కాశీఖండము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ద్వితీయాశ్వాసము

శ్రీరాజమహేంద్రవరమ
హారాజ్యశ్రీస్వయంవరాధీశ్వర! శృం
గారకళాఝషకేతన!
యారాధితభుజగహార! యల్లయవీరా! 1

దేవతలును మునులును బ్రహ్మకడ కేగి స్తుతించుట

వ. అక్కథకుండు శౌనకాదిమహామునుల కిట్లనియె. ఇవ్విధంబున నకాండప్రళయంబు సంభవించిన నపరాసురోరగం బగులోకంబు గాందిశీకం బగుటయు మునులును దేవతలును గూడి బ్రహ్మలోకంబునకుం బోయి బ్రహ్మ నిట్లని స్తుతియించిరి. 2

తే. బ్రహ్మ! బ్రహ్మస్వరూప! హిరణ్యగర్భ!
యమృత! కేవల! యప్రతర్క్యానుభావ!
వేదవేద్య! చిదాత్మ! యనాదినిధన!
చిత్తగింపుము సంస్తుతించెదము నిన్ను. 3

తే. డెందమును వాక్కు నెవ్వాని నందలేవు
కాంతు రెవ్వాని హృదయపుష్కరములందుఁ
బరమయోగీంద్రు లధికతాత్పర్యలీల
నట్టినీకు నమస్కార మఖిలవంద్య!

తే. ప్రకృతిరూప! గుణత్రయోపాధియుక్త!
కాల! కాలాతిరిక్త! నిష్కామహృదయ!
సత్త్వగుణమున హరి వై రజస్తమోగు
ణముల శంభుఁడ వగు నీకు నతి విరించి! 5

సీ. బుద్ధ్యహంకారరూపుని భజింతుము నిన్నుఁ
బంచతన్మాత్రరూపా! భరింపు
పంచకర్మేంద్రియపంచబుద్ధీంద్రియా
త్మక! మనోరూప! యేమఱకు మమ్ము
క్షిత్యాదిపంచకాకృతి మమ్ము రక్షింపు
విషయాత్మకా! మమ్ము విడువవలదు
బ్రహ్మాండరూప! మాపాలిపెన్నిధి వీవు
పాలింపు మముఁ దదభ్యంతరస్థ!
తే. కొలుతు మిమునీశ్వరాకృతిఁ గోరి నిన్ను
విశ్వరూపుని నిన్ను సేవింతు మెప్పు
డవధరింపుము నిత్యసత్యస్వరూప!
సదసదీశ్వర! యభయహస్తంబుఁ జూపు. 6

సీ. నిగమత్రయంబు నీనిశ్వాసపవనంబు
నీమూర్తిభేదంబు నిఖిలజగము
నీయంఘ్రి మేదిని నీమూర్ధ మాకాశ
మంతరితము నాభి యండ్రు నీకుఁ
జంద్రుండు హృదయంబు చక్షు వబ్జహితుండు
తనురుహవ్రాతంబు దరులు నీకు
నీవు సర్వంబును నీయందు సర్వంబు
స్తోతృస్తుతిస్తవ్యజాత మీవు

తే. మ్రొక్కెదము నీకు నని మహామునులు సురలు
నలికతలమున సేవాంజలులు ఘటింప
ద్రుహిణుఁ డెంతయు నాత్మ సంతోషమంది
యందఱిని జూచి యిట్లని యానతిచ్చె. 7

తే. ఆద్య మగునీ స్తవంబున కనఘులార!
యేను బరితుష్టి నొందితి నిచ్చయందు
నేమి వలసిన నట్టిద యిత్తుఁ గాన
యిది యభీప్సిత మనుఁడు మీ రింపు మిగుల. 8

మ. నినవద్యస్థిరభక్తితోడి ననుఁ గానీ శంభు గానీ రమే
శ్వరుఁగానీ గుఱియించి యెవ్వఁరట యీసారస్తవంబు జపిం
తురు వారందఱ కేము మువ్వురము సంతుష్టిం బ్రసాదింతుమిం
పరువారన్ ధనధాన్యపుత్త్రపశురక్షాయుస్సుఖారోగ్యముల్. 9

వ. మీ కెయ్యది యభీష్టం బట్టివరంబు గోరుం డిచ్చెద. ఇక్కడికి వచ్చియు నిట్లేటికి నాకులత్వంబు విడువరు! స్వస్థులరు గండు. నాలోకంబునఁ గామక్రోధలోభమోహమదమాత్సర్యహింసాసూయాదులు లేవు. మూర్తంబు లగు నీయమ్నాయంబులు విద్యలు యజ్ఞంబులు దక్షిణలు సత్యధర్మతపోబ్రహ్మచర్యముఖ్యంబులు నుల్లసిల్లెడుంజూడుం డని మఱియు నిట్లనియె. 10

సీ. తల్లిదండ్రులకు నిద్దపుభక్తి ఠవణిల్ల
శుశ్రూష చేసిన శుద్ధమతులు
పతులకు నిర్వ్యాజపరమతాత్పర్యతఁ
బరిచర్య సలిపినపద్మముఖులు
సజ్జనావళికి నిష్కారణంబున నుప

కార మొనర్చిన ధీరగుణులు
దఱి దప్పకుండ సంధ్యాజపహోమాది
తంత్రముల్ నెఱపినధర్మవిదులు
తే. బ్రహ్మరతులు తపస్వులు భవ్యతీర్థ
సేవకులుసు సద్వ్రతులు నిస్పృహులు మొదలు
గాఁగ నొప్పెడు తత్పుణ్యకర్మపరులు
వీరె కనుగొండ్రు సుఖ మున్నవార లిందు. 11

క. నతి చేసి యిష్టధనములు
క్షితిసురులకు నొసఁగినట్టి సిద్ధులు సుండీ!
యతులహిరణ్మయహర్మ్య
స్థితు లగుచుఁ జరించువారు చిరశుభలీలన్. 12

తే. ఉభయముఖ లగుగోవుల నొండె నొండె
గపిల లగుధేనువులఁ బుణ్యకాలతిథుల
దాన మొనరించినట్టిసత్యప్రతిజ్ఞు
లీమహార్హపీఠంబుల నెసఁగువారు. 13

బ్రహ్మ దేవతలకును మునులకును గోబ్రాహ్మణప్రభావంబు సెప్పుట


వ. అని చెప్పి యప్పరమేష్ఠి బ్రాహ్మణుల సామర్థ్యంబున గోవులమాహాత్మ్యంబును నొక్కించుక వర్ణించుతలంపున ని ట్లనియె. 14

తే. నాకు శంభునకును బద్మనాభునకును
దుష్టికరములు రెండువస్తువులు గలవు
విప్రులును గోవులును నన వినుఁడు మొదల
నొక్కకులము ద్విధాభంగి నొంది యుండు. 15

చ. సకలఫలంబులుం గురియు జంగమతీర్థము లెందు బ్రాహ్మణ
ప్రకరము లట్లుఁ గాక పెడవాయుట యట్లు తదీయభాషణో

దకముల సేవకావలిఁకి దత్క్షణమాత్రన జన్మజన్మబం
ధకత సహాగతంబు లగుతత్తదనేకమహాఘసంఘముల్. 16

చ. వినుఁ డనయంబు గోవులు పవిత్రము గోవులు మంగళంబు ద
ద్ఘనఖురటంకశృంగపరిఘట్టదళద్ధరణీజశ్ఛటల్
కనుకని నవ్వుచుండుఁ బురఘస్మరమూర్ధజటాటవీనట
ద్ఘనపథసింధువార్లహరిగర్వభరార్భటిఁ బావనోన్నతిన్. 17

చ. ప్రతివసియించు గోవులఖురాగ్రములందుఁ సమస్తతీర్ణసం
తతియును సర్వపర్వతవితానము గొమ్ములమధ్యసీమ న
ద్భుతచరితుండు శంకరుఁడు భూధరకన్యయుఁ దాను నుండుఁ ద
ద్వితతకుచేభకుంభపరిదిగ్ధపటీరపవిత్రవక్షుఁడై. 18

క. కొనియాఁడు బితృగణంబులు
గొనియాడు ఋషివ్రజంబు గురుసమ్మదముల్
జనియించు వేల్పులకుఁ గం
దనిపెంపు(న) నరుండు గోవుదానము సేయన్. 19

శ్లో. గోమయం యమునా సాక్షా ద్గోమూత్రం నర్మదా శుభా,
గంగా క్షీరన్తు యాసాం వైకిం పవిత్ర మతః పరమ్. 20

శ్లో. గవా మఙ్గేషు తిష్ఠన్తి భువనాని చతుర్ధశ,
స్మా త్తస్మాచ్ఛివం మే స్యా దిహ లోకే పరత్ర చ. 21

క. అనుమంత్రంబులు చెప్పుచు
నొనరించును ధేనుథాన ముర్వీసురవ
ర్యున కెవ్వఁ డాతఁ డధికత
వినుతులు గను జగమునందు విశ్రుతలీలన్. 22

క. స్తుతిపూర్వకముగఁ బ్రదక్షిణ
మతిభక్తిఁ జరించు విప్రుఁ డావుల కతనిన్

ధృతిఁ బొందు నపుడు సకల
క్షతికిఁ బ్రదక్షిణము నియతిఁ జేసిన ఫలముల్. 23

క. ముందటఁ బిఱుఁదం గ్రేవల
డెందమునం గరము సందడిలవలదా య
స్పందశుభావహములు గో
బృందము లని మాకుఁ బుట్టు బ్రియ మెల్లపుడున్. 24

క. నీరాజనంబు నెఱుపుదు
రారఁగ గోపుచ్ఛమున నిజాంగంబుల కె
వ్వారలు వారలయఘములు
దూరమున దొలంగు నిండ్ల దొరకునుఁ బ్రియముల్. 25

తే. వినుఁడు గోవులు విప్రులు వేదచయము
సతులు లోభవిహీనులు సత్యపరులు
దానశీలు రియ్యేడ్వురు దాల్తు రెపుడు
నవని నెంతయు విగతభయంబు గాఁగ. 26

గీ. నాదులోకంబునకు మీఁదు నలిననాభు
లోకమున నూర్ధ్వమగు గుహలోక మవల
భర్గులోకంబు దత్సమీపస్థలమున
గోకులంబను లోకంబు గొమరు మిగులు. 27

సీ. ప్రవహించు నెచ్చోటఁ బరిపూర్ణుసంపద
దొలుకాడువీచుల దుగ్ధనదులు
సవరిల్లు నెచ్చోట జర డగ్గఱఁగ నీక
సంతతకౌమారసౌష్ఠవంబు
లల రొందు నెచ్చోట నాజ్యనిర్ఝరులతో
బహుసంఖ్యఁ బాయసపర్వతములు

బెడగాఁరు నెచ్చోటఁ గడను యింతయు లేమి
సామగ్రి శుభవస్తుసంచయంబు
తే. నట్టిగోలోకమునయందు నధివసింతు
రభవుచేఁ నెల్ల ప్రొద్దు నెయ్యంబుఁ గనుచు
నలఘుమూర్తులు గోమాతృకలు సుశీల
యాడిగాఁ గలపరమకల్యాణనిధులు. 48

