కథలు - గాథలు (దిగవల్లి శివరావు)/చెన్నపట్నం గవర్నరు దుర్గతి
పాటించకుండా వుండలేక పోతున్నారు. ఇప్పటి గ్రామాదులలో హిందువులూ, మహమ్మదీయులూ అన్యోన్యంగా వుంటూ వరసపెట్టి పిలుచుకుంటూ భారతభూమి కడుపున పుట్టిన అన్నదమ్ముల లాగనూ, అక్కచెల్లెళ్ళ లాగనూ జీవిస్తున్నారు. ఇదంతా మనకు అనుభవైక్యవేద్యమేకదా!
8. చెన్నపట్నం గవర్నరు దుర్గతి
ఇంగ్లీషువా రీ దేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చేటప్పటికి విజయనగర సామ్రాజ్యం విచ్చిన్నం అయినా చెన్నపట్నం సముద్రతీర ప్రాంతాలన్నీ ఆ చక్రవర్తుల వంశీకులైన చంద్రగిరిరాజుల పరిపాలనలోనే వుండేది. ఆరాజుగారి కింది అధికారిని ఆశ్రయించి ఇంగ్లీషు వారు 1689 లో పట్టాపొంది చెన్నపట్టణం దగ్గిర కోట కట్టుకుని అక్కడ వర్తకం చేసుకుంటూవుండగా దేశమంతా గోలకొండ నవాబుల వశమైంది. తరువాత 1687 లో మొగలాయి చక్రవర్తియైన ఔరంగజేబు గోలకొండను జయించగా యీ ప్రాంతాలన్నీ ఆయన తాబేదారుడైన కర్నాటకనవాబు పరిపాలనకిందకి వచ్చినవి. ఇంగ్లీషు వారు ఏయెండకు ఆగొడుగు పట్టుతూ మొదట చంద్రగిరి రాజులను, తరువాత గోలకొండ నవాబులనూ అటుతరువాత కర్నాటక నవాబునూ ఆశ్రయిస్తూ కాలక్షేపం చేసేవారు.
ఆ ర్కా టు న వా బు
ఇలాగ ఉండగా దేశంలొ అంత:కలహాలు కలిగి ఇంగ్లీషువారు బలవంతులై మనరాజులను, నవాబులను బంతులాడించినట్లు ఆడించి రాజ్యాధికారాలను చేజిక్కించుకోవడానికి అవకాశాలు కలిగినవి. కర్నాటక నవాబు అన్వరుద్దీను 1749 లో చనిపోగా అతని కుమారుడైన మహమ్మదాలీ నవాబు అయినాడు. పూర్వపు నవాబుగారి అన్నకుమారుడి అల్లుడైన చందాసాహేబు ఈకర్నాటక రాజ్యసింహాసనాన్ని ఆక్రమించాలని సంకల్పించి ఈవిషయంలో తనకు సహాయం చేయవలసినదని అప్పట్లో పుదుచేరి ప్రాంతాలలో బలవంతులుగానున్న ఫ్రెంచి వర్తక కంపెనీవారిని ఆశ్రయించారు. అప్పుడు మహమ్మదాలీ సహజంగా, ఫ్రెంచివారికి పోటీగానున్న ఇంగ్లీషు వర్తక కంపెనీవారిని ఆశ్రయించారు. అంతట ఈ కర్నాటక రాజ్యసింహాసనం కోసం యుద్ధాలు ప్రారంభమైనవి. ఆయుద్ధాలలో ఇంగ్లీషువారు జయించడంలో మహమ్మదాలీ రాజ్యాధికారం స్థిరపడింది. అతడు ఇంగ్లీషువారికి వశుడై వారిచేతులలో కీలుబొమ్మయై వా రెలాగ చెబితే అలాగ వినవలసి వచ్చినది. కర్నాటక రాజ్యానికి మహమ్మదాలీ పేరునకు నవాబుగా నున్నాడు గాని నిజమైన ప్రభుత్వాధికారాలన్నీ ఇంగ్లీషువారే చలాయించడం ప్రారంభించారు. యుద్ధాలలో సహాయం చేసినందుకు సాలుకు ఏడులక్షల వరహాలు నవాబు కంపెనీవారి కివ్వాలని అది చెల్లించడానికి సొమ్ములేక నవాబు ఋణాలు చేయవలసివచ్చింది.
కర్నాటక నవాబు మొదట ఆర్కాటును రాజధానిగా చేసుకొని యున్నందువల్ల ఆయనను ఆర్కాటు నవాబు అనికూడా అనేవారు. తరువాత అతడు చెన్నపట్నంచేరి ఒక దివ్యభవనంలో కాపురంవుంటూ వచ్చాడు. అతడు తనభోగవిలాసాలకోసమూ, ఇంగ్లీషు అధికారులను మెప్పించడముకోసమూ దుర్వ్యయం చెయ్యడం ప్రారంభించాడు.కంపెనీ ఉద్యోగులకు బహుమతులూ, లంచాలూ విరివిగా నిచ్చేవాడు. చాలా మంది దొరలకు ఉద్యోగాలిచ్చి తనవద్ద వుంచుకొనేవాడు. 1758-1780 మధ్య అతని అతిధ్యమునుబొందిన దొరలూ దొరసానులూ అతని దర్బారువైభవమును, భోగవిలాసాలను, దుబారాఖర్చును చిత్రచిత్రాలుగా వర్ణించి యున్నారు. ఆర్కాటునవాబు యొక్క రాజ్యాధికారము కేవలమూ ఇంగ్లీషువారి దయాధర్మాలపైననే ఆధాపడి వున్నందువల్ల ఏదో నెపంమీద చీటికీ మాటికీ కంపెనీ అధికారులు అతనిని సొమ్ము ఇవ్వవలసిన దని పీడించేవారు. కొందరు ఉద్యోగులు అతనిని నయాన భయాన సొమ్ము తెమ్మని బలవంతపెట్టేవారు. కొందరు అతనికి సహాయం చేస్తామని మోసగించి సొమ్ము కాజేసేవారు. ఇన్ని విధాలుగా సొమ్ము పిండుతూవుంటే నవాబుకి ఎంతసొమ్మైతే చాలుతుంది గనక? అందుకోసం అతడు అప్పులపాలు కావలసివచ్చినది.
