కన్యాశుల్కము/షష్ఠాంకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


శ్రీ

కన్యాశుల్కము

షష్ఠాంకము.

1- వ స్థలము. రామచంద్రపురం అగ్రహారంలో.

(చెఱువుగట్టునవున్న తోటలోనికి పెళ్లివారి బళ్లువచ్చును. గట్టుమీద ఒకవైపు అగ్నిహోత్రావధాన్లు, రెండవవైపు పళ్లుతోమికొనుచు రామప్పంతులును.)

అగ్ని- బళ్లుదింపండి. బళ్లుదింపండి. సాయేబూ యేనుక్కి కావలసినంత రొడ్డ. చెఱువు స్నానానికి బహుబాగావుంది. యెవరయా చెఱువుగట్టుమీద?

రామప్పంతులు- (తనలో) అరే! మరిచితిని. యీవేళేకదా పెళ్లివారు రావలసిన రోజు? (పైకి) నా పేరు రామప్పంతులంటారు.

అగ్ని- లుబ్ధావధాన్లుగారు మిమ్మల్ని పంపించారా యేమిషి?

రామ- యెందుకండి?

అగ్ని- మేవొఁస్తున్నావఁని యెదురుగా యవర్నీ పంపలేదా? నాపేరు అగ్నిహోత్రావధాన్లు అంటారు.

రామ- మీరేనా అగ్నిహోత్రావధాన్లుగారు? యేంవచ్చారేఁవిటి?

అగ్ని- పెళ్లిమాట మీకుతెలియదా యేమిషి?

రామ- పెళ్లెవరికండి?

అగ్ని- మీదీవూరుకాదా యేమిషండి? మాపిల్లని లుబ్ధావధాన్లుగారి కిస్తావుఁ.

రామ- లుబ్ధావధాన్లుగారికి పెళ్లైపోయిందే?

అగ్ని- తమరు హాస్యాలాడుతున్నారు- హాస్యాలకేంగాని, ప్రయత్నాలుయలా జరుగుతున్నాయి యేమిషండి?

రామ- మీరే హాస్యాలాడుతున్నట్టుంది. పెళ్లిఅయి పదిరోజులైంది. లుబ్ధావధాన్లుగారి సంబంధం అక్కర్లేదని మీరు రాశారట. అందుపైని యవడో గుంటూరునుంచి వొచ్చిన ఓ శాస్తుల్లు కొమార్తెని పన్నెండువొందలిచ్చి పెళ్లాడాడు.

అగ్ని- అన్నగారూ- హాస్యం ఆడుతున్నారు. న్యాయంకాదు. మనకి బావగారి వరసా యేమిషండి? రామ- యేమిటి మీమాటలూ? నేను యెన్నడూ అబద్ధవాఁడి యెరుగను. నామాట నమ్మకపోవడం ధర్మవేఁనా?

అగ్ని- ప్రమాణం చెయ్యండీ!

రామ- గాయత్రీసాక్షి.

అగ్ని- అయ్యో! అయ్యో! యేవీఁదురంతం! రండీ, వెళ్లి గాడిదకొడుకు యెవిఁకలు విరగ్గొడతాను.

రామ- నేనురానండి. ఆగుంటూరు సంబంధం చెయ్యవొద్దన్నానని నాతో మాట్లాడడం మానేశాడు. మీరు వెళ్లిరండి- మీరు తిరిగీ వొచ్చిందాకా యిక్కడే కూచుంటాను.

అగ్ని- ఆగాడిదెకొడుకు యింటికి నాకు తోవతెలియదే?

శిష్యుడు- (చెఱువుగట్టు యెక్కుతూపాడును.)

"తా నెవ్వరో తనవారెవ్వరో? । మాయజీవికి తనువుకు తగులాయగాకా" ॥

(రామప్పంతులు నిలబడి భయము కనపర్చును.)

అగ్ని- యేవిఁ అలా చూస్తున్నారు?

రామ- శవాన్ని మోసుకుపోయే పాట!

శిష్యుడు- "దినమూ, మరణమని తెలియూడీ"

రామ- (శిష్యునితో) వూరుకో (అగ్నిహోత్రావధాన్లుతో) అన్నా ఓకానీ వుందా?

శిష్యుడు- మిమ్మల్ని తీసుకురమ్మంది.

రామ- చచ్చానే- వొస్తూందాయేవిఁటి?

శిష్యుడు- కంటెపోతేపోయింది, రమ్మంది.

రామ- బతికాను.

అగ్ని- చావడం యెందుకు, బతకడం యెందుకు?

రామ- అది వేరేకథ.

శిష్యు- చిట్టపులి పిల్లని తండ్రొచ్చి వండకి తీసుకుపోయినాడట.

అగ్ని- యీవూళ్లోకి పుల్లొస్తాయా యేమిషి?

రామ- విరగడైపోయింది. (శిష్యునితో) యింద రూపాయి.

శిష్యుడు- (తీసుకుని) దాసుణ్ణి బాబూ!

(పాడును) "చిత్తాస్వాతివాన, జోడించికురియగ"

అగ్ని- యేవిఁటీ వెధవపాట? వూరుకుంటావా వూరుకోవా? నీకు రూపాయి చాలదురా గుంటకక్కగట్టా?

శిష్యుడు- తమరు దయచెయ్యరాబాబూ?

అగ్ని- నేనివ్వను - అన్నా, తోవ యవరు చూపిస్తారు.

రామ- (శిష్యుడితో) నీకు లుబ్ధావధాన్లు యిల్లు తెలుసునూ?

శిష్యుడు- తెలుసును - తండ్రీ.

రామ- అవధాన్లుగారు ఓకాని డబ్బిస్తారు. యిల్లు చూపించు.

శిష్యుడు- ముందిస్తేగాని చూపించను.

అగ్ని- యింద - యేడువు.

(శిష్యుడు ముందూ, అగ్నిహోత్రావధాన్లు వెనకా కొన్ని అడుగులు వెళ్లిన తరవాత, శిష్యుడుపాడును.)

శిష్యుడు- "నీలాలకా యేల నీ యలుకా"?

అగ్ని- యలకేవిఁటి నీశ్రాద్ధం?

శిష్యుడు- యలక్కాదు, పిల్లి.

(పాడును) "పిల్లన్న తెయితక్కలాడంగనూ । యలక లేరూగట్టి దున్నంగనూ"

అగ్ని- యేవిఁటీ?

శిష్యు- "మేకపిల్లల్రెండు మేళాంగట్టుకుని । మేరంగితీర్థాని కెళ్లంగనూ" ॥

అగ్ని- యేవిఁటి నీశ్రాద్ధంపాట!

శిష్యు- "తొండాయనేస్తూడు. దొనిగఱ్ఱబట్టుకుని । తోటమల్లీ పువ్వులేరంగను" ॥

అగ్ని- పాడావంటే తంతాను.

శిష్యు- అయితే నీకు మరి యిల్లు చూపించను.

అగ్ని- పాడగట్టా - (కొట్టబోవును.)

శిష్యుడు- (తప్పించుకు పారిపోతూ) "గట్టుకిందానున్న । పందాయనేస్తూడు - మరిగబుకూ । మరిగుబుకూ" ॥

(నిష్క్రమించును.)

అగ్ని- వీడిశ్రాద్ధం చెట్టుకింద బెట్టా! తోవయిటా? అటా?

(తెరదించవలెను.)


2-వ స్థలము. చెఱువుగట్టుతోట.

[అగ్నిహోత్రావధాన్లు, రామప్పంతులు, వెంకమ్మ, యితరులూ.]

అగ్ని- గాడిదెకొడుకుని మాచెడ్డదెబ్బలు కొట్టేశాను; యేనుగులూ గుఱ్ఱాలూ తెచ్చాను వీడిశ్రాద్ధం మీదికి! తోవఖర్చయినా వొకదమ్మిడీ ఇయ్యడష.

వెంకమ్మ- మనప్రాలుబ్ధం - నేన్నోచిన నోవుఁలు యిలా వుండగా, మరోలా యలా అవుతుంది? యీ సమ్మంధం వొద్దనిపోరితే విన్నారూ? నేను భయపడుతూనే వున్నాను. బయల్దేరేటప్పుడు పిల్లి యెదురుగుండా వొచ్చింది.

అగ్ని- పింజారీ! వూరుకో- ఆడముండల కేంతెలుసును? అన్నగారూ, క్రిమినల్‌కేసు తావడానికి అవకాశంవుంటుందా? మాదగ్గిర అయ్యవారూ ఒకాయన వున్నారు. ఆయనకి లా బోగట్టా మా బాగాతెలుసును. ఆయన్నికూడా సలహాచేదాం.

