Jump to content

కాశీఖండము/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

పంచమాశ్వాసము

శ్రీమార్కండేయయశః
స్వామికృపాలబ్ధధరణిసామ్రాజ్యరమా
హేమాద్రిదానదీక్షిత!
వేమాంబాప్రియకుమార! వీరనృపాలా!

1


కుమారాగస్త్యసంవాదము

వ.

అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె. కుమారస్వామి పత్నీసహింతుడైన మహాముని నగస్త్యు నాదరించి కుశలం బడిగి కూర్చుండ నియమించి వచ్చిన ప్రయోజనంబుఁ దెలిసి వారాణసిమాహాత్మ్యంబు వినిపించువాఁడై యక్కుంభసంభవుని కి ట్లనియె.

2


తే.

ఆఱుముఖములు గలవాఁడ నౌదుఁ గాని
నిగమశాస్త్రార్థములు గాన నేర్తుఁ గాని
యధిక వైదగ్ధ్యవంతుండ నగుదుఁ గాని
కడఁగి వర్ణింపనోప శ్రీకాశిమహిమ.

3


వ.

అయినను విను. నా నేర్చుభంగిఁ గాశికామాహాత్మ్యంబు వినిపించెద. అడుగవలసినయర్థంబు లడుగుము. కొల్లాపురము మహాలక్ష్మి పుత్తేర నేతదర్థంబు నీవు వచ్చుట యెఱుంగుదు నని

పలికినఁ గుంభసంభవుండు కుమారస్వామి పాదాంభోరుహంబుల కెరఁగి యిట్లనియె. మహాత్మా! యవిముక్తంబు మోక్షస్థానం బనియును, మణికర్ణికాతీర్థంబు తీర్థరాజం బనియును, అప్పుణ్యక్షేత్రం బవిముక్తం బానందకాననంబు మహాశ్మశానంబు రుద్రావాసంబు వారణాసి కాశి యను నామధేయంబులు ధరియించు ననియునుం జెప్పుదురు. అన్నియుం బరిపాటి వినవలతుం దేటపడ నానతిమ్ము.

4


తే.

అనినఁ బర్వతరాజకన్యాసుతుండు
కలశసూతికి ని ట్లను గారవమున
నిల్వలారి! భవత్సముదీరిత మగు
ప్రశ్నభావంబు విస్తరింపంగ భరము.

5


వ.

ఈయర్థంబు మాతల్లి పార్వతీదేవి మజ్జనకు హరు నడిగె. ఆసర్వజ్ఞుండు నాజగన్మాతకు నానతిచ్చినప్రకారంబు నీకుం జెప్పెద; సావధానమతివై యాకర్ణింపుము.

6


వారాణస్యాదినామనిర్వచనము

సీ.

అంబుజాసను నాయురవసానములయందు
        గ్రస్తసమస్తలోకప్రపంచ
యై మాయ నిర్వికల్పాకారమునఁ దను
        నాశ్రయింపఁగఁ బరమాత్మ యుండె
నిస్తరంగసముద్రనిభమై నిరస్తస
        మస్తావధికమయి ప్రాణి కర్మ
పరిపాకకాలంబు ప్రాప్త మయ్యెడునంత
        దాఁక నవ్వేళ విధాతృసృష్టి

తే.

గగన మొక్కండ చిక్కంగఁ గ్రాఁగిపోవ
నంధకారంబు నీరంధ్ర మగుచుఁ బ్రబలె
సత్తును నసత్తు సవసత్తు రిత్త యయ్యె
నెఱుక పడదయ్యె నేమియు నేమి సెప్ప?

7


వ.

అనర్కచంద్రగ్రహతారకానక్షత్త్రం బనహోరాత్రం బనగ్నిభూసలిలమారుతం బప్రధానంబ శబ్దస్పర్శం బగంధంబ రూపం బదిఙ్ముఖంబై భువనప్రపంచం బంధకారావశేషంబై యుండ బ్రహ్మాండంబు నిష్పంచకంబై కేవలత్వంబు భజియింప, ననామరూపవర్ణంబు నస్థూలంబు నకృశంబు నహ్రస్వంబు నదీర్ఘంబు నలఘువు నగురువు ననపచయంబు ననుపచయంబు నవాఙ్మానసగోచరంబు సత్యజ్ఞానానందరూపంబు నప్రమేయంబు ననాధారంబు నిర్వికారంబు నిర్గుణంబు నిర్వికల్పంబు నిరాలంబంబు నిర్మాయంబు నిరుపద్రవంబు నై పరబ్రహ్మంబు నిరుద్యోగియై తూష్ణీభావంబు గైకొని నిష్కళంకంబై విహరించుచు లీలాకైవల్యంబున లోకమర్యాద యాచరించి నిజశరీరంబున నొక్కశక్తిం గల్పించె. ఆశక్తి ప్రకృతిరూపంబ వగు నీ వాపరబ్రహ్మంబ. పురుషరూపుం డైన యేను కల్యాణి! నాఁటికాలంబునందు.

8


తే.

ఉండఁ బ్రో వెచ్చటను లేక యుత్పలాక్షి!
మనము చేరితి మవిముక్తమండలంబు
నాఁడు మొదలుగ నిపుడు గన్నార మందుఁ
గాశికాపురశుభసంజ్ఞకంబునందు.

9


సీ.

అనిశంబు మనచేత నవిముక్తమై యున్కి
        ముగ్ధాక్షి! యిది యవిముక్త మయ్యె

మనకు నానందంబు నొనరించుఁ గావున
        నానందవిపినాభిధాన మయ్యె
సంవసింతు మహాశ్మశానభూములఁ గాన
        నేనుంటను మహాశ్మశాన మయ్యె
నోరంత ప్రొద్దును నుందు రుద్రుండ నే
        నటుగాన రుద్రగేహాఖ్య మయ్యె


తే.

నసియు వరణయుఁ గూడుట నక్షరముల
సరవితో వారణాసి యన్ సంజ్ఞ యయ్యెఁ
‘గాశృదీప్తా' వనంగ విఖ్యాత మైన
ధాతువునఁ గాశి యయ్యె భూతలమునందు.

10


శా.

నక్షత్రగ్రహతారకంబులు నరణ్యంబుల్ నదు ల్వార్థి వి
శ్వక్షోణీధరములున్ దిశల్ వసుమతీచక్రంబు కాలంబుచేఁ
బ్రక్షీణత్వముఁ బొందియున్నయెడ విభ్రాంతిన్ సుఖం బుండఁ గా
శీక్షేత్రం బిది యంబుజాక్షి! మనకున్ సిద్ధించె నెక్కాలమున్.

11


తే.

[1][ఈరహస్యంబు చెప్పకు మెవ్వరికిని
శంభుభక్తున కత్యంతకాంతిమతికి
శ్రద్ధధానున కధికవిశ్వాసమతికి
ననఘమానసునకు ముముక్షునకుఁ దక్క.

12


వ.

అని భవుండు భవాని కానతిచ్చె. మణికర్ణికామాహాత్మ్యంబు వినుము.

13


మణికర్ణికామాహాత్మ్యము

ఉ.

నిండుమనంబుతోడ ధరణిధరకన్యయుఁ దాను గాశిఁ గాఁ

పుండి కుటుంబభారము మహోన్నతిఁ బొందుటఁ జూచి విశ్వనా
థుం డొకనాఁడు శైలసుతతోడ విచారము చేసే దక్షుఁ డొ
క్కండు హితుండు భారకుఁడు గావలదా మనయింతయింటికిన్.

14]


తే.

అని విచారంబు చేసి కాలాంతకుండు
చూచె నరకంట గిరిరాజసుతముఖంబు
ప్రభవమందె నాచూపునఁ బ్రావృషేణ్య
ముదిరనీలాంగుఁ డగునొక్కముద్దుకొడుకు.

15


వ.

అబ్బాలునిం జూచి బాలేందుధరుండు.

16


సీ.

పుండరీకేక్షణ! పురుషోత్తమాహ్వయ!
        శిఖిపింఛసంఛన్నచికురభార!
యాజానుదీర్ఘబాహార్గళద్వయయుగ్మ!
        హరినీలసింహసంహననకాంతి!
గంభీరనతనాభికాసారభవపద్మ!
        శ్యామపిశంగవాసఃకిరీట!
శంఖచక్రగదాసిశార్ఙ్గదివ్యాయుధ!
        కందర్పకోటిరేఖావిలాస!


తే.

కాశిపట్టణము నైదుక్రోశములును
పటుతరక్షేత్ర మిది రాజ్యపదవి నాకుఁ
బరమపుణ్యాత్మ! యీ కుటుంబము భరింపు
తత్పరత మీఱ భారకత్వంబుఁ బూని.

17


వ.

అని పల్కి మహేశ్వరుండు బుద్ధితత్త్వస్వరూపి యగు విష్వక్సేనుం గాశికాపురిసామ్రాజ్యభారంబు భరియింప నియోగించె నజ్జనార్దనుండును.

18

తే.

చక్రమునఁ ద్రవ్వి యొక్కపుష్కరిణి చేసి
ఖననవేళాప్రయాససంజనిత మైన
ఘర్మజలమునఁ బూరించె గైటభారి
యమ్మహాపల్వలంబుఁ గాశ్యంతరమున.

19


క.

వేయును నెనిమిదియేడులు
తోయజలోచనుఁడు చేసె దుస్సహతప మ
త్తోయాధారముదరిఁ గా
త్యాయన్యధిపతి గుఱించి యతులితభక్తిన్.

20


వ.

అనంతరంబ.

21


శా.

ఇందూత్తంసుఁడు కాశికాధిపతి విశ్వేశుండు ప్రత్యక్షమై
కందర్పారి ముకుందనిర్మితమహాకాసారముం జూచి యా
నందం బొందె వృషధ్వజుండు బహుమానశ్లాఘఁ గావించెఁ దా
మందాందోళితమౌళియై వడి శిరోమాల్యానలుల్ మ్రోయఁగాన్.

22


క.

ఫణిభూషణుండు వాపీ
ప్రణుతిశ్లాఘాపరంపరల నొనరింపన్
ద్రిణయనునిదక్షిణశ్రుతి
మణికర్ణిక మిట్టి సరసిమధ్యమునఁ బడెన్.

23


వ.

పరమేశ్వరశ్రవణమణికర్ణికాప్రపతనస్థలం బగుటం జేసి యచ్చక్రపుష్కరిణి మణికర్ణికాహ్వయం బై యుండు.

24


తే.

చక్రపుష్కరిణీతీర్థసవిధభూమి
శంఖచక్రగదాపాణి శంభు నడిగెఁ
గాశికాతీర్థమాహాత్మ్యగౌరవంబు
శివుఁడు నాకతి యిచ్చె నక్షీణకరుణ.

25

కాశీతీర్థమాహాత్మ్యకథనము

వ.

అది వివరించెద నాకర్ణింపుము. మణికర్ణికాతీర్థంబునందు సంధ్యాస్నానజపహోమవేదాధ్యయనంబులు వ్రతోత్సర్గంబులు వృషోత్సర్గంబులు లింగస్థాపనంబులును నక్షయమోక్షఫలంబు నొసంగు. భూతభావిభవత్తీర్థంబు లీతీర్థరాజంబుతో సరిగావు. సాంఖ్యయోగం బాత్మావలోకనంబు వ్రతతపోదానంబులు భవత్తీర్థస్నానంబునకు సమానంబులు గావు. శశమశకకీటపతంగోరగాదులు పంచక్రోశియందుఁ బంచత్వంబు నొంది నిర్వాణలక్ష్మిం గైకొను. కాశీక్షేత్రంబునం దెప్పుడుఁ గృతయుగంబు. ఎప్పుడు నుత్తరాయణంబు. ఎప్పుడు మహోదయంబు. చతుర్వేదాధ్యయనపుణ్యంబు కాశిం బంచాహోరాత్రంబులు వసియించిన వారికిం గలుగు. అశ్వమేధరాజసూయాధ్వరంబుల నుపార్జితము లైన ఫలంబు(లు) కాశిం ద్రిరాత్రశయనంబున సమకూఱు. తులాపురుషదానఫలంబు కాశిం దర్శించినమాత్రంబునం గలుగు. రాజస్థానంబున నాయాజ్ఞ దక్క నితరులయాజ్ఞ చెల్లదు. యోజనశతదూరస్థుం డైన నరుండు కాశీస్మరణంబువలన దోషంబువలనం బాయు. పంచక్రోశప్రవేశసమయంబునం బంచజనునిపాపప్రపంచంబు బహిరంచలంబునన వసియించు. కాశిం బెద్దకాలంబుండి దైవయోగంబునం బరస్థలంబున కరిగి మృతుండైన మనుజునకుఁ గాశీమరణఫలంబు సంభవించు. అవిముక్తక్షేత్రోపనాసంబు కర్మనిరూలనక్షమంబు. మణికర్ణికం గృతాభిషిక్తుం డై తిలవ్రీహియవంబుల బిత్రాదితర్పణం బొనర్చిననరుండు సర్వయజ్ఞంఫలంబునం బ్రాపించు. మణికర్ణికాస్నానానంతరంబున

మౌనంబున జితేంద్రియుండై విశ్వేశ్వర శ్రీమన్మహాదేవుని దర్శించు నెవ్వండేని వాడు సర్వవ్రతఫలంబులం జేకొను. స్నానదేవతార్చనాజపాదుల మూత్రమలవిసర్జనంబుల సమయంబుల దంతధావనహోమకాలంబుల వాచంయముం డై విశ్వేశ్వరు నర్చించిననరుం డేకవాసరంబునన యావజ్జీవశివార్చనాఫలము నొందు. విశ్వేశ్వరప్రీణనార్థంబు కాశీయందు నిధనంబు నొందుమానవుండు గైవల్యధనలాభంబు లంగీకరించు. నిష్ప్రత్యూహం బైనయాగంబున యోగంబున నానాజన్మోపార్జితం బైనఫలంబు కాశియందుఁ దసుత్యాగంబు చేసినజనునకు సిద్దించు. కాయంబు సాపాయం బనియును, బ్రసూతిమరణక్లేశంబులు దుస్సహంబు లనియును, వితర్కించు నరుఁ డాయురవసానపర్యంతంబుఁ గాశిన యుండునది.

26


శా.

అర్ణోరాశిపరీతభూభువనమర్త్యస్వర్గంఖండంబు సం
పూర్ణైశ్వర్యసమృద్ధి కాశిఁ గృతపాపుం డైనఁ దత్పట్టణా
భ్యర్ణక్షోణుల నైదుక్రోశములఁ బ్రాణాంతంబునన్ మర్త్యుఁ డా
కర్ణింపండు కృతాంతవాహమహిషగ్రైవేయఘంటాధ్వనుల్.

27


వ.

అని శంభుండు విశ్వంభరు నిరీక్షించి యింకొక్కవిశేషం బాకర్ణింపుము. భగీరథుం డనురాజన్యుండు కపిలమునిప్రదీప్తకోపానలదగ్ధు లగుసాగరుల నిరయంబువలన నుద్ధరించుటకై తపోవిశేషంబున మందాకినిం గొనితేర నమ్మహానది యిమ్మణికర్ణికమీఁదం బ్రవహింప నదిమొదలుగా నత్తీర్థంబు సురాసురులకు వర్ణింప నశక్యం బై విలసిల్లుచుండు.

28


సీ.

భాగీరథీస్నానపరతఁ బోలంగ లే
        దామ్నాయశాస్త్రాగమాధ్యయనము

వాలాయమును మనోవాక్కాయదురితాళి
        విదళించు గంగాభివీక్షణంబు
శ్రీకంఠుకృప లేక సిద్ధింపనేరదు
        త్రిదశగంగానదీతీరవసతి
బ్రహవిజ్ఞానసంపత్ప్రాప్తిహేతువు
        జహ్నుకన్యాసింధుసలిలసేవ


తే.

కలియుగంబునఁ గలుషచిత్తులకు శఠుల
కన్యవిత్తాపహర్తల కనియతులకు
నాత్మయందుఁ బ్రాయశ్చిత్త మాచరింప
గాంక్ష గలయప్డు నరునకు గంగ దిక్కు.

29


తే.

ఆదియుగమునఁ దీర్థంబు లఖలములును
ద్రేత ద్వాపరమునయందుఁ దివ్యమునకుఁ
బుష్కరంబుఁ గురుక్షేత్రమును సుపర్వ
నిమ్నగయుఁ దీర్థములు బ్రహ్మనిర్మితములు.

30


తే.

కృతయుగంబున ధ్యానంబు కేవలంబు
తపము త్రేతాయుగంబున ద్వాపరమున
నధ్వరంబులు గలివేళయందు గంగ
జనుల కిష్టార్థసంసిద్ధిసాధనములు.

31


శా.

స్వారాజావరజాత! సార మగుప్రాగ్జన్మాంతరాభ్యాససం
స్కారంబు న్మదనుగ్రహంబు వెలిగా స్నానంబు సిద్ధించునే?
వారాణస్యుపకంఠదేశవిలుఠద్వార్వేణివీచీఘటా
ధీరధ్వానపరంపరాకలకలోద్విగ్నాఘభాగీరథిన్.

32


క.

ఆకంఠకరటిడుంఠి
శ్రీకంఠజగండమదమషీచంద్రకితా

నేకప్రవాహజాహ్నవి
వైకుంఠా! యద్ది యెట్టివారికిఁ గలదే!

33


క.

గంగానది గంగానది
గంగానది యనుచు ఱేపకడ మేల్కనుచో
గంగఁ గొనియాడు నెవ్వఁడు
భంగించు నతండు ఘోరపాతకచయముల్.

34


ఉ.

పాయు నలక్ష్మి వాయు నశుభంబులు వాయును దుర్నిమిత్తముల్
వాయు నకీర్తి వాయుఁ బ్రతిబంధము వాయు మహాఘసంఘము
ల్డాయు శుభంబు డాయుఁ గుశలంబులు డాయు మనోరథార్థముల్
పాయక కాశీకట్టెదుఱఁ బాఱువియన్నదిఁ దీర్థ మాడినన్.

35


క.

ఏలా యుపవాసవ్రత?
మేలా యష్టాంగయోగ? మేలా యజ్ఞం?
బేలా తపంబు గంగా
కూలంకషఁ దీర్థ మాడఁ గూడెనె యేనిన్.

36


క.

శ్రద్ధాపురస్సరంబుగ
సిద్దస్రోతోవహాంబుశీర్షాప్లవసం
బద్దహృదయు లగువారికి
సిద్ధించును మోక్షలక్ష్మి చేరువన హరీ!

37


ఉ.

వానికులంబునుం గులమె? వానితపంబులునుం దపంబులే?
వానికృతంబునుం గృతమె? వానిశ్రుతంబు శ్రుతంబె? కృష్ణ! యె
వ్వానిమనంబు పక్వమయి వ్రాలకయుండును విశ్వనాయకా
స్థానమహాశ్మశానదివిషత్తటినీముఖతీర్థసేవకున్.

38


క.

విస్మయ మేల? వియన్నది
యస్మత్తేజోగ్నిగర్భ, యటు గాకున్నన్

భస్మము సేయునె కైటభ
ఘస్మర! నిమిషమున సకలకలికలుషములన్?

39


చ.

నడచుచుఁ గూరుచుండుచును నవ్వుచు నిల్చుచుఁ బారియాడుచున్
గుడుచుచుఁ బవ్వళించుచును గూర్కుచు మేల్కనుచున్ రమించుచున్
బడుచును లేచుచు న్నరుఁడు భావమునం దవిముక్తసీమసం
గడిఁ బ్రవహించు శ్రీగగనగంగఁ దలంచి త్యజించుఁ బాపముల్.

40


క.

జిహ్మగవిరోధివాహన!
జిహ్మమతుల్ దెలియువారె? చిరకాలమునన్
బ్రహ్మాండమునడుమఁ బర
బ్రహ్మమయపయఃప్రపూరభరసురతటినిన్.

41


క.

అంగీకరించు మనుజుఁడు
సాంగోపొంగాధ్వరక్రియాఫలము వియ
ద్గంగాపులినంబున శివ
లింగార్చన మాచరించి లెస్సగ శౌరీ.

42


ఉ.

రోదన మాచరించు వగఁ గ్రోధమనోభవరాగరోగమో
హాదులఁ గూడి తీరములయం దఘముల్ దలఁబట్టు పట్టనే
డాదిగ దీనఁ బాయఁబడెనా! మన కంచును గాశికాసమ
ర్యాదము నన్వియత్తటిని నాడఁగ మర్త్యుఁడు గట్టు డిగ్గుచోన్.

43


తే.

గంగ కరుగంగఁ మిగుల విఘ్నములు సేయుఁ
బ్రేతరక్షఃపిశాచికాభూతతతులు
గంగ డాసినపిదప విఘ్నములు సేయ
వాసవుఁడు లేఁడు నరునకు వానితరమె?

44


మ.

అనుషంగంబున నొండె నొండెను విహారాపేక్ష నొండేని ఘ

ర్మనిరాసంబున నొండె దీవ్రభయసంత్రాసార్థ మొండేని న
న్యనియోగంబున నెవ్వఁడే మునుఁగు గంగాంభఃప్రవాహంబు
జనుఁ డాతండును బుండరీకనయనా! శాసించుఁ బాపౌఘముల్.

45


తే.

