Jump to content

కాశీఖండము/షష్ఠాశ్వాసము

వికీసోర్స్ నుండి

షష్ఠాశ్వాసము


శ్రీ శ్రీకటాక్షవీక్షణ
విశ్రాణన! విభవవిజితవిద్యాధర! వ
ర్ణాశ్రమరక్షాతత్పర!
యాశ్రితమందార! రెడ్డియల్లయవీరా!

1


వ.

అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె.

2


సాంబాదిత్యమాహాత్మ్యము

సీ.

యదువంశమునయందు నవనిభారాపనో
        దార్థంబు దుష్టదైత్యావశేష
హరణార్థముగఁ బుట్టె నంభోజనాభుండు
        దేవకికిని వసుదేవునకును
ద్వారవతీపురాధ్యక్షుండు దైత్యారి
        యవరోధకాంతాసహస్రములకు
గాంచె నందనుల లక్షయునెనుబది వేల
        మాన్య లైన ప్రధానమహిషులందు


తే.

జాంబవతి యనుదేవియు సాంబుఁ గనియె
నక్కుమారుండు లేఁతప్రాయంబునందు
వీథి నొకనాఁడు సఖులతో విహృతి సలుప
నెచట నుండియొ నారదుం డేగుదెంచె.

3

క.

ఆటతమకమున నమ్మధు
కైటభరిపుసుతుఁడు మిగుల గౌరవబుద్దిన్
బాటింప నెఱుఁగఁ డయ్యెను
హాటకగర్భునితనూజు నభ్యాగతునిన్.

4


ఉ.

తోడికుమారులున్ సఖులు దూరమునంద కరారవిందముల్
మోడిచి ఫాలభాగముల మోపి నమస్కృతు లాచరింపఁగా
నాడుచు నుండెఁగాని ముని కంజలి సేయఁగ నేరఁడయ్యె న
వ్వేడుకకాఁడు పుట్ట దొకవేళ వివేకము నెట్టివారికిన్.

5


చ.

త్రిదశమునీశ్వరుండును మదిం గలుషం బొకమూల నుండఁగా
యదుకులసార్వభౌముఁ గని యర్చన గైకొని యిష్టగోష్ఠితో
ముదితల నమ్మి యేమఱుట మోసముసూ! యని బుద్ధి చెప్పు చ
చ్చదురుఁడు సన్న సేయఁదగ జాంబవతీసుతు నెన్నె ధూర్తుఁగాన్.

6


తే.

ఎన్ని యాతోయమున మిన్న కేగి దివికి
నారదుఁడు శౌరిచేత సత్కార మంది
నెరసు పొడఁగానలేఁ డయ్యె నెమకి నెమకి
సాంబుపైఁ బాంచజన్యరథాంగపాణి.

7


వ.

అంతం గొన్ని దినంబులకు.

8


తే.

సాంబు నడచినదాఁక వ్రతంబు పట్టె
జలజసంభవతనయుండు చలపకారి
ద్వారవతి కేగుదెంచి యంతఃపురమున
బుండరీకవిలోచనుం డుండు టెఱిఁగి.

9


తే.

వెదకి సాంబునిఁ బొడగాంచి విబుధమౌని
హరికిఁ దనరాక నెఱిఁగింపు మనుచుఁ బలికెఁ

బోవు టనుచిత మొప్పదు పోవ కునికి
యేమి సేయుదు పని యాతఁ డిచ్చఁ దలఁకి.

10


వ.

ఎట్టకేలకు శుద్ధాంతగతుం డైయున్నతండ్రిసమీపంబున కరిగి యవ్వేళాగమనాపరాధంబు గారణంబుగా శౌరిచేతం గుష్ఠవ్యాధిబాధితుండు గా శపింపంబడి సాంబుండు.

11


తే.

తండ్రికిని నారదునికి వందనము చేసి
జాంబవతిపట్టి శాపావసాన మెఱిఁగిఁ
గాశికకు నేగి యత్యంతగాఢభక్తి
భాను సేవింప నీవ్యాధి మాను ననిన.

12


వ.

ఇట్లు నారదానుమతిం గృష్ణుచేత శాపమోక్షప్రకారం బెఱింగి సాంబుండు కాశి కరిగి తదుపదిష్టమార్గంబున భాను సేవించి కుష్టవ్యాధిబాధావిముక్తుం డయ్యె. ఇది సాంబాదిత్యమాహాత్మ్యంబు.

13


గరుడాదిత్య మయూఖాదిత్య ఖఖోల్కాదిత్యారుణాదిత్యమాహాత్మ్యము

సీ.

పరమసంయమి కశ్యపప్రజాపతికిని
        వినత కాత్మజుఁ డైనవిహగభర్త
విషధికుక్షినిషాదవితతి భక్షించుచో
        ద్విజుఁ గ్రాసి యుమిసినవిమలబుద్ధి
యిభకచ్ఛపముల రోహిణిశాఖతోఁ దాల్చి
        దివిమీఁదఁ బాఱినపవనవేగి
యహికోటి గెల్చి చి చ్చార్చి చక్రము దూరి
        యమృతంబుఁ గొన్నట్టియమితబలుఁడు


తే.

జిష్ణుపవి కొక్కయీఁక యిచ్చినప్రదాత
యచ్యుతునివాహనము తార్క్ష్యుఁ డగ్రజులును

దానుఁ దల్లియుఁ గాశికాస్థలమునందుఁ
గొలిచి రర్కుల నలువురఁ గుంభజన్మ!

14


వ.

అని చెప్పిన విని యగస్త్యుండు హస్తంబులు మొగిడ్చి పార్వతీహృదయానందవర్ధన! కుమార! యొక్కసందేహంబు నడిగెదం దెలియ నానతిమ్ము. దక్షప్రజాపతిపుత్త్రి కశ్యపప్రజాపతిపరిగ్రహంబు గరుత్మంతునిజనయిత్రి వినత యేమికారణమున దాస్యంబు వహించె నని యడుగుటయు బాహులేయుండు కుంభసంభవున కి ట్లనియె.

15


తే.

సవతి కద్రువ శేషతక్షకులు మొదలు
గాఁగ వేవురు భుజగపుంగవులఁ గాంచె
నండముల మూఁటిఁ గలధౌతగండశైల
సన్నిభంబులఁ గనెఁ బుణ్యసాధ్వి వినత.

16


ఉ.

ఆదిమ మైనయండమునయం దుదయించెను గూబపుల్గు సూ
ర్యోదయవేళ ముజ్జగము నుబ్బరపోవఁగ నయ్యులూక మ
ష్టాదశసంఖ్యదీవులను సర్వవిహంగమకోటికిన్ మహా
హ్లాదము గా వహించెను లలాటమునం దధిరాజపట్టమున్.

17


తే.

ఖగములకు నాదిజం బైనకారణమున
సమ్మతించె విహంగమజాతి మొదలఁ
గౌశికము రాజ్యయోగ్యంబు గా దటంచు
నగియెఁ బిమ్మట దుర్లక్షణములు సూచి.

18


సీ.

భంగించిన ట్లుండుఁ బడఁత మాటికి మాటి
        కూర్ధ్వకంపంబు సేయుటకతాన
జంకించిన ట్లుండు శ్రవణనిష్ఠురముగా
        జెలఁగి ఘూత్కారంబు సేసె నేని

బెదరించిన ట్లుండుఁ బృథువర్తులములైన
        దృగ్గోళకంబులు దిరుగఁబడిన
గర్వించిన ట్లుండు ఘస్రంబు నాల్జాలు
        నెదిరిఁ దన్నునుఁ గాంచు నెఱుక లేమిఁ


తే.

బుట్టుపుణ్యంబుమాలిన జట్టిపులుగు
గూబ యెక్కడఁ కలహంసకోకకీర
నీలకంఠాదిబహుషక్షినివహరాజ్య
భార మెక్కడ? యిది యసంబద్ధ మనుచు.

19


వ.

కులము పెద్దలు పరాభవించిన.

20


ఉ.

గద్దియ డిగ్గి [1]కాశ్యపుని గాదిలిసూనుఁడు కొండ వట్టినన్
ముద్దియ దక్షుకూఁతురు విముగ్ధత రెండవపుత్రునైన నుం
దద్దయు వేడ్కఁ జూతు నని తాలిమి లేక నఖాంకురంబునం
బిద్దము చేసె మై సగము నిండనిగర్భముతోడియండమున్.

21


వ.

దాన నపరార్ధకాయహీనుండును బూర్వార్ధమానతనూసహితుండును నైనపుత్రుం డనూరుం డన నుద్భవించి యపకారంబు సేసినతల్లిం గినిసి సవతికి దాసివి క మ్మని శపియించిన.

22


సీ.

వలరాయన్న! నాయేకాపరాధంబు
        సైరింపవైతి యీ శాపమునకు
మోక్ష మెన్నఁడు గల్గు నక్షీణకారుణ్య!
        గరిమఁ జెప్పర యాత్మ గలఁగె నాకు

ననవు డాపిచ్చుకుం టమ్మతో నిట్లను
        నేనూఱువర్షంబు లేగునంత
మూఁడవయీయండమున నుద్భవించిన
        తనయుండు తల్లి! నీదాస్య ముడుపు


తే.

నేమరక దీని రక్షింపు మీవు నియతి
ననుచు బుద్ధులు చెప్పి యయ్యరుణుఁ డరిగె
జననియనుమతిఁ గాశికాస్థానమునకుఁ
దారకబహ్మవిద్యానిధానమునకు.

23


వ.

ఆశాపంబు కారణంబుగా నొక్కనాఁడు కద్రూవినతలు సముద్రతీరంబున వినోదార్థంబు విహరించువారు వేలానువన(ధి)వనప్రాంతంబున మరుత్వంతునితురంగం బుచ్చైశ్శ్రవంబు మేయుచున్నం గనుంగొని వినత ‘యోహో! యీహయోత్తమం బింత యొప్పునే! మహాపురుషునికీర్తిపూరంబునుం బోలెఁ గార్తికచంద్రచంద్రికాధవళం బయియున్న యది’ యనినఁ గద్రువ యేకన్నులఁ గనుఁగొంటివి? ఈ తురంగంబునందు నిందుబింబంబునందుఁ గందునుం బోలె వాలవీధియందు వాలంబు లొకకొన్ని నీలంబు లయియున్నయవి యని పలికె. ఉన్నయవియనియును లేవనియునుం గొంతతడ విద్దఱు వాదంబు సేసి దాస్యంబు పణంబుగాఁ బన్నిదంబు చఱచిరి. అప్ప్రొద్దునకుం బ్రొద్దు చాలమి నిజనివాసంబుల కరిగిరి. మఱునాడు ప్రాతఃకాలంబునఁ గద్రువ గొడుకులం బిలిచి పనిచినం గొంద ఱక్కార్యంబునకు సమ్మతింపక కినుకం బడిరి. కొందఱు వాలమాత్రసూక్ష్మాకారులై వహించి వాలంబునందు వ్రేలిరి. అంతఁ దత్పరీక్షణంబునం వినత యోటువడి

కద్రువకు దాస్యంబు సేయుచుండె. మఱి యేనూఱువత్సరంబులకుఁ దృతీయాండంబునం దుదయుంచినగరుత్మంతువలన నమృతహరణంబు నిష్క్రయంబుగా దాస్యంబువలన విముక్తిం బొందె. కుంభసంభవ! నీయడిగిన ప్రశ్నంబునకు నిది ప్రత్యుత్తరంబు.

24


సీ.

పక్షిసామ్రాజ్యసంపత్పదభ్రంశంబుఁ
        బొందినపెనుగూబపులుఁగుఱేఁడు
కటిభాగమున కధఃకాయంబు శేషంబు
        పేలవం బగుపుట్టు పిచ్చుకుంటు
సవతి కేనూఱువత్సరములదాఁక దా
        స్యంబు సేసి కృశాంగి యైనవినత
యనిలాశనులను వీఁపునఁ బెద్దకాలంబు
        భరియించి తిరిగినపక్షిరాజు


తే.

తల్లి నలువురుఁ గాశికాస్థానసీమ
హరుని ప్రతినిధు లైనభాస్కరులఁ గొలిచి
యచిరకాలంబునన యభీష్టార్థసిద్ధిఁ
గనిరి ప్రతిబంధములు వాసి కలశజన్మ!

25


వ.

గరుడునిపేర గరుడాదిత్యుండును, నులూకంబుపేర మయూఖాదిత్యుండును, వినతపేర వర్షాదిత్యుండును, నరుణునిపేర నరుణాదిత్యుండును ననం బరఁగిరి. ఇంక వృద్ధాదిత్య కేశవాదిత్య విమలాదిత్య గంగాదిత్య యమాదిత్యుల మాహాత్మ్యంబులు సెప్పెద నాకర్ణింపుము.

26


సీ.

వృద్ధహారీతుండు వృద్ధత్వమునఁ బాసి
        తరుణుఁ డై రవిఁ గొల్చి వరము వడసె

[2]ఆదికేశవదేవుఁ డభ్యాసమున నుంచి
        రవి శంభుఁ గనిపించె రత్నమూర్తి
విమలాహ్వయుఁడు రాజు కమలబంధు భజించి
        ప్రబలకుష్ఠవ్యాధిబాధఁ బాసెఁ
దొల్లి గంగ భగీరథుఁడు తెచ్చునప్పు డ
        న్నదిఁ జూచి వినుతించినాఁడు తరణి


తే.

యముఁడు యమతీర్థమునఁ దండ్రి నర్కుఁ గొలిచి
తపము గావించి వడసెఁ దత్కరుణ గాన
[3]నిన్నిచిహ్నలఁ గాశిలో నినులపేళ్లు
వాట మైయుండు ధన వాని వానివలన.

27


శివుండు బ్రహ్మం గాశి కనుపుట

వ.

వెండియుం గాశీవియోగవేదనాక్రాంతస్వాంతుం డై యంధకారాతి తద్వృత్తాంతశ్రవణకౌతూహలంబున విధాత మహాపరేతనిలయంబునకుం బంచువాఁడై యవ్విరించి రావించి యిట్లనియె.

28


ఉ.

పోయెను యోగినీబలము పోయిన పోకనె పోయెఁ బిమ్మటం
దోయజబాంధవుం డతఁడునుం దడసెంగడుఁ [4]జెర్వుఁ జూడఁగా
బోయినతూఁడుతీఁగెక్రియఁ బోయినయట్లనె కాశిఁ జిక్కిరీ

తోయము నీవుపో ద్రుహిణ! తొల్లిటివారలయట్ల కాకుమీ!

29


వ.

అనినం బ్రసాదం బని పనిపూని బ్రహ్మ వృద్ధబ్రాహ్మణవేషంబునఁ గాశిఁ బ్రవేశించి పేరోలగం బున్న దివోదాసు నాశీర్వదించి యి ట్లనియె.

30


తే.

అధిప! యానందకాననాభ్యంతరమున
యజ్ఞములు సేయువాఁడ నీయభ్యనుజ్ఞ
ననుమతింపుము సాహాయ్య మాచరింపు
రాజు నడపింప కెట్లు ధర్మంబు నడచు?

31


తే.

అకట! విశ్వేశ్వరుఁడు లేమి ననదవోలె
నున్నయది కాశికాపురి యోనృపాల!
యున్నవేల్పులు రాకుండ సున్నఁగాని
వామదేవుని రప్పింపవలెఁ జు మయ్య!

32


వ.

అని [5]మైవాకగా నాడి యర్ధాంగీకారంబు వడసి ధాత దశాశ్వమేధయాగంబులు సుప్రయోగంబులుగా నాహరించి బ్రహ్మేశ్వరదేవుఁ బ్రతిష్ఠించె. భాగీరథీపశ్చిమతీరంబున నంతర్గేహంబు దక్షిణద్వారంబున దశాశ్వమేధంబు సర్వతీర్థోత్తమంబు.

33


తే.

ధాత గాశీపురంబునఁ దడయుటయును
నుల్లమునయందుఁ గోపింపకుండె శివుఁడు
రాజమౌళికి మూర్త్యంతరంబు గాదె
గణన సేయంగ నానందకాననంబు?

34


ఈశ్వరుండు ప్రమథులం గాశి కంపుట

వ.

అపుడు గౌరీకాంతుండు నిజాంతర్గతంబున ‘యోగినీబృం

దంబు మసలె, వివస్వంతుండు వెనుక మఱచె, నంభోజసంభవుండుసు గదలనికంబం బయ్యె, నిఁకం బరమవిశ్వాసనిధు లగుప్రమధులం బంచెదంగాక!’ యని బహుమానపురస్సరంబుగా నొక్కతోయంబున శంకుకర్ణమహాకర్ణులను, నొక్కవగ ఘంటాకర్ణమహాకాళులను, నొక్కకెడ సోమనందినందిషేణకాళపింగళకుక్కుటులను, నొక్కవర్గంబునఁ గుండోదరమయూరబాణగోకర్ణులను, నొక్కమొత్తంబునం దిలకర్ణసూలకర్ణద్రుమ చండప్రభామయసుకేశచ్ఛాగ కపర్థిపింగలాక్ష వీరభద్రకిరాత చతుర్ముఖ నికుంభ పంచాక్షభారభూతత్ర్యక్షక్షేమకవిరాధసుముఖాదిపాషండులనుం బంచిన.

35


తే.

భర్తపని పూని నిజముగాఁ బ్రతిన వట్టి
పోదు రానందకాననంబువకుఁ బోయి
[6]మోహమాహాత్మ్య మెట్టిదో మునివరేణ్య?
ప్రమథు లప్పుడ మఱతురు భవునియాజ్ఞ.

36


శా.

సేమం బొప్పఁగఁ గాళికానగరికి న్విశ్వేశ్వరాజ్ఞామహా
సామర్థ్యంబు జటాకిరీటములపై సంధించి ము న్పోయి త
త్సీమాంతంబున నంతయు న్మఱచి యాసిద్ధుల్ శివార్చారతిన్
స్వామిద్రోహము వాపికొం డ్రచట మెచ్చ న్వచ్చుఁ దద్జ్ఞానమున్.

37


వ.

అందుఁ గపర్ది యనుప్రమథుఁడు ప్రతిష్ఠించినకపర్దీశ్వరలింగంబుప్రభావం బుపన్యసించెద నాకర్ణింపుము.

38


కపర్దీశ్వరప్రభావకథనము

సీ.

కాశి కుత్తరదిక్ప్రదేశంబునం దుండు
        విమలోదకం బనుకమలసరసి

యాబావితేటనీ రాస్వదించిన నందుఁ
        దీర్థమాడినఁ బితృదేవతాళి
కతిభ క్తిఁ దర్పణం బాచరించిన మర్త్యుం
        డఘకోటిఁ దున్మి తూటాడఁ జాలు
నీయర్థమున కొక్కయితిహాస మే నీకుఁ
        జెప్పెద దృఢభక్తిఁ జిత్తగింపు


తే.

మాదిఁ ద్రేతాయుగంబునయం దొకండు
హరునిభక్తుఁడు వాల్మీకి యనఁగఁ గలఁడు
వాడు హేమంతఋతుకాలవాసరములఁ
దివిరి యక్కుండమునయందుఁ దీర్థ మాడు.

39


వ.

ఒక్కనాఁడు మధ్యాహ్నవేళ నవ్వాల్మీకి విమలోదకుండంబునం గ్రుంకు వెట్టి యనంతరంబ యాపాదమస్తకంబుగా భస్మోద్ధూళనంబు సేసి రుద్రాక్షమాలికలు ధరించి కపర్దీశ్వరమహాదేవుసమ్ముఖంబునం బంచాక్షరీ పంచబ్రహ్మశతరుద్ర్యాదిమంత్రంబుల ధ్రువమఠప్రతిమఠలంబకరాసకాదుల నేలాకరరేంకి(తేంక)వర్తన్యాదులుసు సూతశుద్ధసూళభేదంబులు నెడనెడ ఝంఝుం టంటం ప్రధాననానాస్తోబ్ధాక్షరంబులు సరిగమాదిస్వరంబులు దివ్యస్తుతిపదంబులు త్రిపురవిజయదక్షాధ్వరధ్వంసాదిబిరుదంబులు శంఖమురజాదివాద్యంబులు ధేవంబులు సంఘటించి విస్ఫురితాందోళితంబులు ద్రిభిన్నాదిగమనభేదంబులతోడ నయ్యయిప్రయోగంబుల నాహతప్రత్యాహతంబులు పుట్టించుచుఁ, జంచత్పుటచారపుటషష్టితాపుట(త్ర)సరద్వేష్టకోద్ఘట్టితాదితాళంబుల ఘంటీరవశంకరాభరణాది (గ్రామంబులను) రాగరాగాంగభాషాంగ

క్రియాంగోసాంగాదిదేశిరాగంబులను సంపుటించి దత్తిలకోహళభరతమతంగనందికేశ్వరాదిమతానుసారంబున వివిధప్రబంధముల నిర్మించి వానికి బహువిధస్థానకమండలచారి(కా)చరణాంగహారరేచకధవళకనతనాదిశిరోభావచతుర్భావచాలనంబులు మెఱయ దేశీమారలాస్యతాండవంబులు పరిఢవించుచు, నిట్లు తాన తూర్యత్రయంబు ననుసంధించుచుఁ గొంత దవ్వవ్విరూపాక్షుని జాక్షుషం బైన యోగంబున యజించుచుండె. అయ్యవసరంబున.

40


సీ.

ఘ్రాణంబు నీచమై కన్నులు పల్లనై
        యుదకంబు వీఁపుతో నొత్తగిల్లఁ
జేదోయి గుఱుచయై చెవులు విల్వంకలై
        పూసటెమ్ముకములు బోటుకట్ట
వక్షంబు గుంతయై వర్త(రణ)౦బు పరుసనై
        తెఱనోరఁ ద్రేవుఁడు తీఁగె సాఁగ
శీర్షంబు వలుదయై చెక్కిళ్లు లోతులై
        ముష్కద్వయీశిశ్నములు గృశించి


తే.

యస్జిచర్మావశేషావయమ్ము లమర
జుజురుకొన్న తనూరుహస్తోమములను
బొలసుకంపున భీభత్స వొడమఁ జేయఁ
గట్టెదుర వచ్చి నిలిచె రాక్షసుఁ డొకండు.

41


వ.

ఇట్లు బహిరంగంబున రాక్షసుం జూచి వాల్మీకి పంచాక్షరాఘోరపాశుపతమంత్రాభ్యాసనావశంబునం బుట్టినదిట్టతనంబునం దెరలక నిలిచి, యోరీ యెవ్వఁడ? వెటనుండి వచ్చితి? వెచ్చోటి కేగెదవు? దృష్టిపథంబున నిలిచిన పిశాచభూత

బేతాళకూశ్మాండప్రేతనికరం(రంకం)బులలో నొక్కరుండవు గావలయు, నేము తపస్వులము, శివనామజాపకులము, మంత్రస్థులము, భస్తోద్ధూళనవర్మధారులము, మాలికారక్షావజ్రపంజరమధ్యస్థితులము, మముఁబోంట్ల నీకు వెఱపింపంబనిలేదు; చేర రాకు మల్లంతన యుండు మనినం గృతాంజలి యై యాభూతం బమ్మహీసురున కి ట్లనియె.

42


తే.

ధాత్రి గోదావరీసింధుతటమునందుఁ
బ్రథిత మైనప్రతిష్ఠానపట్టణమున
నగ్రజన్ముండ దుష్టప్రతిగ్రహముల
కారణంబుగ బ్రహరాక్షసుఁడ నైతి.

