కాళిదాస చరిత్ర/వివాహము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

వివాహము

ఆవనంబునకు

సమీపమున నొకదేశముకలదు. ఆదేశమునేలు రాజునకు సర్వాంగసుందరమైన సర్వమంగళ యను పుత్రిక కలదు. ఆమె యమేయ రూపలావణ్యసమేతమై తలిదండ్రులకేగాక బంధుమిత్రులకు, నగరవాసులకు నయనోత్సవము జేయుచుండెను. రూపమునకుదోడు వినయసంపత్తి కలదు. సకలశాస్త్రపారంగతుడైన యొకానొకబ్రాహ్మణుని రావించి యారాజు విద్యాబుద్దులు గఱపుమని తన గారాబుకూతును వాని కప్పగించెను. బాలిక మిక్కిలిశ్రద్దతోగ్రహించి గురుభక్తిగలిగి యయ్యవారు చెప్పినదంతయు సూక్ష్మబుద్దితో గ్రహించినదానిని మఱువక కుశాగ్రబుద్ధిశాలినియని పేరుదెచ్చుకొని క్రమక్రమముగ విద్యలన్నియు నేర్చుకొనెను. విద్యాపూర్తియైనపిదప రాజు గురువునకు గురుదక్షిణ నిమ్మని చీనిచీనాంబరములు వెలలేని యాభరణంబులు మొదలగునవి యిచ్చి గురువునకు సమర్పింపుమని పుత్రికనంపెను. గురువు వయోవృద్దుడయ్యు , జ్ఞానసంపన్నుడయ్యు, గుణహీనుడగుటచేత నాబాలికయొక్క నవయౌవనప్రాదుర్బావముంజూచి మోహ విష్టుడైపరవశత్వముజెంది బాలికతో నిట్లనియె—“లతాంగీ! నీగురుభక్తికిజాలమెచ్చితి నాకీయాభరణంబులేల? ఈకాంచనవస్త్రంబులేల? నీనిరుపమాన లావణ్య తారుణ్యంబుల జూచినది మొదలు నిన్నొక్కసారిబిగియాగు గౌగిటజేర్చి ముద్దాడవలెనని కోరిక పుట్టినది. నాయందునీకు నుజముగా భక్తికలదేని నాకోరికదీర్చుము. అదియే గురుభక్తి అదియే గురుదక్షిణ, అదియే శుశ్రూష“ యనిపలికి లేచి పయోముఖవిషకుంభమువంటి యా యుపాద్యాధముడు బాలిక హస్తము బట్టుకొనబోవ నామె యాశ్చర్య సంభ్రమంబులు పెనుగొన “చీ! నీవు గోముఖవ్యాఘ్రంబవు. పాముకడ రత్నమున్నట్లే నీకడవిద్యయున్నది. నీకు నేను బుత్రికాతుల్యను. మంచిచెడ్డలులేక పాపపుణ్యము బరికింపక వావివరుసల నరయక గోంకుజంకులేక యిట్టికాఱులఱచిన నిన్ను నాతండ్రితో జెప్పి యిప్పుడే శిరచ్చేదంబు చేయింపగలనుగాని గురువధామహాపాతకము నాకునంక్ర మించునను భయమున నీప్రాణములు రక్షించితి. జాగ్రత్తగా నుండుము“ అని విసవిస యంత:పురమునకుబోయెను. గురువు తాను గావించిన మహాపరాధంబునకు మనంబున లేశమైన పశ్చాత్తాపంబు నొందక యామెలంత పలుకులు వినితలషుకించి “ కాని! నీపనిపట్టెదనులే, నిన్నొక్క కిరాతుకునికిచ్చి పెండ్లిచేయింపకున్నచో నాపేరు మాఱుపేరుపెట్టుము“ అని తనకసిదీర్చుకొనిటకై సమయము నిమిత్త మెదురు చూచుచుండెను.

