Jump to content

కాశీమజిలీకథలు/అయిదవ భాగము/49వ మజిలీ

వికీసోర్స్ నుండి

రామభట్టు — ఈ యలఁతి సిరితోనేమి యతని యనుగ్రహమే కలిగినచో మనకు శాశ్వత సుఖపదమే కలుగునుగాదా.

సుమతి - అవును ఇది మొదలు మనమతని సహాధ్యాయ బుద్ధి విడిచి దైవముగా భావించుదుముగాక.

రామ —— అతం డవతారమూర్తియే కానిచో నేడేండ్ల ప్రాయము గలవాని కీ ప్రజ్ఞ లెట్లు కలుగును.

సుమతి - అతండు కొంతకాల మిందుండునా ?

రామ — ఇక బదిదినములు మాత్రముండి పిమ్మట నింటికిం జనునట. తల్లి యొద్దనుండి రమ్మనుమని వార్తరాగా దిరుగనట్లు ప్రతి వార్త నంపెను.

సుమతి — అట్లైన మనముగూడ నతనితో బోవుదము కృతృత్యుల మగుదుము.

అని యెరింగించి మణిసిద్ధుండప్పటికి కాలాతీతమగుట దదనంతరోదంత మవ్వలి మజిలీయం దిటుల చెప్పదొడంగెను.

శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

49 వ మజిలీ

ద్వితీయోల్లాసము

అట్లు శంకరుండ పూర్వ ప్రభావప్రచారములచే నేడవయేడు ముగియు వరకు గురుకుల వాసముజేసి సర్వవిద్యలయందు నసమానపాండిత్యము సంపాదించి సర్వభాషాకవిత్వచాతురీధురీణుండై సరస్వత్యవతారమని యెల్లరు గొనియాడుచుండ నింటికింజని తల్లికి నమస్కరించెను.

శంకరుని మాతృసేవ

సతీదేవియు దదీయాద్భుత విద్యా గ్రహణసామర్థ్యము విని వెరగుపడుచు బుత్త్రుం దీవించి కౌగలించుకొని శిరము మూర్కొని ముద్దాడి తద్దయు గారవించి విద్యాభ్యాస కాలవిశేషము లడిగెను.

శంకరుడు తత్సమయోచితములగు మాటలచే దల్లికి సంతోషము కలుగ జేసి మాతృసేవ జనుల కవశ్యకర్తవ్యమను విషయము బోధించుకొరకు గొన్ని దినములు దల్లిని సేవింపుచు సూర్యాగ్నుల నారాధింపుచు నింటవసించెను. ప్రాయముచే నల్పుండైనను విద్యామహిమలచే నధికుండయిన శంకరుం జూచినతోడనే యందలి జనులాబాల వృద్ధముగా మిక్కిలి గౌరవము చేయుచుందురు. మరియొకనాడు సతీదేవి మండు వేసవిని మిట్టమధాహ్నంబున బూర్ణానది కరిగి నీరు దెచ్చుచుండ నడుమదారిలో స్వభావ మృదువులగు తత్పదములు సూర్యాతపతప్తమగు నిసుకలో నంటికొనుటయు నడచుటకు దొట్రుపడు చుండెను.

అప్పుడు కొందరు జనులామెంజూచి తొందరపడచు వడివడి శంకరునొద్ద కరిగి, మహాత్మా! సతీదేవి నియమములచే శరీరమును మిక్కిలి కేశపరచియున్నది. దుర్బలశరీరముగల యామె యిప్పుడు మిగుల తపించిన యిసుకలో నడువలేక చిక్కు పడుచున్నది వేగబోయి తీసుకొనిరమ్ము. మేమంటుకొనుటకు వీలులేకపోయినదని పలికిన విని యతండదరిపడి వడివడింజని తామరాకులం దీసికొనివచ్చి, నేలంబరచి వాని మీద నడపించుచు దుర్దును స్యేదజలంబు హరింప దాళ వృంతంబుల వీచుచు నాయాసము వాయజేసి, యింటికిం దీసికొనిపోయి మిక్కిలి పరితపించుచు బెక్కు పచారముల గావించెను.

మరియు నారాత్రి నియమితచిత్తుండై శంకరుండు తత్తటినీ వరంబును గృహనికటంబుగా బ్రవహింపజేయు తలంపుతో మనోహర వృత్తరత్నములచే గంగా స్తవము గావించెను. సత్యవచనుండు శంకరుని భక్తికి మెచ్చి యమ్మహానది మరునా డుదయకాలమునకు దద్గృహముదాపుగా మందవాతానీతములగు జలశీకరములచే లోకుల బవిత్రముజేయుచు బ్రవహింపజొచ్చినది. తత్ప్రాంతమున మాధవుని యాలయమొకటి విరాజిల్లుటంచేసి తదీయపాదంబుల సేవింప నరుదెంచిన మందాకినియో యన నవ్వారి నిధికళత్రం బచ్చటివారి కవ్వారిగ విస్మయ సంతోషములు గలుగజేసినది. దూరముగా నున్న పూర్ణానది యప్పుడగ్రహారము దాపుగా బ్రవహించుచుండుటంజూచి యందలి ప్రజలు తల్లిమూలమున శంకరుడే దానినట్లు కావించెనని యతని మహిమ నద్భుతముగా జెప్పుకొనదొడంగిరి.

అట్లు గోపాలకృష్ణుండువోలె నబ్బాలుండద్భుత విద్యా విశాలుండై యమానుషకార్యంబులం గావింపుచుండ గ్రమంబున దదీయ మహిమాతిశయంబు లాదేశంబంతయు వ్యాపించినవి.

రాజశేఖరుండను రాజు శంకరు నాశ్రయించుట

అప్పుడు ప్రజలం బాలించు రాజ శేఖరుండను నృపాల శేఖరుండతని విఖ్యాతి విని మిగుల వేడుకపడుచు నొకనాడతనిం దీసికొని రమ్మని తన ప్రధాన మంత్రిని గాలట్యగ్రహారమున కనిపెను. అయ్యమాత్యోత్తముండల్లన శంకరునొద్దకుం జని నమస్కరించి, మహాత్మా! నేను రాజశేఖర నృపాలుని యమాత్యుండ. నా పేరు సుబుద్ధియండ్రు. అమ్మహారాజు భుజబలంబున సకల భూభుజుల జయించి యీదేశంబు నిరర్గళ ప్రతాపంబున బాలింపుచున్నాడు తత్త్వజ్ఞానంబున జనకుని యంతవాడు. దాతృత్వంబునగర్ణాదుల మించినవాడు. తదీయ సభామండలంబున సంతతము పండితపుండరీకులు సరసవాద ప్రసంగంబులు గర్ణసుఖం బొనరింపుచుందురు.

ఆ నృప తిలకుండు పండిత ప్రియుండు. సరసకవితాధురంధరుండు. అవధాన్యుండు భవదీయ దర్శనలాలసుండై నన్ను బుత్తెంచెను. సంసార సాగర నిమగ్నుల నుద్ధరింప గంకణము గట్టికొన్న మీ పాదరేణు నాదరముతో శిరంబున దాల్ప నౌత్సుక్యము జెందుచున్నాడు. ఈ భద్రదంతావళము నెక్కి విచ్చేయుడు. అని యనేక ప్రకారముల బ్రార్ధించిన విని మందహాసము జేయుచు శంకరుండిట్లనియె. సుబుద్ధీ! మీరాజు సద్గుణవిశేషముల కెంతయు సంతసించితిమి మేము బిక్షాన్నము భుజించుచు జన్మమె పరిధానముగా ధరించి త్రికాలనియమములచే కాయమును గ్లేశ పరచుచు వేదాధ్యయనము గావించు బ్రహ్మచారులము. ఇట్టి మేము సహజకర్మల విడచి కుత్సితభోగములగు గజాశ్వాందోళకాదుల నధిష్టించి మీరాజు నొద్దకు వచ్చి మా ప్రజ్ఞాప్రభావముల జూపి ద్రవ్యము సంపాదించి యేమి చేయుదుము. మాకీ తుచ్చ భోగములం దభీప్సితము లేదు. కావున నీవు యథాగతముగా నింటికింజని మా వాక్యముగా మీ రాజును బలుమారు నిట్లు బోధింపుము

రాజు ప్రజలకుఁ దగినవృత్తు లేర్పరచి వర్ణాశ్రమాచార నియమంబులు దప్పకుండ ధర్మనిరంతులం గావించి పాలింపవలయును. ప్రజల సుకృతదుష్కృతములలో నాఱవవంతు నృపాలునిఁ జేరునండ్రు. సక్తవ్యసన విరక్తిబొందిన నరేంద్రుండు పరమ సుఖంబొందు. నిదియె మదీయ హితోపదేశంబని యుపదేశించిన విని యామంత్రి మాఱు మాటపలుకక యతని యనుమతిఁ గైకొని మరల రాజశేఖరునొద్ద కరిగి యతని మాటల తెఱంగెఱింగించి మఱియు.

చ. అఱువదినాల్గువిద్యల రహస్యములం గ్రహించి యేడు వ
    త్సరముల ప్రాయమంద నియతవ్రతుఁడై యొక విప్రకాంత పే
    దరికమువాపి యేటినిలు దాపునఁబెట్టిన దిట్ట తుచ్ఛపున్
    సిరులకు నాసఁజెంది మన చెంతకు వచ్చునె పిల్చినంతటన్.

గీ. అతని మాటల వినిన వాఁ డమృతమేవ
    గించు భోగములఁ దృణీకరించుఁ ద్రుంచుఁ
    జిత్తమోహంబులను విమర్శించు శ్రుతుల
    మించు జనకాదియతుల భూమికళత్ర.

క. ఆ మహితాత్మునిగనుఁగొనఁ
   గామదిఁ గామితమునీకుఁ గలిగిన యేనిన్
   భూమీశ! రమ్ము పోవుద
   మామహికననలయాతఁ డతివేగముగాన్.

వ. చతురంగబలపరివృతుండై యయ్యగ్రహారంబునకుంజని యందు.

సీ. క్షితిసురార్భకులచే సేవింపఁబడువాని
             ధవళయజ్ఞోపవీతములవాని
    గంగాతరంగిణీ కమనీయహిమమహీ
            ధరముతోనెనయింపఁ దగినవాని
    శరదంబుధరనిభాంబరముదాల్చిన వాని
            ఘనమృగాజినముమైఁ గప్పికొనుట
    నీలాంబరునిబోలు మేలిరూపమువాని
            మంచికృత్యములాచరించువాని.

గీ. మిసిమి మేలిపసిండి క్రొమ్మించులీను
    మౌంజికటిసీమవింత సంపదఘటింపఁ
    బీతల కావృతద్యుతిభూ జాతమట్లు
    మురువుఁజెందెడు వాని శంకరునిఁ గనియె.

వ. కనుంగొని మనంబునఁ దదీయ మహానుభావతకు విస్మయముఁ జెందుచు నానృపాలుండా బాలునకనేక సాష్టాంగ నమస్కారములు గావించినంజూచి శంకరుం డతని మన్నించుచు నాశ్వీరచన పూర్వకముగా నాగమన కారణంబడిగెను. అప్పుడు పదివేలదీనారము లతని మ్రోల బ్రోగువెట్టి యానృపతి యల్లన నిట్లనియె. మహాత్మా! నేనతి ప్రయత్నముతో మూఁడునాటకములఁ గావించితిని. వాని విమర్శించి గుణదోష వివేచనము గావింపవలయును. ఇదియే మదీయ వాంఛితమని పలికి యతని యనుమతి వడసి యా మూఁడునాటకములను సంగ్రహముగాఁ జదివి వినిపించెను.

రసపూరితములై, మనోహరగుణరీతి విశిష్టములై యొప్పు నా నాటకముల మూఁటిని విని శంకరుఁడు సుస్మితాంకురములు మోము నలంకరింప నృపాలా! నీ నాటకములు నిర్దుష్టములై సుకవిజనస్తోత్ర పాత్రములై యున్నవని మెప్పువచ్చె. నీ యభీష మేమియని యడిగిన విని యానృపాలుండు, స్వామీ! నీ యనుగ్రహంబునఁ గృతి సంతతిచేఁ గృతార్థుండనైతిని. పుత్త్రునొక్కని దయసేయుఁడని కోరికొనియెను. అప్పుడు శంకరుఁడు, రాజా నీవు తెచ్చిన ధనము మాకవసరములేదు. ఈ యగ్రహార బ్రాహ్మణులకుఁ బంచిపెట్టుము సుపుత్త్రుఁ డదయించు నని పలికి రహస్యముగాఁ బుత్రేష్టిగావింపుమని బోధించి తద్విధాన మంతయు నెఱింగించెను. పిమ్మట రాజశేఖరుండు తదుక్త ప్రకారము ధనము బ్రాహ్మణులకుఁ బంచిపెట్టి యింటికింజని పుత్త్రకామేష్టిఁ గావించి సుపుత్త్రుఁబడసెను మహాత్ముల యనుగ్రహమూరకపోవునా? అట్లు నిరూపమాన కళాపరిపూర్ణుండగు నవ్వటుచంద్రుఁడు పెక్కండ్రనాత్మాయత్తులైన ఛాత్రో త్తములు నధిక విద్యాప్రదానంబున ననవద్యులంగావించెను. విద్వజ్జనపరిసేవితుండగు శంకరుండు సర్వార్ధ తత్వములం దెలిసినవాఁడయ్యెను. శాస్త్రోక్తమగు భక్తిచేఁ దల్లికి నుపచారములం గావింపుచుఁ గొన్నిదినములు గడపెను.

చ. శరణముతల్లి కాసుమతి చంద్రుఁడురక్షకమావధూటిశం
    కరునకువారలొండొంరులఁ గానక తాళరొకింతసే పహా !
    వరమతినైననాతఁడు వివాహముసేసికొనందలంపఁడౌ
    నరుదగు మేరువెక్కి యెవఁడైననుగోరునె దుష్ప్రదేశమున్. 21

చ. సకలకలా ప్రవీణుఁడగు శంకరునిస్మఱిగేస్తు జేయ ను
    త్సుకమతువై తదాప్తులు యశోమహితప్రధితంబులైనవి
    ప్రకులములంగళామతిని రాజితరూపగుణాభిధన్యఁ గ
    న్యక వెదుకందొడంగిరి నియంత్రితులై సతిచేమిధోగతిన్. 22

శంకరునియొద్దకు మహర్షులు వచ్చుట

మఱియొకనాఁడు బృందారక పరివృత్తుడగు బృహస్పతి వోలె శిష్యగణసేవ్య మానుండై విద్యావ్యాసంగము చేయునున్న శంకరుని మందిరమునకు నుపమన్యు దధీచి గౌతమాగస్త్య ప్రముఖులగు తపోధనులు విచ్చేయుటయు దూరమునం దతండు వారిఁజూచి లేచి శిష్యగణముతోఁగూడ నెదురేగి యాతిథ్యంబిచ్చి యుచితసపర్యలం గావించి పీఠంబుల సుఖోపవిష్టులంగావించి యంజలి ఘటియింపుచు వినయంబున స్వాగతమడిగిన నమ్మహర్షులాదరపూర్వకముగా నిట్లనిరి.

మహాత్మా! నీవు సుకరమైనమతముల నుద్ధరింప నవతరించిన శంకరుండవు. నీ వచ్చిన కార్యము మరచి మాతృ సేవకుఁజిక్కి యిల్లు విడకున్నవాఁడవు ఇటుపిమ్మట నైనఁ గర్తవ్యాంశ మేమరక సుమీ యని పలుకుచుఁ గొంత సేపు రహస్యకథావిశేషంబుల ముచ్చటించిరి.

అట్టి సమయమున శంకరుని తల్లి యుల్లము రంజిల్ల వారి పాదపల్లవములకు నమస్కరింపుచు, మహాత్ములారా! నేడుగా మేము కృతార్థులమైతిమి. ఊరక మీ యట్టి యవభూతలిట్టికాలమున దర్శనమిత్తురా! అయ్యారే! మావంశము కడు చిత్రమైనదని యనేక స్తోత్రములు సేయుచు "అయ్యా! యీ శిశువు చిరుతతనంబుననే సకలశాస్త్ర పారంగతుం డగుటయు నద్భుతకార్యములు గావించుటయుఁజూడ లోకులకు విస్మయము గలుగక మానదుగదా. అదియునుంగాక మీ బోటి మహాత్ములరుదెంచి యీ చిన్న వానితో ముచ్చటించుట యచ్చెరువుగదా? నే నర్హురాలనైతినేని వీని పుణ్యమెట్టిదో వక్కాణింపవేడెద మీరు త్రికాలవేదులగదా" యని సానునయముగా నడిగిన విని యందుఁ గుంభసంభవుండని పేరుపొందిన మహర్షి యల్లన నిట్లనియె.

సాధ్వీ! నీవును వల్లభుండును బుత్త్రార్థులై చంద్రశేఖరు నారాధించితిరి గదా. ఆ కృపాళుండు మీ తపంబునకు మెచ్చి భవదీయ వల్లభుని స్వప్నంబునం బొడ సూపి, దుష్టుండు శతాయు స్సంపన్నుండగు. సర్వోత్కృష్టుండు మితాయుస్సంపన్నుండగు. వీరిలో నీ కెట్టి సుతుండు కావలయునని యడిగిన నావిద్వాంసుం డుత్తమసుతునే కోరికొనియెను. దానంజేసి తదంశంబున మీకీ పట్టి యుదయించెను.

అట్టివాఁడెట్టి వాఁడును గాకుండ నాయని పలికిన విని యులికిపడి యక్కలికి మునితిలకునకు వెండియు నిట్లనియె. మహాత్మా! యేమంటిరి. యామాట నా ప్రాణవల్లభుండు నాకెఱింగింపలేదే మితాయువన నెంతయో తెలియకున్నది. కనికరముతోఁ దత్పరిమాణ మెంతయో వివరింపుఁడు. ఉల్లము తల్లడిల్లుచున్నదని పలికిన విని సత్యమైన నప్రియవాక్యము చెప్పఁగూడదను నిషేధవచనము గలిగియున్నను నేమి కారణముననో యా మహర్షి వీనికి శంకరుఁడు పదియాఱేఁడుల యాయుర్దాయమిచ్చెను. కాని మఱికొన్ని కారణములచే మఱియన్ని యేఁడులు జీవించునని పలుకుచుండఁగనే వలదు వలదుడుగుమని యితర మునులు కనుసన్నలచే వారింపుచు నతనితోఁగూడ శంకరు ననుమతిఁ గైకొని యథాగతముగా నరిగిరి.