రామ- కోర్టు వ్యవహారాల్లో ఆరితీరిన మీకు ఒహడు సలహాయివ్వాలండీ? స్థలజ్ఞుణ్ణి గనక సాక్ష్యం గీక్ష్యం తేవడానికి నేను సాయంచేస్తానన్నానుగానీ, అయ్యవార్లూ గియ్యవార్లూ మీకూ నాకూ సలహా చెప్పేపాటివాళ్లా? గుంటకక్కగట్లు రెండు యింగిలీషుముక్కలు చదువుకున్నారు గనుక ముక్కస్యముక్కార్థః అని తర్జుమాలుమట్టుకు చేస్తారు; గాని యేదయినా యెత్తుయెత్తావఁంటే, తమలాంటి యోధులు యెత్తాలి, నాలాంటి నియ్యోగపాడు నడిపించాలి. క్రిమినలుకి అవకాశంవుందా అని అడుగుతా రేవిఁటి? మీకు తెలియదా యేవిఁటి!- అటుపైని సులభసాధ్యంగా మూడు నాలుగువేలు డామేజీకూడా సివిల్లో లాగేస్తారు.

అగ్ని- అదే, నా ఆలోచన.

రామ- తీరిపాయె; మళ్లీ యిహ సలహాకేవుఁంది. వెంటనే వెళ్లి ముక్క తగిలించేదాం. ఖర్చులికి సొమ్ముపట్టుకుని బయలుదేరండి.

అగ్ని- నాదగ్గిర దమ్మిడీ లేదు; యేమి సాధనం? యీ గాడిదెకొడుకు రూపాయలిస్తాడని నమ్మి, నేనేమీ తేలేదు.

రామ- యింటికివెళ్లి లెఖ్కపట్టుకు వొచ్చేటప్పటికి పుణ్యకాలం మించిపోతుంది. "శుభస్యశీఘ్రం" అన్నాడు- మీఆలోచనేవిఁటి?

అగ్ని- యిదేదో అయితేనేగాని యింటిమొహం చూసేదిలేదు. మా అమ్మి సరుకేదయినా యీ వూళ్లో తాకట్టు పెడదాం.

రామ- అయితే పట్టుకురండి; పోలిశెట్టి దగ్గిరతాకట్టు పెడదాం; పోలిశెట్టిని మనం కొంచం మంచి చేసుకోవడం ఆవస్యకం. మీరు లుబ్ధావధాన్లుని కొట్టినప్పుడు- పోలిశెట్టి వున్నాడు గనక, లుబ్ధావధాన్లు మీమీద ఛార్జిచేసినప్పుడు, పోలిశెట్టిని తప్పకుండా సాక్ష్యం వేస్తాడు. శెట్టిని మనం విడతియ్యడం జరూరు- యేవఁంటారు?

అగ్ని- మీసలహా మా బాగావుంది. నాకూ అదే భయవేఁస్తూంది.

రామ- చూశారా, ప్రతివాడికీ సలహాచెప్పడం చాతౌతుందండీ? అందులో యీ యింగిలీషు చదువుకున్న అయ్యవార్లని సలహా అడిగితే, కేసులే తేవొద్దంటారు. దొంగసాక్ష్యాలు తావొద్దంటారు. వాళ్లసొమ్మేం పోయింది? యే మాలకూడూ లేకపోతే కేసులు గెలవడం యలాగ?

అగ్ని- మా అయ్యవారు మట్టుకు మంచి బుద్ధిమంతుడూ, తెలివైనవాడూ నండి- కోర్టు వ్యవహారాలలో అతనికి తెలియని సంగతిలేదండి. అంతబుద్ధిమంతుణ్ణి నేను యక్కడా చూడలేదు. ఆయన్ని చూస్తే మీరూ అలాగే అంటారు.

రామ- యెంతబుద్ధిమంతుడైనా మీకొహడు సలహా చెప్పేవాడున్నాడండీ? (చెవులో) మరోమాట- మీ అయ్యవారు గిరీశంగాడు కాడండీ? వాడు లుబ్ధావధాన్లు పింతల్లికొడుకుగదా? మీకా వాడు, యీ కేసుల్లో సరైన సలహా చెబుతాడు?

అగ్ని- అవునండోయి!

రామ- నియ్యోగపాణ్ణి- నా మాట కొంచం ఖాతరీ చెయ్యండి. గనక, ఆ అయ్యవార్నితోడిచ్చి, పిల్లల్ని యింటికి పంపించెయ్యండి. యెకాయెకిని మనం తక్షణం వెళ్లిపోయి, లుబ్ధావధాన్లుకన్న ముందు ముక్క తగిలించెయ్యాలి. యేదో ఓసరుకు వేగిరం పట్టుకురండి.

అగ్ని- యేదీ, అమ్మిని యిలా పిలువు.

వెంకమ్మ- అమ్మేది చెప్మా? బద్ధకించి బండిలో పడుకుంది కాబోలు. పిలువమ్మా.

అగ్ని- మనకి డామేజీ దిట్టంగా వొస్తుందా?

రామ- వొస్తుందంటే, అలాగ యిలాగానా?

ఒకడు- అమ్మన్నగారిబండీ యక్కడా కనపడదు; బండీ వెనకపడిపోయింది కాబోలు.

వెంకమ్మ- అడుగో అబ్బివున్నాడే? వీడెలా వొచ్చాడు? అబ్బీ నువ్వు అక్కయ్య బండిలో కూచోలేదురా?

వెంకటేశం- లేదు. నేను యేనుగెక్కాను.

అగ్ని - దొంగగాడిదకొడకా అయ్యవారేడ్రా?

వెంకటేశం - యెక్కడా కనపడ్డు.

అగ్ని- గుఱ్ఱం వొచ్చిందా? గుఱ్ఱపాడేడీ?

వెంకటేశం- గుఱ్ఱపాడు చెప్పాడు-

అగ్ని- యేవిఁట్రా, వెధవా, చెప్పాడూ?

వెంకటేశం- మాష్టరూ- రాత్రి-

అగ్ని- నోటంటమాట పెగల్దేం?

వెంకటేశం- గుఱ్ఱందిగి- బండీయెక్కాట్ట.

వెంకమ్మ- అయ్యో దాన్ని లేవదీసుకు పోలేదుగద? దగ్గిరనున్నవారు- ఆఁ! ఆఁ!

వెంకమ్మ- కొంప ములిగిపోయింది, మరేవిఁటి!

(చతికిలబడును.)

అగ్ని- (కోపముచేతవణుకుచు) అయ్యవారు పకీరుముండని లేవతీసుకు పోయాడూ? నగలపెట్టె? నాకోర్టుకాగితాలో!

వెంకటేశం- అక్కయ్యపెట్లో నాపుస్తకాలుకూడా పెట్టాను.

అగ్ని- దొంగగాడిదె కొడకా! నువ్వే వాణ్ణి యింట్లోపెట్టావు. రవంత ఆచోకీ తెలిసిందికాదు. దొంగవెధవని చంపేసిపోదును. గాడిదెకొడుకును అమాంతంగా పాతిపెట్టేదును.

రామ- (దగ్గిరకువచ్చి) అయ్యవారు మహా దొడ్డవాడని చెప్పారే? యేమి యెత్తుకు పోయినాడేమిటండి?

అగ్ని- యేవిఁ యెత్తుకుపోయినాడా? నీశ్రాద్ధం యెత్తుకుపోయినాడు. పకీరుముండని యెత్తుకు పోయినాడు. యీ గాడిదకొడుకు యింగిలీషు చదువు కొంపముంచింది. (వెంకటేశం జుత్తుపట్టుకుని కొట్టబోవుచుండగా తెరదించవలెను.)


3-వ స్థలము. విశాఖపట్టణములో మధురవాణి బస యెదటివీధి.

(రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, ప్రవేశింతురు.)

అగ్నిహో- మనం పోలిశెట్టిదగ్గిర బదుల్తెచ్చిన రూపాయిలన్నీ అయిపోయినాయి; యప్పటికీ ఖర్చులు ఖర్చులే అంచారు; నాదగ్గిర వకదమ్మిడీలేదు.

రామప్ప- ఖర్చుకానిదీ కార్యాలవుతాయిటయ్యా? మీకడియం యెక్కడైనా తాకట్టుపెట్టండి.

అగ్నిహో- యీవూళ్లో మనం యెరిగినవాళ్లెవరున్నారు?

రామప్ప- రండి మధురవాణిదగ్గిర తాకట్టుపెడదాం.

అగ్నిహో- చేసేవి మాఘస్నానాలూ, దూరేవి దొమ్మరి కొంపలూ అని, జటాంత స్వాధ్యాయిని నన్ను ముండలిళ్లకి తీసుకువెళతావషయ్యా?

రామప్ప- మరి యేకొంపలూ తిరక్కపోతే కేసులు గెలవడం యలాగ? అది అందరు ముండల్లాంటిదీ అనుకున్నారా యేమిటి? సంసారివంటిది. ఐనా మీకు రావడం ఇష్టంలేకపోతే నాచేతికివ్వండి, నేనే తాకట్టుపెట్టి సొమ్ము తీసుకొస్తాను.

అగ్నిహో- అలాక్కాదు; నేనుకూడావస్తాను.

రామప్ప- యేదీ కడియం ఇలాగివ్వండి.

