కాశీఖండము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తృతీయాశ్వాసము

శ్రీమద్దేసటి వంశ
గ్రామణి! మూర్థాభిషిక్తకంఠీరవ! సు
త్రామనిభవైభవోన్నత!
భామాపాంచాల! వీరభద్రనృపాలా!

1


వ.

అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె.

2


ఉ.

ఆపృథివీధరంబు హృదయంబున సంతస మందె నెంతయుం
గోపనుఁ డెల్లకాలమును గుంభభవుం డతఁ డిప్పు డుగ్రుఁడై
శాపవిషప్రయోగమునం జంపఁదలంచిన నడ్డ మెవ్వ ర
ష్టాపదశైల మిప్పటికి శంక వహింపకయుండుఁగావుతన్.

3


వ.

అని కుంభసంభవుని ప్రత్యాగమనంబుఁ గోరుచు వింధ్యాచలంబు వంధ్యోదయం బై వసుంధరాగర్భంబున నడంగియుండె.

4


తే.

ముని జటాధారి శివభక్తుఁ డనఘమూర్తి
యెవ్వఁ డేతెంచు నప్పు డఱ్ఱెత్తిచూచుఁ
గుంభసంభవుఁ డనుకోర్కి కొనలుసాఁగ
వసుమతీధర మతఁ డేల వచ్చు మరలి?

5

తే.

మొదలగల పెన్కువయుఁ(ను)బోయి ముడిఁగె నద్రి
కలశజునినేత్రములఁ గెంపు గాన నైన
నొరుని యైశ్వర్య మీక్షించి యుపతపించు
నట్టిఖలునకు నిది పెద్ద యౌనె? తలఁప.

6


క.

సిద్ధింప వీప్సితంబులు
సిద్ధించెన యేని బిదపఁ జెడు నన్యునిసం
వృద్ధిఁ గనుంగొని యెవ్వని
బుద్ధి నసూయాగ్రహంబుఁ బొందు నతనికిన్.

7


తే.

అప్రయోజన మభివృద్ధి నతిశయిల్లు
నప్రయోజన మడఁగుఁ గాలాంతరమున
నకట! యీర్ష్యాగ్రహగ్రస్తుఁ డైనయట్టి
ఖలునిసంపద విధవచన్నులును బోలె.

8


వ.

ఆసమయంబునం బాకశాసనపావకపరేతరాజపలలాశిపాశిపవనపౌలస్త్యపశుపతులు పరమహర్షోత్కర్షంబున నగస్త్యమహర్షిం బ్రస్తుతించిరి. పతంగుండు బసిండికొండనెత్తంబు చక్కటివియత్తలంబున నడవం దొడంగె.

9


సీ.

స్ఫటికభూములయందుఁ బ్రతిబింబములు చూచి
        యితరాశ్వబుద్ధి హేషిత మొనర్చుఁ
బద్మరాగోపలప్రస్థభాగములందుఁ
        జరమసంధ్యాశంక జాడ్య మందు
మరకతమణిశిలామధ్యంబునందు దృ
        శ్యాదృశ్యమూర్తులై యలరుచుండు
వైడూర్యమాణిక్యవప్రాంతరములందు
        సలిలాభిలాష నౌదలలు వాంచుఁ

తే.

గిన్నరస్త్రీలఁ జూచి లంఘింపఁ బాఱుఁ
గావరం బెత్తి యుద్ధామకామవృత్తి
వాయుజవములు రవితేరివారువములు
వేల్పుగుబ్బలిప్రస్థానవీథియందు.

10


సీ.

తమతనుచ్ఛాయ మేఘములు పచ్చనివన్నె
        నుభయపక్షములు నై మూఁగియాడఁ
గళ్లేలఁ దెగినసృక్వముల క్రొన్నెత్తురు
        లాననంబులకుఁ గెం పావహింప
నుడుపథంబునయందు నుండినగతి ధార
        గమనవేగంబునఁ గానఁ బడఁగ
శుకముఖద్విజకోటి సులభకౌతూహల
        వ్యతిషంగమునఁ జేరి యనుసరింపఁ


తే.

జిలుకలును బోలె హేమాద్రిశిఖరశృంగ
కల్పవృక్షాటవీవాటికలఁ జరించె
మహిధరముసేయునంకిలి మానుటయును
వనజవనబాంధవుని తేరివాగువములు.

11


సీ.

ఆకాశవాహినిసైకతంబుల ఖురాం
        చటంకములు గ్రుంగ జటులువడిన
శాంతకుంభాచలస్థపుటస్థలంబుల
        జక్రాభిహతివడి చాలకున్న
బహులదూర్వాశంకఁ బ్రణతదేవకిరీట
        మరకతద్యుతులకై మరులుగొన్న
నిందుబింబముఁ జూచి చెందుప్పుగలుసావి
        యఱు లెత్తి నాకంగ నాసపడిన

తే.

బసిఁడిగిలుకలచెర్కోలఁ బరిఢవించి
కఠినహుంకార మొనరించి కనకరథము
వారువంబులఁ బఱపె దుర్వారలీల
బిరుసు తహతహ వినువీధిఁ బిచ్చుకుంటు.

12


అగస్త్యుండు దక్షిణకాశికిం బోవుట

వ.

ఇవ్విధంబునం భువనోపద్రవంబు బ్రశాంతిం బొందించి దక్షిణకాశీసందర్శనంబునంగాని
కాశీవియోగవేదనాభారంబు డిందుపడ దని డెందంబున నిశ్చయించి మందమందప్రయాణంబుల గెందలిరాకుఁబోఁడియాకులతం బొందికను గందకుండ ముందఱఁ బిఱింది నడపించుచు నెడనెడఁ బుణ్యవాహినీతీర్థంబులఁ గ్రుంకులువెట్టి యష్టమూర్తి నభ్యర్చించుచుం గొన్ని వాసరంబులకుఁ గుంభసంభవుండు గోదావరి నొరసికొనుచు నాంధ్రదేశంబున నరుగునప్పుడు.

13


మ.

అహరారంభములందుఁ బ్రస్రవణశైలాధిత్యకాకందరా
కుహరక్రోడకటాహగద్గదనదద్గోదావరీసింధువా
ర్లహరీశీకరమాలికాశిశిరము ల్పంపాసరుల్ దండకా
గహనగ్రాహులు వాయువుల్ దపసికిం గావించె నాహ్లాదమున్.

14


తే.

ఋషిఁకి బంపాసరోవీచిపృషతశిశిర
గంధవాహప్రవాహసంబంధములును
గాశికాక్షేత్రవిప్రయోగప్రభూత
తాపశాంతి యొనర్పంగ నోప వయ్యె.

15


సీ.

పట్టుగా శ్రీవీరభద్రేశు సేవించి
        యికి సోమనాథునంఘ్రులకు నెరఁగి
పురశాసను ననంతభోగీశ్వరస్వామి

        హిమశైలకన్యకాధీశుఁ గొల్చి
పద్మాద్రిపై రుద్రపాదంబు లర్చించి
        చేరి మార్కేండేయశివు భజించి
కోటిపల్లీతీర్థకుండలాముఖముల
        నర్ధేందుధరు విరూపాక్షుఁ దలఁచి


తే.

పల్వెలస్థానమున భూతభర్త నిలిపి
కాంతమున వృద్ధగంగలోఁ గ్రుంకువెట్టి
దక్షవాటిక సప్తగోదావరమున
మునిఁగి భీమేశ్వరునిఁ గాంచె మునివరుండు.

16


శా.

ప్రాతఃకాలము తీవ్రభానుఁ డుదయింపన్ సప్తగోదావరీ
స్రోతఃపూరమున న్మునింగి యభవున్ సోమార్ధచూడామణిన్
జ్యోతిర్లింగమయస్వరూపుఁ గొలిచెన్ శుద్ధాంతరంగంబునన్
బాతివ్రత్యమహాప్రభావనిధి లోపాముద్ర భీమేశ్వరున్.

17


మ.

మునిచూడామణి యెల్లసత్కళలకున్ మూర్ధాభిషిక్తుండు గా
వునఁ జారీకరణాంగహారముల ఠావుల్ మించి కీర్తించుచున్
శనివారోత్సవవేళఁ గన్గొనియె నాస్థానంబునన్ రాజనం
దనయుం దానును దేశిమార్గమున గంధర్వాప్సరోనృత్తముల్.

18


వ.

అంత.

19


తే.

కుంభజుఁడు దక్షిణాభిముఖుం డగుటయు
నదను వీక్షించి వచ్చెనో యనఁగ వచ్చె
శంబరారిప్రతాపాగ్నిసామిధోని
నవశరద్వేళ శ్రీభీమనాథుఁ గొలువ.

20


తే.

జిగురుకొన్న రజస్స్ఫూర్తిఁ జెఱఁగుమాసి
జలజకుండోదకంబుల జలకమాడి

మలయజాచ్ఛపయోధరమండల లగు
దిగ్వధువులందు రుచిఁ బ్రవర్తించె నినుఁడు.

21


సీ.

అభినవోన్మేషజం బై నట్టి తొలుచూపు
        కౌస్తుభాలోకరేఖలకు నలఁగ
సాగభంగం బైనయావులింతకు వేల్పు
        లంగుటిస్ఫోటనం బాచరింప
సౌఖశాయనికులై సంవర్తభృగ్వాది
        మునులు హస్తాంభోజములు మొగుడ్ప
ధృతచేతనంబులై దివ్యాయుధంబులు
        జయజయధ్వనులతో సంస్తుతింప


తే.

నలువఱేకులు బేలెపెంజిలువఱేని
యరవికుబుసంపుఁబొరలు మై నంటియుండ
నిదుర మేల్కాంచి కూర్చుండె నుదధినడుమ
విష్ణుఁ డఖిలేశ్వరుఁడు శరద్వేళయందు.

22


వ.

వెండియుఁ బాకదళావిశీర్ణదిశాశాల్మలీగుల్మతూలరాశిదేశీయంబులు వియదురగనిర్మోకశకలవిభ్రమంబులు నభ్రముపతిశరీరశుభ్రంబులు నగుసితాభ్రంబు లభ్రంమంబునం బరిభ్రమించి ఖండఖండంబులై యాఖండలకోదండదండంబుల గగనమండలంబున నలంకరించె కొదమమొగుళ్ళు దెరలును దండంబడఁబడు వలుఁదవడగండ్లు పుష్పాంజలులును నుఱుముచప్పళ్లు మర్దళధ్వనులుగా గగనరంగస్థలంబునం గ్రొమ్మెఱుంగు మెఱుంగుఁబోఁడి గొండ్లి పరిఢవించె. మత్తవనమయూరమత్తికాశిని (స)కలహంసమధు(ర)కంఠకేకాగీతికావసానంబునం గళాపించె. కుంభద్రోణంబు లంభోధరంబులు గురిసి వెలిసిన

యనంతరంబ యంతంత నుట్టిపడు నట్టిసలిలబిందువులన రజనీశుక్తిముక్తాఫలంబులు నక్షత్రంబు లంతరిక్షంబున సంప్రేక్షణీయంబులయ్యె. దాక్షారామకటకాప్సరస్తాటంకినీవదనారవిందలావణ్యబిందునిష్యందంబు చందురుండు కందర్పదిగ్విజయకీర్తిస్ఫూర్తియుంబోని యచ్చవెన్నెల విచ్చలవిడిం గాయందొడంగె. కుముదంబులు ముదం బందె. లాంగలి చెంగలించె. ఱె ల్లుల్లసిల్లె. కాసర గాచె. దొస దోరగిలం బారె. పయ్యెద విసరె. వాడిమందటిలియె. కరి మదంబుఁ గురిసె. నందిపోతు పోతరించి ఖణిల్లున ఱంకె వైచె. అసలడుగువడియె. నెఱిని నిసుక దెస దీవి చూపె. నీడ సవియయ్యె. ఏకాకులపొన్న క్రొన్నన పెరిఁగె. వరిగ విరిగె. గసగస యెసక మెసఁగె. పెస రుసురుకొనియె. తవిద పొదలె. ఱెక్కప్రాసంగు దొండముక్కపడియె. మదకలకలహంససంపద సల్లాపకోలాహలవ్యాజృంభకరంభితకకుబంతంబులై(న) విహారవేశంతంబులు కాంతాకుచద్వయ ద్వయసవాఃపూరవంతంబు లయ్యె నయ్యవసరంబున.

23


తే.

కార్తికపువేళ భీమశంకరునినగర
వింధ్యసంస్తంభయిత దూరె విమలబుద్దిఁ
దొయ్యలియుఁ దాను జిచ్చఱతోరణంబు
కలుషసంహతిసంహారకారణంబు.

24


క.

దక్షిణవారాణసి యగు
దాక్షారామంబు సొచ్చి తరుణేందుధరున్
వీక్షించినకోలెను గా
శీక్షేత్రాలోకసుఖమ చేకుఱె మునికిన్.

25

క.

క్లేశంబును సౌఖ్యంబును
నాశువునను గుంభజన్ముఁ డభిమర్శించెం
గాశీవిరహము దక్షిణ
కాశీసంగమము వరుసఁ గలిగినకతనన్.

26


వ.

పరోపకారపరుండుయినవానికిఁ బుంఖానుపుంఖంబు సంపదలు సంభవించు. తీర్థస్నానదానజపహోమదేవతార్చనాదులు పరోపకాంబునుం బోలనేరవు. పరాకారంబునకంటె ధర్మంబు లేదు. లోకోపకారపరాయణుం డైనవాతాపిదమనున కింతవింతలేసి ప్రయోజనంబులు సమకూఱకుండునె? ఇవ్విధంబున భోగమోక్షనివాసం బైనదాక్షారామంబునం గొన్నిదివసంబు లుండి కొల్లాపురంబునకు శ్రీమహాలక్ష్మి దర్శింపం(బోఁ)దలంచి యమ్మైత్రావరుణుండు.

27

అగస్త్యుండు కొల్లాపురంబున కేఁగుచు మార్గమున వీరభద్రేశ్వరు దర్శించుట

సీ.

అంతఃప్రవాహమై యావిర్భవించె నే
ధరణీధరముపొంతఁ దుల్యభాగ
పాఱె నేశైలంబుపాదమూలంబునం
గల్లేటితో వృద్ధగంగ వాసి
యుదయించె నేకొండయుత్తరాశారసా
తలకుక్షి సప్తగోదావరంబు
జనియించె నేశిలోచ్చయము దక్షిణమున
గణ్యవాహిని యుప్పుఁగడలికొమ్మ


తో.

(పద్మ)(భర్మ)గిరితోడఁబుట్టు వేపర్వతంబు
బలసియుండు నేయద్రికిఁ బంచలింగ

మట్టిశ్రీవీరభద్రమహాచలమున
కరుగుదెంచెను వింధ్యదర్పాపహారి.

28


వ.

ఇట్లరుగు దెంచి లోపాముద్ర కి ట్లనియె.

29


తే.

దక్షిణానందవిపనమధ్యంబునందు
గ్రతువిధిధ్వంసవేళ దేవతల నురిపె(సె)(పి)
వీరభద్రేశుఁ డీయద్రి వెన్నుఁ దన్ని
గౌతమీవారిఁ దనవాలు గడిగినాడు.

30


తే.

పంకజక్ష్మాధరము వీరభద్రగిగిరియు
నంధ్రభూమికి వక్షోరుహద్వయంబు
భువనచక్షుఃకరండ మంభోరుహాక్షి!
గౌతమీగంగ ముత్యాలకంఠమాల.

31


సీ.

ఎవ్వాఁడుడాచేతి క్రొవ్వాఁడినఖములఁ
        జిదిమె భాషాదేవిచిగురుముక్కుఁ
గనకమేఖలఁ గ్రుచ్చి కట్టె నెవ్వఁడు లీలఁ
        జెఱఁగుపైఁ బూషార్కుమెఱుఁగుపండ్లు
కొసర కెవ్వఁడు పదాంగుష్ఠభాగంబున
        నుడురాజుపొట్టగొం జుఱుక నూఁదెఁ
దఱిగె నెవ్వఁడు ఖడ్గధారాంచలంబున
        నగ్నినాలుక లేడు నంటఁదఱిమి


తే.

మోదెఁ నెవ్వాఁడు ముప్పదిమూఁడుకోట్ల
వేలుపులఁ బారఁ బార వెన్వెంటఁ దఱిమి
యట్టిశ్రీవీరభద్రుఁ డీయద్రిమీఁద
భద్రకాళియుఁ దా నుండుఁ బద్మనయన!

32

తే.

బ్రహ్మసంవేద్య మాదిగాఁ బట్టె సొంత
మతివ! గోదావరీనదీహారమునకు
నడుమ నాయకరత్నమై నలుపు మిగులుఁ
బంచలింగాశ్రయము వీరభద్రశిఖరి.

33


వ.

అని చెప్పి యచ్చోట గదలి ప్రతిదినప్రయాణంబుల.

34


క.

క్షీరారామంబునఁ బ్రా
చ్యారామంబునను నాదిమారామమునం
దారాధిపచూడామణి
నారాధించెను మునీంద్రుఁ డతివయుఁ దానున్.

35


వ.

అనంతరంబ యమ్మునిసింహంబు సహ్యగిరికన్యకాప్రవాహంబునఁ గృతావగాహుం డయి కదలి పశ్చిమాంభోధితీరంబున సౌరాష్ట్రసోమనాథేశ్వరశరచ్చంద్రచంద్రికాధౌతకలధౌతసౌధవీథికాసముల్లిఖితగగనమండలం బయి పదునెనిమిదియోగపీఠంబులందును సుప్రసిద్ధం బైనకొల్లాపురంబునకుం జని యందు.

