కన్యాశుల్కము (తొలికూర్పు)/తృతీయాంకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


కన్యాశుల్కము

తృతీయాంకము

గిరీశ : (కాముని విరిశముల బారికినే అను జావళీ కూనురాగముతో పాడుచు ప్రవేశించి తనలో) ఇన్నాళ్లకు మిడతంభొట్లు చేతిలో చిక్కాడు. యేమీ పాలుపోకుండా వున్నది. యీ విడోబ్యూటీ చూస్తే యేమీ తోచదు. అయితే యిది చెప్పినట్టల్లా వశమయ్యేది కాదు. ఇంత సింప్లిసిటీ యెక్కడా నేను చూడలేదు. దీనికీ లవ్ సిగ్నల్‌స్ రామరామా! యేమీ తెలియవు. చమత్కారము మాటలు ఆడితే యెంతమాత్రం అర్థం చేసుకోలేదు. యే మాటలన్నా ఆ లేడి కళ్లతో తెల్లబోయి చూస్తుంది. అయామ్ డ్రెడ్‌పుల్లీ యిన్ లవ్. దీనిని చూచిన దగ్గిరనుంచీ టవున్ లవ్‌సూ డాన్సింగ్ గర్ల్‌సూమీద పరమ అసహ్యం పుట్టింది. పోజిటివ్ యబ్‌హరెన్స్ వాళ్ల పెంకె మాటలు, పెడర్థాలు, వేషాలు, డామిట్ అంతా యిన్‌సిన్ సిరిటీయే కదా? యిన్నాళ్లు వాళ్ల వలలలో పడిపోయి యేలాగు యాస్‌ని అయిపోయినానో ఆశ్చర్యముగా ఉన్నది. దీనికీ వాళ్లకీ కమ్‌పేరిజన్ ఏమిటి? ఇదీ ప్యూర్ డైమండ్, అట్టర్ ఇన్నోసెన్స్. నేను రాత్రిళ్లు అరబ్బీనైట్సు కథలూ, కాశీ మజిలీలూ, ఇతరదేశపు ప్రయాణాల డచ్చీలూ చెప్పడానికి ఆరంభించిన దగ్గరనుంచీ నాదగ్గర బహుచనువుగా నున్నది. ఈ మధ్య వాళమ్మ నూతిలో కాలుజారిపడ్డప్పుడు నేను సాహసించీ ఉరికిపైకి తీసిన దగ్గరనుంచీ నేను బహుయోగ్యుడనని, సత్య హరిశ్చంద్రుణ్ణి అని అనుకుంటూ యున్నది. కథలలో ప్రతిచోటా విధవలు పెళ్ళాడి బహుసుఖముగా ఉండి తుదకు స్వర్గానకు వెళ్లినట్టు సందర్భం తెస్తూవుంటున్నాను. అది కొంచెము బుచ్చమ్మ మనస్సుకు యెక్కివుండదా? అయితే యిప్పుడు సాల్వు కావలసిన ప్రోబ్లెమ్ యేమిటీ? దీనిని పాడు చేదామంటే అది పాపభీతిచేత వొప్పుకోదు. నాకూ యిష్టము లేదు. దీనికి నామీద కొంత ప్రేమయున్నది. నోడౌట్ ఎబౌట్ దట్ అయితే సక్సీడ్ కావడం యేలాగు, దేరీజ్ దీ రబ్. యేమిసాధనం యిటుపైని? టుబీ, ఆర్ నాట్ టుబీ, దట్ ఈజ్ దీ క్వశ్చన్. షేక్స్పియరు ఉన్న అవస్థలో పడ్డాము. యాశస్ బ్రిడ్జి యేదయినా కట్టితేనే కానీ ఒడ్డుచేరే మార్గములేదు. (పైకి ముఖము నెత్తియాలోచించి) ఇక విడో మారేజీ కూడునని బోధపరిచీ రామవరం తీసుకుని వెళ్లిపోవడమే పని, అందుకు వప్పకపోయినా, యీ సంగతి తనవాళ్ళతో చెప్పినా, పీక కోసుకుంటానని చెప్పుతాను. లెట్ మీ బిగిన్ ది కాంపైన్ ఎట్‌వన్స్, (తలుపు కన్నములో నుంచి తొంగిచూచి) నడవలో కూర్చుని విస్తళ్లు కుడుతున్నది. మొట్టమొదట కొంచెం మ్యూజిక్ విసురుదాము (ఎటులోర్తునే చెలియా అను జావళీ కూను రాగముతో పాడి) బుచ్చమ్మ వదిన గారూ తలుపుతీయండి (బుచ్చమ్మ తలుపుతీయును) వదీనా.... వెల్..... వేంకటేశం యేమి చేస్తున్నాడు?

బుచ్చమ్మ: పెరట్లో గొట్టికాయ లాడుతున్నాడు.

గిరీశ : ఈవూరువస్తే మరి చదువు చెడిపోతుంది. పట్నంలో వున్నప్పుడు డస్కుదగ్గిరనుంచి కదులుతే వొప్పేవాడను కాను... ఒక్క మాటు పి... పిలుస్తారా పాఠం చెపుతాను.

(బుచ్చమ్మ తమ్ముని తీసుకొని వచ్చుటకు వెళ్లును.)

