Jump to content

కాశీఖండము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

చతుర్థాశ్వాసము


శ్రీకంఠచరణసేవా
వైకుంఠ! యకుంఠశౌర్యవైభవ! లోకా
లోకగిరిప్రాచీన
క్ష్మాకల్పయశఃప్రసార! యల్లయవీరా!

1


వ.

అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె. నంతఁ గొంతకాలంబునకు.

2


వైశాననరజననము

క.

నెల మసలె నిందువదనకు
జలజాక్షికి నల్ల నయ్యెఁ జన్నులముక్కుల్
తలిరుంబోఁడికి నలినీ
దళపాండువు లయ్యె గండదర్పణతలముల్.

3


గీ.

గర్భగోళస్థితుం డైనకాలకంఠు
కంఠహాలహలచ్ఛాయకాళిమంబు
నాభిబిలమున వెడలి కన్పట్టినట్లు
కమలపత్రేక్షణకు నారు గారుకొనియె.

4


సీ.

సరసిజానన యహర్విరతి సంధ్యాకాల
        మానందతాండవ మాడఁదలఁచె

జంతుకోటికి ముముక్షావేళఁ గాశిలో
        నోంకార మాన తీ నువిద గోరెఁ
బసిఁడికమ్ములతోడి పచ్చియేనికతోలు
        పచ్చడంబు ధరింప భామ తివిరె
నతివ యువ్విళ్ళూరె నారకూటపిశంగ
        మకుటాగ్రమునఁ జందమామఁ దుఱుమ


గీ.

ముదిత కాంక్షించె నేనికమోముకొడుకు
నంకపీఠమునం దుంచి యాదరింప
నహరహంబును గర్భంబునందుఁ బెరగు
కాలకంఠుని యనుభావగౌరవమున.

5


వ.

వెండియు.

6


శా.

ఆచంద్రానన యధ్వరంబులం బురోడాశంబుతో మంత్రస
ధీచీనంబుగ యాయజూకులు సమర్పింపంగ నాజ్యాహుతుల్
ప్రాచుర్యస్థితి నారగింపఁ దలఁచున్ బ్రాగ్వంశమధ్యంబునన్
శోచిష్కేశుఁడు గర్భగోళమునఁ దొల్చూ లున్నతిం బొందఁగాన్.

7


వ.

అనంతరంబ యాహంసగమనకుఁ బుంసవనసీమంతంబులు గృహ్యోక్తప్రకారంబున నిర్వర్తించిన.

8


మ.

నవమాసంబులు నిండఁగా గురుఁడు కేంద్రస్థాయియై యుండఁగా
శివలగ్నంబున నుద్భవించె సుతుఁ డర్చిష్మంతునంశంబునన్
ధవళాంభోరుహపత్రనేత్రకవిముకస్థానవిశ్వేశ శం
భ్వవతారాంతక మప్రధృష్యతరదివ్యాకారతేజంబునన్.

9


వ.

అప్పుడు గంధవాహంబులు దివ్యగంధంబులు వహించె. ఘనాఘనంబులు పుష్పవర్షంబులు గురిసె. దేవదుందుభులు మొరసె. దిఙ్ముఖంబులు ప్రసన్నంబు లయ్యె. వాహినులు

విమలసలిలప్రవాహంబు లయ్యె. సకలభూతంబులమనంబులు తెలివొందె. విద్యాధరయక్షగంధర్వులు వసిష్ఠవాలఖిల్యాదిమునులు బ్రహ్మవిష్ణుమహేశ్వరులుఁ గుమారావలోకనకౌతూహలాయత్తచిత్తు లయి యేఁగుదెంచి. రాసమయంబున.

10


క.

ద్రుహిణుండు కైటభారియు
నహికటకుఁడు గూడి యిచ్చి రక్కొడుకునకున్
గృహపతి యనియెడునామము
మహనీయకృపావిధేయమానసు లగుచున్.

11


వ.

పదునొకండవదినంబున నామకరణంబు గల్పించి వేల్పులు చన్నపిమ్మట గురుజనంబులు క్రమంబున.

12


సీ.

గృహనిష్క్రమంబు సాగించిరి నాల్గవ
        మాసంబునందుఁ గుమారునకును
వత్సరార్ధమునందు వాలాయముగఁ జేసి
        రన్నసంప్రాశనం బర్భకునకు
నంతఁ జూడాకర్మ మాచరించిరి బిడ్డ
        నికి గృహ్యసంప్రోక్తనియమపరతఁ
దఱితోడఁ గర్ణవేధంబు గల్పించి
        శ్రవణర్క్షమున నాత్మసంభవునకు


గీ.

బ్రహ్మతేజోభివృద్ధికై పంచమాబ్ద
వేళ సల్పి రుపాకర్మవిధి సుతునకుఁ
జదువఁ బెట్టిరి వేదంబు పదముఁ గ్రమము
సాంగముగ బాలకుని నుపాధ్యాయునొద్ద.

13


వ.

అంత నొక్కనాఁడు నారదుండు యదృచ్ఛాగతుండై యతిథి

సత్కారంబు వడసి తనకు నమస్కరించిన గృహపతిం గనుంగొని దంపతుల కి ట్లనియె.

14


గీ.

ఓయి! విశ్వానరుండ! విశ్వోపకారి!
యోశుచిష్మతి ! పరమపుణ్యోజ్జ్వలాత్మ!
బాలుఁ డీతండు మీమీఁద భక్తి గలఁడె?
చేయునా వీఁడు సులభుఁడై చెప్పినట్లు?

15


గీ.

తల్లిదండ్రులయాజ్ఞ యధిఃకరింప
కుండుటయ చూవె! ధర్మ మత్యుత్తమంబు
దైవ మనఁగ గురుండు నా ధర్మ మనఁగ
నర్థ మనఁ దల్లిదండ్రులె యాత్మజునకు.

16


క.

జననీజనకులఁ గొలుచుట
తనయునకును ముఖ్యమైనధర్మము జననీ
జనకులఁ గొల్చుటకంటెను
దనయున కభ్యధిక మైనధర్మము గలదే?

17


సీ.

సవదరించుట యెట్లు జఠరగోళమునందు
        నవమమాసావసానంబు దాఁక?
వ్రేఁక మైన ప్రసూతివేళాసముద్భూత
        సంకటం బోర్వంగఁ జాలు టెట్లు?
కుత్సింపకుం టెట్ము లుత్సర్గవిణ్మూత్ర
        లాలాద్రవశ్లేష్మజాలమునకు?
నందంద వక్షోరుహంబు లింపులు వోవ
        దొడుకనిచ్చుట యెట్టు దుగ్ధరసము?


గీ.

పంచకరపాట్లు పడి తన్నుఁ బెంచి పిశికి
యాపదలఁ బాప రక్షించినట్టితల్లి

దేవతాబుద్ధి వాటించి తెలియవలయుఁ
గొడుకు వంశాభిసంవృద్ధి కొనలు సాఁగ.

18


క.

రేపాడిఁ గొడుకు జననీ
శ్రీపాదములకు నమస్కరింపఁగఁ దగుఁ ద
చ్ఛ్రీపాదక్షాళనసలి
లాపోశనమునను సుతున కాయుష్య మగున్.

19


గీ.

సర్వతీర్థాంబువులకంటె సమధికంబు
పావనం బైనజనయిత్రిపాదజలము
వరతనూజున కఖిలదేవతలకంటె
జనని యెక్కుడు సన్నుతాచారనిరత!

20


వ.

అని నారదుండు గృహపతిం జూచి యన్న! వైశ్వానర! ఇటు రమ్మని చేరం బిలిచి తొడలమీఁదఁ గూర్చుండ నిడుకొని దక్షిణహస్తంబు చూచి లక్షణంబులు పరిక్షించి యంతం బోవక.

21


సీ.

ఆపాదమస్తకం బంగకములు నుపాం
        గకములుఁ బ్రత్యంగకములు వరుసఁ
దను వైనకార్పాసతంతుసూత్రంబునఁ
        గుంకుమాక్తంబునఁ గొలిచి కొలిచి
తప్ప కయ్యయి చోట్లు దర్శించి దర్శించి
        యంగుళీముఖముల నంటి యంటి
నడపించి నిలిచియుండఁగఁ బెట్టి కూర్చుండ
        నియమించి పరికించి నిశ్చయించె


గీ.

లక్షణములు శుభాశుభాలంబనంబు
లంబురుహసూతిసుతుఁడు సంయమివరుండు

సకలసాముద్రికాగమజ్ఞానశాలి
నారదుఁడు సర్వవిద్యావిశారదుండు.

22


వ.

ఇట్లు నిశ్చయించి.

23


గీ.

తిర్యగూర్ధ్వంబు గొలువంగ దేహయష్టి
యెవ్వనికి వ్రేళ్లు నూఱును నెనిమిదియును
మానముక వాఁడు ధరణిసామ్రాజ్యపట్ట
బద్ధయోగ్యుఁడు భాగ్యవైభవముకలిమి.

24


గీ.

ముక్కు భుజములు లోచనంబులును జాను
హనువులును నైదుదీర్ఘంబు లగుట మేలు
మెడయు జంఘాయుగంబును మేహనంబు
హ్రస్వములు గాఁగ వలయు భాగ్యాన్వితునకు.

25


గీ.

నాభిరంధ్రంబు సప్తకంఠస్వరములు
మూఁడు నత్యంతగంభీరముగను వలయు
నంగుళీదేశజత్రు త్వగంఘ్రిగుల్భ
పంచకము సూక్ష్మమై యుండు భాగ్యనిధికి.

26


గీ.

కరములును గుక్షియును గటిస్కంధములును
ఫాలమును మోము నున్నతి వడయవలయు
హస్తరేఖాదృగంత జిహ్వాధరోష్ఠ
తాలునఖములు గెం పైన తథ్యచరిత.

27


క.

కటియు వక్షఃస్థలంబును నిటలతటము
విస్తృతము లెవ్వనికి వాఁడు విభుతఁ గాంచుఁ
బదము గోమల మయ్యును బాణి కఠిన
మయ్యు నైశ్వర్య మొసఁగు మహానుభావ!

28

గీ.

తాల్చు నెవ్వఁడు భ్రూలతాంతరమునందు
వర్తులం బైనదక్షిణావర్తరేఖ
యాతఁ డేకాతపత్త్ర మౌనట్లుగాఁగ
ధరణిరాజ్యంబుఁ బాలించు ధన్యచరిత!

29


క.

కమలోదకారుణములై
సమగుల్భములై మృదుత్వసంయుక్తములై
విమలారుణనఖరములై
చెమరించనియడుగు లొసఁగు సిరి మనుజునకున్.

30


సీ.

లింగంబు గృశ మైన లెస్స మూత్రము దక్షి
        ణావర్తవిస్సృతం బైన మేలు
మధుగంధ మైనను మత్స్యగంధం బైన
        నింద్రియంబు శుభంబు నీగఁ జాలుఁ
గంఠనినాదంబు గ్రౌంచదుందుభిఘోష
        గంభీర మగుట సౌఖ్యప్రదంబు
చక్షుఃకనీనిక సఘామధుచ్ఛాయఁ
        బింగళం బై యిచ్చు మంగళంబు


గీ.

నైదురేఖలనొసలివాఁ డాయిరితుఁడు
భాగ్యనిధి ముప్పదియు రెండుపండ్లవాఁడు
కంబునిభ మైనమెడవాఁ డఖండకీర్తి
నూర్ధ్వరేఖలపదమువాఁ డుత్తముండు.

31


గీ.

హస్త మిఱియించి పట్టినయపుడు కదిసి
యంగుళులు రంధ్రహీనంబు లయ్యె నేని
నతనిఁ గల్యాణలక్షణాన్వితునిఁ గాఁగఁ
జెప్పు సాముద్రికజ్ఞానసిద్ధబుద్ధి.

32

వ.

ఏమి జెప్పినయీభాగ్యలక్షణంబు లెన్ని గల వన్నియు నిక్కుమారునియందు సంపన్నంబు లై యున్నయవి.

33


గీ.

ఇన్నిగుణములు గలిగినయేని వరున
కన్నిగుణములు నౌ బల మవయవంబు
లకట! యత్యంతనిర్దయుం డగువిధాత
యచ్చలమునఁ బరాఙ్ముఖుం డయ్యెనేని.

34


గీ.

చెప్ప నో..డ దేమని చెప్పువాఁడ?
నెఱిఁగినర్థంబు చెప్పక యెట్లు దాతుఁ
బదియు రెండవయేఁట నీబాలకునకు
గండ మొక్కటి దంభోళికారణమున.

35


వ.

అని చెప్పి నాదుం డరిగిన శుచిష్మతియు విశ్వానరుండు నశనిపాతాదారుణం బైనయమ్మునిభాషితంబునకు భయం బంది హాహాకారం బొనర్చి మూర్ఛాంధకారంబున మునింగి యెట్టకేలకుఁ దెలిసి బహుప్రకారంబుల విలపించుచుండి రాసమయంబున దల్లిదండ్రులకు వైశ్వానరుం డి ట్లనియె.

36


సీ.

ఓయమ్మ! యేలమ్మ యుపతాప మందెద!
        వోతండ్రి! యేలయ్య! భీతిఁ బొందె?
దస్మన్నిమిత్తమె యకట! మీశ్రీచర
        ణాంభోజధూళి నా కహరహంబు
సర్వాంగ రక్షమై సంధిల్లుచుండంగ
        మృత్యు వెబ్బంగి నా మీఁదఁ గవయుఁ
గవిసెనేనిఁ గఠోరకంఠహుంకారంబు
        పొనరించి మీయాన యొడుచువాఁడ


గీ.

నానయును ద్రోచి వచ్చిన నాగ్రహమున

దీర్ఘనిర్ఘాతసంపాతనిర్ఘృణోగ్ర
కఠినతరవామపదపార్ష్ణిఘట్టనమున
దానిపండులు రాలంగఁ దన్నువాఁడ.

37


మ.

వినుఁడీ నాదుప్రతిజ్ఞ మీరు హృదయోద్వేగంబు వర్జించి యో
జనయిత్రీ జనకుల్! భనదనుజ్ఞాముద్ర చేపట్టి యేఁ
జని కాశీపతి విశ్వనాయకు శివుం జంద్రార్ధచూడావతం
సుని మృత్యుంజయు నాశ్రయించి విగతాసున్ జేసెదన్ మృత్యువున్.

38


వ.

అనిన విని దంపతు లపయోధరంబైనవర్షంబును, నదుగ్ధాబ్ధియైన సుధోదయంబును, ననిందుబింబం బైనచంద్రికాలోకంబును నైనయామాటకుఁ బరితోషంబు నొంది యెట్టెట్టూ యని క్రమ్మఱ నడుగుచు సుతున కి ట్లనిరి.

39


సీ.

కావఁడే యాభీలకాలపాశనిబద్ధు
        శ్వేతకేతునిఁ బ్రాణవిగమభీతు?
రక్షింపఁడే కాళరాత్రిపా ల్పడకుండ
        నెనిమిదేఁడులశిలాదుని తనూజుఁ?
బాలింపఁడే విష్టపంబు లీరేడును
        గాలకూటాగ్ని చేఁ గాలకుండ?
మనుపఁడే యాయుఃప్రమాణంబు నిండిన
        గారుణ్యబుద్ధి మృకండుతనయు?


గీ.

నంధకాసురవ్యాఘ్రజలంధరేభ
దక్షమఘపుష్పశరపురధ్వంసనునకు
విశ్వభర్తకుఁ గాశికాధీశ్వరునకు
నిందుమౌళికి నినుఁ గాఁచు టెంతభరము.

40

వ.

అని శుచిష్మతియు విశ్వానరుండును గొడుకు నాశీర్వదించి యనిచిన నతండును గాశి కరిగి మణికర్ణికాతీర్థ మాడి విశ్వనాథు దర్శించి తద్దివ్యజ్యోతిర్లింగంబుఁ గనుఁగొని పరమానందకందం బనియును, బిండభూతంబైన త్రైలోక్యసారసర్వస్వం బనియును, దుగ్ధాబ్ధిసముద్భవం బగుసుధాపిండం బనియును, స్వాత్మావబోధపాదపంబునకుఁ బ్రథమాంకురం బనియును, బ్రహ్మరసాయనం బనియును, లింగకైతవంబున నాకారంబు భజించిన యనాకార(త)త్త్వం బనియును, నానారత్న(ప్ర)పూరితం బైనబ్రహ్మాండభాండం బనియును, మోక్షవృక్షఫలం బనియును, బుష్పగర్భం బైననిర్వాణలక్ష్మీకేశపాశం బనియును, గైవల్యమల్లీవల్లీమతల్లిస్తబకం బనియును, (నిశ్శ్రేయసశ్రీకరక్రీడాకందుకం బనియును,) నపవర్గోదయాద్రిసుధాకరబింబం బనియును, సంసారమోహవ్యూహగాఢాంధకారవిధ్వంసనబ్రధ్నమండలం బనియును, (నమృతకళ్యాణశ్రేణిరమణీశృంగారలీలాదర్పణం బనియును) భావించి భావించి వితర్కించి వితర్కించి నమస్కరించి యొక్కపుణ్యాశ్రమంబు చేసికొని శుభవాసరంబున లింగసంస్థాపనంబు చేసి తత్సమీపంబున వత్సరద్వయంబు ఘోరం బైనతపం బొనర్చె. నంత నొక్కనాఁడు.

41


శా.

ఆవిర్భావము నొందె నిర్జరవిభుండై రావణారూఢుఁడై
యావైశ్వానరుచక్కఁ గట్టెదుర బాహాస్తంభదంభోళియున్
గ్రీవాలంకృతతారహారలతికారింఛోళికేళీసఖ
గ్రైవేయాభరణాభిశోభియును నై కాశీప్రదేశంబునన్.

42

గీ.

జంభదైత్యవిరోధి సాక్షాత్కరించి
వరము వేడుము నీతపోవైభవమున
కనఘ! మెచ్చితి నముచిసూదనుఁడ నేను
నావుడును నాశుచిష్మతీనందనుండు.

43


క.

ఏవరము వేఁడ నిన్నును
దేవేంద్రా! నీకు నా కధీశ్వరుఁ డగుకా
శీవిశ్వనాయకమహా
దేవుని నర్థింతు వర మధికతరభక్తిన్.

44


వ.

అనుటయు.

45


గీ.

శ్రీమహాదేవుఁ డనఁగఁ గాశీపతి యన
విశ్వనాయకుఁ డన నొకవేల్పు గలఁడె?
యేను పాలింతు ద్రైలోక్య మేను నిఖిల
దేవతాచక్రవర్తి సందియము లేదు.

46


క.

నాకంటె నధికుఁ డెవ్వఁడు
లోకత్రయమునను? మనములో విశ్వాస
స్వీకార మేల వదలెద?
వాకాంక్షింపంగ రాదె యభిమతవరముల్?

