కాశీఖండము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

పురాణప్రశంస

సీ. పద్మాదికంబులు పదియు నెనిమిదియు
నాదిపురాణంబు లాపురాణ
జాతంబు నాల్గులక్షలసంఖ్యగలయది
యుపపురాణంబులం దుద్భవించెఁ
బదునొకండవది యై బహుసంహితలతోడ
బహుఖండములతోడ బహువిచిత్ర
కథలతో నేకలక్షగ్రంథపరిమాణ
కలితమై శ్రీమహాస్కాంద మొప్పు
తే. నమ్మహాస్కాందమునకు సారాంశ మనఁగ
నాల్గుపురుషార్థములకుఁ దావక మనంగ
బ్రహ్మవిద్యకు నాదికారణ మనంగ
నఖిలఖండంబులందుఁ బ్రఖ్యాతి వడసె. 71

తే. మూఁడులక్షలుఁ బదియేడు ముగిసిపోవఁ
దాఁ బ్రవర్తిల్లు లక్షగ్రంథంబుతోడ
సమధికస్ఫూర్తి నేపురాణములు సాటి
గరిమ కందంబునకు మహాస్కాందమునకు. 72

తే. వదుస నెనిమిది యన్యదేవతలఁ దెల్పుఁ
బదిపురాణంబు లీశ్వరుఁ బ్రస్తుతించుఁ

జంద్రమౌళిప్రభావంబు సమధికముగ
శ్రుతులయట్ల [1]పురాణసంహితలు నడుచు. 73
 
తే. సరవి సర్గంబు నాఁ బ్రతిసర్గ మనఁగ
వరుసతో వంశవంశానుచరితము లనఁ
గ్రమపరిప్రాప్తి మన్వంతరము లనంగ
లలిఁ బురాణమునకు నైదు లక్షణములు. 74

తే. గ్రంథపరిసంఖ్య నాల్గులక్షలు పురాణ
మది చతుర్దశవిద్యలయందుఁ బెద్ద
చాలఁ గర్మార్థమం దానుషంగిక మన
యాదికారికయందె బ్రహ్మార్థగరిమ. 75

ఉ. అట్టి[2]దివోపురాణము మహత్త్వము సూతుఁడు దద్విదుండుగాఁ
బట్టి కనిష్ఠజన్మమునఁ బ్రాకృతుఁ డయ్యు నురుప్రభావులై
నట్టి మహామునీంద్రులకు నంబుజసంభవునంతవారికిన్
దిట్టతనంబు మీఱ నుపదేశ మొనర్చుచు నుండు బ్రహ్మమున్. 76

నైమికశబ్దనిర్వచనము

సీ. ఆది మనోమయం బగునొక్కచక్రంబుఁ
గల్పించె బ్రహ్మ జగద్ధితముగఁ
గల్పించి యాబండికలు డొల్చె సత్యలో
కంబుననుండి యాకమలగర్భుఁ
డది డొల్లగిలి విష్టపాంతరంబులు దాఁటి
క్రమముతో భూమిచక్రమున వ్రాలె
వ్రాలి రంహస్స్ఫూర్తి వచ్చి వచ్చి ధరిత్రి
నిమ్నోన్నతుల శీర్ణనేమి యయ్యె

తే. నేమి విరిసినకతన నన్నేలనెలవు
నైమిశంబయ్యె నదియ తా నైమిశంబుఁ
దన్మహాపుణ్యవనమున ద్వాదశాబ్ది
సత్త్రయాగంబుఁ గావించె శౌనకుండు. 77

వ. ఆసత్త్రయాగంబునందు శౌనకాదిమహామునులును సూతాన్వయసంభవుం డైనసూతు నర్చించి తన్ముఖంబునం బురాణేతిహాససంహితలు వినిరి గావున నమ్మహావిద్యాస్థానంబు సూతముని సంవాదాత్మకంబు. 78

తే. స్కాందమందుల నేఁబదిఖండములకు
బహుకథాసంగతులు సేయ బాడి గాదు
ఖండఖండంబులందును గలిగినట్టి
కథలపాలివి సంగతిగ్రహణమునకు. 79

వ. ఇమ్మహాస్కాందమ్మునకు నవయవంబు లాఱుసంహిత లవి క్రమంబున సనత్కుమారసంహిత పంచపంచాశత్సహస్రిక, సూతసంహిత షట్సహస్రిక, శాంకరసహిత త్రింశత్సహస్రిక, వైష్ణవసంహిత పంచసహస్రిక, బ్రహ్మసంహిత త్రిసహస్రిక, సౌరసంహిత యేకసహస్రిక. ఈసంహితలయందుఁ (బంచ)నాగరఖండంబు, గమలాలయాఖండంబు, రేవాఖండంబు, నేకవీరాఖండంబు, మైలారఖండంబు, గోదావరీఖండంబు నాదిగాఁగల పంచాశత్ఖండంబులందు. 80