శంకరుఁ డల్పాయువని విని తల్లి విలపించుట

పిమ్మటఁ బుత్త్రవత్సలయగు సతీదేవి యమ్మహర్షి మాట వినిన తోడనే యంకుశమునఁ బీడింపఁబడిన కరణి గ్రీష్మంబున నెండిన తరంగిణిపగిది వాయుకంపిత మగు కదళియుంబోలెఁ జలింపుచు నేలంబడి మూర్ఛిల్లి శోకరసావేశంబునఁ బెద్దతడ వొడలెరుంగక యెట్టకేఁల దెప్పిరిల్లి యుల్లము పగుల శంకరునిం గౌఁగిలించుకొని.

సీ. హా! కుమార! సుపుఁత్త్ర హాకులైకఖ్యాత
               సకలకళాపూర్ణ చంద్రవదన

    నా తండ్రి నిన్నుఁ బన్నగశిరోభూషణుం
              డల్పాయువుగఁజేసె నయ్యయిట్టు
    లయ్యయో నీ విద్యలన్ని యేమైపోవు
             నేనేమి సేయుదు నింకమీఁద
    నీ తండ్రితో నేను నిన్నూతగాఁగొని
             యరుగంగలేనైతి నమరపురికిఁ.

గీ. గన్నతండ్రివేడ్క గదుర నీ ముద్దు ము
    చ్చటలఁ జూచుకొనుచు జాలకాల
    మలరఁదలఁచుకొంటి నకట నీ నెత్తిపై
    మృత్యువుంటఁ దెలిసి మెలఁగనైతి.

చ. కపటవరంబులిచ్చి మము గారియఁబెట్టఁగనేల చిత్తభూ
    రిపుడు దయాళుఁడిట్టి విపరీతముఁజేయునె మత్పురాత్త్వ పా
    పపుఫలరీతిగాక కులపావన! ముప్పదియేండ్లె నీకుఁ గ
    ల్పపు తుదియయ్యెనే యకట పాడువిధీ యిటుసేయుదే ననున్.

చ. చిరుతతనంబున ధృతిన శేషకళావిభవంబుగాంచి య
    బ్బురమగు కార్యముల్సలిపి భూజను లన్సువివేకతా ధురం
    ధరులుగఁ జేసినట్టి యవతారశరీరుఁడు తల్లి మోహ సా
    గరమున మున్గికొట్టికొనఁగా దరిజేర్పక మోహమందునే.

శంకరుఁడు తల్లికి వైరాగ్యోపదేశము చేయుట

శ్లో. ప్రబలానిలవేగ వేల్లితధ్వజచీనాంశుశకోటిచంచలె
    అపిమూడమతిః కళేబరెకురు తెకస్స్థిరబుద్ధిమంబికె
    కతినామసుతానలాతితాః కతివానేహవధూరభుంజ్మ హి
    క్వను తెక్వచకాః క్యవానయంభవసంగః ఖలుపాంధసంగమః.

అమ్మా! ప్రబలవాయువుచేఁ కొట్టికొను ధ్వజపటమువలె జంచలమగు నీ కళేబరమున స్థిరబుద్ధి యునుటచుకంటె మూఢత్వము గలదా. ఇంతకు వెనుకటి జన్మముల నీకు నావంటిపుత్త్రు లెందరు జనియించిరి. ఎందఱకు దల్లివైతివి. ఎందఱం బెంచితివి. వారందరిలో నేనొకండ. నెందరికొఱకు విచారించెదవు. మార్గస్థులు పానీయశాల కరుదెంచినట్లు సంసారులు చేరుచుం బోవుచుందురు. మమత్వమున సంసారసాగరమున మునింగి విషయసుఖగ్రాహగ్రస్తుండగు దేహియధోగతిం బొరయును. తల్లీ! నీ దేహమే నీకెరవగుచుండ నా కొఱకు విచారించెదవేల? దేహతత్త్వం బెరుంగుము. జీవులకు జననముతోనే మరణము కూడుకొనియున్నది. నూఱేండ్లు బ్రతికినను వాంఛలు నశింపవు గదా! మమత్వముడిగి సుఖింపుమని యుపదేశించిన విని యవ్వనితామణి యొకింత ధైర్య మవలంబించి కుమారుని కిట్లనియె. తండ్రీ! దేహాభిమానమున్నంత వఱకు మమత్వము విడుచుట కష్టము. సకల లోకస్తుత్యుఁడవగు నీయట్టివాని విషయమై చెప్పనేల? కానిమ్ము విధిగతి యలంఘ్యముగదా! నీవిఁక గృహమేధివైసుపుత్త్రులంగని కులముద్ధరింపుము. క్రతువులచే దేవతలఁ దృప్తిపరుపుము. నీ తండ్రి గృతకృత్యుం జేయు మిదియే నాకోరిక, యని పలికిన విని నవ్వుచు శంకరుం డిట్లనియె

శ్లో. భ్రమతాంభవవర్త్యభ్రమా
    న్న హికించిత్సుఖమంబలక్షయె
    తదవాప్యచతుర్ధమాశ్రమం
    ప్రయతిష్యెభవ బంధవిముక్తయె.

అమ్మా! భ్రమవలన సంసారమార్గమున గ్రుమ్మరువారికి జననీ జఠరవాస మరణాది రూపమైన దుఃఖమేకాని సుఖమించుకయులేదు. మరియు నల్పాయుసంపన్నుం డగు నేను బెండ్లియాడి భార్యాపుత్త్రాదులఁ గ్లేశ పరుపనేల? కావున నేను జతుర్థాశ్రమమును స్వీకరించి భవబంధవిముక్తికొఱకుఁ బ్రయత్నించెద. ననుజ్ఞయిమ్మని కోరికొనియెను సతీదేవి కర్ణకఠోరములైన యతని మాటలువిని చెవులు మూసుకొని రెట్టించిన శోకముతో గద్గకంఠయై, నాయనా! నీవు నన్ను విలపింపఁజేయుటకా జనించితివి? వల్పాయుష్కుండవని వినినది మొదలు హృదయము పగిలియున్న నన్నోదార్చు రీతి యిదియా? నాకేమిగతిఁ జూపి నీవు సన్యాసిదయ్యెదవు? అయ్యయ్యో? నీవన్న మాట గోరుచుట్టుపై రోకలిపడినట్లున్నదిగదా? ముప్పదియేండ్లలోఁ బెండ్లియాడి సంతానమునుగని క్రతువులఁజేసి కృతకృత్యులైన వారనేకులుగలరు. నీవును బూర్వుల మార్గ మనుసరింపుము. వృద్ధురాలనగు నామాట లాదరింపుమని యనేక ప్రకారముల సానునయముగాఁ బలికిన విని శంకరుండు వెండియు నిట్లనియె.

శా. తల్లీ! పుత్త్రులు శత్రులన్పలుకు వ్యర్ధంబౌనెనీవంత వ
     ర్దిల్లుంగాని సుఖంబెనాకతనఁ జింతింపన్మమత్వంబులోఁ
     ద్రెళ్ళంజేయుము సౌఖ్యమయ్యెడు భవాబ్దిందాటెదోయమ్మ నా
     కిల్లున్వాకిలి ప్రీతిలేదఖిలమున్ హేయంబుగాఁ దోచెడిన్.

అమ్మా! నీవు నాయందు మమకారముఁ బెట్టికొంటివేని దుఃఖమే కాని సుఖము లేశమైననులేదు. నాకీయెంటిజందెమే బరువై యున్నది. రెండవదాని నెట్లు ధరింతును. నాకీ సంసారమందిచ్చలేదు. పారలౌకిక సౌఖ్యంబు విచారించుకొనియెదనని పలికినవిని యామెగోలున నేడ్చుచు నతని గడ్డము పట్టుకొని, నాయనా! నీవు మిక్కిలి యక్కటికము గలవాఁడవు. ఎందరినో రక్షించితివి నాముప్పు గడిపి పిమ్మట నీ యిష్టము వచ్చినట్లు చేసికొమ్మని యనేక ప్రకారములఁ బ్రతిమాలికొనియెను. అప్పు డతం డేమియుఁ జెప్పలేక యూరకుండి యాత్మగతంబున నోహో యీమె మోహము మిక్కిలి బలముగానున్నది. సన్యాసస్వీకారమున కాజ్ఞయియ్యదు. తదాజ్ఞలేక యది స్వీకరింపరాదు. ఏమి చేయుదునని తలంచి తదుపాయ మరయుచుఁ గొన్నిదినములు గడిపెను.

శంకరుఁడు మకరగ్రస్తుడై తల్లిని సన్యాసమున కాజ్ఞ యిమ్మనుట

ఎనిమిదవయేట శంకరుండొకనాఁడు ప్రాతఃకాలమునఁ బూర్ణానది కరిగి యందుస్నానము జేయుచుండఁ దన చెడురూపువాపి రక్షింపుమని శరణుఁజొచ్చు నట్లొక మకర మతని చరణంబులఁ బట్టికొని లాగఁదొడంగినది. జలస్తంభనాది విద్యా ప్రవీణుండైనను దనకార్యము సాధింప నిదియే సమయమని నిశ్చయించి యిటునటు గొట్టుకొనుచు. అమ్మా? రక్షింపుము రక్షింపుము. నన్నొక మొసలిపట్టుకొని లాగుచున్నదని పెద్ద కేక పెట్టెను. ఆ రోదనవిని యింటగృహకార్యములు చక్కఁబెట్టుచున్న సతీదేవి శోకపరవశయై గుండెలు బాదుకొనుచు, నొక్కడుగున రేవుఁజేరి నట్టేటం గొట్టుకొనుచు మున్గుచుఁ దేలుచున్న కొడుకుంజూచి అయ్యో అయ్యో హా పుత్త్రా ! హా పుత్త్రా యని యరచుచు లోతునీటందిగవలదని పలుమారు బోధించినను నా మాటఁ బాటింపక నీ యేదికేటికి వచ్చితివి? ఇఁక నాకు దిక్కెవ్వరు? మా శంకరుని మకరము బట్టినది వచ్చి రక్షింపరో మీ పాదములకు మ్రొక్కెదనని యరచుచు నతని మోముదమ్మింజూచుచు రక్షకుల జాడ నరయుచుఁ బలుతెరంగుల జితింపదొడంగినది. కాని సాహసించి యేటిలో దిగలేకపోయినది ప్రాణములకన్న తీపగునది మరియొకటి లేదుగదా.

అప్పుడు శంకరుఁడు, "అమ్మా! నీవు సన్యాసము గైకొంటివేని నిన్ను విడిచెదనను మాట యొకటి నీటినుండి బయలువెడలుచున్నది. సత్యముకావచ్చును. అందులకు నీవంగీకరింతువే" యని యడిగిన విని యామె యోహో? యిది కపటమాయేమి? వీడిదివరకుఁ బలుమారు సన్యాసముఁగైకొనఁ బ్రార్ధించియున్నాఁడు. ఇట్లడిగిన నేను సమ్మతింతునని కాఁబోలు నేమిచేయుదునని డోలాయితచిత్తయై యున్నంత శంకరుం డొక మునుంగుమునిఁగి యంతలోఁ దేలి తల్లి కిట్లనియె.

తల్లీ ! యిది కడపటిమాట యిఁక నిలుచుటకు శక్యముకాదు. మకరగ్రహణ వేదన బరుగుచున్నది యిదిగో మ్రొక్కుచుంటి సన్యాసమునకో, స్వర్గమునకో యాజ్ఞ యిమ్మని వేఁడుకొనియెను.

ఆ మాట విని యామె యతనిదైన్యము సహింపనోపక పుత్త్రుండెట్లైన బ్రతికి యుండినం జాలునని నిశ్చయించుకొని, "పుత్త్రా! నీకు సన్యాసమున కాజ్ఞయిచ్చితిని. పరమానందమును బొందుము. ఆ మకరమునకు సైతము నీ మతమే యిష్టమైనది కాఁబోలు. నిఁక నిలువనేల? వేగర"మ్మని పలుకఁగావిని శంకరుండాజలాంతరముననే మనసుచేత సన్యసించి యల్లననానక్రముఖమునుండి తప్పించుకొని భవబంధవిముక్తుండు వోలె నవలీలందీరంబుఁజేరి తల్లికి నమస్కరించెను.

సతీదేవి బాష్పజలములచే సన్యాసస్వీకారమున కభిషేకము చేయుచున్నది వోలె నతని శిరంబు దడుపుచుఁ దండ్రీ! మకర దంష్ట్రలు సోకి నీ యొడలెంత బడలినదోకదా. అయ్యయ్యో! అయ్యార్తి నెట్లు సైరించితివి. నీరేమైనం ద్రాగితివా యింటికిఁ బోవుదమురమ్ము. వైద్యుల రప్పించి తగిన చికిత్సం జేయించెదనని పలుకఁగా నవ్వుచు శంకరుం డిట్లనియె

శం — జననీ నీ యాజ్ఞచే నేను మానవసన్యాసము స్వీకరించితిని. ఇఁక నేనింటికి రాను. యతికిఁ గర్తవ్యమేదియో యది నాకుపదేశింపుము.

తల్లి - నీవు సన్యాసివై పోవుచుండ నన్ను రక్షించువారెవ్వరు! నాకేమి గతిఁజూపి యరిగెదవు?

శం — మదీయ పైతృకధనం బెవ్వరు దీసికొనుటకుఁ గర్తలో వారలే నిన్ను రక్షించుచుందురు.

తల్లి — ఓహో మంచిదారిఁజూపితివి. మదీయదేహపాతము ఫలహేతువుగాఁ జూచు జ్ఞాతులా నన్నురక్షించువారు? అన్నన్నా శంకరా యింతనిర్దయుండవైతివేమి. వ్యాధిపీడిత నయ్యెదనేని నన్నెవ్వరుజూతురు? నాకౌర్ధ్వ దైహిక క్రియలు గావించు వారెవ్వరు?

శం - రోగము వచ్చినప్పు డనువారములును మరణానంతరమున నపరసంస్కారమును దాయాదులే చేయుదురు అట్లు చేయనిచో లోకాపవాదను బొందరా!

తల్లి - లోకులకు వెరచిచేయు దాయాదుల యుపచారములు నాకుఁ బ్రీతి కరముగా నుండునా? నీవంటి పుత్త్రునింబడిసియు నీవలన సంస్కారమును బొందక యనాథవలె నే నెవ్వరిచేతనో సంస్కారమును బొందవలసినదా? కటకట? యెంత పాపాత్మురాలనైతిని.

శం — అమ్మా! నీకట్టి కోరిక యుండినచోఁ బ్రాణోత్క్రమణసమయంబున నన్నుఁదలంచుకొనుము. ఎంత దూరములో నున్నను యోగబలంబున దెలిసికొని వచ్చి నీ దేహసంస్కారము గావింతును.

తల్లి - అట్టి వరము నాకిమ్ము. సన్యాసికృత్యము కాదని మానెదవేమో సుమా!

శం — తల్లీ ? యుల్లంబునఁ జింతింపకుము. నీకట్టి వరమిచ్చితిని మరియు ననాథనగు నన్ను విడిచి యేగుచున్నవాఁడు వీడు నిర్భయుఁడని తలంపవలదు. దూరముననున్నను నీయొద్దనుండు నప్పటికంటె నూరు రెట్లధికముగాఁ పరామర్శింపుచుందును సుమీ.

తల్లి - బిడ్డా? అదియే నేను గోరుచుంటిని. అయ్యో నీవరిగెదవనిన నా గుండెలు కొట్టికొనుచున్నవి యింటనుండి యేమి చేయుదును. నీవరిగిన నిమిషము బ్రతికియుందునా? నన్నుఁగూడఁ దీసికొనిపొమ్ము.

శం — తల్లీ? మరల మోహమందెదవేమిటికి నద్వైతతత్త్వమును దెలిసికొనుము. ఎవ్వరికెవ్వరును లేరు. తన్నుదారక్షించు కొనవలయు. నీవు నావెంట రారాదు. ఆత్మతత్త్వమును ధ్యానించుకొనుచు నిండియొద్ద నుండుము. మమకార ముడుగుమని యనేక ప్రకారములు బోధించి యామెకు వైరాగ్యప్రవృత్తి గలుగఁజేసి పిమ్మట జ్ఞాతులనెల్ల రప్పించి యిట్లనియె.

శంకరుండు తల్లిని జ్ఞాతుల కప్పగించుట

చ. ఎడదను గన్నతల్లియని యించుకయుం దయలేక వృద్ధన
    న్విడిచి విరాగియై యరుగు వీఁడనియారటమందు నీమె మీ
    కడనిడి యేగుచుంటి నెటు గాంచెదరోకద బంధులార! యీ
    బడుగుబడంతి మీ జనని బాతిఁ దలంచి కృపన్ భజింపుడీ.

క. ననుమరచునట్టు లాదర
   మున జూచుచునుండుఁ డీమె మోహం బొప్పన్
   ననుదలచి కంటఁదడి వె
   ట్టిన మీకును నాకునున్ ఘటించునఘంబుల్.

క. ఇడుమల నెరుఁగదు మాట
   ల్వడదిమ్మని యడుగదేమి లాతులయింటన్
   గుడిచి యెరుంగదుతలఁపఁగఁ
   గడుమెత్తని దీమె నెట్లు కాపాడెదరో.

గీ. సకలభూవిత్త పశుగృహ సహితముగను
    నాదుజనయిత్రి మీయధీనఁగ నొనర్చి
    యేగుచుంటిని దయమాలి యింతమీఁద
    మీదె యామెభరంబు దాయాదులారా.