నవాబు తనవసరంకొద్దీ ఎక్కువ వడ్డీలకు ఋణపత్రాలు వ్రాసి యిచ్చేవాడు. కొందఱు ప్రబుద్ధులు అతనిని మోసగించి, బలవంతపెట్టి నూటికి 24 మొదలు 48 వంతుల చొప్పున అత్యధికమైన వడ్డీలువేసి ప్రతిఫల శూన్యంగాకూడా కొన్ని ఋణపత్రాలు వ్రాయించుకున్నారు. ఇలాగ వ్రాయించుకొన్న ఋణపత్రాల తాలూకు సొమ్ము వెంటనే ఇవ్వవలసిందని బలవంతపెట్టి యివ్వకపోతే కంపెనీ అధికారులకుచెప్పి తగిన శాస్తి చేయిస్తామని బెదరించి అందుక్రింద అతని రాజ్యభాగాలను స్వాధీనతాకట్లు వ్రాయించుకొనిన్నీ, సిస్తులవసూళ్ళ యిజారా హక్కులను పొందిన్నీ, అతనిరాజ్యంలో ప్రవేశించి, శిస్తులవసూళ్లలో రైతులను బాధించడం ప్రారంభించారు. ఈపత్రాలను దొరలు బాహాటంగా బజారులోపెట్టి క్రయ విక్రయాలు చెయ్యడం ప్రారంభించారు. ఆ కాలంలో చెన్నపట్నంలో ఇంగ్లీషు వర్తక కంపెనీవారి కొలువులో పనిచేసే గొప్ప అధికారులైన దొరలలో చాలమంది ఇలాంటి పత్రాలు వ్రాయించుకొని యీ యన్యాయాలలో భాగస్వాములై ఉన్నందువల్ల ఆర్కాటునవాబు ఋణపత్రాల మార్పిడి ఒక పెద్దవ్యాపారంగా సాగింది.
చెన్నపట్నం గవర్నరు కార్యాలోచనసభలో వ్యవహారాలన్నీ అధికసంఖ్యాక సభ్యుల అభిప్రాయాన్ని బట్టి జరగాలనే నియమం ఒకటి యున్నందువల్ల ఈ నవాబుగారి బాకీదారులు కార్యాలోచన సభ్యులకు లంచాలిచ్చీ, భాగాలిచ్చీ వారిని లోబర్చుకొని తమకు కావలసిన అధికారాలను, ఉత్తర్వులనూ సంపాదించేవారు. అందువల్ల కంపెనీ ఉద్యోగులలో ఎవరైనా ఈ అన్యాయానికి అంగీకరించక వాటిని ప్రతిఘటిస్తే తక్కినవారందఱూ వేటకుక్కలలాగ అతనిమీదపడి బాధించేవారు. అందువల్ల ఎవ్వరూ ఈ యన్యాయాన్ని అరికట్టలేకపోయేవారు. కొంత మంది గవర్నర్లు కూడా ఈ యన్యాయపువ్యవహారాలలో భాగస్వాములైనట్లు కంపెనీరికార్డులవల్ల కనబడుతూ వున్నది. కంపనీవారికి సైనికవ్యయంక్రింద సాలుకి ఏడులక్షల వరహాలచొప్పున చెల్లించవలసిన సొమ్మును నవాబుచెల్లించలేక బకాయి పెట్టి అందుక్రింద 1763లో జాగీరుజిల్లా అని ప్రసిద్దిచెందిన చెంగల్పట్టు జిల్లాను కంపెనీ వారికి సమర్పించాడు. ఐతే మళ్లీ సాలుకి 3 1/2 లక్షలవరహాలను చెల్లించే పద్ధతిని ఆజిల్లాను వారివల్ల 1768 మొదలు 1780 వఱకూ అతడు కవులు పుచ్చుకొంటూ ఆసొమ్ముకూడా చెల్లించలేక బాకీపడినాడు. అంతట 1780 లో కంపెనీవారే ఆజిల్లాలొ శిస్తులు వసూలు చేయడానికి యిజారాలు పాడించి బాకీక్రింద వసూలు చేసుకొనేవారు. ఆబాకీ తీరడం ఆంటూలేదు.
ఇలాగ నవాబుగారు లోకుల కివ్వవలసిన మొత్తం పాపం పెరిగినట్లు పెరిగి, కొన్ని కోట్ల వరహాలు తేలింది. బాకీదారులు తమబాకీలను గుఱించి గోలచెయ్యడం ప్రారంభించారు. ఈబాకీలను తీర్మానించే విషయంలో నవాబు ఉపేక్ష వహిస్తూన్నాడనీ , చెన్నపట్నం కంపెనీ అధికారులు కొందరిపట్ల పక్షపాతబుద్ధి చూపిస్తూన్నారనీ తగాదాలు బైలుదేరినవి. చెన్నపట్నం దొరలలోనే ఈ విషయంలో రెండు పార్టీలు బయలుదేరినవి. ఈ తగాదాలు, కుట్రలు, అక్రమాలూ ఎక్కువయి ఆఖరికి సీమలో కంపెనీ డైరక్టర్లకు ఫిర్యాదులు పోగా వారు దీనిని గుఱించి కొంతవిచారణ చేశారు. వారిలోకూడా కొందఱు ఒకపక్షమూ మఱికొందరు ఇంకొక పక్షమూ అవలంబించి అభిప్రాయభేదాలు కనబర్చగా ఈవిషయం పార్లమెంటులో చర్చకు వచ్చింది. కాని అక్కడ కూడా అభిప్రాయ భేదాలు వచ్చినవి. దీనికంతా కారణం నవాబుగారి జుట్టు చేతచిక్కించుకున్న దొరలే. ఈవిషయంలో సీమలో కూడ కొంతసొమ్ము ఖర్చుపెట్టి అక్కడివారి నోళ్లు కట్టకపోతే నవాబుగారి రాజ్యం ఆయనకు దక్కడం దుర్లభమని చెప్పి ఆయనను భయపెట్టి అతని దగ్గరనుంచి వారు మళ్లీ కొంతసొమ్మును గుంజి, కొందఱు డైరక్టర్లకూ, పార్లమెంటు సభ్యులకూ లంచా లిచ్చిన్నీ ఈ ఋణపత్రాలలో భాగాలిచ్చిన్నీ నవాబుగారి ఋణాలను సమర్ధించేపక్షాన్ని అక్కడ లేవ దీశారు. నవాబుగారి బాకీల విషయమై చర్చ వచ్చినప్పుడల్లా ఈపక్షంవారు రేచులలాగ లేచి ఆ వ్యవహారాలను సమర్దించేవారు.
ఈవిషయంలో ప్రవేశించి చాలా దుర్మార్గాలుచేసి సొమ్ము కాజేశాడనే కారణం వల్ల చెన్నపట్నంలో కంపెనీవారి క్రింద ఇంజనీరించు కట్టడముల శాఖలో పని చేసే పాల్ బెన్ ఫీల్డ్ అనే ఒక చిన్న కంపెనీ ఉద్యోగిని ఇక్కడ అధికారులు 1770 లోనూ 1778 లోనూ రెండుసార్లు పనిలోనుంచి తొలగిస్తే అతడు సీమకు వెళ్లి అక్కడ తన పలుకుబడి నుపయోగించి మళ్ళీ తన వుద్యోగం తాను తెచ్చుకున్నాడు. తరువాత అతడు పార్లమెంటు సభలోప్రవేశించి ఈ అన్యాయాలను నిలబెట్టడానికి పాటుపడి కృతకృత్యుడైనాడు.
