కాశీఖండము/సప్తమాశ్వాసము

వికీసోర్స్ నుండి

సప్తమాశ్వాసము

శ్రీరాజరాజ! సుగుణా
ధార! ధరాభరణకరణధౌరంధర్య
స్ఫారభుజార్గళ! భక్తిస
మారాధితభుజగహార! యల్లయవీరా!

1


వ.

అక్కథకుండు శౌనకాది మహామునుల కి ట్లనియె.

2


ధర్మరాజేశ్వరలింగమాహాత్మ్యము

తే.

దృఢవివేక! ధర్మతీర్థేశ్వరమహిమ
యబ్జజున కైన వర్ణింప నలవి యగునె?
యమ్మహానేత్రమున నున్నయండజములు
బ్రహ్మవిజ్ఞానవాసనాప్రవణమతులు.

3


వ.

కాశీమధ్యంబున ననర్ఘ్యమణినిర్మితం బై, మోక్షలక్ష్మీవిహారస్థానం బై, సముత్తంభితశాతకుంభకుంభమండలీమండితసుధాధవళసౌధవీథీవిభ్రాజితం బై, యవతరణరభసశీర్ణస్వర్ణదీస్రోతశ్శలాకానుకారిపుంగవపతాకాలంకృతం బై గవాక్షవివరోదీర్ణగుగ్గులుమహిసాక్షిధూపధూమరేఖాస్మారితస్మరహరకంఠమూలకఠోరకాలకూటవిషచ్ఛాయాఛటాగుళుచ్ఛం బై యుండు ముక్తిమంటపంబునకు ముక్కంటి మధ్నాహ్నకాలంబున బ్రాహ్మణవేషంబున వైశ్వదేవబలి

హరణంబులు సేయు మహాప్రాసాదంబునకు నింద్రదిగ్భాగంబున జ్ఞానమంటపంబునందు బాలేందుధరుండు దక్షిణామూర్తిస్వరూషంబు ధరియించి బ్రహ్మాదులకు జ్ఞానోపదేశంబు సేయుఁ; దత్ప్రాంతంబున విశాలాక్షీహర్మ్యంబునందును బ్రతివాసరంబును గుతపకాలంబునందు.

4


సీ.

పసిఁడికమ్ములతోడి కుసుమపూవన్నియ
        నిద్దంపుఁబుట్టంబు నెఱిక గట్టి
యింద్రనీలములతో నెడకట్టి గ్రుచ్చిన
        రమణీయతారహారము ధరించి
పారిజాతకతరుప్రసవగర్భితమైన
        కబరిపైఁ జెంగల్వకచ్చు నిలిపి
ఫాలభాగంబునఁ బన్నీట మేదించి
        కమ్మకస్తురితిలకమ్ము దీర్చి


తే.

వలుఁదచన్నుల జిలుగుఁగంచెలనుఁ దొడిగి
కటిభరంబున వజ్రాలకాంచిఁ దాల్చి
యరసి యాఁకొన్నవారికి నమృతభిక్షఁ
గరుణ నిడు శ్రీవిశాలాక్షి కాశియందు.

5


వ.

విశాలాక్షీపీఠస్థానంబునకు సమీపంబునఁ జంద్రపుష్కరిణీతీర్థంబు.

6


తే.

భవ్యతరనిష్ఠ నుభయదర్భలను దాల్చి
సంధ్య వారుచుఁ జంద్రపుష్కరిణియందు
ఫాలనేత్రుండు దారకబ్రహ్మమంత్ర
వర్ణకర్ణజాపుఁడు ప్రతివాసరమున.

7


వ.

ఆతీర్థంబునకు ననంతరంబున రత్నేశ్వరలింగంబు, తత్సమీ

నంబున వృషభధ్వజలింగంబు, తత్సమీపంబున నర్థనారీశ్వరపీఠంబు, తత్సమీపంబునఁ బంచనదతీర్థంబు, తత్సమీపంబునఁ బంచముద్రమహాపీఠంబు, తత్సమీపంబున వీరేశ్వరలింగంబు, తత్సమీపంబున సిద్ధేశ్వరలింగంబు, తత్సమీపంబున యోగినీపీఠంబు.

8


తే.

కలవు పీఠంబు లానందకాననమున
[1]జెట్టు వ్రేసినచోట దాక్షిణ్యపుణ్య!
యర్థవాదంబు కాదు సత్యంబ కాని
పెద్దపీఠంబు ధర్మేశపీఠకంబు.

9


విశ్వభుజాఖ్యానము

క.

విశ్వభుజాగౌరీపర
మేశ్వరి సేవించి యందు నింద్రాణి సమ
గ్రైశ్వర్యము సౌభాగ్యము
శాశ్వతముగ భర్తసంప్రసాదముఁ గాంచెన్.

10


వ.

విశ్వభుజాదేవి మనోరథతృతీయావ్రతంబున నారాధించి శచీదేవి యింద్రుని, నరుంధతి వసిష్ఠు, ననసూయ యత్రిని, సునీత యుత్తానపాదుని భర్తలం గా వరంబు వడసిరి. ఈవిశ్వభుజాదేవిసమీపంబున నాశావినాయకుండు ప్రణతాఖిలభక్తజనమనోరథసిద్ధిదాయకుం డై యుండు.

11


తే.

వృత్రవధయాదిగాఁ గలవృజినములకు
శాంతి గాఁ కాశికాపురి జంభభేది
ధర్మపీఠంబునకు నుపాంతంబునందు
నిష్ఠతో శంభులింగప్రతిష్ఠ చేసె.

12

ధర్మేశమాహాత్మ్యము

వ.

ధర్మంబు బ్రహ్మహత్యాదిపాపంబుల నపనయింగంజాలుఁ, దారకేశ్వరునకుఁ బశ్చిమభాగంబున నింద్రేశ్వరుండు, దక్షిణభాగంబున శచీశ్వరుండును, నింద్రేశ్వరుం బరివేష్టించి లోకపాలేశ్వరులును, ధర్మేశ్వరునకుం బశ్చిమభాగంబున నూర్వశీశ్వరుండును, ధర్మేశ్వరునకుఁ నాలుగు దిక్కుల దత్తేశ్వర వైరాగ్యేశ్వ జ్ఞానేశ్వ రైశ్వర్యేశ్వరులును నుండ్రు. కదంబశిఖరంబున వింధ్యపాదంబున దమునికొడుకు దుర్దముం డనువాఁడు జరాభారపీడితుండై యొక్క పుణ్యపురుషువలన జ్ఞానోపదేశంబు వడసి కాశికిం జని లింగప్రతిష్ఠ చేసె. ఆదుర్దమేశ్వరుఁడు భజించువారలకు భోగమోక్షప్రదాయకుండై యుండు. అమిత్రజి త్తనురాజు విష్ణుభక్తిపరాయణుండు నారదునుపదేశంబువలనఁ గంకాలకేతుం డనురాక్షసునిచేత నపహరింపఁబడి పాతాళలోకంబునం జంపకావతి యనుపట్టణంబుననుండి కమలగంధి యనువిద్యాధరకన్యకం బెండ్లియాడి యానందకననంబున కరిగి వీరేశ్వరదివ్యలింగస్థానంబునం దనకంత మనోరథతృతీయావ్రతంబు నోమించి పుత్రవంతుఁ డయ్యె.

13


తే.

మఱి హయగ్రీవంబు మౌనివర్య!
కాశికాతీర్థములలోన ఘనము మహిమ
నంతకంటెను గజతీర్థ మభ్యధికము
ప్రథమఁ గోలావరాహతీర్థంబు నట్ల.

14


వ.

దిలీపతీర్థంబు సప్తమునితీర్ణంబు హంసగోవ్యాఘ్రేశ్వర ముచుకుంద పృథు పరశురామ బలభద్ర దివోదాస హరత్పాపదశా

శ్వమేధ బదరీశుకశుకభవానీప్రభాస గరుడబ్రహ్మవృద్ధార్కనృసింహచైత్రరథధర్మవిశాల లలితాగౌతమీ గంగా కేశవ నర్మదా వసిష్ఠ మార్కండేయ భాగీరథీ ఖురకర్తరీదివిషత్ హయతీర్థంబు లనునివి మహాపుణ్యతీర్థంబులు.[2]

15


తే.

ఇప్పుడు చెప్పినతీర్థంబు లెన్ని గలవు
వీని నన్నిటి రాశి గావించి యందు
మూఁడుకోటులు శివలింగములను నిలిపి
రెలమి నవియు వీరేశ్వరు నెనయలేవు.

16


వీరేశ్వరాఖ్యానము

తే.

అర్థి నేతీర్థమునఁ దీర్థ మాడె నెవ్వఁ
డతని కాతీర్థమాడిన యంతఫలమె
అనఘ! వీరేశతీర్ధ మాడిననరుండు
కాంచు నిశ్శేషతీర్థావగాహఫలము.

17


తే.

కమలగంధితనూజుఁడు కలశజన్మ!
వీరుఁ డనువాఁడు హరుని (భక్తి) సేవింపఁబట్టి
యబ్బె శివునకు వీరేశుఁ డనెడునామ
మనఘ! యానందకాననాభ్యంతరమున.

18


వ.

మఱియు సంగమేశ్వరతీర్థంబు పాదోదకతీర్థంబు క్షీరాబ్ధితీర్ణంబు శంఖతీర్థంబు మఱియుఁ జక్రపద్మగరుత్మద్వైకుంఠ నారద ప్రహ్లాదాంబరీషాదిత్యకేశవ దత్తాత్రేయ భార్గవ వామన నీలగ్రీవోద్దాలక నరనారాయణ యజ్ఞవరాహ విదారణ నరసింహ లక్ష్మీనృసింహ గోపీగోవింద శేషసాంఖ్య మహిషాసురబాణ వైతరణీప్రణవపిశంగిలా పిలిప్పిలానాగే

శ్వర కర్ణాదిత్య భైరవ ఖర్వనృసింహ పంచనదతీర్థంబులు భోగమోక్షప్రదంబులు.

19


స్రగ్ధర.

ఆనందారణ్యభూమధ్యమునఁ గలవుఁ గో ట్యర్బుదన్యర్బుదంబుల్
నానాముక్తిపదంబుల్ నలినజమురభిన్నాకరాడ్వంతంబుల్
స్నానంబుల్ గల్గ నీపంచనదమను మహాశంభుతీర్ధంబుతోడన్
వానిన్ సామ్యంబు సేయన్ వలదు బహులనిర్వాణలక్ష్మీసమృద్ధిన్.

20


వ.

మఱియు జ్ఞానప్రపాతంబు మంగళతీర్థంబు, మయూఖాదిత్యతీర్థంబు, మఖతీర్థంబు, బిందుతిర్థంబు పిప్పలా(ద)తీర్థంబు, మఱియు వరాహమరుత్తేశ్వరమిత్రావరుణాగ్న్యంగార కాకోలచంద్ర విఘ్నేశ్వర హరిశ్చంద్ర పర్వతకంబలాశ్వతరసరస్వత్యుమాభౌమ మణికర్ణికాతీర్థంబు లివి తీర్థోత్తమంబులు ముక్తిదాయికంబులు.

21


తే.

వింటి వీవు తీర్థంబులు వేనవేలు
కలశసంభవ! చెప్పితి గారవమున
హెచ్చు గుందడఁగాఁ గూడదిల్వలారి!
యన్నిటికిఁ బెద్ద మణికర్ణి యని యెఱుంగు.

22


ఆ.

అని దశాశ్వమేధ మర్ఘ్యంబు తీర్థంబు
పంచనదము కాశిఁ బస గలయది
వానికంటెఁ బెద్ద వాతాపితాపన!
చక్రపుష్కరిణి యసంశయంబు.

23

దుర్వాసోలింగమాహాత్మ్యము

వ.

ఇందు దుర్వాసేశ్వరలింగమాహాత్మ్యం బభివర్ణించెద నాకర్ణింపుము.

24


తే.

సకలదేశంబులందును సంచరించి
ఋషివరేణ్యుఁడు దుర్వాసుఁ డేగుదెంచె
నఖిలముక్తివధూవిహారావరోధ
సౌధవీథికిఁ గాశికాస్థానమునకు.

25


వ.

ఇట్లు వచ్చి యమ్మహాభాగుండు భాగీరథీనదీమాతృకంబులై ముక్కారును బండు పంటవలంతికేదారక్షేత్రంబులు, నిర్ధూతకలధౌతశలాకాశకలశంక నంకురింపఁ జేయఁ జాలు క్రొత్తమొలక లొత్తునవియును, సుకుమారశుకచ్ఛదచ్ఛటాదాయాదంబులై యడ్డపచ్చఁ గొనునవియును, నార్యావర్త దేశమత్తకాశినీజంఘాకాండ పాండిత్యంబు గండూషించి చిగురుపొట్టలఁ గనుపట్టునవియును, బదియాఱువన్నియకడానికుందనంబు హెచ్చు కుందాడుపసిమిఁ బచేళిమంబు లగునవియు నైన ప్రాసఁగుంజేలును, వికటఘటీయంత్రప్రాంతవాపికాసలిలధారాధోరణీప్రవాహసేకసంవర్థితంబు లై జంబూజంబీర నారికేళ పనస సహకారకురవకవకుళాశోకశాకోటకుటజముఖ నిఖిలవిటపివాటికాభిరాామంబులైన యారామంబులును, సముద్దండపుండరిక కువలయ కుముదషండమండితంబు లగుతీర్థకుండంబులును, [3]నారసాతలగంభీరరసలిలసంభారంబు లైన పరిఖాచక్రంబులును, గనకగిరిప్రదీప్తవప్రాకారంబు లగు ప్రాకారంబులునుం గనుంగొనుచు, భూర్భువస్వర్మహాలింగ

మకుటగంగాతరంగకూటకోలాహలవ్యాజృంభి సముత్తంభితశాతకుంభసౌధ వనచంద్ర శాలావలభిగర్భక్రోడంబులును, ఖఖోల్కాదిత్యప్రత్యగ్రకిరణకందళీ సందోహస్పందకందళిత మందాకినీకనకారవిందకాననంబును, బైగిషవ్యేశ్వరభూషాభుజంగ ఫూత్కారపవనధారాతరంగితోత్తుంగపుంగపతాకాకౌశేయపట్టపటీవల్లీవేల్లితనభోంగణంబును, వికటాదేవీ కరకఠోరడమురుఢాంకారబృంహితబహ్మాండమండలంబును, ద్రుమిచండవతీ కరాళకంఠ మూలకాకోలవిషమషీవిసృత్వరాాంధకారచ్చటాసంఘాతజ్యోతిర్లింగాయమాన శశిపతంగసమండలంబును, మహేశ్వరివాహనవృషలంబకగళకంబళకషణమసృణత్వ క్శాఖాస్కంధపరిణాబంధువరణాసింధురోధః ప్రత్యాసన్నచైత్రద్రుమంబును, డుంఠిరాజశుండాకాండచుళికితోన్ముక్తజ్ఞానవాపికాసలిలనిర్ఝరజలాంతరిక్షంబును, గ్రోధభైరవప్రబలహుంకారకఠినతరకహకహాట్టహాసముఖరిత ప్రాకారగోపురాట్టాలకంబును, గర్మబీజంబులకుఁ నూషరంబును, బుట్టువులకు వీడుకోలును, గలుషంబులకుఁ గర్తరియును, మంగళంబులకు నాస్పదంబును, గైవల్యంబునకు ఘంటాపథంబును, జ్ఞానంబులకుఁ దానకంబును, విరక్తికి నెలవును, విభవంబులకుఁ బ్రభవంబును, విలాసంబులకు నివాసంబును నయిన కాశికాపట్టణంబుఁ బ్రవేశించి.

26


తే.

తపసి పెద్దయుఁగాలంబు తపము సేసి
కాలగళువీట నానందకాననమున

ఫలము గడుదూర మైనఁ గోపంబు పుట్టి
కాశినగరంబు శపియింపఁ గాఁ దలంచె.

27


వ.

అప్పుడు ప్రత్యక్షంబై.

28


చ.

కహకహ నవ్వె దంష్ట్రి కలగల్ల మెఱుంగులు భానుదీప్తిసం
గ్రహముఁ దిరస్కరింప శతకంఠుఁ డకుంఠితరోషదీప్తుఁ డై
యహహ! దురాత్మ! కాశిపయి నల్గెదవే? యనుపల్కు పల్కి యా
గ్రహమున నేను డుంఠిగణరాజు నెదిర్చితి మమ్మునీంద్రునిన్.

29


వ.

అప్పుడు.

30


సీ.

నందిషేణువిలోచనముల నిప్పులు రాలె
        శూలంబు చేనందె సోమనంది
మృత్యు ప్రకంపను మే నెల్లఁ జెమరించె
        దండుఁ డాస్ఫోటించె ధరణి వగులఁ
గుంభోదరుండు భ్రూకుటి ఫాలమునఁ బూనె
        కోకిలాక్షుఁడు పండ్లు గొఱికికొనియె
అగ్నిజిహ్వుండు ఘోరాట్టహాసము సేసె
        గృత్తివాసుండు హుంకృతియొనర్చె


తే.

భృంగితండులు తాండవప్రియుఁడు రేగి
డమరుగంబులు వాయించి రమితపటిమ
రాజరేఖాధరుండు దుర్వాసుమీఁద
నలుగు టెఱిఁగి తదీయరోషానువృత్తి.

31


శా.

ఆభుగ్నభ్రుకుటీకరాళముఖులై యంగంబు లుప్పొంగ ద్యా
వాభూమ్యంతర మట్టహాసడమరుధ్వానంబులన బిట్టు సం
క్షోభింపం బ్రమథధ్వజిన్యధిపతు ల్కుంభోదరాదు ల్మహా
భూభృత్సన్నిభు లంఘ్రులన్ ధరణి యాస్ఫోటించి తాటించుచున్.