43


తే.

ఎండ నెండితి మంచున నివము కొంటి
వానఁ దడిసితి మంచున వడఁకుచుంటి
గాలిఁ దూలితి నశనంబు కాననైతి
డప్పిఁ గుందితి డస్సి దట్టంబ నైతి.

44


వ.

ఇవ్విధంబునఁ బెద్దకాలంబు కుతిలపడి యాచారవిరహితుండైన యొక్కపురుషు నాశ్రయించువాఁడనై నిరాధారంబునఁ జరించుచు నొక్కనాఁడు.

45


సీ.

మాటలాడుచు మూత్రమలము లుత్సారించు
        మిహిరోదయమున మేలుకొనఁడు
సంధ్య వార్వఁడు మంత్రజపసంయుతంబుగ
        విడికచ్చతో నుండు విడువ కెపుడు
బ్రహ్మసూత్రము ధరింపఁగ సిగ్గు వహియించుఁ
        జల్దియోగిరము నిచ్చలు భుజించు

ఋతువేళలఁ బరిగ్రహింపఁడు నిజభార్య
        నన్యకళత్రంబు నభిలషించు


తే.

నెవ్వఁ డవ్విప్రదాయాదుఁ డేగుదెంచె
మార్గవశమున భాగ్యసామగ్రికలిమి
నాశ్రయించితి నతని మధ్యాహ్నవేళఁ
బ్రాంతదేశంబునం దొక్కరావి నుండి.

46


వ.

అతం డిప్పు డర్థార్జనంబునకు నీక్కాశికాపురికిం జనుదెంచె. పుణ్యక్షేత్రప్రభావంబునం బరాభూతుడనై బహిర్భాగంబునన యున్నవాఁడ. ఇంక నేమి సేయుదు? ఆధారభూతం బైన యతనిం గోలువోయితి. ఎచ్చోటనుండియేనియు నేతెంచి కాశికాపురీరక్షకులు నన్ను బాధపెట్టుదురోయని భీతి యయ్యెడు. నిన్ను శరణంబు వేఁడెద. మహాత్మా! రక్షింపవే! యనినం గృపావశంవదుండై యవ్వాల్మీకి కక్షపాలంబులోని విభూతి హస్తంబున ధరియించి డగ్గరం జని పంచాక్షరీమంత్రంబున నభిమంత్రించి లలాటంబున రణతిలకంబు లిఖించి 'కాశికానగళంబు ప్రవేశింపుము, మద్విభూతిధారణమహిమంబున నీన్ను భైరవాదులు భర్జింపనోడుదురు. కపర్దీశ్వరదేవు దర్శింపుము. అద్దేవుండు నీకు నరిష్టనిరసనంబును, నిష్టావాప్తియుం జేయు' ననిన మహాప్రసాదం బని యతం డట్ల చేసి ముక్తుం డయ్యె. ఇది కపర్దీశ్వరమాహాత్మ్యంబు.

47


క.

అందఱు పారిషదులు నీ
చందంబున శంభులింగసంస్థాపన మా
నందవనీనగరంబున
యం దొనరించిరి యతిప్రయత్నంబులతోన్.

48

తే.

కలశ సంభవ! విశ్వేశకులగృహంబు
కటకసాధారణంబె? శ్రీకాశినగర
మిందురేఖావతంసు మోహింపఁజేయఁ
జాలు నఁట! దాని మహిమ గోచరమె పొగడ?

49


ఉ.

కీటపతంగసర్పపశుకీశమృగాది సమస్తజంతుసం
ఘాట మఖండనిద్రకయి కాశికఁ గన్నులు మోడ్ప నంతలో
గైటభజిల్వరించిబలఘన్మదముఖ్యసమస్తదేవతా
కోటికిరీటకూటములఁ గూర్చు నమస్కరణార్హణాంజలుల్.

50


క.

ఏనాఁటనుండి వచ్చియు
మానవు లేర్కొండ్రు ముక్తి మైత్రావరుణీ!
యానందకాననంబున
నానాకైవల్యశోభనము లనుఫలముల్.

51


తే.

మరణ మానందవనములో మంగళంబు
భూతి కాశీపురంబులో భూషణంబు
గోఁచి యవిముక్తమునయందుఁ గుంభజన్మ!
పరమనిర్వాణజనులకుఁ బట్టుచేల.

52


వ.

కుంభసంభవా! దశాశ్వమేధతీర్థంబున దశహరాఖ్యతటినీదశాశ్వమేధేశ్వరుల దర్శించి మానవుండు దశజనార్జితంబు లైనపాపంబుల దహించు. శంకుకర్ణేశ్వరు శశాంకకళాలంకారు, మహాకర్ణేశ్వరు దృక్కర్ణకుండలు, ఘంటాకర్ణేశ్వరు ముక్కంటి, మహాకాళేశ్వరుఁ గాలగళు, హిమనందీశ్వరు నందివాహను, నంది ణేశ్వరుం గందర్పదమనుఁ, గాలపింగళేశ్వరు గంగామౌళిఁ, గుక్కుటేశ్వరు లలాటాక్షు, గుండోదరేశ్వరుఁ బాండురాంగు, మయూరేశ్వరు నారాయణ

ప్రియుఁ, బాణేశ్వరుఁ బినాకపాణి, జలకర్ణేశ్వరుఁ జతుర్నిగమమౌళిరత్నంబు, స్థూలకర్ణేశ్వరుఁ గరుణాపూర్ణహృదయు, ద్రుమిచండేశ్వరు సంధ్యాతాండవప్రియుఁ, బ్రభామయేశ్వరుఁ ద్రిభువనాధిపతి, సుకేశేశ్వరు నాకాశకేశుం గొలిచి మర్త్యుండు కార్తార్థ్యంబు నొందు. కపర్దికోదగ్దిగ్భాగంబునఁ బింగళాక్షీశ్వరు, నవిముక్తేశ్వరునకుఁ బశ్చాద్భాగంబున వీరభద్రేశ్వరుఁ, గేదారేశ్వరు దక్షిణభాగంబునం గిరాతేశ్వరు, వృద్ధకాలేశ్వరుసన్నిధిం జతుర్ముఖేశ్వరు, విశ్వేశ్వర శ్రీమన్మహాదేవుదక్షిణంబునం బంచాక్షేశ్వరు, నంతర్గృహోత్తరభాగంబు భారభూతేశ్వరుం, ద్రిలోచనేశ్వరుపురోభాగంబునఁ ద్ర్యక్షేశ్వరు, విశ్వేశ్వరోత్తరభాగంబున లాంగలేశ్వరు భజింపఁ బంచజనుండు పంచమహాపాతకంబుల భంజించు. ఇవ్విధంబునం బ్రమథులు లింగప్రతిష్ఠ లాచరించి, లింగార్చనాపరులయి వారాణసీపురంబునం బ్రతివసించుటయు.

53


క.

చింతించె విశ్వనాథుం
డంతఃకరణమున నేయుపాయంబున నేఁ
గాంతునొకో కాశీవృ
త్తాంతం బని మందరాచలాగ్రస్థితుఁడై.

54


సీ.

ఏమి సేయునొ యోగినీమండలం బిప్డు
        కాశికాకటకశృంగాటకముల?
నానందకాననాభ్యంతరంబునయందు
        బిసరుహాప్తుం డేల మసలె నొక్కొ?
వారాణసీపురావాససౌఖ్యంబుల
        మరగి వాక్పతి మమ్ము మఱచె నొక్కొ?

గణనాయకులు శంకుకర్ణాదు లవిముక్త
        మండలిఁ గాఁపురం బుండి రొక్కొ?


తే.

యొక్కమతమున వీరందు నునికి మేలు
భేదమున నన్యరాజ్యలక్ష్మికిఁ బెనంగు
నాకు నాయంతవారి నన్పంగఁ గలిగెఁ
దడసి కార్యంబుఁ గొనుట హితంబు కాదె?

55


తే.

ఊరకుండంగ నేటికి? వారణాస్యుఁ
గాశి కనిచెద వృత్తాంతగతులు దెలియ
బుద్ధిమంతుండు పోకలఁ బోవనేర్చు
కూర్ప విప్పంగ నోపు నాకొడుకుఁగుఱ్ఱ.

56


వినాయకుండు గాశి కేగుట

వ.

అని వినాయకు రావించి బుద్ధు లానతిచ్చి పంచినం బని వూని కాశికానగరంబున కరిగి.

57


సీ.

గంధర్వనగరరేఖలు మేఘపథమునఁ
        జేకొడుందులు వేశ్మసీమలందు
నమరకోదండఖండము నట్టనడురేయి
        ధూమకేతువు జలస్వామికాష్ఠ
గర మరిష్టము లైన కలలు నిద్రలయందుఁ
        గాఁపున్నయిండ్ల శృంగములపులుఁగు
గంధర్వసమితితో కల నగ్నికణములు
        పురవీథికామధ్యమున వఱళ్లు


తే.

బాష్పసలిలంబు దేవతాప్రతిమలందుఁ
గలుగఁజేయుచుఁ బ్రజల కాకస్మికంబు

వెఱుపు పుట్టించు నందంద విఘ్నరాజు
ప్రతిదినంబును గాశికాపట్టణమున.

58


తే.

తాన యుత్పాతములు మూడ్చుఁ దరతరంబ
తాన విధియించుచుండు నుత్పాతశాంతి
తాన హిత మాచరించు మిత్రంబ పోలెఁ
దాన వెఱపించుచుండు దుర్దశలు చెప్పి.

59


సీ.

కలలోనఁ బుట్టినకథ లెన్ని యన్నియు
        బూసగ్రుచ్చినయట్టు పొసఁగఁ జెప్పు
హస్తరేఖలు చూచి యాయుష్యమును భవి
        ప్యము తేట తెలివిగా నానతిచ్చు
గూఁతు లిద్దఱు నీకుఁ గొడుకు లిద్దఱు నీకు
        నని మోము సూచి సత్యంబు నుడువుఁ
దాతగా రనువావిఁ దనవారితన మొప్పు
        గురుసు మోపకనొండు సరసమాడు


తే.

వ్రతము నోమించు దివసవారములు నొడువు
ననుగలం బైన భామినీజనులయెడను
గుండబొజ్జయు శిఖయుసు గుఱుచ పొడవు
వ్రేలిదర్భాంకురము లొప్ప విఘ్నరాజు.

60


ఉ.

ఏనికమోము బూమియ వహించి చరించుచునుండు కామధు
గ్ధేనువు డుంఠి కాశి నిది తెల్లము వేలుపుగిడ్డి గానినాఁ
డీనునె మోక్షతర్ణకము? నిచ్చునె కాంక్షితదుగ్ధధార దూ
ర్వానవపల్లవావలులు వైచినమాత్రన భక్తకోటికిన్?

61


వ.

ఇవ్విధంబున దివ్యాంతరిక్షభౌమోత్పాతంబులు పుట్టించి నానాప్రకారంబులఁ జరించుచుం గాశీపట్టణంబున కచిర

కాలంబునం దరిష్టంబు ప్రాపింపంగల దనువార్త మ్రోయించి హితుండుసుం బోలె లోలోన బోధించి పౌరజనంబులం గొందఱం గుటుంబసహితంబుగా వెలార్చి, యంతం బోవక యంతఃపురంబులు మాయాబలంబునం బ్రవేశించి, రాజశుద్ధాంతకాంతలకు విస్రంభభాజనంబై జితేంద్రియుం డనుష్ఠానపరుండు శమదమాదిగుణగరిష్ఠుండు సత్యసంధుండు నిస్పృహుండని తన్ను సర్వజనులు సంస్తుతించునట్లుగా డుంఠిభట్టారకుం డను నామంబున మెలంగి, లీలావతి యసు పట్టపుదేవిముఖంబున దివోదాసుం గాంచి యతం డడిగిన ప్రశ్నంబులకు సదుత్త్వంబు లిచ్చి మెచ్చువడసి, యతని పురోహితులలో నొక్కరుండయి వర్తించుచుండె నంత నొక్కనాఁడు.

62


ఉ.

వారక కాశియందు నలువంకలఁ బుట్టెడు దుర్నిమిత్తముల్
పౌరులు విన్నవింప నరపాలుఁడు విస్మయమంది తత్ప్రతీ
కారము నాచరించుటకుఁ గా హితచింతకు నాప్తు డుంఠిభ
ట్టారకుఁ బిల్వఁబంచి నికటంబుననుండి ప్రియం బెలర్పఁగాన్.

63


తే.

చెప్పుమా డుంఠిభట్ట! కాశీపురమునఁ
బుట్టుచున్నవి యుత్పాతములు దఱుచుగఁ
గారణం బెద్ది దీనికిఁ? గలుష మెట్లు
వాటిలెనొ? ధర్మ మేవంకఁ బల్లటిలెనొ?

64


వ.

అని యడిగిన నతం డిట్లనియె.

65


తే.

పార్థివోత్తమ! యిమ్మహోత్పాతములకు
శాంతిఁ గావింతు మంత్రరక్షాబలమున
నాకుఁ జూడంగఁ గాశికానగరి విడిచి
యుండఁ దగుఁ గొన్నినాళ్లు నీ వొక్కవంక.

66

శా.

ఆత్మార్థంబు ధనంబు ధాన్యమును నాత్మార్థంబు పశ్వాదికం
బాత్మార్థంబు హితాప్తబంధుజన మాత్మార్థంబు గేహోచ్ఛ్రయం
బాత్మార్థంబు పరిత్యజింపఁ దగు రాజ్యంబైన నస్పందమై
‘యాత్మార్థంపృథివీంత్యజే’త్తనెడువాక్యం బశ్రుతంబే నృపా!

67


వ.

అని చెప్పి యింకనుం బెద్దలతోడ విచారించునది. ఏను ద్రికాలజ్ఞుండ. నేఁటికిఁ బదునెనిమిదియౌ దినంబునకు నుత్తరదేశంబుననుండి యొక్కబ్రాహ్మణుండు రాగలం డతండు నీకు హితోపదేశంబు సేయంగలండు. తద్వాక్యంబులు ప్రమాణీకరించునది యని డుంఠిభట్టారకుండు నిజనివాసంబున కరిగె నంత నక్కడ.

68


శివుండు విష్ణునిఁ గాశి కనుచుట

క.

అరవిందాక్షునిఁ గనుఁగొని
హరుఁడును గాశీప్రవృత్తి యారయఁ బంచెన
గరివదనుండును నీవును
బరికింపఁగ నేకకార్యపరులై యనుచున్.

69


క.

పనిపూని కాశికిం జని
వనరుహలోచనుఁడు వెడఁదవాలికకన్నుల్
తనకుఁ గలఫలముఁ గాంచెన్
బనివడి తద్విభవలక్ష్మిఁ బరికించునెడన్.

70


గంగావరణాసంగమంబునం బాణిచరణతలంబులు ప్రక్షాళించి యవగాహనంబు చేసె. అది కారణంబుగా నత్తీర్థంబు పాదోదకతీర్థంబు నాఁ బరఁగె. కృతకాలోచితక్రియాకలాపుండై పుండరీకాక్షుండు.

71

తే.

త్రిపురకాంతలశీలంబు లపహరింప
బుద్ధివేషంబు గైకొన్న పోకులాఁడు
జలజనాభుండు సుగతవేషము ధరించెఁ
గాశికాప్రజలకు ధర్మగతి హరింప.

72


వ.

పుణ్యతీర్థనామంబు వహించి తనమూలభృత్యుం డైనగరుత్మంతునకు వినయకీర్తి యనుపేరు వెట్టి యతని శిష్యుంగా బరిగ్రహించి, లక్ష్మిం బరివ్రాజికం గావించి యమ్మహాదేవికి కౌముది యనునామధేయంబు గల్పించి, తాను శిష్యుండును నొక్కముఖంబున బురుషులం బ్రమోషింపను గమలయొక్కతియు నొక్కముఖంబున బురంధ్రీజనంబులం బ్రలోభింపను సంకేతంబుగా సేసి వేఱువేఱుమార్గంబులం గాశికాపురంబుఁ బ్రవేశించి.

73


విష్ణువు మాయావేషంబున గాశియందు బౌద్ధధర్మంబు స్థాపించుట

తే.

పటమునందు నాగరలిపి ప్రస్ఫుటముగ
వరమషీతూలికాలేఖ వ్రాసినట్టి
యర్హతాగమగ్రంథ మత్యాదరమున
[7]జట్టు పఠియింప బోధించు సద్గురుండు.

74

తే.

తత్త్వదృష్టి ననానిసిద్ధంబు భవము
భవముఁ బుట్టింపు నడగింపఁ బ్రభుఁడు లేఁడు
దనకుఁ దా నుద్భవం బొందుఁ దనకుఁ దాన
విలయముల బొందు భవ మిది వినయకీర్తి!

75


తే.

బ్రహ్మవిష్ణురుద్రాదుల బ్రదుకు లెల్లఁ
బట్టిచూడంగ మనబోంట్ల బ్రతుకులట్ల
యనఘ! వారి దేహంబులు నస్మదాది
దేహములఁ బోలెఁ గాలంబు తినును గాన.

76


క.

భద్రగుణా! యాహారము
నిద్రాభయమైథునములు నిఖల మగుతనూ
భృద్రాజికి సాధారణ
ముద్రలు మఱి తారతమ్యములపను లేలా?

77


సీ.

హంసతూలికపాన్సునందు రానేలను
        శయనించువారికి సరియె నిద్ర
మెఱుఁగుఁదీఁగలఁ బోలుమెలఁత లెందఱు గల్గి
        నప్పుడు నొక్కతొయ్యలియ రతికి
డప్పికి నీరు వంటక మాఁకలి కశేష
        జంతుసంతతి కాత్మశక్తికొలది
యాకీట మాకైటభాసురాంతక మెల్ల
        ప్రాణకోటికిఁ బ్రాణభయము సమము


తే.

గానఁ దమయట్ల యెదిరిని కాన్పు గాన్పు
జీవులకుఁ దారతమ్యంబు సెప్ప వలదు
సర్వభూతములందును సమత మేలు
కరుణ చేపట్టవలయుఁ గాఁ గాదు హింస.

78

తే.

చెదలు నీర్పేను మశకంబు చీమ నల్లి
యల్ప మనుబుద్ధి హింస సేయంగ వలదు
వానిహృదయంబులం దున్నవాఁడు జీవుఁ
డాతఁ డల్పుండె యితరజీవాత్మకంటె?

79


వ.

సుఖంబ స్వర్గంబు. దుఃఖంబ నరకంబు. శరీరత్యాగంబు మోక్షంబు.

80


మ.

అహహా! వేదము దాన చెప్పును ‘నహింస్యాత్సర్వభూతాని’యం
చహహా? తాన కదా క్రతుక్రియలఁ బశ్వాలంభమున్ మేదినీ
రుహవిచ్ఛేదముఁ జేయఁ జెప్పు! నదియుం ద్రోహంబు కాదో కదా!
బహుభాష ల్దిరుగంగ నాడుటలునుం బ్రామాణికత్వంబులే?

81


వ.

అహింస పరమధర్మంబు. హింస నరకభీరువు లైననరులు పరిత్యజించునది. హింసకుండు నరకంబునకు సహింసకుండు స్వర్గంబునకుం జను. దానంబు లనేకంబులు గలుగ నవియు నభిమతదానంబును బోలనేరవు. పరమపురుషులును నానాశాస్త్రసిద్ధాంతంబు లాలోకించి భీతున కభయదానంబును, వ్యాధితున కౌషధదానంబును, శుశ్రూషకునకు విద్యాదానంబును, నాఁకొన్నవారి కన్నదానంబును దానంబులలో నెల్లం బ్రశస్తదానంబు లని చెప్పుదురు. మణిమంత్రౌషధప్రభావంబు లచింత్యంబులు. ప్రయత్నంబునం దద్విద్యాభ్యాసం బాచరించునది. పరిపూజ్యంబులు ద్వాదశాయతనంబులు. అవి యెయ్యవి యంటేని, కర్మేంద్రియజ్ఞానేంద్రియపంచకంబులును మనోబుద్ధులును. అవి హేతుదృష్టాంతంబులం బ్రమాణప్రమేయాదిపోడశపదార్థవాదు లగునైయాయికులను, ద్రవ్యగుణాదిషట్పదార్థవాదు లగువైశేషికులను, నవ్యక్త

మహదహంకృతి చతుర్వింశతితత్త్వవాదు లగుసాంఖ్యులను, శివశక్తిసదాశివేశ్వర విద్యాతత్త్వప్రభృతి షట్త్రింశత్తత్త్వవాదు లగుశైవుల నవలంబించుచుఁ బ్రత్యక్షానుమానోపమానార్థాపత్తి జ్ఞానంబులయందు నింద్రియార్థసన్నికర్షోత్పన్నంబై యవ్యభిచారియు వ్యవసాయాత్మకంబు నగుజ్ఞానంబు ప్రత్యక్షంబని ప్రత్యక్షజ్ఞానంబు సర్వజనులకుం దేటతెల్లంబు గావునఁ బ్రత్యక్షం బవలబించి యుండునది యని యెల్లవారికిఁ దమతమధర్మంబులు విడిచి సుగతధర్మంబు చేపట్టునట్లుగాఁ బుణ్యనామధేయుం డగుమధుసూదనుండు వినయకీర్తినామధేయుం డగుశిష్యు గరుత్మంతు బోధించుచుండె; నంత వేఱొక్కయెడ విజ్ఞానకౌముది యనుపేరు వహించి పరివ్రాజికావేషధారిణి యగు విషధికన్య యుపన్యాసచాతుర్యం బొప్ప మాధుర్యగుణధుర్యంబుల మధుసమయమంధరగంధసార గిరిగంధవాహప్రవాహలహరికాస్ఫాలనానందకందళిత మాకందఘుసృణకిసలయరసాస్వాద (న) కషాయకంఠకలకంఠకామినీకోమలకుహూయమాన కోలాహలపంచమంబు ననుకరించు తిన్ననియెలుంగున.

82


సీ.

బ్రహ్మ మానందరూపం బంట తథ్యంబు
        నానాత్మపరికల్పనంబు మిథ్య
ముదిమి నింద్రియశక్తి మొఱవపో కుండంగ
        మైథునక్రీడ యేమఱమి యుఱవు
సౌఖ్యార్థి యైన యాచకుని కిచ్చుట పాడి
        పంచభూతాత్మక ప్రకృతి తనువు

యౌవనంబులు పోయెనా రావు క్రమ్మఱ
సపరిక్షయమ్ములు సంచయములు
తే. గడచినప్పుడు క్రిము లొండెఁ గాకు లొండెఁ
గుక్క లొండేనియును భుక్తిఁ గొనెడు దేహ
మొకఁడు బార్ధించి నప్పుడ యొసఁగవలదె!
తన్ను నిచ్చుటయది గదా దానగుణము.

83


వ.

