కన్యాశుల్కము (తొలికూర్పు)/ద్వితీయాంకము

వికీసోర్స్ నుండి


కన్యాశుల్కము

ద్వితీయాంకము

ఒకటవ స్థలము - అగ్నిహోత్రావధాన్లుగారి యింటి యదుటి వీధి

(గిరీశ, వెంకటేశ్వర్లు, ప్రవేశించుచున్నారు.)

వెంకటే: నిన్నరాత్రి కన్యాశుల్కముమీద లెక్చరు యిచ్చారా?

గిరీశ: లెక్చరేమిటోయి ధణుతు ఎగిరిపోయినది. మీ తండ్రిది మైరావణచరిత్రోయి. మీ అంకుల్ కరటక శాస్త్రి స్కౌండ్రల్‌లాగ కనబడుతున్నాడు.

వెంకటే: ఏమి జరిగిందేమిజరిగిందేమిటి?

గిరీశ : రాత్రి భోజనాలవేళ లెక్చరు ఆరంభించమని రోజల్లా బురిడీలు పెట్టి నేను సబ్జక్టు అందుకునేటప్పటికి తనుకూడా సపోర్టుచేస్తానన్నాడు గాని నాకు మీ తండ్రివైఖరీ చూస్తే లెక్చరు ఆరంభిద్దామని నోటికొసకి అక్షరము వచ్చి జంకి మళ్లీ వూరుకుంటూ వుండేవాడిని. తుదకు పెరుగూ అన్నము కలుపుకునే వేళకు యిక టైమ్ మించిపోతుందని ఆరంభించాను ఇంకా ఇన్‌ట్రడక్షన్ రెండు సెన్‌టెన్‌సెస్ చెప్పలేదు. నాలుగు ఇంగ్లీషుమాటలు దొర్లేయి దాంతో మీ తండ్రి గుడ్లు యర్రచేశి ఈ వెధవ యింగ్లీషు విద్యనుంచి బ్రాహ్మణ్యం చెడిపోతున్నది దేవభాషలాగ భోజనాలదగ్గిరకూడా ఆ మాటలే కూస్తారు, సంధ్యా వందనము పురుషసూక్తము శ్రీసూక్తపారాయణ తగలబడి పోయినది కదా అని గట్టిగా కేకలు వేశేటప్పటికి నేను కొంచము పస్తాయించి థ్రోయింగ్ పెర్‌ల్‌స్ బిఫోర్‌స్వైన్ అనుకుని కరటశాస్త్రులు ఏమయినా హెల్‌పు చేస్తాడేమో అని అతనివైపు చూశాను. వులకలేదు పలకలేదు సరేకదా మొఖటు తిప్పేసి కడుపు పగిలేటట్టు నవ్వుతూ కూర్చున్నాడు. యిక లెక్చరు వెళ్లిందికాదు సరే కదా నోటిలోకి ముద్దకూడా వెళ్లిందికాదు. ఛీ యింత ఇన్‌సల్ట్ జరిగిన తరవాతను తక్షణం బయలుదేరి వెళ్ళిపోదామనుకున్నాను.

వెంకటే: అయ్యయ్యో వెళ్లిపోతారా యేమిటి?

గిరీశ : నాట్ ఇన్ ది లీస్ట్. కొసాకు విను నీ తండ్రిని అప్పుడే పోకట్‌లో వేశాను.

వెంకటే: అయితే మరి లెక్చరు ఇచ్చి పెళ్లి తప్పించేస్తామన్నారే.

గిరీశ: పెళ్లి ఆపడానికి బ్రహ్మశక్యంకాదు. డిమోస్తనీస్ సురేంద్ర నాథ్ బానర్‌జీ వచ్చి చెప్పినా కానీ నీ తండ్రి ఆ పెళ్లి మానడు. లెక్చరెంతసేపూ సిటీలలోనే కాని పల్లెటూళ్లలో పనికిరాదు. పూనాలాంటి సిటీలో లెక్చరు ఇచ్చామంటే టెన్‌థౌజండు పీపిల్ వినడానికి వస్తారు. మన టౌన్‌లోనే పెద్ద మీటింగులు చెయ్యాలంటే డప్పులు బజాయించి నోటీసులు కట్టి బాజారులు కాసి తోవంట వెళ్లిపోయే వాళ్లందరినీ యీడ్చుకుని వచ్చినాకాని వక యాభై మందికారు. పల్లెటూరి పీపిల్ లెక్చురుకు అన్‌ఫిట్. మొన్న మనము వచ్చిన బండివాడికి నేషనల్ కాన్‌గ్రెస్ విషయమై రెండు ఘంటలు లెక్చరు యిచ్చేసరికి ఆ గాడిదకొడుకు వాళ్ల వూరు హెడ్‌కానిస్టేబులుని కాన్‌గ్రెస్‌వారు యెప్పుడు బదిలీ చేస్తారని అడిగాడు. విలేజస్‌లో లెక్చర్లు యంతమాత్రం కార్యంలేదు. నీ తండ్రిదగ్గిరమాత్రం లెక్చరు అన్న మాటకూడా అనకు.

వెంకటే: అయితే ఆయన్ని ఏలాగు జేబులో వేశారేమిటి?

గిరీశ: అది పోలిటిక్సు దెబ్బోయ్! ఆ తరువాత కథవిను. నా మీద కేకలు వేశిన తరువాత కోపం అణక్క ధుమధుమలాడుకుంటూ పెరుగూవణ్ణం కుమ్మడం ఆరంభించాడు. యింతట్లో మీ అప్పవచ్చి గుమ్మందగ్గర నిలువబడి కోకిలకంఠంతో నాన్నా తమ్ముడికి పెళ్లి చెయ్యాలంటె నా సొమ్ముపెట్టి పెళ్లిచెయ్యండి గాని దాని కొంపదీసి చెల్లెలని లుబ్ధావధానులకి ఇవ్వవద్దని చెప్పింది. దానితో వుత్తరవుపోసనం పట్టకుండానే ఆ పెరుగూ అన్నం విస్తరి తీసుకువెళ్ళి దానినెత్తిమీద రుద్దేశాడు. కరటకశాస్త్రుల్లు అడ్డపడబోయేటప్పటికి చెంబులో నీళ్లు అతనినెత్తిమీద దిమ్మరించాడు. దానితో కోపంవచ్చి కరటకశాస్త్రుల్లూ అతని శిష్యుడూ అప్పుడే బయలుదేరి వాళ్ల వూరికి వెళ్ళిపోయినారు.

వెంకటే: ఇదేనా ఏమిటి మా నాయన్ని జేబులో వేశెయ్యడం?