47


వ.

అనుటయు.

48


క.

ఏలా యీమాటలపని?
పౌలోమీరమణ! నీప్రభావము కంఠే
కాలునిప్రభావమును నీ
త్రైలోక్యం బెఱుఁగు వలదు తగవఱిపలుకుల్.

49


మ.

అడుగ న్నిన్ను వరంబు వేడఁగ నహల్యాజార! విచ్చేయు నా
కుఁడు రాజార్ధవిభూషణుండు వర మీనున్నాఁడు యుష్మాదృశు

ల్బడుగుల్వాంఛిత మీ సమర్థులె! వృథాలాపప్రబంధోక్తులన్
జడివెట్టం బనిలేదు మిన్నక తపశ్చర్యావిరోధంబు గాన్.

50


వ.

అని యుల్లసం బాడినం గటకటం పడి బిదౌజుం డుద్దీర్ణసురాయుధుండును విబుధవిరోధివధూవైధవ్యదీక్షాదానదేశికంబును, నిరధూమధూషకేతుజ్వాలాజాలజటిలంబును నగు
వజ్రంబు గేలం బూని వైశ్వానరుముందఱ ఝళిపించిన.

51


శా.

దంభోళిజ్వలనాభిఘట్టనమునన ధైర్యంబు వోనాడియున్
గంభీరస్థిరభక్తివైభవమునం గాశీపురాధీశ్వరున్
శంభున్ శంకరు నీలలోహితు నుమానాథున విరూపాక్షు వి
స్రంభ బొప్పఁదలంచుచుం ద్విజుఁడు మూర్ఛం బొందెఁ దీవ్రవ్యథన్.

52


వ.

ఆసమయంబున.

53


సీ.

వికటపాటలజటామకుటకోటటిపినద్ధ
        ముగ్ధచంద్రుఁడు జగన్మోహనుండు
గంఠమూలకఠోరకాలకూటకళంక
        కజ్జలుం డర్థార్థికల్పతరువు
కుటిలకుండలిరాజకుండలాలంకార
        మండితుం డానతాఖండలుండు
భసితధూళిచ్ఛటాపాళిసముద్ధూళి
        తాఖిలాంగుండు విశ్వాధికుండు


గీ.

విశ్వనాథుండు గాశికాధీశ్వరుండు
లీలఁ బ్రత్యక్షమై వచ్చి లెమ్ము వత్స!
యనఁగ జైతన్య మంది దిగ్గనఁగ లేచె
శంభుభక్తిపరుండు వైశ్వానరుండు.

54


వ.

ఈశ్వరుండును వైశ్వానరు నాదరించి విశ్వోత్తరం బైన

యాయగ్నిలోకంబున కధీశ్వరునిఁ జేసి యంతర్హితుండయ్యె. గృహపతి పరమేశ్వరానుగ్రహంబున దీర్ఘాయుష్మంతుండును దిక్పతియు నై చరితార్థత్వంబు నొంది నిజవాసంబునకు వచ్చె. ఇది వైశ్వానరువృత్తాంతంబు.

55


నిరృతిలోకవృత్తాంతము

గీ.

అనినఁ బ్రియమంది శివశర్మ యంబుజాక్షు
కింకరుల కిట్టు లనియె నక్షీణభక్తి
నిరృతిలోకంబు మొదలైననిఖిలలోక
ములును జూపుఁ డనుక్రమంబునను నాకు.

56


వ.

వైవస్వతలోకంబు మున్న యెఱింగితి. అటమీఁదిలోకంబు లెఱుంగవలతుం జెప్పరే యనిన వారు మహాత్మా! సంయమనీపురంబున కవ్వల జాతిమాత్రంబున రాక్షసులై యనుజ్ఝిత లయ్యును గతశ్రుతిమార్గులు నపరద్రోహులు దీర్థస్నానపరులు దేవపూజాపరాయణులు దానవయాక్షాంతిదాంత్యస్తేయసత్యాహింసానిరతులు సర్వభోగసములు నై పుణ్యజులకు నివాసం బై నిరృతిలోకం బొప్పుచుండు.

57


గీ.

తీర్థములయందు విధి మూడి తెగినపుణ్యు
లనఘ! యీలోకమున నుందు రాత్మహనన
మొక్క కాశీపురంబునఁ దక్కనొండు
తీర్థములయందుఁ బాపంబు దెచ్చు నండ్రు.

58


వ.

ఈలోకంబున కధీశ్వరుం డైనదిక్పతిచరిత్రంబు చెప్పెదము. సావధానమతి వై యాకర్ణింపుము.

59


సీ.

వింధ్యాద్రినడుమ నిర్వింధ్యాతటంబునఁ
        గానలో నొక్కపక్కణము గలదు

పింగాక్షుఁ డనియెడుపేరివాఁ డావెంట
        బల్లె యేలెడు భిల్లపరివృఢుండు
గ్రూరకర్మపరాఙ్ముఖుం డక్కిరాతుండు
        వ్యాఘ్రాదిదుష్టసత్త్వములఁ దక్క
దండింపఁ డితరసత్త్వముల నేణాదుల
        నాఖేటమార్గంబునంద బ్రతుకు


గీ.

విశ్వసించిన నీరు ద్రావినను నిద్ర
పోయినను జూలుకొన్నను బొర్లుచున్న
దెవులువడ్డను గుందిన ధృతిసెడినను
జంపఁ డనుకంప నెట్టిహింస్రంబు నైన.

60


సీ.

ఫలమూలముల శాకపక్వాశనంబుల
        దధిపయఃక్షౌద్రాజ్యతక్రములను
శిశిరాంబువులఁ దృప్తి సేయ సంబడ మిచ్చుఁ
        బాదరక్షలు నాతపత్త్రములును
దాళవృంతములు వస్త్రములు గోర్పడుములు
        నొసఁగు రోగార్తుల నుపచరించు
దస్కరబాధ నొందక యుండ నెడ వన
        యటవీస్థలంబున ననుపుఁ బెట్టుఁ


గీ.

దీర్థములు పోవువారికి దివసదినస
మటు విశేషించి కాశికి నరుగునట్టి
పుణ్యులకుఁ జేయు సత్కారములు నెరవుగఁ
బింగళాక్షుండు శబరరాట్పుంగవుండు.

61


గీ.

సంతతంబుసు నాశీర్వదింతు రతనిఁ
దీర్థముల కేగువారు సంతృప్తినొంది

యగ్నిహోత్రాంతములను జపాంతములను
భోజనానంతములను దృప్తిపూర్వకముగ.

62


క.

దక్షత నివ్విధమునం బిం
గాక్షుఁడు సతతంబు తీర్థయాత్రాపరులన్
రక్షింప నటవి నగరస
దృక్షం బై యుండెఁ గొన్నిదినములు పేర్మిన్.

63


వ.

అంత నొక్కనాఁ డతనిపితృవ్యుండు దారకుం డనులుబ్ధకుండు తెరువు గట్టి తీర్థయాత్రాపరు లైనకార్పటికుల దోఁచికొనియె. అప్పు డప్పరుసవారు కలంగంబాఱి మొరయునుం గూఁతయునుం బెట్టిరి. నెట్టఁబడిబెట్టిఁ (నిట్టడింబెట్టిఁ) గల్పారంభసమయసముజ్జృంభమాణకపటకిటికైటభారాతికంఠనాళకఠోరఘుర్ఘురధ్వాఘుర్ఘం బైనయానిర్ఘోషం బాకర్ణించి యటమున్న దైవయోగంబునం దోరంపువేఁటకు వెడలి నికటప్రదేశంబున నున్న పింగాక్షుం డుచ్చైస్స్వనంబున నోహో! వెఱవకుండుఁడు. ఏను గలుగంగ మీకు భయం బేల? యని పేరువాడి క్రీడి కురుబలంబులపైఁ గవిసినచందంబునం గవిసి పుంఖానుపుంఖంబుగాఁ దీవ్రమార్గణంబులు నిగుడించి లుంఠ(బ్ధ)కులం దోలియోటు వడకుండ సార్థవాహులం గడపిపుచ్చి విమతశబర(వర)సుభటకఠినతరభుజపరిఘవలయవలయితపృథులధనురుదితనిశితశరశతఖచితసకలశరీరుండై ఏదు పెరిగినచందంబున వీరశయనంబున శయనించి విగతప్రాణుండై పరోపకారపుణ్యానురూపఫలంబున దిగీశ్వరత్వంబు నొంది నిరృతి యయ్యె. అది నికృతిలోకవృత్తాంతంబు. ఈనిరృతిలోకంబున కనంతరంబున.

64

వరుణలోకవృత్తాంతము

గీ.

వరుణదేవునిలోకంబు ధరణిదేవ!
ఇందు నుండెడుపుణ్యాత్మ లెవ్వ రనిన
వాపికాకూపకాసారవారిపాన
వాటికోద్యానకల్పనావ్యాప్తిపరులు.

65


సీ.

తరుణేందుమౌళిపై ధారాంబుకుంభంబు
        నియమవ్రతంబుగా నిలిపినారు
తనియఁ దియ్యనిపంచదారపానకములు
        భూసురోత్తములకుఁ బోసినారు
చల్లఁగా నెడరుచోఁ జలివెందరలు పెట్టి
        యధ్వనీనులదప్పి యార్చినారు
తీర్థయాత్రాపరాధీనమానసులకు
        నుదకుంభపాదుక లొసఁగినారు


గీ.

వెల్లిలో నేయుపాయంబు వెంట నైన
మునుఁగకుండంగఁ బ్రాణుల మనిచినారు
గారవంబున వరుణలోకంబునందు
నిండువేడుక సుఖియించుచుండువారు.

66


గీ.

పుణ్యతటినుల కవతారభూములందు
శిలల సోపానపంక్తులు చేసినారు
పనులసంకెళ్లు విడిపించి పనిచినారు
వరుణలోకంబునం దుండువార లనఘ.

67


వరుణోత్పత్తి

వ.

ఈలోకం బేలువాఁడు వరుణుండు. జలా(శయా)ధిపతి, యాదఃపతి, సర్వకర్మసాక్షి. ఇతనియుత్పత్తి యాకర్ణింపుము.

కర్దమప్రజాపతినందనుండు శుచిష్మంతుం డనువాఁడు ధైర్యమాధుర్యవైశారద్యాదిశోభనగుణసంపన్నుండు.అతఁడు చిఱుతవయసున సంగడీలయిన బాలకులతోడంగూడి యచ్ఛోదం బనుకొలన సలిలక్రీడలు సలుపుచు నొక్కశింశుమారంబుచేతం బట్టువడినం దోడిబాలకులు భయభ్రాంతస్వాంతులై యేతెంచి దేవార్చనాసమయంబున సమాధినిష్ఠుండైన యాతనితండ్రి కత్తెఱంగు విన్నవించిరి. విజ్ఞాతసుతవిపత్తి యయ్యును జిత్తంబు చలింపనీక యత్తపోధనసత్తముం డభిధ్యానమార్గమున బ్రహ్మాండంబుల, భువనంబుల, భూతంబులఁ, జంద్రసూర్యర్క్ష్యతారకంబులఁ, బర్వతంబుల, వనంబుల, నదుల, సముద్రంబుల, నంతర్ద్వీపంబుల, నానాదేవయోనులఁ, దదీయస్థానంబుల, వాపీకూపతటాకకుల్యాపుష్కరిణులం జూచి యందొక్క కెందమ్మికొలన మునికుమారులతోడం గూడి నిమజ్జనోన్మజ్జనంబుల రంజిలం గరయంత్రనిర్ముక్తసలిలధారాభిషేచనంబుల సముడ్డమరుకాండమడ్డుడిండిమఢిమఢీమధ్వానంబుల దారకుండు విహారంబు సలుపుటయు, నప్పూర్ణేందుబింబవదను నిందుబింబంబుఁ బట్టం బఱతెంచు రాహువుంబోలె నొక్కమహాగ్రాహంబు సమగ్రాగ్రహంబునం బఱతెంచి పట్టుటయు, నమ్మొసలి సరసబిసరుహకిసలయకుసుమసుకుమాదేహుండగు నక్కుమారున (ను)క్కుఁదండసంబులువోని తనరెండుకోఱలం బిట్టూఁది కఱవక మెయిమెయిం గబళించి కసుగందకుండ జలాధిదేవతాసమీపంబునకుం దెచ్చుటయు, నచ్చిగురాకుఁబోఁడి యతని సరిత్పతిసమ్ముఖంబునం బెట్టుటయు, నంతలో సక్రోధరక్తాంతలోచనుండును ద్రిశూలపాణియు నగు

నొక్కదివ్యపురుషుండు పరుషదృష్టి వీక్షించి సలిలాధ్యక్షు నధిక్షేపించి, యోయివరుణాలయ! కరుణారహితుండవై కర్దమప్రజాపతితనయు శివభక్తు శిశువు నక్రంబుం బంచి దంష్ట్రాక్రకచంబులం గఱపించి తెప్పించితి! మేలు గా కేమి? నీలలోహితునిప్రభావంబు నీ కెఱుంగవచ్చునే! యని జంకించి పలుకుటయు, నాతంకంబు నొంది యుదన్వంతుం డాడింభు నలంకరించి శంభుకింకరున కిచ్చి పాశనిబద్ధం బగునమ్మకరంబు నతని కొప్పనంబు చేసి తత్సమేతుండై పరమేశ్వరునిసన్నిధికిం జని బహుప్రకారంబుల స్తుతియించి యపరాధంబువలన విముక్తుం డగుటయు, నద్దేవుండు పనుపం బ్రమథుండు జలగ్రాహంబులతోడం గూడం గుమారుని దనయొద్దకుం గొనివచ్చుటయుఁ గాంచె. అదియ ప్రణిధానావసానం బయ్యె నేత్రోన్మీలనం బాచరించి యప్పరమమాహేశ్వరుండు.

68


సీ.

గ్రాహదంష్ట్రాటకికాశిఖాగ్రము సోఁకి
        కందినజంత్రుభాగంబుతోడ
నుదకబిందుకలాప ముట్టి యుట్టిపడంగఁ
        గర మొప్పు ముద్దుగూఁకట్లతోడ
నరుణాంచలంబులై యరవిందగర్భప
        త్రములఁ బోలువిలోచనములతోడ
బహులయాతాయాతపరిపాటిపెల్లున
        గఱువంపునిట్టూర్పుగాడ్పుతోడ


గీ.

సంభ్రమంబున నచ్ఛోదసరసి వెడలి
మేటివక్రంబు బట్టెడత్రాటఁ బట్టి

వచ్చి తనకట్టెదుర నున్నవానిఁ బుత్త్రుఁ
గాంచె దుర్గమతేజుండుకు కర్దముండు.

69


వ.

అట్లు కాంచి.

70


క.

చరణాంభోరుహయుగళీ
పరిసరమునఁ జక్క సాఁగి ప్రణతి యొనర్పన్
గురుఁడు ప్రమోదం బారఁగఁ
బరిరంభము చేసెఁ జచ్చి బ్రతికినకొడుకున్.

71


గీ.

అనఘ! శివశర్మ! యిట్టిచోద్యంబు గలదె?
యభవు నర్చించువేళ సమాధి నుండి
కొమరుదెస నైనయన్నిపోకలును జూడఁ
గడచె నూఱును నైదేండ్లు కర్దమునకు.

72


వ.

కర్దముండును నతిక్రాంతం బైనయద్దీర్ఘకాలంబు మహాకాళధ్యానతాత్పర్యనిష్ఠాతిశయంబున ముహూర్తమాత్రంబునుంబోలెఁ గడపి యనంతరంబ శుచిష్మంతుండును సముచితప్రకారంబునఁ దండ్రియనుజ్ఞ వడసి వారణాసీపురంబున కరిగి లింగస్థాపనంబు సేసి పంచవర్షసహస్రంబు దపం బొనరించి ప్రత్యక్షం బైనపరమేశ్వరునివలన వరుణపదంబు వరంబుగాఁ బడసి రత్నాకరంబులకు రత్నంబులకు సరిర్సరఃపల్వలంబులకు వాపికాకూపతటాకంబులకుఁ బడమటిదిక్కునకు నధీశ్వరుం డయ్యె. కాశియందుఁ గార్దమప్రతిష్ఠితం బైనమణికర్ణేశ్వరలింగంబునకు నిరృతిభాగంబున వరుణేశ్వరాహ్వయం భైనశంభులింగంబు సుప్రతిష్ఠితం బై యుండు. ఆలింగంబు సేవించినవారికి సంతాపభయంబును నపాయమరణ

భయంబులును జలోదరాదిభయంబును మొదలైనభయంబులు పుట్టక యుండు. ఇది వరుణలోకవృత్తాంతంబు.

73


గంధవతీవృత్తాంతము

సీ.

అదె గంధవతిఁ జూడు మవనీసురోత్తమ!
        వరుణునివీటి కుత్తరమునందు
నిమ్మహాపట్టణం బేలు గంధవహుండు
        భపకృప నీతఁ డీపదముఁ గాంచె
నాదిఁ గశ్యపునిదాయాదుండు పూతాత్ముఁ
        డనుపేరి బ్రాహ్మణుం డనఘ! యితఁడు
తరుణేందుధరురాజధాని వారాణసి
        నయుతాబ్దములు తపం బాచరించి


గీ.

లింగసంస్థాపనంబు గల్పించి లింగ
మధ్యమునయందుఁ గందర్పమథ(దమ)నుఁ గాంచి
జ్యోతిరభ్యంతరస్థు నావ్యోమకేశు
సంస్తుతించె నతండు విస్పష్టఫణితి.72


వ.

దేవదేవ! మహాదేవ! దేవా! (య)భయప్రద! నారాయణేంద్రాదిసర్వదేవవరప్రద! సంస్తుత్యుండవు, స్తోతవు, స్తుతివి, సగుణుండవు, నిర్గుణుండవు, నామరూపవివర్జితుండవు, ఇచ్ఛాజ్ఞానక్రియాశక్తులు నీయవి. ఒక్కరుండవయ్యును శివశక్తిభేదంబునను ద్వైతంబు భజియింతువు. నీదక్షిణాంగంబు బ్రహ్మ. నీవామాంగం బచ్యుతుండు. చంద్రసూర్యాగ్నులు నీనేత్రంబులు. నీనిశ్శ్వాసంబు శ్రుతులు. నీప్రస్వేదాంబువులు నదులు. నీశ్రోత్రంబులు సమీరణంబులు. నీభుజంబులు దిక్కులు. నీ ముఖంబులు బ్రాహ్మణులు. నీ బాహువులు రాజన్యు

లు, నీయూరువులు వైశ్యులు. నీపదంబులు శూద్రులు. నీకేశంబు లంబుధరంబులు. నీవు ప్రకృతిపురుషరూపంబున బ్రహ్మాండంబు సృజియింతు. నీయంద సర్వభూతంబు లుద్భవిల్లు.నీవ సర్వభూతమయుండ వని యనేకప్రకారంబులం బూతాత్ముండు సంస్తుతింపం బ్రసన్నుండై పరమేశ్వరుం డతనికోరినదిక్పాలపదం బిచ్చి తనమూర్తులయందు నంశంబు ప్రసాదించి సర్వగత్వంబును, సర్వావబోధకత్త్వంబుఁ, బ్రాణాపానాదిపంచమూర్తిత్వంబు నొసంగె. అతఁడు కాశీక్షేత్రంబున జ్యేష్ఠేశ్వరుని పశ్చిమభాగంబున వాయుకుండంబు నుత్తరంబునఁ బ్రతిష్ఠించిన యప్పరమేశ్వరునకు నవ్యాక్షిపథంబున భోగమోక్షప్రదత్వంబు సంపాదించి యంతర్హితుం డయ్యె. ఇది గంధవతివృత్తాంతంబు.

