కన్యాశుల్కము/సప్తమాంకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


శ్రీ

కన్యాశుల్కము

సప్తమాంకము


1- వ స్థలము: విశాఖపట్ణంలో వీధి.

(బైరాగీ, వెనుక పదిమంది శూద్రులూ ప్రవేశింతురు.)

రామన్న- యెక్కణ్ణించి యిజయం సేస్తున్నారు గురూ?

బైరాగి- కాశీనుంచిరా.

రామ- యెన్నాళ్లైంది గురూ?

బైరాగి- ప్రాతఃకాలం గంగసేవించి బయల్దేరామురా.

రామ- యింత యేగిరం యెలాగొచ్చినారు గురూ?

బైరాగి- పవనంబంధించి, వాయువేగం మీదవచ్చామురా.

బుచ్చన్న- యోగులికి సిద్దులుండవురా? యీయనేంరా, ఉప్పాకలోనూ సింవాచలంలోనూ మొన్న సివరాత్రికి వొక్కమారే అగుపడ్డారు.

లక్ష్మన్న- తెల్లోడు తీగిటపా యేసినాడు కాడ్రా? నిమేటికి వుత్తరం దేశదేశాలికి యెల్లదా?

బైరాగి- పామరులు! పామరులు!

రామ- వూరుకొస్సి- నీకేటెరిక- యెఱ్ఱినాకొడక.

బైరాగి- యీవూళ్లో తీర్థపురాళ్లరేవున రెండుమైళ్లులోసబురున ధర్మరాజువారు ప్రతిష్ఠచేసిన శివాలయం, కంచుదేవాలయం ఒకటి వున్నది. రాత్రి ఆదేవుణ్ణి శేవించుకుని, రేపు రామేశ్వరం వెళ్లిపోతాం. సదావృత్తి యక్కడ దొరుకుతుంది?

రామ- యీ ఊళ్లో మఠంలేదు గురూ. మేవంతుండగ తమకిలోపవేఁటి గురూ? కాశీ కబుర్లేటి గురూ?

బైరాగి- నాలుగురోజులు కిందట విశ్వేశ్వరుడి కోవిలలో ఒక బంగారపు రేకు ఆకాశంమీంచి పడ్డది. దానిమీద వ్రాసినలిపి బ్రాహ్మలికి యవరికీ బోధ అయిందికాదు. మేం చిత్తగించాం. సిద్ధులభాషని దానిమీద బంగారంచేసే యోగం వకటి కలకాలంబతికే యోగం వకటి వ్రాసివున్నాయి.

రామ- యేవాఁచ్చఱ్ఱెం! గురూ భోజినం యేటారగిస్తారు?

బైరాగి- పాలూ, పంచదారా, అరిటిఫలములూ, యీప్రకారం ఒకపక్షం ఫలహారం చేస్తాము. మరి పదిహేనురోజులు వాయుభక్షణ చేస్తాము.

రామ- ఒక్క మిట్టకాయలో పలారం జాగర్త చేస్తాం గురూ. మా రాంమందిరానికి దయసెయ్యాలి.

బైరాగి- పద- యీవూరి వింతలేవిఁటి?

లక్ష్మన్న- యేటీలేవ్‌- రావఁశంద్రపురం అగ్ఘురోరంలో ముసలిబాపనోడు ఆల్నిసంపేసినాట్ట. ఆడికీ దొంగసాచ్చీకం పలికినోళ్లకీ తాసీలుగోరికీ సిచ్చైపోతాదిట.

బైరాగి- యీవూరు పాపంతో నిండి వున్నట్టు కనపడుతూంది. యీ వూళ్లో మేము నిలవము.

రామ- లచ్చువుఁడు వెఱ్ఱోడు గురూ. ఆడిమాట నమ్మకండి. మీరెళ్లిపోతే మాలాటోళ్లు తరించడం యలాగ్గురూ? ఆళ్లీ వూరోళ్లుకారు.

బుచ్చన్న- ఆవూరి దుకాణదారుగారు అదుగో వొస్తున్నారు.

బైరాగి- యీవూళ్లో తాగడం లావుగావున్నట్టు కనపడుతుంది. మేము తాగుబోతులతో మాట్లాడం- ఆదుకాణదారు వచ్చేలోగా యీ సందులోకి మళ్లిపోదాం; రండి.

(దుకాణదారు పరుగునవచ్చి కలిసి బైరాగిమొలలో చెయివేసి పట్టుకొనును.)

దుకా- రూపాయలుకక్కి మరీ కదలాలి!

బైరాగి- యేమిటీవాళకం! వీడు తప్పతాగి పేలుతున్నాడు- నేను మొదటే చెప్పలేదా యీవూరి సంగతి? అంతా పాపంతో నిండివుంది! వేమన్న యేమన్నాడు. "తాగుబోతుతోడ! తగదెందునేస్తంబు"

రామ- (దుకాణదారుతో) భాయీ! మీకేటి, మతోయిందా? గురువుగోరికి దణ్ణవెఁట్టి లెంపలోయించుకొండి.

దుకా- గురువూలేదు, గుట్రాలేదు వూరుకోస్సి- యీడెక్కడ గురువు? నాదుకాణంలో సారా అంతా చెడతాగి డబ్బియ్యకుండా యెగేసినాడు.

రామ- మీకు మతోయిందా భాయి? ఆరేటి మీదుకాణంలో తాగడవేఁటి. కాశీనించి యిప్పుడే ఒచ్చినారుగదా?

దుకా- ఆకాశం బొక్కచేసుకుని వొచ్చాడుకాడూ? (బైరాగితో) డబ్బిచ్చి మరీ కదులు.

బైరాగి- మావంటి సాధులతో నీకు వాదెందుకు అబ్బీ? యవర్నిచూసి మేవఁనుకున్నావో! మమ్మల్ని పోలిన దాసరివాడొకడు, బైరాగి వేషంవేసుకుని యీ దేశంలో తిరుగుతున్నాడు. కిందటిమాటు మేం దేశసంచారం చేసినప్పుడు చూసి చివాట్లుపెట్టాం. నీకు డబ్బుమీద అంత కాపీనంవుంటే తులం రాగి తెచ్చుకో బంగారం చేసియిస్తాం. సంగోరు ధర్మఖర్చుచేసి సంగోరుతిను. లేకుంటే తల పగిలిపోతుంది.

రామ- యేం యెఱ్ఱిముండాపని చేసినారు భాయీ! బంగారం చేసేసిద్దులికి డబ్బులచ్చంటోయి? ఆరికాళ్లమీదపడి అలకతీరుసుకొండి.

దుకా- వుండోస్సి- యేడిసినట్టేవుంది. నీ సొమ్మేం పోయింది?

(హెడ్‌కనిష్టీబు ప్రవేశించును.)

హెడ్‌- యేమండోయి గురోజీ! మీరు దొరకడం నాకు దేవుఁడు దొరికినట్టుంది. ఇక బతికాను. మీతో కొన్ని జరూరు సంగతులు మాట్లాడాలి, రండి.

బైరాగి- భాయీ- మీరు వెనక్కుండండి. (దుకాణదారు తప్ప తక్కినవారు దూరముగా వెళ్లుదురు.)

దుకా- నాడబ్బిచ్చి మరీ మాట్లాడండి.

బైరాగి- నలుగురిలోనూ మర్యాదతియ్యడం ధర్మవేఁనా తమ్ముడా? యోగరహస్యాలు పామరుల దగ్గిరా వెల్లడిచెయ్యడం?

దుకా- డబ్బు యెగెయ్డపుయోగం నాదగ్గిరపారదు. రహస్యవేఁటి? ఆవిద్యకి అంతా గురువులే!

బైరాగి- వెఱ్ఱినరుడా! బైరాగివాళ్లకి మాకు డబ్బుమీద తనువుంటుందటోయి? ఒకళ్లకి యిచ్చేదీకానం- పుచ్చుకున్నదీకానం.

హెడ్డు- భాయీ! నీరూపాయలు నేనిస్తాను. తెలివిమాలిన మాటలాడకు. గురువుగారికి కళ్లుమొయ్యా ఆగ్రహవొఁస్తే మనం మండిపోతాం. మీరటుండా, వెళ్లండి. (బైరాగితో) గురోజీ! కూనీకేసు పీకలమీదికొచ్చింది. కేసూ, యేబుగ్గీ లేనిదే, ఆరాత్రి నాలుగురాళ్లు తడువుఁకుందావఁని మనం ఆ ముసలాణ్ణి అల్లరి పెట్టావాఁ? ఆతరవాత, తాసిల్దారొచ్చి "హాత్‌ హూత్‌" అని బెదిరించి పదిరాళ్లు లాగాడు. తన తాలూకుకంటె పెగిలిందికాదని రావఁప్పంతులుగాడు, యినస్పెక్టరికీ, పోలీసు సూపరెంటుకీ అర్జీలుకొట్టాడు. నిజంగా కూనీకేసు జరిగి వుండగా, మేవుఁ కామాపు చేశావఁని తాసిల్దారుమీదా, నామీదా యిప్పుడు పితూరీ చేస్తున్నారు.

బైరాగి- మేవుఁండగా మీకేం భయం, భాయి?

హెడ్డు- అందునేగదా, నాపాలిటి దేవుఁళ్లా మీరు దొరికారన్నాను.

బైరాగి- మీశత్రువులకు వాగ్భంధం చేస్తాను. వాళ్లపేర్లు వ్రాసియివ్వండి. యినస్పెక్టరుకి మీమీద యిష్టవఁని చెప్పేవారే?

హెడ్డు- యీపెద్ద వుద్యోగస్థులకి దయలూ దాక్షిణ్యాలూ యేవిఁటి గురూ? వాళ్లకి యంత మేపినా, వాళ్లకి కారక్టు వొస్తుందనిగాని, ప్రమోషను వొస్తుందనిగాని, ఆశపుట్టినప్పుడు, తెగనికత్తితో పీకలు తెగగోస్తారు. మా యినస్పెక్టరికి సూపరేంటుపని కావాలని ఆశుంది. తాసీల్దారికీ వాడికి బలవద్విరోధం వుంది. ఆవిరోధం మధ్య నన్ను కొట్టేస్తూంది.

బైరాగి- చూస్తూవుండండి రేపటినుంచి పతకం తిరిగిపోతుంది.

హెడ్డు- మీదయ, గురూ- సౌజన్యారావు పంతులుగారని ఓ గొప్పవకీలుగారున్నారు. ఆయన నాకు చాలాసాయం చేస్తున్నారు. కేసు తేలిపోయేసాధనం ఆయన వొకటి చెప్పారుగాని, అది కుదరక తల్లడిల్లుతున్నాం.

బైరాగి- యెమిటండి, ఆసాధనం?

హెడ్డు- పరారీ అయిపోయిన ఆపిల్లదాన్ని తండ్రి గుంటూరు శాస్తుల్లని ఒకడు వున్నాడు. అతగాడు దొరికితే, కేసు పోతుంది. వాడు యక్కడా కనపడ్డు.

బైరాగి- యిదెంతపని, రాత్రి అంజనంవేసి ఒక్కక్షణంలో కనుక్కుంటాను.

హెడ్డు- అలారక్షించు గురూ. ఆ కుఱ్ఱాడు- అనగా ఆచిన్నది- యిప్పుడు యెక్కడుందో కనుక్కోగలరూ, గురూ?

బైరాగి- అదీ అంజనంలోనే కనపడుతుంది.

హెడ్డు- అది మొగాడయినా, ఆడదయినా కూడా కనపడుతుందా గురూ?

బైరాగి- ఆడది మొగాడెలా అవుతుంది భాయీ?

హెడ్డు- (తనలో) చెబితే యేం ప్రమాదవో? (పైకి) యీ చిక్కుల్నించి మతిపోతూంది గురూ. దయచేండి, యింటికెళదాం.

బైరాగి- యీశిష్యులకి కొంచం జ్ఞానోపదేశం చేసి మరీవస్తాను. మీరు ముందు నడవండి.

హెడ్డు- యీకార్యం అయిందాకా మీపాదాలు వొదలను- కార్యవైఁతే తమరు హరిద్వారంలో కట్టిస్తూన్న మఠానికి నూటపదహార్లు దాఖలుచేస్తాను.

(అందరూ నిష్క్రమింతురు.)

2- వ స్థలము. డెప్యూటీకలెక్టర్‌ కచేరీ.

(డిప్టీకలక్టరు, వకీళ్లు, బంట్రౌతులు, మొదలైనవారు ప్రవేశింతురు.)

భీమారావు- నాకు మునసబుకోర్టులో కేసున్నది, వొక అర్జీ దాఖలుచేసి శలవు పుచ్చుకుంటాను.

కలెక్టర్‌- కోర్టువారికి అవకాశం అయేవరకూ వుండలేని వకీళ్లు కేసు యెందుకు దాఖలుచేయవలె? ఇది చెప్పినట్టల్లావచ్చే కోర్టనా మీయభిప్రాయం.

భీమా- చిత్తం, చిత్తం, తమ ప్రిడిశెసర్లు అలాగు గడుపుతూవచ్చేవారు.

కలె- ఆఫీస్‌పనిచూసుకుని పిల్చేవరకూ ఉండండి.

అగ్నిహో- (రామప్పంతులుతో) యేమండోయ్‌ మన కొత్తవకీల్ని కోప్పడుతున్నారే?

రామప్ప- (అగ్నిహోత్రావధానులుతో) యీ అధికార్లనైజం యేమిటంటే యెవళ్లమీద దయవుండి యెవళ్లపక్షం కేస్‌చెయ్యాలంటే వాళ్లని కరవ్వొచ్చినట్టు కనపడతారు. మీరు కోరట్లసంగతంతా తెలుసునంటారే? యిదేనా మీఅనుభవం?

