కాశీమజిలీకథలు/అయిదవ భాగము/50వ మజిలీ

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

కాశీమజిలీకథలు

50 వ మజిలీ

తృతీయోల్లాసము

ఒకనాడు నారదుండు దేవలోకమునుండి పుడమికి వచ్చుచుండఁ దుంబరుం డెదురుపడుటయు వారిరువురకును నిట్లు సంవాదము జరిగినది.

తుంబురుఁడు - దేవమునీంద్రా ! తొందరగాఁ బోవుచుంటిరి నెక్కటికేమి? ఎందుండి వచ్చుచుంటివి?

నారదుఁడు - తుంబురుడా యేమి! నేను కైలాసమునుండి వచ్చుచున్నవాఁడ. భూలోకమునకుం బోవుచుంటి. తొందరపనియే యున్నది.

తుంబు — అది యేదియో చెప్పవచ్చునా! రహస్యమా?

నార - రహస్యము వంటిదే. అయినను నీవు నాకుఁ బరమాప్తుండవు గావున వక్కాణించెద నెక్కడను వెల్లడి చేయవు గదా!

తుంబు - నీవు వలదని నుడవినప్పుడు ప్రకటింతునా?

నార — [మెల్లగా] మహేశ్వరుండు పుడమియందు శంకరావతారమెత్తిన కథ నీ వెరుంగుదువా?

తుంబు - ఎరుఁగ నెరుఁగ నది చెప్పవలయు.

నార — విష్ణుండు బుద్ధవతారమెత్తి తద్ధర్మముల నెల్ల బుడమి వ్యాపింప జేసిన వార్తయేని విని యుంటివా?

తుంబు — ఆ కథ యెరుంగుదును. త్రిపురదానవకాంతల వంచించుటకై వైకుంఠుండు బుద్ధుఁడై యవతరించినదియేనా?

నార - అగునదియే తచ్ఛాస్త్రంబులం జదివి బుద్ధమతస్తులు వర్ణాశ్రమాచారంబులు వమ్ము సేయుచు శ్రుతిదూషకులగుటయుఁ గ్రతుభోక్తలు క్షితిహవిర్భాగంబు లిచ్చువారలు లేమింజేసి చింతించి యా వృత్తాంతముఁ గంతువైరి కెఱింగించిరి.

తుంబు — అన్నప్రదాతలు లేనిచో విచారముకాదా! తరువాత తరువాత.

నార - అతిదయాళుండగు భూతపతి వారిమొఱ నాలించి యభయం బొసంగుచు మానుషశరీరము వహించి శంకరనామమున మీ మనోరథమును దీర్తునని యానతిచ్చెను.

తుం — భక్తజనపరిపాలన మా విభునకు సహజమై యున్నది కావున నట్లనుట యుచితమే. తరువాత.

నార — పిమ్మటఁ గుమారస్వామిం జూచి భట్టపాదుండను పేరుతో బౌద్ధమతంబు ఖండింపుచు ముందు నిగమంబుల కర్మకాండంబు నుద్ధరింపుమని యానతిచ్చెను.

తుం - తరువాత.

నార - తదాజ్ఞానుసారముగా షణ్ముఖుండు పుడమి భట్టపాదుండై యవతరించి యింద్రాంశ వలన జనించిన సుధన్యు నాశ్రయించి బౌద్దులనెల్ల దండింపఁజేసి కర్మమార్గమును ధరణి నిష్కంటకముగ వెలయంజేసెను.

తుం - పితృవాక్యపరిపాలనశీలుర కదియే కదా ధర్మము తరువాత.

నార - తరువాతఁ బరమేశ్వరుండు దక్షిణదేశంబున శివగురుండను బ్రాహ్మణోత్తమునకుఁ బుత్రుండై యుదయించి బాల్యంబుననే సకలవిద్యాపారంగతుండై బ్రహ్మచర్యము నుండియే సన్యసించి గోవిందయతి యనుమతిని వ్యాససూత్రములకు నద్వైతభాష్యము రచించి దేవతాంబల వలనం జనియించిన శిష్యబృందముఁ గూడికొని భట్టపాదుని ముక్తినొందించి తచ్చిష్యుండును బ్రహ్మాంశసంభూతుండును బ్రవృత్తిశాస్త్రనిరంతుండునగు మండనమిశ్రపండితప్రవరుని జయింప నరుగుచున్నాఁడు.

దూర్వాసశాపంబునం జేసి సరస్వతి యుభయభారతియను పేరుతో నవ్విద్వాంసునకు భార్యయై యుదయించినది. ఇప్పుడు కాఁబోవు నప్పండితుల ప్రసంగసంగరంబున మదీయాంతరంగమునకు వేడుక గలుగఁజేసికొను తలంపుతో నరుగు చున్నవాఁడ. అయ్యుభయ భారతియే వారికి మధ్యవర్తిగా నుండునని కైలాసంబున నొకసిద్ధుం డీశ్వరుని కెఱింగింపుచుండ వింటిని.

తుం - ఆర్యా! నీకు మంచిభోజనమే దొరికినది. కాని దూర్వాసయతి సకలలోకపూజ్యురాలగు సరస్వతిని సైతము శపించెనా? ఆహా కోపశీలురకు యుక్తాయుక్తవివేక ముండదుగదా! అమ్మహాదేవి యేమిటికిఁ తత్కోపపాత్రురాలయ్యెను.

నార - అదియుం జెప్పవలయునా! సమయము మిగులునేమో కదా, కానిమ్ము మహాత్ముల చరిత్రలు స్మరించుకొనినను కృతము గలుగజేయునని చెప్పుదురు. వినుము వెనుక సత్యలోకములో జరిగిన మహాసభకు నీవు వచ్చితివా?

తుం — రాలేదు. జరిగినదని మాత్రము వినియుంటిని.

నార - సురగరుడోరగగంధర్వాది దివిజగణంబులు దిక్పాలురు మహర్షులు పెక్కండ్రు తత్సభాంగణము నిండించి తమ తమ విద్యాపాటవము లా చతురాననునకుఁ జూపుచుండిరి.

తుం — మునీంద్రా! భవదీయ వీణాగానమాధుర్యమున సామాజికులకానందముఁ గలుగఁ జేసితివా?

నార - అంతవరకును నవకాశమేదీ? వినుము. అతికోపశుండైన దుర్వాసుండు తనకు సామగానము మిగులబ్రౌఢిమ గలదని పలికి యుచ్ఛస్వరంబున నవ్వేదంబు పఠింపుచు నొక్కచో స్వరంబు దప్పుటయుఁ దెప్పున నప్పరమేష్ఠి మ్రోలనున్న సరస్వతి ఫక్కున నవ్వినది.

తుం - వర్ణంబులంబట్టిన శబ్దసంగతి తదవయవమగుటచే నామె నవ్వుటయు సంతోషముగాదని తెలంచెదను.

నారద - అప్పుడు తత్పరిహాసకృతావమానము సహింపక దుర్వాసుండు క్రోధానలజ్వాలామాలికలలో యనఁ గ్రాలు జటాజాలంబులు విరజిమ్ముచు హుమ్మని కటమ్ము లదరఁ బరమేష్టిపత్ని ననుగరువముతోఁ భిన్న పెద్ద తారతమ్యంబు లరయక మాబోటి తపోధనులను సైతము పరిహసింపుచుంటివా కానిమ్ము. పుడమి మనుష్యజాతిం బుట్టిన నిట్లెన్నఁడును బెద్దల బరిహసింపవుగాయని శపించెను.

తుంబు - శివశివ. ఇంత మాత్రమునకే యమ్మహాదేవిని శపించుట. అయ్యయ్యో దుర్వాసుఁ డెంత కఠినచిత్తుఁడోకదా? తరువాత.

నారద — అతని యలుకంజూచి యందున్న మునితిలకులుగాని దివిజులు గాని యేమియుం బలుకనేరక వెఱపుతో మెల్లమెల్లగా నవ్వలికిం జారఁదొడంగిరి.

తుంబు - పరమేష్టియు నూరకుండెనా ?

నార — లేదు తరువాత నాధాత విషాదమేదురహృదయమైయున్న భాషాదేవిం జూచి పరితపించుచు నమ్మునిసత్తముని శాపనివృత్తికై బ్రతిమాలుకొనియెను.

తుంబు — ఆ కఠినహృదయుని హృదయమేమైనం గరఁగినదా ?

నార — ఎట్టకేఁ గోపము విడిచి శాపము త్రిప్పనోపనని పలుకుచు మనుష్యశంకరుం జూచి ప్రసంగించినప్పుడు శాపవిమోచన మగునని యనుగ్రహించెను.

తుంబు - అదియు నతనియందు గణమేయని తలంచెదను. తరువాత తరువాత!

నార — అప్పుడా వాగ్దేవి భూతలంబున శోణానదీతీరంబున విష్ణుమిత్రుఁ డను శ్రోత్రియబ్రాహ్మణునకు బుత్త్రియై యుదయించి యుభయభారతియను పేరుతో సకలకళాప్రవీణత బడసి చతురాననాంశవలనం జనించిన మండనమిశ్రునకు భార్యయై శాపానసానసమయ మరయుచున్నది.

తుంబు — ఓహో! ఇదియా కథాసందర్భము! తెలిసినది. తరువాత!

నార — తరువాత నేమియున్నది. ఇప్పుడా శంకరయతీంద్రుడు శిష్యులతో గూడ మండనమిశ్రునియొద్ద కరుగుచున్నవాడు. కావున నా సంవాదము వినవలయునని పోవుచుంటి నిక నిలువరాదు. మంచి సమయము మిగిలిపోవును. పోయి వచ్చెద నీరహస్య మెచ్చటను జెప్పకుమీ యని పలుకుచు నారదండు నిష్క్రమించెను.

గీ. ఛాత్రసంయుక్తుఁ డైయట్లు శంకరుండు
    అలప్రయాసము వెడలి యోగానుగతిని
    మింటితెరవున మండనమిశ్రపాలి
    తంబు మహిష్మతీనగరంబుఁ జేరె.

మ. కనియెం దన్నికటంబునం దతిచలత్కల్లోలరంగప్రవ
     ర్తనకృత్కోకముఖాంబునీడజము పద్మవ్యాప్తరోలంబని
     స్వనసంగీతమనోజ్ఞమంచితనభ సబ్బోరితాంతఃకన
     ద్వనజామోదసుతోషితాధ్వగము రేవావాహినీరత్నమున్.

కని తదీయశీకరనికరచోరకములగు కిశోరసమీరములు మార్గాయాసం బపనయింప గొంతసేపు తదంతికభూమి విశ్రమించి యందు మధ్యాహ్నికకృత్యంబులు నిర్వర్తించుకొని శిష్యసహితముగా నరుగుచు దారిలో తారసిల్లిన మండనపండితుని దాదుల మువ్వుర జలంబులం దేర నరుగుచున్నవారిం గాంచి మండనమిశ్రుని గృహం బెందున్నదని యడిగిన విని యప్పరిచారికలును దదీయరూపవిశేషమున కచ్చెరువందును ముందు నందొకమందయాన యిట్లనియె.

గీ. నిగమము స్వతః ప్రమాణమో నిర్ణయించి
   యరయఁ బరతః ప్రమాణమో యనుచు నెచట
   ద్వారనీడాంతరస్థిత కీరచయము
   పలుకు నది సూవె మండనేశ్వరుని గృహము.

మరియొకతె.

గీ. ఇలను సుఖదుఃఖరూప ఫలమొసంగ
   గర్త పరమాత్మయో లేక కర్మొ యనుసు
   ద్వారనీడాంతరస్థితకీరచయము
   పలుకు నది సూవె మండనేశ్వరుని గృహము.

ఇంకొకతె.

గీ. నిత్యమో లేక లోక మనిత్యమో య
    టంచు సందియమందుచు నరయనెందు
    ద్వారనీడాంతరస్థితకీరచయము
    పలుకు నది సూవె మండనేశ్వరుని గృహము.

అని పలికి యరిగిన యమ్మగువుల మధురోక్తి విశేషముల కలరుచు శంకరుం డరిగి యరిగి మరియొకచో భూరికవాటగుప్తమగు తన్మందిరము గనుగొని ప్రవేశింప శక్యము కాకుండుట దిలకించి శిష్యుల నందుండ నియమించి యోగశక్తిచే గగనమార్గంబున లోనికింజని తదంతర్భవనంబు బ్రవేశించెను.

అట్టి సమయంబున మండనపండితుండు శ్రాద్ధవిధియందు వ్యాసజైమిని మునులు భోక్తలుగా నియమించు వారికి గాళ్ళు కడుగుచున్నవాడు గావున జ్ఞానశిఖోపవీతుండై యరుదెంచిన యయ్యతిపతిం గాంచి ప్రవృత్తిశాస్త్రైకరతుండగుటచే సన్యాసి యని మిగుల గోపించుచు నిట్లు సంవాదము గావించెను.

శంకర మండనమిశ్రుల సంవాదము

మండనుఁడు — కుతోముండీ! సన్యాసి! యెచటనుండి వచ్చుచుంటివి?

దానికి ముండన మెంతవరకను నర్థముం జేసికొని.

శంక - ఆగశాన్కుండీ నేను కంఠమువరకే ముండిని అనఁగా క్షౌరముఁ జేయించుకొందును.

మండ — తేపంధామయాపృచ్ఛ్యతే? అదిగాదు నాచే నీ మార్గ మడుగ బడుచున్నది. తెలిసికొనలేవేమి?

శంక - కిమాహాకంధాః? పరియే ? మార్గమేనని నీ కుత్తరం మిచ్చినది?

మండ — [కోపముతో ] త్వన్మా తాముండేతి. నీ తల్లి ముండయని చెప్పినది.

శంక — తదైవహి. బాగు బాగు. నీవు మార్గము నడిగినందులకు నీ తల్లి ముండయని నీకు మంచియుత్తరమే చెప్పినది.

మండ - సురాపితాకిము ! పిచ్చిమాటలాడుచున్నావు కల్లు ద్రాగితివా యేమి?