75


కుబేరవృత్తాంతము

క.

నిగమజ్ఞ! గంధవాహుని
నగరమునకుఁ దూర్పుదిక్కున గుణోదారం
బగుపట్టణ మదె యలకా
నగరం బది యేలు యక్షనాథుఁడు గరిమన్.

76


వ.

అక్కుబేరునిచరితంబు చెప్పెద మాకర్ణించుము.

77


తే.

భూసురో త్తమ! కాంపిల్యపురమునందు
యజ్ఞదత్తాఖ్యుఁ డొక్కబ్రాహ్మణుఁడు గలఁడు
వేదవేదాంగవేదార్థవిత్తముండు
యజ్ఞవిద్యావిశారదుం డాద్విజుండు.

78


తే.

అతనిపుత్రుండు గుణనిధి యనెడివాఁడు
దర్పకునితోడిజోడు సౌందర్యరేఖ

నెయ్య మలరంగ గురు లుపనీతుఁ జేసి
చదువఁబెట్టిరి వాని నాచార్యునొద్ద.

79


క.

ద్యూతక్రీడారతుఁడై
యాతఁడు కితవులును దాను నాసాయం బా
ప్రాతస్సమయము దిరుగ న
వేతనిజాచారుఁ డగుచు నెల్లెడ వీటన్.

80


సీ.

బ్రాహ్మణాచారంబు పరిహాసకము సేయు
        నగ్నిహోత్రవిధాన మన్న నలుగు
సంధ్యాభివందనశ్రద్ధ యుజ్జన సేయు
        గీతవాద్యవినోదకేలిఁ దగులుఁ
బాషండభండదుర్భాష లావర్తించు
        ద్యూతకారులతోడి యుద్ధి పడయు
ధాతువాదులమీఁదఁ దాత్పర్య మొనరించుఁ
        జెలిమి వాటించు నాస్తికులతోడ


తే.

నటుల మన్నించు హర్షించు విటులఁ జూచి
పీఠమర్దుల కొనరించుఁ బెద్దఱికము
కౌలటేయులఁ బాటించు గారవించుఁ
శిష్టకుల దీక్షితునిపట్టి సిగ్గు విడిచి.

81


వ.

సజీవనిర్జీవద్యూతంబుల నోడినధనంబులు గితవులకుం దల్లిమేనిరవణంబుల నమ్మిపెట్టుచుండు.

82


తే.

తల్లి బోధించుఁ దత్పరత్వంబు గలిగి
యన్న! మీయన్న చెప్పినయట్ల చేయు
ధూర్తసంగతి విడువు సాధువులతోడఁ
బరిచయము సేయు మని పుత్త్రు ప్రతిదినంబు.

83

వ.

దీక్షితుండును గృహకార్యాభ్యంతరవ్యగ్రుండై కొడుకువర్తనంబుఁ బరామర్శింపక యుండు.

84


తే.

ఎడపఁ దడపఁ దనూభవుం డెచట నుండు
గానరాఁ డంచు గృహభర్త కాంత నడుగ
నింతదడవును నాయొద్ద నిచట నుండి
యరిగెఁ జదువంగ నని భర్త కతివ మొఱఁగు.

85


తే.

స్నాన మాడెనె? వార్చెనే సంధ్య? యగ్ని
హోత్ర మొనరించెనే? యింతి! పుత్త్రుఁ డనిన
స్నాన మాడెను వార్చెను సంధ్య యగ్ని
హోత్ర మొనరించె ననుచును నువిద మొఱఁగు.

86


ఆ.

గొడ్డువీఁగి కన్నబిడ్డండు కావున
నొక్కరుండ కాన నుత్పలాక్షి
ధూర్తుఁ డైనవానిదుశ్చేష్టితము లెల్ల
నధిపుఁ నెఱుఁగనీక యడఁచుచుండు.

87


వ.

చూడాకర్మానంతరంబున పోడశవర్షంబున గృహ్యోక్తప్రకారంబున నతనికి వివాహంబు చేసి ప్రత్యహంబును.

88


క.

స్నేహార్ద్రహృదయయై యతి
సాహసకృత్యములు మాన సమకొల్పుటకై
యూహాపోహవిచాకస
మాహితగతిఁ దల్లి సుతుని మఱి బోధించున్.

89


తే.

అన్న! మీతండ్రి కోపగాఁ డౌనొ కాఁడో?
యీవు వొనరించుదుర్వృత్త మెఱిఁగెనేనిఁ
గల్లతనమున పలుమాఱు గప్పిపుచ్చు
నట్టి నామీఁద జంపంగ గలుగకున్నె!

90

సీ.

సచ్ఛ్రోత్రియులు ననూచానులు సోమపీ
        ధులు నైనకులముపెద్దలఁ దలంచి
రాజమాన్యుఁడు సత్యరతుఁడు వినిర్మలా
        చారవంతుఁడు నైనజనకుఁ దలఁచి
భాగ్యసంపదఁ బుణ్యపతిదేవతలలోన
        నెన్నంగఁ దగియెడునన్నుఁ దలఁచి
వేదశాస్త్రపురాణవిద్యానిరూఢులై
        వాసికెక్కినతోడివారిఁ దలఁచి


తే.

చెడ్డయింటిచెదారమై శివునికరుణ
నివ్వటిలు నిర్వదేనేండ్ల నిన్నుఁ దలఁచి
పదియునార్వత్సరంబులభార్యఁ దలఁచి
గోరతనములు మానురా! కొడుకుఁ గుఱ్ఱ!

91


తే.

అఖలకల్యాణగుణగణాయత్త యత్త
మామ యౌచార్యతేజఃక్షమామహితుఁడు
మాతులుండు యశోమహిమాతులుండు
తనయ! యేలయ్య కైకోవు వినయబుద్ధి?

92


చ.

విడువక నీవు పట్టణమువీథులవీథుల వెఱ్ఱివాఁడవై
చెడుగులఁగూడి ధౌర్త్యములు సేయ మహీరమణుం డెఱింగెనే
విడుచును సోమయాజి మనువృత్తులు చేకొను నెల్లభంగులన్
జెడుదుము నీకతంబుననుఁ జీరయుఁ గూడును లేక ఫుత్త్రకా!

93


తే.

పట్టణములోన నీవు దర్పమునఁ జేయు
కొయ్యతనములు వీక్షించి కూర్మితనయ!
నవ్వుదురు నిన్ను మొదల నానావిధముల
నవ్వుదురు దీక్షితుని ననంతరమ జనులు.

94

వ.

అని యంత నిలువక.

95


తే.

తల్లిబడి కొల్లిచ(చె)ట్టంచు నుల్లసంబు
లాడుదురు నన్నుఁ గూర్చి ని న్నహరహంబు
దుర్ణయం బుల్ల నామీఁదఁ ద్రోచి జనులు
డబ్బఱలు పల్కువారి కడ్డంబు గలదె?

96


క.

అవినయనిధాన మగునీ
నవయౌవనశైశవములనడిమివయసునం
గవినెదు వ్యసనోద్రేకం
బవగాఢము దీని మానవయ్య తనూజా!

97


వ.

అని యనేకప్రకారంబుల బోధించినతల్లిమాటలు చెవులు సోఁకనీక యిట్టట్టనక యూరకుండె. మృగయామద్యపైశున్యవేశ్యాచౌర్యదురోదరపరదారాభిలాషంబు లనుదోషంబులు నవయౌవనారంభంబున సంభవించెనేని వానిం బరా వర్జింప నెవ్వరు నేర్తురు? గురువచనం బతినిర్మలం బయ్యు సలిలంబునుంబోలె శ్రవణస్థితంబై యభవ్యునికి శూల పుట్టించు నయథార్థనామధేయుం డగునగ్గుణనిధి యథాపూర్వంబు దుర్వర్తనంబులఁ దిరుగుచుండ నొక్కనాఁడు.

98


సీ.

దర్శనం బిచ్చె నెద్దానిఁ గోమటి క్రొత్త
        పొడచూప నేతెంచి భూభుజునకుఁ
దన కిచ్చె నెద్దాని ధారాంబుపూర్వంబు
        పుణ్యకాలమునాడు భూమిభర్త
దా నిచ్చె నెద్దాని ధర్మ గేహిని యైన
        సోమిదమ్మకు మనఃప్రేమ మలరఁ

దఱి చూచి యిచ్చె నెద్దానిఁ బట్టికిఁ దల్లి
        జూడ మోడినపైఁడి సుట్టికొనిన


తే.

న(య)ట్టినవరత్నమయ మైనయంగుళీయ
కంబు యజ్ఞావభృథపుణ్యకర్మసాక్షి
వీటిలో నొక్కజూదరివ్రేల నుండ
జూచెఁ గనుఱెప్ప వెట్టక సోమయాజి.

99


వ.

చూచి తనసొ మ్మౌట యెఱింగి దీక్షితుం డక్షక్రీడాజీవనుం గదిసి యెలుంగుత్తి యీయంగుళీయకంబు నీ కెట్టు గలిగె? ఉన్నరూపు చెప్పు. తప్పఁ జెప్పితేని భూపాలుసన్నిధిం బెట్టి నిజంబు దెలిపి దండింతు ననిన జూదరి నీతనయుండు గుణనిధి నెత్తంబున నొడ్డిన విత్తంబునకై యీయంగుళీయకంబు నా కిచ్చె. మఱి బంగారుభృంగారుకర్కరీకలాచికలు, తలియలు, పళ్లెరంబులు, తామ్రపాత్రంబు, లారకూటఘటంబు లన్నియుం దాకట్టువెట్టియు దురోదరక్రీడాపరాయణుండై పట్టణంబులోనం జరియించుచున్నవాఁడు.

100


తే.

అక్షధూర్తులలోన నీయనుఁగుఁగొడుకు
దొరయునంతటి యక్షధూర్తుండు లేఁడు
క్షితితలంబున యాగదీక్షితులలోనఁ
గీర్తి నీయట్టియాగదీక్షితుఁడు లేఁడు.

101


వ.

అనిన విని లజ్జాక్రోధంబులు మనంబున ముప్పిరిగొన యజ్ఞదత్తుం డర్ధముండితం బైనమూర్ధంబున నీర్కావిదోవతి నఱిముఱిఁ జుట్టుకొని యింటి కేతెంచి మొగంబు గంటువెట్టుకొని సోమిదమ్మ! ఏమిచేయుచున్నదాన! విటు రమ్ము! నీకొడు కెక్కడం బోయెఁ? బోవుఁ గాకేమి! విను మని యిట్లనియె.

102

శా.

అంగోద్వర్తనవేళ నీవు దరహాసాంకూరము ల్లోచనా
పాంగప్రాంతములం దిగుర్ప నొకసయ్యాటంబుఁ గల్పించి నా
యంగుళ్యాభరణంబు పుచ్చుకొనవా? యాయుంగరం బిప్పుడే
శృంగారింపనిచేతఁ బావకునకున్ జేయన్ హవిర్ధానమున్.

104


వ.

అనిన నద్దీక్షితాయని దీక్షితున కిట్లనియె.


సీ.

మధ్యాహ్నసంధ్యాసమాగమం బిది తీర్థ
        మవధరింపుము నిత్య మాచరింపు
మగ్నికార్యముఁ దీర్పు మభవుఁ బూజింపుము
        పంచమహాయజ్ఞపరుఁడ వగుము
మొగసాల నున్నారు జగతీసుపర్వులు
        గ్రాసార్థు లగుచుఁ బెక్కండ్రతిథులు
పక్వాన్నములు శాకపాకాదికంబులు
        చల్ల నాఱినయేనిఁ జవులు దప్పుఁ


తే.

బదిలముగ మందసమునందు బరిణలోన
నునిచి దాఁచినదాన మీయుంగరంబు
దీర దిప్పుడు పెట్టె శోధించి చూడ
నారగించినపిదప నే నధిప! తెత్తు.

105


తే.

అనిన విని సోమయాజి కోపాగ్రహమునఁ
దత్తరించుచు పడి సోమిదమ్మఁ బలికె
నౌనె సత్పుత్త్రజనయిత్రి! యౌనె సాధ్వి!
యౌనె సూనృతభాషిణి! యానె దేవి!

106


సీ.

స్వాధ్యాయ మెన్నండుఁ జదువఁగఁ బోకుండ
        బోలునే చదువంగఁ బోయె ననుట?

తెల్లవాఱఁగ నీటఁ దీర్థమాడకయుండ
        ననురూపమే తీర్థమాడె ననుట?
సమయానుకూలత సంధ్యవార్వక యుండ
        వైదగ్ధియే సంధ్యవార్చె ననుట?
తఱితోడ నగ్నిహోత్రము వేల్వకుండఁగ
        విజ్ఞానసరణియే వేల్చెననుట?


తే.

కల్లలాడంగ ఫల మేమి గలిగె నీకు?
మాటిమాటికి నేను నీమాట నమ్మి
యరసి రక్షింపనేరక యనుఁగుఁగొడుకు
భ్రష్టుఁ జేసితి నేమి చెప్పంగఁ గలదు?

107


సీ.

ఏడఁ బోయెనొ కదా మేడలో మంజిష్టి!
        పెనుబండువునఁ నైన బెట్టఁ జాలఁ
దాకట్టు వడదె యింతకు వైశ్యగృహమున
        కనకకక్కరిలభృంగారుకంబు?
పట్టుసూత్రమయంబు పసిఁడియొడ్డాణ మే
        యిగురుఁబోఁడికటీర మెక్కె నొక్కొ!
శశికాంతపీఠికాస్తంభలీలారత్న
        సాలభంజిక యెందు సాఁగె నొక్కొ!


తే.

ఎచట నున్నదియొకొ రత్నఖచిత మైన
హంసతూలికడోలావిహారతల్ప
మూఁచముట్టుగ నీవు నీయొంటికొడుకుఁ
బాడుచేసితి గృహము నిర్భాగ్యురాల!

108


తే.

చాలు నింక నాపాలికిఁ జచ్చినాఁడు
కొడుకు గుణనిధి యనువాఁడు కులవిషంబు

తిలలు దర్భయు నుదకంబుఁ దెత్తుగాఁక
యే నివాపాంజలుల వాని కిత్తు నిపుడు!

109


వ.

కుపుత్త్రత్వంబుకంటె నపుత్త్రత్వకంబు మేలు. కులపాంసనుం డైనవీని నొక్కనిం ద్యజించి కులంబు రక్షించుట నీతియ కదా! యని పలికి కోపావేశంబునఁ బెదవు లదరఁ గటతటంబులు చిటుల భ్రూకుటి నిటలంబున నటింపఁ గటాక్షంబులు గెంపు గదురం గటకటం బడుచు నాహ్నికం బైనక్రియాకలాపంబు నిరవర్తించి యాగ్రహంబునఁ గృతార్ఖత్వంబు నొందం కొన్నిదివసంబులకు నొక్కశోత్రియునిపుత్త్రిం బెండ్లియాడి యజ్ఞదత్తుండు గృహస్థధర్మంబు నిర్వర్తించుచుండె. అంతకమున్న గుణనిధి తండ్రికోపం బెఱింగి యింటికిం బోవక యెందేనియుం జనువాఁడ నని మనంబున నిట్లని వితర్కించె.

110


తే.

ఏమి సేయుదు? నెక్కడి కేగువాఁడ!
ధనము నిప్పచ్చరంబు విద్యయు హుళిక్కి
పెట్టసాఁగెడునాచేయి భిక్ష సేయ
నెట్టు నేరుచు? దైవంబ యెఱుఁగు నింక.

111


తే.

ఏభయంబుల నెచ్చోట నెనయలేదు
నరున కెప్పాట విద్యాధనంబ ధనము
చోరబాధాదికముచేతఁ జూఱ[1]వోవు
ధనము ధన మౌనె యెన్ని చందములఁ దలఁప?

112


గీ.

అక్కటకట! దురోదరవ్యసన మెట్లు?
యాయజూకవిశిష్టాన్వవాయ మెట్లు?
ఎట్లు చేసినఁ జేసెఁ గా కే మనంగ

నేర్చువారము? విధి దయానిస్వహృదయు.

113


చ.

అరుణగభస్తిబింబ ముదయాద్రిపయిం బొడతేర గిన్నెలోఁ
బెరుఁగును వంటకంబు వడపిందియలుం గుడువంగఁ బెట్టుని
ర్భరకరుణాధురీణ యగుప్రాణము ప్రాణము తల్లి యున్నదే?
హరహర! యెవ్వరింకఁ గడుపారఁగఁ బెట్టెద రీప్సితాన్నముల్.

114


వ.

అనుచు నెందేనియుం జనియె నంత.

115


మాలిని.

ఘుసృణకుసుమమాలాకోటిపాటల్యలీలన్
గిసలయములచాయం గిరచంచూపుట శ్రీ
విసృమరసృమరోర్ణావిభ్రమప్రౌఢి మింటన్
బిసరుహహితదీప్తుల్ పింగళత్వంబు నొందెన్.

116


తే.

పాటలాంశుజటాభారభాసురుండు
భార్గవుఁడు వోలె నోలాడె భాస్కరుండు
రాగశక్తచ్ఛటానిర్ఝరప్రపూర్ణ
చరమసంధ్యాశమంతపంచకనదముల.

117


వ.