ఇచ్చ లేకుండినను నగ్ని యెట్లు గాల్చుఁ
దన్ను నంటినవారి నిదాహశక్తి
నిచ్చ లేక క్రుంకినను దహించు నట్ల
తైర్థికునిఁ బొంది యున్నపాతకము గంగ.

46


క.

కంసాంతక! నరుఁ డంతకు
సంసారక్లేశముల విషాదము నొందున్
సంసేవించుం గాశ్యవ
తంసాభరణంబు గంగఁ దా నెపు డేనిన్.

47


చ.

తెగలక కాశికానగరి దేవతరంగిణిఁ దీర్థ మాటకై
యరుగుచు నెవ్వఁ డేని మృతుఁడౌ భవితవ్యధకారణంబుగాఁ
దెరువున నామనుష్యుఁడును దీర్థఫలం బఖిలంబుఁ గాంచి యం
బురుహదళాక్ష! పాపములఁ బోకడవెట్టుఁ బురార్జితంబులన్.

48


సీ.

అరుణాంశుమండలం బంధకారముఁ బోలె
        దంభోళి వసుమతీధ్రములఁ బోలె
ఖగసార్వభౌముండు కాద్రవేయుల బోలె
        గంఠీరవము భద్రకరులఁ బోలె
దివ్యౌషధంబు వ్యాధినికాయములఁ బోలె
        మండువేసవి యెండమడువుఁ బోలె
జంఝసమీరంబు జలధరంబులఁ బోలె
        మానదంభంబు ధర్మంబుఁ బోలె

తే.

భక్తి సేవించువారిపాపము లడంచు
దురితతరుషండశతఖండపరశుధార
మదనవైరిజటాటవీమల్లికళిక
యభ్రరోధిపయోభంగ యమరగంగ.

49


క.

యావజ్జీవము గంగా
ఫ్లావం బొనరించునరుఁడు పంకజనయనా!
జీవన్ముక్తుఁడు త్రిజగ
త్పావనుఁ డని చెప్పుదురు తపస్విప్రవరుల్.

50


తే.

వలదు తిథివారనక్షత్రవర్గణంబు
తీరసంవాసజనులకు వారిజాక్ష!
సంచితము లైననిఖిలదోషములు వాయు
నాకవాహిని నేకాభిషేకమునను.

51


సీ.

వలుదచన్నులమీఁది యులుపచ్చిగందంబు
        కమ్మతావులు దిఙ్ముఖములఁ బొగవ
శశికాంతమణిశిలాశకలపాండుర మైన
        మెయిచాయ చంద్రికామృతముఁ గురియ
జలదేవతాహస్తచామరానిలములు
        కుటిలాలకములకు గొండ్లిఁ బరవ
ధవళాతపత్త్రముక్తాదామకంబులు
        గురుసువర్ణకిరీటకోటి నొరయఁ


తే.

బూర్ణకుంభంబుతో సితాంబుజముతోడ
దరముతోడ నభీతితోఁ గరము లలర
నదనదీపల్వలంబులు గదిసి కొల్వఁ
గాశిఁ బేరోలగం బుండు గగనగంగ.

52

క.

మండూకమకరకచ్చప
గండూపదఢులికుళీరకలహంసికకా
రండవబకముల వెండిఁ బ
సిండిని గావించి గంగఁ జిరుముదురు వ్రతుల్.

53


వ.

అని యిందుధరుండు ముకుందున కానతి యిచ్చె. గంగయు పూర్వోక్తప్రకారంబునన యరుగు దెంచి కాశీస్థానంబున కపూర్వాలంకరణం బయ్యె. ఇంకఁ గుంభినీధరపుత్త్రికి నద్దేవు డాన తిచ్చినప్రకారంబునం గాశీమాహాత్మ్యంబుఁ జెప్పెద. కుంభసంభవ! అవధానపరుండవై యాకర్ణింపుము.

54


తే.

పరిహరించును వేదాంతభాగ మన్న
నుపనిషత్తన్న వీనుల నోకలించుఁ
గంటగించును సాంఖ్యయోగంబు లన్న
గాశి నున్నజనుండు మోక్షమునఁ దనిసి.

55


క.

దేహత్యాగము దానము
దేహనిపాతంబు దపము ధృతిఁ బరికింపన్
దేహవియోగమయోగం
బాహా! కాశీపురీకృతావాసులకున్.

56


తే.

విశ్వనాథుండుఁ దేహళి విఘ్నరాజు
గవనిమొగసాల నధికారి గా నొనర్చి
గాశి జొరనీఁడు తనముద్ర గానియొరుని
ముక్తినిధి నెవ్వఁ డొడుచునో మోస మనుచు.

57


క.

వరణ నసి రెండుదిక్కులఁ
దరుణేందుధరుండు నిలిపెఁ దలవరులం గాఁ

బరు నెవ్వని దా నెఱుఁగక
చొరనీకుం డనుచు ముక్తిచోరవిశంకన్.

58


వ.

ఈశ్వరాదేశంబునం గాని కాశీనగరం బెవ్వరికిం జొరరాదు. ఈయర్థంబు దేటపడ నొక్కయితిహాసంబు గల దాకర్ణింపుము. దక్షిణాబ్ధితటంబుస సేతుబంధసమీపంబున నొక్కగ్రామంబున ధనంజయుం డనునొక్కవైశ్యోత్తముండు గలండు. అతండు మాతృభక్తుండు. తల్లి జరాభారంబునం బెద్దకాలంబునకుఁ గాలధర్మంబు నొందిన.

59


తే.

గాసివడి గంగ నస్థులు గలపకున్నఁ
దల్లి ఋణ మెట్లు వాయుఁ బుత్రకున కనుచుఁ
గదలె గోమటి యానందకాననమున
కంబదేహాస్థిశకలసంహతులు పూని.

60


సీ.

పంచగవ్యముల నాప్లవనంబు గావించి
        పంచామృతముల నభ్యంగ మార్చి
యక్షకర్దమమున ననులేప మొనరించి
        పుష్పమాల్యంబులఁ బూజ చేసి
పట్టువస్త్రంబునఁ బరివేష్ట మొనరించి
        యా టఁ దిత్తిలో నదిమి తుఱిమి
పుటవిగాఁ గంబళంబున ధ్రువంబుగఁ గట్టి
        ముద్దగా మన్నద్ది ముద్ర వెట్టి


తే.

జతనముగ రాగిపెట్టెలో సంగ్రహించి
యరవఁ దాలంబు నీని చి క్కలవరించి
యంబయస్థుల కుపచార మాచరించె
నొడయనికిఁ బోలె గురుభక్తుఁ డూరుభవుఁడు.

61

వ.

ఆయస్థిపేటికయు లోహిండియుఁ దండులంబులుఁ గంబళంబులుం దగినసంబడంబును వహించి యొక్కరుండునుం దెరువుతోడునం బెక్కుదేశంబులు గడచి హవిష్యాశనుండును, స్థండిలశయనుండును నైషథపరిశ్రాంతి నభిఘాతజ్వరంబు సోఁకిన లెక్క సేయక తఱిమి నడచి మార్గమధ్యంబున నొక్కి వేఁటపల్లె నొక్కయాటవికునికిన్ భృతి యిచ్చి మూటమోపించుకొని యెట్టకేలకుం గాశీపట్టణంబు చేరి.

62


క.

ఆనందవనమునం దొక
వానెవణిజునింట నుండి వైశ్యుండు పదా
ర్థనయనార్థము వోయెం
దా నొక్కఁడు హట్టమునకుఁ దదవసరమునన్.

63


వ.

మూటలో దామ్రసంపుటకంబున ధనం బున్నయది యని చెంచు వంచనాపరుం డై బొక్కసం బెత్తుకొని తప్పుతెరువునందన(గాఁ) పల్లెకుం బోయె. ఇటఁ గోమటియును.

64


ఉ.

అంగడినుండి బియ్యము పదార్థములుం గొని వచ్చి దప్పి మై
నంగము దూల నుహ్హనుచు నల్లన కోమటిసెట్టి మందిర
ప్రాంగణసీమవేదిపయిఁ బందిరినీడను విశ్రమించి పి
ల్చెంగటముం బ్రసేవమును జెచ్చెరఁ దెమ్మనె బంటు మ్లేచ్ఛునిన్.

65


క.

విలిచి ప్రతివచన మొదవమిఁ
గళవళమున నిల్లు సొచ్చి కాననచరు న
న్నెలవునఁ గానక వైశ్యుఁడు
నలుమూలలు వెదకి నెమ్మనము దలఁ కొందన్.

66


తే.

అస్థిగర్భితతామ్రపేట్యన్విత మగు
బొక్కసము నెత్తికొని పోయె బోయ యనుచు

జననిఁ దలఁచి ప్రయాసంబు సంస్మరించి
మోసఁ దర్కించి యవ్వైశ్యముఖ్యుం డుండ.

67


సీ.

మధ్యాహ్నకాలంబు మందాకినీవారి
        నభిషేక మొనరింప నబ్బ దయ్యె
శివుని విశ్వేశ్వం శ్రీమన్మహాదేవు
        మదనారి వీక్షింప నొదవ దయ్యె
దండపాణిని డుంఠి దక్షిణామూర్తిని
        గాలభైరవుఁ గొల్వఁ గలుగ దయ్యె
శ్రీవిశాలాక్షికిఁ జేదోయి మొగిడించి
        శిరసుపైఁ జేర్పంగ దొరక దయ్యెఁ


తే.

గోమటికిఁ దల్లియస్థులకోకమూట
పాపకర్ముండు చెం చర్థభార మనుచు
వంచనాపాటవంబునఁ గొంచుఁ బోయి
యారివేగంబు చేసిన కారణమున.

68


శా.

జాలిం బొందియు డప్పిఁ జెందియు బుభుక్షావేదనం గుందియున్
వ్యాళాభీలకరాళతీవ్రతరమధ్యాహ్నార్కరోచిశ్ఛటన్
జాలం గుందియునుం గిరాటుఁ డరిగెన్ సంరంభశుంభద్గతిన్
వైలక్ష్యంబునఁ జెంచువెంట జననీవాత్సల్యనిఘ్నాత్మతన్.

69


వ.

అంతక మున్న (యొక్క) కాంతారంబున నమ్మూట విడిచి యాయాటవికుండు పెట్టెఁ దెఱచి యస్థిశకలంబులు చూచి తనవృథావస్థకుఁ జిన్నఁబోయి యవి యచ్చోటన పారంజల్లి తన పల్లెకుం బోయి మఱుఁగుపడి యుండె. ధనంజయుండును నప్పక్కణంబున కేతెంచి.

70

తే.

చెంచునింటికిఁ బోయి చెంచెతకుఁ బ్రియము
చెప్పి నమ్మించి తలమీఁదఁ జెయ్యి వెట్టి
వెఱకు మని తన్ముఖంబున నెఱుకుఱేనిఁ
గాంచి యాతనితోడ సఖ్యంబు చేసి.

71


వ.

అతఁడుం దానునుం గూడి యయ్యస్థిశకలంబులు పారంజల్లిన కాంతారప్రదేశంబున కేతెంచి నప్పుడు.

72


తే.

ఎముకలు చల్లినట్టిచో టెఱుఁగఁ డయ్యె
దైవవశమున నాభిల్లతస్కరుండు
దిగ్భ్రమం బెత్తి యందంద తిరుగుచుండెఁ
గానలోపల నెచ్చోటఁ గానలేక.

73


క.

వచ్చినయడవిక వచ్చుం
జొచ్చినకాననమ చొచ్చుఁ జోరపుళిందుం
డెచ్చో నస్థులు గానక
యచ్చెరుపడె దైవమతము లవి యల్పములే?

74


వ.

అయ్యస్థులు చల్లినచోటు దప్ప నడచుకొని కిరాతుండు బహుళ క్షుత్పిపాసాపరవశుం డయి హాహాకారంబు సేయుచుం [2]గ్రమ్మఱం గాశీపురంబున కరిగి తన మందభాగ్యత్వంబు ప్రకటించుచు మందాకినీస్నానంబు చేసి మఱలి నిజస్థానంబునకుం బోయెం గావున.

75


తే.

అనఘచారిత్ర! విశ్వేశ్వరాజ్ఞఁ గాని
కాదు వారాణసీనగరంబుఁ జొరఁగ
బలిమిఁ జొచ్చిన యేని నప్పంచజనుఁడు
పడనిపాటులఁ బడు విఘ్నపంక్తిచేత.

76

వ.

అనుటయు నాకుమారస్వామికిఁ గుంభసంభవుం డిట్లనియె.

77


తే.

కార్తికేయ! కృపాలబ్ధి గలుగె నేని
శ్రవణయోగ్యుండ నేనును నవుదు నేని
నాన తీఁ నగు నానందకాననమునఁ
బ్రతివసించిన క్రోధభైరవునిమహిమ.

78


వ.

అనినం గుమారుండు మైత్రావరుణి కి ట్లనియె.

79


కాలభైరవచరిత్రము

క.

వారాణసీకథాశ్రుతి
పారాయణుఁ డైనపుణ్యవరునకు నీకున్
నేరిచినభంగిఁ జెప్పెద
భైరవచరితంబు వినుము పరమమునీంద్రా!

80


తే.

హస్తములు రెంట నందంద యదిమి పట్టి
తాటిపం డారగించెను తమకమునను
నవ్యయంబైన బ్రహ్మాండ మాస్వదించు
భైరవుం డిచ్చుఁ గాత శోభనము మనకు.

81


మ.

క్షయకాలంబున సీధుసాగరరసాస్వాదాతిరేకంబునన్
నయనాబ్జంబులు ఘూర్ణితంబులుగ సంధ్యాకాలరాత్రీకర
ద్వయతాళానుగతిప్రకారమున మత్తల్లీమహానృత్తముం
బ్రియ మొప్పారఁగ నాడు భైరవుఁడు గల్పించు న్మహైశ్వర్యమున్.

82


వ.

అని తత్కథాకథనప్రవణహృదయంబున ని ట్లనియె.

83


క.

హాటకవసుంధరాభృ
త్కూటస్థలియందుఁ దొల్లిఁ గెలువుండె నిరా
ఘాటవిభవాభిజృంభిత
హాటకగర్భుండు జగము లన్నియుఁ గొలువన్.

84

వ.

అయ్యవసరంబునఁ దత్సభాసదు లగుమునీంద్రు లప్పరమేష్ఠికిం బ్రణమిల్లి యిట్లనిరి.

85


తే.

వరద! వాగ్వధూవల్లభ! వనజగర్భ!
యడుగఁ గల దొక్క సంశయితార్థ మిప్పు
డవ్యయం బగుతత్త్వ మెయ్యదియొ తెలియ
నంతవట్టును బ్రీతి మా కానతిమ్ము.

86


వ.

అనిన విని భారతీవల్లభుండు శ్రీమహాదేవమాయామోహవశంబునం [3]బరమాత్మవివేకంబు లేక వారలం జూచి జగద్యోని యగునే నొక్కరుండన యీశ్వరుండ. నా కధికుండు (నీశ్వరుండు) లేఁడు. మీ రివ్విధంబు దెలిసి యవ్యయతత్త్వంబు నన్న కా భావింపుఁ డనియె. అయ్యహంకారంబు సహింపక తత్సమీపంబున నున్న విశ్వంభరాంశసంభవుం డగుక్రతుపురుషుండు నిటలభ్రూకుటి దుర్నిరీక్షుండుం గ్రోధతామ్రాక్షుండు నగుచు నతని కి ట్లనియె.

87


క.

పరతత్త్వ మెఱుఁగ కూరక
పరమర్షులతోడ నేన పరముఁడ ననుచున్
సుర లెల్లఁ గాకు చేయఁగ
దురహంకృతిఁ సేయఁదగునె? తోయజగర్భా!

88


వ.

విను మేను సాక్షాన్నారాణుండను, యజ్ఞపురుషుండ, జగత్ప్రభుండ, నవ్యయుండ, నవ్యయ(తత్త్వ)శబ్దవాచ్యత్వంబు నాయంద సంప్రతిష్ఠితంబు. నీ విట వలవని పెద్దఱికంబున నడిచి పడకుండు మనియె. ఇ ట్లిద్దఱుఁ బరస్పరజయార్థు

లగుచు వాదడిచి యడిచి తమ తారతమ్యం బామ్నాయంబుల నడిగి రప్పుడు ఋగ్వేదం బిట్లనియె.

89


సీ.

సవరించు నెవ్వఁడు జఠరగోళంబున
        బొడ వడంగక యుండ భూతగణము
నెరయించు నెవ్వఁడు నిజసనాతనమాయ
        సకలప్రపంచంబు సంతతముగ
విహరించు నెవ్వండు వివిధోపనిషదర్థ
        హర్మ్యాగ్రములయందు నహరహంబు
చరియించు నెవ్వఁడు శాశ్వతమంగళ
        ప్రోద్దామరార్భటి నొక్కరుండు


తే.

నహహ! యయ్యాదిదేవుఁ డనామయుండు
రుద్రుఁ డనిచింత్యుం డాద్యుఁ డరూపుఁ డుండ
నవ్యయం బగుతత్త్వ మే నన వశంబె
యన్యులకు నెట్టివానికి! ననఘులార!

90


వ.

అనవుడు యజుర్వేదం బి ట్లనియె.

91


సీ.

సకలాధ్వరక్రియాసంచయంబులఁ జేసి
        యిజ్యమానుం డగు నెవ్వఁ డలరు
నధ్యాత్మవిద్యారహస్యమార్గంబునఁ
        దక్క నెవ్వఁడు గానఁ దరము గాఁడు
మాయందుఁ గరము ప్రామాణ్యవిశేషంబు
        లెడపకుండఁగఁ జేయు నెవ్వఁ డెపుడు
ప్రకటకూటస్థస్వభావత నఖిలంబుఁ
        గదల కెవ్వఁడు సమీక్షణ మొనర్చు

తే.

నట్టిశివుఁ డొక్కరుండు గా కర్ణుఁ డగునె
యవ్యయపుఁదత్త్వ మనుసమాహ్వయము దాల్ప?
నితరుఁ డెంతటివాఁ డగు? నేతదర్థ
మాత్మ సంశయింపకుఁడు ధన్యాతులార!

92


వ.

అనిన సామవేదం బి ట్లనియె.

93


సీ.

విశ్వంబు నెవ్వనివిపులక్రియాశక్తిఁ
        పెరుగుచున్నది తీగ పెంపు గాఁగ
జింతింతు రెవ్వనిఁ జిత్ప్రకాశాత్మకుఁ
        బరమార్థవిదులు తాత్పర్య మొదవ
రవిసుధాకరశిఖిగ్రహముఖ్యముల కెల్ల
        భాసకం బెవ్వనిభవ్యతేజ
మితరదుర్ధర మగునీశ్వరశబ్దంబు
        వలచి యెవ్వనిఁ బాయ దలఘులీల


తే.

నతఁడు మరణోద్భవ్యవహారదూరుఁ
డజుఁడు ఫాలాక్షుఁ డిందురేఖావతంసుఁ
డవ్యయపుఁదత్త్వ మౌఁగాక యల్పు లొరుల
కమ్మహత్త్వంబు గలుగునే! యనఘులార!

94


వ.

అనిన నధర్వవేదం బి ట్లనియె.

95


సీ.

ఎవ్వఁడు రవణిల్లు నెల్లజీవులయందు
        బూసలలో నుండుబొందువోలె
నెవ్వనిఁ బొడగండ్రు హృత్పద్మవీథుల
        భక్త్యనుగ్రహులగు భవ్యజనము
లెవ్వఁడు వికసిల్లు నింతయుఁ దా నయ్యు
        నేమియుఁ దాఁ గాక యేకహేళి

నెవ్వనిసద్భావ ‘మిదమిత్థ’ మని చెప్పఁ
        జాలవు నేడును శాస్త్రఫణితు


తే.

లతులకైవల్యమంగళాయతనుఁ డభవుఁ
డప్రతర్క్యుండు శంకరుఁ డప్రమేయుఁ
డతఁడ యవ్యయం బగుతత్త్వ మనఁ దనర్చు
మఱువుఁ డొందుతలంపు ధీమహితులార!

96


వ.

అని యిట్లు చతుశ్శ్రుతు లుపన్యసించిన విని విరించిమఘపురుషు లహహా! పరేతనిలయంబునఁ గాంతాపరవశుం డైయుండు ప్రమథనాథుం డెక్కడ? అవ్యయత త్త్వం బెక్కడ? పరబ్రహ్మభావం బతని కెట్లు సమకూఱు? నింక మీమాటలు పొసంగ వనునవసరంబునం బ్రణవంబు మూర్తిమంతం బై వారి కి ట్లనియె.

97


క.

శితికంఠుఁ డలఘులీలా
ధృతవిగ్రహుఁ డట్లు గానఁ దెల్లం బాత్మా
వ్యతిరిక్త యగుసరోజా
యతలోచనతోడఁ గూడఁ డతఁ డెన్నండున్.

98


తే.

అర్ధశశిభూషణుండు స్వయంప్రబుద్ధుఁ
డున్నతుండు నిత్యోన్నతజ్యోతి యతని
సంతతానందశక్తి యాసరసిజాక్షి
విశ్వజనయిత్రి వారికి వేఱు లేదు.

99


వ.

అనియివ్విధంబున నెంత చెప్పిన విధాతృమఘమూర్తులం జుట్టుకొన్న యజ్ఞానతిమిరంబు దొలంగదయ్యె. అప్పుడు దశదిశావకాశపరిపూర్ణం బగు నొక్కయఖండదివ్యతేజంబు వారలనడుమ నుద్భవించె. అనంతరంబ తన్మధ్యంబునందు.