అగ్నిహో- (గట్టిగా) అవునవున్నాకు తెలుసును.

కలె- యెవరా మాట్లాడుతున్నమనిషి?

నాయడు- (లేచి) తక్‌షీర్‌ మాఫ్‌చేస్తే మనవిచేస్తాను. యీయన కృష్ణారాయపురం అగ్రహారంకాపురస్తుడు, నులక అగ్నిహోత్రావధాన్లుగారు; మహా (అ)యోగ్యమైన బ్రాహ్మడు, జటాంతస్వాధ్యాయి, యీయనే లుబ్ధావధాన్లుగారికి తన కొమార్తెను పద్ధెనిమిదివందల రూపాయిలకు కన్యాదానం చేయడానికి బేరమాడుకుని, కాబోయే అల్లుడికి దేహశుద్ధిచేశారు; అందుకే యీమధ్య లుబ్ధావధాన్లుగారు యేలినవారి కోర్టులో ఛార్జీ దాఖలుచేశారు. అందులో ముద్దాయీ యీ మహానుభావుడే! మల్లవరంలో సహస్రమాసజీవైన వక బ్రాహ్మణశ్రేష్టుడుంటే, ఆయనకు తన పెద్దకుమార్తెను కన్యాదానంచేసి, రెండుపిల్లికూనలు స్వీకరించేటప్పటికి పెళ్లిలోనే ఆ బ్రాహ్మడిపుణ్యం అంతామూడి పరంపదం వీంచేశాడు. ఆపిల్లదాని తరఫున భూములకొరకు దావాతెచ్చారు. వీరు తమవంటి గవర్నమెంట్‌ ఆఫీసర్లకి తరుచుగా పనిగలుగచేసి ప్లీడర్లని పోషిస్తూవుంటారు, వీరి యోగ్యత లేమి, వీరి దయాంతఃకరణ లేమి, వీరి సరసత లేమి, మరియెన్నడమునకు శేషుడికైనా అలవికాదు. వారితరఫున కేసు దాఖలుచెయ్యడంకోసమే భీమారావు పంతులుగారు కోర్టుకు దయచేశారు. (విరసముగా నవ్వి కూరుచొనును.)

కలె- బలే శాబాష్‌ (గుమాస్తాతో) ఏదీ భీమారావు పంతులుగార్ని ప్రియాదు అర్జీ దాఖలుచేయమను. (గుమాస్తా పుచ్చుకొని దాఖలుచేయును.)

కలె- (కాగితమందుకొని) యేమిటయ్యా కేసుస్వభావం?

భీమా- చిత్తం, యీయన వెధవకొమార్తెని, యీయన కొమారుడికి చదువుచెప్పే గిరీశం అనేఆయన అలంకారాలూ, ఆస్తితోకూడా లేవతీసుకు వెళ్లిపోయినాడు.

అగ్నిహో- దస్తావేజులూ, కోర్టుకాయితాలూ కూడానండి.

కలె- యేమిటి! ఆ, హా, హా, హా, హా, (నవ్వుచు బూట్సునేలపైతట్టును) బలే శాబాష్‌ (అర్జీచూచుకొని) యిన్నాళ్లేమి చేస్తున్నారు?

భీమా- తహస్సీల్దార్‌గారిదగ్గిర నేరంజరిగిన మూడోరోజునే మున్సబుకోర్టు వకీలు వెంకట్రావుపంతులుగారు, ఛార్జీ దాఖలుచేస్తే ఆ తహస్సీల్‌దారుగారు కేస్‌ స్వభావం యేమిటని అడిగినారు. ఎబ్‌డక్‌షన్‌ అని వెంకట్రావు పంతులుగారు చెప్పేసరికి యింగ్లీషు రాకపోవడంచాత, తహస్సీల్దారుగారు ఆమాటయెప్పుడూ విన్లేదనిచెప్పారు. తరవాత కేస్‌ స్వభావం తెలుగునచెప్తే యీలాటినేరం మా జూరిస్‌ డిక్‌షన్‌లో జరగదు, తోవలో రోడ్డుమీద యేతాలూకా సరిహద్దులో యెత్తుకుపోయినాడో అని అర్జీ దాఖలుచేసుకున్నారుకారు. లుబ్దావదాన్లుగారి కూనీకేసు కామాప్‌చేసిన తహస్సీల్దారుగారే యీయనండి.

నాయుడు- ఇంగ్లీష్‌రాకపోతేనేమండి? తహస్సీల్దారుగారు యెంతప్రాజ్ఞులు. పూర్వపు యూరోపియన్‌ అధికార్లని యెంతమందిని మెప్పించారు! ఆయన లుబ్ధావధాన్లుగారి కేసు కామాప్‌చేశారని భీమారావు పంతులుగారు అంటున్నారు. యింకా యిన్క్వైరీ అవుతూవున్న కేసులో అలా అన్నందుకు యీయనపైని తహస్సీల్దారుగారు పరువునష్టం ఛార్జీతేవడమునకు వీలువున్నది.

కలె- (భీమారావువైపు జూచి) పిల్లకు పదహారు సంవత్సరములకు లోపుయీడని రుజువున్నదా?

భీమా- జాతకంవుందండి.

నాయుడు- కోర్టువారు ఆజాతకం దాఖలుచేసుకోవాలి.

భీమా- యీకేసులో ఆయన మాట్లాడుతూవుంటే నే ఎంతమాత్రం వొప్పేదిలేదు.

నాయుడు- యీకేసులో నాక్కూడా వకాల్తినామా వుందండి (అని దాఖలు చేయును.)

భీమా-(అగ్నిహోత్రావధాన్లుగారితో)ఏమయ్యా యీయనక్కూడా వకాల్తీ యిచ్చావయ్యా.

అగ్నిహో- మొదటా, రామప్పంతులు యీయన కిప్పించారు.

భీమా-(అగ్నిహోత్రావధాన్లుగారితో) అయితే యేడువు.

(అగ్నిహోత్రావధాన్లు తెల్లపోయిచూచును.)

కలె- యేదీ జాతకం దాఖలుచెయ్యండీ.

(భీమారావుపంతులు దాఖలు చేయును.)

నాయుడు- కోర్టువారితో వకసంగతి మనవిచేసుకుంటాను. యీ జాతకం విశ్వామిత్రుడంత యోగ్యుడైన బ్రాహ్మడిచేత తయారుచెయ్యబడ్డది. అదుగో ఆమూల నిలబడ్డ రామప్పంతులుగారికి యీ జాతకంలో మంచిప్రవేశం వుందండి.

భీమా- నేను పేన్ డ్ వకీల్ని. కేసు హీరింగు నేనే చేయవలెనుగాని, నాయుడుగారు చేస్తే నేనెంతమాత్రం వొప్పేదిలేదు.

నాయ- స్మాలెట్‌దొరగారి దగ్గిర్నుంచీ యేజన్సీ కోర్టులో వకాల్తీ చేస్తున్నాను. డబ్బుచ్చుకున్నందుకు నాపార్టీ తరఫున నాలుగుమాటలుచెప్పి తీరుతానుగాని యింగ్లీష్‌ చదువుకున్న కొందరువకీళ్లలాగ నోటంట మాట్రాకుండా కొయ్యలాగ నిలబడనండి.

కలె (అగ్నిహోత్రావధానుల వైపుజూచి)- మీ కొమార్తె, యేసంవత్సరమందు పుట్టిందయ్యా?

అగ్ని- ఆంగీరస.

కలె- జాతకంలో భావవుందే? బ్రాహ్మణ్యం పరువంతా తీసేస్తిరే. గడ్డితిని పిల్లనమ్ముకున్నావు సరే కాని, యీలాటి ఫోర్జరీలుకూడా చేయిస్తావూ? బ్రాహ్మల్లో వున్నంత ఖంగాళీ, మాలకూడూ మరెక్కడాలేదు. నీదుర్మార్గతవల్ల నీకుమార్తెను యీ అవస్థలోకితెచ్చి మళ్లీ ఎబ్‌డక్‌షన్‌ కేసుకూడానా? నీపొట్ట కరిగించేస్తానుండు. (గుమాస్తాతో) కేసులో నోటీస్‌లు చెయ్యి.

గుమా- (ఛార్జీకాగితముజూచి) యిందులో ముద్దాయీ యింటిపేరూ సాకీనూ లేదండి.

నాయ- (లేచి) యీ అర్జి వల్లకాట్లో రామనాధాయ వ్యవహారం లాగుంది. ఇంగ్లీషు వకీళ్లు దాఖలుచేసే కాకితాలు యీరీతినే వుంటాయండి.

భీమా- (గుమాస్తాతో రహస్యముగా) తరవాయీలు నింపించలేదుటయ్యా? (పైకి) యీలా నాయుడుగారు నన్ను తూలనాడుతూంటే కోర్టువారు ఊరుకోడం న్యాయంకాదు.

కలె- నాయుడుగారు మిమ్ము నేమీ అన్లేదే?

భీమా- (తనలో)యిక్కడికి నేనురావడం బుద్ధిపారపాటు.

క్లార్క్‌-(భీమారావు పంతులుగారితో) ఇంటిపేరూ, సాకీనూ యేమిటండీ?

భీమా- (అగ్నిహోత్రావధాన్లుగారితో) ఏమిటయ్యా?

అగ్నిహో- ఆయనపేరు గిరీశం, మరంతకంట నాకుతెలియదు.

కలె- చాబాష్‌; బాగావుంది! అవధాన్లుగారి కొమార్తెని యెవడో తీసుకుపోయినాడు. కనక వాడి వూరూపేరూ యెరిగినవాళ్లు తెలియచెయ్యవలసినదని, దండోరా కొట్టించి గేజట్లో వేయించండి. పోలీసువారికి యెందుకు నోటీసివ్వలేదూ! సాకీనూ మొదలైనవి లేనిదే కేసు యడ్‌మిట్‌ చెయడానికి వీలులేదు. టిఫిన్‌కి వేళయింది లేదాము (అనిలేచి వెళ్లిపోవును.)

అగ్నిహో- (భీమారావు పంతులుగారితో) ఏమండోయ్‌ కేసు అడ్డంగా తిరిగిందే?

(భీమారావు పంతులుగారు మాట్లాడరు.)

అగ్నిహో- యేమండోయి మీతోటి, మాట్లాడుతున్నాను.

భీమా- ఇచ్చినఫీజుకు పనైపోయింది; మళ్లీ ఫీజిస్తేనేకాని మాట్లాడేదిలేదు.

అగ్నిహో- యేంపనైంది అఘోరంపని? కలక్టరు చివాట్లు పెడతూంటే ముంగిలా మాట్లాడక వూరుకున్నావు!

భీమా- బంట్రోత్‌! యితన్ని నాదగ్గిరికి రాకుండా గెంటేయ్‌.

అగ్నిహో- ఓహో బాగుంది వ్యవహారం! రామప్పంతులేడీ?

నాయుడు (మెల్లగా వెనుకనుండివచ్చి)- పోర్జరీ మాటరాగానే సన్నసన్నంగా జారారు. యీపాటికి వారివూరికి సగంతోవలో వుంటారు.

అగ్ని- అయ్యో కొంపతీశాడే!

నాయుడు- ఇంగ్లీషువకీలు సరదాతీరిందా? పోర్జరీకి తమక్కూడా మఠప్రవేశం అవుతుంది.

అగ్ని- అయ్యో నీయింట కోడికాల్చా.

నాయుడు- రోజూ కాలుస్తూనేవుంటారు.

(తెరదించవలెను.)

3- వ స్థలము. సౌజన్యారావు పంతులుగారి కచేరీగది.

(సౌజన్యారావు పంతులుగారూ, పోలిశెట్టి ప్రవేశింతురు)


సౌజ- చూశారా శెట్టిగారూ. యిప్పటి రోజుల్లో దేవ బ్రాహ్మణభక్తి కోమట్లలోనే వున్నది. లుబ్ధావధాన్లుగారు బ్రాహ్మలు, వృద్ధులున్నూ- ఆయనను కాపాడితే మీకు చాలా సుకృతం వుంటుంది.

పోలిశెట్టి- బాబు- తమశలవు కబ్బెంతర వేఁటి?

సౌజ- చూశారా, మీరు సాక్ష్యంచెప్పి ఆయన్ని యీ ఆపదలోంచి తప్పించకపోతే, నిజం దాచినందువల్ల ఆయనకి యేమి ప్రమాదం వచ్చినా, ఆపాపం మిమ్మల్ని చుట్టుగుంటుంది.

పోలి- అబ్బెంతరవేఁటి? బాబూ!

సౌజ- నిజంగా కూనీ జరగలేదని మీనమ్మకవేఁకదూ?

పోలి- అబ్బెంతరవేఁటి? బాబూ!

సౌజ- ఆపిల్ల గోడదాటి పారిపోవడం మీరు చూశారుగదూ?

పోలి- అబ్బెంతరవేఁటి బాబూ?

సౌజ- మీరు అప్పుడు గుడ్డెమీదికి బాహ్యానికి వెళ్లివున్నారు?

పోలి- అబ్బెంతరవేఁటి బాబూ?

సౌజ- మీరు బాహ్యానికి వెళ్లినప్పుడు, సహాయానికి మీ నౌఖరునుకూడా తీసుకువెళ్లారు?

పోలి- అబ్బెంతరవేఁటి బాబూ?

సౌజ- (కలంకాగితంతీసి) యీ సంగతులే వ్రాస్తాను. చెప్పండి.

పోలి- యేటి బాబూ?

సౌజ- మీరు చెప్పబోయే సాక్ష్యానికి స్టేటుమెంటు కట్టుగుంటాను. జరిగినది అంతా చెప్పండి- వ్రాస్తాను.

