కాశీమజిలీకథలు/అయిదవ భాగము/52వ మజిలీ

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

52 వ మజిలీ

పంచమోల్లాసము

శ్రీశంకరయతి సార్వభౌముండు, పద్మపాద, హస్తామలక, సమిత్పాణి, చిద్విలాస, జ్ఞానకంద, విష్ణుగుప్త శుద్ధకీర్తి, భానుమరీచి, కృష్ణదర్శన, బుద్ధివృద్ధి, విరించిపాద, శుద్ధాంతానందగిరి ప్రముఖులు శిష్యులు వెనవేలు భజియింప, సుధన్వుం డనురాజు చతురంగబల పరివృతుండై తొడరా దిగ్విజయము సేయ శుభముహూర్తంబున బయలు వెడలి ప్రమధసహితుండగు భర్గుఁడువోలె నొప్పుచు నొకనాఁడు మధ్యార్జునం బను శివక్షేత్రంబున కరిగి యందుఁగల ద్వైతమతస్థుల నెల్ల గర్కశతర్కయుక్తి ప్రహరణములచేఁ బరాజితులం గావించుటయు వారిలో నొకవృద్ధుండు లేచి సామీ! నీవు సకలశాస్త్ర పారంగతుండవు నీతో మేము సమముగా వాదింపఁజాలము వాదియపండితుండైనంతనే మత ప్రాబల్యము దగ్గునా ? భేదము ప్రత్యక్షముగాఁ గనంబడు చుండ నభేదవాదము నెవ్వడంగీకరించును. ఇందుల కెద్దియేని దైవనిదర్శనముఁ జూపెద నేని నీ మాటల విశ్వసింతుమని పలికెను.

ఆ మాటలఁ బాటించి శంకరయతి శేఖరుండు వారినెల్ల మధ్యార్జునస్వామి యాలయంబునకుం దీసికొనిపోయి స్వామియెదుర నిలువంబడి చేతులు ముకుళించి జగదీశ్వరా! ద్వైతాద్వైతమతతార తమ్యంబు వివరింప నీవెసమర్ధుండవు అందలి నిక్కం బెరింగించి మా సందియము బోఁగొట్టుమని ప్రార్ధించుటయు నమ్మహాలింగాగ్రంబున నొక్క దివ్య పురుషుండావిర్భవించి "సత్యమద్వైతం సత్యమద్వైతం సత్యమద్వైతం" అని ముమ్మాఱుపలికి యంతర్ధానము నొందెను. అద్దివ్యవచనంబుల నాలించి ద్వైతు లందరు విస్మయమునొందుచు నద్వైతముసర్వోత్కృష్టమని యొప్పుకొని యమ్మహాత్ముని శిష్యులై వెనువెంట దిరుగఁజొచ్చిరి.

అందుండి యయ్యతిచంద్రుండు శిష్యసహితముగాఁ గతిపయ ప్రయాణంబుల రామేశ్వరమున కరిగి యందుఁ గలుషనిచయధూమకేతువగు సేతువున గ్రుంకి రామనాధు నర్చించి తక్కుంగల తీర్థంబుల నెల్ల సేవించి యందుఁగల యద్వైతమత విరోధుల నిరోధింప రెండు మాసములు నివసించెను.

శాక్తమతఖండన

ఒకనాఁడు తులాభవానీమందిర నివాసులగు శాక్తమతస్థులెల్ల గుమిఁగూడి యిట్లు తమలో సంభాషించికొనిరి.

భవానీసేవకులు — లక్ష్మీభక్తులారా! మనయూరు శంకరుండను సన్యాసి మిగుల జంఝాటముతో నరుదెంచుట మనమతముల నిర్మూలించుటకఁట వింటిరా ?

లక్ష్మీ సేవకులు — వింటిమి. వింటిమి. ప్రొద్దుట నతని శిష్యుండొకండువచ్చి బీరములు పలికిపోయెను. అద్వైతమతమొక్కటే ముక్తికి హేతువట. తక్కిన మతము లన్నియు దబ్బరలఁట. ఆహా! యెంత విచిత్రముగా నున్నది.

భవానీ — ఇప్పుడు మనమందరము గలసి యేకముఖముగా నతనితో వాదింపమని శాక్తేయమత మథోగతిపాలైపోఁగలదు సుడీ?

లక్ష్మీ - అవును. అతఁడు సామాన్యుఁడుకాడు. మనలో మనకు భేదము లుండుఁగాక. కలసి శత్రువును పరిభవించుటయే లెస్స.

భవానీ — వామాచారులు మాలోనివారఁగుట వారి నడుగ నవసరములేదు గాని సారస్వతుల కెరింగింపవలయు.

లక్ష్మీ - అదిగో వారును మాటలోనే వచ్చుచున్నారు.

సారస్వతులు — (ప్రవేశించి) రామనాధుని యాలయమునందుండి బాలయతి యెవ్వడో మనలనందఱ రమ్మని వార్తలంపెనఁట యేమిటికి ?

భవానీ - ఏమిటికా! మనమతము ఖండించుటకఁట.

సార - (నవ్వుచు) బాగు బాగు. చిరకాలమునుండి ప్రబలియున్న మన మతమును ఇతఁడా ఖండించువాఁడు !

భవానీ — అట్లనరాదు. అతండు లోకసామాన్యుండుగాఁడు. సకలవిద్యా పారంగతుండని యెల్లరు చెప్పుకొనుచున్నారు. కావున మనమందఱమును గలసి వానితో వాదింపవలయునని యూహింపుచున్నాము.

సార — అది యుక్తమే.

భవానీ - సరే ! మనమేదేవతను ప్రధానముగాఁ జేసికొని వాదించవలయునో ముందుగ నిపు డూహించవలయును.

లక్ష్మీ - మనము లక్ష్మిని ప్రధానదేవతగా నెంచి వాదించితిమేని తప్పక గెలువఁగలము.

భవానీ — ఆదిశ క్తి పార్వతిగాని లక్ష్మిగాదు. కావునఁ బార్వతికే జగత్కారణత్వముఁ జెప్పి వాదింపవలయును. సార — ఓహో ! మీరిరువురును ప్రమాదము నొందుచున్నారు. మీకు వాదమున గెలుపుగొను తలంపుగలిగియున్న సరస్వతిని ముఖ్య దేవతగాఁ జెప్పి వాదింపుఁడు. అతండు శారదారాధకుండగుట నామతము నిరాకరింపఁజాలఁడు.

లక్ష్మీ - సరస్వతి నెన్నఁడును జెప్పఁదగదు. జగత్కారణత్వ మామెకు లేదు.

సార - లక్ష్మికి మాత్ర మున్నదియా?

భవా - లక్ష్మీ సరస్వతుల కిరువురకును ప్రధానత్వము లేదు.

లక్ష్మి - భవానికి మును పేలేదు.

భవా - పోనిండు. మీ దారిని మీరు పొండు మాకర్మము మాది అని వారు సంభాషించుకొనుచుండు సమయంబున శంకర శిష్యుం డొకండువచ్చి వారి నందఱందోడ్కొనిపోయి వాదింప శంకరాచార్యు నెదుటంబెట్టెను. అప్పుడు వారికిట్లు సంవాదము జరిగినది.

శంకరయతి — మీరెవ్వరు ?

భవానీ — అయ్యా ! శాక్తమతస్థులము.

శంక - నాలుగు తెగలుగా నిలువంబడితిరేమి ?

భవా - మా మతము నాలుగుభేదములు గలదిగానున్నది. దానంజేసి యిట్లు నిలువంబడితిమి.

శంక — (నవ్వుచు) బేధమా ? భేదమా ?

భవా — తొందరచే నట్లువచ్చినది. భేధముగాదు భేదము.

శంక - కానిమ్ము. మీమతప్రవృత్తి యెట్టిదో ముందుగ వక్కాణింపుఁడు.

భవా — చిత్తము.

శ్లో॥ అద్యాశ క్తి రశేషకార్యజననీ శంబో ర్గుణేభ్యః పరా
     యన్మాయావశతో మహత్ప్రముఖరం సర్వం జగజ్జాయతే॥

శ్లో॥ తస్యా వాగాద్యగమ్యత్వా త్సేవాయోగ్యత్వ హేతుతః ।
     తదంశాయా భవాన్యాస్తు పాదసేవాపరా వయం॥

స్వామీ! ఆదిశ క్తియే భవాని. సర్వకార్యములకు జనని తన్మాయాప్రభావంబు వలన మహదాదికమైన జగత్తంతయు జనించినది. తత్ప్రభావమవాజ్మౌననగోచరమై యున్నది మేము తత్పాద సేవకులమై ముక్తినొందుచున్నారము. కాంచనవికారములైన తత్పాదచిహ్నము కంఠములయందును భుజములయందును ధరింతుము. ఇదియే మా మతము.

శంక — ఇదియా సరియే. మీ ప్రక్కన వారెవరు ?

లక్ష్మి — స్వామీ ! మేము లక్ష్మీ సేవకులము. శంక — మీ మత స్వభావముగూడ వాక్రువ్వుఁడు.

లక్ష్మీ - చిత్తము

శ్లో॥ మహాలక్ష్మీరాద్యా ప్రకృతిరసదిత్యాదినిగమై
     స్పదేవేతిశ్రుత్యాపరమపురుషశ్శ్యామలతనోః॥॥

శ్లో॥ లక్ష్మ్యాస్సమారాధనతత్పరాణాం
     పద్మాక్షమాలాభిరలంకృతానాం
     బాహ్యోశ్చకంజాంకవిభూషితానాం
     సుకుంకుమేనాంకితమస్తకానాం
     హస్తస్థితాము క్తిరతోభవద్భి
     రుపాసనీయ సకలేశ్వరేశ్వరీ.