100

సీ.

కటిభాగమున గంధకరటిరాట్చర్మంబు
        కపటంపుఁజిమ్మచీకట్ల నీన
వక్షస్స్థలంబునఁ జక్షుశ్శ్రవణభర్త
        తారహారముఠేవఁ దళుకు సూపఁ
గేలుదామరయందు శూల ముద్భటనట
        జ్జ్వలనకీలముల వసంత మాడ
జూటకూటమునందు సొబగులేఁజందురుఁ
        డకఠోరసారచంద్రికలు గాయఁ


తే.

గుటిలఘర్ఘకనిర్ఘాతఘోరఘోష
సరణి డమరుకనాదంబు పరిఢవిల్లఁ
బురనిశాటవిపాటనస్ఫుటవిహార
దుర్ధరుం డగుహరుఁడు ప్రాదుర్భవించె.

101


వ.

ఇ ట్లావిర్భవించిన యవ్విరూపాక్షు నిరీక్షించి యవ్విరించి దురహంకారంబు విడువనేరక పంచమవదనంబున నిట్లనియె.

102


తే.

డమరుధర! నీవు నాలలాటస్థలమున
దొల్లి జనియించితిని తేటతెల్లముగను
రోదనము హేతువుగ నీకు రుద్రనామ
మపుడు ఘటియించినాఁడ నే నలఘుమహిమ.

103


వ.

అట్లు గావున నీవు నాకుఁ బుత్త్రుండవు. నన్ను శరణంబు చొచ్చి నావలనం బరికక్షఁ గాంచి బ్రదుకు మనుచు దురాలాపంబులు పలికె. భర్గుండుసు నఖర్వం బగు తదీయగర్వంబు సహింపక నితాంతరోషసంరంభంబున విజృంభించిన.

104


సీ.

ఢమఢమార్భటిడమడ్డమరుఢక్కాధ్వని
        పదిదిక్కులందును బ్రమసి పార

గళమూలనిర్గళత్కాలకూటచ్ఛవి
        యర్కబింబంబు మాయంబు సేయ
ఫాలదృగ్భవసముద్భటశిఖిజాలంబు
        లుదధుల నన్నింటి నుడుకఁ బెట్ట
గుటిలపాటలజటాంకురకుట్టనంబులు
        జగదండసీమ బెజ్జములు పుచ్చ


తే.

సంభవము నొందె హరునవష్టంభరభస
శుంభదవగాఢరోషవిస్ఫురణవలన
విశ్వసంహారసన్నాహవిషమసుషమ
పరుషద్భైరవుం డగు భైరవుండు.

105


వ.

ఇ ట్లుద్భవించి యుద్భటప్రతాపదుర్నిరీక్ష్యుం డగుచు నాక్షణంబ విరూపాక్షునాజ్ఞవచనంబునం బద్మగర్భునిం గదిసి.

106


ఆ.

గంధకరటి నూత్నకమలంబుఁ బోలె న
[4]ప్పురుషుఁ డలఘులీలఁ బొటకరింపఁ
ద్రుంచె నవ్విరించి పంచమవదనంబుఁ
బ్రఖరదీర్ఘహస్తనఖరధార.

107


తే.

ద్రోహి యేయంగ మట్టిద రూ పడంపఁ
దగవు గావుప దూషకత్వంబుఁ దెలిసి
తునిమెఁ బరమేష్ఠిపంచమాననమ యేర్చి
భైరవుం డింత యొప్పైనపాడి గలదె?

108


వ.

అట్టియెడ నారాయణాంశజుం డైనక్రతుమూర్తి శైవంబు లైనస్తోత్రంబులు పఠియించె. హిరణ్యగర్భుండును నహంకార ముడిగి భీతిపరవశంబున శతరుద్రీయంబు జపియించె. అంత

శరణాగతవత్సలుం డగునయ్యీశ్వరుండు వారి నిద్దఱిం గరుణావిలోకనంబుల మన్నించి నిజరూపాంతరం బైనభైరవదేవుం జూచి యీయధ్వర(పురుష)విధాతలు నీకు మాననీయులు. వీరలయెడ నింకఁ గోపాటోపంబులు చాలు. నీవు వైధసం భైనకపాలంబు దాల్చి లోకాచారప్రకటనార్థంబు భిక్షాశనంబు గొనుచుఁ గాపాలికవ్రతంబుతోడ లోకంబులం జరియింపు మని చెప్పి యనంతరంబ.

109


సీ.

మోకాళ్లు దిగకుండ ముడిచి కట్టినధాతు
        శాటంబు గలకటిస్థలముతోడ
దట్టంబు గాఁగఁ జందనపంక మలఁదిన
        యరుణంపువికటదేహంబుతోడఁ
బిల్లికన్నులఁ బోలు పింగళాక్షములందుఁ
        గ్రూరంబు లగుమిడిగ్రుడ్లతోడఁ
బొడకట్టువడుజపాపుష్పంబు చెరివిన
        చికిచికిపల్లవెండ్రుకలతోడఁ


తే.

గఠినదంష్ట్రికాభీలవక్త్రంబుతోడ
జిహనటనత్వరోల్లలజ్జిహ్వతోడఁ
గత్తతోఁ [5]బద్దెతో మహోగ్రత్వ మొంద
ఫాలనేత్రుఁడు సృజియించె బ్రహ్మహత్య.

110


వ.

ఇట్లు సృజియించి దానిం జూచి కాశికానగరంబుదక్క నితరస్థలంబు లెవ్వియు నీకు దుష్ప్రవేశంబులుగావున నీ వితనిపజ్జ వర్తిల్లు మని పలుకు బుండరీకభవశిరఃఖండనుం డైనభైరవుం

జూపి యక్కాలాంతకుం డంతర్ధానంబు సేసె. అతండును నీశ్వరోక్తప్రకారంబున సకలజగమ్ములు గ్రుమ్మరుచు నొక్కనాఁడు వైకుంఠపురంబు చొచ్చి వైకుంఠనికేతనంబున కేగిన.

111


సీ.

పదపల్లవంబునఁ బ్రకటిల్లుచదలేఱు
        కడ లెత్తి ధాత్రి వెల్వొడిచి పాఱఁ
గటియందు రంజిల్లు కనకశాటిమెఱుంగు
        గెళవుల రేయెండతళుకు లీనఁ
బొక్కిటి తమ్మిపూవున జాలముసరెడు
        నలులు ఝు మ్మనుచు సంకులతఁ దిరుగఁ
దులసీపలాశమంజులదామకంబులు
        కౌస్తుభపదకంబుఁ గ్రిందుపఱుప


తే.

సంభ్రమము విస్మయంబులు సమ్మతంబు
భక్తియును భాషవీధిలోఁ బరిఢవిల్ల
నిందిరయుఁ దానుఁ బద్మాక్షుఁ డెదురు వచ్చె
భర్గమూర్తికి నయ్యాదిభైరవునకు.

112


వ.

ఇట్లు వచ్చి యాలక్ష్మీశ్వరుం డగ్రభాగంబున.

113


మ.

కనియెం గుండలిరాజకుండలు మహాకాళున్ లలాటస్థలీ
జనితానల్పకృపీటసంభవపటుజ్వాలాకరాళాక్షుఁ బా
వనునిన్ బ్రహ్మకపాలహస్తుని జటావ్యాఢౌకనప్రౌఢది
వ్యనదీవార్లహరీపరస్పరహతివ్యగ్రారవున్ భైరవున్.

114


వ.

కని జయజయశబ్దముఖరుం డగుచుం గదిసి ప్రణమిల్లి యంజలిపుటంబు నిటలతటంబునం గదియించి తత్ప్రభావవర్ణనాకుతూహలంబున నిందిరాదేవి కి ట్లనియె.

115


సీ.

జలజాక్షి! యితఁడు వో సకలయోగీంద్రులు
        భావవీథులఁ గాంచుపరమతత్త్వ

మలివేణి! యితఁడు వో యఖిలభూతములకు
        నాధార మగుచు నింపారువేల్పు
కలకంఠి! యితఁడు వో కలకాలములయందు
        నుడివోని శుభమూర్తి నుండుపెద్ద
లలితాంగి! యితఁడు వో యలఘుతేజంబున
        విశ్వంబు వెలిగించు విశ్వనాథుఁ


తే.

డబ్ధిసంభవ! యితఁడు వో హాలహలపు
విషము పుక్కిటఁ దాల్చినవెగ్గలీఁడు
పాటలీగంధి! యితఁడు వో భక్తతతికి
శాశ్వతానందకరుఁ డగునీశ్వరుండు.

116


క.

మన మెట్టిభాగ్య మొనరిం
చినవారమొ నేఁడు పూర్ణశీతాంశునిభా
నన! యట్లు గాక శంభుఁడు
విన నచ్చెరు విచటి కిట్లు విజయము సేసెన్.

117


వ.

అని పలికి యప్పరమేశ్వరుండు వెండియు ననేకప్రకారంబులం బ్రస్తుతించి యతనివలనఁ దద్ భిక్షాటనవృత్తాంతం బంతయు నెఱింగి నాశ్చర్యహృదయుం డగుచుఁ బద్మమందిరకు సంజ్ఞసేసిన నాజగన్మాతయు నంతఃపురంబునకుం జని యనంతరంబ.

118


సీ.

అడుగుఁదమ్ములయందు నడరునున్ననిడాలు
        కపటసంధ్యార్భటిఁ గ్రమ్మఱింపఁ
గాంచీమతల్లికాకలకలారవములు
        ఝషకేతునట్టహాసముల నవ్వఁ

గుచకుంభయుగళిమ్రోఁగునఁ దొట్రుపడి పేద
        కౌఁదీగ జవజవఁ గంప మొందఁ
గ్రుయి వెక్కి జాఱిన క్రొమ్ముడిలోపలి
        విరులు తుమ్మెదలకు విందు పెట్ట


తే.

సహజసంభ్రమతాత్పర్యసమ్మదములుఁ
దళుకు చూపంగ నవరత్నదర్విఁ గొనుచు
నిందిరాదేవి యేతెంచి యిందుధరుని
హస్తపాత్రిక నమృతదివ్యాన్న మిడియె.

119


వ.

ఇట్లు మహాలక్ష్మీదేవిచేత మనోరథవతి యనుపేరం బ్రసిద్ది యగుభిక్షఁ గొని పద్మాక్షునందలి భయభక్తివిశ్వాసంబులకు మెచ్చి యతనికోరినవరంబు లొసంగి యెప్పటియట్ల బ్రహ్మహత్యతోడన యరుగుదేర జగంబులఁ జరియించుచు నొక్కనాఁడు.

120


సీ.

జనని యేతీర్థంబు సకలదుఃఖావళి
        హరణప్రభావవిస్ఫురణమునకు
గృహిణి యేతీర్ణంబు మహితహాలాహల
        గరళచ్ఛవిచ్ఛన్నకంధరునకు
నావాల మేతీర్థ మభిమతప్రదకళా
        కరవిశాలాక్ష్యాఖ్యకల్పలతకు
నావాస మేతీర్థ మఖిలతీర్థాలభ్య
        ముఖ్యసౌఖ్యావహమోక్షమునకు


తే.

నట్టితీర్థంబునకు నెమ్మి నరుగుదెంచెఁ
గాశినగరికి సకలభాగప్రకీర్ణ

గగనగంగాతరంగిణీకనకకమల
పరిమళోద్గారిణికి మహాభైరవుండు.

121


వ.

ఇ ట్లద్దేవుండు విశ్వేశ్వరనివాసంబు సొచ్చినంతన బహిర్భాగంబుననుండి హాహాకారంబున మొఱవెట్టుచు నా బ్రహ్మహత్య పాతాళంబునఁ బడియె. అతనిహస్తంబున నున్న ధాతృకపాలంబును నూడి ధాత్రీతలంబునం బడియె. అది మొదలుగా నవ్వటుకనాథుం డానందంబున నయ్యానందవనంబునం దధివసియించె. కపాలమోచనతీర్థంబు తన్ను భజియించువారికిఁ బాపభంజనంబు సేయుచుఁ బుణ్యప్రదాయకం బయ్యె. ఇయ్యాఖ్యానంబుఁ బఠించినను విన్నను వారలకు మహాపాతకంబు దొలంగు నని చెప్పి కుమారస్వామి వెండియు నగస్త్యున కి ట్లనియె.

122


సీ.

అజుఁడు దా నధికుండ ననుచు గర్వించిన
        గరనఖాగ్రమునఁ దచ్ఛిరముఁ ద్రుంచె
సాకార యగుబ్రహహత్యతోఁ జనుదేర
        సకలలోకంబులు సంచరించె
వైకుంఠమున రమావైకుంఠు లర్పింప
        నమృతభిక్షాశనం బారగించెఁ
గాశికానగరోపకంఠదేశంబునఁ
        బగులవైచెఁ గరంబు బ్రహ్మపునుక


తే.

యాధిపత్యంబు వడసెఁ గామారిచేతఁ
పరియ వైచినచోన కాఁపురము సేసెఁ
గాశికాస్థానమున కేడుగడయుఁ జూవె!
క్రోధభైరవదేవుండు కుంభజన్మ!

123

వ.

దురితభక్షణంబునం బాపభక్షకుండును, గలుషమర్దనంబున నామర్దకుండును, గాలకలనంబువలనఁ గాలనాభుండును, వృజినభైరవుం డగుభైరవుండును నై యద్దేవుండు భజించువారికి షణ్మాససిద్దికరుండు.

124


తే.

కలశయోని! యవ్వీటికి బలుతులారి
పాపహృద్ఫైరవుం డగు భైరవుండు
కాశికాపట్టణం బైదుక్రోశములును
సవహితుం డై యత(౦)డు చే టచ్చికాదు.

125


వ.

అనిన విని గుంభసంభవుండు హరికేతుం డనుయక్షుండు దేవదేవునకుం బ్రేమపాత్రం బైన వారాణసీపట్టణంబునం బ్రమథపరివారంబునకు దండనాయకుం డై యుండు నని విందు. అతని చరిత్రంబు వినవలతు నానతి మ్మనినం గుమారస్వామి యతని కి ట్లనియె.

126


హరికేశచరిత్రము

సీ.

యక్షుండు రత్నభద్రాభిధానుఁడు గంధ
        మాదనంబునయందు మహితకీర్తి
పూర్ణభద్రుండు తత్పుత్త్రుఁ డాతనిభార్య
        కనకమండన గంధకరటియాన
యా లేమతనయుండు హరికేశుఁ డతఁడు శ్రీ
        యానందకాననాభ్యంతరమునఁ
దప మాచరింప నాతనిశరీరము మించి
        పుట్టె వల్మీకంబు పొదలు వొదలె


తే.

నభవుఁ డుమతోడఁ గూడి లీలార్థ మచటి
కరుగుదెంచి ప్రసన్నుఁ డై వరము నొసఁగె

దండనాయకపదవి యాతండు కాశి
చక్రరక్షకుఁ డై యుండుఁ జనువు గలిగి.

127


సీ.

భరియించు నాతండు పాణిపల్లవమున
        వెండికట్టులతోడిదండయష్టి
వసియించు నాతండు వారాణసీపుర
        ప్రాకారగోపురప్రాంతభూమి
ధరియించు నాతండు దప్తారకూటరు
        క్పరిపాటలచ్ఛాయఁ బల్లజడలు
సవరించు నాతండు సతతంబు రుద్రాక్ష
        భూషావిభూతి త్రిపుండ్రకములు


తే.

సౌమ్యరూపంబు వహియించు సజ్జనులకు
బాపమతులకు వికృతరూపంబుఁ దాల్చు
బింగళాక్షుండు దీర్ఘగంభీరమూర్తి
చండికాపతి ప్రియథుండు దండపాణి.

128


వ.

అనిన విని యగస్త్యుండు మహాత్మా! జ్ఞానవాపికాతీర్థమాహాత్మ్యంబు వినవలతుం జెప్పవే యనిన గార్తికేయుండు.

129


జ్ఞానవాపికాతీర్థమాహాత్మ్యము

సీ.

పాదాభిహతి సప్తపాతాళములతోడ
        నుర్వీకటాహ ముఱ్ఱూఁత లూఁగ
నిర్భరతజటానికురుంబకంబులు
        చెదరి బ్రహ్మాండంబు చెంపచెట్ట
బాహార్గళాస్తంభపరివర్తనంబుల
        దిక్చక్రవాళంబు త్రెవ్వి పడఁగ

వితతనిశ్శ్వాసమారుతవర్తనంబునఁ
        బృధ్వీధరంబులు పెల్లగిల్ల


తే.

డమరుఢాన్నాదముల సముద్రములు గలఁగ
నారభటివృత్తిఁ దాండవం బవధరించెఁ
బ్రళయవేళ మహాకారభైరవుండు
కాళరాత్రికుచంబులు గగురుపొడువ.

130


తే.

అభవుఁ డిబ్భంగిఁ దాండవం బాడి డస్సి
డప్పి గొని యారగింపఁ గాండంబు బెరికి
కానఁ డయ్యెసు సప్తలోకంబులందుఁ
దియ్యనివి జివ్వ కింపైన తేటనీరు.

131


తే.

ప్రళయకాలంబునను నెందు బసిమి చెడక
నిలిచిన కాశిపురమ కా నిశ్చయించి
యరిగె నీశానుఁ డనుసమాహ్వయముఁ దాల్చి
ఘనపిపాసార్తి నంధకదనుజవైరి.

132


తే.

కన్నవా రెవ్వరును లేరు కన్నమెఱుఁగు
గర్జితం బనువచనంబు కడల నిలిచె
శశవిషాణప్రరోహంబు జలదవార్త
యంబు వెబ్భంగిఁ గలుగు నయ్యవసరమున.

133


వ.

అప్పు డీశానుండు.

134


సీ.

సంసారసస్యబీజముల కూషరభూమి
        నిర్వాణలక్ష్మికి నిలువడ నీడ
యల్ల నేరెడుదీవి కవతంసకుసుమంబు
        కామధేనువు ముక్తికాములకును

విహరణస్థానంబు విశ్వనాయకునకుఁ
        గల్యాణముల కాదికారణంబు
కట్టుఁగంబము డుంఠిగంధద్విపమునకుఁ
        బ్రణవాక్షరము పరబ్రహ్మమునకు


తే.

నెద్ధి యకాశికాపురి కేగుదెంచె
బసిఁడిలాతాపుగోలయుఁ బల్లజడలు
నసితగళమూలమును ద్రిశూలాయుధంబుఁ
జాల నొప్పఁగ దపసివేషమున హరుఁడు.

135


వ.

ఇట్లు కాశికానగరంబుఁ బ్రవేశించి యీశానుండు విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు నిర్మలజ్యోతిర్మయలింగాకారు సహస్రకలశాభిషేకంబు సేయను, దత్పాదతీర్థప్రసాదోదకంబు లాస్వాదింపను దలంచి.

136


శా.

చేతోజాతవిరోధి కాశినగరీక్షేత్రోపకంఠంబునన్
శాతాగ్రం బగుశూల మూఁది ధరణీచక్రంబు భేదించుచున్
బాతాళంబులు గ్రుచ్చుచు న్నిగిడె నాభవ్యాయుధం బావృతి
స్రోతోభారము సోఁకునట్లుగ దృఢస్ఫూర్తిప్రభావంబునన్.

137


తే.

దృఢముగా నూఁది శూలంబు దివిచె హరుఁడు
దివిచినప్పుడ తన్మహావివరసరణి
నేడుపాతాళములు దాఁటి యిలయుఁ దూరి
యంబరము దాఁకె నావరణాంబుధార.

138


వ.

భూప్రమాణంబునకు శతగుణప్రమాణం బై శుద్ధస్ఫటికనిర్మలంబును, శరజ్యోత్స్నాస్వచ్ఛంబును, శశిఖండసంకాశంబును, సుధాధారామధురంబును, పాటలీకుసుమసౌరభంబు నైనయవ్వారిపూరంబు వెండితీఁగెయుంబోలె నెగ

సిన నీశానుండు సహస్రధారాకలశంబున సహస్రవారంబులు పంచాక్షరీపంచబ్రహ్మశతరుద్రీయప్రణవాఘోరపాశుపతాదిమంత్రంబు లుచ్చరించుచు విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు దివ్యలింగంబు నభిషేకించి.

139


క.

భువనావరణోదకమున
భవు నభిషేకంబు సేయఁ బాసెను లయతాం
డవకేలీసమయసము
ద్భవ మగునీర్వట్టు కపట పాశుపతునకున్.

140


వ.

అప్పుడు విశ్వేశ్వరదేవుఁడు ప్రసన్నుఁ డై యీశానుండు కోరిన ప్రకారంబున.

141


సీ.

జ్ఞానోద మన శివజ్ఞానంబు నా శివ
        తీర్థంబు నా జ్ఞానతీర్థ మనఁగ
జ్ఞానవాటిక నాఁగ సంజ్ఞాంతరంబులు
        గలిగి పానాభిషేకక్రియలను
సంస్పర్శనామాభిసంకీర్తనధ్యాన
        సందర్శనంబుల సప్తతంతు
ఫలము నీఁజాలు ప్రభావంబు కైవల్య
        సంపత్ప్రదానైకసరసతయును


తే.

