Jump to content

కన్యాశుల్కము (తొలికూర్పు)/చతుర్థాంకము

వికీసోర్స్ నుండి


లుబ్ధావ: గాడిదెకొడకా! (అని కర్రపట్టుకొని లేచును).

రామప్ప: ముసలిగాడిదకొడకా నీ పనిపట్టిస్తాను.

(అని వెళ్లిపోవును)

***

కన్యాశుల్కము

చతుర్థాంకము

(బైరాగీ, హేడ్ కనిష్టేబు, దుకాణాదారుడు, యింకా మరిద్దరు, మధ్యను సీసాలు పెట్టుకుని ప్రవేశించుదురు.)

(తెరతీయు ముందర నారాయణ నారాయణ నారాయణభజే అను కీర్తన పాడుచుండవలయును.)

హేడ్ : గురోజీ తమరు హరిద్వారం బయలుదేరి యెన్నాళ్లయిందేమిటి?

బైరాగి : రెండు రోజులయినది. మొన్న వుదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం సేవించాము. ప్రచ్ఛన్నంగా సింహాచలం పోతూవుంటే నువ్కోక భక్తుడవు పట్టుకొని ఆపేశావు.

హేడ్ : ఆహా! యోగమహత్యం - ముక్కు బిగించి స్తానాలుచేసే బ్రాహ్మలకెవరికీ యీ సిద్ధుల్లేవుగదా?

బైరాగి : వాళ్లకేమీ తత్వము తెలియదు. మా తాతగారు చెప్పిన పద్యం నీవు వినలేదా? ఆత్మ శుద్ధిలేని ఆచారమదియేల.

హెడ్ : వేమన్న మీ తాతేనా గురోజీ?

బైరాగి : అవునోయి నాకు మూడువందల యేళ్లున్నవి, ఆయన పరంపదం వేంచేసి వెయ్యి సంవత్సరము లౌతవి.

దుకాణ: ఆహా! యివాళ మనదేమదురుష్టం. గురోజీ! నౌకరి కొక సందేహం వున్నాది. పరబ్బరమం సీసాలో కనపడ్డంత సొట్టంగా మరొకసోట అగుపడుతుందా?

బైరాగి : యీ రహస్యం నీకేలాగు దెలిసిందేమిటి? అమృతమంటే సారాయి కాదురా పామరుడా - నాడు దేవాసురులు యిదే చెడతాగినారు. దుకాణ: (నలుగురివైపు జూచి) సూశారా భాయి నే మొదట్నించీ యిదేకదా సెపుతూ ఒచ్చేవోణ్ణి - అఖాడాకొస్తేగాని పరబ్బరమం దొరకదు

బైరాగి : కాసీలో మేమూ వక బ్రాహ్మడు బ్రహ్మగ్యాన సమాధికి కూర్చున్నాము. బుడ్డీమీద బుడ్డి, బుడ్డీమీద బుడ్డి తెల్లవారేటప్పటికి యిద్దరికీ తన్మయం అయిపోయింది. మరి రెండు రోజులకుగాని నేను సమాధిలోంచి లేవలేదు. మరి ఆ బ్రాహ్మడు, యెప్పటికీ లేవలేదు. పరమాత్మలోకలిసి పోయినాడు. (పెన్షను సిపాయి అచ్చన్న ప్రవేశించుచున్నాడు)

దుకాణ: ఈయన సిపాయి అచ్చన్నగారు మంచి బరమగ్గాని.

అచ్చన్న: నేను యేహపాటివాడనండీ, మీ ద్రాసుడను, తమవంటివారు వచ్చినప్పుడల్లా పాదసేవ చేసుకుని నాలుగు స్రంఘతులు నేర్చు కున్నాను.

బైరాగి : నీ ముఖాన్ని మంచి బ్రహ్మకళవున్నదిరా నరుడా.

అచ్చన్న: (దుకాణదారుతో) నాహస్రంగతి యిప్పుడు త్రెలిసింధా (పైకి) తమ కటాక్షం.

హేడ్ : అచ్చన్నగారు మా బాగాపాడుతారండీ.

బైరాగి : యేదీ కొంచెము పాడూ.

దుకాణ: ఒక గళాపుచ్చుకు మరీ పాడండి.

అచ్చన్న: (యాగంటి లింగడిపాట పాడి, పాటయిన తరువాత మరి రెండు గ్లాసులు పుచ్చుకొని) మాఘురువుగాహరు యీ క్రీర్తన ప్రాఢుతూ రెండు హడుగులుపైకి లేచేవారు.

బైరాగి : నాశక్తి చూపిస్తాను చూడండి. నరుడా ఆ సీసా యిలాగందుకో మంత్రిస్తాను, వకొక్క గలాసు పుచ్చుకుని కళ్లు మూసుకుని లోపలిదృష్టితో చూడండి. నేను లంబికా యోగం పడతాను.

(అందరును త్రాగి కళ్లుమూసికొనుదురు.)

బైరాగి : కళ్లు మూసుకున్నారా?

అందరు:మూసుకున్నాము గురోజీ.

బైరాగి : బస్ - యికకళ్లు తెరవండి, యెన్ని అడుగులు పైకిలేచానో చూశారా?

అచ్చన్న: యీవేహళ యేమిసుధినం! మరి వక్క క్రీహర్తన మనవిచేసుకుంటాను.

(అని మరి వకగ్లాసు పుచ్చుకొనును. )

బైరాగి : యితను నిజంగా బ్రహ్మగ్యానిలాగ కనబడుతున్నాడు.