ఆహా! దీని ఠస్సాకొయ్యా మొహం యెదటికి వచ్చేటప్పటికి కొంచెం టైంబ్లింగ్ పట్టుకుంటుంది. వకటి అనవలెనని మరి వకటి అనేస్తూ యుంటాను. మరెవళ్లూ లేరు. వంటరిగా దొరికింది. యీలాంటప్పుడు నా మనస్సులో మాట చెప్పేస్తే తీరిపోనా! ఆకోతి వెధవను తీసుకొని రమ్మని చెప్పినాను. కానీ, పాఠాలలో చిన్న లెక్చెరు వేతాము. (వెంకటేశ్వరులు, బుచ్చమ్మ ప్రవేశించుచున్నారు) యేమివాయి మైడియర్ బ్రదరిన్లా వెంకటేశం, పాఠాలు చదవడం శుభ్రంగా మానివేశావు? యిక్కడ మాసం రోజులుంటే వచ్చిందికూడా మరచిపోతావు, యేదీ టెక్ట్సు బుక్కు పట్టుకురా - (వెంకటేశం పుస్తుకు పట్టుకుని వచ్చును)

గాడ్స్‌వర్క్‌స్ అనే పాఠం తియ్యి, రీడ్ ఆన్ మైగుడ్ బోయ్.

వెంకటే: (తడుముకొనుచు) దేర్‌యిజ్ నాట్ ఏన్ ఆబ్జక్టు వుచ్ డజ్‌నాట్ సర్వ్ సమ్ యూస్‌పుల్ పర్‌పస్.

గిరీశ : అట్టె! అట్టె! అక్కడ ఆపు, క్రియేషన్ అనగా యేమిటి?

వెంకటే: క్రియేషన్ అనగా - అనగా - ఆవులు

గిరీశ : నాన్సెన్స్ చదవేస్తే ఉన్న మతి కూడా పోతున్నది. ఆవులు యెదుటున్నాయనా ఆవులంటున్నావు. మళ్లీ ఆలోచించి చెప్పు.

వెంకటే: యేమాటకి అర్థం అడిగినారు?

గిరీశ : క్రియేషన్.

వెంకటే: అదా! క్రియేషన్ అంటే ప్రపంచం. నేను యెదట ఆవులు కనబడితే యీ ఆవు పెరుగు యీ నెలరోజులే కదా తినడమనీ అనుకుంటున్నాను.

గిరీశ : వన్ థింగ్ ఎట్ ఏటైమ్. యిప్పుడు పాఠంమాట ఆలోచించు -క్రియేషన్ అనే వక్క మాట పైనే వక్క ఘంట లెక్చరు యివ్వవచ్చును. ప్రపంచం యేలాగున్నది? కపిద్దా కారభూగోళా అని మనుధర్మ శాస్త్రంలో చెప్పినాడు. కపిద్ధమంటే యేమిటి? వెంకటే: నారింజపండు.

గిరీశ : వెరీగుడ్ - అందుకు అమర నీఘంటులో పద్యం నీకు వచ్చునా?

వెంకటే: రాదు - చెప్పండి రాసుకుంటాను.

గిరీశ : యింతలు బదరీ ఫలములు యింతలు మారేడుబళ్లు యీడుకుజోడై బంతులు తామర మొగ్గలు దంతీకుచ కుంభములభోలు తరుణీకుచములూ.

యీ ప్రపంచములో యేమి వస్తువు లుంటవి?

వెంకటే: ఆవులు,

గిరీశ : డామ్ నాన్సెన్స్ - యెంతసేపూ ఆవులే? యేమిటి వుంటవి?

వెంకటే: గేదెలు

గిరీశ : దట్ విల్ నాట్ డు - ఆలోచించి చెప్పు

వెంకటే: అయితే నాకు తెలియదు.

గిరీశ : వీడోస్-యింత చిన్న ప్రశ్నకు నీకు జవాబు తెలియదు! ప్రపంచమందుండే వస్తువులన్నిటిలోకీ ముఖ్యమయినవి విధవలు. దాని విషయమై లెక్చరు యివ్వవచ్చును. మన దేశములో ఒక దురాచారము వున్నది. మొగవాడికి పెళ్లాము చచ్చిపోతే తిరిగీ పెళ్లాడు తాడు. ఆడదానికి మొగుడు చచ్చిపోతే యంత యవ్వనములో నున్నా యెంత సొగసుగా వున్నా, మరికడిని, పెళ్లాడడం వల్ల లేదు. ఇదీ అన్యాయమంటావా? కాదంటావా?

వెంకటే: తప్పకుండా అన్యాయమే.

బుచ్చమ్మ: యేమండీ గిరీశంగారూ - వెధవ, పెళ్లాడడం పాపంకాదూ?

గిరీశ : ఆహా! మీ సత్యకాలం చూస్తే నాకు విచారంగా నున్నది. వెధవలు పెండ్లాడవలసినదని పరాశరస్మృతిలో స్పష్టంగా నున్నది. వేదంలో కూడా నున్నది. రాజమహేంద్రవరములో యిదంతా పండితులు సిద్ధాంతం చేసినారు. పూర్వ కాలంలో వేధవలు పెండ్లాడేవారు. వెంకటేశం! నలచరిత్రలో దమయంతి రెండో పెండ్లి సాటించిన పద్యం చదువు.

వేంకటే: నాకురాదు.

గిరీశ : యంత ముఖ్యమయిన పద్యం మరచిపోవడం యంత తప్పూ! నోటుబుక్కుతీసిరాసుకో దమయంతి రెండో పెళ్లికి, ధరనుండే రాజు లెల్ల దడదడవచ్చిరీ - చూశావా! లోకంలో వుండే రాజులంతా వెధవని పెళ్లాడడానికి వచ్చారు. (బుచ్చమ్మ వైపుజూచి) చూశారా? శాస్త్రాలన్నీ వొప్పుకోవడమే కాకుండా వెధవలు పెళ్లాడకుండా వుండిపోతే దోషమని కూడా చెప్పుతూ వున్నాయి. యిందు విషయమై ఆచార్యులవారు పత్రికకూడా యిచ్చియున్నారు.