32

క.

జడముడులు సడల భ్రుకుటులు
ముడివడఁ గనుఁగడలఁ గెంపు మొలతేరంగా
మృడుప్రమథులు పులితోలుం
గడవసములు వి(ను)డిచికొనుచుఁ గడురభసములన్.

33


ఉ.

చంపుదుమే కృతాంతు? శిఖిచండమయూఖుల బారిగొందుమే?
డంపుదుమే కుభృత్పరివృఢంబుల? మొత్తుదుమే యజాండములన్?
జింపుదుమే చతుర్దిశలు జృంభితబాహుపరాక్రమక్రియా
సంపద సొంపు మీఱఁ? [4]బురసంహరునానతి యింత గల్గినన్.

34


వ.

అని వెండియు.

35


తే.

మాటిమాటికిఁ గోపసంభ్రమముపేర్మిఁ
గక్షపాత్రంబులం దున్నకర్మభూతి
వదనములఁ బ్రామికొనుచు నిర్వక్రలీల
'హరహరా!' యని పల్కి రత్యాగ్రహమున.

36


వ.

అప్పుడు దుర్వాసుండు శర్వాణీపతికి దండప్రణామంబు లాచరించి తలవకారముండక ఛాందోగ్యశ్వేతాశ్వతరాద్యుపనిషదర్థగర్భితంబు లైనబహువిధస్తోత్రసందర్భంబుల నమ్మహాదేవుం బ్రస్తుతించె. శివుండునుం బ్రసన్నుండయి యమ్మునీంద్రునకుం గోరినవరంబు లొసంగి యంతర్హితుం డయ్యె. ననంతరంబ.

37


తే.

అమ్మునీంద్రుండు దనపేర నధికభక్తిఁ
గాశియందుఁ బ్రతిష్ఠించెఁ గాలకంఠు

దివ్యలింగంబు భాగీరథీతటంబు
నందు మణికర్ణి కాహ్రదోపాంతభూమి.

38


విశ్వకర్మేశ్వరలింగప్రాదుర్భావము

వ.

దూర్వాసేశ్వరలింగంబు సర్వాభీష్టఫలప్రదాయకంబు. మఱి విశ్వకర్మేశ్వరలింగంబు ప్రాదుర్భావంబు వివరించెద సావధానమతివై యాకర్ణింపుము. త్వష్టృప్రజాపతికొడుకు విశ్వకర్మ బ్రహ్మచర్యంబున భిక్షాన్నభోజియై గురుగృహవాసియై విద్యాభ్యాసంబు చేయుచుండె నంత.

39


సీ.

వానకాలము వచ్చె వర్షంబు లందందుఁ
        జడివట్టి కురిసె నాసావియందు
గురుఁడు నాకొక్కమందిరము నిర్మింపుమీ
        వర్షధారలచేత నుఱియకుండ
గురుపత్ని నాకొక్కకుపసంబుఁ గుట్టుము
        చలిగాలి యొడలిపైఁ బొలయకుండ
గురునందనుండు నాకు రచింపు పావాల
        నడుసు పాదంబుల నంటకుండ


తే.

గురుతనూభవ నాకు బంగరువుతొడవు
[5]వజ్రభూషలు సేయు తాల్పంగవలయు
ననుచుఁ బ్రార్థించి రందఱ కతఁడు మ్రొక్కి
యిన్నియును దాను గల్పింప నియ్యకొనియె.

40


వ.

ఇవ్విధంబున గురునకు గురుపత్నికి గురుపుత్రులకు గురుతనూభవకు, వారలు కోరినయర్థంబులు సంఘటింప నను వెఱుంగక చింతాక్రాంతుండై యుండెనంత దైవయోగంబున

నొక్క పుణ్యపురుషునుపదేశంబునం గాశి కరిగి శివలింగంబుఁ బ్రతిష్ఠించి పరమనిష్ఠం బెద్దకాలంబు తపం బాచరింప బ్రత్యక్షంబై విరూపాక్షుం డనుగ్రహింప సర్వధాతువులకు, సర్వదారువులకు, సర్వశిలలకు, సర్వమణులకు, సర్వరత్నంబులకు, సర్వపుష్పంబులకు, సర్వవస్త్రంబులకు, సర్వసుగంధంబులకు, సర్వకందమూలఫలంబులకు, సర్వచక్రంబులకు
దాన కర్త యగునట్లుగా వరంబు పడసి, గురుజనంబుల యాజ్ఞ చెల్లించి సర్వోపకారపరుం డయ్యె. అతనిపేరఁ గాశి విశ్వకర్మేశ్వరుండు విశ్వాభీష్టఫలప్రదాయకుండయి యున్నవాఁ డింక దక్షేశ్వరలింగ ప్రాదుర్భావంబుబు వివరించెద.

41


దక్షేశ్వరలింగప్రాదుర్భావము

ఉ.

సామజదైత్యశాసనుఁడు సారసగర్భుఁడు నచ్యుతుండు సు
త్రాముఁడు నాది గా సురకదంబము గొల్వ నశేషలోకర
క్షామహనీయతన్ రజతశైలముపైఁ గొలు వుండె శుద్ధము
క్తామణిభూషితం బయిన కాంచనహర్మ్యశిలాతలంబునన్.

42


వ.

తదనంతరంబ.

43


తే.

వేలుపుల నెల్లఁ బరిపాటి వీడుకొలిపి
సముచితం బైనతారతమ్యమున శివుఁడు
మఱచె దక్షప్రజాపతి మామ ననుప
నెట్టివారికి మఱపు లేదే యొకపుడు?

44


వ.

ఖిన్నుం డై యతం డుస్సురని నిజస్థానంబునకుం బోయి నిజాంతర్గతంబున.

45


సీ.

ఇతనివంశం బెద్ది యెఱుఁగంగ వచ్చునే?
        యితనిగోత్రం బెవ్వఁ డెఱిఁగినాఁడు?

దేశంబు గుఱుతు సాధింపంగ వచ్చునే?
        వర్తనం బెఱుఁగంగ వచ్చు నెట్లు?
వృషభవాహనుఁ డఁట విషముఁ దిన్నాఁడఁట!
        యితనిసమాచార మేమి చెప్ప!
యస్త్రంబు ధరియిచు నఁట తపస్వియు నట్టె!
        యిట్టివేడబము లెయ్యెడలఁ గలవె?


తే.

కాటిలో నుండు గార్హస్థ్యగణన యెట్లు?
బ్రహ్మచారియు గృహియు నెబ్భంగి నయ్యె!
శూద్రుఁడో! బ్రాహ్మణుండొ! వైశ్యుండొ! రాజొ!
తెలియవచ్చునె యీతని కల తెఱంగు?

46


వ.

అర్ధనారి గావునం బురుషుండు గాఁడు; గడ్డంబు గలదు గావున యోష గాదు; సమర్చనీయలింగమూర్తి గావున నపుంసకుండు కాఁడు; పెద్దకాలంబువాఁడు గావున బాలుండు గాఁడు; చిరంతనుండు గావునఁ దరుణుండు కాఁడు; జరామరణవర్జితుండు గావున వృద్ధుండు గాఁడు; మహాకల్పాంతంబునం బ్రహ్మాదుల వధియించియుఁ బాతకి కాఁడు; ఈతనిచందం బెవ్వం డెఱుంగు. నది య ట్లుండె.

47


క.

మామ గురుస్థానంబు న
సామాన్యుఁడ నెట్లు? జలజసంభవసుతుఁడన్
సౌముఖ్యంబున యోగ
క్షేమం బారసి ప్రియంబు చెప్పఁగవలదే!

48


క.

మాతాపితృవర్జితుఁ డగు
[6]నీతని కే నెట్లు బిడ్డ నిచ్చితి? నవియున్

నాతప్పు గాక యిది తా
నీతనితప్పెట్లు? నాకు నిది కావలయున్.

49


తే.

పేద లయ్యును గడు బిఱ్ఱబిగిసి యుండ్రు
వట్టియభిమానములును గర్వములుఁ బట్టి
యల్లువారికి నెల్ల నీయవగుణంబు
వెన్నతోఁ బెట్టినది యింత విసువ నేల?

50


తే.

అహహ! [7]యలచంద్రుఁ డనువాఁ డహంకరించి
రోహిణీదేవి నొల్లక రోసి యుండెఁ
బాపి నతని క్షయవ్యాధిబాధితుఁడుగఁ
గినిసి శపియింపనే? కల్ల వినఁగ నోర్వ.

51


క.

ఇది ధర్మం బకులీనుల
కిది విధి మాతాపితృప్రహీనుల కహహా!
యిది కట్టడి తిరిపెములకు
నెదిరిం దను నెఱుఁగ కునికి యేలా మాటల్?

52


శా.

తా నెట్లేనిఁ దిరస్కరించె నను నాస్థానంబునం దేవతా
మౌనివ్రాతములోన మామ యనుసన్మానంబు శూన్యంబుగా
నేనుం దన్నుఁ దిరస్కరించెద మఘం బిప్పాటఁ గల్పించి సం
స్థానీయత్వముఁ బూని యల్లుఁడను సన్మానంబు శూన్యంబుగన్.

53


వ.

అని యజ్ఞసంభారంబు లొడంగూర్చి యజ్ఞపురుషుం డైనపురుషోత్తముం డుపద్రష్టగా, బ్రహ్మవాదు లగుమరీచ్యత్రిభరద్వాజాదిసప్తర్షులు ఋత్విజులుగాఁ, ద్రైలోక్యంబును దక్షిణాద్రవ్యంబుగా, భృగుండు బ్రహ్మగా, నాంగిరసుం డాచార్యుం

డుగా, భగపూషాదులు సదస్యులుగా, దిక్పాలకులు రక్షకులుగా, నల్లురు ధర్ముండును జంద్రుండును గశ్యపుండు సహాయులుగాఁ, గామధేనువు హవిస్సును గల్పవృక్షంబులు సమిత్కుశంబులును విశ్వకర్మ దారుపాత్రశకటమంటపాలంకారంబులును గల్పించువారుగా, ధర్మపత్ని యగు శతరూపాదేవితోఁ గూటి మహాధ్వరంబు సేయం దొడంగె నంత.

54


తే.

అరణిసంగ్రహ మొనరించి యజునిపట్టి
పెద్దకొలు వుండె ముత్యాలగద్దె యెక్కి
చుట్టు బలిసి కూర్చుండిరి సురలు మునులు
వింజ మాఁ కిడిన ట్లుండె విశ్వసభయు.

55


వ.

అప్పుడు పరమమాహేశ్వరుం డగు దధీచి యనుబ్రహ్మర్షి సభామధ్యంబున నిలిచి యెల్లవారును విన ని ట్లనియె.

56


సీ.

భారతీదేవి [8]కైవారకావ్యంబులు
        పఠియించుచున్నది ప్రస్ఫుటముగ
నాచార్యపదవికి నర్థిమై నాయితం
        బైయున్నవాఁ డుచధ్యానునుజుండు

కర్మకాండవిదుండు గాచియున్నాఁడు బ్ర
        హ్మత్వమునకు క్షణం బంది భృగుఁడు
గట్టువా లై లక్ష్మి కై సేయుచున్నది
        చేరి యంతఃపురస్త్రీజనముల


తే.

దేవి శతరూప జాలియఁ దీర్చె మౌళి
నీవు దీక్షిష్యమాణుండ విద్ధమహిమ
నధ్వరారంభ మిం తొప్పు నయ్య! దక్ష!
శివునిఁ దోడ్తే్నియొక్కయొచ్చెంబు తక్క.

57


క.

అపరాధ మింక నెట్టిది?
చెపుడా! మఖమునకుఁ దన్నుఁ జీరినమాత్రన్
ద్రిపురాంతకుఁ రప్పింపక
యుపదర్శన మాచరింప నుచితమె హరికిన్.

58


క.

వామాంగము వైకుంఠుఁ డ
వామాంగము వేధ మదనవైరికి నని యో
సోమష! యెఱుఁగుదొ? యెఱుఁగవొ?
యామృడు రప్పింపవలదె యధ్వరమునకున్?

59


సీ.

శితికంధరునకు నెచ్చెలికాఁడు గాఁ డొకో
        యటమటీఁ డైనయీయక్షభర్త?
యహికంకణునకు మూఁడవకన్ను గాఁ డొకో
        పాల్మాలినట్టి యీపావకుండు?
పురవైరి కవతంసపుష్పంబు గాఁ డొకో
        నిర్భాగ్యుఁ డైనయీనీరజారి?
గంగాధరునకు లెంకలలెంక గాఁ డొకో
        పెనుగూళ యైనయీయనిమిషేంద్రుఁ?

తే.

డేమి గుడువంగ వచ్చినా రిండ్ల విడిచి
హనుని వెలివెట్టినట్టి యీయాగమునకుఁ?
బంచవదనునికను జేవుఱించె నేని
తత్క్షణంబున తమయాండ్రతాళ్లు దెగవె?

60


తే.

ఏల వచ్చినవాఁడు బాలేందుమౌళి
నిరహితం బైనయీయాగవిధికి జముఁడు?
మఱచెనే శూలి డాకాలిమడమతాకు
దీర్ఘనిర్ఘాతసంపాతనిర్ఘృణంబు.

61


క.

వినరే! ‘శ్వేతాశ్వతరో
పనిషత్తు హరుండు భోక్త భర్గుఁడు భోగ్యం
బనిలాశిధరుఁడు ప్రేరిత’
యని చెప్పెనొ లేదొ యది ప్రయత్నముతోడన్?

62


వ.

వియదాదిపరమాణ్వంతం బైనచరాచరాత్మకజగత్ప్రపంచంబునకు సృష్టిస్థితిలయకారణం బైనశంభుండు నీకు మాననీయుండు గా కుండుట యెట్టు? విచారించి చెప్పుము.

63


తే.

బ్రాహ్మణుఁడ నాశ్రితుఁడ నీకుఁ బరమహితుఁడ
దక్ష! యొకమాట వినవయ్య తగవు గల్గి
క్రతుఫలాధీశు భువరక్షాధురీణు
భోగికంకణు రప్పింపు యాగమునకు.

64


వ.

అర్థహీనం బైనవాక్యంబును, గర్మహీనం బైనశరీరంబును, బతిహీనం బైననారీరత్నంబును, గంగాహీనం బైనదేశంబును, బుత్రహీనం బైనదాంపత్యంబును, దానహీనం బైనవైభవంబును, మంత్రిహీనం బైనరాజ్యంబును, శ్రుతిహీనం బైనయాకారంబును, యోషాహీనం బైనసౌఖ్యంబును,

దర్భహీనం బైనసంధ్యాదికృత్యంబును, జలహీనం బైనపైతృకంబును, హవిర్హీనం బైనహోమంబును, శివహీనం బైనక్రియాకలాపంబులు నిరర్థకంబులు.

65


తే.

అనినఁ గోపించి దక్షుఁ డీయవనిసురుని
వెడలఁ ద్రోయుఁడు ప్రాగ్వంశవేశ్మ మనినఁ
దనకుఁ దాన దధీచి యాస్థాన మెల్లఁ
దల్లడిల్లంగ వెడలె నుద్దామభంగి.

66


వ.

అతనితోడ దుర్వాసుండు, నుదంకుండు, నుపమన్యుండును, రుచికుండును, గాలవుండును, మాండవ్యుండును, వామదేవుండును, నుద్దాలకుండును వెడలిరి. అంతకమున్న మీఁ దెఱింగి బ్రహ్మ సత్యలోకంబునకుం జనియె. మఖంబు ప్రారంభింపబడియె. తద్వృత్తాంతం బంతయు నారదువలన విని సతీదేవి మహేశ్వరానుమతి వడసి దివ్యరథారూఢయై తండ్రికి బుద్ధి చెప్పుతలంపునఁ గైలాసంబున నుండి యేతెంచి.

67


తే.

యజ్ఞదివాటంబు సొత్తెంచి యఖిలజనని
యర్థిఁ గూర్చుండె రత్నసింహాసనమున
భక్తితో దేవసభయును బ్రహ్మసభయు
నంజలులు ఫాలభాగంబునందుఁ గూర్ప.

68


వ.

అప్పుడు దక్షప్రజాపతి కోపించి వచ్చి కూఁతుచిత్తం బెఱింగి యి ట్లనియె.

69


సీ.

హరుఁ డమంగళవేషుఁ డౌనొకాఁడో చెప్పు
        మెఱుఁగ కిచ్చితిమి నిన్నేమి చెప్ప?
నిటు చూడు [9]మిందఱు నిం తొప్పి యున్నవా

రఖలభూషణభూషితాంగు లగుచుఁ
దనరూపునకుఁ దోడు దలము దప్పినగర్వ
మరకంటఁ జూడఁ డే నరిగినపుడు
నాపెండ్లికొడుకులం దేపాటివాఁడు తా?
నేల రప్పింతు నే నిట్టివాని?


తే.

నీవు వచ్చితి మే లయ్యె నింతెచాలు
నతఁడు రాకున్నఁ గొదువలే దంశమైనఁ
దాను బిక్షాకపాలంబు దాల్చి వచ్చి
బండు సేయుటకంటె రాకుండు టొప్పు.

70


వ.

అనిన విని సతీదేవి తండ్రి కి ట్లనియె.

71


శా.

ఆహా! లెస్స! వివేకమే! పురహరుం డాసించియున్నాఁడె నీ
స్వాహాకారము? శంభుఁ బాసి యిట నీసత్రంబునం దేను మృ
ష్టాహారంబు భుజింపవచ్చితినె మోహాంధుండ వై యీశ్వర
ద్రోహం బేటికిఁ జేసెదంచు హితబుద్ధుల్ చెప్పఁగా వచ్చితిన్.