అగ్నిహో- యిది మాతాతగార్నాటిది. యిది యివ్వడమంటే నాకేమీ యిష్టం లేకుండావుంది. డబ్బు వూరికే ఖర్చు పెట్టించేస్తున్నారు; మీరు కుదిర్చినవకీలు తగినవాడుకాడష; యింగ్లీషూరాదు యేమీలేదూ.

రామప్ప- ఆయన్లాంటిచెయ్యి యీ జిల్లాలో లేదు. ఆయన్నిచూస్తే డిప్టీకలక్టరుగారికిప్రాణం. ఇంతకీ మీరేదోపట్టుదల మనుషులనుకున్నానుగాని, మొదటున్న వుత్సాహమ్మీకు యిప్పుడులేదు. మీకు డబ్బు ఖర్చుపెట్టడం యిష్టంలేకపోతే మానేపాయెను. "యావత్తైలం, తావద్వ్యాఖ్యానం" అన్నాడు. మరి నాకు శలవిప్పించెయ్యండి.

అగ్నిహో- (ఆలోచించి) అయితే తాకట్టుపెట్టండి. (అని నిమ్మళముగా కడియము తీసియిచ్చును.)

రామప్ప- (తనచేత నెక్కించుచు) యీకేసుల్లో యిలాగు శ్రమపడుతున్నానుకదా? నాకొకదమ్మిడీ అయినా యిచ్చారుకారుగదా?

అగ్నిహో- అయితే, నాకడియం వుడాయిస్తావాయేమిషి?

రామప్ప- నేను మీకు యెలాంటి వకీల్ని కుదిర్చాను! ఆయన మీవిషయమై యంత శ్రమపడుతున్నాడు! ఇదుగో ఆయనవస్తున్నాడు.

(నాయడు ప్రవేశించును.)

రామప్ప- (తనలో) యేమిటిచెప్మా వీడు మధురవాణి బసపెరటి దిడ్డీవేపునుంచి వస్తున్నాడు? వీడుకూడా మధురవాణిని మరిగాడాయేమిటి? వీణ్ణి యీ కేసులోనుంచి తప్పించెయ్యాలి.

నాయడు- యేమండీ రామప్పంతులన్నా, మిగతాఫీజు యిప్పించారుకారుగదా?

అగ్నిహో- మీరు రాసిన డిఫెన్సు బాగుందికాదని భుక్తగారన్నారష.

నాయడు- ఎవడా అన్నవాడు? గుడ్లు పీకించేస్తాను. రామప్పంతులన్నగారూ చూశారండీ- డిఫెన్సు యెంతజాగ్రతగా తయార్‌ చేశానో. నాదగ్గిర హైకోర్టుక్కూడా ప్లయింట్లు రాసుకువెళ్లిపోతారు. యీకుళ్లు కేసనగా యేపాటి? నేచెప్పినట్టల్లా పార్టీనడిస్తే నేపట్టినకేసు పోవడమన్నమాట యెన్నడూలేదు. యీ డిఫెన్సు చిత్తగించండి. (చంకలోని రుమాల్‌ కట్టతీసివిప్పి అందులో ఒకకాగితముతీసి చదువును) "ఫిర్యాదీచెప్పిన సంగతులు యావత్తూ అబద్ధంకాని యెంతమాత్రం నిజంకావు." చూశారూ ఆవక్కమాటతోటే ఫిర్యాదీవాదం అంతా పడిపోతుంది. "ఫిర్యాదీ నామీదగిట్టక దురుద్దేశంతో కూహకంచేసి కేసు తెచ్చినాడుకాని యిందులో యెంతమాత్రం నిజంలేదు."

రామప్ప- డిఫెన్సు మాటకేమండిగాని అవధాన్లుగారు పైసాలేదంటున్నారు.

నాయడు- పైసాలేకపోతే పనెలాజరుగుతుంది?

రామప్ప- ఒకసంగతి మనవిచేస్తాను యిలా రండి. (రామప్పంతులు, నాయుడు, వేరుగా మాటలాడుదురు.)

రామప్ప- నాయుడుగారూ మీవకాల్తీ యీయనకేమీ సమాధానంలేదు. నేయెంత చెప్పినా వినక భీమారావుపంతులుగారికి వకాల్తీయిచ్చాడు. మీకు యింగ్లీష్‌ రాదనీ, లా రాదనీ, యెవడో దుర్బోధచేశాడు.

నాయడు- స్మాలెట్‌ దొరగార్ని మెప్పించిన ముండాకొడుకుని నాకు లా రాకపోతే యీగుంటవెధవలకుటోయ్‌ లావస్తుంది. పాస్‌పీసని రెండు యింగ్లీషుముక్కలు మాట్లాడడంతోటేసరా యేమిటి? అందులో మన డిప్టీకలక్టరుగారికి యింగ్లీషు వకీలంటేకోపం. అందులో బ్రాహ్మడంటే మరీని. ఆమాట ఆలందరికి బోధపర్చండి.

రామప్ప- మరి కార్యంలేదండి. నేయెంతో దూరంచెప్పాను; తిక్కముండాకొడుకు విన్నాడుకాడు.

నాయడు- అయితే నన్నిలాగు అమర్యాదచేస్తారూ? యీ బ్రాహ్మడియోగ్యత యిప్పుడే కలక్టరుగారి బసకువెళ్లి మనవిచేస్తాను.

(తెరదించవలెను.)


4- వ స్థలము. లుబ్ధావధాన్లు బస.

లుబ్ధావధాన్లు- (ప్రవేశించి) ఏమి దురవస్థ వచ్చిందీ! నా అంత దురదృష్టవంతుడు లోకంలో యవడూలేడు. యేల్నాడి శనిరాగానే కాశీకి బయల్దేరి పోవలిసింది. బుద్ధి తక్కువపనిచేశాను. యిలా రాసివుండగా యెలా తప్పుతుంది. సౌజన్యరావుపంతులు దేవుఁడు. ఆయనలాంటివాళ్లు వుండబట్టే వర్షాలు కురుస్తున్నాయి. ఆయన శలవిచ్చినట్టు తప్పంతా నాయందు వుంచుకుని విధిని నిందించడవెఁందుకు? ఇంతడబ్బుండిన్నీ, డబ్బుకి లోభపడి ఒక్కగా నొక్కకూతుర్ని ముసలివాడికి అమ్మాను. నా జీవానికి ఉసురుమంటూ అదికానితిరుగులు తిరిగిందంటే దానితప్పా? బుద్ధితక్కువ వెధవని, ముసలితనంలో నాకు పెళ్లేం? దొంగముండా కొడుకని తెలిసిన్నీ ఆ రావఁప్పంతుల్ని నేన్నమ్మడవేఁవిఁ? ఆ మాయగుంట పారిపోవడవేఁవిఁ? కంటెకి, ఆ అల్లరేవిఁ? ఆయినసిపికటరు కూనీ చేశావఁని మమ్మల్ని సలపెట్టడ వేఁవిఁటి? అంతా ఘోరకలి; కలి నిండిపోతూంది. ఒక్క సౌజన్యారావు పంతులు సత్యసంధుడు నాకు కనపడుతున్నాడు. కడవఁంతా వకీళ్లూ, పోలీసులూ, పచ్చిదొంగలు.- ఆయనచక్రం అడ్డువేసి మమ్మల్ని యీ ఆపదలోంచి తప్పించారంటే కాసీవాసంపోతాం.- యేమి చిత్రాలు! వెధవలకి మఠం కట్టారట! యన్నడూ వినలేదు. అమ్మినివెళ్లి ఆమఠం చూడమంటాను. దానికి యిష్టం కలిగిందా, దానికి కావలిసిన డబ్బు యిస్తాను. ఆ మఠంలో వుంటుంది. లేకుంటే, నాతోపాటు కాసీవాసం.

[రామప్పంతులు ప్రవేశించును.]

లుబ్ధా- కంటె, గింటె అని నాతో మీరు ప్రశంసించి కార్యంలేదు.

రామ- ఆ కంటె మాట ప్రశంసించడానికి రాలేదు మావాఁ. ఆ కంటె మధురవాణిది, మీరెరగరా? అదీ, మీరూ యేం జేసుకుంటారో నాకేం కావాలి? కంటె సిగకోసిరిగాని, మీకు ఓ గొప్ప సాయంచెయ్యడానికి వొచ్చాను. మీ అవస్థ చూస్తే నాగుండె నీరైపోతూంది.

లుబ్ధా- మహప్రభో! నీకు పదివేల నమస్కారాలు. యిక, యీ పకీరు వెధవని వదిలెయ్యి.

"రామనామ తారకం ।
భక్తిముక్తిదాయకం । జానకీమ"

రామ- రామ! రామ! యంతమాట అంటివయ్యా! మీరు ఆపదలోవుండి విరక్తిచేత యేమి మాటలన్నా అవి పడి, పనిచెయ్యడం నాకు విధి. చెప్పేమాట చెవిని బెట్టండి. ముందూ వెనకా చూడడానికి యిహ టైములేదు. వ్యవహారం అంతా సూక్ష్మంగా పొక్తు పరుచుకు వొచ్చాను. రెండు సంచులతో, కూనీకేసంతా మంచు విడిపోయినట్టు విడిపోతుంది. ఒక్క యినస్పెక్టరుతో కుదరలేదు. డిప్టీ కలక్టరికి కూడా చెయ్యి తడిచెయ్యాలి- మీ దగ్గిర యిప్పుడు సొమ్ము లేదంటిరా, ఒకచోట వ్యవహారం కూడా పొక్తు పర్చాను. ప్రాంసరీ నోటుమీద యెన్ని రూపాయలు కావలిస్తే అన్ని రూపాయలిస్తారు.