స్వామీ ! మహాలక్ష్మీయాది ప్రకృతియని వేదములలో నున్నది గదా! పద్మాక్షమాలచే నలంకరింపంబడి కుంకుమమొగమున నలమికొనుచు బాహువుల పద్మాంకములు వెలయునట్టి మహాలక్ష్మిని సేవించిన లక్ష్మీభక్తులకు మోక్షమరచేతిలోనున్న యది. ఇదియే మా మత సిద్ధాంతము.

శంక — [నవ్వుచు] తరువాత వారెవ్వరో చెప్పవలయు.

సార — అయ్యా ? మేము సరస్వతీ సేవకులము వినుండు.

శ్లో॥ స్వామిన్వేదస్యనిత్యత్వా చ్ఛారదానిత్యరూపిణీ
     కారణం సర్వలోకానాం పరాత్పరతరామతా।
     జగత్కర్త్రీతినిత్యావాగితిచశ్రుతివాక్యతః
     సైవాత్మబ్రహ్మవిష్ణ్వాదిశబ్ద జాలైరుదాహృతా।
     గుణాతీతస్వరూపాచసీ వ్యాసర్వముముక్షుభిః॥

ఆర్యా! వేదము నిత్యమగుట తత్సరూపిణియగు శారదయు నిత్యయగు చున్నది. కృతులయందు సరస్వతియే బ్రహ్మవిష్ణాద్విశబ్దవాచ్యయని చెప్పఁబడి యున్నది. సరస్వతియే పరాత్పరురాలు. వాణియే జగత్కర్త్రి. శారదయే ప్రధానశక్తి. గుణాతీతస్వరూపిణియగు వాగ్దేవి నారాధింపుచుతచ్చిహ్నములందాల్చి మేము ముక్తుల మగుచున్నాము.

శంక - ఓహో? మీలో మీకిట్లు పరస్పరభేదములు గలిగియున్నవే! లోకమంతయు నిట్లేయున్నది. వినుండు తాల్వాదిసంగమున జనించిన వేదమునకు నిత్యత్వ మెట్లు సిద్ధించును. వేదముపరమ పురుషుని వ్వాసములని చెప్పబడియున్నది. ఏది పుట్టునో యదిలయమగునుగదా ఇదియునుంగాని యుగాంతరములయందు వేదము సాంగముగా సశించునని రవిమహర్షులతోఁ జెప్పినట్లు సూర్యసిద్ధాంతములోనున్నది. నాశనమొందుదానికి నిత్యతకలుగదు. చతుర్ముఖునికే నాశనముగలుగుచుండఁ దన్ముఖంబునం బొడమిన శారదనిత్యయెట్లగును? పరమాత్మవ్యతిరిక్తమగు పదార్దమెద్దియును నిత్యముగాదు. లక్ష్మియు భవానియు సరస్వతియుగూడఁ బ్రధానదేవతలుగారు. మోక్షేచ్ఛతో వారి నారాధించిన లాభములేదు ముక్తికి నద్వైతజ్ఞానము కావలయును. ముముక్షువు లాత్మనాత్మచే ధ్యానింపు చుండవలయు కుంకుమాద్యంకథారణము శాస్త్ర దూష్యము. ఫలాపేక్షతో వారి నారాధించిన నారాధింపవచ్చును. జ్ఞానులకు బ్రహ్మతో నైక్యము చెప్పఁబడియున్నది. బ్రహజ్ఞుఁడే బ్రహ్మ యగును గావున మీరందరు భేద బుద్ధినివిడిచి యద్వైతమత మవలంబింపుఁడు. ముక్తులయ్యెదరని యద్వైతజ్ఞానంబంతయు నుపదేశించుటయుఁ దెలిసికొని పరమానంద కందళితహ్మదయారవిందులై వారెల్ల శిష్యులై తత్పదపల్లవంబుల నాశ్రయించిరి వారిలో వామాచార మతస్థులు సమ్మతింపక యెదుర నిలువంబడి యిట్లు వాదించిరి.

వామ — సన్యాసీ ! నీ ప్రజ్ఞమిగులఁ గొనియాడఁదగి యున్నది గదా ? ఏవియో నాలుగు మాయమంత్రములను జెప్పి వీరినెల్ల శిష్యులఁగా జేసికొంటివి. చాలు చాలు వంథ్యాపుత్త్రసమంబగు నద్వైత జ్ఞానంబున వేషధారివై తిరుగుచు లోకుల మోసముఁ జేయుచున్నావు గదా. సంవిత్స్వరూపమేదియో నీవెరుంగుదువా? ఏశక్తిలేక పరమేశ్వరుండు తృణమునైనఁ గదల్పఁజాలఁడో యట్టియాదిశ క్తియే స్వతంత్రురాలు. సకలవిద్యాస్వరూపిణి, జగత్కారణమైయున్నది. అట్టి శక్తి సేవకులమగు మాకుముక్తి గలుగదని నీవాడితివి. నీ యజ్ఞానమేమని చెప్పఁదగినది.

శ్లో॥ తప్యాస్సేవానిరతమనసాం నోనిషేధోధికారో
      నాస్త్యైవైవంహితకరణే సిద్ధతామాగతానాం
      నిస్త్యైగుణ్యేపధివిచరతాం కోవిధిః కోనిషేధో
      భృగ్వాదీనామమలమనసాం నఃప్రవృత్తిర్హి మానం.

శక్తిసేవా పరతంత్రులకేదియు నిషేధములేదు. తపస్సిద్ధులగు వారికి విహిత కార్యములనాచరించుపని లేదు. త్రిగుణాతీతమగు మార్గమందు సంచరించువారికి విధి నిషేధములు లేవు. అని చెప్పెడి భృగ్వాది మహర్షులయొక్క ప్రవృత్తియే మాకుఁ ప్రమాణమైయున్నది. మఱియు

శ్లో॥ మత్స్యోమాంసంచ మద్యంచముద్రామైధున మేవచ
     మకారపంచకం జ్ఞేయం వామాచార విశారదైః,

ఈమకార పంచకము మేము సేవింపవచ్చును. మాకిందేమియు విధినిషేధములులేవు. నీవుగూడ మాయాచారమును గైకొని సుఖింపుమని పలికిరి.

శంక — మూఢులారా ! భృగ్వాదిమహర్షులప్రవృత్తియే మాకు బ్రమాణ మని పలికితిరి. వారికిఁగల చితశుద్ది మీకుఁ గలిగియున్నదా? భృగుండు విష్ణునిదన్నె, నగస్త్యుండు సముద్రమును గ్రోలెను.

అట్టిసామర్థ్యము మీకులేకున్నను విధినిషేధములు లేవనిచెప్పెదరా ? వినుండు. అనాత్మ కెన్నఁడును సత్యత్వములేదు అనిత్యప్రకృతియొక్క యుపాసన సత్యమగు ముక్తి నెట్లొసంగఁగలదు. ప్రకృతిభిన్నమగు చిదాత్మయే ముముక్షువులచే సేవింపఁదగినది. మద్యమాంసముల శక్తినైవేద్యపు నెపంబున భుజించు మీకు ముక్తి కలుగునా, మీకు బ్రాహ్మణ్యంబులేదు అపాజ్త్కేయులు. ప్రాయశ్చిత్తముఁజేసిన కాని మీతో సంభాషించదగదు. అని యుక్తి ప్రహరణంబులచే వారింద్రుటిలో నిరుత్తరులం గావించి తనశిష్యులఁగాఁ జేసికొనెను.

అట్లు శంకరాచార్యవర్యుండ శాక్తమతఖండనంబుగావించి పదంపడి తనయంతేలాసులచేఁ దోడ్కొనిరాబడిఁన తత్ప్రాంతవ్యాస్తవ్యులగు శైవమతస్థులతో నిట్లు వాదించెను.

పాషండ మతఖండనము

శంక — శైవులారా ! మీమతప్రవృత్తియెట్టిదో వక్కాణింపుఁడు.

శైవు — శ్లో॥ ఈశ్వరంరుద్రమవ్యక్తం వ్యక్తరూపం జగల్లయే యేర్చ యంతినరశ్రేష్ఠాస్తేషాంము క్తిః కరేస్థితా॥ ఇత్యతఃపరమాత్మాసౌ సేవనియోముక్షుభిః.

వ్యక్తావ్యక్తస్వరూపుండగు రుద్రునెవరర్చింతురో వారికి మోక్షము కరతలామలకముగా నుండునని మున్ను శివుండు దూర్వాసముని కానతిచ్చెను. మేమట్టిశివుని సేవించుటచే శైవులమని చెప్పఁబడుచుంటిమి. శివసేవాపరాయణులకుఁ గర్మతోఁబని లేదు. శివుండు వినాజడంబగు కర్మశుభాశుభఫలంబుల నీయఁజాలునా? మహేశ్వరుండే మోక్షదాత. తదారాధనము ముక్తికారణము. తచ్చిహ్నధారణంబు సాయుజ్యప్రదంబు. ఇదియే మా మతసిద్ధాంతము.

శం — శివుండు సర్వోత్కృష్టుండను జగత్కారణుండునగుగాత. తత్సేవ వలన ముక్తియుఁగలుగుఁగాత. ముక్తియననేమియో మీకుఁదెలియకున్నది. అది యట్లుండె. మఱియు దేహమంతయు సూలాదిచిహ్నములచేఁ గాల్చికొనుచున్నారు. సర్వదేవమయమగు బ్రాహ్మణదేహముఁ దపింపఁజేయుట పాపకారణము.