వ. అట్లు గావున గోవులకు మిగిలినయుపాసనీయంబు లేదు. గోప్రదాతలకు మిగిలిన పుణ్యవంతులు లేరు. వెండియు నాకర్ణింపుఁడు. సరస్వతీతీర్థమృతులును, మార్తాండుండు మకరస్థుండై యుండఁ బ్రయాగతీర్థంబున మాఘస్నానంబు చేసినకృతార్థులును, వారణాసియందు బంచనదంబునం గార్తికమాసమందుఁ దీర్థమాడినవిశుద్ధదేహులును, గురుక్షేత్రంబునం గణికామాత్రంబై ను హిరణ్యంబు దానంబిచ్చిన దాతలు మొదలుగాఁగల నానాధర్మపరు లస్మదీయలోకంబున వీరె నిజకర్మోచితపదంబులం గల్పస్థాయిసుఖంబు లనుభవించుచున్నవారు మీకును నింక భయంబువలదు మీరు వచ్చినకార్యం బే నెఱుంగుదు వింధ్యం బవంధ్యగర్వోదయంబున గీర్వాణభూధనంబుతో మచ్చరించి శృంగోచ్ఛ్రాయంబులఁ బతంగమార్గంబు నిరోధించి బుధజనంబులకు బాధసేయుచున్నయది. ఈయకాండప్రళయంబులకు బెగ్గలంబంది యాపత్పరిహారార్థంబు నన్ను శరణు జొచ్చితిరి. అరిష్టనిరసంబునకు నుపాయంబు చెప్పేద. మహామునియగస్త్యుం డవిముక్తంబనుపముక్తిక్షేత్రంబున విశ్వేశ్వరు విరూపాక్షు భోగమోక్షప్రదాయకుం దారకబ్రహ్మోపదేశార్థంబు సేవిం చుచున్నవాఁడు. అతఁడు మీకార్యంబు సంఘటింపంగలవాఁడు. మీ రచ్చోటి కరిగి యమ్మహాత్ము నభ్యర్థింపుఁడు. 29

క. వాతాపీల్వలు లనియెడు
దైతేయులఁ గుపితకపటతంత్రోద్ధతులన్
భ్రాతల వధించె వ్రేల్మిడి
నాతం డెవ్వరుసు వెఱతు రమ్మునిపతికిన్. 30

వ. పొండు మీకు మే లయ్యెడు నని పుండరీకభవుండు వీడ్కొల్పిన వారును మహాప్రసాదంబని ప్రసన్నాంతరంగులై సత్యలోకంబు వెలువడి *(వచ్చువా రంతరాంతరంబుల మూర్తిమంతంబులైన వేదంబుల వేదాంగంబుల యజ్ఞంబుల దక్షిణల సత్యంబు ధర్మంబు దపంబు శ్రుతిస్మృతిపురాణేతిహాసంబులం బతివ్రతల బ్రహ్మచారుల మాతాపితృభక్తుల గోగ్రహణహితుల గాయత్రీజపపరాయణుల నుభయముఖగోప్రదాతలఁ గపిలాదానతత్పరుల బ్రాహ్మణపాదోదకప్రాశనుల సరస్వతీతీర్థమృతుల మకరరాశిస్థితుండై మార్తాండుం డుండ మాఖస్నానంబు ప్రయాగతీర్థంబునం జేసినకృతార్థుల వారణాసియందుఁ బంచనదంబునం గార్తికమాసంబునం దీర్థంబాడినవిశుద్ధదేహులఁ గురుక్షేత్రంబునం గాకిణికామాత్రం బైనను గనకంబు దానంబు చేసినదాతలను విలోకించుచు). 31

తే. విమల కైవల్యకల్యాణవిత్తనిధికి
విశ్వనాథుని మొదలిశ్రీవేశ్మమునకుఁ
గాశికాక్షేత్రమున కేఁగఁ గడలి రపుడు
కోర్కు లిగురొత్త బృందారకులును మునులు. 32

వ. హర్షోత్కర్షంబునం దమలోన. 33

సీ. మనభాగ్యమునఁ గాదె కనకాచలేంద్రంబు
విశ్వాధికౌన్నత్యవిభవ మొందె
మనభాగ్యమునఁ గాదె మార్తాండమండలి
వినువీధి రోధించె వింధ్యశిఖరి
మనభాగ్యమునఁ గాదె మర్త్యపాతాళత్రి
విష్ణపంబులకు నరిష్ట మొదవె
మనభాగ్యమునఁ గాదె కనకగర్భుండు ప్ర
త్యక్ష మై యుపదేశ మానతిచ్చె
తే. నహహ! మనభాగ్యమునఁ గాదె యమరతటిని
దరి వసించినవాఁడు వాతాపిదమనుఁ
డిన్నిసౌభాగ్యములు(ను) గూడియిచ్చె మనకుఁ
గాశికాక్షేత్రరాజవీక్షాసుఖంబు. 34

క. ఏకక్రియ ఫలయుగ్మము
నాకర్షింపంగఁ జాలు నది లోపాము
ద్రాకాంతుఁ గుఱిచి పోవఁగ
శ్రీకాశీదర్శనంబుచే సిద్ధించున్. 35

దేవర్షులు బ్రహ్మనియోగంబున నవిముక్తంబున కేతెంచి యగస్త్యుని దర్శించుట

వ. జనుచు బ్రహ్మలోకంబుననుండి డిగ్గి వారు వారణాసీపురోపకంఠంబున శ్రీకంఠజటాటవీకుటజకోరకంబును బరమేష్ఠికమండలుతీర్థసలీలధారాధోరణియును గుపితకపిలమునిపరివృఢకపిలదృగనలచుళికితవపురఖిలసగరసుత స్వర్గారోహణసోపానమార్గంబును నగు భాగీరథియందు మణికర్ణికాకుండం బునఁ దీర్థంబాడి తీర్థోపవాసులకు వాసోహిరణ్యగంధసారకర్పూకస్తూరికాకుంకుమంబులను ఖండశర్కరాపూపసూపాజ్యదధిపయఃఫలాదితర్పణద్రవ్యంబులను సుపానత్పాదుకాచ్ఛత్రంబులను గుండికాదండరల్లకవ్యజనచామరంబులఁ గౌపీనశాటికాకరండంబులను దైలలవణేంధనంబులను గుగ్గులుమహిసాక్షిప్రముఖధూపద్రవ్యంబులను వెండియుం గ్రియాకాండంబులనుం బరితోషంబు సంపాదించి విశుద్ధహృదయులుఁ బ్రసన్నాత్ములు నై శ్రుతస్మృతిపురాణేతిహాసప్రతిపాదిత వేదానువచనయజ్ఞదానతపోవ్రతాదులచేతం బ్రక్షీణసకలకల్మషులు భసోద్ధూళితాంగులు రుద్రాక్షమాలికాలంకృతాంగులునై శంకరుం గురంగాంకశేఖరు నిరస్తసమస్తోపాధికస్వప్రతిష్ఠాఖండసంచితానందైకరసాద్వితీయస్వరూప విరూపాక్షు విశాలాక్షీహృదయాధీశ్వరు విశ్వేశ్వర శ్రీమన్మహాదేవు సందర్శించి ప్రణమిల్లి జగన్నిర్మాణనియమపరిపాలనాదిశక్తియుక్తుం డగునద్దేవుం బంచబ్రహ్మపంచాక్షరప్రణవమంత్రంబుల నావాహనస్థాపన సాన్నిధ్య సన్నిరోధనసంకలీకరణాదులగు దశవిధసంస్క్రియాకలాపంబుల నుపచరించి వెండియు. 36

క. ఆడిరి ప్రమోదనృత్తము
పాడిరి మంద్రకమహాప్రబంధంబుల మో
మోడిరి తైర్థికులకుఁ గొ
ల్లాడిరి కైవల్యలక్ష్మి నమరులు మునులున్. 37

సీ. అందంద చేసిరి యభవుగేహమునకు
ధన్యాత్తు లలర ప్రదక్షిణములు

యోగపీఠారూఢ నుమబోటి నర్చించి
రభ్యర్హితులు సువర్ణాంబుజముల
నాడుంఠివిఘ్నేశు నాపూపమోదకా
ద్యుపహారములఁ దృప్తి నొందఁ జేసి
నవధరించిరి పురాణాఖ్యానముఖముల
సమధికం బగుమహాస్థానమహిమ
తే. వీటి పెద్దతలారి నిస్సాటికలికి
దిస్సమొలవేల్పు పార్వతీదేవిపట్టిఁ
గాలభైరవుఁ గుర్కురగణపరివృతు
ననుచరించిరి మునులు నాకౌకసులును. 38

వ. అనంతరంబ. 39

సీ. పంచాక్షరీమంత్రపారాయణమునకు
నెవ్వానిమానసం బేడుగడయు
దర్పోద్ధతు లగువాతాపికిల్వలునకు
వధశిలాస్థాన మెవ్వానికుక్షి
యాది నెవ్వానిదివ్యావతారమునకుఁ
బూర్ణాంబుకుంభంబు పురిటియిల్లు
మెఱసి లోపాముద్రమెఱుఁగుఁబాలిండ్లపై
బవళించు నెవ్వానిభవ్యమూర్తి
తే. కసరి యెవ్వానికంఠహుంకారరవము
కొండపాములకులములోఁ గూర్చె నహుషు
నట్టి పరమమహాశైవు నలఘుతేజు
వెదకి రానందవనములో విబుధమునులు. 40

సీ. డుంఠివిఘ్నేశుఁ డుండుప్రదేశ మీక్షించి
లోలారునగరిమోసాల వెదకి
దండపాణ్యానవభాండేశ్వరంబులు
గుక్కుటస్థానంబు గుద్దలించి
కేశవస్వామిలోఁగిలి పరామర్శించి
కాలభైరవదేవుగవను జూచి
శ్రీవిశాలాక్షిగోష్ఠీవాటి శోధించి
యపవర్గమంటపోపాంత మరసి
తే. విబుధగంగాతరంగిణీవేణిమధ్య
సైకతోత్సేకవేదికాసంప్రరూఢ
తరుణమంజులకుంజవైతనకుడుంగ
వీధికలయందు దృష్టి యావిష్కరించి. 41

వ. కుంభసంభవు నన్వేషించువారు జగద్ధితకార్యారంభులు జంభమథనపురోగము లైనసురలును గీష్పతిప్రధాను లైనమునులును నానందకాననంబన మహాశ్మశానంబనం రుద్రావాసంూన గాశియన వారణాసియన నవిముక్తక్షేత్రంబన లోలార్కకేశవులు కోటిద్వయంబును, భాగీశథి నారియు, ధర్మంబు శరంబును, గలి లక్ష్యంబును, విరూపాక్షుండు ధన్వియుంగా ముక్తిపురంధ్రీభ్రూలతానుకారంబును జంద్రరేఖాఛాయాప్రకారంబై తాను గోదండంబుభంగి నంగీకరించి విశ్వేశ్వర శ్రీమహాదేవునకు నిఖిలదేవతాసార్వభౌమునకుఁ ద్రైలోక్యసామ్రాజ్యపట్టాభిషేకంబునకుఁ దగిన హేమపీఠంబునుంబోని యమ్మహాస్థానంబుఁ గలయఁ గ్రుమ్మరి యచ్చోటి పెద్దలవలన గందువ యెఱింగి చని తత్పుణ్యాశ్రమంబుఁ బ్రవేశించి రందు. 42

