కన్యాశుల్కము/పంచమాంకము

వికీసోర్స్ నుండి


శ్రీ

కన్యాశుల్కము

పంచమాంకము


1-వ స్థలము. లుబ్ధావధాన్లు పడకగది.

లుబ్ధావధాన్లు మంచముమీద పరుండివుండును. నిద్రలో అరచి, కాళ్లూ చేతులూ కొట్టుకుని, లేచికూచుని వణకనారంభించును,

లుబ్ధా-- అసిరిగా! అసిరిగా! అమ్మీ! చంపేశాడఱ్ఱోయి. రామనామతారకం । రామనామతారకం । రామనామతారకం । రామనామతారకం ॥ యిది రెండోపెళ్లి ముండే. దీనిమొగుడు పిశాచ వైఁనాడు - నాపీకపిసికి చంపేస్తాడు. యేవిఁటి సాధనం? రామనామతారకం । రామనామతారకం ॥

(తలుపు అవతలనుంచి) అసిరిగాడు- యేటిబాబూ? యేటిబాబూ? (తలుపుతట్టును.)

మీనా-- యేవిఁటినాన్నా, తలుపుతియ్యి.

లుబ్ధా-- (తనలో) కాళ్లు ఆడవు. చేతులు వొణుకుతున్నాయి. (తలుపుతీయును; అసిరిగాడితో) వెధవా నువ్వు లోపలికిరాకు.

అసిరి-- నాను పిలుస్తొస్సినాను (నిష్క్రమించును.)

(మీనాక్షి - శిష్యుడు ప్రవేశింతురు.)

లుబ్ధా-- (మీనాక్షితో) ఆముండని అవతలుండమను.

మీనా-- నువ్వు మనగదిలోకి వెళ్లిపో అమ్మా (శిష్యుడు గది అవతలకివెళ్లును) యేవిఁటినాన్నా?

లుబ్ధా-- యిహ, నేబతకను.

మీనా-- యేవొఁచ్చింది నాన్నా, కడుపునొప్పా కాలునొప్పా?

లుబ్ధా-- కడుపునొప్పీకాదు, కాలునొప్పీకాదు. వెధవముండని పెళ్లాడిన కుంకపీనుగ బతకడం యలాగ?

మీనా-- యేవిఁటా వోగాయిత్యం మాటలు, నాన్నా? మీకు యీలేనిపోని అనుమానం యవరుపెట్టారు?

లుబ్ధా-- అనుమానవేఁవిఁటి? నిజం, నిజం, నిజం - వూరంతా అదేమాట.

మీనా-- యీరావఁప్పంతులే యిలాంటి అపవాదులన్నీ వేస్తూవుంటాడు. కనపడ్డవాడితోఅల్లా వూసు పెడితే, వూరంతా అనుకోరూ? బంగారంలాంటి పిల్లని యిలాంటిమాటలని బెంబేరు పెట్టకండి. తండ్రి వెళ్లిపోయినాడని అది రాత్రీపొగలూ యేడుస్తూంది.

లుబ్ధా-- వెధవతండ్రీ, బోడితండ్రీని! గాడిదకొడుకు రెండో పెళ్లిముండని నా పీకకి ముడేసి అమాంతంగా నాకొంప ముంచాడు. యిహ బతకను యిహ బతకను.

మీనా-- "రెండో పెళ్లిముండ, రెండో పెళ్లిముండ," అని శుభమల్లే అనకండి. మీరే యిలా సాటుతూవుంటే వూరంతా అనడం ఆశ్చర్యవాఁ? మాట్లాడక వూరుకోండి.

లుబ్ధా-- వూరుకోవడ వెఁలాగే? మనవూరా, మనదేశవాఁ? రెండో పెళ్లి ముండ కాకపోతే ఆతండ్రి వెధవ, పేరయినా చెప్పకుండా పారిపోవడవేఁవిఁ?

మీనా-- సిద్ధాంతితో చెప్పాట్టే, పేరు?

లుబ్ధా-- వాడి శ్రాద్ధం చెప్పాడు. సిద్ధాంతి గడియకో పేరు చెబుతున్నాడు.

మీనా-- అతగాడికి మాత్రం కొత్తవాడి పేరు జ్ఞాపకంవుంటుందా యేవిఁటి? మనపిల్ల మనయింట్లో వున్నతరవాత, అతగాడి పేరుతో మీకేంపని?

లుబ్ధా-- యీ పెళ్లాం ముండ నాయింట్లో వుంటే నేను చచ్చిపోతాను; మరిబతకను.

మీనా-- వెఱ్ఱి కేకలెయ్క నోరు మూసుకుని వూరుకోండి. యిరుగుపొరుగువారు నవ్వగల్రు. మీ మావఁగారు యంతపండితుడు, యంతదొడ్డమనిషి! లేనిపోని అనుమానాలు పెట్టుగోకండి. పసిపిల్ల బెంగెట్టుకోగల్దు.

లుబ్ధా-- ఓసి భ్రష్టా! వాడు నీకేవఁయినా యిచ్చాడా యేవిఁటే, వాణ్ణి వెనకేసుకు మాట్లాడుతున్నావు? నీకు నేను చచ్చిపోవాలని వుందికాబోలు!

మీనా-- యేవిఁటా మతిపోయిన మాటలు! అతగాడు రేపో నేడో వొచ్చి, యిలాంటి మాట్లన్నందుకు మన నోట్లో గడ్డిపెడతాడు.

లుబ్ధా-- అతగాడెవడు, వొల్లకాట్లో రావఁనాధాయ! మరెక్కడొస్తాడు వాడు! యిహ, నాకు చావుసిద్ధం.

మీనా-- మీకు చావేం వొచ్చింది యిప్పుడు? ఒహవేళ రెండోపెళ్లి పిల్ల అయితే మాత్రం, గుప్‌చప్‌ అని వూరుకోవాలిగాని, అల్లరి చేసుకుంటారా? యీరోజుల్లో యంతమంది రెండోపెళ్లి చేసుకుని సుఖంగా వున్నారుకారు? పిల్ల బుద్ధిమంతురాలు. మీ అదృష్టంవల్ల దొరికింది. మాట్లాడక వూరుకోండి.

లుబ్ధా-- నా అదృష్టం తగలబడ్డట్టేవుంది. నీకేం పోయీకాలం వొచ్చిందే! నువ్వుకూడా యీ కుట్రలోచేరి, నీతండ్రికి కళ్లుగప్పి వెధవపెళ్లి చేశావే? అయ్యో వెధవని పెళ్లి చేసుకున్న కుంకవెధవా నీ బుద్ధెక్కడికి పోయిందిరా? నీ చదువెక్కడికి పోయిందిరా? నీ వేదం తగలబడనూ - యిహ బతకను!

(మీనాక్షి నవ్వును.)

లుబ్ధా-- నవ్వుతావేవేఁ భ్రష్టాకారిముండా? నువ్వూ, నీసవిత్తల్లీ నన్ను చంపేసి రాజమహేంద్రం పారిపోయి, వెధవపెళ్లి చేసుకుంటారు. నాకు తెలుసును. గిరీశంగాడు అన్నమాట నిజం. వెధవని చెవిపెట్టానుకాను. నా సొమ్మంతా ఘటాశ్రాద్ధప వెధవల పాలవుతుంది. నువ్వుపో, నేను పడుకుంటాను. (పక్కమీద పడుకుంటూ) మళ్లీవొస్తాడు గాబోల్రా దేవుఁడా!

మీనా-- యవరు నాన్నా?

లుబ్ధా-- నువుపో, నీకెందుకు! ఆవెధవ నాపీకపిసికేస్తాడు. నీకోరిక తీరుతుంది.

మీనా-- మీరలా అంటే నాకు యేడుపొస్తుంది. నేనిక్కణ్ణించి కదలను. యవడా పీకపిసికేవాడు?

లుబ్ధా-- అయితే యిక్కడ పక్కేసుకుపడుకో.

మీనా-- పడుకుంటాను. యవడు మీపీకపిసుకుతాడు?

లుబ్ధా-- ఆ ముండ మొదటిమొగుడే. యిందాకా నువురాకముందు, నాగుండెలమీదెక్కి, పీకపిసికేటప్పటికి ప్రాణం పోయిందనుకున్నాను.

మీనా-- నిజంగానూ! - కలగన్నారు కాబోలు - నాన్నా.

లుబ్ధా-- కలెక్కడి కలే! పీక నులుచుకుపోతేనూ!

మీనా-- మొదటి మొగుణ్ణి మీకేం తెలుసును?

లుబ్ధా-- వాడే చెప్పాడే! "వెధవా! నాపెళ్లాన్ని పెళ్లాడావు; నిన్ను చంపేస్తా"నన్నాడే.

మీనా-- యలా వుంటాడు?

లుబ్ధా-- గిరీశంగాడి మూడు మూర్తులూనే.

మీనా-- కలగాబోలు నాన్నా. అదే తలుచుకు పడుకుంటే, చిన్నబాబు కల్లోకొచ్చాడు కాబోలు.

లుబ్ధా-- నేను చస్తే యవరికి విచారం!

మీనా-- ఆపిల్లని వెళ్లి అడుగుదునా?

లుబ్ధా-- వొద్దు, వొద్దు, తొందరపడకు.

మీనా-- నన్ను తిట్టేస్తున్నారు, దాని చచ్చినమొగుడు మిమ్మలిని చంపేస్తాడని భయపడుతున్నారు. యెందుకీతంబళ అనుమానం? ఓమాటు దాన్నేఅడిగేస్తే ఉన్ననిజం తెలిసిపోతుంది.

లుబ్ధా-- నిజం నీతో చెబుతుందీ?

మీనా-- నాతో నిజం చెబుతుంది. అది వొట్టి సత్యకాలప్పిల్ల. నాకు యంతో వుపచారం చేస్తుంది.

లుబ్ధా-- దాన్ని పాడుచేస్తున్నావూ?

మీనా-- యిలాంటి మాటలంటేనే నాకు అసయ్యం. మీరు యక్కడో దడుసుకున్నారు కాబోలు; అంచేత దుష్టుకల వొచ్చింది. అంతేగాని, రెండోపెళ్లీ, మూడోపెళ్లి, అని, వెఱ్ఱులు వోడకండి. పూజారి గవరయ్యని పిలుస్తాను; అతగాడు యింత మంత్రించి వీబూదియిస్తాడు రాసుకుపడుకొండి.

లుబ్ధా-- కొంపతీస్తావా యేవిఁటి? వాడొస్తే, వాడితో యేవఁని చెప్పడం? దాన్నే నిజం అడుగుదూ.

మీనా-- నే నడగను, నాన్నా, నన్ను అడ్డవైఁన మాటలూ అంటూంటే, నే నెందుకు అడుగుతానూ? నేం దాంతో యిగమాట్లే ఆణ్ణు.

లుబ్ధా-- నాతల్లివికాదూ, అడుగమ్మా.

(మీనాక్షి పైకివెళ్లును.)

లుబ్ధా-- ఓ పన్నం యాకర బెట్టేదా? గాయత్రీ స్మరణ చేసేదా? వేదాలూ, మహామంత్రాలూ, యీ దెయ్యాలకి పేలపిండి వొడియాలు. శాపరమంత్రాలు ఉపదేశం అవుదావఁంటే, బెడిసి గొడతాయేమో అని భయం. యేవిఁసాధనం? "రామనామతారకం" స్మరణ చేస్తాను. "రామనామతారకం । భక్తిముక్తిదాయకం । జానకీమనోహరం । సర్వలోకనాయకం । రామనామతారకం । రామనామతారకం" యీముండ యింట్లోవుంటే, నే బతకను. "రామనామతారకం । రామనామతారకం" ॥ రుద్రాక్షతావళంయేదీ? (మంచము అంచునకూచుని పరుపుకింద తడివిఁ, రుద్రాక్షతావళం తీయుచుండగా మీనాక్షి ప్రవేశించి.)

మీనాక్షి-- మీమాట నిజవేఁ నాన్నా!

లుబ్ధా-- నిజవేఁ!

(మంచముమీదినుంచి కింద కూలబడును.)

మీనాక్షి-- (లేవదీసి) నాన్నా! నాన్నా! పడిపోయినావేవిఁ?

లుబ్ధా-- యేవీఁలేదూ. నిజవేఁ! నిజవేఁ!

మీనా-- నిజవేఁను. ఆమొగుడు యిప్పుడే దానిక్కూడా కనపడి, "ముండా, మళ్లీ పెళ్లాడావే? నీ కొత్తమొగుణ్ణి పీకపిసికేస్తాను చూడు" అన్నాట్ట.

లుబ్ధా-- అయ్యో! అయ్యో! రామప్పంతులు యిల్లు వొల్లకాడు కానూ! యక్కడ కల్పించాడే యీమాయపెళ్లి నాకోసం! వీడి పిండం పిల్లులికి పెట్టా! అయ్యో! అయ్యో! ఆమొగుడు వెధవ యలా వున్నాడందే?

మీనా-- వాడు రోజూ దానికి కనపడతాట్ట నాన్నా. వాడికి మీసాలూ, గిరజాలూ వున్నాయట, చావం చాయట.

లుబ్ధా-- వాడేనే! వాడేనే! యేవిఁటే సాధనం? యిహ నేం దక్కను.

మీనా-- పూజారి గవరయ్యకి కబురుపెడతాను.

లుబ్ధా-- వొద్దు, వొద్దు, నామాటవిను. వాడొచ్చాడంటే, యిల్లు తినేస్తాడు.

మీనా-- తింటేతింటాడు. ప్రాణంకంటేనా యేవిఁటి?

లుబ్ధా-- నాకొద్దంటూంటే వినవుగదా. నువ్వు నామంచం దగ్గిర పక్కేసుకుపడుకో; నువ్వు చదువుకునే భాగవతం పుస్తకం పట్రా; తలకిందపెట్టుకు పడుకుంటాను.