(వీధిలోనుంచి రామప్పంతులు తలుపు, తలుపు అనీ యనేకమారులు విలుచును. ఎవరును పలుకరు. )

రామప్ప: గాడిదలు యెవరూ వినిపించుకోకుండా వున్నారు. (అని గట్టిగా) హెడ్డు గారూ కూనీ, కూనీ జరిగింది.

హేడ్ : యెవరో కూనీ, కూనీ అంటున్నారు.

రామప్ప: లుబ్ధావధానులు భార్యను చంపివేశినాడు. నూతిలో ధభీమనీ పడివేయడం నేను చూచినాను, ఆ తరువాత శవంతీసి పాతిపెట్టి వేసినాడు.

హేడ్ : (తలుపు తీసికొని యవులకువెళ్లి) యెందుకు చంపాడేమిటి.

రామప్ప: పెళ్లయిన మూడు రోజుల్లోగా రెండు వందలు రూపాయలు ఖర్చు పెట్టిందట. యింతే కాకుండా యిdi వుండడం మీనాక్షి వ్యాపారానికి భంగం; యీ గుంట దానిగుట్టు వీధిలో పెట్టినది.

హేడ్ : యేదో ఆలాగచెప్పు అదీ వుంటేగానీ కూనీయెప్పుడూ జరగదు. యిన్నాళ్లకు దొరికాడవుధాన్లు, నా రెండు వందలరూపాయల పత్రం లాగేస్తాను.

రామప్ప. అయితే నీమట్టుకేనా? భాయీ! నాకంటె అపహరించాడు. దాని ఖరీదు కూడా తియ్యాలి సుమా.

హేడ్ : అదంతా నువ్వే సెటిలుచేసుకో - గాని వక్కడి సాక్ష్యం చాలదే.

దుకాణ: నాకేమైనా పారేస్తే నేను సాచ్చికం పలుకుతాను.

హేడ్ : మూడోసాక్షికూడా కావాలే

బైరాగి : కావలిస్తే నేను కూడా వస్తాను, మావంటి జ్ఞానులుకు అబద్ధం అన్నమాటలేదు, లోకం అంతా మిధ్య, నువ్వూ నేనూ కూడా అబద్దమే. దాని రహస్యం అది. ఏమయినా డబ్ళు పారవేస్తే హరిద్వారంలో నేకడుతూన్న మఠానకు పనికివస్తుంది.

హేడ్ : అచ్చన్నగారుకూడా వస్తే బాగుండును గాని, ఆయన సమాధిలో వున్నాడు.

దుకాణా: మనము చాలమా యేమిటి, ఆయన రేపు సండేళకిగాని సమాదీలోంచి లేవడు.

(అంతా వెళ్లిపోనిచ్చి దుకాణాదారుడును. పంతులును వెనుక నాగుదురు. పంతు లెవరును లేకుండ నిటునటు చూచి యొకగ్లాసు పుచ్చుకొనును)

దుకాణా: మీ పద్దు పాతిక రూపాయలయిందండి. అందర్లాగా మిమ్మల్నింటికొచ్చి అడగడానికి ఒల్లలేదుగదా?

రామప్ప: ఈ వ్యవహారంలో యేమయినా చెయ్యితడి అవుతుంది. నీపద్దు మొట్టమొదట పయిసలు చేస్తాను. (అని నిష్క్రమించును)

ఒకటవస్థలము - లుబ్ధావధానులు యింటిపెరడు

(హేడ్ కనిష్టేబును, లుబ్ధావధానులును మాటలాడుచుందురు)

హేడ్ : నాపత్రం యిచ్చివేస్తే కేసు నీళ్లు కారించివేస్తాను.

లుబ్ధావ: వడ్డీమట్టుకు వదిలివేస్తాను ఆలాగు కటాక్షించండి.

హేడ్ : మళ్లీ మొదటికి వచ్చినారూ?

లుబ్ధావ: నాకు ఏఖర్మం తెలియదు నిరపరాధినిసుమండీ నాయనా?

హేడ్ : యీ కబుర్లు నా దగ్గిర యందుకు చెపుతారండీ? పంతులు చూచారు, కీపర్ చూచాడు, గురోజీగారు చూచారు, గ్రంథం అంతా సంపూర్నంగా ఉన్నది; రిపోర్టు చేస్తినా ఊరి బయట మర్రిచెట్టుకి మీమ్మలిని తప్పకుండా వురిదీసి వేస్తారు.

లుబ్ధావ: మరి వీళ్లకేమి యిచ్చుకోవలెను?

హేడ్ : అంతకు తక్కువకు వప్పరు, యాభై రూపాయలు ఇయ్యండి.

లుబ్ధావ: యిరవయి రూపాయిలిచ్చుకుంటాను.

హేడ్ : పోనియ్యండి ముప్పయిరూపాయలు ఇయ్యండి (అని పత్రమును రూపాయిలును పుచ్చుకొనును)

లుబ్ధావ: డబ్బంతా అయిపోయినది యిక ముష్టికి బయలుదేరాలి.

హెడ్ : డబ్బుమాటకేమి ప్రాణం దక్కింది మరి భయం పడకండి. మీ భార్యా పరారి అయి పోయిందని రిపోర్టు వ్రాశేస్తాను.

(నిష్క్రమించుచున్నారు.)