అని పలికి శంకరుండు కన్నీరు గార్చుచున్న తల్లి రెండుచేతులం బట్టికొని జ్ఞాతుల కప్పగించెను. అట్టి సమయంబున నాయగ్రహారపు బ్రాహ్మణులెల్ల నచ్చోటి కరుదెంచి యామె ధైన్యము జూచి విచారింపుచు నతనివైరాగ్యమున కచ్చెరువందఁ జొచ్చిరి. అంతలో శంకరా! నీవు దూరముననుండిన పూర్ణానదిని దల్లి యిడుమలు వాయుటకై యగ్రహారము దాపునకుం దెచ్బితివి తత్తరంగముల రాయిడిచే గోపాల

స్వామి యాలయము బీటలువారినది. యాస్వామిని మరియొకచోట స్థాపించి పొమ్ము. అనుమాట యొకటి వినంబడుటయు నావచన మెవ్వరు పలికినది నిశ్చయింపలేక యెల్లరు విస్మయమంది నలుమూలలు చూడఁదొడంగిరి. అది భగవదుక్తిగాఁ దలంచి శంకరుం డప్పుడేపోయి యాగుడి పగిలియుండుటఁ జూచి వెరఁగుఁజెందుచు నాస్వామిని భుజములతో మెల్లగానెత్తి మరియొక తావున స్థాపించి యాలయ మంటపప్రాకారాదులఁ గట్టింప నియమించి యనంతరమున.

శంకరుఁడు సన్యాసాశ్రమ స్వీకారమునకై గోవిందయతియొద్ద కరుగుట

గీ. తల్లిపాదాబ్జములకు వందన మొనర్చి
   ఫాలమున గేలు ఘటియించి బంధువులకు
   వారిదీవెనలంది యిల్వడలెనాతఁ డ
   బ్ధిఁబడు నొక్కకల మెక్కి నట్టి యతఁడు.

మ. చతురాస్యాదులు మున్ను దుర్మదమనోజప్రౌఢిమై చాల మో
     హితులై రేనును మోహినీకుచకచాన్వీక్షారతిం బొల్చి వీ
     డితి ధైర్యంబతిదుష్టుఁ డీస్మరుఁడు దండింపన్ భరంబంచు న
     య్యతియైకామకృతార్తివార్తయె వినం డయ్యెన్ శివుండయ్యెడన్.

క. సురగరుడోరగవిద్యా
   ధరగంధర్వాది దేవతలనైన వశం
   కరులుగఁ జేసెడు మన్మథుఁ
   బరిభవమొందించెయతి ప్రభావమలతియె.

సీ. శాంతిమానసము వశంబుఁ జేసికొనంగ
            గమనాదిక క్రియ ల్గట్టె దాంతి
    యుపరతివిషయాంత రోత్సుకత్వముమూన్పె
            క్షాంతిమృదుత్వంబుఁ జక్కఁజేసె

    గురుతరధ్యానైక నిరతిఁజేసెసమాధి
            సంతతియత్యంత సాధువృత్తి
    వేదాంతవాక్య సద్విశ్వాసరూపక
            శ్రద్ధసుప్రియయయ్యె సంశ్రయింప.

గీ. శంకరునిభూరివైరాగ్య శక్తియట్టి
    మహిమగలదియొకొ తలంపఁగ నిన్ని
    సద్గుణంబులుగల్పించె సమయమరచి
    విరులవాసనలావిర్భవించినట్లు.

శంకరుండు శుభముహూర్తమున బయలువెడలి యుత్తరాభిముఖుండై యరిగి యరిగి.

శా. దారింబోవుచుశంకరుండు ధరణీధ్రహ్రాదినీభూరికాం
    తారగ్రామపురీ మనుష్యపశునానాజంతుసంతాన మిం
    పారంగాంచుచు నైంద్రజాలికుఁడు మాయాజాలమున్వోలె దు
    ర్వారాద్వైతమతిందలంచెను బరబ్రహ్మంబుగానంతయున్.

అట్లు దృశ్యంబంతయు బరమతత్త్వముగా బోధించుచు శంకరుండు కులమతవాదులచే, జెడుమార్గముల నడిపింపబడి బడలియున్న శ్రుతిధేనువు నిష్కంటక మగు నద్వైతమార్గంబున నడించుటకుంబోలె నుత్తమదండంబు ధరించి కాషాయాంబరము కటింగ్రాలు నరుగుచుండెను. అతండు దండధరుండై రక్షకుండు కానిచో మొఱయుచు వేఁటకుక్కలు సారంగబులంబోలె బాషండులు వైదికులం బాఱఁద్రోలకుందురా అద్దేశికపుంగవుం డట్లరిగి యనేకపురనదీపక్కణారణ్యంబుల దాటి యొకనాఁటి సాయంకాలమునకు నర్మదానదీ తీరంబునం బొలుపొందు గోవిందయతి చంద్రుని యాశ్రమాంతరమున కరిగెను.

సీ. మువ్వన్నె మొకము మూపులునాకిపాలిచ్చు
              ధేనువత్సముల కెంతేని బ్రీతి
    కటితీటవాయ భీకరసింహదంష్ట్రాగ్ర
              ములగోకికొను ముదంబునగజంబు
    ఫణమల్లవిప్పి తాపము నారసఁ గప్పకు
              నిడుపడుగడురక్తి నీడవట్టు
    గంతులునేర్పుఁ జక్కఁగమృగాదనకిశో
             రములకుఁగలిసి సారంగసమితి.

గీ. చెలఁగిలెక్కించు వృషదంశ మెలుకపండ్లు
    కాసరములశ్వములచెంత గతులెరుంగు
    నలరిగోవిందయతిచంద్రు నాశ్రమాంత
    రమున మృగములు జాతి వైరములు మాని.

అందుశంకరుండట్టి విశేషములుచూచి తదీయ మహానుభావతకు నాశ్చర్యము నొందుచు నర్మదానదీశీకరచోకరములగు మలయానిల కిశోరములు మార్గాయాసం బపనయింప నవ్వనములోఁ గొండొకసేపు విశ్రమించి తద్విశేషములరయుచు నలు మూలలుదిరిగి యతఁడొకచో దత్త్వగోష్ఠి విశేషములచేఁ బ్రొద్దులు గడుపుచున్న కొందరఁ దాపసులంగని నమస్కరించి వారి కిట్లనియె.

గీ. భూరిసంసారవహ్ని తప్తుండనగుచు
    ననఘుగోవిందయతిచంద్రు నాశ్రయింప
    నరుగుదెంచితి మునులార? యమ్మహాత్ముఁ
    డెందు వసియించెనో వచియింపుడయ్య.

అనియడిగిన శంకర డింభకుని వచనంబులకు నజ్జడదారులు విస్మయముఁ జెందుచు, అప్పా! నీవిప్పగిది బాల్యంబున విరక్తిజెందుటకు గతంబేమి? నీప్రాయ మల్పమైనను వాక్యంబులు ప్రౌఢములుగా నున్నయవి. నీవెవ్వండవు? మేము చిరకాలము నుండి గోవిందయతీశ్వరుని దర్శింప నిందువేచియున్నారము. అమ్మహానుభావుండు ప్రాదేశమాత్ర వివరముకముగల యిగ్గుహాంతరమున నున్నాఁడని చెప్పుదురు. యోగ శక్తింగాని దీనిఁబ్రవేశింప శక్యముకాదు. మాకట్టి సామర్ధ్యములేదు. ఎప్పటికేని నమ్మహాత్ముండు ప్రసన్నుండు గాకుండునాయని యిందుఁ గాలక్షేపము సేయుచున్నారము.

ఇప్పుడువచ్చి నీవతనిఁజూడ వేడుకపడుచున్నావు. సామాన్యముగా నతనిం గాంచుట శక్యముగాదు. మాతోఁగొంతకాలమిందు వసియింపుము. సద్గోష్ఠినుండమని పలికిన విని శంకరుండు నవ్వుచుఁ దత్సమయోచితముగా వారికిఁ బ్రతివచనములిచ్చి యపుడు వారెల్లనచ్చెరువంది చూచుచుండ దృఢసమాధియోగంబున యోగంబుపట్టి యగ్గుహంబ్రవేశించి యందు సమాధినిశ్చలచిత్తుండైయున్న గోవింద యతీంద్రుం జూచి ముకుళితకర కమలుండై యిట్లు వినుతించెను.

చ. హరునకుఁ బాదభూషయు మురారికిఁ దల్పమునై యెవండు భూ
    ధరధరణీజ సాగర యుతంబుగ ధారుణినుత్తమాంగ మం
    దిరవుగఁదాల్చెనట్టి యురగేంద్రుఁడవీవెకదా మహాత్మా! నీ
    చరణసరోరుహద్వయికి సాగిలిమ్రొక్కెద భక్తి నియ్యెడన్.

గీ. మునుసహస్రముఖంబులఁ దనరునిన్నుఁ
    గాంచిశిష్యులు భయమందఁ గనికరమున

    నేకముఖమునవారి రక్షింప నవత
    రించినట్టి పతంజలి నీవెకావె.

గీ. అలరసాతలమునకేగి యటభుజంగ
    సాధుముఖమున నధ్యయనంబుఁజేసి
    యోగశాస్త్రములతోఁ గూడ నుర్విశబ్ద
    శాస్త్రభాష్యము నెరపిన సామివీవె.

మ. శుకశిష్యుండగు గౌడపాదువలనన్ క్షుణ్ణంబుగాఁదత్త్వముల్
     సకలార్ధంబులు సంగ్రహించిన ధృఢ స్వాంతుండవత్యుత్తమ
     ప్రకటప్రజ్ఞుఁడ నీవు నీవలన భాస్వద్బ్రహ్మనిష్ఠన్ సమా
     ధికృతాత్మన్ గ్రహింపవచ్చితిని ప్రీతిన్నాకు బోధింపవే.

అని స్తుతియించుటయు నాలించి యయ్యతిచంద్రుండు కన్నులందెఱచి నిజచరణ పరిసర ధరణీతలంబున నిటల తటఘటితాంజలి పుటుండై యున్న శంకరుం గాంచి తదీయ ప్రభా విశేషమున కచ్చెరువందుచు [క స్త్వం] నీ వెవండవని యడిగినఁ పూర్వ పుణ్యోపార్జితబోధాంకములగు వచనంబులచే నమ్మహాత్మున కిట్లుత్తరముఁ జెప్పెను.

శ్లో. స్వామీన్నహంస పృథివీనజలంనతేజో
    నస్పర్శనోనగగనంనచతద్గుణావా
    నాప్రీంద్రియాన పితువిద్ధితతో విశిస్టో
    యః కేవలోస్తి పరమస్సశివోమహస్మి.

స్వామీ! నేను పృథివియు నుదకములు నగ్నియు వాయువు గగనము శబ్దస్పర్శరూపరసగంధములు నింద్రియములుంగాను, తద్బాధావిశిష్టుండై కర్తృత్వ భోక్తృత్వాదివినిర్ముక్తుండై సర్వోత్తముఁడై చిదానందమయుండైన పరమశివుండెవ్వడు గలడో యాతండ నేనేయని పలికిన విని యమ్మహర్షి హర్షపులకితగాత్రుండై సౌమ్యా! నీవు సాక్షాచ్చంకరుండవు అతనిగూఢంబగు నద్వైతమార్గంబు దెరంగెరింగింప నవతరించితివి. సమాధి దృష్టినంతయుంగంటి రమ్ము రమ్ము. లోకవిడంబరమునకై నీకుఁ బ్రణవమంత్రోపదేశముఁ గావించెదను. మదీయపాదంబుల నర్చింపుము అని పలికెను. అప్పుడు శంకరుండు యతిసంప్రదాయమును బరిపాలించు తాత్పర్యముతోఁ దానెరింగినవాడయ్యును సవినయోపచారములచే గోవిందయతీంద్రు ననేక బ్రకారములు సేవించెను. తత్సేవవలన మిగుల సంతుష్టినొందుచుఁ బ్రణవమంత్రోపదేశపూర్వకముగాఁ జతుర్వేద శేఖరవచనములచేఁ గ్రమముగా,

    ప్రజ్ఞానంబ్రహ్మ
    అహం బ్రహ్మాస్మి
    తత్త్వమసి
    అయమాత్మాబ్రహ్మ?

అను నాలుగు మంత్రములచేతను బ్రహ్మభావ యుపదేశముగా భావించెను. పిమ్మట శాస్త్రగూఢములగు వ్యాసమహర్షి హృదయాశయములఁ బ్రకటింపుచు బ్రహ్మ సూత్రముల యందుఁగల సంపద్రాయార్థములనెల్ల నయ్యతి తల్లజుండు శంకరునకుఁ జక్కగాఁ దెలియఁజేసెను. వ్యాసమహర్షి వలన శ్రీశుకుండు శ్రీశుకుని వలన గౌడ పాదుండును, గౌడపాదుని వలన గోవిందతీర్థులను, బ్రహ్మసూత్రార్థముల సంప్రదాయ సిద్దముగాఁ దెలిసికొనిరి. కావున గోవిందయతి యెఱింగించిన విషయములు యథార్థము లని చెప్పుటకేమియును సందియములేదు. మఱియు గోవిందతీర్ధులు పాతాళమునకేగి యనంతుని వలన సంగ్రహించుకొనిన విద్యలు యోగములును, మంత్రములుఁ దంత్రములును చతుష్షష్టికళలను ఆ శంకరాచార్యున కుపదేశముఁగావించి తత్సంప్రదాయముల నెల్లఁ గరతలామలకముగాఁ దెలియఁజేసెను. అనేక జనన కృతసుకృతపరిపాకంబునం గాని పొందశక్యము గాని సన్యాసాశ్రమమును స్వీకరించి శంకరాచార్యులు ధ్రువుండు వోలె పరమోన్నతస్థానమును బొంది ప్రకాశించెను. అప్పుడందున్న తాపసులు కొందఱతని యాకృతి విశేషమునుం జూచి విస్మయముఁ జెందుచు నొండొరు లిట్లు సంభాచుకొనిరి.

వరరుచి - ఆర్యా! యీ బాలయతి యతిపాటవమగు శాటీపటముచేఁ గప్పఁబడి యెట్లుండెనో చూచితివా?

మతంగుఁడు - దివసావసానంబున రక్తమేఘచ్ఛాదితమగు హిమగిరి కూటమువలె నొప్పచుండెంగదా.

వరరుచి - అగునగు. గజాసురుని సంహరించి రుధిరాపుతమగు తచ్చర్మంబునరుణశాటీపల్లవము నెపంబునఁ బూనిన శంకరుండే యితండని యూహింపుము.

మతంగుఁడు - మేలుమేలు. చక్కనిపోలికఁ దెచ్చితివి. ఇతండు భూతాశక్తియు గోవిహరణము భూతిసంగమము భోగుల సహవాసమును బరిహరించినను స్థూలసూక్ష్మ కారణంబులను త్రిపురంబులు దహించుటచే నపరశివునిఁగాఁ జెప్పఁదగినదేకదా.

వరరుచి - దుఃఖసారమై దురంతమై దుష్కృతమేఘయుక్తమైయొప్పు సంసారవర్షర్తును దూరముగా బరిహరించి ప్రతిపక్ష పండిత మృణాలనాళంకుర గ్రాసత్వంబుగలిగి సన్మానసక్రీడావిశేషంబుఁ జెందుచుండుటచే నితనినిఁ బరమహంస శిరోమణియని చెప్పుటకేమి సందియమున్నది.

మతం - సందియమేల? ఈ ద్విజకులావతంసము పరమానంద స్వరూప మగు బ్రహ్మమనుక్షీరము దుఃఖాత్మకమగు జగత్తును నీరముతో దాదాత్మ్యముఁ జెంది యుండ విడఁదీసి స్పష్టపరుచుటచేఁ బరమహంసమని నిస్సంశయముగా వర్ణింప వచ్చును.

వర - తమంబున మందీకృతంబగు దృష్టిని ప్రకర్షగుణయుక్తముగాఁ జేయుచు లోకబాంధవుండన నెసంగి సుహృచ్చక్రముల యార్తి హరింపుచు జిజ్ఞానార్ధములఁ బ్రకటనఁ జేయు నీయతికి యంసాభిఖ్య వేఱొకరీతిం గూడ నన్వర్ధమగుచున్నది సుమీ.

మతం — ఓహో. సూర్యునితోఁ బోల్చితివా? చక్కగా నున్నదిగదా. ఈ మహానుభావుండు పరమహంసయై సంస్కృతి ముక్తి కొఱకు గోవిందయతిచంద్రుని కతంబునఁ బరమాత్ముని ధ్యానించుచుండ నింద్రియతండంబుల నిట్టి చాంచల్యము గలదని చెప్పుచున్నవి వోలె మేఘములు సంచరించుచున్నవి చూడుము.

వరరుచి — వార్షిక దినములలో యతు లాత్మీయస్థానమును విడువకుండుట యాచారము గావున బాలయతియు నీ వర్షాకాల మిచ్చటనే యుండును. నిత్యము నీ మహాత్ముని దర్శనముఁ జేయింపుచున్న యీ ఋతువు మనకు మహోపకారియైనది గదా.

అని చెప్పుకొనుచు వారు నిష్క్రమించిరి - శంకరాచార్యులు గురుశుశ్రూష జనులకవశ్య కర్తవ్యమని తెలుపునట్లనేకాగ్రహారములతో నొప్పుచున్న నర్మదానదీ తీరంబునవసించి యాత్మధ్యానముఁ జేసికొనుచు గోవిందయతి నారాధింపుచు వర్షకాలము గడుపుచుండెను.

ఇట్లుండ నొకసారి భూరిస్తనిత ఘోషములచే భూనభోంతరాళములు పగులఁ జంచలాసంచయంబులు దృష్టిపాతములకు భీతిఁగలుగఁజేయ గల్పాంతమోయని జనులు వెఱచి మొఱలిడ దెసలావరించి వారి వాహతండంబులు వేదండశుండాదండ సదృక్షంబులగువారి ధారలచేఁ బంచరాత్రంబు లేకరీతివర్షించుచు ధారుణితలంబెల్ల ముంచుటయు నప్పుడు గొప్ప చప్పుడుత్పతిల్ల గల్పవారినిధియుంబోలె నుత్తుంగ తరంగంబులతో నర్మదానదిపొంగి తీరములయందలి యగ్రహారముల ముంచినది.