సన్నిహత్యాదిఫల్గ్వాదిసకలతీర్థ
సమధికత్వంబు బ్రహ్మరాక్షసపిశాచ
శాకినీగ్రహకూశ్మాండశాంతివిధియు
నిచ్చె నీశానకుండిక కీశ్వరుండు.

142


కళావత్యుపాఖ్యానము

వ.

అని యానతిచ్చి శంభుం డంతర్హితుండయ్యె. ఈశానవాపి

కాసమీపంబున నీశానుండు కృతావాసుం డయ్యె. కలశోద్భవా! విచిత్రార్థం బగునితిహాసంబు శివతీర్థమాహాత్మ్యప్రకారంబు సెప్పెద ఆకర్ణింపుము. హరిస్వామి యనఁగ నొకవిప్రుండు కాశీనగరంబున నుండు. అతనికూఁతురు సుశీల యనునది రూపరేఖావిలాసంబులం ద్రిభువనంబులయందునుం బొగడఁదగియుండు; నబ్బాలారత్నంబు.

143


చ.

బలబల వేగ ఱేపకడఁ బంకజదీర్ఘికఁ దాన మాడి నె
చ్చెలులును దాను నిందుముఖి శేషవిభూషణుఁ బూజసేయుని
చ్చలుఁ దెలికన్నులు న్మొలకచన్నులు బొమ్మలమీఁద వ్రాలుఁగుం
తలములుఁ జూచి పౌరులు మనంబున నువ్విళులూరుచుండగాన్.

144


తే.

లలన సాక్షాత్కరించిన లక్ష్మివోలెఁ
గంకణమ్ములతో సూడిగములు రాయ
విశ్వనాథుని కళ్యాణవేదియందు
మ్రుగ్గు పెట్టంగ మోహించు ముజ్జగంబు.

145


తే.

బహుళసౌభాగ్యలక్ష్మికిఁ బద్మముఖికి
ముజ్జగంబుల సరి లేరు ముదిత లనుచు
బ్రహ్మ సంకేతరేఖలు వ్రాసె ననఁగఁ
గాంతగళమున నొప్పె రేఖాత్రయంబు.

146


తే.

కడుపులో మూఁడు శంభులింగంబు లుండుఁ
దొయ్యలికి జ్ఞానవాపికాతోయసేవఁ
గలశసంభవ! కేదారసలిలములును
గాశి శివతీర్థజలము లింగత్వ మొందు.

147


వ.

ఒక్కనాఁ డొక్క విద్యాధరుండు రూపలావణ్యమోహితుం డై యర్థరాత్రం బమ్మచ్చెకంటిముంగిటం బిండిచల్లినవిధంబున

నిండువెన్నెలలు గాయఁ జంద్రికాపాండుతల్పంబున నిద్రించియుండ నిద్రాభంగంబు గాకుండ మెత్తమెత్తన నెత్తమ్మిరేకులకంటెను సుకుమారంబు లైనతనహస్తపల్లవంబుల
నెత్తి గగనమార్గంబున మలయాద్రికిం గొనిపోయె నయ్యవసరంబున.

148


మ.

[6] “రక్కసుఁ డొక్కఁడప్పరిసరస్థలిఁ గ్రుమ్మరి కేళి సల్పువాఁ
డక్కమలాక్షిచక్కఁదన మద్భుత మందుచుఁ జూచి రాగము
న్నెక్కొనఁ దత్తరం బుడుపనేరక మారవికారచేష్టలం
గ్రక్కున దానిఁ బట్టుకొనఁగాఁ గవిసెన్ వడి దుర్మదాంధుఁడై.


వ.

ఇట్లువిద్యాధరుండును వాని నదల్చుచు రోషవేషభీషణాకారుఁడై సమరావష్టంభవిజృంభణంబున నిల్చె నయ్యిరువురు నయ్యవసరంబున.”


శా.

విద్యున్మాలి యనంగ నొక్కదివిషద్విద్వేషి యక్కన్యకన్
విద్యుత్సన్నిభగాత్రిఁ జూచి మదనావేశంబునం బట్టికో
నుద్యోగించిన నాలతాంగి నొకచో యోజించి విద్యాధరుం
డుద్యద్బాహుపరాక్రమస్ఫురణ దైత్యుం దాఁకె నయ్యిద్దఱున్.


క.

ఆహవము చేసి రంగజ
మోహాంధులు గడిమి మెఱసి [7]ముష్టాముష్టిన్
బాహాబాహిఁ గచాకచి
సాహసము జలంబు దివిజసంఘము పొగడన్.

150


వ.

అప్పుడు.

151

తే.

అప్సరస్త్రీ తిలోత్తమ యసురవరులు
తనకు నై పోరఁ జూచుచందంబు దోఁపఁ
జూచె విద్యాధరుఁడు రాక్షసుండు గడిమిఁ
దనకు నై పోరుచుండఁగఁ దలిరుఁబోఁడి.

152


వ.

అవ్విధంబున యుద్ధంబు సేసి యన్యోన్యముష్టిప్రసారంబుల నిద్దఱు సమరస్థలంబున నిధనం బొంది రందు.

153


తే.

ప్రాణనిర్యాణవేళ విద్యాధరుండు
గ్రుడ్డు దిరుగంగఁ బడి విప్రకులజఁ జూచి
గటకటా! నిన్ను ననుచు గద్గదిక దనర
మాట నాల్కన యుండంగ మరణ మయ్యె.

154


వ.

అంత నక్కాంత నిజాంతర్గతంబున.

155


క.

ఆలింగనమ్ము సేసెం
బాలిండ్లను ముట్టె వదనపద్మముతావుల్
గ్రోలె మగఁ డనఁగ నెవ్వం
డా లనఁగా నెద్ది? భర్త యతఁ డే నాలిన్.

156


వ.

అని విద్యాధరుతోడ ననుగమనంబు సేయం దలంచి (యరమి) యమ్మెఱుంగుఁబోఁడి మలయాచలోపాంతంబున.

157


ఉ.

వెగ్గల మైనకూర్మి నరవిందదళాయతనేత్ర కొండకా
రగ్గి పటీరకాష్ఠములయందు రవుల్కొనఁ జేసి కమ్మపూ
మొగ్గలదండఁ దాల్చి మది మున్కడఁ గాశిని విశ్వనాయకు
న్దిగ్గన సంస్మరించి జననిన్ జనకుం దలచెం గ్రమంబునన్.

158


వ.

మఱియు నాత్మగతంబున.

159


క.

ఏమిటఁ దప్పితి నొకొ? నా
స్వామికి విశ్వేశ్వరునకు వారాణసిలో

నేమమున నెల్లరును దమ
ధామంబుల నుండ నిట్టిదశ నాకొదవెన్.

160


సీ.

జ్ఞానవాపీపయస్స్నానక్రియావేళ
        జెలికత్తియలు నన్నుఁ దలఁతు రొక్కొ!
మదిలోన నేభంగి మఱుఁగుచుండుదు రొక్కొ
        తల్లిదండ్రులు సంతతంబు నాకు!
హరితాంకుకంబు లే నందీక మేయని
        హరిణశాబము నెవ్వ రరయు వారు
సేవ సేయించుకోఁ జిత్తగింపఁడు సుమీ
        నాచేత శ్రీవిశ్వనాయకుండు!


తే.

కాశి(!)లోలార్క కేశవ! కాళనాథ!
దండనాయక! డుంఠి వేదండవదన!
సంభ్రమోద్భ్రములార! యోజహ్నుకన్య!
కానవచ్చెద మిమ్ము నెక్కట భవమున.

161


తే.

విధవ నై జన్మ మెల్లను వేగఁజాల
నొకని చేపడి యోప నింకొకని వెదుక
నితనితోడిద లోకమై యేగుదాన
ననలముఖమున నిమిషవేదనకు నోర్చి.

162


ఉ.

ఇంకొకఁ డెవ్వఁడేని నను నెక్కటి యుండఁగఁజూచి పట్టునో?
కింక మహాటవిం గరటికేసరిదంష్ట్రితరక్షుయూథముల్
సంకటపెట్టునో! యతినృశంసత నింతలు చేసినట్టి యా
పంకజసూతిపై నెరయఁ బ్రైయిడి వేగమ యగ్గి సొచ్చెదన్.

163


క.

పాపపుదైవ మొనర్చిన
యీపరిభవవహ్నికంటె నెక్కటపడుసం

తాపమునం జితికాస్ఠో
ద్దీపిత మగువహ్ని? యేల ధృతిఁ దొఱఁగంగన్.

164


ఉ.

భూధరరాజసన్నిభుఁడు పుష్పశరాసనుతోడిజోడు వి
ద్యాధరచక్రవర్తి నను నర్మిలిఁ దెచ్చినవాఁడు నాకుఁ గా
శీధగ నాదుక ట్టదు. నీ వశ నుండగ విశ్వనాథ! గా
శ్రీధవ! యంబికారమణ! జీవిత మేను ధరించుదాననే?

165


వ.

అని దుఃఖావేశంబున.

166


చ.

కొసరి వసంతకాలమునఁ గోయిల క్రోల్చినభంగి నేడ్చె న
బ్బిసరుహనేత్ర కొండచఱిఁ బెద్దయెలుంగున వెక్కివెక్కి వె
క్కస మగుమన్యువేగమునఁ గాటుకన్నులనీరు సోన లై
యుసిరికకాయలంతలు పయోధముల్ దిగజాఱునట్లుగన్.

167


మ.

మలయం బెక్కడఁ గాశి యెక్కడ! యసన్మార్గంబు వాటించి తె
క్కలిదైనం బిటు నాకు నీయహితముం గావించునే? యంచు వే
తల యూఁచెం గలకంఠి మచ్చెరువునం దాటంకరత్నప్రభల్
పలకంబాఱిన చెక్కుటద్దములపైఁ బైపై విలంఘింపఁగాన్.

168


వ.

వెండియు నక్కన్యక కర్పూరకదళికాద్రుమనిర్యన్నిర్యాసధారాద్రవవాసనానుగంధంబు లగుగంధసారగిరినితరంబ నిర్ఝరాంభఃప్రవాహంబున ముఖప్రక్షాళనం బాచరించి విద్యాధరోపరివిరచిత(చితా)గంధసా[8]రకాష్ఠంబుల రవుల్కొని గంధకరటికర్ణతాళతాళవృత్తాంతతాండవప్రస్తానవిస్తారితంబు లగుమారుతంబులవలనం బెచ్చుపెరిఁగి విచ్చలవిడిన్ మండుచిచ్చునకుం బ్రదక్షిణంబు వచ్చి నిసర్గకాతరంబు లగుకటాక్షవీక్షణంబులు పుష్పాంజలివిక్షేపంబులభంగి నంగీకరింపఁ జంపుడుగట్ట యగు

శిలాఘట్టంబు మెట్టి నిలిచి సంతతస్వాధ్యాయాధ్యయనధ్వనిముఖరంబును, నగ్నిహోత్రధేనుఖరఖురవలయార్ధచంద్రచంద్రకితాజీపంబును, ద్రికాలశంభుపూజాసమారంభవిజృంభమాణశంఖకాహళబహుళకోలాహలాకులంబును నగునయ్యానందకాననంబునందు బ్రహ్మపురివాడకుం జూడారత్నం బైన నాపుట్టిని ల్లభివృద్ధి బొంది యుండుంగావుత! కాశికకటకవిప్రకుటుంబినీశ్లాఘనీయచరిత్రయగు నాజనయిత్రి పియంవద ముత్తైదువ యగుంగాత! అష్టాదశమహావిద్యాస్థానసామ్రాజ్యభద్రాసనాసీనుం డగురుద్రావాసవిద్వత్సింహంబు నాతండ్రి హరిస్వామి సమానులయం దుత్తమశోకుం డగుంగాక! మహాశ్మశానంబునం దనూచారం బగు నాబంధువర్గంబు బంధువర్గంపుఁదీఁగయుంబోలెఁ గొనసాఁగి బ్రతుకుంగాక యని యాశీర్వదించి.

169


సీ.

ఏఁ బ్రభాతంబుల నీశానవాపిక
        ననిశంబుఁ దీర్థ మాడిన ఫలంబు
వివిధభంగుల నేను విశ్వేశ్వరస్వామి
        ముక్తిమంటపి నిడ్డ మ్రుగ్గుఫలము
ప్రతిచతుర్థిని డుంఠిభద్రేభవక్త్రు నే
        నారాధనము సేసినట్టిఫలము
నానందకాననాభ్యంతరక్షేత్రంబు
        నందు జన్మించినయట్టిఫలము


తే.

సర్వమునుకూడి మీఁదటిజన్మవేళ
నితనికే భార్యఁగా నన్ను నిచ్చు గాతఁ

యనుచు హరిణాంకమూర్తి తీవ్రాంశుఁ బోలె
గొసర కగ్నిఁ బ్రవేశించెఁ గువలయాక్షి.

170


క.

లింగత్రయగర్భిణి యగు
నంగనసాన్నిధ్యమున నిశాటుండును ద
త్సంగతి విద్యాధరరా
జుం గాంచిరి త్రిదివపదము సుకృతస్ఫురణన్.

171


వ.

అంతఁ గొంతకాలంబునం బ్రియాస్మరణంబు సేసెం గావున విద్యాధరకుమారుండు మలయకేతుం డనునామంబునను నగ్నిప్రవేశసమయంబున నవ్విద్యాధరకుమారుండు తనకుం బతి కావలయు నని కోరెం గావున సుశీల కళావతి యనుపేర భూమండలంబున జన్మించి వధూవరులైరి. ఆదంపతులయందుఁ గళావతీదేవి పూర్వజన్మవాసనావశంబున.

172


మ.

అళినీలాలక దాల్చుఁ జన్నుఁగవ రుద్రాక్షావళీదామకం
బులు ముక్తామణిభూష లొల్ల దస్తాంభోజాతపత్రాక్షి మై
నలఁదున్ భస్మ మలంద నొల్ల దొకనాఁ డైనం బటీరద్రవం
బులు పన్నీరు కురంగనాభియును గర్బూరంబు కాశ్మీరమున్.

173


తే.

కడుపు నిండంగఁ గాంచె నక్కలువకంటి
మలయకేతుమహీపాలమన్మథునకు
భాగ్యసౌభాగ్యవైభవప్రాభ వాది
శుభగుణశ్రీసమృద్ధుల సుతుల ముగుర.

174


వ.

అంత నొక్కనాఁడు చిత్రకరుండొకరుండు వారణాసీస్థానవృత్తాంతంబు చిత్రపటంబున లిఖియించి తెచ్చి కళావతీసహితుండైన మలయకేతుసన్నిధిం బెట్టిన నవ్విలాసవతి పటంబు చూచి ప్రాగ్జన్మవాసనావశంబునఁ దన్ను మఱచి సమాధి

స్థయుం బోలె లోచనంబులు మొగిచి ముహూర్తమాత్రం బూరకుండి కన్ను(లు) దెఱచి యాచిత్రపటంబునం గల యశేషవిశేషంబులు క్రమంబునం బూసగూర్చినతెఱంగునం గరతర్జనిం జూపుచు ప్రియునికిఁ జెప్పఁ దొడంగె. ఆప్రకారంబు కుంభసంభవా! నీకుం జెప్పెద నాకర్ణింపుము.

175


తే.

కాశినగరి ధనుర్వల్లి గంగ నారి
కోటియుగ్మంబు లోలార్క కుధరధరులు
వృషము బాణంబు లక్ష్యంబు వృజినరాశి
విశ్వనాథుండు ధన్వి యుర్వీకళత్ర!

176


సీ.

అదె వియద్వాహిని యదె మణికర్ణిక
        యదె కాశి నిఖిలకల్యాణరాశి
యదె విధాతృకపాల మవని వ్రాలినచోటు
        వాఁడె శ్రీమత్కాలవటుకరాజు
పంచతీర్థం బదె ప్రణవమంత్రాకృతి
        మత్స్యోదరీనామమండల మదె
కామేశ్వరుఁడు వాఁడె స్కందేశ్వరుఁడు వాఁడె
        వాఁడె వినాయకేశ్వరుఁడు హరుఁడు


తే.

శశికిరీటుండు పార్వతీశ్వరుఁడు వాఁడె
వాఁడె భృంగీశుఁ డధ్వరేశ్వరుఁడు వాఁడె
వాఁడె యష్టాదశాంగుళేశ్వరుఁడు హరుండు
ధర్మశాస్త్రేశ్వరుఁడు వాఁడె ధరణినాథ!

177


తే.

ఇతఁడు సారస్వతేశ్వరుం డిందుమౌళి
యితఁడు రత్నజాతీశ్వరుఁ డిభవిరోధి

యతఁడు శైలేశ్వరుఁడు భుజంగాభరణుఁడు
సప్తజలధీశ్వరుఁడు వాఁడె శంకరుండు.

178


సీ.

సప్తకోటిమహార్హసన్మంత్రములకు న
        ధీశ్వరుం డితఁడు మంత్రేశ్వరుండు
త్రిపురేశ్వరుఁడు వీఁడె త్రిపురదానవులకు
        సాన్నిధ్యమై పూఁజ గొన్నపెద్ద
బాణేశ్వరుఁడు వీఁడె బాణాసురునకు వే
        భుజము లిచ్చినచంద్రభూషణుండు
వైరోచనేశుండు వాఁడె ప్రహ్లాదాది
        నారదేశ్వరు లల్లవారు చూడు


తే.

ధరణినాయక! యాదిగదాధరేశ
భీష్మకేశ భృంగీశ గోపీముకుంద
నారసింహేశ్వ రాత్రే యనాథశేష
విఘ్నరాజేశ్వరులఁ జూడు వేఱువేఱ.

179


తే.

బింధు(దు)మాధవదేవుఁ డానందవిపిన
వీథికాకేళికలకంఠవిష్కిరంబు
పంచనదతీర్థరాజంబు పార్థివేంద్ర!
కాశికాఫాలకస్తూరికాతిలకము.

180


క.

ఇదె మంగళకాత్యాయని
యిదె మార్కండేయనాయకేశ్వరలింగం
బిదె ధౌతపాతకేశ్వర
పద మిది కిరణేశుమనికిపట్టు మహేశా!

181


తే.

వేయు నేటికి? నానందవిపినభూమి
నడుమ శశిఖండకోటీరనాగకటక

నిటలలోచనగిరిశధూడ్జెటులు హరులు
నారుపోసినచందాన నాటియుండ్రు.

182


వ.

అని చెప్పి కళావతి జ్ఞానవాపికాతీర్థంబుఁ జూపి.

183


సీ.

స్తంభరోమాంచాదిసాత్త్వికభావంబు
        లందందఁ దోఁపంగ నవ్వధూటి
మూర్ఛిల్లె నద్భుతంబును బొంది భూపతి
        శిశిరోపచారంబు సేయుచుండె
బుద్ధశరీరిణి పుష్పప్రగల్భ యా
        ధవళాక్షిఁబొంది నివాస మెఱింగి
చిత్రపటంబు మైఁ జేర్చి కర్ణముఁ జేర్చి
        జ్ఞానోద మనియును జ్ఞానవాపి


తే.

యనియు శివతీర్థ మనియు దృఢాక్షరముగఁ
బలికె ముమ్మాఱు చేతనాప్రాప్తి నొందె
సరసిజాతాయతాక్షి తచ్ఛబ్దమాత్ర
వాడఁబారినసస్యంబు వానఁ బోలె.

184


వ.

మలయకేతుండును గళావతిప్రేరణంబునం బుత్త్రసంక్రాంతరాజ్యభారుండై వారాణసీపురంబున కరిగి జ్ఞానవాపికాతీరంబునం దపం బాచరించి ముక్తుం డయ్యె. ఇది శివతీర్థమాహాత్మ్యంబు. కుంభసంభవా! ఇంక నేమి యడుగఁదలచెద వడుగు మనుటయు.

185


తే.

అనఘ! నాకు సదాచార మాన తిమ్ము
ధరణిసురుఁడు సదాచారపరతఁ గాని
యాత్మసంశుద్ధి వడయ లేఁ డాత్మశుద్ధిఁ
గాని సిద్దింపనేరదు కాశివసతి.

186

సదాచారనిరూపణము

వ.

అనినఁ గుమారస్వామి యతనిం జూచి మన్వత్రిభృగుభరద్వాజయాజ్ఞవల్క్యోశనోంగిరసోర్యమాపస్తంబసంవర్తకాత్యాయనబృహస్పతిశాతాతశంఖలిఖితపరాశరాదుల మార్గంబుల సదాచారంబు ప్రసంగానుప్రసంగంబున వివరింప వచ్చిన నపారం బైయుండుఁ గావునఁ గుంభసంభవ! నీకు దిఙ్మాత్రంబు వివరించెద. సావధానమతిపై యాకర్ణింపుము.

187


తే.

చాతురాశ్రమ్యమును జతుష్కంధ మయ్యె
మొదటిస్కంధత్రయము ధర్మములు వహించు
నగ్రిమస్కంధ మెల్ల వింధ్యాద్రిదమన!
జ్ఞానసంపద్విభూతికిఁ దానకంబు.

188


శా.

ఓరాత్రిం గనుఱెప్పు వెట్టక మహోద్యోగంబునన్ ధీరతా
దౌరంధర్యము పూని మానవునకుం దాత్పర్యవృత్తిన్ సదా
చారం బె ట్లొనరింపవచ్చుఁ గలశీసంజాత! కాశీశ్వరున్
గౌరీవల్లభు సంస్మరించి బ్రతుకుం గా కాతఁ డప్రచ్యుతిన్.

