట్టించుకొందును? అతిమనోహరమగు సగుణతత్త్వ ముపదేశింపుము. ఆనందింతునని పలికిన విని శంకరుండు దయాళుం డగుచుఁ దల్లికి దర్శనమిచ్చుటకై భక్తవశంకరుండైన శంకరుని భుజంగప్రయాతవృత్తములచే నిట్లు స్తుతియించెను.

శ్లో॥ అనాద్యంతమాద్యం పరం తత్త్వమర్ధం
     చిదాకారమే కంతురీయం త్వమేయం
     హరిబ్రహ్మమృగ్య పరబ్రహ్మరూపం
     మనోవాగతీతం మహాశైవమీడె.

2. స్వ సేవాసమాయాతదేవాసురేంద్రా
   నమ్మవ్మౌళిమందారమాలాభిషిక్తం
   నమస్యామిశంబోపదాంభోరుహంతే
   భవాంభోధిపోతం భవానీవిభావ్యం.

3. అకంఠెకళం కాదనంగె భుజంగా
   దపాణౌకపాలాదపాలేనలా క్షాత్
   అమౌళౌశశాంకాదవామె కళత్రా
   దహం దేవమన్యం నమన్యె నమన్యె.

వ॥ అని యిట్లు శంకరుండు శంకరుని భుజంగ ప్రయాతవృత్తంబుల స్తుతిఁ జేయుటయుఁ బ్రసన్నుండై యాభక్తవత్సలుం డాత్మీయ దూతలం బుచ్చుటయు.

ఉ. శూలథనుఃకపాలపరిశోభితహస్తులభూతిసంచయో
     ద్దూళితగాత్రుర్ల శిశువిధుస్ఫురితోరుకిరీటులన్ జటా
     జాలలఁసశ్శురాపగుల శంకరకింకరులన్ భుజంగభూ
     షాలలితాంగులంద్రినయ నాంచితులంగనెనా పెముందటన్.

వ॥ కనుంగొనిమనంబున సందియమందుచు వత్సా! వీరెవ్వరో నన్ను రమ్మని చీరుచున్నవారు వీరి యాకారములు తమోగుణమును సూచింపుచున్నయని వీరితోఁబోవుటకు నాడెందఁ బొడంబడకున్నది. కావున వీరిం బంపివేయుమని తల్లి పల్కుటయు నయ్యతివల్లభుండు వారిని సానునయముగాఁ బోవం బ్రార్థించి మించిన భక్తితోఁ గేలుబోయి ఫాలంబున గీలించి యనంతభోగపర్యంకంబున నిండిరాసుందర పర్యంకపీఠంబునజరణపం కేరుహంబులునిచి నీలావసుధావధూటులిరుగెలంకులనిల్చి చామరములిడుచుండ గరుడుండగ్రభాగంబున దోసిలి యొగ్గి నిలువంబడ శంఖచక్రాది సాధనంబులు మూర్తీభవించి యాశ్రయింప మకుటకే యూరికుండలాద్యలంకారపరిశోభితుండై నీలనిర దనంకాశదేహంబు దీపింప మందహాసశోభితవదనారవిందుండై శయనించియున్న యిందిరావల్లభుం బ్రార్థించి తల్లికట్టిరూపము బోధించి "అమ్మా ! నీకిప్పు డెట్టివారు గనంబడుచున్న వార"ని యడిగెను.

ఉ. చందనచర్చితాంగుల విశాలసరోరుహపత్రనేత్రులన్
     సుందరనీలనీరద విశోభితగాత్రుల విస్ఫురద్గదా

    నందకముఖ్యసాథనకనత్కలరులన్మణికింకిణీరణ
    త్స్యందనయుక్తులన్సుగుణనక్తులవెన్నునికూర్మిభక్తులన్.

వ॥ ఆ వృద్ధాంగనముందరఁ గనుఁగొని యానందముతోఁ దండ్రీ యిప్పుడు శాంతులైన వారెవ్వరోవచ్చి మెఱపువలె మెఱయుచున్న రథముమీదికి నన్ను రమ్మని పిల్పుచున్నారు. పోయివత్తు నిదియంతయు నీ మహిమయేకదా? వెనుకయిచ్చిన వరము మరువకుమీ యని పలుకుచు నామె ప్రాణములు విడిచి దివ్యదేహంబుఁ దాల్చి యవ్విమానం బధిరోహించి పరమపదము నొందినది

పిమ్మట శంకరుండు తల్లికిచ్చిన వరము చెల్లించు తలంపుతో నపర సంస్కారములు సేయఁదలంచి ప్రధానజ్ఞాతియగు యజ్ఞభట్టారకుం జీరి యందులకుఁ దగిన సన్నాహముఁ గావింపుమని జెప్పెను.

ఆ వార్త విని కాలట్యగ్రహారములో నున్న బ్రాహ్మణులెల్లరు నొకచోట సభఁజేసి యిట్లు సంభాషించుకొనిరి.