36


ఉ.

శ్వేతవరాహకల్పమున వెన్నుఁడు సూకరవేషధారియై
యాతతదంష్ట్రికాంకురమునందు ధరిత్రి వహించియుండఁగా
నాతనిమీఁద లేఁతపొలయల్క వహించి తొలంగి వచ్చెనో
యీతరలాక్షి? యండ్రు బుధు లెప్పుడు నాజగదేకమాతృకన్.

37


తే.

భద్రకాళికయై ఘోరపరశుధారఁ
గ్రూరదైత్యునిఁ బొరిగొన్న ఘోరమూర్తి
శౌరివక్షస్స్థలీనభశ్చంద్రరేఖ
శ్రీమహాలక్ష్మి భక్తి వీక్షించెఁ దపసి.

38

క.

కొల్లాపురిలక్ష్మికిఁ బ్రణ
మిల్లిరి పులకాంకురములు మేనులఁ బొడమన్
హృల్లేఖామంత్రోపని
షల్లతికాకుసుమమునకు సతియుం బతియున్.

39


వ.

అనంతరంబ కుంభసంభవుం డాత్మగతంబున.

40

అగస్త్యుండు లక్ష్మిని స్తోత్రముచేయుట

సీ.

క్షీరోదకన్యకు శ్రీమహాలక్ష్మికి
        గమలాయతాక్షికిఁ గంబుకంఠి
కఖిలలోకేశ్వరి కామ్నాయవినుతకుఁ
        గనకకైతకపుష్పగర్భగౌరి
కరుణాధరోష్ఠికి నమరకోటికీరీట
        కోటివిటంకసంఘాటఘటిత
రత్నాంకురప్రభారాజినీరాజిత
        శ్రీపాదపద్మపీఠోపకంఠ


తే.

కంబురుహనాథుదేవికి నాదిశక్తి
కిందిరకు లోకమాతకు నిగురుఁబోఁడి
కలరువిల్కానితల్లికి నాశ్రితార్థ
కల్పవల్లికి మ్రొక్కఁగఁ గంటి మంటి.

41


వ.

అని అనంతరంబ.

42


తే.

చంద్రమునియందు జ్యోత్స్నవు చంద్రవదన!
ప్రభవు వాసరకరునందుఁ బద్మనయన!
దాహశక్తివి పూఁబోఁడి! దహనునందు
మ్రొక్కెదను నీకుఁ గల్యాణమూర్తి! లక్ష్మి!

43

తే.

బ్రహ్మ పుట్టించు మనుచు నారాయణుండు
హరుఁడు హరియించు భువనంబు లవసరమున
నెందు సమకూఱు వీరికి నీప్రభావ
మీవు గలుగంగఁ కా కిందువదన!

44


ఉ.

పండితుఁ డాతఁ డాతఁడు ప్రభావసమగ్రుఁ డతండు శూరుఁ డా
తండు వివేకి యాతఁడు వదాస్యుఁ డతండు మహాకులీనుఁ డా
తండు కళావిదుం డతఁడు ధన్యుఁ డతండు మనోజ్ఞమూర్తి యె
వ్వండు భవత్కృపాకలనవైభవలక్ష్మికిఁ బాత్రుఁ డిందిరా!

45


చ.

పురుషునియందు భాగ్యమును బొల్తుకయందు విలాసరేఖయుం
గరిహరులందుఁ బక్షి భుజగంబులయందు మహీరుహావళీ
హరితతృణంబులందుఁ బసులందును బెయ్యలయందుఁ గుక్కలం
దరుదగు బెంపు నొప్పు భవవంశముగాదె తలంప నిందిరా!

46


ఉ.

[1]ఎవ్వని నేని నీవు దయ నించుకఁ జూచిన వానిఁ జూతు ర
ప్పువ్విలుకానిఁగా సతులు భూపతిఁగా బ్రజ కల్పకంబుగాఁ
నవ్విబుధాశ్రితవ్రతతి యంబుధిఁగాఁ గులగోత్రగోత్రముల్
కవ్వడిఁగాఁ బరద్వేషులు గర్ణునిగాఁ గవు లెల్ల శ్రీసతీ!


ఆ.

కమలనయన! నీవు కలచోటు సరసంబు
నీవు లేనిచోటు నీరసంబు
కంబుకంఠి! నీవు కలవాఁడు కలవాఁడు
లేనివాఁడు నీవు లేనివాఁడు.

47


సీ.

పరిపూర్ణహేమకుంభములు హస్తంబుల
        ధరియించి యిరువంకఁ గరులు గొలువ

బహుళమై వరశంఖపద్మ మహాపద్మ
        మకరాదినిధులు నేమమునఁ గొలువఁ
వింజామరలు దాల్చి వెనుకదిక్కున దేవ
        గంధర్వగుహ్యకాంగనలు గొలువ
నెలవంక బలువంక నింద్రాదిదివిజులు
        సేవాంజలులు మౌళిఁ జేర్చి కొలువ


తే.

భర్మపంకజకర్ణికాభద్రపీఠి
కాగ్రమున నిండుకొలువుండి యఖిలలోక
రక్షణము సేయు నిన్నేసు బ్రస్తుతింతు
నసమసౌభాగ్యగుణధన్య! యబ్ధికన్య!

48


వ.

సమర్థవస్తువిభాగంబు సేయవచ్చిన శక్తిమంతుండైన యీశ్వరునకు శక్తి యగునీకు భేదంబు లేదు, గావున శక్తుం డగు నీశ్వరునకుం గలసృష్టిస్థితిసంహృతిస్వభావస్వరూపంబు లైనకృత్యంబు లైదును నీయవి. దహనునకు దాహశక్తియు, నుష్ణాంశునకు దీధితియుఁ, జంద్రునకుఁ జంద్రికయుంబోలె నీశ్వరునకు నీవు సహజవు ధ్రువవు నై యుండుదు. ఇహజన్మజన్మాంతరంబుల విహితంబు లైనవ్రతదానాదులచేత సంచితంబులైనదురితంబులు నిరసింపఁబడుటం జేసి యస్తరజస్తము లైనంత యుత్తములు విశుద్ధసత్వులయి నీతత్త్వంబుఁ జింతింతురు. భోగాపవర్గలక్షణం బైనఫలంబు పరమేశ్వరుండు పశుగణంబున కిచ్చునపుడు నిన్ను మున్నిడికొనికాని యీఁజాలండు. శబ్దబ్రహ్మంబు కారణబింద్వాత్మకంబై బిందునిష్యందత్వంబున (కుం)బురుషచ్ఛాయాప్రయత్నంబున మూలాధారావస్థితపవనసంధుక్షణంబునం జేసి

యభివ్యక్తంబై పరావా క్కనంబడు.ఆబ్రహ్మం బీనాభిపర్యంతం బావాయువుచేత నభివ్యజ్యమాసంబై విమర్శరూపంబైన మనంబుతోడంగూడి సామాన్యస్యందప్రకాశరూపిణియుఁ గార్యబిందుతత్త్వాత్మికయు నీశ్వరాధిదేవతయు నై పశ్యంతీవా క్కనంబడు. ఆ బ్రహ్మం బావాయువు చేతన హృదయపర్యంతం బభివ్యజ్యమానంబై నిశ్చయాత్మకబుద్ధియుక్తంబై
విశేషస్పందస్వరూపయు నాదబిందుమయయు హిరణ్యగర్భాధిదేవతయు నై మధ్యమవా క్కనంబడు. ఆ బ్రహ్మం బాస్యపర్యంతం బావాయువుచేతన కంఠాదిస్థానంబులయం దభివ్యజ్యమానంబై యకారాదిక్షకారాంతవర్ణమాలారూపంబై (నిశ్చయాత్మయై) శ్రోత్రగ్రహణయోగ్యంబై వైఖరీవా క్కనంబడు. ఈచతుర్విధసూక్ష్మస్థూలమాతృకాస్వరూప విట్టి (దేవీ!) నీకు నమస్కారంబు.

49


తే.

అని నుతించినఁ బ్రియ మంది యబ్ధికన్య
కలశజునిఁ జూచి యి ట్లను గారవమున
ననఘ! నీస్తోత్రమునకు నాయాత్మ మెచ్చె
నీవు గోరినవర మిత్తు నెమ్మిఁ గొనుము.

50


వ.

ఇంకఁ రాఁగలయిరువైతొమ్మిదవద్వాపరంబున నీవు వ్యాసుండవై వారణాశీపురంబున వేదపురాణసంహితాధర్మశాస్త్రంబులు వక్కాణింపంగలవాఁడవు. ఇప్పు డొక్కహితంబు సెప్పెదఁ. దుంగభద్రాతీరంబునం గిష్కింధాచలోపాంతంబున స్వామిమల యనుకాననంబునం గుమారస్వామి యధివసించియున్నవాఁడు. నీ వాచక్కటి కరిగి యతనివలన వారణాశీస్థానమాహాత్మ్యంబు వినుమని పలికి లోపాముద్రం గనుం

గొని యక్కాంతకు ముద్రికాకటకహారకేయూరాదు లగుదివ్యాభణంబులఁ బ్రసాదించె. ఇవ్విధంబునంగొల్లాపురమహాలక్ష్మిచేతఁ బ్రసాదంబు వడసి దంపతులు చరితార్థులయి సముచితప్రకారంబున నమ్మహాదేవి వీడ్కొని స్వామిమలకుం జనువా(డై)రై కొన్నిపయనంబు లరిగి ముందఱ గఠోరమదపరిణతిదశావష్టంభసంష్టంభసముజ్జృంభమాన హేరంబదశనకులిశ
కఠోరకోటిభిద్యమానహాటకకటకటంకారఘట్టి(త)తాశాంగణంబై చతుర్ద్వారంబులను జతురంతరచతుష్పక్షద్వారంబుల పోడశగవాక్షంబుల ద్వాత్రింశన్మరతోరణంబులఁ జతుష్షష్టినాట్యకూటంబులను బంచాశదుత్తరసహస్రదీర్ఘికలను సహస్రకోటిలింగంబులను దశసహస్రకోటిశక్తులనుం గోటితీర్థంబులనుం గలిగి వరాహకుండ మల్లికాకుండ క్షీరకుం డాదికుండంబులచేతనుఁ గదళీవన బదరీవన గౌరీవన బిల్వవనాది ముఖ్యవనంబులచేతను హాటకేశ్వర గుప్తమాహేశ్వర నందిమండలనివృత్యాదు లయినదివ్యస్థానంబులచేతను రససిద్ధరసాయనసిద్ధిమూలికాసిద్ధిపాదుకాసిద్ధ్యాదు లగుసిద్ధక్షేత్రంబులచేతను శోభితంబై దివ్యామృతనిర్మల శ్రీస్వయంభూజ్యోతిర్లింగమూర్తియగుమల్లికార్జున శ్రీమన్ మహాదేవునకు నిజనివాసంబై యభిరామంబై దివ్యంబునగు శ్రీశైలంబుఁ జేరవచ్చె. నయ్యవసరంబున.

51


అగ్యస్త్యుండు శ్రీశైలంబున కేతెంచుట

మ.

పరిరంభం బొనరించె గుంభభవునిం బాతాళగంగాంబు ని
ర్ఝరకల్లోలఘటాపృషద్వ్యతికరప్రాలేయముల్ హాటకే

శ్వరజూటీకృతమాల్యకేసరజస్సౌరభ్యసంపన్నముల్
కరివక్త్రాభరణాహిపీతపరిముక్తంబు ల్వనీవాయువుల్.

52


శా.

ఆమిత్రావరుణాంశసంభవుని వింధ్యాటోపవిధ్వంసి లో
పాముద్రాసహితుం గనుంగొనిరి యుత్పన్నప్రమోదంబునన్
వ్యామగ్రాహ్యపయోధరల్ కుటిలనీలాగ్రాలకల్ తథ్యమి
థ్యమధ్యస్థితమధ్యలాటవికసేవాధీశసీమంతినుల్.

53


సీ.

వాతాపిదమనుండు పాతాళగంగయం
        దఘమర్షణస్నాన మాచరించె
హాటకేశ్వరదేవు నారగ్వధంబుల
        నర్చించె వింధ్యధర్పాపహారి
గగనర్షి వృషభుండు కంఠీరవానను
        వైకుంఠబిలమధ్యవాసుఁ గొలిచె
నేకాంతరామేశు నిందుశేఖరుని ద
        ర్శించె నీవారముష్టింపచుండు


తే.

గూర్మి రంభోరువును దానుఁ గుంభభవుఁడు
కుంభినీధరదుహితృవక్షోజశాత
కుంభకుంభికాపరిరంభణాంభితాత్ము
శంభు స్త్రీమల్లికార్జును సంభజించె.

54


మహాస్రగ్ధర.

యమీ హృల్లేఖాదిమంత్రాభ్యసననిరతుఁ డై యాగమోక్తప్రకార
క్రమయుక్తిం గంధపుష్పాక్షతదళముల శ్రీకంఠు నర్ధాంగలక్ష్మిన్
భ్రమరాంబాదేవి నంతర్భ్రమరఫలరసప్రహ్వచూత ద్రుపుణ్యా
శ్రమవాటీహేమసింహాసనవిలసదధిష్ఠాన నర్చించె నిష్ఠన్.

55

తే.

చెలువయును దాను నాశీతబిలసహస్ర
మార్గశాఖోపశాఖల మౌనివరుఁడు
విధుకిరీటులఁ బూజించెఁ వెదకి వెదకి
యమృతమయలింగమూర్తుల నధికభక్తి.

56


వ.

వెండియు నయ్యిల్వలమధనుండు యథావిధి మండూకకుండంబునం గ్రుంకె. పంచాక్షరీమంత్రసిద్ధుండు పంచధారాపల్లధార లనునిర్ఝరప్రవాహంబులఁ గృతావగాహుండయ్యె. పాటలజటాకిరీటుండు హాటకకూరశిరఃశృంగశృంగాటకఘాటంబునఁ గోటిలింగంబులం భజించె. లోపాముద్రాధిపతి యద్రికటకభద్రాసనంబున సమున్నిద్రప్రతాపముద్రావిద్రుతాక్షుద్రోపద్రవుం డగునుద్యానవీరభద్రు శ్రీద్రవహరిద్రాక్షతంబుల భద్రదారుద్రు పారిభద్రద్రుమక్షారకంబుల నారాధించె. బ్రహ్మర్షి బ్రహ్మపాదారవిందద్వంద్వంబు హరిచందనచర్చామచర్చికల నర్చించె. సిద్ధతాపసమూర్థాభిషిక్తుండు ఘంటాసిద్ధేశ్వరునివలన మంత్రసిద్ధి వడసె. మహాభాగుండు భోగవతీతీరంబున భోగేశ్వరు భోగాపవర్గప్రదు భుజంగభూషణు భజించె. నీవారముష్టింపచుం డిష్టకామేశ్వరునకుం బటిష్ఠనిష్ణావిశేషంబులం దుష్టిఁ గావించె. భువనగోప్తసప్తమాతృకలఁ దలంచె. నహుషదమనుండు ముషితసకలకలుషం బగుకదళీవనవిషమభువినిగమభషకపరిషదనుగతవృషభగమనుం గపటశబరభటు నటఁ (?) దుహితృపరివృఢు నశఠమతిం గొలిచె. అనంతరంబ యొక్కవివిక్తప్రదేశంబున సుఖాసీనుండై.

57

తే.

అర్థిఁ గుంభోద్భవుం డిట్టు లనియె సతికిఁ
బద్మలోచన! చూడు శ్రీపర్వతంబు
పాయ కిం దుండుఁ బార్వతీప్రాణవిభుఁడు
మల్లికార్జునదేవుండు మదనవైరి.

58


తే.

ధవళలోచన! శ్రీపర్వతంబుమహిమఁ
బ్రస్తుతింపంగఁ శక్యమే బ్రహ్మకైన
గండశిల లెల్ల శంభులింగంబు లిందు
సిద్ధమును లిందుఁ వసియించుచెంచు లెల్ల.

59


క.

చాకున్న నీదు ముక్తుల
శ్రీకాశీక్షేత్ర మెవ్వరికి నిది నిక్కం
బీకుధర మిచ్చు శిఖరా
లోకనమాత్రమున ముక్తులు కురంగాక్షీ.

60


వ.

అనియె నప్పుడు లోపాముద్ర ముద్రికామణిమయూఖరేఖలు నఖరశిఖరంబులం జిగురొత్త విద్రుమప్రవాళంబుల యుల్లాసంబు నుల్లసం బాడెడు పాణిపవల్లవంబులు మోడ్చి ఫాలభాగంబునం గదించిన వినయవినమితోత్తమాంగయై యున్నం గనుంగొని సస్నేహంబును సబహుమానంబును సానురాగంబును సాభిప్రాయంబును సమర్మంబును సవిభ్రమంబును సోపాలంభంబునం గాఁ గుంభసంభవుండు మహాదేవి కిట్లనియె.

61


సీ.

హృదయంబులో సంశయించి నిగూఢార్థ
        మిద మిత్థ మని నిశ్చయింపలేక
యది తేఁట తెలివిఁగా నడుగంగఁ దలఁచి ల
        జ్ఞాసాధ్వసంబులు సందడింప

నవనమ్రముఖపద్మ వైయున్నదానవు
        ప్రాగల్భ్యసరణి యేర్పడునొ యంచు
మాటాడనేరనిమాఁటినంగవు నీవు
        సకలకాలంబు నోసరసిజాక్షి!


తే.