లుబ్ధా- నేను ఒక దమ్మిడీ యివ్వను. "రామనామతారకం । భక్తిముక్తిదాయకం । జానకీమనోహరం । సర్వలోకనాయకం" ॥

రామ- నామాటవిను. యంతో ప్రయాసంమీద యీఘట్టం కుదిర్చాను. తాసీల్దారు మీదగ్గిర లంచం పుచ్చుకుని కూనీకేసు కామాపు చేశాడని, యినస్పెకటరు, డిప్టీకలక్టరికి గట్టిగా బోధపర్చాడు. కలక్టరు సలహామీద యినస్పెక్టరు చాలా పట్టుదలగా పనిచేసి, సాక్ష్యం అంతా రడీచేశాడు. కేసు రుజువైనట్టాయనా యావౌఁతుందో ఆలోచించుకోండి.

లుబ్ధా- నీకెందుకు నాయేడుపు?

రామ- డిప్టీకలక్టరు బ్రహ్మద్వేషి- తాసిల్దారు తాడు ముందుతెగుతుంది. తరవాత మిమ్మల్నీ, మీనాక్షినీ కమ్మెంటు కట్టేస్తాడు- వురిసిద్ధం. నాకూ యినస్పెక్టరికీ వుండే స్నేహంచేత యీ ఘట్టానికి వొప్పించాను. గనక నామాటకి చెవొగ్గి యీ ఆపద తప్పించుకోండి.

లుబ్ధా- నన్ను బాధపెట్టక నీమానాన్న నువ్వుపోదూ. "రామనామతారకం । భక్తిముక్తిదాయకం॥"

రామ- నీ అంత కర్కోటకుణ్ణి యక్కడా నేనుచూడలేదు. నీమాటకేం పెద్దవాడివి - పసిపిల్ల, కడుపునకన్న మీనాక్షికి వురిసిద్ధం అయితే, ముండా డబ్బుకి ముందూ వెనకా చూస్తావు! తలుచుకుంటే నాహృదయం కరిగిపోతూంది.

[సౌజన్యారావు పంతులు ప్రవేశించును.]

రామ- తమరు ధర్మస్వరూపులు. లుబ్ధావధాన్లుగారియందు అకారణమైన దయచేత యీకేసులో పనిచేస్తున్నారు. కేసంతా వట్టి అన్యాయమండి. ఒక్కపిసరైనా నిజంలేదు. శలవైతేగట్టి డిఫెన్సుసాక్ష్యం.

సౌజన్యా- నీసంగతి నాకు తెలుసును. అవతలికి నడువు.

రామ- తమరు యోగ్యులూ, గొప్పవారూ అయినా, ఏకవచనప్రయోగం-

సౌజ- నడువు!

[రామప్పంతులు నిష్క్రమించును.]

సౌజ- ఈదౌల్బాజీని తిరిగీ యెందుకు రానిచ్చారూ?

లుబ్ధా- పొమ్మంటే పోడుబాబూ.

సౌజ- యేవొఁచ్చాడు?

లుబ్ధా- యినస్‌పికటరికీ డిప్టీకలకటరికీ లంచం యిమ్మంటాడు.

సౌజ- డిప్టీకలక్టరుగారు లంచంపుచ్చుకోరు. ఆయన నాకు స్నేహితులు; నాకు తెలుసును. లంచాలూ పంచాలూ మీరు యిచ్చినట్లయితే, మీకేసులో నేను పనిచెయ్యను.

లుబ్ధా- తమశలవు తప్పినడుస్తే చెప్పుచ్చుకు కొట్టండి. నాకు భగవంతుడిలాగ తమరు దొరికారు - "పాలనుముంచినా మీరే, నీళ్లనుముంచినా మీరే" అని మిమ్మల్నే నమ్మి ఉన్నాను.

సౌజ- మీరు నేరంచెయ్యలేదని నాకు పూర్తిఅయిన నమ్మకంవుంది. నిజం కనుక్కోడానికి చాలాప్రయత్నం చేస్తున్నానుగాని ఆగుంటూరి శాస్తుల్లు యవడో భేదించలేకుండా వున్నాను. మీరు జ్ఞాపకం మీద చెప్పినచహరా గుంటూరు వ్రాసి పంపించాను. అక్కడ అలాటిమనిషి యవడూలేడని జవాబువొచ్చింది.

లుబ్ధా- అదేంమాయోబాబూ! మీసాయంవల్ల యీగండంగడిచి, నాపిల్లా నేనూ యీ ఆపదలోంచి తేలితే, నాడబ్బంతా, మీపాదాలదగ్గిర దాఖలుచేసి కాసీపోతాను.

సౌజ- మీడబ్బు నాకక్కరలేదని మీతో మొదటే చెప్పాను. నేచెప్పినమాటలు మీకు నచ్చి, ముసలివాళ్లు పెళ్లాడకూడదనీ, కన్యాశుల్కం తప్పనీ, యిప్పటికైనా మీకు నమ్మకం కలిగితే, యిలాంటి దురాచారాలు మాన్పడానికి రాజమహేంద్రవరంలో వక సభవుంది, ఆసభకి కొంచవోఁగొప్పో మీకు తోచిన డబ్బుయివ్వండి. వితంతువుల మఠానికి మీ పిల్లని పంపడం నా సలహా. లుబ్ధా- తమచిత్తం, తమశలవు. చేసినతప్పులు, తప్పులని శల్యాల్ని వట్టిపోయిందీ. బుద్ధివొచ్చింది బాబూ.

సౌజ- ఆగుంటూరు శాస్తుల్లుకి పరవఁటదేశపు యాసవుండేదా? బాగా జ్ఞాపకం చేసుకు చెప్పండీ.

లుబ్ధా- (ఆలోచించి) లేదండి.

సౌజ- బాగా జ్ఞాపకం తెచ్చుకోండీ.

లుబ్ధా- లేదండి.

(తెరదించవలెను.)

5- వ స్థలము. విశాఖపట్టణంలో.

[మధురవాణి యింటి యదటివీధికొసను కరటకశాస్త్రి, శిష్యుడూ ప్రవేశింతురు.]


కరట- నువ్వు ఆకంటె వాళ్లనెత్తిని కొట్టకుండా లేచిరావడంనుంచి, యీ ముప్పంతా వొచ్చినట్టు కనపడుతుంది.

శిష్యుడు- మధురవాణి కంటె మధురవాణికి యివ్వడం తప్పాఅండి?

కరట- తప్పుకాదా? నువ్వు యిచ్చావని, మరి అదివొప్పుకుందా? "తే, ధగిడీకే కంటెతెస్తావా, చస్తావా?" అని రావఁప్పంతుల్ని పీకిపిండెట్టింది. దానిబాధపడలేక, ఆరావఁప్పంతులు కూనీకేసని యెత్తు యెత్తాడు. ఆముసలాడికి సిక్ష అయిపోయిందంటే, బ్రహ్మహత్య నామెడకి చుట్టుకుంటుంది. నువ్వు అంటూ ఆకంటె వాళ్లయింట వొదిలేస్తే, నాకు యీ చిక్కు లేకపోవునుగదా?

శిష్యుడు- వెధవముండ గూబగదలేస్తూంటే కంటె గింటె యవడికి జ్ఞాపకం వొస్తుందండి? చెయికరిచి, పెట్టెతీసి, మొహురు అంకించుకుని, చెంగున గోడగెంతాను. పజ్యండువొందలు మీరుపట్రాగా, నాకు పెళ్లిలోపెట్టిన కంటె నేను తెచ్చాననా, తప్పుపట్టుతున్నారు? ఆకంటె అయినా దక్కిందా? చూస్తూనే మధురవాణి లాక్కుంది.

కరట- నేను హాస్యగాణ్ణేగాని, యీ కూనీ గడబిడతో నాహాస్యం అంతా అణిగిపోయింది. గనక యిక హాస్యంమాను- నేను తీసుకున్న రూపాయలు, లుబ్ధావధాన్లుకి యప్పటికైనా పంపించడానికే తలచాను! అంతేగాని అపహరిద్దామని అనుకోలేదు- మధురవాణిని యలాగైనా లయలేసి, కంటె యరువుపుచ్చుకుని, ఆకంటా, యీ రూపాయలూ, బంగీకట్టి అవుధాన్లుకి పంపించేస్తే, కూనీ నిజం కాదని పోల్చుకుంటారు. నాకు యీ బ్రహ్మహత్య తప్పిపోతుంది.