సభాపతి — ఏమండోయి శివగురుని కొడుకు తల్లిని జ్ఞాతుల పాలుజేసి సన్యాసము తీసుకొని యిప్పుడామెకుఁ గర్మచేయఁదలచుకొన్నాఁడట. రమ్మనమని గ్రామస్థులకు యజ్ఞభట్టారకుండు కబురుఁజేసెను. మనమందరము పోవలసినదా? మాన వలసినదా ?

కొందరుబ్రాహ్మణులు — సన్యాసికిఁ గర్మచేయు నధికారమే శాస్త్రములోఁ జెప్పబడియున్నది ఆ కార్యకారణము చేయునప్పుడు మన మేలాగున వెళ్ళుదుము ?

మరికొందరు — అతఁడు జగత్పండితుఁడుగాని సామాన్యుఁడుకాఁడు అది యకార్యమో కార్యమో యతనికన్న మనకెక్కుడుగా దెలియునా యేమి ?

కొందరు — ఇదియే మూర్ఖత. ఏ కాలములో నైన సన్యాసి కర్మ చేసినట్టు చెప్పికొనుటగాని వినుటగాని యున్నదా ? శాస్త్రముమాట యటుండనీయుఁడు.

సభాపతి — కర్మయే పనికిరాదని దేశములు నెల్లెడల వాదించుచుఁ దానిప్పుడు తల్లికెటు కర్మచేయఁ బూనుకొనుచున్నాఁడు? చెప్పునది యొకటి చేయునది యొకటియునా ?

మరికొందరు — ఇంత వితర్కమేల ? పోయి యడుగరాదా ?

సభాపతి — వీరవర్మ యడిగినంత నేవియో నాలుగు డాంబికములు చెప్పి యతనిని మాట్లాడనిచ్చినాఁడు కాఁడఁట.

మరికొందరు — పోనీ నీవు వెళ్ళి యడుగుము.

సభాపతి — నా కంత యవసరమేల? అచ్చటి కెవ్వరు పోకుంటే నా యొద్ద కతండేవచ్చునుకదా ?

మరి - మనలో మనము తగవులాడుట మంచిదికాదు. మనమందరము పోయి యతనితో మాటాడి యుక్తానుసారముగా నాచరింతుముగాక. కొందరు — మీకేమో దానధర్మములుచేయుననుతలంపుతో జెప్పుచున్నారు. అతఁడు సన్యాసి. ఇచ్చుట కతనియొద్ద నేమియులేదు. ఎదురు మనలనే యాచించును. కావున మా కిష్టము లేదు. మేము రాము. మీరు పోతిరేని మీకును మాకును భోజనములు లేవు. మొదటనే చెప్పుచున్నాము.

మరికొందరు - అతండు బంధువుఁడని యంటిమి. మీ కట్టి తాత్పర్యమున్నది. కావున బ్బీడయఁడని యిట్టియూహ చేయుచున్నారు. చాలు చాలు మీతో మాకు సహంపక్తి లేకపోతే మాకేమియు లోపము లేదు. మొన్నను ఘటశ్రాద్ధము గావించిన విస్సన్నసోమయాజి నెవ్వఁడు నాక్షేపించినవాఁడు కాఁడేమి ? అంతకంటె శంకరుఁడకార్యకరణమేమియుఁ జేయలేదు. మేము పోవకమానము. అదియునుంగాక యజ్ఞభట్టారకుండు మాకు మిత్రుండైయున్న వాఁడు అతని మొగమైనంజూచి పోవక తప్పదు. మీరు మాకు వెలివేయించినప్పుడు చూతములే.

సభాపతి — ఓహో ! మీరిట్లు స్వతంత్రులై మాడాడుచుండ నా సభాపతిత్వమేమిటికో ? ఏదీ మీరు నా యాజ్ఞలేక శంకరుని యింటి కరుగుఁడు మరుఁడు చెప్పెదను.

మరికొందరు - పోనీ యీ గ్రామములో నుండకుండఁ జేయుదువింతేనా? మరియొకచోటికిఁ బోయెదము. ఇంతకు మేమేమంటిమి ? ఊరక వీరు మమ్మాక్షేపించు చుండ నూరకుందుమా ?

సభాపతి — పైన నేనుండఁగా మీకీ తగవులేలా ! నేనెట్లనిన నందరు నట్లు చేయుఁడు. అదిగో యజ్ఞభట్టారకుం డిట్లు వచ్చుచున్నాఁడు. అతనినిఁ గూడ మనము చెప్పునట్లు నడుచువానిఁగా జేయుదు. చూడుఁడు నా ప్రభావము

యజ్ఞభట్టారకుడు — [ప్రవేశించి] ఏమండోయి సభాపతిగారు అందరు నిచ్చటనే యున్నారు, గనుక చెప్పుచున్నాను. మా శంకదరు తల్లి రాత్రి స్వర్గస్థు రాలైనది. ఇప్పు డపర సంస్కారము శంకరుఁడే చేయ నిశ్చయించినాడు. మిమ్ముల నందరినిఁ దీసుకొనిరమ్మన్నాడు.