189


తే.

ద్విజుఁడు వేఁబోక మేల్కాంచి దినముదినమ
ప్రత్యవాయపరీహారపరతఁ జేసి
సంస్మరింపంగఁ దగు భక్తిసౌష్టవమున
మంగళాస్పద మగువస్తుమండలంబు.

190


వ.

బ్రాహ్మముహూర్తంబున మేల్కాంచి కృతాచమనుండయి వివిక్తప్రదేశంబున భసోద్ధూళనంబును, భసితత్రిపుండ్రధారణంబునుం బొనర్చి రుద్రాక్షమాలికలు ధరియించి, పద్మాసనాసీనుండయి, మనంబున హేరంబు, నంబికాసహాయుంద్ర్యంబకు, లక్ష్మీసమేతుఁబుండరీకాక్షు, భారతీసహితుం

బరమేష్ఠిం, బాకశాసనపావకపరేతరాజపలలాశిపాశిపవనపౌలస్త్యపశుపతులను, వసిష్ఠాదిమునుల, గంగాదిపుణ్యవాహినులఁ, బ్రయాగాదితీర్థంబుల, మేరుశ్రీశైలాదిపుణ్యపర్వతంబులను, దుగ్ధోదన్వదాదిసముద్రంబుల, మానసాదిసరోవరంబుల, జ్ఞానవాప్యాదిదీర్ఘికల, నందనాదివనంబులఁ, బుష్కరాదిద్వీపంబుల, నార్యావర్తాదిజనపదంబులఁ, గామధుగ్ధేన్వాదిధేనువులం, గల్పవృక్షాదివృక్షంబులం, గాంచనాదిధాతువుల, లక్ష్మ్యాదిపుణ్యాంగనల, గరుడాదిపతంగంబుల, శేషాదిమహానాగంబుల, నైరావణాదివారణంబుల, నుచ్చైశ్శ్రవాదితురంగంబులఁ, గౌస్తుభాదిమణుల, నరుంధత్యాదిపతివ్రతల, రంభాద్యప్సరసల, నైమిశారణ్యాదిపుణ్యారణ్యంబుల, వారణాస్యాదిపట్టణంబుల, విశ్వేశ్వరాదిలింగంబులఁ, బాంచజన్యాదిశంఖంబుల, సుదర్శనాదిదివ్యాయుధంబుల, వేదాదివిద్యలఁ, బద్మాదిపురాణంబుల, మన్వాదిస్మృతుల, గాయత్ర్యాదిమంత్రంబుల, సనకాదియోగీంద్రుల, నోంకారాదిబీజాక్షరంబుల, వ్రీహ్యాదిధాన్యంబుల, నారదాదివైష్ణవుల, బాణాదిశివభక్తుల, బ్రహ్మాదిభాగవతుల, మహాకాళాదిప్రమథులఁ, బద్మాదినిధుల, దధీచ్యాదివదాన్యుల, హరిశ్చంద్రాదిభూపతుల, జననీజనకులఁ, బితరుల, గురులను సంస్మరించి యీయందఱు నాకు నాయురారోగ్యైశ్వర్యంబులు ప్రసాదింతురుగాక యనుచుం బ్రార్థించి ప్రణమిల్లి నిలిచి నిత్యనైమిత్తికాద్యనుష్ఠానంబుల నిష్ఠాపరుం డయి ద్విజుం డొనర్చునది.

191

సీ.

వెడలి యూరికి నూఱువిండ్లదవ్వున దైత్యు
        దెస బహిష్కార్యంబు దీర్పవలయు
నన్నూఱువిండ్లమాన మగుదూరమ్మున
        బయలి కేగుట పాడి పట్టనమునఁ
దల ముసుం గిడి తృణంబులు గప్పినధరిత్రి
        విణ్మూత్రజలముల విడువవలయుఁ
జెవి బ్రహ్మసూత్రంబుఁ దవిలింపవలయును
        విష్టాస్రవోత్సర్గవేళలందు


తే.

దివసముఖసంధ్య లందుదగ్దిఙ్ముఖుండు
యామినులయందు శమనదిగాననుండు
నగుచు మౌనవ్రతంబున నవనిసురుఁడు
మలవిమోక్షంబుఁ గావించుఁ గలశజన్మ!

192


సీ.

నిలుచుండి కాఁగాదు జలమధ్యమునఁ గాదు
        కాదు దున్నిననేలఁ గాదు మందఁ
గాదు గోసన్నిధిఁ గా దగ్ని కెదురుగా
        కా దగ్రజన్ములకట్టెదురను
గాదు సస్యంబులఁ గాదు రథ్యాభూమిఁ
        గాదు కట్టెదురను గాదు గాలిఁ
గాదు తారాదినక్షత్రగ్రహంబులఁ
        గనుఁగొంచు మలవిమోక్షం బొనర్ప


తే.

శిశ్న మొకచేతఁ గబళించి చెదలు చీమ
లేక శర్కరి గాక వల్మీకజంబు
నెలుకకలుగును గాక మన్నెదుగఁబట్టి
యరుగునది శౌచ మొనరింప నవనిసురుఁడు.

193

తే.

మునుకుఁ గదియఁగఁ దిగిచి నీ మొగము వాంచి
యంగుళీయుగకమున ము క్కదిమిపట్టి
మలవిమోక్షణ మొనరించి తలఁగునపుడు
కనుఁగొనఁగఁ గా దమేధ్యంబు కలశజన్మ!

194


సీ.

అయిదువారము లపానాభ్యంతరంబున
        నొకమాఱు శిశ్నమస్తకమునందుఁ
బదిమాఱు లట సవ్యపాణివల్లవమున
        నిరుగేలులందును నేడుమాఱు
లంఘ్రిద్వయంబునయం దొక్కమాఱు త్రి
        వారిఁ గ్రమ్మఱ హస్తవనరుహముల
నంతరాంతరములయందు నిశ్శబ్దంబు
        గాఁ బ్రసృత్యంబు సంక్షాళనంబు


తే.

గలుగునట్లుగ నామలకప్రమాణ
మృదులమృత్పిండఖండంబు మ్రేవి మ్రేవి
గంధలేశక్షయావధి గా నొనర్ప
వలయు శౌచంబు మది కెక్కఁ గలశజన్మ!

195


వ.

ఇది గృహస్థశౌచంబు. దీనికి ద్విగుణంబు త్రిగుణంబు చతుర్గుణంబును బ్రహ్మచారివానప్రస్థయతులకు నియతంబై యుండు.

196


తే.

పగటిశౌచంబులోన సాఁబాలు రేయి
రాత్రిశౌచంబులోన నర్ధము రుగార్తి!
జోరబాధాదిదుష్టకాంతారమార్గ
మునఁ దదర్ధంబు శౌచంబు మునివరేణ్య!

197


క.

పురుషుల శౌచములోనం
దరుణుల కర్ధంబు శౌచతంత్రంబు మునీ

శ్వర! నిష్కారణ మింతికిఁ
బురుషునకుం దగదు శౌచముం దడవంగన్.

198


తే.

ధరణిధరమంతపొడవుమృద్రాశి యైన
నంబునిధియంతజల మైన ననఘచరిత
భావశౌచంబుఁ బోలదు బాహ్యశౌచ
మనిరి శౌచక్రియావేదు లయినమునులు.

199


తే.

అగ్నిహోత్రాహుతులకుఁ జాంద్రాయణాన్న
పిండమునకును శౌచమృత్పిండములకు
గలశసంభవ! యుసిరికకాయలంత
మాన మని చెప్పుదురు కర్మమర్మవిదులు.

200


వ.

అనుష్ణంబులు నఫేనంబులు నబుద్బుదంబులు నక్షారంబులు నలవణంబులు నకలుషంబులు నదుర్గంధరసంబులు నయిన యుదకంబులు, నగక, నిలుచుండక, మాటలాడక, వెలిఁజూడక, వంగక, (తెలుచుండక,) వేగిరపడక, యజ్ఞోపవీతంబు విడువక, ప్రసారితపాదుండు గాక, బహిర్జానుండు గాక, చప్పుడు గాకుండ ముమ్మాఱు బ్రహ్మతీర్థంబున హృదయపర్యంతంబు డి గ్గశుద్ధిబుద్ధ్యర్థంబు ప్రాశించునది. అనంతరంబ యంగుష్ఠమూలదేశంబున నినుమాఱు [9]*గండస్థలంబున నిరియించిన యోష్ఠాధరంబులు ముమ్మాఱు స్పృశించి యనంతరంబ కుడిచేతం బుడిసిలించిన యుదకంబు వామహస్తసంపుటంబున నినిచి దక్షిణవామపాదములయందు మూర్ఖంబునందునుం బ్రోక్షించునది.* మఱియు ముమ్మాటికి వామహస్తోదకంబు స్పృశించుచు

నంగుళీత్రయంబున న్యాసంబును, దర్జన్యంగుష్ఠంబుల నాసికారంధ్రంబులు, నంగుష్ఠానామికాగ్రంబులఁ జక్షుశ్శ్రోత్రంబులును, గనిష్ఠాంగుష్ఠయోగంబున నాభీరంధ్రంబును, హస్తతలంబుస హృదయంబును, నంగుళ్యగ్రంబుల మస్తకోభయస్కంధంబుల ముట్టునది. కొంద ఱనుష్ఠానపరు లీచతుర్వింశత్యాచమన క్రియలందుఁ గేశవాదిచతుర్వింశతినామంబు లుచ్చరింతురు. అవి క్రమంబున నంభఃప్రాశనత్రయంబునఁ గేశవ నారాయణ మాధవనామంబులుఁ, గపోలమార్జనద్వయంబున గోవిందవిష్ణునామంబులు, నంతరాధరోష్ఠమార్జనత్రయంబున మధుసూదనత్రివిక్రమవామననామంబులు, వామహస్తోదకధారణంబున శ్రీధరనామంబును, దక్షిణవామపాదోదకప్రోక్షణంబున హృషీకేశపద్మనాభనామంబులును, శిరఃప్రోక్షణంబున దామోదరనామంబును, నంగుళీత్రయాస్యస్పర్శనంబున సంకర్షణనామంబును, దర్జన్యంగుష్ఠనాసారంధ్రద్వయస్పర్శనంబున వాసుదేవప్రద్యుమ్ననామంబులు, ననామికాంగుష్ఠచక్షుశ్శ్రోత్రస్పర్శచతుష్టయంబున ననిరుద్ధపురుషోత్తమాధోక్షజనారసింహనామంబులుఁ, గనిష్ఠాంగుష్ఠనాభిరంధ్రస్పర్శనంబుల నచ్యుతనామంబును, హస్తతలహృదయస్పర్శనంబున జనార్దననామంబును, గరాగ్రశిరస్స్పర్శనంబున నుపేంద్రనామంబును, నంగుళ్యగ్రస్కంధస్పర్శద్వయంబున హరికృష్ణనామంబు లుచ్చరింతురు. ఇది యాచమనప్రకారంబు.

201


తే.

శుద్ధుఁ డగుహృద్గతముల భూసురుఁడు నీళ్ల
గళగముల భూమిపతి తాలుగముల వైశ్యుఁ

డాస్యగంబుల శూద్రుఁడు నౌఁ టదియును
నాచమనవేళయందు వింధ్యాద్రిదమన.

202


తే.

ముక్తకేశుండు సంవృతమూర్ధగళుఁడు
గాక సంక్షాళితాంఘ్రి యై క్ష్మాసురుండు
విమలజలముల నాచాంతావిధి యొనర్ప
నర్హమగు వింధ్యశైలదర్పాపహారి!

203


ఉ.

తుమ్మినయప్పుడుం బురముత్రోవఁ జరియించినయఫ్టు వారిపా
న మ్మొనరించినప్పు డశనంబు భుజియించినయఫ్టు నవ్యవ
స్త్రమ్ము ధరియించినప్డు దురితంబులు చూచినయఫ్టు పుణ్యకా
ర్యములయప్డు హేయములనంటినయప్పుడు వార్వఁగాఁదగున్.

204


సీ.

చిటికెనవ్రేలియంతటి పరిణాహంబు
        పదివేళ్లనిడుపును బదును కలిగి
తో ల్గల్గి తొఱ లేక తోమంగ నను వైన
        తరుకాష్ఠమున దంతధావనంబు
వదనసంశుద్దికై వలయుఁ గావింపంగఁ
        బ్రతిపద్దినంబును బర్వతిథియు
షష్ఠియు నవమియు సవితృవాసరమును
        బరిహార్యములు కాష్ఠభక్షణమున


తే.

కర్హదివసంబు లేక యనర్హవేళఁ
బండ్లు దోమంగ వలసెనేఁ బదియు రెండు
సలిలగండూషములు నేయ సంవిశుద్ధి
గలుగువక్త్రంబునకు బ్రహ్మకర్మనిరత!

205


తే.

దంతధావనపూర్వంబు తాన మాడి
ప్రాతరారంభవేళల బ్రాహ్మణుండు

సంధ్య వార్వంగ వలయు నిచ్చలును నిష్ఠ
నర్ఘ్య మీఁ దగు నర్కోదయంబునపుడ.

206


సీ.

సౌభాగ్యమేధాప్రసాదసంపన్మహో
        త్సాహోదయములకు జన్మభూమి
నవరంధ్రములయందు స్రవియించురోఁతచే
        శుచి గానిమేనికి శుద్ధికరము
తేజంబు గల్పింప దీర్ఘాయు వొనరింప
        జాలు వాసరముఖస్నాన మనఘ!
యరుణోదయమున మూర్ధాభిషేక మొనర్చి
        తగును జేయఁగ మంత్రతంత్రవిధులు


తే.

స్నానమున కంగకములు మృత్సంచయంబు
నక్షతంబులు దిలలు దర్భాంకురములు
గోమయంబును బావమానీముఖంబు
లైనఋఙ్మంత్రములును వింధ్యాద్రిదమన!

207


వ.

విశుద్ధం బైన మృత్పిండంబు శుచిప్రదేశంబునం బెట్టి యుదఙ్ముఖుండును బద్ధబ్రహ్మశిఖుండును నై యద్దేవతాకంబు లైన మంత్రంబు లుచ్చరించుచు సలిలావగాహనంబు చేసి.

208


క.

నేమం బొప్పఁగఁ బ్రాణా
యామం బొనరించునది జలాంతరమున లో
పాముద్రాధిప! ప్రాణా
యామంబు శ్రుతిప్రసూతయజనం బనఘా.

209


తే.

మొదలి తుదియోంకృతులతోడ మూర్ధ మగుచు
వ్యాహృతులు మూఁటి నాల్గింటి నధిగమించి

మంత్రరాజంబు గాయత్రి మహిమ నొప్పుఁ
గడుపు చల్లంగ శ్రుతివిద్యఁ గన్నతల్లి.

210


వ.

గాయత్రిత్రివారజపంబు ప్రాణాయామంబు, గాయత్రిదశవారజపంబు తపంబు. జలాంతరమున గాయత్రీత్రివారజపం బొండె [10]విష్ణుసంస్మరణం బొండెఁ జేయునది. స్నానానంతరంబ కారుణ్యపితృప్రీతికరంబు వస్త్రనిష్పీడనం బొనర్చునది. ఇది స్నానవిధానంబు.

211


క.

ధౌతపరిధానపరుఁడై
ప్రాతస్సంధ్యను భజించి బ్రాహ్మణుఁడు కుశా
న్వీతకరాంగుళియై ఖ
ద్యోతనునకు నర్ఘ్య మిచ్చు నుదయింపంగన్.

212


వ.

అనంతరంబ గాయత్రీజపం బాచరించునది.

213


తే.

పగలు నిలుచుండి జపియించు నిగమమాత
మాపు గూర్చుండి జపియించు మహితభక్తి
బ్రాహ్మణుఁడు సంధ్య వార్వని బ్రాహ్మణుండు
గీసతక్కువశూద్రుండు కేవలంబు.

214


వ.

ఈప్రకారంబునన మధ్యాహ్నకాలంబునను బ్రహ్మవిష్ణుమహేశ్వరుల నింద్రాదిదిక్పాలకుల మరిచ్యాదిమహర్షుల మన్వాదిమనువుల సలిలతర్పణంబులం దృప్తిం బొందించునది. చందనాగరుకర్పూరగంధోన్మిశ్రితంబు లగుజలంబులు తర్పణార్హంబులు. దైవం బార్షంబు బ్రాహ్మంబు పైతృకం బనుతీర్థకంబుల దేవాదితర్పణంబులు నాచరించునది.

215

సీ.

ఛందంబు త్రిష్టుపు చంద్రికాచ్ఛచ్ఛాయ
        యభిరామ మభినవయౌవనంబు
రుద్రుండు దేవత భద్ర మాకారంబు
        కశ్యపుండు మహర్షి గన్ను నొసలు
నాపాదమస్తకం బఖిలాంగకంబులు
        నధ్వర్యుశాఖాక్షరాత్మకంబు
లాఁబోతు వాహనం బవతంసకుసుమంబు
        తరుణనిర్మలసుధాధామరేఖ


తే.

తరణిబింబంబు గగనసౌధంబుమీఁదఁ
బసిఁడికుంభంబుచందంబు పరిఢవింప
గానవచ్చినమధ్యాహ్నకాలసంధ్య
యందు సావిత్రి కఖిల విద్యాసనాథ.

216


తే.

పచనపావకుఁ బ్రజ్వలింపంగఁ జేసి
వైశ్వదేవం బొనర్పంగ వలయు నిష్ఠ
జణక కో ద్రవమాషనిష్పావకములు
తైలలవణంబులును గావు తద్విధులకు.

217


తే.

అగ్నికార్యం బొనర్చి యనంతరంబ
హంతకారంబు నిష్ఠఁ జేయంగ వలయు
హంతకారం బొనర్ప బ్రహ్మాదు లైన
త్రిదశముఖ్యులు తృప్తి బొందుదురు సూవె!

218


తే.

హంతకారం బనంగఁ బదాఱుగళ్లు
కలశభవ! నాల్గుగళ్లు పుష్కల మనంగ
గ్రాసమాత్రంబు భిక్ష యక్షయ్య మండ్రు
ధాత్రిబృందారక! తదన్నదానఫలము.

219

క.

బలిహరణము సేయఁగఁ దగుఁ
గలశీసుత! వైశ్వదేవకర్మాంతమునన్
నిలయబహిర్భాగంబున
జలధారాసంయుతముగ శ్రద్ధాపరతన్.

220


సీ.

కైసేసి యంబువైక్లబ్యంబు నొందక
        యుచితపీఠిక నంఘ్రు లుర్వి మోపి
యొండేని ప్రాఙ్ముఖం బొండె నుదఙ్ముఖం
        బగుచుఁ గూర్చుండి సాజ్యాభిఘాత
మభ్యుష్ణమగు విశుద్ధాన్న మాపోశన
        పూర్వంబుగాఁ బ్రాణమును నపాన
మును నాది యగుధాతువుల కైదిటికిఁ దృప్తి
        యావహిల్లంగ స్వాహాంతములను


తే.

బంచవాయునామంబులఁ బరమనిష్ఠ
వేల్చు విప్రుఁడు దర్భలు వ్రేలఁ బూని
యశనకబళాహుతులు జఠరాగ్నియందు
గుణము నగుణంబు నెన్నఁడు గుడుచునపుడు.

221


తే.

కడుపులో గాలి కొకకొంత యెడము విడిచి
యన్నపానీయములఁ దృప్తి యావహిల్ల
నవని నిర్జరుఁ డనుపాన మాచరించుఁ
దక్ర మైనను శీతలోదకము నైన.

222


తే.

ధరణి నిర్జరుఁ డమృతాభిధానశబ్ద
పూర్వమంత్రంబు సముచితంబుగఁ బఠించి
సగము ప్రాశించి యుదకంబు సగము భూమి
విడువవలయును హస్తంబు గడిగికొనక.

223

వ.

అప్రక్షాళితదక్మిణహస్తాంగుష్ఠమూలంబున నిష్ఠ్యూతం బైన యాసలిలం బపుణ్యనిలయం బైనరౌరవంబునం బద్మార్బుదనివాసులైన పితరులకుం దృప్తినావహించు. చేతులకు వార్చి యాచమనంబు సేసి శుచియై కర్కరీసలిలంబు వలకాలి పెనువ్రేలి మోపి ధార లెత్తునది. అద్ధార యయ్యంగుష్ఠంబు నాశ్రయించిన యంగుష్ఠమాత్రుం డగు పురుషుం బరితోషింపంగఁజేయు. అనంతరంబు బొడ్డు నివురుకొనుచుఁ బ్రాణాపానసమానోదానవ్యానంబులు సంతుష్టిం బొంది నాకు నానందం బొసంగుం గాత మని యాశీర్వదించుకొనునది. తాంబూలచర్వణంబులం బుణ్యకథాశ్రవణంబులం బ్రొద్దు పుచ్చునది.

224


తే.

వర్ణములలోన బ్రాహ్మణవర్ణ మెక్కు
డాశ్రమంబులలోన గార్హస్థ్య మధిక
మనఘ! లక్షణవతి యైన యాలు సూవె!
తగినయవలంబనంబు తద్దర్మమునకు.

225


స్త్రీలక్షణనిరూపణము

వ.