వెండియు ధౌతారకూటపాటలకోమలాతపంబై వాసరంబు పలుచం బాఱె. అస్తాద్రికిరీటకూటంబున దరవికచనిచులకుసుమమంజరీపుంజంబునుం బోలె మిహిరబింబంబు చూపట్టె. చరమధరాధరధాతుధారాప్రవాహంబునుం బోలె సంధ్యారాగంబు గగనమండలంబు నాక్రమించె. చైత్యద్రుమంబులు నిద్రా(వ)ణద్రోణకాక కాకాకారకాకుకోలాహలంబు కులకులాయమానంబు లయ్యె. ఆంధకరిపుకంధరామూలకాలకూటచ్ఛాయాశ్రేణిపాణింధమంబై యంధకారంబు బ్రహ్మాండమండలంబు నాచ్ఛాదించె. రజనీశుక్తిముక్తాఫలం

బులు చుక్కలు వొడిచె. భవిష్యద్వాపరకరకరప్రరోహబీజాంకురంబులుంబోలెఁ బ్రదీపంబులు భవనాంతరంబులు వెలింగె. అప్పుడు గుణనిధి పేరాఁకలివేర్చు కార్చిచ్చునుంబోలెఁ బెచ్చుపెరిఁగి యందంద కడుపు మండింప వంటకం బెక్కడఁ గలుగునో యని చింతాక్రాంతుండై యున్నయవసరంబున నద్దినంబు రాత్రి శివరాత్రి యగుటం జేసి శైవుం డొక్కరుండు నగరబాహ్యప్రదేశంబున నొకశివలింగస్థానంబున జాగరణంబుఁ జేసి నాలుగుజాములు నుపహారంబులు సమర్పించువాఁడై నియమవ్రతంబుఁ బూని భక్తివిశ్వాసతాత్పర్యాతిశయంబున.

118


సీ.

మరిచిథూళపాళిపరిచితంబులు మాణి
        బంధాస్మలవణపాణింధమములు
బహులసిద్ధార్థజంబాలసారంబులు
        పటురామఠామోదభావితములు
తింత్రిణీకరసోపదేహధూర్ధురములు
        జంబీకనీరాభిచుంబితములు
హైయ్యగవీనధారాభిషిక్తంబులు
        లలితకుస్తుంబరూల్లంఘితములు


తే.

శాకపాకరసావళిసౌష్ఠవములు
భక్ష్యషోజ్యలేహ్యంబులు పానకములు
మున్ను గాఁ గల యోగిరంబులు సమృద్ధి
వెలయఁ గొనివచ్చె నొండొండ వివిధములను.

119


వ.

అప్పుడు భూసురప్రవరుండు నాసికాపుటకుటీకుటుంబి యగు పక్వాన్నగంధంబు గాలివెరవున నాఘ్రాణించి యాయ

న్నంబు నాకు నెబ్భంగి గుడువ సమకూఱునొకో యని యప్పరిమళంబుసన పట్టుకొని పోయి శంభుభవనద్వారంబునం గూర్చుండి నృత్తగీతవాద్యంబులు ప్రవర్తిల్ల సరిప్రొద్దువోవునం దాఁక వీక్షించుచు జాగరంబు చేసి యంతంత సాగి ప్రజలు చొక్కు మడంగి యుండఁ దా నయ్యవసరంబున.

120


సీ.

కట్టాయితంబుగాఁ గటిమండలంబునఁ
        దీర్చి దట్టీచేల దిండు గట్టి
తలుపు గిఱ్ఱనకుండఁ దరిమి కొంచెం బైన
        యోరవాకిట దేహ మొయ్యఁ జొనిపి
మునివ్రేళ్ళు లొయ్యెయ్య మోపి చప్పుడు గాని
        పరిపాటి బవనంబుఁ బట్టి నడచి
దీపాంకురచ్ఛాయఁ దెలివి చాలనియట్టి
        కోనచీఁకటి లోని కొనరఁ జొచ్చి


తే.

పళ్ళెరములం దపూపసూపములతోడ
ననఁటిపండులతోడ నాజ్యంబుతోడ
దధిపయఃక్షౌద్రబహుపదార్థములతోడ
ధవళకలమాన్న మీక్షించె ధరణిసురుఁడు.

121


తే.

గర్భమంటపదీపికాకలిక యపుడు
దశ చెడఁగ గాలి నిర్వాణదశ వహింప
దీప్తిసంధుక్షముగఁ జేసి తెలివి పడఁగ
నన్న మీక్షింపఁదలఁచె బ్రాహ్మణకులుండు.

122


శా.

గ్రుక్కిళ్మ్రింగుచు నొక్కయోదనమహాకుంభంబు నీక్షించువాఁ
డక్కోణంబున మందరశ్మియగు దీపాంకురముల్ మీఁదికై

యెక్కంద్రోచి ఘృతంబు నించి నిజవస్మ్రైకాంశముం జించి చే
నొక్కెన్ వత్తిగ నేఁతఁదోఁచెను శిఖ న్యోజించె వైశ్వానరున్.

123


సీ.

పక్వాన్నపాత్రంబు పాణిఁ గైకొని బహి
        ర్ద్వారభూమి భుజించువాంఛ నపుడు
వెల్వడి వచ్చుచో విధివశంబున వాని
        కాలివ్రే లొకనియంగంబు దాఁకెఁ
దాఁకిన వాఁడు తత్తఱపాటుతో మేలు
        కని ముచ్చు మ్రు చ్చని కళవళించెఁ
గళవళింప గతానుగతికమార్గంబున
        నాక్రోశ మొనరించి రఖిలజనులు


తే.

నన్నపాత్రంబు విడువక యవనిసురుఁడు
పాఱె భయవిహ్వలుం డయి బయలువట్టి
వెంటఁ దగిలి తలవరులు వెణగుపడఁగ
బాణముల నేసి చంపి రా బ్రహ్మకులుని.

124


తే.

అతనిఁ గొనిపోవఁ బనిఁ బూని యమునిభటులు
వరుణపాశోగ్రహస్తులై వచ్చి రపుడు
వానిఁ గొనిపోవఁ బనిఁబూని వచ్చి రపుడు
త్ర్యంబకునికింకరులు విమానంబు గొనుచు.

125


వ.

అనంతరంబ పట్టిసత్రిశూలఖట్వాంగప్రముఖబహువిధప్రహరణపాణు లగుపినాకపాటిభటులం జూచి భీతులై కృతాంతకింకరులు కరపంకజంబులు మొగిచి వారి కిట్లనిరి.

126


తే.

అభవుకింకరులార! మహాత్ములార!
తగవు ధర్మంబు పాడి పంతంబు దెలియు
మీకు నడ్డంబు గలరె ముల్లోకములను?

నెంతవారము మేము మీయెదుర నిలువ?

127


వ.

వీఁడు కులాచారహీనుండు, పితృవాక్యపరాఙ్ముఖుండు, సత్యశౌచపరిభ్రష్టుండు, సంధ్యాస్నానవర్జితుండు, శివనిర్మాల్యావహర్త. వీనియం దొక్కధర్మంబు లేశంబు గలిగిన నానతిండు వినియెదము. వీనిపుణ్యాపుణ్యవివేకంబునకు మీర ప్రమాణం బనినఁ కృతాంతకింకరులవాక్యము లాకర్ణించి శివకింకరులు వారి కి ట్లనిరి.

128


క.

శివధర్మం బతిసూక్ష్మము
శివధర్మము లేశమైన సిద్ధించినచో
వివిధమహాపాపోప
ద్రవములు చేరంగ రావు ధన్యుని నతనిన్.

129


తే.

స్థూలదృష్టి వీక్షించినఁ దోపకుండు
సూక్ష్మదృష్టి వీక్షించినఁ జూడ్కి కందుఁ
గాన శివభక్తిధర్మం బగాధమహిమ
కానవచ్చినయ ట్లుండ గానరాదు.

130


క.

ఆచారం బిది యనఁగ న
నాచారం బిది యనంగ నజునకు నైనన్
గోచరము గాదు శివధ
ర్మాచారము సూక్ష్మరూపమై వర్తిల్లున్.

131


వ.

ఇతఁడు చేసిన పుణ్యకర్మంబు వినుండు.

132


సీ.

అశన మబ్బక యున్న నైనను శివరాత్రి
        యోరంత ప్రొద్దును నుపవసించి
నోగినంబు హరింప నొన వెట్టుకొని యైన
        వేగునంతకుఁ జేసె జాగరంబు

పాత్రావలోకనోపాయంబునకు నైన
        వెలయించె దీపంబు వెలుఁగఁ బాఱఁ
జూడనొల్లక యైనఁ జూచె నీశ్వరుమౌళి
        బరులు చేసినయట్టి ప్రసవపూజఁ


తే.

జచ్చె విధి మూడి యైనను జంధ్రధరుని
నగరిమోసాలఁ బెంద్రోవనట్టనడుమ
సూక్ష్మదృష్టి విచారించి చూచినప్పు
డింతకింటెను ధర్మంబు లెవ్వి గలవు?

133


వ.

అని పారిషదులు యమదూతల వీడ్కొలిపి యతని దివ్యవిమానారూఢుం జేసి శివలోకంబునకుం గొనిపోయి శివునిసన్నిధిం బెట్టిరి. శివుండును బ్రదీపతేజస్సంధులక్షణాదికపుణ్యానురూపం బైనఫలంబునం గళింగదేశాధిపతి యైన
యరిందమునకుఁ దనయుండై దముం డనుపేర నాదేశంబునకు రాజుగా ననుగ్రహించి పుత్తెంచె. ఈశ్వరానుగ్రహంబునం బట్టాభిషిక్తుండై.

134


క.

చాటించెఁ గళింగేంద్రుఁడు
వీటను దేశమున శంభువేశ్మంబులలోఁ
బాటించి దీపకళికా
గోటు లసంఖ్యములు మెండుకొని యుండుటకున్.

135


క.

ఇలువరుసఁ జంద్రశేఖరు
నిలయంబున దీపకళిక నిలుపనివారిన్
దలఁ ద్రెవ్వఁగ వ్రేయుం డని
తలవరులం బంచె రాజు తనదేశములన్.

136


వ.

దీపికాదానపుణ్యప్రభావంబున నక్కళింగాధిపతి జన్మాంతరంబు

నం గుబేరుం డై యీశ్వరునకు సఖుం డయ్యె. ఆవృత్తాంతంబు వివరించెదము. సావధానమతివై యాకర్ణింపుము.

137


సీ.

పద్మకల్పమునందు బ్రహమానససరో
        జమునఁ బులస్త్యుండు సంభవించె
నాపులస్త్యునకు మహామునిప్రవరుఁ డా
        విర్భావమునఁ బొందె విశ్రవస్సు
విశ్రవస్సునక్కు దపశ్శ్రీసనాథుండు
        వైశ్రవణుండు సముద్భవము నొందె
వైశ్రవణుండు సర్వజ్ఞు నెచ్చెలికాఁడు
        పాలించె లంక యన్ పట్టణంబు


తే.

ఘనయశుఁడు మేఘవాహనకల్పవేళ
యాజ్ఞదత్తి ధనేశ్వరుం డయ్యెఁ బిదపఁ
జిత్ప్రకాశికఁ గాశికఁ జేరవచ్చి
శివుఁ బ్రతిష్ఠించె నవిముక్తసీమయందు.

138


మ.

అవిముక్తంబున యాజ్ఞదత్తి శివు నీహారాద్రిరాట్కన్యకా
ధవునిం దప్పక చూచుచుండె నయుతాబ్దంబుల్ నిమేషక్రియా
వ్యవహారస్పృహ లేనినేత్రములఁ జరాస్థుల్సిరావల్లరీ
నివహంబుల్ పరిశుష్కముల్గనభివర్ణింపంగఁ ద్రైలోక్యమున్.

139


సీ.

గజదైత్యదమనుండు కార్పాసఫలతూల
        వర్తిప్రరోహభావము భజింప
వడఁకుగుబ్బలిరాచవారికూరిమికన్య
        యాలంబనస్తంభయష్టి గాఁగఁ
బరమవిశ్వాసతాత్పర్యనిర్భరభక్తి
        సంపద్విశేషంబు చమురు గాఁగఁ

బ్రవితతధ్యానధారాసముచ్ఛ్రాయంబు
        సమధికోజ్జ్వలతరజ్వాల గాఁగఁ


తే.

గామమును గ్రోధమును నాదిగాఁగఁ గలుగు
శాత్రవులు పాతకము లైనశలభములుగ
విమలసుజ్ఞానదీపంబు వెలుఁగఁ జేసె
నప్రతిమదైర్యసంపత్తి యాజ్ఞదత్తి.

140


తే.

విమలవిజ్ఞానదీపంబు వెలుఁగుచుండ
శాంతిధారాజలంబుల జలక మార్పి
భవునిఁ బూజించె భావపుష్పముల భక్తి
నతివిశుద్ధమనోవృత్తి యాజ్ఞవత్తి.

141


వ.

అవ్విధంబున యాజ్ఞదత్తి విజాతీయప్రత్యయాన్యరహితసజాతీయప్రత్యయసంతానానువృత్తిరూపం బైననిదిధ్యాసం(నం)బున నివాతనిష్కంపదీపంబునం బోలెఁ బెద్దగాలంబు కాలకంఠు మంగళజయోతిర్లింగమూర్తి నంతరంగంబున జ(న)నంబు సేయుచుండిన నాఖండేందుమౌళి ప్రసన్నుండై వత్స! వరంబు వేఁడు మనిన నగ్ధనిమీలితంబు లైనలోచనంబు దెఱచి కనుంగొనునప్పుడు శతసహస్రకోటిసూర్యప్రభాభాసురం బైనతేజోమండలంబునడుమ ఫణికుండలుండును, దప్తారకూటపాటలజటాజూటకోటీపినద్ధముగ్ధేందుండును, దుగ్ధధారాధవళస్నిగ్ధభసితదిగ్ధశుద్ధదేహుండు నయం యద్దేవతామూర్థాభిషిక్తుం డర్ధాంగలక్ష్మి యైనభవానితోడం గూడి పొడ చూపిన విధూమధూమకేతనజ్వాలాజాలంబుతో మేలం బాడు నమ్మృడునొడలిదీప్తి మిఱుమిట్లుగొనుచు వెఱచఱవ నఱిముఱిం జఱచినం దూరఁదారుపోయి యతనికన్నుల

శక్తి గడతేర నంధుండై యంధకారాతి నందంద తలవకారఛాందోగ్యముండకైతరేయబృహదారణ్యకశ్వేతాశ్వతరాద్యుపనిషత్తులను బంచబ్రహ్మపంచాక్షరప్రణవాదిమంత్రంబుల నారాధించి యంజలిపుటంబు లలాటతటంబున ఘటియించి నిర్ణిరోధనిరవగాఢకరుణాసుధాపూరపూరితాంతఃకరణ! శరణు! దేవతాకోటికోటీరకోటీఘటితమణిమయూఖరేఖాపుంజకింజల్కితంబులు, త్రయ్యంతవిద్యాసీమంతినీసీమంతసీమాసిందూరపరాగపాటలంబులు, కుటిలకృతాంతదంతతాడనక్రీడానిష్కృపంబు లగు మీశ్రీపాదపద్మంబులు దర్శించునట్టి సామర్థ్యంబుఁ గృపసేయవే! యిదియ నాకు వరం బనినఁ ద్ర్యంబకుండు బింబఫలాగుణాధరంబునం జిఱునవ్వు చిగురుకొనం దపస్వికి దివ్యదృష్టి యొసంగినం గృతార్థుండై యతండు.

142


చ.

చులుకన మేలుకన్న తొలుచూపునఁ జూచెఁ బినాకపాణి దా
పలిదెస షోడశబ్దములప్రాయము మత్తచకోరనేత్ర ను
త్పలదళకోమలామలవిభారమణీయమనోజ్ఞగాత్రిఁ గుం
డలకనకాంగుళీయకకనద్బహురత్నవిభూషణోజ్జ్వలన్.

143


వ.

అయ్యవసరంబున.

144


చ.

వకుళఫలానుకారు లయి వట్రువలై మెఱుఁగారు క్రొత్తమౌ
క్తికములపే రొకింత తళుకింపఁగ వీనుల హేమరత్నక
ర్ణికలు చలింప నందియలక్రేంకృతిఁ గంకణమేఖలాధ్వనిం
బ్రకటము సేయు మందగతి భాస్వరనవ్యవిలాస మేర్పడన్.

145


తే.

అసమబాణపునర్జీవనౌషధంబు
రాగజలధివిధూదయారంభవేళ

సకలజగదేకసౌభాగ్యజన్మభూమి
శంభుఁ డాయంగ వచ్చె నా శైలకన్య.

146


వ.

ఇవ్విధంబున డాయవచ్చి కాలోన్మీలితశిరీషకుసుమకేసరమాలాసుకుమారంబు కస్తూరికాస్థాపకముద్రాభిముద్రితంబును నైనభుజంబు భుజగాభరణభూషితం బైనఫాలలోచసుభుజం బొరయునట్లుగా నిలిచినం జూచి యాజ్ఞదత్తి చిత్తంబునందు.

147


సీ.

ఎవ్వతె యొక్కొ యీయిందుబింబానన?
        జగదేకసౌభాగ్యజన్మభూమి!
కమలాయతాక్షి నాకంటె వెగ్గలముగా
        నెటు చేసె నొక్కొ తా నీతపంబు?
పరమేశుఁ డీబింబఫలపాటలాధర
        నను మీఱ మన్నించినాఁడు మేలె?
భాగ్యంబు గా కేమి బాలేందుశేఖరు
        కృపఁ గాంచె నీరాజకీరవాణి!


తే.

యనుచుఁ గ్రేగంట నీరసం బావహింప
గినుపుకిలికించితము నాత్మఁ గీలుకొనఁగ
సవతి వీక్షించు ప్రౌఢయోషయును బోలె
బ్రాహ్మణుఁడు చూచెఁ బర్వతరాజతనయ.

148


వ.

అప్పుడు.

149


సీ.

కృత్యపంచకము సాగింపలేఁ డేయింతి
        ప్రాపు లేక కృతాంతభంజనుండు
నిండుఁజందురుని జంద్రిక వోలె నేభామ
        పంచబాణవిరోధిఁ బాయకుండు

నేలేమ శశిమౌళి కిచ్ఛాక్రియాజ్ఞాన
        శక్తియై కల్పించు సకలజగము
నేగంథగజయాన హృదయ మువ్విళ్ళూర్చి
        భవునిమై చక్క సాఁబాలుఁ గొనియె


తే.

మహితహృల్లేఖికామహామంత్రమునకు
నేవరారోహ ముఖ్యాతిదైవతంబు
సకలజగదదిష్ఠాత్రి యాశైలపుత్రి
విభున కి ట్లని మధురోక్తి విన్నవించె.

150


ఉ.

త్ర్యంబక! యీతఁ డెక్కడిదురాత్మకుఁ? డీయవలక్షణం బపాం
గంబుల మాటిమాటికిని గన్గొనుచున్ బహుభంగుల న్వికా
రంబులు చూపెడుం దరతరంబ యబద్దము లాడెడున్ రహ
స్యంబున వీని కిట్టి చన వబ్బుట నీకృపపెంపునం జుమీ!