శ్లో॥ శ్రుతి స్తధోచేసకలాహి దేవానసంతి దేహేఖలు
     భూసురస్య! తతోస్యతాపేతుకృతేసురాస్తే
     పలాయనంయాంశిశరీరతోస్య
     వ్యాధింవినాకర్మయోగ్యేవిప్రాంగేచిహ్న మీ
     క్ష్యచ। లోకేశ్వరంభానుమీక్షేతాధవాహ్ర
     దమావిశేత్॥

వేదవేదాంగపారగుఁడగు బ్రాహ్మణుశరీరమున సమస్తదేవతలు వసింతురని శ్రుతులు చెప్పుచున్నవి. అట్టివిప్రశరీరము చిహ్నములచేఁ గాల్పఁబడెనేని యందున్న దేవతలు పారిపోవుచున్నారు. కావున వ్యాధిలేక విప్రశరీరముఁ గాల్చరాదు. కర్మయోగ్యమగు బ్రాహ్మణ శరీరమున వాతలుజూడఁబడెనేనిఁ బ్రాయశ్చిత్తముఁ జేసికొన వలయును. కావున మీమతము శ్రుతిసమ్మతముగాదు.

శైవు - అయ్యా ! తమవాక్యంబులు వినుటచే నీశ్వరారాధనము పుణ్యప్రదముగాదని తేలుచున్నది శివునిఁబూజింపవలయునని చెప్పెడి గ్రంధములన్నియును బూటకములేనా.

శంక - మీకు ధర్మరహస్యములు తెలియవు. భక్తిజ్ఞానవైరాగ్యములు బ్రాహ్మణునికిఁ గలిగియుండవలెను. కేవలము భక్తియొక్కటియే బ్రాహ్మణేతరులఁ దరింపజేయును. అదిశుద్దకైవల్యమీఁజాలదు. శివవిష్ణ్వాది శబవాచ్యత్వము నిర్గుణునికిఁ గల్పితము. సగుణోపాసనమున నజ్ఞానముబోదు. అజ్ఞానముపోవుటయే ముక్తి. వహ్ని లేకపాకము సిద్ధించనట్లు త త్త్వజ్ఞానంబులేక మోక్షముదొరకదు. బ్రహ్మాది స్వరూపములచే నొక్కడే సృష్టిస్థితివినాశనములం జేయుచున్నాఁడుకాని వానికిన్ని రూపములు లేవు. భేదయుక్తమగు నుపాసన నిద్వమని శ్రుతిచెప్పుచున్నది. లోకమంతయుఁ గర్మబద్ధమైయున్నది. జ్ఞానము సిద్ధించువఱకుఁ గర్మనువిడువరాదు. పురుషుఁడు బ్రహ్మబోధకొఱకు బ్రహ్మజ్ఞు నాశ్రయింప వలయును.

గురుకారుణ్యమున నద్వైతబోధగలిగి ముక్తుండగు. అద్వైత జ్ఞానంబే పునరావృత్తిరహితమగు ముక్తినిచ్చు నిదియే నమ్ముఁడు చిహ్నధారణముమానుఁడు. అని తత్త్వోపదేశమునుజేసి వారినెల్లర స్వమతాయత్తులంజేసికొనియెను.

అప్పుడు వారిలో లింగధారు లీర్ష్యాకషాయిత హృదయులై వారిని నిందించుచు శంకరున కభిముఖముగా నిలువంబడి యిట్లు వాదించిరి.

లింగ — యతీంద్రా! మాయావేషమును గైకొని ప్రామాణిక మతమునుండి మాశైవులనెల్లర భ్రష్టులం జేసితివిగదా ?

శ్లో॥ బ్రాహ్మణ్యాదుత్తమం ప్రోక్తంవైష్ణవంమునిసత్తమ
     వైష్ణవాదధికం శైవమిత్యజః ప్రాహనారదం

బ్రాహ్మణ్యముకంటె వైష్ణవమతము వైష్ణవమతముకంటె శైవమతము గొప్పదని నారదునితో బ్రహ్మచెప్పియున్నాఁడు.

శ్లో॥ సర్వాననశిరో గ్రీవస్సర్వభూతమహాశయః
     సర్వవ్యాపీసభవాస్‌తస్మాత్సర్వగతశ్శివః॥

అని శాస్త్రములు ఘోషింపుచుండు. శివమతము నిరాకరింప నీ తరమా !

శ్లో॥ శివతేజస్సముద్భూతాహరిబ్రహ్మాదికోటయః
     క్రియంతేపున రేవైతేతత్రతత్రలయానుగాః
     ఇతిసస్మాచ్చివ స్యైవతత్పతిత్వంసునిశ్చితం

శివుండు సర్వాధికుండగు నట్లనేక నిదర్శనములున్నవి!

మఱియు

శ్లో॥ ఆతప్తాత్మతనుర్నైవతద్దామైతీతిమానతః
     లింగాంకనమవశ్యంవైకర్తవ్యంమోక్షకాంక్షిభిః
     శ్రుతి॥ "అతప్తతనుర్నతదామో అద్నతే"

అను శ్రుతివలన శరీరతాపనంబునఁగాని మోక్షము జెందనేరఁడని స్థిరపడుచున్నది. అందులకే త్రిశూలాది చిహ్నములచే నంకితులగువారికి ముక్తిగలుగునని మా మతసిద్ధాంతము.

శం — అయ్యో ! మీకు విద్యాగంధమే లేకపోవుటచే జ్ఞానసూక్ష్మము దెలియకున్నది. శివుండు సర్వోత్తముండని యభేదబుద్ధిం జెప్పిన నొప్పుగదా ? శివుం డుత్తముండని చెప్పుచు విష్ణుండతని దాసుండని నిందించుచుందురు. అదియే మూఢత. శివవిష్ణ్వాది శబ్దములు పరమాత్మయొక్క సగుణరూపవాచకములు. ఈ రహస్యం బెరుంగక శివుండధికుండు విష్ణుఁడు దాసుఁడు బ్రహ్మ పరిచారకుండు అని శివాధిక్యము స్థిరపరుచుకొనుచున్నారు. "అతప్తతను" అను శ్రుతికది యర్ధముకాదు. కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతములచే శరీరమును దపింపఁ జేసికొనవలయునని వేదాభిప్రాయము. పశువువలెఁ గాల్చికొనిన మోక్షము సిద్ధించునా ?

శ్లో॥ లింగాంకితతనుదృష్ట్వా శంఖచక్రాంకితంతథా
     స్నానమేవతదాకార్య మథవాసూర్యమీక్షయేత్
     వితితంతప్తలింగాఢ్య చక్రాంకితమధాపివా
     వాజ్మొత్రేణాపినార్చేత పాషండాచారతత్పరం
     అపిశూద్రేక్షణాద్భుంజే ల్లింగచక్రాంకితంవినా
     అపిచేన్ని గమాచార రతో వేదాంగ తత్పరః॥
     లింగచక్రాంకమాత్రేణ ససద్యః పతితోభవేత్ ॥

అను మొదలగు ప్రమాణములచే చిహ్నధారణము నింద్యమని బృహన్నారదీయములోఁ జెప్పఁబడియున్నది. శ్రు॥ "యతోవాచోనివర్తంతే అప్రాప్య మనసాసహ" అను శ్రుతివలన నవాజ్మాననగోచరుండగు పరమేశ్వరుండొక్కఁడే నిత్యుఁడు. శివకేశవాది నామములు సగుణోపాసకులగు మూఢులకు నియమింపఁబడినవి. ఈశ్వరా రాధనము వలదని నేను చెప్పుచుండలేదు. నింద్యమునుగాదు. భూతి రుద్రాక్షాదులను ధరింపవలసినదే. లింగ -- స్వామీ! త్రిపురాసుర సంహారకాలంబున రుద్రుండు శూలాచ్యా యుధముల ధరించినట్లు పురాణములలోనున్నది కదా! సేవ్య సేవక న్యాయంబున మేము సేవకులము గావునఁ దదాయుధములఁ జిహ్నములఁగా ధరింతుము. దీనందప్పేమి !

శం - తప్పని యెన్నిసారులు చెప్పవలయును. రాజు ఛత్రచామరములు దాల్చెనని సేవకుఁడు తచ్చిహ్నంబులఁ దాల్చిన నెట్లుండునో యూహింపుఁడు దాని నించుకయుఁ బ్రయోజనములేదు. లేదు. పాదిత్యముగూడ రాఁగలదు. ముక్తిజ్ఞానము కన్న వేరొక సాధనము లేదు. పామరబుద్ధి విడువుఁడు. అద్వైతజ్ఞానమార్గ మవలంబింపుఁడు అని తత్ప్రకారంబంతయు నుపదేశించి వారినెల్ల శిష్యులం జేసికొనియెను.

శంకరయతి పుండరీకుండట్లు రామేశ్వరములో రెండుమాసములుండి పాశుపతాద్యద్వైతమత విరోధులనెల్ల వశపరచుకొని యచ్చటనుండి బయలు వెడలి సపరివారముగా ననంతశయనమున కరిగెను.

వైష్ణవమత ఖండనము

అందు ననంతపద్మనాభస్వామి నారాధింపుచు నెలదినములు వసియించెను. మరియు నందుఁగల వైష్ణవమతస్థులెల్ల నొక నాడయ్యతి తల్లజునితో వాదింప నరుదెంచుటయు సంవాదము జరిగినది.