(మీనాక్షి వెళ్లును.)

యీముండ నాయింట్లోంచి విరగడైపోతేనేగాని, యీ పిశాచం వొదిలిపోదు. వేదం చదువుకున్న ముండాకొడుకుని, నామీదే పడ్డతరవాత, వీడు బ్రహ్మరాక్షసిగాని, వొట్టిదెయ్యంకాడు. పోనీ అతడికే ప్రార్ధనచేస్తాను - "నాపెళ్లాం మొదటిమొగుడా!" ఆఁ! నాపెళ్లాం కాదు. లెంపలు వాయించుకుంటాను. "యీపిల్ల మొగుడా! నువ్వే నిజవైఁన మొగుడివి - నేనుకాను. దాన్ని ముట్టను - తాకను - దాంచేత చాకిరీ అయినా చేయించను. నన్ను రక్షించి, పీకపిసికెయ్యకు; పీకపిసికెయ్యకు; యేపాపం చెయబట్టో దెయ్యానివైనావు. నన్ను చంపావంటె బ్రహ్మహత్య చుట్టుకుంటుంది. మరిజన్మం వుండదు. బాబూ! నాయనా! తండ్రీ! నాజోలికి రాకు. నీమావఁగారి పీకనులివెఁయ్యి! ఆరావఁప్పంతులుగాడి పీకనులివెఁయ్యి! లేకపోతే," (కేకలు, యేడ్పు వినబడును) ఓరిదేవుడా, మళ్లీ వొచ్చాడు కాబోలు (శిష్యుడు యేడుస్తూ పరిగెత్తివచ్చి లుబ్ధావధాన్లును గట్టిగా కౌగలించుకొనును. మీనాక్షి శిష్యుణ్ణి చీపురుగట్టతో కొట్టబోవును. శిష్యుడు తప్పించుకోగా, దెబ్బలు లుబ్ధావధాన్లకు తగులును.)

మీనా-- ముండా! నామొహురు అక్కడపడేస్తావా పడెయ్యవా? నాతాళం యేదేలంజా?

లుబ్ధా-- నన్ను కొట్టేశావేవిఁటే? (శిష్యుడితో) వొదులు, వొదులు. నన్ను ముట్టుకోకే తల్లీ (మీనాక్షితో) దీని అపవిత్రపు వొళ్లుతగిల్తే చచ్చిపోతాను. నన్ను వొదిలిపించెయ్యి.

(మీనాక్షి శిష్యుడి రెక్కలుపట్టిలాగి, బుగ్గగిల్లును. శిష్యుడు మీనాక్షి చెయ్యికరిచి పారిపోవును.)

మీనాక్షి-- దానమ్మ కడుపుకాలా, చెయ్యి కరిచేసింది నాన్నా - రక్తం బొటబొట కారుతూంది - దీన్ని హతవాఁరుస్తాను.

లుబ్ధా-- యంత దారుణప్పని చేసిందీ, ముండ! యేదమ్మా చెయ్యి (గుడ్డపీరికతో రక్తంతుడిచి) మొహురడిగావుగదా యెక్కడిదేవిఁటి?

మీనాక్షి-- ఆతండ్రివెధవ నాకిమ్మని యీముండచేతికి యిచ్చాడు. దీనినక్క వినయాలు చూసి నాపెట్టాబాడా దానికే వప్పజెప్పి, ఆమొహురు దాన్నే దాచమన్నాను. అనుమానవేఁసి యిప్పుడు నామోరుతెమ్మంటే, "బట్టలపెట్లో పెట్టాను తాళంపోయింది" అంది. తాళంతాకపోతే రోకలితో బుఱ్ఱ చితకబొడుస్తాను.

లుబ్ధా-- చెయి జేసుకోకు. నీది వెఱ్ఱికోపం చావగొట్టగలవు జాగ్రత!

మీనా-- చస్తే యీడిచిపారేస్తాను. ముండయలా కరిచిందో చూడండీ. యింకా రక్తంకారుతూందీ. మనిషికాటుకి మందులేదన్నాడు.

లుబ్ధా-- కుంకం పెట్టమ్మా.

మీనా-- దానిబుఱ్ఱ చితకబొడిచి మరీ పెడతాను (మీనాక్షి వెళ్లును.)

లుబ్ధా-- గుండుగొమ్ముల అనుమానం తీరిపోయింది - పీకనులివిఁ, వాడైనా చంపేస్తాడు; కరిచి అదైనా చంపేస్తుంది. వీడిచేతో, దానిచేతో, చావుతప్పదు. యెంతడబ్బెట్టి కొనుక్కున్నాన్రా, యీచావుపెళ్లీ! అయ్యో! అయ్యో! దీన్ని పైకి తగిలేస్తే వాడుకూడా విరగడైపోతాడు. అదేసాధనం - యెక్కడికితోలెయ్యను? బండీమీద యెక్కించి పట్ణంతోలేస్తాను - అక్కడగానీ తండ్రి వెధవ కనపడకపోతే మళ్లీ దెయ్యాన్ని నెత్తినిపెట్టుకుని ప్రత్యక్షం అవుతుందే! బండి అద్దె యిచ్చుకోవడవేఁ మిగుల్తుంది - యేమి సాధనం? - యేమిసాధనం? - రావఁప్పంతుల్ని సలహా అడుగుదునా? ఆఁ! మంచి ఆలోచన తోచింది. - రామప్పంతులు నాకు కట్టిపెట్టిన యీ ముండని, వాడిదగ్గిరికే పంపించేస్తాను - సానిదాంతోపాటు దీన్ని కూడా వుంచుకుంటాడు. - కావలిస్తే పదిరూపాయలు దక్షిణతోకూడా యిచ్చేస్తాను.

(మీనాక్షి ప్రవేశించి.)

మీనా-- యక్కడా కనపడదు నాన్నా గుంట.

లుబ్ధా-- నూతులో పళ్లేదుగద?

మీనా-- యేమో!

లుబ్ధా-- పరిగెత్తెళ్లి గవరైని పిలవమను. దాన్ని నువ్వు చావగొట్టలేదుగద?

మీనా-- కనపడితేనా?

లుబ్ధా-- యేవిఁటినాయనా, యీకొత్త ఉపద్రం!

(నిష్క్రమింతురు.)

2-వ స్థలము. రామప్పంతులు యింట్లో కొట్టుగది.

(భుక్త, పోలిశెట్టి, సిద్ధాంతి, మధురవాణి పేకాడుచుందురు. పూజారి గవరయ్య ఆట చూచుచుండును.)

పోలిశెట్టి-- యేంభష్టాకారి ముక్కలు యేశావయ్యా! యెప్పుడూనువ్వింతేను.

భుక్త-- చూసివేశానా యేవిఁటి? నీ దరిద్రదేవతని తిట్టు.

పోలి-- గవరయ్యా, నీముణుకు నాదగ్గిర యిలా యెట్టకు. లేచిపో, నీపుణ్యవుఁంటుంది.

గవ-- నేను మా మధురవాణిదగ్గిర కూచుంటాను.

భక్త -- చూడూ, ముక్కతప్పు పడ్డట్టుంది.

పోలి-- ఆఁ! బాపనయ్య పంచాలని తప్పు పంచుతున్నావు. తప్పు పంచితే బేస్తుమీద కుదేలెట్టిస్తాను.

భుక్త-- ముక్కలు బాగా పడలేదన్నావే?

పోలి-- రెండో యేత నాలుగాసులడకూడదా?

భుక్త-- (పోలిశెట్టికి ముక్కలువేస్తూ,) యిదుగో నాలుగాసులేస్తున్నాను. జుఱ్ఱు.

పోలి-- నీయిషపచేత్తో యేస్తే, పొల్లుముక్కలే పడతాయి; మంచి ముక్కలడతాయా?

భుక్త-- తథాస్తు!

పోలి-- అలా అనకు. యెంతశెడ్డా బాపనాడి శాపనాకారం మాశెడ్డది. (చూచుకొని) శీ! భష్టాకారి ముక్కలు!

సిద్ధాం-- ఒకటి, రెండు.

పోలి-- అదుగో, అలాశెప్పితే నే వొప్పను, ఒక్కొకటి శెప్పాలి.

సిద్ధాం-- అయితేవకటి.

పోలి-- ఒక్కటీ.

మధురవాణి-- ఒకటి.

భుక్త-- వకటి.

(సిద్ధాంతి ఆలోచించును.)

పోలి-- యే టాలోసిస్తావు చేతరస! యెత్తవయ్యా.

సిద్ధాం-- నీదేంపోయింది! రెండు.

పోలి-- లాంతరేశావు. యేటెత్తను? రొండు.

మధు-- రెండు.

భుక్త-- రొండు.

(సిద్ధాంతి ఆలోచించును.)

పోలి-- యే టాలోసిస్తావు? చేతరస; యెత్తి బేస్తుగెలుసుకో.

సిద్ధాం-- నువు చెప్పావుగనక యెత్తుతాను.

పోలి-- ఆఁ! డబ్బక్కడెట్టి మరీయెత్తు. మూడో యెత్తడపుబేస్తు; గాపకవుఁందా? బేస్తుమీద కుదేలెట్టిఁ బాకీ లెట్టి, యగెయడానికా?

సిద్ధాం-- (తనముక్కలు యెత్తుముక్కలమీదవేసి) కోవఁటాడి పిలక నిగుడుతూంది!

పోలి-- తంతావాయేటి?

సిద్ధాం-- తన్నడవఁంటే, ఒహలాగనా?

పోలి-- నా ఆట శెడగొట్టేశినావు, బాపనయ్యా!

భుక్త-- ముక్కలు పడలేదని యేడుస్తూ, మళ్లీ యేవిఁటి, ఆట చెడగొట్టాడని యేడుస్తావు?

పోలి-- యీ ఆట బేస్తుచేయించకపోతే నా పేరు-

సిద్ధాం-- కోవఁటాడా, నోరు మూసుకుంటావా మూసుకోవా?

పోలి-- తెల్లాడిబావుటా యెగురుతుండగా, నీ జులువేఁటి? ముక్కల్తియ్యడం యింతసేపైతే, మరాటేటి?

సిద్ధాం-- నువ్వుగానీ మళ్లీ మాట్లాడావంటే, ముక్కలు కలిపెస్తాను.

(పోలిశెట్టి "నేను మాటాడను; నువ్వు ఆడు" అని సౌజ్ఞచేయును. సిద్ధాంతి ఆడును.)

పోలి-- మూడే తురుపులుపడ్డాయి బాపనాడా; "తమాషాదేఖో, లంకకేరాజా!"

సిద్ధాం-- ఆటపారెయనా?

పోలి-- బుద్ధొచ్చింది; బుద్ధొచ్చింది. లెంపలోయించుకుంటాను. మరి మాటాడితొట్టు.

పూజారి-- మా మధురవాణిమీద ఆశుకవిత్వం చెబుతాను.

    రాణా, డైమనురాణీ? ।
    రాణా, యిస్పేటురాణి? రాణి కళావ ।
    ఱ్ఱాణా, ఆఠీన్రాణీ? ।
    రాణి యనన్మధురవాణె, రాజులరాణీ ॥

సిద్ధాం-- గవరయ్యా! యేంవిలవైన పద్యం చెప్పావోయి! నీమీద నేను పద్యంచెబుతాను - విను.

    "గవరయ్యా! నీసరి మరి ।
    యెవరయ్యా?"

పూజారి-- "యెవరు లేరు, యిచ్చోనయ్యా!"

సిద్ధాం-- యిదిగో రాజు.

పోలి-- యిదుగో పాల్తు.

(మధురవాణి తురుఫురాణీ వేయును.)

పోలి-- అదుగో, అదుగో, యీ బాపనాడు కపీశంశెప్పి, మధురవోణిదగ్గిర రాణీ వుందని శెప్పేశాడు. గోరం, గోరం. గవరయగానీ మాటాడితే నే ఆటాణ్ణు.

పూజారి-- పోలిశెట్టిమీద కవిత్వంచెప్పి చాలారోజులైంది. (పొడుంపీల్చి)

    "పోలిశెట్టి ముఖము - పోలిరొట్టెను బోలు!
    పోలిశెట్టిముక్కు పొడుముడొక్కు॥"

పోలి-- వొద్దు! వొద్దు! వొద్దు! నామాటిను. పాసంపెట్టి సంపేస్తావాయేటి! ఊరుకుంటి వొట్టాయినా, యిన్నావా? యీ ఆట సిద్ధాంతి బేస్తెట్టి, నేను గెలిస్తే, నీక్కాండబ్బిస్తాను. మరూరుకో.

సిద్ధాం-- నీసొదతగలడా - తురుఫు మిగిలిపోయింది; బేస్తు. (ముక్కలు చూపించి పారవేయును.)

పోలి-- ఆఁ! మూడో యెత్తడబ్బేస్తు. గాపకాలుంచుకొం డయ్యా, చేతివొరస, మంచిముక్కలెయి, బాపనాడా అంతసేపు కలపడవాఁ? గోరం, గోరం.

సిద్ధాం-- బులబులాగ్గాకలిపి, బేస్తు నీకిస్తాననుకున్నావా?

పోలి-- తోలుసేత్తో, ముక్కలేసినావు! "నరిసింవ్వ, నీదివ్వె నామమంతరముశాత! నరసింవ్వ నీదివ్వె-"

సిద్ధాం-- దివ్వేలేదు, దీపంలేదు ముక్కల్తియ్యి.

పోలి-- గవరయ్య ముక్కలమీద కన్నేసి సిల్లంగెట్టేస్తున్నాడు. నరిశింవ్వ నీదివ్వె- (ముక్కలు యెత్తిచూసి) సీ! భష్టాకారి ముక్కలేశావు.