సభాపతి - భట్టారకా చెప్పువానికి మతిలేకపోయిన వినువానికి నీకైనను మతిలేదా యేమి? శంకరుండా కర్మచేయుట? ఇట్టి విరుద్ధ మెందైనంగలదా? విద్యాధి రాజవంశము వారెట్టి యకార్య కరణము జేసినను సాగుననియా యేమి

యజ్ఞ — అతఁడు తల్లికిఁ గర్మ చేయుదునని వరమిచ్చెనఁట. అందుమూలమునఁ జేయుచున్నాఁడు. ఎవ్వరేని వచ్చి యడిగిన సమాధానము చెప్పెదననుచున్నాఁడు. ఈ విషయమిందాక వీరవర్మ యడిగిన సమాధానముచెప్పి యతని నొప్పించెనే. సభాపతి — ఈ సమాధానముల కేమి లెండి. ఇవేమియు మాకు నచ్చవు. తల్లి బ్రతికియుండఁగా బెండ్లియాడుమని యెంత బ్రతిమాలినను వినక చచ్చిన తరువాతఁ గర్మచేయుమని చెప్పినమాట మాత్రము విని యకార్యకరణమున కుద్యోగించు చున్నాఁడా ? భట్టారకా ! నీవు వట్టి వెర్రివాఁడవు సుమీ.

భట్టారకుడు — అట్లనుచున్నావేమి ? మరియొక హేతువేదియైనంగలదా?

సభాపతి — [రహస్యముగా] శంకరుండు మొదట విరక్తుడై సన్యసించి తన యాస్తినంతయుఁ దల్లితోఁ గూడ నీ యధీనము గావించి యరిగెను గదా? ఇప్పుడా యాస్తియం దాసజనించి తాను రాఁబట్టుకొను తలంపులోఁ దల్లికి గర్మ చేయఁబూనుకొనుచున్నాఁడు. ఈ మర్మము నీవెరుంగక వేరొక విధమునఁ" దలంచుచున్నావు.

భట్టారకుడు — [ఆలోచించుచు] ఇందులకు నేనేమి జేయవలసినది ?

సభాపతి — కర్మచేయనీయకుము. మేమందరము నీకుదోఁడు పడుదుము. మనకు మనకు విధాయకుము. అతండీవేళనుండి ఱేపుపోవువాఁడు.

యజ్ఞ — అయ్యో ! నా కతనితో నేమాట చెప్పుటకు నోరాడదు ఏమి చేయుదును ?

సభాపతి - నీవేమియుఁ జేయవద్దు. ఇందేయుండుము. అతనికి నిప్పైనను దొరకనీయను. వాహకులు మునుపే లేదు. ఏమి చేయునో చూతము.

యజ్ఞ — అదిగో మా పినతండ్రి పశుపతి నా కొరకు వచ్చుచున్నాఁడు. అతనితోఁ గూడఁ జెప్పుము.

సభాపతి — ఎవరు వచ్చిననేమి ? గ్రామస్థులలో బాలుండైన నచ్చటికి రాఁడు.

పశుపతి — [ప్రవేశించి] ఏమిరా భట్టారకా ! యిందు జాగుచేసితివి శంకరుఁడు తొందరపడుచున్నాఁడు ? వాహకులేరీ?

భట్టారకుఁడు - శంకరుఁడు శాస్త్రదూష్యమైన పనిచేయుచున్నాఁడని గ్రామస్థులెల్లరు సభచేసి శంకరునికి వెలివేసిరఁట. వాహకులెవ్వరు రారఁట ! మన మేమిచేయుదుము !

పశుపతి — ఆహా ! శంకరునికా వెలి! గ్రామస్థులెంత మూర్ఖులు అగ్నికిఁ జెదలుపట్టునా ? వీరికెద్దియో మూడినది.

సభాపతి — వీర కేదియు మూడలేదు వారికి మూడియే యిట్టి యకార్య కరణములకుఁ బూనుకొనుట.

పశుపతి - ఛీ ఛీ నోరుమూయి. అతండల్గిన మూడులోకములను భస్మము చేయఁగలడు. సభాపతి — ఈ బెదరింపులకు మేము వెరవము. గ్రామస్థు లెవ్వరును రారు. మీ యిష్టము వచ్చినట్లు చేసికొనుఁడు.

పశుపతి — భట్టారకా ! నీవును రావాయేమి ?

భట్టారకుఁడు - బాబూ ! తొందరపడకుము గ్రామస్థులందరు నొక్కటి యైనచో మనము మాత్రము వెళ్ళి ఏమి చేయుదుము?

పశపతి — ఛీ ! నీ జ్ఞాతిత్వమూరక పోనిచ్చితివికావు. అతండు మహానుభావుండు. మనలనందరను భస్మము చేయకమానఁడు. చూడుము అదిగో మనమిందు జాగుచేసితిమని మనకొరకు మనకుమార పాలితుని వెండియుంబంపియున్నాఁడు. రెండుయామము లైనది పోదమురమ్ము.

భట్టారకుడు — కుమారపాలితు నచ్చటి విశేషములడిగి పోవుదముండుము.