పోలి- మా యింట్లోళ్లకి ఉడ్డోలవైఁన జబ్బుగావుందని కబురెట్టారు, బాబూ. నాకు సేతులు కాళ్లు ఆడకుండున్నాయి. బండీ కుదుర్చుకొచ్చాను- శలవిప్పించండి- యీ సాచ్చీకాల్లో తిరిగితే పిల్లాపేకా బతుకుతారా బాబూ?

సౌజ- యింతసేపూ చెప్పారుకారేమి? రుగ్మతనిజమే ఐతే చాలా విచారవైఁన సంగతి- మీకు సాక్ష్యం యెలాగా తప్పదు. చెప్పేమాటలు ముందు వ్రాసుకుంటే మంచిది. లేకుంటే బోనెక్కినతరవాత తత్తరపడిపోతారు. పదినిమిషములు పట్టదు. చెప్పండి వ్రాస్తాను.

పోలి- సాచ్చీకం తప్పదు బాబూ?

సౌజ- యలా తప్పుతుందీ? నిజంతెలిసినవారు సాక్ష్యం పలకకపోతే మరియవరు పలుకుతారు?

పోలి- బాబూ- తమరు పెద్దవొకీళ్లూ, కోవఁటోడి మాటని కొట్టెయక, యింటారా?

సౌజ- వినకేమి?

పోలి- నిజవేఁటిబాబూ? అబద్దవేఁటి బాబూ? నేను చూసి నిజవాఁ చెప్పినాను? గుడ్డిమీదికేటి నిశిరాత్రేళ నేను బైటకెల్డవేఁటి? జువ్విచెట్టుమీద పిశాచం అమాంతంగా సంపేసిపోదా! బాబూ? యేటిబాబూ సాచ్చీకానికి ముండ పోలిశెట్టి పోలిశెట్టే సెప్పాలా సాచ్చికం బాబూ? తమంటి అధికార్లనిచూస్తే, పాణం యెగిరిపోతుందిగదా? తమరు తలిస్తే సాచ్చీకానిక్కొదవా? బాపనోళ్లు నచ్చాపనచ్చలు. కొంచం సెయితడిజేస్తే సాచ్చీకం చెప్పేసిపోతారు బాబూ-

సౌజ- యీపాటి చాలించండి. దొంగసాక్ష్యాలు నాదగ్గిర పనికిరావు. నిజంతెలిసిన సాక్షులే నాకు కావాలి.

పోలి- ఆపాటిమాట యెవరు సెప్పినారుకారు బాబూ; నిజం నాకేమీతెల్దు, యేదేవుఁడు నెత్తికొట్టమంటే ఆ దేవుఁడు నెత్తికొడతాను బాబూ.

సౌజ- మరి యెరుగుదువఁని యెందుకు చెప్పారూ?

పోలి- బాబూ, సెప్పనంటే కనిష్టీబోళ్లు ఊరుకున్నారా?

సౌజ- యిప్పుడు మాత్రం వూరుకుంటారా?

పోలి- చెప్పితే, యిన్నీసిపికటరు పీకపిసికెయ్డ బాబూ?

సౌజ- చెప్పకపోతే హెడ్డుకనిష్టీబు పీకపిసకడా?

పోలి- అధికార్లేటి చెయ్మంటే, మాలాటోళ్లు అదల్లా సెయ్యాలిగదా బాబూ- లేకుంటే పీక్కురిగదా? "పోలిశెట్టీ, సాచ్చీకం సెప్పాలి" అని హెడ్డుగారంటే, సిత్తం బాబూ అనాలి; "పోలిసెట్టీ, కబడదారు, సాచ్చీకంచెప్పితే సంపేస్తాను," అని యిన్నీసిపికటరుగారు అంటే, సిత్తం బాబూ అనాలి. "హెడ్డుగారిని బదిలీ చేస్తాం. మరి భయపడకు," అంటే, సిత్తం బాబూ అనాలి. ఆరాత్రి నేనూళ్లోవున్నానా బాబూ? లింగోరం సంతకి పోలేదా?

సౌజ- మీ సాక్ష్యాన్ని నమ్ముకుని, లుబ్ధావధాన్లుగారికి నేను ధైర్యం చెప్పానే?

పోలి- గొప్పధికార్లు! తమరు తలిస్తే ఆరికి నోటేటి బాబూ? కోవిఁటాడి మాటకొట్టెయ్కండి బాబూ, తమవంటోరుతలిస్తే, బాపన సాచ్చీకాలు నచ్చాపనచ్చలు.

సౌజ- మీయోగ్యత తెలిసింది. చాలు, యీపాటి వెళ్లండి.

పోలి- (లేచినిలబడి)కోపవాఁబాబూ? మేం బతగ్గలవాఁ? ఆవునెయ్యి బాబూ గుమగుమలాడేది ప్రతోరం పంపించుకుందునా బాబూ?

సౌజ- మీయినస్పెక్టరికి పంపండి.

పోలి- (వెళ్లిపోతూ)ఆరంతోరు ఆరూ, తమంతోరు తమరూ. మాకిద్దరొహటిగాదా?

సౌజ- చాలును వెళ్లండి, వెళ్లండి.

పోలి- తమక్కోపవొఁస్తే, బతగ్గలవాఁ బాబూ. (గుమ్మందాటి) బతిగాన్రా దేవుఁడా! పెందరకాళె యింటికిపోయి యెంకటేశ్శర్లుకి, అరశటాకునెయ్యి దివ్వెలిగిస్తాను.

(నిష్క్రమించును.)

4- వ స్థలము. వీధి.

(అగ్నిహోత్రావధాన్లు, నాయడు ప్రవేశింతురు.)

అగ్ని- అషైతే కేసు మానుకొమ్మంఛారూ?

నాయడు- లేకపోతే మీకు చాలా వుపద్రవం సంభవిస్తుంది. ఆ యింగిలీషు వకీలు అంతా పాడుచేశాడు.

అగ్ని- అయితే రావఁప్పంతులు వుడాయించేసినట్టేనా?

నాయడు- అందుకు సందేహవేఁవిఁటి?

అగ్ని- నాకడియం, పట్టుకుపోయి తాకట్టుపెట్టాడు?

నాయడు- దానికి నీళ్లధారే.

అగ్ని- అయ్యో! ఆకడియం మాతాతనాటిది. మీరు మొన్నదిడ్డీతోవంట వొచ్చారే, ఆ సాందాని యింట్లో తాకట్టుపెట్టాడు.

నాయ- రామ! రామ! ఆసరుకు దానిదగ్గిర వుంచేలేదు. మీది మిక్కిలి దానితాలూకుకంటె వకటి వాడే తీసుకుపోయి యక్కడో తాకట్టుపెట్టాడు. ఆ తాగుబోతు మీకెలా దొరికాడు?

అగ్ని- రావఁప్పంతులు తాగుఛాడా?

నాయ- మరి కడియం, కంటెకూడా తాగేశాడుకాడా?

అగ్ని- వీడిసిగతరగా!

నాయ- అవునుగాని, మీమీద పోర్జరి కేసు ఖణాయించకుండా డిప్టీ కలక్టరుగారితో సిఫార్సు చేశానుగదా, నాకేమిస్తారు?

అగ్ని- యేవిఁచ్చేది? నాభి కొనుక్కోడానికి దమ్మిడీ అయినా నాదగ్గిరలేదు. వూరికిచేరితేగాని డబ్బుపెగల్దు.

నాయ- పోనియ్యండి. ఒక ప్రోమిసరీనోటు రాయండి; రూపాయలు యిప్పిస్తాను.

అగ్ని- నా ప్రాణంపోతే నోటురాయను. అప్పుపత్రం రాయనని మాతండ్రి చచ్చిపోయేటప్పుడు నాచేత ప్రమాణంచేయించాడు.

నాయ- అయితే మీతోకూడా మీవూరువస్తాను- వకబండెడు ధాన్యం యివ్వండి.

అగ్ని- డబ్బూ, దినుస్సూకూడా వొకీళ్లనెత్తినికొడితే, యేటికేడాదీ బతకడం యలాగు? రెండుపుట్లు మిరపకాయలిస్తాను.

నాయ- అదైనా యెంతకాదు. ఖరారేనా?

అగ్ని- అగ్నిహోత్రావధాన్లు, అన్నమాట తప్పుఛాడా? లుబ్ధావధాన్లు నన్ను పకీర్నిచేశాడు- వాడికి సిక్షకాదేం?

నాయ- అవునుగాని, సౌజన్యారావు పంతులుగారు అతడికి సాయం చేస్తున్నారు. అధికార్లంతా ఆపంతులుమాట వింటారు.

అగ్ని- ఆపంతులు అవుధాన్లుకూతుర్ని పెళ్లాడఛాడా యేమిషి?

నాయ- ఆయన ప్రాలుబ్ధం, దాన్ని పెళ్లాడతాడా?

అగ్ని- మరియెందుకు, లుబ్ధావుధాన్లు మీదపడి యేడుస్తాడు?

నాయ- సౌజన్యారావు పంతులుగారు మహాదొడ్డవారు. కోట్లలో యెన్నవలిసిన మనుషులు. ఆపదలోవున్న యెవరికైనా ఆయ్న ఉపకారం చెయ్యవలసినవారే!

అగ్ని- అషైతే, వెధవముండని పెళ్లాడిన చావాటుపీనుగును వెనకేసుకుని, నాపీక యెందుకు నొక్కుచున్నాడు?- అడుగో ఆ గాడిదకొడుకు!

(గిరీశం తొందరగా ప్రవేశించును. అగ్నిహోత్రావధాన్లు పక్కనుంచి గిరీశం మీదపడును. గిరీశం తప్పించుకుని కిందికిజారి, అగ్నిహోత్రావధాన్లు కాళ్లుబట్టిలాగి "మావఁగారికి నమస్కారం" అని పరుగుచ్చుకొనును. అగ్నిహోత్రావధాన్లు కిందపడును.)

నాయ- అల్లుడుగారా యేవిఁటండి? (లేవదీసి వొళ్లుదులుపును.)

అగ్ని- వీడిశ్రాద్ధం చెట్టుకిందబెట్టా! యేడీ, వెధవని చంపేస్తాను?

నాయ- అల్లుణ్ణి హతవాఁరిస్తే, కూతురు డబ్బిల్‌ వెధవౌతుంది. శాంతించండి.

అగ్ని- నీయింట కోడిగాల్చా!

నాయ- అమోఘాశీర్వచనము! పదండి.


5- వ స్థలము. లుబ్ధావధాన్లు బస.

లుబ్ధా-రామనామతారకం । భక్తిముక్తిదాయకం ॥

(గిరీశం ప్రవేశించి లుబ్ధావధాన్లును కౌగలించుకొని "అన్నయ్యా" అని యేడ్చును.)

లుబ్ధా- యిదేవిఁట్రా?

గిరీశం- నీమీద కూనీకేసు వొచ్చిందని తెలిసి నిద్రాహారం లేకుండా యకాయకీని వొచ్చాను. మా అన్నయ్యకీ వాళ్లకీ కబురు పంపించావు కావేవిఁ?

లుబ్ధా- యెవడేంజెయ్యాలి? అన్నిటికీ సౌజన్యారావు పంతులుగారే వున్నారు. అయితే అబ్బీ, అగ్నిహోత్రావధాన్లుగాడి కూతుర్ని లేవదీసుకు పోయినావట్రా? వాడికి తగినశాస్తి చేశావు. దాన్నిగానీ పెళ్లిమాత్రం ఆడలేదుగద?

గిరీశం- నేనంత తెలివితక్కువపని చేస్తాననుకున్నావా, అన్నయ్యా? నువ్వు నన్నేదో పెంచుకుంటావనీ, పెళ్లి చేస్తావనీ మావాళ్లు కొండంత ఆశపెట్టుకున్నారుగదా?

లుబ్ధా- యీగండం గడిస్తే పెంపకంమాట ఆలోచించుకోవచ్చును.

గిరీశం- (గద్గదస్వరంతో)సౌజన్యరావు పంతులుగారు చెప్పినమాటలుచూస్తే, యీగండం గడుస్తుందని నాకు ధైర్యం తాళకుండావుంది. నీకు కావలసినవాణ్ణీ, చదువుకున్నవాణ్ణీ, బుద్ధిమంతుణ్ణీ గనక నీకు మంచి సలహా చెప్పమని సౌజన్యారావు పంతులుగారు నాతో మరీమరీ చెప్పారు.

లుబ్ధా- ఆయన్ని చూశావురా?

గిరీశం- "చూశానా" అనా అడుగుతున్నారు? ఆయనదగ్గిరికి పెద్దసిఫార్సు తీసుకువొచ్చాను. ఆయనకి నామీద పుత్రప్రేమ. ఆయనకేమీ పాలుపోకనే, నన్ను మీతోటీ, హెడ్డు కనిష్టీబుతోటీ మాట్లాడి, మంచి సలహా యిమ్మని పంపించారు. గనక నామాటవిను యెందుకైనా మంచిది, ఒక దత్తత పత్రికరాయి- కన్నకొడుకు లేనందుకు, ఉత్తరగతి చూసుకోవాలా లేదా?

లుబ్ధా- నాకువున్న బంధువులంతా నాదగ్గిర డబ్బులాగాలని చూసేవారేగాని, నాకష్టసుఖాలకి పనికివొచ్చేవాడు ఒక్కడయినా కనపడ్డు.

గిరీశం- ఒహణ్ణెత్తినైనా యెన్నడైనా, ఓదమ్మిడీ కొట్టిన పాపాన్ని పోయినావూ? నేనొక్కణ్ణేగద, నీమీద అభిమానం పెట్టుకు దేవులాడుతున్నాను. మిగతా నీ బంధువులకి యెవరికైనా నీమీద పిసరంత అభిమానం వుందీ? చెప్పు.