బుచ్చమ్మ: అయితే మనవాళ్లంతా వెధవల్ని పెళ్లిచేసుకోకూడదంటారే?

గిరీశం: అదంతా యింట్లో చాకిరీ చేయించు కోవడముకోసరముగానీ మరేమీకాదు. ఝాము రాత్రీ ఉందనగా లేచి మరునాడు రెండు ఝాముల రాత్రిదాకా యెద్దులాగు పనిచేయిస్తారు కదా? ఒక్కపూటకంటె యెక్కువభోజనం చెయ్యనివ్వరుకదా? అప్సరసలాగున యెంత సొగసుగా నున్నా మంచి గుడ్డకట్టుకోనివ్వరు. సరుకు పెట్టుకోనివ్వరు. తుమ్మెద పంక్తుల్లా వుండే జుత్తుకూడా తీసివేస్తారు గదా! ఫర్ ఎగ్జాంపిల్, మీ అక్కయ్యకు ఆ చంద్ర బింబమువంటి ముఖముపైని ఒక కుంకుమబొట్టుంటే త్రినేత్రుడికైనా చూడడానికి అలవి వుండునా. ఆహా! యీ అవస్తచూస్తే నా హృదయం కరిగిపోతున్నది. ఆల్‌రైట్ ప్రపంచములో యింకా యేమి వస్తువులువున్నవి?

వెంకటే: చేగోడీలు.

గిరీశ : డామ్ నాన్సెన్స్-ఎంత సేపూ తిండి విషయమయ్యే ఆలోచిస్తావు. బాచిలర్స్, బ్రహ్మచారులు కూడా వున్నారు. వాండ్లు చెయ్యవలసిన పనియేమిటి?

వెంకటే: వేదం చదువుకోవడం, పెయ్యలకి గడ్డితేవడం.

గిరీశ : నాన్సెన్స్ -అది మీ తండ్రి దగ్గర చదువుకునే విద్యార్థులుకి, బ్రహ్మచారి యొక్క రియల్ డ్యూటీ, అంటే, విధించినపని యేమనగా విధవలను పెండ్లాడడమే. ఇంకా క్రియేషనులో యేమున్నది?

వెంకటే: నాకు తెలియదు.

గిరీశ : రామవరములో వెధవవివాహము చేసుకున్న వాళ్లకల్లా నెల వక్కింటికి నూరు రూపాయిలు యిచ్చి పోషించడముకు విడోమారేజి సభవకటి యున్నది. ఇదివరకు ఐదువేలమంది వెధవలకు వివాహములు అయి పుని స్త్రీలు అయిపోయినారు. ఆల్‌రైట్!! క్రియేషన్ అనేమాట అయినది. ఆ సెంటెన్సు అంతకూ అర్థముచెప్పు.

వెంకటే: మీరొకమాటు చెప్పిన తరువాత నేచెబుతాను.

గిరీశ : ఆల్‌రైట్! ప్రపంచములో దేవుడు ప్రతి వస్తువునూ యేదో ఒక వుపయోగముకొరకు చేసియున్నాడు. చేగోడీ యెందుకు చేసినాడూ?

వెంకటే: తినడముకు. గిరీశ : దట్ ఈజ్ రైట్. ఆవులనెందుకు చేశాడు?

వెంకటే: పాలు యివ్వడముకు.

గిరీశ : పెర్‌ఫెక్ట్‌లీ రైట్. ఆడవాళ్ల నెందుకు చేశాడు?

వెంకటే: వంట చెయ్యడానికి.

గిరీశ : నాన్‌సెన్స్. పెండ్లాడడముకూ పిల్లలను కనడముకున్నూ గనుక పెండ్లాడకుండావున్న వెధవపిల్లలు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన పాపమును చేస్తున్నారు.

(అగ్నిహోత్రావధానులు ప్రవేశించుచున్నాడు)

అగ్నిహో : ఏమండీ గిరీశంగారూ మా కుర్రవాడికి చదువు చెప్పుతున్నారూ.

గిరీశ : ఘంటసేపాయి చెపుతున్నానండీ.

అగ్నిహో : యేదీ నేకూడా వింటాను కొద్దిగా చెప్పండీ.

గిరీశ : మైడియర్ బోయ్, గాడీమేడ్ క్రియేషన్. సృష్టియెవడు చేసినాడూ?

వెంకట్ : దేవుడు.

గిరీశ : ఫాదర్ ఈజ్ నెక్‌స్ట్‌టుగాడ్. దేవుని తర్వాత ముఖ్యం యెవరూ? సే ఫాదర్.

వెంకటే : తండ్రి.

అగ్నిహో : మొత్తముమీద మీ ఇంగ్లీషు చదువు మంచిదీలాగే కనబడుతూన్నది. భాష భేదంగానీ మనముక్కలే వాళ్లవిన్నీ

గిరీశ : వెంకటేశం! దేవుడు సృజించిన ప్రపంచములో యేమి వస్తువులున్నవి? సే కోర్ట్‌స్.

వెంకటే: వెధవలు.

గిరీశ : నాన్ సెన్స్ సే కోర్ట్స్.