గిరీశ : కొసాకు విను మరి కరటకశాస్త్రుల్లు స్కౌండ్రల్ వెళ్ళిపోయాడని సంతోషించాను కాని మీ సిస్టర్ ఫేట్ విషయమై మహా విచారమయినది. నేనే దాని హజ్‌బెండ్ అయినట్టయితే నీ తండ్రిని నిలబడినచోట రివాల్వర్‌తో షూట్ చేసేదును. మీ అమ్మ ఏడుస్తూ వకమూల కూర్చున్నది. అప్పుడు నేను నీళ్ల పొయిలో నిప్పువేశి నీళ్లుతోడి మీ సిస్టరుని తీసుకువెళ్ళి స్నానం చేయించినాను. ఇంతట్లో మీ తండ్రికి పశ్చాత్తాపము వచ్చి నేను అరుగుమీద పక్కవేసుకుని పడుకుంటే మాటల్లో పెట్టి తెల్లవారినదాకా నిద్దరపట్టనిచ్చాడుకాడు, మొత్తము మీద కత్తుకలిపేసినాడు. అతను చెప్పినదానికల్లా సహీచేశాను. కరటక శాస్త్రుల్లు మీదమట్టుకు గట్టిగా బజాయించేశాను. మొత్తముమీద ఇన్‌ఫెన్‌టు మేరియేజి బాగా ఆలోచిస్తే కూడును అని తోస్తున్నది.

వెంకటే: ఇన్నాళ్లూ కూడదని చెప్పేవారే నాతోటి? గిరీశ : ఒపీనియన్సు అప్పుడప్పుడు ఛేంజిచేస్తూ వుంటేనే కాని పొలిటిషన్ కానేరడు. నాకు తోచిన కొత్త ఆర్గ్యుమెంటు చూచావా? ఇన్‌ఫెంటు మేరియేజి వుంటేనే కాని విడోస్ అట్టే వుండరు. విడోస్ వుంటేనే కాని విడోమేరియేజి రిఫారము కాదుగదా. సివిలిజేషను కల్లా ఎసెన్‌షియల్ విడోమేరియేజే. కన్యాశుల్కము తప్పులేదని కూడా ఇప్పుడు నేవాదిస్తాను.

వెంకటే: యేలాగేమిటి?

గిరీశ: కన్యాశుల్కములేని మేరియేజి వుందిటోయి లోకంలోను డబ్బుపుచ్చుకుంటే నేమి, సరుకులు పుచ్చుకుంటేనేమి, లేక ఇంగ్లీషువాళ్లలాగ సెటిల్ మెంటు చేస్తేనేమి, ఈ ఆర్గ్యుమెంటు రాత్రి మీ నాన్నతో చెప్పేటప్పటికి చాలా సంతోషించాడు.

వెంకటే: రాత్రి యింకా యేమి మాట్లాడరేమిటి?

గిరీశ: నీకు జడ్జిపనిదాకా చదువు చెప్పించేస్తానన్నాడు. పుస్తకాల సంగతి కదిపాను గాని, పెళ్లినుంచి వచ్చిన తరువాత యిస్తామన్నాడు. ఈలోగా సిగర్స్ లేకపోతే గుడ్లెక్కొస్తాయి. పట్నం నుంచి తెచ్చిన అరకట్టా అయిపోయింది. దొంగ తనంగా చుట్టకాల్చుకుందామని రాత్రి పక్క వీధరుగుమీద వేసుకుంటే మీ తండ్రి కూడా బిచాణా అక్కడే వేశాడు. సిగర్స్ కోసం యేమయినా కాపర్స్ సంపాదించావా లేదా?

వెంకటే: లేదు - ఈ వుదయమల్లా అమ్మ, ధుమ ధుమలాడుతున్నది. పొడుంకోసం మా నాన్న కొట్టులో నిలువచేసిన పొగాకులోది వక కట్ట వోణీలో దాచి పట్టుకొచ్చాను.

గిరీశ : దటీజ్ పోలిటిక్స్ మైడియర్ బోయ్! మరి యింతసేపూ చెప్పావుకావేమి- చుట్టలు చుట్టుకుని ఈ కోవిలగోపురంలో కూర్చుని కాల్చుకుందాము.

వెంకటే: కోవిలలో చుట్టకాల్చవచ్చునా?

గిరీశ: కాలుస్తే కోవిలలోనేకాల్చవలెనోయి - దీని పొగముందర సాంబ్రాణీ, గుగ్గిలంయేమూల. యేదీ కట్ట యీలాగునతే (అని యందుకొని వాసనచూచి) హా యేమి పొగాకోయి - నిజంగా కంట్రీలైఫులో చాలా చమత్కారం వున్నది. బెస్ట్ టొబాకో - బెస్టు గేదెపెరుగు, మాంచి ఘీ అందుచేతనేనోయి పొయట్సు కంట్రీలైఫు కంట్రీలైఫు, పేస్టొరల్ లైఫ్ అని దేవులాడుతారు?

వెంకటే: మీరూ పోయట్సేకదా?

గిరీశ : అందుకు అభ్యంతరంయేమిటి? నాకు కంట్రీలైఫు యిష్టమే గాని సీమలోలాగ బ్యూటిఫుల్ షెప్పర్డెసెస్, లవ్ మేకింగూ వుండదోయి - గ్రాస్గర్ల్సు తగు మాత్రంగా వుంటారుకాని మాడర్టీస్మెల్, అదొకటిన్నీ మనదేశంలో మెయిడ్సువుండరోయి చిన్నప్పుడే మేరీచేస్తారు. యిక నెంతసేపూ లవ్ మేకింగ్ విడోసుకి చెయ్యాలిగాని మరి సాధనంలేదు. వెంకటే: మీరు విడోసుమీద వ్రాసిన పోయిట్రీ యిస్తామన్నారు. ఒకమాటూ చదివారుకాదు.

గిరీశ : అది నేను రిఫార్మర్‌లో అచ్చువేయించేసరికి టెన్నిసన్ చూచి గుండె కొట్టుకున్నాడు. మైమదర్ అనేటటువంటి పోయిట్రీ నీకు వచ్చునా?

వెంకటే: వచ్చును. బారోసు రీడరులో చదివాను.

గిరీశ : దానికి పాఠాంతరంగా నేను పోయిట్రీ చేశాను. నోటుబుక్కూ పెన్సలూ తీసుకో (అని చుట్ట కాల్చుచు మధ్య మధ్య చుట్ట చేతపట్టుకుని యొక్కొక్క ముక్క చెప్పుచుండగా దానిని వెంకటేశ్వర్లు వ్రాయును)

The Widow

She leaves her bed at A.M.four,
And sweeps the dust from off the floor,
And heaps it all behind the door,

The Widow!

Of wond'rous size she makes the cake,
And takes much pains to boil and bake,
And eats it all without mistake,

The Widow!

