కాళిదాస చరిత్ర/కాళిదాసుని జన్మ వృత్తాంతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కాళిదాసు జన్మ వృత్తాంతము

పూర్వకాలమున మాళవదేశమున

నొక గొప్పతపోవనముకలదు. అది సకల వృక్షములతోను, పుష్పభరిత లతలతోడను, మిక్కిలి సుందరములగు పక్షివిశేషములతోను, నానావిధ మృగసంతతితోడను, నిండి యతిమనోహరమై మహాప్రభావ సంపన్నులగు మహర్షులతోడను నిండియుండెను. ఆతపోవన ప్రభావము వర్ణింపదరముగాదు. అక్కడి ఋషుల ప్రభావముచేత బిల్లులు నెలుకలు వైరములేక చర్లాట లాడుచుండును. నెమళ్లు వేసవికాలమందెండంబడి పాములను దమ ఫించములనీడకు జేర్చితాపశాంతి జేయును. ఆవులు పులిపిల్లలకు బాలిచ్చును. పులుల గుహలలో జింకలు నిద్రించును. చిలుకలు, గోరువంకలు మహర్షులు వల్లించునపుడు విని స్వాధ్యాయము జరుపుటయేగాక ఋషికుమారుల కప్పుడప్పుడు దప్పుల దిద్దుచుండును. భక్తిలేనివారికైన నాయాశ్రమము బ్రవేశించినపుడు విశేషమైన భక్తిజ్ఞానవైరాగ్యములు గుదురుచుండును. ఆ యాశ్రమము పవిత్రతకు దానలంబై శాంతికి స్ధావరమై జ్ఞానమునకు నిధియై భక్తికి బరమావధియై వైరాగ్యమునకు బుట్టినట్లై నిష్టకునిలయంబై విరాజిల్లుచుండును. వెందియు నాయాశ్రమంబు నిర్మల స్వాదుజలపూరితములగు సరొవరంబులును, సరోవరంబులకాంకారంబులై విలసిల్లు తామరపువ్వులును, బువ్వులయందలి ననమకరంద రసములు ద్రావుచు కమ్మని ఝుంకారమ్ములు చేయు తుమ్మెదలును, తుమ్మెదఝుంకారమ్ముల కనుగుణమ్ముగా గెలుగెత్తికూయు శుకపికశారికా సమూహములును గలిగి కన్నులపండువును జెవులకు విందును జేయుచు నతి రమణీయంబై యుండును.