కుమార — [ప్రవేశించి] పశుపతి తాతా ! నీవునిందు జాగుచేసితివేల ? మనయగ్రహారము పనిదీరినదిలే.

పశుపతి - ఏమి ! యేమి ! యతండు కోపించినా యేమి ? నేనేమిచేయుదును. గ్రామస్థులందరు నతనికి వెలివేసిరఁట

కుమార - ఎంతసేపటికి నీవును భట్టారకుండును రామి, నొక్కండును తల్లి శవము దాపుననుండి విసిగి కోపముజనింప వీరిగుజగుజల నతండెరిగి తల్లి కుడి భుజముమధించి యందగ్నిఁ బెట్టించి యయ్యగ్ని చేతమమున దొడ్డిలోఁ జతినేర్పరచి తల్లిని దహించెను.

పశపతి - అతని సామర్థ్యమెట్టిదో చూచితిరా ? నేను మెదటనే చెప్పితిని. సన్నికల్లు దాచిన బెండ్లి యాగునా? తరువాత..

కుమార — తరువాత నీ గ్రామస్థుల నుద్దేశించి.

క. శ్రుతిబాహ్యులగుదురిటు పై
   యతులెప్పుడు వీరి గృహములందుఁగుడువరు
   ద్దతివీర పెరటి భూములఁ
   బితృవనములు వెలయునని శపించె నలుకతోన్.

పశుపతి - అయ్యో అయ్యో ! వీరికతంబున విహితులమగు మనముసయితము శాపదగ్ధులమైతిమే. యికేమి చేయుదుము? వేదబాహ్యులమైపోతిమిగదా మన గృహములు శ్మశానములైనవి.

గ్రామస్థులు — [దుఃఖముతో] ఇంతయు నీ సభాపతి మూలమున మూడినది. ఏమియు నెరుంగని వారిని దీసికొనివచ్చి సభలు చేయించి యిట్లనుమని మమ్ము గంగలో దింపినాడు. మేమేకాక మా కులస్థుల నెల్ల జెరిపికొంటిమి. కటకటా ! కాలట్యగ్రహారమునకెట్టి యాపద తటస్థించినది. జన్మభూమి యని యతడించుకయు కనికరించక క్రూరముగా శపించెనే ఇది కాటియగ్రహారమైపోయినది

పశుపతి — ఇతండు శాంతుఁడని పీడించిన గోపగించకుండునా? చల్లని దైనను చందనవృక్షము మధించినచో నగ్ని జనకము కాకుండునా ? తేజశ్శాలులకృత్యముల శాస్త్రీయములైనను నింద్యములు కావు. మున్ను పరశురాముండు పితృశాసనంబున దూష్యంబైనను మాతృవధ గావింపలేదా ? అని వారు పశ్చాత్తాపతప్తులగుచు నిష్క్రమించిరి.

అట్లు శంకరాచార్యులు దల్లిని ముక్తినొందించి పద్మపాదుని రాక నరయుచు గేరళదేశమున గొన్ని దినములు కాలక్షేపము గావించిరి.

పద్మపాదుని దీర్థయాత్ర

పద్మపాదుండును గురుచరణ సరసిజంబుల హృదయంబున ధ్యానించుచు సేతుయాత్రకు బయలువెడలి సముచిత శిష్య సహితుండై చనిచని.

క. శ్రీకాళహస్తికరిగి సు
   ధాకర శేఖరు భజించి తానంతనతం
   డేకామ్రనాధు గామా
   క్షీ కాంతుంగాంచి సేవించెదగన్.

మఱియును -

గీ. అని శమీకుఁడు తాండవమాడుచుండ
   నద్రికన్యకవీక్షించు నమలమంద
   హాసశోభితవదనాబ్జ యగుచు నెచట
   గదలెఁదానట్టి పుండరీకమునకతఁడు.

అందు శివుండు తాండవమాడునప్పుడు తచ్చ్రమాపనయనార్ధమై దివ్య గంగంబ్రార్ధించిన తీర్థంబు సన్నిహితంబైనది. దానఁజేసి యత్తీర్థంబు శివగంగయని ప్రఖ్యాతి వడసినది. మరియుం బార్వతీవల్లభుని నాట్యశ్రమ మపనయింప గంగా రూపంబున సన్నిహితయగుటం జేసి యది శివగంగయని పిలువంబడుచున్నదని కొందరు చెప్పుదురు. మరికొందరు నాట్యమాడునప్పుడు శివుని జటాజూటమునందలి జాహ్న వీబిందునందు జారిపడినకతంబున బుణ్యతీర్ధంబై శివగంగయని వాడుక వడసిసదని వక్కాణింతురు. ఆ శివగంగయందు మునింగి శివుని తాండవమీక్షించిన మానవులు విధూతపావులై ముక్తి కరుగుదురు. పద్మపాదుండట్టి శివగంగ మునింగి గౌరీనాధు నారాధించి తాండవము జూచి పరమానందము నొందెను. పదంపడి శ్రీరంగమున కరిగెను.