Through fasts and feasts she keeps her health,
And pie on pie she stores by stealth,
Till all the town talk of her wealth

The Widow!

And now and then she takes a mate,
And lets the hair grow on her pate,
And cares a jot what people prate,

The Widow!

I love the widow - however she be,
Married again - or single free,
Bathing and praying,
A model of saintliness,
Or model of comeliness,
What were the earth
But for her birth?

The Widow!

(చుట్టపారవేశి) యింటికి పోదాము పద చాలా సేపయి పోయింది. (అని నాలుగడుగు లిద్దరు నడచునప్పటికగ్నిహోత్రావధానులు ప్రవేశించి)

అగ్నిహో: ఏమండీ రాత్రి మనమనుకున్న ప్రకారం మన దావాలు గెలుస్తాయనే మీ యభిప్రాయమా?

గిరీశ: అవి గెలువకపోతే నేను చెవి కదపాయించుకుని వెళ్లిపోతాను. బుచ్చమ్మ గారి భూముల తగాయదా విషయమై జబ్బల్‌పూర్ హైకోర్టు తీర్పు స్పష్టముగా వున్నది. మా పెత్తండ్రిగారు యీలాటి కేసే వకమాటు గెల్చారు.

అగ్నిహో: దీనికల్లా వచ్చిన అసాధ్యం -పార్వతీపురం కోర్టులో దావా తేవడానికి వీలులేకపోయింది. భూములలో చాలాభాగము అమలాపురం తాలూకాలో వున్నాయి గనుక, కేసు ఆ కోర్టులో తేవలసివచ్చింది. కరటకశాస్త్రుల్లని మళ్లీ పంపించాలని అనుకుంటూ వుండే వాడిని కాని, వాడు వట్టి అవకతవక మనిషి, యెడదిడ్డం అంటే పెడదిడ్డం అంటాడు, వాడు వెళితే కేసు చెడిపోవడానికి అభ్యంతరం లేదు. కేసు యవడో చవల వకీలుకి అప్పగించాడు.

గిరీశ : మీ శలవయితే నేను వెళ్ళి ఆ వ్యవహారం అంతా చక్కపెట్టుకు వస్తాను. మా పెత్తండ్రిగారు అమలాపురం మునసబు కోర్టులో కల్లా పెద్దప్లీడరు. ఆయన పట్టినకేసు యప్పుడూ పోవడం లేదు.

అగ్నిహో : మీరు వెళ్లితే నేను వెళ్లినట్లే - యెంత ఫీజు అయినా మీ పెత్తండ్రిగారికే వకాల్తీయిస్తాను.

గిరీశ: మీ దగ్గర ఫీజు పుచ్చుకోవడం కూడానా? ఖర్చులు మట్టుకు పెట్టుకుంటే వక్కదమ్మిడీ యైనా పుచ్చుకోకుండా పనిచేస్తారు.

(బుచ్చమ్మ ప్రవేశించి)

బుచ్చమ్మ: నాన్నా అమ్మ మడికట్టుకోమంటున్నాది.

(అని బుచ్చమ్మ వెళ్లిపోవుచున్నది)

(గిరీశం క్రేగంటను జూచును)

అగ్నిహో: భోజనం చేసిన తరువాత కాయితాలు మీ చేతికి యిస్తాను. అవన్నీ సావకాశంగా చూడండి. మా యింటిపొరుగు సూరావధానులకీ మాకు మందడి గోడ విషయైమై తెచ్చిన దావాలో మనమీద అన్యాయముగా లంచము పుచ్చుకొని మునసబు తీర్పు చెప్పితే జడ్జీ కోర్టులో అప్పీలు చేసినాను. దానికింద నాలుగువందల రూపాయీలు అయిపోయినవి. మీ వంటి వారు నాకు చెయ్యాసరా వుంటే సూరావధానుల పిలక వూడదీసేదును. క్రిమినల్‌కేసు తెమ్మని కూడా మా వకీలు సలహా యిచ్చాడు. మీరే మంటారు.

(బుచ్చమ్మ తిరుగ బ్రవేశించి భోజనమునకు బిలుచును)

అగ్నిహో: వెధవముండాసొద - పెద్దమనిషితో వ్యవహారము మాట్లాడుతూవుంటే రామాయణంలో పిడకల వేట్లాటలాగ అదే పిలవడం.

గిరీశ : తప్పకుండా తేవలశినదే. దానితోకాని వాడికి శాస్తికాదు. 1572వ శక్షన్ ప్రకారం నెగోషియబిల్ ఇన్‌స్ట్రుమెన్‌ట్సుఆక్టు తెచ్చేదీ జయిలులోపెట్టించేసేదీ. తగయిదాస్థలం చూచినాను గనుక జల్లీలు తెగ పొడిచేసేటట్టు సాక్ష్యం పలికేస్తాను. ఈ గోడచూస్తే తప్పకుండా మీదయినట్టే అగుపడుతూవున్నది.

అగ్నిహో: అందుకు సందేహం ఏమిటండీ? పెరటిగోడకూడా చూదాము యీలాగు రండి. (అని నిష్క్రమించుదురు).

***

రెండవ స్థలము - రామచంద్రపురం అగ్రహారం రామప్పంతులు ఇల్లు

(రామప్పంతులు - మధురవాణి ప్రవేశించి.)

మధు : లుబ్దావధాన్లుని పెళ్ళికి యలా వొప్పించారేమిటి?

రామ : కట్టా విప్పా సమర్థుణ్ణి, నాకు యిదొకష్టమయిన పనా!

మధు: అయినా చెబుదురు.

రామ : సిద్ధాంతిద్వారా హికమతంతా చేశాను. వాడు వెళ్ళి జాతకంలో వివాహయోగం వుందని, పిల్ల మహాపతివ్రత అవుతుందని, అది ఇంట్లో కాలుపెట్టిన దగ్గరనుంచి యిల్లంతా బంగారంతో నిండిపోతుందని చెప్పాడు, నేను వెళ్ళి మీనాక్షి యిల్లు గుల్లచేసేస్తూందని, దానివల్ల యప్పటికైనా ముప్పువుందని చెప్పినాను. దానితో మనసు కుదిరింది. గాని చలచిత్తం ముండాకొడుకు, డబ్బు ఖర్చవుతుందని అడుగడుక్కీ వెనకతీస్తుంటాడు. యీ వివాహంలో నీకు బాగా డబ్బు యిప్పిస్తాను. యిది అంతా నీకోసమే.

మధు: మీమాయలు నాకు తెలియవా యేమిటి? లుబ్ధావధాన్లుకు పెళ్ళి చెయ్యడం మీకోసమే, అంచేత నాకు మనస్కరించకుకండా వున్నది.