72


తే.

శివుఁడు దాత భోక్త శ్రీమహాదేవుండు
సర్వమును హరుండు శాశ్వతుండు
శంభు వేఱు నేసి సాగింపు వచ్చునే
క్రియలు? వెఱ్ఱి బేల వయితి? చెపుమ.

73


దండకము.

మఱి యతఁడు, సదానిధిధ్యాసితవ్యుండు మంతవ్యుఁ డాతండు శ్రోతవ్యుఁ డాతండు ద్రష్టవ్యుఁ డాతండు జన్మస్థితిధ్వంసనముల్ తిరోభావమోక్షంబులున్ గృత్యముల్గాఁగ నాతండు లోకంబులం బట్టి పాలార్పు రుద్రుండు విశ్వాధికుం డంచు నామ్నాయసంఘాత మామ్రేడనప్రక్రియం దోరమై యాతనిం జెప్పు సత్యంబు నిత్యంబు శుద్ధంబు బుదం

బనంతంబు శాంతంబు కూటస్థ మాత్మప్రతిష్ఠం బఖండంబు దత్తద్వితీయం బచింత్యేక మానంద మాద్యం బవేద్యంబు దిగ్దేశకాలవ్యవచ్ఛేదనీయంబు బ్రహ్మంబు దత్తత్వమున్ వేదవేదాంతవిద్యామహావాక్యమీమాంసహంసు ల్విచారింతు రథ్యాత్మయోగంబునన్ షణ్ణవత్యంగుళీమానయుగ్దేహమధ్యాంతరాళానలావాస కోణత్రయీగేహరోహత్ప్రభాకీలికాస్యూతనిర్భిన్నషట్పుష్కరీగర్భ నిష్కంభనిష్కంపనీవారశూకోపమాధామధామచ్ఛటాకోటిశంపాలతా లంఘిత ద్వాదశారేందునిష్యంచమానామృతాపారధారాప్లవాస్పందితానందులై యోగిబృందారకుల్ లీలతో లోనఁ గం డ్రాతనిన్ నిక్కమై యాతఁ డొక్కండు భూతాత్మ భూతంబునం దుండి నానాత్వముం బొందిన ట్లుండు నట్లీఘటాంతస్స్థితంబై ఘటాకాశమయ్యన్ పటాంతస్స్థితంబై పటాకాశ మయ్యెన్ నిజం బొక్కయాకాశ మాకాశముల్ పెక్కులైనట్టిచందంబులన్ భ్రాంతిదోఁచుం గదా! త్రిపురమథను ఫాలనేత్రుం ద్రిలోకీగృహస్థుం ద్రయీమౌళిమాణిక్యఖండంబు బ్రహ్లాండకుక్షింభరున్ శంభుఁ గుంభీనసగ్రామణీకంఠహారున్ గటీభారశాటీభత్సింధురక్రవ్యభుక్కృత్తి మృత్యుంజయుం గూఢపాత్కుండలుం బాండురాంగుం గురంగాంకఖండావతంసుం గిరీశున్ లలాటేక్షణావిర్భద్భీషణోర్బుధజ్వాలమాలాసమాలీఢపుండ్రేక్షుకోదండునిన్ భూర్భువస్వర్జగద్దాహలీలాకనద్దోహలవ్యాళహాలాహలగ్రాసకల్మాషకంఠోపకంఠున్ సమద్బ్రహ్మవైకుంఠముఖ్యామరవ్రాఁతకోటీరకోటీమణిశ్రేణిశోణప్రభాజాల

బాలాతపస్మేరపాదారవిందున్ భజింపందగున్ సత్క్రియారంభకాలంబునన్, జనక! కనకశైలకోదండుఁ డల్పుండుగాఁ జూచితే! తండ్రి! కల్పాంతసంధ్యామహాతాండవాడంబరారంభసంరంభసంక్షోభితాశేష లోకప్రపంచుండు వంచింప నర్హుండొకో? యయ్య! త్రయ్యంత విద్యావధూరత్నసీమంతసిందూరపాంసుచ్ఛటాపాటల
శ్రీపదాంభోజయుగ్ముం డియన్మాత్రుఁడే! తాత! దైతేయ లీలావతీగండపాళీపరిన్యస్తకస్తూరికాపత్రపల్లీ మతల్లీ కళాద్రోహిబాహాగళస్తంభువై నీ కవష్టంభసంరంభ మేలయ్య యీలాగునన్! మధుమధన! మహాప్రబుద్దుండ వీ విట్టిదుశ్చేష్టితం బెట్లు వీక్షింపుచున్నాఁడ? నబ్జాప్త! నీయల్లు వెల్వండ నీబండ దుర్గోష్ఠితోఁ గూడియున్నాఁడ వింకొక్కమాటైన నేమోమునం జూచె దీశానుపాదాబ్జముల్? వహ్ని ! యీకూడు దీఁ పయ్యనే నీకు నిర్భాగ్య? ఏణాంక! యంతఃకళంకంబుఁ దెల్లంబు గావించి తిన్నాళ్లకున్ లెస్స గా కేమి? పౌలస్త్య! నిన్నుం గనుంగొన్న సిగ్గయ్యెడున్? శక్ర! నీ మొక్కలంబు ల్వినంబడ్డవే కావె? వాచస్పతీ! నీచరిత్రంబు (చిత్రంబు) నీచంబు చాలున్ వృథాలాపముల్ (సేయ నీయున్నవా రింద ఱున్నారు) చూడంగ నేఁ డెల్లి యెల్లుండి యీలోన నేపాకముం బొంద నున్నారొ! యేదుర్గతిం జెందనున్నారొ? యేయాపదం దూలనున్నారొ? యేపంచలం దూలనున్నారొ? యామీఁద దైవం బొకం డెర్గఁడున్.

74


వ.

అని పలికి భవాని కన్ను మొగిచి(న.)

75

సీ.

పాదపద్మములందుఁ బ్రభవించునప్పుడు
        ప్రత్యగ్రయావకద్రవము చెలువు
కటిమండలంబుపైఁ గనుపట్టునప్పుడు
        కనకకాంచీదామకంబు డాలు
వలుఁదచన్నులమీఁద మొలతెంచునప్పుడు
        కాశ్మీరజాంగరాగంబు పొలుపు
సీమంతపదమునఁ జిగురొత్తునప్పుడు
        రమణీయసిందూరరజము సొబగు


తే.

ప్రోదిసేయుచు భగ్గున భుజగహారు
రాణివాసంబు దివ్యవిగ్రహమునందు
రవులుకొని మండె నాస్థానరంగభూమి
నధికరోషోత్థితంబు యోగానలంబు.

76


సీ.

ఆక్రోశ మొనరించె నాహారవంబుతో
        బంధువర్గము శోకపరవశమున
మొగములు తెల్లనై మునులు దేవతలును,
        భీతిల్లి చేతులు పిసికికొనిరి
చ్యుతవికంకతతరుస్రుక్స్రువప్రకరమై
        విభ్రాంతిఁ బొందె ఋత్విగ్గణంబు
[10]ప్రజ్వలింపఁగ నాఱుభంగి యేమియు లేక
        యుడివోయి చల్లనై యుండె వహ్ని


తే.

పుట్టె నుత్పాతములు పెక్కు భువిని దివిని
విడిచిపోయిరి యొకపాటి విబుధమునులు

యజ్ఞవాటంబునందుఁ గామారిదేవి
యోగవహ్నికి దేహ మాహుతి యొనర్ప.

77


తే.

భామతోఁ గూడి వచ్చినపారిషదులు
వేగమున నేగి సతిసుద్ది విన్నవింప
భవుఁడు కోపించి భ్రూకుటిభయదఫాల
భాగుఁ డౌనప్పు డొకమహాప్రభ జనించె.

78


వ.

ఆప్రభామండలంబునడుమ నొక్క దివ్యపురుషుం డావిర్భవించి యమ్మహాదేవునకు నమస్కరించి.

79


సీ.

వదనంబు దెఱచి మ్రింగుదునొ బ్రహ్మాడంబు
        పలుమోద కుండంగఁ బాండురాంగ?
పిండిపీచంబుగా బృధివీధరంబు ల
        డంతునో కాలదండమున నభవ?
దందశూకాధీశుతలలు దండసిలంగఁ
        దాటింతునో కాలధర మహేశ?
వ్రచ్చివైతునొ కేలి వాలారునఖముల
        నఖిలదిక్కులు శశాంకార్ధమకుట?


తే.

యేమి సేయుదు? నానతి యిమ్ము నాకు
ననుచుఁ గ్రమ్మఱ మ్రొక్కి బో హప్పళించెఁ
దన్మహాధ్వనిఁ గలఁగి యుత్కటము లగుచు
జడధు లేడును గలుషింప శంభుసుతుఁడు.

80


వ.

అనిన రుద్రుం డతని రౌద్రోద్రేకంబునకు వీరరసరేఖాముద్రకుం బ్రమోదం బంది భద్ర! నీకు వీరభద్రనామం బిచ్చితి; నాయధిక్షేపంబున దక్షయజ్ఞంబు సంక్షయంబు నొందింపుము; ప్రమథాక్షౌహిణీబలంబు నీకు సహాయం బయ్యెడు నని

యానతిచ్చిన మహాప్రసాదంబని విరూపాక్షుం బ్రదక్షిణంబు వచ్చి దక్షిణాభిముఖుండై ధాటీసంరంభంబున నరిగెనప్పుడు.

81


క.

సంగడిఁ బిఱుంద ముందట
నింగియు నేలయుసు నిండె నిష్ఠురభంగిం
బుంగవకేతను సుభటుల
భంగురవీరప్రతాపభయదస్ఫురణన్.

82


క.

కొండలు మహీరుహంబులు
గండోపలములు ధరించి కహకహ నగుచున్
మెండుకొని యజ్ఞవాటిక
[11]కొండొరు గడవంగ బారి రుద్భటభంగిన్.

83


వ.

అందుఁ గొందఱు యూపస్తంభంబు లుద్ఘాటించిరి. కొందఱు కుండంబులను బూడిచిరి. కొందఱు మంటపంబులు పడఁద్రోచిరి. కొందఱు వేదికలు క్రొచ్చిరి. కొందఱు హవిస్సులు భక్షించిరి. కొంద ఱన్నంబు లారగించిరి. కొందఱు పాయసంబులు మెసఁగిరి. కొందఱు పిండివంటకంబులు మ్రింగిరి. కొందఱు ఘృతదధిక్షీరక్షౌద్రపుండ్రేక్షుఫలాదు లాస్వాదించిరి. కొందఱు యజ్ఞపాత్రంబులు పగులమొత్తిరి. కొందఱు స్రుక్స్రువంబులు విఱిచిరి. కొందఱు శకటంబులు విటతాటనంబులు సేసిరి. కొందఱు చషాలంబులు చెవులం దగిలించుకొనిరి. ఇవ్విధంబున నిర్మర్యాదంభై నిరవగ్రహంబై పారిషదుల యాగ్రహంబులు చెల్లుచుండం గోపాటోపసమున్నిద్రుండై.

84

సీ.

తనమీఁద వైవంగ దంభోళి యెత్తిన
        జెలఁగి సంస్తంభించె జిష్ణుభుజము
కైటభారాతి చక్రము ప్రయోగించిన
        వెసఁ జక్కిలముఁ బోలె విఱిచి బొక్కెఁ
బటుచపేటంబునఁ బండ్లు డుల్లఁగ మొత్తి
        పూషార్కువదనంబు బోసిపుచ్చెఁ
జప్పముత్తెములు రాల్చినభంగి నలవోక
        భగునిగ్రు డ్రదరంగ బలిమిఁ దన్నె


తే.

నర్ధచంద్రబాణంబున యజ్ఞమృగము
శిరముఁ దెగనేసి కట్టె నంబరముమీఁద
ధాతపతిముక్కు సోణంబు దాఁకఁ గోసెఁ
బ్రకటవిస్ఫూర్తి శ్రీవీరభద్రమూర్తి.

85


తే.

ద్రోహు లగు వేలుపులలోన దొరలి యున్న
పదియునొక్కండ్రురుద్రులఁ బాఱ విడిచె
గాసి చేయక కాకోలకంఠుపట్టి
తండ్రిపేరివా రగుట చిత్తమునఁ దలఁచి.

86


వ.

అంతట.

87


క.

సిగ్గు చెడి భీతిఁ బాఱిరి
బగ్గనఁ బోధించి వీరభద్రునిధాటిన్
నుగ్గు లయి యవురుసవు రయి
గగ్గులకాండ్రై వికావిక లయి యమర్త్యుల్.

88


తే.

దక్షునల్లుండ్ర మెడల సూత్రములఁ గట్టి
యూపములు సూత్రములతోడ సుద్ది చేసి

దామెనలు గూర్చి నడిపించెఁ దరతరంబ
వీరభద్రుండు పశువుల వెల్చునట్లు.

89


మ.

పనిలే దేటికి బాధ పెట్ట నను? నబ్రహ్మణ్య మైతో? మొఱో
యని యుచ్ఛైర్ధ్వనిఁ గూఁతవెట్ట ముఖశాలాంతంబునన్ గ్రాద్ధదే
వునిఁ గట్టించెను వీరభద్రుడు భటవ్యూహంబుచే నాగ్రహం
బున ధూమోర్ణపయోధరద్వితయమున ముద్దాడు హస్తాబ్జముల్.

90


క.

[12]రాసించె భృగుని పండ్లను
గూపెట్టఁగఁ గాలకంఠుకొడు కుత్తరవే
దీపాషాణాంచలమునఁ
బాపపుయాగమునఁ దొట్రుపడి రంత మునుల్.

91


చ.

మతకరిపాకశాసనుఁడు మత్తాశిఖావళశాబకంబునా
కృతి ధరియించి ప్రాంతమునఁ గేలిమహీధరశృంగ మెక్కి ని
ర్వృతమతి నుండె వేలుపులు వేదనఁ బెట్టెడువీరభద్రు ను
ద్దతి పరికించుచున్ [13]నయపథంబు బృహస్పతి చే టెఱుంగఁడే!

92


తే.

తఱిగె నర్యము దీర్ఘదోర్దండయుగము
క్రకచమున వీరభద్రుఁడు కరుణ దొఱఁగి
త్ర్యంబకునిపట్టి పవను వధ్యంబు సేసె
వానియంతఃపురస్త్రీలు వసటఁ బొంద.

93


చ.

వలపలికాల ముక్కునను వాత సుధారస ముప్పతిల్లఁ గా
వెలికిల వైచి మట్టె రణవీరశిఖామణి వీరభద్రుఁ డ

చ్చలమున రోహశీరమణుచారుశనముఁ దత్పదాహతిం
గలిగిన కుందుగాదె పొడగానఁగ నయ్యెడు నేఁడు చిహ్నమై?

94


తే.

ఈశ్వరద్రోహి! గర్వాంధ! ఋషిసురేంద్ర
బంధునాశైకకారణ! పాపకర్మ!
చావు మని యొక్కపెట్టునఁ జక్రధార
దక్షుతలం ద్రెవ్వగొట్టె ఫాలాక్షసుతుఁడు.

95


వ.

ఇవ్విధంబున మధుమధనుచక్రాయుధంబు విఱిచి, జంభాంతకు భుజాస్తంభంబు సంస్తంభించి, భృగునికన్నులు కెలికి, పూషుపండ్లు పెఱికి, మఖమృగంబుశిరంబు ఖండించి, దక్షుతల ద్రెవ్వవ్రేసి, దాక్షాయణిసుతుఁ బొట్టగు జ్జుఱుక ద్రొక్కి, భారతీదేవిముక్కు చిదిమి, గాలివధ్యంబు చేసి, జమునిమెడ దండె పగిల్చి, యదితియధరపల్లవంబు చక్కడచి, యగ్ని నాలుకలు గోసి, నిరృతి దలపట్టి వంచి, కింపురుషపతి మొగంబు పాషాణపట్టంబున బిట్టు రాచి, యనంతరంబ గరుడులంద్రోచి, ఖచరులఁ బొరకొట్టి, యచ్చరల సిగ్గువుచ్చి, కిన్నరులఁ దునిమి, గుహ్యకుల గోడుకుడిపి, సాధ్యులం జెఱిచి, రుద్రులం బఱపి, మరుత్తులఁ ద్రోపించి, విశ్వుల వేఁచి, విద్యాధరుల వెలిచి, గంధర్వుల గారించి, యక్షుల నధిక్షేపించి, చక్షుశ్శ్రవుల శిక్షించి, చారణుల జంకించి, కింపురుషులఁ బరిభవించి, వీరభద్రుండు మాఱులేక మలయుచుండె. నివ్విధంబున.

96


ఉ.

తామరసాసనుం డగు పితామహు కూరిమిపట్టి యైనమా
తామహు యాగతంత్రమునఁ దంత్రము చేసి శివాజ్ఞ విక్రమో

ద్దాముఁడు వీరభద్రుఁడు పదంపడి యందఱఁ గాచె దేవతా
గ్రామణులందను వ్రణవికారములన్నియు మానునట్లుగన్.

97


తే.

రణములో నైనతనువికారంబు లెల్ల
దేవతలకు శమించె నద్దేవుకరుణ
దాల్చె దక్షుఁడు వీతవ్యథాబలమునఁ
గంఠనాళాగ్రముననుండ మేండశిరము.

98


తే.

శంకరద్రోహపాపప్రశాంతిఁ గోరి
దక్షుఁ డెంతయుఁ గాలంబు తపము సేసె
బహుళకైవల్యసామ్రాజ్యపట్టభద్ర
సింహపీఠికఁ గాశికాక్షేత్రసీమ.

99


వ.

దక్షుండును దనపేర దక్షేశ్వరలింగంబుఁ బ్రతిష్ఠించె.