సీ. కండూయనము సేయుఁ గరటి శుండాదండ
పుష్కరమ్మున సింహపోతకంబు
వాలారునఖముల వదన మించుక యెత్తి
ముద్దాడుఁ బులి లేటిముద్దరాలి
నిండుకౌఁగిటఁ జేర్చి నెమ్మిమైఁ దోఁడేలు
గోదమచింబోతును గుస్తరించుఁ
గుంజమంటపకుటీక్రోడమధ్యంబున
నాఖుతోఁ జెఱలాడు నడవిపిల్లి
తే. యెండ దాఁకక యుండంగ నెత్తి పట్టుఁ
బగలు ముంగికి భుజగంబు పడగగొడుగు
కోఁతితో మైత్రి వాటించుఁ గొండగొఱియ
యౌర్వశేయుని పుణ్యాశ్రమాంతరమున. 43

వ. వెండియు నవ్వనంబున నీవారోచనమండం బుష్ణమధురంబు(గ) గండూషించి క్రొత్తపురిటాలికిం గురంగికి మెత్తమెత్తన కురంగంబు గ్రోల్చు ప్రసక్పత్సర్పీరభిఘార(ప్రవాహ)ధారాగంధపాణింధమంబై కర్కంధూపలో న్మిశ్రశాకపాకంబుల తాలింపులకమ్మనికంపు పాంథఘ్రాణంబుల కింపుసొంపు సంపాదించు, సరసీతీరంబున సారసంబు సారస్యంబు పక్ష్మలింప లక్ష్మణాకంఠోపకంఠంబునం గంఠంబుఁ జేర్చి సుఖపారవశ్యంబునం జొక్కెనో? ముక్కంటి లోఁగంటం గనుంగొనుచు నిశ్చలధ్యానయోగానుసంధానంబున మాధుర్యంబు భజించెనో? యెఱుఁగరాకుండ నుండు. శ్రుతిస్మృతిపురాణేతిహాససం హితాతాత్పర్యపర్యాలోచనఁ బచేళిమం బైనవివేకంబున మత్స్యమాంసం బభ్యర్హితులు గర్హింతు రని యెఱింగి కాఁబోలుఁ బంకజోత్పలకుముదకల్హారసంకులంబులగు కొలంకులఁ బెద్దమీను కొండుకమీనుం దాఁకదు. దరవికచవకుళకురవకన్యాకేసరపరాగధూసరంబు లగుమధుమాసవాసరంబులందును బంచబాణుం డించువి ల్లెక్కువెట్టఁ జెఱుచుం గావునఁ గొంచి కొంచి యప్పశుపక్షిమృగమిథునంబులు నిధువనక్రీడ లాచరించు. కంఠగతప్రాణు లగుజంతువులకుం గాలకంఠుండు గరుణావశంవదుండై కర్ణోపకంఠంబుఁ జేరి తారకబ్రహ్మమంత్రరాజంబు నుపదేశింప మంతనంబున విని యెఱుంగుటం జేసి మధుమదోల్లాసంబున నది వెల్లివిరి(సే)యుచున్నయదియో యన నిందిందిరంబులు మంద్రస్వనంబున ఝంకారంబు సేయ నక్తభోజనవ్రతస్థులతోడి సంసర్గంబుననో చకోరవర్గంబు నక్తంబులం జంద్రచంద్రికాకరంభంబునఁ గౌక్షింభర్యంబు సంభావించు నట్టిపుణ్యాశ్రమంబు దరిసి చనునప్పుడు మునులు బృందారకులు నిజాంతర్గతంబున. 44

తే. ఎన్నఁడును నేగి లేనట్టి యిమ్మహాశ్మ
శానమున (యందుఁ) గాఁపురంబున్నజంతువులకు
నేటి నాకంబు? పున్నియం బెడలినప్పు
డొఱకమునఁ గూలవలయుఁ గీ లూడినట్లు. 45

తే. అపునరావృత్తిశంభులోకాధివాస
సౌఖ్య మొనగూడు నిచ్చోటిజంతువులకుఁ

గాన మనకంటెఁ గడు మేలు కాశినుండు
కీటపక్షిసరీసృపక్రిమికులంబు. 46

సీ. కాశికానగరంబుకడసీమమున నున్న
చండాలుఁ బోలఁ డాఖండలుడు
నానందవనములో ననశనస్థితి నున్కి
భువనసామ్రాజ్యవైభవముఁ బోలు
నవిముక్తదేశస్థుఁ డయ్యె నేఁ బతితుండు
నశ్వమేధాధ్వరాహర్త దొరయు
వారణాసీసంభవం బైనమశకంబు
నైరావణముతోడి నవఘళించు
తే. నాటుకొని శ్రీమహాశ్మశానమున నున్న
యణుకనగ్నాలవటుఁ డైన నాగ్రహమున
గర్వితోద్ధతి నేతెంచు కాళరాత్రి
మృత్యుదేవతమునిపండ్లు మెఱుకఁ జాలు. 47

తే. ఎన్ని కల్పంబు లరిగిన నెడలిపోవ
దెంద రింద్రులు గడచిన నెలమి దప్ప
దెన్ని మన్వంతరంబులు చన్న నెపుడుఁ
బసిమి దప్పదు కాశికాపట్టణంబు. 48

ఉ. తత్తరపాటు లేక నదిఁ దాన మొనర్చి పినాకపాణి దే
వోత్తము విశ్వనాథుఁ గరుణోదధిఁ గమ్మనిపూవుగుత్తులన్
బత్తిరిఁ బూజ చేసి నుతిపాఠములన్ ఠవణించువారికిం
దొత్తులువోలె నుబ్బుదురు దొప్పలు దోరలు ముక్తికామినుల్. 49

సీ. ధర్మంబు కాశికాస్థానమధ్యంబున
నాల్గుపాదంబుల నడచి యాడు

నర్థంబు కాశీపురాంగణంబునయందు
నానాప్రకారమై నటన మిగులుఁ
గ్రామంబు కాశికాకటకఘంటావీథి
గర్వించు రాజలోకంబు ఠేవ
మోక్షసంపదలు గాశీక్షేత్రమునయందుఁ
ద్రవ్వి తండంబులై నివ్వటిల్లు
తే. గాశికల్యాణముల కాదికారణంబు
కాశి యణిమాదిసిద్ధుల కాటపట్టు
కాశి జనలోకసంకల్పకల్పకంబు
కలుషపిశితంబు మెసవురాకాసి కాశి. 50

సీ. ఉర్వీధరశ్రేణు లుఱ్ఱూత లూఁగంగ
నేడుగాడ్పులు వీచు నెన్నఁ డేనిఁ
జండభానుండు పండ్రెండుమూర్తులు దాల్చి
యెసఁగ నెండలు గాయు నెన్నఁ డేని
బుష్కలావర్తకాంభోధరవ్రాతంబు
లెలగోలు వర్షించు నెన్నఁ డేని
భూర్భువస్వర్లోకములు ముంచి జలరాసు
లేకోదకముఁ జూపు నెన్నఁ డేని
తే. నెన్నఁ డే నుండు గాలంబు మిన్ను దక్కి
భూతములు గ్రాగ నెన్నఁడేఁ బుట్టినిండ్ల
నపుడు వారణాసీపుర మైదుక్రోసు
లంతమేర యుపద్రవ మడరకుండు. 51

తే. ఉత్తరోత్తర మభివృద్ధి నొందుచుండుఁ
గాశి ధర్మార్థకామమోక్షములు నాల్గు

చంద్రకళయట్లు శుక్లపక్షంబురేలు
నాఁడునాఁటికి గనువర్ధనంబు కరణి. 52

సీ. పాలిండ్లు గదలంగఁ బసపుఁబయ్యెద వీచు
నచలాధిపతికూర్మియాడుబిడ్డ
థూత్కార మొనరించు తొండంబుముక్కున
శ్రీకరాసారంబుఁ జిలుక డుంఠి
ప్రత్యక్షమై వచ్చి భాగీరథీగంగ
మృదులహస్తము సాంచి మేను నివురుఁ
బ్రమథోత్తముఁడు భృంగి భయరక్షణార్థమై
ఫాలాగ్రమునఁ దీర్చు భసిత రేఖ
తే. దక్షిణ శ్రుతి మీఁదుగా ధాత్రిఁ ద్రెళ్ళి
పెద్దనిద్రకు మ్రాఁగన్ను పెట్టువేళఁ
బంచజనులకుఁ దారక బ్రహ్మవిద్య
యభవుఁ డుపదేశ మొనరించు నపుడు కాశి. 53

వ. అని వారణాసీపురంబు వర్ణించుచు. 54

తే. వృక్షశాఖాంచలంబుపై వ్రేలుచున్న
కోటిసంఖ్యల నీర్కావికోర్పణములు
విఘ్నమృగములఁ బట్టంగ వేసినట్టి
చీరతెర లనసంస్మృతిఁ జిగురు గొలుపు. 55

సీ. ఎదుర లోపాముద్ర పదపద్మములముద్ర
సికతిలం బగునేలఁ జెలువు మిగుల
శ్యామాకముష్టియాచ్ఞార్థంబు మృగములు
ఋషికన్యకలరాక కెదురుచూడ

దేవార్చనాధూపదివ్యగంధములతో
హోమధూమముతావి యొద్ది వడయ
వటుజనస్వాధ్యాయవర్ణసందోహంబు
శారిశుకంబులు చర్చ చేయఁ
తే. గాశకాపట్టణమునకుఁ గ్రోశమాత్ర
గహనగంగాప్రవాహసైకతికభూమి
బ్రహ్మలోకమునకు ననుప్రాసమైన
కలశజునిపర్ణశాల డగ్గఱిరి వారు. 56

వ. అప్పుడు. 57

మ. శివుఁడే దాత శివుండె భోక్త శివుఁడే చేయు న్మఖాదిక్రియల్
శివుఁడే విశ్వము నే శివుండ ననుచున్ జింతించుచున్ జాహ్నవీ
సవిధ శ్రీఫలవృక్షవాటమున భస్మస్నానశుద్ధాంగుఁడై
భవ! కాశీధవ! నీలకంఠ! యనుచు భావించుభవ్యాత్తునిన్. 58

క. రుద్రాక్షభూతిముద్రా
ముద్రితనిఖిలావయవుని ముక్తిపదశ్రీ
భద్రాసనస్థు లోపా
ముద్రాపరిపూర్ణపార్శ్వు మునిపుంగవునిన్. 59

మ. నిజధామంబున శంభులింగము భవానీదృక్కదంబంబు నం
బుజగర్భాధిసురేంద్రవందితపదాంభోజంబుఁ గల్పించె మం
త్రజపధ్యానపరాయణుం డగుచుఁ దత్పార్శ్వంబునన్ ద్వీపిరా
డజినాగ్రంబున నున్న పాశుపతవిద్యారాజ్యపీఠస్థునిన్. 60