వావి వర్ణంబు విచారింప వలదు. వృద్ధాచారంబు విచారించి చూచిన బ్రహ్మపుత్రులు గదా దక్షుండును మరీచియు. మరీచినందనుం డైనకశ్యపుండు ధర్మమార్గంబునం దక్షుని కన్యకలఁ బదుమువ్వుర నెట్టు వివాహంబయ్యె? ఇదానీంతనులు మర్త్యు లల్పబుదు లల్పపరాక్రములు గావున నిది గమ్య యిది యగమ్య యని విచారంబు సేయుచున్నవారు. పరమపురుషునిముఖబాహూరుపాదంబులం జాతుర్వర్ణ్యంబు జన్మించె. ఒక్క తనువునందుఁ బుట్టిన నలువు రేకోదరు లౌదురో కారో? అట్టివారికి భిన్నవర్ణత్వం బెట్టు సిద్ధించుచున్నయది? కావున వర్ణావర్ణవివేకంబు విడిచి వలసినట్టు పురంధ్రీపురుషులు విహరించునది యని పెక్కుప్రకారంబుల విజ్ఞానకౌముది సౌగతశాస్త్రంబు వక్కాణింప విని పురాంగనలు భర్తృశుశ్రూషాదిధర్మంబు లుజ్జగించి రయ్య వసరంబున.

84


చ.

వననిధికన్యయున్ హరియు వాడల వాడల బౌద్ధధర్మముల్
జినమతముల్ నిరంతరముఁ జెప్పఁగఁ జెప్పఁగఁ గాశికాపురిన్
దనతనధర్తముల్ విడిచి తామరసాయతలోచనాజనం
బును పురుషప్రతానమును బూనెను బుద్ధజినవ్రతంబులన్.

85

తే.

వర్ణములు నాశ్రమంబులు వరుసఁ దప్పె
వేదవేదాంగశాస్త్రముల్ విన్నఁబోయె
[8]నా(సా)రజంబులు కృష్ణపచ్యములుఁ జెడియె
వృద్ధి బొందె నధర్మంబు విశ్వమునను.

86


దివోదాసనిర్యాణము

వ.

అప్పుడు దివోదాసుండు డుంఠిభట్టారకుండు సెప్పిన విప్రుం డెప్పుడు వచ్చునోయని దివసంబులు లెక్క పెట్టుకొనుచుండం బదునెనిమిదవదివసంబున మధ్యాహ్నకాలంబునందు సుగతవేషధారి యగుమధుసూదనుండు బ్రాహ్మణవేషంబు దాల్చి యేతెంచి సముచితప్రకారంబున దివోదాసుం యాశీర్వదించి యతం డనుప సమున్నతకనకాసనంబునఁ గూర్చుండె. ఆవేళ విఘ్నేశ్వరుఁడు రాజహృదయంబునందు నావేశరూపంబున నధివసించె. వినాయకాధిష్ఠితుండై భూపతి వైరాగ్యంబు వహించి కపటబ్రాహ్మణున కిట్లనియె.

87


ఆ.

బడలుపడితి రాజ్యభారంబు భరియించి
పొడమె మది విరక్తి భూసుపర్వ!
ఏమి సేయువాఁడ! నెక్కడ కేగుదు?
నేమి దిక్కు? నాకు నెఱుఁగఁ జెప్పు.

88


వ.

తపస్సామర్థ్యంబునం బజ్జన్యాగ్న్యనిలాత్మకుండ నైతి. ప్రజ లౌరసు లైనపుత్రులుం బోలెఁ బరిపాలింపంబడిరి. దేవతలం దృణీకరించిన యొక్కయపరాధంబునుం దక్క నాయందు గానవచ్చినయపకారం బొందు లేదు. నాభాగ్యంబున నీవు హితోపదేశంబు సేయ నాచార్యుండునుం బోలె నేగుదెంచితి. ఇంతకాలంబు నారాజ్యంబున నకాలమరణంబును

జరావ్యాధిదారిద్ర్యంబులు లేవు. ఇప్పు డేమికారణంబుననో యవియును దివ్యాంతరక్షభౌమోత్పాతంబులు పుట్టుచున్నయవి. నాకుం జూడ వేల్పులవేడబంబ కావలయు. మృత్యుంజయుండు త్రిపురవిజయంబును, నారాయణుండు బలిధ్వంసనంబును బురందరుండు వృతాసురవధంబుసు మాయాబలంబున నొనర్చిరి. బలవద్విరోధంబు దుస్తరంబగుట యిప్పు డెఱుంగంబడియె. ఇన్నియు నట్లుండనిము. ఏనును బదివేలేండ్లు రాజ్యంబు సేసితి. జరాభరాక్రాంతుండనై తి. ఇంద్రియంబు లుపరతింబొందుచున్నయవి. ఇంక సకలకర్మనిర్మూలనక్షమం బైనమోక్షం బపేక్షింపవలసియుండు. అమ్మహాపదార్థంబు నా కేయుపాయంబున సిద్ధించు నాయుపాయం బానతి మ్మనిన విని బ్రాహ్మణవేషధారి యగుహృషీకేశుం డమ్మహీవరున కి ట్లనియె.

89


తే.

కాశికాపట్టణమున లింగప్రతిష్ట
యాచరింపుము కల్పింపు హర్మ్యరేఖ
బొందితోడన కైలాసమున కరిగెద
వనఘ! నామాట వేదతుల్యంబు సూవె!

90


తే.

పుత్రుల బట్టంబు గట్టుము బుద్ధి చెప్పు
మాతనికి దేవతాభక్తి యతిశయముగఁ
దనయసంక్రాంతసామ్రాజ్యతంత్రుఁ డగుచు
వనమునకు నేగఁ దగు రాజు వార్ధకమున.

91


వ.

అని బుద్ధి చెప్పి బ్రాహ్మణుం డెక్కడికేనియుం బోయె. దివోదాసుండును నమాత్యుల, మండలేశ్వరుల, నధ్యక్షులం, బురోహితులం, బ్రతిహారుల, ఋత్విజుల, గణకుల, నంతఃపుర

జనంబుల రావించి కుమారు సమరంజయు నందఱికి నప్పగించి యతనికిం బట్టాభిషేకంబు సేసి కాశికానగరంబునందు దనసర్వశ్రీసమృద్ధియు వెచ్చించి మహాప్రాసాదంబు నిర్మించి యందు శివలింగంబుఁ బ్రతిష్ఠించి కింకిణీజాలమండితం బైనదివ్యవిమానం బెక్కి శరీరంబుతోడన శివలోకంబునకుం జనియె. ఆప్రాసాదంబు సర్వశ్రీసమృద్ధివినియోగనిర్మితంబు గావున భూపాలశ్రీ యనం బ్రసిద్ధి గాంచె. దివోదాసేశ్వరలింగంబు భాగీరథీతీరంబున భజించువారికి భుక్తిముక్తిప్రదాయకం బయి ప్రకాశించె. ఇది దివోదాసవృత్తాంతంబు. ఈయుపాఖ్యానంబు విన్నను బఠించిన లిఖించిన జనుల కాయురారోగ్యైశ్వర్యాభివృద్ధి యగు నని చెప్పి కుమారుండు వెండియు కుంభసంభవున కి ట్లనియె.

92


చ.

కరివదనుండు నిందిరయుఁ గైటభవైరియుఁ బెక్కుమాయల
న్ధరణిపుఁ గాశికాపురమునం బెడఁబాపి పినాకపాణికిం
బరమసముద్యమస్ఫురణఁ బంపిరి లేఖలు సర్వకార్యమున్
గరగరనయ్యె రమ్ము శశిఖండశిఖామణి! యంచు భక్తితోన్.

93


సీ.

సంతోషమునఁ జతుష్షష్టిగణంబు
        నామోదవృత్తంబు నభినయించె
సరవి లోలార్కకేశవఘటోల్కాదులు
        పన్నిద్దఱు ప్రమోదభాజు లైరి
వనజాసనుఁడు నాల్గువదనంబుల నుతించె
        వేదార్థముల భక్తి విశ్వనాథు
గణనాయకులు శంకుకర్ణఘంటాకర్ణ
        నందిషేణాదు లానంద మొంది

తే.

రఖిలమాయాప్రయోగవైయాత్యగరిమ
డుంఠివిఘ్నేశ్వరుండు వైకుంఠపతియుఁ
గమలవాసినియును నేకకార్యపరత
నాదివోదాసు వెడలంగ నడచుటయును.

94


శివుండు సపరివారుండై కాశి కేతెంచుట

వ.

అనంతరంబు విదితదివోదాసవృత్తాతుండై యంతకదమసుం డంబికయును మహాకాళవిశాఖనైగమేశులు రుద్రులు ప్రమధులు దేవర్షులును దిక్పాలురుం గొలిచి చనుఁదేరఁ గిన్నరకింపురుషగరుడగంధర్వసిద్ధవిద్యాధరులు జయజయధ్వనులతోడం గైవారంబులు సేయ నందివాహనారూఢుఁడై మందరనగంబుననుండి యానందకాననంబునకు విజయంబు చేసి యవిముక్తమంటపంబునం బేరోలగంబుండి తత్కాలసన్నిహితు లైనయోగినీభానుపద్మభవప్రమథలక్ష్మీనారాయణుల యథాప్రధానంబుగా సంభావించి డుంఠివిఘ్నేశ్వరు గంఠా(గాఢా)లింగనంబు చేసి గండస్థలంబున నఖాంకురవ్యాపారంబునం బుజ్జగించుచు ని ట్లనియె.

95


సీ.

నీకతంబునఁ గాదె లోకభీకరు లైన
        త్రిపురదానవుల మర్దింపఁ గలిగె!
నీకతంబునఁ గాదె కాకోలవిషవహ్ని
        యలవోకయును బోలె నార్పఁ గలిగె!
నీకతంబునఁ గాదె నిరవగ్రహస్ఫూర్తి
        నంధకాదులగర్వ మడఁపఁ గలిగె!
నీకతంబునఁ గాదె నేఁడు వారాణసీ
        సంగమోత్సవకేళి సలుప గలిగె!

తే.

నాత్మజుఁడ వన్న మిత్రుండ వన్న భటుఁడ
వన్న సచివుండ వన్న నా కెన్న నీవు
నిన్ను నెబ్భంగి వర్ణింప నేర వచ్చుఁ?
గంఠపీఠాగ్రకరిరాజ! డుంఠిరాజ!

96


ఈశ్వరకృతడుంఠిస్తవము

వ.

జయజయ విఘ్నేశ్వర! భక్తనిర్విఘ్నకారక! అవిఘ్నకర! సర్వగణాధీశ! సర్వగణాగ్రగణ్య! గణప్రణతపాదాబ్జ! గణనాతీత! సగుణ! నిర్గుణ! సర్వజ్ఞ! సర్వేశ! సర్వభూతవిధాన! సరవమాయాప్రపంచజ్ఞ! సర్వకర్మాగ్రపూజిత! సర్వమంగళ! యమంగళోపశమన! సిద్ధవంద్యపద! సిద్ధనాయక! సర్వసిద్ధినిలయ! స్వబలాధాన! సర్వబలాశ్రయ! సర్వఫలప్రద! బలాకోజ్జ్వలదంతాగ్ర! యనంతమహిమాధార! ధరాధరవిదారణ! దంతాగ్రపోత్థదిఙ్నాగ! నాగవిభూషణ! భువనంబుల కభ్యుదయంబు గావింపుము.

97


గీ.

ఆవరణరూపమునఁ గాశి యహరహంబు
గావఁ దగు నీకు బహువిధాకారకలన
ననుచు నానతి యిచ్చెఁ జంద్రార్ధమౌళి
భవుఁడు భువనాద్భుతక్రియాప్రౌఢి మెఱయ.

98


వ.

అ ట్లద్దేవుం డవధరించుటయు గంగాసంభేదనంబున గర్కరీవినాయకుండు, కాశీక్షేత్రదక్షిణంబున దుర్గావినాయకుండు, భీమచండిసమీపంబున నిరృతిభాగంబున భీమచండివినాయకుండు, పశ్చిమదిగ్భాగంబున దేహళీవినాయకుండు, వాయవ్యదిగ్భాగంబున నుద్దండవినాయకుం, డుత్తరదిగ్భాగంబునం బాశపాణివినాయకుండు, గంగావరణాసంగమంబున

ఖర్వవినాయకుండు యమతీర్థంబునకుఁ బశ్చిమదిగ్భాగంబున సిద్ధనాయకుండు; వీరు బాహ్యావరణదేవతలు. గంగాపశ్చిమతీరంబున నుత్తరార్కుసమీపంబున లంబోదరవినాయకుం, డాపశ్చిమంబునఁ గూటదండవినాయకుండు, భీమచండునకుం గించిదీశానుగ్భాగంబునఁ గాలకంఠవినాయకుండుఁ, [9]బ్రాగ్దిగ్భాగంబునఁ గూశ్మాండవినాయకుండు, నుద్దండవిఘ్నేశ్వరునకు నాగ్నేయదిగ్భాగంబున డుంఠివినాయకుండు, పాశపాణివిఘ్నేశ్వరునకు దక్షిణంబున వికటదంతవినాయకుండు, సర్వవిఘ్నేశ్వరునకు నిరృతిభాగంబున రాజపుత్రవినాయకుండు, గంగాపశ్చిమతీరంబున రాజపుత్రవినాయకునకు వాయవ్యభాగంబునఁ బ్రణవవినాయకుండు వీరు ద్వితీయావరణదేవతలు. ఉత్తరవాహిని యగువియద్గంగాతీరంబున లంబోదరున కుదగ్భాగంబున వక్రతుండవినాయకుండు, కూటవంతున కుదద్భాగంబున నేకదంతవినాయకుండు, కాలకంఠున కీశానదిగ్భాగంబునఁ గవిసింహద్విపత్రిముఖవినాయకుండు, కూశ్మాండునకుం బూర్వదిగ్భాగంబునం బంచాస్యవినాయకుండు, ముండవిఘ్నేశ్వరున కాగ్నేయదిగ్భాగంబున హేరంబవినాయకుండు, వికటదంతునకు యామ్యంబున నాశావినాయకుండు, రాజపుత్త్రవిఘ్నేశ్వరునకు నిరృతిభాగంబున వరదవినాయకుండు, ప్రణవవిఘ్నేశ్వరునకు పశ్చిమభాగంబునఁ బిశంగిలాతీర్థంబున దేవనదీతటంబున మోదకప్రియవినాయకుండు, వీరు తృతీయావరణదేవతలు. వక్రతుండునకు వాయవ్యభాగంబున గంగాతీరం

బున నభయవినాయకుం, డేకదంతునకుం గౌబేరదిగ్భాగంబున సింహతుండవినాయకుండు, త్రితుండన కీశానదిగ్భాగంబునఁ గూణితాక్షవినాయకుండు, పంచాస్యునకుం బ్రాగ్దిశాభాగంబున క్షిప్రప్రసాదవినాయకుండు, హేరంబునకు వహ్నిదిగ్భాగంబున జింతామణివినాయకుండు, విఘ్నరాజున కవాగ్భాగంబున దంతహస్తవినాయకుండు, వరదునకు యాతుధావదిగ్భాగంబునం బిచండిలవినాయకుండు, మోదకప్రియునకు దక్షిణంబున చండముండివినాయకుండు; వీరు చతుర్థావరణదేవతలు. అభయప్రదున కుత్తరంబున గంగాతీరంబున స్థూలదంతవినాయకుండు, సింహతుండవినాయకున కుచ(గ్ది)గ్భాగంబునఁ గరిప్రియవినాయకుండు, గూణితాక్షున కీశానదిగ్భాగంబునం జతుర్దంతవినాయకుండు, క్షిప్రప్రసాదునకుం బూర్వదిగ్భాగంబున ద్వితుండవినాయకుండు, చింతామణికి వహ్నిదిగ్భాగంబున జ్యేష్ఠవినాయకుండు, దంతహస్తునకు దక్షిణదిగ్భాగంబున దక్షవినాయకుండు, పిచండిలునకు నాసురదిగ్భాగంబునఁ గాలవినాయకుండు, నుద్దండముండునకు దక్షిణదిగ్భాగంబున నాగవినాయకుండు; వీరు పంచమావరణదేవతలు. వారాణసి కింద్రాగ్నియమనిరృతివరుణవాయుకుబేరేశానదిగ్భాగంబుల మణికర్ణి ప్రత్యేకవినాయక సృష్టివినాయక యక్షవినాయక గజకర్ణవినాయక చిత్రఘంటవినాయక స్థూలజంఘవినాయక మంగళవినాయకులు. యమతీర్థంబున కుత్తరంబున మిత్రవినాయకుండు; వీరు షష్ఠావరణదేవతలు. మోదాదిపంచవినాయకులును, జ్ఞానవినాయకుండును, ద్వాదశవినాయ

కుండును, అవిముక్తవినాయకుండును వీర లవిముక్తక్షేత్ర సప్తమావరణదేవతలు. ఈ యేఁబదియార్గురువినాయకులుఁ గాశీక్షేత్రంబుం రక్షింతురు.

99


తే.

ఏఁబదియు నాఱుమూర్తులనెసక మెసఁగి
యావరణసప్తకంబున నధివసించి
కాశికాపురి రక్షించుఁ గదల కెపుడుఁ
గుధరకన్యక తొలుచూలుకొడుకు డుంఠి.

100


వ.

ఇట్లు గణేశ్వరపరిపాలితం బైన కాశీపురంబునం బుష్కరంబునందు.

101


చ.

శుభదివసంబునఁ విమలశోభనలగ్నమునందు మేరుస
న్నిభమగుహేమపీఠమున నిల్పి రమాదులు సేస చల్లఁగాఁ
ద్రిభువనరాజ్యలక్ష్మికి నతస్థిరభక్తిరతిన్ సరోరుహ
ప్రభువుఁడు గైటభాంతకుఁడుఁ బట్టముగట్టిరి ఫాలలోచనున్.

102


తే.

హరియు వినతాసుతుండు దుగ్ధాబ్ధిసుతయు
సౌగతాదివికారవేషంబు లుడిగి
యాత్మవేషంబులు వహించి రనఘ! వికృత
వేషములు కాశియందు వేర్వేఱ నిలిచె.

103


వ.

తత్ప్రసంగంబునం దీర్థంబులు గలిగె నవి యెయ్యవి యనినఁ బాదోదకతీర్థంబు, క్షీరాబ్ధితీర్ణంబు, గదాతీర్థంబు, లక్ష్మీతీర్థంబు, తార్క్ష్యతీర్థంబు, నారదతీర్థంబు, ప్రహ్లాదతీర్థంబు, అంబరీషతీర్థంబు, దత్తాత్రేయతీర్థంబు, భృగుతీర్థంబు, వామనతీర్థంబు, నరనారాయణతీర్థంబు, విదారణనారసింహతీర్థంబు, గోపీగోవిందతీర్థంబు, శేషతీర్ణంబు, శంఖమాధవతీర్ణంబు, హయగ్రీవతీర్ణంబు. ఇవి వైష్ణవతీర్ణంబులు.

104

మ.

అలఘుశ్రీనిధిఁ గాశికాపురిఁ బ్రసంగానుప్రసంగంబులం
దెలియం జెప్పతిఁ గొన్నిలింగములనుం దీర్థంబుల న్నిక్క మే
తిలమాత్రంబును నందుఁ దద్విరహితోద్దేశంబు లేకున్కికిం
గలశీసంభవ! వన్నిదంబు గెలువంగా వచ్చుఁ బద్మోద్భవున్.

105


పంచనదతీర్థమాహాత్మ్యము

వ.

అనిన విని యగస్త్యుండు మహాత్మా! పంచనపతీర్థమాహాత్మ్యం బెఱింగింపవే యనినం గుమారుం డి ట్లనియె.

106


సీ.

వేదశిరుండు నా విప్రర్షి భృగువంశ
        సంభవుండు దపంబు సలుపుచుండఁ
బైత్రోవ శుచి యనుపాకశాసనుకొల్వు
        మానిని యెక్కడికేని పోవ
నయ్యచ్చరను జూచి యమ్మునీంద్రుండు ప్ర
        స్థలితేంద్రియుం డయ్యెఁ గదల వెఱచి
కమలలోచన నమస్కారంబు సేయుచుఁ
        బ్రత్యవాయముసకు భయముఁ బొంద


తే.

వెఱవకు మని పల్కి తపసి యవ్వీర్యరసము
మెలఁతకుడిచేతిలో బోసి మ్రింగు మనియెఁ
ద్రావి యది గర్భమై యప్డు తనయఁ గాంచి
సంయమీంద్రున కిచ్చియుఁ జనియె దివికి.

107


తే.

బాల యెనిమిదియేండ్లప్రాయం బగుదు
నెవ్వనికి నిత్తు ని న్నంచు ఋషి యడిగిన
నయ్య! విశ్వాధికుం డై నయతని కిమ్ము
నన్ను నని పల్కె మునితోడ నలినవదన.

108

వ.

అనుటయు నమ్మునీంద్రుండు తపోబలంబునం గాని యట్టిపతి సిద్ధింపఁడు. కాశీక్షేత్రంబునఁ దపంబు సేయుము. బాల్యంబునం దపంబుఁ జేయు నీకు ధనము సిద్ధించెఁ గావున ధూతపాప యనునామంబు వహింపుమనిన, మహాప్రసాదం బని యానందకానకంబునందు ఘోరం బైనతపం బాచరించిన.

109


తే.

బ్రహ్మ ప్రత్యక్ష మై వచ్చి పద్మనయన!
యడుగు వర మన్నఁ బ్రాంజలి యగుచు నింతి
పమపావనిఁ గాఁ జేయు బ్రహ్మ నన్ను
ధరణిఁ బావనవస్తుసంతతులలోన.

110


వ.

అనినం గమలాసనుండు.

111


తే.

ధరణిలో మూడుకో ట్లనర్థంబు లెక్క
గలుగుపుణ్యతీర్థంబులు కమలవదన!
ప్రతివసించును రోమరూపంబులందు
నెపుడు నీదేహమున నీకు నిది వరంబు.

112


వ.

అని విధాత యంతర్హితుం డయ్యె. నంత నొక్కనాఁడు ధర్ముండు త న్నభిలషించి పైఁబడం దలంచిన నాధూతపాప చేయీక తలంగిన.

113


తే.

జముఁడు శపియించె దానిఁ బ్రస్తరము గాఁగఁ
దరుణి శపియించి జము జడత్వంబుఁ బొందఁ
జంద్రకాంతశిలాంబునిర్ఝరిణి సతియు
జడమహానిర్ఝరంబు తా జముఁడు నయ్యె.

114


వ.

చంద్రకాంతశిలారూపంబుఁ గైకొని చంద్రోదయంబున స్రవియించుచు ధూతపాప పుణ్యనది యయ్యె. ధర్ముండును ధర్మనదం బనుపేరఁ బుణ్యనదం బయ్యె. వేదశిరుండును నదీ

స్వరూప యైనకూఁతురు ధూతపాప నదస్వరూపుఁ డైనధర్మునకు వివాహంబు సేసె. గభస్తిమాలి గభస్తీశ్వరుసన్నిధి (మంగళా)గౌరీదేవి నుద్దేశించి మయూఖాదిత్యతీర్థంబున నుగ్రతపం బాచరించిన నతనికిరణంబులవలనం బ్రస్వేదం బుద్భవించి కిరణావతి యనం బాఱె. ధర్మనదంబును ధూతపాప నదియుం గిరణాతరంగిణియు గంగాయమునలుఁ గూడ నైదునదులు పంచనదం బనుపేర పుణ్యతీర్థంబై త్రైలోక్యప్రసిద్ధి గైకొనియె. ఇది పంచనదతీర్ధంబు. ఈతీర్థంబున నాప్లుతుండైనమానవుండు పాంచభౌతికంబైన శరీరంబుఁ బావనంబు సేసి పంచమహాపాతకంబులం బాయు. దివోదాసు నుచ్చాటనంబు సేసి కైటభారాతి పంచనదంబునందు విశ్రమించి యగ్నిబిందుం డను మహామునీంద్రుం డొనర్చు నానావిధస్తోత్రంబులకుఁ బరితుష్టి బొంది యిష్టవరంబు గృప సేసి వెండియు.