రామ : మైడియ్యర్ - అలాంటి అన్యాయం మాటలు ఆడకు. నిన్ను చూచిన కంటితో మరి వక్కర్తెను చూస్తే - మొత్తెయ్యాలని బుద్ధిపుడుతుంది. (అని ముద్దు పెట్టుకొనును)

(తెర దించివెయ్యవలెను.)

***

మూడవ స్థలము - రామచంద్రపురపగ్రహారములో లుబ్ధావధానులుగారి యిల్లు

(లుబ్ధావధానులు, రామప్పంతులు ప్రవేశించుచున్నారు. )

లుబ్ధావ: ఏమండి రామప్పంతులుగారూ వివాహానికి యాభై రూపాయీలు ఇస్టేమెంటు చేసినాను.

రామప్ప: నీగుణం నీవు పోనిచ్చుకోవు గదా మామా? లోకంలో యేమనుకుంటారో అన్నభయం యీషత్తైనా లేదు.

లుబావ: లోకంలో యేమనుకుంటే నాకేం కావాలి? మీరు ప్రోద్బలంచెయ్యబట్టి పద్ధెనిమిదివందల రూపాయీలు ఇవ్వడానికి వప్పుకున్నాను గాని, లేకుంటే యిప్పుడంత సొమ్ము అప్పుచేసి తెచ్చినదాకా నాకు ఏమిపట్టింది.

రామప్ప: వేషాలు వెయ్యకండి. పాతులో రెండు సంచీలు తియ్యరాదా - మీరు పెళ్ళిచేసుకుని నన్ను వుద్దరించినట్లు మాట్లాడుతారేమిటి - మీరు పెళ్లాడే పెళ్లాము నా యింట్లో వచ్చి కాపురం చేస్తుందా ఏమిటి.

లుబ్ధావ: యిపుడు అంటే అన్నారు కాని పాతు, పాతు, అంటూ వుండకండి పాతువుంటే పురిల్లు ఖర్మమేమీ - ఆ యాభయి రూపాయిలు మీచేతికి ఇస్తాను కటాక్షించి అది దాటకుండా అంతతో సరిపుచ్చుతే మీకు చాలా పుణ్యం వుంటుంది - డబ్ళు తేవడమంటే బహు ఇబ్బందిగా వున్నది.

రామప్ప: ఆ యాభయికి మరి వకసున్నాచుట్టి నాచేతికి యివ్వండి. అతిక్లుప్తంగాను విశేషవయిభవం గాను, వివాహంచేస్తాను. మీకేమీ శ్రమ లేకుండా అన్ని సప్లయిలు చేస్తాను.

లుబ్ధావ: అయిదువంద లెక్కడ వస్తాయేమిటి? పెళ్ళిలేకపోతే మానిపోయె.

రామప్ప: ఇప్పుడు వద్దన్నా మానదు. ప్రధానమయిన తరువాత చేసుకోకపోతే అగ్నిహోత్రావధానులు మహా చెడ్డవాడు. లా, బాగా తెలుసును. అయిదువేల రూపాయీలు డేమేజికి దావాతెస్తాడు.

లుబ్ధావ: నీనీంచే ఈ చిక్కంతా నాకు వచ్చినది.

రామప్ప: చక్కని పెళ్ళాము యింటికి వస్తూవుంటే చిక్కేమిటయ్యా, వెర్రి బ్రాహ్మడా! ఆడపిల్లను అమ్మిన సొమ్ము ఏమయినది. యాభయిఏళ్ళాయి వడ్డీ వ్యాపారము చేస్తున్నావు. యెప్పు డయినా నూటికి నెలకు - మూడు రూపాయలకు తక్కువ వడ్డీ పుచ్చుకున్న పాపాన్ని పోయినావా?

లుబ్ధావ: యాభైఏళ్లు - యాభై ఏళ్లు అంటూ వస్తావు. పెళ్లికూతురు వారితో యన్నేళ్ళు వున్నాయని చెప్పారేమిటి. రామప్ప: నలభై రెండేళ్లు అని చెప్పాను.

లుబ్ధావ: ఒకటి రెండు హెచ్చుతగ్గుగా అంతేసుమా నా వయస్సు ప్లవసంవత్సర శ్రావణమాసము ఏదీ లెక్కపెట్టండి.

రామప్ప: (తనలో) ముసలిగాడిదకి ఏమి అభిమానము (పైకి) సర్వజిత్తు, సర్వధారి, విరోధి, క్రోధన, అక్షయ (అని నోటికి వచ్చినట్టల్లా గబగబ లెక్క పెట్టుచూ) ఆట్టేలేవు వచ్చే శ్రావణమాసానికి డెభైతొమ్మిది వెళ్లిపోతాయి. నామాటవిను అయిదువందల రూపాయీలతో నిన్నొక దమ్మిడీ అడగకుండా సరపలాగీ చేస్తాను. అంతా అమాంబాపతులు రెండువేల మూడువందల రూపాయీలతో ఇతి భాషామంజరి సమాప్తః అవుతుంది. ముందూ వెనకా చూడక పాతుతియ్యి,

లుబ్ధావ: అదుగో పాతు పాతు అంటారు గదా అసాధ్యము వచ్చింది. ఈ మాటు మళ్లీ ఆమాట అంటే మరి మీకూ నాకూ సరి. ఈలాగే నీవంటి మహాత్ములు యెవరో లేనిపోని మాటలు పోలీసుగారితో చెప్పి పన్నువేయించేశారు.

రామప్ప: యీ అలకలతో నాకేమీ పనిలేదు. నాద్వారా పనీ జరిగించవలసినదని మీకుంటే అయిదువందల రూపాయిలకి తక్కువకి నేను చెయ్యను. అంతకితక్కువైతే నా ప్రతిష్టకు లోపంవస్తుంది. మరెవరి చేతైనా చేయించుకోండి.

లుబ్ధావ: కోపము పడకండీ మామా. మీ మాట యెప్పుడు వినలేదు. డబ్బుతో సంబంధించిన పని గనుక ఇంత బతిమాలుకుంటున్నాను.

రామప్ప: బేరానికి నేను మనిషినికాను. శలవిప్పించండి.

(తెర దించివెయ్యవలెను)

***

నాల్గవస్థలము - రామప్పంతులుగారి గృహము

(కరటక శాస్రులు, స్త్రీ వేషముతో శిష్యుడు, ప్రవేశించుచున్నారు.)

కరటక: అబ్బీ నేను చెప్పినదంతా నాటకంలో పాత్రలాగా అచ్చుకొట్టినట్టు చేసుకురావలెను. రవ్వంత పిసరు వాతప్రోతము వచ్చిందిరా అంటే మనపీకలు పోతాయి.

శిష్యు : మీకెంత మాత్రమూ ఆ భయము అక్కరలేదు.