క. పాటలజటాకీరీటు ల
లాటంతపసప్తసప్తిలలితమనోజ్ఞ

స్ఫోటికమణిజపమాలా
వ్యాటికి తక్క రసరోరుహాంగుళిపార్శ్వున్. 61

క. పంచబ్రహ్మంబును శ్రీ
పంచాక్షరమును నఘోరపాశుపతంబున్
గించిత్బ్రస్ఫుటదధరో
ష్ఠాంచలముగ జపము సేయునాదిమశైవున్. 62

మ. అవధానంబున నప్పటప్పటికి భక్త్యావిష్టుడై పార్వతీ
ధవ! గంగాధర! నీలకంఠ! మదనధ్వంసీ! మహాదేవ! రు
ద్ర! విరూపాక్ష! భుజంగహార! యనుచున్ ధారాధరవ్యూహసం
భవగర్జారభటిన్ బఠించుఁ బరమబ్రహ్మర్షి లేఖర్షభున్. 63

సీ. అంతర్విలోకనవ్యాప్తి యుద్వాసించి
బాహ్యంబునకు దృష్టి పాఱ విడిచి
లీల రుద్రాక్షమాలిక దక్షిణశ్రవ
శ్శష్కులీశిఖయందు సంతరించి
పదిలంబుగా మున్ను పరిఢవించినయట్టి
నలినాసనంబుబంధము వదల్చి
వేదాగమపురాణవిద్యోద్భవము లైన
పురమర్దనస్తోత్రముల పఠించి
తే. యప్పు డప్పుడ యోగసమాధి యుడిగి
యధికశాంతిఁ బ్రసన్నాత్ముఁ డైనవానిఁ
బ్రణవపంచాక్షరిమంత్రపరమసిద్ధుఁ
గుంభసంభవమునిఁ గనుంగొనిరి వారు. 64

తే. జయజయధ్వను లెసఁగంగ సంయములును
నమరులును మ్రొక్కి రపు డమ్మహాత్మునకును

బిన్న పెద్దతనంబు రూపింప నీదు
శాంభవం బైన దివ్యతేజంబుమహిమ. 65

వ. ఆగస్త్యుండును బ్రత్యుత్థానంబు చేసి యందఱకు నాతిథ్యసత్కారం బొనర్చి సుఖాసీను లైనవారిం గుశలప్రశ్నపూర్వకంబుగా నాగమనకారణం బడిగిన. 66

తే. మునులు నమరులు నత్యంతవినయపరతఁ
దారు వచ్చినకార్య మంతయును జెప్ప
యావదర్థపదోక్తివిద్యానిరూఢు
నాంగిరసుఁ బ్రార్థనము చేసి రధికభక్తి. 67

వ. బృహస్పతియు నమ్మహా(ను)భాగు నవలోకించి యిట్లనియె. 63

బృహస్పతి దేవర్షి నియుక్తుండై యగస్త్యునితో సంభాషించుట


సీ. ధన్యాత్మకుండవు మాన్యుండ వెంతయుఁ
గృతకృత్యుఁడవు జగద్ధితకరుఁడవు
ప్రత్యాశ్రమంబును బ్రతినగంబును బ్రత్య
రణ్యంబు శంసితవ్రతులు లేరె?
నీప్రతాపంబును నీప్రభావంబును
నీదునౌదార్యంబు లేదు గానఁ
బ్రణవపంచాక్షరబ్రహ్మవిద్యామహో
పనిషత్తు నీపాణిపల్లవాగ్ర
తే. మిట్టి నిను వేఁడ వచ్చితి మిందఱమును
గమలగర్భునియానతిఁ గాశిపురికి
భువనసంక్షోభకారియై పుట్టె నొక్క
కడిఁదియుత్పాత మది నీవు గడపవలయు. 69

వ. అని పలికి వాచస్పతి పుష్పంబునకు వాసనయుంబోలె నవినాభావసంబంధంబున నమ్మహామునికి సహధర్మచారిణి యై యరుంధతికి సావిత్రికి ననుసూయకు శాండల్యకు సరస్వతికి లక్ష్మి కుమకు శతరూపకు మేనకకు సునీతికి సంజ్ఞకు స్వాహకుం దోడిజో డగులోపాముద్ర వీక్షించి యిట్లనియె. 70

బృహస్పతి లోపాముద్రకుఁ బతివ్రతాధర్మంబులు సెప్పుట


తే. అమ్మ! కుశలంబె? సాధ్వి! యనామయంబె?
దేవి! భద్రంబె? లెస్సలా? పూవుఁబోడి!
సారపరమపతివ్రతాచారవైభ
వాధిరాజ్యంబు జరుగుచున్నదియె? తరుణి! 71

సీ ప్రాణేశుఁ డారగింపక భుజింపవు భక్త
నిద్రింపకయమున్న నిద్రవోవు
నాథుండు మేలుకొనకమున్న మేల్కాంతు
కైసేయ కెన్నడుఁ గదియ వధిపు
ధవుఁడు రోషితుఁ డైనతఱి వాడి యుండుదు
పతికి నెప్పుడు మాఱు పలుక వీవు
పురుషునీగికి నల్ప మనక సంతోషింతు
మొగ మెత్త నేరవు మగనియెదురఁ
తే. జెఱఁగుమాసినమూన్నాళ్లు సిగ్గుతోడఁ
బతివిలోకనమార్గంబుఁ బరిహరింతు
సవితృఁ డదయింప నాల్నాళ్ల జలక మాడి
చూడ వెవ్వారిఁ బెనిమిటిఁ జూతు కాని. 72

మ. పసపుంగుంకుమకజ్జలంబునును గూర్పాసంబు తాంబూలముం
గుసుమంబుల్ కబరీభరంబు చెవియాకుల్ మంగళాలంకృతుల్

    విసు పొక్కింతయు లేక తాల్పవలయున్ వీనిన్ సదాకాలము
    న్ససిఁ జక్కంగఁ బ్రియుండు వర్ధిలుటకై నాళీకపత్రాక్షికిన్. 73

తే. రజకితోడ నుదక్యతో శ్రమణతోడ
    విధవతో నాథుతో రాయువెలఁదితోడఁ
    జెడిపెతోడఁ బోరాములు సేయవలదు
    ప్రాణసంకటములను బుణ్యాంగనలకు. 74

సీ. పతి పిల్వఁబంచినఁ బని యేమి యని వచ్చి
        చెప్పినయుడిగంబు సేయవలయు
    భక్తయానతి లేక ప్రకృతిబంధునికైన
        నేపదార్థంబును నీగి సెట్ట
    జీవిత్వేరుఁడు డించినయోగిరంబును
        గుత్స సేయక భుక్తి గొనఁగఁదగవు
    సుఖసుప్తుఁ డగునిజేశునిఁ బ్రబోధ మొనర్పఁ
        గా దనుష్ఠానభంగముల దప్ప
తే. నొంటి నెచ్చోటి కరుగుట యుక్తి గాదు
    తడుపు గట్టక నీరాడఁ దగవుగాదు
    కడపమీఁదను మఱి సన్నెకంటిమీఁదఁ
    జక్కిమీఁదను గూర్చుండ జాడ గాదు. 75

క. నాగరికత్వము వాచా
    ప్రాగల్భ్యము జూపఁదగదు పతిముందట సం
    భోగక్రీడావిభవో
    ద్యోగంబులఁ దక్క సతికి నుత్పలనయనా! 76

క. ఇది ధర్మం బిది యీలువు
    ఇది వ్రత మీది సద్వివేక మిది యాచారం

బిది దేవపూజ యిది పతి
యుదితం బాలంబు సేయకుండుట సతికిన్.77

క. కాంతుఁడు సంతోషించిన
సంతోషింపంగవలయు సతి కతఁ డాత్మన్
సంతాపించినపట్టున
సంతాపింపంగవలయు జలజేక్షణకున్. 78

వ. కొందఱు కులటలు పతి దురవస్థఁ బొందినఁ దెవులుపడిన శృంఖలాబద్ధుం డైనను బరిత్యజింతురు. కొందఱు దుష్టమతులగుసతులు లేమిం గొతుకువడినభర్త నధికకార్పణ్యంబు పచరించి సర్పిర్లవణతైలతండులాదులకై సిబ్బితి వఱుతురు. కొంద ఱిచ్ఛావతులు ప్రియుండు దమకు నేమి యిచ్చిన మెచ్చట హెచ్చు కుందాడుదురు. కొందఱు పరాకు లే కేకాకినులై మగని మొఱఁగి యొక్కడికేనియుం జనుదురు. కొందఱు దుశ్శీల లశ్లీలవాక్యంబుల నందందఁ బ్రియునిముందట మందెమేలంబునం బ్రేలుదురు. ఇందఱు నాథునిం గులంబువారిని నరకంబునం ద్రోచి తారును నంద కూలుదురు. 79

సీ. చీఁకటితప్పు చేసిన సరోరుహనేత్ర
గూబ యై చరియించుఁ గోటరమున
వింతవానిఁ గటాక్షవీక్షణంబునఁ జూచు
కిసలయోష్టి వహించు గిల్లకన్ను
మగఁడు దన్మొత్తిన మార్మోత్తునలివేణి
వ్యాఘ్రియై చరియించు వనములోనఁ
జిఱుదిండి తనవారి మొఱఁగి యాహారించు
నతివ సూకరజాతియందుఁ బుట్టు

తే. నధిపుఁ గోపించి హుంకార మాచరించు
పడఁతి మూఁ గౌను సవతిసౌభాగ్యలక్ష్మి
జూడఁజాలక మదిలో ససూయ సేయు
భామ దుర్భగ యగు నన్యభవమునందు. 80

ఉ. దూరమువోయి యెండఁబడి దూపిలివచ్చినప్రాణనాథునిన్
ద్వారకవాటదేహళులదాఁక నెదుర్కొని తీర్థ మార్చి యా
హారము పెట్టి వీడ్యము సమర్పణ చేసి విహారశయ్యపై
నూరువు లొత్తి చిత్తమున కుబ్బొనరించుట ధర్మ మింతికిన్. 81

తే. తగవు పాటించి యల్పంబు దండ్రి యిచ్చు
నల్ప మల్పంబ భ్రాతయు నాత్మజుండు
ప్రార్థితం బైనధన మెంతయైన నిచ్చు
ప్రాణనాథుని సరియె యేబంధువులును? 82

సీ. ఓర్పుమై నుప్పిండి నుపవాస ముండనీ
మగనాలిసరిఁ బోల్పఁ దగదు విధవ
తిరిగి నానాపుణ్యతీర్థంబు లాడనీ
మగనాలిసరిఁ బోల్పఁ దగదు విధవ
సమధికంబగు నిష్ఠజపములు సేసిన
మగనాలిసరిఁ బోల్పఁ దగదు విధవ
సద్భక్తి దేవతార్చనము సేయంగనీ
మగనాలిసరిఁ బోల్పఁ దగదు విధవ
తే. నిద్ర మేల్కాంచి రేపాడి నియపరత
నహిమభానుని వీక్షింపనియటకమున్న
తగదు (వీక్షింప) నరునకుఁ జూడంగఁ దల్లి వదినె
నత్తగారిని దప్పించి యన్యవిధవ. 83