శంక — మీరెవ్వరు మీ మతప్రవృత్తి యెట్టిదో వక్కాణింపుఁడు.

విష్ణుశర్మ - అయ్యో ! వినుండు భక్తులు, భాగవతులు, వైష్ణవులు, పాంచరాత్రులు. వైఖానసులు, కర్మహీనులు. అని వైష్ణవు లారువిధంబుల చెప్పుచుందురు. అందు మేము భక్తులము, జ్ఞానక్రియా విభేదముల మా యాచారము రెండువిధముల నొప్పుచున్నది. వాసుదేవుం డనేకావతారలెత్తి భక్తజనసులభుండై యున్న వాఁడు తదుపాసనచే మూఢులుసైతము తత్సాయుజ్యము నొందుదురు. అనంత పదకమలధ్యానమే మాకురక్షకము. అవి యేమియుఁ జేయక ధ్యానించుటయే జ్ఞానము. తదాజ్ఞలేక తృణమైనఁగదలదు. తదుపాసనమే క్రియ. ఇదియే మా మతము.

శంక — క్రియ యనఁగాఁ దదుపాసనయని చెప్పుట మూర్ఖత.

శ్లో. జన్మవాజాయతేసూద్రః
    కర్మణాజాయతేద్విజః
    నిత్యంసంధ్యాముపాసీత
    ప్రత్యవాయోన్యధాభవేత్॥

బ్రాహ్మణుండు జన్మచే శూద్రుండై కర్మచే ద్విజుండగుచున్నాఁడు. విప్రుండు నిత్యము సంధ్య నుపాసించఁదగినది. అట్లు చేయనిచో ప్రత్యవాయము వచ్చెడిని. అను మొదలగు శ్రుతినిబంధనలు కర్మను స్తుతిఁ జేయుచున్నవి. విష్ణు సేవయే బ్రాహ్మణకర్మ యని చెప్పుట యపాండిత్యము. వేదవిహితమైనదే కర్మ. కర్మ విడచిన వాడు జీవచ్ఛవము. యతులకు సైతము దేవతార్చనాది మగు కర్మ విధించఁబడియున్నది. మీరు కర్మభ్రష్టులైతిరి గావున ప్రాయశ్చిత్తముఁ జేసికొనినగాని మీతో సంభాషించరాదు. అని యుక్తియుక్తముగా వారికి బోధించి త్రుటిలో నిరుత్తరులంజేసెను.

తరువాత భాగవతులు ముందరికి వచ్చి స్వామీ! మా మతము వినుము.

శ్లో॥ సర్వవేదేషుయత్పుణ్యం సర్వతీర్ధేషుయత్ఫలం।
     తత్పలంపురుషఆప్నోతి స్తుత్వాదేవం జనార్దనం॥

సర్వ వేదముల యందు సర్వ తీర్ధముల యందు నే పుణ్యము గలదో విష్ణు స్తుతి వలన నట్టి పుణ్యము రాగలదు. అను వచనము ననుసరించి రాత్రింబవళ్ళు హరికీర్తనం జేయుచు శంఖచక్రాది చిహ్నలం బూని తులసి మాలికల ధరించి యూర్ధ్వపుండ్రములు మెఱయ వసింతుము. ముక్తి మా హస్తమందున్నది. దీనికేమి లోపము లెంచెదవో చెప్పుము.

శంక - చక్రాద్యంకనము శాస్త్రదూష్యమగుట మీ మతము దూషణీయము.

మఱియు,

శ్రుతి - "యతోవాచోనివర్తంతే అప్రాప్యమనసాసహ"

మనసుతో గూడ వాక్యములెవ్వని మహిమఁ దెలిసికొనలేక మరలుచున్నవో అను శ్రుతివలన నదాజ్మాననగోచరుండగు భగవంతుని మీరెట్లు స్తుతియించఁ గలరు. ఈ జడశంఖాదు వలనఁ గలిగిన చిహ్నం దాల్చుటకంటె లోహచక్రాదుల ధరియించిన విష్ణుండువోలె నొప్పుచుందురు అంతకన్న మరియొక విశేషమువినుండు. కరచరణాద్యవయవ విశిష్ట బగు విష్ణుశిలామూర్తిచే సర్వరూపమంతయు వ్యక్తమగు నట్లు మేనంగాల్పించుకొనుఁడు. మీకుముక్తి నధ్యఫలంబోసంగెడిని మూఢులారా! మిమ్ము విష్ణుభక్తులనుటకంటె పాషండులని చెప్పిన నొప్పిదనుగును ఊరక చెడిపోవకుడు. ఫలమీశ్వరార్పణము చేయుచు విహితకర్మ నొనరింపుఁడు దానశుద్ధులగుదురు. పిదపనద్వైతవేత్తయగు గురునాశ్రయించుఁడు తదుపదేశలాభంబున నష్టకర్మ బంధులై ముక్తులగుదురు. మోక్షమునకంతకంటె వేఱొకదారిలేదు. సగుణోపాసనము స్థిరముక్తి నీయఁజాలదు. అని యద్వైతజ్ఞానబోథఁజేసి వారినెల్ల శిష్యలగాఁ జేసికొనెను.

పిమ్మట శార్జపాణియనువైష్ణవుఁడు లేచి నమస్కరింపుచు స్వామీ ! మేము నమోనారాయణాయయను మంత్రము నెల్లపుడు జపముసేయుచుందుము. శంఖచక్రాదు. లచేఁజహ్నితులమై సంసారంబుబాసి వైకుంఠపదంబు నొందుచుందుము. చక్రాంకితమునకు శాస్త్రదృష్టాంతములు లేవని చెప్పరి.

శ్లో॥ యేబాహుమూలపరిచిహ్నితశంఖచక్రా
     యేకంఠలగ్నతులసీనళినాక్షమాలాః
     యేవా లలాటఫలకేలసదూర్ధ్వపుండ్రా
     ప్తేవైష్ణవాభువనమాశు పవిత్రయంతి ॥

ఈ శ్లోకము ప్రమాణముగాదా ? ఇట్టి వైష్ణవులు లోకమును బవిత్రమును జేయుదురని చెప్పంబడి యుండలేదా ! దీనికేమి చెప్పెదరు.

శంక — [నవ్వుచు] ఓహో ! వైష్ణవోత్తమా ! నీవు చదివిన శ్లోకము శ్రుతి సమ్మతమైనదికాదు. శ్రుతివ్యతిరిక్తమైన దానిని మేము ప్రమాణముగా స్వీకరింపము. అతప్తతనుండుముక్తిఁ జెందఁదను శ్రుతి ననుసరించి యీ శ్లోకము రచింపఁబడెనంటి వినుము. ఆ శ్రుతి కది యర్ధముగాదు. తప్తతనుఁడన లోహచక్రాదులచేఁ గాల్చుకొనుట గాదు. కృఛ్రచాంద్రాయణాది నియమవిశేషములచే శరీరమును దపింపఁచేసిన మోక్షము గలుగునని శ్రుతి యభిప్రాయము. అయ్యో! అట్టి యభిప్రాయమును గ్రహించక యూరక శరీరమును గాల్చికొనుచున్నారే.

శ్లో॥ బ్రహ్మజ్ఞోయస్సోశ్ను తేమోక్షమిత్యా
     దేర్వాక్యాన్మోక్షస్య హేతుర్విబోధః
     క్షీణేపుణ్యేమర్త్యలోకంవిశంతీ
     త్యాదేర్వాక్యాదన్యతస్సంసృతిస్స్యాత్॥

బ్రహ్మజ్ఞుండే మోక్షమును బొందుచున్నాడు. మోక్షమునకు బోధయే కారణము. పుణ్యముక్షీణింపఁగాఁ దిరిగి మర్త్యలోకమును బొందును స్వర్గాదికము ముక్తికాదు. దానివలన సంసారము విడువదు. అని శ్రుతులు ఘోషింపుచున్నవి. స్వాభిమానమును విడచి ధర్మసూక్ష్మములజక్కగా గ్రహింపుఁడు. ఆత్మ యొక్కటియే నిత్యమైనది. అదియే జగత్కారణము. పరమాత్మకు నామరూపాదులు లేవనుచుండ శంఖచక్రాది ధారణము పూర్వపక్షము గాదా ? రూపశూన్యుని ధ్యానించుట కష్టమని మందబుద్ధుల కొఱకు భగవంతునికి నామరూపాలంకారాదులు గల్పింపఁబడినవి. బ్రహ్మాహమస్మియని సర్వదాధ్యానింపుఁడు. భేద బుద్ధివిడువుఁడు జీవుఁడే యీశ్వరుండని తోచును దానంజేసి సంసారమునశించును. బ్రాహ్మణునికి శిఖాయజ్ఞోపవీతంబులు దాల్చుట వేదవిహితమై యున్నది. చిహ్నధారణము నిషేధమని బృహన్నారదీయాది మహాగ్రంథముల యందు వ్రాయఁబడియున్నది. తద్ధారణంబున హరిసమానుల మగుదుమనుకొనుట మనోరాజ్యమువంటిదేసుఁడీ. అని యెన్నియో దృష్టాంతరములఁజూపి యాత్మబోధఁజేసి యతని శిష్యునిగా జేసికొనెను. తరువాత పంచరాత్రాగమ దీక్షితుండగు మాధవుండను వైష్ణవుండు స్వమతస్థులచే శంకరునియెదుటకుఁ ద్రోయఁబడి సభాకంపముచేఁ గాళ్ళుచేతులు వడఁకుచుండఁ జూచినవ్వుచు,

శంక - అట్లువణఁకెదవేల ? నీ మత ప్రచార మెట్టిదో నుడువుము భయము లేదు.

మాధ — స. స. సామి! మె. మె. మేము. ప. ప. పాంచ. ర. ర. రాత్రులము.

శంక — నీకు నత్తి యున్నదా యేమి ?

ప్రద్యుమ్నాచారి — అయ్యా ! ఆయనకు నత్తిలేదు. కొంచెము సభాకంపమున్నది, వాదములోఁ బ్రౌడుండే!

శంక - వైష్ణవప్రవరా ! మనస్సుదృఢపరచికొని నెమ్మదిగాఁ గూర్చుండి నీ మత ప్రవృత్తిఁదెలియఁజేయుము.

మాఢ - చిత్తము. చిత్తము. ఇప్పుడు భయముదీరినది. చెప్పెదవినుఁడు. స్వామీ ! భగవత్ప్రితిష్ఠకు మాయాగమమే మూలమైనది. మాయాగమము లేనిచో భగవంతునికిఁ బ్రతిష్ఠయేలేకపోవును. కావున మాయాచారమెల్ల బ్రాహ్మణులు స్వీకరించిన జక్కగా నుండును. ఇదియే మా మతము.

శంక — వేదవిరుద్ధముగానిచో మీయాగమము మంచిదే. గాయత్రివలనంగాని బ్రాహ్మణ్యము సిద్ధించదు. ఆగమవ్యతిరిక్తమంత్రంబుల గ్రహించుట బ్రాహ్మణుల కనుచితంబు, గాయత్రీశూన్యులగుట మీరు బ్రాహ్మణులుకారు. బాహ్మణ్యహీనమగు వైష్ణవత్వము పతితముగాఁ జెప్పఁదగినది. పతితుఁడవగు నీతో మాబోఁటులు సంభాషింప రాదు. నీవు జీవన్మృంతుడవైతివి.

మాధ - స్వామీ ! చిహ్నధారణమువలన వైకుంఠము వచ్చునని మాపాంచ రాత్రాగమములో నున్నది. మాయాగమమే మాకుఁ బ్రమాణము.

శంక - ఆగమాదులయందుఁ జెప్పఁబడిన యాచారము వేద విరుద్ధము కానిచోఁ గ్రహింపదగినదే తద్విరోధంబైన మతము గ్రాహ్యముకాదు. పాంచరాత్రాగమము వేదవిరుద్ధమయినది స్వీకరింపఁబడదు. అతీంద్రియార్ధముల నెరిఁగింప శ్రుతియే సమర్ధమైనది. బ్రాహ్మణ్యసిద్ధి కొరకు వేద విహితాచారములఁ గైకొనుడు. దానబూతుఁడ వయ్యెదవు.

శ్లో॥ సర్వభూతేషుచాత్మానం సర్వభూతానిచాత్మని
     సంపశ్యన్ బ్రహ్మపరమం యాతినాన్యేన హేతునా.

సర్వభూతములయందుఁ దన్నును దనయందు సకలభూతముల నెవ్వఁడు చూచునో వాఁడేముక్తుఁడు యధాజాతుఁడా ! పాషండ ధర్మముల విడిచి యద్వైతజ్ఞాన మును సంపాదించుకొనుము. ముక్తుండ వయ్యెదవని యుపదేశించినంత మాధావాచార్యులు సంతోషింపుచు స్వకులగ్రామదేశస్థులతోఁగూడ నమ్మహాత్ముని పాదంబులఁబడి యనిగ్రహపాత్రుం డయ్యెను.

తరువాత వైఖానసమతాచారుండు వ్యాసదాసుండను వైష్ణవుండు ముందరికి వచ్చి యతీంద్రా ! బ్రహ్మదేవుండైనను మా మతము నిరాకరింపలేఁడు. నీవు వేదసమ్మతము వేదసమ్మతమని పలుమారు భాషింపుచున్నావు. మా మతము వేదసమ్మతమని మీకే తెలియఁగలదు వినుము.

శ్రుతి॥ తద్విష్ణొః పరమంపదం అను శ్రుతివలన విష్ణుపదము సర్వోత్కృష్టమని స్పష్టమగుచున్నది గదా ! మరియు ॥శ్రు ॥ నారాయణాద్బ్రహ్మాజాయతే రుద్ర ఏవచ అనుటవలన నారాయణునివలన బ్రహ్మయు రుద్రుండు జనించినట్లు తేలు చున్నది. ఈ రెండును శ్రుతులని నీ వొప్పుకొనకతీరదు. వీనివలన నతండు బ్రహ్మ రుద్రాదులకన్న నధికుండని తేలుచున్నది మేము తత్సేవకులము మావైఖానసమతము శ్రుతి సమ్మతమని దీనఁ దెల్లమగుచుండలేదా ? శంఖచక్ర పవిత్రాంగుఁడు నూర్ధ్వపుండ్రవిరాజమానుండు పూజ్యుఁడని మా మత సిద్ధాంతము అనుటయు.

శంక - వ్యాసదాసా ! మీకుఁ బాలకుఁడు విష్ణుఁడుగాని బహ్మగాని యగుం గాక. దానికి వివాదములేదు. నీవు విష్ణుభక్తుండవైతివేనిఁ దత్ప్రీతి కొఱకు గర్మలం జేయుము. అంతియకాని తత్సమముగాఁ దప్తచక్రాదుల ధరింపవలదు. అది యొక్కటియే వేదవిరుద్ధమైన పని.

వ్యాసదాసు — స్వామీ ! దీనికిఁ బ్రమాణము లేకపోలేదు. పూర్వ యుగంబున దత్తా త్రేయమహర్షి పంచముద్రలందాల్చి యున్నట్లు పురాణములలోఁ జెప్పఁబడి యున్నది. ముముక్షువులమగు మేము తన్మార్గమే కైకొంటిమి. చక్రాదిధారణము చేసి కొనక వైష్ణవత్వమునకే హాని రాఁగలదు. చిహ్నధారణ మవశ్యము చేసికొనఁదగినది.

శంక - చాలుచాలు. నీ వివేక మేమనఁదగినది ? ముద్రలవలన బ్రయోజనము లేదని బాలురకు సైతము దెలియఁగలదు. తత్త్వదర్శియగు దత్తాత్రేయ మహాయోగికి ముద్రలవలన నేమి ప్రయోజన మున్న. అతండు ముద్రలం దాల్చినట్లే పురాణములోను జూడలేదు. మూడబుద్ధిని విడిచి సుఖింపుము.

శ్లో. ప్రహ్లాదస్య విభీషణస్య గజరాజస్య ద్రువస్యానిలే
    ద్రౌపద్యాప్రజవాసినాంచఖలుకశ్చక్రాంకసంరేకరోత్
    తస్మాన్మూఢమతిం విహాయసకలం పాషండచిహ్నం త్యజ
    బ్రహ్మాస్మీతినిభావనేనసుసుఖం గచ్ఛాశుమోక్షం పదం.

వైధేయా ! ప్రహ్లాదనారదాదిభక్తులకు జక్రాంకన మెవ్వరు గావించిరి. వారు చిహ్నితులైనట్లు లేపురాణ లందైన వ్రాయబడియున్నదా ? మూఢబుద్ధిని విడిచి పాషండధర్మములను నూని "బ్రహ్మాస్మి" యని ధ్యానించుకొనుము. దాన మోక్షము నొందగలవు అని చెప్పి యతని నద్వైతమతావలంబనునిగాఁ జేసెను.

పదంపడి కర్మహీనమతవాదియగు నామతీర్ధుండను వైష్ణవుండెదురు నిలువంబడి, యతిశేఖరా ! నీ చాతుర్యంబు గొనియాడఁదగినదియే! త్రుటిలో వీరినెల్ల విధేయుల జేసికొంటివి. ఇంటియొద్ద బెద్దపెద్ద మాటలంజెప్పి వీరిట్లొప్పుకొనుట చిత్రముగా నున్నది. కానిమ్ము మా మకమతం బదిగాదు. శేషుండైన దీనిం గదలుపఁ జాలడు వినుండు

శ్రుతి॥ సర్వం విష్టమయం జగత్॥ అను వాక్యంబు మా గురుండు శిష్యునికి బోధించుచు "స్వామీ! నా శిష్యుండు నీ పాదారవిందంబుల నమ్మియున్న వాఁడు. ఏ కర్మయు నెరుంగఁడు. వానికి భవదీయ సాయుజ్య మొసంగుము" అని కోరుచుండును. భగవంతుడట్లు ప్రార్థింతుడై మా మతస్థులనెల్ల ముకులం జేయు చుండును. మాకే కర్మయును లేదు. దానంజేసి పునర్జన్మ కలుగదు. కర్మవలనఁగదా జన్మము గలుగుచున్నది. జీవన్ముక్తులమై మేము వర్తింపుచుందుము. ఇదియే మా మత సిద్ధాంతము. సన్యాసి వైన నీవు సైతము మా మత మంగీకరింపవలయును.

శంకరు - బాలికా ! నీవు సత్యము పల్కితివి. కర్మబ్రష్టుండవైన నీవు జీవన్ముక్తుండవే సందియములేదు. నింద్యానింద్యవిహీనుండవై పిశాచంబులాగున వర్తించుచున్నాఁడవు. వేదోక్తకర్మలం జేయుచు దత్ఫలమీశ్వరార్పణముఁ గావించుట జ్ఞానులమార్గము. ఫలముగోరి కర్మలంసేయుట కర్మ మార్గంబు. ఈ రెండుమార్గముల విడిచియిపుడు నీవు రాజదండనకుఁ బాత్రుండవైతివి వినుము.