సిద్ధాం-- (పంపకంముగించి తనముక్కలు తీసి చూచుకొని) మృత్తికాచమే!

పూజారి-- పోలిశెట్టికి అంత అలకైతే, నే నింటికిపోయి పరుంటాను.

(గవరయ్య నిష్క్రమించును. మధురవాణి వెంటవెళ్లి తిరిగివచ్చును.)

పోలి-- శని విరగడైపోయిందిరా, దేవుఁడా! - ఒట్టి భష్టాకారిముక్కలు. ఒహటీ.

మధు-- ఒకటి.

భుక్త-- ఒహటి.

సిద్ధాం-- ఒహటి.

పోలి-- రొండు.

మధు-- రెండు.

భుక్త-- రొండు.

(సిద్ధాంతి ఆలోచించును.)

పోలి-- యెందుకాయెఱ్ఱాలోశన? నామాటిను. మూడోబేస్తెట్టకు.

(వీధి తలుపు తట్టబడును.)

మధు-- పంతులు!

పోలి-- యీవాళరాడని సెప్పితివే?

మధు-- రారనుకున్నాను వొచ్చారు. యేంచేదాం?

సిద్ధాం-- ఆటతీసెయ్యండి. (ముక్కలుపడవేయును.)

పోలి-- బేస్తెగెయడానికా? నే నొప్పను. మధురోణి, ఆటాడి మరీ తలుపు తియ్యి.

మధు-- (ముక్కలుకిందబెట్టి, లేచి, సన్నని గొంతుకతో) గోడగెంతి పారిపోండి.

భుక్త-- దిడ్డితోవంట వెళ్లిపోతాం.

పోలి-- నేను పట్టనే? యేటి సాధనం?

భుక్త-- మేం దిడ్డితోవంట పోతాం. నువ్వు అటకెక్కు.

పోలి-- నన్నెక్కించి మరీ యెళ్లండి. కాలుజారితే యేటిసాధనం?

సిద్ధాం-- నీకొడుకుది, అదృష్టం.

(పెరటిలోకి వెళ్లును.)

పోలి-- గోరం! గోరం! గోరం! యవడిముక్కలు ఆడిదగ్గిరే! ఆట కలపకండి.

(తలుపు తిరిగీ తట్టబడును.)

పోలి-- నరిశింవ్వ, నీ దివ్వె-

(మధురవాణి ఊరుకొమ్మని కోపరసంగా సౌజ్ఞ చేయును.)

(సిద్ధాంతి ప్ర`వేశించును.)

సిద్ధాం-- దిడ్డీతలుపు కప్పతాళం వేశుంది. మన్నిపట్టుగుందావఁనే, పంతులు దిడ్డీతలుపు తాళవేఁశాడు.

పోలి-- నరిశింవ్వ, నీదివ్వె-

మధు-- (పోలిశెట్టి ఉద్దేశించి) చప్‌! (సన్నని గొంతుకతో) ఉలక్కుండా, పలక్కుండా యీగదిలో కూచోండి; ఆయన పరున్నతరవాత వచ్చి తలుపుతీసి వొదిలేస్తాను.(మధురవాణి దీపములుఆర్పి, పైకివెళ్లి, గదితలుపువేసి గొళ్లెము బిగించును.)

(తలుపు తిరిగీ తట్టబడును.)

మధు-- యేవీఁ గవరయ్య చాదస్తం! అదే తట్టడవాఁ? (వీధితలుపుదగ్గిరకు వెళ్లి,) యెవరు!

తలుపవతల మనిషి-- యింతసేపేం?

మధు-- నిద్దరబోతున్నాను.

మనిషి-- పేక! పేక! పేక! నిన్నొదిలేస్తాను. నీ సంగతి నాకు తెలిసింది.

మధు-- మరి, మీ మానాన్న మీరు పోయి, నిశిరాత్రివేళ వొక్కర్తెనీ నన్ను వొదిలేస్తే యీ అడివి వూళ్లో నాకు భయంకాదా? అంచేత పబ్లిగ్గా నలుగుర్నీ పిలిచి పేకాడుతున్నాను. తప్పేవుఁందీ? మంచు పడుతూంది లోపలికిరండి. (తలుపు గడియతీసి) రండి. నా ఆట మీరాడండి, నేను పరుంటాను.

మనిషి-- సాందాన్ని యవడు నమ్మమన్నాడు? నీకిద్దావఁని సంతోషంతో వక సరుకు తెచ్చాను. నీచర్య చూసేటప్పటికి నామనస్సు చివుక్కుమని పోయింది.

మధు-- యెంత న్యాయంగా సంచరించినా, మీ హృదయంలో కాసింత కనికరం లేదుగదా? యీ నాటినుంచి మీరు యెక్కడికి కమాను వెళుతూవుంటే, అక్కడకల్లా నేనుకూడా మీతో వొస్తూవుంటాను.

మనిషి-- మెడపైకివుంచు (మధురవాణి అటులచేయును. ఆమనిషి మధురవాణి మెడలో కంటె వుంచును.)

మధు-- ఔరా! యింద్రజాలి! పంతులు గొంతుక యెలా పట్టావు? నన్నే మోసపుచ్చితివే? (రెక్కపట్టుకొని) గదులోకిరా (గదులోనికి తీసుకువెళ్లును) యీ చిల్లంగి కళ్లు నీకే దేవుఁడిచ్చాడు? (ముద్దెట్టుకొనును) వాళ్లింట యేవేఁవిఁచిత్రాలు చేశావో చెప్పు.

శిష్యు-- ముద్దెట్టుకోనంటే చెబుతాను.

మధు-- నీకు తగనో?

శిష్యు-- ముద్దెట్టుకుంటే యెంగిలౌతుంది.

మధు-- నిజం. నీకున్నబుద్ధి నీ పెద్దలికిలేదు. నన్ను నిష్కారణంగా భయపెట్టావు. అందుకు నీ కేవిఁటిసిక్ష? బుగ్గకొరికేతునా?

శిష్యు-- పాలూ పంచదారావుంటే ఇయ్యి.

మధు-- తరవాత మేపుతాను. ముందు నీకు దాసరివేషం వేస్తాను. కొత్త అగ్రహారంపోయి నీగురువును చేరుకుందుగాని.

(తెరదించవలెను.)

(చీకటిగదిలో పోలిశెట్టి, భుక్త, సిద్ధాంతి వుందురు - తెర అవతలనుంచి రామప్పంతులు గొంతుకతో, శిష్యుడు "ఈగదులో యవణ్ణో దాచావు.")

మధు-- రామ ! రామ! యవ్వడూలేడు.

(పోలిశెట్టి నిచ్చెనయెక్కును. భుక్తకూడా యెక్కబోవును. నాలుగు మెట్లెక్కి యిద్దరూ కింద బడుదురు.)

పోలి-- సంపేశినావు, బాపనాడా!

భుక్త-- నామీద నువ్వుపడి, నేను వుక్కిరిబిక్కిరి ఔతూంటే నువ్వు సచ్చానంటావేవిఁటి? లేస్తావా కరిచేదా?

శిష్యు-- (రామప్పంతులు గొంతుకతో) అదుగో లోపల యెవళ్లోమాట్లాడుతున్నారు లంజా! అదికోవఁటాడి గొంతుకలావుంది. కప్పతాళంవేసి వూరందరినీ లేవదీసుకొస్తాను.

మధు-- కప్పతాళవెఁందుకు? లోపల యెవళ్లూలేరు దెయ్యాలకొంప - దెయ్యాలు దెబ్బలాడుతున్నాయి.

(మధురవాణి తలుపుతీసి గదిలో ప్రవేశించి అగ్గిపుల్ల వెలిగించును. శిష్యుడు పక్కకి తొలగిపోవును.)

మధు-- పోలిశెట్టియేమి, పడుకునిలేవడు - మేలుకొలుపులు పాడనా?

భుక్త-- రామప్పంతులేడీ?

మధు-- రామప్పంతులూలేరు, గీమప్పంతులూలేరు. యింట్లో పనిచేసేవాడు తలుపుకొట్టాడు. బెంగెట్టుకోకండి.

భుక్త-- అతగాడిమాటలు వింటేనే?

మధు-- నేనే ఆయనగొంతుకు పెట్టిమాట్లాడాను. యేమిధైర్యం! యేమి మగతనం!

పోలి-- "నరశింవ్వ, నీ దివ్వె" (లేచి) "నామమంతరముసేత" - యవడిముక్కలాడి దగ్గిరున్నాయా?

(అంతా మళ్లీ ఆటకు కూచుందురు.)

సిద్ధాం-- ఆటకలిపేశాను.

పోలి-- గోరం! గోరం! నాకు యిసిపేటు ఆసు దాడదొచ్చిందిగదా, బేస్తులు గెలుసుకుపోదునే! గోరం! గోరం! మధురోణి, ఒట్టినే బెంబేరు పెట్టేశింది. అటకమీంచిపడి నడుంవిరిగిపోయిందిరా దేవుఁడా.

భుక్త-- నీకిందపడి నేను నలిగిపోయినాను. నీకేం తీపు దిగదీసింది?

పోలి-- కలిపియెయ్యెయ్యి - ముక్కలు.

సిద్ధాం-- నేను కలపను - నావొంతు అయిపోయింది - నువుకలుపు.

పోలి-- యేటైపోయింది?

(రామప్పంతులు వీధి తలుపుతట్టును.)

రామ-- లక్ష్మీ, లక్ష్మీ, తలుపు.

మధు-- యీ మాటు పంతులే.

పోలి-- యేటిసాధనం?

మధు-- గోడగెంతి వెళ్లిపోండి.

పోలిం-- నేను గెంతలేనే?

మధు-- నిన్ను యీగదిలో పెట్టి తాళవేఁస్తాను.

పోలి-- దీపం ఆరిపెయ్కు. నాకు బయవేఁస్తుంది.

సిద్ధాం-- గాజుపెంకులు గుచ్చుకుంటాయి; గోడదాటడం యెలాగ?

భుక్త-- నాకు కాళ్లు మేహవాతం నొప్పులు. నేనుగెంతలేనే?

మధు-- (దీపవాఁర్పి) యిలాగే వుండండి.

పోలి-- నరిశింవ్వ,-

మధు-- చప్‌!

పోలి-- సచ్చాను.

మధురవాణి -- (గది గొళ్లెంవేసి, వీధితలుపు గడియతీసి తలుపు ఓరగావుంచి) మాయగుంటని యెక్కడదాచారు?

రామ-- మాయగుంటయేమిటి?

మధు-- యేం నంగనాచే? లుబ్ధావధాన్లు మాయపెళ్లాన్ని వాళ్లయింట్లోంచి లేవదీసుకుపోయి యెక్కడపెట్టారు? యిదేకదూ, రాత్రల్లా మీరు చేస్తూవున్న లౌక్య వ్యవహారం?

రామ-- నీమాట నాకేవీఁ అర్థం కాకుండావుంది. యింట్లోంచి లేవదీసుకు పోవడవేఁవిఁటి? నేను దాచడవేఁవిఁటి?

మధు-- దాస్తే దాచారు. దాచకపోతే మానారు. నాకంటెయేదీ?

రామ-- నీకంటా? మరిచిపోయినానుసుమా!

మధు-- యేమిచిత్రం! నన్ను మరిచారు - నావస్తువని మరిచారు. మరిచి, ఆగుంటకిచ్చారు. దాన్ని లేవదీసుకుపోయి యెక్కడోదాచి, నిశిరాత్రివేళ పెద్దమనిషిలా, యింటికివొచ్చారు!

రామ-- ఆగుంట కనపడ్డదా యేవిఁటి?

మధు-- యేవిఁనాటకం! మీకు కనపడకేం? మీరు పెట్టినచోటేవుంది.

రామ-- మీనాక్షి తన్నితగిలేశిందా యేవిఁటి? కంటెతో తగిలేస్తేచచ్చానే?

మధు-- యేమినాటకం! చావండి; బతకండి; ఆకంటెతాందీ, గడపలో కాలుపెట్టనివ్వను.

(తలుపు వేయును.)

రామ-- నాలుగుకోసులు గుఱ్ఱపసవారీ అయి, యీదురోమని యిల్లుచేరుకుని, గుమ్మంలో అడుగుపెట్టేసరికి, మబ్బులేని పిడుగుపడ్డది. మీనాక్షి ఆగుంటని మన్ననిస్తుందని, నేను యెన్నడయినా అనుకున్నానా యేవిఁటి? ఆగుంట పోతేపోయింది, వుంటేవుంది; నాకంటె పోకుండావుంటే అదృష్టవంతుణ్ణి. కంటెఅడగడానికి వెళితే, "నువ్వే యీ పెళ్లి కుదిర్చావు" అని కఱ్ఱుచ్చు కుంటాడేమో!

(నిష్క్రమించును.)

3-వ స్థలము. లుబ్ధావధాన్లు యింటివాకలి.