ఉ. జీవముతోడఁ బాసి యశుచిత్వముఁ బొందిన మేనుగంధతో
యావబృథాభిషేకము సహస్రఘటంబుల నాచరించినన్
బావన మౌనె? యట్ల పతిఁ బాసి వితంతుత నొందినట్టిరా
జీవదళాయతాక్షి యశుచిత్వము వాయదు వేయుభంగులన్. 84

తే. ప్రియము గలిగిన నంగీకరింపవలదు
ముండదీవన రేపాది మోముఁ జూచి
బైసిమాలిన పరమనిర్భాగ్యురాలు
విధవ దాని యాశీస్సును విషసమంబు. 85

సీ. పెండిలినాఁడు భూబృందారకులు గన్య
నప్పగించిరొ లేదొ యధిపుఁ గూర్చి
సహచారిణివి గమ్ము సకలకాలమునందు
నిండుఁజందురునిఁ జంద్రికయుఁ బోలెఁ
దొలుకరిమొగులు విద్యుల్లేఖయును బోలె
ననుగమింపఁగఁ బాడి యతివ మగనిఁ
బితృవనంబునదాఁకఁ బతివిమానము వెంటఁ
గైసేసి కొలనాడఁ గదలుభంగిఁ
తే. బిఱిఁకికండ యొకింత లే కజిమి వేడ్కఁ
జిచ్చుఱకఁ బోవునికచరాజీవనేత్ర
కశ్వమేధంబుఫలము తథ్యంబు గలుగుఁ
బద పదమ్మున కిదె వేదభాషితంబు. 86

తే. పుట్టలోపలిపాము నభ్యుద్ధరించు
వశ్యమంత్రుండు పాములవాఁడపోలె
భర్త నభ్యుద్ధరించుఁ బాపంబువలన
నగ్ని నుఱికినయట్టి పద్యాయతాక్షి. 87

గీ. పెక్కు మాటల నిటు జాలిపెట్ట నేల
సాధ్వి గర్హింప నొకఁ డెట్టు చాలఁగలఁడు?
గంధవాహంబు వెఱచు నక్కలువకంటి
పసపుపయ్యెద పాలిండ్లఁ బాయఁ దట్ట. 88

తే. ఔర్వశిఖికంటె జముకంటె నర్కుకంటెఁ
బిడుగుకంటెను దీవ్రమై బిఱుసు చూపు
నాత్మఁ దప్పఁగఁ దలఁచుదురాత్మకులకు
సహహ! పతిదేవత పతివ్రతాతిశయము. 89

చ. తొలఁగుదు రంత నంత యమదూతకిరాతులు భీతచిత్తులై
కలుషసమన్వితుం డయిన కాంతుని దారుణలోహపాశశృం
ఖలికలు విచ్చి పుచ్చుకొని కాంత చితాగ్నిశిఖాముఖంబునన్
వెలువడి యాత్మభర్తవెనువెంట హుటాహుటిఁ గూడివచ్చినన్. 90

తే. ఎన్నికకు రోమకూపంబు లెన్ని గలవు
దివ్యవర్షంబు లన్ని మోదించు సాధ్వి
నాకభువనంబునం దాత్మనాథుఁ గూడి
వెఱ పొకింతయు లేక చిచ్చుఱికె నేని. 91

తే. తండ్రివంశంబునం దేడుతరములకును
దల్లివంశంబునం దేడుతరములకును
ధవునివంశంబునం దేడుతరములకును
శాశ్వతస్వర్గసౌఖ్య మీఁ జాలు సాధ్వి. 92

వ. అని పలికి బృహస్పతి లోపాముద్రం గనుంగొని దేవీ! నీప్రసంగవశంబునం గొన్ని యోషిద్ధర్మంబులు చెప్పితి. నీవు మహాపతివ్రతవు. నీబోఁటిఫుణ్యవతులు కొందరు గలుగంబట్టిగదా వసుంధర తిరంభైయున్నయది. ఇదె నీకు నమస్కారంబు. 93

క. మావచ్చిన కార్యమునకు
నీ వనుకూలత భజించి నిర్మలకరుణా
శ్రీ వెలయఁగఁ బ్రార్థింపుము
నీవల్లభు భువనకుశలనిర్వాహకునిన్. 94

వ. అని యగస్త్యమహామునిం జూచి వెండియుం ప్రణమిల్లి యాఖండలగురుం డిట్లనియె. 95

బృహస్పతి యగస్త్యునితోఁ దమవచ్చినకార్యంబు నెఱింగించుట


సీ. ప్రణవంబు నీవు నిర్మలగుణాలంకార!
యామ్నాయవిద్య యీయలరుఁబోఁడి
తప మీవు శశికళోత్తంసభ క్తినిధాన!
శాంతి యీసంపూర్ణచంద్రవదన
ఫల మీవు వాతాపిఖలదర్పభంజన!
సత్క్రియ యీగంధసారగంధి
మిహిరుండ వీవు విశ్వహితప్రవర్తక!
చైతన్యలక్ష్మి! యీచపలనయన
తే. బ్రహ్మతేజంబు నీయందుఁ బ్రజ్వరిల్లుఁ
బ్రజ్వరిల్లుఁ బతివ్రతాపరమతేజ
మీలతాతన్వియందె మా కిందఱకును
నుభయతేజంబులును మహాభ్యుదయ మొసఁగు. 96

తే. శక్రుఁ డీతండు శిఖి వీఁడు జముఁడు వీఁడు
రాక్షసుఁడు వీఁడు పాథోధిరాజు వీఁడు
పవనుఁడును వీఁడు కిన్నరపతి యితండు
వృషభవాహనుఁ డీతండు విశ్వవంద్య! 97

వ. వీరెమునులు. వీరే సిద్ధసాధ్యమరుత్కిన్నరకింపురుషగంధర్వవిద్యాధరు లగుదేవయోనులు. మావచ్చినకార్యం బవధరింపుము. వింధ్యం బనుమహీధరంబు విబుధశైలంబుతోఁ బ్రతిస్పర్ధించి యూర్ధ్వాండకర్పరంబు నిజశిరశ్శృంగశృంగాటకంబుల నుద్ఘాటించుచు ననూరుసారధిపథం బవరోధించి నక్షత్రగ్రహతారచక్రంబుఁ జిక్కుపఱచి సప్తసమీరణస్కంధంబులనుం బ్రతిబంధించి శింశుమారాకారంబునం దారకావీథి బవ్వడించిన పాంచజన్యధరు నొరసి యౌత్తానపాది నుత్తరించి గగనగంగ నాలింగనంబుచేసి యురులింగాకారుఁ డైనధూర్జటిం ద్రివిక్రమాకారంబున విరాడ్రూపుం డగు విష్వక్సేను ననుకరించియున్నయది. తృటినిమేషకాష్టాకళాముహూర్తాహోరాత్రపక్షమాసర్త్వయన సంవత్సరయుగసంధ్యాసంధ్యాంశమన్వంతరకల్ మహాకల్పాదిభేదభిన్నం బై పదార్థంబులం బరిచ్ఛేదించుకాలంబు నినస్తసమస్తోపాధికస్వప్రతిష్ణాఖండసచ్చిదానందైకరసాద్వితీయరూపుం డైనవిరూపాక్షుండు దప్పించి యన్యులనుం బరిచ్ఛేదించు. అట్టికాలంబునకుం దపనపరిస్పందంబు మూలంబు. మార్తాండుండు కొండప్రక్కం జిక్కి కడలిమొగయక్కలిం దగులుపడి చిక్కిన జోగునుంబోలె నెదురు నడవ మరలం బఱవలేక చీకాకుపడియున్నవాఁడు. ప్రాహ్ణాపరాహ్ణమధ్యాహ్నసమయంబులు గత్తరఁ గలయుటం జేసి నిత్యనైమిత్తికాదిక్రియాకలాపంబు లుపసంహృతంబు లయ్యె. ప్రాచ్యోదీచ్యదేశంబు లంధకారాతపహిమానిలంబులచేతం జేతనావైకల్యంబు వహించె. భువనంబుల కకాండప్రళయం బావిర్భవించె. కల్పాంతకా లంబునందును గసుగందకుండుం గావున నవ్వేసవి గాశీక్షేత్రంబునందు నుపరతి చూపదు. ఏమును నిమ్మహోపద్రవంబునకుం బ్రశాంతిఁ గోరి యబ్రహ్మణ్యంబు సేయుచు బ్రహ్మశరణు సొచ్చితిమి. అవ్విరించి కరుణాకటాక్షంబున నీక్షించి యీయాపద యపనయింప వాతాపిహారితాపసుండు దక్కం దక్కినవాఁడు సమర్థుండుగాఁడు. అతనిం బ్రార్థింపుఁడు, పొం డని తాన నీకందువ చెప్పిన నీయానందవనంబున కనుదెంచితిమి. ఇకమీఁదఁ గోపాటోపావకుంఠకంఠకఠినహుంకారధారావష్టంభంబునం త్రివిష్టపరాజ్యలక్ష్మీమదాంధుం డైననహుషుని నిమిషమాత్రంబున ధాత్రీమండలంబునం బడఁద్రోచిన మహానుభావుండవు. నీవ ప్రమాణంబు. 98

క. ఎవ్వఁడు నిసర్గకఠినుం
డెవ్వఁడు సన్మార్గరోధి యీర్ష్యాపరుఁ డై
యెవ్వఁడు దన కధికునితోఁ
జివ్వకుఁ జేసాఁడు వానిసిరు లధ్రువముల్. 99

వ. అనిన వాచస్పతిపలుకు లాకర్ణించి యమ్మునిపుంగవుం డిట్లనియె. 100

తే. యత్న మొనరింతు నీకార్య మనువుపడఁగఁ
జనుఁడు మీమీనివాసదేశముల కర్థి
నున్నవాఁడు గదా! వీఁడే యుమయుఁ దాను
గాశికాభర్త మనపాలికల్పతరువు. 101

వ. అనిన వారును మహాప్రసాదం బని సముచితప్రకారంబునం గుంభసంభవుని వీడ్కొని నిజనివాసంబులకుం జనిరి. అనంతరంబ యగస్త్యుండు లోపాముద్రం జూచి యిట్లనియె. 102

అగస్త్యుండు కాశీవియోగంబునకుఁ బరితపించుట

తే. కమలలోచన! మనుజుఁ డొక్కటిఁ దలంప
దైన మొక్కటిఁ దలఁచు టెంతయు నిజంబు
కాశిఁ బెఁడబాయ నని యేను గదలకుండ
గాశిఁ బెడఁబాపె దైవంబు కరుణ లేక. 103

తే. అప్పటికి నియ్యకొంటిఁ గా కంబుజాక్షి!
[1]ఋషులపాశంబులే యింతలేసి పనులు?
కొసల కాఁబోతు నాఁబోతు గ్రుమ్ములాడ
నడిమి లేఁబెయ్యగతి వచ్చె నాకు నిపుడు. 104