115


బిందుమాధవసంభవము

తే.

అగ్నిబిందునిపేరు నిజాహ్వయంబుఁ
గూర్చి మధుకైటభారాతి కూర్మి మిగుల
బిందుమాధవుఁ డనుపేరఁ బేర్మి వడసె
నచ్యుతుఁడు భక్తపరతంత్రుఁ డౌనొ కాఁడొ?

116


వ.

బిందుతీర్థంబునం దుండి యగ్నిబిందునకు గోవిందుం డానందకాననంబునందుఁ దీర్థమాహాత్మ్యకథనప్రసంగంబున దానధర్మవ్రతంబు లనేకంబు లుపదేశించి కరుణావశంవదుం డై యతనిం గనుంగొని యింక నేమి యడిగెద వడుగు మనుటయు.

117

తే.

అధికసద్భక్తిసంపద నగ్నిబిందుఁ
డచ్యుతునకు నమస్కార మాచరించి
పద్మలోచన కాశికాపట్టణమునఁ
బ్రతివసించిన నీదురూపంబు లెన్ని?

118


వ.

మఱియు భవిష్యద్రూపంబు లెన్ని? యానతిమ్మనిన మధుసూదనుం డతని కిట్లనియె.

119


వైష్ణవతీర్థమాహాత్మ్యము

సీ.

పాదోదకం బనుప్రథమతీర్థంబున
        నాదికేశవుఁ డన నధివసింతుఁ
దద్దక్షిణమున శ్వేతద్వీప మందేను
        జ్ఞానకేశవసంజ్ఞ సంశ్రయింతుఁ
దార్క్ష్యతీర్థమునందు దార్క్ష్యకేశవుఁడ నై
        యాజనంబులచేతఁ బూజఁ గొందు
నందు నారదతీర్థ మాతీర్థమునఁ గేశ
        వాభిధానుండ నై యతిశయింతుఁ


తే.

గ్రమముతోడ నే నాల్గుతీర్థములయందు
నమృతతాజ్ఞానతార్క్ష్యమహత్త్వములను
బ్రహ్మవిద్యోపనిషదర్థపరిచయంబు
పంచజనులకుఁ గలుగు నాప్లవనపరత.

120


క.

ప్రహ్లాదకేశవుని లను
నాహ్లాదముతోడ నెవ్వఁ డభ్యర్థించుం
బ్రహ్లాదతీర్థమున నేఁ
బ్రహ్లాదత నతని కిత్తు భవ్యశుభంభుల్.

121

తే.

అంబరీషతీర్థంబున నధివసింతుఁ
గేవలం బన నాదిత్యకేశవుఁ డనఁ
బాతకధ్వాంతవిధ్వంసపాటవమునఁ
జేయుదు శుభంబు తత్తీర్థసేవకులకు.

122


వ.

దత్తాత్రేయ భృగు వామన నరనారాయణ విదారణ నరసింహ గోపీగోవింద లక్ష్మీనృసింహ శేషమాధవ శంఖమాధవ హయగ్రీవ కేశవ భీష్మకేశవ నిర్వాణకేశవ త్రిభువనకేశవ జ్ఞానమాధవ శ్వేతమాధవ ప్రయాగమాధవు లనుదివ్యమూర్తులు ధరియించి బహుప్రదేశంబుల నుండుదు. ఈతీర్థంబులు మదీయనామవ్యప్రదేశంబులం బ్రసిద్ధంబు లై యుండు. ఇవి మదీయ తీర్థంబులు.

123


చ.

అనఘ! రహస్య మొక్కటి ప్రయత్నమున న్వినుపింతు నీకు స
జ్జనునకుఁ గాని చెప్పకు మసాధుచరిత్రున కీవు నెన్నఁడుం
బెనుమసనంబునం గలవు పెక్కులు తీర్థము లన్నితీర్థముల్
ఘనమహిమం బ్రసిద్ధ మణికర్ణికఁ బోలవు నిక్క మెంతయున్.

124


మణికర్ణికాప్రభాసవర్ణనము

రగడ.

శ్రీమత్కాశీఫుటభేదన ల
క్ష్మీశ్రుతిమణికర్ణిక మణికర్ణిక;
యామవతీవరచూడామణికిని
హారకమలదీర్ఘిక మణికర్ణిక;
పాదోదకపంచనదాదిమహా
పావనతీర్థోత్తమ మణికర్ణిక;
వేదపురాణాగమవిద్యాపణ
వీథీమాణిక్యము మణికర్ణిక;

పంచమహాపాతకతిమిరౌఘవి
పాటనరవిమండలి మణికర్ణిక ;
కాంచనగర్భహిరణ్యకమండలు
గండూషితజలధర మణికర్ణిక;
పంచారించిన కైవల్యశుభ
ప్రచయంబులకును ఖని మణికర్ణిక;
పంచక్రోశ్యవిముక్తిక్షేత్రా
బ్జమధూళీపూరము మణికర్ణిక;
బిందుమాధవుం డను నా కెంతయు
బ్రేమకళాపాత్రము మణికర్ణిక;
మందాకిన్యంభోవేణీభర
మధ్యనాభిచక్రము మణికర్ణిక;
నరనారాయణమూర్తిధారి యగు
నాకు విహృతిదేశము మణికర్ణిక;
గరుడఖచరవిద్యాధరకిన్నర
గంధర్వనిషేవిత మణికర్ణిక;
డుంఠివినాయకమదజలమిళనక
టుప్రవాహపుష్కర మణికర్ణిక;
కంఠేకాలకిరీటవిటంక
గ్లౌరుచి చుళుకితజల మణికర్ణిక;
మాణికర్ణికం బగుతీర్థంబున
మజ్జనమాడిన మానవోత్తముఁడు;
భ్రూణహత్య మొదలైన యమౌఘము
పొడ వడఁగించును నిమిషమాత్రమునఁ

గాశితీర్థము లెన్ని యన్నియును
గదలి వచ్చి మధ్యాహ్నకాలమున;
రాశి గూడి శ్రీమణికర్ణికతీ
ర్థంబు నాశ్రయించుం బ్రతిదినమును;
మధ్యాహ్నసమాగమమున నేనును
మదనధ్వంసియునుం బరమేష్టియు;
సాధ్యసిద్ధగంధర్వాదులతో
సంసేవింతుము శ్రీమణికర్ణిక;
వత్తురు మధ్యాహ్నస్నానమునకు
వాసుకిశేషాదులు భుజగేశ్వరు;
లుత్తరవాహిని యగుగంగానది
కుత్తమభూషణ మగుమణికర్ణిక;
నిచ్చలుఁ బ్రాతఃకాలము మణిక
ర్ణిక మణికర్ణిక మణికర్ణిక యని
యుచ్చరించుమానవులహస్తముల
కుసిరికకాయలు మోక్షవైభవము;
లొక్కదానమును గోటిదాన మై
యొసఁగు ఫలము నరునకు మణికర్ణిక;
యొక్కయాగమును కోటియాగ మై
యొసఁగు ఫలము నరునకు మణికర్ణిక;
యొక్కపూర్తమును కోటిపూర్త మై
యొసఁగు ఫలము నరునకు మణికర్ణిక;
యొక్కధర్మమును కోటిధర్మ మై;
యొసఁగు ఫలము నరునకు మణికర్ణిక;

యుదయవేళ నెవ్వఁడు మణికర్ణిక
యుదకంబునఁ గ్రుంకును మాఘంబునఁ;
ద్రిదశులు నమ్మానవునకు సంవే
దీంతురు సేవాంజలులు మకుటముల;
మణికర్ణిక హరిచంద్రతీర్థమున
మానవుఁ డెవ్వఁడు పితృతర్పణములు;
ప్రణిథానంబునఁ జేయునాతనికి
భద్రపరంపర లిత్తురు పితరులు;
మణికర్ణికహ్రదతీర్థరాజతట
మధ్యమున హరిశ్చంద్రేశ్వరుఁ డను;
గణనాథుని భజియించువారలకుఁ
గామధేను వై యభిమత మొసఁగును;
మణికర్ణ్యంతరమున గాయత్రీ
మంత్రం బొకమా టుచ్చరించినను;
గణన నది పదివేల్మాఱును శ్రీ
గాయత్రి జపించినఫల మొసఁగును;
నొకవంకను గంగాకేశవులను
నొకవంక హరిశ్చంద్రమంటపిని;
నకలుషమానస; మణికర్ణికతీ
ర్థావధిసీమంబులు గా నెఱుఁగుము;
యావజ్జీవం బగ్నిహోత్రవిధి
యాచరించినట్టిఫలంబు గలుగుఁ;
బావకునందు మహామణికర్ణిక
భవ్యాహుతి వోసినమాత్రంబున;

నుపమకర్ణిక నాణ్యతిలాహుతి
హోమవిధానము మానవోత్తమున;
కపరిమితం బై నిరతిశయం బై
యక్షయ్యంబగు ఫలము ఘటించును;
జక్రపుష్కరిణి యనునామమునఁ
శస్తి వహించినయది మణికర్ణిక!
చక్రనేమిచంక్రమమునఁ దిరిగెడు
సంసృతికిని విరుగడ మణికర్ణిక;
శివుఁ గాశీపతి విశ్వనాయకుని
సేవింపఁగఁ దలఁ పెత్తినయప్పుడు;
ద్రవరూపంబు పరిత్యజించి వని
తారూపముఁ దాల్చును మణికర్ణిక;
ప్రత్యక్షం బై పుణ్యపురంధ్రీ
భావంబు భజించినసమయంబున,
నత్యంతమనోహారిహావభా
వాభిరామ యగు శ్రీమణికర్ణిక;
నాలుగుభుజములు వాలికకన్నులు
నయనాన్విత మగుఫాలభాగమును;
బాలేందుకళామధ్యంబున సిత
భసితంబు ధరించును మణికర్ణిక;
కటకహారకేయూరమేఖలా
కంకణాదిభూషణభూషిత యై;
కుటిలాలకములమీఁదఁ జిన్నిపువుఁ
గుస్తరించు నచ్చుగ మణికర్ణిక;

బహుకల్పాంతంబులు సరిగడచిన
పండ్రెండేఁడులచిన్నిప్రాయమున,
జహజహద్వ్రీడం బగుచేత
స్సంపుటము వహించును మణికర్ణిక;
యొకచే నిందీవరమాలికయును
నొకచే మాదీఫలముఫలంబును;
బ్రకటితమగు దోర్ద్వయమున నంజలి
బంధంబు వహించును మణికర్ణిక;
పద్మసమానం బగునాననబిం
బముచే నొప్పెడునది మణికర్ణిక;
పద్మరాగమాణిక్యంబుల నగు
పలువరుసలు గలయది మణికర్ణిక;
పడమరముఖ మై నాసాశిఖరము
పై నిష్కపం బగుచూపునిలుప,
నుడురాజకళాభరుణునుల్లమున
నుద్వీక్షించును శ్రీమణికర్ణిక;
కన్నియగేదఁగిపూరేకుఁ గబరి
కాభరమునఁ దురుమును మణికర్ణిక;
చిన్నిపూఁపచన్నుల వలి పెపుకం
చెల ధరియించును శ్రీమణికర్ణిక;
మణికర్ణిక చింతామాణిక్యము
మణికర్ణిక బృందారక ధేనువు;
మణికర్ణిక కల్పద్రుమవాటిక
మణికర్ణిక సిద్ధరసస్యందము;

శ్రీమణికర్ణిక యణిమాది మహా
సిద్దికారణము సేవకకోటికి;
శ్రీమణికర్ణిక నగ్నిబిందుముని!
సేవింపుము పుణ్యాత్ముఁడ వయ్యెదు.

125


వ.

మణికర్ణికాతీర్థంబునక వాగ్భాగంబునం బాశుపతతీర్థం; బందు బశుపతీశ్వరుండు లింగరూపధరుండై భవపాశమోక్షంబు సేయు. పాశుపతంబునకుఁ బురోభాగంబున రుద్రావాసతీర్థం బాతీర్థంబునకు రుద్రేశ్వరు డధిదేవత. రుద్రావాసతీర్థంబునకు యామ్యదిగ్భాగంబున విశ్వతీర్థం, బందు తారకేశ్వరుండు విశ్వాభిధాన యగుగౌరితోఁ గూడి విశ్వపూజ్యుండై యుండు. విశ్వతీర్థంబునకు సంగడి మోక్షతీర్థంబు. మోక్షేశ్వరునకు సమీపంబున నవిముక్తేశ్వరంబు. అందులకు సమీపంబునఁ దారకతీర్థంబు గలదు. అందుఁ దారకేశ్వరుండు సంసారతారకుం డధివసించు. తారకతీర్థంబునకు సమీపంబున స్కందతీర్థంబు. స్కందతీర్థంబునకు నవ్వల డుంఠితీర్థంబు. డుంఠితీర్థంబునకు సమీపంబున భవానీశంకరతీర్ణంబు.

126


సీ.

మణికర్ణికాతీర్థమధ్యంబునకు సాగి
        శ్రీపాశుపతతీర్థసీమ నడచి
శ్రీరుద్రతీర్థపశ్చిమభాగమున నేగి
        విశ్వతీర్థంబు వెన్వెంటఁ దగిలి
మోక్షేశ్వరస్థానమూర్ధవవర్త్మము దాఁటి
        తారకబ్రహ్మతీర్థంబు గడచి

బాహులేయక్షేత్రపదము నుల్లంఘించి
        డుంఠిరాట్తీర్థోపకంఠ మొరసి


గీ.

భవతి భిక్షాం ప్రదేహి! యన్పలుకు వలికి
పటువనాంచితకాశికాపథమునందు
నాఁకొనినవారి కిడు సుధాహారభిక్ష
గౌరికరకంకణంబు గల్ గల్లు మనఁగ.

127


మ.

నియమం బొప్పఁగఁ గాశికాపురి భవానీశంకరుల్ విష్టప
త్రయముం గాతురు తల్లిదండ్రు లగుచు న్దాక్షిణ్య మొప్పంగఁ బ్ర
త్యయ మేతవ్విషయంబునం [10]దెఱుఁగ దాయెల్లప్డు మధ్యాహ్న
మక్షయభిక్షాన్నము వెట్టుచుందురు బుభుక్షాక్షీణమర్త్యాళికిన్.

128


గీ.

గృహము వారాణసీసీమ గృహిణ గౌరి
విశ్వనాథుండు గృహమేధి శాశ్వతుండు
పరమకారుణ్యనిధులు దంపతులు దారు
మునికి నప్పుడు సిద్ధించు మోక్షభిక్ష.

129


వ.

భవానీతీర్థంబునకు సమీపంబున జ్ఞానతీర్థంబు. జ్ఞానవాపీసమీపంబున జ్ఞానేశ్వరు సేవించి నరుండు జ్ఞానవంతుండగు. జ్ఞానతీర్థసమీపంబున శైలతీర్థంబు. శైలతీర్థసమీపంబున నందితీర్థంబు. నందితీర్థంబున కవాగ్భాగంబున విష్ణుతీర్థంబు. అం దేను సన్నిహితుండ నై యుండుదు. ఆ తీర్థంబున కవాగ్భాగంబునఁ బితామహతీర్థంబు. పితామహాతీర్థసమీపంబున నాభితీర్థంబు. నాభితీర్థసమీపంబున బ్రహ్మ(నాల)తీర్థంబు. స్వర్గద్వారసన్నిధి భాగీరథీతీర్థంబు. తద్దక్షిణంబున ఖురకర్తరీతీర్థంబు. ఆతీర్థదక్షిణంబున మార్కండేయతీర్థంబు.

మార్కండేయతీర్థసమీపంబున వసిష్ఠతీర్థంబు. తత్ తీర్థసమీపంబున నరుంధతీతీర్థంబు. వసిష్ఠతీర్థంబునకు యామ్యదిగ్భాగంబున నర్మదాతీర్థంబు. తత్సమీపంబునఁ ద్రిసంధ్యతీర్థంబు. తత్సమీపంబున యోగినీతీర్థంబు. తత్సమీపంబున నగస్త్యతీర్థంబు. తత్సమీపంబున గంగాకేశవతీర్థంబు. తత్సమిపంబున వైకుంఠమాధవతీర్థంబు. తత్సమీపంబున వీరమాధవతీర్థంబు. తత్సమీపంబునం గోలాహలనరసింహతీర్థంబు. తత్సమీపంబునఁ గాలమాధవతీర్థంబు. తత్సమీపంబున నిర్వాణమాధవతీర్థంబు. తత్సమీపంబున మహాబలనరసింహతీర్థంబు. తత్సమీపంబున జ్వాలామాలి నరసింహతీర్థంబు. తత్సమీపంబున మహాభయనరసింహతీర్థంబు. తత్సమీపంబున నత్యుగ్రనరసింహతీర్థంబు. తత్సమీపంబున వికటనరసింహతీర్థంబు. తత్సమీపంబున ననంతవామనతీర్థంబు. తత్సమీపంబున దధివామనతీర్థంబు. తత్సమీపంబునఁ దామ్రవారాహతీర్థంబు.

130


సీ.

వారాకరంబులో వటపత్రశయను
        యజ్ఞనాభులు నూఱు నైదుపదులు
తఱితోడ నమృతాబ్ధిఁ ద్రచ్చుచోఁ గుదురైన
        ముదురుకచ్ఛపములు మూఁడుపదులు
సోమకాసురుఁ జంపి శ్రుతులు విధాతృన
        కర్పించునట్టి మత్స్యము లిఱువది
ఛద్మగోపాలవేషమున వ్రేపల్లెలో
        విహరించుకృష్ణులు వేలసంఖ్య

గీ.

పరశురాములు ముప్పండ్రు భానుకులులు
రాఘవేశ్వరు లేకోత్తర మగుశతము
విష్ణురూపుఁడ నొకఁడ నే విను మునీంద్ర!
కాశికాపట్టణము నైదుక్రోశములను.

131


గీ.

శంఖచక్రగదాఖడ్గసంయుతుండు
ననఘ! మధుసూదనాహ్వయుం డగుదు నేను
గమలమును శంఖమును జక్రగదలు దాల్చి
నట్టినన్ను సంకర్షణుం డండ్రు బుధులు.

132


గీ.

శంఖకౌమోదకీచక్రజలజపాణి
నైననన్ను దామోదరుం డండ్రు బుధులు
శంకచక్రాంబురుహగదాసహితు నన్ను
వామనుం డండ్రు రాగమవ్యాప్తమతులు.

133


గీ.

పాంచజన్యంబు గదయును బంకజంబు
చక్రమును దాల్చి ప్రద్యుమ్నసంజ్ఞఁ దాల్తు
శంఖచక్రగదాంభోజసహితు నన్ను
విష్ణుఁ డందురు విజ్ఞానవిమలహృదయ!

134


గీ.

శంఖచక్రగదాపద్మసహితు నన్ను
మాధవుం డండ్రు మేధాసమగ్రమతులు
శంఖగదలును జక్రాంబుజములు దాల్చు
నన్నుఁ బురుషోత్తముం డండ్రు సన్నదురిత.

135


గీ.

శంఖకౌమోదకీపద్మచక్రధరుని
నను జనార్దనుఁ డనుచుఁ జెప్పును బుధాలి
శంఖచక్రగదాంభోజసహితు నన్ను
విశ్వసన్నుతచరిత! గోవిందుఁ డండ్రు.

136

గీ.

శంఖపద్మగదాచక్రసహితుఁడైన
యట్టినన్నుఁ ద్రివిక్రముఁ డండ్రు బుధులు
శంఖమును నంబుజంబును జక్రగదలు
దాల్చుననుఁ జెప్పు జగము శ్రీధరునిఁ గాగ.

137


వ.

శంఖచక్రగదాపద్మంబుల హృషీకేశుండును, శంఖచక్రపద్మగదల నృసింహుండును, శంఖగదాపద్మరథాంగంబుల నచ్యుతుండును, శంఖారిగదాపద్మంబుల వాసుదేవుండును, శంఖపద్మగదాచక్రంబుల నారాయణుండును, శంఖపద్మచక్రగదలం బద్మనాభుండును, శంఖగదారికమలంబుల నుపేంద్రుండును, శంఖచక్రపద్మగదల హరియును, శంఖపద్మగదాచక్రంబులఁ గృష్ణుండును బ్రకాశింతురు. ఇవి మదీయదివ్యమూర్తిభేదంబు లని యానతిచ్చి కార్యాంతరవ్యాసంగంబున మాధవదేవుం డంతర్ధానంబు సేసె. అగ్నిబిందుండును జరితార్థుఁడై [11]బిందుమాధవదేవునియందు నేకీభవించె. ఇది బిందుమాధవాగ్నిబిందుసంవాదం బనునితిహాసంబు. దీని వినినను బఠించినను వ్రాసినను మానవులకు భోగమోక్షములు సిద్ధించు ననినం గుమారున కభివాదనంబు సేసి కుంభసంభవుండు వెండియు ని ట్లనియె.

138


వృషభధ్వజావిర్భావము

సీ.

పార్వతీనందన! పాంచజన్యధరుండు
విఘ్నరాజును శ్రీయు వేఱు వేఱ
వివిధమాయోపాయవేషభాషాదుల
భ్రమియించి కాశికాపట్టణమున

నుఱక దివోదాసు నుచ్చాటనము చేసి
        యామేలివార్త మంథాద్రి నున్న
హరునకుఁ జెప్పి పంపిరి హరుఁడును వచ్చె
        గాశికానగరికిఁ గరమువేడ్క


తే.

వచ్చి పేరోలగం బుండి వరుసతోడ
యోగినుల భాను విధిఁ బ్రమథోత్కరంబు
హరిని లక్ష్మి వినాయకు నాదరించి
భువనసామ్రాజ్యపట్టంబు పూనె నంటి.

139


వ.

సామాన్యంబున సంక్షేపరూపంబుగా వినుటం జేసి దద్వృత్తాంతశ్రవణంబునందు నాకుం దృప్తి చాలకున్నయది. సవిశేషంబుగా విస్తరించి యానతిమ్ము. కాశీమాహాత్మ్యంబునకుం దక్కినవృత్తాంతంబు లానుషంగికంబులు. ఈ వృత్తాంతం బాధికారికంబు గదా యనుటయు, నత్యంతసంతుష్టాంతరంగుఁడై గాంగేయుండు కుంభసంభవున కిట్లనియె.

140


ఉ.

కైటభదైత్యవైరి యధికం బగునేర్పున మన్నుఱేని కు
చ్చాటన మాచరించి తనచట్టు ఖగేంద్రుని బంచెఁ గ్రమ్మఱన్
హాటకరేఖ దానును గజాస్యుఁడు లక్ష్మియుఁ జేసినట్టి కై
లాటమునం ఘటిల్లె సకలార్థము దేవరయాజ్ఞ పెంపునన్.

141


వ.

అనుచు సంతోషసందేశపద్ధతి లిఖించి గరుత్మంతునిచేతి కిచ్చి పంచిన నతిత్వరితగతి లవణేక్షుసురాసముద్రంబులు దాటి కుశద్వీపంబు డాసి.

142


శా.