అగ్నిహో : యిదేమిటండోయి ప్రపంచంలో వెధవలున్నారంచున్నాడు, ఇంగ్లీషు పుస్తకాల్లో యిదేనాయేమిటి వున్నది.

గిరీశ : వేధ్వల్ అన్నదీ లాటిన్ మాటండి - ఆమాట కర్డు కచేరీలండి. కచేరీలు యెందుకున్నవి?

వెంకటే: దావాలు తేవడముకు.

గిరీశ : దట్ ఈజ్ రైట్ - చూచారండీ మీవాడికి కచేరీల భోగట్టాలుకూడా నేర్పుతున్నాను.

అగ్నిహో : అయితే మనదావా విషయమై నేనిచ్చిన కాకితాలు సమగ్రంగా చూశారా. గిరీశ : కేసు గెలవడము కేమీ అభ్యంతరము లేదు. మీకు తెలియడముకోసం గ్రంథం అంతా తెలుగు చేస్తున్నాను. మామగారూ మీ విషయమై యెంత శ్రమయినాపడి అమలాపురం వెళ్లి అక్కడ కోర్టులో కేసు గెలిపించకపోతే నన్ను పేరుపెట్టి పిలవవద్దు.

అగ్నిహో : యేదో అంతా మిమ్మలినే నమ్ముకుని వున్నాము. యెంత డబ్బయినా కేసు గెలిస్తే చాలును. పెళ్లిపనులకి మీరు కుమ్మక్కు వుంటేనేకానీ తూగదుసుమండీ. నామీద కోపంచాత కరటకశాస్రుల్లూ వాళ్లూ వెళ్లిపోయినారు. వాళ్లు వొచ్చేటట్టు కనపడదు.

గిరీశ : మీరు కూర్చున్న దగ్గరనుంచి కాలు కదపకుండా ఎరేంజిమెంటు యావత్తూ నేను చేస్తాను కాదూ.

(నిష్క్రమించుచున్నారు)


***

రెండవస్థలము - రామచంద్రపురం అగ్రహారములో లుబ్ధావధానుల యిల్లు.

(కరటక శాస్త్రి, పురోహితుడు ప్రవేశించుచున్నారు)

కరటక: పంతులు వచ్చేలోగా కార్యమైపోవాలి.

పురోహి: ఆ పూచీనాదీ - మీ రిస్తానన్న రూపాయిలు నాచేతిలో పడేయండి.

(కరటకశాస్త్రి ఆయన చేతిలో పదిరూపాయిలు పడవేయును)

పురోహి: లుబ్ధావధానులుగారూ! వేగిరం స్నానాలు కానివ్వండి.

లుబ్ధావ: పెద్దమనుష్యులింకా రాలేదే?

పురోహి: లగ్నం పెద్దమనుష్యులకోసం ఆగుతుందయ్యా? అగ్రహారంలో బ్రాహ్మణులందరినీ పిలిచాను. వచ్చి పందిట్లో కనిపెట్టుకొని కూర్చున్నారు.

లుబ్దా : పంతులు వుదయం నాలుగడియలకి ముహూర్తమని చెప్పాడే?

పురోహి: పంతులు చెప్పినమాట చూస్తారా - పంచాంగం చూస్తారా?

లుబ్ధావ: ఆ-ఆ-పంతులు నాలుగ్టళ్ల పొద్దుకు రమ్మని పిలుస్తానన్నాడే పెద్దీపాలెంలో లౌక్యుల్ని?

పురోహి: నేను నాలుగు ఘడియలకి తెల్లవారుతుందనగా ముహూర్తమని చెప్పాను. పంతులు నాలుగు ఘడియలు తెల్లవారిన తర్వాతనుకున్నాడు కాబోలు.

లుబ్ధావ: అయితే కానీయ్యండి స్నానానికి లేస్తాను కరటక : నా రూపాయిలిచ్చి మరీ స్నానంచెయ్యండి.

లుబ్ధావ: బాపన్నగారూ : ఊసంచి పట్టుకొండి. మధ్యవర్తులు గనుక మంగళ సూత్రధారణ కాగానే మీరే యిచ్చీ వెయ్యండి.

కరటక: పుస్తె కట్టడంకాగానే బయలుదేరి నేను వెళ్లిపోవలెను. రేపు రూపాయిలు చెల్లకపోతే భూములు నిష్కారణంగా పోతాయి. ఎల్లుండి ఎంత రాత్రికైనా వచ్చి కలుసుకుంటాను. ఈలోగా పిల్లది వక్కరై వంటరిగానుంటుంది. మీదే భారము. (కరటకశాస్త్రి, మీనాక్షి, తక్క దక్కినవారు వెళ్లిపోవుచున్నారు. )

కరటక: అమ్మీ మీనాక్షి! పిల్ల దాన్ని యలాగ చూసుకుంటావో నేను నీకిస్తానన్న మొహురిదుగో పిల్లదాని స్నానం అదీ ఒక్క నిమిషములో అయిపోవాలి. (మీనాక్షి చేతిలో నొకమొహురు బడవేయును)

మీనాక్షి :మీకెందుకూ, నేనున్నాను కాదూ, వెళిపోవును.)


***

మూడవస్థలము - లుబ్ధావధానుల యింటిలో సావడి.

(పసుపు పంచలు కట్టుకొని, లుబ్ధావధానులు, యింకను మరికొందరును, ప్రవేశించుచున్నారు. తాషామరపా చప్పుడు వినబడును.)