***

రెండవ స్థలము - లుబ్ధావధానులు పెరటీ గోడ అవుతల

(రామప్పంతులు, దుకాణాదారు, బైరాగియు నుందురు, హేడ్ కనిష్టీబిల్ ప్రవేశించును)

హేడ్ : (గట్టిగా) రండి వెళ్లిపోదాము.

రామప్ప: మీమాట ఫయిసలయింది కాబోలు - మామాట యేమిటి.

హేడ్ : అంతా పైసలు చేసుకొచ్చాను.

రామప్ప: యేమిటి ఫయిసలు చెయ్యడము-నాకంటె యగేశాడు. రెండువందలిస్తేనే కాని కూడిరాదు. హేడ్ : ఆకాశం కన్నం పడినట్టు కబుర్లు చెపుతారు. మీ యిద్దరికి ఇదిగో చెరి అయిదు రూపాయిలు - గురోజీగారికి పది.

బైరాగి : (పుచ్చుకుని) నారాయణస్మరణ, రాత్రి మేము కాసీవెళ్లి రేపు సాయంకాలానికి తిరిగీ వస్తాము.

హేడ్ : చిత్తం తమ దయవల్ల యీ వేళ యీ లాభం కలిగింది. నాకు మహాకులాసాగా వున్నది.

దుకాణా: (బైరాగి చెవులో) యీవేళే చెన్నాపట్టంనించి ఫష్ణురకం బ్రాందీ వొచ్చింది. ఒక్కమాటు దుకాణం దగ్గిరికి దరిశనం యిప్పించి మరీ కాశీ వెళ్లోలి.

రామప్ప: (తనలో) గాడిద తనమట్టుకు తడుముకుని వూరుకున్నాడు. నేను చెప్పకపోతే యేమీ లేకపోవును. ఆ బైరాగి వెధవ కాసీ వెళ్లి రేపు సాయంత్రానికి వస్తాడట. వాడికి పది రూపాయీలిచ్చేశాడు. యీ హేడ్డుకి యేమీ నదురూ బెదురూ లేకుండా వున్నది. కంటె పోయిందంటే అయిదురూపాయలు చేతులో పెడతాడూ? (పైకి) కనిష్టేబు అన్నా! నా కీ వ్యవహారంలో చాలా నష్టం కలుగజేసినారు. నాకంటె పోయింది. మీకు యేమీ చీమా దోమ కుట్టినట్టయినా లేదు. ఆ ముసలివాడిని మళ్లీ పట్టుకుంటాను - మీరు ఆ వూసుకు రాకూడదు సుమండీ.

హేడ్ : నే మొదటే చెప్పాను మీ కథ మీరే శైటిలు చేసుకొమ్మని. (తనలో) దొంగవేషాలు వీడికంటె పోయిందట - వీడక్కడికిపోతే - నేను మధురవాణి దగ్గిరకు వెళతాను.

(పంతులు తప్ప అందరూ నిష్క్రమించుచున్నారు. )

రామప్ప: ఈ హేడ్ తాళం పట్టించాలి - వాడి సొదే చూచుకున్నాడు గాని నా మాటాలోచించాడు కాడు, బిచ్చం బిసాదు అయిదురూపాయిలా నావంటివాడికి యిప్పిస్తాడు? వీడికిగానీ యీ వూరినుంచి వుద్వాసన అయితే మధురవాణివైపు చూసేవాడు మరెవడూ లేడు. ఆకాశరామన్న అర్జీలు నాలుగు యినస్పెక్టరుకి, పోలీసుకి కొట్ బజాయించేస్తాను.

(అని నిష్క్రమించును.)

***

మూడవస్థలము - అగ్నిహోత్రావధానులయిల్లు

(అగ్నిహోత్రావధానులు, వెంకమ్మ ప్రవేశించుచున్నారు.)

అగ్నిహో : రెండు జాముల రాత్రికి ప్రయాణం.

వెంకమ్మ : యెన్ని బళ్లేమిటి?

అగ్నిహో :యిరవయ్యెదుబళ్లు.

వెంకమ్మ : అన్ని బళ్లేందుకేమిటి?

అగ్నిహో :నులకవారు, నెమలివారు, నప్రవారూ అంతా వస్తారు. కరణంగారి కుటుంబముకూడా వస్తామని చెప్పారు దివాంజీ సాహేబుగారు ఒక యేనుగ, నాలుగు గుఱ్ఱాలూ ఇచ్చారు.

వెంకమ్మ : అల్లుడినడుం ఇదివరకు విరగకుండా వుంటే దీనితో విరిగిపోతుంది. యెందు కేమిటి యీ వెధవ పటాటోపమంతాను? తోవలో మనమింత మందికి తిండి పెట్టాలి కదా? వూళ్లో అయిన వాడినీ కానివాడినీ వెంట పెట్టుకు వెళ్లితే అల్లుడు పకీరౌతాడు - అమ్మిముష్టెత్తుకోవాలి.

అగ్నిహో : ఉత్సాహభంగమ్మాట్లాడకు, నాకు కోపము మాత్రము తెప్పించకు. లుబ్ధావధాన్లు పెళ్లియెంతో వైభవంగా చేస్తాడు.

వెంకమ్మ : చాలును ప్రయోజకత్వం. తోచినప్పుడల్లా ఆడవాళ్లను పశువులలాగ బాదడమే కదా ఇప్పటికిన్నీ, మా మంచి సంబంధం చేశారు లెండి మావాళ్లు కోపంవచ్చి రావడం మానేశారు.