లుభ్ధావధాన్లు-- (పచారుచేస్తూ)

కనపడకపోతే యేవైఁనట్టు? నూతులోగానీ పడిందా? పోలీసువాళ్లు యిల్లుదోచేస్తారు. నూతులో పడలేదా? పడకపోతే యేవైఁనట్టు? - రావఁప్పంతులు యింటికి పోయుంటుంది. అంతే కావాలి - యంత అందవైఁన పిల్లా! నాదిగాక దురదృష్టం! యంతట్లో వెన్నెల చీకటైందీ! రేపో యెల్లుండో యెదిగొచ్చే పిల్లగదా అని సంబరపడ్డాను - ఒహవేళ, - అప్పుడే పెద్దమనిషైందేమో? - అందుకు సందేహవేఁలా? లాకుంటే యింత యేపైన పిల్ల పెద్దపడుచు కాకుండావుంటుందా? యిలాంటివి యెన్నిపెళ్లిళ్లు చేసుకుని యందరు మొగుళ్లని కడతేర్చిందో! ఓరి కుంకపీనుగా, నీకళ్లు యేవైఁపోయినాయిరా? రజస్వలాముండని చూస్తూ, చూస్తూ, యలా పెళ్లాడావురా? మరి నీకు గతులు లేవు. రాజమహేంద్రవరంలో వెధవ ముండల్ని పెళ్లాడినవాళ్ల సామాజికంలో చేరావురా? అయ్యో! అయ్యో! దీనికి మరి ప్రాయశ్చిత్తం యక్కడిది? ఒహవేళ చేయించుకుందా వఁంటే, శంకరాచార్యులు పాదకట్ణం పెట్టమంటాడు. బ్రాహ్మలు యిల్లు తినేస్తారు. అంతకంటె పోలీసువాళ్లు నయం. అల్లరికాకుండా హెడ్డుచేతులో పాతిక రూపాయలుపెట్టి, రేపురాత్రి బయల్దేరి కాశీపోయి, గంగలో ములిగానంటే అన్ని పాపాలూ పోతాయి. కాశీవాసవేఁ చేసుకుంటాను. భగవంతుడు బుద్ధొచ్చేటట్టు చేశాడు. లేకుంటే, ముసలివెధవకి పెళ్లిచేసుకోవడపు పోయీ కాలవేఁవిఁ? అన్నివిధాలా యీ రామప్పంతులు నాకొంప తీశాడు.

(రామప్పంతులు ప్రవేశించి.)

రామ-- యేవిఁటి మావాఁ రావఁప్పంతులంటున్నారూ?

లుబ్ధా-- యేవీఁలేదూ.

రామ-- యింతరాత్రివేళ పచారు చేస్తున్నారేవిఁ?

లుబ్ధా-- యేమీలేదు - నిద్దరపట్టక.

రామ-- మావఁగారూ, ఆకంటె యిప్పుడు తెమ్మని మధురవాణి భీష్మించుకు కూచుంది. శ్రమ అని ఆలోచించక యిప్పించాలి.

లుబ్ధా-- కంటేవిఁటి?

రామ-- మీభార్యాకి పెట్టిన కంటండీ.

లుబ్ధా-- నాభార్యాకి నేను పెట్టలేదు.

రామ-- మీరు పెట్టమంటే, నేను యెరువుతెచ్చానుకానా?

లుబ్ధా-- నేను పెట్టమన్లేదు.

రామ-- అయితే దొబ్బేస్తావా యేవిఁటి? మీభార్యామెళ్లో యిప్పుడా కంటలేదూ?

లుబ్ధా-- నాభార్యా యెవరు? నాభార్యానాడే చచ్చింది.

రామ-- మొన్న మీరు పెళ్లిచేసుకున్న పిల్ల మీభార్యా కాదటయ్యా?

లుబ్ధా-- రెండో పెళ్లిముండ నాకుభార్యా యేవిఁటి?

రామ-- రెండో పెళ్లిముండేవిఁటి?

లుబ్ధా-- రెండో పెళ్లిముండ అని నువ్వే అన్నావు?

రామ-- మాటమీద మాటొచ్చి, వొట్టినే అంటే, అదో దెప్పా?

లుబ్ధా-- వొట్టినే అనలేదు. గట్టే అన్నావు. యిదంతా, ఆగుంటూరు శాస్తుల్లూ నువ్వూచేసినకుట్ర; నాకు నిజం తెలిసిపోయింది. ఆముండ నీ యింటికేవెళ్లింది. మధురవాణిని వుంచుకున్నట్టు దాన్నికూడా నువ్వేవుంచుకో. నాజోలికిరాకు. నీకు పదివేల నమస్కారాలు.

రామ-- నాకంట నాకియ్యమంటే, యీవెఱ్ఱి వెఱ్ఱిమాట లేవిఁటయ్యా?

లుబ్ధా-- నీమాయగుంటా, నీకంటా, నీయింట్లోనే వున్నాయి.

రామ-- యీవేషాలు నాకు పనికిరావు. నిలబెట్టి నాకంట పుచ్చుకుంటాను.

(తడిసినభాగవత పుస్తకంపట్టుకుని మీనాక్షీ, చేతులోకఱ్ఱా, నెత్తిమీద పసుపురాసినకుండా, అందుమీద అఖండంతో అసిరిగాడూ, చేతిలో సీసాపట్టుకుని, తడిబట్టలతో పూజారి గవరయ్యా ప్రవేశింతురు.)

పూజారి-- హ్రాం! హ్రీం! హ్రూం! ఓంకార భైరవీ!

(రామప్పంతులు భయమును కనపర్చును.)

మీనాక్షి-- యక్కడా కనపళ్లేదునాన్నా, యీపుస్తకం నూతులోపడేశింది.

(లుబ్ధావధాన్లు భయమును కనపర్చును.)

రామ-- కనపడకపోవడం యవరు?

మీనా-- నాసవిత్తల్లి - గవరయ బాబు నూతులోదిగి అంతటా గాలించాడు. నూతులోమరేవీఁ కనపడలేదు.

(లుబ్ధావధాన్లు భయం తగ్గును.)

బ్రహ్మరాక్షసిని గవరయ బాబు యీసీసాలో బిగించాడు నాన్నా.

(రామప్పంతులు సీసాకి యడంగా నిలబడును.)

రామ-- బ్రహ్మరాక్షసి యేవిఁటి?

లుబ్ధా-- వేరే - ఓ బ్రహ్మరాక్షసి వొచ్చి - మా అమ్మిని భయపెట్టింది.

మీనా-- నన్నుకాదు - మా నాన్న పీకేపిసికింది.

రామ-- గవరయగారూ, పిల్ల యావైఁనట్టు?

గవర-- దాని మొగుడు యగరేసుకు పోయినాడు.

మీనా-- యక్కడికి యగరేసుకు పోయినాడు? వాడు యీ సీసాలోనే వున్నాడన్నారే?

గవర-- (కొంచం ఆలోచించి - చిరునవ్వునవ్వి) అదీ యీసీసాలోనే వుంది.

మీనా-- మనిషి సీసాలోకి యలా వొచ్చింది?

గవ-- అయ్యో సత్యకాలవాఁ! అది మనిషా అనుకున్నావు? అది కామినీ పిశాచం. అంచేతనే నేను మీయింటికొచ్చి నప్పుడల్లా దూరంగా వెళ్లిపోయేది. యేమి చెప్మా, అనుకునే వాణ్ణి.

మీనా-- యిద్దర్నీ ఓ సీసాలో పెడితే దెయ్యప్పిల్లల్ని పెడతారేమో?

గవర-- పంతులుగారూ చిత్తగించండీ, రెండుమనుషుల బలువుందోలేదో చూడండీ.

రామ-- మొఱ్ఱో! నాదగ్గిరకి తేకయ్యా.

గవర-- అసిరిగా నువ్వుపట్టుకో.

అసిరి-- నాకు బయవేఁటి? పైడితల్లి చల్లగుండోలి - (సీసాపట్టుకుని) ఓలమ్మ! యంత బలువుందోస్సి!

గవర-- సీసా, అఖండం, తులిసికోట దగ్గిరదించు.

లుబ్ధా-- బాబ్బాబు! సీసా నాయింట్లో పెట్టకు. మీయింట్లో పెట్టించండి.

గవర-- మాపిల్లలు తేనెసీసా అని బిరడా తీసినట్టాయనా, రెండు దెయ్యాలూ వొచ్చి మళ్లీ మీయింట్లోనే వుంటాయి.

లుబ్ధా-- అయితే, సీసా భూస్థాపితం చెయ్యండి.

గవర-- భూస్థాపనం మజాకాలనుకున్నారా యేమిటి? భూస్థాపితం చెయ్యడానికి యంత తంతుంది! పునశ్చరణచెయ్యాలి, హోమంచెయ్యాలి, సంతర్పణచెయ్యాలి.

లుబ్ధా-- నాయిల్లు గుల్లచెయ్యాలి!

గవర-- మీకలా తోస్తే నాకేంపోయింది? యీ మూతతీసేసి, నామానాన్న నేను వెళ్లిపోతాను.

లుబ్ధా-- మూతెందుకు తీసెయ్యడం. నాకుకలిగినది తృణవోఁ కణవోఁ యిస్తాను. ఆమూత తియ్యకుండా ఆసీసా అలావుంచివెళ్లండి.

పూజా-- యేవీఁ అవధాన్లుగారి గడుస్తనం! నేపోగానే పాతిపెట్టడానికాయెత్తు? ఆసీసా తగిన శాంతిచెయ్యందీ భూస్థాపితం చేశారంటే, నేను రౌరవాది నరకాలకి పోనా? యిప్పుడె బిరడా తీసేస్తాను.

లుబ్ధా-- తియ్యకు, తియ్యకు. రేపు ఆశాంతేదో తగలేతుగాని.

గవ-- అష్లాగైతే, యీరాత్రల్లా యీసీసా దగ్గిరపెట్టుకు పెరట్లో పడుకుంటాను. మీరు వెళ్లి నిర్భయంగా పడుకుని నిద్రపోండి.

(నిష్క్రమించును.)

రామ-- మావాఁ! ఓ మాట.

(రామప్పంతులూ, లుబ్ధావధాన్లూ పక్కకు వెళ్లి మాట్లాడుదురు.)

రామ-- నాకంటె మాటేవిఁటి, మావాఁ?

లుబ్ధా-- మీకంటె మీయింట్లోనేవుంది.

రామ-- మీపెళ్లాం మాయింటికి వెళ్లిందని మీరంటున్నారుగాని, అక్కడికి ఆపిల్ల రాలేదు కంటాతాలేదు.

లుబ్ధా-- అయితే యేవైఁందో! నాకేం తెలుసును?

రామ-- వొద్దు సుమండీ - నాకంటె నాకిచ్చెయ్యండి - నేను మాకానివాణ్ణి.

లుబ్ధా-- కంటె, గింటె, నాకు తెలియదు.

రామ-- నీకు తెలియకపోతే మరెవరికి తెలుసును? గవరయ్య, నీపెళ్లాం దెయ్యవైఁందన్నాడుగదా? నువ్వూ నీకూతురూ కలిసి దాన్ని చంపేశారుకాబోలు.

లుబ్ధా-- ఓరి! గాడిదకొడుకా (కఱ్ఱతో కొట్టబోవును.)

రామ-- నాకంటె అపహరించావుగదా? నీపని పట్టిస్తాను వుండు. (నిష్క్రమించును.)

లుబ్ధా-- (తనలో) కంటె యావైఁనట్టుచెప్మా? (పైకి) అమ్మీ!

మీనా-- యేం నాన్నా?

లుబ్ధా-- కంటె యేంజేసిందే?

మీనా-- యేంజేసిందో? పెట్లోదాచిందేవోఁ? దాని వొంటినే వుందిగాబోలు నాన్నా?

లుబ్ధా-- వొంటినుంటే - దెయ్యానికి కంటెందుకూ?

మీనా-- యేం? తీపుదిగదీసిందా యేవిఁటి? పెట్టుగుంటుంది.

లుబ్ధా-- నూతులోదిగి గవరయ్య నుయ్యంతా గాలించాడూ?

మీనా-- గడియసేపు గాలించాడు.

లుబ్ధా-- నువు చూశావూ?

మీనా-- చూశాను.

లుబ్ధా-- అది రావఁప్పంతులు యింటికే వెళ్లిందేమోనే?

మీనా-- గవరయ బాబు, సీసాలో బిగించాడుగదా యలా వెళుతుంది?

లుబ్ధా-- యేమో నాకేంపాలు పోకుండావుంది. రా పరుందాం - మనప్రారబ్ధం యిలావుంది.

(నిష్క్రమింతురు.)

4-వ స్థలము. రామచంద్రపురం అగ్రహారంలో సారాదుకాణం వెనకతోట.

(ఆతోటలో కాళీమందిరం యెదటి మంటపం. మంటపంలో కాళీ విగ్రహానికి యెదురుగుండా ఒక పెద్దపీటమీద మూడు సీసాలతో సారాయి; చుట్టూ గళాసులు, పీటనిండా పువ్వులదండలు, మంటపంలో వకవైపు పులిచర్మంమీద యోగదండమును ఆనుకుని సమాధిలో వున్న వొకబైరాగి; యోగిని యొకతె సారాయి అందరికీ అందిచ్చును. గ్రామమునసబు సోమినాయుడు చిలుం పీల్చుచుండును. సాతాని మనవాళ్లయ్య, జంగం వీరేశ, దుకాణదారు రామందాసు చెదిరికూర్చుందురు.)

మునసబు-- ఆకాశం ముందుపుట్టిందా? బూవిఁ ముందుపుట్టిందా?

మనవాళ్లయ్య-- సుత్తిముందా కారు ముందా?

మునసబు-- పంగనావాఁలు ముందా పట్టెవొర్దనాలుముందా? నామాలోడా నాసవాలేటి? నీజవాబేటి? ఆకాశానికి మట్టా బూవిఁ? బూవిఁకి కప్పా ఆకాశం? సదువుకున్నోడెవడో సెప్పండొస్సి-

మనవాళ్లయ్య-- ఆకాశంబు సూన్యంబు అనగా యేమీ లేదన్నమాట.

మునస -- యేటీలేదా? గుడ్డోళ్లకి యేటీలేదు. తెల్లోడు యెర్రోడా? పట్టంలో, గొట్టావెఁట్టి అదేసూస్తాడే ఆకాశం కాసి?

మనవాళ్లయ్య-- శాస్త్రంబులలోని రహస్యంబులు మ్లేచ్ఛులకెట్లు తెలియును?