తద్ధ్యానాస్పదమానమానసుని మంథక్ష్మాధరాధిత్యకా
మధ్యాధ్యాసితు శంభు డగ్గఱి గరుత్మంతుండు కార్యార్థసం

సిద్ధిత్వంబును దీర్ఘపక్షయుగవిక్షేపప్రభేదంబుచే
నధ్యాహార్యముగా నిరంకుశమహాహంకారధీరోద్ధతిన్.

143


వ.

డాసి యంతంత సాష్టాంగదండప్రణామంబు లాచరించుచుఁ చేరవచ్చి నందికేశ్వరునిచేతికి సందేశపత్రికయిచ్చి తత్సమీపంబున బద్ధాంజలియై యుండె. విదితదివోదాసవృత్తాంతుండై మృత్యుంజయుండు కాశీపట్టణంబునకుం బయనం బగుటయు.

144


ఉ.

ఎత్తిరి టెక్కియంబులును నెల్లులు నంబరవీధి దీటుకో
నొత్తిరి శంఖకాహళము లూఁదిరి శృంగకవంశకాండముల్
మొత్తిరి దుందుభుల్ ప్రమథముఖ్యులు హర్షితచిత్తవృత్తులై
యత్తఱిఁ గాశికానగరయానమహోత్సవజృంభణంబునన్.

145


వ.

అప్పుడు నందికేశ్వరుండు.

146


సీ.

ఏనుఁగు లెనిమిది వృషభంబు లెనిమిది
        తురంగంబు లెనిమిది హరు లెనిమిది
గంగాతరంగిణికాళిందు లీషలు
        సాయంబు రేపును జక్రయుగము
ధవళాతపత్రంబు తారకావర్తంబు
        రజితంపుమొలలు తారాగణంబు
ప్రణవంబు మునుకోల పాదపీఠంబు గా
        యత్రి వేదంబు సర్వాంగరక్ష


తే.

ద్వారసంరక్షకులు దీవ్రధామవిధులు
మార్గదర్శక మామ్నాయమండలంబు
గా సమున్నత మగుశతాంగంబు పన్ని
ప్రాంగణంబున నిల్పె శిలాదసుతుఁడు.

147

వ.

విశ్వేశ్వరుండును గైసేసి భవానీసహితుండై యద్దివ్యస్యంచనం బెక్కి, ముప్పదిమూఁడుకోట్లదేవతలును, గోట్యయుతద్వయప్రమథగణంబులును, నవకోటిదుర్గలును, కోటిభైరవులును, గోటికుమారు, లేఁడుకోట్ల వినాయకులును, షడశీతిసహస్రమునులు, నందఱగృహమేధులును, మూఁడుకోట్లు పాతాళతలభుజంగంబులును, రెండుకోట్లు దైత్యదానవులు, నష్టాయుతగంధర్వులును, గోట్యర్ధలక్షరాక్షసులును, బదివేవురు విద్యాధరులును, నఱువది వేలప్సరసలు, నెనిమిదిలక్షలు గోమాతలును, షణ్ణపత్యయుతసుపర్వులును, సప్తసాగరంబులును, నెనిమిదివేలు గిన్నరులును, మున్నూఱు వైవస్వతులును గొలిచి వాయువేగంబున ముహూర్తమాత్రంబున నభోమార్గంబున జని కాశిం బ్రవేశించె. అప్పుడు గోమాతలు దుగ్ధవర్షంబులు కురిసిరి. జైగిషవ్యుం డనుమహామునీశ్వరుండు వేదార్థసారంబు లగు కైవారంబులఁ బరమేశ్వరుం బ్రస్తుతించె. అప్పరమేశ్వరుండు జ్యేష్ఠమాసంబున శుక్లపక్షంబునఁ జతుర్దశినాఁడు ప్రవేశించె. అది కారణంబుగా జ్యేష్ఠస్థానంబనుతీర్థంబును, జైగిషవ్యస్తోత్రంబు కారణంబుగా జైగిషవ్యతీర్థంబును, గోమాతృదుగ్ధవర్షంబు కారణంబుగా క్షీరోదతీర్థంబునుం గలిగె. ఇట్లు కాశీపట్టణంబు ప్రవేశించి.

148


తే.

బ్రహ్మవిష్ణువిహితపట్టాభిషిక్తుఁ డై
జగము లెల్లఁ గొల్వఁ జంద్రమౌళి
గౌరితోడఁ గూడఁ బేరోలగం బున్న
వేళ వచ్చె గాశివిప్రగణము.

149


వ.

అందు.

150

సీ.

సంస్తుతించిరి బహ్వృచప్రపంచంబుల
        నొకకొంద ఱసితకంఠోపకంఠు
నుచ్చైస్వనంబున నొకకొందఱు నుతించి
        రార్యాకళత్రు నధ్వర్యశాఖ
శివునిఁ బ్రశంస సేసిరి యొకకొందఱు
        సద్భక్తిమై సప్తసామములను
సర్వజ్ఞుఁ బొగడి రధర్వవేదంబున
        నొకకొంద ఱొగి ప్రసంగోచితముగఁ


తే.

గాశికాతీర్థవాసులఁ గర్మవరులఁ
భూతిరుద్రాక్షధారులఁ బుణ్యనిధుల
నందఱినిఁ జూచి కరుణాసమగ్రబుద్ధి
నిట్టు లని యానతిచ్చె విశ్వేశ్వరుండు.

151


తే.

సేమమే విప్రులార! యనామయంబె?
పరమమాహేశ్వరాచారనిరతులార!
కుశలమే? కాశికాతీర్థకోటిదివ్య
లింగపూజైకతైనాంతరంగులార!

152


వ.

అనిన విని మందాకినీతీర్థంబు హయతీర్థంబు మత్స్యోదరితీర్థంబు కపాలమోక్షతీర్థంబు నాదిగాఁ గల తీర్థంబులనుండి యేతెంచినబ్రాహ్మణోత్తములు మృత్యుంజయునకు నమస్కరించి యిట్లని విన్నవించిరి.

153


తే.

అసియు వరణయుఁ గూడినయంతనుండి
సంగమేశ్వరతీర్థంబు సందుదాఁక
గగనగంగాతటంబునఁ గదలకుండు
తీర్థవాసుల మమృతదీధితికిరీటి!

154

తే.

పదియు నెనుబదివేలును బంచశతియు
నేఁబదియు నైదుసంఖ్యలయిండ్లవార
మాశ్రితులు కాశికాపురి కస్మదీయు
లీక! పల్లేరు దుడిచి పా టెక్కినారు.

155


వ.

అని యనంతరంబ యాశీర్వదించి యార్ద్రాక్షత(౦బు)లు సల్లి మంగళసూక్తంబుల సంస్తుతించి బ్రాహ్మణులు ప్రబద్ధకరసంపుటులై దేవా! భవదీయకటాక్షవీక్షానిక్షేపసంభూతప్రభూతానుకంపాసంపత్తి గలుగ మాకు సేమం బనామయంబు గుశలం బేమి బ్రాఁతి? అదియునుంగాక.

156


క.

వృషగమన! భవాశీవిష
విషపృషతనిషేకజనితవిషమదశాదు
ర్విషహోష్మదోషసర్వం
కషములు కాశీసమీపగంగామృతముల్.

157


వ.

అనిన విని పినాకి దానునుం గాశీనామాక్షరద్వయంబు గర్ణామృతంబనియును గాశీక్షేత్రధూళిత్రసరేణువులు సర్వాంగరక్ష లనియు గమనాసనస్వప్నజాగరణంబులం గాశీనామస్మరణంబు పాపంబులఁ బాపఁజాలు ననియును బ్రహ్మాండగోళంబున గలతీర్ధజాలంబు లెల్లను గాశీక్షేత్రంబునఁ బంచక్రోశంబున వసియించి యుండు నవియును గాశి నిర్వాణమాణిక్యఖని యనియును గాశిమోక్షలక్ష్మీనివాసకుశేశయం బనియును గాశి సంసారబీజాంకురమరుభూమి యనియునుం గొనియాడి తాను నమ్మహీసురులుఁ గొంతతడ వభీష్టగోష్టీవినోదంబులం బ్రొద్దుపుచ్చి వారు చూడంజూడ నంతర్హితుం

డై దివ్యవభనాభ్యంతరస్థం బైనజ్యోతిర్లింగంబునం [12]దంతరవించె. నంత బ్రాహ్మణులు నిజనివాసంబులకుం జనిరి. ఇది వృషధ్వజావిర్భావం బను నుపాఖ్యానంబు భోగమోక్షప్రదాయకంబు.

158


ఉ.

పంచసహస్రలింగములు భాసురమూర్తులు జ్యేష్ఠనాథతీ
ర్థాంచలభూమియందుఁ బ్రణతాఖిలనిర్జరముఖ్యమండలీ
కాంచనమౌళిరత్నకలికారుచిజాలపిశంగితాంఘ్రు ల
భ్యంచితభోగమోక్షవిభవాకరముల్ కలశీతనూభవా!

159


వ.

అని యెయ్యవి యనిన నాదిత్యలింగంబు పరాశరేశ్వరలింగంబు మాండవ్యేశ్వరలింగంబు మంకణేశ్వరలింగంబు జానుకేశ్వరలింగంబు సుమంతేశ్వరలింగంబు భారద్వాజేశ్వరలింగంబు వాజపేయేశ్వరలింగం బగ్నివర్ణేశ్వరలింగంబు ధ్రువేశ్వరలింగంబు వత్సేశ్వరలింగంబు కుక్కుటేశ్వరలింగంబు పర్ణాదేశ్వరలింగంబు సక్తుప్రస్థేశ్వరలింగంబు మాండూకేశ్వరలింగంబు బాభ్రవేయేశ్వరలింగంబు చ్యవనేశ్వరలింగంబు కలిందమేశ్వరలింగం బక్రోధనేశ్వరలింగంబు కంకేశ్వరలింగంబు కుంతలేశ్వరలింగంబు కఠేశ్వరలింగంబు తుంబురునారదేశ్వరలింగంబు మతంగేశ్వరలింగంబు మాగధేశ్వరలింగంబు జతుకర్ణేశ్వరలింగంబు జంబుకేశ్వరలింగంబు జారుధీశ్వర జలేశ్వర కాళేశ్వర గాలవేశ్వర మహాలింగంబు లాదిగాఁ గల మహాలింగంబులు వెండియు.

160


కందుకేశ్వర వ్యాఘ్రేశ్వరసంభవము

సీ.

ఒక్కనాఁడు భవాని యుబుసుపోవక పైఁడి

        జలపోసనముకసీసంపుఁబట్టు
బంతిఁ గుట్టిమభూమిఁ బాణిపల్లవమున
        నాస్ఫాలనము సేసి యాడుచుండ
నప్పు డంబరవీథి నసుర లిద్దఱు గూడి
        కందుకం బెగవైచు గౌరి బుచ్చి
ప్రమథవేషముఁ దాల్చి పట్టంగ వచ్చిరి
        గనుసన్న చేసి శంకరుఁడు దనుపఁ


తే.

బర్వతాత్మజ యక్కూటపారిషదులఁ
జంపె నచ్చెండునన యురస్స్థలుల వైచి
కపటదైత్యులఁ బరిమార్చెఁ గందుకంబు
కందుకేశ్వరుఁ డనఁ గాశిఁ గాంచె మహిమ.

161


వ.

ఇది కందుకేశ్వరమాహాత్మ్యంబును తత్ సంభవంబును.

162


సీ.

దండఖాతాఖ్యతీర్థమునందు దుందుభి
        నిర్హ్రాదుఁ డనుయామినీచరుండు
ప్రహ్లాదుమామ యప్పాపి దేవతలకు
        నహితంబుగా నధ్వరాంశదాత
లైనవిప్రులఁ జంపఁ బూని కాశికి వచ్చి
        శివరాత్రియందుఁ దత్క్షేత్రవాసి
యొక్క విప్రుఁడు శశాంకోత్తంసుఁ బూజింపఁ
        బులివేషము ధరించి పొంచి కఱవ


తే.

నతఁడు పూజించువృషభాంకుఁ డది యెఱింగి
చంపె నాదైత్యు నొఱలంగఁ జంక నిఱికి
పుండరీకంబు జంపి యాఖండపరశుఁ
డుండెఁ గాశిని వ్యాఘ్రేశ్వరుం డనంగ.

163

వ.

ఇది వ్యాఘ్రేశ్వరు సంభవప్రకారంబు. వెండియు జ్యేష్ఠేశ్వరు సమీపంబునఁ గుక్కుటేశ్వర పితామహేశ్వర గదాధరేశ్వర వాసుకీశ్వర కపాలభైరవ మహాతుండ సాగరేశ్వర వృషభేశ్వర, గంధరేశ్వర దుందుమారేశ్వర కర్కోటకేశ్వర సుప్రతీకేశ్వర తుండకేశ్వర ముండకేశ్వర దివ్యలింగంబులు భజించువారికి భోగమోక్షప్రదాయకంబులు.

164


శైలేశ్వర రత్నేశ్వర ప్రాదుర్భావము

సీ.

ఒకనాఁడు మేనక యుర్వీధరేంద్రుని
        యొద్దఁ గూర్మితనూజ సుమఁ దలంచి
పేదజీవన మయ్యె బిడ్డకు ఱాగుండె
        యతఁడవు గావున నరయ వెపుడు
కాశి నె ట్లున్నదో కమలాయతేక్షణ
        దర్శించి వచ్చుట తగవు గాదె?
యెలనాఁగ పుట్టినయింటివారలు తన్ను
        నరయ కుపేక్షించినపుడు బెగడు


తే.

ననిన బహుసంపదలతోడ నరిగి యతఁడు
హరిపురందర పురలక్ష్మి నతిశయించు
తత్పురముఁ జూచి శివుఁ జూచి తనయఁ జూచి
తెలిసి యవ్వీట లింగప్రతిష్ఠ చేసె.

165


వ.

శైలాధిపప్రతిష్ఠితం బైనయాలింగంబు శైలేశ్వరలింగంబు.

166


ఉ.

అంబికకంచుఁ దెచ్చినమహామణిసంఘము ప్రోఁగు పోసి య
య్యంబురుహాక్షియానతిన యద్రికులాగ్రణి నిల్పె రత్నలిం
గంబు మహాప్రమాణముగఁ గాశికయం దది నేఁడునింద్రచా
పంబుల నీనుచు న్వెలుగుఁ బ్రాహ్ణములం దపరాహ్ణవేళలన్.

167

తే.

చిత్తగింపు మనాది సంసిద్ధ మైన
యొక్క పుణ్యేతిహాస మనూనచరిత!
శిశిరగిరిరాజసంప్రతిష్ఠితవిశుద్ధ
రత్నలింగేశుమహిమ విభ్రాజితముగ.

168


సీ.

కాశికానగరంబు వేశవాటికలోనఁ
        గర్పూకతిలక నా గణిక యొకతె
యసమసాయకునియాఱవపుష్పబాణంబు
        రత్నేశు నాస్థానరంగభూమిఁ
గుండలీనృత్తంబు గోహలాద్యాచార్య
        మతభేదముల దేశిమార్గసరణిఁ
జారికాకరణాంగహారరేచకముల
        భ్రమరికావలన వర్తనగతులను


తే.

నాడి మెప్పించు నెట్టి చోద్యంబొ, తరుణి
మీనకేతనహరుఁ డెట్లు మెచ్చు టెట్లు?
తాను దాండవవిద్యాప్రధానగురుఁడు
లలన పార్వతి సుకుమారలాస్యజనని.

169


వ.

ఇట్లు పరమేశ్వరు నారాధించి యనంతరంబ యక్కాంత యొక్కనాఁడు కార్యాంతరవ్యాసంగంబున నన్యదేశంబునకుం బోయి విధివశంబునఁ గాలధర్మంబు నొందె. ప్రాగ్భవీయంబైన యీశ్వరారాధనసుకృతంబునం జేసి గంధమాదనంబున వసుభూతి యనుగంధర్వరాజునకుం బ్రభవించి రత్నావతి యనుపేర రూపలావణ్యవిభ్రమవిలాసంబులకు నావాసం బై పూర్వజన్మవాసనావశంబునఁ గాశికానగరం

బున రత్నేశ్వరుం బ్రతిదినంబునుం గొలిచి నిజావాసంబునకుం బోవుచుండు.

170


తే.

ఇద్ధకరుణాన్వితుండు రత్నేశ్వరుండు
తన్ను ననిశంబుఁ గొలుచుగంధర్వసుతకుఁ
తనకు సేవకుఁ డైనపాతాళరాజు
శేషకులరత్నభూషణుఁ జేసెఁ బెండ్లి.

171


తే.

చందశూకంబుకలలోనఁ దరుణిఁ గూర్చుఁ
గాంత కలలోన చందశూకంబు నిలుపు
నెట్టివేడుకకాఁడొ రత్నేశ్వరుండు?
జంపతులఁ జేయునందాఁకఁ జలముకొనియె.

172


క.

లీలాకైవల్యవినో
దాలంబం బగుచు లోకయాత్రావిధులం
బాలించు నుబుసుపోకకు
హాలాహలగళుఁడు కాలయాపనబుద్ధిన్.

173


తే.

రత్నలింగేశుమందిరప్రాంతభూమి
రత్నచూడాఖ్యుఁ డను భోగిరాజుపేర
రత్నచూడాహ్వయంబు తీర్థంబు గలిగెఁ
గాశికాస్థానమునయందుఁ గలశజన్మ!

174


కృత్తివాసస్తీర్థమాహాత్మ్యము

వ.

ఇంకఁ గృత్తివాసస్తీర్థమాహాత్మ్యంబు వినుము. ఒక్కనాఁడు కాశీప్రవేశవిష్కంభంబున గంభీరకంఠగర్జితఘోషంబునఁ జదలం జాతకవ్రాతంబులను భువి శిఖండిమండలంబును నొండొండ యుల్లసిల్లం జేయుచు సముల్లసత్కదంబకుసుమకేసరవాసనాసంపాది మధుసుధాసారసౌరభం(భ్యం)బున దశ

దిశాభోగంబులు బుగులుకొన మూర్ధోద్ధూననంబున బ్రహ్మాండభాండంబు దశనకులిశకోటి నుత్పాటించుభంగి నంగీకరించుచు, సముద్దండశుండాకాండగండూషితోజ్ఝితం బగువిబుధనిర్ఝరిణీపాథఃపూరంబునఁ బయోధరవిధిచక్రంబు నీర్కొలుపుచుఁ, జరణఘట్టనంబునం బుడమిం గదిసిల్లినం గపటకిటిజఠరకమఠభుజగపరివృఢులు గూనిగిలం బడఁ గఠోరఫూ(ధూ)త్కారపవనవారాభిఘాతంబున జీమూతవ్రాతంబు చెదరి పఱవఁ గర్ణతాళదుందుభిధ్వానంబున ధరణికుధరగుహాక్రోడంబులం బ్రతిధ్వనులు పుట్టింప నుచ్చకుంభక్రూరాట్టాలకం బగుట గర్వంబునకు నివాసదుర్గంబును, శీకరాసారశిశిరం బగుటఁ గ్రోధంబునకు విహారధారాగృహంబును దానప్రవాహంబులకుఁ బ్రావృటాలంబును, దర్పాంధకారంబునకుఁ గాళరాత్రిసమయంబును నై [13]యానందకాననంబున నవష్టంభసంరంభంవిజృంభణంబున.

175


స్రగ్ధర.

చిందెం జెండాడె మట్టెం జిరిమె విఱిచెఁ గ్రొచ్చెన్ విఘట్టించె దంచెన్
ద్రుంచెం జక్కాడె మోదెం దొడసెఁ గెడపె నత్యుద్ధతిం గాశిసీమన్
బంచక్రోశీధరిత్రీపరిధిఁ గరిసురప్రత్యనీకుండు హేలా
సంచారోదగ్రభంగిన్ బలముకొని వనీసౌధవప్రాట్టవీథుల్.

176


వ.

మఱియు.

177

సీ.

భారభూతేశ్వరప్రాకారగోపుర
        ప్రఘణభూముల మదద్రవము గురియు
ఘర్షించు గండభాగము ఘటోల్కాదిత్య
        భవనోపకంఠాంఘ్రిపంబు శాఖ
థూత్కార మొనరించు ద్రుమిచండపతిమేను
        తుండంబు తుంపరఁ దొప్పదోఁగ
సలుపు వప్రక్రీడ శంకుకర్ణేశ్వర
        స్థానమాణిక్యపాషాణవేదిఁ


తే.

బాఱఁబాఱఁగ వేటాడుఁ బ్రమథకోటి
జిబిజిగఁగ జేయు భూతముల్ కళవళింప
మలయుఁ గాశీపురంబులో మాఱు లేక
యహితజయభాసురుఁడు సింధురాసురుండు.

178


క.

గజదైత్యుఁ డివ్విధంబున
గజిబిజి సేయంగఁ గాశికానగరమునం
బ్రజనితభయకంపమునం
బజ తామరపాకునీటిపగిదిఁ దలంకెన్.

179


ఉ.

క్రొవ్వునఁ గన్నుఁగాన కిటు కుంజరదైత్యుఁడు విక్రమోద్ధతిం
జివ్వకుఁ జేయి సాచి తనుఁ జేరఁగ వచ్చిన లోచనంబులన్
నవ్వుచుఁ గాశికానగరనాథుఁడు విశ్వవిభుండు వైచెఁ దా
నెవ్వడి యాతుధానరథినీలయకాలమునుం ద్రిశూలమున్.

180


తే.

ఆ త్రిశూలాయుధంబు తీవ్రాంశుకోటి
భాశ్ఛటాభాసురము కుంభపదము నాటి
రక్తధారలతోన యారాక్షసేంద్రు
కలుషములు గూల్చి యేతెంచెఁ గ్రమ్మఱంగ.

181

వ.

అప్పుడు నిర్మలాంతరంగుండై యారాక్షసేంద్రుండు విరూపాక్షు ననేకప్రకారంబులం బ్రస్తుతించినం బ్రసన్నుండై యావిశ్వేశ్వరుండు గజాసురా! వరంబు వేడుమనిన నా దైత్యుండు మృత్యుంజయున కి ట్లనియె.

182


ఉ.

పుట్టినవారికి న్నియతము ల్మరణంబులు విశ్వనాథ! నా
యట్టికృతార్థుఁ డెవ్వఁడు? చరాచరవిశ్వవిధాతృసృష్టికిం
బట్టమురాజు నానతసుపర్వకిరీటతటీవిటంకసం
ఘట్టితపాదపీఠు నినుఁ గంటిఁ దుదిం గరుణాపయోనిధిన్.

183


తే.

అమరవంద్య! త్రిశూలాయుధమునఁ జీరి
యొడలు తిత్తొల్చి తోలు పచ్చడము చేసి
యుత్తరాసంగముగఁ దాల్చి యుండవలయు
నోడిగిలి రక్తబిందువు లుట్టిపడఁగ.

184


ఉ.

అంధకవైరి! నాపయి దయాగుణసంపద గల్లె నేని సీ
స్కంధమునందు నాయొడలిచర్మము పాయకయుండుఁగాత దు
ర్గంధము లేక కర్కశము గాక చినుంగక వెండికొండపై
గంధరకాళ మున్న యెసకంబున నీవరమే వరించెదన్.

185


వ.