ఆ యాశ్రమమున మహానుభావుండైన చిరంతపుడను నొకముని దీర్ఘకాలమునుండి తపస్సు చేయుచుండెను. అతడు కొంతకాలము ధూమపాయియై యనగా పొగబీల్చి బ్రతుకుచు, మఱికొంతకాలము గాలిదిని జీవించుచు మఱికొంతకాలము జలభక్షణముచేత నుదరము నిండుకొనుచు, మఱికొంతకాలమాకులు, దుంపలు, గాయలు పండ్లుమెక్కి పొట్టబోసుకొనుచు మఱి కొంతకాలము నిరాహారుండగుచు, మండువేసవి కాలమున బంచాగ్నిమధ్యమునను, వర్షాకాలమున నింగికి నేలకు నేకధారగా నాకసము చిల్లులుబడునట్లు వానలు గురియునప్పుడు బట్టబయటను, జగమతయు గడగడ నడకించునట్టి శీతకాలమున నహోరాత్రములు ద్రేళ్ళవలెనుండు చన్నీరుగల తటాకములయందును నిలిచి కొన్నాళ్లూర్ద్వ బాహుడై, కొన్నాళ్లొంటికాలిమీద నిలిచి యుగ్రతపము జేసెను. అతని ఘోరతపము గాంచి మౌనులు కిమ్మనక యూరకుండిరి. వేల్పులు వెఱగొందిరి. విద్యాధరులు విన్నంబోయిరి. సిద్ధులు సిగ్గుపడిరి. సన్నగులు పాఱిపోయిరి, గరుడులు గడగడనడంగిరి. పదునాల్గులోకములు పల్లటిల్లెను. అష్టదిక్పాలకులు తమతమస్ధానంబుల నితడు తపొవైభవంబున నాక్రమించుకొనునని దిగులుజెంది యింద్రునితో మొఱబెట్టుకొనిరి. ఇంద్రునకు నట్టి భయమే గలుగుటంజేసి తనయాస్థాన వేశ్యలగు రంభాదులను రావించి గౌరవించి యిట్లనియె-- "సుందరులారా! మీవలన నాకొక్క ప్రయోజనము కలదు. అయ్యది మీరు తప్పక చేయవలయును. భూలోకంబున నొక మహర్షి చిరంతపు డనువాడు మహోగ్రతపము చేయుచున్నవాడు. ఈవఱకు దేవమానరాక్షసుల తపంబుల జూచితిమి గాని యింత లోకభయంకరముచేయు ఘోరతపము జేయువా డెనడు గనపడడు వాడు తనదారుణ తపముచే దిక్పాలకుల దమ పదవులనుండి దిగద్రోచి వాటిని దానాక్రమించుకొనుటేనని చూచుచున్నట్లు కనపడుచున్నది. ఈమహావిపత్తునుండి మీరుమమ్ము దప్పింపవలయును. ఈస్వర్గసామ్రాజ్యమునకు రాక్షసులవలన భయము, మహర్షులవలన భయముగూడకలదు. రాక్షసభయమును శ్రీమన్నారాయణుడు పెక్కుసారులు నవారించెను. ఈపని బ్రహ్మవిష్ణు మహేశ్వరుల వలనగాదు. మన్మధుడుచేయవలెను. మన్మధుని చేతికనారులైన మీవంటి మిఠారులు చేయవలెను. మీరునాయాజ్న దాట్నిబోటులగుటచే నాపనితప్పక నెరవేర్తురని నమ్మకముతో మన్మధుని బిలువనంపలేదు. మీచేష్టలముందు వారినిష్టలు నిలుచునే? మీగానంబులముందు వారిమౌనంబులు మాయముముగాకుండునే? మీచిఱునవ్బుల జూచిన వారినియమములు దవ్వుల కరుగవే ? మీరూపంబు జూచిననాకుమదన తాపంబు పాలుగాకుందురే? మీకరారవిందస్పర్శనమైనప్పుడు పులకింపుకుండుటకు వారిమేనులు దేహములుగాక లోహములా? కావున మీరీక్షణంబు యరిగి నాకార్యసిద్ధిచేయుడు, మీకుమంగళమగుగాక! “అనినీదుకొల్చిననామెలుతలు” మనమహాముని మనస్సుకలపగలమా? ఆమహాత్మునికోపముచే సగముశాపముపాలగుదుమేమోగదా!” యనిశంకించుచు మనమింతమాత్రపుపని చేయజాలమాయని ధైర్యముదెచ్చుకొని తలపంకించుచు స్వర్గమునుబాసి దుర్గమమగు నాయాశ్రమమును నశ్రమునుజొచ్చి మూర్తీభవించిన బ్రహ్మతేజంబుపగిది నాకారంబు ధరియించిన శాంతరసముభాతి, నంగంబులు దాల్చిన తపోదేవతవలె వ్యాఘ్రచర్మోత్తరీయుడై రుద్రాక్షమాలాలంకృతుడై హృదయ పద్మపణిహిత శివుడై బద్దపద్మాసంస్థుడై చిరకాలసముసముపార్జిత తపోధనుడై ఘను వైయున్న యామహామునిని సందర్శించి భయసంభ్రమంబుకచేత నించుక నడకి యెట్టకేలకు ధైర్యముదెచ్చుకొని మెల్లమెల్లన నాతనిజేరి పూజకు నానావిధ పుష్పములు దెచ్చి ఇచ్చియు, నగ్నిహోత్రములకు సమిధలందిచ్చియు నారబట్టల దడిపి యుదికి యారవైచియు, బర్ణశాఅ శుభ్రముగా నూడ్చియు, నతనికి కొంతకాలము శుశ్రూషజేసిరి. పిమ్మట నతడు కొంతచనవిచ్చుటయు,నతని మనసానంద సముద్రమున వొలలాడునట్లు కిన్నెరుల వంటి కంఠములనెత్తి యొకమాఱు గానముచేయుదురు ఒక మాఱు మందహాసముఛెయుదురు. ఒకసారి వికవిక నవ్వుదురు. ఒకసారి భయవినయంబులతో నమస్కరింతురు. ఇట్లనేక విలాసంబుల జూపి యాతనిం దమవలలో వైచికొని కొట్టకొనకు దమదాసునిం జేసికొనిరి. అంతట నాముని హోమాగ్నిని విడిచి కామాగ్నిపాలయ్యెను. యోగంబుపోయి రాగంబు వాని నాశ్రయించెను. చిట్టచివర కాతడు నిష్ఠవిడిచి, నియమమువిడిచి, జపమువిడిచి, ధ్యానమువిడిచి, మానము విడిచి నిరంతర స్త్రీలోలుడై భోగపరాయణుడై పరలోకంబు మఱచి కామినీలోకంబు నమ్ముకొని వరి "కటాక్ష వీక్షణములె రక్షణములుగ, వారిచరణంబులె శరణంబులుగ సిగ్గువిడిచి విరహింపజొచ్చెను.