100


తే.

అంబికకుఁ బుట్టినిల్లు నీహారశిఖరి
యత్తవారిల్లు కాశీమహాపురంబు
హిమకరోత్తంసునకుఁ బుట్టినిల్లు కాశి
యత్తవారిగృహంబు నీహారశిఖరి.

101


వ.

నర్మదేశ్వరుండు సరస్వతీశ్వరుండు రత్నేశ్వరు పురోభాగంబున నధివసింతు రింక వ్యాసేశ్వరుమాహాత్మ్యం బభివర్ణించెద.

102


వ్యాసేశ్వరుమాహాత్మ్యము

తే.

బాదరాయణుఁ డఖిలభూపరిధియందు
సకలతీర్థంబులను నాడి శాంతబుద్ధి
నైమిశం బనుపుణ్యకాంతారమునకు
నరుగుదెంచెను శిష్యసంహతియుఁ దాను.

103


క.

ఆతతమతి నతఁ డష్టా
శీతిసహస్రములు మునులు శివుఁ గొలువంగా

నేతెంచి శిష్యులును దాఁ
బ్రాతఃకాలమున కాలమునఁ బొగడఁ బద్మేక్షణునిన్.

104


వ.

లక్ష్మీశ్వరుండె దైవంబు, జనార్దనుండె భుక్తిముక్తిప్రదుండు, విష్ణుధర్మంబె ధర్మంబు.

105


సీ.

సత్యంబు భుజగేంద్రశయనుండె దైవంబు
        సత్యంబు దైవంబు చక్రధరుఁడు
సత్యంబు వైకుంఠసదనుండె దైవంబు
        సత్యంబు దైవంబు శాశ్వతుండు
సత్యంబు కైటభశత్రుండె దైవంబు
        సత్యంబు దైవంబు శార్ఙ్గధరుఁడు
సత్యంబు వార్ధిజాసహితుండె దైవంబు
        సత్యంబు దైవంబు శ్యామతనుఁడు


తే.

మఱియు సత్యంబు దైవంబు మాధవుండు
మఱియు సత్యంబు దైవంబు మదనగురుఁడు
మాట లేటికి? దైవంబు మఱియుఁ గలఁడె
పుండరీకదళాయతాక్షుండు దక్కె.

106


వ.

అని యీప్రకారంబు వారణాశియందుఁ బంచనదంబునం బావనోదకంబులం దీర్థం బాడి యాదికేశవదేవుం బాంచరాత్రదివ్యాగమమార్గంబున నర్చించి విశ్వేశ్వర శ్రీమన్మహాదేవుభవనద్వారంబున నిల్చి దక్షిణభుజం బెత్తి సకలవేదపురాణేతిహాససిద్ధాంతనిశ్చితార్థంబు, సత్యంబు, పునస్సత్యంబు, వేదశాస్త్రంబులకంటెఁ బరం బైనజ్ఞానంబును, గేశవులకంటె బరం బైనదైవంబు లే దని పలికిన విని.

107

శా.

‘ఎట్టెట్టూ! వినమైతి మింక నొకమా ఱేర్పాటుగాఁ జెప్పుమా
భట్టారా!’ యని నందికేశ్వరుడు విస్పష్టంబుగాఁ బల్కిన
న్బట్టెన్ గంఠబిలంబు చెయ్యి దివియ న్రాదయ్యె వారాణసీ
హట్టప్రాంగణమందు వ్యాసునకు శిష్యశ్రేణి భీతిల్లఁగన్.

108


క.

భుజవాక్సంస్తంభంబునఁ
బ్రజనితభయుఁ డగుచు ముట్టఁబడి మదిఁ దలఁచెన్
గజరాజవరదు గరుడ
ధ్వజుఁ డప్పుడ యరుగుదెంచె వ్యాసునికడకున్.

109


వ.

వచ్చి ‘యో బాదరాయణుండ! బుద్ధిమంతుండ విట్టియపరాధం బెట్టు సేసి?’ తని కినిసి, ‘నందికేశ్వర! నాకుం బ్రియంబుగా నీతని(యపరాధంబు క్షమించి) కరుణార్ద్రదృష్టిం జూడు’మని వేడుకొనియె. అప్పుడు సత్యవతీవందనునకు వాగ్భుజాస్తంభనంబులు నివర్తిల్లె. కృష్ణద్వైపాయనుండును బహుప్రకారంబులం బరమేశ్వరుం బ్రస్తుతించి తనపేర వ్యాసేశ్వరలింగంబుఁ బ్రతిష్ఠించె. ఆలింగంబును దన్ను భజించువారలకు భోగమోక్షప్రదాయకుండై యుండు. అనిన విని కుంభసంభవుండు శంభునందనున కభివాదనంబు సేసి సవినయంబుగా నిట్లనియె.

110


సీ.

శైలారి వాగ్భుజాస్తంభం బొనర్చుట
        నజ్ఞానవిరహితుం డయ్యె నేని
భాగీరథీతటోపాంతస్థలంబున
        లింగప్రతిష్ఠఁ గల్పించె నేని
పుణ్యపంచక్రోశభూతీర్థమహిమంబు
        నెరవుగా సర్వంబు నెఱిఁగె నేని

ముక్తిమంటపమధ్యమునఁ బురాణంబులు
        శైవంబు లేప్రొద్దుఁ జదివె నేని


తే.

తపమునకు బాధకములు క్రోధంబు లగుటఁ
దెలిసి యొక్కింత యేని తితిక్ష లేక
యేల శపియించెఁ గాశిఁ బుణ్యైకరాశి
గంధవతిపట్టి? యానతీ కార్తికేయ!

111


వ.

అనిన గాంగేయుం డౌర్వశేయా? యడుగవలసినయర్థంబ యడిగితి. సాత్యవంతేయుండు వాగ్భుజాస్తంభంబునాఁటంగోలె బుద్ధిమంతుండై యుండె. కాశికానగరంబుమీఁదం గోపించి బాదరాయణుండు శపించుటకు గారణంబు మీఁద వివరించెద. కాశికామాహాత్మ్యవర్ణనావిశేషావశేషంబు వినుము.

112


కాశీతీర్థమహిమావర్ణనము

తే.

కలుగనీ! కాశి శంభులింగములు కోట్లు
విశ్వనాథుండు లింగంబు శాశ్వతుండు
కలుగనీ! తీర్థములు కోట్లు కాశియందు
ననఘ! మణికర్ణికయ తీర్థమని యెఱుంగు.

113


క.

సేవ్యుఁడు విశ్వేశుఁడు స్నా
తవ్యము మణికర్ణికాహ్రదజలౌఘము శ్రో
తవ్యంబులు శంభుకథా
దివ్యపురాణములు కాశి తీర్థమునందున్!

114


సీ.

వసియింపవలయు యావజ్జీవ మనురక్తి
        పరత వారాణశీపట్టణమున

జక్రపుష్కరిణి నిచ్చలుఁ దీర్ధమాడంగ
        వలయు సంకల్పపూర్వకము గాఁగ
నర్చింపవలయు గంధాక్షతంబులఁ బుష్ప
        ఫలపత్రముల విశ్వపతి మహేశు
నిలుపంగ వలయును నెఱసు వాటిలకుండ
        నాత్మధర్మస్వవర్ణాశ్రమముల


తే.

స్నానమహిమంబు భక్తితాత్పర్యగరిమ
వినఁగవలయుఁ బురాణార్థవిదులవలనఁ
దనయథాశక్తి వలయును దానమిడఁగఁ
గాశిఁ గైవల్య మిన్నింటఁ గాని లేదు.

115


తే.

యాత్ర విధ్యుక్తసరణిఁ జేయంగవలయు
వలయుఁ బరివారక్షేత్రదేవతలఁ గొలువ
వలదు బొంకంగ వలదు జీవముల కలుగ
వలదు నగి యైనఁ బరమర్మములు వచింప.

116


తే.

ప్రాణసందేహమైనట్టి పట్టునందు
ననృతములు వల్కియైనను నౌర్వశేయ!
యన్యు రక్షింప వలఁచు టత్యంతమైన
పరమధర్మంబు కాశికాపట్టణమున!

117


క.

కాలాంతకుకటకమున బి
పీలికఁ గాచుట మహర్షిబృందారక! యీ
త్రైలోక్యంబును గాచుట
పోలఁగ శివధర్మసూక్ష్మములు దెలియు మదిన్.

118


తే.

తీర్థసంవాసకారులై ధీరబుద్ధిఁ
గాశి వసియించుపెద్దల గారవించు

టధికధర్మంబు దాన నాహ్లాద మొందు
వివిధకైవల్యసంధాయి విశ్వభర్త!

119


సీ.

కుదియించునది నెట్టుకొని యింద్రియవ్యాప్తి
        మనసుచాంచల్యంబు మానుచునది
మదిలోన మోక్షకామనము వీడ్కొనునది
        పాయంగ నిడునది ప్రాణభయము
వ్రతదానధర్మసంరక్షణార్థంబుగా
        గావించునది యాత్మకాయరక్ష
తత్కాలదేహయాత్రామాత్రమునఁ గాక
        సమకూర్చునది ధాన్యసంగ్రహంబు


గీ.

నణఁచునది దంభ ముజ్జగించునది యీర్ష్య
యుడుగునది రాగలోభగర్వోదయములు
శాంతిదాంతితితిక్షానృశంస్యసత్య
నిరతుఁ డగునది కాశిలో నిలుచు నరుఁడు.

120


క.

ఒకవర్షశతంబున నొం
డొకతీర్థమునందుఁ గల ప్రయోజనలాభం
బొకదివసంబున నానం
దకాననమునందు సర్వదా సిద్ధించున్!

121


క.

నేమంబున నొక ప్రాణా
యామంబున నరుఁడు పడయునట్టిఫలశ్రీ
సామాగ్రి యొండెడ ముని
గ్రామణి! సాష్టాంగయోగగతిఁ గనరు నరుల్!

122

సీ.

[14]చక్రవాళపరీతసర్వసర్వంసహా
        పరమతీర్థములలో గరిమ కాశి
కాశికాపట్టణక్రోశపంచకతీర్థ
        సమితిలో సారంబు జహ్నుకన్య
జహ్నుకన్యాతీర్థసముదాయకమునందు
        గడుఁ బెద్ద మణికర్ణికాహ్రదంబు
మణికర్ణికాతీర్థమజ్జనప్రతతికం
        టెను విశ్వనాథు దర్శన మధికము


గీ.

విశ్వపతికంటెఁ గైవల్యవిభునికంటెఁ
గాలకంఠునికంటె ముక్కంటికంటె
దీర్ధములు దైవములు లేవు త్రిభువనముల
సత్యమింకను సత్యంబు సంయమీంద్ర!

123


సీ.

అఖిలకాలము శంభు నర్చించినఫలంబు
        సకృదీక్షణంబున సంభవించు
భవసహస్రముల సంపాదితం బగుపుణ్య
        మొకప్రదక్షిణమున కుపమ గాదు
పుష్పప్రదానంబుఁ బోలంగ లేవు షో
        డశమహాదానకాండములు గూడి
తలకూడు నశ్వమేధఫలంబు పంచామృ
        తాభిషేకవిధాన మాచరింప

గీ.

వాజపేయసహస్రప్రవర్తనమున
గలఫలం బబ్బు నైవేద్యకల్పనమున
నిన్నియును జిత్తగించి విశ్వేశు నభవుఁ
గాశికాధీశు భజియింపు కలశజన్మ!

124


క.

గొడుగులు వింజామరములుఁ
బడగలునుం దాలవృంతపటవాసకముల్
మృడుని కొసంగినధన్యుఁడు
పుడమిని జితైకాతపత్రముగఁ బాలించున్.

125


వ.

మఱి యాస్తిక్యబుద్ధి, వినయంబు, మానావమానంబుల వికృతిలేమి, యకామిత్వం, బనౌద్ధత్యం, బహిపరత్వం, బప్రతిగ్రహవృత్తి, యదాంభికత్వం, బలుబ్ధత, యనాలస్యం, బపారుష్యం, బదీనత, యాదిగాఁ గలగణంబులు కాశీతీర్థవాసి కవశ్యంబును సంభావనీయంబులు.

126


తే.

కలశసంభవ! ‘వ్యాసుండు కాశిమీఁద
నేల గోపించెఁ జెప్పు’మం చీ వడిగితి
బాదరాయణకోపప్రపంచమునకుఁ
గారణము చెప్పెదను విను గౌరవమున.

127


వ్యాసుండు కాశిమీఁదఁ గోపించుట

సీ.

త్రిషవణస్నానంబు దీర్చు భాగీరథి
        శివధర్మములు చెప్పు శిష్యతతికి
నుదరపోషణము సేయును మాధుకరవృత్తి
        లింగార్చనంబుఁ గల్పించు నియతి
ముక్తిమంటపమధ్యమునఁ బురాణము చెప్పుఁ
        బంచాక్షరంబు జపంబు సేయు

భూతి సర్వాంగకంబుల సముద్ధూళించు
        ధరియించు రుద్రాక్షదామకములు


తే.

శ్రుతులు నా ల్గేర్పఱచినట్టి సూక్ష్మబుద్ధి
బ్రహ్మసంవేది యాదిపురాణకర్త
భారతాఖ్యానసంహితా ప్రథమసుకవి
గంధవతిపట్టి యానందకాననమున.

128


వ.

ఇవ్విధంబునం బెద్దకాలంబు కాశీనగరంబునఁ గృష్ణద్వైపాయనుండు శిష్యవర్గంబును దానును నపవర్గపదవీకల్యాణలాభార్థంబు వసియింప నమ్మునిమనస్స్థైర్యంబు పరీక్షింపం దలంచి విశ్వేశ్వర శ్రీమహాదేవుండు విశాలాక్షి కి ట్లనియె.

129


గీ.

బాదరాయణచిత్త మేపాటియదియొ
యరయుదము గాని యతఁడు బిక్షాటనమున
కేగుదెంచినయప్పు డింటింట భిక్ష
కలుగకుండంగఁ జేయంగవలయు నీవు.

130


వ.

అనిన నద్దేవి మహాప్రసాదం బని యఖిలభూతాంతర్యామిని గావున గాశికానగరంబున గృహిణీగృహస్థులయంతరంగంబుల నధివసించి భిక్షాప్రదానప్రతిష్టంభకారణంబై యుండె; నంత కృష్ణద్వైపాయనుండును.

131


సీ.

[15]కాలోచితము లైనకరణీయములు దీర్చి

        నరుణోదయము గానియటక మున్న
గంగలోఁ జక్రపుష్కరిణీహ్రదంబున
        నఘమర్షణస్నాన మాచరించి
యరుణాంశుమండలం బర్ధోదయమునొందు
        సమయంబు వీక్షించి సంధ్య వార్చి
నిలుచుండి జపియించి నియతితో గాయత్రి
        సంఖ్య యష్టోత్తరశతము గాఁగ


తే.

నగ్నికార్యముదీర్చిఁ గామారిఁ గొల్చి
ముక్తిమంటపికామధ్యమునఁ బఠించె
శివపురాణంబు మధ్నాహ్నసీమదాఁక
నపరనారాయణుఁడు బాదరాయణుండు.

132


మ.

ఝటితిస్యూతపలాశపత్రపుటికాశాటీప్రసేవంబులున్
ఘటముల్ తామరపాకులున్ గుహళులున్ గండోలముల్ పూని బా
సట వేదంబుఁ బఠించుచుం గదిసి వైశంపాయనాదుల్ సము
త్కటభంగిం గొలువంగ నేగె ముని భిక్షాకృత్యయాచ్ఞార్థమై.

133


తే.

నెట్టుకొని కాయు బిఱ్ఱెండఁ బట్టపగలు
తాను శిష్యులు నింటింట దప్పకుండఁ
గాశికావిప్రగృహవాటికలఁ బొనర్చె
నఖిలవిద్యాగురుండు భిక్షాటనమును.

134


శా.

ఛాత్రుల్ పైలసుమంతజైమినులువైశంపాయనుం డాదిగాఁ
బాత్రంబుల్ ధరియించి యన్నిదెసలన్ భైక్షంబు వేడంగ న
క్షత్రాధీశ్వరమౌళిపట్టణమునం గాశిం దలంప న్మహా
చిత్రం బోగిర మబ్బదయ్యె ఋషికిం జేకూరదయ్యెం దుదిన్.

135

తే.

తిరిగె నింటింట భిక్షాం ప్రదేహి యనుచు
బాదరాయణుఁ డీశానుపట్టణమున
నొట్టు వెట్టినయట్ల నేయుగ్మలియును
బిలిచి యొకపట్టెఁడన్నంబు వెట్టదయ్యె.

136


తే.

వండుచున్నార మనె నొక్కవనజనేత్ర
తిరిగి రమ్మనె నొక్కలేఁదీఁగెఁబోఁడి
దేవకార్యంబు నేఁ డనెఁ దెఱవ యోర్తు
ద్వారకవాటంబు దెఱవదు వనిత యొకతె.

137


వ.

ఇవ్విధంబున భాగ్యహీనుండు ధనంబునుం బోలె భిక్షాన్నంబు వడయనేరక మఠంబునకుం జని జఠరక్షుధావ్యథాదూయమానమానసుండై కృష్ణద్వైపాయనుండు శిష్యుల రావించి వారల కి ట్లనియె.

138


తే.

అబ్బెనే నేడు మీకు మధ్యాహ్నభిక్ష
బ్రహపురివాడఁ గాశికాపట్టణమున?
నబ్బదో నాకపోలె మహర్షులార!
వాడవాడల నీపెద్దవల్లకాట?

139


సీ.