అగ్నిహో : మీవాళ్లు రాకపోతే పీడాచీడా కూడా పోయింది. మీవాళ్లు ఓర్వలేని గాడిదలు.

వెంకమ్మ : అయ్యవారు బయలుదేరి వెళ్లిపోతామంటున్నారు. ఆయన కేదో పరీక్ష వుందట.

అగ్నిహో :ఆయన వెళ్లిపోతె పెళ్లిసప్లై యెంతమాత్రమూ జరగదు. యేలాగైనా వుండమని బతిమాలు కుంటాను. ఆయనలాంటి అల్లుడుంటేనా, లోకమంతా సాధింతును. (నిమ్మళముగా) చిన్నమ్మిని ఇతనికిస్తే తీరిపోవును. అయితే డబ్బుంటేనేగానీ వ్యవహారం జరగదు.

(అని నిష్క్రమించుచున్నారు)

(గిరీశం, బుచ్చమ్మ, ప్రవేశించుచున్నారు.)

గిరీశ : మీ పెనిమిటి యెన్నేళ్లె పోయినాడు.

బుచ్చమ్మ: పెళ్లి సదస్యంనాడే. గిరీశ : ఆహా! ఆ తల్లిదండ్రులు నీకు శత్రువులైనారు గదా! ముసలివాడికి కట్టిపెట్టడం కంటె శవానికి కట్టిపెట్టడం మేలు. ఆహా! స్త్రీలకు వెధవరికం యెంత దురవస్త, మీవంటి శోభ గల ముఖమునకు బొట్టూ కాటుక యుంటే యేమి సొంపుగా నుండును. ఆ తుమ్మెద బారుల నపహసించు జుత్తుతీసి వేయుదురు గదా? వంటిపూట తిండిబెట్టి ఆ దబ్బపండువంటి శరీరము కృశింపచేతురు. ఇంటిచాకిరంతా నీవే చేయవలెను గదా? మనవాళ్ల ఆచారము లెంత దుర్మార్గముగానూ, శాస్త్ర విరుద్ధముగానూ వున్నవి.

బుచ్చమ్మ: మన శాస్త్రాల్లో అలా చెయమనే వుందటే?

గిరీశ : రామాయణము నెత్తిని పెట్టుక ప్రమాణం చేస్తాను. చిన్న పిల్లని ముసలి వాడికివ్వగూడదని శాస్త్రమున్నది గానీ, విధవలను పెళ్లాడగూడదని లేదు. మీ తమ్ముడికి పాఠం చెప్పేటప్పుడల్లా శాస్త్రాలూ, సబబులూ చదివి వినిపించుతూనే వున్నాను కానూ. నేను సలహాయిచ్చినట్టు వెళ్లిపోడమే వీళ్లకు శాస్తి. నీయందు నాకు అపరిమితమైన అనురాగము వున్నది. నీవు ఆలాగు రాకపోయినా యీ సంగతి మీవాళ్లతో చెప్పినా తప్పకుండా ప్రాణత్యాగంచేస్తాను. నీ కోసమే ఇన్నాళ్లు మీ వాళ్ల యింట్లో అరవచాకిరీ చేస్తూ ఉన్నాను.

బుచ్చమ్మ: మీరు చెప్పిన మాటలు బాగానే వున్నవి గాని జాతిలోనుంచి వెలివేస్తారు గదా అని భయము మట్టుకు వదలకుండా వున్నది.

గిరీశ : నీ యడల ఇంత అక్రమముగా నడిచినవాళ్ల లోంచి విడిచిపోతే నీకు వచ్చిన నష్టం యేమి? యింత సొగసూ, యిన్ని సద్గుణములూ బూడిదేలో పోసిన పన్నీరు అయి పోయెను గదా అని విచారిస్తూన్నాను. గౌర్నమెంటువారు మళ్లీ పెండ్లాడిన వెధవల్ని కులములో కలుపుకొమ్మని ఆక్టుకూడా కొద్ది రోజులలోనే ప్యాసుచేయడానికి సిద్ధంగా వున్నారు.

బుచ్చమ్మ: లేచిపోయి మావాళ్లందరికీ-విచారం కలగచేయడంకంటె నేను బాధపడుతూ అయినా యిక్కడ వుంటేనే మంచిది కాదూ?

గిరీశ : నీవు యెక్కడ వున్నా యేమిచేసినా నీకు లోపంలేదు. వజ్రమెక్కడున్నా వజ్రమే, కానీ నీవు రాకుంటే నా బ్రతుకంతా వృధా అయిపోతుంది. నా ఇష్టము నెరవేరకపోయిన యడల జీవించడమందు యెంతమాత్రమూ అభిలాషలేదు. నీవు మీవాళ్లను విడవవలసి వస్తుందన్నావు? నీకింత అపకారము చేసి నిన్నింత బాధపెడుతూ వున్నవాళ్లను, విడిచేమి వీడవకేమి. నెత్తి మీద పువ్వులాగ ధరిస్తాననిన్నీ, నీవు లేక జీవించలేననిన్నీ మనవి చేసుకుంటూ వున్న నన్ను పొందక పోవడం ధర్మమా (అని మోకాళ్లపడి చేయిపట్టుకుంటాడు). బుచ్చమ్మ: అయితే మనము వెల్లిపోతే ఆపైన గతేమిటి?