సీ. వివరించి చూడంగ విసుమానములుగాక
గోత్రారి వెఱచునే కుధరములకు?
యుగవిరామమున నుఱ్ఱూత లూఁపగఁజూలు
గాలి కొండ దమింపఁ జాల దెట్లు?
సర్వభూతంబుల శాసింపఁజాలెడు
జములావు గిరియందుఁ జడతవడునె?
దహనునిదాహకత్వంబు మహీధ్రసం
స్తంభంబునకు శక్తి చాల దొక్కొ?
తే. రుద్రులాదిత్యతుషితమరుద్గణములు
దక్కుగల దేవతలు జగత్త్రయము మ్రింగి
యుమియఁజాలుదు రట్టివా రోపలేరె?
వింధ్యగిరగర్వసంరంభవిభవ మడపఁ. 105

తే. కామధేనువుఁ దనయింటఁ గట్టినాఁడు
కలవు తనతోటలోపలఁ గల్పతరులు

అట్టియింద్రుండు ప్రార్థించె నట్టె నన్ను
నింతపని కియ్యకోకుండ నెట్లు నేర్తు? 106

సీ. మాటనిల్కడఁ గాదె? మధుకైటభులు దొల్లి
హరిచేతఁ జచ్చి రేకార్ణవమున
గరుడుండు మోమోటఁ గాదె? వాహన మయి
వనజాక్షు నెక్కించుకొనియె వీఁపు
స్వాగతంబునఁ గాదె? చక్రాయుధుఁ డడంపఁ
బాతాళబిలములో బలి యడంగె
విశ్వాసమునఁ గాదె వృత్రాసురేంద్రుండు
సమసె నంబుధివాక శక్రుచేత
తే. మెఱసి యుపకార మొనరింప మేలు వచ్చుఁ
గీడు వచ్చు మనంబులో నోడ వలదు
వాడు చేసినధర్మంబు వానిఁ గాంచుఁ
గీర్తి యొక్కటి సాలదే కేవలంబ? 107

చ. ప్రతిదివసంబు విందుము పురాణముఖంబునఁ గాశియందు సం
తతముగ నంతరాయములు దాఁకుచునుండు ననంగ నిప్పు డా
శ్రుతి నిజమయ్యె నేనిదె యశోకమనస్కత నుండఁగా నత
ర్కితగతి వచ్చెఁ జూడుమిదె కిన్నరకంఠి! మహాంతరాయముల్. 18

తే. విముఖుఁ డయ్యెం జుమీ! నాకు విశ్వభర్త
గాక యూరక యేభంగిఁ గలుగనేర్చు
సకలకైవల్యకల్యాణజన్మనిలయ
కాశికాక్షేత్రవిప్రయోగవ్యథార్తి. 109

తే. పాణి యాహారకబళంబుఁ బాఱవైచి
కూర్పరము నాకు పిసవెఱ్ఱికూళ వోలె

భోగమోక్షములకు జన్మభూమి యైన
కాశి విడిచి నరుం డన్యదేశ మరుగు. 110

చ. తటగున నియ్యకొంటి మతి దప్పి మరుద్గురునంతవానితో
నటమట మింకఁ బోక యడియాసల నుండుటఁ బాపు దైవమా!
యిటు ననుఁ జిక్కు వెట్టుదె యనేకవిధంబుల నెట్లు చెప్పినన్
గటకట! యెట్లు వాయనగుఁ గాశిక మోక్షపదప్రకాశికన్. 111

సీ. పాయంగ వచ్చునే ప్రాలేయగిరికూట
సమవతీర్ణజలౌఘజహ్నుకన్య?
మఱువంగ వచ్చునే మందారమధురసా
స్వాదఘూర్ణితనేత్రు వటుకనాథు?
విడువంగ వచ్చునే విఘ్నాంధకారార్కు
డుంఠివిఘ్నేశు మండూకజఠరు?
మానంగ వచ్చునే మధ్యాహ్నకాలంబు
శ్రీవిశాలాక్షి కెంజేతిభిక్ష?
తే. సురలు ప్రార్థింపగాఁ బ్రతిశ్రుతము చేసి
యెట్టు వోకుండ నేర్తు నే నింతవాడ?
నెట్టు వో నేర్తుఁ గాశిఁ బుణ్యైకరాశి
బ్రకటగుణరత్నదుగ్ధాంబురాశిఁ బాసి. 112

క. కాశీ క్షేత్రము పంచ
క్రోశము గైవల్యలక్ష్మికులగృహ మని యా
క్రోశించు శ్రుతులు వినియును
దేశాంతర మరుగ సమ్మతింతు రభాగ్యుల్. 113

తే. కాశిం బాయుదుఁ గా కేమి కలువకంటి!
యంతరవిముక్తితీర్థంబు నాశ్రయింతు

నంతరవిముక్తతీర్థ మెయ్యదియొ యనిన
వరణయును నసియును నైనవారణాసి. 114

వ. భ్రూఘ్రాణంబులసంధి యవిముక్తస్థానం బది యభ్యంతరతీర్థంబు తీర్థంబులు బాహ్యాభ్యంతరభేదంబున ద్వివిధంబులై యుండు. 115

తే. ఎల్లవియు బాహ్యతీర్థంబు లిందువదన!
యరయ బాహ్యంబు లయ్యు నాభ్యంతరములు
కాశికాతీర్థ మాదిగాఁ గలవు కొన్ని
వాని వినిపింతుఁ బరిపాటి వనిత! వినుము. 116

సీ. శీర్షంబునందలి శ్రీశైలతీర్థంబు
మల్లికార్జునదేవుమనికిపట్టు
ఫాలభాగమునందుఁ బ్రాలేయమయ మైన
విమల కేదారతీర్థము వసించుఁ
గుచచూచుకములందుఁ గురుజాంగలమ్ముల
తీర్థరాజము సంప్రతిష్ఠ నొందు
భ్రూవల్లరీయుగ్మమునకు మధ్యంబున
నానందవనతీర్థ మధివసించు
తే. నంతరంగమునఁ బ్రయాగ మాశ్రయించు
నిమ్మహాతీర్థములు పార్వతీశ్వరునకు
విహరణస్థానములు వేదవిశ్రుతములు
వెలుపలను లోపలను నుండుఁ దలిరుఁబోడి! 117

వ. బాహ్యాభ్యంతరంబులయందును నవిముక్తతీర్థం బుత్తమోత్తమంబు. అట్టితీర్థంబుననుండి యఖండంబు సచ్చిదానందైక రసంబు నవ్వితీయంబు నగునిష్కళంకస్వరూపంబును నర్ధనారీశ్వరాదిరూపం బైనసకలస్వరూపంబును నగువిశ్వనాథు నుపాసింప నొడగూడదయ్యెం గావున నింక నేను భావతీర్థంబున యాభర్గు నుపాపించెద. సంసారసాగరంబుఁ దరియింపసాధనం బగుటఁ దీర్థం బయ్యె. ఆభ్యంతరం బైనయవిముక్తతీర్థంబు బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు లబ్ధస్థానంబగుటం త్రిమూర్తులకు సాధారణం బయ్యును మహేశ్వరునకుం బ్రధానస్థానం బై యుండు. 118

సీ. ఏవిధంబున నాత్మ నెఱుఁగుదు నే నంచు
యాజ్ఞవల్క్యుని నత్రి యడిగెఁ దొల్లి
యవిముక్తమునయం దుపాస్యుఁ డాత్ముఁ డటంచు
యాజ్ఞవల్క్యుం డత్రి కానతిచ్చె
నాయవిముక్త మెం దాశ్రయించినది యం
చడిగెఁ గ్రమ్మఱ నత్రి యాజ్ఞవల్క్యు
నిసుపారి వరణయందును నసియందును
నది యుండు నని యత్రి కాన తిచ్చె
తే. యాజ్ఞవల్క్యుండు భూమధ్యమాస్థలంబు
వరణ సంసారదోషనివారణంబు
నాశి యింద్రియదోషవినాశనంబుఁ
జేయుచుండుట యిట నిర్వచింపఁబడియె. 119

వ. అభ్యంతరావిముక్తక్షేత్రదర్శనంబు బ్రహ్మనాడీపవమానజయంబునం గాని సిద్ధింపదు. 120

సీ. ప్రకృతిరూపిణి యైనపాఁపపూఁబోడికి
మహదాదివికృతులు మలక లేడు

మొగము విచ్చి సుషుమ్న మూలరంధ్రముఁ గప్పి
వంశాస్థిసంబంధవలనలీల
నది మీఁదు ప్రాఁకి మధ్యమనాడితోఁ గూడి
ద్రుహిణరంధ్రముఁ గప్పుఁ దోఁకచివరఁ
జక్కజాయఁ జరింప సమకూరకుండుట
నిడఁ బింగళను గాలి యెక్కు డిగ్గుఁ
తే. గెలనివాఁకిళ్ళు రెండు వేగిరము మూసి
నడిమివాఁకిలిఁ దెఱవ నెన్నండు నేర్చు
సాధకుఁడు నాఁడుగాని వశ్యంబు గాదు
పవనవిజయంబు వానికిఁ బద్మనయన! 121

క. ఇడ వామనాడి పింగళ
కుడినాడి సుషుమ్న మధ్యగోచర యగు నీ
కుడియెడమ మధ్యనాడుల
కుడురాజానన! త్రిమూర్తు లొగి దైవతముల్. 122

క. హరి యిడకు నలువ పింగళ
కరవిందదళాయతాక్షి! యమృతాంశుకళా
ధరుఁడు సుషుమ్నానాడికిఁ
బరిపాటి నధీశు లనుచుఁ బలుకుదు రార్యుల్. 123

వ. పవనంబునకు సుషుమ్నాప్రవేశలక్షణం బైన యోగంబు వివరించెద. బ్రహ్మలోకప్రాప్తిద్వారం బగుట సుషుమ్న బ్రహ్మనాడి యనం బరఁగు. షణ్ణవత్యంగుళప్రమాణం బైనదేహంబునట్టనడుమఁ ద్రికోణాకారం బై కుక్కుటాండంబు చందంబున నుండునది కందస్థానంబు. 124

తే. నాభికందంబుక్రిందట నలినగంధి!
కుండలీశక్తిదేవత యుండునెలవు
కుండలీశక్తి నాఁగఁజకోరనేత్ర!
పాముచందాన నుండెడు ప్రథమధమని. 125

వ. అది మూల ప్రకృతి. మహదాదిప్రకృతివికారంబు లేడును దానిమేనిమలకలు. అప్పాపచేడియయు సుషుమ్నానాడితోడం బెనంగొనియుండు.126

క. గిటగిట నెనిమిదిమలకలఁ
గుటిలీభావము భజించి కుండలి ప్రాకున్
నిటలాంతముదాఁకను గ్రిం
దటిమొగ మై వ్రేలు నండ్రు దద్జ్ఞులు దానిన్. 127


తే. దానిచుట్టును నుండు లేఁదలిరుఁబోఁడి!
డెబ్బదియు రెండువేలు నాడికలు మేన
ముఖ్యనాడులు వానిలో ముద్దరాల!
పదియునాలుగు ననుచుఁ జెప్పుదురు బుధులు. 128