పాదతలంబులు రేఖ లంగుష్ఠాంగుళినఖంబులు మీఁగాళ్ళు గుల్భంబులు పిక్కలు జంఘలు రోమంబులు జాను లూరులు కటి నితంబంబు జఘనంబు భగంబు వస్తి నాభి కుక్షి పార్శ్వంబు మధ్యంబు వళులు రోమావళి హృదయంబు వక్షోజద్వయంబు చూచుకంబులు జత్రుస్కంధకక్షమణిబంధద్వయంబు మీఁజేతు లరచేతులు కృకాటిక కంఠంబు చిబుకంబు హనువులు కపాలంబులు వక్త్రం బుత్తరోష్ఠాధరోష్ఠంబులు జిహ్వ తాలువులు హసితంబు నాసిక కన్నులు

పక్ష్మంబు భ్రూకర్ణలలాటశిరోరుహంబు లను నఱువదియాఱంగంబులు లక్షణాన్వితంబులు గావలయు. అట్టిలక్షణవతియైనభార్య గృహలక్ష్మి. అట్టి గృహిణికతంబునం గదా గృహస్థుం
డిహపరసౌఖ్యంబులకు భాజనం బగు నని చెప్పి కుమారస్వామి కుంభసంభవున కి ట్లనియె.

226


తే.

ఇన్నిపాటులఁ బడఁగ లే దిల్వలాసు
రారి! వర్ణాశ్రమస్థుల కలఘుమతుల
కూర్ధ్వలోకంబు ముక్కున నూర్పుగాలి
యుడిగినప్పుడె కాశియం దొదవు ముక్తి.

227


వ.

అని సదాచారవర్ణనం బొనర్చి కుమారుం డింక నేమి యడిగెద (వ)డుగు మనినఁ గుంభసంభవుండు జ్ఞానకారణంబు లెయ్యవి? యని యడిగినం గుమారుండు.

228


యోగనిరూపణము

తే.

అఖిలవేదాసువచనంబు యజ్ఞపరత
బ్రహచర్యైకనిష్ఠ తపంబు దమము
శ్రద్ధ యుపవాస మపరతంత్రత శమంబు
కలశసంభవ! విజ్ఞానకారణములు.

229


తే.

ధర్మనిర్మలహృదయ! శ్రోతవ్య మాత్మ
తారక బ్రహ్మనిష్ఠ! మంతవ్య మాత్మ
సర్వశాస్త్రప్రవీణ! ద్రష్టవ్య మాత
దంభరహిత! నిదిధ్యాసితవ్య మాత్మ.

230


వ.

ఆత్మావలోకంబునకు యోగాభ్యాసంబు పరమసాధనంబు.

231


సీ.

కుంభినీధరగుహాక్రోడాటవినికుంజ
        గర్భవాసము గాదు కారణంబు

గ్రంథతాత్పర్యపర్యాలోచనక్రియా
        కర్మతంత్రము గాదు కారణంబు
దానంబు వ్రతము నధ్వరము లోనుగఁ గల్గు
        కర్మకాండము గాదు కారణంబు
నాసాగ్రసంవీక్షణంబు నాసాబంధ
        కల్పనంబును గాదు కారణంబు


తే.

మౌనమును శౌచమును యంత్రమంత్రములును
గావు కారణములు యోగకలనమునకు
నిశ్చయంబును నభియోగనిశ్చలతయుఁ
గడఁకయును నప్పనము గాని కలశజన్మ!

232


తే.

ఆత్మఁ దప్పించి యెఱుఁగఁ డన్యంబు నెవ్వఁ
డాత్మసంతుష్టుఁ డెవ్వఁ డహర్నిశంబు
నాత్మ నాత్మనె కను నెవ్వఁ డాత్మమిథునుఁ
డెవ్వఁ డాతండు యోగలక్ష్మీశ్వరుండు.

233


వ.

కొంద ఱాత్మమనస్సమాయోగంబ యోగం బండ్రు. కొందఱు ప్రాణాపానసమాయోగంబ యోగం బండ్రు. కొందఱు విషయేంద్రియసమాయోగంబ యోగం బండ్రు. కొందఱు పరమాత్మక్షేత్రజ్ఞసమాయోగంబ యోగం బండ్రు. యమనిసియ మాసనప్రాణాయామప్రత్యాహారధ్యానధారణసమాధులుం గొంద ఱెనిమిదియోగాంగంబు లండ్రు. నామతం బాసనప్రాణాయామప్రత్యాహారధ్యానధారణాసమాధు లాఱంగంబులు. అందు బ్రథమాంగం బైనయాసనంబు స్వస్తికాసనంబు, గోముఖాసనంబు, పద్మాసనంబు, వీరాసనంబు, సింహాసనంబు, భద్రాసనంబు, ముక్తాసనంబు, మయూరాస

నంబు, సుఖాసనం బన బహుభేదంబులం గలిగియుండు. ఇం దొక్కయాసనంబున నాసీనుండై యోగి యోగం బభ్యసించునది. దంశమశకాకీర్ణంబు గాక, కేశభస్మాంగారకీకసాదిప్రదూషితంబు గాక, జనసంకులంబు గాక, సర్వబాధావిరహితంబై సర్వేంద్రియసుఖావహంబై మనఃప్రసాదజననంబై కుసుమస్రగ్వాసనాధూపధూమమేదురంబైన ప్రదేశంబున నతితృప్తుండును, నతిక్షుధార్తుండును, విణ్మూత్రబాధితుండును, జింతాకులుండును గాక, నిమీలితాక్షుండై దంతంబులు దంతంబులం గూర్పక యింద్రియగ్రామంబు నియమించి ప్రాణాయామంబున కుపక్రమించునది.

234


తే.

యోగి యొయ్యయ్య మరగించి యునుపవలయుఁ
గుక్షిగోళంబులో గాలి కుంభకమున
బలిమి నిలిపిన రోమకూపముల వెడలి
యవే ప్రకల్పించుఁ గుష్టాదు లైనరుజల.

235


ఉ.

ఎంతయు ఘోరమైన విపినేభము మెల్లన మస్తరించి మా
వంతుఁడు కంఠపీఠి గుఱివైచి సుఖంబున నెక్కునట్టు ల
శ్రాంతము యోగసాధకుఁడు ప్రాణసమీరణముల్ నిసర్గదు
ర్దాంతము మ(కు)స్తరించి యవధానము మై ధరియింపఁగాఁదగున్.

236


తే.

కడఁగి సవ్యాపసవ్యమార్గముల వెలికి
యాన మొనరించుఁ గావునఁ బ్రాణ మొయ్యఁ
జంద్రనాడికఁ బూరించి సాధకుండు
భానునాడిక విడుచుఁ బ్రాణానిలంబు.

237


సీ.

నలినాదినానాసనంబులయందును
        గ్రమముమై దేహదార్ఢ్యము వహించుఁ

బ్రాణానిలాయామపరిపాటి విదళించు
        నందంద కలుషసంహతుల నెల్లఁ
బ్రత్యాహృతిక్రియాపాటవంబునఁ జేసి
        పావనత్వంబు చేపట్టు మేన
ధారణావిధిధురంధరతాబలంబునఁ
        జన మైనచిత్తంబు దిరము సేయు


తే.

ధ్యానమున నీశుఁ జూచి సమాధియుక్తి
గర్వనిర్మూలనక్రియాకర్మశూర
మైన మోక్షంబుఁ గాంచు వింధ్యాద్రిదమన!
[11]సాధకుని కిది యోగాంగషట్కఫలము.

238


తే.

దహని యన భ్రామణి యనంగ స్తంభని యన
శమని యనఁ బ్లావని యనంగ సంయమీంద్ర!
ప్రాణపవమానధారణ లైదు గలుగఁ
జెప్పుదురు యోగసిద్ధాంతసిద్ధమతులు.

239


ఆ.

ఉడ్డి యానముద్రయును మహాముద్రయు
మూలబంధగగనముద్రికలును
సారతరవివేక! జాలంధరంబును
ననఁగ యోగముద్ర లైదు సుమ్ము.

240


వ.

నాడీశోధనంబునకుం జంద్రసూర్యసంఘటనంబునకు రసపోషణంబునకు మహాముద్రకపాలకుహరంబున జిహ్వాప్రవేశంబు సేసి బ్రహ్మరంధ్రధ్రువేందుమండలసుధాధారానిష్యంద(న)౦ బాస్వాదించుటకు నభోముద్ర; అదియ ఖేచరీముద్రయు. ఉడ్డీనం బగుమహఃఖగంబు నహోరాత్రంబు నిలుపుటకు నుడ్డీ

యానముద్ర నాడీజాలంబు ధరించుటకు జాలంధరంబు. అపానమూలంబు బంధించుటకు మూలబంధంబు. ఈయైదుముద్రాబంధంబులు సమాధినిష్ణాకారణంబులు; [12]బిందుస్థిరీకరణకారణంబులు, గంధవహధారణాధురంధరంబులు.

241


తే.

ఊర్ధ్వమున నున్నప్రాణంబు నొడిచి తివుచుఁ
క్రింద నున్నయపానంబు గిట్టి పట్టి
యూర్ధ్వమున నున్నప్రాణంబు నొడిచి తివుచుఁ
గ్రింద నున్నయపానంబు గిట్టి పట్టి.

242


క.

మానక జీవుఁడు ప్రా
పానంబులచేతఁ దివియఁబడు వెలుపలికిన్
లోనికి నెక్కుచు డిగ్గుచుఁ
బౌనఃపున్యమునఁ బడనిపాటులఁ బడుచున్.

243


వ.

హంకారంబున బహిర్గమనంబును సకారంబున నంతర్గమనంబును జేయుచు హంసహంస యను ప్రణవాక్షరమూలభూతం బగునజపామంత్రంబున దివారాత్రంబు లిరువదియొక్కవేయునార్నూఱువారంబు లుచ్ఛాసనిశ్శ్వాసరూపంబున జీవుండు జపించు. అమ్మహామంత్రంబు సంకల్పమాత్రంబున.

244


సీ.

విను దూరవార్తలు వీక్షించు దవ్వుగా
        నడుచును శతయోజనములు గదియ
నశ్రుతం బగుశాస్త్రమైన వక్కాణించు
        గౌరవం బొందు లాఘవముఁ జెందుఁ
బరకాయములఁ జొచ్చుఁ బక్షికీటమృగాది
        బహుజీవజాతులభాష లెఱుఁగు

దివ్యగంధంబు దివ్యతేజము దివ్య
        కర్మంబులును దివ్యకళయుఁ దాల్చు


తే.

మోక్షనగరిమహాద్వారముఖకవాట
విఘటనాలోహకుంచికావిభ్రమమున
నుల్లసిలుచుండును షడంగయోగవిద్య
నభ్యసించిన సాధకుం డద్రిదమన!

245


వ.

ఇది యాభ్యంతరం బైనముద్రాసహితషడంగయోగంబు. ఇంక బాహ్యం బైనషడంగయోగంబు వివరించెద.

246


తే.

విశ్వభర్త విశాలాక్షి విబుధగంగ
దండపాణి చమూనాయకుండు డుంఠి
కాలభైరవదేవుండు కలశజన్మ!
కాశినగరి షడంగయోగమున నెఱుఁగు.

247


తే.

విశ్వనాయక దేవత్రివిష్టపేశ
వీరకేదారనాయకోంకారకృత్తి
వాసు లిల్వలదైత్యవిధ్వంస! మఱియుఁ
గాశినగరి షడంగయోగముగ నెఱుఁగు.

248


సీ.

వారాణసీపురవాటిసంచారంబు
        ఖేచరీముద్ర యక్లిష్టచరిత!
వేగ మై యానందవిపినంబునకు రాక
        భద్ర! యుడ్డీయానబంధముద్ర
కాశికానికటగంగావాహినీవారిఁ
        దల ధరించుట జలంధరము ఘటజ!
శివరాజధానిఁ జేసినసద్వ్రతంబులు
        మూలబంధంబు సన్మునివరేణ్య!

తే.

నహుషదమన! మహాశ్మశానంబుమీఁద
భక్తిముద్ర మహాముద్ర పరమయోగ
విద్యను షడంగముద్రికాన్వితము గాఁగ
నీకుఁ జెప్పితి దృఢముగా నిలుపు మాత్మ.

249


వ.

అనిన నగస్త్యుండు.

250


క.

ఆయురవసానకాలం
బేయనువునఁ దెలియవచ్చు నెరిగింపుము గాం
గేయ! యరిష్టాగమనము
లేయపశకునములు చూచి యెఱుఁగంగఁ దగున్.

251


వ.

అనిన గుమారుం డతని కిట్లనియె.

252


కాలజ్ఞానకథనము

తే.

వామనాసాపుటమున నెవ్వానికి నొగి
గాలి యుచ్ఛ్వాసనిశ్శ్వాసగతిఁ జరించుఁ
బింగళానాడి నడువదు పెద్దయేని
వాఁడు మూఁడబ్దములకు నిర్వాణ మొందు.

253


తే.

ఒండె మూఁడహోరాత్రంబు లొండె నేని
రెం డహోరాత్రములు సంచరించు హేళి
నరుని కెవ్వని కొక్కవత్సరముగాని
బ్రతుకఁ డండ్రు సుధర్మిణీప్రాణనాథ!

254


క.

నాసాపుటయుగమున ని
శ్శ్వాసోచ్ఛ్వాసానిలములు సరియై నడుచున్
వాసరము లెవ్వనికిఁ బది
మాసత్రితయమున వాఁడు మరణముఁ బొందున్.

255

క.

ప్రాణానిల మెవ్వనికిని
ఘ్రాణపుటీయుగ్మకమునఁ బ్రవహింపక సం
క్షీణంబై నోరవెడలుఁ
బ్రాణ మతఁడు దొఱఁగు వాసరత్రితయమునన్.

256


తే.

అదిరిపా టెవ్వఁ డీక్షించు నాకసమున
హారికపుఁ గృష్ణపింగళుం డైనపురుషు
నాతనికి వత్సరద్వయం బవధి సూవె!
ప్రాణధారణమున కిల్వలాసురారి!

257


ఉ.

తుమ్మును నింద్రియంబు నిజతోయమలంబులు నొండెనొండె మూ
త్రమ్ము మలమ్ముఁ దుమ్ము బలదార్థ్యము చాలక యెవ్వఁడేని నొ
క్కుమ్మడి నుత్సృజించు నతఁ డుండఁడు ప్రాణముతోడఁగూడి యే
కమ్మగు వత్సర[13]మ్ము గడగాంచిన పిమ్మట వాసరార్ధమున్.

258


ఉ.

కానఁ డరుంధతిన్ ధ్రువునిఁ గానఁడు విష్ణుపదత్రయంబునుం
గానఁడు మాతృమండలముఁ గానఁడు కన్నులు గల్గియుండ నే
మానవుఁ డమ్మనుష్యునకు మాసములాఱు విరామ మొందఁగాఁ
గానఁగ వచ్చుఁ గుంభభవ! కాలునిబంధురసౌధవీథికల్.

259


తే.

దృఢవివేక! యరుంధతీదేవి జిహ్వ
నాసికాగ్రంబు ధ్రువుఁ డిల్వలాసురారి!
విష్ణుపద మది భ్రూమధ్యవీథి యనఘ!
మాతృమండల మక్షిపక్ష్మము మునీంద్ర!

260


సీ.

అసితాదివర్ణంబు నామ్లాదిరసమును
        నన్యథాభావంబు నందెనేని

దంతోష్ఠకంధరాతాలుజిహ్వా[14]గ్రంబు
        లారొక్కవర్ణంబు నందెనేనిఁ
గరజేంద్రియంబులు కనుదోయికొలుకులు
        ధూమధూమ్రత్వంబు దొరసెనేని
నాఖండలీయకం బగుధనుఃఖండంబు
        నభమున న్నెరయఁ గన్పట్టెనేని


తే.

నాఱుమాసములకు మర్త్యుఁ డస్తమించు
వేగ యేతెంచి యూసరవెల్లి తొండ
పాదములనుండి తలదాఁకఁ బ్రాఁకెనేని
యతఁడు షణ్మాసములఁ జూచు యమునిపురము.

261


తే.

జలక మాడినపిమ్మటఁ జరణములను
హృదయమున నీళ్లు వేగంబ యివురువారు
దర్పణమునీడ తోఁచు నాతామ్రకాంతి
నెవ్వనికి వాఁడు నార్నెల్ల కేగు దివికి.

262


వ.

మఱి ఛాయాప్రకంపంబు, మతిభ్రంశంబు, చంద్రద్వయ సూర్యద్వయదర్శనంబు, పగలు తారకావీక్షణంబు, రాత్రి తారకానభివీక్షణంబు, గంధర్వనగరావలోకనంబు, పిశాచనృత్తవీక్షణంబును, శ్రవణధ్వనిహాని, స్వప్నంబునందుఁ బిశాచఖరవాయసభూతప్రేతశునకగృధ్రగోమాయుబాధ, పాంసురాశియూపదండవల్మీకాధిరోహంబుఁ, దైలాభ్యంజనముండనంబులు మరణసూచకంబులు.

263


క.

ఈదుర్నిమిత్తములతో
నేదైనను నొకటి గాంచి యెదలోనఁ గడున్

ఖేదము నొందక నరుఁడు ప్ర
మోదమునఁ గాశినగరమున కేగఁదగున్.

264


వ.

అని చెప్పిన మహాత్మా‌! యీ ప్రపంచంబు నిర్వికల్పంబు నిరాకారంబు నిరస్తసమసస్తోపాధికంబు. నిత్యంబు నగుపరబ్రహ్మం బేక్షేత్రంబును నాశ్రయించియుండు, నేక్షేత్రంబునంద లలాటనేత్రుండు తారకబ్రహవిద్యావర్ణకర్ణేజపుండై కీటపతంగక్రిమిసరీసృపాదు లగునానావిధజంతువులకుం బ్రాణాంతకాలంబున నభయం బొసంగు, నేక్షేత్రంబునకు నుత్తరవాహిని యనవియత్తటిని యుపకంఠంబునం గంఠముక్తాకలాపంబునుం బోలెఁ బ్రవహించు, నేక్షేత్రంబున కభ్యర్థంబున మణికర్ణికాతీర్థంబు తీర్థరాజంబు రజనీకరకిరణసందోహదానదీక్షాధురంధర వినిర్మలకబంధకల్లోలమాలికాస్ఫాలితమహాదేవదివ్యలింగ శతసహస్రలక్షకోట్యర్బుదన్యర్బుదంబై మహోత్కదంబుఁ గావించె, నట్టియవిముక్తక్షేత్రంబు మహిమ యింకను వినవలతు నానతిమ్మని ప్రార్థించినం గరుణావశంవదుండై శిఖివాహనుం డతని కి ట్లనియె.

265


దివోదాసవర్ణవము

తే.

బ్రాహ్మణోత్తమ! బ్రహ్మకల్పంబునందు
మనువు స్వాయంభువునికాలమున ధరిత్రి
యఱువదేఁడు లనావృష్టి యైనకతన
దారి వందురి కడునుపద్రవము నొందె.

266


సీ.

అంభోధితీరంబు లద్రికాననములు
        నాశ్రయించిరి పేద లగుచు మనుజు

లంగళ్లయందు మిట్టాడ మానిసి లేక
        గుడియుఁ బాడును జిక్కఁ జెడియె నూళు
లుద్యానములు వాపికోదకంబులు లేక
        వృక్షవాటంబులు వెరలు పోయె
వ్యాఘ్రాదు లైనక్రవ్యాదహింస్రమృగంబు
        లెచ్చోటఁ జూచిన నేఁపు మిగిలె


తే.

సంతతము దాను సృజియించు జంతుకోటి
కఱవుపాల్పడి మోమును కాళ్లు వాఁచి
వండఁగాఁ దిన్న బూరెలవరుస నడఁగ
భ్రమసి దిట దప్పి నివ్వెఱపడియె ధాత.

267


తే.

రాజు లేనికతంబున రాష్ట్రములకు
నన్నిటికి బాధగా ధరిత్ర్యంతరమున
వ్రాలె నఱువదియేఁడు లవగ్రహంబు
కాచె వెలిపుచ్చ నొకభంగి గాక యుండ.

268


వ.

అప్పుడు చింతాక్రాంతుఁ డై జగద్యోని ప్రజాక్షయంబున యజ్ఞాదిక్రియ లుచ్చాటనం బయ్యె, సవనాదిక్రియానాశనంబును నధ్వరభుజులు భూప్రజలఁ బోలె హవిర్భాగాద్యభావంబున బుభుక్షాక్షోభంబు వహించిరి. ఇంక నేమి సేయుదు? ఒక్కనిం బట్టంబుగట్టనినాఁడు సర్వసర్వంసహామండలంబును నాఖండలుండు వర్షింపకుండుటం జేసి యెండి బెండుపడిపోవుచున్నయది. నిఖిలక్షోణీచక్రరక్షణైకదీక్షాధురంధరుం డైన యంతటివాఁ డెక్కడఁ గల్గునొకో? యని యన్వేషించి మనుజవంశంబున రిపుంజయుం డనువాని

నౌదార్యశౌర్యధైర్యాదిగుణగరిష్ఠుం గాంచి సబహుమానంబుగా నతని కిట్లనియె.

269


సీ.