గిరీశ : వీరయ్య పంతులుగారు మహాయోగ్యులు, ఆయన్ను చేరుకుంటే మనకి లోపం వుండదు. యీ సొసైటీ తాలూకు లక్షలకొలదీ డబ్బువున్నది, డబ్బు విషయమై నీకు వీచారంవద్దు. | నేను పరిక్ష ప్యాసుఅయినాను కదా?

బుచ్చమ్మ: అయితే మనం యేలాగు వెళ్లడం?

గిరీశ : యెల్లుండి రాత్రి జగన్నాధపురంలో మజిలీచేస్తాము. ఆరాత్రి ప్రయాణంలో నీ బండితోవ . తప్పించి శొంఠాం మార్గంగా పెట్టించివేస్తాను.

బుచ్చమ్మ: నా బండిలో మా తమ్ముడుకూడా కూర్చుంటాడే?

గిరీశ : వాడిని యేనుగుమీద యెక్కిస్తాను?

బుచ్చమ్మ: కానియ్యండి - అలాగేను వెళ్లండి! నా మనస్సేమీ మనస్సు లాగుంది కాదు (అని కన్నీళ్లు విడుచును.)

గిరీశ : నేను చెప్పినట్టు చేస్తానని చేతులో చెయ్యివేస్తేనే కానీ వెళ్లను.

బుచ్చమ్మ: (కొంత సేపాలోచించీ) సరే.

(ఇద్దరు నిష్క్రమించుచున్నారు.)


***

నాల్గవస్థలము - జగన్నాధపురం సత్రం

(గిరీశం, వెంకటేశం ప్రవేశించుచున్నారు)

వెంకటే: రాత్రి మీరూ నేనూ కూడా వొక బండిలోనే కూర్చుందాము.

గిరీశ : డామ్‌బండీ - నేను హోర్సుమీద కూర్చుంటా.

వెంకటే: అయితే నాకూ బండీవద్దు హార్సు యెక్కలేనే మరి సాధనం యేమిటి ?

గిరీశ : అయితే నీకు యెలిఫెంటు. మావటివాండ్రతో బందోబస్తు చేస్తాను మీవాళ్లతో యీ . ప్రయత్నం చెప్పుకుమా.

అయిదవస్థలం- (లుబ్ధావధానులు ఇల్లు)

(లుబ్ధావధానులు, రామప్పంతులు ప్రవేశించుచున్నారు. )

రామప్ప: అయితే కంటె ఇవ్వనంటావా?

లుబ్ధావ: నీకంటె సంగతి నాకేమీ తెలియదు.

రామప్ప. అయితే నీమీద క్రిమినల్ చార్జీ తేవలసి వుంటుంది.

లుబ్ధావ: పీకకోసినాగానీ కంటెమాట నాకేమీ తెలియదు.

రామప్ప: యింతా చదువుకుని అబద్ధం ఆడేస్తావయ్యా,

లుబావ: అక్షరాలా.

రామప్ప: నీకూ నాకూ వుండే స్నేహం ఇంతేనా నా మాటవిని కంటెఇచ్చేయి మధురవాణి దానికోసం అల్లరి పెట్టేస్తూన్నది.

లుబ్ధావ: యీ కబుర్లు నాతో యెందుకు చెపుతారు? ససేమిరా కంటె సంగతి నాతో మాట్లాడవద్దు.నీ స్నేహంవల్ల కావలసిన వుపకారం ఎంత కావాలో అంతా అయింది. వద్దంటూ వుంటే పెళ్లాడమని ప్రాణాలు తినేశావు. డబ్బు పోవడం పెళ్లాము పారిపోయి పరువు పోవడం ఆలాగు వుండగా మీది మిక్కిలి కూనీకేసుకూడా పీకలమీదికి తెచ్చావు. నాపాలింటి శనిగ్రహంనీవే. అందుకు తోడు యేల్నాటిశని రోజులు కూడా తటస్థించాయి? రేపు రాత్రి బయలుదేరి కాశీయాత్ర వెళ్లడానికి నిశ్చయించాను. పెట్టవలసిన బాధేమో పెట్టావు. చెయ్యి చిక్కిన డబ్బేమో చెయ్యి చిక్కింది. మరి కంటే గింటే అని బాధపెట్టక లేచిపోతే బహువుపకారంగా ఆలోచించుకుంటాను.

రామప్ప: మొగుణ్ణి కొట్టి మొగసాలెక్కింది అన్న సామెతగా, నువ్వూ ఆగుంటూరు శాస్త్రులూ కలిశిచేసిన దగావల్ల యాభై రూపాయీలూ, కంటే, పోవడమే కాకుండా నేను పెళ్లిలో పడ్డశ్రమ యెంతమాత్రమూ ఆలోచించినావు కావు! చిన్నప్పటినుంచీ నీ దగ్గిర యెంతో స్నేహభావంగా వుండే నన్ను యీలాగు దగా చెయ్యడం యెంతమాత్రమూ నీకు న్యాయముకాదు. కేసులో నా వూసే ముందీ. కూనీ జరిగిన తరువాత పోలీసు వాళ్లూరు కుంటారా? బలవత్తరమయిన సాక్ష్యం వచ్చింది. నన్నేమి చెయ్యమంటావు? ఇంకా నేను చెప్పబట్టే నిన్నీలాగు వదిలేశారు. న్యాయమాలోంచి నాకంటె నాకిప్పించండి.