అప్పుడందలి ధరణీబృందారికులు హాహాకార నినాదములతో సస్త్రీ బాల వృద్ధముగా గృహంబులువిడిచి యొండొరులం జీరికొనుచుఁ బ్రాణతుల్యములగు యజ్ఞోపకరముల నరణులఁ బుస్తకముల భారంబున పిల్లలతోఁగూడఁ గక్షస్కంధాది ప్రదేశములంబూని యతికష్టంబున గోవిందయతిచంద్రుని యాశ్రమగిరి శిఖరమెక్కి యొక్కచో స్త్రీ బాలవృద్ధుల నిలిపి గుంపులుగా నరుదెంచి మహానుభావుండైన గోవింద యతీంద్రుఁ డెందున్నవాఁడని యందున్న వారినడిగి యోగసిద్ధులకుఁ గాని ప్రవేశింప శక్యముగాని గుహయందున్న వాఁడని తెలిసికొని యగ్గుహాముఖంబున నిలువంబడి ఫాలభాగంబులఁ గేలుదోయిం గీలింపుచు నేకముఖముగా నిట్లు వేడికొనిరి.

క. గోవింద యతీంద్ర ! భవ
   త్సేవానిరతులము మేమధిక భిన్నమనీ
   షావివశులమైతిమిగదె
   కావవెమాయా ర్తివిని ప్రకాశగుణాణ్యా.

సీ. అటుకలఁద్రాళ్ళ వ్రేలాడగట్టినసుపు
           స్తకములువరదఁ గొట్టికొనిపోయె
    సుడిగుండములు పెట్టి కడిదిగుండములయ్యె
           నగ్నికుండముల గేహంబులెల్ల
    నరణులతోస్రుక్ర్సు రాదిపాప్రలునీటఁ
           దేలివారిధిఁజేరెఁ దెట్టెతోడఁ
    బెనురాలతోడఁ గట్టిసమేటియిండ్లతో
          గోడలెల్లను నీటఁ గూలిపడియె.

గీ. పాతరలుమున్గె గాదుల పసయడంగె
    ధ్యానములువోయెఁ జేలు గుండంబులయ్యె
    నరుతనిడుకొని మా యగ్రహారములను
    దాచికొన్నది యీ నర్మదాస్రవంతి.

గీ. చెట్టుచేమలపైఁ బ్రాకి చెదరిజనులు
   బ్రాణములఁ గాచికొనుచుండి రనఘ? యిప్పు
   డీ యుపద్రవముడిపి రక్షింపుమయ్య
   శరణుఁజొచ్చితిమయ్య మీ చరణయుగము.

గోవిందయతి యప్పుడు సమాధిబద్ధచిత్తుండై బాహ్యేంద్రియ వ్యాపార ముడిగి యున్నవాఁడు గావున వారిమ్రోల నాలింపడయ్యెను. తచ్చుశ్రూషాపరాయణుండై యున్న శంకరుఁ డయ్యర్తధ్వని నాలించి యగ్గుహాంతరమునుండి యరుదెంచి గుహా ముఖమున వారిం గాంచి మీరెవ్వరు? ఏమిటికి మొర పెట్టుచున్న వారని యడిగిన నతండు బాలుండు వినియు నేమిచేయఁగలవాఁడని నిరసించుచుఁ బ్రత్యుత్తర మీయ కప్పారులు నలుమూలలకుఁ బరువఁదొడంగిరి. అందుఁ గొందరు బుద్ధిమంతులు శంకరునిమాటఁ బాటించి, ఆర్యా! నీవు ప్రాయంబున నల్పుండవయ్యును దేజంబుఁజూడ నధికుండువలెఁ గనంబడుచున్నాఁడవు. వినుమా నడుమ గురిసిన ప్రకర్షవర్షప్రచారము మీరెరింగియే యుందురు. పర్వతగుహావాసులగుటఁ దద్భాధ మీకెరుక పడక పోవ చ్చును. అయిదుదినము లహోరాత్రంబు లేకరీతి వర్షము గురియుటచే భూమియంతయు జలమయమైనది. మేము నర్మదానదీ తీరవాసులము. బ్రాహ్మణులము. నర్మదానది పొంగి మా యగ్రహారములన్నియు ముంచివేసినది. సస్త్రీబాల వృద్ధముగా బ్రాణములు దక్కించుకొని యీమెట్ట యెక్కితిమి వరద పెచ్చు పెరుగుచున్నది. ఇప్పటికైన వరద తీసినచో గొన్ని యిండ్లు నిలుచును. కొందరు బ్రదుకుదురు. కొన్ని సస్యములు ఫలించును. కొంతసొమ్ము దొరుకును. గోవిందయతి యార్తత్రాపరాయణుండనియు మా యార్తి బోఁగొట్టసమర్ధుఁడని యతని నాశ్రయింపవచ్చితిమి. ఆ దయాహృదయం డెందును గనంబడకున్నవాఁ డిదియే మా వృత్తాంతమని చెప్పిన విని మందహాసముఁ గావింపుచు శంకరుడు ఒక కడవ నభిమంత్రించి వారికిచ్చి, విప్రులారా! మీరు చింతింపకుఁడు. ఈ కుంభమును వేగముగాఁ దీసికొనిపోయి నర్మదానదీ ప్రవాహంబున విడువుఁడు. మీయార్తి వాయునని చెప్పి యది వారికిచ్చెను. అప్పుడే వారాఘటమును దీసికొనపోయి నర్మదలో విడిచినంత

క. బుడబుడయను చప్పుడుతో
   గడగడ నీరెల్ల ద్రావెఁ గడవ యడియగ
   స్త్యుఁడుమున్ను వార్ధిఁగ్రోలిన
   కడిదిని నక్కడవ కెంత కడుపున్నదియో.

గీ. కడవవాకఁగోలఁ గడవకుఁ బొడమిన
    బుడుతగ్రోలెఁబిదప గడలినెల్లఁ
    దల్లి గుణ మొకింత తగులనిచో నట్టి
    ఘనతగాంచునే యగస్త్యుఁడపుడు.

గీ. ఇవముతో నట్లు గడవ నీరెల్లఁద్రావఁ
   గడిగినట్లున్న వెప్పటి కరణిఁజెక్కు
   చెదర కిండ్లును వాకిండ్లు జెట్లు చేలు
   మందునకునైన లేదందు బిందువొకటి.

ముహూర్తకాలములో నద్దేశమెల్ల నిర్జలమగుటయు వెరఁగుపడుచు నప్పుడమివేల్పులా శంకరుని సుతసతీయుతముగాఁ గొనియాడుచు మితిలేని సంతసముతోఁ దమతమ నెలవులకుంబోయిరి. గోవిందయతియు సమాధినుండి లేచి యా వృత్తాంత మంతయు విని, యోహో ! యీతండు యోగసిద్ధుండయ్యె. నీతనికజేయం బేదియును లేదని సంతసించెను. అతండు మరియొకనాఁడు శంకరుఁజూచి, వత్సా! శంకర! అవిద్యావరణమునుబాసి జ్ఞానంబునం బ్రకాశిల్లు పరతత్త్వమువలెనే మేఘశూన్యమై శరదృతువుచే గగనమెంత నిర్మలముగా నున్నదియో చూచితివా? మరియు హరిదంబులు చిరసముపార్జితంబులకు జీవనంబుల లోకంబులకుఁ దృప్తిఁజేసి తటిత్కాంతల విడచి గగనగృహములనుండి సన్యసించిన యతులవలె నరిగినవి కంటివే! శ్రవణమనన నిధి ధ్యాసలచే నీ వార్షిక దినములను గడిపి మహాత్ములీ శరత్సమయంబునఁ బాదరజంబున జగంబుఁ బవిత్రము సేయుచు సంచరింతురు. కావున నీ విప్పుడు కాశీపట్టణమున కరుగుము అందు వేదచోదితమగు త్తత్వపద్ధతి వివరింపుమని పలికి వెండియు నిట్లనియె.

తొల్లి యొకప్పుడు హిమగిరియం దత్రిమహాముని సత్త్రయాగము గావించెను. తదా లోకనార్ధమై త్రిలోకంబులంగల తాపసులచ్చోటికి విచ్చేసి వేదశాస్త్ర పురాణగోష్ఠులతోఁ గాలక్షేపము గావించుచుండిరి. అమ్ముని సభామండలమున రెండవ పుండరీకభవుండువోలె నొప్పుచు వ్యాసభట్టారకుండొకనాఁ డుపనిషత్తుల కర్ధముజెప్పుచుండ విని వినయంబునఁ జేతులుజోడించి యిట్లంటిని. మహాత్మా! నీవు నాలుగు వేదంబులను విభజించితివి. భారతంబు రచించితివి. యోగశాస్త్రముఁ జెప్పితివి. బ్రహ్మసూత్రములు నిర్మించితివి. లోకంబునకు మంచి యుపకారంబు గావించితివి. కాని యా సూత్రములకుఁ గొందరువిపత్రిపన్నులు తమతమ మతానుసారముగా విపరీతార్థములం గల్పించుచున్నవారు. కావున నీవా సూత్రంబులకు నిశ్చయార్ధంబు దేటపడు నటుల భాష్యంబు రచియింపు మిదియే నా ప్రార్ధనయని పలికిన విని యమ్మహాత్ముండు నవ్వుచు నిట్లనియె. సూరివరేణ్యా! పూర్వ మొకప్పుడు కైలాశమందీ విషయమే వేలుపులును బ్రస్తావించిరి. వినుము. ముందు నాయంతవాఁడు నీకు శిష్యుండు కాఁగలడు. ఆ సర్వజ్ఞునిచే నభిమంత్రితంబగు కుంభము నర్మదానదీ ప్రవాహోదక మంతయుఁ ద్రుటిలోఁ బానముఁ జేయఁగలదు. అదియే నీకు గురుతు. ఆ పండితశేఖరుండే దుర్మతంబుననెల్ల ఖండించుచు మదీయ బ్రహ్మసూత్రములకు యథార్థముగా భాష్యముఁ జేయఁ గలఁడు. తన్మూలంబున నీ కీర్తియు లోకంబుల నెల్ల వ్యాపించును. ఇదియే కైలాసంబునందేలిన విషయమని చెప్పి యా వ్యాసమహర్షి యెందేనింపోయెను. శంకరా! అమ్మహర్షి యెరింగించిన విషయంబులన్నియు నీ యందు గనంబడుచున్నవి. నీవు సర్వోత్తముఁడవు. తత్వజ్ఞానంబున నిన్నుఁ బోలిన వారెందును లేరు. కావున నజ్ఞానంబునం గొట్టుకొను లోకము నుద్దరింపఁ బ్రయత్నింపుము. కాశి కరిగి యందు సూత్ర భాష్యము రచించుము. ఇది దేవసమ్మతము. అని పలికి నిర్మలమగు దృష్టి ప్రచారములచేఁ బవిత్రముఁజేయు వాఁడు వోలె శంకరాచార్యుం జూచెను.

అప్పుడు శంకరుండు తత్పాదపంకేరూహంబులకు నమస్కరింపుచుఁ దదనుజ్ఞగైకొని యెట్టకేఁ గదలి కతిపయప్రయాణంబులఁ గాశీపట్టణంబునకుఁ జనియెను. అందు గంగానదిం గృతావగాహుండై విశ్వనాథు నర్చించి యన్నపూర్ణం గొలిచి వటుకభైరవాదులు సేవించి మరియుంగల తీర్ధంబులనెల్ల మోక్షలక్ష్మింగొల్లాడి సద్గోష్ఠం గాలక్షేపము జేయుచుఁ గొన్ని దినంబులు కాశీపట్టణంబున వసించెను.

సనందుని ప్రవేశము

అట్లు శంకరాచార్యుండు కాశీపురంబున వసియించి యున్న సమయంబున నొకనాఁడొక విప్రకుమారుండు బ్రహ్మచారి బ్రహ్మతేజంబున దెసలం బ్రకాశింపఁ బద్మపత్రంబులఁ బరిఢవించి నేత్రంబులు నాజానుబాహువులం గలిగి చూచువారి కచ్చెరువు గలుగఁజేయుచు దురంతరంబగు సంసార సముద్రమును గురుకారుణ్య నౌకా సహాయంబున దాట నిశ్చయించి వైరాగ్యబుద్ధితో వచ్చి శంకరుని పాదంబులంబడి నమస్కరించెను. అప్పుడమ్మహాత్ముండతని లేవలెత్తి నీ వెవ్వడవుఁ నీ నివాసమెచ్చట నేమిటికిట్లు వచ్చితివి? నీ వృత్తాంతం బెరింగింపుమని యడిగిన నవ్వటూత్తముం డిట్లనియె. ఆచార్యా! నేను బ్రాహ్మణుడను. కావేరీనదీ విరాజితమగు చోళదేశము మదీయనివాసము మహాత్ములదర్శించు నుత్సుకతతో నిల్లు వెడలి తిరిగితిరిగి యిచ్చటికి వచ్చితిని. మత్పూర్వపుణ్యపరిపాకంబున నిన్నుఁ గనుఁగొంటి మహాత్మా సంసారసముద్రంబున మునిఁగిన జనులు నుద్ధరింపఁగంకణము గట్టికొంటివని నీ వృత్తాంతమాలించి నిన్నాశ్రయించ వచ్చితిని. అమృతఝరభంగములగు నపాంగములచె నన్ను వీక్షింపుము మద్గుణదోషంబుల విచారింపవలదు. వీఁడనర్హుఁడని నన్ను విడచితి వేని నిన్ను నిరవధిక కృపారధి వని యెవ్వరు స్తుతియింతురు! నీవు దీనదయాళుండ వైనచోఁ గారుణ్యంబున నన్ను రక్షింపకమానవు. మరుస్థలంబున వర్షించిన మేఘమునే యెక్కుడుగాఁ గొనియాడుదురు. నా మానసంబు భవదీయ సారస్వత సుధాసాగరజలంబులం గ్రీడింప నుత్సుకత్వముఁ జెందుచున్నది. ఆహా! భవదుక్తి ప్రవృత్తి యందు శ్రద్ధగల సుద్ధాద్వైతవేత్త సూర్వచంద్ర పురందరాది బృందారక పురగతంబులగు దివ్యభోగంబుల నతి నీచంబులు గాఁదలంచునుగదా! తావకవాక్యామృతంబు శ్రుతిపుటంబులం గ్రోలినవాడు విషయసుఖంబుల విషవల్లీఫలసఖంబులగాఁ దలంచును. రంభాఘనస్తనపరీరంభారంభోజ్వలంబగు పౌరందరలోకపుణ్యం బగణ్యంబుగా నెంచును. విరించి పదంబున ననాదరము వహించును.

అయ్యారే! పూర్వఖర్వతపఃపచేశిమఫలంబులు సంసార వైరాయమాణంబులు, సర్వాధిహరణంబులునగు తావకచరేణసేవానివహంబులు మామక మానసమాసక్తిఁ జెందియున్నది. దేవా! నేను సంసారబంధామయ విముక్తి కొరకు నిన్నాశ్రయించుచుంటి. ఈ తెవులు బాపుట కుదయించిన వైద్యుఁడవు నీవని యెల్లరుం జెప్పు చున్నారు. నన్ను రక్షింపుమని వేఁడుకొనియెను. శంకరార్యు లతని మాటలు విని సంతసించుచు వాని భక్తి విశ్వాసములు మెచ్చుకొని యొకనాఁడు యథాశాస్త్రముగా బ్రహ్మభావమతని కుపదేశించి సన్యాస మిప్పించెను. అతండే శంకరాచార్యుల ప్రథమశిష్యుడని వాడుకఁబడసిన సనందనుఁడు, తరువాత నాసనందనుచే నట్లు సంసారసాగరంబున మునుంగకుండ నుద్ధరింపుమని ప్రార్ధింపంబడి వామదేవాది శిష్యులఁ దురీ యాశ్రమ మను నోడ నెక్కించి కృపారసనౌకాదండ సహాయంబున దరింజేర్చుటయుఁ గ్రమంబున నతని వాడుక నలుదెసల వ్యాపించినది. మరియు నాయవిముక్త క్షేత్ర వాసులగు జనులాయతి పతి నారాధించి వక్రమార్గమున నడుచుచున్నను దమబుద్ధిని సాధువగు నట్లు నియమించుకొనిరి.

విశ్వేశ్వర దర్శనము

మరియొకనాఁడు కిరణ నికరంబుల ఖరకరుండువోలెఁ బ్రసూన సంతానంబులఁ బారిజాతంబట్లు శంకరయతి మిట్టమధ్యాహ్నంబునఫాలలోచన లోచనాగ్నింబోలె దపనకాంతశిలలు విస్ఫులింగజ్వాలలఁ గ్రక్కుచుండఁ జండభానుండు బ్రహ్మాండకరండమును మంగలము పగిదివేప నోపికతో గంగానదికి నాహ్నిక కృత్యముల నిర్వర్తింప నరుగుచు ముందర :-

సీ. నాల్గుకుక్కలకుఁ గంఠములఁ జిక్కపుత్రాళ్ళ
           దగిలించి ముడిచి చేతనుధరించి
    మెలితోలు మొలత్రాటఁ గలిపి కూర్చిననీలి
           గోచిముంగిటను చెంగులనుదీర్చి
    కఠినాంగకములందుఁ గలయఁబూసిన సురా
           రసము వాసనలెల్ల దెసలఁ గ్రమ్మ
    చింతనిప్పుల భంగి వింతగా నెరుపెక్కు
           కరకుచూపులు భయంకరముగాఁగ.

గీ. వారుణీ పానమత్తత మీఱఁ దూలి
   పడుచు లేచుచు నవ్వుచుఁ బాడికొనుచు
   వింతమాటల జనుల నవ్వించుచొక్క
   మాలఁడెదురయ్యె నయ్యతి మౌళికపుడు.

వానిరాక కేవగించుకొనుచు శంకరాచార్యుండు.

క. ఓరీ చండాలుండా
   సారాచారపార సంపన్నులమౌ
   పారులము మమ్మెరుంగవో
   దూరముగాఁ బొమ్మ దరియ దోషముసుమ్మా.