కాంత! యేకాంతవేళలఁ గాంతునెదుర
నగుచుఁ దెగడుచు నుండుట తగవుసూవె
వలసి సిగ్గున వెఱపునఁ గలసి బెరసి
యుండకుండుట మాబోటు లోర్వఁగలరె?

62


వ.

అనిన విని లోపాముద్ర మౌనముద్ర దిగద్రావి మునీంద్రున కి ట్లనియె.

63


సీ.

చతురశీత్యాయామసంపన్న మై యోజ
        నోత్సేధవైభవాభ్యుద్గత మయి
ముప్పదియోజనములంవెడల్పును గల్గి
        సార్ధత్రికోటితీర్థాన్విత మయి
సమధికాష్టారీతిసాహస్రసంయమి
        జనసమాకుల మయి సప్తకోటి
మంత్రాశ్రయం బయి మహనీయమహిమ మై
        తనరారునీపర్వతంబునందు


తే.

శిఖర మీక్షించునంతన చేరు నట్టి
ముక్తి జంతువులకు (మఱి) జీవములు దొరంగఁ
జచ్చినప్పుడు గాని మోక్షంబు లేదు
కాశి కరుగంగ నేటికిఁ గాళ్లజాలి.

64


వ.

మఱికొందఱు కేవలవిజ్ఞానంబుఁ బ్రశంసింతురు. కొందఱు విజ్ఞానంబువలన సముచ్చితం భైనకర్మంబుఁ బరిశీలింతురు.

కొందఱు దానంబులు గొనియాడుదురు. కొందఱు వ్రతంబులు సెప్పుదురు. కొందఱు యజ్ఞంబులు మెత్తురు. కొందఱు తపంబులు గోరుదురు. కొందఱు బ్రహ్మచర్యం బభినందింతురు. కొందఱు గార్హస్థ్యంబుఁ బ్రశంసింతురు. కొందఱు వానప్రస్థాశ్రమంబు మన్నింతురు. కొందఱు సన్న్యాసంబుఁ బ్రసంగింతురు. కొందఱు తీర్థసేవ యావిష్కరింతురు. కొందఱు స్వాధ్యాయంబు నధికరింతురు. కొందఱు కాశీశ్రీపర్వతాదిశివస్థానంబు లభ్యర్థింతురు. ఇన్నియు ముక్తిస్థానంబులై యుండు, నందులోపల సులభంబగు ముక్తిస్థానం బెయ్యది? వినవలతు నానతిమ్ము. సంశయబీజభూతంబు లైనయావిప్రతిపత్తివచనసహస్రంబులు వినంగ నాడెందంబు డోలాందోళనం బందుచుండు.

65


క.

అని యడిగినఁ గలశసుతుం
డనుమోదరసార్ద్రహృదయుఁ డై దేవికి ని
ట్లను నడుగవలయు నర్థమ
వనజానన! యడిగి తుక్తివైభవ మలరన్.

66

అగస్త్యుండు లోపాముద్రకు బాహ్యాభ్యంతరతీర్థమాహాత్మ్యంబుఁ జెప్పుట

శా.

శ్రీశైలాదులు ముక్తికారణములై చెప్పంబడుం దీర్థముల్
ప్రాశస్త్యంబును నన్నితీర్థముల కప్రత్యూహ మై వర్తిలున్
గాశీప్రాప్త(ప్తి)కరంబు లైనక తనం గైవల్యలక్ష్మీసహుల్
గాశీక్షేత్రము గైకొనుం దరుణి! సాక్షాన్ముక్తిహేతుత్వమున్.

67


వ.

ప్రయాగ నైమిశంబు కురుక్షేత్రంబు గంగాద్వారంబు నవంతిక యయోధ్య మధుర ద్వారక సరస్వతి సహ్యంబు

గంగాసాగరసంగమంబు కాంచి త్ర్యంబకంబు సప్తగోదావరంబు కాలంజరంబు ప్రభాసంబు బదరికాశ్రమంబు మహాలయం బోంకారంబు పురుషోత్తమంబు గోకర్ణంబు భృగుతీర్థం బంబుపుష్కరంబు శ్రీపర్వతంబు నా నివి మోక్షకారణంబు లైనమహాతీర్థంబులు.

68


సీ.

శంభుప్రసాదంబు సమకూఱకుండినఁ
        దీర్థయాత్రకు సమ్మతింప దాత్మ
దీర్థంబు లాడంగఁ దివుట లేకుండినఁ
        బ్రతిబంధదురితంబు వాసిపోదు
ప్రతిబంధదురితంబు వాసిపోకుండినఁ
        గాలి కేగెడునట్టికడఁక లేదు
కాశీపురక్షేత్రవాసమ్ము లేక యే
        విజ్ఞానదీపంబు విస్తరిలదు


తే.

జ్ఞానమునఁ గాని మోక్షంబు సంభవింప
దతివ! జ్ఞానం బనంగ వేదాంతవాక్య
సంభవం బైన దదియ పోజ్ఞాన మండ్రు
తరుణి విజ్ఞాన మీసూక్ష్మ మెఱిఁగికొనుము.

69


క.

ధారాతీర్థం బనఁగాఁ
దారాధిపవదన! ఖడ్గధారాంచల మ
ద్దారాంచలమునఁ ద్రెవ్విన
వీరాగ్రేసరుఁడు ముక్తివిభవముఁ గాంచున్.

70


తే.

తీర్థములు మానసములు ముక్తిప్రదములు
తరుణి! యివి మేలు బాహ్యతీర్థములకంటె

మానవుం డివి యేమఱి మధురవాణి!
బాహ్యతీర్థంబు లాడ నిష్ఫలము సూవె.

71


సీ.

తీర్థంబు సత్య మింద్రియనిగ్రహము తీర్థ
        మనసూయ తీర్థంబు వనరుహాక్షి!
తీర్థంబు దానంబు తీర్థంబు సంతోష
        మనుకంప తీర్థంబు కనకగౌరి!
బ్రహచర్యంబు తీర్థంబు తీర్థము ధృతి
        యమము తీర్థము విద్రుమాధరోష్ఠి!
సమత తీర్థంబు విజ్ఞానంబు తీర్థంబు
        పుణ్యంబు తీర్థంబు పువ్వుఁబోఁడి


తే.

తీర్థములు మానసంబులు ధీవిశుద్ధి
యతిశయిల్లంగ నివి యాడ కాడినట్టి
పంచజనులకుఁ గలహంసపక్షిగమన!
బాహ్యతీర్థావలులు తీర్థఫలము నీవు.

72


చ.

బిసరుహపత్రలోచన! కృపీటములందు మునింగియాడవే
మొసళులు మీలు కర్కటకముల్ గమఠంబులు వాని కబ్బునే!
యసదృశమైనతీర్థఫల మట్టివిధంబు సుమీ? తలంప మా
సస మగుతీర్థమాడనిజనంబులకుం బహుబాహ్యతీర్థముల్.

73


తే.

సుదతి! యేటికి నంతర్విశుద్ధి లేని
బాహ్యసంశుద్ధి? బహుతీర్థపరిచయమున
వేయుఁగడవలజలమున వెలిఁ గడిగిన
గలుగునే శుద్ధి వారుణీకలశమునకు?

74


తే.

రాగదోష మలాపహారక్షమంబు
మానసం బైనతీర్థంబు మందగమన!

యవనిఁ బంకరజోవ్యపాయక్షమంబు
బాహ్యతీర్థంబు మేచకోత్పలదళాక్షి!

75


సీ.

దర్శించినపుడ చిత్తము నిర్నిబంధనం
        బగుఁ బ్రసాదగుణంబు నందు నేని
గలుషంబు గాని దుర్గంధంబుఁ బొరయని
        సలిలంబు నెరముగాఁ గలుగునేని
బావనక్షేత్రపుణ్యావనీధరతపో
        వనసన్నికర్షంబు దనరు నేని
శంసితవ్రతులైన సంయమిశ్రేష్ఠుల
        యధికపరిగ్రహం బబ్బునేనిఁ


తే.

దీర్థములు పెక్కులాడిన తీర్థ మగునె?
ధవళలోచన! సలిలమాత్రమునఁ జేసి
ముదిత! దేహమునం దంగములకుఁ బోలెఁ
దారతమ్యంబు గలదు తీర్థముల కతివ.

76


వ.

సారంగనయన! తీర్థాంగంబు లప్రతిగ్రహం బనహంకాం బకోపనత్వం బనాలస్యంబు సూనృతంబు సమాధానంబు శ్రద్దధానత్వంబు హేమనిష్ఠక్షేత్రోపవాసంబు పితృతర్పణంబు బ్రాహణభోజనంబు పితృశ్రాద్ధంబు పిండప్రదానంబు శిరోముండనంబు మొదలుగా గలయవి సాంగోపాంగంబు లయి ఫలంబు నీజాఁలు. మఱి యత్తీర్థతారతమ్యంబు వివరించెద.

77


సీ.

చెలువ! శ్రీగిరియందు శిఖరేశ్వరం బను
        శిఖరంబు జూచినఁ జేరు ముక్తి

కాంత! శ్రీశైలంబుకంటె వేగంబునఁ
        గేదార మీఁ జాలుఁ గేవలత్వ
మంతకంటెను వేగ మరవిందలోచన!
        యమృత మీనొప్పుఁ బ్రయాగతీర్థ
మాప్రయాగముకంటె నతివేగమునఁ జేయు
        నవవర్గ మింతి! మహాశ్మశాన


తే.

మతివ! యానందకాననప్రాప్తికరము
లఖలతీర్థంబులును సందియంబు లేదు
కాశికాతీర్థ మాడక కదియరాదు
లక్షతీర్థంబు లాడిన మోక్షలక్ష్మి.

78

శివశర్మోపాఖ్యానము

వ.

ఈయర్థంబు దేటపడ నొక్కయితిహాసంబు చెప్పెద వినుము. మధుర యనుపట్టణంబున శివశర్మ యను విప్రోత్తముండు గలఁడు. అతఁడు వేదంబులు చదివి, తదర్థంబు లెఱింగి, ధర్మశాస్త్రంబులు పఠించి, పురాణంబు లధిగమించి, యంగంబు లభ్యసించి, తర్కంబు లాలోడించి, మీమాంసాద్వయం బాలోచించి, ధనుర్వేదం బవగాహించి, యాయుర్వేదంబు విచారించి, నాట్యవేదంబు గ్రహించి, యర్థశాస్త్రంబు(లు) ప్రాపించి, మంత్రశాస్త్రంబు(లు) దెలిసి, భాషలు గఱచి, లిపులు నేర్చి, యర్థం బు(లు)పార్జించి, ధర్మంబులు చేపట్టి, భోగ్యంబు లనుభవించి, పుత్త్రుల నుత్పాదించి, వారి కర్థంబు విభజించి యిచ్చి, యౌవనంబుపోకకు ముదిమిరాకకు శోకించి వ్యాకులుం డయి నిజాంతర్గతంబున.

79

శా.

నానాశాస్త్రము లభ్యసింపను ననంతద్రవ్య మార్జింప సం
తానంబుం బడయంగఁ బుత్రులకు నర్థంబు ల్విభాగించి యీఁ
బౌనఃపున్యమునన్ సుఖం బనుభవింపంబోయెఁ గాలంబు గౌ
రీనాథున్ భజియింప నేన నయితిన్ శ్రీకాశికావల్లభుఁన్.

80


సీ.

కొలువంగ లేనైతి గోపాలకృష్ణుని
        నర్చింప లేనైతి హ స్తివదను
మ్రొక్కంగ లేనైతి మునిజనశ్రేణికి
        సేవింప లేనైతిఁ జిత్రభాను
యజియింప లేనైతి నమరసంఘాతంబు
        బూజింప లేనైతిఁ భూదివిదులఁ
గట్టింప లేనైతిఁ గమలకాసారంబు
        నిలుపంగ లేనైతిఁ దులసివనము


తే.

పేరటాండ్రను నర్చింపనేరనైతి
సలిలసత్రంబు సాగింపఁజాలనైతి
నాజ్యతిలహోమవిధులు మంత్రాన్వితముగ
హుతవహునియందుఁ జేయంగ నోపనైతి.

81


తే.

పురుషసూక్తము శ్రీసూక్తమును జపింపఁ
బావమాని పఠింపఁ దత్పరత మీఱ
నర్థి శతరుద్రియంబు పంచాక్షరంబు
ప్రణవమంత్రంబు జపియింపఁ బ్రతిదినంబు.

82


క.

ఈహర్మ్యము లీతురగము
లీహేమము లీభుజిష్య లీధాన్యము లీ
దేహము నాతో వచ్చునె?
యూహింపఁగఁ బుణ్యకర్మ మొక్కటి దక్కన్.

83

సీ.

పొడిదగ్గు కంఠంబుఁ బొరివుచ్చకయమున్న
        తల ప్రకంపంబుఁ బొందకయమున్న
బొమలు కన్నులమీఁదఁ బొదివి వ్రాలకమున్న
        పగ నేత్రముల కడ్డు పడకమున్న
శ్రుతిపుటంబుల శక్తి సురిఁగి పోవకమున్న
        వళు లాననమునఁ బర్వకయమున్న
హృదయంబులో జాగ పదను దప్పకమున్న
        గాత్రంబు శిధిలంబు గాకమున్న


తే.

పండ్లు వేర్వాసి కదలుచూపకయమున్న
కాళికడకంటిచూపు పై రాకమున్న
కాలుసేయాడుకాలంబె కదలవలయుఁ
దీర్థసేవకు దేహ మస్థిరము గాన.

84


వ.

అని తీర్థయాత్రాపరాయణుండై యిల్లు వెడలి రెండుమూఁడుపయనంబులకొలఁదితెరవున నొకవటవృక్షంబుక్రింద బరిశ్రమాపనోదార్థంబు విశ్రమించి యంతరంగంబున నిట్లని వితర్కించె.

85


మ.

కరికర్ణాంతవిలోల మాయువు శరత్కాదంబినీచంచలా
తరళంబాత్మ పయస్తరంగచలముల్ తారుణ్యముల్ తీర్థముల్
పరిపాటిం జతురంతధాత్రిఁ జరియింపన్వచ్చునే యైన నేఁ
బురముల్ నాలుగుమూఁడుముక్తిజనకంబుల్ మున్ను వీక్షించెదన్.

86

సప్తపురీప్రశంస

తే.

ఉజ్జయిని కాశి మాయ యయోధ్య కాంచి
మథుర ద్వారక యనెడి నామములు గలిగి

పట్టణము లేడుఁ గీర్తిసంపద వహించు
మహితకైవల్యలక్ష్మికి మందిరములు.

87


వ.

అని నిశ్చయించి.

88


సీ.

సాకేతమున కేగి సరయూతరంగిణి
        నభిషేక మొనరించె నధికభక్తి
నల్పుఁ దెల్పును నైన నదులకూటము ప్రయా
        గాఖ్యంబునందు దేహంబు దోఁచె
గంగలో మణికర్ణికాతీర్థమునయందు
        సంకల్పపూర్వంబు గ్రుంకువెట్టె
కైవల్యకల్యాణఘంటాపధంబైన
        యానందవిపినంబు నాశ్రయించె


తే.

తీర్థదైవతకోటిఁ బ్రార్థించి పలికి
యఖిలమును నాచరించి తీర్థాంగకములఁ
దీర్థములయందు శ్రీమహాదేవుఁ గొలిచెఁ
బావనాచారనిరతుండు బ్రాహ్మణుండు.

89


సీ.

బ్రహ్మలోకోన్నతప్రాసాదనిశ్శ్రేణి
        యాజవంజవభీతి కభయపాణి
కలుషకంఠచ్ఛేదకాలాయస కృపాణి
        కైవల్యనవమౌక్తికమున కాణి
[2]వీరావనీస ముద్విష్టకంతర్వాణి
        చక్షురుత్సవగంధసారశోణి
చేతఃప్రసాదలక్ష్మీవిహారక్షోణి
        కల్పాంతకాలంబు గలపురాణి

తే.

పరమకల్యాణి యాపగాంభస్త్రివేణి
రాజరేఖావతంసుగారాపురాణి
సమధికప్రీతిఁ దేలి యాసత్యవాణి
కేవలత్వశుభశ్రేణి గ్రుంకువెట్టె.

90


తే.

అఖిలతీర్థంబులును నాడి యవనిసురుఁడుఁ
గోర్కిమెఁ బుణ్యలక్ష్ములఁ గొల్లవెట్టె
నటువిశేషించి గంగాప్రయాగతీర్థ
మధికతాత్పర్యనిష్ఠతో నాడఁదొడఁగె.

91


సీ.

వైకుంఠముననుండి వచ్చి వైకుంఠుండు
        దేవీసహాయమై తీర్థ మాడు
గోలోకముననుండి గోమాతృకలు వచ్చి
        తీర్థ మాడుదు రతిస్థిరమనీషఁ
గాశికాపురినుండి కాలకంఠుఁడు వచ్చి
        దివసంబు దివసంబు తీర్థ మాడు
వరుస దిక్కులనుండి వచ్చి దిక్పాలురు
        త్రిదశేశ్వరాదు లాడుడురు తీర్థ


తే.

మమరగంధర్వసిద్ధవిద్యాధరర్షి
గరుడకిన్నరయక్షరాక్షసపిశాచ
భూతములు దీర్థ మాడు వేఁబోక చివరఁ
బూష మకరస్థుఁడైన యప్పుడు ప్రయాగ.

92


వ.