క. శ్రీరంగపతింగావే
   రీరంగద్భంగపవన తృప్తమతిమనం
   బారంగఁ గొలిచె సుకృతము
   మీరంగొన్నాళ్ళు యతి సమీహితభక్తిన్.

అట్లు దక్షిణ యాత్రలన్నియు గ్రమంబున సేవింపుచు బద్మపాదుండొక నాడు దారి దారసిల్లిన మేనమామ యింటికిం జనుటయు నతండు పరమానందము జెందుచు భాగినేయుని శిష్యయుక్తముగా నర్చించి నానా ధోపచారములచే నతనికి సంతోషము గలుగజేసెను.

అప్పు డవ్వార్త నాలించి యందుగల బంధువులందరు సందోహముగా జనుదెంచి ప్రేమానుబంధపూర్వకముగా నాలింగనాది కృతంబు లొనరించి,

శా. అన్నా ! నీ విటకుంజిరాగతుడవైతంచుం బ్రమోదంబుతో
    నిన్నుంజూడగ వచ్చినారముగదా నీ వెన్న సంసార దు
    స్సాన్నాహంబుల నెల్లఁ ద్రెంచి పరమాచ్చస్థానస స్థాయివై
    చెన్నారన్సుఖియింపుచుంటివిఁక మా స్నేహంబు నిన్నంటునే.

గీ. లేదుగద నీకుదారసుతాదిబంధు
   గతవిషాదంబు గలుగదు గద నృపాల
   బాధ తస్క రభీతి యెప్పటికి నహహ
   కనఁగ నీ వంటిసౌఖ్య మెక్కడిది మాకు.

చ. అనఘ కుటుంబరక్షణ సమాప్తమనీషులమై సదా ధనా
    ర్జనగితి నొప్పి యించుకయు సౌఖ్యముగానక నిద్రజెంద కి
    ల్లను పెనునూతిలోనఁ బడియారటమందెడు మాకు దేవతా
    ర్ఛనయును దీర్తయాత్రలును సజ్జనసేవయుఁ గల్గనేర్చునే.

క. నిను సన్యాసకృతునిఁగా
   వినినారము పూర్వమొక్క విప్రునివలనన్
   గనుఁగొనఁగోరుదు మిప్పుడు
   కనఁబడితివి తీర్థయాత్ర కతమున మాకున్.

గీ. పరులచే బెంపఁబడినట్టి పాదపములు
   తావులుగఁ జేసికొను శకుంతములభాతి

    యతులు పరకృత మఠదేవతాలయములఁ
    దిరుగుచుందురు మమతా విధేయులగుచు.

క. యతి కేమిగావలయు సం
   యతమే సౌఖ్యంబు పూజ్యులగు శిష్యజనుల్
   సుతలాత్మగతి కళత్రం
   బతిశయముగ దనువే గేహమై యొప్పంగన్.

గీ. కామవశునకు దుఃఖంబె కాని సుఖము
   లేశమైనను దలపోయలేదు లేదు
   పురుషునకుగానను విరక్తిఁ బూనవలయు
   దానఁ గలిగెడు సౌఖ్య మెద్దానలేదు.

వ. మహాత్మా ! అధ్యాత్మతత్త్వవేత్తలగు మీ వంటివారు యదృచ్ఛాలాభ సంతుష్టి నొందుచు గులశీలనామంబుల దెలియనీయక యజ్ఞజడమూకనులభాతి దోచుచు బరోపకారమునకే తీర్థాటనంబు గావింతురు. కాని తీర్థయాత్రవలన నించుకయుఁ బ్రయోజనంబు మీకు లేదు. విశేషించి తీర్థములే మీ పాదరేణువులు సోకి పవిత్రము లగుచుండును. మీరు కొన్ని దినంబు లిందుండుఁడు. భవదీయ దర్శన లాభంబునఁ బాపంబులంబాసి యభీష్ట సుఖంబులనొందఁ గలమని పలికిన విని పద్మపాదుండు వారి కిట్లనియె.

గీ. ఆకలియు దప్పిగొనుచు మధ్యాహ్నవేళ
   నన్న మిడియెడు సుకృతి యెందున్నవాఁ డ
   టంచు నతిధులు వెసనే గృహస్థుఁజేరి
   తృప్తివడయుదు రతని సతింపవశమె.

ఉ. స్నానముఁజేసి యగ్ని పరిచర్య నొనర్చుచు వేళలందుఁ గౌ
    పీనము దాల్చి వేదము జపించుచు దండము చేతఁబూని వి
    ద్యానిధి బ్రహ్మచారి జఠరాగ్ని జ్వలింపఁగ భిక్షఁగోరి యె
    వ్వాని గృహంబుజేరుఁ దలపన్మరి యట్టి గృహస్తుఁ డల్పుడే.

శా. వైరాగ్యంబు దృఢంబుఁజేసి పరతత్త్వజ్ఞానసంయుక్తి సం
    సారంబున్మదిరోసి క్రమ్మరెడు నా సన్యాసియున్నిష్ఠి నోం
    కారంబుం జపియించుచు నృతతమున్ ఘస్రార్థభాగంబునం
    జేరుంగాదె గృహస్థునింటి కుదరార్చిష్మచ్చిఖల్వెల్గఁగాన్.