అంతట నారాజపుత్రిక సంప్రాప్తయౌవనమయ్యెను. దుష్ట నక్ష్త్రమందు రజస్వలయయ్యెను. గురువు జ్యోతిశ్శాస్త్రమందుగూడ నపారప్రజ్న గలవాడగుటచే రాజు వానిని రావించి దుష్టనక్షత్రమునందీడేరుటవలన గలిగిన యరిష్టమును బాపుకొనుటకై యేమిశాంతి జేయవలెనని యడిగెను. గురువు తనపగదీర్చుకొనుటకు దగిన యదను సమీపించెనని మనంబున సంతసించి యొక్క మూహర్తమాలోచించి యిట్లనియె. “రాజేంద్రా! ఈనక్షత్రమతిదుష్టమైనది. ఇదిగ్రహశాంతితోడను, బ్రాహ్మణ సంతర్పణములతోడను శమించునట్టికీడుకాదు. బాలికనే పరిత్యజింపవలయును. పూర్వము చంద్రమతీదేవి ఈవిధముగానే దుష్టనక్ష్త్రమందు రజస్వలయగుటచే జనకుడామెను పరిత్యజించెను. మీరు కన్నకూతురును కారడవులకంపి పరిత్యజింపలేరు. కావున ధర్మశాస్త్రములబట్టి మీకుపాయాంతరముజెప్పెదను. ఈమెను సుక్షిత్రియునకు గాక చదువురాని యొక మోటవాని కిచ్చి వివాహము చేయుడు. దానితొ నాపద నివారణ మగును. అట్లుచేయకపోదువేని మీకు రాజ్యవిచ్చిత్తి గలుగు, వంశనాశనమగును" అనవుడు రాజు మిక్కిలి విచారించి, యెట్టకేలకొడంబడి, విద్యాగంధ: మెఱుగని యనాగరికుడగు మోటవాని డొకనిని దోడితెమ్మని సేవకులం బంపెను.

ఆహా! చూచితివా! దురాత్ముడైన యాగురువు బాలిక కెట్టి ఇక్కట్లు తెచ్చిపెట్టెనో! దుర్జనులు పాపభీతి కలిగియుండరు. చదువుకొనినంతమాత్రముచేత మనుష్యుడెప్పుడును బూజ్యుడుకాడు. చదువుకన్న సద్గుణమే ప్రధానము. సకలశాస్త్రవేత్తయైనను, గునవిహీనుడైన మనుష్యుడు వర్జింపదగినవాడే .శిరస్సున మాణిక్యము మాణిక్యముధరించియున్నను ద్రాచుపాము బరిత్యజింపదగినదేగాని ముద్దుపెట్టు కొన దగినదికాదుగదా!

సేవకులు నానాప్రదేశములు సంచరించి యెట్టకేలకు బ్రాహ్మణకిరాతుడున్న యడవికిబోయి వాడే తగినవాడని వానిని బ్రతిమాలి "నీకు మహావైభవము పట్టగలదు రారా!" యని వానిని దోడ్కొని పోయిరాజునకు గురువునకుజూపిరి. గురువు వానింజూసి "శిహబాస్ ! మాకిట్టివాడే కావలెనురా" యనిమెచ్చెను. రాజు వానింగనుంగొని కుసుమ కోమలియై బంగారుబొమ్మవలె నున్న తనకూతును, మానికంబును మసిపాతనుగట్టినట్లు విద్యావిహీనుడు, రూపవిహీనుడు, గుణవిహీనుడు నగు కటిక వానికిచ్చి వివాహముచేయవలసివచ్చి నందుకు విచారక్రాంత మనస్కుడై విధియోగముదాట శక్యముగదని గుండె ఱాయిజేసికొని కూతు నాతనికే యిచ్చి వివాహముచేయ నిశ్చయించి ముహూర్త నిర్ణయము జేయించి, విశేషవైభవము లేకుండ సామాన్య్హముగ వివాహకార్యము జరిగించెను. పితృ వాక్యపరిపాలనమే ప్రధానముగాగల యా బాలిక తండ్రి యానతిచొప్పున వానిని వివాహమాడెను. ఆహా! మూఢవిశ్వాస మెట్టియాపదలు దెచ్చునో చూచితిరా? రాజు యుక్తాయుక్త్గ వివేచనాజ్ఞానములేక గురువుయొక్క స్వభావమెఱుంగక వానిమాటలయందే విశ్వాసముంచుటచేత దన ప్రియపుత్రిక కిట్టిపాట్లు సంప్రాప్తించెను.