దుర్భిక్షదోషంబు దొరకొన్నఁ గడపని
        కడపనిగృహసూతకంబునందు
నింటఁ బీనుఁగు వోయెనేనియుఁ గడపని
        కడపనిమ్రుక్కడి గవిసె నేని
కువలయేశుఁడు దండుగులు గొన్నఁ గడపని
        కడపనిభవనంబు గాలె నేని
పితృకార్యవిధి సమాప్తింపక గడపని
        కడపనిముట్టంటు గలసె నేని

తే.

వేళఁ గాకున్నఁ గడపనివేలుపులకు
మీఁదు వోకున్నఁ గడపనిమిన్న కెట్లు
గడపి రింటింట నీకాశికాపురమునఁ
బుణ్యగేహిను లిది మహాద్భుతము గాదె?

140


వ.

పెద్దకాలమునంబట్టి మన మున్నవార, మిక్కాశీపట్టణంబున బిక్షాన్నంబు పుట్టని దినంబునుం గలదె? కుతపకాలంబునందు.

141


సీ.

ముంగిట గోమయంబున గోముఖము దీర్చి
        కడలు నాల్గుగ మ్రుగ్గుకఱ్ఱ వెట్టి
యతిథి నచ్చో నిల్పి యర్ఘ్యపాద్యము లిచ్చి
        పుష్పగంధంబులఁ బూజ చేసి
ప్రక్షాళితం బైనపసిఁడిచట్టువముతో
        నన్నంబుమీఁద నె య్యభిఘరించి
ఫలపాయసాపూపబహుపదార్థములతో
        భక్తివిశ్వాసతాత్పర్యగరిమ


తే.

బెట్టుదురు మాధుకరభిక్ష భిక్షుకులకుఁ
గంకణంబులతో సూడిగములు రాయఁ
గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి
నన్నపూర్ణభవాని క ట్టనుఁగుఁజెలులు.

142


క.

ఆపరమపురంధ్రులయం
దేపుణ్యాంగనయు భిక్ష యిడదయ్యెఁ గటా!
రేపాడి మేలుకొని మన
మేపాపాత్మునిముఖంబు నీక్షించితిమో?

143


తే.

వాడఁబాఱినయవి వక్త్రవనరుహములు
భాజనంబులలోన నిప్పచ్చరంబు

మీకు భిక్షాన్నములు లేమి నాకుఁ దెలిసెఁ
జేలపంటలఁ గొయ్యలు చెప్పుఁ గాన.

144


వ.

చతుర్విధపురుషార్థములకు నకట! పుట్టినిల్లైన యిక్కాశీనగరంబున మనకు నేడు భిక్షాన్నంబు పుట్టమికిఁ గారణం బేమియో మీర పరామర్శించి రం డనిన నట్లకాక యని గురునియోగంబున నందఱు నన్నిముఖంబుల(కుం) జని యేయవకరంబునుం బొడఁగానక క్రమ్మఱవచ్చి శిష్యులు బాదరాయణున కి ట్లనిరి.

145


తే.

అవధరింపుము నారాయణావతార!
బాదరాయణ! కాశికాపట్టణమున
నవకరము లేదు మీయట్టియధికపుణ్యు
లుండ నివ్వీటి కెట్లు గీ డొంద నేర్చు?

146


సీ.

విశ్వేశ్వరుం డెందు విచ్చేసియున్నాఁడు
        కైలాసశైలశృంగంబు విడిచి
ప్రవహించు నెందేని భాగీరథీగంగ
        యుపకంఠమున హారమో యనంగ
నాఁకొన్నవారికి నమృతభిక్షాన్నంబుఁ
        గృప సేయు నెందేని గిరితనూజ
యుండు డుంఠివినాయకుం డెందు నొసలిపై
        యువరాజపట్టంబు నవధరించి


తే.

యెందు నుందురు తమయంతలేసివారు
పరమపుణ్యులు సంయమీశ్వరు లనేకు
లట్టికాశిని భిక్షాన్న మబ్బ దనుట
వినఁగఁ బొసఁగునె యిది యేమి విధమొ కాక.

147

సీ.

జిలుఁగుసంధ్యారాగచీనాంబరము గట్టి
        కుసుమగర్భపుఁ గీలుకొప్పు తనర
కస్తూరితోఁ గూర్చి గంధసార మలంది
        ముత్యాలతాటంకములు ధరించి
సీమంతపథమునఁ జేర్చుక్క సవరించి
        కురులపైఁ జిన్నిపూ గుస్తరించి
శ్రీపాదముల హేమనూపురంబులు దాల్చి
        కటిమీఁద వజ్రాలకమరు నిల్పి


తే.

యన్నపూర్ణ విశాలాక్షి యనెడు పేళ్లఁ
గాశికామధ్యశృంగాటకములయందు
విశ్వపతిదేవి మధ్యాహ్నవేళఁ బెట్టు
నమృతపాయసదివ్యాన్న మనుదినంబు.

148


తే.

మనము మనమనపూర్వజన్మములయందుఁ
గడపినారము మధ్యాహ్నకాలభిక్ష
యనుభవింపక పోవంగ నలవి యగునె
కమలజుని కైనఁ బ్రారబ్ధకర్మఫలము?

149


క.

అందఱు భుజంగభూషణు
[16]లందఱునుం గాలకంఠు లందఱు గిరిశుల్
అందఱు ధృతేందుకళ లా
నందవనీనగరనివసన స్థిరులు నరుల్.

150


తే.

బ్రహ్మలోకంబు గాశికి బడిసివాటు
విష్ణులోకంబు గాశికి వినిమయంబు

దాసదాసానుదాసబృందంబు గాశి
కింద్రచంద్రాదిలోకంబు లిధ్ధమహిమ!

151


సీ.

శివుని నివాళించు శేషాహి నడురేయి
        బహుఫణారత్నదీపములచేత
నంతర్హితంబులై యర్చించు నీశాను
        ఫలపుష్పములఁ గల్పపాదపములు
కామధేనువు లైదుఖండేందు శేఖరు
        నూధస్యధారల నోలలార్చు
నిధులు తొమ్మిదియుఁ గంఠేకాలునకు నిచ్చు
        నిర్మలమణులు కానికలు గాఁగఁ


తే.

గాశికాపట్టణంబు శంకరుని నెలవు
కలి ప్రవేశింప దానందకాననమున
శ్రీనివాసంబు వారాణసీపురంబు
ముక్తిసంధాయకం బవిముక్త మెపుడు.

152


వ.

అని శిష్యులు గాశీమాహాత్మ్యంబు వర్ణించిన విని బాదరాయణుండు వారి కి ట్లనియె.

153


తే.

ఉపవసింతుము గాక నేఁ డుడిగి మడిఁగి
యస్తమించుచు నున్నవాఁ డహిమభానుఁ
డెల్లి పారణ కైన లే దెట్టు మనకు
మాధుకరభిక్ష బ్రాహ్మణమందిరముల.

154


వ.

అని యారాత్రి గడపి మఱునాఁడు మధ్యాహ్నకాలంబున శిష్యులుం దాను వేఱు వేఱ వేదవ్యాసుండు విప్రభవనవాటికల భిక్షాటనం బొనర్పంబోయి తొలునాఁటియట్ల ముక్కంటిమాయ నేమచ్చకంటియు వంటకంబు వెట్టకున్నఁ గటకటం

బడి భిక్షాపాత్రంబు నట్టనడువీథిం బగుల వైచి కోపావేశంబున.

155


తే.

ధనమదంబును వేదవిద్యామదంబు
మోక్షలక్ష్మీమదంబును ముదిరి కాదె
కాశికాపట్టణంబునఁ గరుణ లేక
బ్రాహ్మణులు నన్ను నిటు భంగపఱచి రనుచు.

156


వ.

కృష్ణద్వైపాయనుం డాత్మగతంబున.

157


తే.

ధనము లేకుండెదరు మూఁడుతరములందు
మూఁడుతరములఁ జెడుఁ గాక మోక్షలక్ష్మి
విద్యయును మూఁడుతరముల [17]వెలయవలయుఁ
బంచజనులకుఁ గాశికాపట్టణమున.

158


వ.

అని పారాశర్యుండు క్షుత్పిపాసాపరవశుండై శపియింపందలంచునవసరంబున నొక్కవిప్రగృహంబువాకిటఁ బార్వతి [18]ప్రకృతస్త్రీవేషంబున.

159


ఉ.

వేనలి పాటపాట నరవెండ్రుకతోఁ దిలతండులాన్వయ
శ్రీ నటియింపఁ గై సడలి వ్రేఁకనిచన్నుల పాలవంకపైఁ
గౌ నసియార్ప వాలుఁదెలికన్నులు గల్కితనంబు వీడ్కొనన్
మానిని హస్తమూఁది యొకమంజులభాషిణి వచ్చె వీథికిన్.

160


ఉ.

వేదపురాణశాస్త్రపదవీనదవీయసి యైన పెద్దము
త్తైదువ కాశికానగరహాటకపీఠశిఖాదిరూఢ య
య్యాదిమశక్తి సంయమివరా! యిటు రమ్మని వీచె హస్తసం
జ్ఞాదరలీల రత్నకటకాభరణంబులు ఘల్లుఘ ల్లనన్.

161


వ.

చేరం బిల్చి యమ్మత్తకాశిని సాత్యవతేయున కి ట్లనియె.

162

శా.

ఆకంఠంబుగ వేడ్కతో నిపుడు భిక్షాన్నంబు భక్షింపఁగా
లేకున్నం గడు నంగలార్చెదవు మేలే! లెస్స! శాంతుండవే!
నీకంటె న్మతిహీనులే కటకటా! నీవారముష్టింపచుల్
శాకాహారులుఁ గందభోజులు శిలోంఛప్రక్రముల్ దాపసుల్.

163


తే.

ఓ మునీశ్వర! వినవయ్య యున్నయూరుఁ
గన్నతల్లియు నొక్కరూ పన్నరీతి?
యటు విశ్లేషించి శివుని యర్ధాంగలక్ష్మి
కాశి యివ్వీటిమీఁద నాగ్రహము దగునె?

164


తే.

వేయుశాఖలతో సామవేదరాశి
యేకవింశతిరూపమై ఋఙ్నిగమము
తొమ్మిదియు నూట యొక్కండ్రు త్రోవ లంది
మెరినొ నాధర్వణయజుస్సు లుండుఁ గాశి.

165


వ.

ఇట్టి కాశికానగరంబుమీఁద భిక్ష లేకుండ కారణంబుగా నీయంతవాఁడు గటకటంబడి శపియింపం దలంచునె? బ్రాహ్మణుండవు గదా! నీకు నేమన్ననుం జెల్లు. అటు విశేషించి యాఁకొన్నవాఁడవు కావున నీయవసరంబున నిన్ను హెచ్చుకుందాడుట మముబోఁటిగృహిణులకు మెచ్చుగాదు. మాయింటికిం గుడువ రమ్ము. కుడిచి కూర్చున్నపిమ్మటం గొన్నిమాటలు నీతోడ నాడఁగల నిప్పుడు.

166


తే.

వైశ్వదేవాదివిధుల సర్వమును దీర్చి
యరసియున్నాఁడు నాభర్త యతిథిరాక
నతిథి పంక్తికి రాకున్న నారగింపఁ
డొంటి నొకనాడుఁ బతి యెట్టియొఱకమునను.

167

తే.

అభ్రగంగ నుపస్పర్శ మాచరించి
వేగ విచ్చేయవలయు నావిభుఁడు దసిలి
యాఁకటికి నోర్వలేఁడు బ్రాహ్మణవరేణ్య!
యర్కమండల మిదె వ్రాలె నపరదిశకు.

168


వ.

అనిన వేదవ్యాసుండు ముత్తైదువ కి ట్లనియె.

169


తే.

కమలలోచన! కిన్నరాంగనవె నీవు
నీవు గంధర్వభామవే నీలవేణి?
యప్సరస్స్త్రీవె నీవు బింబాధరోష్ఠి!
రమణి! నీవు విద్యాధరరాజసుతవె!

170


సీ.

కల్యాణి! నిన్ను నీకాశీపురములోన
        నెన్నండుఁ గాన నీ వెవ్వరమ్మ?
నిన్ను దర్శింపంగ నిఖిలేంద్రియములకు
        నత్యంతసంతృప్తి యావహిల్లె
రాహుదంష్ట్రాంకురక్రకచఘట్టనభీతి
        జగతి కేతెంచినచంద్రకళవె?
నన్ను రక్షింపంగ నాపాలఁ గల్గిన
        భాగ్యదేవతవొ తప్పదు నిజంబు


తే.

ఒండెఁ గైవల్యలక్ష్మివి యొండె నీవు
కామినీత్వంబుఁ గైకొన్న కాశిపురివె?
యొండె నాకొన్నవారల నూఱడించి
యమృతభిక్షాన్న మిడువిశాలాక్షి వీవు.

171


తే.

చేయఁగలవాఁడ నేను నీ చెప్పినట్ల
బ్రాహ్మణుఁడఁ గాన నాకుఁ జాపలము ప్రకృతి

బుద్ధిఁ గృప చేసి రక్షింపు పుణ్యసాధ్వి!
కాన! నీపేరు నాకు నిక్కముగఁ జెప్పు.

172


వ.

అనిన నమ్మత్తకాశిని సాత్యవతేయున కి ట్లనియె.

173


శా.

ఊఁకఁ జెప్పఁగ నెంత యేని తడ వౌ నోవిప్రశార్దూల! నీ
వాఁకొన్నాఁడవు భోజనోత్తరమునం దాస్థానమై యుండి య
ఱ్ఱాఁకం బెట్టక చెప్పెదన్ వినుము వృత్తాంతంబునుం దేటగా
వీక న్వేళ యతిక్రమించెఁ గుడువన్ వేంచేయుమా గ్రక్కునన్.

174


వ.

అనినం బారాశర్యుం డయ్యార్యతో నమ్మా! యొక్కవిన్నపంబు గల దాకర్ణింపు మని యి ట్లనియె.

175


తే.

అయుతసంఖ్య శిష్యు లాయాయివీథుల
వేఱువేఱ భిక్ష వేఁడితేఱ
నేను నొక్కవీథి నేకాంతవృత్తిమైఁ
బర్యటించి తెత్తుఁ బంచభిక్ష.

176


చ.

దినము దినంబుఁ దప్పకిటు ద్రిమ్మఱి చాలఁగ భిక్ష చేసియుం
జనునెడఁ గూడ వత్తురు కృశానుసమానులు నన్నుఁబైలజై
మినిముఖు లైనశిష్యులు సమిద్ధమతిం బురసూర్యవీథికిన్
మునుకొని యొయ్యనొయ్యఁ గరముం గరవల్లియునుం బఠించుచున్.

177


తే.

శిష్యులును నేను గూడి రాజీవనేత్ర!
యాశ్రమమునఁ బాషాణమఠాంతరమున
రాశి వోయుదు మఖిలపాత్రికలయందు
నందఱును దెచ్చినట్టి భిక్షాశనముల.

178


సీ.

పాయసాపూపాదిపక్వాన్ననివహంబు
        లేకీభవించిన నేర్పరించి

యన్నింట సగ మతిథ్యభ్యాగతార్థంబు
        భాజనంబుల నించి పాయఁ బెట్టి
సగము భాగీరథీసలిలధారాప్రపూ
        రంబునఁ బ్రక్షాళితంబు సేసి
తారతమ్యమున వృద్ధపురస్సరంబుగాఁ
        బరిపాటి వేర్వేఱ బంతి సాగి


తే.

యర్థి ‘నమృతాయతా’ మని యసుమటించి
యేను మున్ను ప్రాణాహుతు లెత్తఁ జూచి
చేయుఁ బ్రాణాగ్నిహోత్రంబు శిష్యకోటి
యింతగాలంబు నీ వ్రతం బిట్లు సెల్లె.

179


ఉ.

ఎన్నఁడుఁజూడ మున్వినమె యిట్టిమహాద్భుత మేమి చెప్పుదుం
గిన్నరకంఠి? యొ ట్టిడినకీలునఁ గాశిపురంబునందు భి
క్షాన్నము లేదు నీయడుగు లాన నిజంబుగ విన్నవించెదన్
నిన్నటబట్టి యేము నిరు నీఁగియు నుంటిమి నిట్టుపాసముల్.

180


ఉ.

చట్టలు డప్పిమై నవురుసౌ రయి పాత్రలుఁ దారుఁ గాశికా
హట్టమునందుఁ గూటికి నుపాయము లేక పరిభ్రమింప వా
రెట్టటపోవ నిమ్మనుచు నించుకయేనియుఁ దాల్మి లేక యే
నెట్టు భుజించువాఁడ దరళేక్షణ! యొక్కఁడ నీగృహంబునన్.

181


తే.

అస్తమింపంగఁ జేరినాఁ డహిమకరుఁడు
శిష్యులే కాక యయుతంబుఁ జిగురుఁబోఁడి!
వ్రతము దప్పి భుజింపంగ వలను గాదు
నేడు నిన్నటిమఱునాడు నిక్కువంబు.

182


చ.

అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను లెస్సగాక యో
మునివర! నీవు శిష్యగణముం గొని రమ్మిట వేడ విశ్వనా

థుని కృపపేర్మి నెంద ఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం
బనిగొనునట్లు పెట్టుదు నపారము లైనయభీప్సితాన్నముల్.

183


వ.

అనిన నట్లకాక మహాప్రసాదం బని వేదవ్యాసుండు శిష్యులం గూర్చుకొని భాగీరథికిం జని యుపస్చర్శం బాచరించి యేతెంచిన.

184


తే.

గొడుగు పాగలు గిలుకలు గులుకరింప
నిందుబింబాస్య యెదురుగా నేగుదెంచి
ఛాత్రసహితంబుగాఁ బరాశరతనూజు
బంతి సాఁగించె ముక్తిశాలాంతరమున.

185


వ.