గీ. వసుధ నెవ్వని యెన్నంబు వలనఁ దనువు
   బలియఁ దపమాచరించుఁ దాపసజనంబు

   తత్తపోర్ధ వలంబన్న దాతఁజేరు
   ననుచు స్మృతులెన్న వినమె మహాత్ములార

గీ. ఉర్విగృహపతి చల్లగా నుంటఁగాదె
   సాగుచున్నది తాపస జనతపంబు
   యతులనియమంబు మడుగుల వ్రతముభిక్షు
   కులప్రవాసంబు మహిదైర్ది కులప్రసేవ.

గీ. కాన గృహపతి యందఱికన్న నధికుఁ
   డన్న మన్నమటంచు గృహంబుఁజేరు
   నతిథిఁ బూజింపరయ్య సత్యముగదాన
   గలుగు సుకృతము కోటియాగములరాదు.

క. భగవత్ప్రీతిగ నిత్యము
   లగుకర్మలఁ జేయుఁడీ ఫలాపేక్ష దృఢం
   బుగవిడువుఁ డట్టులైనన్
   జగతిని మిముఁబోల రెట్టి సాధువులైనన్.

అని గృహస్థధర్మంబులం గొనియాడుచు నీతిమార్గం బుపదేశించి బంధుజనంబునెల్ల సాదరంబుగా ననిపెను. పదంపడి మేనమామచే నర్చితుండై యతని గృహంబున భిక్షగావించెను. అట్టిసమయంబున మాతులుఁడు శిష్యహస్తచ్ఛన్నంబైన యొకపుస్తకమును జూచి యదియేమని యడిగిన బద్మపాదుండు ఆర్యా! యిది శంకరాచార్య కృతంబగు సూత్రభాష్యమునకు టీక నాచే రచింపఁబడినది. వినుమని యంతయుం జదివి వినుపించుటయు నతండతని ప్రబందనిర్మాణ నైపుణ్యమున కెంతయు వింత పడుచు మతాంతరఖండనల నిరుత్తరముగాఁ జేయఁబడిన తద్రచనకుఁ ప్రభాకర శిష్యుండగుట నీసుజనింప స్వమత తిరస్కారంబువలనం గలిగిన మత్సరంబు వెల్లడి గానీక మందహాసముఁ గావించి మిక్కిలి స్తోత్రము గావించెను.

అక్కపటం బెరుంగక పద్మపాదుండు ప్రయాణసమయంబున నాపుస్తకము మాతులహస్తముననిడి ఆర్యా ? నాకు దీనియందు జీవితముకన్న నెక్కుడు ప్రీతిగలిగి యున్నది మార్గమధ్యమందుఁ బ్రత్యనాయమేమైనఁ గలుగునేమో యనివెఱచి ఇది నీకడ నప్పగించుచున్నవాఁడ. నేను సేతుయాత్రఁ జేసికొని సత్వరముగా వచ్చువాఁడ? నంత దనున భద్రముగా దీని గాపాడవలయు. నీకన్న నాకుఁ బరమాప్తుడు లేఁడుగదాయని పలుమారు చెప్పి చెప్పి యతండు శిష్యులతోఁ గూఢ రామేశ్వరమున కఱిగెను.

పిమ్మట మాతులుం డాలోచించి యాహా ! యిప్పుడీ పుస్తకము నాచేతం బడినదిగదా. దీని రూపుమాపితినేని గురుమతరక్షకుండ నగుదును. కానిచో నిందలి మతఖండనల కుత్తర మెవ్వఁడు సెప్పగలఁడు? విశ్వాసఘాతుక పాతకమువచ్చిన వచ్చుంగాక. దీని నిర్మూలించుటయే కర్తవ్యము. గృహముతోఁగూడ దీని దగ్ధము గావించెద. స్వపక్ష నాశనముకన్న గృహనాశనమే శ్రేయము. అట్లైనఁ పద్మపాదునకు నిందించుట కవకాశము గలుగదని దలంచి యొక రేయిఁ దనయింటికి నిప్పంటించుకొని నాయిల్లు దగ్ధమగుచున్నదో యని పెద్ద యెలుంగున నరచెను.