లుబ్ధా- లేకపోతే పీడానాడాకూడా పాయెను.

గిరీశం- నేమట్టుకు నీదగ్గిర ఒక్కదమ్మిడీ యెన్నడూ ఆశించలేదు. నీపరంకోసం దత్తత చేసుకోమన్నాను. నన్ను కాకపోతే మరొకణ్ణి చేసుకో.

లుబ్ధా- యిహం యింతబాగా వెలిగింది; పరంమాట బతికివుంటే ముందు చూసుకుందాం.

గిరీశం- సౌజన్యరావు పంతులుగారు నీకు మంచిసలహా యిమ్మని శలవిచ్చారు గనక నీతో యీమాట చెప్పాను; అంతేగాని, ఆప్తులు చెప్పినమాట నువ్వు వినవన్న మాట నాకు బాగా తెలుసును- పోనియ్యి- మరోమాట చెబుతాను. అది ఐనా, చెవినిబెట్టు- నీకొకవేళ, సిక్ష అయితే, నీతరఫున, నీవ్యవహారాలూ సవహారాలూ, చూడడానికి యవడైనాఒకడు వుండాలాలేదా? నీ బంధువుల్లోకల్లా యింగిలీషు వొచ్చినవాణ్ణీ వ్యవహారజ్ఞానం కలవాణ్ణీ నేను వొక్కణ్ణేగద? నాకో పవరాఫ్‌టర్నామా గొలికి యిచ్చెయ్యి.

లుబ్ధా- నువ్వెందుకు నన్ను దుక్ఖంలోవున్నవాణ్ణి, మరింత దుక్ఖపెడతావు? అన్నిటికీ నాకు సౌజన్యారావు పంతులుగారు వొక్కరే వున్నారు. ఆయన యేలా చెబితే ఆలా చేస్తాను.

గిరీశం- నేనన్నమాటా అదేకదూ? ఆయన చెప్పినట్టు నువ్వేవిఁటి, నేనేవిఁటి, యవరైనా వినవలసిందే. యీ రెండుసంగతుల విషయమయీ, ఆయన సలహా తప్పకుండా అడిగి, వారు యలా శలవిస్తే అలా చేదాం? యేవఁంటావు?

లుబ్ధా- యిప్పటి నాచిక్కుకు పనికొచ్చేమాట ఒక్కటి లేదుగద.

గిరీ- మరి యెందుకొచ్చా ననుకొన్నావు యింతదూరం? నేను నాడువ్రాసిన వుత్తరపు సంగతులు నువ్వు ఆలోచనలోకి తెచ్చివుంటే, యీచిక్కులు నీకు రాకపోనుగదా?

లుబ్ధా- అప్పుడు గడ్డితిన్నాను.

(హెడ్డు కనిష్టీబు, దుకాణదారు ప్రవేశించి)

హెడ్డు- అవుధాన్లూ- ఈయనెవరు?

లుబ్ధా- నాతమ్ముడు.

హెడ్డు- నాకేం తోచకుండావుంది బైరాగీ మాయవైఁపోయినాడు.

లుబ్ధా- అయ్యో! మరేవిఁటి సాధనం?

హెడ్డు- అదే ఆలోచిస్తున్నాను.

లుబ్ధా- యెక్కడికి వెళ్లాడో?

హెడ్డు- శ్రీజగన్నాధస్వామివారి శలవౌతూందిఅని యీ వుదయంనుంచీ అంటూ వొచ్చాడు.

దుకా- సారాదుకాణాల్లో యెతికితే, దొరుకుతాడు.

హెడ్డు- అదేంమాట భాయీ. సిద్ధులు యేంజేసినా, వారికి తప్పులేదు. యేదుకాణంలోనూ కూడా కానరాలేదు.

దుకా- ఆలాగైతే అనకాపల్లి రోడ్డుకాసి యెతకండి.

గిరీ- బైరాగి యెందుకయ్యా?

హెడ్డు- ఆయన అంజనంవేసి గుంటూరుశాస్తుల్లునీ, వాడికూతుర్నీ చూపించాడు.

గిరీ- డామ్‌నాన్సెన్సు- గ్రోస్‌ సూపర్‌స్టిషన్‌- యీ వెఱ్ఱికబుర్లు యేదొర నమ్ముతాడు?

హెడ్డు- దొర్లు నమ్మకపోతే పోయేరు. ఆగుంట బతికివుందనీ, ఫలానాచోట వుందనీ మనకి ఆచోకీ తెలిస్తేచాలదా?

గిరీశం- ఇగ్నోరెన్స్‌! యేమి ఆచోకీ తెలిసింది?

హెడ్డు- ఆపిల్ల ఒక పూరియింట్లో కుక్కిమంచంమీద కూచుని యేడుస్తూన్నట్టు కనపడ్డది.

గిరీశం- మీకే కనపడ్డదా?

హెడ్డు- నాకెలా కనపడుతుంది? పాపంపుణ్యం యెరగని చిన్నపిల్లవాళ్లకే కనపడుతుంది.

గిరీశం- లోకం అంతటా పూరియిళ్లూ కుక్కిమంచాలూ వుఁన్నవిగదా, యేవూరని పోల్చడం?

హెడ్డు- యీరాత్రి మళ్లీఅంజనంవేసి వూరుపేరు చెప్పిస్తానన్నారు.

గిరీశం- యవిడెన్సు ఆక్టులో అంజనాలూ, పిశాచాలూ సాక్ష్యానికి పనికొస్తాయిటయ్యా.

హెడ్డు- ఆబైరాగీని మీరెరగరు; ఆయన గొప్పసిద్ధుడు- యేంజెయ్యాలంటే అది చెయ్యగల్డు- అతడు పక్కనివుంటే నాకు కొండంత ధైర్యంవుండేది. జగన్నాధస్వామిని సేవించుకుని సాయంత్రానికి ఆయనవొస్తే, నేను అదృష్టవంతుణ్ణి.

గిరీశం- పదిరోజులు ప్రయాణంగదా, ఒక్కరోజుకిపోవడం రావడం యలాగ?

హెడ్డు- ఆయనకి వాయువేగంవుంది.

దుకా- అప్పులాళ్లు అగుపడితే, వాయువేగంగా యెగేస్తాడు; నాబాకీ వొసూలు చేసుకోనిచ్చినారుకారు గదా భాయీ!

హెడ్డు- వెధవబాకీ- యీగండంతప్పితే, నేను యిచ్చేస్తానుభాయీ.

దుకా- గండంతప్పేదేటి, నాసొమ్ము నాచేతులో పడేదేటిభాయి?

హెడ్డు- మీ అందరిసాయంవుంటే దాటకేంభాయి?

దుకా- ప్రాణం పెడతాను భాయి, సాక్షెంమాటమాత్రం శలవియ్యకండి.

హెడ్డు- సాక్ష్యంపలకరా యేవిఁటి?

దుకా- దుకాణవేఁసుకు బతికేవాళ్లకి సాక్షికాలెందుకు భాయీ? యీ తిరగడం నించి బేరంచెడ్డాది. యీవేళ వూరికిపోకుంటే దుకాణం యెత్తిపెట్టాలి.

హెడ్డు- యిదేనా మీస్నేహం, నేస్తం?

దుకా- మీవెంట తిరిగితే, కొత్తహెడ్డుగారు.-

హెడ్డు- కొత్తహెడ్డేవిఁటిభాయి?

దుకా- యినసిపికటరుగారు, చెప్పినారు. నాసొమ్ము మాటేటిభాయి?

హెడ్డు- యినస్పెక్టరుగాడు అన్నిందాలా నాకొంపతీశాడు!

దుకా- ఆ బైరాగాడు నాకొంపతీసినాడు. యిహ నాడబ్బు నాచేతులో పడేదేటి?

(నిష్క్రమించును.)

(అసిరిగాడు ప్రవేశించి.)

అసిరి- (బుఱ్ఱగోకుకుంటూ)బాబు, మా ముసల్దోనికి సాలొచ్చిందట- కబురెట్టింది బాబూ.

హెడ్డు- వెధవా, సాక్ష్యంయివ్వందీ వెళ్లిపోతావా యేమిటి?

అసిరి- సాచ్చీకం అయిందాకా బతికుంతాదా బాబు?

హెడ్డు- ఓరి, వెధవా, దొంగమాటలాడుతున్నావు- గుండెపగలగొడతాను. నీకెవడ్రా కబురు తీసుకొచ్చాడు?

అసిరి- మనవూరు బండోళ్లొచ్చినారుబాబు.

హెడ్డు- గాడిద కొడకా, యిల్లుకదిలావంటే వీపుపెట్లగొడతాను.

అసిరి- యెళ్లితే మీరుతంతారు, యెళ్లకుంటే ఆరుతంతారు.

హెడ్డు- ఆరెవఱ్ఱా?

అసిరి- యినీసిపిక్కటోరు.

హెడ్డు- యీ యినస్పెక్టరు మరి సాక్ష్యం రానివ్వడు!

గిరీశం- అసిరీ .. నాదెబ్బ నీకుతెలుసును- యినస్పెక్టరూ గినస్పెక్టరూ జాంతేనై. విన్నావా, తిన్నగాబోనెక్కి నిజవేఁదో సాక్ష్యం పలక్కపోతివట్టాయనా, పీకనులివేఁసి నిన్ను నూతులోపారేస్తాను.

అసిరి- యేటిబాబూ! మీరోతెన్నా, ఆరోతెన్నా, యీరోతెన్నా, నాకేటెరిక బాబు? మీనౌకరీకి దణ్ణం పోతాను, బాబూ. ఆయమ్మ గోడగెంతడం నాను సూపులేదు బాబూ. గవరయ్యగోరు దెయ్యాన్ని సీసాలోయెడితే, గోడగెంతడం యేటిబాబు? వొట్టిఅబద్దం! నాను సూపులేదు బాబు.

గిరీశం- వాడుచూడందీ సాక్ష్యం యలా పలుకుతాడు, అన్నయ్యా?

లుబ్ధా- నాప్రాలుబ్ధం. యేవని జెప్పను?

హెడ్డు- యవరీయనా? కేసులమొహం అంటే యీయనకేమైనా తెలుసునా?

గిరీ- కేసులమొహం నాకూతెలియదు, నిజంమొహం పోలీసువాళ్లకీ తెలియదు. అబద్ధ సాక్ష్యాలవల్ల తప్పించుకోవడంకన్న, జెయిల్లోకూచోడవేఁ ఉత్తమం. ధన ప్రాణాలు రొండూపోయినా మనిషిఅన్నవాడు అసత్యం ఆడకూడదు- ఆడించకూడదు.

హెడ్డు- యేవిఁటండీ ఈయన శల్యసారధ్యం?- యవరితడు?

గిరీశం- నేను లుబ్ధావధాన్లుగారి తమ్ముణ్ణి- నా పేరు గిరీశంఅంటారు. నేను పరీక్షలు పాసైనవాణ్ణి; తెలిసిందా?

హెడ్డు- వెధవముండని తగులుకుపోయిన మహానుభావుడివి నువ్వేనా?

గిరీశం- డిఫమేషన్‌ అంటే మీకేమో తెలుసునా? నేను సౌజన్యారావు పంతులుగారి స్నేహితుణ్ణి- సాక్ష్యాలు యేరీతిగావున్నాయో కనుక్కుని, అన్నయ్యగారికీ మీకూ సలహాచెప్పమని పంతులుగారు నన్ను పంపితే వచ్చాను.

హెడ్డు- అలా అయితే మాకు మీరు సాయంచెయ్యాలిగాని, అబద్ధంలేకుండా సాక్ష్యం కావాలంటే యీ భూప్రపంచకమందు యెక్కడైనా సాక్ష్యం అన్నది వుంటుందా? నానెత్తిమీద యెన్ని వెంట్రుకలువున్నాయో, అన్నిసాక్ష్యాలు చూశాను. పెద్దపెద్దవకీళ్లు తయారుచేసిన సాక్ష్యాలుకూడా చూశాను. మీరు అనుభవంలేక నీతులు చెబుతున్నారుగాని, హైకోర్టు వకీళ్లుకూడా తిరగేసికొట్టమంటారు. నీపుణ్యంవుంటుంది బాబూ, నిజం అబద్ధం అని తేలగొట్టక, యేదో ఒకతడక అల్లి తయారుచేస్తేగాని ఆబోరుదక్కదు.

గిరీశం- అన్నయ్యకీ, మీకూ సహాయంచెయ్యడంకోసం కాకపోతే యింతదూరంనుంచి నేను యెందుకువచ్చాను? మీయిష్టవొఁచ్చినట్టల్లా మీకు పనికివొచ్చే అబద్ధాలు మీరు పలికించడముకు నా అభ్యంతరం యెంతమాత్రంలేదు. ఎబ్‌స్ట్రాక్టు ట్రూత్‌ అనగా సుద్ధసత్యఁవనేది, సాక్షాత్తూ భగవంతుడితో సమానమైన వస్తువ అన్నమాటమాత్రం మరిచిపోకూడదని నాఅభిప్రాయము. నేను మట్టుకు నిజం కోసం సమయంవొస్తే సంతోషముతో ప్రాణం యిచ్చేస్తాను. "లోకోభిన్నరుచిః" అన్నాడు. కొందరికి కందిపప్పు పచ్చడి రుచి; కొందరికి పెసరపప్పు పచ్చడి రుచి; కొందరు అదృష్టవంతులికి, రెండుపచ్చళ్లూ రుచి. అలాగనే కొందరికి అబద్ధం రుచి; కొందరికి నిజం రుచి; చాలామందికి రెండింటీ కలగలుపు రుచి. యిది లోకస్వభావం. గనక అవసరం కలిగినప్పుడు తణుకూబెణుకూలేకుండా, అబద్ధం ఆడవలసిందే- ప్రస్తుతాంశంలో, అసిరిగాడిచేత అబద్ధం ఆడించడం నాదిపూచీ. అసిరీ- నాతడాఖా జ్ఞాపకవుఁందా, కబడదార్‌- సాక్ష్యం యివ్వకపోతే చంపేస్తాను.