ఆహాహా! కాముకులకు సిగ్గుశరము లుండునా? భయభక్తులుండునా? అటులుండ నొకనాడు సనకసనందనులు, నాలాఖిల్యులు, మొదలగు మహర్షులు తన్మార్గంబునంబోవుచు నాయాశ్రమంబు బ్రవేశించి చిరంతపుడు మహోగ్రతపము చేయుచున్నాడనుకొని యాతని సందర్శింపవలెనని యతడున్న చోటికంజనిరి. వారనుకొనినట్లతడు తపోవ్యాపారములయందు నిమగ్నుడుగాక, కామ వ్యాపారములయందు నిమగ్నుడై యుండుటంజూచి మిక్కిలి యక్కజపడి వానికించుక బుద్దిచెప్పిరి. కాని, మూర్ఖుల మనసు మచిమార్గమున ద్రిప్పు నెవరితరము? అతడువారి హితోపదేశంబుల సరకుగొనక వారినెగతాళిజేసి తిరస్కరించి తూలనాడెను. అంతట వారు కోపోదీపితులై కనులెఱ్ఱజేసి "దురాత్మా! సదాచారమువిడచి మునిజనవిరుద్దమైన మార్గమున నీవు సంచరించు చుంటివి. గావున నీవుత్తరజన్మంబున నొకకిరాతుడవై యుందువు గాక! " యని శపించిరి. శాపాక్షరములు వారినోట వెలువడినతొడనే చిరంతపుడు భయాక్రాంత చిత్తుడై పశ్చాత్తప్తమనస్కుడై శ్రీమన్నారాయణ చరణారవిందసేవకులగు నమ్మునిసత్తముల పాదములపై బడి యనుగ్రహింపుడని వేడుకొనెను. నవనీతహృదయులగు నమ్మునిచంద్రులు సదయులై "ఓయీ ! యిచ్చినశాపము సంపూర్తిగా మఱల్పజాలము. కాని, కొంతమార్పు చేసెదము. నీవు మొదట బ్రాహ్మణగర్భంబునంబుట్టి విద్యానయశూర్యుండవై కిరాతులంగలసి సంచరించెదవు. అనంతరము దేవీ ప్రసాదంబున మరల బ్రాహ్మణుడవై జగత్ప్రసిద్ది గాంచెదవు" అని శాపము కొంత త్రిప్పి యధేచ్చంజనిరి. కాలక్రమంబున వానితపంబు భంగంబువావించి యచ్చనలు నియచ్చడలోకంబునకు జనిరి. చిరంతపుడు కడు వృద్దుడై భోగవిముఖుడై యన్నివిధంబుల జెడి మృతి నొందెను.

బాల్యము

అతడుత్తర జన్మమున

గౌడదేశమున సంతానహీనుడై బిడ్డలకై తపించునట్టి యొకానొక బ్ర్రాహ్మణునకు నందనుడై రూపరేఖా విలాసంబుల నెల్లర కానందము