శ్లో॥ నచలతి నిజవర్ణ ధర్మతో య
     స్పమమతి రాత్కసుహృద్విపక్షపక్షే
     నజహతిన చహంతికంచిదుచ్చై
     స్సితమననం తమ వైహివిష్ణుభక్తం.

నిజవర్ణధర్మముల విడువక శత్రుమిత్రపక్షముల సమముగా జూచుచు దేని ఫలమును గోరక నిర్మలమైన బుద్ధికలవాఁడు వైష్ణవోత్తముఁడని చెప్పఁబడుచున్నాడు శ్రుతిస్మృతులు భగవంతునియొక్క యాజ్ఞలు. అట్టి యాజ్ఞల ద్రోహముఁజేసినవాఁడు నా భక్తుండైనను నరకమును బొందునని విష్ణుండే చెప్పియున్నవాఁడు. కావున వేదోక్తకర్మవిడువఁగూడదు. బ్రాహ్మణులకు నగ్నియే దేవుఁడు. బ్రహ్మచర్యాదులకు సైత మగ్ని సేవ విధియై యున్నయది. అట్టి కర్మను మీరు విడిచిరి కావున మీకు పతితులైతిరని పలికిన విని నామతీర్థుండు రక్షింపుమని యయ్యతిపాదంబులబడి వేఁడికొనెను. అట్లు వైష్ణవులనెల్ల శిష్యులంజేసికొని శ్రీ శంకరాచార్యు అచటనుండి బయలువెడలి కతిపయ ప్రయాణంబుల సుబ్రహ్మణ్యంబను పేరుగల కుమారస్థానమునకు కరిగిరి. అట్లు సుబ్రహ్మణ్యక్షేత్రంబున కరిగి యందుఁ గుమారధార యను నదిం గ్రుంకువెట్టి శేషస్వరూపుండగు షణ్ముఖు నారాధింపుచు శ్రీ శంకరాచార్యు లైదు దినము లట వసియించిరి.

ఒకనాఁడమ్మహాత్ముండు దండకమండలు మండితుండై కాషాయాంబరముతో భూతిభూషిత సర్వాంగుండై రెండవ మేరుకోదుడు నింభాతివిరాజిల్లుచు సుబ్రహ్మణ్యస్వామి యాలయంబున గూర్చుండియున్న సమయంబున నాప్రాంతదేశముల నుండి కొందరు బ్రాహ్మణులరుదెంచి తత్తేజంబునకు వెరుగుపడుచు నెదుర నిలువంబడి నమస్కరింపుచు నిట్లనిరి.

స్వామీ ! మీరు సర్వమతంబులను ఖండింపుచు నద్వైతమత మొక్కటియే శ్రేష్ఠమని చెప్పుచున్నారఁట. మీతో వాదించి మా మత ప్రాబల్యము నిలుపుట కై యరుదెంచితిమి. మేము చతుర్ముఖమతస్థులము. మను ప్రభృతులచే గదితమగురుకర్మను జేయుచుందుము. సంతతము చతుర్ముఖునర్చింపు చుందుము.

శ్రుతి॥ హిరణ్యగర్భశ్శమవర్తతా గ్రేభూతస్యజాతః పతిరేకఆసీర్ ।
         సదాధారపృధివీంద్యాము తెమాంక స్మైదేవాయహవిషావిధేమ.

అని శ్రుతిచే బ్రహ్మయేనికర్తయనియుఁ బాలకుండనియు హంతయనియు సర్వాధికుఁడనియు నానంద స్వరూపుండనియుఁ దెల్లమగుచున్నది గదా ? అబ్రహ్మ లోకముల సృజించి యందాత్మస్వరూపంబునఁ బ్రవేశించి [తదైక్షత] అను శ్రుతులచే గొనియాడఁబడుచు శివవిష్ణువుల భుజములుగాఁ జేసికొని ప్రకాశింపుచుండును. మే మమ్మహాత్ముని భక్తులము. జ్ఞాననిష్ఠులము. కృతార్థులమై ముక్తినొందుచుందుము. ముక్తికిట్టిమతము ఘంటాపథమైయొప్పుచుండ నద్వైతమతంబుతో నేమి ప్రయోజన మున్నదని పలికిన నవ్వుచు శంకరాచార్యుం డిట్లనియె.

బ్రాహ్మణులారా! బ్రహ్మాదిభూతము లెవ్వానివలన జనించుచుండునో యప్పరమాత్మయొక్కఁడే నిత్యుఁడు. అతనిం దెలిసికొనవలయు. నందుల కద్వైత బోధయే హేతువు గావున వేదాంతవాక్యములు సదా వినుచుండవలయును. చతుర్ముఖ చిహ్నధారణము నింద్యము దానముక్తి లభింపదని యుక్తియుక్తముగాఁ జెప్పి వారి నొప్పించి శిష్యులగాఁ జేసికొనియెను.

పదంపడి వహ్నిమతస్థులు కొందఱరుదెంచి, స్వామీ! మేము వహ్ని సేవకులము. అగ్నిర్దెవోద్విజాతీనాం అను శ్రుతివలన బ్రాహ్మణులకగ్నియే దేవుఁడు మరియు శ్రు॥ అగ్నిరగ్రేప్రథమా దేవతాదేవతానాం అను ప్రమాణమువలన దేవతలకు సైతమగ్నియే ముఖ్యుఁడని స్పష్టమగుచున్నది. అదియునుంగాక శ్రుతి|| ఉద్దీప్యస్వజాత వెదోపఘ్నంనికృతింమమ.॥ అనుశ్రుతిచే విప్రులెల్ల నగ్నినారాధింపవలయునను విధి విధింపబడుచున్నది స్ఫులింగాత్ముని శకల ధారణమునఁ బవిత్రులగుచుందురు. అగ్నియేసర్వోత్తముఁడు. తదారాధనము బ్రాహ్మణులకు ముక్తిప్రదము. దీనినెట్లు పూర్వపక్షము చేయుదురని పలికిన నాచార్యుం డిట్లనియె.

అగ్ని దేవతలకు సముఁడనియుఁ జెప్పబడియున్నది. అదియునుంగాక అగ్ని పరిచారకుండై దేవతలకు హవిర్భాగములఁ దీసికొనిపోయి యిచ్చుచుండును. మఱియు వహ్ని కర్మదేవత. అగ్ని కారణ వాక్యంబులన్నియు భూతాగ్ని పరమునుగా నిరూపింపఁబడినవి. మీరు వహ్య్నధీనముగా గర్మలసేయుచుండుఁడు. శ్రద్ధమాత్ర మద్వైతజ్ఞానమందుంచవలయును. దానంగాని మోక్షములేదు. అని తత్ప్రవృత్తి యంతయు బోధించి శిష్యులగాఁ జేసికొనియె.

తరువాత రక్తచందనపుష్పాదులందాల్చి సూర్యోపాసకులు శంకరాచార్య నెదుటకువచ్చి నమస్కరింపుచు యతీంద్రా! మేము సౌరమతస్థులము. మామతవృత్తి నాకర్ణింపుడు. సూర్యుండు త్రిమూర్తి స్వరూపుండని వేదముఁజెప్పబడియున్నది. సృష్టిస్థితిలయములు కమ్మహాత్ముండేకారణుండు. అతండే ప్రత్యక్షదైవము. 'ఘృణి స్సూర్య ఆదిత్యః' అనుమంత్రము సంతతయు జపించుచుందుము. మామత మారు విధములుగా నొప్పుచున్నది. కొందఱు బ్రహ్మస్వరూపుండగు దనుయభాస్కరు నారాధింతురు. కొందఱు శివస్వరూపుండగు నాకాశమధ్యస్థభాస్కరుని సేవింతురు. మఱి కొందఱు విష్ణుస్వరూపుండగు నస్తమయభాస్కరుం గొల్చుచుందురు. కొందఱు కాలత్రయమందును ద్రిమూర్త్యాత్మకమగు రవిబింబమును సేవించుచుందురు కొందఱు మండలేక్షణ వ్రతధారులై కాంచనశ్మశ్రుకేశాదియుక్తుండగు తన్మండల మధ్యస్థితు జూచుచు భవింపుదురు. వారు రవిబింబముజూచి కాని భుజింపరు. కొందఱు తప్త లోహంబున లలాట భునజవక్షస్థలంబున మండలచిహ్నంబుల వెలయించుకొని యుపాసింతురు. షడ్విధసౌర మతస్థులును మూలమంత్రమునే జపించుచుందురు.

మఱియు దన్మండలమధ్యవర్తియగు పురుషుండు పరమాత్మయని యనేక శ్రుతులు ఘోషింపుచున్నవి. పురుషసూక్తంబున భానుఁడే ప్రధానుఁడని నిరూపింపఁ బడియున్నది. గీతలలోఁగూడ అదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం రవిరంశుమాన్॥ అని శ్రీకృష్ణభగవానుఁ డానతిచ్చియున్నాఁడు. బ్రహ్మాదిదేవతలు సూర్యునివలనం గలుగు చున్నారు. కావున ముముక్షువులు సూర్యునారాధించిన ముక్తినొందెదరిదియే మామత మని యెరింగించిన శంకరాచార్యులు మందహాసముగావింపుచు నిట్లనిరి.