హెడ్డు- అలా తోవలోకిరండి భాయీ- చర్మం చెప్పులుకుట్టియిస్తాను. (లుబ్ధావధాన్లుతో) ఆ ఛండాలుడు రావఁప్పంతులుని నమ్మక, యిలాంటి కావలసినవాళ్ల మాట వింటే; మీకు యీగతి రాకపోవునుగదా?

గిరీశం- మావాడు, కావలసినవాళ్ల సలహా వింటాడండీ. దత్తత చేసుకుంటానని యెన్నాళ్లాయో అంటున్నాడు; దత్తత చేసుకుంటే కనిపెట్టివుండనా? "పోనీ, ఓ పవరాఫ్‌ టర్నామా అయినా నా పేరవ్రాయి, నీ వ్యవహారాలు చూస్తాను" అంటే, చెవిపెట్టడు.

హెడ్డు- యేవఁండీ, అవుఁధాన్లుగారూ అలా చెయరాదటయ్యా?

లుబ్ధా- వెనకనుంచి ఆలోచించుకుందాం.

గిరీశం- అధాత్తుగా, జెయిలులోకి లాక్కుపోతే, ఆపైని చేసేపనేవిఁటి?

హెడ్డు- జయిలు సిద్ధపరిచారూ?

గిరీశం- మాటవరసకన్నాను. కీడించిమేలించాలి- యినస్పెక్టరు కుట్ర బలంగావుంది. పోలిశెట్టి సాక్ష్యం పలకనని సౌజన్యారావు పంతులుగారితో చెప్పి వూరికి వెళ్లిపోయినాడు.

హెడ్డు- అయ్యో, మరేమిటిగతి!

గిరీశం- అదే పంతులుగారూ నేనూ, విచారిస్తున్నాం.

(పూజారి గవరయ్య ప్రవేశించును.)

హెడ్డు- గవరయ్యగారూ, గురోజీ కనపడ్డారా?

గవర- యిదుగో నాతో వొస్తూంటేనే! మీపెరటి అరుగుమీదే యింతసేపూ సమాధిలో వున్నారు.

హెడ్డు- నాకు పెరటి అరుగుమీద కనపడలేదే? పోనీండి ఆయనవొచ్చారంటే బతికాను అన్నమాట- యేరీ?

గవర- యేమి అలా అడుగుతున్నారు? యిరుగో మీ యెదటా. (కాళీజాగా వేపు చూపును) మీకు కనపడలేదా యేమిటి? (కాళీజాగావైపు చూచి) యేం గురోజీ తిరస్కరిణీ విద్య అవలంబించారేమి?- ఓహో, మీగురువుగారి ఆజ్ఞ ఐందనా?అయితే నాకెలా కనపడుతున్నారు?- నాకు మంత్రసిద్ధికలదనా?- అయితే యెన్నాళ్లు యిలా కనపడకుండావుంటారు?- ఒక్కపక్షవాఁ? (హెడ్డుతో) అదీ వారు శలవిచ్చినమాట.

హెడ్డు- యీలోగా మాపీకకి వురి అయిపోతుందే?

గవర- (కాళీజాగావైపు చూచి)- యేమిశలవు. గురూ?- (హెడ్డుతో) మీకేమీ పర్వాలేదన్నారు.

హెడ్డు- యీరాత్రి అంజనం వేయిస్తావఁన్నారుగదా, యెలాగ?

గవర- (కాళీవైపు చూచి) యేంశలవు?- (హెడ్డుతో) అన్నిపనులూ నాచేత చేయిస్తామన్నారు.

హెడ్డు- వారు కనపడితే బాగుండును.

అసిరి- అదేటిబాబూ, ఆరు నాకగుపడుతున్నారు!

గవర- సిద్ధులూ, పిశాచాలూ, మాలాంటి మాంత్రికులికి కనపడతారు. వాడిలాంటి మూఢభక్తులకు కనపడతారు; పాపంపుణ్యం యరగని, పసిపిల్లలికి కనపడతారు. ఇతరులకు కనపడరు.

గిరీశం- డామ్‌, హంబగ్‌. (కఱ్ఱతో గవరయ్యపక్కని కాళీజాగాకొట్టి) యవడున్నాడిక్కడ? హెడ్డుగారూ, యిదంతా గ్రాండ్డచ్చీ ఆఫ్‌బేడెన్‌.

గవర- నువ్వు రెండు యింగిలీషుముక్కలు చదువుకుని నాస్తికుడివి కాగానే, మాహాత్మ్యాలు పోతాయనుకున్నావా యేవిఁటి? నువ్వు సొట్టకఱ్ఱ తిప్పితే సిద్ధులికి తగుల్తుందా? నీలాగే పెద్దకబుర్లు చెప్పిన రిజస్టరికి, స్మశానంలోకి తీసికెళ్లి దెయ్యాన్ని చూపించేసరికి, ఆర్నెల్లు వూష్టంపెట్టుకున్నాడు. సిద్ధుల్ని నిందిస్తే బుఱ్ఱపగుల్తుంది.

అసిరి- ఆరేటిబాబు, బైరాగోరు!

గిరీశం- (అసిరిగాడిపైని ఉరికి)- వెధవా, యేడిరా?

అసిరి- లేడుబాబూ, లేడుబాబూ, ఉత్తినన్నాను.

గిరీశం- దొంగ గాడిద కొడకా! (హెడ్డుతో) మీరు సాక్ష్యం కుదుర్చుకోవడం మానేసి, యీగవరయ్య మాయల్లోపడితే మరి తేల్తారా?

హెడ్డు- అన్నా- అలా అనకండి. వీరి సాయంవల్లే మనం వొడ్డెక్కాలి. (చెవిలో) గవరయ్యగారు మనకి ముఖ్యమైనసాక్షి.

గవర- కిరస్తానవ భ్రష్టులు చేరినచోట మాంత్రికులూ, సిద్ధులూ వుండజనదు- (కాళీవైపుచూసి) రండి గురోజీ మనతోవని మనంపోదాం.

లుబ్ధా- గవరయ్యన్నా, యెక్కడికి వెళతారు?

గవర- నాకు తోచినచోటికి.

లుబ్ధా- మరి సాక్ష్యవో?

గవర- అవధాన్లుగారు పెళ్లాడినది కామినీపిశాచం. "అది మనిషీ, గోడగెంతి పారిపోయిందీ" అని నేను అబద్దపు సాక్ష్యం చెప్పానంటే మరి మంత్రంఅన్నది నాకు మళ్లీ పలుకుతుందా? నావొంతు ఆ గిరీశాన్ని సాక్ష్యం పలకమను.

"నమ్మి చెడినవారు, లేరు ।

నమ్మక చెడిపోతే, పోయేరు ॥"

(గిరీశంతో) - యినసిపికటరుగారు నీకంటే యెక్కువ యింగిలీషు చదువుకున్నా ఆయనికి మనశాస్త్రాల్లో నమ్మకాలు పోలేదు.

హెడ్డు- ఆయనదగ్గిరికి వెళతారా యేవిఁటి?

గవర- (వెళ్లుతూ) కబురంపించారు.

హెడ్డు- రండి, రండి, గవరయ్యగారూ చిన్నమాట.

గవర- (వెళ్లుతూ) ఆచిన్నమాటేదో (గిరీశమునుచూపి) ఆ మహానుభావుడుతో చెప్పండి.

(నిష్క్రమించును.)

హెడ్డు- (గిరీశంతో)యీ సాక్ష్యం మీరు మాటదక్కించుకున్నారు - మరి సాక్ష్యవఁన్నదిలేదు.

గిరీశం- ఆ మాటకొస్తే - నేనే సాక్ష్యానికి దిగి, కేసు నీళ్లు కారించేస్తాను. నాశక్తి చూతురుగాని - సౌజన్యారావు పంతులుతోమాత్రం ఆమాట యింకా చెప్పకండి.

(తెరదించవలెను.)

6-వ స్థలము. సౌజన్యారావు పంతులుగారి యిల్లు.

(మేడపైని పంతులుగారి పడకగది. ఒక బల్లపైని సన్నని గాజుదీపము కొంచము వెలుతురు కలుగజేయును. గదిమధ్యను మెట్లవైపునున్న గుమ్మమునకు యెదురుగా దోమతెర మంచము ఉండును. దానిపైని సౌజన్యారావు పంతులు మేలుకుని పరుండియుండును. మంచము రెండవప్రక్కను చిన్న రౌనుబల్లపైని గిల్టు కవరూ అంచులూగల భగవద్గీతాపుస్తకము. పక్కని కుర్చీమీద గిరీశము కూర్చుని యుండును.)

గిరీశం- నామనసు డైలెమ్మాలోపడి చాలా ఖేదిస్తూందండి. యేరీతినైనా నాఅన్నగారు యీ ఆపద దాటుదురా అని ఆతృత వొకపక్కా, అసత్యమునా కార్యసాధనంగా చేసుకోవడం అనే జిఘాస ఒక పక్కా, నన్ను పీడిస్తూన్నవండి. "అబద్ధపుసాక్ష్యం వొద్దు. నిజమైనసాక్ష్యం జాగ్రత చెయ్యండి" అని హెడ్డు కనిష్టీబుతో నేను అనేసరికి నాపైని కొండంత కోబ్బడ్డాడండి. నిజమైన సాక్ష్యం ప్రయత్నిస్తే దొరకదా అండి?

సౌజ- నిజమైనసాక్ష్యం! యేంసత్యకాలం! నిజవాఁడేవాడు సాక్ష్యానికిరాడు. సాక్ష్యాని కొచ్చినవాడు నిజవాఁళ్లేడు.

గిరీ- యెంచేత ఆళ్లేడండి?

సౌజ- వాదికి బాధించే నిజం వాదితరపు వకీలుకి అక్కర్లేదు. ప్రతివాదిని బాధించే నిజం ప్రతివాది వకీలుకి అక్కర్లేదు. క్రాసెగ్జామినేషను ఆరంభం అయేసరికి యెంతటిసాక్షీ కవిత్వం ఆరంభిస్తాడు. అంచేతనే పెద్దమనుషులు బోనెక్కడానికి భయపడతారు.

గిరీ- వకీళ్లు అబద్ధాలాడిస్తే న్యాయం కనుక్కోడానికి జీతం పుచ్చుకునే జడ్జీ యేం జేస్తాడండి?

సౌజ- ఉభయపార్టీల వకీళ్లు ఆడించే అబద్ధాలూ చెయిపీకేటట్టు రాసుకుంటాడు.

గిరీ- అయితే యెందుకండి యీకోర్టులు?

సౌజ- నేను అదే చాలాకాలవాఁయి ఆలోచిస్తూవుంటిని. పెద్దపెద్ద వకీళ్లుకూడా సిగ్గుమాలి బరిపెట్టి దొంగసాక్ష్యాలు పాఠంచెబుతారు. కొందరు మృదువర్లు తిరగేసి కొట్టమంటారు. నావంటి చాదస్తులం యింకొక కొందరం అట్టి పాపానికి వొడిగట్టుకోంగాని, మాపార్టీల తరఫు సాక్ష్యులుకూడా అబద్ధం చెబుతున్నారని యెరిగిన్నీ వూరుకుంటాం. యిలాటి అసత్యానికి అంగీకరించవలసి వస్తుందనే, నేను ప్రాక్టీసు చాలా తగ్గించుకున్నాను. క్రమంగా యీవృత్తే మానుకోవడపు సంకల్పం కూడా వుంది.

గిరీ- అందరూ తమవంటి వకీళ్లే అయితే, అసత్యం అన్నది వుండనే వుండదండి. వకాల్తీలో యింత అక్రమం వుందన్నమాట నే నెరగనండి. యేమైనా సహించగలనుగాని అసత్యం అన్నది సహించలేనండి.

సౌజ- ఒక్క అసత్యంతో కుదరలేదు. సాధారణంగా వకాల్తీలో దురాచారాలు చాలావున్నాయి. ఆంటినాచ్‌ లాగనే, ఆంటీ వకీల్‌ అని వకమూవ్‌మెంటు మనదేశంలో స్టార్టు చెయ్యడపు ఆవశ్యకత కలిగేటట్టు కనపడుతుంది. హెడ్‌ కనిష్టీబుది తప్పుకాదు. దొంగసాక్ష్యం కలిగిస్తేనేగాని కేసులు గెలియవు. మీరు సత్యమార్గంలో తరిఫీదైన మనుష్యులు ఔటచేత, మీకు కేసులు నడిపించే మార్గాలు ఏహ్యంగా వున్నాయి.

గిరీ- మరి మా అన్నగారి గతియేవిఁటండి?

సౌజ- ఒక్కటే సాధనంవుంది. ఆగుంటూరు శాస్తుల్లు యెవరో పోల్చి పట్టుగుంటే, యితరసాక్ష్యం అవసరం వుండదు.

గిరీ- పట్టుపడేమార్గం యేదో తమరు శలవిస్తే మూడులోకాలూ గాలించి అయినా పట్టుగుంటానండి.