అనిన సింధురాసురు కోరినవరం బిచ్చి యంధకవైరి కృత్తివాసుం డయ్యె. అది కారణంబుగా నత్తీర్థంబు గృత్తివాసతీర్థం బన విషమభవభయకలుషవిష (నిషేక) భంగజాంగలికం బైన గగనగంగాతీరంబునం బరమఖ్యాతి వహించె. ననంతరతీర్ణంబు లాకర్ణింపుము.

186


కలహంసతీర్థాదిమాహాత్మ్యము

మ.

కలశీసంభవ! యద్భుతంబొకటి యాకాశంబునన్ రెండు కా
కులు కాకా కృతిఁ గాకలీ కళ కళక్రూరప్రకారోద్ధతిన్

గలహం బాడి కొలంకులోనఁ బడి లోకంబెల్ల వీక్షింపఁగాఁ
గలహంసత్వము నొందె నిట్టివిసుమీ కాశీప్రభావోన్నతుల్.

187


వ.

అది కలహంసతీర్థంబు.

188


తే.

హంసతీర్థంబు డగ్గరి యన్నిదిశలఁ
బదియు వేలును మున్నూఱు భవ్యచరిత!
శంభుభవ్యలింగంబులు సన్మునీంద్ర
సంప్రతిష్ఠాపితము లభీష్టప్రదములు.

189


వ.

లోమశేశ్వరలింగంబు మాలతీశ్వరలింగంబు నుత్తరలింగంబు జనకేశ్వరలింగం బసితాంగభైరవతీర్థంబు శుష్కోదరీతీర్థం బగ్నిజిహ్వమణికుండ మహాబలలింగ శశిభూషణలింగ మహాకాళ యోగదేవేశ్వర మహానాదతీర్థంబులును విమలేశ్వరలింగంబు మహాదేవలింగంబు పితామహేశ్వరలింగంబు రుద్రస్థలీతీర్థంబు చండీశ్వర నీలకంఠేశ్వర విజయేశ్వర శ్రీకంఠేశ్వర కపర్దీశ్వర యక్షేశ్వర జయంతేశ్వర త్రిపురాంతక కుక్కుటేశ్వర త్ర్యంబక హరిశ్చంద్రేశ్వర చతుర్వేదేశ్వర సహస్రాక్షేశ్వ రేశానేశ్వర సంహారభైరవస్థానోగ్రభవేశ్వర డుంఠీశ్వర భద్రకర్ణేశ్వర కాలకలశేశ్వర కామేశ్వరలింగంబులును గపాలలోచనతీర్థంబును దీప్తేశ్వ రామరేశ్వర స్వయంభూమహాలక్ష్మీశ్వర ధరణీవరాహేశ్వరలింగంబులును గణపతిక్షేత్రంబును మత్స్యోదరీతీర్థంబును భూర్భువస్స్వర్లింగంబును హాటకేశ్వర కిరాతేశ్వర భారభూతేశ్వర నాకులేశ్వర నైరృతేశ్వర జలప్రియ జ్యేష్ఠేశ్వర దేవేశ్వరోంకారేశ్వర ప్రాసాదపర్వతలింగంబు లివి యష్టషష్ఠ్యాయతనంబులు.

190

సీ.

శ్రీవిశాలాక్షిచే శిశిరభానుకిరీటు
        నర్ధాంగలక్ష్మిచే నగజచేత
లలితచేఁ దరుణపల్లవపాటలాంగిచే
        జవరాలిచే లోకజననిచేతఁ
బూఁబోఁడిచే విశ్వభుజచేత హ్రీంకార
        వనజవాటివిహారవరటచేత
శివదూతచేతఁ బశ్చిమనాడికావీథిఁ
        బరమయోగులు గాంచుఫలముచేతఁ


తే.

జిత్రకంఠికచే నీలచికురచేత
భద్రకాళికచే దైత్యభయదచేత
నిగళభంజనచేఁ గృపానిఘ్నచేతఁ
గరిమ గైకొనె శ్రీకాశికాపురంబు.

191


తే.

గుజ్జుమోకమావి కుబ్జామహాదేవి
భక్తలోకకీరపతగములకుఁ
గమల గమలనాభు గారాబుదేవేరి
గ్రామదైవతములు కాశినగర.

192


సీ.

ఐరావణము నెక్కి యశని చే ధరియించి
        యైంద్రి ఘంటావీధియందు మెలఁగు
విహరించు శృంగారవిపినవీథులయందుఁ
        గౌమారి శిఖిశాబకంబు నెక్కి
చంద్రశేఖకు నాదిశక్తి మాహేశ్వరి
        యాఁబోతు నెక్కి వాహ్యాళి వెడలుఁ
జదలేటి సైకతస్థలుల వినోదించు
        నలవోక బ్రాహ్మి రాయంచ నెక్కి

తే.

విహగపతి నెక్కి వైష్ణవి ప్రహరి దిరుగుఁ
బంచమియును జాముండియు సంచరింతు
రాత్మవాహనముల నెక్కి యహరహంబు
ననఘ! శ్రీకాశికాపురాభ్యంతరమున.

193


తే.

చిత్రఘంటామహాదేవి శివపురంధ్రి
గౌరి నెవ్వాఁడు సేవించుఁ గాశినగరి
నతఁడును వినండు ప్రాణప్రయాణవేళ
యమలులాయకఠోరఘంటారవంబు.

194


శా.

ఝంకించుం గరతర్జనీముఖమునన్ జాలేశ్వరీదేవి కా
శ్యంకస్థాయిని భ క్తకోటిబహువిఘ్నోఘంబుల న్నిచ్చలున్
హ్రీంకారాక్షరమంత్రసౌధశిఖరక్రీడాకళాలోల సా
హంకారామరవైరిమర్దనవిధివ్యాపారపారీణ యై.

195


గీ.

భద్రనాగమహాతీర్థపరిసరమున
భద్రవాపికయందు నాప్లవ మొనర్చి
భద్రకాళిక వీక్షించు పంచజనుఁడు
భద్రసంస్థితిఁ గాంచు వింధ్యాద్రిదమన!

196


క.

సిద్ధివినాయకు గెడ వర
సిద్ధి త్రిసంధ్యంబు సేవ సేసిన నెరయన్
సిద్ధించును మానవునకు
శ్రద్ధావంతునకు విభవసంపత్సిద్ధుల్.

197


క.

విధిశక్తిఁ గాశికాపుర
నిధి నిరవధినిరవసంధినిరవధికకృపా
భ్యర్థిక విధీశ్వరశివుస
న్నిధిఁ గొలిచిననరుఁడు గొంచు నిరుపమసిద్ధుల్.

198

గీ.

అధికభక్తితోడ నమరేశ్వరీదేవి
సిద్ధలక్ష్మి సంభజించి నరుఁడు
నిడివిగాఁగ బ్రదుకు విడువంగ ముడువంగ
వ్రేఁక నైనకలిమి వృద్ధిఁ బొందు.

199


వ.

వెండియుఁ ద్రిలోకసుందరి యనుకందర్పదమసుశక్తి యవిముక్తక్షేత్రంబునకుఁ గస్తూరికాతమాలపత్రంబు. శ్రీకంఠసన్నిధియందు మహాలక్ష్మి భజించువారలకు భోగమోక్షలక్ష్ముల నొసంగు. లక్ష్మీపీఠం బనుమహాస్థానంబు సాధకాభీష్టదంబు. కమలాపీఠంబున కుత్తరంబున హయకంఠి యనుదేవి కఠినతరకుఠారధారాఘట్టనంబున విఘ్నద్రుమషండంబు ఖండించు. పాశపాణి దక్షిణంబునఁ గౌర్మికర్మంబులు ఖండించు. వాయవ్యభాగంబున శిఖచండి శిఖండినీరూపధారిణి యై జాము జామునఁ గేకాధ్వనులు సేయు. భీముచండి యుత్తరద్వారంబు రక్షించుచుండు.

200


గీ.

కాశీభీమేశ్వరునిచక్కఁ గట్టెదురనఁ
బాశపుష్కరపాణి యై భద్రకాళి
భీమచండి మహాదేవి భీమకుండ
పార్శ్వభూమండలంబునఁ బాయకుండు.

201


గీ.

ఛాగవక్త్రేశ్వరీదేవి శంభుశక్తి
వృషభకేతనుయామ్యదిగ్వీథియందుఁ
గదిసి సేవించువారివిఘ్నముల నెల్ల
మేయుఁ జిగురాకు భక్షించుమేఁకవోలె.

202


గీ.

తాటిపొడవున నవిముక్తధామసీమఁ
దాళజంఘేశ్వరీదేవి తలిరుఁబోఁడి

విఘ్నముల నెల్ల జురుకొట్టు వెదకి వెదకి
తాటికంబంబు సవ్యహస్తమునఁ దాల్చి.

203


క.

వికటానన యనుదేవత
మకుటాంగదకటకహారమండన కాళీ
నికటమున నుండుఁ బాయక
యకలంకశశాంకశకల మౌదల వెలుఁగన్.

204


క.

ఉద్దాలకతీర్థంబున
నుద్దాలకనామధేయుఁ డుడుపతిమకుటుం
డుద్దండదండధరమద
భిద్దోఃఖట్వాంగుఁ డుండుఁ బ్రియ మెసలారన్.

205


గీ.

అందు వసియించు యమదంష్ట్ర యనెడు దేవి
పూర్వదిగ్భాగమునకు విభూష యగుచు
నమ్మహాశక్తి నవమందహాస మైన
మెల్లచూపున వలపించు మృడునిమనము.

206


గీ.

తారకేశ్వర మనెడుతీర్థంబునందుఁ
దారకేశ్వరదేవు నిద్ధప్రకాశుఁ
దారకేశ్వరరేఖావతంసు శివుని
దారక బ్రహ్మనిధిఁ గొల్చు ధన్యతముఁడు.

207


సీ.

ఆతారకేశ్వరం బనుతీర్థ మేలెడు
        దారకేశ్వరుని ప్రత్యంతభూమి
సప్తపాతాళవిష్కంభతాలుద్వయీ
        భీకరంబును దందశూకరాజ
జిహ్వాలతంబును జీమూతవిధ్యుక్త
        రోష్ణంబును ధరాధరోష్ఠదళము

తారకానక్షత్రదశనమండలము వి
        ద్యుద్ధండదంష్ట్రాచతుష్టయంబు


గీ.

నైనవదనంబుఁ దెఱచి బ్రహ్మాండపిండ
కబళనమునకుఁ జేసాచి కాళరాత్రి
కాశి శుష్కోదరీదేవి గదల కుండుఁ
జర్మముండకుఁ జెలికత్తె శైలదమన!

208


సీ.

జంగాళముగ వ్యాఘ్రచర్మాంబరముఁ గట్టి
        శూలంబు వలచేతఁ గీలుకొలిపి
భసితత్రిపుండ్రంబు ఫాలపట్టికఁ దీర్చి
        నిద్దంపుఁజిలువజన్నిదముఁ దాల్చి
చనుదోయి గీకసప్రక్కలాపముఁ బూసి
        తనువల్లి రక్తచందన మలంది
కరటాంజనము కల్కి క్రాలుకన్నులఁ దీర్చి
        మధుపానమున నుబ్బు మదికి నొసఁగి


గీ.

వాసి గల్గి మహాప్రేతవనమునందు
సంతతంబుసు విహరించుఁ జర్మముండ
రుండమండన గానిచో రూఢిఁ జర్మ
ముండయ ట్లమ్మహారుండ మునివరేణ్య!

209


శా.

హాలాపాన మొనర్చి యిద్దఱును నన్యోన్యంబు మత్తిల్లి కం
కేలీనృత్తవినోదకందుకమణిక్రీడావిహారక్రియా
లీలాహాస్యకళాప్రసంగముల నుల్లేఖించ వర్తింతు రె
క్కాలంబున్ ఘటజన్మ! కాశినడుమన్ గర్వించి యద్దేవతల్.

210


భుజంగప్రయాతము.

హయగ్రీవతీర్థంబునం దభ్రగంగా

పయోవేణి నిర్ధూతపాదారవింద
ద్వయీరత్నపీఠాంకఁ దాళప్రమాణన్
భయఘ్న న్మహారుండ భావింతు రార్యుల్.

211


వ.

మహారుండకుం బశ్చిమభాగంబున స్వప్నేశ్వరి. ఆస్వప్నేశ్వరి భజించువారలకు భూతభవిష్య[14]చ్ఛుభాశుభార్థంబులు గలలోనం దెలుపుచు నవమ్యష్టమీచతుర్దశీదివసంబులం బూజఁగొను. ఆస్వప్నేశ్వరికి వరుణదిగ్భాగంబున దుర్గాదేవి. ఆ దుర్గ కాశీక్షేత్రంబున దక్షిణద్వారదేశంబు రక్షించుచుండు ననినం గుంభసంభవుండు శంభుసంభవున కి ట్లనియె.

212


గీ.

తుహినగిరి రాజకన్యక దుర్గ యయిన
కారణం బేమి? కందర్పవైరితనయ!
ఆనతిమ్మన్న గుహూఁడు వింధ్యాద్రిదమన!
విను మనుచుఁ జెప్పఁ దొడఁగె సవిస్తరముగ.

213


దుర్గామాహాత్మ్యము

వ.

దుర్గుం డనుపేర నొక్కరాక్షసుండు రురునికొడుకు తపోబలంబున నవధ్యుఁ డై భూర్భువస్స్వర్భువనంబులు బాధింపం దొడంగిన దేవతలు మహేశ్వరు నభయంబు వేడిన నట్లగా నొసంగి శివుండును రాక్షసునిం భంజింప దాక్షాయణి నియోగించిన.

214


గీ.

గౌరి వింధ్యాద్రి కేతెంచి కాళరాత్రి
బంచె రాత్రించరేంద్రునిఁ బట్టి తేరఁ
జంపఁ బాతాళమున కంపఁ జాలునట్టి
శక్తియును నేర్పు నిచ్చి యైశ్వర్య మెసఁగ.

215

వ.

కాళరాత్రియు రుద్రాణియాజ్ఞ శిరంబునఁ దాల్చి యద్దైత్యుసన్నిధి కరిగి యతని కి ట్లనియె.

216


గీ.

రాయబారంబు వచ్చితి రాక్షసేంద్ర!
యచలకన్యక యనుప వింధ్యమున నుండి
బుద్ధిమంతుఁడ వైతేని భువనములకు
బాధ సేయక యుండు నిష్పాపబుద్ధి.

217


వ.

వేదోక్తంబు లైనసర్వక్రియాకలాపంబులుం బ్రతిష్ఠింపం బాలుపడునది యమ్మహాదేవియాజ్ఞం జేసి పెద్దకాలంబు బ్రతుకుము. అట్లు కాదేని బంటవై యకుంఠితోత్సాహంబున నక్కంఠీరవగమన(మధ్య)తోడ యుద్ధము గావింపుము.

218


తే.

హితము చెప్పితి విన నిచ్చయేని లెస్స
జగము బాధింపకుండుట చాలు మాకుఁ
దుహినగిరికన్యయానతిఁ ద్రోచి తేని
యీడ్చికొని పోదు వెండ్రుక లిరియఁబట్టి.

219


వ.

అని గర్వించి పలికినకాళరాత్రిం జూచి కనలి యారాత్రించరేశ్వరుండు.

220


సీ.

అట్టహాసము చేసి యౌరా! ప్రతాపోక్తు
        లాఁటదానికి నింత యదటు వలదు
నే మన్న ననియెఁ గా కేమి మీయేలిక
        సాని వచ్చితి వీవ చాలు మాకు
జగదేకసామ్రాజ్యసంపత్తియును బోని
        యీ వుండవలదె మాయింట నెపుడు?
నేతదర్థమ కదా ఋషి దేవతాకోటి
        దట్టిఁ బెట్టినవాఁడఁ బట్టి తెచ్చి

తే.

వంటయిలు సొచ్చెఁ గుందేలు వనజనయన!
మెచ్చినారము విధి నిన్నుఁ దెచ్చినపుడ
యడవిలోపల నున్న గేహమున నున్నఁ
బొందఁగల భాగ్యవిభవంబు పొందుఁ బురుషు.

221


వ.

అని యంతఃపురచరుల ‘దీని నభ్యంతరంబునకుం గొనిపొం’డని పలికినం గళవళింపక కాళరాత్రి రాత్రించరేశ్వరున కి ట్లనియె.

222


ఉ.

నీతివిదుండ వీవు రజనీచరవంశవరేణ్య! యర్హ మే
దూతలమాటకుం గినియ! దూతలు నేరక యాడినప్పుడుం
గాతురు తప్పు విశ్వనయకార్యధురంధరు లైనభూపతుల్
దూతకు నిష్టసిద్ధికయి తూరఁగ నాడఁగఁ జెల్లు భూపతిన్.

223


సీ.

నయపరాక్రమము లెన్నడు ప్రయోగింప రే
        దేశకాలములు శోధించి చూచి?
నన్నుఁ బట్టగ నైన యదియేమి? పట్టంగ
        రాదె న న్నేలిన రాజవదన?
నెంద ఱబ్బరు నీకు నేను సైతంబుగాఁ
        బర్వతాత్మజ పట్టువడినయపుడు
నే నాఁక సుండనీ కెవ్వారు చూపెద
        రింక నెఱింగి యీయిందువదన?


తే.

వేఁటకానికి మృగము లేవెంట వచ్చుఁ
దెలియుమా దీముఁ గాలిచి తినిన పిదప?
నన్నుఁ బట్టిన దొరకునే నగతనూజ
ప్రథననిర్జితదిగధీశ! రాక్షసేశ!

224

తే.

కాంతఁ గందువఁ బెట్టి నీకడకు మేలు
చెప్ప వచ్చిననన్ను శిక్షింపఁ దగునె!
మొనసి హిత వాచరించిన ‘ముండముక్కు
కోతపడె’ ననుమాటయె గోచరించె.

225


శా.

నీయాజ్ఞన్ గడుగాసి వెట్టెదరు నన్ బెక్కండ్రు నంతఃపుర
స్థాయుల్ శౌర్యపరుల్ పయోధతటీసంవ్యానమున్ గొప్పునుం
జేయుం జెట్టయుఁ బట్టి రాజులు పరస్త్రీ నింత సేయింతురే?
న్యాయంబా యిది? మాన్పు నిగ్రహము మేలందింతు నీ కెమ్మెయిన్.

226


వ.

అని కాళరాత్రి సకరుణంబుగాఁ బలుకం గ్రోధాంధుం డై యవ్విబుధవిరోధి వినియు విననియట్ల యూరకుండె. పొదపొద మని సౌవిదల్లులు హస్తపంకజంబులు పట్టి తివిచిన నప్పంకజాక్షి కరకంకణఝణఝణత్కారంబుగాఁ గెంగేలు గుదిలిచి తివిచికొని వికటకుటిలభ్రుకుటీనటనభీషణఫాలఫలకయై కలకలం గటికినగవు నగి కన్నుల నిప్పు లురుల హుంకారంబు సేసినం గల్పాంతకాలవికరాళకాలవ్యాళఘనాఘనఘటాకోరదీర్ఘనిర్ఘాతచ్ఛటాపాతంబునకుఁ దాత యగు నాని్రఘోషంబు విని గుండియ లవిసి బెండువడి యంగజాలలు గాలుగాలం బెనచుకొని చాఁపచుట్టువడం గూలి రచ్చెరువును మచ్చరంబును గోపంబును నాటోపంబు నెఱయ మెఱయ దుర్గాసురుండు ఖడ్గఖేటకంబులు ధరియించి డిగ్గన గద్దియ దిగనుఱికిన నప్పు డడ్డంబు సొచ్చి దుర్ముఖుండును సీరపాణియుఁ బాశపాణియు సురేంద్రదమనుండు ఖడ్గరోముండు నుగ్రాక్షుండు దేవకంపనుండు నహంపూర్వికాసంఫుల్లపటలంబులగు చేతస్సంపుటంబులం బుటపుటనియవష్టంభంబు బూని

కుంభినీధ్రసన్నిభాకారులు కుఠారభిండివాల మండలాగ్ర త్రిశూలపట్టినప్రాసతోమరంబులు ధరియించి యమ్మహాదేవిం జుట్టుముట్టి పట్ట నురవడించిన.

227


మ.

ఘనరౌద్రోద్ధతి భద్రకాళికకటాక్షజ్యోత్స్న కెంపార ను
హ్హని వక్త్రంబు బిగించి యూఁదుటయు నుల్కాగ్నిచ్ఛటల్ గ్రమ్మ వె
చ్చని జంఝాపవమాన ముప్పతిలి రక్షఃకోటి నొక్కుమ్మడిన్
గొనిపోయె న్వినువీధిఁ జొప్పసొరువాకుంబోలె నెందేనియున్.

228


తే.

పగర నిబ్బంగి శతకోటిఁ బాఱ నూఁది
కఠినహాసం బొనర్చి యాకాళరాత్రి
యరిగె నాకాశవీథి వింధ్యాద్రిసీమ
కసురయును శక్తి వెంటాడి యరుగుటయును.

229


తే.

అంబరక్షోణిచక్రమధ్యమున నుండి
కోటి కోటి నిశాటులు గొల్చి నడువఁ
గాళరాత్రి మహాశక్తి గదిసి వెంట
నేగుదెంచె దుర్గాసురుం డేకధాటి.

230


వ.

అప్పుడు శతకోటిరథంబులు నర్బుదశతద్వయగజంబులు గోట్యర్బుదహయంబులు నసంఖ్యాతయోధులుం గొలువ నేతెంచుదుర్గాసురునిముందట బృందారకమార్గంబున నిరర్గళాటోపంబున నేతెంచు కాళరాత్రిని దవ్వుదవ్వులం గనుంగొని మహాభుజసహస్రదివ్యాయుధయు మహాతేజోపబృంహితయు మహాఘోరప్రహరణపరంపరాధగధ్ధగితధామచ్ఛటాచ్ఛాదితాంబరయుఁ బ్రోద్యచ్చండమార్తాండమండలసహస్రకాంతిజ్యోతిశ్చక్రమధ్యవర్తినియు లావణ్యవార్ధిసమృద్ధి

చంద్రికయు నై త్రైలోక్యకల్యాణమంటపప్రదీపికయు నై యాసర్వమంగళకట్టాయితం బై నిలిచె నప్పుడు.

231


తే.

ధరణిధరరాజకన్యపాదముల కెఱఁగి
కరసరోజద్వయము మోడ్చి కాళరాత్రి
యాదినుండియుఁ దనదువృత్తాంత మెల్లఁ
బూస గ్రుచ్చినచందానఁ బొసఁగఁ జెప్పె.

232


వ.

అనంతరంబ దుర్గాసురుండు వింధ్యాటవీమధ్యంబున వేలంబు విడిసి జంభ మహాజంభ శుంభ వికటానన లంబోష్ఠ పింగాక్ష హయగ్రీవ మహోగ్రాత్యుగ్రవిగ్రహ క్రూరాస్య క్రోధన సంక్రందన మహాలయ జితాంతక దుందుభ వృకానన సింహాస్య క్రూరాస్య ఖర శివారావ మధుపోత్కట శూకతుండ ప్రచండ ముండ మహాభీషణాదు లగుదొరల రావించి యందఱం గలయం గనుకొని యుచ్చైస్స్వనంబున నిట్లనియె.

233


ఉ.