ఆ మాటలు విని యామాఁలడట్టె నిలువంబడి కడు నెరుపెక్కియున్న కన్నులెత్తి చూచుచు ఓహో! నీ యాకారంబుచూడఁ గొప్పవాఁడవువలెఁ గనంబడుచుంటివి. మాటలు విపరీతముగాఁ దోచుచున్న వేమి? నన్నేమిటికి దూరముగాఁ బొమ్మంటివి. సత్యజ్ఞానానందస్వరూపంబగు బ్రహ్మతత్వము సర్వాంతర్యామియై యుండెనని శ్రుతిశేఖరంబులు వక్కాణింపుచుండ నీకీభేదబుద్ధి యేమిటికిఁ గలుగఁవలయును. నీవు నిగమాంతంబులఁ జూచియున్నచో నిట్లనవని తలంచెదను. దండకమండవులందాల్చి కాషాయాంబరములు మేనం బొలుపుఁజెంద యతివేషంబు ధరించి కొందరు జ్ఞానగంధరహితులయ్యుఁ బ్రౌఢవాక్యంబులచే గృహస్తుల వంచింపుచుందురు గదా!

విద్వాంసుడా? నీవు దూరముగా దేహమును బొమ్మంటివా చెప్పుము. దేహమునంటివేవి యన్నమయమగు నీ దేహమునకును నా దేహమునకును భేదమేమి యున్నదిఁ దేహినంటివేని ప్రత్యగాత్మకు మునుపే భేదము లేదుగదా వీఁడు బ్రాహ్మణుం డనియు వీఁడు శ్వపచుండనియు నీవు ప్రత్యగాత్మయందు భేదవిచారము చేయఁ గలవాయేమి. సూర్యబింబము గంగయందును సురయందునుంగూడ ప్రతిఫలింపదా? అతిపవిత్రంబగు బ్రాహ్మణశరీరమునకును, నతిపాపిష్టుండగు ఛండాలు శరీరమునకును భేదములేదా? దానంజేసి దూరముగాఁ బొమ్మంటినని పలికెదవేని మునివర్యా! వినుము, అచింత్యుఁడు నవ్యక్తుండు ననంతుండు పరిపూర్ణుండగు పురాణపురుషుండు సర్వశరీరములయందు సూత్రముపగిది నుండుట యెరింగియు నిట్లనుట యనుచితంబ. కరికర్ణాంతవిలోలమగు నీ కళేబరమున నహంభావము నీకేటికిఁ గలుగవలయును. ముక్తిమార్గదర్శకమగు విద్యను సంగ్రహించియు నీకీ తుచ్ఛసంగ్రహేచ్చ గలిగిన దేమి? అన్నన్నా? మహామాయావియగు పరమేశ్వరుని యింద్రజాలంబున మహాత్ములుసైతము మునుంగుచుందురు గదాయని పలికి యూరకుండెను. వానిమాట లాలించి యత్యుదార చరితుండగు శంకరుండు విస్మయావేశ హృదయుండై యల్లన నిట్లనియె.

దేహభృత్ప్రవరా? నీవు పలికినదంతయు యథార్థమగును. ఆత్మవేత్తవగు నీ వాక్యంబులచే నీయందుఁ జండాలబుద్ధిని విడిచితిని. లోకంబునఁ గొంద రుపనిష దర్ధముల శ్రవణముచే దెలిసికొనుచున్నారు. కొందరు జితేంద్రియులు మననము జేయుచున్నారు. మరికొందరు నిదిధ్యాసనము జేయుచున్నారు. కాని యెవ్వరును బుద్ధియందు గల భేదభావమును విడలేకున్నవారు.

ఎవ్వనికి నెల్లపుడు జగంబంతయు నాత్మస్వరూపమున దోచునో యట్టి వాడు ద్విజుం డైనను శ్వపచుండైనను వందనీయుడని నా దృఢమైన నిశ్చయము. బ్రహ్మ విష్ణు శివాదులయందే చైతన్యంబు స్ఫురించుచున్నదియో యదియే పశుపక్షికీటకాదులయందును బ్రకాశించుచున్నది. అదియే నేను. అంతకన్న దృశ్యము మరి యొకటి లేదని సంతతము నెవ్వని మనంబున దోచుచుండునో వాడు ఛండాలుండై నను నాకు గురువగుగాక. పెక్కులేల? ఈ లోకంబున విషయానుభవకాలంబున విషయదర్శకమగుబోధ యెద్దిగలదో సర్వోపాధిసూన్యమగు నాతెలివియే నేను. కద్వ్యతిరిక్క్త మించుకయు లేదని యెవ్వని మనంబున దృఢ నిశ్చయము గలిగి యుండునో వాడెట్టివా డైనను నాకు గురువుసుమీ. నిన్ను దేహాభిమానంబున దూరముగా బొమ్మనలేదు. ఆత్మజిహీర్షచేతను బొమ్మనలేదు. తరుభయతాదాత్మ్యా ధ్యాసచే నట్లంటివి. నీవు నే జెప్పిన యట్టివాడవైనచో నాకు గురుండవే యని పలుకుచున్న సమయంబున.

సీ. సుమనస్తరంగిణీ కమనీయ జటలతో
           నాగరాట్సువిభూషణములతోడ
    నద్రికన్యాచంద దర్ధదేహముతోడ
           మృదుహాసలలితచంద్రికలతోడ
    నుద్యత్కరీంద్ర చర్మోత్తరీయముతోడ
           మకుటనిప్తార్ధశీతకరుతోడ
    ధవళప్రభాధగగ్ధగితగాత్రములతో
           సత్సాధనాఢ్యహస్తములతోడ.

గీ. విమల గోరాజ వాహనోత్తమముతోడ
    బ్రమథగణ సేవితాంఘ్రి పద్మములతోడ
    విశ్వనాథుండు మాతంగు విధమువిడిచి
    శంకరాచార్యనెదుట సాక్షాత్కరించె.

అట్లు ప్రత్యక్షంబైన యాజగద్రక్షకుంగాంచి శంకరుండు మేను పులకింప భయభక్తి వినయ విస్మయ సంభ్రమకలిత హృదయుండై సాష్టాంగ నమస్కృతులుగావించి ముకుళిత కరకమలుండై యిట్లు వినుతించెను.

గీ. దేహదృష్టిచే ద్వదీయదాసుల జీ
    వాత్మదృష్టిచేఁ ద్వదంసకుండ
    నాత్మదృష్టిచేత నైతి నీవే నేను
    దేవ! యిదియెనాదు దృఢమతలాస.

సీ. శాస్త్రమెంతయు సమంజసమగుఁగాని శ్రీ
           గురుకృపాగరిమ చేకూరకున్న
    చదువదేమిటికి నెంచంగనట్టియాచార్య
           కరుణగల్గినను జక్కఁగసుబోధ
    ముదయింపఁగా జేయకుండిన ఫలమేమి
           కలిగించుఁబోదాని గరిమనవియు

    నిరుపమ పరతత్త్వ నిరతత్వము వహింప
           వలయు గావున నట్టి పరమతత్త్వ.

గీ. లలిత సుజ్ఞానమునకు నాలంబసుడవు
    పరుఁడ వాద్యంతశూన్యుఁడ పురుమహత్త్వ
    ఖనివి యస్మదఖిన్నుడ పనుపమ ప్ర
    భావుఁడవు నీవు నీకిదే వందనంబు.

వ. అనియిట్లు గంభీరవాగ్గుంభనలచే నానందబాష్ప పూర్ణలోచనుం డై వినుతించు యతిపతింగాంచి జగత్పతి కృపారసంబు లొలుకు పలుకుల నిట్లనియె. వత్స! శంకర నీతపోధననైషికత్వము పరీక్షించుటకై యిట్లువచ్చితి. నీ యద్వైత బుద్దికి మెప్పువచ్చినది. వ్యాసుండువోలె నీవును మదనుగ్రహపాత్రుండవైతివి. అబ్బాదరాయణుండు వేదంబుల విభజించి యందు సమంచితముగా శిక్షితుండై బ్రహ్మసూత్రముల రచించెను. కాణాదసాంఖ్య పాతంజల ప్రభృతులగు మనంబులందు జక్కగా ఖండింపబడినవి.

కలిదోషంబున గొందరు మూఢమతులు తత్సూత్రసంతతులకు గుత్సితభాష్యంబుల విరచించిరి. అవియు బ్రబుద్ధులచే నిరసింపబడినవి. నీవు నిగమశిఖార్ధముల జక్కగా నెరింగిన ధన్యుడవు. గోవిందయతీంద్రులవలన దదర్థములన్నియు సంగ్రహించిన ప్రోడవు అన్నింటికిం దగియున్నవాడవు. కావున నిగమోద్భావితములగు యుక్తిప్రయుక్తులచే దుర్మతంబుల ఖండింపుచు సూత్రభాష్యము రచియింపుము. నీ రసించినభాష్యంబ నవద్యంబై పురందరాది బృందారక సందోహముచే సర్బనీయమై బ్రహ్మసభయందు సైతము పూజింపబడగలదు. మరియు నభినవగుప్త నీలకంఠ భాస్కరప్రభాకర మండనమిశ్రాది పండితమండనుల బ్రచండవిద్యావాదంబులనోడించి యద్వైతమతావలంబనులుగావింతువు. మోహధ్వాంత పద్మినేకాంతులగు ఛాత్రోత్తముల బరతత్త్వసరణి బరిపాలింపనందందునిలిపి పిమ్మట నన్ను గలిసికొందువని యనుగ్రహ పూర్వకముగా నెరిగించి వృషభతురంగుండు నిగమములతో గూడ నంతర్థానము నొందెను. శంకరయతిచంద్రుండు నతి విస్మితస్వాంతుడై యా వృత్తాంతమునే ధ్యానించుకొనుచు నంతేవాసి సంతతితోడ గంగానదికింజని స్నానాది నిత్యకృత్యములం దీర్చుకొని యా వసధంబుజేరి సనందనునితో నిట్లనియె. వత్సా! సనందన! సనకసనందనాది వందిత చరణారవిందుఁడగు నిందుమౌళియు సూత్రభాష్యము రచియింపుమని స్వయముగా నానతిచ్చెను. వ్యాసభట్టారకు నభిలాషయు నట్లెయున్నదనివింటి. గురునానతి మునుపే ప్రేరేపించుచున్నది. కావున నిఁకభాష్యము రచింపవలయు. అందులకు బదరికారణ్యము కడు బవిత్రమైనది. అది యేకాంతప్రదేశము. అందలి మహర్షులీ కార్యంబునకు సహాయ్యము సేయుదురని పలుకుచు శుభముహూర్తంబున శిష్యులతో బయలువెడలి యుత్తరాభిముఖుండై యొకచో నత్యుష్ణమై యొకచో నతిశీతలమై యొకచోవక్రమై యొకచో నుత్కుంటకమై మూర్ఖచిత్తంబువలె నొప్పుచున్న మార్గంబున నడచుచు నవ్యయుండు నక్రియుండునగు పరమాత్మ స్వరూపుండు తానయ్యును లోకరీతి ననుసరించి పాంథులతోఁ గూడ నడుమ ఫలంబులందినుచు నీరు ద్రావుచుఁ గూర్చుండుచుఁ బండుకొనుచు నతిప్రయాసమునఁ గతిపయ ప్రయాణముల బదరికారణ్యమున కరిగెను.

అందు గంగా ప్రవాహశీకర పరంపరోద్భూతములగు వాతపోతంబులచే గమనాయసంబుఁ బాయఁజేసికొని శంకరుండు శిష్యవర్గంబుతోఁ గూడ నందలి ముని బృందములచేత నర్చితుండై తద్గోష్టీ విశేషంబులచేఁ గొన్ని దినంబులఁ గడపెను.

భాష్య ప్రచారము

శ్రీ శంకరాచార్య శేఖరుండా బదరీవనంబునఁ బండ్రెండవ యేఁట సమాధి నిష్టులగు బ్రహ్మఋషులతోఁ గూడ బలుమా రుపనిషదర్థంబుల విమర్శించి షడూర్ముల చేతను సప్తధాతువులచేతను, విషయ పంచకముచేతను, అంతఃకరణ చతుష్టయము చేతను, అభివ్యక్తమగు శరీరతత్త్వ మెఱింగించుటకై భవ్యంబై మధురంబై గంభీరార్ధ యుక్తంబై యొప్పునట్లు సూత్రభాష్యము రచించెను.

గీ. కరగతంబగు నుసిరిక కాయవోలె
   మేటి యద్వైతతత్త్వంబుఁ దేటపరచి
   నిరసితాజ్ఞానమై మనోహరతనొప్పి
   శంకరాచార్యసూత్ర భావ్యంబుదనరె.

మఱియు నందయ్యతిచంద్రుండు బ్రహ్మవిద్యాప్రతిపాదకంబులగు నీచ కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీ, యైతరేయ, ధాందోగ్య, బృహదారణ్యాద్యుపనిషత్తులకును మహాభారత సారభూతంబులగు గీతలకును నిరవద్యము లైన భాష్యంబుల రచించెను. వానినేకదా ప్రస్థానత్రయమని వాడుదురు. పిమ్మట భారతమునకు సనత్సుజాతీయమను వ్యాఖ్య రచించెను. తరువాత నుపదేశసహస్రికా గ్రంథముల నసంఖ్యాకముల రచించి విద్వజ్ఞన గీయమానుడై పరమార్ధపదేశంబున లోకోపకారంబు గావించెను. శంకరుండను దినకరుండుదయించి ప్రకాశింపుచుండఁగ కుమతి ప్రణీతంబులగు వ్యాఖ్యాంధకారంబులు దుర్వాదిచంద్ర ప్రభతోఁ గూడ నాశనము నొందినవి. శంకరుండట్లు భాష్యములరచించి తన శిష్యులకుఁ బాఠములఁ జెప్పి తదర్థముల నెల్ల జక్కగా బోధించెను. నిరుపమాన భక్తి విశ్వాస సమంచిత చిత్తుండగు సనందనునికి సూత్రభాష్యమును ముమ్మారు పఠింపఁ జేసి యందలి గూడార్థము లెల్ల వివరించి వక్కాణించెను. దానంజేసి వామదేవాది శిష్యులు దమ యాచార్యునకు సనందనునియం దెక్కుడు పక్షపాతము గలదని మనంబులందుఁ జింతుల్లుచుండెడివారు. తదభిప్రాయముల గ్రహించి శంకరాచార్యుం డొకనాఁడు సనందనుని భక్తివిశేషమితర శిష్యుల కెఱింగింపఁదలంచి సనందనుండు గంగానది కవ్వలి యొడ్డున నుండఁగా వత్సా! సనందనా! వేగముగా నిటురమ్ము? పనియున్నదని కేకవైచెను.

గురువచనము వినినతోడనే సనందనుఁడు దురంతమగు సంసార సాగరమునే దాటింప సమర్థమగు గురుపాదభక్తి యీ చిన్ననదిం దరింపఁజేయదా? యని నిశ్చయ భక్తి విశ్వాసములతో గంగానది నీటిపై వడివడి నడుగులిడుచు నడువఁదొడంగుటయు నత్తటినీవరం బతని యడుగునఁ బద్మంబుల నూతగా నిల్పినది. దృఢ భక్తి తాత్పర్యములతో నప్పద్మంబులం బాదంబు లిడుచుఁ గ్రమముగాఁ దన యొద్ద కరుదెంచిన సనందనునిఁగాంచి యానంద విస్మయ కందళితహృదయారవిందుడై యయ్యతిచంద్రుం డతని గౌఁగిలించు కొని యవ్విశేష మెల్లరకుం దెలియఁజేయుచు వానికిఁబద్మపాదుండను నన్వర్థనామధేయం బొసంగెను. నాట గోలె యమ్మేటి పద్మపాదుండనఁ బరఁగుచుండెను.

శంకరయతి యొకనాఁడు శిష్యగణంబునకు భాష్యము పాఠము జెప్పుచున్న సమయంబున పాశుపతాదిభేదవాద మతస్థులు తద్భాష్యమును బూర్వపక్షము సేయుట శంకరుండు శ్రుత్యుదాహరణ పూర్వకముగాఁ దదాగమములు మధింపుచుఁ గులిశ కఠినంబులగు తర్క ప్రహరణంబులచేఁ ద్రుటిలో వారిని గాందిశీకులం గావించెను. అట్లు శంకర కంఠీరవంబు వేదాంతకాంతారంబున సందర్శింపుచుఁ దీక్ష్ణములగు యుక్తి నఖాగ్రదంష్ట్రలచే భయంకరమై కుమతవాది మత్తగజంబుల మదం బడగింపుచుండెను. ఘర్షణచ్ఛేదన తాడనాదులచే సువర్ణంబు మెరుగుఁజెందెడి పగిది వాదులచే మధింపఁ బడిన శంకరభాష్యంబు మిక్కిలి ప్రఖ్యాతి నొందినది. తద్భాష్యామృతమునుగ్రోలి పద్మపాదాది శిష్యు లొకనాఁ డిట్లు సంభాషించుకొనిరి.

పద్మపాదుఁడు - వామదేవా! మన గురువరుని యాత్మనిష్ఠాతి శయత్వమునకుఁ బరితుష్టి వహించి విశ్వనాథుండు శారీరక సూత్ర భాష్యమును రచించుమని స్వయముగా నానతిచ్చెనుగదా! అమ్మహానుభావుం డట్టి భాష్యమును రచించి కుమత వంకనిర్మగ్నమై వ్యాసమహర్షిచే లేవనెత్తబడిన శ్రుతిలక్షణమగు వృద్ధధేనువును భాష్య సూక్తామృత సేచనంబున సేదదేర్చి ప్రబలఁజేసెను. గాంచితివే?

వామదేవుఁడు — అన్నా ! శంకరదుర్గ వార్ధింబొడమి విబుధుల కమృత మిచ్చుచు గోసముదయంబునఁగు మతాంధకారంబుల నడఁగించు భాష్యచంద్రబింబము నివ్రచకోరముల సంతోషపరచుట యబ్బురమా!