ఆర్కాటు నవాబుగారి బాకీలవ్యవహారంవల్ల చెన్నపట్నంలో కంపెనీ ప్రభుత్వం పుచ్చిపోయింది. ఆర్కాటు నవాబుబాకీల విషయంలో జరిగిన అన్యాయాలను గుఱించి విచారించ వలసినదని పార్లమెంటు వారు 1774 లో తీర్మానించారు. ఈ ఋణమును పరిశీలించగా అది మూడు భాగాలుగా కనబడించి. అందులో రెండు భాగాలలో కొంతనిజం వున్నట్టు కనబడినా పెద్దభాగం మాత్రం అంగీకరించడానికి వీలులేని దొంగ బాకీలతో నిండివున్నట్లు కనబడింది కంపెనీ డైరెక్టర్లు దీనిని గుఱించి విచారించడానికి ప్రయత్నిస్తే బోర్డు ఆఫ్ కంట్రోల్ అనే పై తనిఖీ సంఘంవారు దానిని అలాగ విడదీయడానికి వీలు లేదని బాకీల మొత్తాన్ని అంగీకరించడమో,నిరాకరించడమో జరగాలన్నారు. దీనికి కారణంసీమలోని అదికారులలోని అధికారులలోకూడా చాలామంది కిందులో భాగాలు వుండడమే!
ఇంగ్లాండు పార్లమెంటుసభలో సభ్యుడుగా నున్న ఎడ్మండ్ బర్కు అనే ధర్మాత్ముడొకడు ఈయన్యాయాలను చూచి సహించలేక దీనిని గుఱించి అతితీవ్రంగా విమర్శించి ఈ బాకీలను సంబంధించిన కాగితములు నన్నింటినీ పార్లమెంటువారి ఎదుట పెట్టవలసినదని, ఒక తీర్మానాన్ని ప్రతిపాదించాడు. అయితే పైనచెప్పిన పాల్ బెన్ ఫీల్డున్నూ అతనిలాగనే భారతదేశంలో చాలా అన్యాయాలు చేసి అమితధన మార్జించి పార్లమెంటు సభ్యుడైన అట్కిన్ సన్ అనే దొరయున్నూ మరికొందఱున్నూ ఏకమై బర్కుమహాశయుని తీర్మానాన్ని ఓడించివేశారు. అంతట ఆర్కాటునవాబుగారి ఋణదాతల అక్రమచర్యలను హద్దుపద్దు లేకుండా పోయింది. ఈబాకీని 1784 మొదలు 1804 వరకూ సాలు ఒకటింటికి 480000 సవరసుల చొప్పున కిస్తీలుగా చెల్లించేటట్లు ఏర్పాటుచేశారు. ఇంత సొమ్ము చెల్లించిన తరువాత 1805 లో ఈ బాకీలను విమర్శించ డానికని ఒక విచారణ సంఘాన్ని ఏర్పర్చగా వారు 1814 వరకూ విచారించి రెండుకోట్ల సవరసులు బాకీ మొత్తంలో ఒకకోటి తొంబైలక్షల సవసరుల బాకీ కేవలమూ అబద్ధమని నిర్ణయించారు! ఇలాగ తేల్చిన మొత్తాన్ని బట్టిచూస్తే లోగడ కంపెనీ వుద్యోగులకు చెల్లించి వేయబడిన బాకీయావత్తు అబద్దమే ననిన్నీ నిష్కారణంగా ఆ మొత్తం చెల్లించబడిన దనిన్నీ కనబడుతూ వుంది.
ఈ ఋణభారంయొక్క వడ్డీమాత్రమే సాలుకు 623000 సవరసులుగా వుండేది. ఇది తూర్పుఇండియా వర్తకసంఘంవారికి బారత దేశంవల్ల వచ్చేలాభాల మొత్తానికి రెట్టింపు మొత్తంగా వుండడం చూసి చాలా మంది తమ గుండెలు బాదుకొన్నారు. దొంగపత్రాలను సృష్టించి నందుకు కొందరిమీద ఫొర్జరీ కేసులు దాఖలుకాగా వాటి విచారణ సందర్భంలో ఆకాలంలో చెన్నపట్నంలో కంపెనీ అధికారులుగాను, స్వతంత్రవర్తకులుగాను, ఉండిన దొరలు చేసిన అనేక అక్రమాలూ, అన్యాయాలూ బయలుపడినవి. ఆంధ్రపత్రిక వృషభసంవత్సరాది సంచికలో 'మన చెన్నపట్నము - దీని పూర్వచరిత్ర ' అనే వ్యాసంలో దీని వివరము లున్నవి.(Rule and fulfillment of British Rule in India Thompson, and Garrett pp 187-190)
తంజావూరు రాజ్యాపహరణం
అప్పులు తీర్చలేక ఖర్చులకు సొమ్ము చాలక బాధ పడుతూ వున్న ఆర్కాటునవాబు చుట్టుప్రక్కల నున్న రాజ్యాలలో దేని నైనా చేజిక్కించుకొని తనకు కావలసినసొమ్ము సంపాదించు కోవాలని ఆలోచిస్తున్నాడు. ఈవిషయంలో తన ఋణదాతలైన కంఫెనీ అధికారులూ, దొరలూకూడా తనకు సహాయము చేస్తారని అతని ఆశ. త్వరలోనే నవాబుకి అలాంటి అవకాశాలు లభించాయి.
ఆర్కాటునవాబు బాకీల వ్యవహారంలోనుంచి ఒక అధర్మదేవత తలెయెత్తి తంజావూరురాజ్యాన్ని పట్టుకొని ఓడించసాగింది. తంజావూరు సకల సంపదలకూ నిలయమైన స్వతంత్రరాజ్యం. అది పూర్వము చోళరాజుల క్రిందనుంది 14 వ శతాబ్దములో విజయనగర సామ్రాజ్యానికి సామంతరాజ్యమై తరువాత రాజ ప్రతినిధులైన తెలుగు నాయకులు పరిపాలనమున నుంటూ వచ్చింది. మఱికొంత కాలానికి తెలుగునాయకులు స్వతంత్రురాజులై ఆ దేశాన్ని పరిపాలించారు. తంజావూరు, మధురనాయకులమధ్య 1673 లో జరిగిన యుద్ధంలో మధురనాయకులు తంజావూరును జయింపగా ఆంధ్రనాయక రాజవంశం అంతరించినది. చత్రపతి శివాజిమహారాజు సవతి తమ్ముడైన ఏకోజి అనే 'వెంకోజీ ' బిజాపూరు సుల్తానుగారి సేనాపతిగా వచ్చి రాజాక్రమణచేసి 1675 లో తంజావూరుకు రాజైనాడు. తరువాత మహరాష్ట్రులైన ఆయనవంశీకులే ఆరాజ్యాన్ని పరిపాలించారు. ఇలాగ ఇక్కడ రాజులు మారినా దేశపరిస్థితులు మాత్రం మారలేదు. తంజావూరు ఎప్పటిలాగనే పాడిపంటలతో తులతూగుతూ సుభిక్షంగా నుండి సంగీత సాహిత్యాలకు, లలితకళకు ప్రసిద్ధిజెంది స్వతంత్రమైన దక్షిణాంధ్ర రాజ్యంగా ఉంటూవచ్చింది. ఈ తంజావూరు రాజ్య వైభవం చూస్తే చుట్టు పక్కల వారందఱికీ కళ్లు కుట్టినవి.