అప్పుడు గొప్పచప్పుడు లుప్పత్తిల్లగుప్పునఁ బొగగ్రమ్మియమ్మందిరము దగ్ధమగుచుండ గ్రామస్థులెల్ల సత్వరముగా నరుదెంచి తగుప్రయత్నముఁ జేసిరికాని యించుకయుం బ్రయోజనము లేకపోయినది. భస్మావిశేషమైన తనయింటింజూచి యా బ్రాహ్మణుండు గుండెలు బాదుకొనుచు, అయ్యో నాకీగృహము నాశనమైనదని యించుకయు విచారములేదు. పద్మపాదుండు నాకొకపుస్తక మిచ్చిపోయెను. అది యిందు దగ్ధమైనది దానిగురించి చింతించుచున్నవాఁడని పదుగురు విన శోకించుచు బంధుజన ప్రభోధితుఁడై యెట్టకేని యాదుఃఖము వాసికొనినట్లభినయించెను. పద్మపాదుండును సేతుయాత్రఁజేసికొని వెండియుం గొన్నిదినంబులకు మాతులగృహంబున కరుదెంచెను. అతండతనిఁ గౌగిలించుకొని యార్యా ! దైవమెట్లుగావించెనో చూచితివా ? నాకు నీ మొగముచూచుట సిగ్గగుచున్నది. నీవు ప్రాణపదముగా నాకప్పగించిన పుస్తకము దిరుగ నీచేతఁబెట్టుభాగ్యము నాకుఁబట్టినదికాదుగదా. గృహముపోయిన విచారముకన్న నీవిచారమే నన్నెక్కడగా బాధింపుచున్నది. ఏమిచేయుదును. సంతతము నిన్నే తలంచుకొనుచుఁ గృశింపుచుంటినని బుడిబుడిదుఃఖంబభినయించిన వారించుచు పద్మపాదుం డిట్లనియె.

మామా గతమునకు వగచుట సాధుధర్మముగాదు. పోనిమ్ము దైవికమునకు నీవేమిచేయుదువు పుస్తకముపోయినం బోవుఁకాక నా బుద్ధియెక్కడికిఁ బోయినది. కొన్ని దినములిందుండి వెండియు నాగ్రంథము రచించెదఁ జూడుమని పలికి యప్పుడే గంటము చేతింబూని గ్రంథరచన ప్రారంభించెను.

అప్పుడు మాతులుఁడు అయ్యో ! నాచేసిన ప్రయత్నమంతయు వ్యర్థమై పోయినది మఱల నితండా గ్రంథమును జేయుచున్నవాఁడు. దీనికంతరాయమెట్లుగలుగునని యాలోచించి యాలోచించి యతండు భుజించనప్పు డన్నములో బుద్ధిమాంద్యము గలుగఁజేయు నోషధీ విశేషము గలిపెను. దానిందిని యతండు మందబుద్ధియై మును బోలె గ్రంథరచనా పాటవంబులేక విచారింపుచుండె.

అట్టిసమయంబున శ్రీశంకరశిష్యులుకొందఱాకస్మికముగా నచ్చటికివచ్చుటయు వారింగాంచి పద్మపాదుండు ప్రహర్షసాగరంబున మునుంగుచు నాలింగనముఁ జేసికొని మిత్రులారా ! మీరెందుండి వచ్చుచుంటిరి మనగురుండెందున్న వాఁడు. విశేషములేమనియడిగిన వారిట్లనిరి.

ఆర్యా! నీవరిగిన కొన్నిదినంబులకు మన గురుండు తల్లికిఁ బ్రాణోత్క్రమణసమయ మగుచున్నదని యెరింగి మమ్మువిడిచి శృంగగిరినుండి యోగశక్తి నింటికిం జనియెను. నాటంగోలె నమ్మహాత్ముని పాదసేవ మాకులేదు. మేమును నీవలెనే తీర్థాటనము సేయుచున్న వారము. అమ్మహాత్ముండిప్పుడు కేరళ దేశమందు మహా సురేశ్వరుని యాలయంబుననున్నాడని యొకబ్రాహ్మణుఁడుచెప్పెను. అచ్చటికిబోవు చున్నారము. దైవికమున నీవిందుఁ గనంబడితివి. పోదము రమ్మనుటయుఁ బద్మ చరణుండు సంతసించుచు వారితో బయబదేరెను.

వారందరుంగలసి కతిపయప్రయాణంబుల మహాసురేశ్వరుని యాలయంబునకుంజనియందు దేవస్తుతిగావించు గురువరునింగాంచి ప్రహర్షపులకితశరీరులై సాష్టాంగ నమస్కారములు గావించిరి శిష్యుల నందఱ గ్రుచ్చియెత్తి కరుణాకటాక్షవీక్షణంబుల విలోకింపుచు వేరు వేర కుశలమడిగి సాదరంబుగ గారవించుటయ నప్పుడుపద్మపాదుం డతి దీనమనస్కుండగుచుఁ గంఠంబున గద్గదికదోప మెల్లననిట్లనియె మహాత్మా నేను దేవరయానతివడి రామేశ్వరమునకరుగుచుఁ బూర్వాశ్రమబంధుండుగు మేనమామ యింటికింబోయి యతనిచే నర్చితుండనై యతనియొద్ద నారచియుంచిన టీకంజదివితిని. అతండందుఁ గొన్ని శంకలం గావించెను. అప్పుడు విధ్వస్తతర్క గురుకాపిలతంత్రములగు భవదీయ సూక్తజాలములచే నతనిఁ ద్రుటిలో నిరుత్తరుం జేసితిని.