151


క.

నారూపమునకు మదిలో
నీరసపడుచున్నవాఁడు హృదయేశ్వర! ని
ష్కాణముగ నీచందం
బారసి యెఱుఁగంగవలయు నని పలుకుటయున్.

152


వ.

మందస్మితసుందరవదనారవిందుండై యిందుధరుండు ధరాధరపుత్త్రి కి ట్లనియె.

153


చ.

మనమునయందు నెగ్గులును మానుము పర్వతపుత్త్రి! వీఁడు నీ
తనయుఁడు నందను ల్బహువిధంబుల ధౌర్త్యము లాచరించినం
గినియునె తల్లి భావమునఁ? గీ ల్పరికించిన దేవతావలం
బనపరభావమై పరఁగు భావవిలాసము లీప్రకారముల్.

154


క.

ఈకాశీక్షేత్రమున న
నేకాబ్దము లాచరించె నీతఁడు తప మ

స్తోకగుణా! యీపుణ్య
శ్లోకునిఁ గరుణార్ద్రదృష్టి జూడఁగ వలయున్.

155


క.

ఏ వర మిచ్చెద వీనికి
నీవును వర మిమ్ము నాకు నీకును భేదం
బావిష్కరింపవచ్చునె?
యేవారికి నైనఁ బర్వతేశ్వరతనయా!

156


వ.

అనిపలికి పరమేశ్వరుం డాయాజ్ఞదత్తికి యక్షకిన్నరగుహ్యకలోకాధిపత్యంబును తన సఖ్యంబును నిచ్చె భవానియు.

157


సీ.

ఎడమలోచనము గ్రుడ్డెగసి గవ్వయుఁ బోలె
        నుఱ్ఱూత లూఁగంగ నుండుఁ గాక
కుడికన్ను తారకాగోళంబు పల్లయై
        యొండులోచనముతో నొరయుఁ గాక
యీశుండు గృప చేసి యిచ్చినట్టివరంబు
        లట్ల యౌఁ గాకయం చానతిచ్చె
నాయొప్పిదమున కసూయ సేసితి గాన
        నభిధఁ గుబేరుండ వగుదు గాక


తే.

కాశియం దీవు నిలిపిన కాలకంఠ
దివ్యలింగంబు సర్వసిద్ధిప్రదంబు
నఖలలోకాభివర్ణనీయంబు నిఖిల
పాపహరమును నగుఁ గాక భవ్యచరిత!

158


వ.

అని పార్వతీ దేవి యతని గారవించె. నిది యాజ్ఞదత్తి పుణ్యచరితంబు.

159


మ.

ధనవంతుండగు బుద్ధిమంతుఁడగు విద్యావంతుఁడౌ సాధునం
దనవంతుండగు బుత్త్రవంతుఁడగుఁ గాంతావంతుఁడౌ నిత్యశో

భనవంతుండగుఁ గీర్తిమంతుఁడగు సత్ప్రాధాన్యవంతుం డగున్
ధనదాధీశ్వరు మానవోత్తముఁడు సందర్శించి కాశీస్థలిన్.

160


వ.

విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు దక్షిణభాగంబునం గుబేరేశ్వరస్థానంబునందుఁ గుబేరేశ్వరు సేవించినవారికి నణిమాద్యష్టైశ్వర్యంబులు సిద్ధించు నని యిట్లు యాజ్ఞదత్తికి నభిమతంబులం బ్రసాదించి దేవుండు దేవీసహితుండై యనక్షరం బైనపదంబు ప్రవేశించె. ఈ ప్రకారంబున శంభుతోఁ జెలికారంబు వడసి ధనదుఁడు.

161


సీ.

ఏపట్టణమునకు నెలదోఁట నందనా
        రామంబు తాఁ జైత్రరథవనంబు
క్రీడావిహారదీర్ఘిక యేపురమునకు
        మధురామృతాంబువు మానసంబు
మాణిక్యముకురబింబంబు కైలాస మే
        నగరివారవధూజనప్రతతికి
నేవీటిపొలిమేర యింత యం తనరాని
        దవ్వుల నున్న యుత్తరఫుదిక్కు


తే.

యట్టియలకాపురము నిధానాధివరము
రాజధానిగఁ దారకారాజమౌళి
రాజితం భైనకృపపెంపు ప్రాపు గాఁగ
రాజరా జేలె నెరవైన రాజసమున.

162


వ.

ఆరాజరాజు రాజీవభవహరిపురందరాది బృందారకమకుటసందానితవికచమందార కుసుమమాలా మకరందబిందుధారాధౌతచరణారవిందు మందరాచల మంథాన మధ్యమాన దుగ్ధజలనిధిగర్భావిర్భూతకాలకూటకృపీటభవపిండగండూ

షాకళంకితకంఠమూలోపకంఠకంఠోక్తభువనరక్షాదాక్షిణ్యు దాక్షయణీకుచకలశపాళికేళికస్తూరికామకరికాముద్రాభిముద్రితవక్షఃకవాటుఁ బశ్యల్లలాటుఁ గుటిలసుధామయూఖశకలవిచికిలకలికాకల్పితావతంసుఁ బాంసుక్రీడాపరిచయపేశలం బగుశైశవస్నేహానుబంధంబునంబోలె నిరభిసంధిస్నేహబాంధవంబున భజియించు. ఇది యక్షాధిపలోకస్వరూపంబు. ఈయాఖ్యానంబు సర్వపాపహరంబు. ఇంక నీశానలోకస్వరూపంబు వివరించెద మాకర్ణింపుము.

163


ఈశానలోకవృత్తాంతము

తే.

అలకయౌల మహోదయ మన్పురంబు
బ్రాహ్మణోత్తమ! యీశానురాజధాని
యందు నుందు రజైకపాదాదు లైన
పదురు నొక్కండు రుద్రులు పారిషదులు.

161


సీ.

ఫాలభాగముల నంబకము లందఱికిని
        నవతంసశశిరేఖ లందఱికిని
డమరుఖట్వాంగఖేటకము లందఱికిని
        హస్తిచర్మపటంబు లందఱికిని
శ్యామకంఠప్రదేశమ్ము లందఱికిని
        నౌపవాహ్యవృషంబు లందఱికిని
బవమానభుక్కలాపంబు లందఱికిని
        నాపాండుదేహంబు లందఱికిని


తే.

నందఱికి నగ్నితాపతప్తారకూట
పాటలచ్ఛాయఘనజటాబంధనములు

దేరికొనఁ జూడు మీశానుదిక్కునందు
బ్రాహ్మణోత్తమ! రుద్రుల పారిషదుల.

165


వ.

ఇందఱు నానందకానంబుననందు నీశానదేవుదివ్యలింగంబుఁ బ్రతిష్ఠించి యారాధించి తత్ప్రసాదంబున నీశానదిక్కునందు శాశ్వతసుఖైశ్వర్యంబుల నొందినారు.

166


తే.

కాశి నీశానదేవు శ్రీకంఠుఁ గొలిచి
కాంచు మనుజుఁడు హృదయసంకల్పసిద్ధి
కాశికాక్షేత్ర మష్టదిక్పాలకులకుఁ
గామనావాప్తిసంకల్పకల్పతరువు.

167


వ.

అనిన విని (యనంతరంబ) కొంతద వ్వరిగి శివశర్మ వారల కిట్లనియె.

168


సీ.

ఆవేశచూర్ణంబు లఖిలేంద్రియములకు
        శృంగారరససముజ్జీవనములు
శంబరాంతకభుజాజయకీర్తిమహిమలు
        కోకదంపతులదృక్కూలశిఖలు
బ్రహ్మాండపురవీథిరత్నతోరణములు
        యామినీకర్పూరహారలతలు
నీరదాధ్వాంభోధినిబిడాంకురంబులు
        కుముదకాననములకూర్మిచెలులు


తే.

గరళకంఠాట్టహాసంబు గర్వరేఖ
కైటభారాతి నవనాభికమలశోభ
చంద్రికలు గాయుచున్నవి సాంద్రలీల
భువన మిది యెద్ది? మిగుల నద్భుత మొనర్చె.

169


వ.

అనినఁ బుణ్యశీలసుశీలు రతని కి ట్లనిరి.

170

చంద్రలోకవృత్తాంతము

మ.

మధురాపట్టణవిప్రముఖ్య! శివశర్మా! వేదశాస్త్రాగమాం
బుధిచంద్రోదయ! చంద్రలోక మిది యీప్రో లేలుచుండుం గళా
నిధి యాత్మీయమయూఖకందళశిఖానిష్ఠ్యూతధారాసుధా
విధులన్ భానుగభస్తితప్త మగునీవిశ్వంబు రక్షించుచున్.

171


వ.

సర్గాదియందు శతానందుండు నేత్రంబులను మరీచి, హృదయంబున భృగువు, శిరంబున నంగిరసు, నుదానంబునఁ బులస్త్యు, వ్యానంబునఁ బులహు, నపానంబునఁ గ్రతువు, బ్రాణంబున దక్షు, శ్రోత్రంబున నత్రి , సమానంబున వసిష్ఠు, సంకల్పంబున ధర్ము సృజియించె. అందు నత్రి యనుమునీశ్వరుఁడు.

172


క.

త్రిసహస్రదివ్యవర్షము
లసదృశధృతి నాచరించె నాతఁడు దపమున
విసమాన మతనితేజో
రసపూరం బెగసె బ్రహ్మరంధ్రము దాఁకన్.

173


సీ.

బ్రహ్మరంధ్రము మోవఁ బాఱి యయ్యింద్రియ
        ద్రవ మోడిగిల్లె నేత్రములలోన
నేత్రగోళంబులు నిండంగఁ బర్వి యా
        వీర్యంబు కలధౌతవిమలకాంతి
బదిధారలై పాఱెఁ బదిదిక్కులందును
        నమరాపగానిర్ఝరమునుబోలె
స్రవియించుచున్న యాచరమధాతురసంబు
        ధరియించి చూ లయ్యె దశదిశలును

తే.

నెలలు తొమ్మిది మోచి కాష్ఠలు గఠోర
గర్భలై సూతిమాసంబు గదియుటయును
సత్త్వభారంబు భరియింప శక్తి లేక
వ్రాలె భూమండలంబుపై వడఁకి వడఁకి.

174


వ.

ఆదిగ్దేవతలగర్భంబున నుద్భవించిన తేజం బేకీభవించి చందురుండై యఖిలజగద్ధితార్థం బయ్యరవిందభవునాజ్ఞ నతనిదివ్యస్యందనం బెక్కి యష్టాదశద్వీపంబులం జరియించి తనకుందాన వృద్ధి బొందె. అతని తేజోనిస్సరణంబున సకలజగదుపకారం బగునదీనివహం బుద్భవించె. అట్లు వర్తించి యాసుధాకరుం డవిముక్తస్థానంబున నమృతలింగమూర్తిఁ జంద్రేశ్వరాహ్వయు నీశ్వరుం జంద్రమౌళి దనపేరం బ్రతిష్ఠించి యమృతోదర(క)౦ బనుకుండంబు నిర్మించి తత్సమీపంబున బహుదివ్యవర్షంబులు దపంబు చేసి యాదేవదేవుని ప్రసాదంబున నోషధీతోయంబులకు నగ్రజన్ములకు రా జయ్యె. అమ్మహాదేవుననుగ్రహంబున వెండియు నాజైవాతృకుండు.

175


ఉ.

ఏటికిఁ దానకం బయినయిక్షుశరాసనవైరిజూటీకా
కోటికి మల్లికాకుసుమగుచ్ఛముఠేవ వహించి కైకొనున్
బాటలిమంబు మేనపరిపాటివినోదనవేళఁ బార్వతీ
పాటలగంధిచారుపదపద్మనఖంబుల క్రొత్తలత్తుకన్.

176


తే.

రాజరా జయి పాలించె రాజసమున
వసుధ యెల్ల నేకాతపవారణముగఁ
గాశికాక్షేత్రమునఁ బెద్దగాల మేనిఁ
దపము చేసిన బహులఖేదంబు వాయు.

177


వ.

అంత నక్కాశియందు హిరణ్యగర్భాత్రిభృగువులు ఋత్విజు

లుగా హరి సదస్యుండుగా సినీకుహూద్యుతిపుష్టిప్రభావసుకీర్తిధృతిలక్షులనం దొమ్మండ్రుధర్మపత్నులతోడం గూడి యుమామహేశ్వరప్రీత్యర్థం రాజసూయాధ్వరంబు నొనర్పి యవార్యం బైనయౌదార్యంబున.

178


ఉ.

దక్షిణ యిచ్చె ముజ్జగము దానగుణప్రవరుండు లీల ఫా
లాక్షునిసన్నిధిన్ మఘసమాపనకాలమునందుఁ దారకా
ధ్యక్షుఁడు కాశికాపురమునందు సదస్యులకు బ్రసాదసం
రక్షితసర్వవిష్టపుఁడు రాజు ప్రతాపవిరాజమానుఁడై.

179


తే.

ఇంద్రుకుండంబుకెలనఁ జంద్రేశునొద్దఁ
గాశిలో నవిముక్తోపకంఠభూమిఁ
దపము చేసినచోటన ధవళకిరణుఁ
డాహరించెను రాజసూయాధ్వరంబు.

180


వ.

ఇట్లు రాజసూయాధ్వరంబు చేసినసుధాకరు నవభృథస్నానానంతరమున.

181


సీ.

సకలలోకాహ్లాదసంధానహేతువై
        వెలయ నీకౌముదీవిభ్రమంబు
వర్తింతు వీవు నామూర్తిభేదంబులం
        దొకమూర్తివై సమగ్రోదయమున
శ్రీకాశిలోఁ బ్రతిష్ఠించినాఁడవు నన్ను
        జంద్రేశ్వరుం డనుసంజ్ఞఁ గూర్చి
బ్రహ్మదత్తం బైనరథ మెక్కి యవలీలఁ
        దిరిగి తష్టాదశద్వీపములను


తే.

నాహరించితి రాజసూయాధ్వరంబుఁ
దత్పరత మీఱఁ ద్రైలోక్యదక్షిణముగఁ

జంద్ర! నీయట్టి ధన్యుండు జగతిఁ గలఁడె?
యనుచు వర్ణించె రాజు ఖట్వాంగపాణి.

182


వ.

ప్రతిమాసంబునం బూర్ణిమాదివసంబున జపహోమార్చనధ్యానదానబ్రాహ్మణభోజనంబులు చంద్రేశ్వరస్థానమునం జేసిన ననంతఫలము నొసంగు. ఎవ్వండేని మత్కులంబునఁ గుహూయోగంబునఁ జంద్రోద(య)వారి నభిషిక్తుండై చంద్రేశ్వరుని సందర్శించి వసురుద్రాత్యతర్పణం బొనర్చు నన్నరుండు పితృప్రసాదంబు వడయు. నతని పితృపితామహు లానందంబున నర్థించి వర్తింతు రని వెండియు.

183


సీ.

ప్రత్యష్ట మీతిథిఁ బ్రతిచతుర్దశి సిద్ధ
        యోగీశ్వరీదేవి యోగపీఠి
కాధిరూఢభవాని నకఠోరశశిమౌళి
        హాటకతాటంకహారకటక
కేయూరమేఖలాకింకిణికంకణా
        ద్యఖిలదివ్యాభరణాభిరామఁ
బింగళాహ్వయ నమద్బృందారకశ్రేణి
        నాదిభైరవశక్తి నఖలజననిఁ


తే.

గాళిఁ జంద్రేశదేవోపకంఠనిలయఁ
జంద్రకుండోదకంబున జలక మార్చి
గంధపుప్పోపహారాదికల్పనముల
సేవ చేసిన విఘ్నంబు చేరకుండు.

184


వ.

ఇది చంద్రలోకమాహాత్మ్యంబు. ఈయుపాఖ్యానంబు విన్నను బఠియించినను జనున కాయురారోగ్యైశ్వర్యంబులు సమ

గ్రంబు లై సంభవించు ననిన విని శివశర్మ పుణ్యశీలసుశీలుర కిట్లనియె.

185


తే.

భాగవతులార! భాగ్యసంషన్నులార!
యింత యొప్పునె యుడులోక మెట్టునెదుర
గగనలక్ష్మీలతాతన్వి కబరిమీఁద
సంతరించిన ముత్యాలజల్లివోలె!

186


వ.

ఈలోకవృత్తాంతంబు వినవలతుం జెప్పుం డనిన నతనికి వార లి ట్లనిరి.

187


నక్షత్రలోకవృత్తాంతము

సీ.

సర్గాదిఁ బరమేష్టి చరణంబుపెనువ్రేల
        దక్షుండు పుట్టె నాతనికిఁ బుట్టి
రఱువండ్రు కన్యక లాకన్నియలు రూప
        లావణ్యలీలావిలాసవతులు
రోహిణీప్రముఖ లారుక్మగౌరాంగలు
        శివుఁ గూర్చి యాచరించిరి తపంబుఁ
గాశిలో దివ్యలింగంబు నక్షత్రేశ
        సంజ్ఞంబు నొకప్రదేశమున నిలిపి


తే.

వరణదరియందు సంగమేశ్వరునియొద్ద
దివ్యవర్షసహస్రంబు ద్రిపురవైరి
మెచ్చి పొడచూపి యడుగుఁడు మీరు వరము
లనిన వార లిట్లనిరి కాలాంతకునకు.

188


క.

నీయట్టివాఁడు పురుషుం
డాయెడు మా కభవ! యనిన నట్టిఁడ మీకున్

నాయకుఁ డయ్యెఁడు నని దా
క్షాయణులకు వరము నీలకంఠుం డొసఁగెన్.

189


వ.

వెండియు సమస్తజ్యోతిశ్చక్రంబునడుమ నగ్రగణ్య లయ్యెదరు. మేషాదిరాసులకుం గారణంబు లయ్యెద రాదోషాధీశ్వరుండు బ్రాహ్మణాధిపతి యైనతారకాపతికిం బత్ను లయ్యెదరు. మీచేతం బ్రతిష్ఠితం బైననక్షత్రేశలింగంబు భజించువారలకు భోగమోక్షప్రదం బయ్యెడు. మృగాంకలోకంబునకు మీలోకం బూర్థ్వలోకంబు గాఁగలయది. సర్వతారకామధ్యంబున మీరు మాన్య లయ్యెద రని యానతిచ్చి శివుం డంతర్హితుం డయ్యె. ఇది తారకాలోకవృత్తాంతం బనిన విని యనంతరంబ ముందట బుధలోకంబుఁ గనుంగొని.

190


బుధలోకవృత్తాంతము

సీ.