తెంపెసలారఁ గా మనల దీకొనియున్నది యొక్కలేమ దో
స్సంపద వింధ్యభూధరవిశాలశిలాస్థలి నీతలోదరిం
జంపక పట్టి తేవలయుఁ జయ్యన నేగి సరోరుహాక్షులం
జంపకపుష్పకోమలులఁ జంపుట శౌర్యమె! వీరధర్మమే?

234


క.

చలమున నొండెను నొండెను
బలమున బంధించి యొండెఁ బ్రార్థనలీలా
కలనమున వేగ కొని రా
వలయుఁ దరుణిఁ గందకుండ వాడకయుండన్.

235


ఉ.

క్రచ్చఱ నెవ్వఁ డేనిఁ గసుగందక యుండఁ సరోజలోచనం
దెచ్చు నుపాయమార్గమునఁ దెచ్చినయప్పుడ యేను వానికిన్

మెచ్చుడివోకయుండ మఱిమీఁదటియీగులు వేయునుండనీ
యిచ్చితి మింద్రలోకపద మిందఱుసాక్షిగఁ బొండు గ్రమ్మఱన్.

236


వ.

అనుటయు సన్నద్ధులై రాక్షసులు సంవర్తకాలంబున జలధులు మేర దప్పినచందంబున భువనంబులు ముంచి మంచుకొండకూఁతుపై విజృంభించి శంఖభేరీపటహకాహళాగానంబు రోదసీకుహరంబు పూరటిల్లంజేయ ధాత్రీమండలంబు వడవడ వడంక నడచి. రాసమయంబున.

237


తే.

శక్తి రాక్షసుతోడ రాక్షసుఁడు శక్తి
తోడఁ దలపడ సమధికాద్భుతము గాఁగ
ద్వంద్వయుద్ధంబు సాగె వింధ్యంబుమీఁదఁ
బ్రకరనిష్ఠురబహువిధప్రహరణములు.

238


వ.

త్రైలోక్యవిజయతోడ దుర్భరుండును, దారతోడ దుర్ముఖుండును, జయతోడ ఖరుండును, ద్రైలోక్యసుందరితోడ సిరపాణియుఁ, ద్రిపురహరతోడఁ బాశపాణియుఁ, జగన్మాతతోడ సురేంద్రదమనుండును, ద్రిపురభైరవితోడ దేవకంపనుండును, గామాక్షితోడ ఖడ్గరోముండును, గమలాక్షితోడ వజ్రపాణియుఁ, ద్రిపురావనితోడఁ బింగళాక్షుండును, జయంతితోడఁ గుక్కుటాస్యుండును, విజయతోడఁ గపింజలుండును, నపరాజితతోడఁ గాకవక్త్రుండును, శంఖినితోడ ఘూకరవుండును, గజవక్త్రతోడ శంఖకర్ణుండును, మహిసాక్షితోడ జలంధరుండును, రణప్రియతోడ బకుండును, శుభానందతోడఁ గిమ్మీరుండును, గోటరాక్షితోడ ధూమ్రపర్ణుండును, శివారావతోడ ధూమ్రాక్షుండును, ద్రినేత్ర

తోడఁ బింగళాక్షుండును దలపడినం బోరు మహాఘోరం బయ్యె. నయ్యవసరంబున.

239


శా.

ద్యావాపృథ్వ్యవకాశముల్ బుగులుకో నందంద వింధ్యాద్రి ఘం
టావీథిన్ జెలఁగెన్ గఠోరతరకంఠక్ష్వేళనాదంబుతో
దేవీదానవకోటినిష్ఠురభుజాతిప్రౌఢనానాధను
ర్జ్యావల్లీభవభూరిటాంకృతు లురుద్రాఘిష్ఠవీరధ్వనుల్.

240


క.

శక్తులతో సరి పోరెను
నక్తంచరకోటి ప్రహరణవ్రాతములన్
ముక్తాముక్తంబులఁ గర
ముక్తంబుల యంత్రముక్తముల ముక్తములన్.

241


మ.

తిమిరంబున్ ఘటియించెఁ బట్టపగటన్ దేవీమరుద్విద్విష
త్సమరారంభములన్ సముద్భట భుజాచక్రీభవద్దీర్ఘదు
ర్దమకోదండవినిర్గతంబు లయి హేరాళంబు పాదక్షుర
ప్రమహాభల్లశిలీముఖాంజలికనారాచార్ధచంద్రాస్త్రముల్.

242


వ.

ఇవ్విధంబున నుభయసైన్యంబులు సరి పోరుచుండ నయ్యెడ వింధ్యవాసిని మహామాయ వాయవ్యాస్త్రంబు ప్రయోగించి రాక్షసులయస్త్రశస్త్రంబులు తూల నడఁచిన నిరాయుధు లై యద్దైతేయులు విఱిగి పఱచి. రంత దుర్గాసురుండు డగ్గరి మహాశక్తిం గొని వైచిన.

243


తే.

రాక్షసుఁడు వైచినట్టియాప్రబలశక్తి
శక్తి వైచి విఖండించె శంభుశక్తి
చక్రమున వైచె వింధ్యాద్రి సదన నసుర
శైలకన్యక యది త్రుంచెఁ జక్రమునను.

244

తే.

అనిమిషారాతి విల్లెత్త నగజ ద్రుంచె
శూల మెత్తిన ఖండించె నీలవేణి
పఱియలుగఁ జేసె గద యెత్త భద్రకాళి
ఖడ్గ మెత్తిన జక్కాడెఁ గంబుకంఠి.

245


మ.

వడి వింధ్యాచలగండశైలములఁ ద న్వైవంగ నేతెంచుచో
నుడురాజార్ధశిఖావతంసుసతి యత్యుగ్రంబు వహ్న్యస్త్రమున్
దొడి దుర్గాసురు నేయ వాఁడు వడియెన్ దుర్వారవజ్రాహతిన్
బడుశైలంబును బోలి మెచ్చిరి హరిబ్రహ్మాదిబృందారకుల్.

246


వ.

అప్పుడు “దేవీ! జగద్ధాత్రీ! జగత్రయీజననీ! మహేశ్వరమహాశక్తి! దైత్యద్రుమకుఠారికా! త్రైలోక్యవ్యాపినీ! శివా! శంఖచక్రగదాశార్ఙ్గధారిణీ! విష్ణుస్వరూపిణీ! హంసయాన! సర్వసృష్టివిధాయినీ! అనాదినిధనవాగ్జన్మభూమి! చతురానన! ఐంద్రీ! కౌబేరీ! వాయవీ! వారుణీ! యామినీ! నైరృతి! ఐశీ! పావకీ! శశాంకకౌముదీ! సౌరీ! సర్వదేవమయీ! పరమేశ్వరీ! గౌరీ! సావిత్రీ! గాయత్రీ! సరస్వతీ! ప్రకృతీ! మతీ! అహంకృతీ! బ్రహ్మాండాంతస్థమహాదేవీ! పర! పరాపరపరమ! పరమాత్మస్వరూపిణీ! సర్వస్వరూప! సర్వగ! చిచ్ఛక్తిమహామాయ!స్వాహా! స్వధా! శ్రౌషడ్వౌషట్స్వరూపిణీ! ప్రణవాత్మిక! సర్వమంత్రమయీ! చతుర్వర్ణాత్మిక! చతుర్వర్గఫలోదయ!” యని యిట్లనేకప్రకారంబుల దేవతలందఱు ప్రస్తుతించిరి. భద్రకాళియు నిర్జరుల కభీష్టవరంబులు ప్రసాదించె. దుర్గాసురుని మర్దించి జగంబులదుర్గతి మాన్పుటం జేసి భర్గుగృహిణికి దుర్గాభిధానంబు గలిగె. దుర్గాదేవి గాశీక్షేత్రంబునందు నుపసర్గాదిదోషంబులు మాన్చు. దుర్గా

కుండంబునం గృతస్నానుం డైన నరుండు దౌర్గత్యంబులు వాయు. దుర్గాశరీరంబునం బుట్టిన శక్తులు దుర్గా సమీపంబున వసించి పంచక్రోశంబున నిరాక్రోశంబుగా శాసింతుము. మఱియు శతనేత్ర సహస్రాస్య యయుతభుజ యశ్వారూఢ గజాస్య త్వరిత శతవాహిని విశ్వసౌభాగ్య గౌరి యన్వీరు తొమ్మండ్రును శక్తులు. రురుండు చండుం డసితాంగుండు కపాలి క్రోధనుం డున్మత్తభైరవుండు సంహారుండు భీషణుం డీయెనమండ్రు భైరవులు. విద్యుజిహ్వుండు లలజ్జిహ్వుండు క్రూరాస్యుండు క్రూరలోచనుం డుగ్రలోచనుండు వికటదంష్ట్రుండు వక్రాస్యుండు వక్రనాసికుండు జంభకుండు జృంభణముఖుండు జ్వాలానేత్రుండు వృకోదరుండు గర్తరినేత్రుండు మహానేత్రుండు తుంగనేత్రుండు అంత్రమండనుండు జ్వలత్కేశుండు కంబుశిరుండు పృథుగ్రీవుండు మహాహసుండు మహానాసుండు లంబకర్ణుండు కర్ణప్రావరణుం డనాదిగాఁ గల బేతాళు లసంఖ్యాతులు. భూతంబు లసంఖ్యంబులు గల. రిందఱు కాశీక్షేత్రంబు సంరక్షింతు రనినఁ గుంభసంభవుండు గాశీస్థానంబున దివ్యలింగంబు లెన్ని? తత్ప్రభావంబు లెట్టివి? యానతి మ్మనినఁ బార్వతీదేవికి భవుం డానతిచ్చినప్రకారంబున నయ్యగస్త్యునకుఁ గుమారుం డిట్లని చెప్పె.

247


ఓంకారేశ్వరమాహాత్మ్యము

సీ.

ఆనందవిపినంబునం దాదిమబ్రహ్మ
        దప మాచరించె నత్యంతనిష్ఠఁ

బర్యాయమున నేగెఁ బదినూఱులుయుగంబు
        లంతఁ బాతాళలోకాంతరమున
నుండి యుత్థిత మయ్యె నొకదివ్యలింగంబు
        బహుకోటిసూర్యపద్భాసితంబు
విధి మనోవీథి భావించు నేతేజ మా
        తేజంబు లింగమూర్తిత్వ మొందె


తే.

భూరిభువనాగ్రభాగవిస్ఫుటనవేళ
సంభవించినచటచటచ్ఛబ్దధారఁ
గ్రమముతోడ సమాధియోగంబు విడిచి
కన్ను లెనిమిదియును విచ్చెఁ గమలభవుఁడు.

248


సీ.

ఆదిమతేజంబునం దకారము దోఁచెఁ
        గైటభరాతియాకారరేఖ
నటఁ జూడఁ జూడఁ బ్రత్యక్షమయ్యె నుకార
        మంబుజాసనుని రూపంబుఁ దాల్చి
తదనంతరంబ చంద్రశిఖావతంసు చం
        దంబుఁ గైకొని నుకారంబు మెఱసె
నంత శబ్దబ్రహ్మ మైన నాదంబున
        భువనహేతువును బిందువును దోఁచె


తే.

నఖిలములు గూడి యోంకార మయ్యెఁ బిదపఁ
గ్రమముతోఁ గుంభభవ! యకారము నుకార
మును మకారంబు నగు వర్ణములును నాద
బిందువులు ధాతయగ్రమునందు నిలిచె.

249


వ.

ఎయ్యది సంసారతారకం బగుటఁ దారకం బయ్యె. ఎయ్యది ప్రకర్షంబునం జేసి యశేషవిక్రియావిరహంబునం గూటస్థ

నిత్యం బయ్యును బరమానందప్రకాశంబున సర్వదా యభినవం బగు పరబ్రహ్మంబునకు వాచకం బగుటఁ బ్రణవాభిధానంబు వహించె. ఎయ్యది యకారోకారమకారబిందునాదంబు లైదవయవంబులవలననుం బంచాశత్కళారూపయగు మాతృకకుం గారణభూతం బయ్యె; ఎయ్యది త్రయీమయంబు తురీయంబు తురీయాతీతంబు నిఖిలాత్మకం బనం బరఁగు; ఎయ్యది చతుశ్శృంగంబు సప్తహస్తంబు ద్విశీర్షంబు త్రిపాదంబు త్రిధాబద్ధంబై వృషభాకారంబై మ్రోయు; ఎద్దానియందు బ్రహ్మస్థం బగుజగం బభిలీనంబై యుండు; ఎయ్యది యకారోకారమకారంబు లను వర్ణత్రితయంబుచే వేదచతుష్టయాత్మకంబును గార్హపత్యదక్షిణాహవనీయసంవర్తకాగ్నిరూపంబును బృథివ్యంతరిక్షద్యుసోమలోకాత్మకంబు నుదాత్తానుదాత్తస్వరితప్రచయాత్మకంబును భూతభవిష్యద్వర్తమానసాధారణకాలాత్మకంబును నాఁ జను; ఎద్దానియం దాదర్శంబునందును ముఖంబునుం బోలె స్వప్రకాశకచిద్రూపుండు నీశ్వరుండు ప్రతిబింబించు; ఎయ్యది యకారాదివర్ణంబు లేకత్వంబు నొందునట్లుగా సంయోజింప 'నాద్గుణ' యనుసంధిఁ గూడి మంత్రత్వంబు నొందు; అట్టి యోంకారమంత్రత్వంబు దివ్యలింగస్వరూపంబై యావిర్భవించినం గనుంగొని పంకజాసనుండు 'నమ ఓంకార స్వరూపాయ, నమ స్సర్వరూపస్వరూపిణే, నమో రుద్రాయ, నమో భవాయ, నమ శ్శర్వాయ, నమ ఉగ్రాయ, నమ స్సామర్గ్యజుస్స్వరూపాయ, నమో నాదాత్మనే, నమో బిందుకళాత్మనే, నమో లింగాయ, నమో లింగస్వరూపాయ, నమో భీమా

య, నమఃపశుపతయే, నమ స్తారస్వరూపాయ, నమశ్శివాయ, నమః కపర్దినే, నమ శ్శితికంఠాయ, నమో మీఢుష్టమాయ, నమో గరిష్ఠాయ, నమ శ్శిపివిష్ఠాయ, నమో హ్రస్వాయ, నమో బృహతే, నమో వృద్ధరూపిణే, నమః కుమారగురవే, నమః శ్శ్వేతాయ, నమః కృష్ణాయ, నమః పీతాయ, నమో౽ రుణమూర్తయే, నమో ధూమ్రపర్ణాయ, నమః పింగళాయ, నమః కిర్మీరవర్చసే, నమః పాటలవర్ణాయ, నమో హరితతేజసే, నమో నానావర్ణస్వరూపాయ, నమో వర్ణపతయే, నమ స్స్వరరూపాయ, నమో వ్యంజనరూపిణే, నమ ఉదాత్తానుదాత్తస్వరితరూపాయ, నమో హ్రస్వదీర్ఘప్లుతవిసర్గాత్మనే, నమో౽ సుస్వారస్వరూపాయ, నమ స్సానునాసికాయ, నమో నిరనునాసికాయ, నమో దంత్యాయ, నమ స్తాలవ్యాయ, నమ ఓష్ఠ్యాయ, నమ ఉరస్యాయ, నమ ఊష్మస్వరూపాయ, నమో౽౦తస్థాయ, నమః పినాకీనే, నమో నిషాదాయ, నమో నిషాదపతయే, నమ స్తారాయ, నమో మంద్రాయ, నమో మధ్యమాయ, నమో ఘోరాయ, నమో౽ ఘోరమూర్తయే, నమ స్తానస్వరూపాయ, నమో మూర్ఛనాస్వరూపాయ, నమ స్స్థాయిసంచారస్వరూపాయ, నమో లాస్యతాండవజన్మనే, నమ స్తోత్యత్రికస్వరూపాయ, నమ స్థూలాయ, నమ స్సూక్ష్మాయ, నమో౽ దృశ్యాయ, నమో౽ ర్వాచీనాయ, నమ పరాచీనాయ, నమో వాక్ప్రపంచస్వరూపాయ, నమ ఏకాయ, నమో౽ నేకభేదాయ, నమ స్సదసస్పతయే, నమ శ్శబ్దబ్రహ్మణే, నమః పరబ్రహ్మణే, నమో వేదాంతవేద్యాయ, నమో వేదపతయే, నమః పార్వతీశ్వ

రాయ, నమో జగదీశ్వరాయ, నమో దేవదేవాయ, నమశ్శంకరాయ, నమస్తుభ్యం మహేశ్వర! నమస్తుభ్యం జగదానంద! నమస్తుభ్యం చంద్రశేఖర! నమస్తుభ్యం మృత్యుంజయ! నమస్తుభ్యం త్ర్యంబక! నమస్తే పినాకహస్తాయ, నమస్తే త్రిశూలధారిణే. నమస్తే త్రిపురఘ్నాయ, నమస్తే ౽౦ధకనిషూదనాయ, నమః కందర్పదర్పదళనాయ, నమో జాలంధరారయే, నమః కాలాయ, నమః కాలకూటవిషాదినే, నమో భక్తవిషాదహంత్రే, నమో నమ” యని యనేకప్రకారంబులం బ్రస్తుతించిన.

250


సీ.

హరుఁ డకారేశ్వరుండై కైటభారాతి
        యాకారరేఖఁ బ్రత్యక్ష మయ్యె
శివుఁ డుకారేశ్వర శ్రీమహాదేవుఁడై
        ధాతృస్వరూపంబుఁ దాల్చి యలరె
గంగాధరుండు మకారేశ్వరుం డయి
        విధుమౌళిఠేవ నావిర్భవించె
నాగకీయూరుండు నాదేశ్వరుం డయి
        భాసిల్లి శబ్దరూపత వహించె


తే.

విశ్వలోకైకభర్త బింద్వీశ్వరుఁ డయి
భువనకారణభావంబుఁ బూని మెఱసె
నిందఱును బ్రహ్మ కిచ్చి రభీప్సితంబు
లైదులింగంబులును బ్రణవాత్మకములు.

251


వ.

ఈ యైదును దివ్యలింగంబులు.

252


తే.

దమనుఁ డను బ్రాహ్మణుడు భరద్వాజగోత్రుఁ
డాదిమాశ్రమమునను వింధ్యాద్రిదమన!

పాశుపతదీక్షఁ గైకొని కాశియందు
సిద్ధి గైకొనె నవిముక్తసీమయందు.

253


తే.

భారభూతేశ్వరుఁడు యక్షభర్తదిశకు
నింద్రు దెసకును మణికర్ణికేశ్వరుండు
బ్రహ్మగోకర్ణవరు లవాక్పశ్చమముల
కవధు లవిముక్తమునకు వింధ్యాద్రిదమన!

254


వ.

అట్టహాసుండు ప్రాగ్ద్వారంబును, భూతధాత్రీశ్వరుండు దక్షిణద్వారంబును, గోకర్లుండు పశ్చిమద్వారంబును, ఘంటాకర్ణుం డుత్తరద్వారంబును, ఛాగవక్త్రుం డీశదిక్కోణంబును, భీషణుండు వహ్నిదిక్కోణంబుసు, శంకకర్ణుండు రాక్షసదిక్కోణంబును, ద్రుమిచండుండు వాయుదిక్కోణంబును, నానాప్రమథగణపరివృతులై రక్షింతురు. కాలారక్షణ భద్రకౌలేయకాలకంపనులు గంగాతీరంబును, వీరభద్ర నభకర్ధమాలిప్తవిగ్రహస్థూలకర్ణమహాబాహు లసితీరంబును, విశాలాక్షమహాభీమకుండోదరమహీధరులు దేహలీదేశంబును నందిషేణ పాంచాల ఖరపాద కరండ కానంద గోపక బభ్రులు వరణాతీరంబును గాచియుండుదురు.

255


తే.

కపిల సావర్ణులకును శ్రీకంఠ పింగ
ళాంశుమంతులకును నొక్కయవసరమున
నేగురకుఁ గల్గె నాశ్చర్య మేమి చెప్ప
దనువుతోడన శివుఁ గూడికొనఁగఁ గాశి!

256


చ.

కలశతనూజ! యచ్చెరువు కాశికయం దొక శంభులింగముం
దిలలను నక్షతంబులను ధీనిధి యొక్కఁడు పూజ చేసి పో

నొలికిన వాని మేయుటకు నోలిఁ బ్రదత్మక్షిణ మాచరించి చి
ట్టెలుక శరీరముం [15]దొరుగ కెక్కెనుబో రజతాద్రికూటమున్.

257


క.

ఘటసంభవ! శ్రీకాశీ
కటకమునకు నికట గగనగంగాతటి నీ
చటులకృపీటోర్మిఘటా
స్ఫుటదఘమున కెనయె యితరపుట భేదనముల్?

258


శా.

అంభోజాసను నంతవానికిని శక్యంబే నుతింపంగ నో
కుంభీసంభవ! డుంఠిరాజకరటక్రోడక్షరద్దానవా
స్సంభేదప్రవిజృంభమాణ వరణాసంపర్కసంపన్న కౌ
క్షింభర్యామరసింధునైకటికమున్ శ్రీకాశికాక్షేత్రమున్?

259


క.

అవిముక్తం బవిముక్తం
బవిము క్తం బగుచుఁ బ్రాతరారంభములం
దవధానపరత నెవ్వం
డు వచించును వాఁడు ధన్యుఁడు మునిప్రవరా!

260


తే.

మొగుచు జంతువు కాశికానగరసీమ
న పునరున్మీలనమునకై యక్షియుగముఁ
గాంచు నిక్కలగా నొక్కకలయు నపుడు
త్రిణయనుఁడు గాఁగఁ దన్ను నాదీర్ఘనిద్ర.

261


ఉ.

ఎట్టు నుతింతు నల్పమతి నిల్వలమర్దన! యేను గాశికా
పట్టణశంభుమూర్తులఁ గృపాగుణ! యోర్తులతాంగి ఱేపెదు
ర్కట్టున ముంగిటం గసవుగాండ్రయుఁ బుచ్చుచుఁ జేతిచీపురుం
గట్టయుఁ దానుఁ జొచ్చెఁ గఱకంఠుని నోంకృతినాథదేవునిన్.

262

తే.

ఓంకృతి శ్రీమహాదేవునొద్దఁ గలదు
బిలము పాతాళమున కేగు పెద్దత్రోవ
దానివాఁకిట నుండ్రు వాతాపిదమన!
సౌవిదల్లులు కుఱుపల్లజడలమునులు.

263


తే.

వెంటఁ బడి వచ్చు కాకికి వెఱుచి భేకి
తిరిగె నందంద నోంకారదేవుభవన
మటఁ బ్రదక్షిణ మొసరించి నట్టిమహిమ
నొడలితోడనె యాకప్ప మృడునిఁ గలసె.

264


తే.

పాడి మెచ్చించె నొకయింతి పంజళమున
నాడి మెచ్చించె లేమ లాస్యమున నోర్తు
పొగడి మెచ్చించె నొక్క లేఁజిగురుఁబోఁడి
కరుణ గలవాఁడు కాశి నోంకారభర్త.

265


మ.

మనుజుం డెవ్వఁడు కాశికిం జనఁడు శ్రీమత్స్యోదరీతీర్థముం
గనఁ డోంకారశశాంకమూర్ధునకు మ్రొక్కం డద్దురాత్ముండపో
మునిశార్దూల! వినాశకారణము దోర్మూలాగ్రకూలంకష
స్తనభారాలనససూక్ష్మమధ్యజననీతారుణ్యసంపత్తికిన్.

266


చ.