పంతులు :(డాబుగా దుస్తువేసుకుని ప్రవేశించి) అబ్బ! ఎంత శ్రమ పడ్డానండీ.(నౌఖర్ల వైపుచూచి) బాజాలూరుకోమనరా వెధవ పెద్దీపాలెం ఎంతదూరమున్నదండీ. కాళ్లు పీకుకువచ్చాయి.

(అని కూరుచొనును.)

లుబ్ధావ : లగ్నానికి మీరు లేకపోయినారుగదా అనీ మహావిచారంగా వుంది.

పంతులు: (ఉలికిపడిలేచి) ఏమిటీ.... వివాహమయిపోయిందీ?

లుబ్ధావ :మీరు ముహూర్తం తెల్లవారిన తర్వాత నాలుగు ఘడియలకనుకున్నారు. పురోహితుడు: నాలుగు ఘడియల రాత్రుందనగా లగ్నమన్నాడు.

పంతులు: (పురోహితుని వైపుచూచి) నాతో స్పష్టంగా నాలుగు ఘడియల ప్రొద్దుకని చెప్పావు? నేను పెద్దమనుషుల్నాలాగు పిలుచుకువచ్చానుగదా వాళ్లేమనుకుంటారు? గుంటూరు శాస్తుర్లేడి? లుబ్ధావ: వూరికి వెళిపోయినారు.

పంతులు: (ఆశ్చర్యము, కోపము, ముఖమున గనపరచుచు) ఏమిటీ రూపాయిలిచ్చి వెయ్యలేదు గదా?

లుబ్ధావ: సీదాగా యిచ్చివేశాను.

పంతులు: అన్న కొంపతీశావు మరేమిటి? ఇదంతా నీ కుట్రలాగ కనపడుతుంది. నువ్వూ వాడూ ఒకటైపోయినారు. యింతా నన్ను మధ్యవర్తినిచేసి నేను లేనిదీ ఈ వ్యవహారము ఏలాగు పైసలు చేసినారయా. ఈ వివాహంకోసం అష్టకష్టాలుపడి చమటూడ్చి పనిచేస్తే నేను లేకుండా ముహూర్తం జరిగినదా? ఇంత అమర్యాద నన్నెవ్వడూ చేయలేదు, దాని సంగతి నీకే తెలుస్తుంది.

లుబ్ధావ: నేను యేమీ చెయ్యలేదండీ మామగారూ, మీ పాదాలుసాక్షి, యేతప్పువున్నా క్షమించ వలసినది (అని కాళ్లుముట్టును.)

పంతులు: యీ గుంటూరిశాస్త్రుల్లు పచ్చపుదొంగలా కనపడుతున్నాడు. రూపాయలు పట్టుకుని వుడాయించాడు. పెళ్లి ఖర్చుకని నా దగ్గిర యాభై రూపాయలు బదులుకూడా పుచ్చు కున్నాడు. యీ వాళకమంతా చూస్తే వీడు యేదో పెద్దదగా చేసి నీలిచివుంటే యెక్కడ తెలిసిపోతుందో అని డబ్బు సంధించుకుని వుడాయించినట్టు కనపడుతుంది.

లుబ్ధావ: ఆయన రేపు సాయంత్రంలోగా రూపాయలు అప్పులవాళ్లకు చెల్లించకపోతే భూములు పోతాయని ఊరికే తొందరపడ్డాడు.

రానుప్ప: నువ్వు తెలివిహీనుడివి. నీకు వాడి సంగతి బోధపడకయినా వుండవలె. లేకుంటే నీవూ వాడూ కలిసి నన్ను టోపీ వెయ్యడముకు కుట్రైనాచేసి వుండవలెను. నా యాభై రూపాయలు నిష్కారణంగా పోయినాయి. నేను వూరుకునేది లేదు. బాగా ఆలోచిస్తే యీ పిల్ల రెండో పెళ్లి పిల్లలాగ కనబడుతున్నది. కనిస్టేబులను పిలిచి కేసు చేయిస్తాను. నేను యెప్పుడూ యింత దగాపడలేదు. యెవరోయి, హెడ్డుగారిని పిలువు.

లుబ్ధావ: యేదో కార్యమైపోయింది. మీ యాభైరూపాయలూ నేనిచ్చుకుంటాను. నా పరువు నిలబెట్టండి. రసాభాస చెయ్యకండి. మీరెలా చెపితే అలాచేస్తాను.

రామప్ప: ససేమిరా! నేనెంతమాత్రమూ వూరుకోజాలను. నా దగ్గిరే స్వామిద్రోహం చెయ్య డమా?

లుబ్ధావ: క్షమించండి (కాళ్లుపట్టుకొనుచున్నాడు. )

దగ్గిరున్నవారు: లుబ్ధావధానులుగారు నిరపరాధీ తమరేలాగైనా గడుపుకోవాలి.

రామప్ప: ...యేవూరు వెళ్లారో తెలుసునూ? లుబ్ధావ: విశాఖపట్నం.

రామప్ప: (బుర్ర తటాయించుచు) కానీ చెపుతాను - లౌక్యులంతా నాలుగుఘడియల ప్రొద్దుకు వస్తారు గదా యేమిటి చెయ్యడం?

లుబ్ధావ: యేమీతోచకుండా వున్నది. తమరే చక్రం అడ్డువెయ్యాలి.

రామప్ప: కానియ్యి మేజువాణీ పెడదాము. మధురవాణికి రాత్రులకు కంట్రాక్టుగాని పగలు రావడముకు ప్రసక్తంలేదు. దానికి ఇందుకు వేరే ఇస్తేనేగాని కుదరదు.