శిష్యుడు- మీ నాస్తులు సౌజన్యారావు పంతులుగారితో నిజంచెప్పెయ్యరాదా అండి?

కరట- వెఱ్ఱి కుదిరింది, రోకలి తలకి చుట్టమనన్నాట్ట! వెనకటికి యవరో పోలీసు, తల్లి కూరగాయలు పుచ్చుకుంటే జుల్మానా వేశాట్ట; సౌజన్యారావు పంతులు అలాటివాడు. ఆయనతో మనం వున్నమాట చెప్పావఁంటే, ఆయన నిజం కోర్టులో చెప్పేస్తాడు. ఆపైని లుబ్ధావధాన్లు పీకవురి, మన పీకకి తగులుకుంటుంది.

శిష్యుడు- "మన" అంటున్నారేవిఁటి?

కరట- మాట పొరపాటురా. రావఁప్పంతులు వూరికి వెళ్లినమాట నిజవేఁనా?

శిష్యుడు- నిజవేఁ.

కరట- వాడికంట పడ్డావఁంటే-

శిష్యుడు- పడితే?

కరట- మరేంలేదు. మధురవాణిగాని కంటె మనకి యెరువుయివ్వడానికి వొప్పుకుంటే ఆంజనేయస్వామికి పదిశేర్లునెయ్యి దీపారాధనచేస్తాను.

శిష్యుడు- కడుపులోకి వెళ్లవలసిననెయ్యి కాల్చెయ్యడం నాకేవీఁ యిష్టంలేదు. అమృతగుండీ మొక్కుకొండి.

కరట- హాస్యంచాలించు, బెడిసిగొడుతుంది.

(నిష్క్రమింతురు.)

6- వ స్థలము. మధురవాణి బసలోగది.

[మధురవాణి కుర్చీమీద కూచునియుండును. కరటకశాస్తుల్లు, శిష్యుడూ, ప్రవేశింతురు. మధురవాణి నిలబడును.]


మధు- గురువుగారికి పదివేలదండాలు; శిష్యుడికొక చిన్నముద్దు. (శిష్యుని ముద్దుబెట్టుకొనును.)

కరట- నీ పుణ్యం వుంటుంది. నా అల్లుణ్ణి చెడగొట్టకు.

మధు- అల్లుడెవరు?

కరట- మాపిల్లని యితగాడికి యిచ్చి, కన్యాదానంచేస్తాను.

మధు- జెయిలునుంచి వొచ్చినతరవాత పెళ్లా? లేక, పెళ్లిచేసుకుని, మరీ మఠప్రవేశవాఁ?

శిష్యు- జయిలేవిఁటండోయి?

కరట- వొట్టినే హాస్యానికంటూంది.

మధు- పాపం ఆపసిపిల్లవాడికి వున్న నిజస్థితి చెప్పండి. తనవాళ్లని వెళ్లిచూసైనావస్తాడు.

శిష్యు- (కరటక శాస్త్రితో) కొంపముంచారో?

మధు- ముంచడం అంటే అలాగా యిలాగానా?

కరట- నీపుణ్యంవుంటుంది. హాస్యంచాలించు. లేకపోతే కుఱ్ఱవాళ్లకి పెద్దలయందు భక్తి చెడుతుంది.

శిష్యు- నేనేంతప్పుచేశాను? గురువుగారు చెప్పినపనిచేశాను. ఆతప్పూ వొప్పూ ఆయందే.

మధు- యవరేమిచేసితిరో, నాకు తెలియదుగాని, మీయిద్దరికోసం హెడ్‌ కనిష్టీబు గాలిస్తున్నాడు. దొరకగానే మఠప్రవేశం చేస్తాడట. యీ మాటమట్టుకు నాకు రూఢిగా తెలుసును.

శిష్యు- యిదేనా మీరు నాకు చేస్తానన్న పెళ్లి?

కరట- యేమైనా జట్టీవస్తే, నీప్రాణానికి నాప్రాణం అడ్డువెయ్యనట్రా?

మధు- వొస్తే జట్టీ గురుశిష్యులకు యిద్దరికీ వొక్కమారే వస్తుందిగాని, ఒకరికి రావడం ఒకరు అడ్డుపడడం అన్నమాట వుండబోదు. యెప్పుడైనా మీయిద్దరి ప్రాణాలకీ నేను కనికరించి, అడ్డుపడాలిగాని, మరియవడికీ సాధ్యంకాదనుకుంటాను.

శిష్యు- మాగురువుగారి మాటకేం; ఆయనపెద్దవారు; యేవొఁచ్చినా సర్దుకోగలరు. నేను పాపం పుణ్యం యెరగని పసిపిల్లవాణ్ణి, నాప్రాణానికి నీప్రాణం అడ్డువేశావంటే, కీర్తివుండిపోతుంది.

మధు- నీగురువుని వొదిలేసి నాదగ్గిర శిష్యరికం చేస్తావా?

శిష్యు- యిదిగో- యీనిమిషం వొదిలేస్తాను. (బుగ్గలుగాలితో పూరించి పిడికిళ్లతో తట్టి గురువుతో) మీనేస్తం యీవేళతోసరి. మరి ఆడవేషం యీజన్మంలో వెయ్యను.

మధు- నాటకంలోకూడా వెయ్యవా?

శిష్యు- మరి నాటకం గీటకం నాకొద్దు.

మధు- నాదగ్గిర శిష్యరికం అంటే యేవేఁంజెయ్యాలో తెలుసునా?

శిష్యు- నీళ్లుతోడుతాను, వంటచేస్తాను. బట్టలువుతుకుతాను. గాని బ్రాహ్మణ్ణిగదా, కాళ్లుపట్టమనవుగద?

మధు- (విరగబడినవ్వి) యిదా నీగురువుదగ్గిర చేసే శిష్యరికం?

శిష్యు- మరిచిపోయినాను. చిడప్పొక్కులుకూడా గోకుతాను.

మధు- (నవ్వి) పెంకా?

శిష్యు- యేనౌఖరీ చెయ్యమంటే ఆనౌఖరీ చేస్తాను.

మధు- నన్ను ముద్దెట్టుకొమ్మన్నప్పుడల్లా ముద్దెట్టుకోవాలి.

శిష్యు- ముద్దెట్టుకుంటాను.

కరట- వాడు కుఱ్ఱవాడు- వాణ్ణెందుకు చెడగొడతావు? ఆశిష్యరికం యేదో వాడి తరఫునా, నాతరఫునాకూడా నేనే చేస్తాను. చాతనైతే చక్రంఅడ్డెయి.

మధు- "గురువూ శిష్యుడాయె శిష్యుడూ గురువాయె" మీరు శిష్యులు కావాలంటే యిస్కూలు జీతం యిచ్చుకోవాలి.

కరట- పిల్లికి చెలగాటం; యలక్కి ప్రాణపోకటా!

మధు- మీరా యలక?

కరట- అవును.

మధు- మీరు యలకకారు, పందికొక్కులు, మీశిష్యుడు యలక.

కరట- పోనీ- వాణ్ణయినా కాపాడు.

మధు- అదే ఆలోచిస్తున్నాను.

కరట- బుద్ధీ బుద్ధీ కలిస్తే రాపాడుతుంది. నీ ఆలోచన యేదో కొంచం చెబితివట్టాయనా నా ఆలోచనకూడా చెబుతాను. కలబోసుకుందాం.

మధు- మీ ఆలోచన ముందుచెప్పండి.

కరట- మరేమీలేదు నేపుచ్చుకున్న పజ్యండువొందల రూపాయల నోట్లూ, ఆకంటా, పోస్టుద్వారా భీమాచేసి గుంటూరు శాస్తుల్లుపేరట, లుబ్ధావధాన్లుకి పంపిస్తాను. దాంతోటి కూనీకేసు నిజంకాదని సౌజన్యారావు పంతులుగారు పోల్చుకుంటారు. ఆపైని దైవాధీనం!

మధు- మీకు కంటె యలా వొస్తుంది?

కరట- నువ్వు అనుగ్రహిస్తేను.

మధు- (ముక్కుమీద వేలువుంచుకుని) చిత్రం! బ్రాహ్మలు యంతకైనా తగుదురు.

కరట- యేవిఁ అలా అంటున్నావు?

మధు- నాకంటె తిరిగీ నేను కళ్లచూడడం యెలాగ?

కరట- సౌజన్యారావు పంతులుగారు నీవస్తువ నీకు యిచ్చేస్తారు. ఆయన బహున్యాయమైన మనిషి.

మధు- అంత మంచివాడా?

కరట- అందుకు సందేహవేఁమిటి?

మధు- యెంత మంచివాడు?

కరట- అంత మంచిమనిషి మరి లోకంలోలేడు.

మధు- ఆయన్ని నాకు చూడాలనుంది. తీసికెళ్తారా?

కరట- నా ఆబోరుంటుందా? ఆయన సానివాళ్లని చూడరు.

మధు- ఆంటీ నాచ్చి కాబోలు?

కరట- యింగిలీషు చదువుకున్నవాళ్లకి కొందరికి పట్టుకుంది యీ చాదస్తం! అయినా అందులోనూ దేశకాలాలనుబట్టి, రకరకాలు లేకపోవడంలేదు.