కాశీఖండప్రశంస

శా. ప్రాశస్త్యంబు వహించు ద్వాదశసహస్రగ్రంథసంకౢప్తివి
శ్వేశక్షేత్రవియన్నదీపటుకడుంఠీనాథసత్కీర్తనో
ద్దేశప్రక్రమశోభితాద్భుతకథాధిషానమై శ్రేష్ఠమై

కాశీఖండ మఖండవైభవమునన్ స్కాందాబ్ధిమధ్యంబునన్. 81

వ. ఈకాశీఖండంబు వేదవ్యాససూతసంవాదాత్మకం బనియునుం గొందఱు చెప్పుదురు. దీనికిం గథాక్రమణిక వింధ్యనారదసంవాదంబు, బ్రహ్మలోకప్రభావంబు, గోదానమాహాత్మ్యంబు, వారాణసియం దగస్త్యాశ్రమవర్ణనంబు, మునిదేవతాసమాగమంబు, పతివ్రతాచరితంబు, కుంభసంభువప్రార్థనంబు, తీర్థప్రశంస, శివశర్మోపాఖ్యానంబు, సప్తపురీప్రశంస, సంయమనీప్రశంస, మహేంద్రలోకదర్శనంబు, వహ్నిసముత్పత్తి, క్రవ్యాద్వరుణసంభవంబు, గంధవత్యలకావర్ణనంబు, చంద్రలోకప్రాప్తి, యుడులోకవృత్తాంతంబు, శుక్రసముద్భవంబు, శనైశ్చర్యలోకవర్ణనంబు, సప్తర్షిలోకధ్రువలోకవర్ణనంబులు, కుమారాగస్త్యసంవాదంబు, మణికర్ణికాసముద్భవంబ, గంగామాహాత్మ్యంబు, భైరవావిర్భావంబు, దండపాణిజన్మంబు, కళావత్యుపాఖ్యానంబు, సదాచారంబు, బ్రహ్మచారిప్రకరణంబు, స్త్రీలక్షణంబు, కృత్యకృత్యప్రకరణంబు, గృహస్థధర్మంబు, యోగనిరూపణంబు, కాలజ్ఞానంబు, దివోదాసవర్ణంనంబు, యోగినీవర్ణనంబు, లోలార్కోత్తరార్కసంజ్ఞాదిత్యద్రుపదాదిత్యారుణాదిత్యవర్ణనంబు, దశాశ్వమేధతీర్థమాహాత్మ్యంబు, పిశాచవిమోచనంబు, డుంఠీప్రాదుర్భావంబు, విష్ణుమాయాప్రపంచంబు, దివోదాససముచ్చాటనంబు, పంచనదోత్పత్తి, మందరాచలంబుననుండి యిందుమౌళి వారాణసీపురంబున కేతెం చుటయు, జైగిషవ్యౌపాఖ్యానంబు, కృత్తివాససముత్పత్తి, దుర్గామాహాత్మ్యంబు, ఓంకారమాహాత్మ్యంబు, త్రిలోచనసముద్భవంబు, కేదారేశధర్మేశమాహాత్మ్యంబులు, పక్షికథ, విశ్వభుజాఖ్యానంబు, దుర్దమకథ, విశ్వేశ్వరాఖ్యానంబు, కామేశ్వరవిశ్వకర్మేశ్వరసరస్వతీశ్వరామృతేశ్వరవర్ణనంబులు, వ్యాసభుజాస్తంభంబు, క్షేత్రతీర్థకదంబవర్ణనంబు, ముక్తిమంటపవర్ణనంబు, విశ్వేశ్వారావిర్భావంబు, దేవతాయాత్రావిధానంబు ననఁ బుణ్యాఖ్యానంబు లేకోత్తరశతంబునుం గలిగి. 82

శా. ఆశాస్యంబులు సంఘటించును బహూపాఖ్యానశాఖోపశా
ఖాశోభాసముదంచితాభ్యుదయమై స్కాందాబ్ధిసంజాతమై
యీశానుగ్రహలబ్ధముక్తిఫలమై యెక్కాలమున్ శ్రోతకున్
గాశీఖండ మఖండవైభవమునన్ గల్పద్రుమప్రక్రియన్. 83

వ. పూర్వఖండంబున బ్రహ్మర్షి నారదుండు తీర్థయాత్ర చరించెనని సూతుండు శౌనకాదిమహామునులకుం జెప్పి వా రడుగంగా గాశీవృత్తాంతం బిట్లని చెప్పం దొడంగె. కృష్ణద్వైపాయనుండు ప్రియశిష్యుఁడైన సూతున కనంతరకథాక్రమంబునం గాశీఖండకథాకథనప్రారంభంబున నిట్లనియె. 84

నారదుఁడు వింధ్యమున కేతెంచుట

తే. ఇవ్విధంబునఁ దీర్థంబు లెల్ల నాడి
నర్మదానది నవగాహనం బొనర్పఁ
దలఁచి గోదావరీసింధుతటము పట్టి
దండకారుణ్యవీథిమధ్యంబు దరిసి. 85