1742 లో తంజావూరునేలే సాహుజీని ప్రతాపసింహుడు త్రొసిరాజన్నాడు. అప్పట్లో చెన్నపట్నం సముద్రతీరంలో ఒకకోట కట్టుకొని వర్తకం చేసుకోంటూవున్న ఇంగ్లీషువారు ప్రతాపసింహ మహారాజుతో స్నేహం చేసి ఏడు సంవత్సరాలు ఆయనతో సఖ్యతగా నున్నారు. ఆకాలంలో ఇంగ్లీషు వారికీ, ఫ్రెంచివారికీ జరిగిన యుద్ధాలలో ప్రతాప సింహుడు ఇంగ్లీషువారి పక్షాన్నే వున్నాడు. ఇలాంటి స్థితిలో పదభ్రష్టుడైన సాహూజీ మహారాజు తాను మళ్ళీ తంజావూరు సింహాసనం ఎక్కడానికి గనక తనకు సహాయముచేస్తే తంజావూరు రాజ్యంలోనున్న దేవికోటజాగీరునున్నూ, కోటనున్నూ ఇస్తాననిన్నీ, యుద్ధపు ఖర్చులన్నీ తానే భరించు కుంటాననిన్నీ, ఇంగ్లీషువారితో బేరం పెట్టాడు. అంతట ఇంగ్లీషువారికి నోరూరింది. ఇంతవఱకూ తమకు స్నేహితుడుగా నున్న ప్రతాపనరసింహరాజుపట్ల మిత్రద్రోహం చెయ్యడానికి పూనుకొనినారు. అతని మీదికి దండు పంపించారు. అయితే ఆ యుద్ధంలో వారి సైన్యమేఓడిపోయింది. అంతటితో నానాజీకి సహాయంచేసే ప్రయత్నం మానుకొని ఏవిధంగానైనా దేవికోటనుమాత్రంప్రతాపనసింహుని దగ్గర నుంచి లాక్కోవాలనె సంకల్పంతో ఇంగ్లీషువారు దేవికోటను ముట్టడించి అది స్వాధీనంకాగానే దేవికోటను తమకు ఉండనిస్తే ఇకముందు సాహురాజుకు సహాయం చేయకుండా వుంటామని ప్రతాపనసింహునితోనే బేరంపెట్టారు! ఈ వాలకంయెక్క మొదటి అంశం ఇలాగ పూర్తి అయింది. తరువాతకొంతకాలం జరిగింది.
ప్రతాపసింహుడికింత అన్యాయము జరిగినప్పటికీ కర్నాటకనవాబు తగాదాల సందర్భంలో ఇంగ్లీషువారికీ, ఫ్రెంచివారికీ జరిగిన యుద్ధాలలో ప్రతాపసింహుడు పాపము ఇంగ్లీషువారి పక్షాన్నే అవలంబించి నమ్మకంగా నున్నాడు. ఆయుద్ధాలలో ఇంగ్లీషువారు జయించినందువల్ల వారి నాశ్రయించిన మహమ్మదాలీ కర్నాటకకనవాబుగా స్థిరపడి వారి చేతులలో కీలుబొమ్మ అయిపోయినాడు. ఒక మూలనుంచి తన రాజ్యాధికారాలూ, రాజ్యమూ కూడా తన చేతులలోనుంచి జారి ఇంగ్లీషువారి చేతులలోకి పోతూ వుండగా ఈ నవాబు తనకు పచ్చపచ్చగా కనబడుతూ వున్న తంజావూరు రాజ్యముమీద కన్నువేసి దానిని ఎలాగైనా కబళించాలని విశ్వప్రయత్నాలు చెయ్యడం ప్రారంభించాడు. అతడు ఏదో సాకు కల్పించి తనసైన్యాలను తంజావూరు మీదికి దండుపంపాడు. అంతట తంజావూరురాజు ఈయన్యాయాన్ని గుఱించి తనస్నేహితులైన ఇంగ్లీషు వర్తకకంపెనీవారితో మొరపెట్టుకొన్నాడు. ఇంగ్లీషుకంపెనీవారు వీరిద్దరి మధ్యను రాజీ కుదర్చడంలో తమకు కొంత లాభం వున్నదని గ్రహించి అందుకు తగిన ఏర్పాటు చేశారు. తంజావూరు రాజు ఆర్కాటు నవాబుకు సామంతుడిగానుండి ఆయనకు నాలుగులక్షలవరహాలు కప్పం చెల్లించే టట్లున్నూ, నవాబు తంజావూరు రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించకుండా వుండేటట్లున్నూ 1762 లో ఒక రాజీ కుదిర్చారు. ఈ ఏర్పాటు ప్రకారం కొంతకాలం జరిగింది. ఇంతలో ప్రతాపసింహ మహారాజు చనిపొయాడు. అంతట కర్నాటక నవాబు తన బాకీదారు లైన ఇంగ్లీషుధికారుల కుట్రతో మళ్లీ ఎప్పటి ఆటనె సాగించాడు. ప్రతాపసింహుడి కొమారుడైన తులజాజీమహారాజు మీదికి నవాబు 1771 లో తనసైన్యాలను పంపించి రాజ్యాన్ని కొల్లగొట్టించాడు. తులజాజీమహారాజు ఏమీ చెయ్యలేక నవాబుకి చాలా సొమ్ము నిచ్చి అతనితో రాజీపడ్డాడు. ఇంగ్లీషువారు చూస్తూ వూరుకున్నారు.
కర్నాటకనవాబు ఆశకిమితిలేదు. తంజావూరు రాజ్యాన్నెలాగునైనా కాజెయ్యాలని సంకల్పించాడు. ఇందులో తనకు సహాయంచేస్తే అమితమైన ధన మిస్తానని ఇంగ్లీషుదొరలందఱికీ ఆశపెట్టాడు. చాలా మంది అధికారులను లోబర్చుకొన్నాడు. 1773 లో మళ్లీ తంజాఫూరు మీదికి దండేత్తి దేశాన్ని కొల్లగొట్టి రాజును చెరబట్టి రాజ్యాన్ని తనవశంచేసుకొన్నాడు. అంతట నవాబుచుట్టూ చేరిన ఇంగ్లీషు దళారీల పంటపండింది. ఋణాలతీర్మానం పేరున తంజావూరు రాజ్యభాగాలను నవాబువల్ల తాకట్టుపెట్టించుకొని శిస్తులు వసూలు చేసుకొనే హక్కును పొంది అక్కడ రైతుల పొలాలలో నున్న పంటయావత్తు జప్తుచేసి నానా భీభత్సమూ చెయ్యడం ప్రారంభించారు. ఇలాగ నవాబు తన బాకీదారులను తంజావూరుమీదికి ఉసికొల్పడం చూస్తే నిజంగా వీరందఱికీ బాకీలు లేవనిన్ని, తంజావూరును దోచుకొని ప్రజలను పీల్చిపిప్పిచేసి సొమ్ము పిండి ఉభయులూ కలిసి పంచుకోవడానికి నవాబున్నూ, ఈ దొరలున్నూ, కలిసి కుట్రచేశారనిన్నీ చాలమందికి తోచింది. ఋణదాతలలో చాలామంది కంపెనీ అధికారులుగానే ఉన్నందువల్ల తంజావూరు రైతుల మొరలను ఆలకించి అక్కడ జరుగుతూవున్న అక్రమాలను విచారించి న్యాయం జరిగించేవారే లేకపోయారు.