లుబ్ధావ: యెవరివల్ల వస్తేనేమీ నా ప్రాలుద్దం ఆలాగువుంది యేలాగా రేపు బయలు దేరి వెళ్ళిపోవడానికి సిద్ధంగా వున్నాను. మీకంటె సంగతి మీరే కొవ్వి తెచ్చిపెట్టుకున్నారు - నన్ను ఆ విషయమై అడగవలసిన ప్రసక్తిలేదు. రామప్ప: బాగా ఆలోచించుకోండి నావల్ల చాలా వుపకారం పొందినారు.

(లుబ్ధావధానులు తలుపువేసుకొని లోపలికి వెళ్లిపోవును)

రామప్ప: ముసలిగాడిద టంగాడుకాడు. రేపు రాత్రి బయలుదేరి వెళ్లిపోతానంటూన్నాడు. వీడు వెళ్లిపోయినట్టైనా నా కంటెకు నీళ్లధారే - ఇంటిదగ్గిర రోజూ మధురవాణి ఘాలివాన పెట్టేస్తూ వున్నది. యీ రాత్రి అదన్నమాటలుచూస్తే దానిని పొడిచేసి పొడుచుకోవాలని బుద్దపుట్టింది. వీడు వెళ్లేలోగా ఆకాశరామన్న అర్జీ అంది పోలీసువస్తే బాగుండును. ఈ వేళ దశమికాదూ; ఆ! అయితే ఫర్వాలేదు. ఈ రాత్రి అగ్నిహోత్రావధానులు తోటలో దిగుతాడు. అక్కడ యేదైనా పన్నాగం పన్నాలి. ఇప్పుడు యింటికి వెళ్లితే మధురవాణి పేడనీళ్లు పట్టుకువస్తుంది నాకు యేమీ తోచకుండావున్నది తెల్లవారగట్ల కావచ్చినది. కాలోచిత కృత్యములు తీర్చుకోవడముకు చెరువుకు వెళ్లుదాము.

***

ఆరవస్థలము - తోట - పెళ్లి వారి బళ్లు చెరువుగట్టుమీద నుండును.

అగ్నిహో : బళ్లుదింపండి - బళ్లు దింపండి - సాయేబూ యేనుక్కి కావలసినంత రొడ్డవున్నది. చెరువు, స్నానానికి మహాబాగా వున్నది. యెవరయ్యా చెరువు గట్టుమీద?

రామప్ప: నా పేరు రామప్పంతులంటారు.

అగ్నిహో : లుబ్ధావధానులుగారు మిమ్ములను పంపించారా యేమిటి?

రామప్ప: యెందుకండీ?

అగ్నిహో :మేమొస్తామని లుబ్ధావధానులుగారు యెదురుచూస్తూ ఉండలేదూ? నా పేరు అగ్నిహోత్రావధానులంటారు.

రామప్ప: మీరేనా అగ్నిహోత్రావధానులుగారు యేమి వచ్చారేమిటి?

అగ్నిహో : పెళ్లిమాట మీకు తెలియదా యేమిటి?

రామప్ప: పెళ్ళెవరికండీ?

అగ్నిహో : మీదీవూరు కాదా యేమిటండీ? మా పిల్లను లుబ్ధావధానులుగారికిస్తాము.

రామప్ప: లుబ్ధావధానులుగారికి పెళ్లి అయిపోయిందే?

అగ్నిహో : పంతులుగారాశ్యాలాడుతున్నారు -హాశ్యాలకేమిగాని ప్రయత్నాలు యేలాగు జరుగుతున్నాయి యేమిటండీ? లుబ్ధావధానులుగారు బహుసామంతులనీ వింటున్నాము? రామప్ప: మీరే హాశ్యాలాడుతున్నట్లున్నది. పెళ్లి అయి పదిరోజులైంది. మీరీ సంబంధం అక్కరలేదని వుత్తరము వ్రాసినారట. అందుపైని గుంటూరు నుంచి వొక శాస్త్రుల్లు వస్తే ఆయన కొమార్తెను పన్నెండువందల రూపాయలు యిచ్చి పెళ్లాడాడు.

అగ్నిహో : అన్నగారూ హాశ్యం ఆడుతున్నారు - న్యాయంగాదు సుమండీ.

రామప్ప : గాయత్రీసాక్షి, నేను యెప్పుడూ అబద్దం ఆడి యెరుగను. నా మాట నమ్మకపోవడం ధర్మమేనా?

అగ్నిహో : గుండెలు తీసినపని. రండీ గాడిదకొడుకుని యెమికలు విరగకొడతాను.

రామప్ప: నేను రానండి - గుంటూరు సంబంధం చేయ్యవద్దంటే నాతో దెబ్బలాడాడు. అప్పటి నుంచీ నాకూ అతనికీ మాటలులేవు - మీరు వెళ్లి మాట్లాడి రండి. సూర్యోదయము అయేసరికి వచ్చి కలుసుకుంటాను.

అగ్నిహో : గాడిదకొడుకింత స్వామిద్రోహం పని చేస్తాడూ? నా కేమీ నమ్మకము లేకుండా వుందీ - నిజమైతే పులుసులోకి యెమికలు లేకుండా విరిచేస్తాను.

(నిష్క్రమించును)

రామప్ప: పిశాచంలాగు వెళ్లుతున్నాడు - కంటె యివ్వనందుకు తగినశాస్తి అవుతుంది-నా సంగతి చూస్తే ఆవు పెయ్యాకాదు - గేదెపెయ్యాకాదు, దీక్కుమాలిన పెయ్యలాగున్నది. ఇంటికి వెళ్లితే కంటెకి తాపులాట తప్పదు. వెళ్లకపోతే కనిష్టీబు ప్రవేశిస్తాడేమో అన్న బెంగ.