ఓ భాస్కరభక్తులారా! మీరు నుడివిన ప్రమాణములే మీమతమును బూర్వ పక్షముసు సేయుచున్నవి వినుండు. చంద్రమామనసోజాతః చక్షోస్సూర్యో అజాయత అని పురుషసూక్తములో నున్నది. సూర్యుడు పరమపురుషుని చక్షుస్సులవలన జనించెనుగదా యేదిపుట్టుచున్నదో యది తప్పక లయమగునని తర్కశాస్త్రసిద్ధాంతము. అట్లనిత్యవస్తువులకు బ్రహ్మత్వ మెట్లు చెప్పెదరు? శ్రుతులు సూర్యనిష్ఠపర బ్రహ్మను స్తుతియింపుచున్నని. అదియునుగాక శ్రు॥ భీషాస్మాద్వాతః పవతె భీషోదేతిసూర్యః భీషాస్మాదగ్ని శ్చేంద్రశ్చః పరమాత్మకు జడిసి వాయువు వీచుచున్నది సూర్యుడు బ్రతిదినముదయింపుచున్నాడు. అగ్ని యింద్రుఁడు లోనగు వారాజ్ఞావర్తులగుచున్నారని శ్రుతులు చెప్పుచుండగా సూర్యుఁడు పరమాత్మ యెట్లగును. మరియును,

శ్రు. నయత్రసూర్యోభాతినచంద్రతారకం
     నేమావిద్యుతో భాంతికుతోయ మగ్నిః
     తమేనభాంతమును భాతిసర్వం
     యస్యభాసాసర్వమిదం విభాతి.

ఏ పరమేశుని కాంతి పరిపూర్ణమై వెల్లుచుండ సర్వము ప్రకాశింపుచుండునో యట్టిపరమాత్ము ననుసరించి యంతయుం బ్రకాశింపుచుండును. అతని ప్రకాశములేనిదే సూర్యుఁడును జంద్రుఁడును దారలు మెఱపులు నగ్నియుఁ గూడఁ బ్రకాశింపరు. అని శ్రుతులు వక్కాణింపుచుండ సూర్యుఁడే పరమాత్మ యని చెప్పుటకన్న యవివేక మున్నదియా? జ్యోతిశ్శాస్త్రంబున సూర్యుని నిర్యత జెప్పబడియున్నది. ఇట్టి రవికి జగత్కారణత్వముఁజెప్పెడి మీవిద్యామహిమ గొనియాడఁదగినదే మూడబుద్ధిని విడిచి దానముక్తులయ్యెదరని యుపదేశించి వారినెల్ల శిష్యులుఁగా జేసికొనియెను.

జగద్గురుండట్లు చతుర్ముఖ వహ్నిసౌరమతస్థులఁ ద్రిసహస్రసంఖ్యాకుల నద్వైత మతావలంబకులం గావించి వారిలోఁ గొందరు శంఖములు బూజింపుచుఁ గొందరు ఘంటానాదంబులం గావింపుచుఁ గొందరు దాళంబులు వాయింపుచుఁ గొందరు వింజామరలు వీచుచుఁ గొందరు ఛత్రంబులంబట్టుచు సేవింపనన్యస్తసుఖ దుఃఖుండై యటఁ గదిలి వాయవ్య దిగ్దేశమునకరిగి యందందు సంచరింపుచుఁ జనిచని గణపత్యాశ్రమంబు గణపరంబను పురంబుఁజేరి యందు గౌముదీ నదియందు గృతావ గాహుండై గణపతినారాధింపుచు శిష్యులతోఁగూడ నందొకమాసము వసించెను. పర విద్యాప్రభేదులు దిగ్గజములని బిరుదు వహించిన యమ్మహాత్ముని శిష్యులు పద్మపాద ప్రభృతు లొకనాఁడు సాయంకాలమున నయ్యాచార్యశిరోమణిం బీఠంబున కూర్చుండఁ బెట్టి ఢక్కా తాళ ప్రముఖ వాద్యవిశేషంబులఁ బూని యమ్మహాత్ముని స్తుతిజేయుచు నృత్యములు చేయుచు నిట్లుపాడిరి.

శ్లో. ప్రపూర్ణం బ్రహ్మాహంనిఖిలజనకం బుద్ధినిహితం
    చిదానందం సత్యంసకలజగదాధారమమలం
    అగమ్యంవాగాద్యైస్సుజితకరణైర్జాతమనమై
    స్సునిర్వాణం లబ్ద్వాయదిహనపునస్సంసృతిరయః.

అట్లు పెద్దతడవు గురుభజనచేసి శిష్యులెల్ల నరసి పరమానందమంతో గురుసమీపంబున వసించిరి.

గాణపత్య మతము

అట్టి సమయమున నప్పట్టణవాసులగు బ్రాహ్మణు లావింతఁజూచి యాక్షేపించుచు, అయ్యా ! యింతదనుక మీ స్తుతివాక్యములన్నియు వింటిమి. ఆకాశమువలె నిరాలంబమై యవాజ్మౌననగోచరమై యొప్పు నద్వితీయ బ్రహ్మము నజ్ఞుండెట్లు తెలిసికొనఁగలఁడు. మీ మతమేమియు లెస్సయైనదికాదు. శుభములు కావలయునని యభిలాష గలిగినచో మా మతమును స్వీకరింపుడు. వినుఁడు మాది గాణసత్యమతము . అది యారుభేదములు గలదిగా నున్నది. దేవతలెల్లరు దీనినే పొగడుచుందురు. తుం డైకదంత చిహ్నితుండగు మహాగణపతి శ క్తిసహితు నెవ్వఁడు మూలమంత్రము పఠించుచు సేవించునో యతఁడే ముముక్షువు. శ్రు॥ ఆసీద్గణపతిస్త్వేకః॥ అను శ్రుతి ప్రమాణము వలన గణపతియే జగత్కారణుఁడని తేలుచున్నది. ఆయన మాయచేతనే బ్రహ్మాదులు సృష్టింపఁబడిరి. దానంజేసియేకదా యతనికిఁ బ్రారంభమునఁ బూజ్యిత్వము గలిగినదని యుక్తియు క్తముగా నుపన్యసించిన విని శంకరాచార్యులు మూర్ఖులారా! వినుండు.

గణపతి రుద్రసుతుండగుటఁ బ్రసిద్ధిఁ జెందెను. అందులకు రుద్రుండు కారణుండు. కాని శ్రుతి ప్రమాణము కాదు. మీ నుడువు లంగీకరింపబడవనుటయు వారు మరల స్వామీ ! చిహ్నలేనివాఁడు గణపతి సన్నిధికిఁ బోవుటకు యోగ్యుఁడు కాడు. మీ కట్టిచిహ్న మేమియునులేదు. కావున దేవసన్నిధి నుండరాదని పలికిన గురుండిట్లనియె. ఓరీ ! పాషండుడా బ్రాహ్మణకులంబునఁ బుట్టినఁవాడు శిఖాయజ్ఞోపవీతంబులం దాల్చి వేదోక్తములగు కర్మలం చేయుచుండవలయు నట్లయిన విప్రత్వము సిద్ధించును. వేదమునందును బురాణములయందును నిందింపఁబడిన చిహ్నలం దాల్చిన మీరెట్లు బ్రాహ్మణులగుదురు ? థాలిశులారా ! మీ దేహంబుల మూలాధారాది చక్రంబుల గణపతి విరాజిల్లుచుండె వాని సేవింపరాదా ? చిహ్నధారణంబున నణుమాత్రమైన బ్రయోజనము లేదు. వేదోక్తమగు పరమాత్మను దెలిసికొనుఁడు. ముక్తులయ్యెదరు. మరియుఁ బంచపూజాపరాయణులైతిరేని మీ యభీష్టము దీరఁగలదు అందు గణపతి యున్నవాఁడని యుపదేశించి వారి శిష్యులుగాఁ జేసికొనియెను. పిమ్మట హరిద్రా గణపతి మతవాడి ముందరకు వచ్చి యతివర్యా!

శ్లో. పీతాంబరధరందేవం పీతయజ్ఞోపవీతినం
    చతుర్భుజం త్రినయనం హరిద్రా లసదాననం
    పాసాంకుశధరం దేవం దుండాబుజకరాభయం
    ఏవయంయఃపూజ యద్దేవం సముక్తోన్రాతసంశయః

అని యున్నది. హరిద్రాగణపతియే జగత్కారణుండు. బ్రహ్మాదు లాయన యంశంబున జనించిరి. మీరుకూడ నమ్మహాత్ముని సేవించినఁ గృతార్ధులగుదురు. తుండైకదంతాకారములగు లోహంబుల భుజంబులంజిహ్నలుంచుకొనిన ముక్తిరాకుండున్నాయని పలికిన నవ్వుచు గురుండిట్లనియె, మూఢా! తుండాకారములగు లోహంబున గట్టిగఁ గాల్చి కొంటినేని తప్పక నీకు శరీరమోక్షము గలుగుట కెంతమాత్రము సందియము లేదు. గణాధిపతి జగత్కర్తయగుంగాక సర్వనామములు నమ్మహాత్మునికిఁ జెల్లును. అతఁడు రుద్రసుతుండగుట నశాంశులకభేదముఁ జెప్పవచ్చును. ఎల్లవారు గణపతి నుపాసింపఁ దగినదే అందుల కేమియు నాక్షేపము లేదు. బ్రాహ్మణులకు గణేశాదిపంచాయతన పూజ విధింపఁబడియున్నది. కాని చిహ్నధారణము కడుదూష్యము. దాన బ్రాహ్మణ్య హాని యగునని బోధించి వారిని స్వమతప్రవర్తకులం గావించెను.