సౌజ- మీయోగ్యతకు నాకు చాలా సంతోషంగావుంది. మీలాంటి యెంగ్‌మెన్‌ లావుగావుంటే, మనదేశం బాగుపడును. మీ ప్రయత్నం సానుకూలం కాతగిన బందోబస్తు యావత్తూ నేను చేస్తాను. మీ స్వంత చిక్కులుకూడా వదిలినవి గనక మీరు వెంటనే బయలుదేరి వెతకడం ఆరంభించవచ్చును. యీ కారణంచేత మీ వివాహం పోస్ట్‌పోన్‌ కావలసి వొస్తుందిగదా అని మాత్రం విచారిస్తున్నాను.

గిరీ- అట్టి విచారం తాము పడనక్కరలేదు. మా గురువుగారి ఉపదేశం డ్యూటీముందూ, ప్లెజర్‌ తరవాతానండి. అందులో నేను చిన్ననాటినుంచీ కొంచం కాన్‌సెన్‌ట్రేషనూ, ఇంద్రియనిగ్రహమూ అభ్యాసం చెయ్యడంచాతనూ, వొళ్లు మరిచి యెల్లప్పుడూ యేదో ఒక వ్యాపకంలో కొట్టుకుంటూ వుండడంచాతనూ, స్త్రీ సుఖముల యెడల నాకు విముఖత లావండి. అందుచేతనే మావాళ్లంతా నాకు నెపోలియన్‌ ఆఫ్‌ ఆంటినాచ్‌ అని పేరుపెట్టారు. యీ జీవితకాలవఁంతా సోషల్‌ రిఫారమ్‌ కింద వినియోగపరుద్దావఁనే నిర్నయంతో వివాహంమాని మాగురువుగారిదగ్గిర లెఫ్టెనెంటుగా ప్రవేశించానండి. బుచ్చమ్మయొక్క హృదయనైర్మల్యమూ, ఆమె దురవస్థా చూచిన్నీ, నా శిష్యుడియందు నాకువుండే ప్రేమాతిశయం చేతానున్నూ, ఆమెయందు కూడా ప్రేమాతిశయం నాకు కలిగి, ఆమెను వివాహం కావడముకు వొప్పుకున్నానుగానండి, ఇంద్రియసుఖముల నపేక్షించి కాదు. ఆమెకూడా నన్ను ప్రేమించి, విధవా వివాహము కూడుననే నిశ్చయముతో నన్ను వివాహము కావడముకు అంగీకరించారండి. గనక మా మారియేజి అనేది, ట్రూలవ్‌ మారియేజిగాని, సాధారణపు విడోమారియేజి కాదండి.

సౌజ- మీగురువుగారూ అలాగే వ్రాశారు. గాని మీరు విడోమారియేజి చేసుకుంటే మీఅన్నగారు మిమ్మల్ని పెంచుకోరేమో?

గిరీ- తమమాటను ఆయన అతిక్రమించబోరండి. ఒకవేళ ఆయన వప్పకపోతే, దత్తత వదులుకుంటానుగాని, ప్రాణసమానురాలైన బుచ్చమ్మను విడవనండి.

సౌజ- ఆమె అదృష్టవంతురాలు.

గిరీ- అట్టి స్త్రీరత్నము (చడిలేకుండా ఒకమనిషి మెట్లెక్కివచ్చి ద్వారముదగ్గిర తనకు యెదురుగా నిలిచివుండడము చూచి గిరీశం నిర్ఘాంతపోయి మాటమాని నోరు తెరచును. ఆవైఖరి సౌజన్యారావుపంతులు కనిపెట్టి)

సౌజ- యేవిఁటి అలా చూస్తున్నారు? (గిరీశం చూస్తూవున్నవేపు తానును దృష్టితిప్పి, వచ్చినమనిషిని చూసును.)

గిరీ- యిట్టి స్త్రీరత్నము దొరికిన కారణంచేత నేనే అదృష్టవంతుణ్ణి అని భావిస్తాను. అయితే "పరోపకారఃపుణ్యాయ । పాపాయపరపీడనం" అన్న న్యాయప్రకారం, ఒకర్నికాపాడి ఉపకారం చెయ్యడం ఉత్కృష్టమైనపుణ్యం. నిష్కారణంగా, వాడిమానాన్న వాడు బతుకుతున్నవాడికి అపకారంచెయ్యడం పాపానికి కారణం. గనుక మా అన్నయ్యని యెంతకష్టపడి అయినా నేను కాపాడడం విధిఅని యెరుగుదునండి.

సౌజ- (కొత్తగావచ్చినమనిషితో) యెవరు మీరు?

కొత్తమనిషి- జరూరు ప్రయోజనం కలిగివచ్చానండి- వర్తమానం చెయకుండా వచ్చినందుకు క్షమించవలెను- కింద నౌఖర్లు కానరాలేదండి.

సౌజ- రండి- కూచోండి.

గిరీ-(లేచివెళ్లి ఒక కుర్చీతెచ్చి తనకుర్చీ పక్కనువేసి) దయచెయ్యండి.

కొత్తమనిషి- (కూచోక)అక్కర్లేదు.

సౌజ- కూచోండి- (కొత్తమనిషి కూచొనును) తాము యెవరండి?

కొత్తమనిషి- నేనెవరో మనవిచెయక తీరదా అండి?

సౌజ- యేకారణం చేతనైనా పేరుచెప్పడం యిష్టంలేకపోతే, చెప్పనక్కరలేదండి.

కొత్తమనిషి- నేవచ్చినపనికి, నాపేరుతో పనిలేదండి. కొన్ని కారణములచేత నాపేరు చెప్పడముకు వీలులేదండి. క్షమించవలెనని ప్రార్థన.

గిరీ- షేక్‌స్పియర్‌ అన్నాడుకాడా అండి. "వాట్సినెనేమ్‌?" అని? దానిని నేను చిన్న గీతముక్కగా తర్జుమా చేశానండి "పేరులోననేమి పెన్నిధియున్నది." మన శాస్త్రాల్లోకూడా యెవరిపేరు వారుగట్టిగా ఉచ్చరించితే పాపవఁన్నారు. తమకు విశదమే.

కొత్తమనిషి- మరివొకరితో అయితే కల్పించి మారుపేరు చెప్పుదును. తమచోట అబద్ధం ఆడజాలనండి.

గిరీ- భోజరాజు ముఖంచూస్తే కవిత్వం పుట్టినట్టు, తమముఖంచూస్తే యెట్టివాడికైనా నిజవేఁ నోటంట వొస్తుందండి.

కొత్తమనిషి- ఒకానొకరికితప్ప.

గిరీ- "సచేమాన్‌ ఈజ్‌టుబి పిటీడ్‌." అనగా అట్టిమనిషివుంటే ఆమనిషియెడల మనం కనికరం కలుగజేసుకోవాలి- అంతే.

సౌజ- అసత్యవఁనేది యెవరితోనూ ఆడకూడదు.

కొత్తమనిషి- మంచివారియెడల మంచిగానూ, చెడ్డవారియెడల చెడ్డగానూ, వుండమని మాతల్లిగారు ఉపదేశంచేశారు. అంచేత తమతో అబద్ధవాఁడనన్నాను.

సౌజ- మీతల్లిగారు పూజ్యులేగాని, వారి ఉపదేశంలో మీరు మొదటిసగమే అవలంబించి కడం సగమూ మార్చి, మనంచెడ్డవారని అనుకునే వారియెడలకూడా మంచిగా వుండుటకు ప్రయత్నముచేస్తే, దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన యీలోకము మీకు మరింత యింపుగా కనపడుతుంది. మీకూ మీపరిచయం కలిగినవారికీ మరింత సౌఖ్యము కలుగుతుంది. కాక మంచిచెడ్డలు ఏర్పర్చగలిగినవాడు యెవడు? మంచిలోనూ చెడ్డవుంటుంది. చెడ్డలోనూ మంచివుంటుంది.

గిరీ- యేమి విలవైనమాటలు! ఒక చెడ్డమనిషి వున్నాడనుకోండి. ఒకణ్ణి అనడవెఁందుకు? నేనే ఆచెడ్డవాణ్ణి అనుకోండి. అట్టి చెడ్డవాడనైన నాయెడల మంచిగా వుండడమే యోగ్యత. తమవంటి మంచివారియెడల అంతా మంచిగానే వుంటారు. "అపకారికి నుపకారము । నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ" అని కవి అన్నమాట పర్‌ఫెక్‌ట్‌ జెమ్‌ కాదాఅండి?

సౌజ- నాభావం మా బాగా ఉపన్యశించారు.

కొత్తమనిషి- (సౌజన్యారావు పంతులుతో)తమవాక్యం గురూపదేశంగా భావించి, యిటుమీదట చెడ్డవారియెడలకూడా మంచిగా వుండడముకు ప్రయత్నిస్తాను. తమశిష్యరికం లభించడం నాకు పెన్నిధి. సత్పురుషుల దర్శనం సద్యోఫలం కలది. తాము మంచిలో చెడ్డవుంటుందని శలవిస్తిరి. పరిపూర్ణమైన తమ మంచిలో చెడ్డలేదని వింటున్నాను.

సౌజ- పరిపూర్ణమైన మంచి ఒక్క భగవంతుడియందేకలదు. నా చెడ్డ లోకవేఁ వెఁరుగును?

గిరీ- మిషనరీ ఒరిజినల్‌సిన్‌ అంటాడండి. మనవాళ్లు దుష్కర్మ అంటారు. దాంతస్సాగొయ్యా (బెగ్‌ యువర్‌ పార్డన్‌) ఆ ఒరిజినల్‌సిన్‌, లేక కర్మ, అనేది యెంత మంచివాడినైనా, యెంత కట్టుదిట్టవైఁనవాడినైనా రెక్కపట్టుకుని తప్పుతోవలోకి లాగుతుందండి. తమకు విశదముకానిది యేమున్నది?

సౌజ- "బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి" అని గీత చెబుతూంది. యెవడి చెడ్డ వాడు దాచుకుని, మంచినే పైకి కనపర్చుతాడు.

కొత్తమనిషి- ఒకానొకరు లేని మంచినికూడా వున్నట్టు ప్రచురపరిచి లోకాన్ని భ్రమింప చేస్తారు.

సౌజ- సత్యం. అందుచేతనే మంచి చెడ్డలు మనసే యెరగవలెగాని లోకమేవెఁరుగును అని అన్నాను.

కొత్తమనిషి- నటనవల్ల కొద్దికాలవేఁ లోకానికి కళ్లు కప్పవచ్చునుగాని, నిడివిమీద బంగారాన్నీ, యిత్తడినీ లోకం యేర్చేస్తుందండి. (గిరీశంతో) యేమంటారు?

గిరీ- పంతులుగారికి నిద్రభంగవౌఁతుంది. మీరు వచ్చినపనేదో-

కొత్తమనిషి- (సౌజన్యారావు పంతులుతో)స్వాభావికంగా మంచికి లోకంగుడ్డి; చెడ్డవెతకడానికి చారెడుకళ్లు; గనక, చూచ్చూసి, లోకం ఈయనమంచివారు, అని నిర్ధారణచేసిన తరవాత, వారు మంచివారు కాకతీరదండి- తమవంటి మంచివారు వలవేస్తే యెక్కడా కనపడడం కష్టం అండి. గనక తమదర్శనం నాకు కావడంవల్ల యీరోజు, నాజన్మానికల్లా సుదినంగా భావించి సంతోషిస్తున్నాను.

గిరీ- సందేహవేఁవిఁటి!

సౌజ- మంచిగావుందావఁని ప్రయత్నిస్తున్నాను. అంతకన్న నాయందు యోగ్యత యేమీలేదు. మీరు వచ్చినపని చెప్పారుకారు.

గిరీ- నేను కనుక్కుని తమతో ఉదయం మనవిచేదునా?

సౌజ- జరూరు పనిమీద వచ్చినవారూ, పేరు చెప్పనివారూ, మీతో వారికార్యం చెబుతారా? మీది యెంతసత్యకాలం!

గిరీ- వారికి నేనేమైనా సాయంచెయడానికి అవకాశం వుంటుందేమో అనీ, తమకు నిద్రవేళైందనీ, మనవిచేశాను.

కొత్తమనిషి- గిరీశంగారు లోకోపకారపరులు.

సౌజ- మీకు కృతపరిచితులా?

కొత్తమనిషి- వారిని యెరుగనివారెవరండి?

గిరీ- వారు నాయందువుండే దయచేత అలా శలవిస్తున్నారుగాని, నన్ను అంతా యెరగడానికి నేనేపాటివాణ్ణండి. అయినా తరుచుగా లెక్చర్లు యిస్తూవుండడంచాత, వీరివంటి సత్పురుషులు నన్ను యెరిగివుండడంకద్దు; సత్కరించడంకద్దు. వీరినికూడా నేను చూచివుందును. అందుచేతనే వీరు కనపడగానే, యెవరు చెప్మా చూచినట్టుందీ! అని కలవిలపడ్డాను. వారుకూడా ప్రచ్ఛన్నులై వుందామని నిశ్చయించుకున్నారు గనక, నేను జ్ఞాపకం తెచ్చుకోడానికి ప్రయత్నం చెయ్యను; నేనుపోయి పరుంటాను. తాము ఉభయులు మాట్లాడుకోవొచ్చును.

సౌజ- అలాగే చెయ్యండి.

గిరీ- (సౌజన్యారావు పంతులుతో)నమస్కారం. (కొత్త మనిషితో) మీరు బ్రాహ్మలా?

కొత్తమనిషి- కాను.

గిరీ- (కొత్తమనిషితో)అయితే, దాసోహం!- టుది అన్నోన్‌! (నిష్క్రమించుతూ గుమ్మము దగ్గరకువెళ్లి, తిరిగిచూసి కొత్తమనిషిని బతిమాలుకున్నట్లు అభినయించి, వెళ్లును.)