మధు- సౌజన్యారావు పంతులుగారిది యేరకం? గిరీశంగారిది యేరకం?

మధు- సౌజన్యారావు పంతులుగారిది యేరకం? గిరీశంగారిది యేరకం?

కరట- యేమి సాపత్యంతెచ్చావు? కుక్కకి గంగిగోవుకూ యెంతవారో, వాడికీ ఆయనకు అంతవార. సౌజన్యారావు పంతులుగారు కర్మణా, మనసా, వాచా, యాంటీనాచి. "వేశ్య" అనేమాట, యేమరి ఆయనయెదట పలికితివఁట్టాయనా, "అసందర్భం!" అంటారు. ఆయనలాంటి అచ్చాణీలు అరుదు. మిగిలినవారు యధాశక్తి యాంటీనాచులు. ఫౌఁజు ఫౌఁజంతా, మాటల్లో మహావీరులే. అందులో గిరీశం అగ్రగణ్యుడు. కొందరు బంట్లు పొగలు యాంటీనాచి, రాత్రి ప్రోనాచి; కొందరు వున్నవూళ్లో యాంటీనాచి, పరాయివూళ్లో ప్రోనాచి; కొందరు శరీరదాఢ్ర్యం వున్నంతకాలం ప్రోనాచి, శరీరం చెడ్డతరవాత యాంటీనాచి; కొందరు బతికివున్నంతకాలం ప్రోనాచి, చచ్చిపోయినతరవాత యాంటీనాచి; కొందరు అదృష్టవంతులు చచ్చినతరవాతకూడా ప్రోనాచే. అనగా యజ్ఞంచేసి పరలోకంలో భోగాలికి టిక్కట్లు కొనుక్కుంటారు. నాబోటి అల్పప్రజ్ఞకలవాళ్లు, లభ్యం కానప్పుడల్లా యాంటీనాచె.

మధు- మీయోగ్యత చెప్పేదేమిటి! గాని, హెడ్డుగారి మాటలుచూస్తే, సౌజన్యారావు పంతులుగారు లుబ్ధావధాన్లుగారిని కాపాడడానికి, విశ్వప్రయత్నం చేస్తూ వున్నట్టు కనబడుతుంది. యేమికారణమో?

కరట- చాపలు యీదడానికి, పిట్టలు యెగరడానికి యేంకారణమో అదేకారణం.

మధుర- పరోపకారం ఆయనకు సహజగుణమనా`?

కరట- కాకేవిఁ?

మధుర- మీరెందుకు, కొంచెం ఆయీదడం, యెగరడం నేర్చుకోకూడదు?

కరట- నీమాట అర్థంకాలేదు.

మధుర- యీ కేసులో నిజవేఁదో సౌజన్యారావు పంతులుగారితో చెప్పి మీరుకూడా- కొంచం లోకోపకారం చెయ్యరాదా?

కరట- మామంచి సలహా చెప్పావు! తనకు మాలిన ధర్మమా? "స్వయంతీర్ణః పరాంస్తారయతి" అన్నాడు. నిజంచెబితే పంతులు యేవంటాడో నీకు తెలుసునా? "శాస్తుల్లుగారూ మీరు నేరంచేశారు. నేనేమిచెయ్యగలను? మిమ్మునుగురించి నాకుచాలా విచారంగా వున్నది" అని వగుస్తూ, పోలీసువాళ్లతోచెప్పి, జైయిలులోకి వప్పచెప్తాడు. జైయిలునుంచి తిరిగీ వచ్చిందాకా మాత్రం నెలకో పాతికో, పరకో కనికరించి నాభార్యాకు యిస్తూవుంటాడు. అలాంటి ప్రమాదం లేకుండా కార్యసానుకూలం కావఁడంకోసమే యీయెత్తు యెత్తాను. మధుర- సరె, సౌజన్యారావు పంతులుగారు మంచివారు గనక ఆయనదాకావస్తే నాకంటె నాకు యిప్పించేస్తారు గాని, లుబ్ధావఁధాన్లు ఆరూపాయలూ, కంటా, పెట్లో పెట్టుకుని ముంగిలా మాట్లాడకుండా వూరుకుంటేనో?

కరట- దానిఖరీదు నేనిచ్చుకుంటాను.

మధు- తమరు ఒకవేళ మఠంలో ప్రవేశిస్తే మరి నాకు కంటె ఖరీదుయిచ్చేవారెవరు? అందుచేత ఆకంటె నాకు తిరిగీ వచ్చేవరకూ మీశిష్యుణ్ణి నాదగ్గిర తాకట్టువుంచండి.

కరట- అలాగనే.

శిష్యుడు- మీసొమ్మేంబోయింది. నాపెళ్లో?

కరట- నాలికా, తాటిపట్టెరా?

శిష్యుడు- మీరోవేళ- జయిల్లోకివెళితే

మధు- గురువుకు తగిన శిష్యుడివౌదువు!

కరట- అంత ఉపద్రంవొస్తే, నీపెళ్లిమాట నాపెళ్లాంతో యరేంజిమెంటుచేసి మరీవెళతాను.

శిష్యుడు- యేమో! ఘోరవైఁనప్రమాణం చేశారుగదా?

కరట- మధురవాణీ, కొంచంశ్రమచేసి కంటెతేవా?

మధు- యేవొఁచ్చింది తొందర?

కరట- హెడ్డుగాని, రావఁప్పంతులుగాని, వొచ్చారంటే నాకొంప ములుగుతుంది.

మధు- ములిగితే తేలుస్తాను.

కరట- అంత చాకచక్యం నీకులేదనికాదు.

(మధురవాణి లోనికివెళ్లును.)

కరట- అది చెప్పిందల్లాచెయ్యక. కొంచంపై ఒచ్చేదికాని, మరీ నడుస్తూవుండు. యేవైఁనావుంటే, నాచెవిని పడేస్తూండు.

శిష్యుడు- యవరిదగ్గిర వున్నప్పుడు వారు చెప్పిందల్లా చెయ్యడవేఁ, నా నిర్ణయం. మీరు యేం పైకాని, నాచేత ఆడవేషంవేయించి పెళ్లిచేశారో?

కరట- ప్రమాదో ధీమతామపి. యంతటివాడికైనా ఒకప్పుడు కాలుజారుతుందిరా!

(మధురవాణి కంటె పట్టుకు ప్రవేశించి.)

మధు- తాకట్టువస్తువ తప్పించుకు పారిపోతేనో? కుక్కా, నక్కా, కాదుగదా గొలుసులువేసి కట్టడానికి?

కరట- నీ వలల్లో పడ్డప్రాణి మరి తప్పించుకుపోవడం యలాగ? వాటికి వున్న పటుత్వం యేవుక్కు గొలుసులకూ వుండదు.

మధు- వలలో ముత్యపు చిప్పలుపడితే లాభంగాని, నత్తగుల్లలుపడితే మోతచేటు.

కరట- యంతసేపూ డబ్బు, డబ్బేనా? స్నేహం, వలపూ, అనేవి వుంటాయా?

మధు- స్నేహం మీలాటివారిచోట; అందుచేతనే, కష్టపడి ఆర్జించిన కంటె మీపాలు చేస్తున్నాను. మాతల్లిచూస్తే భవిష్యంవుంచునా? యిక వలపో? బతుకనేది వుంటే, వలపువన్నెతెస్తుంది. అంగడివాడికి మిఠాయిమీది ఆశా, సానిదానికి వలపూ, మనస్సులోనే మణగాలి; కొద్దికాలంవుండే యవ్వనాన్ని జీవనాధారంగా చేసుకున్న మా కులానికి వలపు ఒక్కచోటే.

కరట- యక్కడో?

మధు- బంగారంమీద. శృంగారం వన్నెచెడిన దగ్గిరనుంచీ, బంగారంగదా తేటుతేవాలి? ఆ బంగారం మీకు ధారపోస్తూవున్నప్పుడు నా స్నేహం యెన్ననేల?

కరట- నీ స్నేహం చెప్పేదేవిఁటి! గాని నీ యౌవ్వనం, నీ శృంగారం దేవతా స్త్రీలకువలె శాశ్వతంగా వుంటాయి.

మధు- మాతల్లి ధర్మవాఁ అని, ఆమె నాచెవిలో గూడుకట్టుకుని బుద్ధులు చెప్పబట్టిగాని, లేకుంటే మీలాంటి విద్వాంసుల యిచ్చకాలకి మైమరచి, యీపాటి వూళ్లో సానులవలె చెడివుండనా?

కరట- మీతల్లి అనగా యెంత బుద్ధివంతురాలు! దాని తరిఫీదుచేతనే నువ్వు విద్యాసౌందర్యాలు రెండూ దోహదంచేసి పెంచుతున్నావు!

మధు- అంతకన్న కాపుమనిషినైపుట్టి, మొగుడిపొలంలో వంగమొక్కలకూ, మిరపమొక్కలకూ దోహదంచేస్తే, యావజ్జీవం కాపాడే తనవాళ్లన్నవాళ్లు వుందురేమో?