పద్మ — అగు. శంకరార్కుని భాష్యప్రభ సజ్జనహృదయాజ్ఞములఁ బ్రకాశింపఁజేయుచు దమస్సముదయంబుల విదళింపుచుఁ బ్రతివాది ఘూకములఁ జీకాకు నొందించుచు బ్రకాశించుచున్నదిగదా?

వామ — గంగా ప్రవాహము పద్మనాభుని పాదంబునం బుట్టి సేవించిన వారిని ముంచుచున్నది. సూత్రభాష్య ప్రవాహము శంకరుని వక్త్రంబునం బొడమి సేవించిన వారిం దేల్చుచున్నది. ఇది యంత కన్న నెక్కుడుకాదా?

పద్మ - వ్యాసమహర్షి సూత్రకలితములగు న్యాయరత్న మాలికల నమ్మ దెచ్చిన నర్థలాభముఁ బడయమింజేసి బుధులు చిరకాలము గొనలేకపోయిరి. ఇప్పుడీ యతిపతి వలన నర్ధాప్తింబడసి తత్సూత్రరత్న మాలికచేఁ బండితులు మండితు లగుచున్నారు. వ్యాసుండును గృతార్థుండయ్యె. ఆహా? శంకరగురుని యౌదార్య మెంత యాశ్చర్యకర మైనదో చూచితివా!

వామ - బాగు. బాగు. లెస్సగా వర్ణించితివి! మఱియు వేదబాహ్యులచే మిథ్యావ్యక్తియని దూరముగాఁ ద్రోయఁబడి భట్టప్రభాకరాదులచే గర్మవియోజ్యుఁడగు పురుషునిం బరిచరింపఁదగునని పీడింపఁబడి పదార్థవంచనలం జేయునైయాయికాదులచే మృదువుగాఁ గ్లేశము నొందింపఁబడిన యుపనిషద్దేవి మన శంకరుగురుని శరణుఁజొచ్చి పరమానందమును బొందుచున్నది. అరసితివా?

పద్మ - తదభివ్యక్తుండగు పరమపురుషునిఁ జంపుటకై బౌద్ధుండు తరుమఁగాఁ గణాదుం డడ్డమువచ్చి యాత్మలాభము గలుగఁ జేసి యా వెరపుడిపెను. పిమ్మట భట్టపాదుండు నిజపదగమనమునకు మాత్రము మార్గముఁ జూపెను. తరువాత సాంఖ్యులు దుఃఖమును బోగొట్టిరి. పాతంజలులు ప్రాణధారణంబున నతనికిఁ బూజ్యత్వముం గలుగఁజేసిరి. ఇట్లు పెక్కు చిక్కులఁబడిన పరమపురుషునిఁ గరుణచే మనశంకరగురుండు పరేశునిగాఁజేసి యానందముఁ గలుగఁజేసెను.

అని బ్రహ్మసూత్రభాష్యమును బెక్కు తెరంగుల స్తోత్రములు సేయుచు వారు నిష్క్రమించిరి.

వ్యాస దర్శనము

మరియొకనాఁడు శంకరయతిచంద్రుండు గంగానదీ సమీపంబునం గూరుచుండి సూత్రభాష్యము శిష్యులకుఁ బాఠముఁ జెప్పుచుఁ దదీయశంకల కుత్తరంబులు సెప్పుచుండఁ గుతపకాలంబగుటయు నలసి స్నానముఁ జేయుటకై లేవఁ బ్రయత్నించుచున్న సమయంబున నొక వృద్ధ బ్రాహ్మణుం డచ్చోటికి వచ్చి దండంబూతగాఁబూని శంకరాభిముఖుండై నిలువంబడి అయ్యా! నీవెవ్వండవు? శిష్యుల నేమి చదివింపుచుంటివని యడిగెను. అప్పుడు శిష్యులా బ్రాహ్మణునితో నార్యా! ఈయన మాయాచార్యుండు. సమస్తోపనిషత్స్వతంత్రుండైన యీ శంకరాచార్యుని ప్రభావము మీరు వినియే యుందురు. దూరీకృతభేదవాదముగా నిమ్మహానుభావుండు బ్రహ్మసూత్రములకు భాష్యముఁజేసి యది మాకుఁ బాఠముఁ జెప్పుచున్నాఁడు అని చెప్పిరి.

ఆ మాటలువిని యా వృద్ధబ్రాహ్మణుండు ఏమేమీ! మీ గురుండు సూత్రభాష్యమునే రచించెనా! అయ్యారే! ఎంతచిత్రము! బాపురే! ఎట్టి మాటవింటిని! భళిరే! ఎట్టి పండితునిం గనుఁగొంటిని! ఆహా! నేఁడెంత సుదినము. అని పెక్కు తెరంగుల విస్మయమభినయించుచు శంకరునితో, స్వామీ! మీరు సూత్రభాష్యమును రచించితిరని మీ శిష్యులు చెప్పుచున్నారు. మీప్రజ్ఞాప్రభావంబు లనన్యసామాన్యములని కొనియాడఁ దగినదే! ఏదీ! ఒకసూత్రమును జదివి యర్ధమును జెప్పుఁడు! మీ సామర్ధ్యమెట్టిదో వినియెదంగాక యని యడిగిన శంకరుడిట్లనియె. ఆర్యా! నేను సూత్రార్ధముల లెస్సగా నెరిగినవాఁడనని చెప్పుకొనజాలను సూత్రార్థవేత్తలను గురువులఁగా నెంచి నమస్కరింపుచు నాయెరింగినంత వక్కాణించెద. ఏ సూత్రమున కర్థముఁ జెప్పవలయునొ తమరే వాగ్రుచ్చుఁడు. అని ప్రత్యుత్తర మిచ్చెను. అప్పుడా బ్రాహ్మణుండు, యతీంద్రా! మీ మాటలకు సంతసించితిని. వినుము. మూఁడవ యధ్యాయములో మొదటి సూత్రము.

సూ॥ తదంతర ప్రతిపత్తౌరంహతి సంపరిష్వక్తః ప్రశ్న నిరూపణాభ్యాం.

ఈమాత్రమునకు భాష్యములోనెట్టి యర్థము వ్రాసితిరో వక్కాణింపుఁడు. అని యడుగుటయు శంకరుండు తదంతర ప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్తః ప్రశ్నవిరూపణాభ్యాం అని పదవిభాగముజేసి జీవుఁడు ఇంద్రియములయొక్క యవసాదమున అనగా మరణసమయమున దదంతర ప్రతిపత్తౌ దేహాంతర సంక్రమణము విషయమై నంపదిష్వక్తం దేహబీజములగు భూతసూక్ష్మములతోఁ గూడికొని రంహితి వెళ్ళుచున్నాడు. ప్రశ్న నిరూపణాభ్యాం ఈ యర్ధము తాండీశ్రుతియందుగల గౌతమ జైమినులయొక్క ప్రశ్నోత్తరములచేఁ ప్రఖ్యాతమగుచున్నది.

ప్రశ్న - వేత్థయథా పంచమ్యామాహుతావాపః

ఉత్తరము — పురుషవచసో భవంతి.

ఆకాశము, మేఘము, భూమి, పురుషుఁడు, స్త్రీ, వీని నైదగ్నులుగా నిరూపించి ఈ యగ్నులయందు అపః అనగా శ్రద్ధ చంద్రుఁడు వర్షము అన్నము రేతస్సు. వీని నైదింటిని నాహుతులుగా నిరూపించి ఈయాహుతుల నాయగ్నులయందు హోమము సేయగా నేమగును! అని గౌతముఁడు ప్రశ్న వేయగా జైమిని పురుషవచసో భవంతి. పురుషుఁడని పిలువఁబడుచున్నాడు. అని యుత్తరముజెప్పెను. అనగా జీవుడు. దేహాంతరప్రతిపత్తికై దేహమునకు విత్తనములైన భూతసూక్ష్మములతోఁ గూడికొని తొలుత నాకాశములో శ్రద్ధారూపముగాఁజేరి (అనగా వివేకానుసారముగాననుట) చంద్ర కిరణములద్వారా మేఘములయందుం బ్రవేశించి వర్షరూపముగా భూమికివచ్చి అన్న రూపముగాఁ బురుషుని యందు బ్రవేశించి రేతోరూపముగా స్త్రీగర్భములోఁజేరి పురుషుఁడగుచున్నాడు. ఈయర్థమునే సూత్రకారులు వ్రాసిరని శ్రీశంకరాచార్యులు చెప్పగా విని నవ్వుచు నావృద్ధబ్రాహ్మణుఁడు ఓహోహో! నీ భాష్యము చాల బాగున్నది. ఇది యెక్కడి యర్ధము; ఎక్కడికల్పన చాలు! చాలు! అని యాక్షేపించుచు దేహాంతర ప్రతిపత్తియందుఁ గర్మవశంబున వృత్తిలాభము. వ్యాపులగు నింద్రియములకు నాత్మకుఁ గూడ గలుగుచున్నదా! కేవలము ఆత్మకే కలుగుచున్నదా? ఇంద్రియములు దేహమువలెనే క్రొత్తవియేకదా! అక్కడక్కడ భోగస్థానమును బుట్టించుచున్నవి. లేక మనస్సునైన జెప్పికొనవచ్చును అదియట్లుండ చిలుక యొకచెట్టు నుండి మరియొక చెట్టునకెగిరిపోవునట్లు జీవుఁడు ఒకదేహమును విడిచి మరియొక దేహమున కెగిరిపోవునా ఏమి? దేహాంతర ప్రతిపత్తియందు నింద్రియములు జీవునితోఁ బోవుననుట శృతివిరుద్దము వినుము.

శ్రు॥ యత్రాస్యపురుషస్య మృతస్యాగ్నిం వాగప్యేతివాతం
      ప్రాణశ్చక్షురాదిక్యం మనశ్చంద్రమసందిశశ్చోత్రమితి॥

మృతినొందిన పురుషుని యొక్క వాక్కు అగ్ని ప్రాణములు వాయువును చక్షుస్సులు సూర్యుని మనస్సు చంద్రుని శోత్రములు దిక్కులనబడును. అని శ్మృతి చెప్పుచున్నది అవి జీవునితో నెట్లుపోవును. అదియునుం గాక మీరు చెప్పినతాఁడి శ్రుతి యందుగల పంచమ్యామాహుతావాపః పురుషవచసో భవంతి యని నిర్ధారణ చేయుటకు వీలులేదు. ప్రథమాగ్నియందు నుదకాహుతి పరికల్పనము అసమంజసము. ద్యులోకప్రముఖములగు పంచాగ్నులు క్రమంబున శ్రద్ధాదిరూపములగు నాహుతులకు నాధారముగాఁ బరికల్పింపఁబడినవి. ప్రథమాగ్నికిఁ బ్రసిద్ధమగు శ్రద్ధనువిడిచి యప్రసిద్ధమగు నుదకమును జెప్పుట మీ సాహసము గాని వేఱొకటికాదు మఱియు జీవుఁడు భూతసూక్ష్మములతోఁగూడికొని పోవుననుట మీ కల్పితము. శాస్త్రసమ్మతము కాదని వాదించుచు శంకరోక్తమును నూరువిధముల ఖండించెను.

అప్పుడు శంకరులు చిరునగవుమొగంబునకు నగయై మెరయ, అయ్యా! తాముపన్యసించిన విషయంబులు సాంఖ్యబౌద్ధ వైశేషిక దిగంబరులయొక్క కల్పనలు గాని వేదసమ్మతములు గావు వినుండు. కేవలము బ్రశ్న ప్రతి వచనములలోని యప్ఛబ్ద ప్రయోగమువలన నొక్క యుదకములతోనే కూడికొనిపోవుచున్నాడని చెప్పరాదు అవి కలసియుండుటచే నట్లు ప్రయోగింపఁబడినది. కేవలము ఉదకములతోఁకూడిన దేహారంభమగునా! కాకున్నను నితరభూతాపేక్షచేత నుదకము లెక్కువగా నుండుటచేత నప్ఛబ్దము ప్రయోగింపబడినది. అప్ఛబ్ద ప్రయోగము వలన దేహబీజములగు భూతసూక్ష్మముల నైదింటియొక్క యుపపాదనము గలుగుచున్నది.

మరియు దేహాంతరప్రతిపత్తియందుఁ బ్రాణములయొక్క గతి శ్రుతికధితమైయున్నది.

శ్రు. తముల్క్రోమంతం ప్రాణోనుత్క్రామతి
    ప్రాణము త్క్రామంతం సర్వేప్రాణా అనుత్క్రామంతి.

జీవుండు దేహమును విడిచిపోవునప్పుడు వాని ననుసరించి ప్రాణము పోవును. ఆ ప్రాణము ననుసరించి యితర ప్రాణములు పోవును. ఆశ్రయములేక ప్రాణములయొక్క గమన మసంభవము. కావున దదాశ్రయములగు భూతసూక్ష్మముల యొక్క గమనమర్థాత్తు తోడఁబడుట లేదా? నిరాశయములై ప్రాణము లెక్కడికి బోవును? ఉన్నప్పుడెవ్వరికైనఁ గనంబడుచున్నవియా? మృతునిగా గాదు. లగ్న్యాదులఁ బొందుచున్నవని చెప్పిన శ్రుతి గౌణమైనది. కాని ముఖ్యమైనదికాదు. జీవము ప్రాణోపాధిశూన్యుఁడై యరుగునని చెప్పుటకు వీలులేదు. దేహాంతరమందుఁ బ్రాణములు లేక యుపభోగము సంభవింపదు కావున బాగాదుల కుపకారములై యధిష్టాతృదేవతలగుట మరణకాలమున నవి చేయు నుపకారము నివృత్తియైనది. కావున వాగాదు లగ్న్యాదులను బొందుచున్నవని చెప్పఁబడినది.

మరియు బ్రథమాగ్నియందు బంచమాహుతియగునప్చబ్దము ప్రయోగింపఁ గూడదంటిరి. అట్లు ప్రయోగించుట దోషముకాదు.

అప్ఛబ్దము ప్రథమాగ్నికి హోమద్రవ్యమగు శ్రద్ధాశబ్దాధి స్రాయముగాఁ బ్రయోగింపఁబడినది. మరియు

ఉదకములు పంచమాగ్నియందుఁబడి పురుషుఁడెట్లగునని ప్రశ్నవేయగాఁ బ్రథమాహుతికి హోమద్రవ్యమగు శ్రద్దను ప్రతివచనముగాఁ జెప్పినచోఁ బ్రశ్న యొక్కటియు సమాధానము మరియొకటియు కాదా శ్రద్ధ జీవునియొక్క మనోధర్మమై యున్నది. అది ధర్మీవలన విడదీసి హోమము చేయుట శక్యముకాదు. కావున అప్పడే శ్రద్ధాశబ్దముచేత గ్రహింపఁదగినది. శ్రద్ధవా ఆపః అనవదిక ప్రయోగము వలన శ్రద్ధాశబ్దమున కప్పులయందుపపత్తి చెప్పవచ్చును. పీలరూపముగా నరుగుచున్న యప్పుల సూక్ష్మత్వగుణయోగముచేత మాణవకునియందు సింహశబ్దమువలెనే వాని యందు నిష్పన్నమగుచున్నవి అని యీరీతి నుపన్యసించి వృద్ధబాహ్మణుని శంకల సహస్రముఖంబుల ఖండింపుచుఁదానుడివిన యర్థమును స్థిరపరచుకొనియెను. పిమ్మట శంకరుఁడు నుడివిన యర్ధముల వేయు మార్గముల ఖండించి యావృద్ద బ్రాహ్మణుఁడు స్వపక్షమును రక్షించుకొనియెను. ఈరీతి వారిరువురకు నెనిమిది యహోరాత్రంబు లేకరీతి సంవాదంబు జరిగినది. తదీయ విద్యామహత్త్వములకు విస్మయమును జెందుచు శంకరాచార్యుండెనిమిదవనాఁడు సాయంకాలమున రహస్యముగాఁ బద్మపాదుఁజూచి, వత్సా ఈ బ్రాహ్మణుని యాకారమున జూడ సామాన్యముగాఁ గనఁబడుచున్నది. ఈతండు సకల విద్యాపరిపూర్ణుండనుటకేమియు సందియములేదు. తప్పుత్రోవలఁ ద్రొక్కియుఁ బ్రసంగములో యుక్తులచేఁ దన వాదమును నిలుపుకొనుచున్నవాఁడు. వీనింగెలుచుట యెట్లో తెలియకున్నయది. ఉపాయమేమని యడిగినఁ బద్మపాదుండు, మహాత్మా! ఈతండు బ్రాహ్మణమాత్రుండుగాడు. యుష్మత్పాండిత్యప్రకర్షము నరయు తలంపుతో వ్యాసమహర్షి యిట్టివేషముతో నరుదెంచెనని తలంచెను. కానిచో నొరునకిన్ని దినంబులు మీతో వాదించుటకు శక్యమా! నీవు శంకరుండవు. అతండు నారాయణుండు మీరిరువురు ప్రసంగము సేయుచుండ మాబోటి కింకరుల మేమి దెలిసికొనఁగలము. మీయిరువుర ప్రసంగములు వినుచుంటిమి. పూర్వపక్ష సిద్ధాంతముల ప్రసక్తియించుకయు మాకు బోధపడలేదు. మీరు మహానుభావులకు మీమహత్వము మీకే యెరుకయని పలికిన విని శంకరుండు పులకాంకురంబులు మేనంబొడసూప నతండు వ్యాసుండుగా నిశ్చయించి నిటల తటఘటితాంజలిపుటుండై యిట్లని నుతించెను.

మ. యతిరాట్చంద్రమ! నీకు నా రచితమౌ నద్వైతభాష్యంబు స
     మ్మతమేనిన్భవదీయ సూత్రములకు న్మన్నించి నా తప్పు ల
     ద్భుత విద్యుద్విల సజ్జవామకుటమై స్పూర్జద్వినీలాంబు దా
     యత చారుద్యుతి భాసమానమగు నీ యాకారమున్ జూపవే.

అని ప్రార్థింతునంతలో నమ్మహానుభావుండు.