వ. ముందట. 86



శా. కాంచెన్ గాంచనగర్భసంభవుఁ డుదగ్రగ్రావకోటిస్ఖల
చ్చంచన్నిర్ఝరవేణికానివహసంజాతాబ్ధిసాంగత్యమున్
బంచాస్యస్ఫుటకంఠనాదహతశుంభత్కుంభిదర్పాంధ్యమున్
ప్రాంచద్ధాటకభూమిభృచ్ఛిఖగర్వావంధ్యమున్వింధ్యమున్. 87

క. రేవాతరంగశీకర
సేవాహేవాకపాకశిశిరసముత్ప్ర
స్తావపరికంప్యమానజ
టావలి యగు చతఁడు వింధ్య మల్లనఁ జేరెన్. 88

క. తాపసకులాగ్రగణ్య
శ్రీపాదాంభోజయుగళచిహ్నశ్రేణీ
నైపథ్యపరమపుణ్యశి
లాపట్టం బగుచు నయ్యిలాధర మలరెన్. 89

సీ. త్రసరేణుపరిమాణధాతుధూళీపాళి
యలికంబులకు వింతచెలువ మొసఁగ
ఘన మైనరారాపుచనుదోయిరాయిడి
నిఱుపేదనడిమికి వెఱపు చూపఁ
పొలుపాఱుమెఱుఁగుఁదీఁగెల బోలుకన్నులు
వడ దాఁకి యొక్కింత వాడఁ బాఱ
సిందూరతిలకంబు చెమటచిత్తడిఁ దాఁకి
యలికభాగంబునం దనలుకొనఁగఁ
తే. గనకమేఖల జఘనచక్రమునఁ జాఱ
నీవిబంధంబు నాలోన నెమ్మి వదల
మహతి ధరియించి యొకతనుమధ్య దన్ను
ననుచరించుచు గాంధర్వ మభ్యసింప. 90

వింధ్యవర్ణనము

సీ. కర్పూరకదలికాకాంతారపవనంబు
లధ్వనీనశ్రాంతి నపనయింప
మదురంగఁ బండినమాలూరఫలములు
చెంచుకన్యలకుచశ్రీలఁ జెనయ
నురగవల్లీగాఢపరిరంభణంబులఁ
బోఁకమ్రాకులకింపు పురువుకొనఁగఁ
బాటలీవకుళచంపకసౌరభముతోడ
విచికిలామోదంబు వియ్య మంద
తే. గమియ నామూలచండంబుగా ఫలించి
యంబరము మోచి యున్నయుదుంబరములు
లీల బ్రహ్మాండభాండమాలికలభూష
లవధరించిన వృషభాంకు ననుకరించె. 91

క. దరవికచవకుళకురవక
పరిమళసంభారలోలబంభరమాలా
పరిషజ్ఝంకారధ్వని
తెరువరులకు మన్మథప్రదీపన మొసఁగున్. 92

వ. వెండియుఁ గర్కరేటుకఠోరతారతరరటనంబును దాత్యూహవ్యూహకహకహారావకోలాహలంబును గలకంఠకంఠకోమలకుహూకారంబును మదకలకలవింకచూంకృతంబును కాకకాకలీకలకలంబును బుంఖానుపుంఖఝిల్లీఝంకారధారాప్రసారంబును సముద్దతధ్వాంక్షనిధ్వానపాటవాటోపంబును సముత్కటోత్క్రోశవాసితవ్యాఘ్రసంరంభసంభ్రమంబును గోయష్టివదననిష్ఠ్యూతనిష్ఠురారావనిష్ఠాసౌష్ఠవంబు నుం గూడి కిటిశరభగండవేదండశార్దూలసింహగవయసృమరచమరవాతప్రమీలులాయఖడ్గరురుకురంగభల్లూక ఫేరవగోలాంగూలాది నానామృగంబుల యెలుంగులతోడఁ గీడ్పెఱసి లతాకుడుంగగర్భంబులం బ్రతిశబ్దంబు లావిర్భవింపంజేయఁ గిసలయముకుళకుసుమశలాటుఫలభరితంబై బిసరుహబాంధవునికి కిరణవిసరంబులను సొంగనీయకమసుమసుకనియిరు లసలుకొనుచు నిసుక చల్లిన రాలని పసరుఢాలవింధ్యవసుంధరాధరప్రాంతకాంతారంబు దఱిసి చనువాఁడు ముందట. 93

మ. నలినప్రోద్భవసూతి గన్గొనియై వింధ్యక్షోణిభృత్కందరా
బలవద్గండశిలాఘాతవిలుఠత్పాథస్తరంగచ్ఛటా
స్ఖలసంరంభవిజృంభమాణపటుఝంకారస్ఫుటాంతర్మదన్
గలనాతత్పరభక్తలోకపరిరక్షాశర్మదన్ నర్మదన్. 94

తే. దివిజముని నర్మదానదిఁ దీర్థ మాడి
విమలభస్తంబు నిఖలాంగకముల నలఁది
యఱుత రుద్రాక్షమాలిక లనువుపఱచి
భవుని నోంకారనాథునిఁ భక్తి గొలిచి. 95