అప్పుడుచ్ఛిష్టగణపత్యుపాసకుఁడు జగద్గురు నెదురుపడి, అయ్యా, మా మతమునకు మహా గణపతి హారిద్రాగణపతి యుచ్ఛిష్ట గణపతి నవనీతగణపతి సువర్ణ గణపతి సంతాన గణపతియని యారు విధముల నధిదేవతలు బ్రఖ్యాతులైయున్నారు. మొదటివారు నిరువురును మాయబన్ని శిష్యులం జేసికొంటివి. నేనుచ్చిష్టగణపత్యుపాసకుఁడ. నా మతమునిరాకరింప నీకకాదు నిన్ను సృష్టించిన విరించికైన శక్యముకాదు, వినుము.

శ్లో. చతుర్భుజంత్రినయనం పాశాంకుశగదాభయం
    తుండాగ్రతీవ్రమధుకం గణనాధమహంభజె
    మహాపీఠనిషణ్ణంతం వామాంగో పరిసంస్థితాం
    దేవీమాలింగ్యచుంబంతం స్పృశంస్తుండేనవైభగం

ఇట్టి స్వరూపముగల గణపతిని మేమారాధింతుము. జీవేశ్వరుల కైక్యము గలిగి నట్లాగణపతికిని దేవికిని నైక్యము గలిగియున్నది. ఫాలంబునంగుంకుమదాల్చుట మా మతాచారమై యున్నది. ఇచ్ఛాధీనములగు కర్మలంజేసిన మాకు దోషములేదు. మా మతంబున స్త్రీ పురుష జాతులు రెండేకాని యితర జాతిభేదములు లేవు. స్త్రీ పురుష సంయోగమువలన దోషనిరూపణము మా మతంబున యేమియుఁ జేయలేదు. ప్రతి వనితయు నిష్టమగు పురుషునితో భోగింపవచ్చును. దీనికి వీఁడేపతి యని దైవమని నిరూపించెనా యేమి? స్త్రీ పురుష సంయోగమువలనఁ కలిగిన యానందమే ముక్తియని మా మతసిద్ధాంతము. తదానందస్వరూపుఁడే గణేశుఁడు. బ్రహ్మాదులు తడంశసంజాతులు శ్రు॥ సకర్మణానప్రజయా అను శ్రుతి కర్మమువలనఁ బ్రయోజనము లేదని చెప్పుచున్నదికదా ! దానంజేసి మా కేమియు కర్మము లేదు. పుణ్యపాపములఁ దుల్యముగాఁజూతుము. ఇంత సుఖమైన మతము మరియొకటిలేదు. సుఖమిచ్ఛయించినవారెల్ల నీమతమే కైకొనవలయు నిదియే ముక్తిప్రదమని పలికిన విని యాచార్యుం డిట్లనియె.

ఓరీ మూర్ఖ ! నీ మతము ముక్తిప్రదమని నీవేకొనియాడుకొనవలయును. శ్రు॥ సురాం నైవపిబేత్ నైవపరదారాన్ గచ్చేత్. కల్లు తాగఁగూడదు పరదారలగూడఁ గూడదని శ్రుతులుఘోషింపుచుండ వానివలన ము క్తిగలుగునని చెప్పుచుంటివి. ఆహా నీపాండిత్యము, నకర్మణా. అను శ్రుతి కర్దమేమియో యెరుంగుదువా? అది తత్వవేది యగు యతినిమిత్తము చెప్పఁబడినదికాని మీబోటులకు గాదు. పాపాత్ములు నరకార్హులుఁ నీవుపతితుండవుఁ ప్రాయశ్చిత్తము కావింతుము. నంచపూజాపరాయణుండవుకమ్ము. అజపాదమంత్రంబుల జపింపుము. ముక్తుండవయ్యెదవని చెప్పి ప్రాయశ్చిత్తపూర్వకముగాఁ దత్త్వోపదేశముఁజేసి వారి మతస్థులతోఁగూడ శిష్యునిఁగా జేసికొనియెను.

అట్లె తక్కిన మూడు మతములవారునువచ్చి యాచార్యునితోఁ బెద్దతడవు వాదించి తదీయో క్తి ప్రహరణములచే గొట్టఁబడి శిష్యులై సేవించిరి. అట్లు శంకరాచార్యులు క్రమంబున శాక్తశైన వైష్ణవ సౌరగాణాపత్యమతంబుల ఖండించి తద్దేవతల బంచాయతనము లనిత్యముఁ బూజించుకొమ్మని యుపదేశించి వారెల్ల శిష్యులై సేవింపుచు దోడరా నటకదలి కాంచీపురంబునకరిగిరి. అందమ్మహాత్ముండు శిష్యులతోఁకూడ నొక మాసమువసించి శంకరప్రతిష్టాపూర్వకముగా శివకాంచియను పట్టణముగట్టించి తత్సేవకై పెక్కండ్ర బ్రాహ్మణుల రప్పించి శుద్ధాద్వైతబోధఁ గావించి వేదాంత తాత్పర్యనిష్టులై యొప్ప నందు నిలిపెను. ఒకనాఁడు తామ్రపర్ణీ తీరమునుండి కొందరు బ్రాహ్మణులరుదెంచి గురువువరుని చరణంబులకు నమస్కరింపుచు నిట్లనిరి. స్వామీ యీలోకంబున దేహాదులకు భేదము ప్రత్యక్షముగా గనంబడుచున్నది. పరలోకంబున సైతమా మా యీకర్మలవలన నాయా యీ దేవతలనుపాసించుటచే నాయా యీ లోకములు కలుగునని వినుచుండుట భేదమే నిజమైనట్లు తోచుచున్నది. అభేదవాదనకు నిదర్శనమేమని యడిగిన నాచార్యుం డిట్లనియె.

విప్రులారా ! పరమార్ధతత్త్వము దెలియకపోవుటచే మీరిట్లంటిరి. వినుండు.

శ్రు॥ యత్రత్వస్యపరమాత్మై వాభూతత్కేన కంపశ్యేత్ అను శ్రుతి ప్రమాణమువలన దత్త్వజ్ఞానాగ్నిచే దగ్ధమగు పాపపంజరముగలవానికి ముక్తిదశయందు భేదభావము దెలియఁబడును.

శ్రు॥ తత్సృష్ట్వాతదేవాను ప్రావిశత్॥

అను ప్రమాణమువలన జగత్కర్తయగు పరమాత్మయే జీవరూపముగా జగములో బ్రవేశించెనని స్పష్టమగుచున్నది. మరియు దేవతలెందఱని శంకించికొని మువ్వురా ? మూడువందలా! మూడువేలా ? ముప్పదిమూడువేలా ? ముప్పదిమూడు కోటులా ! యని యనేకత్వము నిరూపించుకొని యంతర్భాగక్రమంబున నొక్కఁడే దేవుఁడని నిశ్చయింపబడినది. మొదట బ్రహ్మకే యనేకత్వము జూపఁబడిఁనదిగదా.

శ్రు॥ బహుస్యాంప్రకాయేయేతి. అనిశ్రుతిచే భోక్తృభోగ్యాత్మకమగు సకల ప్రపంచకమునకుఁ బరమాత్మరూపత్వము ప్రతిపాదింపఁబడినది కావున సర్వజ్ఞు నిత్య శుద్ధబుద్ధస్వభావు సకలవివర్తాధిష్ఠాను బరబ్రహ్మను ముముక్షువులుపాసింపఁదగినది. మీరును జీవపరమాత్మ భేదమును దేవతాభేదమును విడిచి శుద్దాద్వైతబ్రహ్మోపాసనఁ జేయుడు. ముక్తులయ్యెదరని యుక్తియుక్తముగా నుపదేసించినఁ దెలిసికొని కాంచీతామ్రపర్ణీ దేశవాసులగు బ్రాహ్మణులెల్ల నద్వైతజ్ఞానభూయిష్ఠులైయొప్పిరి.

అట్లాచార్యవర్యుండు నిజపాదసేవాపరాయణులై నానాదేశములనుండి యరుదెంచిన బ్రాహ్మణుల సద్వైతజ్ఞానబోధచేఁ గృతార్థులంగావించి యచ్చటనుండి వేంకటాచలమున కరిగి యందు వేంకటేశ్వరునిచే నారాధించి పదంపడి విదర్భరాజధానికింజని కథకై శివకేశ్వరునిచే నర్చితుండై శిష్యులతోఁగూడ నప్పట్టణంబునఁ గొన్ని దినంబులు వసించెను.


శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

53 వ మజిలీ

షష్ఠోల్లాసము

క్రకచుని కథ

గీ. మానవ కపాల మొకకేలఁ బూనిభూరి
   శూలమింకొక కేలఁ దాల్పుచు శ్మశాన
   భసితలిప్తాంగుఁడై జటాపటల మొప్పఁ
   గ్రకచనామక కాపాలిక ప్రభుండు.

స్వతుల్యవేషులగు కాపాలికులు పెక్కండ్రు సేవింపఁ గర్ణాటదేశంబున నోలగంబుండి యొకనాఁ డాప్తులతో నిట్లు సంభాషించెను.

క్రకచుఁడు - వయస్యా ! విద్యుజ్జిహ్వ! శంకరుండను దాంభిక సన్యాసి గగనపుష్పసమానమగు క్రొతమత మొకటి కల్పించి యెల్లమతస్థులం బరిభవించుచు