ఏడవ స్థలము - రామప్పంతులు ఇల్లు

(రామప్పంతులు వెనుక ప్రక్క నుంచే తొంగితొంగి చూచుచు నిన్ముళముగా అడుగువేయుచు ప్రవేశించును)

రామప్ప: మధురవాణీ.

మధుర: అయ్యా?

రామప్ప: యెవరు యింట్లోంచి నల్లకోటు తొడుక్కుని వెళ్లిపోతున్నాడు?

మధుర: ఇల్లుతుడిచేదాన్ని కాబోలు చూచీ ఆలాగనుకున్నారు. మీ కంతకంతకు మతిపోతూంది. నా కంటేదీ? తాకట్టు పెట్టేశారు. నాకు తెలుసును. అది అడుగుతానని యీ వేషాలు వేస్తూన్నారు. యీ సరుకులు మీరు తీసుకోండి - మీరు నన్ను సార్లా చెయ్యరు - నేను నూతులో బడిపోతాను (అని యేడ్చును) రామప్ప: (తనలో) గట్టి వుపద్రం వచ్చింది. (పైకి) సుందరి! యెందుకు నిష్కారణంగా విచారిస్తావు యీ నెలలో రొండు కంటెలు సంపాదించి యివ్వకపోతే నా మీసం గొరిగించెయ్యి

మధుర: నాకేమి అక్కరలేదు నాకంటె నాకు కావాలి.

రామప్ప: (దగ్గిరకు వెళ్లి) గడ్డం పట్టుకు బ్రతిమాలుకుంటాను. (అని గడ్డము పట్టుకొనబోవును, మధురవాణి తోసివేయును)

రామప్ప: కాళ్లు పట్టుకుంటాను నన్ను రక్షించి యేలాగైనా ఈ మాటు కాపాడు.

మధుర: ఆ కంటె యెవర్తికిచ్చావో దాని కాళేపట్టుకో. (అని తన్నివేయును)

ఎనిమిదవ స్థలము - తోట

(రామప్పంతులు, అగ్నిహోత్రావధానులు, వెంకమ్మ, మొదలగువారు)

అగ్నిహో : గాడిదకొడుకుని మా చెడ్డదెబ్బలు కొట్టేశాను. యేనుగులూ గుఱ్ఱాలూ తెచ్చాను - వీడి శ్రార్ధము మీదికి త్రోవ ఖర్చులైనా వాడు వొక దమ్మిడి ఇవ్వడష,

వెంకమ్మ : మన ప్రాలుద్ధం గాని యెందుకీ సంబంధం వద్దంటే విన్నారూ. నేను మొదటే అనుకున్నాను - వచ్చేటప్పుడు పిల్లి యెదురుగుండా వచ్చింది.

అగ్నిహో : మాదర్చోద్ వూరుకో? ఆడముండలకేమి తెలుసును. అన్నగారూ - క్రిమినల్ మీద వెళ్లడానికి అవకాశంగా వుంటుందా? మా దగ్గిర గిరీశంగారని అయ్యవారు ఒకరున్నారు- ఆయనకీ లాభోగట్టా మా బాగా తెలుసును. ఆయనను కూడా సలహా చేద్దాం.

రామప్ప: (తనలో) ఇదేమిటి పులిమీద పుట్రొచ్చింది వీడినిపట్టి గ్రంథంచేయించి డబ్బు పిండాలనుకుంటూవుంటే నా చేతిలో నుంచి వ్యవహారము తప్పిపోయేటట్టు కనపడుతూ వున్నది. (పైకి) చిన్నప్పటినుంచీ, లాలో పుట్టి పెరిగాను. నా కంటె యెక్కువ తెలిసిన వాడొకడున్నాడా? అయినా యిందులో సలహా కేమున్నది. మీరు మాత్రం యెరగని లా యేముంది. మొట్టమొదట క్రిమినల్కి తెచ్చేది, తరవాత సివిలు, నా సలహాప్రకారం వెళితే యీ కేసులో నాలుగువేల రూపాయిలు డామేజి యిప్పిస్తాను. మొట్టమొదట ఖర్చులకి మట్టుకు కొన్ని రూపాయిలు పట్టుకోవాలి.

అగ్నిహో : నా దగ్గిర లెఖ్క దమ్మిడీ లేదండీ, యీ గాడిదెకొడుకు రూపాయిలిస్తాడనే నమ్మకంచాత నేనేమీ తేలేదు.

రామప్ప: యింటికి వెళ్లి లెఖ్ఖపట్టుకు వచ్చేటప్పటికి వ్యవధి అయిపోతుంది. శుభస్యశీఘ్రం అన్నాడు. మీ ఆలోచనేమిటి? అగ్నిహో : యిదేదో అయితేనేకాని యింటి మొఖంచూచేదిలేదు. ఓ సరుకేదైనా మా అమ్మిది యీ వూళ్లో అమ్మేస్తాను.

రానుప్ప: అయితే పట్టుకురండి పోలిశెట్టికి అమ్మేదాము. మీరు లుబ్ధావధాన్లని కొట్టేటప్పుడు పోలిశెట్టి దగ్గిర వున్నాడని చెప్పారు. లుబ్ధావధాన్లు మీమీద కేసుతేవడం స్వతస్సిద్ధం. పోలిశెట్టి మీమీద సాక్ష్యం పలక్కుండా వాడికేమైనా యిచ్చి కట్టుకుందాము.