వ. అప్పుడు. 96

తే. స్థావరం బైనరూపంబు జలదవీథి
నావరించుచు మొదల నున్నట్ల యుండ
జంగమంబైనరూపంబు నవధరించి
యెదురుగా వచ్చె వింధ్యమహీధరంబు. 97

తే. అతిథి గడునల్పుఁ డైన నత్యధికుఁ డైన
నింటి కేతేరఁ బ్రియ మందు నెవ్వఁ డేని

వానిగౌరవ మది గౌరవంబు గాని
కాదు గౌరవ మాకారగౌరవంబు. 98

సీ. మొగులు ముట్టినమహామూర్ధంబు ధర మోవఁ
బాదాంబుజములకుఁ బ్రణతిఁ జేసి
యంతరంగముకంటె నత్యున్నతం బైన
పృథుహేమసీఠంబు వెట్టఁ బంచి
దధ్యాజ్యమధుపుష్పదర్భాదికము లైన
యష్టాంగములతోడి యర్ఘ్య మిచ్చి
యాత్రాసముత్థితాయాసఖేదము వాయ
నంఘ్రిసంవాహనం బాచరించి
తే. శ్రాంతి దీఱుట యెఱిఁగి హస్తములు మోడ్చి
వినయవినమితగాత్రుఁడై విన్న వించె
తనగుహారంధ్రములు ప్రతిధ్వనుల నీన
వేల్పుఁదపసికి నిట్లని వింధ్యశిఖరి. 99

వ. మహానుభావా! భవదీయకృపాకటాక్షవీక్షాసుధారసప్రవాహంబున రజఃప్రసరంబును ద్వదంఘ్రినఖచంద్రమండలజ్యోత్స్నాసమున్మేషణంబునం దమఃకాండంబును ఖండింపఁబడియె. ఇంతగాలంబునకుఁ బ్రాగ్జన్మకృతంబు లైనసుకృతంబులు ఫలించె. విశ్వంభరాభారభరణదీక్షాధురంధరంబు లగునాకులంబు వసుంధరాధరంబులలోన మాన్యుండ నైతి ధన్యుండ; గృతార్థుండ, భాగ్యవంతుండ; అది య ట్లుండె. యుష్మత్పాదారవిందసందర్శనంబునం బ్రభవించినయానందప్రవాహం బుల్లంబున వెల్లివిరిసినకతంబున నేయర్థంబునకు నవకాశంబు లేదు. ఐనను నొక్క విన్నపంబు సావధాన మతివై యవధరింపుము. నీకు సేవాంజలీపుటంబు పంచాశత్కోటివిస్తీర్ణం బైనభూమండలఁబునందు నీవు చూడనియట్టి మహీధనంబులు లేవ. కొండలు లెక్కకుఁ బెక్కు కలుగుంగాక, యెనిమిది దిక్కుంజరంబులకు దిక్కై కూర్మంబునకు నర్మిలియై క్రీడాక్రోడంబునకుఁ దోడై పాఁపఱేనికిం బ్రాపై యేసుబోలె నెక్కటి యీసర్వసర్వంసహాచక్రంబును భరియింపంగలయదియే? మందరంబు మందరశి, నీలంబు నీలనిలయం, బస్తం బస్తవ్యస్తం, బుదయం బనభ్యుదయంబు, క్రౌంచం బకించనంబు, గంధమాదనంబు పేద, పారియాత్రం బేతన్మాత్రంబు, మలయదర్దురత్రికూటంబు లొకపాటివి, మహేంద్రనిషధద్రోణంబులు దరిద్రాణంబులు, హేమకూటంబు గిటగిటన, తక్కుఁజిఱుకొండలఁ బేర్కొనం గారణం బేమి? ఇప్పు డిప్పాట నాతోడం బ్రతిభటింపఁ గలయది సురగరుడఖచరవిద్యాధరయక్షకిన్నరగంధర్వదర్వీకరాశ్రయంబును, గల్పతరువాటికామధుగ్ధేన్దుమండలంబును, విబుధవేదండశుండాదండచుళికితోద్క్షగీర్ణస్వర్ణదీకాండగండూషితబ్రహ్మాండగోళంబును నగు సుమేరుశైలంబు, మాయిద్దఱతారతమ్యంబును నెఱుంగుదు. నాకు నగ్గిరికి నిప్పుడు గొన్ని వాసరంబులనుండి యీరసంబు పెరుఁగం గఱకఱిక నెట్టుకొని సాగుచున్నది. ఇంక నెట్లుండు? భట్టారకా! మొకమోట యుడిగి పక్షపాతంబు పరిత్యజించి యానతిమ్ము.