మునస-- అల్లాండం, బెల్లాండం, శక్కరపొంగలి తినడవఁనుకున్నావా, నామాలోడా? తెల్లోడి మహిమ నీకేటితెలుసును! తెల్లోడిసారాయికి, తెనుగోడిసారాయికి యెంతభేదంవుందో, తెల్లోడికీ నీకూ అంతబేధంవుంది.

మనవాళ్లయ్య-- గణితశాస్త్రంబునం దాకాశంబన సున్న- సున్నయన సూన్యంబు- యేమీ లేదన్నమాట.

వీరేశ-- చాత్రంలో మన్ను, మిన్ను, అని అన్నాడుకాడా? మన్నులేదా? మన్నుంటే మిన్నుండదా?

మునస-- యీరేచ మామేలయిన పలుకు పలికినాడు.

వీరేశ-- "ఆకాశం బొక్కడ్డది!" అంటురుగదా, ఆకాశం లేకుంటే బొక్కడ్డవెఁలాగ?

మునసబు-- శబాసు యీరేచ! నామాలోడు పలకడేం? నోరుకట్టడ్డది.

వీరేశ--( శంఖం పూరించును.)

హెడ్డు-- (దుకాణదారునితో) యేవిఁటీ అల్లరిభాయి?

మునస-- యీరేచం గెల్చుకున్నాడుగదా, చంకం వోగించడా?

దుకాణదారు-- గురోజీగారి సమాదికి బంగంవొస్తే శపించిపోతారే?

బైరాగి-- (కళ్లుతెరిచి) శివబ్రహ్మం! శివబ్రహ్మం! శివోహం!

వీరేశ-- చూచావు నేస్తం, చివబ్రెమ్మం అన్నారు.

బైరాగి-- రామబ్రహ్మం! రామబ్రహ్మం! రామోహం!

మన-- మొదటిమాటను రెండవమాట రద్దుచేయును. రామానుజ! రామానుజ!

వీరేశ-- చివచివా! చివచివా!

దుకాణదారు-- యెందుకు కాట్లాడతారు. నీశివుఁడూ నిజవేఁ. అడుగో ఆశీసాలో యెలుగుతున్నాడు. నీరాముడూ నిజవేఁ. అడుగో ఆశీసాలో యెలుగుతున్నాడు. వినలేదా తత్తం?

గాజుకుప్పెలోను గడగుచుదీపంబు ।
    యెట్టులుండు గ్యానమట్టులుండు ।
    తెలిశినట్టివారి ద్రేహంబులందును ।
    యిశ్వదాభిరామ యినరవేమా ॥

బైరాగి-- సత్యం, సత్యం.

దుకాణదారు-- గురోజీ! తమకి అంతాయిశదవేఁ! ద్రేహం గాజుకుప్పె, ద్రేహంలో వుండేది పరవాఁత్వఁ, గాజుకుప్పెలో వుండేది అన్నసారం. యీఅన్నసారం ద్రేహంలో పడితేగాని పరవాఁత్వఁ పెజ్జలించదు. యేం శలవు?

బైరాగి-- యీ పరమరహశ్యం నీకు యెలా తెలిసింది తమ్ముడా?

దుకా-- తమవంటివారి ద్రయవల్లగురూ! (నలుగురివైపూచూసి) చూశారాబాయీ నేను యెప్పుడూ యీమాటేగదా చెపుతూవుంటాను? అఖాడాకి వొస్తేగాని పరబ్రెమ్మం పట్టుపడ్డం యెలాగు?

బైరాగి-- అమృతమనేది యేమిటి? సారాయే! నాడు యిదేగదా తాగడానికి దేవాసురులు తన్నుకుచచ్చారు?

వీరేశ-- చివచివా! చివచివా!

మనవాళ్ల-- రామనుజ - రామానుజ!

మునస-- కాట్లాటమాని యినండొస్సి. యెఱ్ఱిగొల్లోళ్లు.

హెడ్డు-- గురూ, మరివొక రసలింగం చేయించి, శిష్యుడికి దయచెయ్యాలి.

బైరా-- అలాగె.

మున-- గురూ! బంగారం సేస్తారుగదా, అదెట్టి, హరిద్దొరంలో మటం కట్టించక మాలాటోళ్లని డబ్బెందుకడుగుతారు?

బైరా-- మేం చేశే స్వర్ణం మేవేఁ వాడుకచేస్తే తలపగిలిపోతుంది.

హెడ్‌-- అవివేరే రహస్యాలు వూరుకొండి మావాఁ! గురోజీ! హరిద్వారంలో చలిలావుగాబోలు?

బైరాగి-- నరులక్కద్దు- మాబోటి సిద్ధులకు, చలీ, వేడీ, సుఖం, దుఃఖం, యెక్కడివి-

హెడ్‌-- ఆహా! అదృష్టవఁంటె సిద్ధుల్దే అదృష్టం.

మునస-- గురు, హరిద్దోరంనించి యెప్పుడు బైలెళ్లేరు?

బైరా-- రెండురోజులయింది. మొన్న ఉదయం ప్రయాగ, నిన్న వుదయం జగన్నాధం శేవించాం. ఖేచరీగమనమ్మీద ఆకాశమార్గాన్న పోతూవుండగా మీవూరి అమ్మవారు వనందగ్గిర గమనం నిలిచిపోయింది. యేమిచెప్మా? అని యోగదృష్ఠిని చూచేసరికి అమ్మవారి విగ్రహముకింద ఆరు నిలువులలోతున, మహాయంత్రం వొకటి స్థాపితమై కనపడ్డది. అంతట భూమికిదిగి, అమ్మవారిని శేవించుకొని, ప్రచ్ఛన్నంగా పోదావఁంటూంటే, యీ భక్తుడు మమ్ముల్నిపోల్చి నిలిపేశాడు.

దుకా-- చూడగానే, నేను సిద్ధుల్ని పోలుస్తానుగురూ-

మునస-- సుక్కేసేవోళ్లని మాబాగా పోలుస్తావు. మావూరమ్మోరు జగజ్జనని! మా చల్లనితల్లి.

బైరాగి-- బ్రహ్మోహం! బ్రహ్మోహం!

హెడ్‌-- ఆహా! యోగమహత్యం! స్తానాల్చేసి, ముక్కుబిగించే బ్రాహ్మలకి లేవుగదా యీ సిద్దులూ?

బైరా-- వేషానికీ - జ్ఞానానికీ దూరంకాదా తమ్ముడా? మాతాతగారు చెప్పలేదా? "ఆత్మశుద్ధిలేని యాచారమదియేల" అని?

హెడ్‌- వేమన్న - తమతాతా, గురూ?

బైరా- అవును - వారు పరంపదించి ఆరువొందల సంవత్సరాలు కావొచ్చింది.

హెడ్‌- తమవయస్సెంత గురూ?

బైరాగి- ఆదీ అంతూలేనిదానికి లెఖ్ఖేవిఁటి తమ్ముడా? పరమాత్మకెన్నేళ్లో అన్నేళ్లు.

మునస- యేం యిలవైన మాటలింటున్నాం!

(వీరేశ శంఖం పూరించును.)

హెడ్‌ - (శంఖంలాక్కొని పక్కనువుంచి) అట్టె పట్టెయ్యకండి భాయి.

దుకా - అట్టే యక్కడభాయీ? పరవశవైఁందాకా తాక్కుంటే తాగడవేఁటి? వేమన్న చెప్పలేదా?

    "తాగి, తాగి, తాగి, ధరణిపైబడుదాక ।
    తాగెనేని తన్ను, తాను తెలియు ॥
    తాగలేనివాడె, తాగుబోతరయంగ ।
    యిశ్వదాభిరామ యినరవేమ" ॥

బైరాగి- కాశీలో రెండువందల యాబై సంవత్సరములక్రిందట ఆలంగీర్‌ పాదుషావారి హయాంలో, ఒకశేటు మాబోటి సిద్ధులనందరిని కూటానికి పిలిచాడు. గంగనడివిఁని పడవమీద పీపాలలో సారాయి భరాయించి, బంగారపుగిన్నెలతో అందిచ్చాడు. రెండుఝాములరాత్రి అయేసరికి పీపాలు కాలీ అయిపోయినాయి. అంతా పడిపోయినారు.

హెడ్- యేమి ఆశ్చర్యం!

బైరా- మేమూఁ ఒక్క నేపాళపు బ్రాహ్మడూ మిగిలాం. "తే! తే!" అన్నాడు ఆ బ్రాహ్మడు. "తెస్తావా శపించేదా" అన్నాడు. శెట్టి యెక్కడ తెస్తాడూ? వాడు మాకాళ్లు పట్టుకునేటప్పటికి పర్వాలేదు నిలవమని చెప్పి, మేము ఒక పుణిక మంత్రించి, గంగ భరాయించినకొద్దీ ఆగంగ సారా అయిపోయింది. ఆ బ్రాహ్మడు సహస్ర పుణికలుతాగి జిఱ్ఱునతేన్చాడు. బ్రాహ్మల్లోకూడా మహాత్ములుంటారు. కనుక్కో గలిగిన జ్ఞానికి గంగానది అంతా సారాయి కాదా?

మునస- రామందాసొహడు, గంగ బరాయించడానికి గురువు; ఒకదరావుఁకి పద్ద రావుఁలు సేరుస్తాడు.

(హవల్దారు అచ్చన్న ప్రవేశించును.)

దుకా- గురూ వీరు హవల్దార్‌ అచ్చన్నగారు. మంచిగ్యాని. మునసబుగారికి మేనల్లుడు.

హవ- రామ్‌! రామ్‌!

బైరాగి- రామ్‌! రామ్‌!

హవ- (యోగినితో) పిల్లా హుక్కాలావ్‌. (హెడ్‌తో) భాయీ గుంటూరు శాస్తుల్లుగారి పత్తాయేమైనా తెలిశిందా?

హెడ్‌- లేదుభాయి.

దుకా- రామప్పంతులంటాడు-పెళ్లికూతురు రెండోపెళ్లి పిల్ల- దాన్ని అమ్మి డబ్బు చెయ్యిచిక్కించుకుని-

హెడ్‌- ఆమాటలు మనకెందుకు భాయి?

మునస- పోలీసొళ్లకీ అక్కర్లేక, బాపనోళ్లకీ అక్కర్లేక, యెదవముండని బాపనాడు పెళ్లిశేసుకుంటే లోకంఅంతా వూరుకోవడవేఁనా?

హెడ్‌- డబ్బు యిచ్చినవాడికీ, పెళ్లి ఆడినవాడికీ లేనిచింత మనకేలమావాఁ? కాక, యీరోజుల్లో బ్రామ్మణ్యం యెక్కడుంది యెక్కడచూశినా పిల్లల్ని ముసలాళ్లకి అమ్ముకోడాలు- రంఢా గర్భాలేకదా?

హవ- కలికాలంగదాభాయీ? యెంతచెడ్డా బ్రాహ్మలు మనకి పూజ్యులు.

హెడ్‌- అన్నా, యవరంతవారు, వారు. జ్ఞానం, నీతిప్రధానంగాని, జాతిలో యేవుఁంది? వేమన్న యేవఁన్నాడు?

మునస- యెవఁన్నాడా? నీతికి పోలీసొణ్ణి ఘానానికి సాతానోణ్ణి అడగమన్నాడు.

హెడ్‌- మావాఁ! వెక్కిరించండిగాని, నేను యెన్ని తాలూకాల్లో నౌఖరీచేశానో అన్ని తాలూకాల్లోనూ రండాగర్భాలు యెన్ననిచెప్పను? నన్నడిగితే వెధవలు పెళ్లిచేసుకోవడవేఁ ఉత్తమం అంటాను. మాసూపరెంటు పిల్లలతో వున్న రెండో పెళ్లి దొరసాన్ని పెళ్లాడి సుఖంగా వుండలేదా?

మునస- మావఁగారి అబిప్పరాయం, పెయ్యతోటొచ్చిన ఆవు మేలుకాదా అని? అందకనే, ముసలిబాపనోడు యెధవగుంటని పెళ్లాడితే, మీనేస్తం కరణపోణ్ణి, ఆముసలాడి యెధవకూతుర్ని పెళ్లాడమని బోదసెయ్యరాదా?

హవ- మనకేలమావాఁ? గవునర్‌మెంటూ, దేవుళ్లూ, బ్రాహ్మలూ- వారి నేరాలు వారివి- వాటితో మనకిపనిలేదు. మనభక్తి మనకుండాలి. (హెడ్‌తో) భాయీ, తెల్లానల్లా వొకటా?- తెల్లవాడికి క్రీస్తు వొకపద్ధతి పెట్టాడు. ముసల్‌మాన్‌కి పైగంబరు వొకపద్ధతి పెట్టాడు, నల్లవాడికి రాముడు వొకపద్ధతి పెట్టాడు. భగవంతుడు తెల్లవాడితోయేవఁన్నాడూ? వెధవని పెళ్లాడు అన్నాడు. రాముడు తెనుగువాడితోయేవఁన్నాడూ? ఆంధ్రభారతినుండి కాపీచెయ్యొద్దన్నాడు. వెధవని పెళ్లాడొద్దన్నాడు. చెప్పన్న దేశాలూ చూశాను భాయీ. పరిపరివిధాలు ఆచారాలూ, వ్యవహారాలూ వున్నాయిగాని నీతివకటీ, భగవంతుడొకడూ, అంతటా వక్కటే.

మునస- రాముడు యెదవముండల్ని కానిపనులు సెయమన్నాడూ? మన్లో మారుమనువులుండేవికావా?

హవ- పిల్లా, చిలుం భరాయించి, తే.

మునస- నామాలోడు మూలకి తీసికెళ్లి పిల్లని ముద్దెట్టు కుంటున్నాడు. యోగినీ- (చెయ్యి విడిపించుకొని సిగ్గుతో) ఏకాంత ఉపదేశం చేస్తున్నారు.