కరటక : (తలుపు దగ్గిరకు వెళ్ళి) ఇదేనా రామప్పంతులుగారి బస. రామప్ప: (లోపలనుంచి) మీదీయేవూరయ్యా?

కరటక : కృష్ణాతీరము. జటాంతస్వాధ్యాయిని.

రామప్ప: రామప్పంతులుగారు యింట్లో లేరు.

కరటక: మీరు వున్నారుగద.

రామప్ప: యెవరుంటే నేమిటి, యీ వేళ యేకాదశి వెళ్లిపొండి.

కరటక: తలుపుతీశివుందీ; యిక మిమ్మల్ని బ్రతిమాలుకోవడమెందుకు? (అనీలోపల ప్రవేశించు చున్నారు)

రామప్ప: పీటవెయ్యవే, దయచేయండి.

కరటక: సాలిగ్రామాల వాసన కొట్టుతూంది యేమిటండోయి - యేకాదశన్నారే.

రామప్ప: వొళ్ళు, కారకంచేసి వున్నది. ఔషధంగా పుచ్చుకుంటూ వున్నాను. ఈ మాట యెక్కడా చెప్పకండి.

కరటక: మీ దయవల్ల భోజనం చేసినాను. ఒక ప్రయోజనం వుండి - వచ్చినాను.

రామప్ప: (తడక యవుతలనుంచి పైకివచ్చి చెయ్యి తుడుచుకొనుచు) దయచేయండి కుర్చీమీద - ఔనే, చుట్టలు పట్టుకురా. శాస్రుల్లుగారికి కూడా ఆకులు చెక్కలూ ఇయ్యి.

(సాని ప్రవేశించి)

సాని : నమస్కారమండీ పంతులుగారూ.

కరటక: ఇన్నాళ్ళకి జన్మసాఫల్యమయినది నన్ను పంతులుగారిని చేశావా.

రామప్ప: యేమండీ-ఇంగ్లీషు అభివృద్ది అయిన దగ్గిరనుంచీ మన వైదీకులము కూడా పంతుళ్ల వారము అవుతున్నాము.

కరటక : నీయ్యోగీవైదీకీ భేదమూ నాడీ భేదమూ శాస్త్రసిద్దము కాదని విజయనగరము ఆనందవర్ధనీ సమాజంవారు పరిష్కరించినారు.

రామప్ప: అందుకు సందేహమేమిటండీ. పేరుగొప్పా, ఊరుదిబ్బా అన్నట్టు యీ మార్థులు, ఈ కరణకమ్మలు, ఈ నియ్యోగులు, లౌక్యానికి మనవాళ్లతో పనికివస్తారండీ. యీ తాలూకాలో యే క్రిమినల్ కేసువచ్చినా నా సలహా లేనిదీ పని జరగదు. నియ్యోగి యేమిటి, వైదీకి యేమిటి.

రామప్ప: ఔనే. అద్దం పట్టుకరా.

(ఆమె తెచ్చి యద్దము చేతికివ్వగా దానినందుకొని చూచుకొనుచు మీసములు సవరించుకొనుచుండును.)

కరటక: లుబ్ధావధానులుగారికీ తమకీ చాలా స్నేహమటా? తమ మాట అడుగు దాటడని విన్నాను.

రామప్ప. ఆ గాడిదెకొడుకుకు ఒకడితో స్నేహమేమిటండీ, వాడి ప్రాణానికీ డబ్బుకీలంకే. డబ్బుకీ వాడికీ స్నేహముగాని మరియెవరితోనూ స్నేహములేదు. అయితే వాడికి వ్యవహార జ్ఞానం బొత్తిగా లేదు. కోర్టు అంటే భయపడతాడు. అంచేత నా సలహాలేక బతకలేడు.

కరటక : నేను కృష్ణాతీరమునుంచి వస్తున్నాను. భూములమీద చాలా ఋణం అయిపోయినది. ఈ పిల్లని నందిపిల్లిలో, వేంకటదీక్షితులు గారికి, పదిహేనువందల రూపాయీలకు అమ్మి ఆ ఋణం తీర్చుకోవాలని అంతా సిద్ధంచేసుకుంటే మాసంరోజులకు గానీ, రూపాయిలు యివ్వలేమని ఆయన అన్నారు. పదిహేనవ తారీఖులోగా రూపాయాలు చెల్లకపోతే భూములు పోతాయి. ఇంతట్లో లుబ్ధావధాన్లుగారు వివాహప్రయత్నం చేస్తున్నారని విని ఆ సంబంధం మానుకుని యీలాగు వచ్చినాను. ఈ పిల్లను ఆయనకు అమ్మివేసి ఋణవిముక్తుణ్ణి కావలెనని ఆలోచిస్తూన్నాను. ఇదిగాని సమకూరిస్తే మీకు పది వరహాల సొమ్ము దాఖలు చేసుకుంటాను.

రామప్ప: నలభై, యాభై రూపాయిల వ్యవహారాల్లోకి చొరబడే వాడనుకాను. అయినా మీరు దూరదేశమునుంచి వచ్చినారు. ఈపాటి ఉపకారం చేతునుగాని మించిపోయింది. పది రోజుల కిందటవస్తే అయిపోవును. అప్పుడే సంబంధం రహితమయినది. అయితే మీది యేనాడి?

కరటక: యేనాడి కావలిస్తే ఆనాడే అవుతుంది. మేము వెల్నాట్లం.

రామప్ప: చూచారా! అది వక వుపద్రం, వారు వేగినాట్లు - యెందుకయినా వేరే ఒక చోట ప్రధానం అయిపోయినది.

కరటక : ఈ కార్యం సమకూరిస్తే నాకు దొరికే దానిలో నాలుగోవంతు మీకిస్తాను.

రామప్ప: యెంతయిస్తేనేమిటి? మించిపోయినదని మనవి చేసినాను కానూ, ఇంకా మరి వకపని | కావలిస్తే చేస్తాను. మీ భూములు తనఖా యిచ్చాం అన్నారు గదా, తనఖా దస్తావేజు చూపిస్తే, అదీ చెల్లకుండా సాక్ష్యం సంపన్నం సంపాదించి గ్రంధం చేయిస్తాను.

కరటక: సాక్షులు యెవరు దొరుకుతారండి?

రామప్ప: మధుపాడా, గరికివలసా, యింకా మరికొన్ని అగ్రహారాలూ వున్నాయి కావండీ, ఉర్లాం బసవరాజు గారి పద్దులెఖ్కే దొంగసాక్ష్యాలకు కూడా పనికివస్తుంది. కుండనాలుంటే పది. లేకుంటే ఆరు. నా తమాషా చూడండి యీ విషయంలో కావలిస్తే యాభయి సాక్ష్యాలు తీసుకువస్తాను. లాంటివి యెన్ని వ్యవహారాలు మోసేశానండీ. కరటక: ఈ లండాచోరీలో దిగడానికైనా డబ్బుండాలి కదా? పిల్లకి యేలాగైనా పెళ్ళిచేస్తేనే కాని డబ్బూ దొరకదు. టొంపలాగు యిది నాతో తిరుగుతూ వుంటే స్వేచ్ఛావుండదూ.