సౌజ- గిరీశంగారు కవి- మహా యోగ్యవైఁన చిన్నవాడు.

కొత్తమనిషి- వితంతువులను పెళ్లాడడం, యాంటీనాచీకూడా మంచికి ఆవశ్యకవేఁనా అండి? సౌజ- వితంతువులను, యిష్టమైతే పెళ్లాడవొచ్చును లేకుంటే మానవొచ్చును. మంచితో దానికి పనిలేదు. గాని వేశ్యాసంసర్గ కలవాడు యెన్నడూ మంచివాడు కానేరడు.

కొత్తమనిషి- అంతేనా అండి, లేక వేశ్యనుచూడరాదు; వేశ్యతో మాటాడరాదు; వేశ్యపాట వినరాదు; అని నిర్నయంకూడా వున్నదా అండి?

సౌజ- అలాటి నిర్నయంవుంటే మరీ మంచిది.

కొత్తమనిషి- తమరు యాంటినాచ్‌ అనుకుంటాను.

సౌజ- ఔను.

కొత్తమనిషి- (చిరునవ్వు నవ్వుతూ)గిరీశంగారూ యాంటీనాచేకదా అండి?

సౌజ- మీకు తెలియదా? ఆయన యాంటీనాచికి గురువు.

కొత్తమనిషి- ఆయన నాకుకూడా గురువులేనండి.

సౌజ- అలాగనా? నాకు చాలా సంతోషం.

కొత్తమనిషి- యీ విషయంలో చాలాకాలవాఁయి నాకు ఒక్కసందేహం వుండిపోయింది; క్షమిస్తే మనవిజేస్తాను.

సౌజ- చెప్పండీ- తప్పేమి?

కొత్తమనిషి- వేశ్యలను పాటకు పిలవకపోతే, వాళ్లు బతకడం యెలాగండి?

సౌజ- పెళ్లిచేసుకుంటేసరి.

కొత్తమనిషి- గిరీశంగారిలాంటివారిని అనా తమ అభిప్రాయం?

సౌజ- యేమిమాట అన్నారు! రేపోనేడో ఆయ్న ఒక పవిత్రమైన వితంతువును పెళ్లికానైయున్నారు గదా, వేశ్యనా పెళ్లాడుతారు?

కొత్తమనిషి- జపాన్‌దేశంలో గెయిషాలని వేశ్యలువున్నారనీ, వాళ్లని గొప్పగొప్ప వారు కూడా పెళ్లాడతారనీ యీ గిరీశంగారే కాబోలు చెప్పగావిన్నాను. జపాన్‌ దేశం గొప్పదేశం అని అంటారండి?

సౌజ- ఔనుగాని, గొప్పదేశంలోవున్న చెడ్డనే మనం అవలంబించాలా? గిరీశంగారు అట్టి అపవిత్రమైన పనికి ఇయ్యకొనరు.

కొత్తమనిషి- అయితే పెళ్లిచేసుకోగోరిన వేశ్యలకు కోరతగిన వరులు దొరకడం యెలాగండి? లేక యెట్టివారైనాసరే అని తమ అభిప్రాయమా అండి?

సౌజ- యీసంగతి యింకా నేను బాగా ఆలోచించలేదు- వేశ్యలు విద్యలునేర్చి, ఇతరవృత్తులవల్ల సత్కాలక్షేపము చెయ్యరాదా?

కొత్తమనిషి- అట్లా చేస్తే, తమవంటివారు వాళ్లను వివాహమౌదురా?

సౌజ- యేంప్రశ్న? నేను యెన్నడూ వేశ్యను పెళ్లాడను. నాయెత్తు ధనంపోస్తే వేశ్యను ముట్టను.

కొత్తమనిషి- ప్రమాదంవల్ల వేశ్యశరీరం తమకు తగిలితే?

సౌజ (నవ్వుతూ)- తగిలినశరీరం కోసేసుకుంటాను. చిత్రమైన ప్రశ్నలడుగుతున్నారు!

కొత్తమనిషి- వేశ్యజాతి చెడ్డకావచ్చును. గాని తాము శలవిచ్చినట్లు, చెడ్డలో మంచి వుండకూడదా? మంచి యెక్కడనున్నా గ్రాహ్యంకాదా అండి?

సౌజ- మంచి యెక్కడనున్నా గ్రాహ్యమే. గాని మీరు వచ్చినపని చెప్పారుకారు?

కొత్తమనిషి- నాపనిమట్టుకు మిమ్మల్ని చూడడమే.

సౌజ- చూడడానికి నిశీధవేళ రావలెనా?

కొత్తమనిషి- మీపని మించిపోకూడదని అట్టివేళవచ్చాను.

సౌజ- మించిపోయేపనులేవీ నాపనులులేవే?

కొత్తమనిషి- దురవస్థలోవున్నవారి పనులల్లా తమ స్వంతపనులుగానే యోచింతురని లోకులవల్లవిన్నాను. మరేంలేదు, అవధాన్లుగారి కేసులోగట్టి సహాయం చెయ్యగలిగినవారి నొకరిని నేను యెరుగుదునండి.

సౌజ- అలాగైతే మిమ్మల్ని మాపాలిట దేవుణ్ణిగా భావిస్తాం.

కొత్తమనిషి- అంతమాట నాకు దక్కాలిగదా అండి?

సౌజ- యేమి అలాగ అంటున్నారు?

కొత్తమనిషి- మరేమీలేదు. ఆ కార్యసాధనము ఒకవేశ్యవల్ల కావలశివున్నది. అదీ చిక్కు.

సౌజ- డబ్బు యిద్దాం.

కొత్తమనిషి- ఆవేశ్య ద్రవ్యానికి సాధ్యురాలుకాదండి.

సౌజ- అయితే మరేమి కోరుతుంది?

కొత్తమనిషి- ఆమెకోరిక అసాధ్యవఁని తలుస్తానండి.

సౌజ- అయినా యేమిటోచెప్పండి.

కొత్తమనిషి- చెప్పితే మీకు ఆగ్రహం రావడమేకాని, కార్యం వుండదనుకుంటానండి.

సౌజ- తనను వుంచుకోమంటుందా యేమిటి! అది యెన్నడూ జరిగేపనికాదు.

కొత్తమనిషి- ఆ ముసలిబ్రాహ్మడి దురదృష్టం! మనవేఁంచెయ్యగలవండి?

సౌజ- యెంత బుద్ధిహీనురాలు! అసందర్భమైన యిలాటికోరిక కోరతగునా? మీరెలా మోసుకొచ్చారు యింత అసంభావితమైనమాట?

కొత్తమనిషి- వ్యవహారవిషయములు మాట్లాడతూన్నప్పుడు మంచైనా చెడ్డైనా ఉన్న మాటలు నాలుగూ అనుకోవడం విధాయకం గదండి. ఆమనిషి తలకి తగని వెఱ్ఱి కోరిక పెట్టుకుంది అనేమాట అన్నంతినే మనిషల్లా యెరగడా అండి?

సౌజ- నేను మన్మధుణ్ణనా నన్ను వలిచింది?

కొత్తమనిషి- మిక్కిలీ మంచివారని కాబోలు.

సౌజ- సానిదానికి మంచితో పనివుండదు. ఇదియేదో యెత్తైవుండాలి.

కొత్తమనిషి- మృచ్ఛకటిక చదివిందేమోనండి.

సౌజ- వసంతసేనలాంటి మనిషి వెఱ్ఱికవీశ్వర్ల కల్పనలో వుండాలిగాని లోకంలో వుండదు. యేదో యెత్తు. అందుకు సందేహం వుండదు- సాధనాంతరం లేదో?

కొత్తమనిషి- తమరు ప్రశ్నలు అడుగుతారు. విన్నమాట మనవిచేస్తే ఆగ్రహిస్తారు. యేం సాధనం?

సౌజ- శ్రీకృష్ణుడి అనుగ్రహంవల్ల ఆగ్రహమనే వస్తువను చంపుకోవడముకు సదా ప్రయత్నంచేస్తున్నాను. స్ఖాలిత్యం కనపర్చారు. కృతజ్ఞుడను. చెప్పవలసినది చెప్పండి.

కొత్తమనిషి- తమకు వుంచుకోవడం మనస్కరించకపోతే, తనను వివాహము కావచ్చునని కూడా ఆమనిషి అభిప్రాయము.

సౌజ- మంచివారిని హేళన చెయ్యవలసినదనికూడా మీతల్లిగారి ఉపదేశం కాబోలు?

కొత్తమనిషి- మీ శ్రీకృష్ణునిమీద ఆన- మీయెడల నాకు అమాయకమైన భక్తికలదు. తమరియెడల తృణీకారభావము నాహృదయమందు యెన్నడూ పుట్టదు. నమ్మండి. రాయభారి మోసుకువచ్చేమాటలకు రాయభారిని తప్పు పట్టడం ధర్మంకాదు. యివి జరిగేమాటలని నేను మనవిచెయ్యలేదు. వున్నమాట మనవిచేస్తే, వకీళ్లు గనక వేశ్యపెట్టిన చిక్కు విప్పజాలకపోతారా అని మనవిచేశాను.

సౌజ- వేశ్యలకు వకీళ్లు సమదంతాఅనా? (నవ్వి) నేనుమట్టుకు వోడిపోయినానని వొప్పుగుంటున్నాను. యెగతాళీలో దించకండి- వేశ్య డబ్బొల్లకపోదు. ద్రవ్యం కోరమనండి, ఆయనైనా యిస్తారు, నేనైనా యిస్తాను.

కొత్తమనిషి- అందాకా యెందుకండి? తమదాకా అక్కరలేదు, ఆ బ్రాహ్మడికి ఉపకారార్థం నేనేయిస్తును. ఆమనిషి ద్రవ్యానికి సాధ్యురాలుకాదని మనవి చేశాను; నమ్మరా?

సౌజ- అన్నట్టూ, మీరు గిరీశంగారి శిష్యులమంటిరిగదా? మీరు యాంటినాచ్‌ కారా? అయితే, వేశ్యవల్ల యీ భోగట్టా యావత్తూ మీకు యెలా వొచ్చింది? యిదంతా యెగతాళా? కుట్రా?

కొత్తమనిషి- నమ్మనివారితో యేమిచెప్పను? యిది కుట్రాకాదు; యెగతాళీకాదు. నేను అక్షరాలా యాంటీనాచ్‌నే. వివేకలేశంవున్నవారు యెవరు యాంటినాచ్‌ కారండి? గాని, విధికృతంచేత నాకు వేశ్యాసంసర్గ తప్పిందికాదు.

సౌజ- యేమిటో ఆవిధికృతం?

కొత్తమనిషి- ఇది! (కొత్తమనిషి నెత్తినివున్న పాగాతీసి జుత్తును జారవిడిచి; వెనకకు తిరిగి తొడుగుకున్న కోటువిడచి, కప్పుకున్నశాలువ వల్లెవాటుగావేసికొని సౌజన్యారావుపంతులు వేపుతిరిగి) నావూరూపేరూ అడిగితిరి. వూరు విజయనగరం; పేరు మధురవాణి!

సౌజ- (మొదట ఆశ్చర్యమగ్నుడై, యోచనపైని కోపావేశము కలిగి నిలిచి) యేమి మోసము జరిగినది!

మధు- గురువుల ఉపదేశం గురువులే మరవకూడదు. చెడ్డలోకూడా మంచి వుండవచ్చును. కాక మంచి చెడ్డలు యెంచేవారెవరు?

సౌజ- యేమి దగా!

మధు- నిర్మలమైన అంతఃకరణతో వస్తిని. నిజం దేముడెరగవలె. దగా అని తోచినది; యేమి చెయ్యగలను? వెళతాను.

సౌజ- శీఘ్రంగా వెళ్లవచ్చును.

(మధురవాణి పాగా కోటూవిడిచి గుమ్మమువరకు వెళ్లును.)

సౌజ- నిలు- నిలు- (మధురవాణి తిరిగివచ్చి, కొంచము యెడముగా యెదట నిలుచును.)

సౌజ- పాగా, కోటూ మరిచిపోయినావు.

మధు- అంతేనా? మనసే మరచిపోయినాను; కొదవేవిఁటి? (తిరిగి రెండడుగులు వెళ్లును.)

సౌజ- మాట!

మధు- (తిరిగిచూసి)యీమాటు యేం మరిచానండి?

సౌజ- నువ్వుమరవలేదు, నేనే మరిచాను. లుబ్ధావధాన్లుగారి మాటేమిటి?

మధు- తమమంచి లోకప్రసిద్ధమైనప్పటికీ, ఆయనయందు తమకు అట్టే అభిమానం భగవంతుడు పుట్టించలేదు.

సౌజ- ఆయనను కాపాడడముకు న్యాయవైఁనపని యేమిచెయ్యమన్నా చేస్తాను. అనేక సంవత్సరములాయ, వేశ్య అన్నది నాయింటికిరాలేదే? నేను వేశ్యతో యెన్నడూ మాట్లాడలేదే? యీనాటికి వ్రతభంగమైనదిగదా, అని అపారమైన విచారములో ములిగివున్నాను.

మధు- తమరు ప్రాజ్ఞులు; వ్రతభంగమేది?

సౌజ- నిశిరాత్రివేళ పడకింటిలో వేశ్యను పెట్టుకుని మాట్లాడటం కన్న యింకా యేమి కావలెను?

మధు- తమరు నన్ను రప్పించలేదే? వేశ్యలు పార్టీలైతే, వకీళ్లు కేసులు పట్టరో?

సౌజ- పడతాం, పట్టం; యేమైనా నువ్వు పార్టీవైనాకావే?