మనువంశమకుటమండన! యోరిపుంజయ!
        ధర యేలు లవణాబ్ధి గరుసు గాఁగ
మత్ప్రసాదమున సామర్థ్యం బతీంద్రంబు
        కలకాలమును నీకుఁ గలుగఁగలదు
బర్హిర్ముఖస్నేహపరివృత్తితో దివో
        దాసౌఖ్యవిఖ్యాతిఁ దాల్తు వీవు
వాసుకితనయ విలాసినీరత్న మ
        నంగమోహిని భార్య యగును నీకు


తే.

ననిన నంజలి చేసి మహాప్రసాద
మనుచుఁ బరమేష్ఠియానతి నాదరించి
యిట్టు లని విన్నవించె ధాత్రీశ్వరుండు
పద్మభవునకు గంభీరభాషణముల.

270


ఉ.

నెట్టన నన్ను సత్కరుణ నీరధివేష్టిత యైనధాత్రికిం
బట్టము గట్టెదేని నొక బాస పితామహ! యాత్మ నెగ్గుగాఁ
బట్టక విన్ము భోగులు సుపర్వులు క్రిందట మీఁద నుండఁగాఁ
దొట్టవు సత్యమౌ ధరణి నొక్కరుఁ డున్ననుఁ జేయ రాజ్యమున్.

271


వ.

అనిన నట్ల యగుగాక యని బ్రహ్మ కాశీనగరంబున కేగి విశ్వనాథున కత్తెఱం గెఱింగించి తదనుమతి వడసి దివోదాసునకుం బట్టాభిషేకంబు సేసి సత్యలోకంబునకుం జనియె నయ్యవసరంబున.

272


శా.

చాటించెన్ మనువంశవర్ధనుఁడు విశ్వక్షోణి నందంద ఘం
టాటంకారము దుందుభిధ్వనియుఁ గూడ న్వేగమై దేవతా

కోటు ల్మేదిని నున్నఁ దప్పగుఁజుఁడో కోపంబు పాపం బుపా
త్తాటోపంబుమెయిం గుటుంబసహితం బై చేరుఁడో నాకమున్.

273


క.

పాతాళమునకుఁ జనరో
వాతాశను లెచటికేని వలసినయెడకున్
భూతము లేగరొ! యని య
త్యాతతగతి జాటి రవని నధిపతిదూతల్.

274


ఈశ్వరుండు నిఖిలదేవతలం గూడి మందరాద్రి కేగుట

వ.

ఇవ్విధంబున దివోదాసదాసులు కాశీశ్రీశైలకుంభకోణశోణార్కపుండరీకపురపాండురంగమహాకాళకాళహస్తికాంచీవేంకటశ్రీరంగవల్మీకరామేశ్వరాదిదివ్యస్థానంబుల ఘంటాపథంబుల ఘంటాడిండిమధ్వనులతోడం గూడంజాటిన బ్రహ్మదత్తవరానుభావంబునం గుటుంబసహితంబు త్ర్యంబకపీతాంబరహేరంబభైరవదుర్గావీరభద్రప్రధానులగులనిర్జరులు దమతమచిందంబులతో దుందుభివేణువీణామృదంగకాంస్యకాహళఢక్కాహుడుక్కానకంబుల మ్రోఁత దిక్తటంబుల దీటుకొనం గిరీటకోటీరరమణీయఘటితమణిమయూఖరేఖాపుంజంబు గలసి యరసంజపొడవువేడబంబు విడంబింప వెల్లజగజంపుగొడుగుల పెల్లును, డెక్కియంబుల పెక్కువయు, నాలవట్టంబుల డాలును, సీవికుల ఠేవయుఁ, దాలవృతంబుల డంబును, దాంబూలకరండంబుల పొంకంబును, గర్కరీకళాచికాపీఠగండోపథానమణిముకురశయ్యాకటాహంబుల కల్మియు, మహైశ్వర్యంబుం బ్రకటింప నిలింపమార్గంబున సవాహనులు, సాయుధులు, సపరివారులు, సశక్తులు, సాలంకారులునై కాశీపట్టణంబున కేతెంచి

విశ్వేశ్వరాదేశంబున నెచ్చోటికైనను జనువారై గంగాతీరంబున విడిసిరి. కాశీశ్వరుండును నేకక్రియాఫలద్వయంబు నీఁజాలునట్టిప్రకారంబు విచారించి యటకుమున్న పెద్దకాలంబునం యవిముక్తక్షేత్రంబునందునుంబోలె నిజశిఖరదేశంబునం దా నధివసించుట ఫలంబుగాఁ గోరి తన్ను నుద్దేశించి ఘోరవీరతపంబు చేసినమందరాచలంబు కృతార్థం బగునట్లు నగ్గిరీంద్రంబునం దుండి దివోదాసు ప్రతిజ్ఞ చెల్లించువాఁడై తత్కాలసన్నిహితం బైన నానాదిగ్దేశదేవతాసమూహంబుఁ గనుంగొని యి ట్లనియె.

275


ఉ.

ఓసురముఖ్యులార! కమలోద్భవుఁ డాదర మొప్పఁగా దివో
దాసున కిచ్చినాఁడు వసుధాతల మెల్ల జగద్ధితార్థమై
రాసుతుఁ డాతఁ డీభువనరాజ్యభరంబు వహించునప్డు దే
వాసురసిద్ధసాధ్యగరుడాదుల వేల్పులఁ బన్నగేంద్రులన్.

276


తే.

ఆజ్ఞ వెట్టినఁ గాని రాజ్యంబు సేయ
బహుముఖం బైన రాజ్యంబు పదిలపడదు
ఫణులు పాతాళమున నుండఁ బాడివారు
నిర్జరులు నాకమందున నిల్చువారు.

277


వ.

అని వరంబు వేఁడినఁ బితామహుండును నాయనుమతి నతని కభీప్సితార్థంబు నొసంగె నని యానతిచ్చి.

278


సీ.

మహనీయరుద్రాక్షమాలికాభరణులు
        భస్మత్రిపుండకోద్భాసితులును
వికటపాటలజటామకుటవర్ధనులును
        సముదీర్ణశార్దూలచర్మధరులు

దంతనిర్మితయోగదండమండితులును
        ననిలభుగ్బ్రహ్మసూత్రాన్వితులును
నాసాశిఖాగ్రవిన్యస్తలోచనులును
        బంచాక్షరీమంత్రపఠనపరులు


తే.

నైనప్రమథులు గొలిచి రా నగజతోడ
నందికేశ్వరు నెక్కి యానందలీల
సకలజగదీశ్వరుండు పర్జన్యులీల
సుందరాద్రికిఁ గదలె సమగ్రమహిమ.

279


వ.

మఱియు సారస్వతేశ్వరుండు, రత్నజాతీశ్వరుండు, సప్తనాగరేశ్వరుండు, శైలేశ్వరుండు, త్రిపురేశ్వరుండు, బాణేశ్వరుండు, ప్రహ్లాదేశ్వరుండు, భృంగీశ్వరుండు మొదలైన పరమేశ్వరులు, దివ్యజ్యోతిర్లింగమూర్తులు, శతసహస్రలక్షకోట్యర్బుదన్యర్బుదసంఖ్యాకులు విశ్వేశ్వర శ్రీమన్ మహాదేవు ననుగమించిరి. లోలార్కకేశవులును, విశాలాక్షియు, డుంఠివిఘ్నేశ్వరుండును, దండపాణియుం గదలిరి. అందఱువేల్పు లిరుపక్కియలనుం బిఱుందనుం గూడి రాఁ గాశీశ్వరుండు.

280


సీ.

లవణపాథోధివేలావేష్టితంబైన
        యల్లొనేరెడుదీవి యధికరించి
యిక్షురసాబ్ధిపరీతాంచలంబైన
        ప్లక్షాంఘ్రిపద్వీపపరిధి గడచి
హాలాకసోదన్వదభిమంత్రితంబైన
        శాల్మలద్వీపభూస్థలము దాఁటి

ఘృతపయోరాశిసంకౢప్తావధిక మైన
        చంచత్కుశద్వీపజగతిఁ జేరి


తే.

యమ్మహాద్వీపమునకు రత్నాఢ్యమైన
మకుటమును బోలె నొప్పారుమందరమునఁ
గనకకలధౌతమాణిక్యకందరమున
గాఁపురము సేసె శివుఁ డంబికయును దాను.

281


వ.

ఇట్లు కృతనివాసుండై యిందుధరుం మ్మంచరాచలంబునందు మణికందరమందిరంబున విహరించుచుం బర్వత(రాజ)నందనం జూచి యి ట్లనియె.

282


సీ.

నలినాక్షి! యైరావణంబుకుంభములతో
        సరివచ్చు నీగుబ్బచన్నుదోయి
తన్వంగి! పారిజాతప్రవాళములతో
        బ్రతివచ్చు నీహస్తపల్లవములు
కాంత! కౌస్తుభమణిగ్రావకందళముతో
        నెనవచ్చు నీలేఁతయిగురుమోవి
యలినీలకుంతల! యమృతపూరంబుతో
        దొరవచ్చు నీముగ్ధసరసఫణితి


తే.

యువిద! యీయుపమానవస్తువులు గలిగె
నంబునిధియందు నీమనోజ్ఞాంగములకు
నిమ్మహామందరాద్రి కవ్వంబు గాఁగ
సురలు నసురులు సంప్రీతిఁ దరువఁ బట్టి.

283


చ.

చఱిఁబడి తీవ్రఘర్షణవశంబున నొక్కట తీఁగసుట్టు నె
త్తఱులయియున్న పాఁపతరిత్రాటిమలంకల నిర్ఘరాంబువుల్
గిఱికొని మీఁదనుండి దిగఁ గిన్నరకంఠి పయోధిఁ ద్రచ్చున

త్తఱి ఫణిరాజు చుట్టినవిధంబున నున్నది చూడు మిగ్గిరిన్.

284


వ.

అనియె నంత.

285


సీ.

సోమార్కమయమహాసోపానముల డిగ్గి
        పుష్కరాంబువు లొగిఁ బుక్కిలించి
గ్రహతారనక్షత్రగణము నాస్వాదించి
        విధుకిరీటునిమౌళి వెల్లిగొల్పి
వడఁకుగుబ్బలిరాచవారిమూర్ధం బెక్కి
        కనఖలక్షేత్రంబుఁ గౌఁగిలించి
కాశికానగరోపకంఠదేశము డాసి
        యేడ్నూఱుముఖముల నేగె జలధి


తే.

కిమ్మహానది యియ్యేటి యిరుగెలఁకుల
విడిసియున్న నల్దిక్కుల వేల్పుగములు
నంబుధరమార్గమున నేగి రభవుఁ గూడ
మందరమునకు సంభృతానందలీల.

286


తే.

అపుడు జంబూతరుద్వీపవిపులయందు
వాసి కెక్కినయద్దివోదాసునాజ్ఞ
గొంది సందిని నొకకుంటి కుదిపి పేద
యనదబూతంబు నుండనీరైరి భటులు.

287


క.

కోయిలఁ దిరుమలఁ బెరుమా
కోయిలఁ దిరుపతులఁ గుంభకోణాదికపు
ణ్యాయతనంబుల మాయం
బై యెక్కడఁ బోయెనొకొ మురాంతకుప్రతిమల్?

288


తే.

మోసపోక ముసానమ్మ ముద్దరాలు
తారె సరిసప్డు లేక పాతాళమునకుఁ

దాను గొడుకులు నొకకొంత తడసె నేని
గుతిలపఱుపరె నృపుబంట్లు గుదెలవారు.

289


వ.

అప్పుడు చతురంతమహీమండలంబు సర్వదేవతాశూన్యం బగుటం జేసి విఘ్నేశ్వరావాసంబుల స్తవరాజస్తోత్రపాఠంబును, గాళికాకటంబుల హృల్లేఖాదిమంత్రజపంబును, శివసానంబులఁ బంచాక్షరీపంచబ్రహ్మపాశుపతా(ద్య)ఘోర[15]శారభాది విద్యానుసంధానంబును, విష్వక్సేనావాసంబులం బురుషసూక్తద్వాదశాక్షరాష్టాక్షరప్రధాననామానుస్మరణంబును లేక తక్కెం దక్కినవేలుపుల గుళ్లయందును సంధ్యాకాల బహుళ పటహశంఖ కాహళకోలాహలం బుడిగె. నేనునుం గర్ణాటదేశహాటక మణికిరీటంబును, గిష్కింధాచల హేమకూటమతంగగిరిప్రాంతంబును, దుంగభద్రాతటినీనైకటికంబును, భాస్కరక్షేత్రప్రాతివేశికంబును, బంపావిరూపాక్షదేవ దివ్యవికటపాటలజటాజూటకోటీపినద్ధముగ్ధేందు లేఖామయూఖకండళగళదమృతధారానిష్యందానేక సంవర్ధితసుకుమారసరళసహకార జంబుజంబీర నారికేళ కేసరకురవకాశోకశాగోటకుటజ పారిభద్రద్రాక్షారుద్రాక్షసర్జ ఖర్జూరభూర్జబిల్వచిరిబిల్వాది తరులకుంజఖంజన్మిహిరకిరణపుంజంబు నగుసామిమల విడిచి, మందరాచలంబున కరిగితి. ఇవ్విధంబున దేవసంఘంబులు దివికిం గాద్రవేయకులంబు బలిసద్మంబునకుం బోక విని నిర్ద్వంద్వంబు, నిరవగ్రహంబు, నిస్సపత్నంబునుం గాఁ గాశీనగరంబు తనకు మొదలిరాజధానిం గావించికొని దివోదాసుం డేకవాసర

ప్రాయంబుగా వత్సరాయుతాష్టకంబు రాజ్యంబు సేసిన నక్కాలంబు నందు.

290


ఉ.

దేవత లెల్లఁ దక్కుఁ గలదీవులకున్ దివి కేగునట్టిచోఁ
బోవఁగ లేక కుంటికుదుఫుల్ జిఱువేల్పులు దేవదానవుల్
సేవకు లై మహీవిభునిచే నధికారనియోగవృత్తికై
జీవిత మంది నిల్చిరి త్యజింపఁగ వచ్చునె జన్మదేశముల్.

291


తే.

తత్పరతమీఱఁ గొలిచి రాధరణివిభుని
దైత్యదానవు లవధూతదానవారి
పఠితపాఠ మాబాలగోపాల మైన
సుద్ది పగవారిపగవారు చుట్ట లగుట.

292


తే.

విశ్వదేవగణంబుతో వేఱువేఱ
వచ్చి పితృదేవతలు మహేశ్వరుఁ గొలిచిరి
చులుకఁ గా ల్వట్టి యీడ్పినఁ జూరు వట్టి
వేలుదురు గాక తమవారి విడుతు రెట్లు.

293


సీ.

సిద్ధు లారాజుఁ గొల్చి ప్రసిద్ధిఁ గాంచిరి
        గ్రహముల కతఁ డనుగ్రహముఁ జూపె
విద్యాగురుం డయ్యె విద్యాధరుల కతఁ
        డతఁడు రుద్రులకు సౌహార్దుఁ డయ్యె
రక్షించె నాతఁడు రక్షస్సమూహంబు
        నతఁడు తార్క్ష్యులకు నాధ్యక్ష మిచ్చె
మన్నించె నాతఁడు కిన్నరవ్రాతంబుఁ
        దుషితుల నతఁడు సంతోషపఱిచె

తే.

నతని భూతపిశాచకూశ్మాండగణము
ఢాకినీప్రేతరంకులు శాకినులును
గర్కరీపాదుకావీటికాకరండ
పేటికలు దాల్చి కొల్చిరి భృత్యు లగుచు.

294


వ.

అవ్విధంబున రిపుంజయుండు ప్రజాపాలనంబు పరమధర్మంబుగా శక్తిత్రయచతురుపాయషాడ్గుణ్యంబులు కాలంబెఱిఁగి నడుపుచుఁ బెద్దకాలంబు రాజ్యంబు సేసె. చాతుర్వర్ణ్యంబును జతురాశ్రమంబులుఁ దమతమధర్మంబులు దప్పక వర్తించె. అపుడు వేల్పులు ధరావియోగవేదనాదూయమానమానసు లై మరుద్గురుం బురస్కరించుకొని మంతనం బుండి దివోదాసునకు రాజ్యపదభ్రంశనం బెవ్విధంబునం గావింతు మొకో యని విచారంబునకుం దొడంగిరి. అప్పుడు కార్యంబు నిర్వర్తించి బృహస్పతి యింద్రాదిదేవతల కి ట్లనియె.

295


క.

ప్రాణాపానవ్యానో
దానసమానములు తృప్తి దలకొనఁ జేయం
గా నోపెడు నది యన్నము
ప్రాణం బన నన్న మనఁగఁ బర్యాయంబుల్.

296


తే.

అగ్ని మనలోన నొక్కరుఁ డౌనొ కాఁడొ?
చేయఁడే మారుతము మనచెప్పినట్లు?
వరుణుఁ డెవ్వరివాఁడు? మువ్వురును లేక
యోజితం బగునెబ్భంగి నోగిరంబు?

297


వ.

వరుణానిలాగ్నులు తమతమశక్తు లుపసంహరించిరేనిఁ బిఠరపాకంబు సాగదు. పిఠరపాకంబు సాగక యోదనంబు పరి

పక్వంబు గానేరదు. పరిపక్వాన్నంబు లేక వైశ్వదేవబలిహరణాదిక్రియాకలాపంబులు కుంఠితంబు లగు. హవ్యకవ్యక్తియాశూన్యు లైనబ్రాహ్మణులు రాజులయందు విరక్తు లగుదురు. బ్రాహ్మణులు విరక్తు లైనప్పుడ తక్కినవర్ణంబుల ప్రజలు వైరాగ్యంబు వహింతురు. ప్రజా(ను)రంజనంబునంగదా రాజు రాజౌట. ప్రజావిరక్తిఁ గోశదుర్గబలాదిసప్తాంగంబులు పరిక్షీణంబు లగు. సప్తాంగపరిక్షయంబునఁ ద్రివర్గనాశనం బగు. త్రివర్గనాశనంబున నుభయలోకమార్గంబును ఖిలీభవించుంగావున.

298


తే.

మొదల వైశ్వానరుని నిజమూర్తిశక్తి
సంహరింపంగఁ దగుఁ గాశి జనపదమున
నగ్ని లేకున్న నోగిరం బనువుపడక
రాజు ప్రజలును నెబ్భంగి బ్రదుకువారు.

299


ఉ.

చండకరాన్వయాంబునిధిచంద్రుడు భూమణుం డతండు ఱా
గుండియవాఁడు వేలుపులకోటు లసంఖ్యలు భూతధాత్రిపై
నుండఁగ నీక కాశిపురి నొక్కఁడు రాజ్యము సేయు టెట్టు? లీ
దండికి మెచ్చి నారట ప్రతాపవిహీనుఁడు భూమిపాలుఁడే?

300


తే.

అనిన నాచార్యుపలుకుల నాదరించి
యింద్రుఁ డనుపఁగ ధాత్రికి నేగె నగ్ని
మొదలఁ గాశీపురమునకు ముట్టముణఁగ
సకలగృహములఁ దినమూర్తి సంగ్రహించె.

301


మ.

కర మాశ్చర్యముగా బ్రతిక్షయమునం గాష్ఠంబులం దగ్నిదే
వర నిప్పచ్చరమై యడంగుటయు సర్వస్త్రీలు పాకక్రియా

పరతల్ దక్కిరి యాయజూక భవనప్రాగ్వంశమధ్యంబులన్
[16]వరుసం జేయరయారె వీడు నస్వధాస్వాహావషట్కారముల్.

302


ఉ.

యంత్రితభక్తిభావమున నగ్నిసమింధని సామిధేని ఋ
ఙ్మంత్రము లుచ్చరించుచు సమగ్రతరాగణిమంథనక్రియా
తంత్రము నాచరించి వసుధామరముఖ్యులు వీతిహోత్రు నా
మంత్రణ సేయ లేరయిరి మచ్చరికించియుఁ గాశికాపురిన్.

303


వ.

ఆసమయంబున.

304


ఉ.

భూపతిసమ్ముఖంబునకుఁ బోయి కరాంబుజము ల్మొగిడ్చి వి
జ్ఞాపన సేసె నారసికసంఘము మెల్లన గొంకి కొంకి యి
ష్టాపకరోక్తిఁ జెప్పెడునెడం [17]గడునల్గుట నీతి యౌ ననం
బాపలు మేదినీశ్వరులమానసముల్ దిరిసెంపుఁబూవులున్.

305


తే.

అవధరింపుము నీప్రతాపాతిశయము
గరిమమున నోహటించియో కాని వహ్ని
కాశికాపట్టణము నైదుక్రోశములును
బదిల మై యుండ నోపక పాఱిపోయె.

306


ఉ.

అంబుజబాంధవాన్వయనృపాగ్రణి! బోనము నేఁడు సూర్యపా
కంబున నాయితం బయినఖజ్యము భోజనశాలలోనఁ బ
ళ్యం బిడినారు పంకజదళాక్షులు రెండవజాముగంట వే(మ్రో)
యంబడె నారగింప సమయం బని యిమ్మెయి విన్నవించినన్.

307

తే.

వేల్పు లొనరించినట్టి దుర్వృత్తి యగుట
నెఱిఁగి యింతియ కాకయొం డేమి? యనుచు
నారగించె దివోదాసుఁ డర్కకిరణ
తాపపక్వంబు లగుపదార్థంబు లెలమి.