మునస- యేటో ఆవుప్పుదేశం? తనెంట వాయు యేగంగా రమ్మనా?

దుకా- యేవిఁటిభాయీ, అనరానిమాట్లు అంటున్నారు. మనయోగిని పరమభక్తురాలు.

మునస- లెంపలోయించుకుంటాను. పిల్లా! ఆనామోలోడు సెప్పిన ఉప్పుదేశవేఁటో, నాసెవులో కొంచం సెప్పరాదా?

(యోగిని సారాగళాసు హవల్దార్‌ యెదటవుంచును.)

మునస- నామాలోడి వుప్పుదేశంతో పిల్లకి మతోయింది.

బైరాగి- హవల్దారుగారు అమృతం సేవించరా?

హవ- (చిరునవ్వునవ్వి) తాక్క సోజరువాడు చెడ్డాడు. తాగి సిపాయివాడు చెడ్డాడు, జ్ఞానికి జ్ఞానపత్రి; తాగుబోతుకు సారాయి.

మునస- పించను పుచ్చుకుంటివిగదా, యింకా సిపాయానా సెయ్యాల్నుందా అల్లుడోడా?

హవ- కుంపిణీ నమ్మక్‌ తిన్నతరువాత, ప్రాణంవున్నంతకాలం కుంపిణీ బావుటాకి కొలువుచెయ్యాలి. రేపు రుషియాతో యుద్ధంవొస్తే పించను ఫిరకాయావత్తూ బుజాన్ని తుపాకీ వెయ్యవాఁ?

మునస- రుస్సావోడివోడ నీట్లోములిగి నడుస్తాదిగదా, నువ్వు తుపాకుతో యవణ్ణి కొడతావు?

హవ- మొన్నగాక మొన్న యింగిరీజ్‌ రుషియాదేశానికి దండెత్తిపోయి, రుషియాని తన్ని తగలలేదా? అప్పుడేవైఁందో, యిప్పుడూ అదే అవుతుంది. మారాణీ చల్లగావుండాలి.

దుకా- సీవఁరాణీ ఆకాళీమాయి అవుతారంకాదా?

హవ- కాళీ, గీళీ, జాంతేనై- ఆరాముడి అవతారం.

దుకా- గురూ- హవల్దారుగారు తత్తకీర్తనలు మాయింపుగా పాడతారు. (యోగినితో) తల్లీ, నా తంబూరాతెచ్చి భాయిగారికి ఇయ్యి.

మునస- యీతూరి, యీరేచ వుప్పుదేశం చేస్తున్నాడు.

దుకా- గొప్పవారున్నప్పుడు ఆస్యాలేటి భాయీ?

మునస- వున్నమాటాడితే ఆస్సాలా? నాకెవడూ సెయడేం వుప్పుదేశం? యీరేచ వుప్పుదేశం గట్టిగాబిగిసింది; మరిసెయ్యొదల్డు-

(యోగిని కష్టంమీద చెయ్యి వొదిలించుకొని తంబురా తెచ్చియిచ్చును.)

దుకా - అవన్నీ గ్యానరహశ్శాలు. బ్రెమ్మానందవఁంటె యేటి? కడుపునిండా సారా; ముక్కునిండా పొగ; పక్కని పడుచుపిల్లా కదా?

మునస- ఘానం యినండొస్సి

హవ- పామరం! పామరం! రాముడు పఠం కాళీ నెత్తిమీద పెట్టకపోతే కుంపిణీ సిపాయన్నవాడు యిక్కడికి వొచ్చునా?

హెడ్‌- భాయి! ఓకీర్తన శలవియ్యండి.

హవల్దారు పాడును.)

    పింజర్మెరహకర్‌ ఛుప్‌నైరహ్న
    క్యారేబుల్బుల్‌ కహొ ముల్కిసునా ॥క్యారె॥
    యెక్కడికి వెళతావు? యేమి చెప్పవు, బోలో పింజర్మె ।

(వీరేశ శంఖం మనవాళ్లయ్య తీసి పూరించును.)

హవ- (పాటమాని, తంబూరా క్రిందబెట్టి) గద్దా!

హెడ్‌- (శంఖంలాక్కొని) శంఖం అగ్గిలో పడేస్తాను. యెందుకు తానిస్తావు భాయి.

దుకా- వొద్దంటే వినడు.

హెడ్‌- వినకపోతే దుకాణానికి రానియ్యకండి. అల్లరైతే మాకు మాటకదా?

దుకా- పదిశంకాలు దాచేశాను; మళ్లీమళ్లీ తెస్తాడు. యేంజెయ్యను? బేరంగదా భాయీ?

మునస- దిట్టంగా పట్టెయి. తత్తఘ్ఘానం తలకెక్కాలి!

దుకా- (తంబురా తీసిపాడును.)

    నాగా దిగురా । నాతండ్రి దిగురా ॥
    దిగుదిగునాగన్న । దివ్యసుందరనాగ ।
    ముదముతోరేపల్లె । ముద్దులనాగ ॥
    ఊరికిఉత్తరాన । ఊడలమఱ్ఱికింద ।
    కోమపుట్టలోని । కొడినాగన్నా ॥-

(పాడుచుండగా రామప్పంతులు ప్రవేశించి యెడంగా నిలచి యోగినికి సౌజ్ఞచేయును. యోగిని రామప్పంతులుతో మాటలాడివచ్చి హెడ్‌ చెవిలో రహస్యం చెప్పును.)

మునస- పిల్ల, హెడ్డుగారికి వుప్పుదేశం సేస్తూంది. ముసలోణ్ణనా-

యోగిని- (మునసబు చెవిదగ్గిర నోరుపెట్టి చెవిగిల్లును.)

మునస- పిల్లా! సాల్రోజులైంది మునిసిబు నాయుడికి యీపాటి వుప్పుదేశం తగిలి-

(హెడ్డుకనిష్టీబు రామప్పంతులు దగ్గిరకువెళ్లి యడంగా యిద్దరూ మాట్లాడుదురు.)

హెడ్‌- కొత్తవారు యెవరూలేరే? బావాజీ గారు వుంటే మీకు భయవేఁవిఁటి?

రామ- కొత్తా, పాతా, ఆలోచించుకోలేదు కొంపములిగింది. మీసాయం కావాలి.-

హెడ్‌- డబ్బేవైఁనా పేల్తుందా?

రామ- మీ చాతైతే, పేల్తుంది. హెడ్‌- యేమిటొచ్చిందో చెప్పు.

రామ- లుబ్ధావుధాన్లు పెళ్లాడినగుంట మధురవాణి తాలూకుకంటె తీసుకుని యెక్కడికో పారిపోయింది.

హెడ్‌- యెందుకు పారిపోయిందో?

రామ- మీనాక్షి చావగొడితే పారిపోయింది. యెక్కడవెతికినా కనపడలేదు. ముందు మీజవాన్లని దౌడాయించండి.

హెడ్‌- యీరాత్రవేళ మాజవాన్లుమాత్రం పట్టుకోగల్రా? పోలీసు జవానంటే పదికళ్లూ పదికాళ్లూ వుంటాయనుకున్నావా యేవిఁటి?

రామ- దానిసిగ్గోసిరి; దాన్ని పట్టుకోవడం నాకెందుకు, నాకంటె నాకిప్పించెయ్యండి.

హెడ్‌- యేవిఁటి నీమాటలూ! ఆకంటెపట్టుకు ఆపిల్ల పరారీ అయిందని చెపితివి. నేనుకంటె యెలా యిప్పిస్తాను?

రామ- ముసలాణ్ణి అడిగితే, అది పట్టుకుపోయిందంటాడు; గాని నిజంగావాడు పెట్టెలో దాచేశి యివ్వకుండా వున్నాడు.

హెడ్‌- నన్నేంచెయ్యమంటావు?

రామ- కూనీకేసని ముసలాణ్ణి బెదిరిస్తే, నాకంటె నాకిచ్చేస్తాడు; మీచెయ్యికూడా తడౌతుంది.

హెడ్‌- అలాగనా- గాని నువ్వన్నట్టు ఆపిల్లగానీ, కంటెపట్టుకు పరారిఅయిపోయివుంటే-

రామ- పోనీండి- దానిఖరీదు యిప్పించెయ్యండి.

హెడ్‌- వాడిస్తాడా?

రామ- మరి మీసాయం యెందుకు కోరాను?

హెడ్‌- యిస్తాడని నాకు నమ్మకంలేదు. ఐనా చూస్తాను, కేసనియెత్తు యెత్తడానికి యిద్దరు ముగ్గురు సాక్షులుండాలి!

రామ- మందిరంలో వున్నవాళ్లో?

హెడ్‌- వీరేశం, మనవాళ్లయ్యా, మూడోకాలంలో వున్నారు. హవల్దారు అబద్ధం ఆడమంటే తంతాడు. మునసబునాయుడు యింతరాత్రివేళ అంతదూరం నడిచిరాలేడు. యిహ ఆడనూ పాడనూ రామందాసు వొక్కడేగదా?

రామ- ఆ బైరాగాడు సాక్ష్యం పలకడేం?

హెడ్‌- వేషంవేసుకు ముష్టెత్తుకునే బైరాగాడనుకున్నావా యేవిఁటి? ఆయన గొప్పసిద్ధుడు. నిలువెత్తు ధనంపోస్తే అబద్ధవాఁడ్డు.

రామ- సాక్ష్యం పలకావొద్దు, యేవీఁవొద్దు, దగ్గిరనిలబడితే చాలును. పిల్చుకురండి!

(కనిష్టీబువెళ్లి దుకాణదారునూ బైరాగినీ తీసుకువచ్చును.)

బైరాగి- సాక్ష్యంఅంటే మావంటివాళ్లే చెప్పాలి. యోగదృష్ఠివల్ల చూశావఁంటే, యెక్కడ జరిగినదీ యెప్పుడు జరిగినదీ కళ్లకి కట్టినట్టు అప్పుడు కనపడుతుంది. గనక మేంకూడా వస్తాం. యెవైఁనా దొరికితే హరిద్వారంలో మఠానికి పనికొస్తుంది.

రామ- జరిగినదాని ముండామోశిరి. కొంచం కల్పనుంటేగాని కథనడవదు. అంచేత హెడ్డుగారు ముసలాడితో చెప్పేమాటలు నిజం అని మీరు శలవివ్వాలి.

బైరాగి- వెఱ్ఱి! వెఱ్ఱి! నిజవేఁవిఁటి, అబద్ధవేఁవిఁటి! మేం సిద్ధులం అబద్ధం నిజం చేస్తాం. నిజం అబద్ధం చేస్తాం - లోకవేఁ పెద్ద అబద్ధం. పదండి.

(నిష్క్రమింతురు.)

5-వ స్థలము. దేవాలయం గుమ్మందగ్గిర.

(హెడ్డుకనిష్టీబు, రామప్పంతులూ మాట్లాడుతుందురు. మరివక కనిష్టీబు, బైరాగి, దుకాణదారు కొంత యడముగా నిలుచుందురు.)

హెడ్- నా నౌఖరీ పోగొట్టుకుంటానా భాయీ?

రామ- కొంచం బెదిరిస్తే నౌఖరీ పోతుందా అన్నా ? పోలీసుడూటీ అంటే బెదిరింపే గదా ? మీరు అలా తప్పించుకుంటే నేనేం అనుకోను ?

హెడ్- (చేతిలో నులువుతున్న కాకితపుముక్కలు విసిరేసి) భాయీ, లుబ్ధావుధాన్లు చంటిపిల్లడా? దుక్కిముచ్చా? బెదిరించడానికి - కూనీకేసని నాకేవైఁనా ఆశవుంటే, పోలీసువాణ్ణి, నేను వూరుకుంటానా? పట్టుకుంటే నాకు యెంతకారక్టుకాదు? యీ జవాన్ని యీ చీకటిరాత్రిలో నూతిలోదింపానుకానా? కూనీ గీనీ అంటే యవరైనా నవ్వుతారు. మీనాక్షిచేతికి వెరచి, ఆపిల్ల యిరుగింట్లోనో పొరుగింట్లోనో పడుంది. మీయింట్లోనే వుందేమో ముసలాడు అన్నట్టు?

రామ- దేవుఁడుతోడు మాయింటికి రాలేదు. యిరుగింటో, పొరుగింటో అని మీరు వూరుకుంటే యలాగ? మీ ధైర్యవేఁవిఁటో నాకు బోధపడదు. వెతికించవయ్యా అంటే, వెతికించారూకారు. ఆ యిరుగింటివాళ్లూ పొరుగింటివాళ్లూ, పిల్ల నిద్దరపోతూ వుండగా కంటె చెపాయిస్తే నాగతేవిఁటి? కంటె యింటికి పట్టుకు వెళ్లకపోతే మధురవాణి గుమ్మంలోంచి గెంటుతుంది- అనగా, గెంటుతుందని కాదు - యేడుస్తుంది, ప్రాణం తినేస్తుంది. విన్నారా?

హెడ్- అయితే నాసలహావిన్నారా?

రామ- యేదో చెప్పండి మరి.

హెడ్- ఆకంటె యిచ్చిందాకా, కదలకుండా, లుబ్ధావుధాన్లు యింటిమీద కూర్చోండి.

రామ- యిదా సలహా ? పీకమీద కూచున్నదాకా నాకేంపట్టింది ? యింటికెళ్లి సుఖంగాపడుకుంటాను.

హెడ్‌- మధురవాణి బాధ పెడుతుందనికదూ?

రామ- అని మీకు కనికారం కాబోలు ? రేపుగానీ వాడు కంటెయివ్వకపోతే, అవుధాన్లుమీద సివిల్‌ దావాపడేస్తాను. మీదగ్గిర, కంటె మాట వొప్పుకున్నాడు గదా, మిమ్మల్ని సాక్ష్యం వేస్తాను.