వ. ఇడానాడియందుఁ జంద్రుం డధివసించియుండుం గావున నందుఁ బవనం బుద్గమించుకాలంబు రాత్రి. ప్రవేశించుకాలంబు పగలు. పింగళానాడియందు సూర్యుం డధివసించి యుండుఁగావున నందుఁ బవనం బుద్గమించుకాలంబు దివంబు. ప్రవేశించుకాలంబు రాత్రి. ప్రాఙ్ముఖస్థితుఁ డగుపురుషునకుఁ బింగళానాడి దక్షిణదిక్కున నిడానాడి యుత్తరదిక్కున నుండుఁగావున మకరాయనసమయంబున దక్షిణదిగవస్థితుం డగుసూర్యుండు గర్కటకాయనపర్యంతంబు నుత్తరంబు నడచుటం జేసి యుత్తరాయణం బయ్యె. ఈ చందంబునం బింగళా స్థితుం డగుపవనుండు యావత్కాలంబు నిడయందు సంక్రమించు నంతకాలం బుత్తరాయణం బీప్రకారంబున దక్షిణాయనంబు నెఱుంగునది. 129

చ. సమగతి నేకకాలమున సంగతి యాషవతీకళత్రుఁడున్
గమలహితుండు ప్రాణమనుగాడ్పులు దారటుకూడి పింగళా
ధమనిని డాసి తీవ్రగతిఁ దార్కొని క్రుంకుదు రస్తమింతు రే
సమయమునందుఁ దాల్చునది చంద్రనిభాస్య! యమాభిధానమున్. 130

తే. పాము కుండలి చంద్రుండు ప్రాణపవన
మాసిరావల్లి యెప్పు డయ్యనిలుఁ గ్రోలు
నది యశేషాంగకగ్రాస మైనయట్టి
గ్రహణకాలంబు సుమ్ము సారంగనయన! 131

వ. ప్రాణంబ యాదిత్యుండు. ఆదిత్యుండ చంద్రుండు. ఆప్రాణానిలంబు మూలాధారప్రవేశానంతరం బుదయించు మూర్ధప్రవేశానంతరం బస్తమించు. దేవతలకు మొదలివిషువం బైనమేషాయణంబున సూర్యుం డుదయించు. విషువాంతరం బైనతులాయనంబున నస్తమించు. ప్రాణోదయాస్తమయసమయంబులు విషువద్ద్వయంబు. 132

చ. మొదల సుషుమ్నఁ జొచ్చు నిడముట్టినగాడ్పుల కొంతసేపునం
బిదప సుషుమ్నఁ బుట్టినసమీరము చొచ్చునిడాఖ్యనాడికన్
మొదలను బిమ్మటం బవనముల్ దిరుగంబడి చొచ్చుఁ గానన
య్యదనులు సంక్రమంబులని యాడుదు రాగమతత్త్వకోవిదుల్. 133

వ. అని యవిముక్తక్షేత్రవియోగదుఃఖంబున మానసాంతరవిముక్తక్షేత్రమాహాత్మ్యం బుపన్యసించి యనంతరంబ కాశికావిరహవేదనాభరంబు దుస్సహం బగుట నౌర్యశేయుండు కాశిని లక్ష్యంబు చేసి యి ట్లనియె. 134

క. ఆమచ్చిక యాయను వా
ప్రేమాతిశయంబు విస్తరింపఁగ వశమే?
భూమండలతిలకమ పర
భూమికి ని న్నెట్లు వాసి బోవుదుఁ గాశీ! 135

మ. నిజ మేఁ బల్కెద బాహులెత్తి శ్రుతివాణీజాహ్నవీగోపతి
ధ్వజడుంఠీశగణేశ్వరుల్ గుఱిగ నోవారాణసీదేవి! యో
గజచర్మాంబరుకూర్మిపట్టణమ! యోకల్యాణి! నిన్ బోలనం
బుజగర్భాండమునందు లేవు నగరంబుల్ తీర్థరాజంబులున్. 136

తే. లేవు లింగంబు లవిముక్తలింగమునకు
సాటిసేయంగ భూర్భువస్స్వస్త్రయమున
రావు దక్కటిపుణ్యతీర్థములు నీకు
సాటిసేయంగ భూర్భువస్స్వస్త్రయమున. 137

వ. అని యెట్టకేలకుం గదలి విరాళింగొన్నచందంబున మరులు గుడిచినపోల్కి నపస్మారం బెత్తినపగిది నన్నుకొన్నవిధంబున దూపటిల్లినతెఱంగునఁ దూలపోయినరీతి విషం బెక్కినలీల మ్రాఁగన్ను పెట్టినలాగున లాహిరి పట్టినభాతి మదంబెక్కినమాడ్కి నుంగిడిగొన్నభంగి నూసరిల్లుచు నుస్సురనుచు నుమ్మలించుచు నుదిలగొనుచు నుపతాపం బందుచు నూటాడుచు నూర్వశీనందనుం డూర్ధ్వబాహుండై యుచ్చైస్స్వనంబున. 138

సీ. పరమకల్యాణీ! యోభాగీరథీ! గంగ!
వార్ధిభామిని! పోయివత్తు నమ్మ!

యమరేంద్రులార! లోలార్కకేశవులార!
వనజసంభవ! పోయివత్తు నయ్య!
శ్రీవిశాలాక్షి! దాక్షిణ్యపుణ్యకటాక్ష!
వాసవార్చిత! పోయివత్తు నమ్మ!
శ్రీపూర్ణభద్రపారిషదనాయకులార!
వటుకభైరవ! పోయివత్తు నయ్య!
తే. తీర్థసంవాసులార! కృతార్థులార!
పాశుపతులార! భాగ్యసంపన్నులార!
మందిరోద్యానవాటికామఠములార!
పోయివచ్చెద మీకాశిపురము వెడలి! 139

సీ. కలహంసి! రారాదె కదలి నాతోఁ గూడి
నీవేల వత్తమ్మ నెమ్మి నుండి
కదళికాకాంతార! కదలి రా ననుఁ గూడి
నీ వేల వత్తమ్మ నెమ్మి నుండి
శ్రీవిశాలాక్షి! విచ్చేయు నాతోఁ గూడి
నీ వేల వత్తమ నెమ్మి నుండి
నాతోడఁగూడి యంతర్గేహ! యే తెమ్ము
నీ వేల వత్తమ్మ నెమ్మి నుండి
తే. రండు ననుఁ గూడి యోపరివ్రాట్టులార!
వత్సలత గల్గి మీరేల వత్తు రయ్య !
పరమనిర్భాగ్యుఁ డైననాపజ్జఁ బట్టి
కటకటా! సౌఖ్యజలరాశిఁ గాశిఁ బాసి. 140

వ. అని యెట్టకేలకుఁ గాశీనగరంబు వెడలి కొంతదవ్వు నడచి కాశీవిప్రయోగతీవ్రవేదనాదూయమానమానసుం డై వద నంబు వఱువట్లు పట్టం బాదంబులు గుదివడ నుహ్హనుచు నొకవటవిటపినీడ నజ్జటాధరుండు చతికిలంబడి లోపాముద్ర కిట్లనియె. 141

తే. భూమిపతిపుత్త్రి! చెప్పుమా బుద్ధిమతివి
కాశి వెడలంగ వలసె నేకారణమునఁ
గారణము లేక యూరక కలుగు నెట్లు
సుఖము దుఃఖము నరునకు సులభలీల? 142

వ. కాశ్మీరంబులయందుఁ గుంకుమం బనునది దేశాపేక్ష; దివంబునంద కమలవికాసంబు, రాత్రియంద యుత్పలవికాసంబు ననునది కాలాపేక్ష; పుణ్యవంతునకు సుఖంబు, పాపిష్ఠునకు దుఃఖంబు ననునది యదృష్టాపేక్ష; సర్వంబును నీశ్వరేచ్ఛాయత్తం బనునది యీశ్వరాపేక్ష; విశ్వంబును గ్రహవశం బనునది గ్రహాపేక్ష; మాకుఁ జూడ నీశ్వరప్రేరణంబునం గర్మంబు సుఖదుఃఖంబుల నాపాదించు; ఈశ్వరుం డెవ్వని రక్షింపవలసె వానిచేఁ బుణ్యకర్మంబులు చేయించు నెవ్వనిం జెఱుపవలసె వానిచే బాపకర్మంబులు చేయించు అవిద్యాస్మితరాగద్వేషాదిలక్షణక్లేశపంచకమూలంబున గదా కర్మాతిశయంబు? అక్కర్మఫలం బిహలోకపరలోకంబులం బ్రాణు లనుభవింతురు. కర్మంబునకు మూలభూతంబైన క్లేశపంచకం బెంతకాలం బనువర్తించు నంతకాలంబునకుఁ ద్రివిధంబు పరిపాకంబు నానావిధయోనిజన్మప్రాప్తియు నాయువు సుఖదుఃఖఫలోపభోగంబును జన్మంబున జన్మహేతుకర్మంబు చరితార్థం బయ్యెనేనియు నవశిష్టంబులై యాయుర్హేతువులు భోగహేతువులు నైన కర్మంబులకు ఫలానురూపం

బైనభోగంబులు బరమేశ్వరుండు గల్పించుచుండు. 143

తే. ఏమి చెప్పఁగ నున్నది? యేవిధమునఁ
గాశి వెడలించుచున్నాఁడు కాలగళుఁడు
మనము లోఁగితి మేని లోఁగునె శివాజ్ఞ?
యుడుము నడికిన నడుకునే బడియ పెట్టు? 144

వ. అని వెండియు. 145

సీ. వక్షస్స్థలంబున వైచు మంత్రము చెప్పి
జమిలిపాములరాజుజన్నిదంబు
జడ లల్లి చొళ్ళియం బిడి యెక్కసకెముగా
బాలేందుశకలంబుఁ బదిలపఱచుఁ
గంఠమూలమునందుఁ గస్తూరిమాఱుగాఁ
గాలకూటవిషంబుఁ గీలుకొలుపుఁ
గటిభారమునయందుఁ గట్టు రింగులువాఱ
మెఱుఁగారు మువ్వన్నెమెకముతోలు
తే. గట్టువాలుపడంతి చక్కడముఁ దోఁపఁ
దఱచు గైసేయుచుండు నాతల్లి కాశి
యయిదుక్రోసులపొలములో నంత నంతఁ
జావు కుండంగఁ జచ్చినజంతువులకు. 146

చ. అని యెదురుండి మ్రొక్కి నయనాంబురుహంబుల బాష్పబిందువుల్
చినుకఁగ వెక్కివెక్కి కలశీసుతుఁడోయన నేడ్చు నీరెలుం
గున నొకకొంత కొంత మఱి గ్రుమ్మరు మిన్నున మ్రోవ నుద్ధుర
ధ్వని బఠియింపఁ జొచ్చెఁ బ్రణవంబునఁ గూర్చినమంత్రరాజమున్. 147