అనంతరం బావిశాలాక్షీ మహాదేవి యనుభావంబున నమ్మహామునులముందటం గనకరంభాపలాశపాత్రంబులయందు విచిత్రంబుగాఁ గలవంటకంబులు, నపూపంబులు, లడ్డుకంబులు, నిడ్డేనలు, గుడుములు, నప్పడంబులు, నిప్పట్లు, గొల్లెడలు, దోసియలు, సేవియలు, [19]నంగరపొలియలు, పోవెలు, [20]సారసత్తలు, [21]బొత్తరలు, జక్కిలంబులు, మణుఁగుఁబూవులు, మోరుండలుఁ, బుండ్రేక్షుఖండంబులు, బిండఖర్జూరద్రాక్షానారికేళకదళీపనసజంబూచూతలికుచదాడిమీకపిత్తకర్కంధూఫలంబులు, గసగసలుఁ, బెసరుపులగములుఁ, జెఱకుగుడుములు, నరిసెలుఁ, బిసకిసలయములవరుగులుఁ, జిఱుగడములుఁ, బడిదెములుఁ, బులుపలుఁ, బులివరుగులు, నప్పడంబులు , బప్పు(లు), రొట్టియలును, జాపట్లు, బాయసంబులుఁ, గర్కరీకారవేల్లకూశ్మాండ నిష్పావకపటోలికాకోశాతక్యలాబూ

శిగ్రూదుంబరవార్తాకబింబికారవింద శలాటువులును, గందయుఁ, బొందయుఁ, జారులుఁ, దియ్యగూరలుఁ, బచ్చడులు, భజ్జిగలు, భిజ్జిగిణులు, వడియంబులుఁ, గడియంబులుఁ, గాయంబులు, గంధతోయంబులు, నుండ్రాలు, నానబాలు, ననుములు, మినుములు, బుడుకులు, నడుకులు, నిలిమిడియును, జలిమిడియును, ద్రెబ్బడయు, వడయు, నుక్కెరలు, జక్కెరలును, నేతులుఁ, దేనెతొలలుఁ, బిట్టును, గుట్టును, ద్రోఁపలు, ఫాలతిమ్మనం బూపలు, మోదకంబులు, గుడోదకంబులు, శాకంబులు, చెఱుకుపాకంబులు, ముక్కులు, మొరయని (మురియని) చొక్కంపుటేరుఁ బ్రాలమిలమిలని మడుంగు రాజనంపుటోగిరంబులు, షాడబంబులతోడఁ, బానకంబులతోడఁ, దిమ్మనంబులతోడఁ, దధిపిండఖండంబులతోడ, మీఁగడలతోడ, మజ్జిగలతోడ, నూరుఁగాయలతోడ, నంబకబళంబులతోడ, దసావళులతోడంగూడ, భుగభుగలం దగుబొరగఁగంపులతోడం బ్రతిభటించు రామఠామోదంబును, రామఠామోనంబుతో మంతనంబాడు మెంతుల నెత్తావులు, మెంతులనెత్తావులతో బిత్తరించు జీరకంబులసౌరభంబులును, జీరకంబులసౌరభం(భ్యం)బులతోడం బ్రస్తరించు కుస్తుంబురుకిసలయవాసనలును, గుస్తుంబురుకిసలయవాసనలతోడం బిసాళించుచుఁ గఱివేపాకుపరిమళంబును, గఱివేపాకుపరిమళంబుతో సంబంధించుకమ్మకసిందగంధంబులును, గమ్మకసిందగంధంబులతోడం దార్కొనునేలకులసౌరభంబులును, నేలకులసౌరభంబులతో సాళగించుకాలాగురుకురంగనాభి కర్పూరగంధసార నీహావాఃపూరంబుల వలపు

లును, కాలాగురుకురంగనాభికర్పూరగంధసారనీహారవాఃపూరంబులవలపులను, వానితోడం గలహించు మహిసాక్షిగుగ్గులుధూపధూమంబుల కమ్మదనంబును, గూడి భోజనాగారగవాక్షమార్గంబుల వెడలి కాశికానగరఘంటావీథులం బౌరజననాసికాపుటకుటీరంబులకుఁ గుటుంబకంబులుగా మిరియంబుపెరిమయుఁ, బసుపుపసయు, శొంఠిసొబగు, నావఠేవయు, జెందుప్పుచేఁగయుఁ, కరాంబువుమవ్వంబును, బిప్పలియొప్పును, నల్లంబు, మొల్లంబును, జింతగ్రొజురజ్జును, బేలపిండిమెండును, నిప్పపూమొగ్గల యగ్గలికయు, పెన్నాటకంబునుం గలిగి యొక్కొక్కమఱియుఁ దనకుఁదాన నులివేఁడికట్టావితో నావిర్భవించిన.

186


సీ.

తరుణకంకోలపాదపపల్లవముచాయ
        ఠవణించుజడలజూటంబు ముడిచి
హైమంబు లైనరుద్రాక్షకుండలములు
        శ్రవణపార్శ్వములందు సంతరించి
నిర్నాభిబిలముగా నెఱి వీఁగుబొజ్జపై
        సలిలకాషాయవస్త్రము ధరించి
యాపాదమస్తకం బఖిలాంగకంబుల
        నవ్యభస్మోద్ధూళనంబు సేసి


తే.

పాశుపతదీక్ష రూపంబు పడసినట్లు
శాంతి పుంభావ మొందినసౌష్ఠవమున
బంతినడిమికి నేతెంచి భవనభర్త
తపసులకు భక్తి నన్నంబు దారవోసె.

187


వ.

అంత.

188

తే.

ఆరగించెఁ జతుర్విధాహారములను
మనసుకోరిక నిండంగ మునిగణంబు
వారిబంతిన కుడిచె నావాసభర్త
ధర్మగేహిని తాలవృంతంబు వీవ.

189


వ.

భోజనానంతరంబున నాస్థానమంటపంబున సుఖోపవిష్టుండై ధర్మపత్నియుం దాను గృహపతి బాదరాయణు రావించి కూర్చుండ నియమించి కనుసన్నఁ జేసి విశాలాక్షికి నతనితో నాడంగలమాట లాడుమనిన నమ్మహాదేవి సాత్యవతేయున కిట్లనియె.

190


తే.

ఆరగించితె కడుపు నిండార నీవు?
శిష్యతతి భోజనంబు సేసెనె యథేచ్ఛ?
నదను దప్పినఁ దలఁగి యంతంత సున్న
వారు లేరు గదయ్య మీవంగడమున?

191


వ.

అనిన బాదరాయణుండు మహాదేవీ! షడ్రసంబులయందు నొక్కొక్కరసం బుల్బణంబును, ననుల్బణంబునుఁ, నుల్బణానుల్బణంబును ననుమూఁడుప్రకారంబుల ముయ్యాఱుభేదంబుల నాస్వాదనీయంబులై చతుర్విధాహారంబులయందు మాజిహ్వలకుం బండువు నేసె. కడుపునిండ భుజించితిమి. వాసరద్వయోపవాససం(ప్ర)భూతజఠరగోళక్షుధాగ్నితాపం బుపశమించె. అవసరంబు దప్పి భోజనంబు లేక యంతంత నున్నవారు మాయం దెవ్వరును లేరు. మున్నెన్నడుం జూడము వినము. ఇట్టియద్భుతంబుం గలదె! పాత్రంబులయందు విచిత్రంబు లగునన్నంబులు సవ్యంజనంబులయి తమకుందా మావిర్భవించు టెట్లు? మీ

ప్రభావంబు మీర యెఱుంగుదురు.మాకుఁజూడ నీవు విశాలాక్షి వీయయ్య యావిశ్వేశ్వర శ్రీమన్మహాదేవుండునుం గావలయు ననిపలికిన విని మూశానియు నలిగి యతండు కాశీనగరంబునకుం జేసిన యపరాధంబునకుం దగినశిక్ష సేయంగలదై యి ట్లనియె.

192


క.

[22]మే లగుఁ గాశీనగరం
బీలాగున భక్తి గలిగెనే భోజన మే
వేళం బుట్టదు? పుట్టని
వేళం గినియంగఁ దగునె వేదవ్యాసా?

193


ఉ.

ఎట్టు పురాణము ల్పదియునెన్మిదిఁ జెప్పితి? వెట్లు వేదముల్
గట్టితి వేర్పఱించి? నుడికారము దప్పకయుండ భారతం
బెట్టు రచించి? తీవు ఋషి వె ట్టయి? తొక్కదినంబుమాత్రలోఁ
బొట్టకు లేక తిట్టెదవు పుణ్యగుణంబులరాశిఁ గాశికన్.

194


క.

క్రోధంబు ఫలమె నిర్మల
బోధమునకుఁ? దీర్థవాసమున కర్హంబే
క్రోధము? వారాణసిపైఁ
గ్రోధించిన విశ్వభర్త గ్రోధింపఁ డొకో?

195


వ.

వారాణసి ముక్తిస్థానం బీతీర్థముమీఁద నెవ్వం డన్యాయము దలంచువాఁడు రుద్రపిశాచం బగు నని పలికి భవాని భవునియాననం బాలోకించిన.

196

తే.

కాశి నుండంగ నర్హుండు గాఁడు వీఁడు
వెడలి పొ మ్మను మాటలు వేయు నేల?
క్రోధసుం డెట్లు? కైవల్యకులగృహంబు
నానివాసంబు కాశికానగర మెట్లు!

197


వ.

అని విరూపాక్షుండు రూక్షాక్షరంబుల (దన్ను)నధిక్షేపించి పలికినం గలంగి వడవడ వడంకుచు వేదవ్యాసుం డయ్యాదిమదంపతులపాదారవిందంబులకుం బ్రణమిల్లి యేనపరాధంబు సేసితిఁ గోపం బుపసంహరింపవలయు నని ప్రార్థించిన.

198


సీ.

కాశికాపురిఁ దొంటికట్టడ నుండక
        పుణ్యకాలమునందు భూతతిథుల
వచ్చువాఁడవు శిష్యవర్గంబు నీవును
        నైదుక్రోశములకు నవలినేల
నుండువాఁడవు పైఁడికుండలు ప్రాకార
        వలయంబుఁ బొడగానవచ్చుచోటఁ
ద క్కన్యతిథులఁ దీర్థముల నిందింపకు
        బుద్ధిమంతుడవు గాఁ బొమ్ము బ్రదుకు


తే.

మంచు నంతర్హితుం డయ్యె నగజతోడ
విశ్వనాథుండు మునియును విశ్వభర్త
యాన తిచ్చినచోటనే యధివసించె
గాశికాపురి కెడదవ్వు కలుగునడవి.

199


తే.

అనిన విని కుంభసంభవుఁ డాదరమున
నాంబికేయున కభివాదనంబు సేసి
కాశిఁ గలతీర్థములును లింగములు నాకు
నాన తిమ్మని ప్రార్థించి యడుగుటయును.

200

వ.

కార్తికేయుం డౌర్వశేయున కి ట్లనియె.

201


క్షేత్రతీర్థకదంబవర్ణనము

తే.

అనఘ! యిట్టుల మాతల్లి యడిగె శంభు
హస్తములు మోడ్చి యడిగిన నధికకరుణ
నాన తిచ్చె విశాలాక్షి యనెడుపేరి
యస్మదంబకు దరుణచంద్రార్ధమౌళి.

202


వ.

విశాలాక్షీ! మోక్షలక్ష్మికిం బుట్టినిల్లగు కాశీపట్టణంబున విశ్వేశ్వరాభిధానుండ నైననాచుట్టుననుం బంచక్రోశమధ్యంబునను విరించిహరిపురందరాదిబృందారకవందనీయంబులై నిగూఢంబులు నగూఢంబులు గూఢాగూఢంబు లగు దివ్యలింగంబులుం బుణ్యతీర్థంబులు బావనవాపీకూపతటాకంబులు లెక్కించి చెప్ప గోచరంబులుగావు. లేశమాత్రంబునుఁ జెప్పెద. సావధానమతివై యాకర్ణింపుము. సారసలోచన! సారస్వతేశ్వరుండు సారస్వతప్రదుండు; నీలవేణి! గోప్రేక్షుండు దాక్షిణ్యనిధి; అచలకన్యక! దధీచీశ్వరుండు పాపవిమోచనుండు; కనకకేతకీ (కుసుమ) గర్భపత్ర సగోత్ర గౌరి! యత్రీశ్వరుం డిహాముత్రఫలప్రదాత; లజ్జావతి! విజ్వరేశ్వరుండు గుజ్జుకల్పతరువు; తలోదరి! వేధేశ్వరుండు కరుణానిధి; కుశేశయగంధి! యాదికేశవుం డఖిలక్లేశనాశకుండు; తన్వంగి! సంగమేశ్వరుండు తంగేటిజున్ను; తీగఁబోఁడి! చతుర్ముఖేశ్వరుండు భయత్రాత; ఇంతి! శాంతీశ్వరుండు చింతామణి; కాంత! శాంతీశ్వరుండు సంతతికరుండు; విపులశ్రోణి! కాపిలహ్రదం బఘగదాగదంకారంబు; కిసలయోష్ఠి! యనసూయేశ్వరుండు కొంగుపసిఁడి; ముగ్ధ!

సిద్ధివినాయకుండు కామధేనువు; తరుణ! హిరణ్యకశిపులింగంబు ముంగిటినిధానంబు; మందగమన! మందాసురేశ్వరుండు వందారుజనమందారంబు; సుదతి! సతీశ్వరస్కందేశ్వరప్రసన్నవదనేశ్వరులు శాశ్వతైశ్వర్యసంధాయులు; చండి! ప్రసన్నోదకుండంబు దురితఖండనంబు; అష్టాదశయోగపీఠికారాధిష్ఠాత్రి! యట్టహాసేశ్వరుండు ఘటితాఘప్రఘట్టుండు; జగద్ధాత్రి! మిత్రావరుణవృద్దవసిష్టకృష్ణయాజ్ఞవల్క్యప్రహ్లాదవైరోచనేశ్వరులు సర్వాభీష్టఫలప్రదాయకులు; పల్లవపాణి! బాణచంద్రవిద్యేశ్వరులు క్షుద్రోపవనవిద్రావణులు; కర్ణమోటీ! వికటాదేవి జంబేటికాలువ; గౌరీ! వీరేశ్వరుండు వారాణసీపంచముద్రమహాపీఠపట్టాభిషిక్తుండు; లీలావతి! వాలిహనూమదధీశ్వరుల లింగంబులు మంగళప్రదంబు లని చెప్పి వెండియు.

203


దండకము.

విను మభినవవిద్రుమాతామ్రదంతచ్ఛదా! భద్రకుండంబు గండూషితాశేషదోషంబు భద్రేశ్వరశ్రీమహాదేవుఁ డందుండు, దత్కుండపూర్వోత్తరాశావిభాగంబునం జక్రకుండంబు చక్రేశుఁ డందుండు, దత్సేవ సంసారచక్రక్రమప్రక్రియాధిక్కృతి, ప్రౌఢ! తన్నైరృతాశంద్రికూటేశ్వరుం డుండు, నాచేరువన్ శూలికుండంబు, శూలాహ్రదస్నానపానంబులన్ మానవుం డొందు నేనోనివృత్తిం దదగ్రంబున న్నారదేశుండు గోటీశుఁడుం గోటితీర్థంబు నంగారకాధీశుఁడున్, దుర్గ! చాముండియున్ భార్గవేశుండును న్గాపిలేశుండు నోంకారమత్స్యోదరీతీర్థరాజంబులున్ శంకుకర్ణేశ్వరాఘోరనాథేశుఁడున్ రుద్రవాసాహ్రదంబున్ మహాపాతకోపద్రవో

ద్రేకవిద్రావణప్రౌఢిముద్రాసమున్నిద్రరౌద్రోదయస్ఫూర్తులై యుందు, రాచక్కటిం గౌస్తుభేశుండు సిధ్ధీశుఁడుం గామకుండంబు లక్ష్మీశ సత్యామృతేశానులుం జంద్రకుండంబు నింద్రేశచంద్రేశ్వరాగ్నీశులున్ బాలచంద్రేశుఁడు్ వృద్ధకాలేశలింగంబు దక్షేశలింగంబునై రావణాధీశలింగంబు ధన్వంతరీశానలింగంబునుం దుంగనాథేశలింగంబు శ్రీభైరవాధీశలింగంబు దర్శించు మర్త్యుండు మృత్యూద్భవంభైన భీత్యుద్గమంబున్ బెడంబాయు వ్యాసేశ్వరవ్యాసకుండబులుం బంచచూడాసరోమధ్యమేశానమందాకినీతీర్థముల్ రామభద్రేశుఁడున్ జంబుకశ్రీమతంగేశులున్ సిద్ధకూపంబు సిద్దేశుఁడున్ వ్యాఘ్రలింగంబు వాతాతపేశానుఁడున్ హారితేశుండు గాణాదకూపంబు గాణాదలింగంబు నాషాఢనాథేశుఁడున్ భారభూతేశుఁడున్ శ్రీగభస్తీశుఁడున్ మంగళేశుండునుం ద్వష్టృనాథేశుఁడున్ దైవదైతేశుఁడున్ మంగళాదేవియున్ శ్రీమయూఖార్కుఁడున్ [23]వ్యాఘ్రపాదేశుఁడున్ శ్రీవిభాండేశలింగంబు సిద్ధేశలింగంబు నాలక్షకోట్యర్బుదన్యర్బుదానేకలింగంబు లాకాశగంగాప్రతీరంబునన్ గాశికాక్షేత్రసీమావిభాగంబునన్ భోగమోక్షంబులున్ సేవకశ్రేణి కీఁజాలుఁ గల్యాణి! కాత్యాయనీ! దేవి! నారాయణీ! శ్రీవిశాలాక్షి! సత్యంబు సత్యంబు సత్యంబు ముమ్మాటికిన్.