లుబ్ధావ: మీరేమిమ్మంటే అదిచ్చుకుంటాను.

రామప్ప: యెవరోయి నౌఖరు, పోలిశెట్టిని పిలువు. యెవరోయి వంటబ్రాహ్మలు, ఫలహారాలు మా బసకి పంపించీనారా లేదా?

(తెర దించవలెను)

***

నాల్గవస్థలము - లుబ్ధావధాన్లుగారి యిల్లు

లుబ్ధావ: సోమన్నశాస్రుల్లుగారు వచ్చారయ్యా నా గుడ్లు పైకి వస్తూన్నాయి.

పురోహి: ఇదివరకు పదికబుర్లు వెళ్లాయి. ఇప్పుడే దేవతార్చన చేస్తున్నారు.

లుబ్ధావ: రామయ్యపంతులుగారు వచ్చారా?

బ్రాహ్మడు : ఇప్పుడే చుట్టకాల్చుకుని స్నానానికి వెళ్లారు.

లుబ్ధావ: పంతులూ, నాకు మా ఆకలి వేస్తూన్నదయా పెందరాళే మెతుకులు పడితేనే కానీ ప్రాణం నీలవడం కష్టం.

రామప్ప: మాయింటికిరండి అక్కడ చల్దివణ్ణం యెవరికీ తెలియకుండా పెట్టేస్తాను. ఇప్పుడు ఆచార మాలోచిస్తే కథ మొదటికి వస్తుంది - యేదో వొకటి పెందరాళేకానియ్యండి.

లుబ్ధావ: (నాలుగడుగులు నడచి తొంగిచూచి.) ఓయి నాయినా - ఇంతమందిని పిలిచినా వేమయ్యా భోజనానికి?

రామప్ప: ఇదో విశేషంటయ్యా - ఇందులో ముప్పాతిక మంది పిలవనివాళ్లే పీక బట్టుకు గెంటుతూ వుంటే పెణకపట్టుకు వేళ్లాడుతున్నారు. యీ సప్లై వూసు మీ కెందుకు మీరు ముందు భోజనానికి పదండి.

(వెళ్ళిపోవుతున్నారు.)

అయిదవ స్థలము : రామప్పంతులుగారి ఇల్లు

లుబ్ధావ: (తనలో) అమ్మా - భోజనమయింది - ప్రాణం తెప్పిరిల్లినది, కార్యం యరక్క తలపెట్టినాను. యీ రామప్పంతులు సంసారం కొల్లపెట్టేస్తున్నాడు. యక్కడలేని బ్రాహ్మణ్యం వచ్చారు.


(రామప్పంతులు ప్రవేశించి.)

రామప్ప: ప్రయత్నం చాలిందికాదు. బ్రాహ్మలు కొంప ముట్టించేస్తామంటున్నారు.

లుబ్ధావ: గాడిదకొడుకులు, కనిష్టేబులను పిలవండి.

రామప్ప: యిందాకా పిలవని బ్రాహ్మలని తోలెయ్య డానికి కనిస్టేబులను పిలుస్తే దర్భాసనాలూ జారీలతో ఆ కనిస్టేబులను చావగొట్టారు. మధుపాడ అగ్రహారీకుడు, లెంపకాయకొడితే చూశారా నాదవడమీద అయిదువేళ్లూ అంటుకున్నాయి. రెండు మూడు వందలదాకా పయినివుంచివేశి తలుపులు బిడాయించి వేశినాను. వుతకయెత్తివేశి లోపల ప్రవేశించి నారు. వాళ్లే పదార్థంఅంతా ఒడ్డించేసుకున్నారు. అయిదురోజులకూ జాగ్రత్తచేసిన సామానంతా అయిపోయింది. యిప్పుడు వాళ్లకు వండిపెట్టకపోతే ఆబోరు దక్కదు, రౌద్రాకారులై వున్నారు, మీకోసం వెతుకుతున్నారు.

లుబ్ధావ: (వణుకుతూ) మీ పుణ్యం వుంటుంది పోలిశెట్టిదగ్గిర యిసేబు తెచ్చివాళ్లకు కూడా తిండి పెట్టేయ్యండి.

రామప్ప: (తనలో) సమయంలో సమయం పోలిశెట్టికి నేబాకీవున్న రూపాయలు కూడా దీనిలో కలిపివేస్తాను. (అని వెళ్ళిపోవుచున్నాడు)

***

ఆరవ స్థలము - లుబ్ధావధానుల యిల్లు (హాకర్ ప్రవేశించుచున్నాడు)

హాకర్ : అయ్యా పంథుల్‌గారూ లెక్కా యిప్పించరా.

లుబ్ధావ: పెళ్లిచేసుకొన్న సౌఖ్యం బాగానే వున్నది.

హాకర్ : అమ్మగార్ నలభై రూపాయల్‌కీ కీన్‌కాఫ్‌తాన్ పుచ్చుకొన్నార్.

లుబ్ధావ: ఖీనూలేదు ఖాబూలేదు అడ్డదిడ్డంగ పేలక వెళ్లు.

హాకర్ : రూపాయల్‌కీ ఇయ్యరంటయ్యా బవిస్సం తీసివేస్తాన్.

లుబ్ధావ: పుండాఖోర్ - తలకు దగనిమాటలు ఆడతావు. హాకర్ : మాటల్‌కి మిగుల్ సెప్పకండి. యేటమ్మా మాటాడక్ యింటిలో కూఖుంటావ్. యిలా రావమ్మా నీ బవిస్సం తీసివేస్తాన్.