హెడ్‌- ఓహో యిదా వేషం? పోలీసు ఆఫీసర్ని నేను, సాక్ష్యాలకీ సంపన్నాలకీ తిరిగితే నానౌఖరీ నిలుస్తుందా? కావలిస్తే లుబ్ధావుధాన్లు కంటె హరించాడని నాదగ్గిర ఫిరియాద్‌ చెయ్యండి. కేసుచేసి నా తమాషా చూపిస్తాను.

రామ- కంటెమాట మీదగ్గిర అతడు వొప్పుకున్నతరవాత, మీరు బోనెక్కి యలా అబద్ధం ఆడగల్రో చూస్తానుగదా.

హెడ్- పంతులూ, అక్కరమాలిన లౌక్యాలుచెయ్యకు. వాడు కంటెమాట తనకేవీఁ తెలియదన్నాడు. కావలిస్తే ఆమాట సాక్ష్యం పలుకుతాను.

రామ- యిదా మీరు చేసినసాయం?

హెడ్- యెందుకు అక్కరమాలిన ఆందోళన పడతావయ్యా- రేపు నీకంటె నీ యింట్లో వుండకపోతే నన్ను అను.

రామ- మధురవాణితో యిప్పుడు యేంజెప్పను?

హెడ్‌- అయితే నన్నేం జేయమంటారు?

రామ- మళ్లీ లుబ్ధావధాన్లు యింటికిరండి. యీమాటు మనవిఁద్దరం వెళ్లి పీడిద్దాం.

హెడ్‌- రెడ్డొచ్చాడు, మొదలాడు అన్నాట్ట - నిరర్ధకంగా రాత్రల్లా నిద్దర్లేకుండా చంపావు - మరి నేను రాజాలను. నువ్వెళ్లి వాడియింటిమీద కూచోవయ్యా, అని చెప్పానుకానా? నామాటవిని అలా చెయ్యండి. అదేసలహా. పీసిరిగొట్టు ముండాకొడుకు మానలుగురికీ నాలుగుమూళ్లు పజ్యెండురాళ్లు పారేశాడు. యివి పెగిలేటప్పటికి నాతల ప్రాణం తోకకివొచ్చింది. నావొంతు మూడూ మీకిచ్చేస్తాను.

రామ- కంటెపోయి యేడుస్తూవుంటే, యీవెధవ మూడు రూపాయలూ నాకెందుకూ?

హెడ్- మీకు అక్ఖర్లేకపోతే పోనియ్యండి. గురోజీగారికి యిద్దాం.

రామ- కొంచం చిల్లరఖర్చుంది. యేంజెయ్యను? యిలా పారెయ్యండి. (పుచ్చుకొనును.)

హెడ్- గురోజీ తమకో తులసిదళం.

బైరాగి- తృణం, కణం యేవొఁచ్చినా మఠానికే అర్పణం. హెడ్- (దుకాణదారుతోనూ, కనిష్టీబుతోనూ) మీకోమూడు, నీకోమూడూ - (చేతులుదులిపి) సాఫ్‌ఝాడా - నాకు తిప్పటే మిగిలింది.

దుకా- (బైరాగిని పక్కకిపిలిచి) యీవేళే చెన్నాపట్టంనించి ఫస్టురకం బ్రాందీ వొచ్చింది. చిత్తగించి మరీ కాశీ వెళుదురుగాని.

హెడ్- గురోజీ రాం! రాం! పంతులూ, ముసలాణ్ణివెళ్లి పట్టుకోండి. భాయీ, స్టేషనుకుపోవాలి. (జవానుతో) రావోయి కావఁయ్యా. (హెడ్డూ, జవానూ, ఒకవైపున్నూ, దుకాణదారూ, బైరాగీ మరి వొకవైపున్నూ వెళ్లుదురు.)

రామ- కంటె పోయిందంటే మూడురూపాయలా చేతులో బెడతాడు! (విరసంగా నవ్వును) వీడితాళం పడతాను. (హెడ్‌ పారేసిన కాకితపు ముక్కలుయేరి) యినస్‌పెకటరుకి వొకటి, తాసిల్దారుకి వొకటి, ఆకాశరామన్న అర్జీలు పంపుతాను. వెధవ, మధురవాణి దగ్గిరికి వెళతాడేమో? నేను యింటికిపోతే అరుగుమీద పడుకోవాలిగాని ఆతిక్కలంజ తలుపుతియ్యదు. లుబ్ధావధాన్లు యింటికివెళ్లితే వాడు కఱ్ఱుచ్చుకుంటాడు. యీ దేవాలయంలో పరుందునా?- పురుగూ బుట్రా కరిస్తే - కరిస్తే - ఛీ! ఈ సానిముండని వొదిలేస్తాను - ఆ గుంటయావైఁనట్టు? నా అదృష్టంవల్ల యవళ్లింట్లోనైనా దాగి రేపుగాని కళ్లబడితే, కంటెపోకూడదు - ఒకవేళ చస్తే? - చచ్చుండదు - నూతులో పడలేదు. గవరయ్యా, కావఁయ్యాకూడా గాలించారు - ఒకవేళ అది రెండోపెళ్లి పిల్ల అయి, దాని ఆతండ్రి కానికీగా వొచ్చి బండీ యెక్కించుకు దౌడాయించాడేమో? అలా ఐతే కంటెకూడా వుడాయించడా? - మీనాక్షిని పట్టుకుంటే కొంత ఆచోకీ తెలుస్తుంది - అది కనపడ్డవెఁలాగ? - తలుపుతట్టితేముసలాడే వొస్తాడేమో? - (రోడ్డుదాటి లుబ్ధావధాన్లు యింటిగుమ్మంయదట నిలుచుని) ఆకలి దహించేస్తూంది - మీనాక్షి దొరికితే యేవైఁనా ఫలహారం యిచ్చును - యవడు చెప్మా! రావిచెట్టుకింద చుట్ట కాలుస్తున్నాడూ? (నాలుగు అడుగులు ముందుకువెళ్లి) అసిరీ, నువ్వా ?

అసిరి- నానుబాబు (చుట్టపారవైచును.)

రామ- నిమ్మళంగా వున్నావురా ?

అసిరి- యేట్నిమ్మళంబాబూ. సానమ్మొచ్చింది - ఈయమ్మకాసి సూడ్డం మానేసినారు. డబ్బిచ్చే దాతేడిబాబూ?

రామ- అసిరి, అడక్కపోతే, అమ్మైనా పెడుతుందిరా ?

అసిరి- ఆసానమ్మ మాసెడ్డమనిషిబాబూ !

రామ- యేవిఁటి? యేవిఁటి? చెప్పొరే. చాలారోజులైంది నీకు డబ్బిచ్చి - యింద యీ రూపాయి పుచ్చుకో.

అసిరి- నూరు దండాలుబాబూ !

రామ- మధురవాణి మాటయేవిఁట్రా చెప్పబోయినావు?

అసిరి- మాసెడ్డమనిషిబాబూ.

రామ- యవడెళ్తాడ్రా దాందగ్గిరికి? అసిరి- యవడెళ్తాడ్రా?

అసిరి- యవడెళ్నా, యీపు పెట్లగొడతాది బాబూ.

రామ- చెడ్డమనిషన్నావు?

అసిరి- కాదా? మొన్న హెడ్డుగారెళ్తే, యేపికూన్ని ఉసు గలిపిందికాదా?

రామ- నిజం చెప్పావు. నీమీద యెప్పుడైనా కోప్పడ్డదిట్రా ?

అసిరి- మాలాటోళ్లమీద యెందుక్కోప్పడతాదీ? బాపనాళ్లొస్తే తిడతాది.

రామ- నువ్వు యెప్పుడూ నిజవేఁ చెబుతావురా అసిరిగా.

అసిరి- సీ! అబద్దవాడితే బగమంతుడు ఒల్లకుంటాడా బాబూ?

రామ- మీబుగత యేం జేస్తున్నాడ్రా?

అసిరి - తొంగున్నాడుబాబూ.

రామ- నీకు మరోరూపాయి యిస్తాను- మీనాక్షిని సావిట్లోకి పిలుస్తావురా?

అసిరి- నాశక్కవాఁ, బాబూ? ఆయమ్మ అయ్యగదులో పక్కేసుకుతొంగున్నారు.

రామ- నువ్వు చిటికేస్తే, యక్కడున్నా లేచొస్తుంది. నేనెరగనట్రా!

అసిరి- తెండి బాబూ. సూస్తాను. (రామప్పంతులు రూపాయి యిచ్చును. ఉభయులూ యింట్లో ప్రవేశింతురు.)

6- వ స్థలము. లుబ్ధావధాన్లు యింటినడవ.

(తలుపు జారవేసివుండును.)

(మీనాక్షి ప్రవిదతో దీపం తెచ్చి గూటిలోవుంచును. రామప్పంతులు వొత్తితగ్గించి, మీనాక్షిని ముద్దుబెట్టుకొనును.)

మీనా- తోవతప్పొచ్చారో ?

రామ- బుద్ధితక్కువచేత, గడ్డితిని యిన్నాళ్లూ తోవమరచాను.

మీనా- మధురవాణి యలా రానిచ్చింది ?

రామ- మధురవాణి శిగ్గోశిరి, దాన్ని వొదిలేస్తాను. ఆకలి దహించుకుపోతూంది. ఫలారం యేవైఁనావుందీ ?

మీనా- యేవుందీ?- వొడపప్పూ, కొబ్బిరిముక్కా కావాలా!

రామ- యేదో ఒహటితెస్తూ. (మీనాక్షి మూకుడుతో వడపప్పూ, కొబ్బరిముక్కలూ తెచ్చును. రామప్పంతులు తినుచుండును.)

మీనా- మధురవాణిని వొదిలేస్తారో ? రామ- వొదిలెయడం నిశ్చయవైఁపోయింది.

మీనా- కనిష్టీబుమాట తెలిసిందో ?

రామ- తెలిసింది.

మీనా- యవరు చెప్పారు ?

రామ- అసిరిగాడు.

మీనా- మా అసిరిగాడా ?

రామ- మీ అసిరిగాడే.

(అసిరిగాడు వీధితలుపు కొంచంతీసి తొంగిచూసి.)

అసి- దెయ్యానికెట్టింది తింతున్నావయ్యా?

రామ- దెయ్యానికా పెట్టారు ?

మీనా- (అసిరిగాడితో) వూరుకో వెధవా.

రామ- నీకు న్యాయవేఁనా, దిగదుడుపు కూడుపెట్టడం?

(వీధులోకి వెళ్లి వమనము చేసికొనుటకు ప్రయత్నముచేసి తిరిగీ ప్రవేశించి)

వమన వైఁందికాదు. యేం సాధనం ?

మీనా- దిగదుడుపుకాదంటే నమ్మరుకదా ?

రామ- మూకుళ్లో తగలేశావు ?

మీనా- దెయ్యం తిని సచ్చిందా, యేవిఁటి ?

రామ- ఆడవాళ్లు దారుణం మనుషులు!

మీనా- అసిరిగాడేంచెప్పాడు మధురవాణిమాట?

అసి- (తిరిగీ తొంగిచూచి) ఆ పారేసిందట్టుకు పోదునాబాబు ?

రామ- పట్టుకుపో.

(అసిరిగాడు పట్టుకుపోవును.)

మీనా- వాడికి మీకంటె ధైర్యంవుంది.

రామ- అపవిత్రం ముండాకొడుకు యేవైఁనా తింటాడు. బ్రాహ్మలం పవిత్రవైఁన వాళ్లంగదా?

మీనా- పవిత్రం అంటే, మీదీ, నాదే !

రామ- అదేం అలా అంటున్నావు ?

మీనా- నేను వెధవముండనీ, మీరు సరసులున్నూ. మనకంటే మరిపవిత్రం అయినవారు యవరుంటారు ?

రామ- ఆకళంకం తీసెయ్యడానికే యీవేళొచ్చాను.

మీనా- యలా తీసేస్తారు?

రామ- మన యిద్దరం పెళ్లాడితే మరి అపవిత్రత యెక్కడుంటుంది ?

మీనా- యేవిఁటీ !

రామ- మనం పెళ్లాడదాం ?

మీనా- నిజంగాను?

రామ- యేంవొట్టు వేసుకొమ్మన్నావు ?

మీనా- ఆదీపం ఆర్పెయ్యండీ.

రామ- యీకాగితం ముక్కలు చదివి మరీ ఆర్పేస్తాను. (కాగితం ముక్కలు జేబులోంచి తీసి చదివి) గాడిద కొడుకు తనబాకీ తాలూకు నోటులాగి, నన్ను దగా చేశాడు; వీడితాళం పడతాను.

మీనా- యవడు ?

రామ- అది వేరేకథ.

మీనా- అసిరిగాడు కనిష్టీబుమాట యేం జెప్పాడు ?

రామ- మధురవాణి హెడ్డుమీద కుక్కని వుసిగలిపిందని చెప్పాడు.

మీనా- యెందుకూ ?

రామ- నేను లేనప్పుడు వాడు యింట్లో చొరబడబోతేను.

మీనా- అయ్యో తెలివా ! అసిరిగా !

అసిరి- (ప్రవేశించి) యేటమ్మా ?

మీనా- వెధవా, నిజంచెప్పూ. పంతులు యింట్లోలేనప్పుడల్లా కనిష్టీబు మధురవాణితో వుంటాడని, నువ్వు నాతో చెప్పలేదూ ?

అసిరి- (బుఱ్ఱగోకుకుంటూ) సెప్పినాను.

రామ- దొంగవెధవా! కుక్కని వుసిగలిపిందన్నావు ?