తే. అని యవష్టంభసంరంభ మతిశయిల్లఁ
బలుకుటయు నాత్మ గర్హించి నలువపట్టి
యొం డనాక యొక్కింతసే పూరకుండి

యుస్సు కనుచు వేఁడేనిట్టూర్పు పుచ్చి.101

వ. పదంపడి నిలింపమౌని కలహప్రియుండు గావునఁ ద్రిభువనోపద్రవకారణంబైనను నమ్మహామహీధరంబులసంఘర్షణంబునకు సమ్మతించి శక్తిసంధుక్షణార్థంబు వింధ్యంబున కి ట్లనియె. 102

శా. నాతో నీ విపు డెట్టులాడితి ప్రధానత్వం బపేక్షించి ప్ర
స్ఫీతాటోపమహాప్రతాపగుణగంభీరార్థయుక్తంబుగా
నాతో నట్లన యాడె మేరువు ప్రధానత్వం బపేక్షించి ప్ర
స్ఫీతాటోపమహాప్రతాపగుణగంభీరార్థయుక్తంబుగన్. 103

తే. నీ వెఱుంగుదు నీలావు నిక్కువముగ
నెఱుఁగుఁ దనలావు తా నమ్మహీధరముదానె
తప్పకుండ మాయిద్దఱతారతమ్య
మెంతవారును దెలియంగ నెంతవారు. 104

వ. శ్రీశైలవేంకటాహోబలశోణాద్రిసాలగ్రామాదిపర్వతంబులు మహాసుభావంబున మీయిద్దఱికంటె నధికంబులు. మీగర్వాలాపంబులు విని యోర్వవచ్చునే? మిము నే మనవచ్చును? హెచ్చుకుం దాడనేరక విషాదంబున నిట్టూర్పు నిగుడించితి. మముఁబోటి తీర్థయాత్రాపరాయణులకు నిది యేటి చింత? మీకు మే లయ్యెడుఁ బోయి వచ్చెద నని నారదుం డెందేనియుం జనియెఁ దదనంతరంబ. 105

తే. విబుధమునిమాట చెవికిఁ గ్రొవ్వేఁడి యగుడు
వంధ్యగర్వోదయుం డైన వింధ్యశిఖరి
చాల నుద్వేగ మంది విచారపరత
నాత్మగతమునఁ దాను నిట్లనుచు నుండె. 106

తే. శాస్త్ర మాచార్యసన్నిధిఁ జదువఁ డేని

నిద్ధబోధంబు మది సంగ్రహింహింపఁ డేని
దెగువ మీఱి ప్రతిజ్ఞ సాధింపఁ డేని
జ్ఞాతిజయ మందఁ డేని తజ్జనుఁడు జనుఁడె? 107

ఉ. కంటికి నిద్ర వచ్చునె? సుఖం బగునే రతికేళి? జిహ్వకున్
వంటక మిందునే? యితర వైభవముల్ పదివేలు మానసం
బంటునె? మానుషంబుగలయట్టిమనుష్యున కెట్టివానికిన్
గంటకుఁ డైనశాత్రవుఁ డొకండు దనంతటివాఁడు గల్గినన్. 108

క. ఎవ్వనితో నెచ్చోటం
జివ్వకుఁ జే సాఁపవలదు చే సాఁచినచో
నివ్వల నవ్వల నెవ్వరు
నవ్వక యుండంగఁ బగసనందీర్ప నగున్. 109

శా. ఆచందంబున నంతరంగమున కత్యంతంబుఁ దీవ్రవ్యథా
ప్రాచుర్యంబు ఘటింపఁ జాలదతిఘోరం బైనదావానలం
బేచందంబున నంతరంగమున కి ట్లీజ్ఞాతిభూభృజ్జిగీ
షాచింతాభర మావహించు నతిదుస్సాధ్యవ్యథాభారమున్. 110

సీ. భేషజం బెద్దాని భేషంపఁ జాలదు
లంఘనంబున నెద్ది లావు చెడదు
తఱిగించు బుద్ధినిద్రామహోత్సాహక్షు
ధాకారతేజోబలాది నెద్ది
నాసత్యచరకధన్వంతరప్రభృతివై
ద్యులకు నసాధ్యమై యుండు నెద్ది
దివసంబు లీరే డతిక్రమించినయప్డు
జీర్ణత్వదశ నధిష్ఠింప దెద్ది
తే. ప్రత్యహంబు నవత్వంబు వడయు నెద్ది

యట్టిచింతాజ్వరంబు త న్నలముకొనియె
నేమి సేయుదు నింక నే నెచటఁ జొత్తు
నెట్టు నిర్ణింతు మేరుమహీధరంబు. 111

క. ఉప్పర మెగసి యజాండము
చిప్పలు రాలంగ మేరుశిఖరంబులపై
గుప్పించి దాఁటుకొందునొ
తప్పక నామనసులోని తహతహ దీఱన్. 112

ఉ. ఒక్కఁడు మాకులంబున సముద్ధతిఁ జూపిన జాతరోషుఁడై
ఱెక్కలు దెంచి వేలుపులఱేఁ డటు పాపము చేసెఁ గాక యా
ఱెక్కలు నేడు గల్గిన నెఱిం గగనంబునఁ బాఱుతెంచి బి
ట్టెక్కనె కూటకోటితటు నెల్లను నుగ్గులు గాఁగ మేరువున్. 113