లుబ్ధావ: నీ అమ్మకడుపుకాల్చా. తీసుకోరా రూపాయలు, పెళ్లిసుఖం బాగా అనుభవిస్తున్నాను, ఇఖ మా యింటికివస్తే నేవప్పేవాడిని కాను. (రూపాయిల నిచ్చును)

హాకర్ : మీకీ పెనిమిటి ధర్మరాజా అమ్మా. ముఖ్ మల్‌తాన్ మా మంచీదీ వుండాది కనిష్టీపుగారి కూతురుకి వకటి ముక్కా ఇచ్చాస్.

శిష్యుడు: రెండుగజాల గుడ్డ కావాలోయి.

లుబ్ధావ: గుమ్మంలో అడుగుపెడితే కాళ్లు విరగకొడుతాను.

హాకర్ : అదుగోనమ్మా మీకి మొగుడ్ అలాగూ కోపంపడుతూవుంటే నాకీ యేమి సెయ్యమంటార్.

శిష్యుడు: నీకెందుకోయి ఆయన ముసలివాడు ఆయనకీ సంగతులేమీ తెలియవు.

లుబ్ధావ: కొంపపీక్కున్నాను. ఇంట్లో డబ్బంతా దీనికిందైపోతూంది. కుట్టుపనివాళ్లూ, పళ్లవాళ్లు, కంసాలివాళ్లూ అంతా బాకీలని తినేస్తున్నారు. సంసారం కడితేరుస్తూంది. రాత్రి దీనిపని పట్టిస్తాను. అమ్మీ వీడి మొఖముమీద పేడ్ణీళ్లుపొయ్యి..

(హాకర్ బట్టలుమూట కట్టుకుని పారిపోవును.)

మీనాక్షి: దీనిని పెళ్లాడవొద్దని చెప్పానుకానూ - దాని తండ్రి యేమి మాయలమల్లి వాడమ్మా! ఓ సక్కా బంగారం మోరీ చేతులో పెట్టాడనుకున్నాను. కంసాలి అక్కాబత్తుడికి చూపిస్తే డబ్బుకు కళాయి వేశాడన్నాడు. కులంతక్కువ గుంటను పెళ్లాడితే యేమౌతుందేమిటి.

శిష్యుడు: తల పెంచుకుని తాంబూలం వేసుకుని సరసాలుచేసే వెధవముండ కంటే నయంకద.

మీనాక్షి: చూశావురా నాన్నా - దీనమ్మ కడుపుకాలా యేలాగంటుందో.

లుబ్ధావ: ఇక నాకు సుఖంలేదు

మీనాక్షి: నువ్వే తెచ్చిపెట్టుకున్నావు.

లుబ్ధావ: దెబ్బకి దెయ్యం వెరుస్తుందన్నాడు. రాత్రి దీనికి ఒక తాళాధ్యాయం వెయ్యి,

(తెర దించవలెను)

***

ఏడవస్థలము - రామప్పంతులుగారి యిల్లు

రామప్పంతులు గడప వెలుపలను, మధురవాణి లోపలను, నిలువబడుదురు.

రామప్ప: నీకంత పెంకెతనంగావుంటే పెళ్లిచేసుకుని గృహస్తాశ్రమంలో ప్రవేశిస్తాను.

మధురవాణీ: అరవైయేళ్లు వచ్చి చదువుకోక మన్ను కొట్టుకుంటానా అన్నట్టున్నది. యీ వెర్రికబుర్లకు యేమిటి - యేదో వొక తంబళ అనుమానం పెట్టుకుని చెర్రూ బుర్రూ అంటూవుండడం మీకు స్వభావమే. మెడలో కంటే తీసుకొని పోయినారు - అది యెక్కడనో తాకట్టుపెట్టి నేను యేమంటానో అనీ నామీదికే బయలుదేరుతున్నారు.

రామప్ప: కంటె తాకట్టు పెట్టుకోడం ఖర్మమేమి? నిలబడ్డపాటుగా చూడు కంటెలు వర్షం కురిపిస్తాను.

మధుర: నాకాకబుర్లేమీ పనికిరావు - మీ ప్రయోజకత్వం నాకు తెలుసును. నాకంటిప్పుడు తీసుకొస్తారా లేదా?

రామప్ప: నీకు మతిపోతూంది. నన్ను తృణీకరించడం ఆరంభిస్తున్నావు. నా దెబ్బ తెలియకుండా వుంది.

మధుర: మేడిశినట్టే వుంది.

రామప్ప: నాకు వొళ్లు మండుతూన్నది. ఖబడ్దార్!

మధుర: మీకు వొళ్లుమండుతూంటే గాల్లో నిలబడితే చల్లబడుతుంది.

(అని తలుపువేసికొనును. )

రామప్ప: యీ కంటేబాధ మా ఇబ్బందిగా వున్నది. తాకట్టుపెట్టానని ప్రాణం కొరికేస్తూంది. రేపు వుదయం తెస్తానంటే వినదు. యీ చీకట్లో లుబ్ధావధానులు ఇంటికి పోకతీరదు. యీ కంటె తాకట్టు పెట్టానని గట్టి అనుమానము పట్టుకుంది. తీరా వెళితే యిప్పుడు పెట్టా బేడా తీసియిస్తాడో ఇవ్వడో.