అగ్నిహో ఆ సలహా బాగుంది. నాకూ అదే భయంవేస్తూవుంది.

రామప్ప: చూశారా ప్రతివాడికీ సలహా చెప్పడానికి చాతవుతుందండీ! అందులో యీ యింగ్లీషు చదువుకున్న అయ్యవార్లని సలహా అడిగితే కేసులు తేవద్దంటారు. వాళ్ల సొమ్మేం పోయింది. దొంగసాక్షాలు కూడదంటారు. యేవీ లేకపోతే కేసులు గెలవడం ఎలాగు?

అగ్నిహో :మా అయ్యవారుమట్టుకు మంచి బుద్దిమంతుడూ, తెలివైనవాడండీ. కేసుల విషయమై అతనికి తెలియందేదీలేదు. అంత బుద్ది మంతుణ్ణి యెక్కడా చూడలేదు, మీరు అతణిస్తే చూస్తే మీరూ అలాగే అంటారు.

రామప్ప: మీకు మరొకరు సలహా చెప్పవలసిన జరుగురుండదు. నా మాటవిని అయ్యవారిని తోడిచ్చి పిల్లల్ని యింటికి పంపించెయ్యండి, లుబ్ధావధాన్లు మీమీద చార్జీ తెచ్చేలోగా మనం ముక్కతగిలించేస్తేనేగానీ బాధిస్తుంది, మరి వేగిరం ఏదో సరుకు పట్టుకురండి.

అగ్నిహో :యేదీ అమ్మి నిలా పిలువ్ (అమ్మేది, అమ్మేదియని పదిమందియు పిలుతురు)

వెంకమ్మ : అమ్మేదీ చెప్మా బద్దకించి బండిలో పడుకుందేమో పిల్చుకొస్తాను. (అమ్మిబండి యేది యనుచు నాలుగడుగులు నడుచును)

ఒకరు : అమ్మిబండీ యెక్కడా కనబడదు. బండీ, వెనకుండిపోయిందేమో?

వెంకమ్మ : అడుగో అబ్బున్నాడే, వీడెలావచ్చాడు? అబ్బీ నువ్వక్కయ్య బండిలో కూర్చోలేదూ?

వెంకటే: లేదు. నేను యేనుగెక్కాను.

అగ్నిహో :దొంగగాడిద కొడకా అయ్యవారేడ్రా.

వెంకటే: యెక్కడా కనబడడు.

అగ్నిహో :గుర్రం యేదీ, గుర్రపాడేడీ.

వెంకటే: రాత్రివేళ గుర్రం దిగిపోయి బండీయేక్కాడని గుర్రపువాడు చెప్పాడు.

వెంకమ్మ : అయ్యో దాన్ని లేవదీసుకుపోలేదు గద?

దగ్గిరనున్న వారు : ఆఁ! ఆఁ! వెంకమ్మ : కొంప ములిగిపోయింది మరేమిటి (అనీ చతికిలబడును)

అగ్నిహో : (కోపముచేత వణకుచు) అయ్యవారు పకీరు ముండని తీసుకువెళ్లినాడూ? నగలపెట్టె! నాకోర్టు కాగితాలో!

వెంకటే: నా పుస్తకాల పెట్టెకూడా పట్టుకుపోయినాడు.

అగ్నిహో :(జందెము చేతుల బట్టి ముందుకు వెనుకకు కుడిచేయిలాగుచు) దొంగ లంజకొడకా! నువ్వే వాణ్ణి యింట్లో పెట్టావు, గాడిద కొడుకును చంపేదును. నాకు రవంత ఆచోకీ తెలిసింది కాదు. గాడిద కొడుకును పాతిపెట్టేదును.

రామప్ప: (దగ్గిరకువచ్చి) అయ్యవారు మహాదొడ్డవాడని చెప్పారే యేమి యెత్తుకు పోయినాడేమిటండి?

అగ్నిహో :యేమి యెత్తుకుపోయినాడా - నీ శ్రార్థం యెత్తుకుపోయినాడు. పకీరు ముండ నెత్తుకపోయినాడు. గాడిద కొడుకు ఇంగ్లీషు జదువుకొంపతీసింది. (అని కుమారుని జుత్తుపట్టుకొని కొట్టబోవుచుండగా తెర దించవలెను)

***

కన్యాశుల్కము

పంచమాంకము

ఒకటవస్థలము - విశాఖపట్టణములో మధురవాణి బసయెదుటి వీధి

(రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు ప్రవేశించుచున్నారు)

అగ్నిహో : మనం పోలిశెట్టి దగ్గిర బదుల్తెచ్చిన రూపాయిలన్నీ అయిపోయినాయి, యప్పటికీ ఖర్చులు ఖర్చులే అంటారు. నా దగ్గిర వక దమ్మిడీలేదు.

రామప్ప: ఖర్చు కానిదీ కార్యాలవుతాయిటయ్యా? మీ కడియం యెక్కడైనా తాకట్టు పెట్టండి.

అగ్నిహో : యీ వూళ్లో మనం యెరిగిన వాళ్లెవరున్నారు.

రామప్ప: రండి మధురవాణి దగ్గర తాకట్టు పెడదాము.

అగ్నిహో : చేసేవి మాఘస్నానాలూ, దూరేవి దొమ్మరి కొంపలూ అని జటాంత స్వాధ్యాయిని నన్ను ముండలిళ్లకి తీసుకు వెళతావషయ్యా?