తే. అడుసులోపలఁ దాటిపం డదిమినట్టు
లదుముదునె కాదె పాతాళ మంటికొనఁగ
వేల్పు లెల్లను విభ్రాంతి విహ్వలింపఁ
బాదముల మెట్టినాదాయఁ బసిఁడికొండ. 114

శా. ఈయైశ్వర్యముఁ జూడఁ జాలుదునె నే నిప్పాట నానాఁటికి
న్రేయిందుగ్రహతారకంబులు పగల్ నీరేరుహాప్తుండు సే
వాయోగంబు మెయిన్ బ్రదక్షిణముగా వర్తిల్లఁగా నిర్భరా
సూయామానపరీతచేతసుఁడనై సూన్యోద్యమప్రక్రియన్. 115

తే. అడ్డపెట్టెదఁ గాక తీవ్రాంశురథము
ప్రహరిఁ దిరుగక యుండంగ భర్మగిరికి
దరతరంబ యజాండకర్పరము దాఁక
ఘనశిరశ్శృంగశృంగాటకములఁ బెంచి. 116

వ. అని యవష్టభసంరంభంబున. 117

మ. అవరోధించెను వింధ్యభూధర ముబ్రధ్నాధ్వంబు దర్పోద్దుర
వ్యవసాయోద్భవభంగి నింగి నురులింగాకారుఁడై యీశ్వరుం
డవరోధించిన గర్వరేఖ బలిదైత్యధ్వంసినారాయణుం
డవరోధించిన ఠేవమూర్ధ మొగి బ్రహ్మాండంబుతో రాయఁగన్. 118

తే. మేదినీధర మిబ్బంగి మిన్ను ముట్టి
నిట్టనిలుచుండి చూచె నిర్నిమిషదృష్టిఁ
దనయనుష్ఠానకాలంబుఁ దప్పకుండ
బ్రాహ్మణుఁడు ఱేపకడఁ బోలె భానుపొడుపు. 119

వ. [3]అంత. 120

సూర్యోదయవర్ణనము

సీ. చిఱుసానఁ బట్టించి చికిలి సేయించిన
గండ్రగొడ్డలి నిశాగహనలతకుఁ
గార్కొన్న నిబిడాంధకారధారాచ్ఛటా
సత్త్రవాటికి వీతిహోత్ర జిహ్వ
నక్షత్రకుముదకాననము గిల్లెడుపొంటె
ప్రాచి యెత్తినహస్తపల్లవాగ్ర
మరసి మింటికి మంటి కైక్యసందేహంబుఁ
బరిహరింపంగఁ బాల్పడ్డ యవధి
తే. సృష్టికట్టెఱ్ఱ తొలుసంజచెలిమికాఁడు
కుంటి వినతామహాదేవికొడుకుఁగుఱ్ఱ
సవితృసారథి కట్టెఱ్ఱచాయవేలు
పరుణుఁ డుదయించెఁ బ్రాగ్దిశాభ్యంతరమున. 121

సీ. ప్రాలేయకిరణబింబంబు వెల్వెలఁ బాఱి
యస్తాచలంబుపై నత్తమిల్ల
వరుసతో నోషధీవల్లీమతల్లుల
కాంతి వైభవలక్ష్మి కచ్చు వదల
రవికాంతపాషాణరత్నంబులం దుబ్బి
యగ్ని ప్రత్యుత్థాన మాచరింపఁ
బ్రబలాంధకారధారాచ్ఛటాపటలంబు
పంచబంగాళమై పాఱిపోవ
తే. నుదయపర్వతకటకగండోపలములఁ
బక్షమూలచ్ఛిదావ్రణప్రభవమైన
నెత్తు రనియెడు విచికిత్స నివ్వటిల్ల
భానుకిరణంబు లొకకొన్ని ప్రాఁకె నభము. 122

సీ. తఱిపివెన్నెలలోని ధావళ్య మొకకొంత
నవసుధాకర్దమద్రవము గాఁగఁ
చిన్నారి పొన్నారి చిఱుతచీకటి చాయ..
యసలుకొల్పినమఓనసము గాఁగ
నిద్ర మేల్కాంచిన నెత్తమ్మిమొగడల
పరువంపుఁబుప్పొళ్లు హరిదళముగఁ
దొగరువన్నియలేతతొలుసంజకెంజాయ
కమనీయథాతురాగంబు గాఁగ
తే. వర్ణములు గూడి యామినీవ్యపగమమున
జగము చిత్రింప దూలికచంద మైన
కులుకుఁబ్రాయంపునూనూఁగుఁగొదమయెండ
ప్రాచి కభినవమాణిక్యపదక మయ్యె. 123

తే. ప్రాగ్దిశాకాంతనిండుగర్భంబునందు
సూర్యుఁ డుదయింపఁ బ్రొద్దులు చొచ్చి యుండ
మొదలఁ దీండ్రించు లేఁతక్రొమ్మొలకయెండ
నింగి యింగిలికాన నభ్యంగ మార్చె. 124