గ వ ర్న రు పి గ ట్టు గా రు
తంజావూరు రాజుకుజరిగిన అన్యాయం సంగతి మెల్లిమెల్లిగా ఇంగ్లాండులో నున్నతూర్పు ఇండియా వర్తకసంఘంవారి అధికారులకు తెలిసించి. అంతట కంపెనీ డైరెక్టర్లు నవాబుచేసిన అక్రమానికి చెన్నపట్నంలో కంపెనీ అధికారులు మద్దతుచేయడం బాగాలేదని వారిని కఠినంగా మందలించి అప్పట్లో చెన్నపట్నం గవర్నరుగా నుండిన వించ్ (Winch) దొరను ఆపదవిలోనుంచి తొలగించి అతని స్థానే పూర్వం 17855 మొదలుకొని 1763 వరకూ చెన్నపట్నం గవర్నరుగా నుండి ఫ్రెంచివారితో జరిగిన యుద్ధాలలో ధైర్యంగా పనిచేసిన 'జార్జి పిగట్టు ' అనే ఆయనను మళ్ళీ చెన్నపట్నానికి గవర్నరుగా నియమించి తంజావూరు రాజ్యాన్ని మళ్ళీ పూర్వపురాజుగారివశం చెయ్యవలసిందని అతనికి చెప్పి 1775 లో పంపించారు.
ఇది కర్నాటకనవాబుగారికి చాలా కష్టంగాతొచించి. తాను ఇంగ్లీషువారికి నమ్మిన స్నేహితుడననిన్నీ తంజావూరు రాజు వట్టి పనికిమాలిన వాడనిన్నీ తంజావూరు తన అధీనం తప్పితే తాను దొరల కివ్వవలసిన ఋణాలను తీర్చలేననిన్నీ ఎన్నోవిధాలుగా మొరపెట్టుకున్నాడు గాని పిగట్టుగారు వినిపించుకో లేదు. చెన్నపట్నంలోనున్న గొప్పగొప్ప ఉద్యోగులచేత చెప్పించి చూశాడుగాని లాభం లేక పోయింది. ఆఖరికి తాను మళ్ళీ ఇంగ్లాండులో కంపనీ డైరెక్టర్ల సభవారికి చెప్పుకుంటాననిన్నీ అందాకా తంజావూరు విషయంలో చర్యతీసుకొవద్దనిన్నీ పిగట్టుగారిని వేడుకున్నాడుగాని అందుకు కూడా ఆయన అంగీకరించలేదు. తనకీ వ్యవహారంలో సహాయంచేస్తే అమిత మైన ధనం లంచమిస్తానని కూడా నవాబు కబురంపగా పిగట్టుగారు చలించలేదు. నవాబుకి అమితమైన కోపంవచ్చింది. ఈ పిగట్టుగారిని ఎలాగైనా సాధించాలని ఉపాయాలు ఆలోచించడం ప్రారంభించాడు. ఆయన మనస్సును మార్చాలని జపతపాలు హోమాలు చేయించాడు. అతనిని తుదముట్టించాలని మారణహోమంకూడా చేయించాడు.,
పిగట్టుగారు తన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి స్యయంగా తంజావూరు వెళ్ళి అక్కడ ఆర్కాటునవాబుగారి పరిపాలన రద్దుచేయబడి మళ్ళీ తంజావూరు రాజుగారి పరిపాలన స్థాపించబడిందని ప్రకటన చేయించాడు.
బె న్ ఫీ ల్డు క ధ
ఆసమయంలో ఒక చిత్రం జరిగింది. 1763 వ సంవత్సరం నుంచి చెన్నపట్నంలో కంపెనీవారి ఇంజనీరింగు కట్టడముల శాఖలో ఒక చిన్న వుద్యోగి గా నుంటూ చెన్నపట్నం కోట గోడల నిర్మాణం వగైరా పనులు చేయించిన 'పాల్ బెన్ ఫీల్డు ' అనే దొర ఒకడు గవర్నరుగారి దగ్గరికివచ్చి ఆర్కాటునవాబుగారు తనకు 230000 సవరసూ బాకీ వున్నాడనినీ అందుకింద తంజావూరు రాజ్యంలో కొన్ని భాగాలను తనకు తాకట్టు పెట్టినాడనిన్నీతంజావూరు రాజ్యంలో శిస్తులు వసూలుచేసుకునే హక్కు తనకు వున్నదనిన్నీ తంజావూరులో కొందరు ఆసాములుకూడా తనకు బాకీవుండి భూములమీద పైరునుతనకు హామీ వుంచి నారనిన్నీ అభ్యంతరం చెప్పాడు. గవర్నరుగారు అతని మాటి వినిపించు కోకుండా తంజావూరును రాజుగారికి స్వాధీనపరిచారు. అంతట బెన్ ఫీల్టు చెన్నపట్నంలో గవర్నరు గారి కార్యాలోచన సభవారికి పైసంగతులతో అర్జీయిచ్చినాడు. బెన్ ఫీల్డు మాటలు చాలా ఆశ్చర్యంగానూ అనుమనాస్పదంగానూ కనబడినవి. ఇతరులకు అంత అప్పులిచ్చే తాహతు అతనికిలేదు. ఇతడు స్వతహాగా ధనవంతుడు కాడు. ఇంగ్లాండు నుంచి వచ్చినప్పుడు ఇతను తెచ్చిన సొమ్ము ఏమీలేదు. పోనీ, ఉద్యోగంలో ఎక్కువగా సొమ్ము ఆర్జించినాడేమోననుకుందా మంటే అతడు చేసిన వుద్యోగం చాలా చిన్నది. అందులో ఎక్కువగా సొమ్ము ఆర్జించే అవకాశాలు లేవు. ఇతడు తాను సంపాదించిన దానినే పొదుపు చేసుకుని కూడబెట్టు కున్నాడేమో నను కుందామంటే అతడు చాలా దుబారా మనిషి. సొమ్ము నిలువచేసే స్వభావం కల వాడు కాదు. నవాబుగారుగాని ఇతరులుగాని నీకు బాకీ వున్నట్లు నీదగ్గర దాఖలా లేమైనా వుంటే చూపించ వలసిందని గవర్నరుగారు అడిగితే అతడేమీ చూపలేక పోయాడు. గవర్నరు గారి కార్యాలోచన సభ్యులలో బహుసంఖ్యాకులు కూడా మొదట బెన్ ఫీల్డు చెప్పిన మాటలను నమ్మలేదు. తరువాత మళ్లీ అతడేమి మాయోపాయాలు చేశాడోగాని త్వరలోనే కార్యాలోచన సభ్యుల మనస్సులు మారి బహుసంఖ్యాకులు మళ్ళీ తమ అభిప్రాయాన్ని మార్చుకొని ఈవ్యవహారాన్ని తిరుగదోడి తంజావూరు కర్నాటక నవాబు స్వాధీనంలో వుండగా ఆరాజ్యాలలో భూములమీద పండిన పంట యావత్తూ బెన్ ఫీల్డుకే హక్కు గల ఆస్తి అని తీర్మానించారు! పైగా బెన్ ఫీల్డు బాకీలనేవి తంజావూరు రాజ్యాదాయంపైన బద్ధతచేయబడవలసిన పబ్లికు ఋణ మనే అభిప్రాయాన్నికూడా వెలిబుచ్చి ఆ రాజ్యములోని భూములమీద నున్న పంటను అతని వశంచెయ్యడానికి చెన్నపట్నం ప్రభుత్వం వారు తగు సహాయం చెయ్యాలని కూడా నిశ్చయించారు.