కరట- యేమి చిన్నమాట అన్నావు! మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి యీ కళింగరాజ్యంలో వుండకపోతే, భగవంతుడి సృష్ఠికి యంతలోపం వచ్చివుండును?

మధు- సృష్ఠికి లోపం వచ్చినా రాకపోయినా, యిప్పటి చిక్కులలో మీకుమట్టుకు కించిత్‌లోపం వచ్చివుండును.

కరట- మమ్మల్ని తేల్చడానికి నీ ఆలోచన యేదో కొంచం చెప్పావుకావుగదా?

మధు- నన్ను సౌజన్యారావు పంతులుగారి దగ్గిరకి తీసుకువెళ్లడానికి వొప్పారు కారుగదా?

కరట- ఆయన నిన్నూ, నన్నూ యింట్లోంచి కఱ్ఱపుచ్చుకు తరుముతారు.

మధు- కోపిష్టా?

కరట- ఆయనకి కోపవఁన్న మాటేలేదు.

మధు- ఐతే భయమేల?

కరట- చెడ్డవారివల్ల చెప్పుదెబ్బలు తినవచ్చునుగాని, మంచివారివల్ల మాటకాయడం కష్టం.

మధు- కొత్తసంగతి వకటి యీనాటికి నాకు తెలిసింది. సృష్టికల్లా వన్నె తెచ్చిన మధురవాణి అనే వేశ్యాశిఖామణి గిరీశంగారివంటి కుక్కలపొత్తుకే తగివున్నదిగాని, సౌజన్యారావు పంతులుగారివంటి సత్పురుషులను చూడడమునకైనా అర్హత కలిగివుండలేదు. గిరీశంగారు దానియింట అడుగుబెట్టగానే, మీచెల్లెలుగారియింట, అడుగుపెట్టడానికి ఆయనకు యోగ్యత తప్పిందని మీ నిర్ణయం. తమలాంటి పండితోత్తములుమాత్రం కార్యావసరం కలిగినప్పుడు వూరూవాడా వెతికి, మధురవాణిదగ్గర లాచారీపడవచ్చును. అయితే డిప్టీకలక్టరూ కుక్కేనా?

కరట- లంచం తినడుగాని ఆయనకు స్త్రీవ్యసనంకద్దు. పెద్ద వుద్యోగస్థుడు గనుక, సీమకుక్క అని అందాం, ఆయన్నిగానీ వలలోవేశావా యేవిఁటి?

మధు- వేస్తే?

కరట- బతికానన్నమాట! ఆయన సాయంవుంటే, కేసు మంచులావిడిపోతుంది. తెలిసింది. యిదా, నువుచేసిన ఆలోచన? యెంత గొప్పదానివి!

మధు- ఆయన నాయుడుచేత రాయభారాలు పంపుతున్నారు.

కరట- వెళ్లు, వెళ్లు, వెళ్లు, వెళ్లు, యింకా ఆలోచిస్తావేవిఁటి? నీ అదృష్టం నా అదృష్టం యేవఁని చెప్పను!

మధు- వెళ్లతలచుకోలేదు.

కరట- చంపిపోతివే! ఆయన ఒక్కడే మమ్మల్ని కాపాడగలిగినవాడు.

మధు- యిటుపైని వూరకుక్కలనూ, సీమకుక్కలనూ దూరంగావుంచడానికి ఆలోచిస్తున్నాను.

కరట- ఆయనని హాస్యానికి సీమకుక్క అని అన్నానుగాని, యెంత రసికుడనుకున్నావు? చేతికి యెమికలేదే! హెడ్డుకనిస్టీబుసాటి చేశాడుకాడా?

మధు- పట్ణంవొదిలి పల్లెటూరు రాగానే, మీదృష్టిలో, పలచనైతినో? హెడ్డును నౌఖరులా తిప్పుకున్నానుగాని అధికంలేదే? ఆ నాలుగురోజులూ, సర్కారు కొలువుమాని అతడు నాకొలువుచేశాడు. అతడి సాయం లేకపోతే, మీరు ఆవూరి పొలిమేరదాటుదురా? యీ దాసరి దాటునా? లోకం అంతా యేమి స్వప్రయోజకపరులూ?

కరట- అపరాధం! అపరాధం! కలక్టరుని చూడనంటే, మనస్సు చివుక్కుమని అలా అన్నాను. నువ్వు ఆగ్రామం గ్రామం సమూలం రాణీలాగ యేలడం నేను యీ కళ్లతో చూడలేదా?

మధు- నేను కలక్టరును చూడనంటే, మీమనస్సు చివుక్కుమనడం యెట్టిది? యేమి చిత్రం! సౌజన్యారావు పంతులుగారు యీమాటవింటే సంతోషిస్తారు కాబోలు?

కరట- పీకవుత్తరిస్తారు.

మధు- అదేదో చూస్తాను.

కరట- బ్రహ్మహత్య కట్టుకుంటావా యేమిఁటి?

మధు- అహా! యేమి బ్రాహ్మలూ!- అయినా పోలిశెట్టి చెప్పినట్టు, యెంత చెడ్డా బ్రాహ్మలుగదా? యిందండి; (కంటెయిచ్చును) తిలోదకాలేనా?

కరట- యెంతమాట? పువ్వులలోపెట్టి మళ్లీరాదా? నీయెదట అనవలిసిన మాట కాదు. నీలాంటి మనిషి మరిలేదు. కించిత్‌ తిక్కలేకుంటేనా!

మధు- ఆతిక్కేగదా యిప్పుడు మీకు వుపచరిస్తూంది?

కరట- యేం వుపచరించడం? చంపేశావు! ఆ డిప్టీకలక్టర్ని ఒక్కమాటుచూసి యీ బీదప్రాణిని కాపాడితే-

మధు- చాలించండి. యిక విజయంచెయ్యండి. (వెళ్లిపొమ్మని చేతితో సౌజ్ఞచేయును. కరటకశాస్తుల్లు, శిష్యుడు నిష్క్రమించుచుండగా) శాస్తుల్లుగారూ!

(కరటకశాస్తుల్లు తిరిగీ ప్రవేశించును.)

మధు- మీపిల్లని మహేశానికి యిస్తారా?

కరట- యిస్తాను.

మధు- అయితె నాకో ఖరారు చేస్తారా?

కరట- చేస్తాను.

మధు- యిక అతణ్ణి నాటకాలాడించీ, ముండలిళ్లతిప్పీ చెడగొట్టకండి.

కరట- యిటుపైని చెడగొట్టను- నాకుమాత్రం అక్ఖర్లేదా? (పొడుంపీల్చి) నీది గురూపదేశం, మధురవాణీ!

మధు- బ్రాహ్మలలో ఉపదేశంలావూ, ఆచరణతక్కువా. ఖరారేనా?

కరట- ఖరారే.

మధు- బ్రాహ్మలుకాగానే, దేవుఁడికంట్లో బుగ్గిపొయ్యలేరు అనుకుంటాను.

కరట- చివాట్లకి దిగావేఁవిటి?

మధు- చిత్రగుప్తుడికి లంచం యివ్వగలరా? అతడిదగ్గిరకి మధురవాణిని పంపి, చేసిన పాపాలు అన్నీ తుడుపుపెట్టించడానికి వీలువుండదుకాబోలు?

కరట- మధురవాణీ! జరూరు పనివకటుంది. మరిచిపోయినాను- వెళ్లి, రేపు మళ్లీ వస్తాను.

మధురవాణి- (నవ్వుచేత కుర్చీమీద విరగబడి, తరవాత నవ్వు సమాళించుకొని) ఒక్కనిమిషం ఆగండి. శిష్యుడా! (శిష్యుడు ప్రవేశించును) యేదీ, నాడు నువ్వు రామచంద్రపురం అగ్రహారంలో, రామప్పంతులు యింటి బైటనూ, నేనూ మీనాక్షమ్మా తలుపు యివతలా అవతలా ఖణాయించి వుండగా, తెల్లవారఝావుఁన నిశ్శబ్దంలో ఆకాశవాణిలాపాడిన చిలక పాటపాడి నీమావఁగారికి బుద్ధిచెప్పు. తమమూలంగా ఒక ముసలిబ్రాహ్మడికి ముప్పువస్తూవుంటే తమశరీరం దాచుకుంటున్నారు.

శిష్యుడు- (పాడును) "యెఱ్ఱనిముక్కుగలది రామచిలుక । దాని."

మధు- (బెత్తముతో కొట్టబోయినట్టు నటించి) చెప్పినపని చెయ్యకపోతే జయిలుసిద్ధం.

శిష్యుడు- ( "యెన్నాళ్లు బ్రతికినా" అను పాటపాడును. రెండు చరణములు పాడిన తరవాత.)

కరట- అతిజరూరు పనివుంది మధురవాణీ మరోమాటువస్తాను. (నిష్క్రమించుతూ) తల వాయగొట్టింది. తెల్లవెంట్రుకలు లావయినాయి- మనసు కొంచం మళ్లించుకుందాం.7- వ స్థలము. సౌజన్యారావు పంతులుగారియింట్లో కచేరీగది.