సీ. కనకవల్లీ లసద్ఘసజటాతతివానిఁ
          దటిదంచితాబ్ద సుందరము వాని
    జ్ఞానము ద్రావిరాజత్క రాబ్జము వానిఁ
          బ్రవరదంద కమండలువులవాని
    రుద్రాక్షమాలికా కుచిరవక్షమువాని
          వసితాజినోత్తరీయంబువాని
    నద్వైతతత్త్వ విద్యావేత్తయగువాని
          ఛాత్రసంఘాధ్య పార్శ్వములవాని

గీ. నతిశయకృపాకటాక్షవీక్షామృత ప్ర
    వర్షధారానివారితాప్తజనతాను
    తావు విభజితనిగమకలాపుఁదాప
    ననివహోల్లాసుఁ వ్యాసుఁ గన్గొనియె నెదుట.

గీ. కని వినేయులతో నెదుర్కొనితదీయ
    చరణపద్మములకు మ్రొక్కి శంకరుండు
    పూతచరితుని సత్యవతీతనూజుఁ
    బలికెభయభక్తి వినయసంపదచెలంగ.

మహాత్మా! నేఁడుభవదీయ దర్శనమునంజేసి మేమెల్లరం గృతార్ధుల మైతిమి. పరోపకారవ్రత దీక్షితుండవైన నీకు లోకంబులం బవిత్రంబులఁ జేయుట యుచితంబుగదా? శ్రుత్యర్థగర్భంబులగు నష్టాదశపురాణంబులు రచించుట నీకుఁగాక యొరులకు శక్యంబే? నిర్దుష్టముగా బద్యద్వయము రచించుట దుష్కరము కదా? అదియునుంగాక కలియుగంబున బ్రాహ్మణులు మందబుద్ధిలని యెఱింగి వేదంబుల విడదీసితివి. త్రికాలవేదివగుట భవిష్యత్కథావిశేషముల వర్ణించితివి. వేదంబులు వేదాంగములు భారతాది గ్రంథములు పురాణములు భవదీయ వాఙ్మయంబులు గదా? నిగమంబులెవ్వని సచ్చిదానంద స్వరూపునిఁగా వర్ణించుచున్నవో యట్టి నారాయణుండవు నీవేకదాయని యనేక ప్రకారముల స్తుతియించుటయు వ్యాసుండు తదీయభక్తి విశేషంబుల కుల్లాసంబు వహించి యల్లన నిట్లనియె.

యతిసార్వభౌమా! నీవు మావలెనే ప్రఖ్యాతుండవైతివి. నీదగు నఖండ పాండిత్యము దెలిసికొంటిని శుకుండువలె నీవు నా కత్యంత ప్రీతికరుండవైతివి. శిష్యులతోఁ గూడ నిఁకభ్రమను బొందకుము. నీవు మదీయ సూత్రములకు భాష్యము రచించి నాఁడవని చంద్రశేఖరుని సభయందు సిద్ధులవలన విని మిగుల సంతసించుచు నిన్నుఁ జూడవచ్చితి నీరనించిన భాష్యంబు నాకు మెప్పు వచ్చెనని పలికిన విని శంకరుండు హృదయంబునం బొడమిన సంతోషమున కవకాశము చాలక రోమాంచ రూపంబునఁ బొంగుచున్నదో యన మేను గగుర్పొడగద్గదకంఠంబుతో నిట్లనియె. మహాత్మా! భవదీయ శిష్యులు జైల వైశంపాయనాది మహర్షులు లోకాతీతులై యున్నవారలు. వారి యెడ నే నెంతవాఁడ ఇట్టి దీనుని యందు దయజూపి ప్రసన్నుడవైతివి. నీ కంటె గృపాళుండు గలడా! ఆహా! సకల నిగమశేఖరార్థీ విశేషకమగు భవదీయ సూత్ర చయమను సహశ్రాంసునకు భాష్య ప్రదంబున నీరాజనమిచ్చి యధికుండనని గర్వ పడుచుంటి నెంత సిగ్గులేదో కదా! అయినను భవదీయ శిష్య ప్రశిష్య భావబుద్ధిం జేసి యీ సాహసంబునకుం బూనుకొంటి. కావున నాదరంబున మదీయ సూక్తిదురుక్తి జాలంబుల సవరింప వేడుకొనుచున్నాఁడనని పలుకుటయు నప్పారాశార్యుం డనురాగముతో శంకరుని చేతిలో నున్న పుస్తకమును రెండు చేతులతో స్వీకరించి గంభీర గణంబులచే మనోహరంబై యున్న యా భాష్యమంతయు లెస్సగా విమర్శించెను. సూత్రానుసారములగు మృదువాక్యములచే నర్థములందెలుపుచు స్వపద విశేషంబుల చేతనే పూర్వపక్షముల నిరాకరింపుచు సిద్ధాంత యుక్తిప్రయుక్తులచేఁ దదర్ధంబులనిలుపుదు నొప్పుచున్న మా భాష్యమంతయుంజూచి పరమానందము నొంది సత్యవతీ నందనుండతని కిట్లనియె.

తాతా! శంకర! గురువినీతుండవగు నీ విషయమేమియు సాహసముఁ జేయలేదు గాని మదీయ సూక్తి దురుక్తి జాలముల సవరింపుమని నన్నడుగుటయే సాహసమని తలంచెదను. మీమాంసకాగ్రేసరుండ నై సకలవ్యాకరణంబులను బూర్తిగ నెఱింగితివి. అదియునుంగాక గోవింద శిష్యుండవైన నీ ముఖమునుండి దురుక్తిజాల మెట్లుగా వచ్చెడిని నీవు ప్రాకృతుఁడవు గావు. సకలార్థముల నెఱింగిన మహానుభావుండవు. బ్రహ్మచర్యము నుండియే సన్యసించి సూర్యుం డంధకారంబుపగిది విషయసుఖంబుఁ బరిభవించితివి. బహ్వర్దగర్భంబులు గూడ భావంబులు నగు మదీయ సూత్రములను వివరింపనీకుఁగాక యొరులకు శక్యమా! స్వభావముచేతనే తెలియశక్యముగాని యా సూత్రముల కర్థముల నెవ్వఁడెఱుంగును. సూత్రకర్తక్లేశము కన్న భాష్యకర్తకష్ట మెక్కడని దేవతలు చెప్పియున్నారు. మదీయభావంబుల నెఱింగి సాంఖ్యాది శాస్త్రములచే విపరీతమై యున్న వేదాంత మార్గమును జక్కఁబరచుటకు నపరశివుండవగు నీకుఁ గాక యొరులకు శక్యమా? సర్వజ్ఞా! మదీయ సూత్రజాలమున కింతకుఁబూర్వ మెందఱో పండితులెన్నియో వ్యాఖ్యానములు రచించి యున్నారు. ఒక్కటియైనను నీ భాష్యమువలె మదీయహృదయానుగుణ్యమై యుండలేదు. నీ వన్నిటికింజాలినవాఁడవు. గావున వేదాంత విద్యను బుడమియంతయు వ్యాపకము సేయుము. భేదవాదులగు విద్వాంసుల నోడింపుము. సానుబంధములగు గ్రంథముల రచింపుము. నీకు విజయ మగుంగాక నేను పోయి వచ్చెదనని పలుకుచున్న వ్యాసునకు వినయపూర్వకముగా శంకరుండిట్లనియె.

స్వామీ! నీ యనుగ్రహంబున భాష్యములఁబెక్కు రచియించితిని. శిష్యుల బఠింపఁజేసితిని కుమతవాదుల నోడించితిని. ఇక నాకుఁగర్తవ్యమేమి యున్నది? ముహూర్తమాత్రంబీ మణికర్ణికాక్షేత్రంబున వసియింపుఁడు. మీ మ్రోలను బ్రాణంబులువీడి కైవల్యంబు నొందెదను కాలంబు సమీపించియున్నది. ఆజ్ఞయిండని పలికిన విని వ్యాసభట్టారకుండొకింత చింతించి సౌమ్య! అట్లు కావింపవలదు. ప్రౌఢవిద్యాశాలులగు పండితులు గొందఱు పుడమియం దద్వైతవిద్యావిరోధకులై యున్నవారలు వారి నెల్లర జయించు నిమిత్తము కొంతకాల మీ పుడమియందు నీవుండవలయును. లేనిచోఁ దల్లి లేని పిల్లవాని యునికివలె మోక్షేచ్చ దుర్లభమగును.

యతివరేణ్యా! ప్రసన్న గంభీరార్థములతో నొప్పుచున్న భవత్ప్రణీతంబగు భాష్య ప్రబంధంబుఁ జూచుటవలనం గలిగిన యానందము నీకు వరమిమ్మని నన్నూరక ప్రేరేపించుచున్నయది. ఎనిమిది యేండ్లు యాయువు నీకు విధినిరూపితమై యుండఁ నీ బుద్ధిబలంబున మరియంతయాయువు సంపాదించుకొంటివి ఇటుపిమ్మట వెండియుం బదియాఱేఁడుల యాయు వీశ్వరాజ్ఞచేఁ గలుగునట్లు నీకు వరమిచ్చితిని నీరచించిన భాష్యం బాచంద్రతారకంబై వసుధరఁ దిరంబై యుండుగాక. నీవీ పదియాఱేఁడులలో దేశాటనము చేయుచు. విరోధిగర్వాంకురంబులు నిర్మూలింప జాకరూకంబు లగు యుక్త్యనీకములచే నద్వైద విద్యాపరిపంథులగు భేదవాదుల నభేదబుద్ధులం గావింపుము. అని పలుకుటయుం గులుకుచు నయ్యతితిలకుం డిట్లనియె.

స్వామీ! పరసవేది సంపర్కంబున లోహంబు బంగారమైన తీరున భవదీయ సూత్రసంబంధ వశంబునం జేసినా భాష్యంబువన్నెకెక్కి ధరణిఁజిరప్రచారంబు వహించుచున్నయది. నాపుణ్యమేమని చెప్పఁదగినది. దేవర యాజ్ఞమెట్లోయట్లుకావించి కృతార్థుండయ్యెదనని పలికి యతని పాదంబులకు నమస్కరించెను. అమ్మునిచంద్రుం డతని దీవించుచు నట్టివరంబులిచ్చి యంతర్ధానము నొందెను. తద్వియోగచింతా సంతాపంబు కొంతసేపు స్వాంతంబున వేధింప శంకర హరికాంగ పారాశర్యుని శాసనంబునంజేసి దిగ్విజయంబు సేయ నిశ్చయించి శిష్యసహితముగా శుభముహూర్తంబున గాశీపురంబు బయలువెడలి కతిపయ ప్రయాణంబుల దొలుత బ్రయాగకరిగి తన్మహత్త్వం బంతఃకరణగోచరము జేసికొని పద్మపాదునితో నిట్లనియె.

వత్సా! పద్మపాద? యిమ్మహాక్షేత్రం బొకదినంబున వసించిన వారికి యాగంబులకన్న బ్రకర్షఫలం బిచ్చునది కావున బ్రయాగ యని యన్వర్ధనామంబు వహించుచున్నది. మునింగినవారి దేహంబుల సితాసితంబుల జేయు తలంపుతో నిందు మందాకిని కాళిందీనదితో గలసికొనుచున్నది చూచితివా? యిందు మునింగిన మనుజులు దివ్య శరీరముల దాల్చి యాధివ్యాధుల నెరుంగక పరమసౌఖ్యంబుల జెందుదురని వేదములో జెప్పబడియున్నది సుమీ! మాఘమాసంబున మకరంబున హిమికరుం డున్నతరి నేతక్షేత్ర ప్రభావం బింతయని వక్కాణింపదరంబుగాదు. ఇమ్మహానది పురవిరోధి జటోపరోధంబునం గోపించి తజ్జటావరోధంబు తనకు గలుగునని యెరుంగక యట్టి వాండ్రం బెక్కండ్రను సృష్టింపుచున్నది కంటివే? జడప్రకృతులు రాబోవునది యెరుంగరుగదా? ఈసురాపగ, సన్మార్గవర్తన ప్రసక్తిగలది యైనను నిత్యము నపవిత్రములగు నస్థుల నేమిటికి స్వీకరింపుచున్నదో తెలిసికొంటివా? ఇందుమునుంగు సజ్జనుల దేహము లలంకరించు తలంపుతో సుమీ! అని యనేక ప్రకారంబుల దన్మహత్త్వ మగ్గించి శిష్యుల కెరిగించుచు నయ్యతిసత్తముండు త్రివేణికరిగి శాటీపటంబు కటిం బిగియించి వేణుదండంబు పైకెత్తియఘమర్షణ స్నానము లాచరింపుచు దన్నుగన్న తల్లిని స్మరించుకొనుచు ననుష్టానంబు దీర్చికొనిన పిమ్మట గల్హారశీతంబులగు వాత పోతంబుల మేనికి హాయిసేయ శిష్యులతో వినోద కథాకాలక్షేపము సేయుచు గొంత సేపు తత్తీరసైకతతలంబున విశ్రమించెను.

భట్టపాదుని కథ

సీ. వేద మెక్కుడటంచు వాదించి యెవ్వాడు బెనుకొండ తుదినుండి పృథివి కుఱికె
    సురగణం బెవ్వానికరుణచే నవహవిర్భాగంబురను దృప్తి బడసె మిగుల
    ధరణిసర్వామ్నాయతంత్రస్వతంత్రుడై యేసూరికీర్తి నెల్లెడల నిలిపె
    బటుశక్తిబౌద్ధచార్వాకాదిమతముల దండింపజేసె నే పండితుండు

గీ. అట్టి శ్రీ భట్టపాదుండు ప్రాప్తమైన
    గురుమథనదోషమును బాపుకొనుట కిప్పు
    డురుతుషాగ్నిఁ బ్రవేశించుచున్నవాడు
    అహహ! విజ్ఞానపరమార్ధుఁ డగుట జేసి.

అని యెవ్వరో చెప్పుకొనుచుండ విని యదరిపడి లేచి శంకరుండు శిష్యులతో గూడ నమ్మహాత్ముం డెక్కడ నెక్కడనని యడిగి తెలిసికొని సత్వరముగా నచ్చటికిం జని యందొకచో బ్రోగుగానిడిన యూకపై శయనించి యందుంచిన యనలంబును ప్రథితప్రభావులగు ప్రభాకరాదిశిష్యులు చుట్టునుం బరివేష్టించి కన్నీటిధారలచే దడుపుచుండ ధూమాయమానంబగు తదనలంబున నొడనెల్ల గమలినను వదనకమలంబు మాత్రము వికాససూన్యముగాక యొప్పుచున్న యబ్భట్టపాదుం గాంచెను. వేదమార్గరక్షకుండగు నా సూరివరేణ్యుండును దూరంబున నోరచూపులచే దనదెస కరుదెంచు నప్పారికాంక్షిం గాంచి యతని నంతకుమున్ను జూచి యెరుంగుకున్నను దదీయప్రఖ్యాతి వినియున్నవాడు గావున గురుతు పట్టి పట్టరానిసంతోషంబుతో దుషానలబాధం బాటింపక తన శిష్యగణంబులచే శిష్యులతోగూడ శంకరాచార్యున కిచ్చగింపకున్నను నపూర్వాతిథిసత్కారముల గావింపజేసెను. అట్లర్చితుండై శంకరుండు గుశలప్రశ్నానంతరంబున దనరచించిన సూత్రభాష్య మా విద్వాంసునికి సంక్షేపముగా జదివి వినిపించెను. దాని విని విస్మయమునొందుచు నప్పండితపురందరుండు ఆహా! భవదీయభాష్యప్రభావంబు వర్ణింప వాక్పతికైన వశంబా; అందు మొదటి యధ్యాయనంబునంగల నిబంధన లేతన్మాత్రములే? అది యొకండే యెనిమిదివేల వార్తకములతో నొప్పియుండవలయుం గదా! నే నీదీక్షయే వహింపకుండినచో నీ భాష్యంబునకు నద్వార్తికంబు రచియించి కృతార్థుండ గాకపోవుదునా! అట్టి యోగము నా కేల తటస్థించును. అది యట్లుండె మీవంటి మహాత్ముల దర్శన మగుటయే దుర్ఘటము. విశేషించి యట్టిసమయంబున లభించుట మదీయపురార్జితభాగధేయంబు గదా! సంసారసాగరంబున మునింగియున్నవారిం దరిజేరుటకు మీవంటి యుదారవృత్తుల సాంగత్యముగాక మరియొకసాధన మేమి యున్నది. చిరకాలమునుండి మిమ్ము జూడవలయునని నాకు దలంపు గలిగియున్నది. నేడుగదా నా మనోరథము సఫలమైనది. నరులకీ సంసారంబున నభిమతంబు దీరుట దుర్ఘటము. కాలం బొకప్పుడు మంచియు నొకప్పుడు చెడ్డయుం గలుగజేయును. ఒకప్పుడు కలుగజేసి విడఁజేయును. పెక్కు లేల! సుఖాసుఖంబులు కాలకృత్యములు గదా!

ఏను వేదమునకు గర్మమార్గము నిర్ణీతము సేసితిని. నైయాయికుల యుక్తిజాలముల ఖండించితిని. విషయసుఖంబుల ననుభవించితిని. కాని యీ కాలప్రవృత్తిని మాత్ర మతిక్రమింపలేకపోయితిని. నరులకు గాలానుగుణ్యమైన బుద్ధి బొడముచుండును. వేదంబులకు స్వాతంత్ర్యము కల్పించి యీశ్వరు నిరాకరించితి. గురుద్రోహంబు గావించితి. నీ రెండుపాతకంబుల బాయుటకై తుషానలంబు బ్రవేశించుచున్నవాడనని పలికిన విని శంకరుడతి విస్మయము జెందుచు మహాత్మా! నీవు గురుద్రోహ మేమిటికి గావించితివి. తద్వృత్తాంతము వక్కాణింపుమని యడిగిన నతం డిట్లని చెప్పదొడంగెను.