204


క.

గంగాధరుసన్నిధి హరి
ముంగలఁ జదివినను విన్న ముక్తిధరిత్రీ

లింగాభిధానమాలిక
భంగించును బంచజనునిపాపౌఘంబుల్.

205


తే.

ఒక్క పేరిలింగంబులు పెక్కు గలవు
కలవు పె క్కొకపేరిన కలువకొలఁకు
లొక్కపేరిన కలవు పెక్కుపవనములు
గాశికాపట్టణమునందుఁ గంబుకంఠి.

206


తే.

అంధువులసంఖ్య లెక్కింప నలవి గాదు
కుండముల సంఖ్య లెక్కింప గొలఁది గాదు
వాపికలసంఖ్య లెక్కింప వలను గాదు
పద్మలోచన! కాశికాపట్టణమున.

207


మ.

మునుపు మ్మచ్చటయు న్రహస్యమునను న్ముద్రించి నానాదివౌ
కసు లాస్థానముఁ గూడియాడుదురు శ్రీకాశీప్రదేశంబునన్
గసవై పుట్టెడుభాగ్యమైన మనకున్ గల్పింపదా దైవ మీ
కసుమాళం బగునాక మేల యని యుత్కంఠాతిరేకంబునన్.

208


తే.

కాశి శివలింగకోటులఁ గన్నతల్లి
కాశి కైవల్యఫలసవకల్పవల్లి
గంగగారాబునెచ్చలికత్త కాశి
సురనరోరగదైత్యసంస్తుత్య కాశి.

209


తే.

శైలసుత, సర్వతీర్థైకజన్మభూమి
సర్వవేదపురాణశాస్త్రములగరిడి
సర్వపాపౌఘజలదజంఝామరుత్తు
సర్వమోక్షమ్ములకు శుభాస్పదము కాశి.

210


ఉ.

దుర్గ! హిమాచలంబుఁపయి దుస్సహమైన తపంబు సేసి త
ద్ధూర్గరిమంబున న్ననుఁ గుతూహలిఁ జేసితి వీవు కాశి నె

సర్గిక మైనతేజమున సంతస మందఁగఁ జేయు నన్ను నీ
మార్గము కాశికానగరిమార్గముఁ జూడుమ యెద్ది యెక్కుఁడో?

211


క.

నీ వెంతప్రియవు నాకును
దేవి! విశాలాక్షి సర్వదేవనమస్యా
కైవల్యజన్మనినిలయము
శ్రీవారాణసియు నంతప్రియ మైయుండున్.

212


తే.

స్కందనందిమహాకాళకరటిముఖులు
నైగమేషవిశాఖులు నలిననేత్ర!
పట్టిచూడంగ నా కెంత పరమహితులు
పాయ కవిముక్తమున నున్నప్రజలు నట్లు.

213


తే.

వేల్చినారు తపంబు గావించినారు
తీర్థములు సర్వములును సాధించినారు
కమలలోచన! యానందకాననమునఁ
బాయకుండెడుజనులు ప్రాగ్భవమునందు.

214


తే.

భువనభారంబునకుఁ గాఁగఁ బుట్టినారు
కాశిఁ గాఁపున్న ప్రజలు దక్కఁగ లతాంగి
యక్షగంధర్వగరుడవిద్యాధరులును
దందశూకులు నర్థవాదంబుగాదు.

215


తే.

[24]కాశిపురి నున్న యట్టిపుల్కసునిఁ బోల
రితరభూముల నున్నవా రెంతవారు
శోత్రియులయింటఁ బుట్టనీ శ్రుతులు నాల్గు
నభ్యసింపంగ నీసరోజాయతాక్షి?

216


సీ.

సాక్షాద్ద్విసంఖ్యాధికేక్షణుం డనవచ్చు
        గాశీఁ గాఁపుర మున్నకాఁపుకొడుకు

కాశిఁ బంచక్రోశికడసీమ మొలచిన
        గఱికతో సరిరావు కల్పకములు
కల్పాంతకాలంబు గరుసు దాఁటిననాఁడుఁ
        గాశి ముంపఁగ లేదు కడలివెల్లి
బ్రహ్మాదులకుఁ గాశిఁ బాదచారమ కాని
        యొక్క మర్యాది లే దెక్కిరింత


తే.

సుదతి! పాపములకు నెదుర్చుక్క కాశి
వెలఁది! యుపపాతకములకు విషము కాశి
భామ! కల్యాణమున కాటపట్టు కాశి
ఇంతి! మోక్షంబునకుఁ బుట్టినిల్లు కాశి.

217


తే.

అన్నికుండంబులను దీర్ఘమాడినఫల
మన్నిలింగంబులకు మ్రొక్కినట్టిఫలము
గలదు నీహారగిరిరాజకన్య! నిజము
మరియు నీతీర్థములు విన్న మానవులకు.

218


సీ.

జపియింపఁ దగుఁ బితృశ్రాద్ధకాలంబుల
        నిమ్మహాస్తోత్ర మద్రీంద్రతనయ!
పంచమహాపాపభద్రేభపంచాస్య
        మిమ్మహాస్తోత్ర మద్రీంద్రతనయ!
పఠియించువారలపాలి కల్పద్రుమం
        బిమ్మహాస్తోత్ర మద్రీంద్రతనయ!
నాకు నత్యంతమనఃప్రమోదావహం
        బిమ్మహాస్తోత్ర మద్రీంద్రతనయ!


తే.

డాంబికున కుద్ధతునకు నధార్మికునకుఁ
గూటసాక్షికి శఠునకుఁ గుత్సితునకు

హేతువాదికిఁ గ్రూరున కిది యనర్హ
మిమ్మహాస్తోత్రరాజ మద్రీంద్ర తనయ!

219


వ.

అని గంగాధరుండు కాశీలింగతీర్థమాహాత్మ్యంబు విశాలాక్షికి వినిపించుచుండె. ఆసమయంబున మందరాచలంబున నుండి దివోదాసోచ్చాటనానంతరంబు గాశి కేగుదెంచి బహిర్గేహంబునం బట్టాభిషేకంబు గైకొని యంతర్గేహప్రవేశంబునకు శుభముహూర్తంబు ప్రతీక్షించుచుండ నమ్మహోత్సవకాలం బాసన్నం బగుటయు నందికేశ్వరుం డేగుదెంచి యి ట్లనియె.

220


సీ.

ఊర్జమాసంబున నుడురాజునభివృద్ధి
        ప్రతిపద్దినంబున భాస్కరుండు
గగనహర్మ్యశిఖాగ్రకనకకుంభంబు గా
        నభిజిత్తునందు మధ్యాహ్నవేళఁ
బ్రాలేయకరుఁడు సప్తమరాశితోఁ గూడఁ
        బంచగ్రహము లుచ్చపదవి నుండఁ
గరణంబు యోగనక్షత్రంబులును లెస్స
        గా లగ్నసంశుద్ధి కలిమి మెఱయ


తే.

మంచికాలంబు సాధించి మనసు గెలిచి
బ్రహహరివాసవాదుల పరమనిష్ఠఁ
గాచి యున్నారు మీరాకఁ గాలకంఠ!
వేగి విచ్చేయు గేహప్రవేశమునకు.

221


వ.

అది నందికేశ్వరుండు విన్నవించినం బరమానందకందళితహృదయారవిందుండై యయ్యిందుశేఖరుండు విశాలాక్షీసహితుండై మోక్షలక్ష్మీలీలదర్పణం బై యంతఃపురప్రాసాద

మందిరంబు ప్రవేశించె. సురభిగంధంబులై గంధవాహంబులు వొలసె. గంధర్వులు దివ్యగాంధర్వంబున మద్రకాది(మహా)ప్రబంధంబులు పాడిరి. అప్సరస లాడిరి. మహర్షులు హర్షించిరి. చారణులు సం స్తుతించిరి. ప్రమథులు ప్రమోదించిరి. విద్యాధరులు పుష్పవర్షంబులు గురియించిరి. చరాచరభూతజాలంబు సంప్రీతిమేదురంబు లయ్యె. పంచమహావాద్యంబులు సెలంగె. ఇబ్బంగి గృహప్రవేశమహోత్సవారంభంబు త్రిభువనచరదృక్కరంభం బయ్యె. నయ్యవసరంబున.

221


ఉ.

వెగ్గల మైనవాసనలు విశ్వజగంబులఁ గ్రమ్మ వేల్వఁగా
గుగ్గులుధూపధూమము లగోచరలీల నజాండగోళము
స్మగ్గఱఁ బాఱె వానిమిళనంబునఁ గాదె నభంబు గల్వపూ
[25]మొగ్గయుఁబోలి యిప్పుడు సమున్నతి నీలిమ మయ్యెఁ జూడ్కికిన్.

222


తే.

అవసరం బిచ్చి శివుఁడు బ్రహ్మాచ్యుతాది
దేవతల గారవించె నతిప్రియమున
నటు విశేషించి మధుకైటభాసురారి
నాదరించెను గారవం బతిశయిల్ల.

223


వ.

ఆదరించి యిట్లని యానతిచ్చె.

224


తే.

నీకతనంబునఁ గాదె నాళీకనయన?
కలిగెఁ గ్రమ్మఱ నానందకాననంబు
తక్కొరుఁడు నేర్చునే దివోదాసనృపతి
విబుధసందోహవిద్వేషి వెడల నడువ?

225


వ.

నీకుం బ్రియం బెయ్యది? యదియ వరంబుగా నిత్తు ననిన నచ్యుతుం డంబికావల్లభున కి ట్లనియె.

226

తే.

ప్రియము నా కొండు గలుగ దీత్రిభువనముల
గలదు ప్రియ మొక్కటియ చూడఁ గాలకంఠ!
కాశికాపట్టణమున నివేశసంబుఁ
గరుణ నొప్పార నిమ్ము నీపొరుగునందు.

227


విశ్వేశలింగమాహాత్మ్యము

వ.

అనిన విని శంభుం డట్లయగుంగాక యో విశ్వంభర! నాచేరువనే యుండు, మొదల నిన్ను నారాధించి పిమ్మటఁ బ్రజలు న న్నారాధించువారు. ఇదె చూడు, దక్షిణమంటపం
బైన యీయపవర్గమంటపంబునఁ గాశీమాహాత్మ్యపుణ్యకథలు వినునది. మణికర్ణికాస్నానానంతరంబ ముక్తిమంటపంబునఁ బురాణంబు వినుట కర్తవ్యంబు.

228


తే.

కాశిఁ దీర్ఘంబు లెన్నేని గలుగనిమ్ము
చక్రతీర్థంబు తీర్థంబె శార్ఙ్గపాణి!
కాశి లింగంబు లేన్నేని గలుగనిమ్ము
విశ్వపతి మేటి లింగంబు విహగగమన!

229


క.

కైవల్యమంటపం బిదె
నావిహరణభూమి పద్మనాభ! విముక్త
శ్రీవనితాశుద్ధాంతము
గ్రైవేయవిభూషణంబు గాశీపురికిన్.

230.


వ.

ఈముక్తిమంటపంబునకు భవిష్యద్ద్వాపరంబునఁ గుక్కుటమంటపం బనునామాంతరంబు గలుగఁ గలయది. యావృత్తాంతంబు వివరించెద. ఆకర్ణింపుము. ఆనందకాననంబున మహానందుం డనుబ్రాహ్మణుం డగ్రవేది పిన్ననాఁట పితృ

మాతృవియోగంబు నొంది యవినయనిధానం బై యౌవనంబున విషయాసక్తుండై విషమశరశరశలాకాకీలితం బైనచిత్తంబున నుత్తమాంగన(నుం) బొరుగింటిబ్రాహ్మణు(ని) భార్య మైత్రీచ్ఛద్మంబున నపహరించి యపేయపానం బభక్ష్యభక్షణం బగమ్యాగమనం బనాచారాచరణంబు గర్తవ్యంబులుగా వర్తించుచు.

231


సీ.

శైవుఁడై యొకవేళ సర్వాంగకంబుల
        భూతియు రుద్రాక్షములు ధరించుఁ
బఠియించు శ్రీగీతఁ బరమభాగవతుఁడై
        యుద్ధతి నటియించు నొక్కనాఁడు
గొరగయై మైలారుఁ గొనియాడు నొకవేళ
        నొసలిపై బండారుపసుపుఁ దాల్చి
ప్రణుతించు నొక్కవీరాదేవి నొకవేళ
        బవినీఁ డయి సమగ్రభక్తిగరిమ


తే.

బౌద్ధుఁడై యొకవేళఁ గాపాలికుఁడయి
యొక్కవేళను జైనుఁడై యొక్కవేళ
దిరుగు నాయాయిచిహ్నము ల్పరిఢవించి
యర్థకాక్ష మహానందుఁ డవనిసురుఁడు.

232


తే.

శైవపరిషత్తుఁ గూడి వైష్ణవుల నవ్వుఁ
బదరు శైవుల వైష్ణవప్రతతిఁ గూడి
శైవుఁడును గాఁడు తాను వైష్ణవుఁడు గాఁడు
పరమధూర్తాగ్రగణ్యుండు బ్రాహ్మణుండు.

233


క.

ఏవేషము ధరియించిన
నావేషము తనకు నడ్డమై యద్ధాత్రీ

దేవుఁడు చెట్టునఁ బుడికిన
భావంబున నుండు రూపు ప్రాయము కలిమిన్.

234


తే.

ద్వారవతి గంగమట్టి హస్తమునఁ గరఁచి
ఫాలమున నూర్ధ్వపుండ్రంబు పట్టె దీర్చి
యుభయదర్భలు ధరియించి యుదయవేళ
గంగదరి నుండు దానాభికాంక్ష నతఁడు.

235


ఉ.

ఏమని చెప్పఁ గాశిపురి నెందును సంకుచితాగ్రహస్తుఁడై
భూమిసురుండు దానములు పుచ్చుకొనండు దరిద్రుఁ డయ్యు నే
నేమఱుపాటునం గనిన నేటితటంబున నర్థకాంక్షఁ బే
రాముదపాకునట్ల తనహస్తము విచ్చియయుండువానికిన్.

236


తే.

ఇవ్విధంబున బ్రాహ్మణుం డేపు రేగి
తిరుగుచుండఁగఁ బెక్కువత్సరము లరుగఁ
గలుగుదురు పుత్రు లిద్ద ఱక్కాలమునకుఁ
గుండగోళకశబ్దంబు కొనలు సాగ.

237


వ.

అక్కాలంబునం దొక్కచండాలుండు బహుధనాఢ్యుండు వింధ్యపర్వతదేశవాసి తీర్థయాత్రాప్రసంగంబునం గాశి కేతెంచి చక్రపుష్కరిణీహ్రదంబునఁ దీర్థం బాడి యార్ద్రవస్త్రధరుండై దరి కేతెంచి నలుదిక్కులం జూచి యుచ్చైస్స్వనంబున.

238


శా.

చండాలుం డను వింధ్యభూధరమహాసానుస్థలీపక్కణ
స్థుండం గాశికి వచ్చి సిద్ధతటినీతోయంబులం గ్రుంకితిన్
వెండియుఁ బైఁడియుఁ వెచ్చినాఁడఁ గలఁడే విప్రుండు విద్యాసము
ద్రుం డీయర్థము వాని కేను బితృసంతోషార్థమై యిచ్చెదన్.

239


తే.

అనిన విని భూసురోత్తము లద్దిరయ్య!
కాశి యఁట గంగ యఁట మణికర్ణిక యఁట

విశ్వపతి యఁట యవిముక్తవిహృతిభూమి
మాలచే దారగొనెడు బ్రాహ్మణుఁడు గలఁడె?

240


తే.

అనుచుఁ జేతులఁ గర్ణంబు లదిమికొసుచుఁ
బోవనున్నారు నది నున్న భూమిసురులు
చూపనున్నాఁడు వ్రేల భూసురుఁ డొకండు
సాహసికుఁడు మహానందు సన్న సేసి.

241


సీ.

ప్రార్థింపసున్నాడు పాదాబ్దముల వ్రాలి
        వెలివాడవాఁడు తద్విప్రకులుని
మేల్కొననున్నాఁడు మిథ్యాసమాధి న
        క్కపటధార్మికుఁ డప్డు కన్నుఁ దెఱిచి
ప్రణుతింపనున్నాఁడు బ్రాహ్మణబ్రువు మాల
        కేల్దోయి నొసలిపైఁ గీలుకొలిపి
దీపింపనున్నాఁడు దెలిసి దోహరిబంటు
        చెవి నక్షమాలిక చెరివి ద్విజుఁడు


తే.

ప్రబలత భక్తి నీరీతి బ్రస్ఫుటముగ
వివిధదంభంబు లిబ్భంగి విస్తరిల్ల
నంత్యజుండును నగ్రజన్మాధముండు
గంగదరిఁ దీర్తు రుచితసత్కారవిధులు.

242


వ.

అనంతరంబ పరద్రవ్యజిహీర్షాలోభగ్రహగ్రస్తు డైనయయ్యగ్రజన్మాధముండు చండాలునిం గటాక్షమున వీక్షించి నిస్పృహత్వంబు నటించుచు.

243


తే.

ఆస లేదు ధనంబుపై నంత్యజన్మ!
చాలు యాయావరము శిలోంఛంబు మాకుఁ

గలుగునే వేడ్క సమలోష్టకాంచనులకు
నర్థములమీఁద? నని విప్రుఁ డపలపించు.

244


వ.

ఆచందంబున మనసుపట్టి యుండంజాలక.

245


సీ.