ఆ మత్సరంబుమదంబున నడంచుకొని యతండు యధాపూర్వముగా నన్నభినందించిన సంతసించును నేనా టీకయతనియొద్ద దాచి సేతుయాత్రకరిగి వచ్చితిని. ఆ లోపలనావంచకుండిటింతోఁ గూడ నా గ్రంధమును దగ్ధముగావించెను. అంతటితో విడువక నాకు గ్రంథరచనా పాటవము లేకుండ నన్నములోమ దిడి నాడెందమునకు మందత గలుగజేసెను. ప్రభాకర శిష్యుండుగు నతనియూహ తెలిసికొనలేక మోస పోయితిని. స్వామీ యేమిసేయుదును. మునుపటి యూహలేమియు స్ఫురించవు. కరుణాసముద్రుండవగు నీదాసునకిట్టి యవమానమేమిటికి రావలయు. భవదీయ పాదపద్మదర్శనమైనది నాచింతవాయఁగలదని పలికినవిని శంకరాచార్యులు కృపారసపూరితాంతరంగులై యమృత సమంబులగు పలుకుల నూరడింపుచు నిట్లనిరి

వత్సా ! పద్మపాద ! దైవమునుమీరిన వాఁడెవ్వఁడును లేఁడు. కర్మపరిపాకము కడువిషమమైనది. వినుమీతెరంగు మునుపే నేనెరుగుదును. సురేశ్వరునితోఁ గూడఁ జెప్పియుంటిని కానిమ్ము. పూర్వము శృంగగిరియందు నీవు నా చెంతఁ జదివిన పంచపాది నాకు జ్ఞాపకమున్నది. అదియంతయుం జదివెద వ్రాసుకొనుమని పలికిన విని యతండు మితిలేని కుతుకముతో నదియంతయు వ్రాసికొనియెను

ఆ కృతి యాకృతినంతయు యధాపూర్వకముగా వక్కాణించెను. సర్వ విద్యాబ్రవృత్తిగలిగి త్రిభువనగురుండగు పరమపురుషున కొక్కసారి వినిన గ్రంథము మరలఁ జదువుట యొకయబ్బురమా ? అట్లు పద్మపాదుండు పంచపాదిని వ్రాసికొని యబ్బి యానందంబు పట్టఁజాలక గంతులువైచుచు నానందాశ్రులుగార నడుచుం బాడుచుం బలుతెరంగుల సంతోషమున బ్రకటించుకొనియెను. అప్పుడావార్త యాదేశమంతయు వ్యాపించినది. కేరళదేశాధీశ్వరుఁడైన రాజశేఖరుండను నృపాలుండు సత్వరముగా నరుదెంచి నిజకిరీట కోటిఘటితమణిగణ కిరణనిచయములచే శంకరగురుని చరణ సరసిజములకు నీరాజన మిచ్చుటయు నమ్మహనుభావుండు గురుతువట్టి రాజా! నీకుభద్రమా! నీరచించిన నాటకములు వ్యాపకముగా నున్నవియా? యిట కేమిటికి వచ్చితివని యడిగిన నయ్యెడయఁ డు ఫాలంబునఁ గేలుగీలించి యల్లన నిట్లనియె

మహాత్మా! భవదీయకరుణావిశేషంబున నేకొరంతయలేదుగాని నాచే రచింపఁబడిన నాటకములుమూడును ప్రమాదవశంబునంజేసి దగ్ధములైనవి. మరల వానిరచించుట కట్టి బుద్ధిపాటవములేదు. తన్నాశనదుఃఖంబు నన్నూరకబాధింపుచున్నది. మీరల్లనాఁడు వాని వింటిరిగద. ప్రధమశిష్యునకుఁ బంచపాది ననుగ్రహించితిరని లోకమంతయుఁ జెప్పుకొనుచున్నది. కరణాళుండవై నన్నుఁగృతిచేఁ గృతకృత్యునిఁగాఁ జేయవేఁడుచున్నానని ప్రార్థించిన విని యయ్యతి చంద్రుఁడు మందహాసచంద్రికలు గండఫలకల వ్యాపింపఁ జేయుచు నామూడునాటకముల నామూలచూడముగా నేకరువు పెట్టెను

విస్మయసంతోషంబుల మనంబునం బెనంగొన వానిని వ్రాసికొని యారాజు మహాత్మా ! నీవవతార శరీరుఁడవు. నీప్రభావంబెన్న మాబోటులకు శక్యముకాదు. నీకు నేను కింకరుండఁ బనులకు నియోగింపుమని ప్రార్ధించిన నాగురుండు రాజా ! నీవు నాకుఁ గావింపవలసిన దేమియును లేదు కాలట్యగ్రహారవాసులగు బ్రాహ్మణులు ద్విజ కర్మలకుఁ దగరని శపించితిని. మచ్ఛాపంబు మన్నించి నీవును వారికట్లు విధింపుము. పాపమతులఁ గనికరింపరాదుగా యని యాజ్ఞాపించిన వల్లెయని యానృపతల్లజుండతని పాదపల్లవములకు నమస్కరింపుచుఁ దదనుజ్ఞవడసి నిజపురంబున కరిగె.