మధు- కాను- గాని మీపార్టీయని కాపాడే మనిషిని. నేను యెవతెనైతేనేమి- నను చూడకూడదా? అది అలా వుండగా వేశ్యలము దేవాలయములలో భగవంతుణ్ణి చూడడమునకు పోవచ్చునుగదా? సత్పురుషులైన తమవంటివారి దర్శనమునకు మాత్రము నిరోధమా?

సౌజ- "మంచివారు, మంచివారు" అని పలుమారు అంటూవుంటే నాకు లజ్జగా వుంది. ఆమాట మరి అనకు- చూడరావచ్చునుగాని రాత్రివేళ పడకింట్లోనా!

మధు- వేశ్యనని వర్తమానంచేస్తే పగటివేళ చూతురో?

సౌజ- నా శత్రువులు యెవళ్లో నిన్ను నాదగ్గిరకు పంపారు. (నఖసిఖపర్యంతం నిదానించి) యెంతటివాళ్లైనా వుంటారు!

మధు- అలాగైతే తమమంచే తమకు శత్రువై ఉండాలి. మీ కార్యం నిర్వహించి డబ్బు ఒల్లనప్పుడు కుట్రా కూహకంలేదని నమ్ముదురా?

సౌజ- అంత మంచిమనిషివి అయితే, పాపము ఆ బ్రాహ్మడికి ఉపకారం నీవు చెయ్యరాదా? మధ్య నాకు గండగత్తెరేమి?

మధు- నేను మంచిదాననని నమ్మగలరా?

సౌజ- ఆబ్రాహ్మణ్ణి కాపాడితే నమ్మనా?

మధు- అయితే, ఒకతుని తగువు మనవిచేస్తాను.

సౌజ- అట్టేసేపు నువ్వు నాయెదటగానీ నిలిచివుంటే, నువ్వు యేతగువుతీరిస్తే ఆతగువుకు వొప్పుదల అవుతానేమో అని భయవేఁస్తూంది.

మధు- (ముఖముపక్కకుతిప్పి) ఒక్క చిన్నముద్దుకు కరువో?

సౌజ- అంతటితో కార్యం నిర్వహిస్తావా?

మధు- యేంజెయనూ, మరి?

సౌజ- నావ్రత భంగం చెయ్యడవేఁనా నీపట్టుదల?

మధు- అడుగుమెట్టుకు దిగానని మెప్పులేదుగదా? యిష్టంలేనిపని యేల చేయించవలె? శలవు. (రెండు అడుగులు వెళ్లును.)

సౌజ- ఆగు (మంచముమీద కూర్చుని- దుప్పటీ కప్పుకుని) కూచో.

మధు- కూచోను.

సౌజ- వెయ్యిరూపాయలిస్తాను. తీసుకుని బ్రాహ్మణ్ణి కాపాడు.

(మధురవాణి తిరిగీ వెళ్లబోవును.)

సౌజ- వెళ్లకు- నీకు ముద్దాకావాలి? యేం వెఱ్ఱిమనిషివి! యేమిలాభం?

మధు- నాకుతెలియదు.

సౌజ- తప్పదూ?

మధు- తప్పదనుకుంటాను.

సౌజ- అయితే విధిలేక వొప్పుకుంటున్నాను. చిత్రం! వెయ్యిరూపాయలకంటె వక ముద్దు యెక్కువ విలవా?- సరే- నువ్వుచేసే సాయఁవేదో చెప్పు.

మధు- తెల్లబియ్యం, పాటిమానికా- లుబ్ధావదాన్లుగారు వివాహవైఁనపిల్ల ఆడపిల్లకాదు.

సౌజ (ఆశ్చర్యముతో)- యేమిటీ!

మధు- మరచితిని- అందుతో సంబంధించినవారికి యెవరికిన్నీ హానిరాకుండా కాపాడతావఁని శలవిస్తేనేకాని పేర్లు చెప్పజాలను.

సౌజ- లేకుంటే చెప్పవా?

మధు- చెప్పను.

సౌజ- లుబ్ధావధాన్లుగారివల్ల యెవరికిన్నీ బాధలేకుండా కాస్తాను. ఆయనకు కాక ఇతరులు యెవరికైనా హానిచేసివుంటే, నావశంకాదు.

మధుర- చాలును. యిహ చెబుతాను. కరటకశాస్తుల్లుగారు వారిశిష్యుడికి ఆడవేషం వేశి పెళ్లిచేశారు.

సౌజ- కరటకశాస్తుల్లా గుంటూరు శాస్తుల్లు!

మధుర- అవును. కొంచం చిరిగెడ్డం అంటించుకున్నారు; అంతేభేదం-

సౌజ- ఔరా? అతగాడి దారుణం!

మధుర- అతనివల్ల తప్పులేదండి; అగ్నిహోత్రావధాన్లుగారి కూతురు ఆయన మేనకోడలు. ఆపిల్లని లుబ్ధావధాన్లుగారికి యివ్వడానికి నిశ్చయమైన సంగతి తమకు విశదమే. ఆసమ్మంధం తప్పించుటకు కరటకశాస్తుల్లుగారు యీ యెత్తు యెత్తారు. ఆయనకు మాత్రం హానిరానీకండి.

సౌజ- ఔరా? యేమి చిత్రము! మేలుకున్నానా నిద్రబోతున్నానా?

మధుర- నాఫీజుయిచ్చి మరీ నిద్రపొండి.

సౌజ- బీదవాణ్ణి యిచ్చుకోలేనే?

మధుర- నాకు లోకంలో ధనవంతా అదే అనుకున్నానే?

సౌజ- నీవు సొగసరివి. ముద్దుచేదని కాదు. వ్రతభంగం గదా అని దిగులు.(ముద్దుపెట్టుకొన బోవును.)

మధుర- ఆగండి.

సౌజ- ఏమి?

మధుర- నావ్రతమో?

సౌజ- యేమిటది?

మధుర- చెడనివారని చెడగొట్టవద్దని మాతల్లిచెప్పింది.

సౌజ- చెప్పితే?

మధుర- అందుచేత, మిమ్మల్ని ముద్దుపెట్టుకో నివ్వను.

సౌజ- కృతజ్ఞుడనైవున్నాను!

మధుర- ఆపుస్తుకము నేను చూడవచ్చునా అండి!

సౌజ- చూడు.

(మధురవాణి పుస్తుకమువిప్పి చదువును.)

మధుర- భగవద్గీతలు. యిది మంచివారు చదివేపుస్తుకమా అండి?

సౌజ- యిది చెడ్డవారిని మంచివారినిగా చేశేపుస్తకం.

మధుర- దానిలో యేముందండి?

సౌజ- అదిచదివిన వారికల్లా విలువలేని గొప్ప స్నేహితుడొకడు దొరుకుతాడు.

మధుర- యెవరండి ఆస్నేహితుడు?

సౌజ- శ్రీకృష్ణుడు.

మధుర- శ్రీకృష్ణుడు సానిదానితోకూడా స్నేహంకడతాడా అండి?

సౌజ- శ్రీకృష్ణుడు తన్ను నమ్మినవారితో అల్లా స్నేహం కడతాడు. పరమాత్మకు జాతిభేదంలేదు.

మధుర- శ్రీకృష్ణుడు ఆంటీనాచికాడా అండి?

సౌజ- యేమి పెంకెవు!

మధుర- అయితే యీపుస్తుకం చదువుతాను. చదివి మంచిదానను అవుతాను.

సౌజ- కావలిస్తే ఆపుస్తుకం తీసుకువెళ్లు.

మధుర- కృతార్థురాలను- శలవా?

సౌజ- (వెన్ను కుర్చీవేపుచూచి యోచించి)నువ్వు మంచిదానివి. యెవరో కాలుజారిన సత్పురుషుడిపిల్లవై వుంటావు. యీవృత్తి మానలేవో? స్థితిలోపమా?

మధు- దైవానుగ్రహంవల్ల లోపంలేదు. నావృత్తియొక్క హైన్యత గుర్తెరుగుదును. సత్పురుషులదయ సంప్రాప్తమైన తరవాత దుర్వృత్తి యేలవుంటుంది?

సౌజ- (భగవద్గీతాపుస్తకము మీదనున్న శ్రీకృష్ణుని విగ్రహమును వేలునజూపి)సత్పురుషుడనే నామము సార్థకముగాగల యీ సత్పురుషుణ్ణి నీకు యిచ్చాను ఆయన స్నేహం బలమైనకొలదీ మాబోంట్లను తలచవు.

మధు- అప్పటప్పట తమదర్శనము చేసుకోవచ్చునా?

సౌజ- (తటపటాయించును.)

మధు- వృత్తిమానినా, మంచి-

సౌజ- అయితే రావచ్చును.

మధు- కృతార్థురాలను. (పుస్తకము వక్షమున ఆని చేతులు జోడించి) శలవు!

సౌజ- మరోమాట! (మధురవాణి ప్రశ్నార్థకముగా కనుబొమలెత్తి చూచును) నీకు గిరీశంగారి పరిచయం యెక్కడ?

మధు- క్షమించండి.

సౌజ- చెప్పవా?

మధు- తాము చెప్పకతీరదని ఆజ్ఞాపిస్తే దాటగలనా? పాపము ఆయనను బతకనియ్యండి.

సౌజ- అతడి బతుకుమాట ఆలోచించుతున్నావు. వీడు అవ్యక్తుడైతే, పాపము ఆ బుచ్చమ్మ బతుకు చెడుతుంది. అది ఆలోచించావుకావు.

మధు- (ఆలోచించి)అవును. ఆయన నాకు కొంతకాలం యింగిలీషు చదువు చెప్పేవారు. కొంతకాలం వుంచుకున్నారు కూడాను.

సౌజ- యెన్నాళ్లకిందట?

మధు- మొన్న మొన్నటి దాకా.

సౌజ- చిత్రం! ఒక్క నిమిషము ఆగు (పైకివెళ్లి గిరీశమును వెంటబెట్టుకునివచ్చి) నెపోలియన్‌ ఆఫ్‌ యాంటి నాచ్‌గారూ! యీమెను మీరు యెరుగుదురా?

గిరీ- కొంతకాలంకింద గిరీశం అనే ఫూలిష్‌ యంగ్‌మాన్‌ వొకడు వుండేవాడు. మధురవాణి అనే అబ్యూటిఫుల్‌ నాచిడెవిల్‌ ఒకతెవుండేది. వాడి దురదృష్టం వల్ల దానివలలలో చిక్కి, మైమరచి అంధకారంలో పడిపోయినమాట సత్యము. గురువుల ఉపదేశం కొంతకాలానికి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ అంధకారంలోంచి వెలువడి గురువుల పాదములు చేరుకుని గతం కలగాభావించి, మరిచి, మంచి తోవలో పడ్డాడు. ఆగిరీశవేఁ యీ గిరీశం- ఆ మధురవాణే యీ మధురవాణి! స్వర్గానికి ఒక్క చీడీ తరవాయిగా వున్న నన్ను నరకానికి లాగడానికి తిరిగీ యిక్కడ నాపురాకృతంవల్ల ఆవిర్భవించింది! ఐటర్నడ్‌ ఆల్టుగెదరే న్యూలీఫ్‌- పాపంలో కాలుజారి, పశ్చాత్తాపపడి, రిఫార్ము అయినాను. నావంటి సిన్నర్సిని సహాయంచేసి మంచివాళ్లని చెయ్యడం తమ బిరుదుగాని, బ్రతుకుచెరచడం న్యాయంకాదు. ఐక్రేవ్‌ యువర్‌ మెర్సీ.

సౌజ- యెన్నాళ్లైంది చీకట్లోంచి వెలుతురులోకి వురికి?

గిరీశం- (వూరుకుండును.)

సౌజ- (మధురవాణితో)నువు చెప్పగలవు.

గిరీశం- యెన్నాళ్లైతేనేమండి? ట్రూరిపెంటెన్సు ట్వంటీఫోర్‌ అవర్సు చాలదా అండి?

సౌజ- ఔరా! నీలాంటి ఆషాఢభూతులవల్ల నీ గురువుగారు యెంత సులభంగా దగాపడతారూ! అరె, నన్నుకూడా భ్రమింపజేస్తివే! నిన్ను మరి చేరనివ్వవద్దనీ, బుచ్చమ్మను పూనాలో విడోజుహోముకు పంపమనీ మీ గురువుగారి పేర టెల్లిగ్రాంయిస్తాను. ఆమె చదువుకుని ప్రాజ్ఞురాలై తనయిష్ఠము వచ్చినవారిని పెళ్లిచేశుకుంటారు. లేకుంటే మానుతారు. రిఫారము అయితివనిగదా నీవు చెప్పితివి. నిజమైతే, కాలేజీలో ప్రవేశించి, పైపరిక్షలకు చదువుకో. నీ ప్రవర్తన బాగున్నంతవరకు ద్రవ్యసహాయం చేస్తాను. బుద్ధితెచ్చుకుని బతుకు. మధురవాణిని డెవిలంటివే? నీవే డెవిల్‌. ఆమె నీ అయోగ్యత అయినా నొక్కి అడిగితేగాని చెప్పిందికాదు. వక సత్యకాలపు బ్రాహ్మడిని కాపాడడమేకాకుండా, దుర్మార్గుడవైన నీచేతిలో పడకుండా బుచ్చమ్మను కాపాడింది. నాకు వక మహోపకారంకూడా చేసింది. గనుక, నాసంతోషమును తెలియచేయుటకు, యిదిగో ఆమెతో షేక్‌హాండ్‌ చేస్తున్నాను. (షేక్‌హాండ్‌ చేయును) నెపోలియన్‌! తక్షణం యింట్లోనుంచి పైకిపో!

గిరీ- డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది.

(తెరదించవలెను.)

---*---