అది ప్రజాపతిక్షేత్రంబు యాగంబులకంటెను బ్రకృష్టం బగుటం జేసి దానికిఁ బ్రయాగసమాహ్వయం బన్వర్థనామంబై యుండు. మార్తాండుండు మకరరాశిస్థుండై యుండ మాఖమాసంబున మఘవమణిశిలాశకలవిసరవిసృమరకిరణసందోహ

సందేహదానదీక్షాధురంధరంబులగు కాళిందీసింధుకబంధంబులతో సంబంధించి కర్పూరగంధసారతారహారనిర్జరాహారనీహారక్షీరధారాశ్రేణి పాణింధమంబై(న) సౌరసైంధవధవళవాఃప్రవాహంబు ప్రవహింప సితాసితచ్ఛాయాచ్చటాగుళుచ్ఛవ్యతికరంబునం జేసి మోక్షలక్ష్మీకటాక్షవీక్షణంబునుం బోని యమ్మహాతీర్థరాజంబునం గ్రుంకి బ్రాహ్మణుండు కృతార్థుం డయ్యె. వెండియు.93


గీ.

కాశి కేతెంచు మఱిఁ బ్రయాగమున కేగుఁ
గాశి కేతెంచు మఱిఁ బ్రయాగమున కేగు
మునుఁగు మణికర్ణికాతీర్థమునను మఱియు
మునుఁగు మణికర్ణికాతీర్థమునను మఱియు.

94


శా.

కింకుర్వాణపురందరాదికమహాగీర్వాణకోటీకిరీ
టాంకస్థాపితనూత్నరత్నరుచిధారాశ్లేషకిమ్మీరప
త్వంకేజుండు హరుండు జంతువులకుం బ్రాణాంతకాలంబునం
దోంకారాక్షరమంత్రరాజముఁ జెవిన్ యోజించుఁ గాళీస్థలిన్.

95


గీ.

కర్ణికాంతము సేరి యేకతమ శివుఁడు
మునుకు మోక్షచింతామణి జనున కెపుడుఁ
గాన మణికర్ణికాసమాఖ్యత వహించె
నమ్మహాతీర్థ మమరు గంగాంతరమున.

96


క.

ఉద్భిజ్జములు జరాయు
ప్రోద్భూతము లండజాతములు స్వేదజముల్
తద్భూమఁడలిఁ జచ్చి మ
హాద్భుతముగఁ బుట్టు హాలహలకంధరులై.

97

గీ.

ఎడమప్రక్కయి కాశిలో నీల్గునట్టి
మశకశిశువున కోంకారమంత్రరాజ
మభవుఁ డుపదేశ మొనరింప నమరకోటి
సిగ్గువడుచుండుఁ దమవృథాజీవములకు.

98


చ.

కటకట! కాశికాపురి నొకానొక నిద్దురఁ గన్నుమోడ్చి య
ప్పటఁ గనువిచ్చి చూచి కుడిభాగముఁ గన్గొని చోద్య మందు దా
పటిదెసఁ జూచి యచ్చెరువుపాటు వహించు మనస్సరోజసం
పుటమున నాఁడులాగు మగపోడిమియుంగల జంతుసంతతుల్.

99


మ.

గృహమేధిప్రవరుండు విప్రుఁ డమృతక్షేత్రంబు వారాణసిన్
ద్రుహిణక్షేత్రము వాసిపోవఁదలఁచెన్ దూరంబుగా వెండియు
న్మహిఁ గైవల్యపుతీర్థముల్ గలిమి సంభావించి శాస్త్రజ్ఞతన్
బహుధావిప్రతిపత్తిధీవిషయముల్ పాదైనశాస్త్రార్థముల్.

100


సీ.

ఆనందవిపినపుణ్యానుభావాధిక్య
        మెఱుఁగఁడా తా నేమి యెల్లయదియు?
దెలియఁడా తా నేమి దేవలోకారోహ
        నిశ్శ్రేణి యగుగంగ నిత్యమహిమ?
మణికర్ణికాతీర్థమాహాత్మ్యవిభవంబుఁ
        జూడఁడా తా నేమి సూక్ష్మదృష్టి?
నరయఁడా తా నేమి యామ్నాయములఁ బురా
        ణేతిహాసముల విశ్వేశుగరిమ?


గీ.

నకట! పుణ్యప్రమాణాంతరానువృత్తి
నుదక మున్నతభూమియం దుండలేక
పల్లమున కొడ్డగిల్లినపగిది నతఁడు
కదలెఁ దీర్థాంతరమునకుఁ గాశినుండి.

101

వ.

కదలి కతిపయప్రయాణంబుల.

102


సీ.

ఏవీటిశృంగార మెలదోఁటలో నుండుఁ
        గదల కెప్పుడు కాలకంధరుండు
ప్రతిదినంబునను నేపట్టణంబునకు ది
        వ్యాభిధానంబు పెం పమర నెగసు
జేనెంటఁ జేనెంట శివలింగములు కోటి
        సంఖ్య లేపురమునఁ జాల నొప్పుఁ
గల్పాంతవేళ నేకటకంబు మునుఁగదు
        నింగితో రాయుమున్నీటివెల్లి


గీ.

నట్టిమహిమల యుజ్జని కరుగుదెంచి
కాళి దర్శించె శ్రీమహాకాళుఁ గొలిచె
యుండె శివశర్మ యట రాజయోగపరత
నిఖిలముక్తుల కచ్చోటు నెలవుగాన.

103


ఆ.

హాటకేశ్వరుఁడు మహాకాళనాథుఁడు
దారకేశ్వరుండు తలిరుఁబోఁడి?
యుబ్బి లింగము లయియున్నారు పాతాళ
మర్త్యనాకభువనమండలముల.

104


ఉ.

కందవు గాజుపాఱవు వికారము నొందవు పూతిగంధముం
జెందవు వాడ వప్పురముసీమల నల్గడ వామకర్ణముల్
క్రిందుగ దీర్ఘనిద్రలు ధరించి శయించినజంతుదేహముల్
సుందరి! యిట్టిచోద్యములు చూడము తక్కినతీర్థభూములన్.

105


క.

లీల మహాకాల! మహా
కాల! మహాకాల! యనుచుఁ గడుభక్తి మహా

కాలస్థానాధీశ్వరుఁ
గాలగళున్ సంస్మరింపఁ గాంతురు ముక్తుల్.

106


గీ.

భవు మహాకాళు సేవించి బ్రాహ్మణుండు
గదలెఁ గాంచీకి నక్కాంచికాపురమునఁ
గలికి వేడుకకత్తె శ్రీకామకోటి
గవయు నేకామ్రనాథునిఁ గరిమ గిరిశు.

107


ఉ.

కాంచికిఁ బోయి బ్రాహ్మణుఁడు గాంచెను దావళభూమి భృచ్ఛిరః
కాంచనకంధరానిలయుఁ గైటభమర్దనుఁ గామకోటి ద
ర్శించి భజించె బాలశశిశేఖరు నేకరసాలనాయకు
న్బంచె ననేకపూర్వజననంబులఁ బుట్టిన పాతకౌఘముల్.

108


సీ.

ముడువంగ నేర్తురు ముడువ దాపటికి రాఁ
        జికురబంధము లీఁగ జీరువాఱఁ
బొన్నపువ్వులఁ బోలు పొక్కిళ్లు బయలుగాఁ
        గట్టనేర్తురు చీర కటిభరమునఁ
దొడువంగ నేర్తురు నిడువ్రేలుఁజవులయం
        దవతంసకంబుగా నల్లిపువ్వు
పచరింప నేర్తురు పదియాఱువన్నియ
        పసిఁడిపాశములోరపట్టుచెంగు


గీ.

పయ్యెదముసుఁగు బాలిండ్లఁ బ్రాఁకనీరు
తఱచు పూయుదు రోల(లి) గంధంబుఁ బసుపు
బందికత్తెలు సురతప్రసంగవేళఁ
గంచివ్రేతలు కుసుమాస్త్రఖడ్గలతలు.

109


గీ.

కాంతి యందురు గొంద ఱక్కాంచిపేరు
కమ్రకురువిందరత్నసత్కాంతిదంతి

నప్పురంబున నేడునా ళ్లధివసించి
బ్రాహ్మణుఁడు సర్వదేవతాప్రతతిఁ గొలిచె.

110


వ.

అందుండి ప్రభాసక్షేత్రంబుమీఁదుగాఁ జని.

111


క.

ద్వారవతీనగరంబునఁ
గోరిక శివశర్మ యుండి కొన్నిదినంబుల్
నారాయణపుణ్యకథా
పారాయణు లైనపరమభాగవతులతోన్.

112


గీ.

ధవళలోచన! యొక్కచోద్యంబు వినుము
ద్వారవతియందుఁ జచ్చినవారియొడలి
యస్థిశకలంబులం దంతరాంతరములఁ
దనగు శ్రీపాంచజన్యసుదర్శనములు.

113


ఉ.

కాంచనకేతకీకుసుమగర్భదళోదరసోదరప్రభా
భ్యంచితమై పటీరఘుసృణాగురుసౌరభలక్ష్మితోఁ బిసా
ళించుచుఁ గమ్మనై పరిమళించు సముజ్జ్వలగోపిచందనం
బించినవేడ్కతోడ ధరియింతురు భాగవతో త్తము ల్పురిన్.

114


గీ.

రమణీ! ధరియింతు రూర్ధ్వపుండ్రములు మెఱయ
ఫాలతలమున నవ్వీట భాగవతులు
కఠినపాపపరంపరాకంఠనాళ
ఖండనప్రక్రియాక్రూరఖడ్గలతలు.

115


సీ.

కమనీయగోపికాగంధసారంబున
        నూర్ధ్వపుండ్రములు బాగొప్పఁ దీర్చి
వక్షస్స్థలంబుల వనజాక్షమాలికా
        చారునైపథ్యంబు సంతరించి

దక్షిణశ్రవణరంధ్రములఁ గోమలకృష్ణ
        తులసీప్రవాళంబు లలవరించి
నలినలోచనదివ్యనామసంకీర్తనా
        భంగికి జిహ్వలఁ బాలువెట్టి


గీ.

ద్వారవతియందు ముక్తికాంతావిహార
మంటపములందు నుంద్రు నిర్మలవివేక
నిరభసంధికృపాగుణనిర్ణిరోధ
పరమభాగ్యాన్వితులు మహాభాగవతులు.

116


గీ.

ప్రతియుగంబును ద్వారకాపట్టణంబు
ముంచి రత్నంబులెల్లను మ్రుచ్చిలించి
కొంచుఁబోయెడుకతమునఁ గువలయాక్షి!
యబ్ధి కొడఁగూడె రత్నాకరాహ్వయంబు.

117


సీ.

కట్టు రింగులువారఁ గటిభాగమునయందుఁ
        బసిఁడికమ్ములపచ్చపట్టుచేల
వక్షస్స్థలంబున వనమాల ధరియించుఁ
        గౌస్తుభగ్రైవేయకమునఁ గూర్చి
సేసకొప్పునఁ జుట్టు శిఖపింఛరింఛోళి
        మక్కళించిన జిల్గుమడుఁగుపాగ
గొజ్జంగిపూనీరు కులికి మేదించిన
        కమ్మకస్తురి మేనఁ గలయ నలఁదు


గీ.

ద్వారకాపట్టణముపొలిమేరసీమఁ
గాలవశమున నీల్గిన క్షణమునందుఁ
గైటభారాతిసారూప్యగరిమఁ గన్న
కీటపక్షిసరీసృపక్రిమికులంబు.

118

ఉ.

ఆపృథివీసుపర్వుఁడు ప్రియంబున ద్వారకయందుఁ దీర్థసే
వాపరతంత్రుఁడై యయిదువాసరము ల్వసియించి పోయె మా
యాపురి కమ్మహానగర మంబుజపత్రవిశాలనేత్ర! దు
ష్ప్రాపము పూర్వజన్మమునఁ బాపము నేసిన మర్త్యకోటికిన్.

119


వ.

అన్నగరంబును గొందఱు హరిద్వారం బండ్రు కొందఱు మోక్షద్వారం బండ్రు (కొందఱు గంగాద్వారం బండ్రు.) అవ్వలనన నిర్గమించికదా భాగీరథి భుననపావనిభవజటాజూటాటవీవాటికాకుటజకోరకంబు మున్నీటం బెక్కుముఖంబులం గలసె. అట్టిమాయాపురంబునందు.

120


సీ.

తీర్థోపవాసంబుఁ దీర్చి జాగర ముండి
        తెల్లవాఱఁగ గంగఁ దీర్థమాడి
పితృతర్పణముఁ జేసి పిండప్రదానంబు
        యవసక్తుచరువున నాచరించి
యగ్నికార్యముఁ దీర్చి హరుని నభ్యర్చించి
        ములుమోదుగాకులఁ బులియఁ గుట్టి
రాగిలో వండిన న్బ్రాలేయి కుండంగ
        వండి డించినయట్టి వంటకంబు


గీ.

కుడువఁగూర్చుండి వడ్డించుకొనఁదలంచు
నంతలోన శిరస్తాప మావహిల్లె
మేను గరుదాల్చెఁ జలి బెట్టి మెడలు నొచ్చె
వేఁకి దలచూపె దాహ మావిర్భవించె.

121


వ.

అప్పుడు శివశర్మ నిజాంతర్గతంబున.

122


గీ.

బ్రతుకుమీఁదియాస పాయంగఁ బెట్టితిఁ
జిచ్చువంటివేఁకి వచ్చినపుడు

జలధినట్టనడుమ సాంయాత్రికుఁడు కలం
బవిసినపుడు ధనమునాసవోలె.

123


సీ.

ప్రతివాసము గృహారామసస్యక్షేత్ర
        పశువీక్షణము సేయఁ బ్రాప్తుఁ డెవ్వఁ?
డిటమీఁద నేభంగి నిందుబింబానన
        విధవసంసారంబు వెడలఁబోయుఁ?
దనయు లిం కేభంగి ధనవిభాగములకై
        పోరితంబులు లేక పొసిగియుందు?
రఖిలపురాణేతిహాసశాస్త్రాగమ
        గ్రంథసంరక్ష యెక్కడిది యింక?


గీ.

నకట! మిన్నులు వడ్డచో ననద వోలె
దిక్కుమాలినప్రేత నై తిరుగవలసె
శిరసుపై మృత్యు వాడెడు శీఘ్రమునను
చావు నిక్కంబు బ్రతుకుట సంశయంబు.

124


శా.

సంతాపంబునఁ బొంద నేమిటికి నీ సంసారయాత్రావ్యథా
చింతాభారము పూని జూర్తిదహనార్చిర్దాహము ల్సాలవే
చింతింతు న్మది విశ్వనాయకు శివున్ శ్రీకాశీశాధీశ్వరుం
జింతింతున్ సరసీరుహాక్షుని హరిన్ శ్రీద్వారకావల్లభున్.

125


గీ.

ఏల చింతింప నిహమునం దెల్లసుఖము
లనుభవించితి మధురామహాపురమునఁ
బరమునందును ముక్తిసంపదయుఁ గలిగె
నేడుపురములఁ దీర్ఘంబు లాడఁగనుట.

126


వ.

అని వితర్కించుచుండ.

127

శా.

పాటిల్లెం ధరణీసురోత్తమున కప్పాటన్ విదాహజ్వరో
ష్మాటోపంబున నత్యుపద్రవము మైనాపాద మస్తంబుగాఁ
గోటీవృశ్చికకీటపుచ్ఛలతికాకోటీశిఖాకంటక
త్రోటీకుట్టనసంప్రభూతవిషధూర్జుర్వారదాహోద్ధతిన్.

128


క.

తన్నెఱుఁగ కెదిరి నెఱుఁగక
కన్నులు దెఱవంగ నెఱుఁగక వసుంధరపైఁ
గొన్నిదినంబులు బ్రాహ్మణుఁ
డున్నట్లన యుండె నోటి(నొంటి)యూరుపుతోడన్.

129


క.

ఇటు బహువిధములఁ గడుసం
కటపడి మాయాపురోపకంఠమున మరు
త్తటినీతటనికటమునం
దటుకున శివశర్మ కాలధర్మము నొందెన్.

130


వ.

అంత.

131


మ.

అసితాంభోధరనీలవర్థు లురుభద్రాకారు లాజానుదీ
ర్ఘసముత్తుంగభుజాచతుష్టయు లలంకారాన్వితు ల్పుణ్యశీ
లసుశీలాఖ్యులు విష్ణుకింకరులు లీలం బక్షిరాట్కేతనో
ల్లసితం బైన రథంబుఁ దెచ్చిరి ప్రభ ల్నల్టిక్కులం బర్వంగన్.

132


సీ.

వెలిదామరలఁ బోలు వెడఁదకన్నులతోడ
        గౌస్తుభగ్రైవేయకంబుతోడఁ
బసిఁడికమ్ములపచ్చపట్టుఁబుట్టంబుతో
        మెఱుఁగారుఁజామెన(చాయ)మేనితోఁడ
తలుకొత్తుపసిఁడిగేదంగిరేకులతోఁడఁ
        గస్తూరికాంగరాగంబుతోఁడ

నటవీమయూరపింఛావతంసంబుతో
        జిగురొత్తుమొలకలేనగపుతోఁడ


తే.

నపుడ సాక్షాత్కరించినహరియుఁ బోలె
నెక్కె శివశ్మ గాంభీర్య మెసక మెసఁగఁ
గింకిణీజాలమాలికాలంకృతంబు
గరుడకేతనసహితంబు కనకరథము.

133


వ.

ఇట్లు దివ్యవిమానారోహణం బొనర్చి శివశర్మ విష్ణుకింకరులఁ జూచి యిట్లనియె.

134


గీ.

విష్ణుభక్తులఁ జెప్పంగ విందు నెపుడు
నేఁ బురాణేలేహాససంహితలయందుఁ
బుణ్యశీలసుశీలురన్ పుణ్యపురుషు
లచ్యుతునిసముఖమున నుం డ్రధికు లనుచు.