రామప్ప: మీకు దొరికేదానిలో సఘం రూపాయిలు యిస్తే వక తంత్రం చేసి వివాహం కుదురుస్తాను.

కరటక : సఘం మీకిస్తే నేను ఋణం యేమితీర్చుకోను.

రామప్ప: ఋణం తీర్చుకోనక్కరలేకుండా గ్రంధం జరిగిస్తానుగదా.

కరటక: (ఒక నిమిషమాలోచించి) అయితే కానియ్యండి. అంతా మీదే భారం, పిల్లదాని కలంకారం వుంపిస్తారా.

రామప్ప: ప్రయత్నం చేస్తాను కానీ ఖరారు చెయ్యజాలను, వాడు పీసరికొట్టుముండా కొడుకు - అయినా నా ప్రతాపం చిత్తగించండి - అవునే కలం, కాయితం, సిరాబుడ్డీ తీసుకురా - (వ్రాయుచు గరటకశాస్త్రులవైపు జూచి) మీరు రేపు జామురాత్రికి రండి.

***

అయిదవస్థలము - లుబ్ధావధానులుగారి ఇల్లు, లుబ్ధావధాన్లు, రామప్పంతులు, మీనాక్షీ, ప్రవేశించుచున్నారు.

రామప్ప: అయితే మూడువందలకా సిసలు.

లుబ్ధావ: ఒక యాభై కొట్టివేస్తే బాగుండును.

రామప్ప: వక దమ్మిడీ తక్కువైతే నేను సరపలాగీ చెయ్యలేను. మరి యెవరిచేతనైనా చేయించుకోండి.

లుబ్ధావ: పోనీయండి నేనన్నమాటా వద్దు, మీరన్నమాటా వద్దు, ఒక పాతిక కొట్టి వేయండి.

రామప్ప: అయిదువందలల్లా, మూడువందలదాకా దించాను. ఇక నొక దమ్మిడీకొట్టేస్తే నాకీ వ్యవహారం అక్కరలేదు. అగ్నిహోత్రావధానులు మహా కోపిష్టిముండా కొడుకు, లాంఛనాలలో యేమిలోపం వచ్చినా వూరుకోడు.

(తెరలో) యిదిగో వుత్తరంబాబూ.

రామప్ప: యేవూరినుంచేమిటి.

కూలివాడు: కృష్ణారాయపురం అగ్ఘురారంనుంచీ బాబూ.

రానుప్ప: యిదిగో అప్పుడే మీ మామగారివద్దనుంచీ వుత్తరాలు వస్తున్నాయి. లుబ్ధావ: పంతులుగారూ చదవండి. రామప్ప: (చదువుచున్నాడు)

           శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ లుబ్ధావధానులుగారికి - త||
           మీకు విశేష వయస్సు లేదనీ మధ్యవర్తులు మభ్యపరచినందున మేము మీ సంబంధం
           చేసుకోవడంకు నిశ్చయించుకున్నాము. అయితే మీరు చాలా ముసలివాళ్లని మాకు
           తెలిసినందున, మీ సంబంధం మానివేయడమైనది - గనక, మీరు వేరే సంబంధం
           చూచుకోవచ్చును. మీరు మరి యెవరినీ యీలాగు దగాచేయ్యరని నమ్ముతాను.
                                                                           అగ్నిహోత్రావధాన్లు వ్రాలు.

లుబ్ధావ: ముసలివాడనటోయి వీడమ్మ కడుపుకాల్చా.

మీనాక్షి: మరేమిటి కాకపోతే - అగ్నిహోత్రావధానులు తగినశాస్తి చేశాడు. యిపుడు పెళ్లేందుకు లేకపోతే.

లుబ్ధావ: అంతా నానోట్లో గడ్డిపెట్టేవారే.

రామప్ప: అమ్మీ - ఆడవాళ్లకీ వూసెందుకు అవతలికి వెళ్లూ,

(మీనాక్షి వ్రేళ్ళు విరచి వెళ్లిపోవును. )

యిది మించిపోతే వచ్చిన బాధేమిటి. అగ్నిహోత్రావధాన్లకు సిగ్గువచ్చేటట్టు దీనితాత

సంబంధం మరివకటి చూస్తాను.

లుబ్ధావ: నా మాటవిని మరి యీ విషయమై మీరు శ్రమపడవద్దు. యీ ఖర్చు తప్పిపోయినదని సంతోషిస్తున్నాను.

రామప్ప: ఖర్చో, ఖర్చో అనీ యేడుస్తావు. నీ కూతురు సంసారం కొల్లబెట్టేస్తూవున్నది. ధాన్యం అమ్ముతుంది గదా? నాటి గందరగోళం అప్పుడు హెడ్డు కనిష్టీబుకు మూడువందలు దీమ్మరించకపోతే నిలబడ్డ మానాన్న అరదండాలు వేసేసునుగదా - యెప్పటికయినా యిది నీ పీకలమీదికి వున్నది. నీవు పెళ్ళి చేసుకుంటే నీవూ నీ పెళ్లామూ ఖులాసాగా వుండి దానిని వేరే కాపురం బెట్టవచ్చు. యిదీ యవరినైనా తీసుకుపారిపోతుంది.

లుబ్ధావ: చవకగా కుదిరేటట్టయితే మరవక సంబంధం చూడండి.

రామప్ప: పన్నెండు వందలకు కుదురుస్తాను - సమాధానమేనా?

లుబ్ధావ: వెయ్యికి కుదిరిస్తే మహాయుక్తంగా వుంటుంది. రామప్ప: నీకు డబ్బంటే మతిపోతుంది. అగ్నిహోత్రావధానులకు పద్దెనిమిది వందలు యివ్వడానికి వొప్పుకున్నావు. యిప్పుడు వెయ్యికి నన్ను కుదర్చమంటే నా శక్యమా. పన్నెండువందలకి తక్కువ కుదరదు.

లుబ్ధావ: తేలిపోయిన సంబంధము తేలేపోయింది. మళ్లీ నన్నెందుకు బాధపెట్టుతావు - మరి సంబంధము యెంతమాత్రమూ అక్కరలేదు.