శంక — [పీతా అను పదమునకు "పచ్చన" అని యర్ధముఁజేసి] నహి నహి శ్యేతాస్మర. కల్లు పచ్చగానుండదు. దెల్లగా నుండును. జ్ఞాపకము తెచ్చుకొనుము.

మండ — త్వంతద్వర్ణం జనాసికిం! అలవాటుగనుక దానిరంగు నీకు బాగుగాఁ దెలిసియున్నదా?

శంక — అహంవర్ణం భవాన్ రసం. అగు, నేను రంగు నెఱంగుదు. నీవు రుచి నెఱుంగుదువు.

మండ — మత్తోజాతఃకళంజాశీవికరీతానిభాషసే. కలంజమనగా నలుగు దెబ్బతినిన మృగమాంసము. అట్టి దానిం దిని మత్తుఁడవై యున్నావా యేమి? విపరీతముగాఁ బలుకుఁచుంటివి.

శంక — సత్యం బ్రవీషి. పితృనత్ త్వత్యోజాతఃకళంజభున్ మత్తః. నావలనను కళంజమును తినువాఁడు బుట్టెనని సత్యము పలికితివి. నీ వట్టివానికిఁ దండ్రి వగుదువు. సందియము లేదు.

మండ — దుర్మతీ! గాడిదసైతము మోయలేని గంతను మోయుచున్నావు గాని శిఖాయజ్ఞోపవీతములు నీకు బరువయ్యెనా ?

శంక - నీ తండ్రియైనను మోయలేని గంతను మోయుదును. శిఖాయజ్ఞోపవీతములు నాకు బరువుగావు శ్రుతులకు బరువైనవి.

మండ — చాలుచాలు, పెండ్లియాడిన భార్యను బోషించుకొన సామర్ధ్యము లేక శిష్యపుస్తకభారముల వహించెడి నీ బ్రహ్మనిష్టయంతయుఁ దెల్లమైనదిలే.

శంక -- గురుశుశ్రూష చేయలేక యలసి యది విడచి స్త్రీశుశ్రూషఁ జేయుచున్న నీ కర్మని ష్టంతమాత్రము వెల్లడిలేదనుకొంటివా!

మండ - స్త్రీగర్భములోఁ బెరిగి స్త్రీలచేఁ బోషింపబడి స్త్రీలను నిందించుచున్నావేమిరా ? మూర్ఖ నీ కృతఘ్నత యంతయు వెల్లడియైనది గదా?

శంక — నీవు స్త్రీలస్తన్యము గ్రోలి స్త్రీల యోనిలోనుండి పుట్టి యట్టి స్త్రీలచే పశువులాగున రమించుచుంటి వేమిరా? బాలిశా?

మం — అగ్నులను విడచినవాఁడు వీరహత్యను బొందునని వేదములో నున్నదిగదా.

శంక — పరమాత్మతత్త్వమును దెలిసికొనినవాఁ డాత్మహత్యను జెందుననియు వేదములోనే యున్నది చూచుకొనుము.

మం — ద్వారపాలర వంచించి దొంగలాగున లోనికి వచ్చితివే.

శంక — బిక్షువుల కన్న మిడక డేగలాగున నీవు భోజనము సేయుటకుఁ బ్రయత్నింపలేదా?

మం - సీ. యిట్టి కర్మకాలమున మూర్ఖుఁడవగు నీతో మాటాడుట తటస్థించినదేమి.

శంక — ఆహా, యతిభంగముగా మాటాడెడి నీ జ్ఞానము వెల్లడియైనదిలే.

మం — యతిభంగమునకు బ్రవర్తించువానికి యతిభంగము దోషము కాదు గదా?

శం — యతివలన భంగమని దానికిఁ బంచమ్యంతమర్ధము చేసికొనుము.

మం — ఆహా. యీ కాలములోనా సన్యాసము? ఈ దుర్బుద్ధు లెక్కడ? బ్రహ్మవేత్తృత్వ మెక్కడ? స్వాదుపదార్ధములఁ దినుటకై యోగివేషము వేసికొందురు.

శం — ఆహా. యీ కలికాలములోనా స్వర్గము? ఈ దురాచారు లెక్కడ? అగ్నిహోత్రము లెక్కడ? మైథునకాములై కర్మిష్ఠులవేషము వేసికొందురు. నిశ్చయము.

అని యిట్లు రోషకషాయితస్వాతుండై మండనుండు దుర్వాక్యము లాడుచుండుటయు వానికి దగిన యుత్తరములు శంకరయతి యిచ్చుచుండుటయుం జూచి యందు భోక్తగా నియమింపబడిన వ్యాసుండు జైమిని చేత సపరిహాసముగా జూడబడుచుండెడి మండనమిశ్రుం జూచి యల్లన నిట్లనియె. వత్సా! మండన! తత్త్వవేత్తయైన యతి యతిథియై యింటికి వచ్చిన నర్చింపక యిట్లు దుర్భాషలాడుచుంటివే మి అభ్యాగత స్స్వయం విష్ణు వనుమాట మఱచితివా యేమి? చాలు జాలు ఈ ప్రసంగము గట్టిపెట్టుము. ముందుగా నతిథిపూజం గావింపుమని యాజ్ఞాపించెను. అమ్మునివరునిశాసనంబునం జేసి మండనుండు శాంతుండగుచు మారుమాట పలుకక జలము స్పృశించి శాస్త్రోక్తరీతి నతనిం బూజించుచు భిక్షకొరకు నిమంత్రితుంజేసెను. అప్పుడు శంకరాచార్యుడు మండనపండితునితో నార్యా! నే నన్నార్థినై నీయొద్దకు వచ్చియుండలేదు. వివాదభిక్షను యాచింపవచ్చితిని, సమర్థుడవేని యది పెట్టి పంపుము. అం దోడినవా రోడనివారికి శిష్యులై యుండునట్లు పణమేర్పరుపవలయును. యతినిషిద్ధమగు వాదభిక్ష నీ కేమిటి కంటివేని యుపనిషన్మార్గము వెల్లడిచేయుటకంటె నాకు వేఱొకకోరిక యం దిష్టములేదు.

సంసారతాపపరిహారకమై పరమానందసుఖం బొనరించు నమ్మార్గంబు కర్మతంత్రుండవగు నీచే దిరస్కరింపబడినది గదా? భవాదృశులనెల్ల వాదంబున భరిభవించి పుడమినెల్ల నమ్మార్గంబు రాజమార్గమై ప్రఖ్యాతి నొందజేసెను. నీవును బరమోత్తమమైన మదీయమతంబు స్వీకరింపుము. కానిచో వాదమునకు బూనికొమ్ము. దానికిం జాలనివాడవైతేని యోడిపోయితినని పలుకుమని యతి గంభీరవాగ్గుంభనలచే బలికెను.

మండనుం డయ్యతికులమండనుని వాక్యములు విని నూతనపరాభవమువలనం గలిగిన విస్మయముతో నాత్మగౌరవము ననుసరించి యిట్లనియె. ఏమంటివి? మండనుని పాండిత్యప్రకర్ష మెరుంగవు నీవననెంత? ఇతండు సహస్రముఖుండైన యనంతుడు వచ్చినను బరిభవించునుగాని జితోస్మియని పలుకువాడుకాడు. మఱియు వేదసమ్మతమగు మతమును విడిచి క్రొత్తగా గల్పించిన వ్యాసునియొక్కయు నీ యొక్కయు మతమందు బ్రవేశించువాడుకాడు. ఎన్నడైన బుడమి నొకపండితు డుదయించునా సరసప్రసంగకథ యెన్నడైనం జరుగునా యని యెల్లప్పుడును వేడుకపడుచుందును. ఇప్పు డట్టిజయమహోత్సవము స్వయముగా వచ్చినదిగదా నాభాగ్య మేమని కొనియాడుకొందును? ఇప్పుడు మనయిరువురకు బ్రసంగము జరుగుఁగావుత, పుష్కలమైన మదీయశాస్త్రపరిశ్రమ ఫలించుగాత స్వయముగా వచ్చియమృతము నోటబడుచుండ భూతలవాసిమాత్రము వలదనునా? అయ్యో దుర్హృదయగర్వకాంతారకుఠారమగు మదీయవాక్చాతుర్య మెరుంగక నన్ను వాదమునకు బిలుచుచుంటివిగదా! ఇసిరో! నన్ను వాదభిక్ష పెట్టుమని యడుగుట యత్యల్పమని తలంచెదను. నీకు వాదేచ్ఛ గలిగియున్నచో నాకు బండువేకదా! ప్రసంగవార్త వినినంతనే నాకు సంతోషము గలుగుచుండును. ఈ కోరిక నాకు జిరకాలమునుండి కలిగియున్నను నేపండితుండు దీర్పకున్నవాడు.

మంచిది తప్పక నీతో నిప్పుడు వాదము గావింతును. సందియములేదు. కాని మనవాదమునకు జయాపజయంబులు నిశ్చయించు మధ్యవర్తి యెవ్వడు అట్టి మధ్యస్థుండు లేనిచో బరస్పరవిజగీషులగు వాదిప్రతివాదుల సంవాదము కంఠశోషమే ఫలముగా గలది యగుంగదా! మరియు బ్రసంగించునప్పుడు మనకు జేయదగిన ప్రతిజ్ఞ యేది? యందలి ప్రమాణము నీ కేది సమ్మతము? నేను గృహస్థుడ నీవు భిక్షుండవు పిమ్మట నేమి యనినను లాభములేదు. కావున జయాపజయంబులకు బణము లేర్పరచుకొనినచో నవ్వుచు వాదమునకు బూనుకొనవలయును.

వాదము ఱేపు ప్రారంభింతము. ఇప్పుడు మాధ్యాహ్నికకృత్యంబులు నిర్వర్తించుకొని యాతిథ్యమందుమని పలికిన విని శంకరుండును సమ్మతించిన పిమ్మట మండనుండు మధ్యస్థులుగా నుండుఁడని వ్యాసజైమినుల బ్రార్థించెను. వా రప్పండితోత్తమునితో నార్యా! నీ భార్య సరస్వతి యంతటిది ఆ సాధ్వీరత్నంబు మధ్యస్థురాలై న్యాయంబున జయాపజయంబులు నిశ్చయింపఁగలదు అందులకు మీ యిరువురును సమ్మతింపుఁడని పలికి వారిరువురి నొడంబడఁజేసిరి. పిమ్మట నమ్మండనుఁడు వారి మువ్వురనుఁ ద్రేతాగ్నుం బోలె నర్చించుచు మధురాహారసంతృప్తులం గావించెను.

ఉపనిషదర్థంబుల నెరింగిన వ్యాసజైమినిశంకరులు మువ్వురును భుజించిన వెనుక నొకచోఁ గూర్చుండి మండనుని శిష్యులు పార్శ్వంబుల నిలిచి వింజామరల వీచుచుండఁ గొండొకసే పొండొరు లెద్దియో యాలోచనఁ జేసికొనిరి. వారట్లు కొంతసేపు సంతతముతో మంతనమాడి తద్గృహము నుండి వెడలి వ్యాసజైమిను లంతర్థానము నొందిరి. శంకరుండు నర్మదానదీపరిసరంబున మెఱయు నుద్యానవనములో నున్న దేవాలయములో వసించి శిష్యులతోఁగూడ నచ్చటి వార్తలం జెప్పికొనుచు నా దివసమును గడిపెను.

అమ్మఱునాఁ డహిమకరుం డుదయగిరిశిఖరం బధిరోహింప రేవానదిం గాల్యకరణీయంబులం దీర్చుకొని శంకరయతి పద్మపాదాదిశిష్యులతోఁగూడ మండనపండితుని సభాభవన మలంకరించుటయు వారింజూచి మండనుండు సంతసించుచు యథావిధి నర్చించి యుపవిష్టులం గావించి సమస్తవిద్యావిశారదయగు శారదను స్వదార నాదరంబున మధ్యవర్తినిగానుండ నియమించెను. పతివ్రతాశిరోమణి యగు నయ్యుభయభారతియును, భయభారతీతారతమ్యంబు నిరూపింప నరుదెంచిన భారతియుం బోలె నాసభాభవనంబున మిక్కిలి బ్రకాశించెను. అప్పుడు పరాపరజ్ఞుండైన శంకరయతీంద్రుఁడు వృద్ధినొందుచున్న తదీయవాదోత్సుకత నాలోచించి ముందుగాఁ దాను బరాపరైక్యపరమగు ప్రతిజ్ఞ నిట్లు గావించెను.

మ. పరమానందము నిత్యబుద్ధము పరబ్రహ్మంబు దోచున్నహా
     విరళాజ్ఞానసమామృతం బగుచు నీ విశ్వప్రపంచంబుగా
     నరయన్ జ్ఞానము చేతనంతయు లయం బౌనట్లు వాక్రుచ్చ వి
     స్ఫురదామ్నాయశిరోమణు ల్వెలయు మత్ప్రోక్తప్రమాణంబులై.

చ. ఉరుగతి నేను వాదమున నోడితినేనిఁ గషాయదండస
    త్కరకములం ద్యజించి యతిధౌతపటంబు ధరించి గేస్తునై
    వరఁగెద సాధ్వి యీయుభయభారతియే వివరించుఁగాత బ
    క్షరహితబుద్ధియై మనప్రసంగజయాపజయంబు లేర్పడన్.

అని యి ట్లుపనిషదర్థంబులు ప్రమాణంబుగాఁ జేసికొని వాదింతుననియు నందుఁ బరాజితుండ నగుదునేని సన్యాసము విడిచి గృహస్థుండ నయ్యెదనని శంకరయతి ప్రతిజ్ఞఁ జేయుటయు సంతసించుచు మండనమిశ్రుండు తన ప్రతిజ్ఞాప్రకారం బిట్లని వక్కాణించెను.

ఉ. వేదశిఖల్ ప్రమాణపదవి న్వహియింపవు చిత్స్వరూపసం
    బోధము సేయ దానఁ బరిపూర్ణత గల్గదు లేదు ముక్తి య
    య్యాదిమకాండమే పరమమై తగి ముక్తి ఘటించునంచు నే
    వాదము సేయుదుం బ్రజలవైఖరి గర్మమహత్త్వ మేర్పడన్.