గవర్నరుగారికి కార్యాలోచన సభ్యులకూ తగాదా
గవర్నరు గారికి చాలా అన్యాయమని తోచింది. అంతట పిగట్టుగారు తన కార్యాలోచన సభ్యుల యభిప్రాయాన్ని ప్రతిఘటించారు. గవర్నరుగారికీ కార్యాలోచన సభ్యులకూ ఘర్షణ జరిగింది. అంతట గవర్నరుగారి కార్యాలోచన సభలో బెన్ ఫీల్డు పక్షం వహించిన సభ్యులు గవర్నరుమీద నీర్ష్యవహించి ఇతర విషయాలలో అతని అధికారాన్ని తృణీకరించడం ప్రారంభించారు.
ఇంతలో తంజావూరు రాజు దర్బారులో ఒక ఇంగ్లీషు ప్రతినిధిని నియమించ వలసి వచ్చింది. ఆ సందర్భంలోకూడా గవర్నరుగారికీ కార్యాలోచన సభలోని అధిక సంఖ్యాక సభ్యులకూ అభిప్రాయ భేదం వచ్చింది. గవర్నరుగారీ పదవికి రస్సెల్ అనె అతణ్ని నియమించాలని అంటే సభ్యులు బెన్ ఫీల్డుకి అనుకూలంగ ఉండే స్టూవార్డు అనే అతనిని నియమించాలని అన్నారు. దీనిని గురించి కార్యాలోచన సభ యొక్క సమావేశాలలో అతి తీవ్రమైన చర్చలు జరిగినవి. చివరకు అధిక సంఖ్యాక సభ్యులు గవర్నరుగారి అభిప్రాయాన్ని త్రోసిపుచ్చారు. అంతతా వారు పేర్కొన్న అభ్యర్హిని ఆపదవికి నియమించినట్లు జారీ చేయవలసిన అధికార పత్రముమీద గవర్నరు సంతకం చెయ్యడానికి నిరాకరించాడు. ఈ తగాదా చాలా తీవ్రరూపం దాల్చింది. గవర్నరును సభలో ప్రతిఘటిస్తూవున్న సభ్యులలో బ్రూకు స్ట్రాటన్ అనే ఇద్దరు సభ్యులు చాలా దురుసుగా ప్రవర్తించినందువల్ల గవర్నరు వారిపైన కోపించి వారు ప్రభుత్వ ద్రోహము తలపెట్టినారనే నేరమును మోపునాడు. అలాంటి నేరము మోపబడిన సభ్యులు సభలో పాల్గొనడానికి వీలులేదని శాస్త్రవిధి యున్నందువల్ల వారిని సభలోకి రాకుండా చేసి తక్కిన సభ్యుల సహాయంతో వాళ్ల సభ్యత్వం బర్తరపు చేసినట్లు గవర్నరు తీర్మానింప జేశారు. అంతట కార్యాలోచన సభలో పూర్వం అధిక సంఖ్యాకులుగా నుండిన సభ్యులందరూ ఏకమై గవర్నరుకు వ్యతిరేక పక్షంగా ఏర్పడి అతనిని గురించి పైయధికారులకు ఒకపితూరీ వ్రాసి గవర్నరును కార్యాలోచన సభలో పలుకుబడి లేనందువల్ల అధిక సంఖ్యాకులైన తామే ప్రభుత్వాధికారాలను చలాయించుటకు అర్హులమని ప్రకటిందారు. అప్పుడు గవర్నరున్నూ అతని స్నేహితులున్నూ పితూరీదారులైన కార్యాలోచన సభ్యులందరినీ సభ్యత్యంలో నుంచి తొలగించినట్లు ప్రకటించి వారిని పట్టుకుని అరెస్టు చేసి సైనిక శాసనంకింద శిక్షించవలసినదని చెన్నపట్నంలో సర్వసేనానిగా వున్న సర్ రాబర్టు ప్లెచర్ గార్ని కోరారు. అయితే ఈ సర్వసేనాని కూడా గవర్నరుకు వ్యతిరేక పక్షంలో చేరి వున్నందువల్ల అతడలాగ చేయక ఉపేక్షించాడు.
గవర్నరుగారిని ఖైదుచెయ్యడం
గవర్నరుకు వ్యతిరేక పక్షంగ నున్న సభ్యులకు గవర్నరు అలుసైపోయినాడు. అతడు తమర్ని అరెస్టు చేయించదలచి నందుకు శాస్తిగా తామే అతనిని పట్టుకుని నిర్భంధించడానికి వారు నిశ్చయించారు. ఆప్రకారం వారు 1776 వ సంవత్సరం ఆగుస్టు 24 వ తేదీన పిగట్టు గారిని, పట్టుకొని ఖైదుచేశారు.