ప్రతిబింబమో గాని రజనివల్లభున క
        ధ్యాహారమో కాని యమృతరుచికి
వినిమియంబో కాని విధున కన్వాదేశ
        మో కాని యత్రి నేత్రోద్భవునకు
వీప్సయో కాని పూవిలుకానిసఖునకు
        నామ్రేడితమొ కాని యుబ్ధిజునకు
నభిధాంతరమొ కాని యరవిందవైరికి
        సారూప్యమో కాని చందురునకు


తే.

ద్రుమికి నూడ్చినవాఁడు భర్గునికిరీట
కోటి కాభరణం బైన కువలయాప్తు
మిగులఁ జక్కనికొడకండు మింటినడుమ
గ్రహములం దీతఁ డెవ్వండు? గణములార!

191

వ.

ఈతఁ డీలోకంబు సంభ్రమమయంబు విలాసమయంబు రాగ
మయంబు శృంగారమయంబును గావించుచుఁ జక్షురాకర్షణ
సిద్ధాంజనం బన మనోవశీకరణమంత్రం బన నింద్రియావేశ
చూర్ణం బనఁ గౌతుకంబునకు సంతోషంబును, సౌభాగ్యం
బునకు సిద్ధయోగంబును, మన్మథునకుజన్మాంతరంబును, యౌ
వనంబునకు సామ్రాజ్యంబును గల్పించుచున్నవాఁడు.
షోడశవర్ష దేశీయుం డీగ్రహగ్రామణి యెవ్వం డనినఁ బుణ్య!
శీలసుశీలురు శివశర్మ కి ట్లనిరి.

192


చ.

విను మధురామహానగరవిప్రకులోత్తమ! బ్రహవంశవ ర్ధన
శివవర్మ! పుణ్యకథ ధర్మకథల్ పరిపాటిఁ జెప్పఁగా, విన నతి
మాత్రదూర మగు విష్ణుపదంబున కేగుచున్నచో, మనకుఁ
బథప్రయాసములు మానెడు, విఘ్నములుం దొలంగెడున్.

193


వ.

ఇది బుధలోకంబు.

194


సీ.

రాజసూయమహాధ్వరం బెవ్వఁ డొనరించెఁ
        ద్రైలోక్యహంతకారంబుగాఁగ
నెవ్వానిప్రియభామ లిరువదేడ్వురు నల
        ధవళాయతాక్షులు దక్షసుతలు
మన్మథాంతకుజటామకుటకోటికి నెవ్వఁ
        డవతంసకుమమాల్యత వహించె
నెవ్వఁడు నలువతే రెక్కి యష్టాదశ
        ద్వీపియం దసివాఱు దిరిగె లీలఁ


తే.

జంద్రికాపాండుకౌశేయశాటి యైన
యతనుజగజంపుగొడు గెవ్వఁ డవ్విధుండు

పెద్దకాలంబు ముత్యాలగద్దె యెక్కి
వసుధఁ బాలించె నేకోష్ణవారణముగ.

195


తే.

శైశవంబున శాస్త్రంబుఁ జదువఁ వచ్చి
గురునిప్రియభామ యని చేయుఁ బరమభక్తి
యెవ్వతెకు నట్టితార పూర్ణేందువదన
నాఁటనుండియుఁ గామించె నలినవైరి.

196


మ.

జడసుళ్లెంబును బట్టుదట్టియును రక్షాహాటకాలంకృతు
ల్మెడహారంబులు చుట్టె వన్నియరుచుల్ లీలావిలాసంబు పెం
పడరంజేయఁగ యామినీధవుఁడు విద్యాభ్యాసకాలంబున
న్నిడువాల్గన్నులకుం బ్రమోద మొసఁగు న్నిత్యంబునుం దారకున్.

197


సీ.

ఆచార్యుప్రియభామ యని కొన్నిదివసంబు
        లిచ్చగింపఁడు ఱెప్ప లెత్తిచూడ
నుల్ల మువ్విళ్లూర నొకకొన్నిదినములు
        వీక్షించుఁ జూడనివేళయందు
నొకకొన్నితిథులు గర్భోక్తిచాతుర్యంబు
        మెఱయ నేకాంతంబ మేలమాడు
నొకకొన్నిఘస్రంబు లొక్కొక్కనెపమున
        నంగాంగసంస్పర్శ మాచరించు


తే.

నలచి పైఁబడు నొకకొన్నివాసరములు
హృదయ మనురాగసంపద నిగురుగొలిపి
కవయఁ దొడఁగినయది యాదిగాగ నునిచెఁ
జందురుఁడు తార శుద్ధాంతసదనభూమి.

198


తే.

చదివె గురువొద్ద ధర్మశాస్త్రంబు తొలుతఁ
బరమవిశ్వాసతాత్పర్యభక్తిగరిమఁ

జదివె జంద్రుండు కామశాస్త్రంబు పిదపఁ
దలిరుఁబాన్పున ననురక్తి దారయొద్ద.

199


తే.

ఆదిగర్భేశ్వరుం డౌట యనుచితంబు
మిగులఁ జక్కనివాఁ డౌట మేలు గాదు
పాప మభినవయౌవనోద్భాసి యగుట
యరయ మంచిగుణంబుల యవగుణములు.

200


వ.

అవినయనిదానం బైనస్వాతంత్ర్యంబునను గుతూహలబహుళం బైనస్వభావంబునను ధైర్యప్రతిపక్షం బైనయౌవనారంభంబునను నెవ్వని కేమనోవికారంబు పుట్టకుండునే? అదియునుం గాక.

201


సీ.

ఘనతరాహంకారకాలకూటవిషావ
        లాభీలములు గటాక్షాంచలములు
దుర్వారతరతీవ్రగర్వగళగ్రాహ
        కలితగాద్గద్యఘర్ఘరము మాట
యస్మితాసంప్రభూతిస్మయాపస్మార
        విస్తృతధైర్యంబు వినయగరిమ
యుద్దామదర్పభారోష్ణదాహజ్వరా
        రంభసంభృతవికారంబు మనసు


తే.

చరణచంక్రమ దభిమానసన్నిపాత
జాతసర్వాంగకమ్ములు జనపతులకు
భూభుజులతప్పె యది వారిఁ బొందియున్న
ధరణిసామ్రాజ్యభారంబు తప్పు గాక?

202


సీ.

భువనైకధన్విచేఁ బుష్పాయుధునిచేతఁ
        బ్రసవాస్త్రమున నేటు పడనివాఁడు

నతిగాఢమైన క్రోధాంధకారంబునఁ
        గన్నుల నంధుండు గానివాఁడు
నిర్ణిబంధనలోభనిద్రాభరంబున
        బారవశ్యంబుచేఁ బడనివాఁడు
లక్ష్మీకటాక్షలీలాసీధుమదమున
        మనములోపల మన్నఁగొననివాఁడు


తే.

లేడు భూపతిఁ గలిగెనా వాడు నృపుఁడె
విశ్వధాత్రీజనులపాలివేల్పు గాక?
బాహ్యశత్రుల బరిహరింపంగ వచ్చు
నంతరారుల నిర్జింప నలవిగాదు.

203


వ.

అది యట్లుండెఁ దదీయవృత్తాంతంబు విను మని యి ట్లనియె.

204


తే.

తాల్చె గర్భంబు తార సుధాకరునకుఁ
గువలయేక్షణ రాగంబు గొనలు సాఁగ
జంభరిపుదిక్కు ప్రత్యూషసమయమునను
తామరసబంధుగర్భంబు దాల్చినట్లు.

205


తే.

గర్భసంస్థితుఁ డగుగ్రహాగ్రణి విశుద్ధ
సితయశస్స్ఫూర్తి వెలిఁ బ్రకాశించినట్లు
దారమైదీఁగ వికచలోధ్రప్రసూన
పాండురచ్ఛాయ నొయ్యొయ్యఁ బలుకఁ బాఱె.

206


తే.

గర్భసంస్థితసద్గుణగౌరవమునఁ
బోలె గాత్రంబు భరియింపఁజాల దయ్యె
నమృతధారారసాస్వాదసముపజాత
తృప్తియును బోలె నాహారతృష్ణ వదలె.

207

శా.

ప్రత్యుత్థానము సేయుఁ బెద్దలకు నాప్రౌఢేందుబింబాస్య య
ప్రత్యూహస్థిరభక్తిభావమునఁ దోరం బైనగర్భంబుచే
నత్యంతాలస యయ్యు నగ్గురుజనం బందంద వారింపఁగాఁ
బ్రత్యాసన్నసఖీసమర్పితకరాబ్జాతావలంబంబునన్.

208


క.

అంగన యొక్కొకమఱి యు
త్తుంగమణిస్తంభయష్టితో నొత్తిగిలున్
మంగళభవనాంతరమున
బంగారుమెఱుంగుపాలభంజిక పోలెన.

209


ఉ.

బింబఫలాధరోష్ఠి మణిభిత్తిపుటంబులయందు నాత్మబిం
బంబు గరావలంబనసమర్థముగా మదిఁ గోరుఁ గేలిసౌ
ధంబుపయిన్ సమున్నతనితంబపయోధరభారగర్భభా
రంబునఁ గోషలాంగకము త్రాడ్పడఁగేలివిహారవేళలన్.

210


తే.

భవనశృంగారవనలతాపాదపముల
నబలకైదండ పట్టుట యద్భతంబె?
విహృతసౌధమణిస్తంభవిసృమరాంశు
కందళుల నూఁత గొనఁబోవు గర్భగరిమ.

211


తే.

పనులు పంపంగఁజాలదు ప్రాణసఖుల
భవనకార్యప్రవృత్తికై పద్మనయన
తాను గర్భభరాలసత్వంబుకతనఁ
జేయఁజాలదు మఱి వేఱ చెప్ప నేల?

212


మ.

అట మున్నెక్కుడుకేలిశైలమున నధ్యారోహణం బాచరిం
చుటకై నెచ్చెలికత్తియన నగుచుసంసూచించినన్ గాంత యొ
క్కట సంత్రాసము నొందుఁ జన్నుఁగవ యాకంపింపఁగా నిండువే
కటిభారంబునఁ జేసి ధీరహృదయల్ గారాదిగర్భేశ్వరల్.

213

వ.

అంత నట బృహస్పతి పత్నీవియోగవేదనాదూయమానమానసుండై చంద్రుండు చేసినయపరాధంబు హరిహరహిరణ్యగర్భులకు నింద్రాదిసురులకు నెఱింగించిన.

214


సీ.

తగవు గా దనియె మంతన ముండి వృత్రారి
        యనుచితం బనియె హుతాశనుండు
పాతకం బని దెప్పి పలికె దండధరుండు
        దౌరాత్మ్య మనియెను దానవుండు
దుష్కర్మ మని చెప్పెఁ దోయాధినాయకుఁ
        డపకీర్తి యని తూలనాడె గాలి
యన్యాయ మనియె గుహ్యకసార్వభౌముండు
        కాదు కా దనియె శాక్కరగముండు


తే.

హేతుదృష్టాంతములు చూపి యెల్లసురలు
నన్వయవయతిరేకమార్గానువృత్తి
బుద్ధిఁ జెప్పరి యివ్విధమున శశాంకుఁ
డమరగురునకు మగుడ నీఁ డయ్యెఁ దార.

215


వ.

అంత.

216


చ.

ప్రమథులతోడఁ గూడ నతిభైరవఘోరతరాట్టహాసుఁడై
శమనవిరోధి దాఁకుటయుఁ జంద్రుఁడు వేల్పులతో నెదిర్చిన
న్సమరము తారకామయ మనంగ నభోంగణభూమిఁ దారకా
సముదయభీతిహేతువయి సాఁగెఁ బురారికి నబ్జవైరికిన్.

217


తే.

ఈశ్వరునితోడ నని సేయ నెట్లు వచ్చు
నన్యులకు నెంతవారికి నాగ్రహమున
నీశ్వరునిమూర్తి గావున నెదిరి నిల్చి
యుద్ధ మొనరించెఁగాక యనుష్ణకరుఁడు.

218

వ.

అప్పుడు.

219


శా.

చండీశుం బొదవె న్నిశాకరుఁ డవష్టంభంబు జృంభింప బ్ర
హ్మాండక్రోడము శింజినీధ్వనులతో నాఘూర్ణతంబొంద ను
చ్చండాటోపభుజావలేపకలనాసంరంభవక్రీభవ
ద్గాండీవప్రవిముక్తభీషణమహాకాండప్రకాండంబులన్.

220


వ.

ఇవ్విధంబునఁ బ్రతిఘటించి గెంటింపరాని మగంటిమిం బెచ్చుపెరిగి కలువలనెచ్చెలి చిచ్చులుమియు శిలీముఖంబు లొడలఁ గ్రుచ్చి యార్చి శంఖంబు పూరించి సింహనాదంబు చేసి గాండీవజ్యారావంబు రోదసీకుహరంబు నిండ విధుండు దండమహాకాళనికుంభకుంభోదరవీరభద్రాదిప్రమథవర్గంబుతోడం గూడఁ దన్ను నొప్పించినం గోపించి కించిదారజ్యమానలోచనాంచలుండై లలాటలోచనుండు పురనిశాటతాటంకినీకపోలకస్తూరికా(కరి)మకరికాముద్రాద్రోహియు, జలంధరహృదయగర్వసర్వంకషంబును, సింధురాసురశిరఃకూటపాకళంబును, దక్షాధ్వరమృగధ్వంసనక్రీడానృశంసంబును, దుషారగిరికన్యకాభ్రూవల్లీవిలాసరేఖాలలితశృంగంబును నగు నజగవంబున బ్రహ్మశిరోనామకంబైన దివ్యాస్త్రంబు సంధించిన.

221


శా.

ఆకంపించె జగత్త్రయంబు దెస లల్లాడెన సముద్రంబు లు
ద్రేకించెన్ భయమందె భూతలము భేదిల్లెన్ గులక్ష్మాధ్రముల్
శ్రీకంఠుం డవికుంఠవిక్రమమునన్ దివ్యాస్త్రముం గూర్చి వి
ల్లాకర్ణాంతముగా వెసం దివిచి శీతాంశు న్నిరీక్షించినన్.

222


తే.

అప్పు డడ్డంబు సొచ్చి పద్మాసనుండు
ప్రమథనాథునిరోషసంభ్రమము మాన్పి
చంద్రునికి బుద్ధిఁ జెప్పి మాత్సర్య ముడిపి

యాలి నిప్పించె నయ్యుపాధ్యాయునకును.

223


చ.

అమృతమయుండు గావున సుధాంశునితోడిసమాగమంబునన్
రమణి కశుద్ధి లేగనుచు బ్రహ్మరీశులు సంఘటింపఁగా
నమరగురుండు గైకొనియె నంబుజలోచనఁ దారఁ దారకా
రమణముఖిం ద్యజించె నుడురాజును భామిని నెట్టకేలకున్.

224


వ.

అనంతరంబ గర్భం బాలోకించి గురుండు దాని కి ట్లనియె.

225


తే.

అతివ! యీగర్భ మెవ్వరి కైతి చెపుమ
చంద్రునికొ? నాకొ? యని రహస్యమున నడిగె
సిగ్గుపడి యెంత యడిగినఁ జెప్పదయ్యె
నాంగిరసునకుఁ దారఁ తారాధిపాస్య.

226


తే.

చెప్పకున్నను గోపించి యిషిక యెత్తి
చూలు గరఁగంగ వైవంగఁ జూచె గురుఁడు
వేల్పు లాయిందుముఖిఁ జీరి వెఱక చెప్పు
నిజము చెప్పిన నీకు నేనెగులు లేదు.

227


ఉ.

నావుడు తార యొక్కవచనంబును బల్కక యూరకుండె ల
జ్జావనితాస్య యై సరసిజాసనుఁ డప్పుడు నేర వచ్చి యో
దేవి! నిజంబు చెప్పు హిమదీధితిసంగతి నైన గర్భమో?
జీవుఁడు దొంటికాలమునఁ జేసినగర్భమొ? యంచుఁ బల్కినన్.

228


తే.

తోయజదళాయతాక్షి కేల్దోయి మోడ్చి
పలికె నెత్తమ్మిచూలితోఁ బ్రస్ఫుటముగ
వనజసంభవ, తారకావల్లభుండు
చూలుచేసినవాఁ డంచు సూక్ష్మఫణితి.

229


వ.

గురుండును దారకు జన్మించిన కుమారునిం జంద్రుని కిచ్చె. చంద్రుండు నిజనందనునకు బుధుం డను పేరు వెట్టె. బుధుం

డును దండ్రియనుమతి వడసి కాశి కరిగి బుధేశ్వరుం డనుశివలింగంబుఁ బ్రతిష్ఠించి పెద్దకాలంబు తపంబు చేసి యాబుధేశ్వరలింగంబునందు సాక్షాత్కరించిన విరూపాక్షుం బ్రస్తుతించి యమ్మహేశ్వరువలన నక్షత్రలోకంబునకు నూర్ధ్వంబున నున్నలోకంబున కధీశ్వరుం డయ్యె.

230


తే.

చంద్రకుండచంద్రేశ్వరస్థానమునకుఁ
బ్రాగ్దిశాభాగమునయందు భక్తి నరుఁడు
కాశికాక్షేత్రసీమ బుధేశుఁ గొలిచి
పరమబోధంబు దప్పఁడు ప్రాణవిరతి.

231


తే.

అనుచు గోవిందకింకరు లనఘమతులు
బుధునికథ చెప్పుచుండ నభోంతరమున
బోయె దివ్యవిమానంబు పుణ్యకర్మ
కరులనెల వైన శుక్రలోకంబు డాయ.

232


శుక్రలోకవర్ణనము

వ.

అప్పు డయ్యిద్దఱు శివశర్మ కి ట్లనిరి. నిశితశతక్రతుప్రయోగప్రక్రియాక్రమసమర్థశుక్రలోకం బిది. ఇందు దానవగురుండు గావ్యుం డధివసియించు. ఆభార్గవుండు భర్గువలన వర్షసహస్రంబు కణధూమం బాహారంబుగా దుస్సహం బైన తపం బాచరించి మృతసంజీవనీవిద్యారహస్యంబును సకీలకంబుగా నెఱింగినాఁడు.

233


తే.

ఎఱుఁగ రీవిద్య యెవ్వార లిజ్జగమున
బ్రహవంశాగ్రగణ్య! వాక్పతి మొదలుగ
గుహుఁడు దక్కంగఁ గరటివక్త్రుండు దక్క
బార్వతీదేవి దక్కంగ భవుఁడు దక్క.

234

తే.

హరునితోడ విరోధించి యంధకుండు
యుద్ధ మొనరించు చొక్కనాఁ డోహటించె
నజగవోన్ముక్తఘననిశాతార్ధచంద్ర
బాణనిర్భిన్నవక్షఃప్రపాతుఁ డగుచు.

235


వ.