రామప్ప: అగ్నిహోత్రావధానులు నిన్ను ముసలివాడని అగౌరవపరచిన తరువాత రెండువేలు ఇచ్చైనా పెళ్లాడకపోతే లోకం అంతా నవ్వుతారు. మీనాక్షివల్ల వచ్చే వుపద్రం మరచిపోకు, జాతకంలోకూడా రూఢిగా వివాహయోగం, ఆ భార్యామూలంగా గొప్ప ధనయోగం వుంది. నువ్వు అక్కరలేదంటే తప్పుతుందా.

లుబ్ధావ: అయితే సుళువుగా ఎక్కడైనా సంబంధము చూడండి.

కూలిమనిషి: చాలాశేపైంది. బత్తైఖర్చు ఇప్పించండి బాబూ.

లుబ్ధావ: ఈ శుభవార్తకా భత్యఖర్చు, వకదమ్మిడీ ఇచ్చేదిలేదు. ఇంకా శిగ్గులేక భత్యఖర్చు అడుగుతావు.

కూలి : ఆ వూసు నాకెందుకయ్యా. నా కూలి నేను నిలబెట్టి పుచ్చుకుంటాను.

లుబ్ధావ: రామప్పంతులుగారూ చూచారండి, యీ గాడిదకొడుకు పెంకితనం.

కూలి : మాటలు మిగల్నియ్యకండి, ఆ వెనక నేను వూరుకునేవాణ్ణికాను.

(తెర దించవలెను)

***

ఆరవ స్థలము - లుబ్ధావధానుల యిల్లు

కరటక : (తెరవెనుకనుంచి) యత్రబాణా స్సం పతంతీ

లుబ్ధావ: యవరయా వారు?

కరటక: బ్రాహ్మలం మాది కృష్ణాతీరం తలుపు తీయించండి.

లుబ్ధావ: ఏమిటయ్యా వేదము మహావడిగా చదువుతున్నావు. నేను చదవలేనా యేమిటి. వేదము వొక దమ్మిడీ ఇవ్వదు. ఇంగ్లీషు చదువుకోండి.

కరటక: ఒక పనస వినుపించి వెళ్లిపోతాను.

లుబ్ధావ: నేను కావలిస్తే పదీ పనసలు చదువుతాను. కరటక: అయితే తలుపుతీయ్యవషయ్యా?

లుబ్ధావ: తీసేదిలేదు పంతులుగారి యింటికి వెళ్లండి.

కరటక: ఇది లుబ్ధావధానులగారి యిల్లుకాదూ.

లుబ్ధావ: ఇదికాదు, ఇదికాదు. అవతలవీధి.

రామప్ప: (తెర యవుతలనుంచి) అవధాన్లు మామగారూ

లుబ్ధావ: పంతులుగారా - యేమిటి యిలాగు వచ్చారు.

రామప్ప: కొంచెము పనివున్నది.

లుబ్ధావ: మీకు రోజూ రెండుఝాముల రాత్రప్పుడు పనిగలిగే వుంటూ వుంటుంది. నేనెంతమాత్రం వప్పేదిలేదు.

రామప్ప: ఇందాకా మన మనుకున్న ప్రకారం వ్యవహారం ఒకటి ప్రశస్థంగా కుదిరింది.

లుబ్ధావ: ఊఁ అలాగనా? సరే. అమ్మీ తలుపుతీయ్యవే.

(మీనాక్షి ప్రవేశించి తలుపు తీయుచున్నది. )

రామప్ప: ముండాకొడుకు ఎన్ని గడియలు వేశాడయ్యా.

(రామప్పంతులు, కరటకశాస్తులు, ఆడువేషముతో శిష్యుడు, ప్రవేశించుచున్నారు. )

లుబ్ధావ: దయచెయ్యండీ అవధానులుగారూ దయచెయ్యండి. ఈ పిల్ల మీ కుమార్తా యేమిటండీ?

కరటక: అవునండీ. దీన్ని యెవరికయినా సమర్పించి ఋణవిముక్తుణ్ణి అవుదామని ఆలోచిస్తున్నాను.

లుబ్ధావ: కన్యాదానం చేస్తారా ఏమిటండీ?

కరటక: తమకు తెలియని ధర్మము ఏమిటున్నది - దాని ప్రక్రియ అంతా పంతులుగారితో చెప్పినాను.

రామప్ప: మూతముప్పిడి యెందుకుమామా, పన్నెండువందల రూపాయలకు నిర్నయించినాను.

లుబ్ధావ: తమరు యోగ్యులు పిల్ల నమ్ముతారండీ? గవర్నమెంటువారి రూల్సు వున్నదే అమ్మ కూడదని. మా గిరీశం చెబుతూ వచ్చేవాడు.

మీనాక్షి: యిన్నిరూల్సు యెరిగివుండేనా చచ్చే ముసలిగాడిదకొడుక్కి నన్ను అమ్మేవు.

రానుప్ప: ఈలాంటి పెద్దవేషాలు వేస్తే మామా, నేనూ యీ పనిలో జోరుకోను. లుబ్ధావ: (పిల్లవైపు యగదిగ జూచి తనలో) పిల్ల యేపుగానూ, లక్షణంగానూ వున్నది. (పయికి) అయితే పన్నెండువందలా?

కరట : ఇప్పిస్తేనేగాని వీలులేదండి, భూములమీద కొంత ఋణం తీర్చుకోవాలి. యీ నెల 15వ తారీఖు వాయిదా - ఆలోగా రూపాయలు చెల్లకపోతే భూములు పోతవి. పెళ్లి యాలాగు కావలిస్తే ఆలాగు చేసుకొండి. మీ యింట పిల్లను దిగబెట్టి వెళ్లిపోతాను.

మీనాక్షి: ఇప్పటినుంచీ దిగపెట్టడమే.

లుబ్ధావ: నీ నోరు వూరుకోదుగదా?

కరటక: రామప్పంతులుగారూ - అలంకారాలమాట వూరుకున్నారు. అలంకారాలు పెట్టకపోతే పిల్లది చిన్నపోతుంది. వివాహసమయమందే వుంచితేనేకానీ వొప్పేదిలేదు.

లుబ్ధావ: అలంకారం ఒక పిసరయినా వుంచేదిలేదు.

రామప్ప: (లుబ్ధావధానులు చెవులో) చెడగొట్టకయ్యా వ్యవహారం సులభంగా కుదిరింది.

లుబ్ధావ: (రామప్పంతులుతో) యింట్లో వక పిసరైనా బంగారంలేదు. యేలాగు పెట్టడము?

రామప్ప: (లుబ్ధావధానులతో) నేను యెక్కడనైనా రహస్యంగా ఒక కంటె యెరువు తీసుకువస్తాను, పెళ్లప్పుడువుంచి తరవాత తీసి యిచ్చివేదాము (కరటకశాస్త్రులవైపుచూచి) అలంకారం విషయమై మీ ఇష్టానుసారం ఫైసలు చేశామండి.