చ. కమలము లుల్లసిల్ల రవికాంతశిలాధమనీలతాసహ
స్రములఁ గృపీటసంభవుఁడు రాజఁగఁ జీఁకటియారుసౌరుగాఁ
గుముదము నిద్రవోఁ బొడుపుఁగొండపయిన్ రవి యొప్పెఁ జూడఁగా
సమధికలీల నింద్రునిహజారపుమేడకుఁ బై(డికుండయై. 125

సీ. చరమరింఖాపుటాంచలటంకశిఖరంబు
లుదయాద్రిచఱి జాఱకుండ మోపి
తీఁగ సాగినభంగి దీర్ఘదీర్ఘము లైన
యంగకమ్ముల రాజు లలమి యెత్త
సుత్తానుఁ డై వెన్క కొరిగి పిచ్చుకకుంటు
విప్రతీపంబుఁ గా వినుతి సేయ
నపగతవ్యాసంగ మగుటఁ జిత్కారంబు
వెలిగాగఁ జక్రంబు విభ్రమింప
తే. నభ్రవీథికి లంఘించె నమ్మహాద్రి
గంధవాహప్రవాహాభిఘట్టనమునఁ
గేతనముమీఁది పసిఁడికింకణులు మొరయ
మెఱుఁగు మెఱసినచందాన మిహిరురథము. 126

సీ. ధూర్దండఘట్టనత్రుటితగ్రహగ్రా(వ)మ
ధూళిపాళిమిళద్ద్యుస్స్థలములు

ధ్వజపటపల్లవోద్ధతమరుత్సంపాత
పరికంపమానోడుపరివృఢములు
గ్రాసాభిలాషానుగతవిధుంతుదపునః
ప్రాప్తచక్రవ్యథోపద్రవములు
శ్రాంతాశ్వనిబిడనిశ్శ్వాసధారోద్ధుర
స్వర్ధునీనిర్ఝరజలభ(ధ)రములు
తే. గగనపదలంఘనైకజంఘాలికములు
పద్మ(వనజ)బాంధవనిజరథప్రస్థితములు
సాఁగె నని దక్షిణాయనసమయ మగుట
దర్దురముమీఁద మలయభూధరముమీఁద. 127

తే. నడచె భాండీరదేశంబునడిమిచాయ
గగనఘంటాపథంబునఁ గమలహితుఁడు
పాండ్యభూపాలశుద్దాంతభవన మ
దీర్ఘికలయందుఁ దననీడ తేజరిల్ల. 128

సీ. ఒకదీవి కొకకొండ యుదయాద్రియై యుండు
నది యొండుదీవికి నస్తశిఖరి
యొకదీవిఁ దొలుసంజ యున్మేషమునఁ బొందు
నుదయించు మఱుసంజ యొండుదీవి
నొక దీవి నిండుచంద్రికలు మిన్నులు వ్రాఁకు
నొకదీవిఁ బేరెండ యుబ్బి కాయు
నొకదీవి ఠవణిల్లు నొకఋతుప్రారంభ
మొకదీవి నిగురొత్తు వొండుఋతువు
తే. దక్షిణాయన మొకదీవి దళుకుఁ జూపు
నుత్తరాయణ మొకదీవి నుప్పతిల్లు

నిన్నిటికి యత్ప్రభావంబు హేతుభూత
మట్టిరవితేరు సాఁగె లంకాద్రిమీఁద. 129

సీ. మలయాచలంబుపైఁ జిలువయిల్లాండ్రుర
ఫణరత్నములయందుఁ బ్రతిఫలించి
లంకాపురంబున శాంకరీదేవర
మకుటేందురేఖతో మచ్చరించి
కాంచీపురోపాంతకంపాతరంగిణీ
నాళికావనరాజి మేలుకొలిపి
ద్రవిళసీమంతినీస్తనమండలంబుల
నవకంపుఁజెమటబిందువుల నిలిపి
తే. సహ్యగిరిరాజకన్యకాజలనిధాన
సలిలహాళిపరస్పరాస్ఫాలనోత్థ
కణలవాసారనీహారగంధవాహ
సంగమంబులఁ బథపరిశ్రాంతిఁ దొఱఁగి. 130

వ. ఇవ్విధంబున దక్షిణాపథంబునం జనునప్పుడు. 131

సీ. విసృమరధ్వాంతౌఘవిధ్వంసనక్రియా
బరమదీక్షారంభగురుమయూఖ
దశశతపరిషదాధారమండలుఁ డైన
చండభానుని కధిష్ఠాన మగుట
భారంబు భరియింప బరువుపడ్డది వోలె
మూఁపుమూఁపున నంది(టి) మొక్కలముగ
ననిలంబు లేడును నంచెలంచెలు గట్టి
యాకాశవీథి నందంద నడవ

తే. నడచురవితేరు మింటినన్నడిమిచక్కిఁ
బ్రగ్గనఁగఁ దాఁకె వింధ్యపర్వతముచఱులఁ
గఠిననిర్ఘోషనిర్ఘాతఘట్టనమునఁ
బంకజాతభావాండకర్పరము వగుల. 132

క. తగులువడి యపుఁడు వడి సెడి
గగనమణిరథంబు దోరగలువడి నిలిచెన్
బొగరు మొగకడలియక్కిలి
దగిలి నిలువఁబడినకలపతతియుంబోలెన్. 133