కాలకంధరునకు నంధకాసురునకు నైన యమ్మహాయుద్ధంబున నీల్గిన రాక్షసులను మృతసంజీవనీవిద్యాప్రభావంబున భార్గవుండు బ్రతికించుచుండ దండనికుంభకుంభోదరప్రముఖు లగు పారిషదులు పరమేశ్వరున కి ట్లనిరి.

236


సీ.

దేవ! మహాదేవ! త్రిపురదైత్యధ్వంస!
        యభవ! మావిన్నప మవధరింపు
మీచేత బడసిన మృతజీవనీవిద్య
        బ్రతికించుచున్నాఁడు భార్గవుండు
దైత్యవర్గము నెవ్విధంబున మా కెట్లు
        జయము సిద్ధించు? నాఁ జంద్రమౌళి
నందికేశ్వరుఁ బంచి బందిగ్రహణలీల
        గావ్యుఁ దెప్పించి శ్రీకంధరుండు


తే.

గరతలమునఁ బరిపాండుకాంతి నతనిఁ
దాల్చి దధితోడిచలిదిముద్దయును బోలె
విషము మ్రింగినపెన్నుద్ది వేల్పుఱేఁడు
మనసిజారాతి మ్రింగి గఱ్ఱనఁగఁ ద్రేఁపె.

237


వ.

అంధకాసురుండును భార్గవుండు లేని పిమ్మటం కొంతకాలంబునకుఁ గృతాంతమర్దనుచేత హతుండయ్యె. బహుకాలంబు కాలకంఠుజఠరగోళంబునం దుండి కావ్యుండును.

238


మ.

స్రవియించెన్ దుహినాంశుశేఖరుని మేఢ్రద్వారమార్గంబునన్

గవిశుక్లం బయి తత్క్షణంబున నిజాకారంబుఁ దాల్చె న్మనో
భవవిద్వేషి నిజాత్మసంభవునిఁ గా భావించి వీడ్కొల్పె భా
ర్గవు నాతండు దపంబు సేయ నరిగెన్ గాశీపురీసీమకున్.

239


వ.

అరిగి యానందకాననంబున లింగప్రతిష్ఠ చేసి యాలింగంబునందు విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు భావించుచుఁ జంపక దత్తూత కరవీర కుశేశయ మాలతీ కరణికార కదంబ వకుళోత్పల మల్లికా శతపత్త్ర సింధువార కింశు కాశోకపున్నాగ నాగకేసర క్షుద్ర మాధవీ పాటలా బిల్వ మందార ద్రోణ గ్రంధిపర్ణి దమన చూతపల్లవ దర్భ తులసీ నంద్యావర్త దేరదారు కాంచన దూర్వాంకురాదుల శంకరు ననేకకాలం బారాధించి శుక్రుఁ డీలోకంబుక కధీశ్వరుండయ్యె.

240


క.

వారాణసి శుక్రేశ్వరు
నారాధించిన వరుండు ప్రాపించు సమ
గ్రారోగ్యాయుఃపుత్త్ర
శ్రీరాజ్యైశ్వర్యశౌర్యచిరసౌఖ్యంబుల్.

241


అంగారకలోకవృత్తాంతము

వ.

అట నూర్ధ్వంబున నున్నయది లోహితాంగలోకంబు.

242


సీ.

తొల్లి దాక్షాయణితోఁ బాసి శంభుండు
        మహసంతాపాగ్ని వేఁగుచుండె
నావేళ నొక్కనాఁ డభవుఫాలంబునఁ
        బ్రస్వేదబిందు వుత్పన్న మయ్యెఁ
బరిపక్వకూశ్మాండఫలసన్నిభం బైన
        యాఘర్మజలకణం బవని వ్రాలె

వ్రాలి తత్క్షణమ యవ్వసుమతీస్థలమునఁ
        బద్మరాగోపలప్రతిమకాంతి


తే.

నొక్కదివ్యకుమారుఁడై యుండె నెదుర
నతని నందను గాఁ శంభుఁ డాదరించె
ధాత్రియును వాని భావించెఁ దనయు గాఁగ
నతఁడు ధృతిమెయి దుము సేయంగఁ గోరి.

243


సీ.

భాగీరథీగంగ ప్రవహించు నేవీటి
        పరిసరంబున కుదగ్భాగమునను
వరణాతరంగిణీవార్నిర్ఝరములతో
        నసి(ళి)వేణి యేవీటియవధిఁ గూడెఁ
దప్తంబు హుతమును దత్తంబు నేవీటి
        యైదుక్రోసుల నిచ్చు నమృతలక్ష్మి
వలచు నేవీటి కవ్యాజరాగస్ఫూర్తి
        శైలకన్యకకంటెఁ జంద్రమౌళి


తే.

యట్టి కాశికి గురునాజ్ఞ నరుగుదెంచి
పరమనైష్ఠికుఁ డగుచుఁ దపం బొనర్చెఁ
గలుషసంతానకాననాంగారకుండు
ధారకుఁడు భూతధాత్రి కంగారకుండు.

244


తే.

పాంచముద్రమహాస్థానపదమునందుఁ
గాశి శాశ్వతదేశోపకంఠభూమి
నిష్ఠ నంగారకేశుఁ బ్రతిష్ఠ చేసి
కాంచె నీలోక మేల నంగారకుండు.

245


వ.

ఇది యంగారకలోకవృత్తాంతంబు.

246

బృహస్పతిలోకవృత్తాంతము

క.

అదె వీక్షింపు బృహస్పతి
పదము ధరామరవరేణ్య! బహువిధశుభసం
పదలకు నాస్పద మీతఁడు
చదివినవాఁ డర్థశబ్దశాస్త్రము లెల్లన్.

247


వ.

అయ్యాంగిరసుండు కాశీక్షేత్రమున కరిగి యందుఁ దనపేర శంభులింగంబుఁ బ్రతిష్ఠించి తత్సమీపంబున బహుదివ్యవర్షంబులు దపంబు సేసి తనకుం బ్రత్యక్షం బైన విరూపాక్షు నిట్లని సంస్తుతించె.

248


తోటకము.

జయశంకర! శాశ్వత! చంద్రధరా!
భయనాశ! గిరీశ్వర! భక్తపరా!
నయనత్రయభాస్వర! నాగహరా!
యయవర్ధన! శాంత! దయామధురా!

249


తోటకము.

భువనావన! పావన! భూతపతీ!
భవ! పన్నగభూషణ! భద్రకృతీ!
శివ! దేవ! మహేశ! విశిష్టమతీ!
భవభంగ! ఫలప్రద! పాపహృతీ!

250


తోటకము.

శ్రితపాపవిభంజన! సిద్ధనతా!
క్షితిజార్ధవపుర్ధర! చిద్విదితా!
మృతిజన్మవిధూత! హరిప్రణుతా!
సతతప్రణవధ్వనిసౌధరతా!

251


క.

చాటుకవితాకళాపరి
పాటిం బాటించి యారభటిభక్త్యావే

శాటోపంబున గీష్పతి
తోటకవృత్తములఁ బొగడెఁ దుహినాంశుధరున్.

252


శా.

ఆటోపారభటి న్మునీశ్వరుఁడు దన్నందంద వర్ణింప ద
చ్చాటుప్రౌఢికిఁ జేసె ధూర్జటి మహాశ్లాఘాశిరఃకంపమున్
జూటీకూటవిటంకకోటివిలురత్స్రోతస్వినీవీచికా
కోటీధాటిరటత్కరోటుకుహరక్రోడావగాశ(హ్ర)౦బుగాన్.

253


వ.

ఇట్లు ప్రీతుండై.

254


సీ.

బృహదుగ్రతపము సంభృతనిష్ఠఁ జేసిన
        సామర్థ్యమున బృహస్పతివి కమ్ము
ప్రాణంబు ప్రాణమై భక్తిఁ జేసితి గాన
        జీవాహ్వయము నీకుఁ జెల్లుఁ గాక
వాగ్డంబరమునఁ గైవారంబు సేసితి
        తగుదు వాచస్పతిత్వమున కీవు
పఠియించువారికిఁ బ్రాభవస్ఫురణంబు
        దొరకించు నీచాటుతోటకములు


తే.

లోహితాంగుఁడు పాలించులోకమునకు
నూర్ధ్వమైన పదంబున నుండు వత్స
యనుచు వరములు కృపచేసి యసితగళుఁడు
బ్రహ్మ దలఁచెను దేవతాప్రతతితోడ.

255


వ.

సంస్మరణమాత్రంబున నేగుదెంచిన బ్రహ్మాదిదేవతలచేత నవ్వాచస్పతికి దేవతాచార్యపదవీసామ్రాజ్యంబునకుం బట్టాభిషేకంబు చేయించి యప్పంచాననుండు చంద్రేశ్వరునికి దక్షిణభాగంబున విశ్వేశ్వరునికి నిరృతిభాగంబున ధీషణుండు ప్రతిష్ఠించిన ధిషణేశ్వరునియందు సంక్రమించె. గురుండును

నీలోకంబున కధీశ్వరుం డయ్యె. ఇది బృహస్పతిలోకవృత్తాంతంబు.

256


తే.

దివిజగురునిపదంబు నతిక్రమించి
సౌరిభువనంబు గాంచి యాశ్చర్య మంది
పుణ్యశీలుండు శివశర్మ పుణ్యశీలు
నకు సుశీలున కి ట్లనుఁ బ్రకటఫణితి.

257


ఉ.

పాండురపద్మలోచనునిపార్శ్వగులార! మహాత్ములార! మా
ర్తాండసమానతేజ మిదె ప్రాంతమునందు సముజ్జ్వలప్రభా
మండలమధ్యవర్తియు సమగ్రవిలాససమన్వితంబు నై
రెండవనాకలోక మన దృష్టికి నిం పొనరించె నెంతయున్.

258


శనైశ్చరలోకవర్ణనము

వ.

ఇది యెవ్వరిలోకం బనిన వార లి ట్లనిరి.

259


తే.

శంసితవ్రత! యిది శనైశ్చరునిలోక
మితఁడు గ్రహములలో నెల్ల నతివిశిష్టుఁ
డిమ్మహాత్ముని శుభచరిత్రమ్ము వినుము
విశదముగఁ జెప్పెదము నీకు విస్తరించి.

260


సీ.

నారాయణునినాభినలినమధ్యంబున
        జనియించె బ్రహ్మ యావనజజునకు
సంభవించె మరీచి సంయమిగ్రామణి
        గలిగె నమ్మౌనికిఁ గశ్యపుండు
ప్రభవించె నాకశ్యపప్రజాపతికి మా
        ర్తాండుఁ డబ్భానుండు త్వష్టకూఁతు
సంజ్ఞాభిధాన రాజనిభాస్య వరియించెఁ
        దరణికి నది యపత్యత్రయంబుఁ

తే.

గాంచె మను వన యముఁ డనఁగాఁ దనయుల
యమున యనుకన్య నక్కాల మప్పురంధ్రి
యోర్వలేదయ్యె మగనియత్యుష్ణమైన
తేజమున కతికోమలదేహ యగుట.

261


వ.

అంత.

262


తే.

ఛాయ యనుదాని సృజియించె సంజ్ఞ యొక్క
మానినీమణి నాత్మసమానమూర్తి
నగ్రమునయందుఁ బ్రాంజలి యగుచు నుండె
నతిప్రతిచ్ఛాయ లలితమాయాస్వరూప.

263


వ.

సంజ్ఞాదేవి సవర్ణ యగు నాఛాయ కిట్లను: కల్యాణి! యేఁ బుట్టినింటికిం బోయివచ్చెద. నామాఱై నీవు మదీయాజ్ఞ సూర్యునికిం బరిచర్య చేయుము; మనువును, యముండును, యమునయు ననునీయపత్యత్రయంబు త్వదీయంబుగాఁ దలంపుము. ఈరహస్యంబు కచగ్రహణశాపపర్యంతం బెవ్వరికిం జెప్పకు మని యప్పగించి పితృగృహంబునకుం బోయె; నిట సవర్ణయు.

264


తే.

అష్టముం డగు సావర్ణి యనెడుమనువు
మఱి శనైశ్చరు భద్రాసమాఖ్యఁ గన్యఁ
గాంచే నుష్ణాంశువలన నక్కలువకంటి
తరణియును దాని సంజ్ఞఁగాఁ దలఁచియుండె.

265


వ.

ఆసవర్ణయు సర్వస్త్రీస్వభావం బగు సాపత్న్యగుణంబున సంజ్ఞాసంతానమునకంటెం దనసంతతియందు నత్యంతవాత్సల్యంబు వాటించి భోజనాలంకారలాలనంబులపట్టున వైషమ్యంబు గలిగియుండ నొక్కనాఁడు భవితవ్యతావిలాసంబు

ననో! బాల్యచాపలంబుననో! మమతాస్వాతంత్ర్యంబుననో! జముండు సంజ్ఞాస్వరూపిణియైన పినతల్లి ఛాయాదేవిం గోపించి తన్నం దలంచి పాదం బెత్తిన.

266


సీ.

తనకు సంజ్ఞాదేవి మనములోఁ గడు నమి
        యిల్లడ వెట్టుట యెట్లు మఱచెఁ?
బసిబిడ్డ నేరమి పట్టి పాలార్పంగఁ
        దగవు గా దని యేల తలఁపదయ్యెఁ?
దా నేమి బిడ్డలఁ గానదా? సవతాలి
        కొడుకు త ప్పొకటి లోఁ గొన్న నేమి?
యల్పదోషంబున కననురూపం బైన
        ప్రబలదండన మొనర్పంగఁ దగవె?


తే.

జముఁడు దనమీఁదఁ బాదంబు చాఁచినపుడు
కనికరం బింత లేక యక్కలువకంటి
కంటికొనఁ గెంపు గదురంగఁ గనలి చూచి
పదము దెగి పడ శపియించె బాలు నతని.

267


వ.

అవ్విధం బెఱింగి భానుండు ఛాయాదేవిం జూచి యిట్లనియె.

268


తే.

ఎట్టియపరాధ మొనరించెనేనిఁ దల్లి
కొడుకు శపియింప దిబ్బంగిఁ గ్రూరబుద్ధి
నతివ! సత్యంబు చెప్పు మెవ్వతవు నీవు?
నావుడును శాపభీతి నన్నలిననేత్ర.

269


వ.

తనవృత్తాంతంబు సెప్పె; చెప్పిన దానియం దపరాధంబు పొడగానక యమునిం జూచి మాతృశాపంబు నివర్తింప శక్యంబు గాదు. నీచరణంబునం గలమాంసంబు కృమికీటంబులు తొలిచి భక్షింప భూమిపయిఁ బడియెడు నని పలికి కొడుకు

నూఱడించి త్వష్టృప్రజాపతిభవనంబునకుం బోయి యతనివలన నిజభార్య దపంబు సేయం జనుటయు, నున్న గుఱుతును నెఱింగి యరిగి యగ్రభాగంబున.

270


సీ.

కఠినరింఖాపుటీఘట్టనంబుల భూమి
        పటహనిస్వానంబు ప్రస్తరింప
ధవళలాంగూలపల్లవచాలనంబులు
        గౌముదీచ్ఛాయలఁ గ్రాసి యుమియ
వెలిదామరలఁ బోలు వెడఁదకన్నులయందు
        దారంబు నళులచందము వహింపఁ
బ్రోథసంపుటపరిస్ఫురణావసరముల
        దంతగోరకకాంతి దళుకు సూపఁ


తే.

గొదమగోడిగ యై కురుక్షోణియందు
విపినవీథుల నేకాంతవృత్తిఁ దిరుగు
పరమపుణ్యాంగనాజన ప్రథమగణ్య
సంజ్ఞఁ బొడగాంచె దవ్వులఁ జండకరుఁడు.

271


ఉ.

ఘోటికయై చరించు తనకూరిమిభామినిఁ జూచి క్రమ్మరన్
ఘోటకరూపుఁడై యతఁడు క్రొవ్వెసలారెడుకావరంబుపై
పాటున డాయవచ్చి నిరుపాధికసౌహృదవిభ్రమంబునన్
జీటికి మాటికిం దిశలు చిల్లులు వోవఁగఁ జేసె హేషలన్.

272


తే.

అశ్వరూపుఁ డైన యరవిందబాంధవుఁ
డశ్వ యైన సంజ్ఞ నల్లఁ జేరి
కావరంబుతోడి కందర్పవిక్రియ
మోర మోర మోపి మూరుకొనియె.

273


వ.

ఇవ్విధంబున సాక్షాత్కరించిన తపోలక్ష్మియుం బోలె నబ్బ

డబ బడబానలజ్వాలాజాలలీలావ్రీడావహమహఃపటలపాటలిమపల్లవితదశదిశాభోగ భోగింపం దలంచి పూషవిషమబాణుచిటకంబున నకఠోరదూర్వాంకుచర్వణక్రియాసమభిహారహరితఫేనచ్ఛటాచ్ఛేదపిచ్ఛిలంబును, దారుణ్యదర్పభరకవోష్ణనిశ్శ్వాసధారాధురంధకంబును, జలాచలప్రోథదళసంపుటంబును నగు నాఘోటీవదనంబు చుంబించె. సంజ్ఞయు నిజాంతఃకరణప్రవృత్తియ ప్రమాణంబుగా నతిప్రమాణమూర్తిస్ఫూర్తి యగునత్తురంగంబుఁ బతంగుండ కాఁదలంచి యిచ్చగించె. అత్తళువైన యమ్మత్తకాశిని కించిదున్నిద్రపారిభద్రకలికాచ్ఛాయాముద్ర కుద్ది యగు ముద్ర విరియించుచు మొగుచుచుం గదలకుండిన మోర మోరతో మోపియుఁ, గండంబు గఱచియు, డాసియుఁ, బాసియు, ఱవళి చేసియుఁ, గొంతదడవు వినోదంబునొంది యక్కుహనాహయం బగ్గోడిగ డగ్గఱి క్రీడించి యుండె. అప్పు డమ్మావునకు ముకుగ్రోళ్ల నెక్కి చరమధాతుద్రవంబు కదంబకుసుమకేసరపరాగగంధపాణింధమంబై స్రవించె. అయ్యింద్రియంబున జంద్రబింబానను లిద్దఱు గవలవారు నాసత్యు లనం బ్రభవించిరి. అక్కుమారద్వయంబు.

274


తే.

విబుధవైద్యద్వయం బయ్యె విమలచరిత!
యంత నిజమూ ర్తి ధరియించె నబ్జహితుఁడు
సంజ్ఞయును దాల్చె నిజమూర్తి సంతసించి
[2]దంపతులు చని రాత్మీయసదనమునకు.

275

వ.