ఉ. ఓసుయతీశ! వాదమున నోడితినేని శిఖోపవీతము
    ల్దీసి కషాయచేల మవలీల ధరించి జగంబెఱుంగ స
    న్యాసముఁ బూని యేను భవదగ్రవినీతుఁడ నౌదు దీనికి
    న్భాసురగాత్రి యీయుభయభారతి సాక్షిణియై తలిర్పఁగన్.

అని యి ట్లొండొరులు శపథములు చేసికొని యయ్యుభయభారతిని సాక్ష్యాధికారమున కభిషిక్తఁ జేసి శుభముహూర్తమునఁ బ్రసంగమునకుఁ బూనుకొనుటయు నద్దేవి వారిరువురకంఠంబులను బుష్పమాలికలు వైచి యోడినవారి మెడనున్న దండ వాడఁగల దిదియే నిదర్శనమని యెరింగించి యయ్యించుబోణి గృహకార్యములం జక్కఁబెట్ట నరిగినది.

తత్ప్రసంగ మాలకించు తలంపుతో వచ్చిన బ్రహ్మాదిదేవతలు తద్గృహప్రాంతాంతరిక్షంబున విమానములపై వసియించి వినుచుండిరి.

అప్పడంతపుంగవు లిరువురు నభిముఖముగా బద్ధాసనులై కూర్చుండి మందహాసశోభితవదనారవిందులై తొందర యేమియుం బూనక స్వాదుప ప్రయోగములచే హృద్గరాభిప్రాయంబుల వెల్లడిఁ జేయుచు నిరువురును వేదమే ప్రమాణముగాఁ దీసికొని యిట్లు వాదించిరి.

మండనుఁడు — ఓ యతిసార్వభౌమా? మీచే జీవేశ్వరుల కేకరూప మంగీకరింపబఁడుచున్నది. అందులకుఁ బ్రమాణమేమి? హేయోపాదేయరహితమగు దానికిఁ బురుషార్ధములేమిం జేసి వేదాంతవాక్యములు మేము ప్రమాణములుగా స్వీకరింపము.

శంకరుండు — మహాత్ములైన యుద్దాలక జనక యాజ్ఞవల్క్య ప్రభృతులైన గురువులు శ్వేతకేతుఁడు లోనగు శిష్యులకు తత్త్వమస్యాది వాక్యములచేఁ బరమాత్మ నాత్మతత్త్వముగా బోధించిరి. ఇదియే ప్రమాణము. అయ్యర్థంబులు శ్రు॥ తత్త్వమసి శ్వేతకెతో శ్రు॥ అభయంవైజనక ప్రాప్తోసితదాత్మానమేనవేదాహం బ్రహ్మస్మీలితస్మాతత్సర్వ మభవత్తత్రకోమోహః కశ్శోకఏకత్వమనుపస్యత॥ ఇత్యాది శ్రుతుల వలన స్పష్ట మగుచున్నది.

మండను — హుం ఫట్ ఇత్యాది శబ్దములవలెనే వేదాంతముల యందలి తత్త్వమస్యాది వాక్యములు పాపములు పోవు నిమిత్తము జపింపఁబడుచున్నవి. కాని వానికి నొకానొక యర్థమందు వివక్షతలేదు.

శంకరు — ప్రాజ్ఞులు హుంఫడాది శబ్దములయం దర్ధ మేమియుఁ దోచకపోవుటచేత జపోపయుక్తములని బలికిరి. విద్వాంసుఁడా! తత్త్వమస్యాది వాక్యముల యందు స్పష్టముగా నర్ధము కనంబడుచుండఁగా జపార్ధత వీనియం దెట్లుగాఁ ప్రాప్తించెడిని.

మండ — యతీంద్రా! జీవేశ్వరులకుఁ దత్త్వమస్యాది వాక్యములచే నభేదము దోచఁబడుగాక యదియెట్టి దంటేని యజ్ఞాదులం గావించు కర్తలను స్తుతిఁజేయునప్పుడు ఈమఖకర్త యీశాభిన్నుఁడని స్తావకముగాఁ జెప్పిన మాట గాని మరియొకటి గాదు. విధియొక్క స్తావకము విధివిశేష మనంబడును.

శంక — క్రతుయూపాదికముల దేవతాస్వరూపములుగా వర్ణించెడు వేద వాక్యములఁ గ్రియాకాండగతము లగుటచే విధిశేషములని చెప్పవలయును. కాని జ్ఞానకాండగతములగు తత్త్వమస్యాది వాక్యముల విధిశేషములని యెట్లు చెప్పఁదగినది.

మండ — యతీంద్రా! నీ వనిన యట్లే జీవునియందుఁ బరమాత్మ దృష్టి యుండుగాక అన్నము బ్రహ్మము. మనసు బ్రహ్మము. ఆదిత్యుఁడు బ్రహ్మము. వాయువు బ్రహ్మము. అని కర్మసమృద్దికొరకు అబ్రహ్మనుఁ బ్రహ్మనుగాఁ జెప్పినట్లే తత్త్వమస్యాది వాక్యములును గర్మసమృద్ధికొరకు నట్లు చెప్పినవి. కావున నుపాసనానుగుణ్యముగా నుపాసనావిధిశేషములని చెప్పవలయును.

శంక —- మనోబ్రహ్మేత్యుపాసీత! మనస్సునే బ్రహ్మగా నెంచి యుపాసింపఁదగినది. ఇత్యాది వాక్యములయందు విధింపఁబడిన లిదాదికము తత్త్వమస్యాది వాక్యములందుఁ గలిగియున్నదా? దాని నుపాసనావిధిశేషమని యెట్లు చెప్పుదువు విద్వాంసుడవయ్యు నిట్లు పలికెదవేల? విధియొక్క యభావముచేత నారోపింపఁబడిన బ్రహ్మభావము గల జీవునియొక్క యుపాసనాపరత్వము వేదాంతవాక్యములకు సంభవించదు. బ్రహ్మ యగుటయే ప్రమాణముగలవి.

మండ - యతివర్యా! వేదాంతవాక్యములు బ్రహ్మాత్మత్వంబునం బ్రమాణంబగుంగాక. సోమాయాగవిశేషములయందు ఫలదర్శనముకొఱకు విధి యెట్లు గల్పించఁబడినదో యాలాగులననే యిచ్చటను "బ్రహ్మవేదబ్రహ్మైవభవతీ" అను ముక్తిఫలమును దెలుపు శ్రుతికి బ్రహ్మలుభూషుః బ్రహ్మవేదనంకుర్యాత్. బ్రహ్మకా నిచ్ఛయించిన వాడు జ్ఞానమును దెలిసికొనవలయును. అని విధి కల్పించుకొనుట యుక్తము. అట్లైనచో బ్రహ్మ యన నేమి యాత్మ యన నేమి యని శంకించుకొని తత్స్వరూపసమర్పణమొచేత నిత్యుండు సర్వజ్ఞుండు సర్వగతుండు విజ్ఞానానందస్వరూపుండు అను మొదలైన వేదాంతవాక్యముల నుపయోగించుకొన తెలిసికొనవలయును. తదుపాసన వలన మోక్ష మప్రత్యక్షంబైనను శాస్త్రదృష్టంబు కాఁగలదు. అట్లు విధి కల్పించనిచో హనోపాదావశూన్యము వలన రాజాగచ్ఛతి సప్తద్వీపా వసుమతీ ఇత్యాది వాక్యములకుంబోలెఁ దత్త్వమస్యాది వాక్యముల కానర్థక్యము గలుగునుగదా! మఱియు బ్రవృత్తిని వృత్తుల బోధింపని వేదాంతవాక్యములకు శాస్త్రత్వము గలుగనేరదు.

శంక - అయ్యో! అట్లు విధి కల్పించినచో మోక్షము క్రియాజన్యమగుట స్వర్గాదికమువలెనే నశించునది యగుం గదా? స్వర్ణాదికమువలెనే మోక్షమునకు ననిత్యత్వసాతిసయత్వములు లేమింజేసి దానికిఁ గ్రియారూపము గల్పించుట యుక్తముగాదు. జ్ఞానము మాత్రము మానసక్రియాజన్యము గాదు? మీ మతంబున ముక్తి కనిత్యత్వ మేల ప్రాప్తించలేదంటివేని వినుము. జ్ఞానము మనోధర్మమైనను యథాభూతవస్తుప్రమాణాదికము మాత్రము దెలిసికొనుచున్నది. ఏ దేవతకొరకు హవిస్సు గ్రహింపఁబడునో వషట్కారములనే నా దేవతను ధ్యానింపవలెను. తచ్చింతనంబే మానసం బనంబడు. అది పురుషతంత్రమైనదగుటచే నిష్టము వచ్చినట్లు చేయుటకును జేయకపోవుటకును మరియొకరీతిఁ జేయుటకును శక్యమగుచున్నది. కాని జ్ఞానంబున కట్లుగాదు. కావునఁ దజ్జన్యమగు ముక్తి కనిత్యత్వము సిద్ధించదు.

మండ — మునిసత్తమా! తత్త్వమసీతివాక్య ముపాసనాపర్యవసాయి కాకపోయినను జీవునకుఁ బరమపురుషునితో సాదృశ్యమును బ్రతిపాదించుచున్నది గదా?

శంక - ఓహో! పండితాగ్రేసరా? తత్త్వమసీతివాక్యము జీవున కీశ్వరునితోఁ జేతసత్వపాధర్మ్యము చేతసాదృశ్యమును బ్రతిపాదించుచున్నదా లేక సర్వజ్ఞత్వ సర్వాత్మత్వ సర్వశ క్తిత్యాదిగుణములచే సాదృశ్యమును జెప్పుచున్నదా? నుడువుము. చేతసత్వముచేత నంటివేని యయ్యది ప్రసిద్ధమైనదగుటచేత నుపదేశమున కేయవసరము లేదు. సర్వజ్ఞత్యాదిగుణముల చేత నంటివేని, జీవునకుఁ బరమాత్మ స్వరూప పత్తితోన భేదము లేదని చెప్పెడు స్వసిద్ధాంతమునకు విరుద్ధమగును గదా! కావున నీ ప్రశ్న మైక్యమునే ప్రతిపాదించుచున్నది సుమీ?

మం — తత్త్వమసీతి వాక్యము అవిద్యావృతివలనఁ బ్రతీతములు గాని సుఖబోధానంత్యాది గుణములచే జీవునకుఁ బరమాత్మతో సాదృశ్యమును జెప్పుఁగాక దాన నుక్తదోషము లేదు గదా?

శంక — సుహృద్వరా! భవదీయవాక్యంబే జీవునకుఁ బరమాత్మత్వ మాపాదించుచున్నయది యికఁ దద్విషయయై కోప మేమిటికిఁ జేసెదవు. సుఖబోధానంత్యరూపమగు పరమాత్మతత్త్వమునకుఁ బ్రతిభాసశంక యవిద్యావరణమువలన నీవే తీసివేసితివి గదా?

మం — భో యతిశ్రేష్ఠా. తత్త్వమసీతివాక్యము జగత్కారణుండైన యీశ్వరునితో జీవునకుఁ జేననత్వసాధర్మ్యము వలన సామ్యమును జెప్పుగాక. జగము చేతనము వలన బుట్టినదగుటచే సాంఖ్యాదులచే జెప్పబడెడు ప్రధానపరామాణ్వాదులకు నిరాసము కాగలదు.

శం — అయ్యో పండితపుంగవా! అట్లైనచో ద్వన్మతంబున దత్తమసీతిప్రయోగము తప్పగును. తత్త్వమస్తియని యుండవలయుం గదా! తత్ అజత్కారణముత్వం. త్వత్సదృశము అస్తియగును. అని యర్థము వచ్చును. జగంబునకు జడత్వశంక పోవుకొఱకు నట్లు చెప్పవలయు నంటివేని శ్రు॥ తదైక్షత బహుస్యాం ప్రజాయేయేతి. అను శ్రుతియందు గల యీ క్షణశబ్దసామర్థ్యంబున నది స్పష్టమగు చుండ నణుప్రధానాదులయొక్క నిరాసకొఱకని చెప్పుట యుచితముగా లేదు.

మం - తత్త్వమసీతి వాక్యమునకు నే నీశ్వరుడ గాను అను ప్రత్యక్షజ్ఞానము గలుగుచుండగా నైకపరత్వము జెప్పుట యుచితము కాదు కావున సాధ్యాయోధ్యేతప్యః అను విధివాక్యము ననుసరించి తత్త్వమసీతి వాక్యము జపింపదగినదై యున్నది. అంతకన్న వేరొకఫల మేమియు గలుగదు.

శం - విభుధేంద్రా! ఇంద్రియమునకు భేదగ్రహణసామర్థ్యము గలిగియున్నయెడల నభేదవాదశ్రుతివాక్యము బాధించెడిని. ఇంద్రియమునకు భేదముతో సనికర్షము లేమింజేసి తద్భేదజ్ఞానమే కలుగనేరదు. కావున జీవేశ్వరభేదము ప్రత్యక్షమని యెట్లు చెప్పదగినది.

మం - ఈశ్వరునికంటె నేను వేఱైనవాడను అనుచో భేదశబ్దము జీవాత్మకు విశేషణ మగుచున్నది. కావున భేధేంద్రియములకు సంయోగసన్నికర్ష లేకపోయినను విశేషణతాసన్నికర్ష యున్నది కాదా.

శం — కేవల విశేషణతాసూత్రమునకు సన్నికర్షము జెప్పిన యెడల నతిప్రసక్తి వచ్చుంకదా భేదాశ్రయము ఇంద్రియమునకు సన్నికర్ష మగుచుండగా విశేషణతాసన్నికర్షము చెప్పదగినది. ఇక్కడను, ఇంద్రియమందు ఆత్మకు సన్నికర్షత్వము లేదు గావున నది చెప్పుట యనుచితము గదా.

మం — భేదాశ్రయమైన యాత్మకు నింద్రియముతో సన్నికర్షము లేదని చెప్పుట యెంతయు నిపుణతగా లేదు. చిత్తాత్మలు ద్రవ్యము లగుటచే రెంటికిని సంయోగసమాశ్రయత్వ మేమిటికి గలుగదు.