పనివడి ఫాలలోచనుఁడు పర్వతరాజతనూజ కానతి
చ్చినపరిపాటి నీకు నఱ సేయక చెప్పెద సావధానతన్
విను కలశీతనూభవ! త్రివిష్టపదివ్యసమాహ్వయత్రిలో
చనచరితంబు సర్వకలుషఘ్నము పుణ్యసమృద్ధ్యుపఘ్నమున్.

267


క.

విరజాహ్వయ మగువివరము
పరమఋషిప్రవర! కాశీపట్టణరత్నా
భరణము తద్దర్శనమున

[16]నరుఁడును విరజస్కుఁ డగు ననఘ! నిమిషమునన్.

268


తే.

అనఘచారిత్ర! కాళిందియును సరస్వ
తియును నర్మదయును దదంతికమునందుఁ
గాలుదిక్కునఁ బ్రవహించుఁ గాలకూట
కంఠపాదాబ్జపీఠోపకంఠ మొరసి.

269


ఉ.

సంభృతభక్తిభావనఁ ద్రిసంధ్యములందును నాతరంగిణుల్
శంభుఁ ద్రివిష్టవేశ్వరు శశాంకకళాధరుఁ దీర్థ మార్చు వి
స్రంభమునం గరాంబురుహసంగతమంగళశాతకుంభకుం
భోంభితగంధసారసయోగసుగంధనవాంబుధారలన్.

270


క.

స్థాపించె నాస్థలంబున
నాపుణ్యతరంగిణీత్రయము చంద్రకళా
నైపథ్యంబుల భుజగక
లాపంబుల వివిధమణిశిలాలింగములన్.

271


ఉ.

నిండుమనంబుతోడ రజనీచరమౌళిఁ ద్రివిష్టపేశ్వరున్
దండనమస్కృతిప్రవణతన్ భజియించిన మర్త్యకోటికిన్
వెండియుఁ గర్మబంధములె? వెండియు నాధివికారబాధలే?
వెండియు మాతృయోనిపదవీచ్యుతి సంకటమే? ఘటోద్భవా!

272


మ.

గయ కేలా యరుగంగ మానవులకుం? గాశీపురీవాహినీ
త్రయవేణీపులినంబులందు నిడ రదా తల్లినిం దండ్రినిం
బ్రియమాతామహులం బితామహులనుం బేర్కొంచుఁ బిండానము
ల్గయికోరా ప్రమదంబుతోడఁ బితరు ల్హస్తాబ్జముల్ సాఁచుచున్?

273

తే.

దక్షిణమున త్రివిష్టపస్థానమునకుఁ
జెంగట సరస్వతీశ్వరక్షేత్ర మనఘ!
యిచ్చుఁ గొలిచినవారి కయ్యిందుధరుఁడు
గరుణ సారస్వతం బైనపరమపదము.

274


క.

యమునేశ్వరుఁడు ద్రివిష్టకు
సమీపమున నంబుపతిదెస న్వసియించున్
యమపుటభేదననికట
ద్రిమవాటికఁ జూడ రవ్విధుధరునిభక్తుల్.

275


తే.

ఆత్రిలోచనుప్రాగ్దిక్కునందు నుండు
నర్మదేశుండు నిజభక్తశర్మదాయి
శైవదీక్షావిధిజ్ఞ! తత్సేవకులకు
మాతృగర్భార్భకత్వంబు [17]మందు సుమ్ము.

276


తే.

అఖిలనీవారముష్టింపచాగ్రగణ్య!
ప్రత్యహంబు ద్రవిష్టపద్రష్ట యెవ్వఁ?
డవ్విశిష్టుఁడు విష్టపాధ్యంతరమున
వీసమంతటిమాత్రంబు వెలితిస్రష్ట.

277


ఉత్సాహ.

లీల మనుజుఁ డెవ్వఁ డేఁ బిలిప్పిలాతరంగిణిం
దేలి శ్రీత్రివిష్టపేశు ద్రిపురమథను శశికళా
మౌళిఁ బూజ సేయుఁ గుసుమమాల్యముల నతండు డా
కాలిమడమఁ జప్పళించుఁ గాలమృత్యువక్త్రమున్.

278

మానిని.

ఉత్తరవాహినియై ప్రవహించుచునున్న పిలిప్పిలఁ గ్రుంకి మదిం
దత్తపా టొకయించుక లేక యథావిధిఁ గోమలతాకకరా
డ్భిత్తకిరీటుఁ ద్రివిష్టపనాయకుఁ [18]బెన్మసనంబునఁ గొల్చిన భా
గ్యోత్తరుఁ గాంచి నమస్కృతి సేయుదు రుప్పరవీథిఁ జరించుసురల్.

279


తే.

ఇతరదేశంబులం దుపార్జితము లైన
పాపములు వాయుఁ గాశికాపట్టణమున
గాశిఁ జేసినపాప మెక్కడను బాయ
దదియుఁ బాయుఁ ద్రివిష్టపోపాంతభూమి.

280


తే.

కాశి జంబూతరుద్వీపకనకభూష
కాశియం దుత్తమంబులు క్రమవిభూతి
సింధుసంభేద మోంకారశివపదంబు
శ్రీత్రివిష్టపనాయకక్షేత్రతలము.

281


క.

విదితముగఁ గాశినడుమం
ద్రిదశమణికిరీటకోటిదీధితివిలస
త్పదునిఁ ద్రివిష్టపుఁ గొలిచిన
నొదవును సిరిమోక్షపదము [19]నుదయవివేకా!

282


శా.

కుంభసంభవ! యాత్రివిష్టపుని గ్లౌకోటీరు సింధుత్రయీ
సంభేదస్థలవాసుఁ గొల్చునరునిన్ సాధింపఁగాఁ జాలునే
కుంభీపాకముఖప్రధాననరకక్రూరప్రకారవ్యథా
సంభారంబుల నీగఁ జాలు మదిరాస్వాదాదిపాపౌఘముల్.

283

సీ.

క్రూరుండు పిశునుండు కొండీ డభక్ష్యభ
        క్షకుఁడు విప్రంభవిఘాతుకుండు
గురుతల్పగుఁడు నిందకుఁడు నాస్తికుఁడు కూట
        సాక్షి పరద్రవ్యచౌర్యపరుఁడు
మాతాపితృత్యాగి యాతతాయి శఠుండు
        పరదారలోలుండు గరళదుండు
గులధర్మవిముఖుండు గురుజనద్వేషుండు
        బ్రహ్మహత్యాసురాపానరతుఁడు


తే.

నాఁగఁ గల పాపుల కఘంబు నీఁగ దిక్కు
శ్రీత్రివిష్టపదేవుండు శ్రీప్రదుండు
నీలలోహితు నభవు నిందించుపట్టి
కర్మచండాలునికిఁ దక్కఁ గాశియందు.

284


క.

ఇందుకళాశేఖరునిన్
నిందించుట ముజ్జగంబు నిందించుట త
ల్లిందండ్రిని నిందించుట
నిందించుట హర్యజాదినిర్జరకోటిన్.

285


క.

శివనింద సేయుపాతకు
దవుదవ్వులఁ జూచి తొలఁగఁ దగు శైవులకున్
శివనిందాపరుపలుకులు
చెవి యొడ్డి వినంగఁ దగదు శివభక్తులకున్.

286


ఉ.

సత్యము పల్కెదన్ శ్రుతులు శాస్త్రము లాగమముల్ పురాణముల్
ప్రత్యయ మయ్యెనే నిజముఁ బల్కెద రింతియ కాక యేమి? దు
ర్గత్యపహారదక్ష యగుకాశియ తీర్థము తీర్థకోటిలో

నిత్యుఁడు విశ్వనాయకుఁడు నిక్కపుదైవము దేవకోటిలోన్.

287


తే.

ఆదిఁ బంచనదంబునయందు మునుఁగు
నాడు మణికర్ణికాతీర్థ మంతమీఁద
విశ్వనాథుని భక్తి సేవించి పిదప
నట విఖండించు మనుజుఁ డొక్కఁడ యఘంబు.

288


శా.

వాతాపీల్వలదైత్యమర్దన! తగున్ వర్ణింప దివ్యామృత
జ్యోతిర్లింగతనుం ద్రివిష్టపుని నస్తోకప్రభావాన్వితున్
బాతాళంబున నుండి వెల్వడి పురీత్రత్యంతభాగీరథీ
స్రోతస్విన్యుపకంఠభూమిఁగృతవాసుం డైన సర్వేశ్వరున్.

289


వ.

త్రివిష్టపేశ్వరునకుఁ బశ్చిమభాగంబున ద్రోణేశ్వరలింగంబు, తదగ్రభాగంబున నశ్వత్థామేశ్వరలింగంబు, నటుపిఱుంద శాంతనవేశ్వరలింగంబు, నందులకు వాయవ్యదిగ్భాగంబున వాలఖిల్యేశ్వరలింగంబు, తత్సమీపంబున వాల్మీకేశ్వరలింగంబు గల దందు. మఱియుఁ ద్రివిష్టపేశ్వరుమాహాత్మ్యం బభివర్ణించెద.

290


త్రివిష్టపేశ్వరమాహాత్మ్యము

తే.

అమ్మహాదేవుప్రాసాద మాశ్రయించి
యుండుపారావతంబులు రెండు నెలమి
నాలుమగఁడును ననఁగ గార్హస్థ్యగరిమ
సకలకాలంబుఁ గవఁగూడి సంచరించు.

291


సీ.

పక్షాగ్రముల విచ్చి ప్రాసాదవలభికా
        పర్యంతములధూళి పాఱఁ దుడుచుఁ

జలుపు యాతాయాతములఁ బ్రదక్షిణములు
        మాటమాటికి గర్భమంటపికకు
సోమసూత్రప్రణాళీమార్గనిష్ఠ్యూత
        తీర్థోదకంబులు దివుటఁ గ్రోలు
భక్షించు గేహళీబల్యర్తవిక్షిప్త
        పిండోదకములు సంప్రీతి యెసఁగ


తే.

వినుఁ ద్రికాలంబు నర్చనావేళలందు
శంఖకాహళపటహజర్జరరవంబు
కాశినగరంబునఁ ద్రివిష్టపేశునగర
నవ్విహంగమరత్నంబు లనుదినంబు.

292


వ.

ఇవ్విధంబునం బారావతస్త్రీపుంసంబులు సంసారసుఖంబు లనుభవించుచు నొక్కనాఁడు నద్దివ్యదేవుదివ్యభవనచంద్రశాలాగర్భవితర్దితానిర్యూహవిటంకనీడంబునం మెలంగి యాడుచుండ నొక్కశ్యేనం బమ్మిథునంబు దవుదవ్వులం గనుంగొని చేర వచ్చి జాలకంబులలో నుండి తన్ను నలవోకయుం బోలెఁ గనుంగొనుచు దుర్గసమాశ్రయబలంబున నయ్యుగ్మంబు లెక్కసేకయున్న నప్పటికి నొడుపు దప్పి తొలంగి యెక్కడికేనియుం బోయె. పరేంగితజ్ఞానచతుర యగు నప్పారావతి తనపతి కి ట్లనియె.

293


సీ.

మనపాలివేరువిత్తని యెఱుంగుదు గాదె
        యెఱుఁగవో శ్యేనంబు హృదయనాథ!
ప్రబల మైనట్టి దుర్గంబులో నున్నార
        మగుట నేటికిఁ దప్పెఁ బ్రాణభయము

వైపు దప్పిన మహాకోపంబుతోడన
        పోయె వైరం బాత్మఁ బూని డాయ
కొండుచోటికిఁ బోవు టుచితంబు మన మిఁక
        వానికిన్కకు నోర్చువార మెట్లు?


తే.

చిచ్చువాతను బరువాతఁ జిక్కువడక
తప్పిపోయిన వారెపో తజ్ జ్ఞు లెందు
దాఁతకట్టిన చెఱు వంచుఁ దగునె మునుఁగ?
[20]నిల్లు విడువంగ లేక చా నేల మనకు.

294


చ.

అన విని పారువం బడరి యౌవనగర్వమునం బడంతికి
ట్లను నిది యేమి? నాబలపరాక్రమసంపద యింతమాత్రమే?
తనసరివారికి న్వెఱచి ధామముఁ బాడఱఁ జేసి దాఁగఁ బో
యిస సరియిండ్లవారు నగరే? ఖగమో యదియేమి దయ్యమో?

295


తే.

అది విహంగమ మేను విహంగమంబ
పెసరగింజకుఁ దక్కువే పెసరగింజ?
యబల! యిటు చూడు మప్పక్షియదటు మాంతుఁ
గుటిలచంచూపుటీకోటికుట్టనముల.

296


వ.

అనిన 'ధర్మో జయతి' యనుచుం బారావతి యూరకుండ నంత మఱునాడు ఱేపకడ నాశ్యేనంబు ద్రివిష్టపేశ్వరునగరీప్రాకారంబుమీఁద నిర్గమద్వారంబు నిరోధించి పొంచి యుండి సంచారార్థంబు దిక్కులకు వెడలునక్కలరవంబుల నుక్కుఁ దండసంబువోనిముక్కున నంకుశంబులం బోలు చరణనఖాంకురంబులం బెట్టనుం బోతునుం గఱచియు నూఁదియు నొక యేకాంతప్రదేశంబునం భక్షించునది యై

యంతరిక్షంబున దవ్వు(గా) గొని చనియె నప్పుడు సేయునది లేక కాందిశీకత్వంబుకం జీకాకువడియు వివేకనిధి యైన పారావతి పారువంబుఁ దప్పక చూచి నయనసంజ్ఞం గాలుం గఱువు మని కదపిన.

297


ఉ.

శ్యేనము కాలివ్రేలు గఱిచెన్ దిట దప్పక పారువంబు లో
నూనిఁతీవ్రవేదనకు నోరువఁ జాలక చీత్క్రియాసుసం
ధానము పాదధూననముఁ దత్సమయంబునఁ జేసెఁ బత్రియా
మానముదూరి పాఱిఁ రసమానరయంబునఁ బక్షిదంపతుల్.

298


వ.

పాఱి యొక్కచోటంగూడి బలవద్విరోధంబునం జేసి గాశినుండ వెఱచి యయోధ్యానగరంబున సరయూతీరంబునం బెద్దకాలంబు మనువు మని యపరజన్మంబున మందరధారకుండను విద్యాధరుండును రత్నావళి యనునాగకన్యకయు నై జన్మించి జాతిస్మృతివశంబున నప్పారువంబులు రెండును దంపతు లై కాలక్రమంబునఁ గాశీత్రివిష్టపేశ్వరు సేవించి ముక్తులైరి. ఇది త్రివిష్టపేశ్వరమాహాత్మ్యంబు.

299


కేదారేశ్వరమాహాత్మ్యము

తే.

ఆదిఁ బరమేశ్వరుఁడు గౌరి కానతిచ్చి
నట్టిపరిపాటిఁ జెప్పెద ననఘ! నీకుఁ
గాశికేదార శంభులింగంబుమహిమ
సావధానత విసుము వింధ్యాద్రిదమన!

300


వ.

అనేకజన్మార్జితంబు లైన పాపంబులు గేదారేశ్వరస్మరణంబునం బాయు. సాయంప్రాతఃకాలంబులఁ గేదారేశ్వరస్మరణంబు సర్వదురితహరంబు.

301

శా.

ప్రాతఃకాలమునందు మర్త్యుఁడు [21]హరత్పాపాభిధానహ్రద
స్రోతఃపూరమునన్ మునింగి పరమజ్యోతిర్మయంబు న్ముని
ధ్యాతవ్యంబును శాశ్వతంబు నగు కేదారేశలింగంబు సం
ప్రీతిం జేరి భజించి కాంచు వితతాభీష్టార్థసంసిద్ధులన్.

302


వ.

తొల్లి రథంతరకల్పంబునందు వశిష్ఠుం డను విప్రుండు హిరణ్యగర్భాచార్యువలనం బాశుపతదీక్ష వడసి కేదారేశ్వరుని సేవించి ముక్తుం డయ్యె. వెండియు.

303


సీ.

శిశిరభూధరకన్య చిఱుబంతిపసు పాడు
        నెందు సాయంకాల మిం పొనర్చు
నరుఁ డెందు జలము నుద్ధరణంబు సేవించి
        శంభులింగముఁ దాల్చు జఠరపిఠరి
వినువీథిఁ బోరాడి వివశంబు లై కూలి
        హంసంబు లయ్యె వాయసము లెందుఁ
బ్రవహించు నెందు శ్రీభాగీరథికిఁ బోటి
        యమృతప్రదాహ్వయ యైనతటిని


తే.

యది విముక్తివధూకంఠహారతిలక
దివ్యకేదారలింగేశతీర్థభూమి
సదనదీవాపిపల్వలహ్రదసమగ్ర
ద్రాక్షపందిరి కాశికోద్యానమునకు.

304


వ.

అందు గౌరీకుండంబు గౌరతీర్థం బమృతప్రవాహతీర్థంబు మానసతీర్థంబు గలహంసతీర్ణంబు మొదలుగా ననేకతీర్థం

బులు గలవు. కేదారేశ్వంబునకు నుత్తరంబునఁ జిత్రాంగదేశ్వరలింగంబు, తత్సమీపంబునం గేదారేశ్వరస్థానంబు, దక్షిణంబున నీలకంఠేశ్వరలింగంబు, నీలకంఠక్షేత్రంబునకు వాయవ్యభాగంబున నంబరీషేశ్వరలింగంబు, తత్సమీపంబున నింద్రద్యుమ్నేశ్వరలింగంబు, నాదక్షిణంబునఁ గాలంజరేశ్వరలింగంబు, చిత్రాంగదేశ్వరు నుత్తరంబున క్షేమేశ్వరలింగం, బిది కేదారలింగమాహాత్మ్యంబు. ఇంక ధర్మరాజేశ్వరలింగమాహాత్మ్యం బభివర్ణించెద.

305


తే.

అనినఁ బ్రియ మంది నైమిశమునిగణంబు
సూతు నర్చించి భక్తిసమేతు లగుచు
ధర్మరాజేశ శివమహాస్థానమహిమ
గుహుఁడు సెప్పె నెవ్విధమునం గుంభజునకు?

306


వ.

అవ్విధంబు మాకు నానతి మ్మనుటయు.

307


ఆశ్వాసాంతము

శా.

కల్పాంతానిలఘూర్ణమానజలముగ్దర్జానినాదోద్భటా
నల్పాటోపకఠోరధాటిపటహోద్యదోషవిధ్వస్తసం
కల్పారాతినృపాలసంశ్రితకులక్ష్మాభృద్గుహాగేహ! యా
కల్పక్షౌమపటీపటీరవిశదా కాశ్మీరచంద్రప్రదా!

308


క.

వీరావతార! వితరణ
పారాయణహృదయ! రాజపరమేశ్వర! ది
గ్వారణకరసన్నిభభుజ!
ధారాసురతాణదర్పధరణీధ్రపవీ!

309

మాలిని.

ధరణిభరణ హేలాధఃకృతక్రోడలీలా
జరఠకమఠభూభృచ్చక్రచక్రీశ్వరాశా!
ద్విపదనివహశుంభద్దీర్ఘదోస్తంభయుగ్మా
భరితగుణదిలీపా! పంటవంశప్రదీపా!

310


గద్యము.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ
శ్రీనాథనామధేయప్రణీతంబైన కాశీఖండం బనుమహాకావ్యంబునందు షష్ఠాశ్వాసము సమాప్తము.

  1. ‘కశ్యపుని గాదిలిసూనుఁడు’ అని వ్రాఁతప్రతిపాఠము. ‘కౌశికేర తథావృత్తే’ అని సంస్కృతమూలము.
  2. ఇది ప్రాఁతవ్రాఁతప్రతుల పాఠము. సంస్కృతమూలమునకుఁ గొంతవఱకు సరిపడుచున్నది. పూర్వముద్రితగ్రంథమున ‘ఆదికేశవదేవుఁ డభ్యాసమున నుబ్బి, యనిశంబు గొల్చిన యర్కమూర్తి’ యనియున్నది. ఈ పాఠము చింత్యము.
  3. ‘నిన్నిచిన్నెలఁ గాశిలో నినులపేళ్లు’ అని వ్రాఁతప్రతుల పాఠము.
  4. ‘నీరుచూడఁగాఁ, బోయినయట్టి తామరలపోలికి నందఱు కాశిఁ’ అని పాఠాంతరము.
  5. 'మైపోక గా గాడి' అని పా.
  6. ‘నరవరేణ్యుని మోహమాహాత్మ్యమునను’ అని వ్రాఁతప్రతి.
  7. ఇచట ‘సరసఁ బఠియింప’ అని పూర్వపూర్వతరముద్రితపుస్తకములపాఠము. ఆంధ్రసాహిత్యపరిషత్తులో లభించిన తాళపత్రపుస్తకమునందును మఱికొన్ని వ్రాఁతపుస్తకములందును 'జట్టు' అనియే కనఁబడుచున్నది. ఈపదమె యిచటఁ బొంకముగఁ గుదిరి యున్నది. ఈపదము తప్పను నభిప్రాయమునం గాబోలు ‘సరస’ అని దిద్దిరి. శబ్దరత్నాకరములో ‘జట్టు=జనసమూహము. (ఇది విచార్యము)’ అని వ్రాసియున్నారు. ముద్రితపుస్తకమున నీపదము మార్పఁబడినందునఁ బ్రయోగము లభింపక యట్లు వ్రాసియుందురని తోఁచుచున్నది.
  8. శైవపక్షంబు కృష్ణపక్షంబు చెడియె
  9. దేహళీవిఘ్నేశ్వరునకు
  10. ‘దెఱుఁగరాదా’ యని పా.
  11. బిందుమాధవసేవాతాత్పర్యంబున
  12. దంతరించె
  13. సయాకారంబున గజాసురుండ
  14. ద్వర్తమానశుభాశుభంబులు
  15. 'దొఱఁగి యెక్కె రహిన్' అని పాఠాంతరము మూలవిరుద్ధము.
  16. 'నరుఁడును విగతాఘుఁ డగును నరనిముసమునన్' అని పాఠాంతరము.
  17. అచ్చుపుస్తకమున 'మందు కొడుకు' అనియు, వ్రాఁతపుస్తకమున 'మందు కుడుక' యనియు, మఱియొక వ్రాఁతపుస్తకమున 'మందు సుమ్ము' అనియున్నది. దీనికి “దృష్టం త్రిలోచనా త్ప్రాచ్యాం నర్మదేశం సుశర్మదం, తల్లింగార్చనతో నౄణాం గర్భవాసో నిషిధ్యతే" అని సంస్కృతమూలము.
  18. ‘బ్రేమమనంబునఁ’ అని వ్రాఁతపుస్తకము. ‘బెన్నసమంబుగఁ’ అని అచ్చుపుస్తకము.
  19. ‘నొదవును శివమోక్షపదము లుదితవివేకా!’ అని పాఠాంతరము.
  20. ‘ఇల్లు వెడలక చావంగ నేల మనకు?’ అని పాఠాంతరము.
  21. ‘హరున్ బాపాభిధాన’ యని యచ్చుపుస్తకము. ‘హరం పాపాభిధాన’ యని యొక వ్రాఁతపుస్తకము, ‘హర పాపహ్రదేస్నాత్వా’ యని సంస్కృతమూలము. ఛందోభంగనివృత్తికై ‘హరత్పాప’ యని సవరింపఁబడినది.