వివాహమంగళవిధి సలక్షణముఘా జరిగిన పిదప రాజు పుత్రికకు బునస్సందాన మహోత్సవము చేయించెను., బాలిక చెలికత్తెలు కొందఱు కమ్మసంపెంగ నూనెతో దలయంటి పన్నీట జలకమాడించి హోంబటు దువ్వలుపలు గట్టబెట్టి నవరత్నస్ధగితములైన సువర్ణ భూషణములు బెట్టి సింగారించిరి. మఱికొందఱు నాటి ప్రాత:కాలము మొదలుకొని పడకగదే బలువిధముల నలంకరించిరి. అదివఱకే గోడలమీద వ్రాయబడిన చిత్తరువులుతోడను, జిత్రవిచిత్రముగా బల్లలమీద నమర్చంబడిన బొమ్మ్లలతోడను, వెండిదీపస్ధంభముల మీద బంగారుప్రమిదలలో నత్తరు చమురుతో వెలుగుచున్న దీపములతొడను, గది యతిరమణీయంబై మన్మధుని కొలువుకూటమి వలె వర్ణింపరాని సౌందర్యము గలిగి విరాజిల్లుచుండెను. సాయంకాలము భోజనమైన తొడనే పెండ్లికొడుకు ముందుగదిలో బ్రవేశించి బల్ల మీది బంగారు పళ్లెరములలో దంపతుల నిమిత్తమై యమర్చబడిన పండ్లను, భక్ష్యములను. గడు పాఱ మెక్కి కఠినశిలమీద బండుకొనుటచే మిక్కిలి కర్కశ మైన తనమోటమెను రాజపురుషోచితమైన యా హంసతూలికా తల్పము పై జేర్చి క్షణములోనిద్ర పోయెను. సఖీజనులు రాజపుత్రికను మెల్లమెల్లగా శయనాగారముజేర్చి బుజ్జగించి తలుపులువైచి యావలకు జనిరి. జగన్మోహనాకారము గలిగి త్రైలోక్య రాజ్యలక్ష్మివలెను, మన్మధుని యాఱవ బానమువలెను, గాలుచేతులు మొదలగు నవయవనములుదాల్చిన క్రొకాఱుమెఱుంగవలెను. జైతన్యము గలిగిన పసిడిబొమ్మవలెను, దళుకుతళున మెఱయుచున్న దీపముల కాంతి నడుమ దేదీప్యమాన ప్రభలతో వెలయుచున్న యామత్తకాళినీమ తల్లియొక్క యొయ్యారము, లావణ్యము, తారుణ్యము జూచు భాగ్యములేక యానిర్భాగ్యుడు బావురుపిల్లులు పోరాడు నట్లు పెద్ద గుఱ్ఱువెట్టి కుంబకర్ణుని తమ్ముడో యనునట్లు గాఢనిద్ర పొవుచుండెను. ప్రాణేశ్వరుడు వివాహమందలి నిరంతర వైదికవిధులచేత నలసిసొలసి యుండుటచేత కాబోలు నించుక కునుకుపట్టి యుండునని తలంచి యా రాజనందన యొకమూల గొంతసేపు నిలువంబడి యెంతసేపటికి నాతనికి మెలుకువరామి నొకపీఠముపై గూరుచుండి వీణాగానముచేత నతనికి మెలుకువ వచ్చునేమో యని వీణం జేకొని హాయిగా వాయింపజొచ్చెను. పెండ్లికుమారుడు నిద్రలొ నడుమ నడుమ 'ఓరీ! గంగులు పందిపిల్లపోయె పందిపిల్లబోయె కొట్టుకొట్టు పట్టుపట్టు" మని యొకసారియు"గంజినీళ్లు గంజినీళ్లు" యని యొక మాఱును బలవరించెను. ఆపలవరించుటవిని బాలిక "ఏమిది? ఇట్లు పలువరించుచున్నాడేమి?" యని భయము , నాశ్చర్యము మల్లడిగొన నేదొ యూలొచించుచు మనసు మనసులో లేక వీణ మఱింతగట్టిగా వాయించెను. అడవిలొ బెబ్బుల యొక్కయు, సింగములయొక్కయు, బొబ్బరింతలకు మెలుకువరాని యాపురుషునకు వీణాగాన మొక లెక్కయా? కుక్కలమొఱుగులేగాని బైరవరాగ మెన్న డాతని చెవిని బడియుండలేదు. నిద్రలో శంకరాభరణ ములవలె బుసకొట్టుటేగాని శంకరాభరణము వాని కర్ణ గోచరముకాలేదు. "పశుర్వేత్తిశిశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి" యనగా శిశువు, పశువు, పామునుగూడ గాన రసమును గ్రహించును. గానము పశువుల కానందము కలిగించును. గానము పశువుల కానందము గలిగించునా? అంత మనోహరముగా నామె పాడుచున్నను వాడు చెక్కుచెదరక నిద్రపొవుచుండెను. అంతటనామె చారక్రాంతియె మెల్ల మెల్లగా జెవితేశ్వరుని మంచముకడ కేగి మెలకువ వచ్చునేమో యని యించుక పన్నీరు వాని మేనిపైన జిలికెను. అది కాఱుదున్నపోతుమీద వర్షము కురిసినట్లు వానియెడ బ్రయొజనకారి కాదయ్యెను. అంతట నామె మెల్లగా మీదజేయివైచి సన్నసన్నముగా దనకంఠమెత్తి గానముచేసెను. అతడొకసారి కన్నెత్తిచూసి "ఓసే, గుయిగుయిలాడక తొంగోసి "యని యామె చేయిదీసివైచి మరల నిద్రపోయెను. అప్పుడామె భయసంశయాకులాత్మయై యావైచిత్య్రమేమో కనుగొనదలచి క్షణకాలమూరక కూర్చుండి మరల నాతనిమీద జేయివైచి తట్టి లేపెను. అతడు మెలకువ దెచ్చికొని 'యెందుకులేపినా" వని బిగ్గరగా నడిగెను. అందుకామె ధైర్యము దెచ్చుకొని "మెరెరెవ్వరు? మిక్కడికి దోడితెచ్చినవారెవ్వరు? మీవృత్తాంతమేమి? " యని యడిగెను.. అప్పుడతడు తనచరిత్రమంతయు మోటమాటలతో నెంతో రసహీనముగా నామెతొచెప్పెను. ఆ వృత్తాంతమువిన నామె మొగము చిన్నబోయెను. నెమ్మేను జలదరించెను. మనస్సు క్రుంగిపోయెను. రాజపుత్రి యగుటచే నెట్టకేలకు ధైర్యము దెచ్చుకొని తన మనసులొ నిట్లని విచారించెను.