శం - ఆత్మ ప్రభువగుగాక యణువగుగాక రెండుపక్షములు యందును జిత్తములో సంయోగత యెట్లు కలిగెడిని? లోకములో నవయవములు గలవానికి నవయవములు గలవానితో గదా సంయోగము. మనస్సు ఇంద్రియమని యొప్పుకొని యట్లు చెప్పితిమి. నిజ మరయ జిత్త మింద్రియము గాదు చక్షురాదిసహాయము గలిగిన దీపమువంటిది. “ఇంద్రియణాంమనశ్చాస్మి" అనువచనము "నక్షత్రాణామహంశశీ" అనునట్టిదే కదా?

మం — పారికాంక్షీ! భేదజ్ఞాన మింద్రియమువలన గలుగనేరదు. సాక్షి స్వరూపమని యొప్పుకొనియెదను సాక్షిస్వరూపమగు భేదజ్ఞానముతో విరోధము గలుగుచుండగా బరమాత్మ జీవాభేదమును బోధించుకొఱకు దత్త్వమసీతి వాక్య మెట్లుగా బ్రమాణమగుచున్నది.

శం - సాక్షిస్వరూపమగు ప్రత్యక్షము అవిద్యావృతుండగు జీవాత్మకును మాయావృతుండగు పరమాత్మకు భేద మున్నట్లు తోపింప జేయుచున్నది. తత్త్వమసీతి వాక్యము అవిద్యామాయావినుర్ముక్తులగు శుద్ధజీవేశ్వరుల కభేదమును దెలుపుచున్నది. శ్రుతిప్రత్యక్షములు భిన్నాశ్రయములగుటచే విరోధము లేదు. ఒకవేళ శ్రుతిప్రత్యక్షములకు విరోధమున్నను ముందుగా బ్రవర్తించెడు బలహీనమగు ప్రత్యక్షము చరమప్రవృత్తమగు శుృతిచే నపచ్ఛేదనన్యాయమును బట్టి బాధింపబడుచున్నవి. ప్రథమప్రవృత్తమగు రజితజ్ఞానము పశ్చాత్ప్రఖ్యాతమగు శుక్తిజ్ఞానము చేత నెట్లు బాధింపబడునో యట్లే.

మం — సంయమిచక్రవర్తి! జీవుడు ఘటాదికమువలెనే యనిర్వజ్ఞత్వము కలిగియుండుటచేత నీశ్వరభిన్ను డగుచున్నాడు. అనెడు నీ యనుమానముచేతనే భేదశ్రుతికి బాధకము రాలేదా! తర్కము నీవు చూచియుండినచో నం దీవిషయము నీకు దెలియను గదా!

శం - తర్కము నే నెఱుంగునది కాదు. నీ నుడివినబట్టి బ్రహ్మనిరూపితమగు భేదము పరమార్ధభూతమైనదియా లేక కల్పింపబడినదియా? బరమార్ధ భూతమ వంటివేని దృష్టాంతము లేదు. కాల్పనిక మంటివా? పరస్పరవ్యావహారికభేదము లేదన మేమును సమ్మతించితిమి. కావున సాధింపంబనిలేదు.

అని యిట్లు మృదువాక్యచాతుర్యంబున శాస్త్రదృష్టాంతములచే మండనమిశ్రప్రశ్నములనెల్ల ఖండింపుచు స్వమతము శిద్ధాంతపరచుచున్న శంకరయతిచంద్రుని పాండిత్యప్రకర్ష నరసి నిరుత్తరుండై యున్న ప్రాణేశ్వరు మెడలో నున్న పుష్పమాలిక వాడుటయు జూచి యుభయభారతి యచ్చెరువు నొందుచు వారిని భోజనమునకు లెండని నియోగించి భోజనానంతరమున నల్లన శంకరునికిట్లనియె.

ఆర్యా! శంకర! నీ వాదిశంకరుడ వగుట దెలిసికొంటిని. దుర్వాసశ్శాపదోషంబు వాసి భవదీయదయావిశేషంబున గృతార్ధురాలనైతి నిఁక సత్యలోకమున కరుగుదాననని పలుకుచు బ్రయాణోణ్ముఖి యగుటయు నామెను సైతము జయించి యద్వైతము స్థాపన జేయుతలంపుతో వనదుర్గామంత్రంబున నామె నరుగకుండ బంధించి యల్లన నిట్లనియె. దేవీ! నీవు లోకరక్షణార్ధమై యవతరించిన విరించిపత్నివని యెరుంగుదును. నేను భవదీయభక్తుండ కృపావీక్షణంబుల నీక్షించుము. మరి కొంతకాల మిందుండి పిమ్మట నరుగుము. లోకహితమగునని పలికి మండనపండితుని యభిప్రాయము దెలియు తాత్పర్యముతో నతని మొగము జూచెను. అయ్యతిప్రవరుని నిగమార్థనిర్ణయములగు వచనములచేత శాంతింపబడిన కోపము గలవాడైనను మండనుండు, సందియముదీరక వెండియు నతని కిట్లనియె.

ఆర్యా! నాకీ నూతనాపజయంబున నించుకయు విషాదము గలుగదు. కాని జైమినీవాక్యములం బరిభవించితినని విచారింపుచుంటి అమ్మహాత్ముం డాగతానాగతములం దెలిసిన సుకృతలోకోపకారపారీణుండు నిగమప్రవర్తనయం దధికృతుండైనవాఁడు. సకలకలానిపుణుం డత్తపోధనత్తమున కిట్టి వ్యర్ధసూత్రముల రచించు వ్యవసాయ మేటికి గలుగవలయును? అంత దెలియనివాడా యని సంశయముగా నున్నదని పలికిన విని నవ్వుచు శంకరు డిట్లనియె సౌమ్యా! జైమినియం దించుకయు నన్యాయము లేదు అత డెరుంగనివాఁడు కాఁడు. మనమే యనభిజ్ఞుల మగుటచేఁ దదభిప్రాయముఁ దెలిసికొనఁజాలకున్నాము. అనుటయు మండనుండిట్లనియెను. యతిసార్వభౌమా! పండితులకును దెలియఁబడని జైమినిముని యభిప్రాయము వేఱెద్దియో వక్కాణింపుము. నీనుడివి నది యుక్తమని తోచినయెడల నహంకార మమకారములు విడిచెద ననుటయు శంకరుం డిట్లనియె. గృహమేధీ? జైమినిముని పరబ్రహ్మయం దభిప్రాయము గలవాఁడైనను విషయసుఖప్రసక్తిచిత్తునకుఁ దద్గ్రహణసామర్ధ్యము గలుగనేరదని యాలోచించి తదధికారము వారికిఁ గలుగజేయుతలంపుతోఁ బరబ్రహ్మప్రాప్తి సాధనమగుటచేతఁ గేవలము పుణ్యమును గర్మాతిశయముచేత నిరూపించెను సుమీ! అది యె ట్టెఱింగితి వంటేని వినుము. శ్రు॥ తమేతం వేదానువచనేన బ్రాహ్మణావివిడిషంతియజ్ఞేన దానేనతపసానాశ కేన॥ అను వేదవాక్యము బోధోత్పత్తికిఁ గారణమగుటచే బ్రహ్మచర్యాదిధర్మసముదాయము చేయుమని చెప్పుచున్నది. తద్వచనాపేక్షచేతనే బ్రహ్మనిరతుండైన జైమినిముని కర్మనిచయమును జేయుమని నిశ్చయించెను. ఇదియే తదీయాభిప్రాయము. మరి యొకటి కాదని మేము నిశ్చయించితిమి అనుటయు మండనుం డిట్లనియె. సూ॥ అమ్నాయ్య క్రియార్థత్వానర్ధక్యమత దర్ధానాం అనగాఁ శ్రుతులు క్రియార్దకములగుట సఫలములైనవి. అక్రియార్థకములైన వాక్యము నిరర్థకములు అని సూత్రము రచించిన జైమినిముని వేదవాక్యములు సిద్ధవస్తుపరమైనవని యెట్లుగాఁ దలంచెడినో సందియముగా నున్నదనుటయు భాష్యకర్త వెండియు నిట్లనియె.

పండితప్రవరా! నిగమరాశిపరంపరచే నద్వితీయబ్రహ్మయం దాసక్తి గలదైనను ఆత్మబోధయే ఫలముగాఁగల కర్మయందు దృష్టి వ్యాపింపఁజేయుచుఁ దత్కర్మప్రకరణవాక్యములయొక్క కార్యపరత్వమును సూచన జేసె ననిన మండనుండు, ఆర్యా! సకలవేదకదంబమునకు సచ్చిదాత్మపరత్వముకలదని జైమినిముని యభిప్రాయము పడినచోఁ బరమాత్మభిన్నమగు కర్మకు ఫలదాతృత్వము జెప్పుచు, బరమేశ్వరు నేమిటికి నిరసించునో చెప్పుఁడు. ఈ జగము కర్తృపూర్వకమగుటచే ఘటాదికము వంటిదియని యనియెడు ననుమానమే వేదవాక్యముతోఁ బనిలేకయే బరమేశ్వరునిఁ బ్రకటనఁ జేయుచున్నది. శ్రుతు లనువాదమాత్రములే సుమీ యని కాణాదుల పలుకఁగా నుపనిషేదికగమ్యుండును బూర్ణుండు నగు పరమపురుషుని వేదవేత్త కానివాఁడు దెలిసికొనజాలడు. అని వేదవచనములు పరమాత్మును వేదగోచరుడని జెప్పుచున్నవే మీ యనుమాన మెట్లుగాఁ దెలిసికొనగలడని బంధురములైన యుక్తిశతములచే నీశ్వరపరమగు ననుమానమును నిరాకరించుచు నయ్యీశ్వరునివలన జగత్తు పుట్టుటయు లయము నొందుటయు లేదనియు ఫలము గలుగుటయు లేదని నిరాకరించెను. కాని వేదోక్తమగు పరబ్రహ్మ విషయముకాదు. కావున జైమినిముని వాక్యమం దింతకంటె నణుమాత్రమును విరుద్ధములేదు. ఇట్టి తద్భావరహస్యమునుఁ దెలిసికొనఁజాలక బుధు లమ్మహాత్ముని నిరీశవాదియని పలుకుచుందురు.

పరమేశ్వరపరమగు ననుమానమును ఖండించినంతమాత్రముననే బ్రహ్మవిద్వరేణ్యుండైన జైమినిముని నిరీశవాదియగునా? మేచకాదులవలనం గలిగిన చీఁకటి సూర్యకాంతుల మలినపరుచునా యని జైమినీయవాక్యములంగల రహష్యవిశేషంబు లెఱింగించిన విని యమ్మండనపండితుండు సభ్యులతోఁకూడ మిక్కిలి యానందించుచు నింకను సందియము హృదయమును బాధింపుచుండ నప్పుడు భక్తిపూర్వకముగా జైమినిం దలంచుకొనియెను. అట్లు మండనపండితుండు హృదయంబున ధ్యానించి నంతనే యాజైమినిముని సన్నిహితుండగుటయు నమస్కరింపుచు నతండు తమసంవాదప్రకారమంతయు నెఱింగించి, మహాత్మా యీయతిచంద్రుండు కర్మకాండ యంతయు నిరర్ధకమైనదనియు జ్ఞానకాండ ప్రధానమైనదనియు వాదించి భవదీయసూత్రాభిప్రాయ మట్టిదేయని వక్కాణింపుచున్నవాఁడు. అయ్యర్ధంబు మాకు విడిపోవకున్నది. అందలి నిక్కువం బెరింగించి సంశయనివృత్తి సేయుఁడని వేడుకొనిన నమ్ముని యిట్లనియె. సుమతీ! విను మాభాష్యకర్త మదీయసూత్రతతి కేయర్ధము సెప్పెనో నాహృదయ మదియేసుమీ ఇమ్మహాత్ముని వచనంబులు సందియము విడచి, యథార్థములని నమ్ముము. నా హృదయ మొకండే యననేల ? సకలవేదశాస్త్రములయొక్క యథార్ధాభిప్రాయ మెరింగిన ధన్యుండు. పెక్కులేల? భూతభవిష్యద్వర్తమానవిషయంబులఁ దెలిసికొను మహిమ యతిని కొక్కనికే కలదు. మరియు మదీయగురుండైన వ్యాసమహర్షి చేత నుపనిషత్తులకుఁ జిదేకరసతత్పరత్వము నిర్ణయింపఁబడినదిగదా. తత్ప్రసాదన మపాదితవిద్యావైభవుండనగు నేను తధ్విరోధముగా నొకసూత్రమైనం జెప్పుదునా? ఇంత మాత్రము దెలిసికొనరాదా?

ఈ మహానుభావుండు సంసారసాగరమున మునిగినవారి నుద్దరింప నవతరించిన పరమేశ్వరుండని తెలిసికొనుము. ఇది పరమరహస్యంబు.

శ్లో॥ ఆద్వేసత్వమునిస్సతాంవితరతిజ్ఞానంద్వితీయె యుగె
     దత్తోద్వాపరనామలేతు సుమతి ర్వ్యాసః కలో శంకరః
     ఇత్యేవస్ఫుటమీరితోస్యమహిమామావై వేపురాణేయత
     స్తత్యత్వం సుమతె మతెత్వవతరేస్సంసారవార్థంత రేః.

కృతయుగంబునఁ గపిలాచార్యుండును ద్రేతాయుగంబున దత్తాత్రేయులును ద్వాపరంబున శ్రీవేదవ్యాసభట్టారకుండును గలియుగంబున శ్రీశంకరుండును సజ్జనుల జ్ఞానముపదేశింతురని శైవపురాణములో నితనిమహిమ స్పష్టముగా వర్ణింపఁబడి యున్నది. కావున నీ వతని మతి ననుసరింపుము. సంసారసముద్రమును దరింతువని బోధించి జైమినిముని మనస్సుచేత నయ్యతిపతి నాలింగనముఁ చేసికొనుచు నంతర్థానము నొందెను. పిమ్మట మండనమిశ్రుఁడును శంకరునికి నమస్కరింపుచు నల్లన నిట్లనియె. మహాత్మా! నిన్నిపుడు దెలిసికొంటిని నీవు జగత్కారణుండవైన పరమపురుషుండవు. న్యూనాధిక్యరహితుండవు సర్వసముండవనబోధమాత్రశరీరుండవైనను మాబోఁటి పామరుల రక్షింప మూర్తీభవించితివి. యతివరా! అశేషశృతిశేఖరములచే నేపదము పరమమని నుడువఁబడినదో యాపదమును తత్త్వమస్యాయుధముల ధరించి నీవు పరిపాలించితివి. లేనిచోఁ బురుషార్థభ్రష్టులగు సౌగతుల ప్రలాపములను చీఁకటినూతులోఁ బడి యాపదము నాశనము నొందకపోవునా? ఆహా!