క. ఒక్కనిమేషము రాహువు
పుక్కిటిలోఁ దగులువడక పోయెడుభానుం
డిక్కొండ ప్రక్కఁ జిక్కెం
బెక్కేఁడులు విధివశంబుపెం పెట్టిదియో? 134

తే. రెండువేలును నిన్నూటరెండుయోజ
నంబు లతనిమేషమాత్రంబునందు
నంబరంబునఁ బాఱుతీవ్రాంశురథము
నిలిచె బహుకాల మిట్టిదే నియతిమహిమ. 135

క. స్థితిసర్గవిసర్గములకు
గతి భానుఁడు గేవలంబ కాన తదీయ
ప్రతిబంధము త్రైలోక్య
ప్రతిబంధంబై విపత్పరంపరఁ బెనచెన్. 136

సీ. లేవయ్యె స్వాహాస్వధావషట్కారంబు
లుడివోయెఁ ద్రేతాగ్నిపహోత్రవిధులు
కాలంబుకొలఁది లెక్కలు పెట్ట నేరక
చిత్రగుప్తాదులు చిక్కువడిరి

యిది సంజ యిది రాత్రి యిది వాసరం బను
సమయపర్వంబులు సంక్రమించె
సావితో వర్షంబు సమకూరకుండుటఁ
బంటలు లేవయ్యేఁ బాఁడిదొరగె
తే. కొన్నిదేశంబు లెండచే గుమిలిపోయెఁ
గొన్నిదేశంబు లీదచేఁ గొంకువోయెఁ
గొన్నిదేశంబు లిరులచే గుడ్డివడియెఁ
గొన్నిదేశంబు లివచేతఁ గుందుపడియె. 137

సీ. పూచినకొరవిపూఁబొదరింటిచందానఁ
గత్తెర యొక్కచోఁ గదలకుండె
నొకచోఁ దగుల్పడె సుపకారికొఱటికిఁ
దర మైనరోహిణీతారకంబు
నొకచోఁ బునర్వసు పూఁగె వృక్షముకొమ్మ
సుడిబడ్డముత్యాలజోఁగువోలె
శయనించె నొకచోట శ్రవణనక్షత్రంబు
గుంటెమీఁదటి ప్రత్తికొడుపువోలె
తే. స్వాతిచిత్తలు తోరణస్తంభయుగము
ననుకరించుచు నొక్కచో నత్తమిల్లెఁ
జిఱువవోయినమూఁకుటిచెలువుఁ దాల్చి
హత్తె నొకచో విశాఖ వింధ్యాద్రియందు. 138

సీ. నేత్రంబు లున్మేషనిస్పృహత్వము నొంద
శ్రుతిపుటంబుల శక్తి చొక్కుమడఁగ
జ్ఞానేంద్రియజ్ఞానకళ లౌరుసౌరుగా
జిహ్వవివేకంబు చిదువవోవ

నంతరంగమున మహాంధకారము గ్రమ్మఁ
దనువు చేష్టాదరిద్రత వహింపఁ
బ్రాణముల్ శ్వాసమాత్రమునఁ బర్యవసింపఁ
దలచీర యెఱుగనిదశ ఘటిల్లఁ
తే. బాము గఱచిన మూర్ఛిల్లి పడినయట్లు
వితతనిద్రాసమావేశవివశు లగుచు
తరణిదీధితి లేమిఁ జైతన్య మెడలి
పడిరి పాశ్చాత్యదేశంబుపంచజనులు. 139

వ. అనిన విని నైమిశారణ్యమునీశ్వరు లటమీఁది వృత్తాంతం బెయ్యవి యని యడిగిన. 140

ఆశ్వాసాంతము

శా. పారావాకపరీతవిశ్వధరణీభారోద్ధతీవ్రక్రియా
ధౌరంధర్య! సరోరుహేక్షణ! సమిద్గాండీవకోదండ! దా
క్షారామప్రమాదాకఠోరకుచకుంభాభోగసంకౢప్తక
స్తూరీస్థాపకముద్రితస్థగితవక్షోవీథికాభ్యంతరా! 141

క. వేమాంబాప్రియనందన!
హేమాచలధీర! భువనహితచారిత్రా!
వేమాధిపాసుసంభవ!
రామారతిరాజ! రాజరాజకిరీటా! 142

భుజంగప్రయాతము.
హరశ్రీపదాంభోరుహద్వంద్వపూజా
పరాధీన! కారుణ్యపాథోనిధానా!

కురంగేక్షణాపుష్పకోదండమూర్తీ!
శరచ్చంద్రికాస్నిగ్ధసంసిద్ధకీర్తీ! 143

గద్య. ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతంబైన కాశీఖండం బనుమహాకావ్యంబునందుఁ బ్రథమాశ్వాసము.

  1. పురాణతత్త్వము ప్రియంబున
  2. పురాణతత్త్వము ప్రియంబున
  3. ఇయ్యది కొన్ని మాతృకలలో లేదు.