"ఆహా! దైవమా! నాలేంబ్రాయము, నాజవ్వనము, నాచక్కదనము బూడిదబోసిన పన్నీరు తెఱంగున నడవిగాచిన వెన్నెల నడువున, జవిటినేల గురిసిన వానపోలిక, నిరర్ధకమయ్యెగదా! సుక్షత్రియుడై, సత్కులజాతుడై, సౌబాగ్యనిధియై, విద్యావిషయ వివేక సంపన్నుడై, యీడుజోడైయుందు ప్రాణనాధుని చెట్టబట్టి సౌఖ్యసాగరమందు దేలునట్టి భాగ్యము నాకు కలుగదయ్యెగదా! కొఱనోములు నోచి యధికఫలము గావలెనన్న నెట్లువచ్చు? ప్రాణనాధుడు మెచ్చని సౌభాగ్యసౌందర్యంబులేటికి కాల్చనా? ది పరమదుర్మాత్ముడైన నాగురువుచేసిన యపకారము. పరమూర్ఝుడైన నాతండ్రి, తేనెబూసిన కత్తివలెనున్న యావృద్ధపండితుని మాటాలు నమ్మి తనకు గీడు గలుగునని శంకించి తనయాపద నివారించుకొనుటకై తెగీతెగని బందికత్తితో నాగొంతుకోసినాడు. ఒకరిని నిందింపనేల? 'అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభ ' మ్మను నార్యొక్తి కలదుగదా! నేజేసిన కర్మయొక్క ఫలము నేననుబవింపవలెనుగదా! గతించినదానికై విచారించిన ఫలములేదని పెద్దలు చెప్పుదురుగదా! కాబట్టి విచారించుటమాని దీనికి తగిన ప్రతిక్రియ చేసుకోవలయును" నని క్షణమాలొచించి మగనిజూచి యిట్లనియె. "మహాత్మా! మీరుజతముచేత బ్రాహ్మణులు కర్మచేత గిరాతకులైనను బ్రహ్మతేజము నుండి మీరుద్బవించిరి గావున సహజములైన తెలివితేటలు మీయందు గూఢముగానుండును. దిస్సహవాసములచేత నీవఱకుజేసిన దురాచారముల విడచి మీరు విద్యావంతులై సాధువులై గౌరవనీయులగుటకు నొక్క యుపాయము జెప్పెద నినుండు. వినెదరా!" అనవుడు నాబ్రాహ్మణ కిరాతకుడు "సెప్పుసెప్పు యింటాయింటా" యని యనుటయు, దనమగడు దారికి వచ్చుచున్నాడని యాకళ్యాణి లోలోపలసంతసించి వెండియు నిట్లనియ, "స్వామీ! ఈయూరిబైట గాళికాదేవి యాలయముగలదు. ఆమె భక్తవత్సలురాలు. రాత్రులయందామె తనయాలయము విడచి లోకసంచారార్ధమై యరుగును. తెల్లవాఱుజామున నామె మరల గుడికి జొచ్చును. ఇప్పుడు రెండుజాముల రాత్రికన్న నెక్కువకాలేదు. ఈ క్షణమే మీరక్కడికరిగి యాలయము బ్రవేశించి తలుపులు లోపల గడియ వైచికొని మేలుకొనికూర్చుండుడు. భగవతికాత్యాయని లోకసంచారము సమాప్తముచేసి నాలవజామున నాలయము బ్రవేశించుటకై వచ్చును. అప్పుడు తలుపులు తీయుమని యడుగును అప్పుడు మీరు భయపడక కొండవలె నిశ్చయుడై 'నాకు విద్యా దానము ఛేసిన గుడి తలుపులు తీసెద, లేనిచొ దీయ ' నని కంథమెత్తి పలుకుడు. అంతట దెల్లవాఱుచున్నదను భయముచే దేవితత్తఱపడి గుడిలో బ్రవేశింపవలెనను కోరికతొ మీరు కోరిన వరములిచ్చి లోపలబ్రవేశించును. అప్పుడు మీరు విద్యవంతులగుదురు. ఆవిధముచే మీరు విద్యా వంతులు కావలెనుగాని ఇప్పుడక్షరములు నేర్చికొని పుస్తకముబట్టి పండితులగుట యసంభవము. విద్యావంతులైతిరా సమస్తవైభవములు గలుగును. విద్య వినయమొసగును. -భాగ్యమొసగును. ఇహపరసౌఖ్య మొసగును- గౌరవ మొసగును. వేయేల! విద్యకల్పవృక్షము. కాబట్టి నామనవిం జేకొని, పరమేశ్వరియైన కాళిం నాశ్రయింపుడు" అని భార్య హితొపదేశము జేయు భర్త మంచిదని నామెచెప్పిన చొప్పున జేయదలంచి పడటిల్లు విడచి పెరటిదారిన వీధిలొ బ్రవేశించి నాయర్ధరాత్రమున నిర్భయముగా నామె చెప్పిన యానవాళ్లనుబట్టి కాళికాలయమున కరిగి గుడిజొచ్చి తలుపులుమూసి గడియవైచుకొని లోపల గూర్చుండెను.

కాళికా ప్రత్యక్షము

కాళికయు యధేచ్చముగా

లోకసంచారముజేసి కడపటి జామున దన యాలయముకడకు వచ్చి తలుపులు మూయబడి యుండుటకు మిక్కిలి యక్కజమంది భయంకరముగా నిట్లనియె, "ఓరీ! యెవడురా! నయాలయము గవాటముబంధించి కూర్చున్నవాడు!