శ్లో॥ ప్రబుద్ధోహం స్వప్నాదితికృతిమతిః స్వప్న మపరం
     యథామూఢస్వప్నే కలయతితథామోహవశగా
     విముక్తింమన్వంతే కతిచిదిహలోకాంతరగతిం
     హసం త్యేతాన్‌దాస్తా స్తవగళితమాయాః పరగురో.

స్వప్నములోఁనుండియే మేల్కొంటిమని భ్రమఁ జెందుచు మరియొకస్వప్నములోఁ దలంచు మూఢుల పగిది మోహవశంబునఁ గొందరు మూఢు లనిత్యమగు లోకాంతరగతినే ముక్తినిగాఁ దలంతు రాహా! అట్టివారిం గాంచి భవదీయభక్తులు పరిహసింతురుగదా!

చ. అకటలం గలంగుచు భయంపడి మేల్కొనినట్టులందె వే
    ఱొకకలఁ గాంచురీచవిభుధోత్తమయస్యజగద్ధతింభ్రమా
    త్మకమతి నెంచుచుండి రమృతం బని కొందరు జ్ఞానయుక్తిఁ దా
    వకహితు లట్టివారి ననపాయగతిం బరిహాసమాడరే.

ఉ. ధారుణిభేదవాదికథితంబగు మోక్షము సీకరంబు ని
    స్సార మహో తదాశ్రయులు సంస్మృతిసంగతిఁ బాయకుందురౌ
    భూరితరప్రమోదపరిపూర్ణసుఖం బొనఁగూడు ఘోరసం
    సారము బాయఁ ద్వత్కథితసాధువిముక్తి భజించువారికిన్.

గీ. క్షితి నవిద్యా నిశాచరీ గళితు నీశు
   బయలుపరచితి తత్కుక్షి వ్రక్కలించి
   యతనిభార్యను దానవీవృతను సీతఁ
   గాంచి వచ్చిన హనుమ నీకంటె ఘనుఁడు.

చ. ఎరుగక యీదృశంబగు త్వదీయలసత్సరమప్రభావము
    ద్గురువముతోడ ని న్నలతిఁగాఁ దలపోసి తిరస్కరించి ని
    ష్టురములు పెక్కులాడితిని జూవె మహాత్మక! సత్కృపామతీ
    మరువుము వానినెల్లను గుమారునిపల్కులఁ దండ్రియల్గునే.

మహాత్మా! కపిలగౌతమకాణాదిప్రభృతులు సైతము శ్రుతిభావరహస్యంబుల నిర్ణయించువిషయమునఁ బరశివాంశసంభూతుండవైన నీ కెనయగుదురా! అయ్యయ్యో! యీభూతలంబంతయు దురంతమోహమత్తులు పరమాత్మభేదకులు శ్రుతిగోభంజకులు నగు నభినవయవనులచే నాక్రాంతమైయున్నది. అట్టివాండ్రను సేవించువారి కెన్నఁడైన ముక్తి లభియించునా? విష్ణుతత్త్వానురక్తులగు భవదీయశిష్యు లందందు మెలంగుచుంటిరని తలంచి యాచింత వీడుచుంటిని అయ్యారే! అల్పబుద్ధివ్యాఖ్యోరగములచేఁ గరవఁబడి స్మృతిచెడియున్న శృతినికరముల భవదీయాసూక్తమృతసేకము దగిలి యిప్పుడు తెప్పరిల్లి హృదయాశయములఁ బ్రకటింపుచున్నవి గదా! దురంతసంసారఖరకరప్రచురాతపపరితాపము భవదృక్వమృతకరశరప్రచారమునంగాని యుపశమించునా?

అన్నా? తపఃశ్రుతగృహదారభృత్యధనాదులతోఁ గూడఁ గర్మయంత్ర మధిష్టించి యభిమానభరితుండనై సంసారకూపబిలంబునం బడుచుండఁ దటాలున వచ్చి నన్నుద్ధరించితివి. నీకంటె బరమరహితుండుఁ నాకెందేనిం గలడా? నేను తొంటిజన్మమున నెక్కుడు సుకృతము గావించితిని. లేకున్న నత్యంతాయోగ్యుండనగు నాకు జగదీశ్వరుండవైన నీ సంఘటన మెట్లు గల్గెడిని? దేవతలకు సైతము పురుషార్థ మాపాదించు కరుణాంతరంగితమగు భగవత్కటాక్షప్రవాహంబున ధన్యతముఁడుగాక యెట్లు మునింగెడిని? మహాత్మా? భవదీయశిష్యులు స్వర్గాదిసౌఖ్యంబులు తృణముగా నెంతురుగదా! భవన్మతం బిప్పటికిఁ దెలిసికొంటి దారాసుతాదుల విడిచితిని. నీ చరణంబుల శరణుఁ జొచ్చితిని. కరుణాభరితహృదయుండవై కింకరుండనైన న న్ననుగ్రహించి కర్తవ్య ముపదేశింపుమని తదీయపాదపద్మలం బడుటయు శంకరాచార్యుఁ డతని శిష్యునిఁగా ననుగ్రహింపదలచి తత్సహధర్మచారిణియైన యుభయభారతిని సాభిప్రాయముగాఁ జూచెను.

ఉభయభారతి బాల్యదశ

అమ్మహాదేవి యతని యభిప్రాయమును గ్రహించి యతిపుండరీకా! మండనమిశ్రుండు భవదీయశిష్యుం డగునని యింతకు బూర్వ మెరుంగుదును. విను మొకనాఁడు నేను బాల్యంబున మాతల్లినికటంబున వసియించియుండ రెండవమార్తాండునివలె మెఱయుచున్న తాపససత్తముఁ డొకండు విద్యుత్ప్రభాప్రతిభటంబులగు జటాపటలంబులు మకుటంబుగాఁ జుట్టికొని భూతిరుద్రాక్షమాలిక లొడలినిండఁ దాల్చి విచ్చేయుటయు నమ్మాహాత్ముని నర్ఘ్యపాద్యాదిసత్కారముల నర్చించి ప్రసన్నుడై యున్నసమయంబున నల్లన మాతల్లి యిట్లనియె ఆర్యా! మీరు తపోమహత్త్వంబున ద్రికాలవృత్తాంతములు కరతలామలకముగాఁ దెలిసికొందురుగదా? ఇప్పసికూన నా కూతురు, దీని నెక్కుడు గారాబముఁగా బెంచుచుంటిమి. దీని యాయు వెంత? పిల్లల నెందఱం గనును? పతి యెట్టివాఁడగు? ధనధాన్యము లేమైనం గలిగియుండునా? దీని భావి స్థితియంతయు వక్కాణింపుడు. భవాదృశులు ప్రణతజనులయెడఁ గనికరముఁ జేసి గోప్యమైనను వక్కాణింతురుగదా. అని భయభక్తివిశ్వాసములతోఁ బ్రార్థించినది. అమ్మహాత్ముం డొక్కింతసేపు కన్నులు మూసి ధ్యానించి యంతయుం గనికరముతో నోహో! యువతీ! భవదీయపుత్త్రికారత్నము నిరవద్యసౌఖ్యంబుల నందఁగలదు. వేదమార్గము బాహ్యమతములచే నావృతము గాఁగ దానిం జక్కపరచుటకై హాటకగర్భుడు మండనపండితుండై యుదయించి యున్నవాఁడు. ఈ చేడియ యాతనికి భార్యయై యనేకయజ్ఞములం గావించి పుత్త్రపౌత్త్రాది సంపదలతోఁ జిరకాలము సుఖియించును. పిమ్మటఁ గురుమతములచే నష్టమగు నుపనిషత్సిద్ధాంతముల సాధించు నిమిత్తము శంకరుండు పుడమి నవతరించి భూమిని బలవిన్యాసములచేఁ బవిత్రము జేయును. యతివేషము ధరించిన యమ్మహాత్మునితోఁ బెద్దతడవు వాదించి భవజ్జామాత పరాజితుం డగుచు నతనినే శరణము జొచ్చును సుమీ యని యెఱింగించి యత్తాపససత్తముం డంతర్హితుండయ్యె. తదుక్తిప్రకార మంతయుం జరిగినది. ఇతండు నీకు శిష్యుండు కా కేమగును? అయినను నీకు సంపూర్ణజయ మింకను గలుగలేదు. నే నతని సగము శరీరమును గానా? నన్నుం జయించి పిమ్మట నతనిని శిష్యునిగా జేసికొనుము. నీ వీ జగదీశ్వరుండవైన పరమపురుషుండవని యెరుంగుదు. అయినను నీతోఁ బ్రసంగింప నాకును ముచ్చటగా నున్నది. అని యిట్లు యాయజూక సహదర్మచారణియగు నుభయభారతి పలికిన విని తదీయమధురగంభీరార్ధయుక్తములగు వాక్యముల కానందించుచు శంకరు డిట్లనియె.

దేవీ! నా హృదయము వాదకలహోత్సుకత నొందుచున్నదని పలికితివి. కాని యది యనుచితమని తలంచెదను. కీర్తిశాలురు స్త్రీలతో బ్రసంగములు సేయుటకు సమ్మతింపరుగదా? యనుటయు నాభారతి యిట్లనియె. యతిప్రవరా! యెవ్వఁడు స్వమతఖండనము గావించునో యట్టివానిని జయించుటకు నాడుదిగాకాని మగవాడుగా కాని తప్పక ప్రయత్నం చేయవలయుంగదా? స్త్రీపుంసవివక్షతోఁ బని యేమి? అదియునుఁగాక మున్నుగార్గియను కాంతామణితో యాజ్ఞవల్క్యుండు ప్రసంగము చేయలేదా బృహదారణ్యకౌపనిషత్తు చూచుకొనుము. మరియు మోక్షదర్పిణోధితమైన జనకసులభాసంవాదము నీవు వినియుండలేదా? జనక యాజ్ఞవల్క్యాదులు యశోనిధులుగారా? స్వమతరక్షణార్ధమై ప్రవర్తించు నీ వట్లనుట యుచితముగాదని యుక్తియుక్తముగాఁ బలికిన విని యయ్యతిప్రవరుం డనుమోదించుచు వాక్యాధిష్ఠాత్రియగు వాగ్దేవితోఁ బ్రసంగము జేయుటకు సమ్మతించెను.

శంకర సరస్వతుల సంవాదము

పిమ్మట నా సభయందు శంకరసరస్వతులు పరస్పరవిజయోత్సుకత్యము మీర మతిచాతుర్యంబునం బ్రయోగింపబడిన శబ్దప్రవాహములచే విద్వాంసులకు విస్మయము గలుగజేయుచు నద్భుతముగాఁ బ్రసంగముఁ జేయందొడంగిరి. విచిత్రపదయుక్తిప్రయుక్తులచే వ్యాప్తమైయున్న తత్ప్రసంగవాగ్ధోరణి నాలించి సభ్యులు గురుకవిఫణీశభాస్కరాదులఁ దిరస్కరింపుచు మెచ్చుకొనఁదొడంగిరి. వారిరువురు సంధ్యావందనాదుల నియతకాలంబుల విడిచి యహోరాత్రంబు లేకరీతి వాదింపుచుండఁ బదియేడు దివసంబులు గతించినవి. అ ట్లవ్వాగ్దేవి పదియేడుదినము లఖిలశాస్త్రములయందును శంకరునితోఁ బ్రసంగించి చూచి దేనిలో నతని జయించునుపాయముం గానక యీతండు బాల్యంబుననే సన్యసించి యుత్కృష్టములైన నియమములచే దీపించుచున్నవాఁడు. కావున మదనశాస్త్రమం దితనికిఁ బ్రవేశము కలిగియుండదు. కావున దానియం దడిగి యీతని నోడింపవలయు నింతకన్న వేఱొకసాధనము లేదని నిశ్చయించి యవ్విరించి మించిబోణి యిట్లనియె.

శ్లో. కళాఃకియంత్యో వదపుష్పధన్వః
    కిమాత్మికాఃకించ పదంసమాశ్రితాః
    పూర్వేచపక్షెకథ మన్వథాస్థితిః
    కథం యువత్యాం కథ మేవపూరుషే

సంయమీంద్రా! మన్మథకళ లెన్ని? యవి యే స్వరూపమున నొప్పునవి? వానిస్థానము లెయ్యవి? అవి శుక్లకృష్ణపక్షములయం దెట్టివ్యత్యాసమును జెందును? పురుషునియం దెట్లుండును? స్త్రీలయం దెట్లుండు వక్కాణింపుమని యడిగెను. అయ్యతిసత్తముఁ డత్తరుణివచనములకుఁ బ్రత్యుత్తర మీయక యోహో! యీమె కామశాస్త్రములోఁ బ్రశ్నఁ జేసినది. ఉత్తర మీకున్న నల్పజ్ఞత్వదోషము వచ్చును. చెప్పినచో ధర్మలోపము వచ్చును. ఏమి చేయుదును. అని యొక్కింతసేపు చింతించి తదర్థములన్నియు లెస్సగా నెరిఁగినవాఁడయ్యును యతుల నియమము గాపాడుతలంపుతోఁ గామశాస్త్ర మెరుంగనివాడుంబోలె నిట్లనియె.