అప్పుడు గవర్నరుగారి కొక ఉపాయం తట్టింది, చెన్నపట్నం రేవులోను కోటలోనూ కంపనీ ప్రభుత్వంవారు అధికారం చలాయిస్తూ వున్నా సముద్రంమీద వారికలాంటి అధికారాలు లేవు. సముద్రము మీద నున్న ఇంగ్లీషు యుద్దనౌకలపైన అధికారియైన అడ్మిరల్ ఇంగ్లీషురాజుగారి ప్రభుత్వోగి. అతనికి సర్వాధికారాలుంటాయి. అందువల్ల చెన్నపట్నం దగ్గర సముద్రంలో నున్న నౌకల అధికారియైన అడ్మిరల్ సర్ ఎడ్వర్డ్ హ్యూస్ గారి నాశ్రయించి తన నొక నౌకమీదికి తీసుకునివెళ్లి కాపాడవలసినదని పిగట్టు ప్రార్ధించాడు. అంతట పిగట్టు గారిని తనకు వప్పగించవలసినదని అడ్మిరల్ గారు కార్యాలోచన సభవారిని కోరారు. నౌకలమీద ప్రభుత్వాధికారాలన్నీ అడ్మిరల్ గారివే యైనా రేవులో కంపెనీ ప్రభుత్వంవారి వశంలో నున్న కంపెనీ యుద్యోగులను తన నౌకమీదికి తీసుకుని వెళ్లడానికి ఆయనకు అధికారం వున్నట్లు తగిన శాస్త్ర దృష్టాంతరం తమకు కనబడనందువల్ల పిగట్టుగారిని ఆయనకు వప్పగించడానికి వీలులేదని వారు నిరాకరించారు. ఇంగ్లీషురాజుగారి ప్రభుత్వాధికారిగా తనకర్తవ్యాన్ని నిర్వర్తించగలందులకు తాను చెప్పవలసిన మాట చెప్పినాననిన్నీ వారు తనమాట విననందువల్ల కలిగే ఫలితాలకు తాను ఉత్తరవాదిని కాదనిన్నీ చెప్పి అతడు వూరుకున్నాడు.
చెన్నపట్నం గవర్నరు కార్యాలోచన సభవారు పిగట్టుగారి నొకచోట ఖైదుచేసి వుంచారు.
గవర్నరుజనరల్ ఉపేక్ష
అప్పట్లోకంపెనీవారి రాజ్యానికంతా గవర్నరు జనరలుగా కలకత్తాలోనున్న వారన్ హేస్టింగ్సుగారికి చెన్నపట్నంలో జరిగిన సంగతులు మెల్లిగా తెలిసినవి. అయితే కార్యాలోచన సభలో అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా తానేమీ చేయదలచ లేదని చెప్పి దీనిని గురించి ఎలాంటి చర్యయున్నూ తీసుకోకుండా వుపేక్షించాడు. ఇలాంటి విషయంలోనే బొంబాయి గవర్నరు కార్యాలోచన సభలో అభిప్రాయభేదం వచ్చినప్పుడు అతడు చర్యతీసికొనిన్నీ ఇక్కడి వ్యవహారాలలో ఇలాగ వుపేక్షించడం చాలా ఆశ్చర్యకరమైన సంగతి యని చరిత్రకారుల యభిప్రాయం. తాను ఇలాగ ఊరుకున్నందువల్ల చెన్నపట్నంలో అధికారాన్ని చేజిక్కుంచుకున్న కార్యాలోచన సభ్యులు ఇంకా అక్రమాలు చేస్తారనిన్నీ కర్నాటక నవాబు గారి బాకీదార్లు హాయిగా కాలక్షేపం చేస్తారనిన్నీ కూడా అతడు ఎరిగి వుండిన్నీ అతడు అందుకుకూడా హర్షించినట్లు వారన్ హేస్టింగ్సు 26-9-1776 వ తేదీన తన స్నేహితుడికి వ్రాసిన ఒక వుత్తరం వల్లనే కనబడుతూవుంది.[1]*
అక్కడ చెన్నపట్నంలో పిగట్టుగారు ఖైదులో పడి మగ్గిపోతున్నాడు. అతడు మనోవ్యాధితో బాధ పడుతూవున్నందువల్ల అతని ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది.
సీమలో కంపెనీ డైరక్టర్ల చర్యలు
చెన్నపట్నంలో జరిగిన సంగతులను గురించి ఇంగ్లాండులో కంపెనీ డైరెక్టర్లకు తెలియగా వారికి విషాదాశ్చర్యాలు కలిగినవి కాని డైరెక్టర్ల కోర్టు అనే కార్యనిర్వాహక సంఘసభలో అభిప్రాయభేదాలు కలిగినందువల్ల దీనిని గురించి వెంటనే తగినచర్య జరపలేదు. 1777 వ సంవత్సరం మార్చి 26 వ తేదీన డైరెక్టర్ల సాధారణ సంఘసభలో ఈ విషయాన్ని గురించి చర్చ జరిగింది. పిగట్టుగారు మళ్ళీ గవర్నరు పదవిలో నుండే ఏర్పాటును త్వరలో చెయ్యవలసినదనిన్నీ ఆయనను ఖైదుచేసిన కార్యాలోచన సభ్యుల చర్యలనుగురించి విచారణ జరిగించ వలసినదనిన్నీ ఆ సభవారు డైరెక్టర్ల కోర్టువారికి శిఫారసు చేశారు.డైరెక్టర్ల కోర్టువారు మాత్రం పిగట్టుగారి మీద అంతగా అభిమానం చూపలేదు. పిగట్టుగారు మళ్లీ గవర్నరుపదవిలో నుండేటట్లున్నూ ఆయనను ఖైదులోనుంచిన సభ్యుల చర్యలను గర్హిస్తూను కొన్ని తీర్మా
నాలున్నూ, కార్యాలోచనసభలో అతనిపక్షముననున్న సభ్యులను విమర్శిస్తూ కొన్ని తీర్మానాలున్నూ డైరక్టర్లకోర్టువారు చేశారు. అయితే పిగట్టుగారి వ్యవహారాన్ని గురించి వారేమీ పర్యవసానం తేల్చలేదు.
ఈ డైరెక్టర్లకోర్టులో సభ్యులు ప్రతియేటా మారుతూవుంటారు. అందువల్ల ఒకమాటు పిగట్టుగారిని అనుకూలంగానూ, ఇంకొకమాటు ఆయనకు వ్యతిరేకంగానూ వుండే తీర్మానాలు చేయడం కూడా జరిగింది. అంతేగాని ఆ వ్యవహారాన్ని గురించి ఇతమిత్ధమని నిర్ణయించి తీర్మానించలేదు. కార్యాలోచన సభలో అధికసంఖ్యాకుల అభిప్రాయానికి వ్యతిరేకంగా గవర్నరు ప్రవర్తించడం అక్రమమనిన్నీ తంజావూరు దర్బారులో ఇంగ్లీషు కంపెనీ ప్రభుత్వంవారి ప్రతినిధిగా రస్సెలును నియమించడం అసమంజసమనిన్నీ, 21-4-1777 వ తేదీన తీర్మానించారు. గవర్నరుగారు తన కార్యాలోచనసభలోనుంచి బ్రూకుస్ట్రాటనుగార్లను బర్తరపుచెయ్యడాన్ని గురించి ఖండిస్తూ తీర్మానించాలని కూడా ప్రయత్నించారు గాని అది సాగలేదు. పిగట్టుగారి పక్షమవలంబించినవారు అతనిని బలవంతముగా పట్టుకుని ఖైదుచేయడాన్ని గురించిన్నీ కార్యాలోచన సభలో అతని తరఫున నున్నవారిని సభలోనుంచి తోలగించడాన్ని గురించిన్నీ గర్హిస్తూ ఒక తీర్మానం చేయించగలిగారు గాని అవతలిపక్షం వారు ఆర్కాటు నవాబు పిగట్టుగారి కేదో సందర్భంలో ఇచ్చిన చిన్న చిన్న బహుమతుల సంగతిని ఎత్తుకుని వాటిని స్వీకరించడంలో గవర్నరు ప్రవర్తన యేమీ బాగా లేదని తీర్మానించారు. నిజానికి పిగట్టుగారు నవాబు పట్ల ఏలాంటి పక్షపాతమూ చూపించలేదు సరికదా, అతని దురాశను ప్రతిఘటించాడు. అతడు చాలా పెద్దమొత్తాలు లంచమిస్తానన్నా ఇతడు లోబడలేదు.