135


గీ.

వారు కారుకదా మీరు వనజనేత్రు
లంబుధరనీలవర్ణులు కంబుగళులు
భద్రదివ్యాకృతులు చతుర్బాహుదండు
లసితతులసీపలాశమాల్యాభరణులు.

136


వ.

అనిన వారు మహాత్మా! నీయట్టిమహానుభావు లెఱుంగనియర్థంబులు గలవె? ఏము నీవు పెద్దలవలనం బురాణేతిహాససంహితాముఖంబుల విన్నపుణ్యశీలసుశీలుర మగుదుము. అనేకలోకంబులు గడచి కానీ వైకుంఠపురంబునకుం బోవరాదు. అయ్యయిలోకంబులవిశేషంబులు నీకుం జెప్పెదము. సావధానమతివై యవధరింపుము. ఈవును నడుగవలసినయర్థంబు లడుగు మనిన నట్లకాక యనుచుం జనువాఁడు ముందట.

విష్ణుదూతలు శివశర్మకు సంయమనీస్వరూపంబుఁ దెల్పుట

సీ.

కఱకులై వ్రేలినకుఱుచజుంజుఱువెండ్రు
        కలును గందెనచాయకాయములును
గలివోసి నాన్చినగ్రచ్చకాయలభంగి
        గొఱమాలినట్టిదృగ్గోళకములు
తొట్టివాతెఱలపై దూరంబు సాగిన
        గొగ్గిపండులతోడి కుముఖములును
గూనివీఁపులమీఁద గోడియై బోడెత్తి
        తఱివడ్డకంకాళదండములును


గీ.

రాసభక్రూరకంఠనిర్హ్రాదకఠిన
ఘర్ఘరవ్యక్తభాషితోద్గారములును
గలిగి యిదె కొంద ఱున్నారు గగనవీధి
నొరిమెఁ నొడఁగూడుకొని యెవ్వరొక్కొ వీరు?

138


వ.

అనిన నద్దివ్యపురుషు లతని కిట్లనిరి.

139


ఆ.

ఇది పిశాచలోక మీ ధూమ్రవర్ణులు
విను పిశాచరాజు లనఘ! వీరు
చంద్రశేఖరుని బ్రసంగవశంబునఁ
గొలిచినారు భక్తి గొంచియంబు.

140


వ.

అనియిట్లు క్రమంబునఁ బ్రశ్నోత్తరరూపంబునఁ గర్మానురూపంబు లగుఫలంబు లనుభవించుచు [3]నుందురనిన నమరభావంబుల నుత్తరోత్తరాభ్యున్నతంబు లగు నాయాయిలోకంబుల వసియించియున్న పుణ్యపురుషులం గనుంగొనుచు శివశర్మ గుహ్యకలోకంబును గంధర్వలోకంబును విద్యా

ధరలోకంబును నతిక్రమించి యప్సరోలోకంబునకుం బోవు నవసరంబున.

141


చ.

ఎదురుగ వచ్చె హేమరథ మెక్కి కృతాంతుఁడు సౌమ్యమూర్తియై
పదురునిజాప్తకింకరులు పార్శ్వయుగంబున భక్తిఁ గొల్చి రా
ముదిరనినాదముం జఱచి ముందటి చక్కటి దివ్యదుందుభుల్
మృదులగభీరనాదములు మిన్నులు ముట్టఁ జెలంగుచుండఁగన్.

142


గీ.

ఎదురుగా వచ్చి దక్షిణం బేలు రాజు
ధర్మరాజు గరంబు సంతస మెలర్ప
సాధు! సాధు! మహాబుద్దిబోధమహిత!
మేలు మే! లని శివశర్మ మెచ్చి పొగడె.

143


సీ.

అభ్యసించితి వేద మాఱంగములతోడఁ
        బరిచర్య చేసితి గురుజనులకు
నాదిపురాణేతిహాసంబులును ధర్మ
        శాస్త్రంబు సదివితి సారధిషణ
సమబుద్ధిమై మహేశ్వరుఁ బుండరీకాక్షు
        సేవించి తేకాంతశీలమునను
గైవల్యకల్యాణఘంటాపథము లైన
        తీర్థంబు లాడితి తిరిగి యేడు


గీ.

ననఘ! నీ భాగ్యమునకు నియతియుఁ గలదె?
చూడుమా! యెంతటిదియొ నీసుకృతగరిమ?
భూసురోత్తమ? మాయంతలేసివారి
చే నమస్కారములు గొనఁ జెల్లె నీకు.

144

వ.

అని ధర్ముండు శివశర్మ నభినందించి నిజనివాసంబునకుం బోయెఁ దదనంతరంబ.

145


గీ.

విప్రకులముఖ్యుఁ డంతట వినయపరత
నిటుల ననియె హృషీకేశుహితులఁ జూచి
యనఘులార! యతిక్రూరుఁ డండ్రు జముఁడు
సౌమ్యుఁడై యున్నవాఁ డేమిచంద మొక్కొ?

146


గీ.

యమునిరూపంబు వర్ణింతు రఖిలమునులు
గుండె ఝల్లనునట్లుగా ఘోరలీల
జమునిఁ జూడఁగఁ గన్నులు చల్లనయ్యె
నిప్పు డారౌద్రరసరేఖ లెందుఁ బోయె?

147


గీ.

ఇదియ రూపంబొ? యీతని కింక నొక్క
రూప మున్నదియో? మహాక్రోధమునకు
నెఱుఁగ నానతియిండు నా కీరహస్య
మనఘమతులార! సందేహ మావహిల్లె.

148


వ.

అనిన [4]వారలిట్లనిరి.

149


క.

నినుబోటి పుణ్యవంతుల
కనఘా! శమనుండు సౌమ్య మగు నాకారం
బున నుండు దుర్జనుల కీ
యన రౌద్రాకారుఁడై యుదగ్రత చూపున్.

150


వ.

ఈదండధరుండు దంష్ట్రాకరాళవదనుండును, గ్రోధరక్తాంతలోచనుండును, నూర్ధ్వకేశుండును, గృష్ణాంగుఁడును, బ్రళయాంబుదనిస్వనుండును, బరిభ్రమద్భ్రుకుటీకుటిలనిటలతట

విటంకుండును, విశదవికటాకారుండునై దుర్వృత్తుల నీరీతి శాసించు.

151


సీ.

పాదంబు లిరుకేలఁ బట్టి గుంజుండు జ
        ర్జరితంబుగా వీనిఁ జట్టుఱాత
మెడ మెట్టి గోర్గొండి మెఱికి పుచ్చుఁడు వీని
        గ్రుడ్లు నక్తములు (నెత్తురులు) చెక్కుల స్రవింపఁ
గరికండలుగ వీనికంఠంబు వ్రేయుండు
గ రసానఁ బట్టినఖడ్గధార
బలుత్రాళ్ల బంధించి తలక్రిందుగా వ్రేలఁ
        గట్టుఁడు వీని వృక్షంబుకొమ్మ


గీ.

ఱంపమున వీనికంఠంబుఁ ద్రెంపి విడుఁడు
మడమతాఁపుల వీనిమర్మముల నొంపుఁ
డెఱ్ఱఁగా నగ్నిఁ గ్రాఁచినయినుపయిసుకఁ
గులికి పోయుఁడు వీనిముక్కునను జెవుల.

152


గీ.

పరకళత్రంబు కుచకుంభపాళియందు
నఖముఁ దివిచిన పాపాత్మునఖమునందు
నెఱ్ఱగా నగ్ని గ్రాఁగినయినపసూదు
లుగ్రదృష్టిని జొన్పుఁ డత్యాగ్రహమున.

153


వ.

పరదారముఖాఘ్రాణంబు చేసినపాపిష్ణు వదనంబున నిష్ఠురనిష్ఠీవనం బొనర్పుఁడు. పరదారభవనగమనం బొనర్చి కర్మ చండాలుని పాదంబులు ప్రచండత ఖడ్గంబున ఖండంబులుగా ఖండింపుఁడు. పరదారాధరోష్ఠబింబంబు చుంబించునయ్యసంబంధుమూర్ధం బుద్ధత చపేటంబునం దాటింపుఁడు. పరాపవాదపరునివక్షంటు లక్ష్యంబు సేసి తీక్ష్ణముఖనిశితక్షురప్రంబున

నేయుండు. పరసంతాపకారి కటుకవచనుం డగు కుటిలబుద్ధిని సింగలంబుల గ్రాఁగిన మంగలంబున వ్రేల్చుఁడు. పరునియందు మిథ్యాదోషం బారోపించునిర్దయు బ్రవర్ధనపూయశోణితకర్దమంబున ముంపుఁడు. గురునిందాకర్త యగుధూర్తునోట సంవర్తతప్తలోహంబు పోయుండు. పరకళత్రనాశకుం డగు సంకుసుకుచెవుల నిశ్శంకకలాయనశంకువులు గూర్పుఁ డని దండధరుండు ప్రచండకోపాటోపంబునఁ గింకరులం జూచి పలుకు. వెండియు.

154


గీ.

రౌరవం బనఁగను మహారౌరవ మనఁ
గాలసూత్రంబు గుంభిపాకం బనంగ
నంధతామిస్ర మనఁగ సంహార మనఁగ
నారకంబులు మఱియు నెన్నంగఁ గలవు.

155


వ.

ఈనరకంబులయందు దేవస్వభోక్తల బ్రహ్మస్వభుజుల శిశుహంతలఁ గృతఘ్నుల గురుతల్పగుల గోఘ్నస్త్రీఘ్నమిత్రఘ్నల బరక్షేత్రపరాలయాపహర్తలఁ గూటసాక్షుల గర్భఘ్నులఁ బ్రజాపీడాకరుల సురాపులఁ గూటశాల్మలిం బ్రాకించియుఁ బట్టుగార్లం బట్టించియుఁ దలక్రిందుగా (వ్రేల)గట్టించియు నిక్షుయంత్రములఁ బీడించియు నంధకూపంబునం ద్రోపించియు నినుపముక్కులకాకులం గఱపించియు యమకింకరులు పెక్కువిధంబుల బాధలు పెట్టుదురు.

156


క.

హరినామకీర్తనంబును
హరినామజపంబు నెవ్వఁ డాత్మఁ బఠించున్
నరకమహావేదన య
న్నరునకుఁ బ్రాపింపకుండు నయతత్త్వనిధీ!

157

వ.

ఈయర్థంబు నీకుఁ దేటదెల్లంబు గావించెద మాకర్ణింపు మాదికాలంబునం గృతాంతుండు నిజకింకరులతో నిట్లనియె.

158


సీ.

గోవింద! భూతేశ! గోప! గంగాధర!
        చాణూరమర్దన! చండికేశ!
కంసప్రణాశన! కర్పూర...!గో
        పీపతి! శంకర! పీతవసన!
గిరీశ! గోవర్ధనోద్ధరణ! బాలమృగాంక
        వర్ణ! మాధవ! భవ! వాసుదేవ!
విషమేక్షణ! మురారి! వృషభధ్వజ! హృషీక
        పతి! భూతపతి! శౌరి! ఫాలనేత్ర!


గీ.

కృష్ణ! హర! గరుడధ్వజ! కృత్తివసన!
కల్మషారి! గౌరీపతి! కమఠ! శూలి!
యనుచుఁ బఠియింతు రెవ్వ రాఘనులు మీకు
వందనీయులు చెనకంగ వలదు వారి.

159


సీ.

హరి! రజనీశకళావతంస! రమేశ్వ
        ర! పినాకపాణి! శ్రీరామ! భర్గ!
యనిరుద్ధ! శూలపాణి! నృసింహ! త్రిపథగా
        ర్ద్రజటాకలాప! మురహర! యీశ!
రాఘవ! యురగాభరణ! పద్మనాభ! యు
        గ్ర! మధుసూదన! పినాకపతి! యాద్య!
ప్రమథాధినాథ! నారాయణ! మృత్యుంజ
        య! పురుషోత్తమ! త్రిదశైకనాథ!


గీ.

యచ్యుతా! కామశత్రుప! యబ్జపాణి!
దిగ్వసన! చక్రపాణి! భూతేశ! యనుచుఁ

దలఁతు రెవ్వారు వార లుత్తములు భువన
పావనాత్మకు లందఱు ప్రభులు మీకు.

160


సీ.

బ్రహ్మణ్యదేవ! శర్వ! ముకుంద! విశ్వేశ్వ
        ర! సనాతన! త్రిణేత్ర రావణారి!
శ్రీకంఠ! ధర్మధురీణ! శంభువ! కమ
        లాధీశ! యీశాన! యదుపతి! మృడ!
ధరణీధ[5]ర! హర! యంధకహర! శార్ఙ్గపా
        ణి! పురారి! విష్ణువ! నీలకంఠ!
వైకుంఠ! దేవదేవ! మధురిపుఁడ! త్రిలో
        చన! కైటభరిపుండ! చంద్రచూడ!


గీ.

కేశినాశ! గిరీశ! లక్ష్మీపతి! త్రిపు
రారి! వసుదేవసూనుఁడ! త్ర్యక్ష! యనుచు
జపము సేయుదు రెవ్వ రవ్విపులపుణ్య
ఘనులఁ గదిసినప్పుడు మీకుఁ గల్లవచ్చు.

161


వ.

మఱియు వినుండు. శ్రీకాంత! శివ! యసురనిబర్హణ! మన్మథరిపుఁడ! జనార్దన! ఖండపరశుఁడ! శంఖపాణి! శశిశేఖర! దామోదర! రిపుసూదన! యంబుధరనీల! స్థాణువ! యానందకంద! సర్వేశ్వర! యను నీదివ్యనామంబులు భావించుకృతార్థులు మీకు మాననీయులు సుండి యని యివ్విధంబున నంతకుండు గింకరవర్గంబు ననుశాసించె. ఈహరిహరనామంబులయష్టోత్తరశతంబు విన్ననుఁ బఠించిన జనులకు నారోగ్యైశ్వర్యంబులు సంభవించు.

162

చ.

శమనుని రాజధాని యగుసంయమనీనగరంబునం గరం
దమకురుధర్మసేనదృఢధన్వజయద్రథు లాదిగా నృపో
త్తములు నిజాంతనిర్మలినధర్మధురంధరు లుండ్రు నిర్వ్యపా
యమున ననర్ఘ్యరత్నమయహారిహిరణ్మయహర్మ్యవీథులన్.

163


వ.

అని యివ్విధంబున.

164


పరలోకవృత్తాంతము

తే.

శమనలోకాభివర్ణనశ్రవణపరత
సుబుసుపోవఁగ శివశర్మ యొయ్యఁ జేరె
నప్సరోలోక మది ప్రసూనాశుగునకు
లోకవిజయైకపట్టాభిషేకభూమి.

165


వ.

అప్పుడు శివశర్మ విష్ణుశీలసుశీలుర కి ట్లనియె.

166


తే.

ఎవ్వరొకొ? వీరు విమలపూర్ణేందుముఖులు
దివ్యభూషామహారత్నదీప్తిజాల
పరిధిచక్రావరణమధ్యభావ్యమాన
భువనమోహనమూర్తు లిప్పురమునందు.

167


వ.

అనిన వార లిట్లనిరి.

168


సీ.

ఏయిందుబింబాస్య లిక్షుకోదండుని
        త్రైలోక్యరాజ్యాధిదైవతంబు
లేయింతులకుఁ బుట్టినిల్లు దుగ్ధాంభోధి
        మధుకైటభారాతిమడుఁగుఁబాన్పు
ఏచకోరాక్షుల కింద్రచంద్రజయంత
        నలకూబరాదులు ననుపుమిండ
లేపువ్వుఁబోడులయిరియింతచూపుల
        ఋషులవంటిమనంబు లిగురువెట్టు

తే.

మహితభక్తి నేభామలమనుమరాండ్ర
దక్షిణాసందవనమహాస్థాన....కి
భీమనాథేశ్వరునకు సుత్రాముఁ డిచ్చె
ననఘ! వీరు సు మ్మయ్య! యయ్యప్సరసలు.

169


వ.

ఊర్వశి, మేనక, రంభ, ఘృతాచి, చంద్రరేఖ, తిలోత్తమ, పపుష్మతి, కాంతిమతి, లీలావతి, యిల్వలావతి, యలంబుస, గుణవతి, స్థూలకేశి, (కళావతి), కలానిధి, (గుణనిధి), కర్పూరతిలక, యుర్వర, యనంగతిలక, మదనమోహిని, చకోరాక్షి, చంద్రకళ, మునిమనోహర, చారునాద, సువర్ణిక, దారుసంజీవని, క్రతుశుల్క, శుభానన, తపశ్శుల్క, తీర్థశుల్క, దానశుల్క, హేమావతి, పంచాశ్వమేధిక, రాజసూయార్థిని వీరుమొదలుగా నఱువదివేలు దివ్యాప్సర లీలోకంబునం దధివసింతురు.

170


సీ.

బ్రహచర్యం బొక్కరాత్రి దైవికమున
        మఱచి తప్పినయట్టిమాస(చ)కమ్మ
కలకాల మెల్లను గామితవ్రతములు
        సలిపినట్టిచకోరశాబనయన
బలిమి నొక్కనికి లోబడి వాని నవ్వేళఁ
        బతిఁ గాఁ దలంచినపద్మగంధి
పురుషుఁడు లేనియప్పుడు ప్రమాదంబున
        మోసపోయినయట్టిముద్దరాలు


తే.