కరటక: అయితే సంతోషమే - ఇక మీ పిల్లగాని నా పిల్లగాదు. దాని కేమి సరుకులు పెట్టుకున్నా మీవేగదా?

రామప్ప: మామా అయితే తాంబూలం యిప్పించేయండి.

లుబ్ధావ: అమ్మీ తాంబూలం తేవే.

(మీనాక్షి వెళ్ళుచున్నది. )

రామప్ప: నేనే పట్టుకువస్తాను (అని వెనుక వెళ్లుచున్నాడు. )

కరటక: మీకు వేరే సంబంధం కుదిరి తేలిపోయినదటే.

లుబ్ధావ: అవునండి, పిల్లదాని నక్షత్రము మంచిదయిందికాదు.

కరటక: అలాగునా! శుభస్య శీఘ్రం అన్నారు. పంతులూ నేనూ ముహూర్తం దగ్గిరగా నిర్ణయించాము - చూచారండీ కార్యమేదో క్లుప్తంగా కానీండి. విజయనగరం ఆనందవర్ధనీ సమాజమువారు, సదస్యమూ, నాగవిల్లీ, చెయ్యనక్కరలేదన్నారు. లుబ్ధావ: మామగారూ (నిమ్మళముగా) యీ పంతులు వకడు శనిలాగు పోగయినాడు. యేదో వొక పెంటపెట్టి విశేషఖర్చుపెట్టిస్తూ వుంటాడు.

కరటక: (నిమ్మళముగా) మామగారూ యిటు పైన మీకు యేపనీ వచ్చినా, కావలసిన వాడిని గదా యిటుపైని నేనే చేసిపెడుతూ వుంటాను - మీరు శలవిచ్చినట్టు యీ పంతులు యింద్రజాలిలా కనపడుతాడు.

లుబ్ధావ: (నిమ్మళముగా) ఆ సంగతి నాకు మొదటినుండీ తెలుసును.

కరటక: (నిమ్మళముగా) నేను యవరినీ నమ్మలేకుండా వున్నాను. రూపాయిలు చేతులో పడితేనేకాని మంగళసూత్రధారణం చెయ్యనివ్వను సుమండీ.

లుబ్ధావ: (నిమ్మళముగా) ఆలాగే కానివ్వండి (బిగ్గరగా) ఇంతసేపు తాంబూలాలు తేవడ మేమిటయ్యా

రామప్ప: వస్తున్నాను మామా చక్కలు పడిపోయినాయి వేదుకుతూ వున్నాను.

(అని తాంబూలము పట్టుకొని ప్రవేశించుచున్నాడు. )

(లుబ్ధావధానులు కరటక శాస్త్రికి తాంబూలమిచ్చును.)

లుబ్ధావ: వీరిని, వివాహమయ్యే వరకు మీయింటనే ఉంచండి.

రామప్ప: యిక్కడే వుండకూడదా? మా యింట్లో చేసేవారెవరూ లేరు.

కరటక: నేనే చేస్తానయ్యా పదిమందికి (అనిలేచి) శలవుపుచ్చుకుంటాను.

రామప్ప: (రహస్యముగా) వెర్రిబ్రాహ్మడా యిక్కడే వుండవయ్యా

కరటక: (రహస్యముగా) వీళ్లయింట్లో వుండలేనండీ.

రామప్ప: (నిమ్మళముగా) అయితే నే వచ్చేదాకా అరుగుమీద పడుకొండి.

(కరటకశాస్రులు, శిష్యుడు, వెళ్లిపోవుచున్నారు. )

రామప్ప: యెల్లుండి పెళ్ళి నిశ్చయించాము. పుస్తెకట్టేటప్పుడు రూపాయీలు యివ్వాలట.

లుబ్ధావ: ఇంత కొద్ది కాలంలో, ఇన్ని రూపాయలెక్కడ, అప్పు దొరుకుతాయి.

రానుప్ప: పాతుతియ్యవయ్యా?

లుబ్ధావ: బాబూ నీ పుణ్యవుంటుంది కాని ఆమాట పదే పదే అంటూ వుండకు.

రామప్ప: యీ వ్యవహారము యంత సులభంగా కుదుర్చానో చూశారా! పెద్ద మనుష్యులని, భోజనాలకీ వాటికీ, పిలవడం ఎప్పుడేమిటి. లుబ్ధావ: నాకు పిలిచేవారు యవరున్నారు? మీరే రేపురాత్రి బయలుదేరి పిలవండి, మీమ్మలిని నమ్ముకుని నేను యీ పనిలో దిగాను. కాని నాకు యంతమాత్రమూ యిష్టంలేదు.

రామప్ప: మీకోసం వక్కదమ్మిడీ అపేక్షించకుండా యంతశ్రమ పడుతున్నానో చూశారా! రేపురాత్రి అగ్రహారమంతాను, పెద్దిపాలెంలో లౌక్యుల్నీ పిలిచేటప్పటికి తెల్లవారిపోతుంది.

లుబ్ధావ: అగ్రహారంలో మీరుపిలిచి, పెద్దీపాలెం మరియవరినైనా పంపండి.

రామప్ప: అగ్రహారపు వైదీకపు వాళ్లని యవరయినా పిలుస్తారు. పెద్దిపాలెం వెళ్లి, లౌక్యుల్ని నేనేపిలవాలి. మేజువాణీవుంటేనే కాని వివాహము రాణించదుసుమండీ.

లుబ్ధావ: లేకపోతే బాధేమిటి?

రామప్ప: లేకపోతే పెద్దమనుష్యులు యవరొస్తారయా?

లుబ్ధావ: ఎల్లుండికి మేజువాణీ ఎక్కడవొస్తుంది.

రామప్ప: మన మధురవాణి వుందీకాదూ ఆపాటి చెయ్యిమరి ఈ జిల్లాలో యేదీ?

లుబావ: ఆ ఖర్చువెచ్చమంతా మీ ఇష్టానుసారమే అని చెప్పాను కానూ, అంతకు వక దమ్మిడీ హెచ్చీతే మాత్రం నేనివ్వజాలను.

రామప్ప: ఆలాగే కానియ్యండి (అని తనలో) ఆద్యంతాలు అయేసరికి మరి రెండు వందలు వీడిదగ్గిర లాక్కపోతే నేను మరియేమీ లౌక్యుణ్ణి.

లుబ్ధావ: (పొడుము పీల్చుచు) అమ్మీ పంతులుకు తాంబోలమియ్యి.

రామప్ప: అక్కరలేదు నేనే వెళ్లి తెచ్చుకుంటాను.

లుబ్ధావ: ఇదుగో నువ్వు వెళ్లకయ్యా.

(తెర దించవలెను)

***