భట్టపాదుని పూర్వ వృత్తాంతము

ఏను జనించువరకు జగంబంతయు బౌద్ధమతము వ్యాపించియున్నది. వైదికతంత్రము లాకాశకుసుమంబులై యున్నవి. అట్టియెడ నేను స్వల్పకాలములో వేదవేదాంగముల జదివి క్రమ్మర వేదమార్గము జక్కజేయవలయునని తలంపుతో నుద్దతులైయున్న సుగతు బరాజితులం గావించినంగాని యిట్టిపని నెరవేరదని నిశ్చయించి యచ్చటచ్చట వారితో బ్రసంగములు సేయుచుంటిని గాని తదీయమతశాస్త్రప్రవృత్తి దెలియమింజేసి నాకు వారితో మాటాడుటయే దుర్ఘటమైనది అప్పుడు నేను వినీతవేషముతో నొక బౌద్ధమతగురువు నొద్దకు బోయి అయ్యా! నేను బౌద్ధమతస్థుండ. దచ్చాస్త్రంబులన్నియు నాకు బోధింపుడని వేడుకొనిన నిక్కువమనుకొని యాసుగతగురువు తన శిష్యులతో గూడ దన్మతమర్మంబులన్నియు నాకు బోధించెను.

ఒకనా డాభసయందు బక్షబుద్ధిగల బౌద్ధుడొకడు నిలువంబడి యోహో! వేదములు ప్రత్యక్షప్రమాణవిరుద్ధముగా నీశ్వరు డెవ్వడో యున్నాడని చెప్పుచున్నవి. తద్వాక్య మెంత సత్యమో చూడుడు ఉన్నవాడు కనబడకుండునా! మొదట గర్మ చేయుమని చెప్పి తరువాత గర్మతో నేమియు బ్రయోజనము లేదని చెప్పుచున్నది. సీ! యింతయసత్యవాది యెందైన గలదా! యిట్టిదానిమాట ప్రమాణముగా దీసికొని జీవహింసల జేసెడు వైదికుల నేమి చేసినను దోసము లేదు కదా! కటకటా! యింత పాడుశాస్త్ర మెందునులేదు. వైదికులం జూచిన మహాపాతకములు రాగలవు అని యూరక వేదదూషణ చేయుచు నుపన్యాసము జెప్పెను.

ఆ మాటలు విని తథాగతులందరు జయబుద్ధా! యని పలుకుచు గరతాలంబులు వాయించిరి. కర్ణకఠోరంబులగు నా వాక్యములు నేను విననొల్లక చెవులు మూసికొని కన్నీరు విడువజొచ్చితిని. అప్పుడు నా ప్రాంతమందున్న బౌద్ధశిష్యులు నా దుఃఖమును జూచి శంకించుకొనుచు దమగురువుతో, అయ్యా! వీడెవ్వడో వైదికుండట్లు తోచుచున్నాడు. మన మతధర్మములం గ్రహింపవచ్చెను గాబోలును. వేదనిందావాక్యంబులు విని యుబ్బక కన్నీరు విడిచినాడని యతనికి బోధించిరి. అదిమొద లాయుపాధ్యాయుడు నాయందు నమ్మకము విడచి మర్మముల జెప్పుమానుటయేకాక యొకనాడు నేను నిద్రించుచుండ నెత్తుగల మేడపైనుండి నన్ను నేలంబడ ద్రొబ్బించ్చెను. పడియెడుసమయంబున నాకు దెలిసివచ్చినందున వేదమే ప్రమాణమైనచో నే నీపతనబాధం బొరయక జీవింతునని పలికితిని ప్రమాణమైనచో నని సందేహపూర్వకముగా బలుకుటంజేసి నా కేమియు దెబ్బ తగులక యొకకన్ను మాత్రము పోయినది. అది విధి కల్పనయని నిశ్చయించి నేను సుగతమతమర్మము లన్నియుం గ్రహించియున్నవాడ గావున బౌద్ధుల నవలీల జయింప సామర్ధ్యము గలిగియున్నందున వారిం బరిభవింపు నుపాయం బాలోచించి యప్పుడు రాజుగానున్న సుధన్వునొద్దకుం బోయితిని. బౌద్ధులా మహీపతిగృహంబున శిష్యప్రశిష్యసహితముగా బ్రవేశించి యతనికి స్వమతబోధయంతయుం జేసి వైదికుల జేరనీయవలదని జెప్పియున్నను మదీయవిద్యాపాటవంబు దేటపరచి యతని మన్ననలం బడసితిని.

బౌద్ధమతస్తులచే నిండియున్న యప్పేరోలగంబున నానృపాలునిమ్రోల నేను వసియించి యున్న సమయంబునఁ దత్సమీపవిటపి నాశ్రయించియున్న కోకిల యొకటి మనోహరముగాఁ గూయుటయు నారవము నెపముగాఁ జేసికొని యీ పద్యమునుం జదివితిని.

క. పికమా! నీ కలశ్రుతిదూషకదుర్ఘోషకములు మలిన సంగతిగలనీ
   చక కాకవితతిరతి గలుగకయున్నం బొగఁడబడుదు గాదె ధరిత్రిన్.

అని చదువుటయు భావగర్భితమైన నా పద్యమును విని షడభిజ్ఞులు చరణతాడితంబగు భుజంగమంబు పగిది రోజుచు ఔరా! యీ వైదికుండీ సభాంతరంబున నిర్భయుండై యెంతమాట పలికెను! మనము కాకులమఁట మనసాంగత్యము లేనిచో నీ రాజు స్తోత్రపాత్రుండగునట. ఎట్టి మాటల వింటిమి! వీనిం బరిభవింపక పోనీయరాదని పలుకుకొనుచు నం దుద్దండులైనవారలు నాతో నప్పుడు ప్రసంగమునకుఁ బూనుకొనిరి. ఏనును నుద్దండపాండిత్యప్రకర్షంబుఁ జూపి యుక్తికుఠారంబున బౌద్ధసిద్ధాంతశాస్త్రవృక్షంబుల నఱకుచు జీర్ణంబులగు తద్గ్రంథంబు లింధనములుగాఁ జేసి వారి క్రోధానలజ్వాలల వర్థిల్లజేసితిని. అప్పుడు బౌద్ధులు మోములు జేవురింపఁ దెంపుతో నా వాక్యంబులు పూర్వపక్షంబులఁ జూపుటయు నే నవలీలగా సిద్ధాంతముఁ జేయుచుండగా నప్పుడు పాతాళము భేదిల్లునట్లు పెనురవము బయలు వెడలినది అప్పుడు విజృంభించి నేను తదీయసర్వజ్ఞపదంబు సహింపక కర్కశతర్కవాక్యప్రసంగములచే వారిఁ ద్రుటిలో నిరుత్తరులం జేసితిని. బౌద్ధులు దర్పంబు లుడిగి యూరకున్నంత నమ్మేదినీకాంతునకు నేను వేదప్రభావమంతయు బోధించిన విని యతండును విస్మయము నొందుచు నిట్లనియె. ఆర్యులారా! జయాపజయంబులు విద్యాయత్తంబు లగుటం జేసి దీనివలన మతప్రాముఖ్యము తేటపడనేరదు. దైవతంత్రంబున దత్ప్రాధానత్వము బరీక్షించెదకాక. ఏ మతస్థుడు కొండశిఖరంబునుండి నేలంబడి యక్షతుండై యుండునో యాతనిమతమే నాకు సమ్మతమని పలికిన విని బౌద్ధు డొండొరుల మొగములు జూచుకొన దొడంగిరి. అప్పుడు నేను చేతులెత్తి నృపాలోత్తమా! సత్వరముగా నే నట్లు జేసి మన్మతప్రాబల్యంబు జూపించెదం బరీక్షింపుమని పలుకుచు వడివడి బోయి యొకయున్నతపర్వత మెక్కి యకల్మషుని వేదపురుషుని భక్తితో ధ్యానించుచు వేదమే ప్రమాణమైనచో నందు దైవమే కలిగియుండినచో నా కించుకంతయు దెబ్బ తగలనేరదని పలికి దుమికితిని. నిగమము తన్ను నమ్మియున్నవాని నేల రక్షింపకుండును.

అప్పుడు నేను దూదిబంతియుంబోలె నేలంబడి కసుగందక చెక్కు చెమర్పక యుంటిని. మేఘరవంబు విని నికుంజంబుల నుండి బయట వచ్చిన మయూరంబులచందంబున మదీయవార్త నాలించి దిక్కులనుండి పెక్కండ్రు బ్రాహ్మణు లచ్చటికి వచ్చిరి. అ ట్లక్షతుడనైయున్న నన్నుఁ జూచి యన్నరపతి శ్రుతిప్రభావంబు వేతెరంగుల గొనియాడుచు ఖలసంపర్కము వహించియున్న తన్ను బెక్కుగతుల నిందించికొనియెను.

చ. అకట! మహాప్రభవ సముదంచితముల్ నిగమంబు బట్టి వా
    నికిఁగల సారముం దెలియనేరక యూరక నింద సేయు నా
    స్తికుల మహాత్ములంచు గణుతించి మతిం బరమార్థ మేమి గా
    నక చెడిపోయితిన్ విబుధనాథ! యడింగితి నేఁడు నీ కృపన్.

అని పలుకుచున్నసమయంబున నాసౌగతులా నృపతిలకునితో నరేంద్రా! ఇంతమాత్రమునకే మీ రామత ముత్తమమని నిశ్చయింపవలదు. మరి మంత్రౌషధప్రభావంబుల దేహరక్షణఁ జేసికొనవచ్చును. అంతియకాని యిది దైవశక్తి కాదని పలికిన విని యలుక మెయి వికటభ్రుకటిభీకరముఖుండై యేమంటిరి! అది కపట మైనచో మరియొక దృష్టాంతము పరీక్షించెద నందోడిపోయిన వారి యంత్రోపలంబులఁ బెట్టించి మర్దింపజేసెదనని యుగ్రముగా శపథము జేసి యొకకుండలో గాలసర్పమునుంచి మూత పెట్టి దీనిలో నేమియున్నదో చెప్పుడని నన్నును సౌగతులను నడిగెను. అప్పుడు మే మావిషయము ఱేపు చెప్పదమని యొకదినము గడువు పుచ్చుకొని యిళ్ళకుంబోయితిమి. కంఠదఘ్నంబగు జలంబున నిలిచి నే నాలోకబాంధవు నారాధించితి. నన్నిగమన్వరూపుండు నాకు బ్రత్యక్షంబై వక్తవ్యాంశమును బోధించి యంతర్హి తుండయ్యె. మరునాడు మేమందరము రాజసభకు బోయితిమి. రాజు మమ్మందరి వస్తువెద్దియో చెప్పుమని యడిగిన బౌద్ధులు భుజంగమందున్నదని చెప్పిరి అప్పుడు నేను భోగీశభోగశయనుండైన శ్రీవిష్ణు వున్నాడని వ్రాసియిచ్చితిని నా మాట వినినతోడనే యా పుడమిఱేడు వాడినమోముతో నేమియుం బలుకక తలకంపించుచు నల్లన నాకుంభము మూత తీయించి చూడ నందు శేషశయనుండైన వాసుదేవుని యాకృతి గనంబడినది. పుడమియొడయుం డాకడవలోఁ దానినుంచినది మాఱి మదుక్తి ప్రకారముగా నుండుట తిలకించి దేహము పులకింప సందేహరహితుండై శ్రుతుల ప్రామాణ్యము సాద్గుణ్యమని నిశ్చయించి యహంకారముతో భయంకరులగు కింకరులం జూచి యిట్లనియె.

ఆసేతుహిమాచల మధ్యముననున్న బౌద్ధులనెల్ల నాబాలవృద్ధముగా వధియించిరండు జాలిచే నెవ్వడు చంపక విడుచునో వానిఁ జంపించెద నిది నిక్కువమని యెక్కుఁడు కోపముతో భృత్యుల కాజ్ఞాపించి యట్లు చేయించెను. మహాత్ము విష్ణునైనను దుష్టుడయ్యెనేని పరిభవింపక మానరు పరశురాముండు మున్ను దల్లిం జంపలేదా? అ ట్లల్పకాలములో సుధన్వుండు భృత్యుల జైనుల నెల్ల వెదకి వెదకి చంపించి వేదమార్గము నిష్కంటకముగాఁ జేసెను. అప్పుడు నేను భూమియంతయు వేదశాఖల వ్యాపింపజేసితిని. కర్మప్రతిపాదకమైన దారి బాగు జేసితినని యెఱింగించి భట్టపాదుండు వెండియు నిట్లనియె.

మహాత్మా! యొక యక్షరము జెప్పినను గురువని చెప్పబడుచున్నాడు. శాస్త్రముల నుపదేశించిన వానిమాట చెప్పనేల? ఏను బౌద్ధగురువునొద్ద దచ్ఛాస్త్రములన్నియుం జదివితిని. చివరకు దత్కులము నాశనము జేయించితిని. ఇంతకన్న మహాపాతక మేమి యున్నది. అదియునుం గాక బౌద్ధశాస్త్రంబుల జదువునప్పుడు పరమేశ్వరుని లేనివానినిగా నిందించితి. నీ పాతకంబులు బాపుకొనుతలంపుతో నీ తుషాగ్నింబడితి నంతకన్న భవదీయపాదదర్శనలాభం బెక్కుడు నిష్కృతియని తలంచెదను. యోగీంద్రా! నీవు భాష్యము రచించితివని విని దానికి వార్తికముజేసి యెక్కడు కీర్తి బొందెదనని తలంచితివి కాని యా మాటలతో నిప్పుడేమి ప్రయోజనమున్నది.

నీ వద్వైతమార్గము రక్షించుకొరకు నవతరించిన పరమేశ్వరుండవని యెఱుంగుదు. అయ్యో! నే నీతుషావలంబుఁ బ్రవేశింపకపూర్వమైనం దర్శనబిచ్చితివి కావే? యీ ప్రాయశ్చిత్తముతో నవసరము లేకయే కృతార్ధుండనగుదుంగదా? అన్నా! నీ భాష్యమునకుఁ గొంచెమైనను వార్తికముఁ జేయు భాగ్యము నాకు లభింపకపోయెనే. ఇప్పుడేమి చేయుదునని చింతించుచున్న భట్టపాదు నాదరించుచు దయామేదురములగు విలోకనము లతనిపైఁ బరిగించుచు శంకరుండల్లన నిట్లనియె. ఆర్యా! నీవు వేదచోదితకర్మవిముఖులగు బౌద్ధులు దండింప నవతరించిన షణ్ముఖుండవని యెరుంగుదును. నీ కొకపాతకంబు గలదా? సజ్జనధర్మముల బోధించుగొఱకు నిట్టినియమమునకుఁ బూనికొంటివి. మదీయకమండులజలంబుఁ బ్రోక్షించి నిన్నుఁ బ్రతికించెదను. సూత్రభాష్యమునకు వార్తికము రచియించెదవే యనుటయు ధర్మజ్ఞుండైన భట్టపాదుం డిట్లనియెను.

యతివర్యా! నీకట్ల యుచితంబా మహాత్ములు శూరులు ధనస్సు నందువలెఁ గుటిలునియందుసైతము గుణము నారోపింతురు గదా మరియు లోకవిరుద్దంబగు కృత్యంబు శుద్ధమైనదైనను నాచరింప నిష్టములేకున్నయది. నన్ను బ్రతికించుట నీకేమి యబ్బురము భూతజాలము నెల్ల సంహరించి వెండియు సృష్టించు సామర్ధ్యము నీకుఁ గలిగియున్నది. నీ ప్రభావము నేనెరుంగుదును అయినను సంకల్పించిన వ్రతమును జీవితాంశం జేసి విడిచితినేని నిందాపాత్రుండ నగుదును. కావున న న్ననుగ్రహింప దలంచితివేని జన్మతారకఁబగు బ్రహ్మ ముపదేశించి కృతార్థునిం గావింపుము. పండితవర్యా! మండనమిశ్రుని ప్రఖ్యాతిని నీవును వినియుందువు. అతండు మదీయశిష్యుండే కాని నాకంటే నెక్కుడు విద్వాంసుం డయ్యెను. వైదికకర్మతత్పరుఁడై ప్రవృత్తిశాస్త్రములయందే నిరతుండై యుండెను. నివృత్తిశాస్త్రములయం దేమియు నా శక్తి లేదు. అతనియొద్దకుం జని వానిం జయించి వశంవదునిగాఁ జేసికొనుము. లోకమంతయు నీ చేతిలోని దగును. అతని భార్యయు మిగుల విద్వాంసురాలు. సరస్వతి యనియే తెలిసికొనుము. ఆమెను మధ్యవర్తినిఁగాఁ జేసికొని వాదమునకుఁ బూనుకొని జయించి యతనిచేతనే నీ భాష్యమునకు వార్తికములఁ జేయింపుము. కాశికాపురంబున విశ్వనాథుండువోలెఁ గాలంబున వచ్చితివి. తారకోపదేశము జేయము. కృపాత్మా! ముహూర్తకాలం బిందు వసియింపుము. యోగిధ్యేమగు నీ రూపముఁ జూచుచుఁ బ్రాణంబుల విడిచి కైవల్యంబందెదనని పలుకఁగా శ్రీ శంకరుం డంతఃకరణమున గరుణ యుప్పొంగ నమిద్ధసుఖప్రకాశమగు బ్రహ్మ ముపదేశించి మోహవిముక్తునిం జేసెను.

తదీయ సంవాదమాకర్ణించు నాడు గన వీతహోత్రుం డంతవరకు దహించుటమాని తద్బ్రహ్మోపదేశానంతరమున నొక్క మారత్తుషరాశిం బ్రజ్వరిల్లం జేయుటయు నా భట్టపాదుండు మాటాడుట యుడిగి కన్నుల మూసికొని చిత్తంబున నద్వైతతత్త్యధ్యానంబు సేయుచు మమతామోహశూన్యుండై బంధముల విడిచి కైవల్యము నొందెను. శ్రీ శంకరాచార్యుండును భట్టపాదునట్లు ముక్తినొందించి మాహిష్మతీనగర గమనోన్ముఖుండయ్యెను.

అని యెఱింగించి మణిసిద్దుం డప్పటికి కాలాతీతమగుట దదనంతరోదంత మవ్వలి మజిలీ యందిటులఁ జెప్ప దొడంగెను.