సాధ్వీ! నా కొకమాస మవధి నీయదగు మాసాంతరమున నీ మాటల కుత్తరము జెప్పువాఁడ. మదీయమదనశాస్త్రప్రవీణత యప్పుడు జూచెదవుగాక అట్లు గడు విచ్చుట వాదిధర్మమై యున్నదని గడు వడిగిన విని యప్పు డయ్యింతియు నందుల కొడఁబడియెను. అంతటితో నాసభ ముగింపఁబడినది. కావున వారి యనుమతి వడసి శంకరయతి సనందనాది శిష్యులతోఁ గూడ నచ్చట వెడలి నర్మదానదీతీరంబున నున్న యుద్యానవనములోఁ బ్రవేశించి యా రేయి సంవాదగోష్ఠీవిశేషకథాలాపములచేఁ ద్రుటిగా వెళ్ళించెను. అమ్మరునాఁడుదయకాలంబున శంకరయతి శిష్యులతోఁగూడ యోగ మవధరించి గగనమార్గంబున నరుగుచు నొకచో నరణ్యమధ్యంబున రాత్రి వేటకై వచ్చి మూర్ఛామయగ్రస్తుండై తరుమూలంబున గతాంసుడైనను స్వర్గబ్రష్టుండైన యమర్త్యుండువోలె నొప్పు నమరకుండను నృపాలుండు పడియుండుటయు నతని భార్యలు నూర్వు రార్తనినాదములతో వచ్చి చుట్టునుం బరివేష్టించి పెద్ద యెలుంగున నరణ్యము ప్రతిధ్వను లీయ నేడ్చుచుండుటయుం జూచి శంకరుండు సనందనుని కిట్లనియె. సనందనా! యిం దమరకుండను నృపాలుండు గతాంసుండై బడియున్నవాఁడు చూచితే! యితని భార్యలు సౌందర్యసౌభాగ్యమనోజ్ఞులై యున్నవారు. పాప మీయువతులు పతివియోగచింతాసంతాపముతో నెట్లు చింతించుచున్నారో చూడుము. వీడు హఠాన్మరణము నొందుటచే వీరికి శోకమిబ్బడించు చున్నది. నేను వీనిదేహమునఁ బ్రవేశించి యిమ్మించుబోణులఁశోకము కొంత యుపశమింపంజేసి వీని పుత్త్రుని భట్టభద్రునిం జేసి మఱల స్వకాయమునం బ్రవేశింతును.

అదియునుంగాక యుభయభారతి ప్రశ్నముల కుత్తరముఁ జెప్పి సర్వజ్ఞత్వము నిలువుకొనవలయుంగదా. యీ మించుబోణులవలన గిలికించితాది లక్షణంబులును గళావిశేషంబులం దెలిసికొని కార్యనిర్వాహకత్వము గావించెదను. అని పలికిన విని పద్మపాదుం డీషత్స్మితశోభితవదనారవిందుండై యల్లన నిట్లనియె స్వామీ! నే మీమాట కాదనుటకెంతవాఁడ. సర్వజ్ఞులైన మీ యెరుంగనిది కలదా? యైనను భక్తి నన్ను వాచాలునిఁగాఁ జేయుచున్నది. పూర్వము నుత్సేంద్రుఁడను మహాత్ముం డొకచో మృత్యుండైనమహారాజు శరీరముఁ జూచి గోరక్షుండను తన శిష్యుని స్వకళేబరముం గాపాడ నియమించి తా నానృపశరీరములో బ్రవేశించి యారాజ్య మేలుచుండెను. ఆ మౌనిసింహుండు సింహాసన మెక్కినది మొదలు తద్దేశము తృణకాష్ఠజలసమృద్ధి గలిగి సస్యానుకూలముగా వర్షములు గురియుచుండఁ జక్కగా ఫలింపఁదొడంగినది. తదీయమంత్రు లానృపవరుని యపూర్వతేజఃపటలమునకు వెరిఁగందుచు నోహో? యిం దెవ్వఁడో పరకాయప్రవేశవిద్యానిపుణుండైన యోగి ప్రవేశించినాఁడు కాబోలు. కానిచోఁ జచ్చినవాఁ డెందైనం బ్రతుకునా? యతండు తిరుగ స్వకాయమును బ్రవేశింపకుండ వీని నిందు నిలుపవలయునని తలంచి రూపయౌవనకళావిలాసములచే నభిరామలై యున్న రామలఁ బెక్కండ్ర నతనిసేవకు నియోగించిరి. తదీయహావభావాది విలాసములకుఁ జిక్కి యయ్యోగి సమాధి వృత్తమఱచి తదీయసంగీతనృత్యాది వినోదముల బద్ధాదరుండై స్మరలీలాసమాకర్షితస్వాంతుండై ప్రాకృతుండువోలెఁ బూర్వకృతం బంతయు మఱచిపోయెను.

గోరక్షుం డెంతకాలమునకు దనగురుండు స్వశరీరమునఁ బ్రవేశింపకునికి విచారించి తద్దేహము మఱియొక విధంబున నిగూఢముఁ జేసి గురు నన్వేషింపుచుఁ బోయి పోయి తద్వృత్తాంతముఁ దెలిసికొని స్త్రీలోలుండై యున్నవాఁడు కావున నల్లనఁ దదంతఃపురకాంతల నాశ్రయించి నృత్యంబులఁ గఱపుచు వారి కాంతరంగికుండై మెలంగుచుండెను. ఇట్లుండ నొకనాఁ డయ్యోగి తత్త్వవేత్తయగుటఁ బూర్వస్మృతి గలిగి నివృత్తరాగుఁడై తన స్థితికి వగచుచున్న నెఱింగి గోరక్షుఁడు సమీపించి యోగప్రవృత్తి పూర్వకముగాఁ దనవృత్తాంతమంతయు నతని కెఱింగించి క్రమ్మఱ నాత్మీయకాయంబునం బ్రవేశింపఁజేసెను.

అయ్యారే! విషయానురాగ మటువంటిదిగదా? యూర్ధ్వరేతోవ్రతఖండనంబునం బాపంబు గలుగునండ్రు. ఈ కృత్యంబు పుణ్యమో పాపమో వివేచింప నీవే సమర్థుండవు. నిరుపమానములగు మన నియంబు లెక్కడ! నతిగర్హితమగు కామశాస్త్ర మెక్కడ? మీరే యీ పని కవలంబించితిరేని నిఁక జగంబున నీమంబు వహించువా రెవ్వరు. పృథివియందు శిథిలమగు యతిధర్మమును నిలుపఁ గంకణము గట్టికొనిన నీకుఁ దెలియనిది యేమి యున్నది? యైనను నీ యందుఁ గల పరిచయంబున నింత చెప్పితి, నా తప్పు మన్నింపుమని పలికెను.

వత్సా! నీవు సత్యమే పలికితివి. విషయప్రవృత్తి యట్టిదే కాని పరమార్ధ మొక్కటి చెప్పెద నాలకింపుము. అసంగునకుఁ గామంబు లెన్నఁడును జనింపవు. దీనికిఁ గృష్ణుడే నిదర్శనము. మరియు నఖిలకామములకు మూలమైనది సంకల్పము. అట్టి సంకల్పము కృష్ణతుల్యుఁడనగు నాకు లేదు గదా! సంసారదోషములం జూచు కర్తకు సంకల్పహాని యగుచుండఁగా భవనాశన మగుచుండు. ఎవ్వఁడు శరీరాదికమును విచారింపక ధృఢముగా నే నని తలంచునో యట్టి మూఢుని విషయమై విధినిషేధశాస్త్రము సఫలమగుచున్నది. మహావాక్యములచేఁ గృతకృత్యమైన బుద్ధిగల ప్రాజ్ఞుండు వర్ణాశ్రమజాతిశూన్యమగు పరతత్త్వముఁ దన్నుఁగా నెన్నుకొనుచు శ్రుతిశిఖరంబు నధిష్టించియు విధినిషేధశాస్త్రమునకుఁ గింకరత్వము చేయునా?

శ్లో॥ తదయంకరోతుహయమేధశతా
     న్యమితాని విప్రహననాన్యథవా
     పరమార్థ విన్న సుకృతై ర్దురితై
     రపిలిప్యతేస్తమిత కర్తృతయా.

తత్త్వవేది కర్తృత్వభోక్తృతాది శూన్యుండగుటచే హయమేధశతంబు నాచరించుఁగాక యనేక విప్రహత్యలు గావించుఁగాక తత్సుకృతదుష్కృతముల నంటఁడు సుమీ. ఇంద్రుండు తొల్లి త్వష్ట కొడుకుగు విశ్వరూపుం బరిమార్చెను. కుపితుండై నరున్ముఖయతుల బెక్కండ్ర సాలావృకముల కప్పగించె. దత్కర్మ వలన నతనికి లోమహానియైనం గలిగెనా? యని ఋగ్వేదము చెప్పలేదా?

మరియుఁ బరమజ్ఞానసంపన్నుండగు జనకుం డసంఖ్యాకదక్షిణలతోఁ బెక్కులు జన్నములు సేసి దేవతలఁ దృప్తిపరచియు నంతంబున సర్వభయశూన్యంబునుఁ బరమానందస్వరూపమగు మోక్షముఁ జెందెను కాని తత్ఫల మనుభవించుకొఱకుఁ దిరుగ దేహము నొందలేదని కాణ్వులు చెప్పుచున్నారు. కావున సనందనా! పురందరునిచందంబునఁ దత్త్వవేత్త పాపముల నంటడు. జనకునిపగిది సుకృతఫల మనుభవింపడు. నే నీదురిత మేమిటికిఁ జేసితిని సుకృత మేమిటికిఁ జేయలేదను పరితాపమును బొందువాఁడను కాను. సౌమ్యా! యా శరీరముచేత ననంగశాస్త్రపరిశీలనఁ జేయుట దోషముగాదు. కాని విశిష్టమార్గపరిపాలనముకొరకు కన్యశరీరము నాశ్రయించుచున్నాఁడ. అని యిట్లు భవభయహరణంబులగు సత్కథలం జెప్పుట శంకరయతి శిష్యులతోఁగూడ నరిగి యరిగి యందొకచోఁ బాదచారుల కధిరోహింప శక్యముగాని సముత్తుంగశైలశృంగం బొకండు గనంబడుటయు నశిష్యముగా నక్కూటతటంబున దిగి వెండియు శంకరుం డిట్లనియె.

శా. అంతేవాసివతంసులార! కనుఁడీ! హద్మ్యాంతరమ్మట్టు ల
    త్యంతామోదము గూర్చు నీగుహ విశాలాగ్రస్థలోపేతమై
    ప్రాంతోద్యత్పలభారనమ్రతరుదీప్యత్కూలకాసారతో
    యాంతఃపంకజగంధచోరకసమీరాహ్లాదితాదిత్యమై.

వ. ఇక్కందరాంతరంబున మదీయకళేబరం బునిచి యమరకశరీరంబుఁ బ్రవేశించి పంచశరకళాపాండిత్యంబు సంపాదించుకొని వచ్చెద నంతదనుక మీ రిగ్గుహాంతరంబున మత్కాయం బపాయంబు నొందకుండఁ గాపాడుచుండవలయుంజుఁడీ యని వారికిఁ జెప్పవలసిన మాటలన్నియుంజెప్పి యప్పు డప్పరమహంసము గుహాబిలంబునఁ దన శరీరము విడిచి యోగబలంబున లింగశరీరముతోఁ కూడికొని చని యల్లన నమరకశరీరంబుఁ బ్రవేశించెను.

శా. పాదాంగుష్టకమాదిగాఁగ దశమద్వారంబు పర్యంతమున్
    బ్రోదిం బ్రాణసమీరణంబుల నొగిం బొందింపుచున్ నేర్పుమై!
    మీఁద న్మస్తకరంధ్రమార్గమున నెమ్మిందోయి పైకమ్మహీ
    నాథాంగమ్ముఁగ రంధ్రమార్గమున నిండన్ జొచ్చె నాద్యంతమున్.

అట్లా యోగీంద్రుం డన్నరేంద్రుని మేను జొరబడినతోడనే హృదయంబు గదలఁజొచ్చినది. పిమ్మటఁ గందోయి రవికిరణప్రసారంబున వికసించు నరవిందముకుళంబునఁ దెరవపడినది. మరికొంత సేపున కద్ధరాకాంతుండు నిద్రితుండువోలె లేచి కూర్చుండెను.

అట్లు సంప్రాప్తజీవుండగు జీవితవల్లభుం జూచి యప్పల్లవపాణులు పెల్లుగ నుప్పతిల్లిన సంతసముతో నృపాలుండు బ్రతికె బ్రతికెనని పెద్దయెలుంగున నరచుచు నరుణోదయంబున సారసపతంగముఖరితములగు పద్మినులువోలెఁ బ్రకాశించిరి.

తదీయసంతోషనినాదంబు లాలించి యాప్రాంతమందు విచారింపుచున్న యతని మంత్రులు సజీవితుండగు భూపతిని గాంచి ప్రహర్షసమంచితాంతరంగులై పటహభేరీశంఖాదినినాదంబులు భూనభోంతరాళంబులు నిండ వెలయింపజేసిరి.

సీ. మన యదృష్టంబు నేమనవచ్చు జమువీడు
           గని వచ్చె తిరుగ నీ ఘనుఁడటంచు
    మనపుణ్యమే కాక మరల జీవించునే
           చితిఁ జేర్చినట్టి భూపతియటంచు
    మనపురాకృతతపంబునఁ గాక మనునునోకో
           ప్రేతత్వ మొందిన నేతయనుచు
    మనదానధర్మసంపత్ఫలంబునఁగాక
           యిటు చచ్చి బ్రతుకునే యినుఁడటంచు.

గీ. భార్యలును మంత్రులును హితుల్ ప్రజలు మురిసి
   రందు నిద్రించి మేల్కొని నట్టివాని
   పగిది లేచిన యజ్జనపాలముఖ్యుఁ
   గాంచి సంతోషభూరిసాగరతరంగ
   డోలికల నూగి రొక్కింతకాల మపుడు.

పిమ్మట నమ్మనుజపతిని హితపురోహితమంత్రి ప్రముఖులు శాంతికర్మపూర్వకముగా మాంగళ్యకృత్యంబులు నిర్వర్తించి భద్రదంతావళ మెక్కించి తూర్యధ్వనులతో నూరేగింపుచుఁ బౌరు లత్యద్భుతాహ్లాదమేదురహృదయములతో విలోకింపుచు సేసలు జల్లుచుండ గ్రమంబున రాజమందిరముఁ బ్రవేశపెట్టిరి.