భోగదానవ్రతంబులఁ బూని యెపుడు
మకరకేతను నర్చించుమాఁటినంద
కన్నెవయసునఁ గన్నెఱికంబుఁ దప్పి

పిదపఁ బతిభక్త యగునాతి త్రిదశవేశ్య.

171


తే.

మాంత్రికుం డైన యొక సిద్ధమౌని నొండె
నొక్కవేలుపు నొండెణ బ్రియుండు వనుప
పుత్త్రసంతానలబ్ధి పొందినట్టి
లోలలోచన కప్సరోలోక మబ్బు.

172


సూర్యలోకవర్ణనము

వ.

అని చెప్ప నప్సరోలోకంబుఁ గనుంగొనుచు భాస్కరలోకంబు సేరం జని యేకచక్రంబును సప్తసప్తియు ననూరుసారథికంబును నప్సరోమునిగంధర్వామరోగసమన్వితంబును నగు రథంబుమీఁదఁ గరధృతారవిందద్వయం డయి నభోమార్గంబునం జను కమలబాంధవునిం జూపి విష్ణుకింకరు లి ట్లనిరి.

173


సీ.

సిద్ధాంతసంసిద్ధి సిద్ధసంఘంబును
        విధ్యుక్తపరిపాటి విబుధకోటి
చాటుధారాప్రౌఢిఁ జారణవ్యూహంబు
        కిన్నరవ్రాతంబు గీతసరణి
ఖచరసంఘము విశృంఖలమణి వైచిత్రి
        యాతుధానశ్రేణి యధికభక్తి
గరుడలోకము నమస్కారవాక్యంబున
        నేకాగ్రమతి దందశూకసమితి


తే.

ప్రతిదినంబును బ్రాతరారంభవేళ
నిర్ణిబంధననిరుపాధినిరవగాధ
నిర్నిరోధనిరాఘాటనిరుపమాన
భక్తి సంభజియింతు రీపద్మబంధు.

174

సీ.

సంచారలోలుఁ డౌ జగదుపక్రియకు నై
        సమధికస్థైర్యంబు జరుపుఁ గాని
జనులదృష్టికి వెక్కసం బై విభాసిల్లు
        లోనఁ జైతన్యంబు నీనుఁ గాని
సంతాపహేతు వౌ సంయమిశ్రేణికి
        నిర్వాణలీల యీ నేర్చుఁ గాని
ఖరరుచిత్వముఁ బూనుఁ గాలక్రమంబున
        శీతలామృతము వర్షించుఁ గాని


తే.

ప్రాగవస్థాభ్యధికతరోపర్యవస్థ
నతిశయిల్లుచు భువనంబు లఖిలములుసు
వార కత్యంతచాతుర్యవైభవమున
ననఘ! రక్షించుచుండు నీయబ్జహితుఁడు.

175


వ.

అని రప్పుడు శివశర్మ దా నొనర్చునమస్కారంబు లంగీకరించుచు నిమేషార్ధమాత్రంబున రెండువేలు నిన్నూటరెండుయోజనంబు లతిక్రమించినం జూచి యాశ్చర్యం బంది గోవిందకింకరుల కి ట్లనియె.

176


తే.

అనఘులార! ఖరాంశుబింబాంతరమునఁ
బురుషు నొక్కని నుండఁ జెప్పుదురు బుధులు
పరమతాత్పర్యగరిమ సప్పురుషు నెట్లు
సేవసేయుదు రొక్కొ సంసిద్దిపరులు?

177


వ.

అనిన వార లిట్లనిరి.

178


సీ.

ఆకాశమధ్యస్థ మగుభానుబింబంబు
        విను లక్షయోజనవిస్తృతంబు

తన్మధ్యమందున ధవళాంశుశేఖరు
        నుద్గీతవిద్యాప్రయోగసరణి
హైమరూపుఁడు హిరణ్యశ్మశ్రుకేశుండు
        నానాప్రముఖహిరణ్యానయవుఁడు
గాగ భాగించి యాకమలలోచనుఁ డుండు
        నతఁడ యే నని సదా ధ్యానపరత


తే.

విమలమానసుఁ డగుచు భావింపవలయు
బ్రహ్మవిద్వాంసుఁ డగువాఁడు ప్రాహ్ణవేళ
నర్కునర్ధోదయమున గాయత్రిఁ గూర్చి
యర్ఘ్య మెత్తిన యాచమనాంతరంబు.

179


వ.

కాలలోపంబు సేయవలదు. కాలంబు ప్రతీక్షించునట్టిది. కాలంబునం గదా యోషధులు ఫలించు. కాలంబునం గాక పాదపంబులు పూచునే? కాలంబుననే మేఘంబులు వర్షించు. మందేహదేహనాశార్థం బుదయాస్తమయంబుల బ్రాహణోత్సృష్టంబగు గాయత్రీమంత్రతోయాంజలిత్రయంబు చిత్రభానుం డపేక్షించుచుండు. కాలంబు దప్పకుండ సదుపాస్యమానం డయి భానుం డాయురారోగ్యైశ్వర్యంబులు ప్రసాదించు.

180


సీ.

మే లైన రెండుతొమ్మిదులు విద్యలలోన
        మననీయ మగుచు మీమాంస వెలయ
మీమాంసకంటెను మిగులుప్రాభవమునఁ
        దర్కశాస్త్రము శుభోదర్కగరిమ
తర్కశాస్త్రముకంటెఁ దా నమభ్యధికంబు
        వివరించి చూడంగ వేదరాశి

యామ్నాయములకంటె నభ్యర్ధితంబులు
        చర్చింప నుషనిషత్సముదయములు


తే.

నుపనిషత్తులకంటెసు నూర్ధ్వపదవి
మంత్రరాజంబు గాయత్రి మహిమఁ గాంచుఁ
బ్రణవ మనుక్రేపుతోఁ గూడి పాఁడిఁ బిదుకు
నవనిసురులకు గాయత్రి యనెడిసురభి.

181


తే.

మంత్రములలోన గాయత్రి మహిమఁ గాంచు
నగరములలోనఁ గాశి యున్నతి వహించు
దైవతంబులలో సుధాధామమౌళి
విశ్వనాథుండు ప్రాధాన్యవిభవ మొందు.

182


స్రగ్ధర.

గాతారం త్రాయతే నాఁగలిగినతెలివిన్ గల్గె గాయత్రి కర్థా
న్వీతం బై నామధేయం బితరమనువులం దీప్రభావంబు లే దీ
ప్రాతర్మధ్యాహ్నసాయోపగమములఁ బరబ్రహ్మవిద్వాంసు లార్యుల్
జ్యోతిర్మూర్తిన్ భజింతు ర్సురగణవినుతున్ సూర్యునిన్ సిద్ధవిద్యన్.

183


క.

గాయత్రి పరబ్రహ్మము
గాయత్రి కధీశ్వరుండు కమలాప్తుఁడు శ్రీ
గాయత్రీమంత్రమునకు
నేయవియును సాటి వచ్చునె మంత్రమ్ముల్?

184


వ.

ఈ వేదమూర్తి హంసుండు, భానుండు, సహస్రాంశుండు, తపనుండు, తాపనుండు, రవి, వికర్తనుండు, వివస్వంతుండు,

విశ్వకర్మ, విభావసుండు. విశ్వరూపుండు, విశ్వకర్త, మార్తాండుం(డు, మిహిరుం), డంశుమాలి, యాదిత్యుం, డుష్ణగుండు, సూర్యుం, డర్యముండు, బధ్యుండు, దివాకరుండు, ద్వాదశాత్ముండు, సప్తహయుండు, భాస్కరుం, డహస్కరుండు, ఖగుండు, సూరుండు. ప్రభాకరుండు, శ్రీమంతుండు, లోకచక్షువు, గ్రహేశ్వరుండు, త్రిలోకేశ్వరుండు, లోకసాక్షి, తమోరి, శాశ్వతుండు, శుచి, గభస్తిహస్తుండు, తీవ్రాంశుండు, తరణి, మహారణి, ద్యుమణి, హరిదశ్వుం, డర్కుండు, భానుమంతుండు, భయార్దకుండు, ఛందోశ్వుండు, వేదవేద్యుండు, భాస్వంతుండు, పూష, వృషాకపి, యేకచక్రరథుండు, మిత్త్రుండు, మందేహారి, తమిస్రహుండు, దైత్యహుండు, పాపహర్త, ధర్ముఁడు, ధర్మాధర్మార్థహేళి, చిత్రభానుండు, (కళిందుండు), తార్క్ష్యవాహనుండు, దిక్పతి, పద్మినీనాయకుండు, కుశేశయకరుండు, హరి, ఘర్మరశ్మి, దుర్నిరీక్షుండు, అరుణుండు, కశ్యపాత్రజుం డను నీడెబ్బదినామంబులు గలిగియుండు.

185


సీ.

మోకాళ్లు భూమిపై మోపి హస్తాంబుజ
        ద్వయమునఁ దామ్రపాత్రము ధరించి
యర్ఘ్యోదకంబులయందు దూర్వాంకురా
        క్షతలును నవరక్తచందనంబు
కరవీరముఖ్యరక్తప్రసూనంబులు
        వైచి యొక్కొక్కపేర్వరుసతో న
మోంతంబుగాఁ జతుర్థ్యంతంబుగాఁ బ్రణ
        వాదిగాఁ బఠియించు చర్ఘ్యపాత్ర

తే.

మౌళిపర్యంత మెత్తుచు మాటిమాటి
కర్ఘ్య మిచ్చినఁ బ్రీతుఁడై యర్కుఁ డొసఁగు
సేవకుల కాయురారోగ్యధీవివేక
భాగ్యసౌభాగ్యవైభవప్రాభవములు.

186


సీ.

అది గుహ్యమై యకారాదిక్షకారాంత
        పంచాశదక్షరప్రకృతి యైన
మాతృకయై మహామంత్రరాజంబునై
        దవయవంబులఁ బుట్టె నం దకార
మునకును నోంకారమునకు మకారంబు
        నకు బిందువునకును నాదమునకుఁ
బ్రత్యేకమ పదేసిపదియేసివర్ణంబు
        లనఘ! జన్యంబులై యతిశయిల్లు


తే.

నట్టిప్రణవంబు హేమసింహాసనమున
భాస్కరుం డనుమాణిక్యపదకభూష
యఱుత ధరియించి దేవి గాయత్రి యొప్పుఁ
గడుపుచల్లంగ వేదాళిఁ గన్నతల్లి.

187


క.

సంశితవిజ్ఞానచతు
ర్వింశతితత్త్వంబులకును వేడుకతో నీ
యంశుమదధిపతిమంత్ర మ
సంశయముగ నెపుడు మన కొసఁగు నభిమతముల్.

188


సీ.

మూడు వేదంబులు మూఁడుపాదంబులు
        నాభి యాదిమపురాణవ్రజంబు
క్రిందు మీఁదును జతుర్దిశలు నాల్గక్షులు
        భువనంబు దేహంబు దివి యుదరము

ధర్మశాస్త్రంబు హృత్సరసీజముకుళంబు
        ఛందోవితతి కుచస్తబకయుగము
సాంఖ్యశాస్త్రంబులు శ్రవణపాశంబులు
        జాతవేదుఁడు వక్త్రచంద్రబింబ


తే.

మైదుతలలును శిక్షాదు లంగకములు
చేష్ట యాధర్వణశ్రుతి శిఖ శివుండు
బ్రహ్మమూర్ధంబు హరి యాత్మభావలక్ష
ణములు మీమాంస సావిత్రి కమలచరిత!

189


క.

వ్యాహృతులతోడఁ బ్రణవో
ద్గ్రాహముతో శరముతోడఁ గమలాప్తమనః
ప్రాహుణికంబై యీమను
వాహుతిఁ గొనుఁ బాతకముల నగ్నియుఁ బోలెన్.

190


మ.

క్షితిదేవోత్తమ! బ్రాహ్మణుండు వెలిగా జిహ్మాభిచారక్రియా
క్రతుతంత్రంబున శాత్రవున్ గుఱిచి యీగాయత్రివర్ణావళిన్
బ్రతిలోమంబున నుచ్చరించి విడువన్ బ్రహ్మాస్త్రమై తాఁకి యా
ప్రతిపక్షుం దెగటార్చు నంగుళిభావప్రస్ఫోటమాత్రంబునన్.

191


సీ.

గాయత్రి విష్ణుండు గాయత్రి శంభుండు
        గాయత్రి పరమేష్టి కర్మనిష్ఠ
గాయత్రి విధివిష్ణుకమలసంభవమూర్తి
        యైనమార్తాండుండు మౌనివర్య!
గాయత్రి జపియించి గాయత్రి గొనియాడి
        కాంచు విప్రుఁడు ముక్తి కలితపుణ్య!
గాయత్రి సేవించు కాలంబు గాలంబు
        మంత్రతంత్రములు నిర్మలవివేక!

తే.

యనఘ! సావిత్రి యనఁగ గాయత్రి యనఁగ
విశ్వజనయిత్రి యనఁ జతుర్వేదమాత
యనఁ బరాపరబ్రహ్మద్వయం బనంగ
నమ్మహాదేవికి సమాహ్వయాంతరములు.

192


వ.

అని పుణ్యశీలసుశీలురు సూర్యలోకమాహాత్మ్యం బభివర్ణింప నాకర్ణించుచు శివశర్మ ముంపట నయనానందసందోహసంధాయి యగునొక్కపట్టణంబుఁ గనుంగొని యవ్విష్ణుకింకరుల కి ట్లనియె.

193


తే.

పుండరీకాక్షులార! యీ పురంబు
నెఱయ నుత్సవ మొనరించె నేత్రమునకు
నెఱుఁగఁ జెప్పుడు నా కది యేభువనమొ
శోభితం బైనకారుణ్యవై భవమున.

194


స్వర్గలోకవర్ణనము

తే.

అనిన వా రిది నముచిమర్ధనునివీడు
కనకగోపురకనకాట్టకనకసౌధ
కనకకుట్టిమవేదికాకనకభిత్తి
కనకరాజీవసరసీప్రకాశితంబు.

195


సీ.

చికిలించుకొనియుండు జిలుఁగుఱెప్పలలోనఁ
        గుసుమసాయకవైరినొసలికన్ను
పద్మనాభునికౌస్తుభముకాంతి వెలిపోయెఁ
        బద్మచన్నులమీఁదిపసుపు దాఁకి
ధళధళుక్కన నింగిఁ దాటించి చనుఁ గాని
        నిలువనేరదు హ్రాదినీప్రకాశ

మస్తినాస్తిప్రకాశానుసారంబున
        మినుమిన్కుమనుచుండు ననలుదీప్తి


తే.

పగలు పగ లయ్యె శశివిభాప్రసరమునకు
దాన పో దిక్కు దీప్తిసంతానమునకు
ననఁగ గనఁగనఁ గనకవర్ణాభుఁ డైన
భానుఁ డేతత్పురీసమీపమున నడచు.

196


చ.

అమవసలందు నా సరసిజాప్తునిగర్భము దూఱఁ బోవునా
సమయమునన్ స్వకీయమగుచంద్రిక నిల్లడవెట్టెనో సుమీ
యమృతమయూఖుఁ డీనెలవునందను సంశయ మావహించె ను
త్తమకుల! చూడు మిప్పురిసుధాధవళోన్నతసౌధవీధికల్.

197


శా.

పౌనఃపున్యము సంఘటింపఁదొడఁగెన్ బ్రహ్మద్వయోత్తంస! గో
ష్ఠీనాగ్రంబున లేఁగపెయ్య యిది కంటే కామధేనూద్భవం
బానందంబున డెంద ముబ్బఁగ జనన్యాపీనవాపీసుధా
పానోత్పుచ్ఛమనూనమౌ చటులఝంపాతాండవాటోపమున్.

198


శా.

కంటే స్వఃకరికంఠపీఠవిలుఠద్గ్రైవేయలోహార్గళా
ఘంటాటాంకృతి నాదసౌధవలభీగర్భంబులం దార్కొనం
ఘంటావీథిఁ జరించుచున్నది పురాగారంబు వీక్షించి వె
న్వెంటక దివ్యకరేణు వభ్ర ముపధావింపంగ దర్పోద్ధతిన్.

199


క.

నందనవన మిదె ధరణీ
బృందారక! యల్ల పెద్దపృథివీరుహముల్
మందారకల్పతరుహరి
చందనసంతానపారిజాతాహ్వయముల్.

200


మ.

దివిజాధీశు సుధర్మ యన్ సభ సముద్వీక్షింప భూదేవ! రెం
డవకై లాసమువోలె నున్నయది బ్రహ్మాండంబుతో రాయుచున్

ధవళాభీలసుధాట్టహాసవిమలద్రాఘిష్ఠశృంగాగ్రమై
యవదాతధ్వజశాటికాంచలచపేటాధూతజీమూతమై.

201


సీ.

చెఱువు లేటికి రేలు శిశిరాంశుకరముల
        గరఁగు చంద్రోపలగిరులు గలుగఁ?
గల్పవృక్షంబులు గలుగంగ నేటికి
        వలువలకై తంతువాయసమితి?
గణకు లేమిటికి సంకల్పార్థచింతకుఁ
        జింతామణీశిలాశ్రేణి గలుగఁ?
గామధేనువులు గల్గగ నేమిటికి మఱి
        యోదనంబునకు నై యౌదనికులు?


తే.

నాఁగ సర్వపదార్థజన్మస్థలంబు
భూరికల్యాణవైభవకారణంబు
విశ్వభువనైకవినుతంబు విబుధరాజ
పట్టణం బిది పంకజప్రభవవంశ్య!

202


శా.