పిగట్టుగారి వ్యవహారం విషయంలో కంపెనీ డైరెక్టర్ల కోర్టు వారి తీర్మానాలకు విధివిదానాలు గాని ఆద్యంతాలుగాని లేకుండా పోయినవి. 1777 వ సంవత్సరం మే 7 వ తేదీన డైరెక్టర్లకోర్డువారి సాధారణసంఘసభలో దీనిని గురించి తీవ్రమైన చర్చ జరిగినది. పిగట్టు గారి అధికారాన్ని ధిక్కరించిన సభ్యుల చర్యను ఖండిస్తూ అతనిని గవర్నరుపదవిలో పున:ప్రతిష్టచేసినట్లు తీర్మానిస్తూ అతని యొక్క ప్రవర్తనను గురించి విచారించ గలందులకుగాను అతనిని చెన్నపట్నం గవర్నరు పదవి వదిలి సీమకు రావలసినదని తీర్మానించారు. చెన్నపట్నం కార్యాలోచన సభలో పిగట్టుగారిపక్షం అవలంబించిన వారినీ ఆయనకు వ్యతిరేకంగా నున్నవారినీ కూడా సీమకు రమ్మని వుత్తర్వుచేసేటట్లున్నూ శిఫారసు చేశారు. ఈ తీర్మానాలకు 317 మంది వ్యతిరేకులుగానూ, 414 మంది అనుకూలంగానూ సమ్మతులిచ్చారు.
పిగట్టుగారి మరణం
అంతట 1777 వ సంవత్సరం మే 21 వ తేదీన పిగట్టుగారి వ్యవహారం ఇంగ్లాండు దేశపు పరమోన్నత శాసనసభ యైన పార్లమెంటులో కామన్సు సభవారి యెదుట చర్చకు వచ్చింది. అప్పుడు కొందరు పిగట్టుగారికి అనుకూలమైన తీర్మానాలను ప్రతిపాదించగా ప్రభుత్వ మంత్రులు వాటిని ప్రతిఘటించారు. అంతట అవి ఓడిపోయినవి ఇట్టిస్థితిలో డైరెక్టర్ల కోర్టు సాధారణ సంఘసభవారి తీర్మానాలను అమలులో పెట్టడానికి డైరెక్టర్ల కోర్టువారు 30-7-1771 వ తేదీన తీర్మానించారు. అయితే ఈ లోపుగానే 11-5-1777 వ తేదీన పిగట్టుగారు దివంగతులైనారు. అందువల్ల పిగట్టుగారి బాధలన్నీ తీరిపోయినవి.
పిగట్టువారికి పెళ్లిలేదు. ఆయనకు ఒక ఉంపుడుకత్తె వుండేది. ఆమెవల్ల అతనికి చాలామంది పిల్లలు కలిగారు. ఆయనకు శాస్త్రీయమైన వారసులు లేనందువల్ల ఆయన వంశమూ ప్రభుబిరుదమూ కూడా బేవారసీ అయిపోయి అంతరించినవి.
పిగట్టుగారు చచ్చిపోయిన రెండు సంవత్సరాలకు ఆయనకు జరిగిన అన్యాయాన్ని గురించిన వివరాలు ఇంగ్లాండులో కంపెనీ అధికారులకూ పార్లమెంటువారికీ బాగా తెలిసినవి. చెన్నపట్నంలో ఆయన కార్యాలోచన సభలో నుండి ఆయనను ప్రతిఘటించి తుదకు ఆయనను ఖైదుచేసిన సభ్యులలో ఒకడైన స్ట్రాటనుగారు ఇంగ్లాండు పార్లమెంటులో కామన్సు సభలో సభ్యుడైనాడు. ఆర్కాటు నవాబుగారి పక్షమునవలంబించిన ఇంకా కొందరు దొరలుకూడా అక్కడ చేరారు. పిగట్టుగారి వ్యవహారాన్ని గురించి కామన్సు సభలో చర్చించబడి నప్పుడు వీరందరూ పిగట్టుగారి ప్రత్యర్ధుల చర్యలను సమర్ధించడానికి తంటాలు పడ్డారు గాని అందులోని నిజమంతా కామన్సు సభవారికి విశదమైంది. అంతట ఈస్ట్రాటసుగారున్ను, ఇతని తోడివారున్నూ చేసిన అక్రమాన్ని గుఱించి నేరాన్ని గుఱించీ విచారించి శిక్షించడానికి వీరిపైన ఒక క్రిమినలు కేసు దాఖలు చేయడానికి వుత్తర్వు చేయవలసిన దని కామన్సుసభవారు ఇంగ్లీషు రాజుగారికి విన్నపం చేశారు. ఆప్రకారం స్ట్రాటసు మొదలైన వారిమీద కేసుదాఖలై విచారణ జరుగగా వారినేరం రుజువు అయింది. అయితే వీరు చేసిన ఘోరాన్యాయానికి తగిన శిక్షమాత్రం వీరికి విధించబడలేదు. ఒక్కొకరికి వెయ్యి నవరసులు జుల్మానా మాత్రం విధించి వదిలివేశారు. (History of British Empire - Edward Thornton Vol.11 pp.199-213)
-----
కాశీ మశీదులో శివలింగం
క్రీ.శ. 1823-26 మధ్య కలకత్తాలొ తూర్పు ఇండియావర్తక కంపెనీవారి పరిపాలనలో ప్రధాన క్రైస్తవమతాధికారిగ నుండి హిందూదేశా మంతా తిరిగి చూసిన బిషప్ హెబరుగారు (Bishop Heber) తమ గ్రంధములో ఒకచిత్రమైన చరిత్రాంశాన్ని వుదాహరించారు.
1659-1707 మధ్య హిందూదేశాన్ని పరిపాలించిన ఔరంగజెబుచక్రవర్తి చాలా హిందూదేవాలయాలను పడగొట్టించి వాటిపై మశీదులు కట్టించినాడని ప్రతీతి. దేవాలయ స్తంభాలతోటీ రాళ్ల తోటీ దూలాలతోటీ నిర్మింపబడిన మశీదులు ఇప్పటికీ కాశీలో కనబడుతున్నాయి.
- ↑ * (Memoirs of Warren Hastings. Gleig.Vol.II. pp.106,113)