***

ఎనిమిదవస్థలము - లుబ్ధావధానులుగారి యిల్లు

రామప్ప: (తలుపు వెలపలనుంచి గట్టిగా) అవధానులు మామగారూ! అవధానులు మామగారూ! తలుపండోయి (అని అనేక పర్యాయములు పిలిచి) యేమిటి చెప్మా, దొంగగాడిదె పలకడు. నిద్రమాట అబద్ధం. దొంగల భయంచాత వీడురాత్రల్లా మేలుకుంటాడు. (గట్టిగా) తలుపు తియ్యకపోతే వుతకయెత్తి చేస్తాను. లుబ్ధావ: (లోపలనుంచి) యెవరయా?

రామప్ప: నేనయ్యా రామప్పంతులుని.

లుబ్ధావ: (నిమ్మళముగా) రామప్పంతులు... అమ్మీ తలుపుతియ్యవే.

(తలుపు తియ్యును)

రామప్ప: మామగారూ మీ వంట్లో తాజాగావుందిగద?

లుబ్ధావ: యేమితాజా అండి

(అని యూరకుండును.)

రామప్ప: కోడలు మాజోరుచేస్తూన్నట్టు కనబడుతూంది. వూరు హాకర్లంతా మీ గుమ్మంముందరే కనబడతారు.

లుబ్ధావ: (మోకాళ్లమీద బుర్ర పెట్టుకుని నిమ్మళముగా) ఆ ఊ ఊ ఉ!

రామప్ప: (తనలో) ఆ మాటలు యిష్టములేదు కాబోలు (పైకి) ఆకంటెకు చాలా తొందరగా వున్నది. మధురవాణి యేమీ నీలవనియ్యకుండా వుంది. అదీ తాకట్టు పెట్టానన్న అనుమానంకొద్దీ యిప్పుడు తెస్తేనేకానీ వల్లకాదని కింకపట్టుపట్టి కూర్చున్నది.

లుబ్ధావ: అదికూడా పారిపోయింది.

రామప్ప: కంటె పారిపోయిందీ! ఏమిటి! మామగారు పలవరిస్తూ వున్నారా యేమిటి?

లుబ్ధావ: లేదండీ పలవరింతగాదు - కంటెపట్టుకుని చెప్పకుండా పరారీ అయిపోయింది. యిదంతా మీ కుట్రే..

రామప్ప: ఏమిటీ! అయితే కంటె యిస్తావా, యివ్వవా?

లుబ్ధావ: నా దగ్గిరలేదు.

రామప్ప: వద్దుసుమా నా సంగతి తెలిసిందికాదు నీకు.

లుబ్ధావ: నాకు అంతా తెలుసును. నాచేత పద్దెనిమిది వందలు కర్చుచేయించావు.

రామప్ప: (బుర్ర తటాయించి ఆలోచించీ తనలో) అన్నా మించిపోయినది. యేదైనా వక యెత్తు యెత్తితేనేకాని కంటె రావడము కష్టము. (పైకి) మొన్నరాత్రి మీ ఇంట్లో పెద్దకేకలూ,పెడబొబ్బలూ జరగలేదూ?

లుబ్ధావ: అయితే!

రామప్ప: అయితే మరేమిటి - మీ అమ్మి దానితో దెబ్బలాడి నూతులో పడేసింది. నేను పెరట్లో గుడ్డెమీదికి బాహ్యానికిపోయి స్వయంగా చూచాను. లుబ్ధావ: గాడిదెకొడకా! (అని కర్రపట్టుకొని లేచును).

రామప్ప: ముసలిగాడిదకొడకా నీ పనిపట్టిస్తాను.

(అని వెళ్లిపోవును)

***

కన్యాశుల్కము

చతుర్థాంకము

(బైరాగీ, హేడ్ కనిష్టేబు, దుకాణాదారుడు, యింకా మరిద్దరు, మధ్యను సీసాలు పెట్టుకుని ప్రవేశించుదురు.)

(తెరతీయు ముందర నారాయణ నారాయణ నారాయణభజే అను కీర్తన పాడుచుండవలయును.)

హేడ్ : గురోజీ తమరు హరిద్వారం బయలుదేరి యెన్నాళ్లయిందేమిటి?

బైరాగి : రెండు రోజులయినది. మొన్న వుదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం సేవించాము. ప్రచ్ఛన్నంగా సింహాచలం పోతూవుంటే నువ్కోక భక్తుడవు పట్టుకొని ఆపేశావు.

హేడ్ : ఆహా! యోగమహత్యం - ముక్కు బిగించి స్తానాలుచేసే బ్రాహ్మలకెవరికీ యీ సిద్ధుల్లేవుగదా?

బైరాగి : వాళ్లకేమీ తత్వము తెలియదు. మా తాతగారు చెప్పిన పద్యం నీవు వినలేదా? ఆత్మ శుద్ధిలేని ఆచారమదియేల.

హెడ్ : వేమన్న మీ తాతేనా గురోజీ?

బైరాగి : అవునోయి నాకు మూడువందల యేళ్లున్నవి, ఆయన పరంపదం వేంచేసి వెయ్యి సంవత్సరము లౌతవి.

దుకాణ: ఆహా! యివాళ మనదేమదురుష్టం. గురోజీ! నౌకరి కొక సందేహం వున్నాది. పరబ్బరమం సీసాలో కనపడ్డంత సొట్టంగా మరొకసోట అగుపడుతుందా?

బైరాగి : యీ రహస్యం నీకేలాగు దెలిసిందేమిటి? అమృతమంటే సారాయి కాదురా పామరుడా - నాడు దేవాసురులు యిదే చెడతాగినారు.