క్షీరాంభోనిధి సంభవించిన ఘృతాచీమేనకామంజుఘో
షారంభాహరిణీతిలోత్తమలు విశ్వాచీచకోరాక్షులున్
స్వారాజప్రియవారభామినులు నానాభూషణాలంకృతల్
గారా మూరఁగఁ జూతురు న్మనలనీకంజాక్షులం జూడుమీ!

203


వ.

ఈయింద్రలోకంబునందుఁ దరురత్నంబు పారిజాతంబు, గాంతారత్నం బూర్వశి, వనరత్నంబు నందనంబు, తురగరత్నం బుచ్చైశ్రవంబు, గజగత్నం భైరావతంబు, రత్నరత్నంబు చింతామణి, సప్తార్చిఃప్రభృతు లగుసప్తలోకపాలురు, నారదాదిమునులు, దనుజమనుజదైత్యులు, గంధర్వయక్షకిన్నరకింపురుషులు, సగరనలనహుషమాంధాతృదుందుమారాదివ

సుంధరాధిపతులు, జ్యోతిప్టోమాదియాగంబులు చేసినసోమయాజులుం, దులాపూరుషాదిమహాదానంబులొనర్చినదాతలు, సంగ్రామంబుల నపరాఙ్ముఖులై యక్లీబవాదులై యీల్గినవీరులు వసియింతు రని యనంతరంబ యగ్నిలోకంబున నర్చిష్మతీపురంబు చేరం గొనిపోయి శివశర్మకుఁ బుణ్యశీలసుశీలు రి ట్లనిరి.

204


సీ.

అమరావతీపురం బమరవల్లభుఁ డేలు
        నర్చిష్మతీపురం బగ్ని యేలు
శ్రాద్ధదేవుం డేలు సంయమనీపురం
        బసురనాయకుఁడు పుణ్యవతి నేలు
నమలవతీపురం బంబునాయకుఁ డేలు
        వాయు వేలును గంధవతిపురంబు
నలకాపురంబు యక్షాధీశ్వరుం డేలు
        నైశాని యేలు జన్ద్రార్ధమౌళి


తే.

యనిరి దిక్పాలపురములం దవనిసురుఁడు
రెండవపురంబు నీక్షించి ప్రీతి నుండె
నపుడు వర్ణింపఁ దొడగి రయ్యగ్నిలోక
మహిమసంపద గోవిందమాన్యహితులు.

205


సీ.

శిఖ కర్మఠులకు నిశ్రేయసశ్రీదాత
        ధరణీసురులకుఁ దీర్థంబు వహ్ని
యాశుశుక్షణి గురుం డవనినిర్జరులకు
        నగ్రవర్ణుల కగ్ని యాశ్రమంబు
దహనుఁ డేడ్గడయు నుత్తమవర్ణభవులకుఁ
        బావకుం డీశుండు బ్రాహ్మణులకుఁ
బ్రత్యయంబు తనూనపాత్తు బాడబులకుఁ

        బాఱుల కనలుండు పారిజాత


తే.

మాశ్రయాశుండు ప్రాణుల కంతరాత్మ
చంద్రశేఖరమూర్తి యుషర్బుధుండు
సకలజగదుద్భవస్థితీసంహృతులకుఁ
గేవలము హేతుభూతుండు కృష్ణవర్త్ర.

206


మ.

వివిధాజ్యాహుతిధూపదీపములు నైవేద్యంబు నీయగ్ని మున్
జవి గొం బిమ్మట భుక్తిముక్తుల నవశ్యప్రీతి గా నెప్పుడున్
జవి గోం డ్రంబుజసంభవాచ్యుతమహేశానాదిబృందారక
ప్రవరు ల్సర్వహృషీకతర్పణముగా బ్రహ్మార్థపారంగతా!

207


వ.

అనిన విని శివశర్మ వైశ్వానరుం డనంగ నెవ్వం? డెవ్వనితనూజుం? డేప్రకారంబున నాగ్నేయం బైనతేజం బతనికి సంభవించె? మహాత్ములారా! యెఱింగింపుం డనిన వారు వైశ్వానరమాహాత్మ్యంబు వివరింపఁ దొడఁగి యి ట్లనిరి.

208


వైశ్వానరమాహాత్మ్యము

సీ.

విశ్వానరుండు నానీశ్వరభక్తుండు
        శాండిల్యగోత్రసంజాతుఁ డనఘుఁ
డభినుతబ్రహ్మచర్యాశ్రమనిష్ఠుఁడై
        బ్రహ్మయజ్ఞములు తప్పక యొనర్చు
నిరతుఁడై విజ్ఞాతనిఖిలశాస్త్రార్థుఁడై
        లోకతత్త్వజ్ఞుఁడై యేకతమున
నొకనాఁడు చింతించుచుండె నేయాశ్రమం
        బొక్కొ నాల్గింటిలో నుత్తమంబు!


తే.

భక్తి నేయాశ్రమంబు చేపట్టినప్పు
డైహికాముష్మిక ఫలంబు లందవచ్చు?

నిదియ మే లన్న య ట్లుండు నిదియ లెస్స
యన్న య ట్లుండు నొక్కొక్కయాశ్రమంబు.

209


వ.

అది యెట్లనిన వర్ణాశ్రమాచారంబు శివప్రసాదద్వారంబున జ్ఞానసాధనంబు. అందు వర్ణధర్మంబులు బ్రాహ్మణుండు బృహసృతిసవనంబునను, రాజు రాజసూయంబునను, వైశ్యుండు వైశ్యస్తో(స్టో)మంబునను యజియింతురనునివి యాదిగాఁ గలయది. మఱి యాశ్రమధర్మంబు లధ్యయనాదులు బ్రహచారిధర్మంబులు, గృహస్థధర్మంబు లగ్న్యాధానాదులు, వానప్రస్థధర్మంబు లరణ్యవాసాదులు, యతిధర్మంబులు శ్రద్ధాదులు. బ్రహ్మచారిగృహస్థవానప్రస్థభిక్షు(కు)లయాశ్రమంబు లుత్తరోత్తరంబు లుత్కృష్టంబు, లీచతురాశ్రమంబులవారును నిజకర్మానుష్ఠానంబులు తప్పక యీశ్వరపూజాతత్పరులై సంసిద్ధి వడయుదురు. నాకుం జూడ నన్నియాశ్రమంబులకు నాధారభూతం బై(న)గృహస్థధర్మంబు ముక్తిసాధనంబై తోఁచుచున్నయది. సర్వాశ్రమంబులకు స్వరూపలాభంబు గృహస్థాశ్రమ నిబంధనంబ. కొందఱు ‘వర్ణాశ్రమాచారనిష్ఠునకు బ్రహ్మనిష్ఠ సిద్ధింపదు. బ్రహ్మనిష్ఠ యన సర్వవ్యాపారపరిత్యాగంబున ననన్యచిత్తంబునం జేసి బ్రహ్మంబు నెఱుంగుట, కర్మానుష్ఠానకర్మత్యాగంబులకు స్వరూపంబుఁ బరస్పరవిరోధంబుఁ గావునఁ గర్మశూరునియందు సంభవింప’ దండ్రు. వర్ణాశ్రమకర్మానుష్ఠానవంతునకు యథావశంబున బ్రహ్మనిష్ణాతాత్పర్యంబు సుకరంబు గావునఁ గర్మపరుండు బ్రహ్మంబు నెఱుంగండను నిషేధోక్తి(కిం)బని లేదు. పరదారపరిత్యాగంబునను నాత్మదారపరితోషంబునను ఋతుకాలాభిగమనంబునను

బ్రహ్మచారియుఁ రాగద్వేషకామక్రోధవర్జనంబున వానప్రస్థుండును నయాచితోపస్థితదేహయాత్రామాత్రంబున భిక్షుకుండును నై గృహస్థుం డఖిలాశ్రమంబులు తాన కైకొను. దేవయజ్ఞంబు, పితృయజ్ఞంబు, భూతయజ్ఞంబు, మనుష్యయజ్ఞంబు, బ్రహ్మయజ్ఞం బనుపంచమహాయజ్ఞంబులం జేసి వివిధిషాముఖంబున గృహస్థుండు ముక్తుం డగు. కావున గార్హస్థ్యం బగుధర్మంబునం గైవల్యంబు వడసెద.

210


మ.

అని యత్యుత్తమవంశసంభవ వివాహం బయ్యె శాస్త్రోక్తవి
ధ్యనురూపంబున భాగ్యలక్ష్మిగ(వ)తి కల్యాణిన్ గుణాన్వీతశో
భనపుణ్యాకృతి విప్రకన్యక మహాభాగుండు విశ్వానరుం
డనురూపస్థిరపుణ్యలగ్నమున వంశానందసంధాయియై.

211


ఉ.

చేడియనామధేయము శుచిష్మతి యాచిగురాకుఁబోఁడికిన్
వ్రీడయుఁ గేశభారమును వృత్తపయోధరము ల్నితంబమున్
బాడబునెమ్మనంబు రతిభావముతోడన నాఁడు నాఁటికిన్
వీడఁగఁ జొచ్చె బాల్యమును వీడఁదొడంగె దదీయచింతతోన్.

212


సీ.

అనుదినంబును బ్రాతరారంభవేళల
        నోలగందంబుతో నుదకమాడి
యంచువన్నియతోడ నంద మైనమడుంగు
        నిద్దంపుఁ బుట్టంబు నెఱికి గట్టి
నెఱయంగఁ గూడని నెఱికూఁకటులు పాఁచి
        పొంకంబుగాఁ గమ్మపూలు దుఱిమి
కాశ్మీరతిలకరేఖామధ్యమునయందుఁ
        బుణ్యంపుఁజిఱుబొట్టు పొందుపఱచి

తే.

విసువు లే కగ్నిహోత్రంబు వేల్వఁ బెట్టు
దీపధూపంబు లొడఁగూర్చు దేవపూజ
కోగిరంబులు గావించు నొప్పుగాఁగ
బాల ప్రాణేశుహృదయంబు పల్లవింప.

213


వ.

అనంతరంబ యౌవనారంభమున నారంభోరువు వినయవతియు, వివేకవతియు, విలాసవతియు, విభ్రమవతియు, శాంతిమతియు, సౌజన్యవతియు, సౌహార్దవతియు నై శుశ్రూషాతాత్పర్యంబునం బతిడెందంబున కానందంబు సంపాదించుచుండం బెద్దకాలం బరిగిన.

214


తే.

కానరాదయ్యెఁ బుత్త్రసంతానలబ్ధి
యెన్నినోములు నోఁచిన నిందుముఖికి
నంత నొకనాఁడు తరుణి యేకాంతవేళ
విభునిపాదంబులకు మ్రొక్కి విన్నవించె.

215


ఉ.

కట్టితి బట్టుఁబుట్టములు కాంచనభూషణముల్ ధరించితిం
బెట్టితి బంధుకోటికి నభీప్సితవస్తుచయంబు గీర్తి చే
పట్టితి మీపదాబ్జములు పాయక నిచ్చలు సేవసేయఁ గాఁ
బట్టి వసుంధరం గలరె భామలు నాసరి భాగ్యసంపదన్?

216


క.

సకలైశ్వర్యసమృద్ధులు
నొకతల సంతానలాభ మొకతల యిది యే
టికిఁ దడసె? నిందురేఖా
మకుటునికృప యేల లేదు మన కిప్పాటన్?

217


క.

చింతించి చూడవచ్చిన
సంతానము వంశమునకు సకలంబునకున్

సంతానము సురధేనువు
చింతామణి సిద్ధరసము! చిరతరపుణ్యా!

218


వ.

సంతానంబు గలుగునట్టియుపాయంబు చింతింపుమని ప్రార్థించిన.

219


ఉ.

ఇంతవిచార మేమిటికి నిందునిభానన! నెమ్మనంబులో
సంతతిలబ్ధికై విడువు శంక శశాంకకళాకిరీటుఁ గా
లాంతకుఁ గాశికానగరహాటకనిర్మలహర్మ్యమాలికా
భ్యంతరవర్తి విశ్వపతి నాశ్రితవత్సలు నాశ్రయించెదన్.

220


వ.

అనిన విని శుచిష్మతీదేవి యర్చిష్మత్ప్రభావుం డగుభర్తకు వెండియుం బ్రణమిల్లి పాణిపల్లవంబులు మొగిడ్చి వినయవినమితోత్తమాంగయై యార్య(పుత్రా!) పుత్రసంతానలాభంబు నాయందుం బడయ నభిమతంబ యేని నేనుం బ్రసాదభాజనంబ నగుదు నేని నిందుశేఖరసదృశుం డైననందనుం బ్రసాదింపు మనుటయు.

221


తే.

ధర్మగేహినిపైఁ గలకూర్మిపేర్మి
శంసితవ్రతుఁ డైనవిశ్వానరుండు
వనరుహాయతనేత్ర కోరినవరంబు
మునికులశ్రేష్టుఁ డిచ్చితి ననుచుఁ బలికె.

222


సీ.

ఇంతి మనోరధం బెట్లు నీయఁగ వచ్చు?
        నేయింతి పతి వేఁడె నిట్టివరము?
వరము వేడిన వేఁడవచ్చుఁ గా కిబ్భంగి
        నీ నేరవచ్చునే యీప్సితార్థ?
మాగమంబులు సమానాధికరహితుఁ గా
        శీతాంశుశేఖరుఁ జెప్పుచుండు

నారుద్రు లీలావతార మీచపలాక్షిఁ
        దనకుఁ గారణముఁ గాఁ దలచె నొక్కొ.


తే.

కానినాఁ డిట్టితలఁ పెట్లు గలుగనేర్చుఁ
దరుణి? కంచు వితర్కించి తరతరంబ
యొకముహూర్తంబుతడవు నైష్ఠికతఁ బూని
శంభుభక్తిపరుండు విశ్వానరుండు.

223


వ.

అనంతరంబ యమ్మునీశ్వరుండు తపఃప్రభావంబున భవుని ఫాలలోచను భర్గు భాగీరధీతీరభవను భక్తనిధిభక్తిభావను భావనాసులభస్వభావు భజింతుం గాక యని భవభయోదన్వదుత్తారయానపాత్రం బైనకాశీక్షేత్రంబునకుం జని.

224


సీ.

మందాకినీవారి మణికర్ణికాంబువు
        వాపికాకూపపల్వలజలంబు
కుండికాసలిలంబు గుల్యాప్రపూరంబు
        సెలయేటిపాథస్సు చెలమనీరు
ధారాకృపీటంబు తమ్మిబావిపయస్సు
        కాసారనీరంబు గ్రయ్యతోయ
మూటకాండము బుగ్గయుదకంబు జలపుష్క
        రము నదహ్రదశంబరంబు లివియు


తే.

మొదలుగా సర్వసర్వతోముఖము కాశి
తీర్థరాజంబులుగ సమర్థించు శ్రుతులు
గాన యిన్నింటియందు విశ్వానరుండు
దేవసంకాశుఁ డతిభక్తిఁ దీర్థ మాడె.

225


తే.

అవనిదివిజుండు మణికర్ణికాదిపుణ్య
తీర్థములయందు దేహంబుఁ దేల్చి తేల్చి

శాంతిఁ బొందించె బ్రాగ్జన్మశతసహస్ర
పరిచితం బైనబహులతాపత్రయంబు.

226


సీ.

భద్రేభముఖులకు భద్రకాళికలకుఁ
        గాలభైరవులకు గణపతులకు
నాదికేశవముఖ్యు లైనకేశవులకు
        లోలార్కముఖు లైనహేళులకును
బ్రణమిల్లి సురనదీమణికర్ణికాదితీ
        ర్థములఁ బిండప్రదానములు చేసి
పాయసాపూపాదిబహువిధాన్నంబుల
        జగతీమరుత్సహస్రంబుఁ దనిపి


తే.

కానవచ్చినయుబ్బులింగంబులకును
కానరానినిగూఢలింగంబులకును
బుణ్యవాసరముల మహాపూజ చేసి
యాతఁ డిట్లు వితర్కించె నాత్మలోన.

227


వ.

ఓంకారేశ్వరుండు, గృత్తివాసేశ్వరుండు, కాళేశ్వరుండు, వృద్ధకాళేశ్వరుండు, గళేశ్వరుండు, కేదారేశ్వరుండు, కామేశ్వరుండు, చంద్రేశ్వరుండు, త్రిలోచనేశ్వరుండు, జ్యేష్ఠేశ్వరుండు, జంబుకేశ్వరుండు, జైగిషవ్యేశ్వరుండు, దశాశ్వమేధేశ్వరుండు, ద్రుమిచండేశ్వరుండు, (దృక్కేశ్వరుండు,) గరుడేశ్వరుండు, గోకర్ణేశ్వరుండు, గణేశ్వరుండు, డిండీరేశ్వరుండు, గజసిద్ధేశ్వరుండు, ధర్మేశ్వరుండు, తారకేశ్వరుండు, చండికేశ్వరుండు, మోక్షేశ్వరుండు, గంగేశ్వరుండు, డత్రీశ్వరుండు, వ్రీహికేశ్వరుండు, (త్రిపురేశ్వరుండు, మార్కండేయేశ్వరుండు,) మణికర్ణికేశ్వరుండు, యమునేశ్వ

రుండు, లాంగలీశ్వరుండు, శ్రీవిశ్వేశ్వరుండు, అవిముక్తేశ్వరుండు, విశాలాక్షీశ్వరుండు, వ్యాఘ్రేశ్వరుండు, వారాహేశ్వరుండు, వ్యాసేశ్వరుండు, వృషభధ్వజేశ్వరుండు, నరుణేశ్వరుండు, విధీశ్వరుండు, వరిష్ఠేశ్వరుండు, సోమేశ్వరుం, డింద్రేశ్వరుండు, సంగమేశ్వరుండు, హరిశ్చంద్రేశ్వరుండు, (త్రిసంధ్యేశ్వరుండు,) భవానీశంకరుండు, కపర్దీశ్వరుండు, కందుకేశ్వరుండు, (మఖేశ్వరుండు, మిత్రావరుణేశ్వరుండు) నన సిద్ధామృతజ్యోతిర్లింగాదు లగుమహేశ్వరులు శతసహస్రసంఖ్యలఁ గలరు. ఈమహేశ్వరులసిధ్ధస్థానంబులయం దేను దివ్యస్థానంబునం దపం బాచరించి శీఘ్రసంతానలాభంబు నొందుదు.