అసిరి- బాబు- నౌకరోడు నోరుమూసుకోవొద్దా బాబు ? సానమ్మడిగితే, మీమాట సెప్పుతాన బాబు ?

మీనా- వెధవా, నువుచెబితే నాకు భయవఁనుకున్నావా యేవిఁటి ?

రామ- ఓరి అబద్ధపు వెధవా! యెవరితోనూ మామాటమాత్రం చెప్పకు. రూపాయి యిచ్చానుకానూ?

మీనా- యందుకిచ్చారూ, రూపాయి ?

అసిరి- పిల్లలోణ్ణిగందా? (పైకివెళ్లును.)

రామ- దొంగముండ ద్రోహం చేస్తూందేం ?

మీనా- తెలుసునన్నారు ?

రామ- యింతని యెరగను.

మీనా- ఆడది నీతి తప్పినతరవాత అంతేవిఁటి ? యింతేవిఁటి ? తెగించినదానికి సగుడు మోకాలుబంటి- అందులో సాంది ఖాయిదాగా వుండాలనుకోవడం మీదీ బుద్ధితక్కువ.

రామ- బుద్ధితక్కువంటే బుద్ధితక్కువా? ముండనిబుఱ్ఱ చితకపొడిచెయ్యాలనివుంది. దీనికింద యంత సొమ్ము తగలెట్టానూ !

మీనా- యెప్పుడుతోలేస్తారు ?

రామ- యెప్పుడోనా ? రేపే. లంజ యంత పతివ్రతవేషం వేసిందీ ?

మీనా- మనవెఁప్పుడు వెళ్లిపోవడం ?

రామ- యక్కడికి?

మీనా- మతి పోతూందా యేవిఁటి ? రాజమేంద్రం ?

రామ- అవును. రేపు దాన్నితోలేస్తానా? యెల్లుండి మనం వుడాయిద్దాం. గాని నీసరుకులు తెచ్చుకుంటావా, ముసలాడికి వొదిలేస్తావా ?

మీనా- నాకున్నదల్లా నాసరుకులే; యెలా వొదిలేస్తాను ? నా సరుకులపెట్టె తాళం మానాన్నదగ్గిరుందిగదా యేవిఁగతి ?

రామ- నా ప్రయోజకత్వం నీకేం తెలుసును ? యిదుగో యీ రింగునవున్న యినప ములికీతో నీచిత్తవొఁచ్చిన పెట్టెతాళం తీసేస్తాను. గాని నాకంటె యక్కడుంది ?

మీనా- గుంటకి పెట్టిందా ? రాత్రివేళ, నాబట్టల పెట్లోపెట్టేది.

రామ- నీపుణ్యవుంటుంది ఆ బట్టలపెట్టె వోమాటుతీసిచూతూ. రేపు దానికంటె మధురవాణికిచ్చి, ముండని తగిలేస్తాను.

మీనా- ఆగుంట బట్టలపెట్టె తాళం పారేశింది.

రామ- ములికితో తీసేస్తాను.

మీనా- నా సరుకులపెట్టె తాళంకూడా తీసేసిపెడతారూ ?

రామ- అద్దే !

మీనా- నన్ను పెళ్లాడతానని ప్రెమాణం చేశారుకారే ?

రామ- దీపం ఆర్పేస్తే పెట్టెతియ్యడం యలాగ ?

మీనా- అగ్గిపుల్లవుంది.

రామ- ఐతే యిదిగో, నిన్ను తప్పకుండా పెళ్లాడతానని యీ దీపం ఆర్పేస్తున్నాను.

(రామప్పంతులు దీపం ఆర్పి మీనాక్షిని కౌగలించుకొని యెత్తును.)

రామ- యిలా యెత్తుకు తీసుకుపోతాను రాజమహేంద్రవరం.

(లుబ్ధావధాన్లు చీకటిలోవచ్చి కఱ్ఱతో రామప్పంతులు కాళ్లమీద కొట్టును. మీనాక్షి కిందపడును.)

లుబ్ధా- బందిపోటు గాడిదెకొడకా !

రామ- సచ్చాన్రా (వీధిలోకి కుంటుకుంటూ పోవును.)

లుబ్ధా- పో, ముండా నువుకూడా నాయింట్లోంచి. (మీనాక్షిని పైకితోసి తలుపు గడియవేయును.)

రామ- అసిరిగా. చంపేశాడ్రా- కాలెవిఁక విరిగిపోయిందిరా.

అసి- (నిమ్మళంగా) దెయ్యానికెట్టింది తింతే యేటౌతదిబాబూ ? (గట్టిగా) కానేళయిల్లు జొరబడితే, బుగత తన్నడా ?

రామ- (మీనాక్షితో) నువ్వు యింట్లోకి వెళ్లిపో.

మీనా- మరి యింట్లో అడుగుపెట్టను. నాసరుకులు లేకపోతే పాయను. రండి రాజమేంద్రం పోదాం.

రామ- తలిచినప్పుడేనా తాతకి పెళ్లి?

మీనా- మీయిష్ట వొఁచ్చినప్పుడు పెళ్లాడుదురుగాని, యింట్లోంచి లేవదీసుకొచ్చారుగదా? యిహ నేను మీతో వుండవలసినదాన్నే; పదండి.

రామ- వెఱ్ఱి కుదిరింది రోకలి తలకి చుట్టుకొమ్మన్నాట్ట ! బతిమాలుకుంటాను యిప్పటికి యింట్లోకి వెళ్లిపో.

మీనా- మరి యీజన్మంలో యీ యింట్లో అడుగుపెట్టను.

రామ- అసిరిగా, మీనాక్షి వొక్కర్తావుంటుంది. కాపాడి, బుగత తలుపుతియ్యగానే లోపలికి తీసికెళ్లు- (పరిగెత్తును. మీనాక్షి వెంటపడును.)

(రామప్పంతులు యింటియదట.)

రామ- (తలుపుతట్టి) వేగిరం, వేగిరంతియ్యి.

మధురవాణి- (తలుపు అవతలనించి) యేవిఁటాతొందర ?

రామ- ఆకుచిట్టెడ వెంట తరువుఁతూంది.

మధు- చిట్టెడ కనపడగానే తలుపుతీస్తాను.

రామ- తలుపేసుకు కూచుంటే నీక్కనపడ్డం యలాగ ? నువ్వు తలుపు తీసేలోగా నన్ను కాటేస్తుంది.

మధు- నా కంటేదీ?

రామ- కంటె, కంటె, అని తపిస్తున్నావేవిఁటి ? నిలబడ్డపాటున నూరుకంటెలు కురిపిస్తాను.

మధు- మీ నూరుకంటెలూ మీరు వుంచుకుని, నావొక్కకంటె నాకిచ్చి, మరీ యింట్లో అడుగుబెట్టండి.

రామ- రేపు పొగలుగాని కంటె యివ్వనన్నాడు లుబ్ధావధాన్లు.

మధు- రేపే యింట్లో కొత్తురుగాని, మించిపోయిందేవీఁ లేదు.

రామ- యింతట్లో చిట్టెడ మీదపడితే ?

మధు- సకేశా ? అకేశా ?

రామ- పిల్లికి చెలగాటం, యలక్కి ప్రాణపోకటా !

(మీనాక్షి ప్రవేశించి, రామప్పంతులు రెక్కపట్టుకొనును.)

మీనా- దీపం ఆర్పి ప్రమాణం చేశావు- తప్పితే తలపగిలిపోతుంది.

రామ- పో ముండా !

మీనా- మీ కాగల పెళ్లాన్నిగదా యెక్కడికి పోతాను ?

మధు- కాగల పెళ్లావేఁవిఁటి?

మీనా- నిన్ను వొదిలేసి, నన్ను రాజమేంద్రం తీసుకుపోయి పెళ్లాడతానన్నాడు- దీపవాఁర్పి ప్రమాణంచేశాడు- మరెలా తప్పుతాడు ?

మధు- యీవిడేనా ఆకుచిట్టడ ?

రామ- ముండా, నాచెయ్యొదిలెయ్‌- నిన్ను నే పెళ్లాడతానన్నానే? కలగన్నావా యేవిఁటి ? (మీనాక్షిని విడిపించుకొనగా మీనాక్షి కిందపడును.)

మధు- ఆడదానిమీదా చెయిజేసుకుంటారు ? యేమి పౌరుషం ! అబద్ధవాఁడక అన్నమాట నిలబెట్టుకోండి. యేం ? కులంతక్కువా ? రూపం తక్కువా ? ఆమెబతుకు భ్రష్టుచెయ్యనే చేశారు; పెళ్లాడి తప్పుదిద్దుకోండి- ఆవిణ్ణి పెళ్లాడివొస్తేనే నేను తలుపు తీస్తాను.

మీనా- పంతులు నన్ను కౌగలించుకొని యెత్తుకుంటే మానాన్న చూసి, తన్ని, యిద్దర్నీ యింట్లోంచి తగిలేశాడు. నువ్వు హెడ్డు కనిష్టీబుతో పోతున్నావు, నిన్నొదిలేసి నన్ను పెళ్లాడతానని వొట్టేసుకున్నాడు. నన్ను లేవదీసుకొచ్చి, నన్ను పెళ్లాడక తప్పుతుందాయేమిటి ?

మధు- అవస్యం పెళ్లాడవలిసిందే- పెళ్లాడకపోతే నువ్వుమాత్రం వూరుకుంటావూ ? దావా తెస్తావు- పంతులుగారికి దావాలంటే సరదానే!

రామ- మధురవాణీ- నీకు మతిపోతూంది- నాయింటికి నువ్వా యజమానివి ? తలుపు తియ్యి.

మధు- నిలబడండి. కర్పూరంవెలిగించి మంగళహారతి పళ్లెంతెస్తాను.(తలుపుదగ్గిరనుంచి లోనికివెళ్లును.)

రామ- (తలుపుసందులోనుంచి చూసి, తరవాత మీనాక్షిని ముద్దెట్టుకుని) యెంతపనిచేశావూ ! దాంతో చెప్పేశావు ! రహస్యంగా లేచిపోయి పెళ్లిచేసుకోవాలిగాని, అల్లరిచేసుకుంటే యలాగ ?

మీనా- యెప్పుడైనా అందరికీ తెలిసేదే గదా ?

రామ- నామాటవిని యిప్పుడు యింటికి వెళ్లిపో.

మీనా- యిహ మాయింటికి వెళ్లను. యిదే మాయిల్లు; మధురవాణి తలుపుతీస్తుంది; లోపలికి వెళదాం.

రామ- అయితే యిక్కడవుండు యిప్పుడే వొస్తాను (కొన్ని అడుగులు వీధంట నడచి, నిలచి) నిజంగా మంగళహార్తి తెస్తుంది కాబోలు పెంకెలంజ ? అది తలుపు తియ్యకపోయెనా, మీనాక్షి నన్ను వెతకడానికి బయల్దేరుతుంది. తెల్లవారవచ్చింది- చెరువ్వేపుపోయి కాలకృత్యాలు తీర్చుకుని ఆపైచర్య ఆలోచిద్దాం. రెండ్రోజులు పైకి వుడాయించానంటే మళ్లీ వొచ్చేసరికి కొంత అల్లరి సద్దుకుంటుంది. తలుపుతీసినట్లు కానరాదు. యవడిల్లు ? యవర్తె యిది నన్ను అడ్డడానికి ? ఆశ్చర్యం ! (కొంతదూరంగా వీధిలో నిలబడి, దాసరివేషంతో శిష్యుడు చితారుమీటి పాడును.)

చరణం॥

"యిల్లుయిల్లనియేవు ।
యిల్లునాదనియేవు ।
నీయిల్లుయెక్కడే చిలుకా ?"

రామ- యిది నాయిల్లు కాదా ?

శిష్యుడు- "ఊరికి ఉత్తరాన । సమాధిపురములో ।కట్టెయిల్లున్నదే చిలుకా ॥"

రామ- వొల్లకాట్లోనా ?

శిష్యుడు-

పల్లవి॥
"యెన్నాళ్లుబ్రతికినా ।
యేమిసామ్రాజ్యమే ।
కొన్నాళ్లకోరామ చిలుకా?" ।
అనుపల్లవి॥
"మూణ్ణాళ్లబతుకునకు ।
మురిసేవు త్రుళ్లేవు ।
ముందుగతికానవే చిలుకా"

రామ- యేవిఁటీ అపశగునం పాటా !

శిష్యుడు- "కఱ్ఱలే చుట్టాలు । కట్టెలేబంధువులు ।కన్నతల్లెవ్వరే చిలుకా?"

రామ- చుట్టాలా ? వొక్క అప్పవుంది, అదియెప్పుడూ నా గుమ్మంలో అడుగుబెట్టలేదు. యిప్పుడు యింటికి యజమాని యెవరూ ? తలుపవతల సానిలంజా! తలుపివతల సంసారి వెధవలంజానూ; యిద్దరూ కలిసి యిల్లుచేరకుండా నన్ను తగుల్తున్నారు.

శిష్యుడు- "నిన్నుమోసేరు నలుగురు । వెంబడిని పదిమంది ।"

రామ- వెఱ్ఱి ముండాపాటా ! పోదాం. (గబగబ కొంతదూరము నడచి, నిలుచుని) యీతోవనే వొస్తున్నాడుకాబోలు- అదుగో పాట వినపడుతూంది. శిష్యుడు-

(పాట)
   "నువ్వుకాలిపోయేదాక ।
    కావలుందురుగాని ।
    కడకుతొలగొత్తురు ।
    వెంటనెవరూరారు చిలుకా ॥"

రామ- వెఱ్ఱి ముండాపాటా !

శిష్యుడు- పంతులుగారూ ! యక్కడున్నారు ?

రామ- పరుగుచ్చుకోకపోతే పట్టుగుంటుంది. (పరిగెత్తును.)

---