(సౌజన్యారావు పంతులుగారు, అగ్నిహోత్రావధాన్లు ప్రవేశింతురు.)


సౌజన్యా- ఇక మిమ్ములను జయించినవాడులేడు. పిల్లల్ని అమ్ముకోవడం శిష్టాచారం అంటారండీ?

అగ్ని- అహా. మా మేనత్తల్ని అందరినీ కూడా అమ్మారండి. వాళ్లంతా పునిస్త్రీ చావే చచ్చారు. మాతండ్రి మేనత్తల్నికూడా అమ్మడవేఁ జరిగిందష. యిప్పుడు యీ వెధవ యింగీలీషు చదువునుంచి ఆ పకీరువెధవ దాన్ని లేవదీసుకుపోయినాడుగాని, వైధవ్యం అనుభవించినవాళ్లంతా పూర్వకాలంలో యెంతప్రతిష్ఠగా బతికారు కారు?

సౌజ- పసిపిల్లల్ని కాలంగడిచినవాళ్లకి పెళ్లిచేస్తే వైధవ్యంరాక తప్పుతుందా? నింపాదిచేసి కొంచం యోచించండీ.

అగ్ని- ప్రాలుబ్ధం చాలకపోతే ప్రతివాళ్లకీ వస్తుందండి- చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా, రాసినరాత యెవడైనా తప్పించగలడా?

సౌజ- మీరు చదువుకున్నవారుగదా, ప్రారబ్ధమని పురుషప్రయత్నం యే వ్యవహారంలో మానేశారు? కేసు, "విధికృతం; యలావుంటే అలా అవుతుందని" వకీల్ని పెట్టడం మానేశారా? కన్యలని అమ్ముకోవడం శాస్త్రదూష్యంకాదా? డబ్బుకిలోభించి పిల్లల్ని ముసలివాళ్లకి కట్టబెట్టి విధికృతం అనడం న్యాయవేఁనా? శలవియ్యండి.

అగ్ని- యిప్పుడు మీ లౌక్యుల్లో వెయ్యేసి, రెండేసివేలు, వరకట్నాలు పుచ్చుకుంచున్నారుకారండీ? గిరీశంగారు చెప్పినట్లు- వాడిపిండం పిల్లులికిపెట్టా!- మీలో ఆడపిల్లలికి యిన్నితులాలు బంగారం పెట్టాలి యిన్నితులాలు వెండిబెట్టాలి అని నిర్నయించుకోవడంలేదా? అదిమాత్రం కాదేం కన్యాశుల్కం?

సౌజ- అలాచెయ్యడం నేను మంచిదన్నానా యేమిటండి? "గిరీశంగారు చెప్పినట్టు" అని అన్నారేవిఁటి?

అగ్ని- ఆ వెధవపేరు నాయదట చెప్పకండి.

సౌజ- కానీండిగాని- మీ రెండోపిల్లకి తగినవరుణ్ణిచూసి పెళ్లిచెయ్యండి. యేం సుఖపడుతుందని ముసలివాళ్లకి యివ్వడం? శలవియ్యండీ.

అగ్ని- అదంతా మీకెందుకయ్యా? ఓహో యిందుకా నన్ను పిలిపించారు? మీగృహకృత్యాల వూసుకి నేవొచ్చానా యేవిఁటి? నాగృహకృత్యాల వూసు మీకెందుకూ?

సౌజ- తొందరపడకండి అవుధాన్లుగారూ. దూరం ఆలోచించండి- మీకడుపున బుట్టిన పిల్లయొక్క సౌఖ్యం ఆలోచించి సలహాచెప్పానుగాని, నా స్వలాభం ఆలోచించి చెప్పలేదుగదా- పెద్దపిల్లకి సంభవించిన అవస్థ మీకళ్లతో చూడనేచూశారు. యికనైనా వృద్ధులకు పిల్లని కట్టబెట్టడపు ప్రయత్నము చాలించండి.

అగ్ని- నా పిల్లభారం అంతా మీదైనట్టు మాట్లాడుతున్నారేమిటి? ఆ సంత మీకెందుకూ?

సౌజ- నన్ను తమస్నేహవర్గంలో చేర్చుకోండి- పరాయివాణ్ణిగా భావించకండి- దయచేసి నాసలహావినండి- మర్యాదగలయింట పుట్టిన బుద్ధిమంతుడగు కుఱ్ఱవాణ్ణి చూసి మీ చిన్నపిల్లని పెళ్లిచెయ్యండి. యిక పెద్దపిల్లమాట- ఆమెకు వితంతువుల మఠంలో, సంఘసంస్కారసభవారు విద్యాబుద్ధులు చెప్పించుతారు. మీకడుపున పుట్టినందుకు యెక్కడనయినా ఆమె సుఖంగావుండడంగదా తండ్రైనవారు కోరవలసినది. ఆమె తాలూకు కొంతఆస్తి తమవద్దవున్నది. మా స్నేహితులున్నూ, స్త్రీ పునర్వివాహసభ కార్యాధ్యక్షులున్నూ అయిన రామయ్యపంతులుగారు నాపేరవ్రాసినారు. ఆ ఆస్తి, చిక్కులుపెట్టక, తాము ఆపిల్లకి పంపించి వెయ్యడం మంచిది.

అగ్ని- యేవిఁటీ ముండా యేడుపుసంత! వాడెవడు? వీడెవడు? మీరెవరు? అదెవర్త? నాపిల్లేవిఁటి, పకీరుముండ! రేపు యింటికి వెళుతూనే ఘటాశ్రాద్ధం పెట్టేస్తాను.

సౌజ- యిప్పటి ఆగ్రహంమీద మీరు అలా శలవిచ్చినా, నిడివిమీద మీకే కనికరం పుడుతుంది. యిప్పట్లోనే మీరు కనికరిస్తే కొంత మీకు నేను ఉపకారం చెయ్యగలను.

అగ్ని- కనికరం గాకేం. కడుపులో యేడుస్తున్నానుకానూ? ఆస్తీగీస్తీ యిమ్మంటేమాత్రం యిచ్చేవాణ్ణికాను. ఆవెధవని పెళ్లిచేసుకోకుండా యిల్లుజేరితే, యింట్లో బెట్టుకుంటాను. అంతే.

సౌజ- అది మరిజరగదు.

అగ్ని- యిది అంతకన్న జరగదు.

సౌజ- ఆమె ఆస్తి మీరు యిచ్చివెయ్యకపోతే దావాపడుతుంది. నిష్కారణం ఖర్చులు తగులుతవి.

అగ్ని- నేను అగ్రహారపుచెయ్యిని- దావాగీవా అని బెదిరించితే భయపడేవాణ్ణి కాను.

సౌజ- నామాటవిని ఆస్తియిచ్చివేసి, గిరీశంగారిమీద గ్రంథంచెయ్యడపు ప్రయత్నము మానుకుంటే, లుబ్ధావధాన్లుగారు మీమీద తెచ్చినకేసు తీయించివేస్తాను- మీ పిల్లమీద దయాదాక్షిణ్యాలు లేకపోతే, స్వలాభవైఁనా ఆలోచించుకోండి.

అగ్ని- వెధవముండని లేవదీసుకుపోయిన పకీరువెధవపక్షం మాట్లాడుతావు; యేవిఁపెద్దమనిషివయ్యా? నేనా కేసు వొదులుకుంఛాను? ఆవెధవగానీ కంటికి కనపడితే, కూనీచేస్తాను. పెద్దప్లీడరు ప్రత్యుద్ధానంచేసి పిలిచాడంటే, కేసుల్లో యేవిఁసలహా చెబుతాడో అని భ్రమపడ్డాను. వెధవముండలకి పెళ్లిచెయ్యడవు పోయీ కాలంపట్టుకుందేవిఁ, పెద్దపెద్దవాళ్లకి కూడాను?

సౌజ- లుబ్ధావధాన్లుగారి తరఫున మీమీద గ్రంథం నేనే నడిపించవలసివుంటుంది. మీకు వృధాగా డబ్బుతట్టుబడీ, సిక్షా, క్షూణతాకూడా సంభవిస్తాయిగదా అని యింతదూరం చెప్పాను. మంచికి మీరు మనుషులైనట్టు కనపడదు. గనక నా చాయశక్తులా పనిచేసి మీకు గట్టి సిక్ష అయేటట్టు గ్రంధంనడిపిస్తాను. పిల్లదాని ఆస్తి విషయమయి దావాకూడా నేనే పడేస్తాను.

అగ్ని- నీయింట కోడికాల్చా!

సౌజ- మీరు యేమన్నా, నాకు కోపంలేదు. యింటికివెళ్లి ఆలోచించుకొని, నా సహాయం కావలసివుంటే తిరిగీరండి.

అగ్నిహోత్రావధాన్లు (నిష్క్రమించుతూ తనలో)- వీడికి వెఱ్ఱిగాబోలు!

(తెరదించవలెను.)