228


తే.

అహహ! తెలిసి విస్మయం బైనయర్థ
మేల సందేహ మందంగ హృదయవీథి?
సిద్ధసంసేవితము సర్వసిద్ధికరము
దర్శనస్పర్శనములఁ దీర్థములరాజు.

229


సీ.

ఉద్ఘాటితంబులై యుండు రేలుఁబగళ్లు
        గవనితల్పులు నాకకటకమునకు
సర్వజంతువులకు సంసిద్ధిసంపద
        గరతలామలకమై కానవచ్చు
వికటామహాదేవి విశ్వనాథునిభామ
        పర్వతాధిపుపుత్రి పాయ కెపుడు
సిద్ధివినాయకక్షేత్రపాలకు లుంద్రు
        పరిరక్షణైకతత్పరత బూని


తే.

భూమి తిలమాత్రమును నుడివోవకుండ

నమృతలింగంబు లర్బుదన్యర్బుదములు
గలవు తీర్థరాజంబులు గాశియందు
మహిమ కావాస మవిముక్తమండలంబు.

230


క.

ఎందుండును విశ్వేశ్వరుఁ
డిందుకళాధరుఁడు గిరిదుహితృసహితుండై
యందుండు భుక్తిముక్తులు
సందేహము లేదు తప మచట నొనరింతున్.

231


సీ.

అప్సరోంగన లెల్ల నాటపాటలవెంటఁ
        బ్రాపించిరి మనోరథార్థసిద్ధి
గంధర్వుఁ డొక్కఁడు గానవిద్యాప్రౌఢి
        శీఘ్రంబునంద సంసిద్ధిఁ గాంచె
యక్షపుంగవుఁడు విద్యాధరశ్రేష్ఠుండు
        కోకిలాలాప యన్ కోమలియును
శతరుద్ర్యమంత్రైకజపపరాయణుఁ డైన
        వేదశీలుం డనువిప్రవరుఁడు


తే.

చంద్రమౌళి భరద్వాజసంయములును
హంసవతి యనునొకకిన్నరాంగనయును
నాప్రవాళోష్ఠిమగఁడు వేణుప్రియుండు
సిద్దిఁ బొందిరి యవిముక్తసీమయందు.

232


క.

సిద్ధమరుత్సాధ్యాదులు
సిద్ధిం బ్రాపింతు రం దచిరకాలమునన్
సిద్దమతి యగుట శంభుం
డద్ధరణిని సిద్ధలింగ మనఁగా వెలయున్.

233

వీరేశ్వరప్రభావవర్ణనము

వ.

అమ్మహజ్యోతిర్లింగమూర్తి విశ్వేశ్వరుఁడనం బ్రసిద్ధివహించె. అమ్మహేశ్వరుండు జయద్రథునకు, విదూరసునకు, మగధాధిపతికి, వసుదత్తునకు, మనోరథార్థంబుల చిరకాలంబునంద బ్రసాదించె. నేనును విశ్వేశ్వరమహాదేవు నారాధించి యభిమతార్థంబు(లు) వడసెదం గాక యని చంద్రకూపజలంబున నభిషేకం బొనరించి సంకల్పపూర్వకంబుగా నియమంబు వహించి యొక్కమాసం బేకాహారుండును, నొక్కమాసంబు నక్తాశనుండును, నొక్కమాసం బయాచితాశనుండును, నొక్కమాసంబు నిరశనుండును, నొక్కమాసంబు పయోవ్రతుండును, నొక్కమాసంబు శాకఫలాశనుండును, నొక్కమాసం బష్టతిలాహారుండును, నొక్కమాసంబు పానీయుండును, నొక్కమాసంబు పంచగవ్యాశనుండును, నొక్కమాసంబు చాంద్రాయణవ్రతుండును, నొక్కమాసంబు కుశాగ్రజలపాయియు, నొక్కమాసంబు వాయుభక్షుండును నై సంవత్సరంబు గడపి త్రయోదశమాసంబునం బ్రథమదినసంబున.

234


సీ.

హరు లేడు నేడుకక్ష్యాంతరంబులు గాఁగ
        నియమంబునా నాజ్ఞ నిలుపువాఁడు
వెండికట్టులతోడివేత్రంబు మాఱుగా
        బంగారుముని(లు)కోల పట్టువాఁడు
ఝంకించి వెరపుతర్జనకోటిచందానఁ
        గఱకుచీఁకటివెన్ను సఱచువాఁడు
వసుమతీభృచ్ఛ్రేణి వరుసతో గుఱి చూపి

        యొండొండఁ గాన్పించుచుండువాఁడు


తే.

త్రిభువనస్థానపతి యైనదివసకరుని
ప్రాక్ప్రతీహారపాలుండు ప్రాచినొసలి
ఘుసృణలీలాలలామంబు బిసరుహాప్తు
కుంటుసారథి తీండ్రించెఁ గొమరు మిగుల.

235


సీ.

ప్రథమసంధ్యాకాలబలిశంఖనినదంబు
        ప్రభవించె శ్రీవిశ్వవిభునినగరఁ
గదిసె నంగుళియుగ్మకం బంతరముగాఁగ
        గగనగంగారథాంగద్వయంబు
నెఱయంగఁ గై సేసి నిలువుటద్దము చూచె
        నవిముక్తమున విశాలాక్షి గౌరి
కొక్కొరొకో యని కుక్కుటంబులు మ్రోసెఁ
        గడఁగి చతుష్కటకంబునడుమఁ


తే.

బ్రహరిఁ దిరుగుట చాలించి భైరవుండు
గవనిమొగసాలయరుఁగుపైఁ గన్ను మొగిచె
డుంఠివిఘ్నేశుఁ డొనర గండూష సేసి
యుమిసె వినువీధిఁ జంద్రకుండోదకములు.

236


సీ.

ముక్తిప్రయోజనంబునఁ గుటీరకకోటి
        సావిత్రితత్త్వంబు సంగ్రహించె
బరమహంసలు పరబ్రహ్మార్థమీమాంస
        శోధించి రుపనిషద్వీథులందు
నిగమాంతవాసనానిర్వృతస్వాంతు లై
        హంస లుండిరి దృడైకాంతపరతఁ
బ్రత్యగ్రగోపాలరజ్జుసంబంధంబు

        దండత్రయము బహూదకుఁడు దాల్చె


గీ.

భసిత ముద్ధూళనము చేసి పాశుపతుఁడు
దీర్ఘపాటలజటల బంధించె మౌళిఁ
గలుమఠంబులమీఁద శృంగములనడుమఁ
గొక్కొరోకో యనుచుఁ గోడి కూయుటయును.

237


వ.

అంత సూర్యోదయంబున.

238


సీ.

ధరణీధరములందు ధాతుపాషాణంబు
        పాదపంబులయందుఁ బల్లవంబు
పాథోనిధులయందుఁ బవడంపులేఁదీఁగ
        కాలాభ్రములయందుఁ గోలమెఱుపు
హరిదంతనాగంబులందు సిందూరంబు
        భూమిమండలియందు హేమభూష
యాకాశవీథియం దబ్జవందనమాల
        నబ్జజాండగృహంబునందు దివియ


గీ.

యగుచు బాలాతపము జగం బాక్రమింప
నంధకారము దిక్కుల నస్తమింప
భానుబింబంబు దోఁచెఁ బ్రభాతలక్ష్మి
కబరిభారంబుమీఁద చెంగలువకచ్చు.

239


వ.

అయ్యవసరంబున విశ్వానరుండు సకలకలికలుషవిషభంగజాంగలికం బగుగగనగంగాప్రవాహంబున నఘమర్షణస్నానం బాచరించి, విరజానలసంభవం బైనభస్మంబున సర్వాంగోద్ధూళనం బొనర్చి, తిర్యక్పుండ్రంబు లురశ్శిరోబాహుమూలంబుల ధరియించి, రుద్రాక్షమాలికాధరుండయి సరస్వతీస్కందవిఘ్నేశ్వరులకు నాదిత్యానిలాగ్నులకు మ్రొ

క్కి, పుండరీకచర్మాసనంబునం బ్రాఙ్ముఖుండై దక్షిణజానూరుమధ్యంబున వామపాదంబును వామజానూరుమధ్యంబున దక్షిణపాదతలంబుసు విన్యసించి, సమగ్రీవామూర్ధకాయుండును, సంభృతాస్యుండును, నిశ్చలుండును నై నాసాగ్రంబున సుధాధారాబిందునిష్యందంబునందు నిందుబింబంబు(న) వీక్షించుచుం బ్రాణాయామంబు సేసి, ప్రాణాయామంబువలనఁ జిత్తశుద్ధి వడసి, చిత్తశుద్ధివలన వేదాంతజ్ఞానంబు విశదీకరించి, విశుద్ధవేదాంతజ్ఞానవాసనావశంబున శ్రోతవ్యుండును, మంతవ్యుండును, నిధిధ్యాసితవ్యుండును, నిరస్తసమస్తోపాధిక స్వప్రతిష్ఠాఖండసచ్చిదానందైకరసాద్వితీయస్వరూపుండును, పరమశివపరమజ్యోతిర్లింగమూర్తియు నైన యవిముక్తవిశ్వేశ్వర శ్రీమన్మహాదేవునందు భావించి భావించి చూచుచుండం బ్రాచీనంబు పచేళిమంబై భవ్యం భైన భాగ్యాశయంబున.

240


సీ.

శ్రీపాదములఁ బైఁడిచిగురుగజ్జెలతోడ
        ఠవణించుగండపెండార మమర
వెలిదామరలఁ బోలు వెడఁదక్రాల్గన్నులు
        మద్దికాయలతోడ నుద్దివడయ
మొలకకూఁకటిఁ గ్రాలు [6]ముక్తాలలామంబు
        భసితంపుబొట్టుతో బాదరింపఁ
బాలబుగ్గలదీప్తిపల్లవంబులతోడఁ
        జిన్ని లేనగవుతోఁ జెలిమి సేయ


గీ.

లజ్జ యెఱుఁగనికటిమండలంబుమీఁద
వలుదవజ్రాల కమరుగర్వంబు సూప

దివ్యబాలకుఁ డొకరుండు దేజరిల్లెఁ
గాశివిశ్వేశశంభులింగంబునడుమ.

241


చ.

ప్రవిశదభంగి దివ్యశిశురత్నము సప్రణవాక్షరంబుగా
శ్రవణమనోహరంబుగఁ బ్రసన్నముగాఁ బఠియింపఁజొచ్చె మూఁ
డవసవనంబునన్ శ్రుతిసమభ్యధికంబుగఁ దత్ప్రతిస్వనం
బవిరకతలీల గర్భభవనాంతరభూముల నుద్భవింపఁగాన్.

242


వ.

అప్పుడు విశ్వానరుం డానందాశ్రుపూర్ణలోచనుండును, రోమాంచకంచుకితాఖిలావయవుండును, గద్గదికానిరుద్ధకంఠధ్వనియు నయి యంజలీపుటంబు లలాటతటంబున ఘటియించి యేకతంబుగా బ్రహ్మం బద్వితీయంబు నిత్యంబు సత్యం బొక్కరుండ రుద్రుం డొక్కరుండ కర్త యెవ్వం డట్టి నీకు నమస్కారంబు. రజ్జువందు సర్పంబును, శుక్తియందు రౌప్యంబును, మరుమరీచికయందు సలిలంబును బోలె నెవ్వానియందుఁ బ్రపంచంబు గానంబడు నట్టినీకు నమస్కారంబు. తోయంబునందు శైత్యంబుసు, వహ్నియందు దాహకత్వంబును, దపనునందుఁ దాపంబుసు, జంద్రునందుఁ బ్రసాదంబును, బుష్పంబునందు సుగంధంబును, దుగ్ధంబునందు ఘృతంబునుంబోలె సర్వంబునం దెవ్వం డంతరాత్ముఁ డై యుండు నట్టినీకు నమస్కారంబు. శబ్దంబు గ్రహించు నశ్రవణుండు, గంధం బాఘ్రాణించు నఘ్రాణుండు, దూరంబు నడచు ననంఘ్రి, చూచు నలోచనుండు, రసంబుఁ గొను నరసజ్ఞుం డెవ్వం డట్టినీకు నమస్కారంబు. నిజభక్తుండు దక్క విష్ణువిరించిపురందరాదిబృందారకు లెవ్వానికందువ యెఱుంగ రట్టినీకు నమస్కారంబు. గోత్రంబు, జన్మంబు, నామంబు, రూపంబు, శీలంబుఁ దెలియ

రాకుండనుండియు నిజభక్తులకు నభీప్సితంబు లొసంగు నెవ్వం డట్టినీకు నమస్కారంబు. ఎవ్వనివలన సర్వంబును, నెవ్వండు సర్వంబును గనుంగొను, నెవ్వఁడు సంపన్నుం, డెవ్వఁడు దరిద్రుఁ, డెవ్వండు వృద్ధుఁ, డెవ్వండు యువ, యెవ్వండు బాలుం డట్టి నీకు నమస్కారంబు. అని సంస్తుతించి సాష్టాంగదండప్రణామంబు చేసిన నతని గరుణాతరంగితం బగునపాంగవీక్షణంబునం గనుంగొని వృద్ధవృద్ధుం డగునబ్బాలుండు ముగ్ధస్మితజ్యోత్స్న చిన్నిబుగ్గలం జిగురొత్త నిట్లని యానతిచ్చె.

243


మ.

క్షితిదేదోత్తమ! నీమనోరథము సంసిద్ధిన్ వహింపన్ బతి
వ్రతకున్ శోభనపుణ్యలక్షణకు విశ్వస్తుత్యచారిత్ర క
ప్రతిమప్రాభవభాగ్యవైభవకళాపారిణకున్ మీశుచి
ష్మతికిం బుట్దెదఁ గాశికాపురతపశ్చర్యాఫలం బల్పమే!

244


గీ.

అచిరకాలమునంద యే నవతరింతుఁ
బరమపావని యైన నీభార్యయందుఁ
జను నిజాశ్రయమునకు సంశయము మాని
విమలపుణ్య! విశ్వానర విప్రముఖ్య!

245


వ.

అని చూడం జూడ నయ్యిందుచూడుం డానందక్రీడావాటికాక్రోడక్రీడావిహారహేలాచిక్రోడంబుపదంబులోని నీడయుంబోలెఁ బొడచూపి యవిముక్తక్షేత్రవిడంబనం బగువిశ్వేశ్వరలింగంబునందుఁ గుడుంగంబునందునుంబోలె లోనడాఁగియుండె. విశ్వానరుండును విశ్వాసభక్తితాత్పర్యంబులు మనంబునం బెనఁగొన నయ్యనంగమథనుం దలంచి తలంచి శుచిష్మతియుం దానుఁ దమయంజలిపుటంబులు లలాటతటంబులం ఘటియించి ప్రస్తుతించుచుం బ్రమోదించుచు నిజనివా

సంబునకుం జని రనిన విని నైమిశారణ్యవాసు లీశ్వరుం డెబ్భంగి శుచిష్మతికిం జన్మించె నని యడిగిన.

246


ఆశ్వాసాంతము

శా.

కర్ణాటోత్కలపారసీకనృపసంఖ్య! ప్రాభవశ్రీనిధీ!
యర్ణోరాశిపరీతభూభువనమధ్యాంధ్రక్షమాధీశ్వరా!
కర్ణాభ్యర్ణవిశాలనేత్ర! జగదేకప్రాజ్యసామ్రాజ్య! దృ
క్కర్ణాధీశ్వరహారభక్తినిరతక్ష్మాపాలచూడామణీ!

247


క.

పంచారామవధూటి
పాంచాల! త్రిలింగరాజపరమేశ్వర! య
భ్యంచితయాధురంధర!
చెంచూమలచూరకార! చిరపుణ్యనిధీ!

248


భుజంగప్రయాతము.

త్రిలోకీనికాయ్యప్రదీపప్రతాపా!
కళాభోజ! యౌదార్యకల్పావనీజా
నలేక్ష్వాకుదుష్యంతనాభాగలీలా
కలా! రెడ్డిభూపాల! కల్పాంతకాలా!

249


గద్యము.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతం బైనకాశీఖండం బనుమహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.

  1. ఈపద్యము మద్రాసు ఓరియంటలు లైబ్రరీలో నుండు నొక తాళపత్రప్రతిలోమాత్ర మున్నది. ఇతరము లగు పెక్కుప్రతులయందుఁ గన్పట్టదు.
  2. ఇందిరావణ సమాహితనిజాంతర్వేణి
  3. (తమతమ తరతమ)
  4. శివశర్మకు ఫుణ్యశీల సుశీలు రిట్లనిరి.
  5. రాయంధకరిపు జనార్దన, చటులఖండ పరశుశార్ఙ్గపాణి, త్రిపురారి విష్ణుదేవేశహరిత్రిలో
  6. ముత్యాల రావ్రేక భసితంపు