308


వ.

భోజనానంతరంబున నాస్థానమధ్యంబునం గొలువుండి దివోదాసుండు వాసవాదులు సేసిన యపకారంబునకుఁ బ్రతిగారంబు సింతించునవసరంబునఁ బౌరజానపదులగు జను లయ్యగ్నితిరోధానంబునకు భయంపడి యమ్మహోత్పాతంబు విన్నవింప నేతెంచిన.

309


ఉ.

అందఱ నాదరించి మిహిరాన్వయముఖ్యుఁడు వారియాత్మ లా
నందముఁ బొంద ని ట్లనియె నాకనివాసులు సేసినట్టికీ
డొందునె నన్ను? మీరు వెఱుకుండుఁడు భూప్రజలార! నేడ
యానందవనంబునందు దహనంబు ఘటించెద యోగసంపదన్.

310


మ.

అనుమానింపక యాసురాధములు మాయాకల్పనావంచనం
బున వైశ్వానరునిన్ హరించిరి యవుంబో! యింతమాత్రంబులో
నన నాయోగమహానుభావమునకున్ భంగంబ వాటిల్లునే!
సనెక ల్దాఁచినఁ బెండ్లి మానునొకొ! దుశ్చారిత్రము ల్గంటిరే!

311


సీ.

దహనస్వరూపంబుఁ దాల్చి యేఁ గైకొందు
        హవ్యకవ్యాహతు లధ్వరములఁ
బర్జన్యమూర్తిఁ జేపట్టి యే వర్షింతు
        సలిలధారలు సస్యములు ఫలింప
శశిదివాకరులవేషంబులుఁ దాల్చి యే
        ఖండింతు గాఢాంధకారపటలిఁ

బవసునాకారంబు భరియించి యేను బ్రా
ణ్యంతబ్బహిర్వ్యాప్తి నాచరింతు


తే.

వేల్పులందఱు నేన యై వివిధగతుల
విశ్వలోకంబు రక్షింతు వేయు నేల?
యింక నౌదాని నిట నేన యేలువాఁడ
నాగలోకంబు నాకంబు యోగశక్తి.

312


వ.

అని యోగవిద్యాబలంబున సర్వదేవతామయుండై దివోదాసుండు రాజ్యంబు సేయుచుండె. అంత నటఁ బరమేశ్వరుండు మంచరాచలంబునం దధివసించి కాశీనగరవియోగవేదనాదూయమానమానసుండై తత్సమాగమోపాయంబుఁ జింతించుచుండె నప్పుడు.

313


తే.

అభవుఁ డిందుకళాధరుఁ డయ్యు నమర
వాహినీధరుఁ డయ్యు దుర్వార మైన
కాశికావిప్రయోగాభిఘాతజనిత
తాపభారంబు సైరింప నోపఁడయ్యె.

314


ఈశ్వరుండు యోగినులం గాశి కంపుట

వ.

అంత నొక్కనాఁ డద్దేవుండు గజానన, సింహముఖి, గృధ్రాస్య, కాకతుండిక, ఉష్ట్రగ్రీవ, హయగ్రీవ, వారాహి, శరభానన, యవికేశి, శివారావ, మయూరి, వికటానన, అష్టవక్ర, కోటరాక్షి, కుబ్జ, వికటలోచన, శుష్కోదరి, లలజ్జిహ్వ, దంష్ట్రోగ్ర, వానరానన, ముక్తాక్షి, కేకరాక్షి, బృహత్తుండ, సురాప్రియ, కపాలహస్త, రక్తాక్షి, శుకి, శ్యేని, కపోతిక, పాళహస్త, దండహస్త, ప్రచండ, చండవిక్రమ, శిశుఘ్ని, పాకహంత్రి, కాలి, రుధిరసాయిని, వసాధయ, గర్బభక్ష,

శవహస్త, అంత్రమాలిని, స్థూలకేశి, బృహత్కుక్షి, సర్పాస్య, ప్రేతవాహన, దందశూకకర, క్రౌంచి, మృగశీర్ష, వృషానన, యాంత్రశ్యామ, ధూమనిశ్శ్వాస, వ్యోమకచరణ, ఊర్ధ్వదృశ, తాపని, శోషణి, వృకోదరి, స్థూలనాసిక, విద్యుత్ప్రభ, బలాకాస్య, మార్జారి, కటపూతన, అరిష్టాహాస, కామాక్షి యను నీచతుష్షష్టియోగినుల రావించి మీరు నానాప్రకారమాయావేషచేష్టావిదానంబులం గాశికానగరంబునం బుణ్యస్త్రీలపాతివ్రత్యంబులు, పురుషులయాచారంబులు చెఱుచునది. వర్ణాశ్రమంబులు నిజధర్మంబున వర్తింపకున్న దివోదాసుండు రాజ్యపదభ్రంశంబు నొందెడు. అప్పుడు గాని మాకుఁ గాశీసమాగమంబు సిద్ధింపదు. అనిన వారును మహాప్రసాదం బని.

315


సీ.

పుష్పలావిక యోర్తు బూమెకత్తియ యోర్తు
        గంధవాహిని యోర్తొకర్తు లంజె
హస్తాంఘ్రిరేఖాసమాలోకనక్రియా
        సాముద్రికజ్ఞానచతుర యోర్తు
సలిలాగ్నివాగ్వయస్స్తంభవిద్యాకళా
        ప్రావీణ్య యోర్తు సైరంధ్రి యోర్తు
మాచకమ్మ యొకర్తు మంత్రవాదిని యోర్తు
        రంగవల్లికచిత్రరచననిపుణ


తే.

చదువఁ బాడంగ నాడంగ సరస మాడఁ
గథలు సెప్పంగ (నటియింప) నద్గింపఁ గన్ను లార్ప
వీణ వాయింపఁ బొగడంగ విరులు గట్ట
నేర్చునట్టిది యోర్తు సన్నియత యోర్తు.

316

వ.

ఇవ్విధంబుల నానారూపవిధంబులు గైకొని వారణాసికిం జని రనంతరంబ.

317


ఈశ్వరుండు సూర్యునిం గాశి కంపుట

తే.

మనసిజారాతి సిద్ధయోగినులఁ బంపి
యూరడిలి యుండఁ జాలక యుష్ణకరుని
ననిచెఁ గాశికానగరివృత్తాంత మరయఁ
గౌతుకము కాలయాపనాక్షమము గాదు.

318


సీ.

పురివైరి రవిఁ గాశిపురి కన్పునప్పు డే
        కాంతంబు సేసి య ట్లనుచుఁ బలి రే
వాసరాధిప! దివోదాసు ధరాత్ముని
        నేయుపాయంబుననేని ధర్మ
విముఖుఁ గావింపుము విడియంగ నాడకు
        ధర్మమార్గైకతత్పరత నతని
మన మాదరింపకుండిన ధర్మ మెబ్భంగి
        నభివృద్ధి బొందుఁ? గా నగునయంబు


తే.

[18]దప్పకుండంగ నేదేని తప్పుటొఱపు
మత్సరాహంకృతులను గామమునఁ గ్రోధ
మోహములఁ బ్రత్యవాయంబు మోపఁదలఁచి
తప్పు లేకయ శిక్షింపఁ దగవు గాదు.

319

తే.

కదలకుండును మది నెంతకాలమేని
ధర్మమతిసుకరం బయి కర్మసాక్షి!
యంతగాలము నరునకు నావహిల్ల
దేయపాయంబు సూక్ష్మ మెఱిఁగికొనుము.

320


వ.

అని చెప్పినం బ్రసాదం బని శివాజ్ఞ శిరంబున వహించి రవి కాశీపురంబున కరిగి యొక్కొక్కమాటు యాచకుం, డొక్కొక్కమాటు దూత, యొక్కొక్కమాటు వదాన్యుఁ, డొక్కొక్కమాటు దీనుం, డొక్కొక్కమాటు గార్తాంతికుం, డొక్కొక్కమాటు దృష్టప్రత్యయవాది, యొక్కొక్కమాటు జటిలుం, డొక్కొక్కమాటు దిగంబరుం, డొక్కొక్కమాటు జాంగలికుం, డొక్కొక్కమాటు పాషండుం, డొక్కొక్కమాటు బ్రహ్మచారి,యొక్కొక్కమాటు గృహి, యొక్కొక్కమాటు వాసప్రస్థుం, డొక్కొక్కమాటు యతి యై నానాప్రకారవేషభాషాచేష్టాయంత్రమంత్రతంత్రమాయాప్రయోగబలంబున.

321


తే.

ఇన్ని విధముల జనియించిన యినుఁడు గాశి
ప్రణము గానంగ లేఁ డయ్యె రాజునందు
నవకరంబు మహీపాలునంద యేల?
కనఁగ లేఁ డయ్యె నొకపృథగ్జనునియందు.

322


వ.

ఇట్లు విఫలప్రయత్నుం డయి యినుండు నిజాంతర్గతంబున.

323


సీ.

కార్యంబు నిష్పత్తిగతికి రాకుండంగ
        మందరంబున కెట్లు మఱలిపోదు?
ఆదె వచ్చె యిదె వచ్చె నని నా కెదురుచూచు
        నీశు నీక్షింతు నే నేమొగమునఁ?

బతియాజ్ఞ నిర్వహింపక కాని దేవతా
        ప్రమథులం దే నెట్లు ప్రభుతఁ గాంతు?
నొచ్చెంబు ధరియించి యొదిగి యుండక యెట్లు
        నిటలలోచనుమ్రోల నిలుచువాఁడఁ


తే.

గనలియున్నాఁడు నేఁ డెల్లి కాశివిరహ
వేదనాభారమున వేఁగి వేఁగి భర్గుఁ
డడ్డపడువారె యొరు లతఁ డలిగినపుడు?
గాన నిచటన కాలంబు గడపువాఁడు.

324


వ.

హరిశ్చంద్రశిబిదధీచిప్రముఖు లగుపెద్దలుం గాశీసంసేవనంబున సంసారదుఃఖంబులు ద్యజించి రని ప్రభావజ్ఞుం డగుభాస్కరుండు లోలార్కుం డన, నుత్తరార్కుం డన, సాంబాదిత్యుం డన, గరుడాదిత్యుం డన, మయూరాదిత్యుం డన, [19]ఖఖోల్కాదిత్యుం డన, వరుణాదిత్యుం డన, వృద్ధాదిత్యుం డన, కేశవాదిత్యుం డన, విమలాదిత్యుం డన, గంగాదిత్యుం డన, యామాదిత్యుం డనఁ బండ్రెండుమూర్తులు వహించి కాశీపురంబునం దధివసించె. కాశీవాసనిమిత్తంబు గా మనంబు లోలంబగుట లోలార్కుం డయ్యె. క్రమంబున నీ యాదిత్యులప్రభావం బభివర్ణించెద నాకర్ణింపుము.

325


ఉత్తరార్క ప్రభావవర్ణన

సీ.

కాశీపురికి నుత్తరాశాప్రదేశంబు
        నందు నుండుట నుత్తరార్కుఁ డయ్యె
నితిహాస మొకటి యయ్యినునిమాహాత్మ్యంబు
        సంప్రకాశ మొనర్పఁజాలెడునది

వినిపింతు విను కాశి విప్రుఁడొక్కఁడు సదా
        చారసంపన్నుఁడు శాంతిశాలి
యతిథిప్రియుఁడు ప్రియవ్రతుఁ డను పేరివాఁ
        డతనిభార్య శుభవ్రతాభిధాన


తే.

దంపతులు వారి కుదయించెఁ దనయ యోర్తు
మూలనక్షత్రమునయందు మొదటి కాలఁ
గేంద్రమున నాంగిరసుఁ డుండఁ జంద్రవదన
బాల వర్ధిల్లె రూపసంపదయుఁ దాను.

326


తే.

దాని పేరు సులక్షణ మౌనివర్య!
సర్వలక్షణసౌభాగ్య జన్మభూమి
బాల యంతంత వర్ధిల్లె బ్రతిదినంబు
జింత తండ్రికి వర్ధిల్లె నంత కంత.

327


తే.

తగినవరుఁ డెవ్వఁ డొక్కొ యీతలిరుఁబోఁడి
కనుగుణుం డెవ్వఁ డొకొ విశుద్ధాభిజాత్య
పరమసౌభాగ్యభాగ్యసంపదల కనుచు
నిత్యమును దండ్రి యాత్మఁ జింతించుచుండు.

328


తే.

మూలనక్షత్రమునయందు మొదలికాలఁ
గన్య గండానఁ బుట్టినకారణమున్న
గర్మఠుండు విప్రుఁ డానందకాననమునఁ
జచ్చెఁ జింతాజ్వరముపైన జ్వరము దాఁకి.

329


వ.

శుభవ్రతయునుం బతి ననుగమించె నంత సులక్షణదుఃఖావేశ యయ్యును ధీరోదాత్త గావునఁ దాత్పర్యంబునం దలిదండ్రుల కౌర్థ్వదైహికవిధులు నిర్వర్తించి నిజాంతర్గతంబున.

330

సీ.

ప్రాణంబు ప్రాణంబు లగుతల్లిదండ్రుల
        హృదయంబులోన నే నెట్టు మఱతుఁ?
బితృమాతృహీన నై యతిశోచ్యవృత్తి మై
        నెబ్భంగి నీదుదు నీభవాబ్ది?
నేల కల్పించ నా కీరూపలావణ్య
        సౌభాగ్యసంపద జలజభవుఁడు?
కులశీలరూపాదిగుణములు వీక్షించి
        యెవ్వారి కీ నేర్తు నేన నన్ను?


తే.

ననుచు నిర్వేదమునఁ బొందె నలరుఁబోఁడి
పురుషు నెవ్వనిఁ జిత్తంబు చొరఁగ నీక
బ్రహచర్యవ్రతస్థితి బదిలపఱిచి
యుత్తరార్కునికడఁ జేసె నుగ్రతతపము.[20]

331


ఉ.

నిత్యము నిష్ఠతోడ ధరణీసురకన్యక కాశి నుత్తరా
దిత్యునిపార్శ్వభాగమునఁ దీవ్రతవం బొనరింప వచ్చి సాం
గత్యము చేసెఁ గూర్మి చెలికత్తియకైవడి నొక్కమేఁక సం
ప్రీత్యనులబ్ధి నంగనయుఁ బ్రేమ మొనర్చుచు నుండె దానిపైన్.

332


తే.

రాత్రి దూర్వాప్రవాళ చర్వణ మొనర్చి
యుత్తరాదిత్యకుండిక నుదక మాని
పగలు నాల్జాలు సేవించుఁ బద్మనయన
వత్సలత మీఱ [21]నలవోక వయసుమేఁక.

333

వ.

[22]అంతఁ బెద్దకాలంబున నీలలోహితుం[23]డు ప్రత్యక్షం బై వరంబు వేఁడు మనిన సులక్షణ యవ్విరూపాక్షునకుఁ బ్రణమిల్లి వినయంబున ని ట్లనియె.

334


తే.

మీనకేతనదమన! యీమేఁకపిల్ల
ప్రాణసఖివోలె నాయొద్దఁ బాయకుండు
శర్వ! యీనోరుమాలినజంతువునకు
మొదలు వర మిమ్ము వర మిమ్ము తుదకు నాకు.

335


వ.

అనిన విని శంకరుండు కరుణాతరంగితాంగీకారం బైనకటాక్షవీక్షణాంకురంబునం గురంగాక్షిం గనుంగొని గౌరీహృదయానురోధంబున బర్కరి యన్యజన్మంబునం గాశీరాజుపట్టపుదేవికిం గూఁతురై పుట్టునట్లుగా వరం బోసంగె. బర్కరిపేర నయ్యుత్తరాదిత్యకుండంబు బర్కరీకుండం బనంబరఁగె. గుణానురాగిణి యైనగౌరి సులక్షణఁ దనకుం జెలికత్తియంగాఁ గైకొని జయ, విజయ, జయంతిక, శుభానంద, సునంద, కౌముది, యూర్మిళ, చంపకమాల, మలయవాసిని, కర్పూరతిలక, గంధధార, శుభ, అశోక, విశోక, కమలగంధి, చంచననిశ్శ్వాస, మృగమదోత్తమ, కోకిలాలాప, మధురభాషిణి, గద్యపద్యనిధి, యనుక్తజ్ఞ మొదలయిన చెలికత్తియలనుం బోలె నబ్బాలబ్రహ్మచారిణి యైన యయ్యలివేణి నాదరించె. ఇది యుత్తరార్కుమాహాత్మ్యం బనుటయు నైమిశారణ్యనివాసులు మహాత్మా! యింకనుం గాశికానగరపంచక్రోశపుణ్యక్షేత్రంబునం గలదేవతాస్థానం

బులు, పుణ్యతీర్థంబులు వివరించి మముం గృతార్థులం జేయు మనుటయు.

336


ఆశ్వాసాంతము

శా.

ధారాపట్టణసార్వభౌమ [24]సురధాణ్దర్పాపహారక్రియా
ధౌరంధర్యపటిష్టనిష్ఠురభుజాదంభోళిసంరంభ! దా
క్షారామప్రమదాకటాక్షలహరీవ్యాపారనీరాజితా
కారశ్రీజితమత్స్యకేతన! సమిద్గాండీవబాణాసనా!

337


క.

వేంగీవిషయాధీశ్వర !
సంగరగంగాతనూజ! సాహిత్యకళా
సంగీతలక్ష్యలక్షణ
భంగీసర్వజ్ఞ! విమలపాండిత్యనిధీ!

338


మాలిని.

చతురుదధిచతుర్దిక్సౌధవీథీవిటంకా
ప్రతినవబహుముక్తారంగవల్లీమతల్లీ
ప్రతిమవిమలకీర్తీ! పంచనారాచమూర్తీ!
వితరణసురభూజా వేమమాంబాతమాజా!

339


గద్య.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతం బైనకాశీఖండం బనుమహాకావ్యంబునందుఁ బంచమాశ్వాసము.

  1. కుండలీకృతభాగ మొకమాతృకలో మాత్రము లేదు. పెక్కు మాతృకలం దున్నను నధికపాఠముగా గ్రహింపఁబడియున్నది.
  2. జనియె. నిటవైశ్యుండును అస్థియుం గిరాతునిం గానక అగ్గి దాఁక
  3. పరాత్మపరామర్శ; పరామర్శవివేకంబు
  4. పురుషుఁ డలసలీల
  5. అన్ని మాతృకలందు ‘పట్టి’ యనియే యున్నది. ‘కర్త్రీకర్పరహస్తాగ్రాం’ అని సంస్కృతమూలము, పట్టిశబ్దము కర్పరవాచక మగుట విచార్యము.
  6. ఈరెండును మద్రాస్ ఓరియంటలు లైబ్రరీ ప్రతిలోఁ గనుపట్టుచున్నవి.
  7. అన్నిమాతృకలలో 'ముష్టాముష్టిన్' యని యున్నను 'ముష్టీముష్టి' సరిరూపము.
  8. రేంధనకాండప్రకాండఖండం
  9. ఇది మూలాతిరిక్తవిరుద్ధముగా నున్నది. ‘త్రిఃపీత్వాంబువిశుద్ధర్థం తతఃఖాని విశోధయేత్, అంగుష్ఠమూలదేశేన ద్విర్ద్విరోష్ఠాధరౌస్పృశేత్.’ అని మూలము.
  10. ప్రణవత్రివారజపం బొండె
  11. కాదు సాధకుఁ డష్టాంగకర్మఫలము
  12. కుష్ఠక్షయాపస్మారాదిరోగోపద్రవవిద్రావణంబులు
  13. ౦బునధికమ్మట మీఁదట
  14. ఘ్రాణ, ళాఱొక్క
  15. శాతరుద్రా
  16. 'వరిబియ్యం బెడ యొల్కి వీడును; వరు జయ్యెం బెద యొల్కి'
    అనియుఁ గొన్నిప్రతులతోఁ గనఁబడుచున్నవి. ఈ పాఠములు చింత్యములు.
  17. 'గడునజ్ఞులనీతియోపనం, బ్రాపలు' అని ముద్రితపుస్తకపాఠము. ఈ రెండు పాఠములు జింత్యములు.
  18. ఇచట ‘తప్పకుండదు నెడనొక్క తప్పువెఱపు’ అని యచ్చుప్రతిలోను, ‘తప్పకుండ నెందే నొక తప్పువెఱపు’ అని యొకవ్రాఁతప్రతిలోను, ‘తప్పకుండంగ నేదేని తప్పుటొఱపు’ అని కొన్నివ్రాఁతప్రతులలోను పాఠభేదములు గనఁబడుచున్నవి. ప్రథమపాఠము కేవల మపభ్రంశముగ నున్నది. తక్కిన పాఠములఁ గ్లిష్టార్థకల్పన చేయఁదగియున్నది. దోషజ్ఞులు ప్రమాణము.
  19. ఘషోల్కా, ఖట్వా
  20. 331-వ పద్యమునకుఁ దరువాత కొన్నిప్రతులలో ‘వ. ఇవ్విధంబున దపంబు సేయుచు నక్కన్యకారత్నంబు’ అని యొకవచనము గనఁబడుచున్నది.
  21. ‘నెలమ్రోఁక’ అని ముద్రితప్రతి
  22. ఇవ్విధంబున నుండ నంత గొంతకాలంబునకు
  23. డక్కన్యకామణి సన్నిధికిం
  24. సురరాట్దర్పా