అబ్భూపాలదేహముతోనున్న శంకరుండు ప్రజల నెరుంగకున్నను తత్సమయోచితముగా వారి వారికిం దగినట్లు ప్రత్యుత్తరము లిచ్చుచు నాదరింపుచు సత్కరింపుచుఁ దనవైపరీత్యము దెలియకుండ మెలంగుచు సింహాసన మెక్కి న్యాయంబునఁ బ్రజలఁ బాలింపుచుండెను.

అట్టి సమయంబున బుద్ధిమంతులగు తన్మంత్రిపుంగవు లొకనాఁడు రహస్యముగా నిట్లు సంభాషించుకొనిరి.

ప్రథముఁడు — మిత్రులారా! మన ధాత్రీపతి మృతుండై బ్రతికిన తరువాతఁ బూర్వమువలెఁగాక యపూర్వతేజోమహత్త్వంబునఁ బ్రకాశింపుచున్నవాఁడు చూచితిరా?

ద్వితీయుడు - అగునగుఁ దేజమొక్కటియే కాదు. గుణములు సైత మపూర్వములై కనంబడుచున్నవి. యయాతిరీతి నిచ్చుచున్నాఁడు గదా! అర్థజ్ఞానసంపత్తితో బృహస్పతిగతి సంభాషించుచున్నాఁడు శర్వుండువోలె నన్నియుం దానే తెలిసికొనుచున్నాఁడు యేమి చిత్రము.

తృతీయుడు :- మీ మాటలు యథార్ధములె అనన్యజనసామాన్యము లైనవి తరణపౌరుసశౌర్యధైర్యాది గుణములచే నీతండు పరమపురుషుండులాగున దోచుచున్నాడు.

చతుర్ధుండు :- మరియొక యద్భుతము గనంబడుచున్నది. కనిపెట్టితిరా ?

ప్ర :- అదియేమి.

చ :- ఇతండు సింహాసన మెక్కినది మొదలు ఋతువ్యతిరిక్తకాలంబునం దరువులు ఫలించుచున్నవి. మరియు గోవులు నెక్కుడుగా బాలిచ్చుచున్నయవి తలంచినప్పుడు వానలు గురియుచున్నవి సుఁడీ.

ప్ర :- అగునగు నదిమొదలు తగవులు నినంబడమిజేసి ప్రజలు ధర్మరతు లైరని తలంచెదను.

ద్వి :- ఇదియంతయు నీ మహారాజుగారి ప్రభావమే యని నిశ్చయింప వచ్చును.

ప్ర :- సందేహమేల

తృ :- ఇతండు సమసి పరలోకంబున నెవ్వరివలననేని వరములంది రాలేదు కదా.

ప్ర :- కాదు కాదు. పరకాయప్రవేశవిద్యానిపుణుడైన మహాత్ముడెవ్వడో వీని దేహమందు ప్రవేశించెనని తలంచెదను.

ద్వి :- అగు. జక్కగా గ్రహించితివి. కానిచో జచ్చినమనుజుం డెన్నడైనను జీవించునా?

తృ :- రాత్రి రెండుజాములవేళ వేటాడుచు జెట్టుక్రింద మూర్ఛనొంది పడెనని కింకరు లెరింగింప దేవీసహితులమై మనమందఱము పోయి చూచువఱకు దెల్లవారుచున్నది. పిమ్మట రాజపత్నుల శోకమోహములతో రెండుయాయములైనది. నే నతని దేహమంతయుం బరీక్షించి చూచినాను. శవమై మిక్కిలి విపరీతముగా గనంబడెను.

ద్వి :- కన్నులు తెల్లబడి చూచువారికి వెరపు గరపుచు మోము కళదప్పి యుండలేదా? యిది పరకాయప్రవేశలక్షణమే కానిచో నట్టివాడు తిరుగ జీవించుట కలలో వార్త గదా.

ప్ర :- ఆ మాట నిశ్చయమే యిక మనము చేయవలసిన పని యెద్ది.

ద్వి :- మన కెట్లైన నేమి? యీ కాయంబున నమ్మహాత్ముండు స్థిరముగా నుండిన మనదేశము ప్రజలు మిక్కిలి ధన్యులగుదురు. అదియే యాలోచింపవలయును.

ప్ర :- అతని శరీర మెక్కడనో నిగూఢప్రదేశమున విడువబడియుండును. కావున మనమెట్టిస్థలములెల్ల వెదకించి కనబడిన శవము నెల్ల విచారింపకయే దహింపుడని కింకరుల రహస్యముగా నియోగింపవలయు. వెదకించి యతని శరీరము దగ్ధము గావించితిమేని యతం డెల్లకాలము నిందేయుండును.

ద్వి :- నీ యాలోచన సమంజసముగా నున్నది. కాని రా జెరుంగకుండ మనము కింకరుల కె ట్లాజ్ఞాపింతుము?

ప్ర :- అయ్యో ప్రొద్దుటి రాజశాసనము నీవు వినలేదు కాబోలు.

ద్వి :- లేదు లేదు. ఎట్టిదో చెప్పుము.

ప్ర :- తాను జేడియలతో గూడ గ్రీడాశైలంబున కరిగియందు గొన్ని దినములు వసియించునట. రాజకార్యములన్నియు మనలనే చక్క బెట్టుకొనుడని మనకు స్వతంత్రాధికారమిచ్చి రాజముద్రికల నంపినాడు. ఇక మనమేమి చేసినను రాజుగారికి దెలియజేయవలసిన యవసరము లేదు.

ద్వి :- అలాగునా? ఆజ్ఞాపత్రిక నేను జూడలేదు. అట్లయిన మనమనుకొనినట్లు నిరాటంకముగా జరిగింపవచ్చును.

ప్ర :- ఎప్పుడో యననేల యీ దినముననే యట్టివారల నియమింపుము. వల్లెయని పలికినంత నందరు నిష్క్రమించిరి.

అయ్యమరకనృపాలుండు రాజ్యంబు మంత్రుల యధీనంబు గావించి పట్టణంబున కనతిదూరములో నున్న క్రీడాశైలమునకు నూర్గురు భార్యలతో నరగి యందు ఫలదకుళకుసుమవిసరమనోహరతరునికరపరివృతమగు నుద్యానవనములో స్పటికశిలాసంఘటితసోపానమండితంబైన సౌధాతరంబున యమునాతీరంబున గోపికలతో శ్రీకృష్ణుండువోలె నయ్యంగనలతో ననంగతంత్రపాండిత్యంబు దేటపడ నిట్లు క్రీడించెను.

మదుపానమదంబున గలధ్వనులు గలిగి యీషత్స్వేదయుక్తంబులై మనోహరభాషణములతో నొప్పి పులక లుదయింప సీత్కారములతో గూడి పద్మసౌరభములు గలిగి సిగ్గుచే మూయబడిన కన్నులతో నొప్పి వ్యాపించిన మన్మథోదేక్రముతో నలుకలు చెలింప దీపించు నించుబోణుల మోముల జుంబించి చుంబించి యబ్భూపతి కృతకృత్యుండయె.

గీ. చిత్తజాతకళాతత్త్వవేత్తయగుచుఁ
   గుచగురూపాసనాశక్తి కొనలుసాగ
   నిర్వృతస్వాంతుఁ డగుచు నా నృపవరుండు.
   పడసె నప్పుడు నిధువనబ్రహ్మసుఖము.

గీ. సొరిది వాత్స్యయనోదితసూత్రజాత
   భాష్య మెల్లను జూచి భూపాలవరుఁడు
   దివ్యశృంగారరసము మూర్తీభవించె
   ననఁగదబోఁట్లతో మోద మనుభవించె.

మరియు శ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మదనోత్పాదిని, మద, మోహిని, దీసిని, వశకరి, రంజని యనంబరగు పదియేనుకళలు మదవతులందు బొదలుచు శుక్లపక్షంబున బాదాంగుళము మొదలు శిరఃపర్యంతంబు నెడమభాగంబు మీదుగా నెక్కి కుడిభాగమునుండి కృష్ణపక్షమునందు దిగును. కావున దదీయస్థానంబులు గ్రహించి యందందు జేయదగిన కృత్యంబులు నిర్వర్తింపుచు వారి వివశలంజేయుచు మనోభవసామ్రాజ్యపట్టభద్రుండై యేలదొడంగెను. తత్కృతాపూర్వక్రీడావిశేషంబుల కచ్చెరువందుచు నొకనాడు తద్భార్య లొండొరులిట్లు సంభాషించుకొనిరి.

వసంతకళిక :- యువతులారా! మన ప్రాణనాథుని కృత్యములు యథాపూర్వకములుగా లేవు సుడీ. యబ్బురములుగా గనంబడుచున్నవి.

మదనమోహిని :- అక్కా! నీ వన్న మాట సత్యమగును. లోకాంతరము నుండి నేర్చుకొని వచ్చెనేమో ముద్దలం బ్రౌడల జేయుచున్నాడు.

కేసరిక :- మదనమోహినీ! నీ మాటవలన జ్ఞాపకము వచ్చినది. మొన్నను తమాలిక యచ్చతురు నెత్తుకొని తిరిగిన దేమిటికి? అది మిక్కిలి లజ్జావతియే పదుగురిలో నెట్లట్టిపని జేయనోపినది?

మదన :- అది మగనితో జదరంగ మాడి యోడిపోయినది. యోడినవా రట్టిపని చేయవలయునని మొదట పణముగా నియమించుకొనిరి. అందుమూలమున జేతులతో నెత్తుకొనినది.

కేసరిక :- ఓహో మనోహరుడు మంచినేర్పరియే కాకున్న నది యట్టిపని చేయునా?

మదన :- సరి. అదియొక్కటే? అంతకన్న ముగ్దయగు తమాలికలచేత వనితాసంఘమునకు దన పెదవి కొరికించుకొనలేదా ?

కేసరి :- ఏమి మిషచే నట్లు చేయించెను.

మదన :- అక్షక్రీడలో నోడించి.

కేసరిక :- క్రీడాకైతవంబున దనకిష్టమైన పణములు వైచి యోడించి యభీష్టములు దీర్చుకొనుచున్నాడు. లేకున్న నాగరాసులు విందురా?

మదన :- అన్నిటికంటె జనరంజనిచేత జిత్రమైన పని చేయించినాడు. వింటివా?

కేసరిక :- లేదు. లేదు. చెప్పుము.

మదన :- తమాలికకు దనతో నెవ్వరు సమముగా బాచికలు ద్రిప్పలేరని యెక్కుడు గర్వము గలిగియున్నది నిన్నను బ్రియునితో నాడుచు నతం డోడిన నేమి పణమని యడిగిన మీ యిష్టమైన పందెము వేయవచ్చునని పలికినది. అప్పుడతండు పరాజితులు పురుషాయితము చేయుట పన్నిదముగా వైచి యా చిలుకలకొలికిని ద్రుటిలో నపజయము బొందచేసి చివర కట్లు చేయించుకొనెను.

హేమ :- మేలు మేలు దానికే యంతపరాభవము? వహ్వా, మంచిపని జరిగినది.

మదన - దానిమీద నీకంత కోపమేమి ?

హేమ — నేను మగనిని దామరపూవు పుచ్చుకొని కొట్టినంతనే వింతపడి పరిహాసముగా నందఱితో జెప్పినదే. ఇట్టిపని తానెట్లు చేసినదో.

కేసరిక — నీ కేమిటికి గొట్టవలసివచ్చినది.

హేమ — నాకును బరిహాసకేళిలో నట్టి యవమానమే తటస్థించినది.

కేసరిక - మన జీవితేశ్వరుని యపూర్వచమత్కారశృంగారచర్యలకు నింత జెప్పవలసివచ్చెను. కాని దీని కేమి. మును పీరసజ్ఞత యెక్కడిది?

వసంతకళిక - రసజ్ఞతయో విరసజ్ఞతయో నాకు దెలియదు కాని యతండు ముట్టినంతనే మేను వివశత్వము నొందునేమి?

మదన - వివశత్వ మొక్కటియే? కంఠమునుండి యేదియో వింతనినదము బొడుముచుండును. అట్టి విచిత్ర మెప్పుడు నెరుంగమే.

హేమ - అది కళావేతృత్వమహిమవలనం గలుగునట.

మదన - మన ప్రియుండు మనలం గూర్చి యెద్దియో గ్రంథము రచించినాడట యెరుంగుదువా ?

కాంచ - రచించుట గాదు. వాత్స్యాయనసూత్రములకు భాష్యము పరిశీలించుచున్నాడు.

మదన — కాదు. అమరుకమను పేరు బెట్టి నూర్గురికి నూరు శ్లోకములు రచించినట్లు మంజుభాషిని చెప్పి కొన్ని శ్లోకములు చదివినది.

కాంచ — అయ్యో! ఆ మాట నే నెరుంగనే! మంజుభాషిణి యెక్కడ నున్నదో కదా?

హేమ — అదిగో· గ్రంథము వర్ణించుచు నిట్లే వచ్చుచున్నది.

మంజు — [ప్రవేశించి] నా దెస జూచి నవ్వుచున్నా రేమి ?

కాంచ - నీ చేతిలోనిదేమి ?

మంజు - అమరుకము.

కాంచ - ఎవరు రచించిరి ?

మంజు - మన ప్రాణేశ్వరుండే.

కాంచ — అందలి కథ యేమి?

మంజు — అందు మనయందరి కథలున్నవి.

కాంచ - ఏదీ యొక శ్లోకము చదువుము.

మంజు - శ్లో॥ కోపాత్కోమలలోలబాహులతికాపాశేనబధ్వాదృఢం
                 నీత్యామోహసమందిరం దయితయాస్వైరం సఖీనాంపురః
                 భూయోవ్యేవమితిస్థలన్మృదుగికాసంసు చ్యదుశ్చేష్ఠితం
                 ధన్యోహన్యత ఏవనిహ్నుతిపరః ప్రేయాన్ సుదత్యాహసన్.