వ. అచ్చోటు గదలి కతిపయప్రయాణంబుల వింధ్యాచలంబు డాయం జనుదెంచి విషమదృషత్ఖండవిలసనస్థలంబును జరత్తరుకోటకజఠరలుఠదజగరగళ గుహానిష్ఠ్యూతనిష్ఠురపవనసాధుక్షమాణదవదహనశిఖాకలాపంబును నుగ్రతరశరభచటులపేటపాతమోహితరోహితంబును సముద్ధతస్తబ్ధరోమకంఠకఠోరఘుర్ఘురధ్వానఘుమఘమాయమానదిక్కుంజరక్రోడంబును సుగ్రీడచ్చిక్రోడశిశుచరణనఖశిఖాశిఖరవిశీఢ్యమాణశిఖరశేఫాలికాకుసుమకేసరరజఃప్రసరధూసరవాకరకరవ్రాతంబును బరుషతరుపవనబిలపతితపచేళమదధిఫలభక్షణఫుల్లగల్లభల్లూకప్రకరంబును నగు మహాగహనమధ్యంబున. 148

సీ. యక్షరాజుఁ దలంచి యక్షిగోళంబుల
నశ్రుపూరము నించు నర్మి మిగిలి
పలుమాఱు నట దండపాణిసౌహార్దంబు
భావించి భావించి పలవరించు
సంభ్రమోద్భ్రముల విశ్వాపాత్రంబుల
సౌవిదల్లుల వర్థి సంస్మరించు
దిగ్గజాఘోరసిద్ధివినాయకకపర్ది
చింతామణీగణేశతులఁ బొగడు
తే. జ్యేష్ఠసౌభాగ్యసుందరీచిత్రకంఠ
వికటదుర్గామహాదేవి విశ్వవాహ
శాటికాదేవతల నిజస్వాంతవీథిఁ
గాంచిఁ గఱువ్రాల్పు సర్వాంగకములఁ దపసి. 149

క. త్రిణయనునిరాణివాసము
నణిమాద్యైశ్వర్యవితరణామరతరువున్

మణికర్ణిక ముక్తివధూ
మణికర్ణికఁ దలఁచుఁ దపసి మానసవీథిన్. 150

సీ. కరవల్లిఁ బఠియించుఁ గళము సంశోధించుఁ
బ్రాణోపనిషదభిప్రాయ మరయుఁ
బఱిపాటి ముండకోపనిషత్తుఁ దాపనీ
యోపనిషత్తు నభ్యుపగమించు
నఱియు నధర్వవేదశిరఃప్రపంచంబు
లారణ్యకముత్రోవ లరసి చూచుఁ
బ్రశ్నోపనిషదర్థపరిమళంబు గ్రహించు
శ్రీభగవద్గీతఁ జిత్తగించుఁ
తే. దల వకారంబు శ్వేతాశ్వతరము ననెడు
నునిషత్తులు దలపోయు నొయ్య నొయ్యఁ
గాశికాక్షేత్రవిప్రయోగప్రభూత
హృదయసంతాపశాంతికై యిల్వలారి. 151

వ. అప్పుడు. 152

మ. క్షితిపాలోత్తమవంశభూషణము, లక్ష్మీభారతీపార్వతీ,
ప్రతిబింబంబు సమగ్రకాంతిమతి లోపాముద్ర నీక్షించి య
ద్భుతముం బొందుచు వింధ్యనామకమహాభూమిధరారణ్యదే
వత లందంద నమస్కరింతురు మనోవాత్సల్య మొప్పారఁగన్. 153

మ. నలి వింధ్యాచలకాననాంతరమున న్వారాణసీత్యాగవి
హ్వలభావంబున నిల్చి నిల్చి హర! నీహారాంశుమూర్ధన్య! ని
ర్మల! కాశీశ్వర! నీలకంఠ! యనుచున్ మ్రాన్గన్స్నును వాటిల్లఁ ద
త్కలశీసూనుఁడు మూర్ఛఁ గైకొను సమగ్రంబైన తద్వేదనన్. 154

వ. వెండియుఁ గుంభసంభవుండు. 155

చ. దురితము లేన్ని చేసితినొ తొల్లిటిజన్మమునందుఁ గాశికా
పురమున సర్వజంతువులు భూరివిముక్తులు గొల్లలాడఁగా
హరహర! నెత్తిఁ జేతు లిడి యశ్రులు గన్నుల నొల్క నిప్డు నే
గరినిభయానతో నిదె పొకాలెదమిన్నులు వడ్డచోటికిన్. 156

తే. ఏల మింగితి వాతాపి నిల్వలు? నిల
నేల త్రోచితి దివినుండి యోలి నహుషు?
నాప్రభావంబు గాదె న న్నదిరిపాటు
కాశి వెడలంగఁ ద్రోచె నిష్కారణంబ. 157

సీ. ఎన్నఁడు చూతునో యింకొక్కమా టేను
బ్రకటకైవల్యాంబురాశిఁ గాశి?
నెన్నఁడు చూతునో యింకొక్కమా టేను
జగదేకపావని జహ్నుకన్య?
నెన్నఁడు చూతునోయింకొక్కమా టేను
మహిమాస్పదము ముక్తిమంటపంబు?
నెన్నఁడు చూతునో యింకొక్కమా టేను
విశ్వలోకారాధ్యు విశ్వనాథు?
తే. నింక నెన్నఁడు చూతునో యేను డుంఠి?
నింక నెన్నఁడు చూతునో యేను దుర్గ?
నింక నెన్నఁడు చూతునో యేను వటుకు?
నింక నెన్నఁడు చూతునో యేను గుహుని?158

అగస్త్యుండు లోపాముద్రతోఁ గాశిం బెడదబాయుట వింధ్యగర్వాపహరణము

వ. అనుచు నల్లనల్లన వచ్చుకుంభసంభవు దవ్వుదవ్వులం గాంచి కాంచనశిరశ్శృంగశృంగాటకంబులం గమలభవాండకటా హంబు లుద్ఘాటించుతనమేటిపొడవు నేలసపాటంబుగా వంచి వింధ్యాచలం బమ్మహానుభావు నెదుర్కొనియె. అప్పు డర్కునిరథంబు చక్కఁ జాయ నడచె. పవనస్కంధంబులు నిర్బంధంబు లుడిగె. ఇందుండు చిందిలిపడసాగె. మంగళబుధబృహస్పతిశుక్రశనైశ్చరరాహుకేతువులు దమతమతానకంబులు దప్పక చరింపం దొడఁగిరి. విశ్వప్రపంచంబు సర్వంబును గ్రామంబున యథాపూర్వంబునం బ్రవరిల్లె. కాలంబు లేర్పడియె. అనంతరంబ పురుషాకారంబు దాల్చి యజ్ఞగతీధరంబు గొన్ని యంజలం బ్రత్యుద్గమించి. 159

సీ. ప్రణవపంచాక్షరోపనిషత్ప్రపంచంబుఁ
గడదాక నెఱిఁగిన కఱతలాని
వాతాపిదైత్యు నిల్వలునితోఁ గూడంగ
జఠరాగ్ని వేల్చిన సవనకర్తఁ
గోపించి నహుషునిఁ గుంభీనసంబుగా
హుంకార మిచ్చిన యుగ్రతేజు
వానకాలమునాఁడు వండుపట్టిననీటి
కాలుష్య ముడిపెడు కతకఫలముఁ
తే. బాండుభసితత్రిపుండ్రాంకఫాలభాగు
భద్రరుద్రాక్షమాలికాభరితవక్షు
భార్యయును దాను నేతెంచుపరమశైవుఁ
గాంచె వింధ్యాచలేంద్రంబు కలశభవుని. 160

క. కాశీనగరీవిరహ
క్లేశభవక్రోధవహ్నికీలల నాశా

కాశధరిత్రీవలయము
లాశుగతిం గాల్పఁ గడఁగునట్టిమహోగ్రున్. 161

వ. కాంచి యక్కుంభినీధరంబు కుంభసంభవు నతిథిసత్కారసంభావనావిశేషంబులం బరితోషంబు సంపాదించి కరాంభోరుహంబులు మోడ్చి ‘మహానుభావా! నీయాజ్ఞాప్రసాదభవంబున ననుం గృతార్థుం జేయు’మని పలికిన. 162

సీ. వింధ్యాచలేంద్ర! పృథ్వీభృత్కులశ్రేష్ఠ!
దక్షిణాపథము తీర్థంబు లాడఁ
బోవుచున్నాఁడ నీ పువ్వుఁబోఁడియు నేను
బెద్దకాలమునాఁటి పెరిచ గాన
లావు చాలదు జక్లైబ్యంబుకతమునఁ
బొడ వెక్కునపుడు డిగ్గెడునపుడును
నభ్రంకషము లైనయానీశిరశ్శృంగ
శృంగాటకము లిట్లు చిఱుతపఱిచి
తే. యనఘ! నేఁ గ్రమ్మఱఁగ వచ్చునంతదాఁక
నుండవలయు ధరిత్రిలో నొదిఁగి నీవు
చేయు నాయాజ్ఞ లెస్స యౌఁ జేయకున్న
నెఱిఁగెదవు గాక రజ్జాడ నేల యిపుడు? 163

వ. అనిన వింధ్యంబు మహాత్మా! చరాచరంబైనజగంబునందు నీయాజ్ఞఁ జేయనివారునుం గలరె! నీవు మరలి విచ్చేయునంతదాఁకను నిట్ల యుండెద ననినఁ గుంభసంభవుం డతని దీవించి నిజపాదాంభోరుహవిన్యాసంబుల విశ్వవిశ్వంభరాభాగంబు భాగ్యవంతంబు గావించుచు దక్షిణదిశాభిముఖు డయి చనియె నని చెప్పిన నైమిశారణ్యవాసు లటమీఁదివృత్తాంతం బెయ్యది యనుటయు. 164

ఆశ్వాసాంతము

ఉ. బలవద్బారహగొంతిమన్నెధరణిీపాలావరోధాంగనా
విలసన్మంగళసూత్రరక్షణకళావిఖ్యాతకారుణ్య! యు
త్కలకర్ణాటతురుష్కరాట్పరమమిత్రా! కుండలిస్వామికుం
డలపూజాపరతంత్రధీవిభవ! పంటక్ష్మాపచూడామణీ! 165

క. భూపాలమథన! జంబూ
ద్వీపేశ్వర! విమతరాయవేశ్యావిటధా
టీపటహడాన్నినాదా
టోపప్రక్షుభితదిక్కుడుంగక్రోడా! 166

ఉత్సాహ—
బంధులోకపారిజాత! పంటసంశపావనా!
సంధివిగ్రహప్రధానషడ్గుణా! విశారదా!
గంధవాహభుక్కలాపకంఠకోణనాభిని
ర్గ్రంధనక్రియామహాప్రగల్భకీర్తివైభవా! 167

గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్ర మారయామాత్యపుత్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతంబైన కాశీఖండం బనుమహాకావ్యంబునందు ద్వితీయాశ్వాసము.

  1. ఋషుల పాలిటి వేయింతలేసిపనులు
    కొతుక కాఁబోతు ...
    నడిమి యాఁ బెయ్యదెస వచ్చె.