అవుఁ గాక! యేమి ద్రవ్యము తెచ్చినాఁడవు?
        తెచ్చినాఁడ ధనంబు దిమ్మలుగను
దెత్తు గా కేమి యీఁ దీరు నెంతసువర్ణ?
        మెంత యిచ్చినఁ జిత్తమ మిగ్రుచు నంత
మేలు గా కేమి టంకాలజాళెము లెవ్వి?
        యల్లవెపెట్టెలో నెల్ల నవియె
యుండుఁ గా కేమి యేనో యెందఱో పాత్ర?
        లీవె పాత్రంబు గా కెంద ఱేల?


తే.

యనుచు నొయ్యొయ్య మంతనం బాడుచుండ
బ్రాహ్మణుండును జండాలభటుఁడు గూడి
ద్రవ్యలాభంబు తీర్థయాాత్రాఫలంబు
దివుటమైఁ గోరి భాగీరథీతటమున.

246


తే.

అంత నమ్మక బ్రాహ్మణుఁ డర్థపరత
నిట్టు లనెఁ బుల్కసునితోడ నేవపడక
నేన యీయర్థము పరిగ్రహించువాఁడ
నొరుఁడు గలసిన నీధనం బొల్లఁ జుమ్ము.

247


వ.

అని పలికినఁ జండాలుండును నందుకు సమ్మతించి మణికర్ణికాహ్రదంబు తీరంబున గోమయంబునం బట్టు వేసి మార్తాండకిరణంబులలో మాఱుమండు పదియాఱువన్నెబంగారంబు రాశిపోసి చతురశ్రం బగునప్పట్టుమీఁద బ్రాహ్మణు నిలిపి భాగీరథీజలంబులఁ దత్పాదంబులు బ్రక్షాళించి గంధమాల్యాక్షతలం బూజించి యమ్మహాదానంబు ధారాసలిలపూర్వకంబుగా విశాలాక్షీసహితుండు గాశీపతి విశ్వనాథుండు సంప్రీతుం డగుంగాక యని యతని కాదానం బిచ్చునంత బ్రాహ్మణుండును సంతుష్టాంతరంగుండై నిజనివాసంబున కరుగు. చండాలుండును దమదేశంబునకుం బోవుఁ దతనంతరంబ.

248


క.

బహుళద్రవ్యంబుఁ బరి
గ్రహము గొనియె మాలచేత గంగయరుత న
మ్మహీసురుఁడు వంశమునకును
బహిరుండో! యనుచుఁ జాటఁ బలుతురు విప్రుల్.

249


క.

చండాలాత్తద్రవిణుఁడు
చండాలబ్రాహ్మణుండు జగతిని సాక్షా
చ్చండాలుఁడు గాశిని వీఁ
డుండిన నే ముండ మందు రుర్వీదివిజుల్.

250


వ.

ఇవ్విధంబునం గాశికానగరంబున భూతాక్రోశంబుగాఁ గన్నవారెల్లనుం దన్ను నిందింప విని విని వేసరి యొక్కనాఁ డర్ధరాత్రసమయంబున మహానందుం డానందకాననంబు వెడలి పౌరభీతుండై కాకభీతం బగు దివాంధంబునుంబోలెఁ జీకాకు వడి పుణ్యదేశంబులు చొరనెలమి లేమి గుటుంబసహితుండై కీకటదేశమునకుం బోవువాఁడై, యటవీమార్గంబున.

251


తే.

తాను నిల్లాలుఁగొమ్మయుఁ దనయయుగము
మొలల దీనారములజాళెములు వహించి
సాతుఁగూడి చనంగఁ దస్కరులు దాఁకి

నలుగురం బట్టి ధన మెల్ల నొనిచికొండ్రు!

252


వ.

ఒలిచికొని యాదొంగ లిట్లని వితర్కింతురు.

253


తే.

ధనము హేరాళ మబ్బె నీతఁడు బళాయి
వీడు ప్రాణాన కలిగిన వెదకి వెదకి
మనల బరి మార్చుఁ గా కేల మనఁగ నిచ్చు
నితని వధియింత మని నిశ్చయింతు రపుడు.

254


వ.

వధియింప నిశ్చయించి బ్రాహ్మణునిం జేరి కత్తిఁ దీటి యోయి విప్రుండ; నీవు కళత్రంబును నీతనయులును మీయిష్టదైవంబులం దలంచికొం డనుటయు.

255


తే.

అంబురుహనేత్ర శ్రీవిశాలాక్షిఁ దలఁచు
బ్రాహ్మణుఁడు చిత్తమున విశ్వభర్తఁ దలఁచుఁ
దలఁచుఁ బుత్రద్వయంబు సద్భక్తియుక్తి
గంఠపీఠాగ్రకరిరాజు డుంఠిరాజు.

256


వ.

వెండియు మహానందుం డాత్మగతంబున.

257


సీ.

పొరిగింటిబ్రాహ్మణిఁ బుణ్యగేహిని నేల
        యపహరించితిఁ గన్ను లార్చి యార్చి?
పడరానిబ్రాహ్మణపదవి భస్మంబుగా
        మధుమాంసముల కేల మరులుగొంటిఁ?
బరమనాస్తికుఁడ నై పాషండవేషంబు
        ఘటియించుకొని యేల కోర్కి నైతిఁ?
జక్రపుష్కరిణిలోఁ జండాలకుజుచే
        ధన మపారం బేల ధార గొంటి?


తే.

నాతతాయికి శఠున కన్యాయరతికిఁ
బాపబుద్ధికి విశ్వాసపాతకునకు

నాకు నిది ప్రాప్త మని మహానందుఁ డుండు
మస్తకము వాంచి కాంతారమధ్యభూమి.

258


చ.

తలలు దెగంగ వేయుదురు తస్కరవీరులు వారి నల్వురన్
నలువురుఁ జచ్చి యన్యజననంబునఁ గుక్కుటజాతిఁ బుట్టుటం
గొలఁకులకోళ్లలోఁ గలసి కోళ్లును నాలుగు నుండుఁగాన య
ప్పులుఁగుల గూటఁ బెట్టుకొనిపోదురు కాశికి సార్థవాహకుల్.

259


సీ.

రేపాడి మణికర్ణికాపయోవేణిక
        మజ్జనం బాడు నేమంబు మెఱయ
ముక్తిమంటపములో మునిజనంబు పఠింప
        విను నాదిమపురాణవిస్తరంబు
విశ్వనాథునిదివ్యవేశ్మంబునకు జేయు
        మైత్రి మీఁదఁ బ్రదక్షిణత్రయంబు
ద్వారభూములఁ జల్లు నీరాజనక్రియా
        దివ్యాన్నములఁ దీర్చు దేహయాత్ర


తే.

గోరి భజియించు నొకవేళఁ గొమరుసామిఁ
నాల్గుజాలును సంజ్ఞాస్వనం బొనర్చు
బ్రణవమంత్రంబు క్రేంకారపదముఁ గూర్చు
మిక్కుటం బగుగరిమతోఁ గుక్కుటములు.

260


వ.

ప్రాగ్జన్మవాసనావశంబున నజ్ఞానతస్కరత్వంబు గలిగి యాకుక్కుటచతుష్కంబు ముక్తిమంటపంబు నాశ్రయించి మోక్షంబు వడయం గావున నమ్మంటపంబునకుఁ గుక్కుటమంటపంబను సంజ్ఞాంతరంబు సంభవించు నని శంభుండు విశ్వంభరునకు నావృత్తాంతం బానతిచ్చె. విశ్వంభరుండును విశ్వేశ్వరలింగంబుతోడి సాంగత్యంబు వహించె నని చెప్పుటయు.

261

తే.

కుంభసంభవుఁ డంబికాసంభవునకు
బ్రణతుఁడై దేవతాయాత్రపదము దెలుపు
క్రమముతో నది మొదలుగాఁ గాశియందుఁ
దీర్థ మాడంగ నర్హంబు దివిజవంద్య!

262


దేవతాయాత్రావిధానము

వ.

అనినం గుమారస్వామి చక్రపుష్కరిణీతీర్ణంబున దేవర్షి పితృతర్పణంబు సేసి యాదిత్యాద్రౌపదీవిష్ణుదండపాణిమహేశ్వరడుంఠివినాయకజ్ఞానవాపీనందికేశ్వరతారకేశ్వరకాలేశ్వరుల సేవించి విష్ణువిశ్వేశ్వరుల నారాధించునది. అనంతరంబ ఓంకారలింగంబు
మత్స్యోదరీకృత్తివాసోలింగంబు రత్నేశ్వరుండు చంద్రేశ్వర కేదారేశ్వర కరవీరేశ్వర దక్షేశ్వర పార్వతీశ్వర పశుపతీశ్వర గంగేశ్వర నర్మదేశ్వర గభస్తీశ్వర సరస్వతీశ్వర తారకేశ్వరుల దర్శించునది. శైలేశ్వర సంగమేశ్వర మందాకినీశ్వర మణికర్ణికేశ్వర గోప్రేక్షేశ్వర కాపిలేశ్వర శుక్రేశ్వరేశ్వర వహ్నీశ్వర నకులేశ్వర భారభూతేశ్వర లాంగలీశ్వర మ(౦)దాలసేశ్వర తిలపర్ణేశ్వర త్రిపురాంతకేశ్వర మనఃప్రకారేశ్వర ప్రీతికేశ్వర బ్రహేశ్వ రాగస్తీశ్వర కశ్యపేశ్వర త్రిసంధేశ్వర హాటకేశ్వర సీమావినాయకత్రిసంధ్యేశ్వర విశాలాక్షీశ్వర రమేశ్వర ధర్మేశ్వర వినాయక వృద్ధాదిత్య చండిచండీశ్వర భవానీశ్వర పరాన్నేశ్వర వీరభద్రేశ్వర పంచవినాయకులం బూజించునది.

263


సీ.

యాత్రాక్రమం బిది యానందకానన
        వాస్తవ్యదేవతావర్గమునకు

నిది కాశికాఖండ మిమ్మహాఖండంబు
        శ్రీమహాస్కాందవార్థికి నమృతము
పఠియించినను దీనిఁ బ్రతిలిఖించిన విన్న
        దానంబు చేసిన దారులోహ
పాషాణపీఠికోపరిభాగమున నిల్పి
        గంధపుష్పముల నక్షతలఁ బూజ


తే.

సేసినను గాశికాభర్త శివుఁడు విశ్వ
నాయకుఁడు లక్ష్మి యిచ్చు దీర్ఘాయు వొసఁగుఁ
బ్రాభవంబుఁ బ్రసాదించు భక్తతతికి
శ్రీవిశాలాక్షి కృప సేయుఁ జింతితములు.

264


ఆశ్వాసాంతము

శా.

కర్ణాటక్షితీపాలమౌక్తికసభాగారాంతరాకల్పిత
స్వర్ణస్నానగతిప్రసిద్ధకవిరాట్సంస్తుత్యచారిత్ర! దు
గ్ధార్ణోరాశిగభీర! ప్రాహ్ణముఖమధ్యాహ్నాపరాహ్ణార్చితా
పర్ణావల్లభ! రాజశేఖరమణీ! పంటాన్వయగ్రామణీ!

265


క.

హేమాద్రిధీర! ద్రాక్షా
రామశ్రీభీమశంకరకృపాలక్ష్మీ
సామగ్రీపరివర్ధిత
భూమాసామ్రాజ్యవిభవ! పుణ్యశ్లోకా!

266


మాలిని.

వికచకములనేత్రా! నేమమాంబాసుపుత్రా!
సకలనృపశరణ్యా! సంభృతాశేషపుణ్యా!
మకరనిధిగభీరా! మానినీచిత్తచోరా!
ప్రకటగుణతరంగా! రాయవేశ్యాభుజంగా!

267

గద్యము.

ఇది శ్రీమత్కమలనాభపౌత్త్ర మారయామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ కవిసార్వభౌమ శ్రీనాథనామధేయప్రణీతంబైన కాశీఖండంబునందు సప్తమాశ్వాసము సర్వము సంపూర్ణము.






చ.

వరకవిసత్ప్రబంధములు బాలిశసంస్కృతి దుర్విదగ్ధతం
బొరసిపొకాలసంస్కరణముంబొనరించుటదుష్కరంబ; య
చ్చరిత మెఱింగియుం బలమసాహసరీతిఁ బొనర్చితిం బరి
ష్కరణము నెద్దియే నెరసుగల్గిన సూరులు దెల్పుడీదయన్.


క.

నలపుష్యకృష్ణదశమిన్
లలిఁ గాశీఖండకృతి సలక్షణముగ ను
త్సల వేంకటనరసింహా
ర్యులు సంస్కరణంబొనర్చి రుద్దీప్తము గాన్.

'శ్రీరామాప్రెస్సున' ముద్రితము.—1958.

  1. ‘జెట్టు వ్రేసినఁ జేటెఁ డక్షీణపుణ్య!’ అని పూర్వముద్రితపుస్తకపాఠము.
  2. అన్నింటికిని తీర్థంబు అని చేర్పఁబడినది.
  3. సారసోత్సలోదంచితసలిలసంభారరసాతల
  4. ‘పురశాసన! మాకు ననుజ్ఞ గల్గినన్.’ అని తాళపత్రపుస్తకపాఠము.
  5. 'వజ్రభూషణములు నాకు వలయుఁ దాల్ప' అని వ్రాఁతపుస్తకము.
  6. ‘నీతనికిని నెట్లు బిడ్డ నిచ్చితి (నదియున్) నాదిన్’ అచ్చుపుస్తకము.
  7. 'మును చంద్రుఁ; యిలచంద్రుఁ .. రోహిణీదేవి నొకకొంత రోసి' అని వ్రాఁతపుస్తకము.
  8. ఇచటఁ గైవారశబ్దము సంస్కృతసమాసఘటితమైయున్నది. ఇది సంస్కృతశబ్దముగూడ నని శబ్దరత్నాకరమున నున్నదిగాని యచ్ఛకర్ణాటశబ్దముగఁ గర్ణాటనిఘంటువులో నున్నది. ప్రాచీనసంస్కృతనిఘంటుగ్రంథములలో నెక్కడ నీశబ్దము గనఁబడదు. కావున నిది దేశ్యమొండెఁ గవివార(కవులకులుకులు) శబ్దతద్భవమొండెం గావలయు. ఈశబ్దము స్తుతిపరముగనే యఱవముననుఁ గన్నడమునను వాడఁబడుచున్నది. ఇట్లే శృంగారనైషధమునను 'మీకైవారదుర్భాషణం, బులకుం గాని' (ఆ-7. ప-89)యని ప్రయోగించియున్నాఁడు. శ్రీనాథుఁడు సంస్కృతశబ్దముగ భ్రమించె నని తోఁచుచున్నది.
  9. ‘వీరంద ఱెం తొప్పి’ అని వ్రా.ప్ర.
  10. 'ప్రజ్వలింపఁగరానిభంగి గా కొకభంగిఁ దఱచుగానుండె వైతాళివహ్ని' అని అచ్చుపుస్తకము.
  11. ‘కొండొరుఁ గడవంగఁ జొచ్చి రుగ్రత మెఱయన్’ అని వ్రాతపుస్తకము.
  12. క. ‘రావించె భృగుని’ పాఠాంతరము.
  13. ‘నయపంథంపు బృహస్పతి చొప్పెఱుంగఁడే.’ ఒక వ్రా.ప్ర.
    ‘చేదెఱుంగఁడే’ పూ. ము. ప్ర
  14. ‘చక్రవాళపరీత సర్వసర్వంసహా ప్రథితతీర్థములలోఁ బెరుగుఁగాశి’ యనుపూర్వముద్రితపుస్తకపాఠములో యతిభంగము. ఈపాఠ మిష్టమేని ‘చక్రవాక........పృథులతీర్థములలోఁ బెరుఁగు కాశి’ యని సవరించుకొనఁదగు.
  15. ‘గంగలోఁ జక్రపుష్కరిణీహ్రదంబున నఘమర్షణస్నాన మాచరించి
    నిలుచుండి కావించి నియతిమై గాయత్రి సంఖ్య యష్టోత్తరశతము గాఁగఁ
    బఠియించి యప్పుడు పత్రపుష్పములతో శివు నీలకంఠుని సేవ చేసి
    యంతరంగంబున నభవుని నిడుకొని శాంతచిత్తంబున సంధ్య వార్చి
    గీ. యగ్నికార్యముఁ దీర్చి కౌమారిఁ గొల్చి’ అని యొక వ్రాఁతపుస్తకమునఁ బాఠాంతరము.
  16. 'లందఱును ద్రిశూలపాణు లందఱును గిశో, రేందూత్తంసులు' అని పా.
  17. వెడలవలయు
  18. ప్రాకృత
  19. 'అంగరొల్లె' లని శబ్దరత్నాకరము.
  20. 'సారసత్తులు' అని శ. ర.
  21. బొంతరకుడుములు
  22. ఒక వ్రాఁతపుస్తకమున దీనికిఁ బద్యాస్తరము:-
    మేలుగఁ గాశీనగరం
    బీలాగున భుక్తి గలిగె నీభోజన మే
    వేళం బుట్టదు? పుట్టని
    వేళం గినియంగ దగునె వేదవ్యాసా!
    మఱియొక ప్రతిలో ‘కినియుటిది తగవె’
    ఇంకొకదానిలో ‘వేళనునీకిదియె తగవు’ యనియు నున్నది.
  23. శీఘ్రచండీశుఁడున్ చిత్రగుప్తేశుఁడున్ నిర్జరాధీశుఁడున్ నిమ్నగేశుండు శుక్రేశుఁడున్ శక్రకూపంబు శ్రీదాదికాధీశుఁడున్ శ్రీఆదికేశేశుఁడున్ పిశాచేశుఁడున్
  24. కాశికాపురినున్న పుల్కసుని
  25. మగ్గయుఁబోలె నిప్పుడు సమంచిత' ఇయ్యది విచార్యము.