అంత నక్కడ శనైశ్చరుండు వారాణసికిం జని లింగస్థాపనంబు చేసె. ఆశనైశ్చరేశ్వరుండు విశ్వేశ్వరదేవునకు దక్షిణభాగంబున శుక్రేశ్వరున కుత్తరంబున సంప్రతిష్ఠితుండై భజియించువారికి భోగమోక్షంబులు ప్రసాదించు. శనైశ్చరునకుఁ దత్ప్రసాదలబ్ధం బీలోకంబు. ఇది శనైశ్చరలోకవృత్తాంతంబు.

276


సప్తర్షిలోకవృత్తాంతము

క.

సప్తమహామునిలోకము
సప్తార్చిఃప్రతిమతేజ! సకలైశ్వర్యా
వాప్తికరం బిది చూడుము
ప్రాప్తాఖలవిద్య! భూసుపర్వవరేణ్యా!

277


వ.

మరీచి యత్రి పులస్త్యుండు పులహుండు క్రతు వంగిరసుండు వసిష్ఠుండు వీరు బ్రహ్మమానసపుత్రులు, సప్తబ్రహ్మలు. వీరికి ధర్మపత్నులు క్రమంబుగ సంభూతి యనసూయ క్షమ ప్రీతి సన్నతి స్మృతి [3]యూర్జ. వీరివలన నా ప్రజాపతులు నానారూపప్రజల సృజియించి బ్రహ్మాదేశంబున నయ్యవిముక్తక్షేత్రంబునఁ దపంబు చేసి మరీచ్యత్రీశ్వరాదిలింగంబులం బ్రతిష్ఠించిరి. సంభూత్యనసూయాదు లగు పతివ్రతలును దమపేర శివలింగంబులం బ్రతిష్ఠ చేసిరి. తత్ప్రసాదలబ్ధం బైన యీలోకంబున సప్తమహామునులును బరమసుఖం బనుభ

వించుచున్నవారు. ఇది సప్తమహామునిలోకవృత్తాంతంబు. ఈలోకంబున కూర్ధ్వంబున.

278


ధ్రువపదవర్ణనము

సీ.

త్రైలోక్యమంటపస్తంభసంభారంబు
        గగనలక్ష్మీకంఠకనకభూష
బ్రహ్మాండకేతకీపాదపప్రసనంబు
        గంగాతరంగిణీక్రౌంచఖగము
బలిదైత్యమథనాంఘ్రిపంకేజవఖరంబు
        దారకావళితులాదండయష్టి
ధాతృలోకద్వారదంతకవాటంబు
        గ్రహమండలీపశుగ్రామవేది


తే.

తారకాశింశుమారకాకారుఁ డైన
యాదినారాయణునితోఁకయలఁచివ(పు)ర
తప్ప కీక్షింపు ధరణిబృందారకేంద్ర!
వివిధకల్పపరంపరాధ్రువుని ధ్రువుని.

279


వ.

ఈతనిలోకవృత్తాంతంబు వినుము.

280


క.

స్వాయంభువమనుధాత్రీ
నాయకుఁ డుత్తానపాదుఁ డనఁ గాంచె సుతున్
దోయజనేత్రలు గేహిను
లాయయ్యకు నిరువు రంబుజాసనవంశ్యా!

281


తే.

కాంత యొక్కత సురుచి యొక్కత సునీతి
సురుచి కుత్తముఁ డను పేరిసుతుఁడు పుట్టె
ధ్రువుఁడు పుట్టె సునీతి కాధ్రువునికంటె
నుత్తమాహ్వయు మన్నించుచుండుఁ దండ్రి.

282

తే.

ఒక్కనాఁ డోలగంబున నున్నవేళ
గురునితొడమీఁదఁ గూర్చుండె సురుచికొడుకు
ధ్రువుఁడు నేతెంచి వాఁ డున్నతొడయె యెక్క
సురుచి వారించె భూపతి చూచుచుండె.

283


వ.

అప్పుడు మఱలి వాఁ డంతఃపురంబున కరిగి యావృత్తాంతం బంతయుఁ దల్లి కెఱింగించి పిన్నయయ్యును నుత్తమక్షత్త్రియతేజోవిశేషంబునం బరిభవంబు సహింపఁజాలక తల్లియనుజ్ఞ వడసి తపంబు సేయ జనువాఁడై యదృచ్ఛాగతు లగు సప్తఋషుల గాంచి సముచితప్రకారంబునం దనవృత్తాంతంబు వారి కేఱిఁగించి వారివలన ద్వాదశాక్షరమంత్రం బుపదేశంబు గొని పరమభక్తిపరాయణుం డైన నారాయణు మధువనప్రాంతంబున యమునాతటంబునఁ బెద్దకాలంబు పెక్కువిఘ్నంబులకు మనంబు చలింపనీక యారాధించి సాక్షాత్కరించిన యప్పుండరీకాక్షువలన విశ్వోత్తరం బైన యిప్పదంబుఁ గాంచె.

284


తే.

ధ్రువుని కిచ్చినవరమును ధ్రువము గాఁగ
నతఁడు దాను వారాణసి కరిగె శౌరి
వానిఁ దనవెన్కదిక్కున వైనతేయు
మీఁద నెక్కించుకొని చిట్టమిడుచు నంత.

285


మ.

శివుఁ గాశీపతి విశ్వనాయకుని సంసేవించి యప్పార్వతీ
ధవునాజ్ఞన్ గ్రహచక్రవాళమున కూర్థ్వం బైనలోకంబునన్
ధ్రువ! వర్తింపు మనేకకాల మనుచున్ బోధించి యేగెన్ మనో
జవనుం డైనఖగేంద్రు నెక్కికొని విష్వక్సేనుఁ డెందేనియున్.

286


వ.

ధ్రువుండును.

287

సీ.

మణికర్ణికావారి మజ్జనం బొనరించి
        యవిముక్తమునయందు శివుని నిల్పి
యాశివలింగంబు ననిశంబు సేవించి
        యందు విశ్వేశ్వరు నావహించి
పంచాక్షరీమంత్రపారాయణంబును
        బ్రణవమంత్రంబును బరిచరించి
విశ్వనాయకుకృపావిభవంబు పెంపునఁ
        బరమోన్నతం బైన పదము గాంచెఁ


తే.

గాశిలోన ధ్రువేశ్వరుఁ గాలగంఠు
భక్తి సేవింప ధ్రువ మైనపదము గలుగుఁ
బంచజనులకు నిది సిద్ధభాషితంబు
సమధికస్మార్తశుభకర్మ! శంబుశర్మ.

288


వ.

అని చెప్పి రంత నివ్విమానంబు ధ్రువలోకంబు గడచి క్రమంబున మహాలోకజనోలోకతపోలోకంబు లతిక్రమించి సత్యలోకంబు గదిసె. అప్పు డవ్విష్ణుకింకరులు శివశర్మ కి ట్లనిరి.

289


శివశర్మ బ్రహ్మవిష్ణుమహేశ్వరలోకంబుల కేగుదెంచుట

క.

ముందఱిది సత్యలోకము
సందర్శింపుము త్రిణేత్రశర్మ! ధరిత్రీ
బృందాలక! యిది పరమా
నందస్థానంబు ద్రుహిణునకు నెల వగుటన్.

290


వ.

అనుచు నతనిం బద్మగర్భుసన్నిధికిం గొనిపోయి రప్పు డవ్విభుండును వారలం బ్రసాదబహుమానంబులం దనిపి ప్రసంగవశంబున నమ్మహాశ్మశానంబున మృతుండు గానివానికి ముక్తి సిద్ధింప దని సముచితప్రకారంబుగా వీడుకొలిపె.

శివశర్మయు నమ్మాటకు సంశయాకులుండగుచుఁ దదూర్ధ్వంబుగాఁ జని చని పుణ్యశీలసుశీలురం జూచి మన కింక నెంత ద వ్వరుగవలయు నెఱింగింపుఁడు. ఇప్పుడు పితామహుండు కాశియందు శరీరంబు విడువనివారికి మోక్షంబు లేదనియె. నాకు నిశ్రేయసంప్రాప్తి యెట్లు గల్గు? అవ్విధంబును వివరింపుఁ డనిన వార లిట్లనిరి.

291


తే.

ఉర్వి కెనిమిదికోటుల యోజనముల
పొడవునం దుండు నా బ్రహ్మభువన మనఘ!
యీప్రమాణంబునం దుండు నిందుమీఁద
విష్ణులోకంబు సతతవర్థిష్ణు వగుచు.

292


వ.

అవ్వైకుంఠంబునకు మీఁదఁ బదాఱుకోట్లయోజనంబుల పొడవున శివలోకంబు కైలాసాహ్వయం బనం దనర్చు. దానికిం బరమం బగు లోకంబు లేదు.

293


తే.

సంశితాచారపర! దాని సంస్తుతింప
నాక కా దచ్యుతునకైన నలీనభవున
కెన శంభునకైనను నహివిభునకు
నైన గీష్పతికైనను నలవి గాదు.

294


వ.

అప్పరమస్థానంబునందు నిందుధరుండు గిరినందనాసహాయుండై దణాధిస్కందనందికేశ్వరాదులు గొలువ నుదారవిహారంబులం బ్రవర్తిల్లుచుండు. అవ్విశ్వేశ్వరుండు విశ్వరక్షణార్థంబుగాఁ జతుర్భుజుఁ జతుర్దశభువనాధిపత్యంబునకుం బట్టాభిషిక్తుం జేసి యనంతరంబ.

295

విష్ణుపట్టాభిషేకవర్ణనము

సీ.

మండువేసవినాఁటిమార్తాండబింబంబు
        గోడగించుఁ బసిండిగుబ్బతోడఁ
దొలుకారు క్రొమ్మెఱుంగులధాళవళ్యంబు
        ఠవణించు రత్నదండంబుతోడ
నచ్చవెన్నెలచాయ హెచ్చుగుం దాడెడు
        వెలిపట్టుజగజంపువలువతోడఁ
గడలియం దేకోదకమువేళఁ బుట్టిన
        పగడంపుఁదీఁగలపంజుతోడ


తే.

వేనవేల్యోజనంబులవిరివి నొప్పు
లక్షకోటిశలాకికాలంకృతంబు
తారకాస్టూలమౌక్తికస్థాపితంబు
విష్ణునకుఁ బట్టె వెనకయ్య వెల్లగొడుగు.

296


తే.

పార్వతీదేవి కైసేసె బహువిధములఁ
బలుకుఁదొయ్యలి రత్నదర్పణము చూపె
శచి నివాళించె మణిదీపసంచయమున
శేషశయనుని పట్టాభిషేకవేళ.

297


సీ.

చాముండి యొనరించు జంపెతాళమునకు
        భృంగీశ్వరుం డాడె బ్రేంకణంబు
వెనుకదిక్కున నుండి కనకభూషలు మ్రోయ
        సూర్యుండు శశియు వీచోపు లిడిరి
వెండికట్టులతోడ వేత్రదండము పూని
        సందడి నెడఁ గల్గ జడిసె జముఁడు
గాలోచితంబుగాఁ గైవార మొనరించెఁ
        బలుకుఁదొయ్యలి గద్యపద్యసరణి

తే.

నఖలలోకములకును బ్రహ్మాండములకు
నాధిపత్యంబు పూని సింహాసనమున
మునులచే వేలుపులచేత మ్రొక్కు గొనుచు
నచ్యుతుం డోలగంబున్న యవసరమున.

298


లయగ్రాహి.

మ్రొక్కిరి గణేశ్వరులు మ్రొక్కె జలజాసనుఁడు
        మ్రొక్కె మునిమండలము మ్రొక్కిరి దిగీశుల్
మ్రొక్కెను మరుద్గణము మ్రొక్కె గరుడవ్రజము
        మ్రొక్కె దనుజావళియు మ్రొక్కి రురగేంద్రుల్
మ్రొక్కె నిగమప్రతతి మ్రొక్కె మనుయూథములు
        మ్రొక్కె నితిహాసములు మ్రొక్కె నచలంబుల్
మ్రొక్కెఁ దటినీకులము మ్రొక్కెఁ జతురంబుధులు
        నక్కమలనేత్రునకు నక్కజపుభక్తిన్.

299


వ.

ఇవ్విధంబున జతుర్భుజు నిర్భరస్నేహంబున భూర్భువస్స్వర్భువనంబుల సామ్రాజ్యభారభరణంబునకుం బట్టాభిషేకంబు సేసి ఫాలలోచనుండు ప్రావృషేణ్యపయోధరధ్వానగంభీరం బగు నెలుంగున స్వయంభూజంభారిప్రముఖులగు బర్హిర్ముఖు లాకర్ణింప, విష్ణుండ యే ననియును, నేన విష్ణుం డనియును, నాకు విష్ణునకు భేదంబు లే దనియును, హరి మంగళాయతనం బనియును, విష్వక్సేనుండు మాననీయుం డనియును, నారాయణుండు జగద్రక్షాపరాయణుం డనియును, నచ్యుతుం డనాదినిధనుం డనియును, నరవిందలోచనుం డాదిపురుషుం డనియును, హరి సర్వపాపహరుం డనియును, నానతిచ్చి తనయిచ్చ నెచ్చోటి కేనియు విచ్చేసె. ఈయాఖ్యానంబును చతుర్భుజాభిషేకం బండ్రు. దీనిం బఠియించినను,

వినినను, వ్రాసినను నరుల కాయురారోగ్యైశ్వర్యాలవృద్ధులు సంభవించు. శివశర్మ! నీ వీరహస్యధర్మమర్మం బెఱింగి హరిహరత్వంబులయందు భేదంబు సేయకుండుమని చెప్పిరి.
అంత నవ్విమానంబు విష్ణులోకంబు గదియుటయు నాతనిం జూచి, యిది వైకుంఠలోకంబు. ఇందు లక్ష్మీసహాయుండై వైకుంఠుం డుండు. నీ విందుఁ బరమానందంబున శతానందపరివత్సరపర్యంతంబు వసియింపుము. ఇటమీఁదివృత్తాంతంబు చెప్పెదము. పుణ్యతీర్థోపాంతమరణంబున నైనఫలంబునను, భూతసుకృతశేషంబునను, భూమండలంబునకు డిగ్గి నందివర్ధననగరంబున వృద్ధకాలుం డనుపేరిరాజువై పెద్దకాలంబు రాజ్యంబు సేయంగలవు. నీ రాజ్యంబునందు.

300


క.

కురియు నెలమూఁడువానలు
సురభులు చ న్నవిసి పితుకు సుకృతము జరుగున్
ధరఁ గొండ్ర వేలు పండును
బరఁగుం బురుషాయుషంబు ప్రజలకు నెల్లన్.

301


వ.

ఇవ్విధంబునం బెద్దకాలంబు రాజ్యంబు సేసి సుతవిన్యస్తరాజ్యభారుండవై కాశి కరిగి యయోధ్యావంతీమధురామాయాద్వారావతీకాంచ్యుజ్జయినీతీర్థసేవాఫలంబున విశ్వనాథుప్రసాదంబున నపవర్గంబుఁ గాంచెద వని పలికి విష్ణుకింకరు లతని దివ్యవిమానంబువలన డించి నారాయణదేవు సముఖంబునం బెట్టిరి. అప్పుణ్యశ్లోకుండును విష్ణులోకంబునం బెద్దకాలంబు సుఖం బనుభవించి పుణ్యశీలసుశీలురు చెప్పినప్రకారంబున మోక్షంబు వడసె నని లోపాముద్రకు గుంభసంభవుండు శ్రీశైలకటకంబునందు సకలతీర్థంబులుం

గాశీప్రాపణద్వారంబున నానాసదుపకారంబులై మోక్షంబు సిద్ధించు, కాశి యవ్యవధానంబున ముక్తినిచ్చు ననునర్థంబుఁ దేటపఱచె. ఇది శివశర్మనిర్వాణం బను నుపాఖ్యానంబు. దీని విన్ననుం బఠియించినను వ్రాసినను నరుల కాయురారోగ్యైశ్వర్యములు సంభవించు నని చెప్పి.

302


ఉ.

చేసెఁ బ్రదక్షిణంబు కలశీసుతుఁ డద్రికి మల్లికార్జునా
వాసశిఖాంతరంబునకు వామవిలోచనతోడఁ గూడ విశ్వా
సము భక్తియున్ హితము శాంతియు దాంతియు నొప్ప నంతరా
ధ్యాసితశంభులింగసముదాయము వారక సంభజించుచున్.

303


వ.

చేసి కతిపయప్రయాణంబుల.

304


అగస్త్యుండు కుమారస్వామిని దర్శించుట

లయగ్రాహి.

సామిమలకుం జని మహాముని ఘటోద్భవుఁడు
        భాషయును దాను గడునేమమునఁ బుణ్యా
రామతరువాటి మణిధామమున నున్న యభి
        రామసుకుమారతరహేమనిభగాత్రున్
సామజముఖానుజు సుధామధురమందహసి
        తామలకపోలవదనామృతమయూఖున్
హైమవతిపట్టి నఖిలామరశరణ్యు నత
        కామితకరున్ గొమరసామి భజియించెన్.

305


వ.

అనిన విని నైమిశారణ్యవాసులు కుమారస్వామి దర్శించిన యటమీఁది వృత్తాంతం బెయ్యది? యని యడిగిన.

306


ఆశ్వాసాంతము

శా.

వేమక్షోణివరానుసంభవ! దిశావేదండగండస్థలీ
సీమావిచ్ఛిలదానగంధలహరీశ్లేషానుభూతిక్రియా

సామగ్రీపటుకీర్తివైభవ! కుభృచ్ఛార్దూల! సౌభాగ్యరే
ఖామత్స్యధ్వజ! మత్స్యవంశనృపరక్షాకేలిపద్మేక్షణా!

307


క.

అరిరాడ్గజకఠీరవ
బిరుదాలంకారపృథులభీషణబాహా
కరవాలనిశితధారా
పరిఖండితదుర్మదాంధపరిపంధినృపా!

308


ఉత్సాహ.

అసమబాణనిభవిలాస! యాజిగాండివాయుధా
బసవశంకరా! విశుద్ధపంటవంశవర్ధనా!
కసిమికోట మేకరాయి కప్పకొండ కిల్లెడా!
ద్యసుహృదవనిపాంతరంగహాలహలవిషానలా!

309


గద్య.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతం బైనకాశీఖండం బనుమహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము.

  1. కములచేఁ జూఱ
  2. యతిభ్రంశము. కాననిట్లు పాఠముండి యుండును. చనిరి దంపతు లాత్మీయసదనమునకు. (ఉ. వేం. రం)
  3. ‘యక్ష’ యని పెక్కుప్రతులఁ గనఁబడుచున్నది. ఇది ‘సంభూతి రనసూయాచ క్షమా ప్రీతి శ్చసన్నతిః, స్మృతిరూర్జాక్రమాదేషాం పత్న్యో లోకస్య మాతరః’ అను మూలమునకు విరుద్ధము.
    అరుంధతి యని వేఱొక పా.