వసంతకళిక - ఇది యెవ్వతెనుగురించి రచించినదో చెప్పుకొనుడు.

హేమ — నాకర్థము తెలియదు. చెప్పితినేన నుడివెదను.

వసంత — బాహులతిలకలచే బ్రియుని బిగియబట్టి మోహనమందిరమునకు దీసికొనిపోయి సఖులయెదుట నీతం డేమి చేసెనో చూచితిరాయని ప్రియురాలిచే గొట్టబడు పురుషుడు ధన్యుడు గదా?

మదన — నా కేమియుం దెలియవేని నీవే చెప్పుము.

వసంత - హేమా! నీకు దెలిసినదా? లేదా?

హేమ — ఓహో ఇదియా? తెలిసినది ఇది కనకప్రభయొక్క ఖండితాత్వము ప్రకటింపుచున్నది కాదా.

మంజు — హేమా! నీవు గ్రహించితివి. మదనమోహిని చెప్పుకొనలేక పోయినది గదా.

మదన - నాకర్ధము తెలిసినది కాని యా చర్యలు నేను చూడలేదు కావున దెలిసినది కాదు. మరియొకటి చదువుము.

మంజు - శ్లో॥ తద్వక్త్రాభిముఖంముఖం వినమితందృష్టిఃకృతాపాదయోః
                 తత్సల్లాపకుతూహలాకులతరెశ్రోత్రేనిరుద్దేమయా
                 పాణిభ్యాంచతరస్కృతిసపులక స్స్వేదోద్గమోగండయో
                 స్సఖ్యఃకింకరపాణీ యాంతిశతధామత్కంచుకెసంధయః

మదన — తెలిసినది తెలిసినది. ఇది ముగ్ధయగు భ్రమరవేణి కథ కదా.

మంజు - అగునగు నీమాటు గ్రహించితిని.

హేమ - అక్కా? నాకు దెలిసినది కాదు. భావము చెప్పవూ?

మంజు — వినుము. సఖులారా! మీరు చెప్పినట్లుగా బ్రియుడు పల్కరింపుచుండ, ముఖము వంచి పాదములయందు దృష్టి వెలయజేయుచు జెవులు మూసికొని కపోలములఁ బులకలతో బొడమిన చెమ్మటను జేతులతో దుడిచికొనుచు నభిలాష వెల్లడి చేయకుండ నిలిచితినిగాని యప్పుడు నాఱవికే పటాలున బిగిలినది. దానికేమి చేయుదును? దేలిక పడిపోయితిని గదా యని తనకు బోధించిన సఖులతో భ్రమరవేణి పలికిన కధవిని మన మనోహరు డీశ్లోకమును రచించెను.

హేమ — మన ప్రియుండు రహస్యాలాపములు కూడ వినుచుండెనా యేమి?

మంజు — సందియమేల? యీ క్రింది శ్లోకము వినుము. ఆ యర్ధము తెల్లమయ్యెడిని.

హేమ - చదువుము. చదువుము.

మంజు - శ్లో॥ దంపత్యోర్నిశిజల్పతోగృహాశుకేనాకర్ణితంయద్వతచ
                 స్తత్ప్రాతర్గురుసన్నిధౌనిగదతస్తస్యాతి మాత్రంవధూః
                 కర్ణాలంచితపద్మరాగశకలం విన్యస్యచంచూపుటె
                 వ్రీడార్తావిదధాతి దాటిమఫలవ్యాజేన వాగ్బంధనం.

మదన - భళి. భళి. భళి. భళి. శృంగారవతి చాతుర్యము వెల్లడిజేసెను.

హేమ - అక్కా! నాకది యేమియో చెప్పుము.

మదన — శృంగారవతి రాత్రి ప్రియునితో గ్రీడావిలాసముచే నాడిన మాట లన్నియు విని చిలుక వానినెల్ల మఱునా డుదయకాలంబున బెద్దలయొద్ద మలుమారు పలుకుచుండ విని సిగ్గుపడుచు వడివడింబోయి కర్ణభూషమందలి పద్మరాగశకలముదీసి దాడిమబీజంబు నెపంబున దానినోటం బెట్టి వాగ్భంధము గావించినది.

హేమ - శృంగారవతి మంచి నేర్పరియే. ప్రౌఢత్వమునగాక యట్టిపని తోచుట కష్టము.

మంజు - మనలోనెల్ల నదియే ప్రోఢయని మనోహరుడు దానికి బిరుదిచ్చిన సంగతి నీవెరుంగవు కాబోలు.

హేమ - ఎరుగ నెరుగ మన ప్రౌఢత్వము లేమియు నతనియొద్ద గవ్వ జేయవు. మఱియొక చమత్కారశ్లోకము చదువుము. అమరుకము విన డెంద మూరక యభిలాషపడుచున్నది.

మంజు — నీకే కాదు. రసికులకెల్ల నట్లనేయుండును. వినుము.

శ్లో॥ దృష్ట్వెకాసననంగతె ప్రియతమెతశ్చాదు పేత్యాదరా
     దేకస్యానయనెపిధాయ విహీతక్రీడానుబంధచ్ఛలః
     తిర్యగ్వ క్రితకంధరసపులక ప్రేమోల్ల సన్మానసా
     మంతర్హాసలసత్కపోలకాఁధూర్తోపరాంచుంబతి.

మదన - బాగు బాగు. వల్లభు డెంతచతురుడే. యువతుల నెట్లు వంచించుచున్నాడో చూచితివా?

మంజు — అందు మూలముననే ధూర్తయని ప్రయోగించుచున్నాడు.

హేమ - అయ్యో నాకర్ధము తెలియకపోవుటచేత కదా మీతోఁ గూడ సంతోషించు భాగ్యము పట్టినది కాదు. ఇది యెవ్వరి కథ. యేమి జరిగినదో ముందు చెప్పుడు తరువాత ననుమోదింపవచ్చును.

మదన - హేమలతా! యిది కౌముదీమోదినుల కథ. వారిద్దరు నొక గద్దియంగూర్చుండి యెద్దియో మాటలాడుకొనుచుండ మెల్లగా వెనుకగా బోయి మన ప్రియుండు, తన రెండు చేతులతో గౌముది కన్నులనుమూసి మెడను వంకరగా ద్రిప్పుచు మేనం బులక లుప్పతిల్ల నంతర్హాసముచేత బ్రకాశించు కపోలములుగల మోదిని మోమును జుంబించెను. తెలిసినదియా?

హేమ - ఇంకను దెలియదా? సంస్కృతభాషా పాండిత్యమెక్కుడుగా లేకపోవుటచే నిట్లడుగవలసివచ్చినది. పాపము కౌముది ముగ్ధ కావున నట్టివంచన గ్రహింపలేకపోయినది. మోదిని ప్రౌఢయని యెఱుంగును కాబోలు. దాని కన్నులు మూయలేదు.

మదన - అదియేయైనచో నా పటము దెలిసికొని వెంటనే చేతులు విదళించుకొన లేకపోయినదా? కౌముది ముద్దరాలు గనుక కన్నులు మూయుటయే సంతోషమని యెంచినది.

హేమ - అక్కా? మఱియొక చక్కని పద్యము చదువుము.

మంజు - విను.

శ్లో॥ పటాలగ్నే పత్యౌనమయతి ముఖజాంతవినయా
     హఠాశ్లేషంవాంచత్యవిహరతిగా త్రాణినిభృతం
     అశక్తాచాఖ్యాతుంస్మితముఖసఖీదత్తనయనా
     హ్రియాతామ్యత్యంతః ప్రణమపరిహాసెనవవధూః॥

హేమ — అర్థము చెప్పి పిమ్మట యనుమోదింపవలయును.

మంజు — (నవ్వుచు) తారావళి ప్రథమసంగమదివసంబున గావించిన కృత్యము స్వభావోక్తిగా నిందు వర్ణింపబడినది. ప్రియుండు చేలములాగి వినయముతో మోము వంచుచు నతండు గౌగిలింపబోయిన నంగంబులు ముడుచుకొనుచు బెనిమిటి నిట్లు చేయవలదని చెప్పుడని చెప్పలేక నవ్వుచుండెడి సఖురాండ్ర మొగములు చూచుచు దనలో దానే సిగ్గుచే నవోఢ తొట్రుపడుచుండెను.

హేమ - లెస్సగా నున్నది యింకొక శ్లోకము.

మంజు -

శ్లో॥ కాంతేసాగసియాపితె ప్రియసఖీవేషం విధాయాగతె
     భాంత్యాలింగ్యదుయారహస్యముదితంతత్సంగమాపేక్షయా
     ముగ్దెదుష్కరఎషఇత్యతితరా ముక్త్వాసహానంబలా
     దాలింగ్యచ్చలిదాస్మి తేనకితవే నాద్యప్రదోషాగమె.

మద - అయ్యో! యీలాటి మాయలు చేయుచుండెను. ఇతనియందు శ్రీకృష్ణుని చర్యలన్నియు గనంబడుచున్నవి.

హేమ - నాకర్ధము చెప్పిన పిదపగాని మిమ్ము మాటాడుకొననియ్యను.

మంజు - ఇందు మణిమంజరి నాయకునిచే వంచింపబడి యావార్త సఖుల కెరిగించు విషయమును వర్ణింపబడినది. సఖులారా! ప్రియుని యపరాధ మెరింగి యింటికి రాగా గోపముతో బొమ్మంటి నావంచకుండు పోయి మదీయసఖీవేషముతో వచ్చి గురుతు పట్టజాలక సఖి యనుకొని కౌగలించుకొని "బోటీ యింటికి వచ్చినవానిని నిష్కారణకోపముతో వెడలుగొట్టితిని. నీవు పోయి వాని నెట్లయిన దీసికొని రమ్ము. లేనిచో బ్రాణములు నిలువవని" పలికిన నా రహస్యమును విని యతండు అగుంగాని యా కార్యము చేయుట దుర్ఘటమని పలికి నవ్వుచు నన్ను బిగ్గఱ గౌగిలించుకొని నేటి సాయంకాలమున వచించెను. అని మణిమంజరి సఖులలో జెప్పినది.

హేమ - మేలు మేలు. మణిమంజరిని జక్కగా వంచించె. మంచి చతురుఁడగు నింకొక్కశ్లోకము చదివి సంతోష పెట్టుము.

మంజు — శ్లో॥ అహంతేనాహూతాకి మసికథ యామీతివిజనె
                  సమీపేచాసీనా సరళహృదయత్వాదవహితా
                  తతఃకర్ణోపాంతెకిమపివదతాఘ్రాయవదనం
                  గృహీత్వాధమ్మిల్లంమమసఖీ! విపీతోధరరసః॥

మదన — అమ్మక్కచెల్లా! ప్రియుం డెంత మాయవాఁడే.

హేమ - అదిగో! నాకర్ధము చెప్పక పూర్వము మీరేమియు నా విషయము ముచ్చటింపగూడదని చెప్పియుండలేదా!

మదన - తదీయభావంబు మద్భావంబు నాకర్షించుటచే మఱచిపోయితిని. ప్రియుండు మన కాంచనమాల రహస్యస్థలమందు వసియింప మాటయని పిలిచి దగ్గిరకు బోగా జెవిలో నెద్దియో చెప్పువాడుంబోలె నూది మో మాఘ్రాణింపుచు జడ గైకొని యధరరస మానెనఁట. అయ్యర్ధం బాయువతి సఖితో జెప్పుచుండ నట్లిందు వ్రాసె నెంత చతురుడో చూడుము.

హేమ — అక్కా? యీ శ్లోకములన్నియు నాకు జెప్పెదవా? అర్ధముతో వర్ణించి మన సఖురాండ్రనెల్ల వెరపించుచుందును.

మంజు — అలాగే కాని యిప్పుడు దీరికలేదు. ఱేపు చెప్పెద బోయి వత్తునా?

వసంతకళిక - డెబ్బదినాలుగ శ్లోకము చదివి పిమ్మట బొమ్ము. అది పైకి తీసితివి గదా.

మంజు - సరియే యెంతసేపు నిలువను ? సంగీతశాల కరుగవలయు నుపాధ్యాయుండు వచ్చి వేచియుండునేమో ?

వసంత — అది యొక్కటియే కాదా చదివిపొమ్ము.

మంజు —

శ్లో॥ శూన్యంవాసగృహంవిలోక్యశయనాదుత్థాయకించిచ్చనైః
   నిద్రావ్యాజముపాగతస్యసుచిరంనిర్వర్ణ పత్యుర్ముఖం
   విస్రబ్దంపరిరభ్యజాతపులకామాలోక్యగండస్థలీం
   లజ్ఞానమ్రముఖీప్రియే హసతాబాలాచిరంచుంబితా.

హేమ - అర్ధము చెప్పి కదలుము.

మంజు — ప్రియుం డేకాంతగృహంబున నొక్కరుడు శయనించి యుండ విద్రుమోష్ఠి మెల్లగా లోనికిబోయి కపటనిద్ర బోవుచున్న యతిని మొగము సోయగము వర్ణించుచు నువ్విళూర ముద్దిడుకొనబోయి యందు బులకలు పుట్ట జూచి సిగ్గుపడి తలవంచుకొనుచు, దిగ్గున లేచి యతం డాబాలను చుంబించెను. ఇదియే దీని యర్దము.

హేమ — విద్రుమోష్ఠి యనురాగము వెల్లడిచేయును.

మంజు — ప్రియుం డీశ్లోకము చక్కగా రచించెను. నే నిక నిలువరాదు. పోయివత్తు. సంగీతశాల నాచార్యుండు వేచియుండుంగదా.

హేమ — పోనీ పుస్తక మిచ్చి పొమ్ము. మేము చదువుకొనుచుందుము.

మంజు - ఆలాగునే యని పుస్తక మిచ్చి నిష్క్రమించినది. పిమ్మట తక్కిన యువతులు నా పుస్తకము చదువుకొన మరియొకచోటికిం బోయిరి.

అని యెరింగించి మణిసిద్ధుం డప్పటికి కాలాతీతమగుటయు దదనంతరోదంత మవ్వలిమజిలీయం దిటుల చెప్పదొడంగెను.