Jump to content

కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు/సత్యరాజా పూర్వదేశ యాత్రలు-ప్రథమభాగము-నాల్గవ ప్రకరణము

వికీసోర్స్ నుండి

అల్లము, బెల్లము, బట్టలు, తట్టలు, ఆవులు, మేకలు మెుదలైన వానిని జూపి వాని పేరు లేమని సైగచేయుచురఁగా నాతఁడు చెప్పుచు వచ్చెను. ఆ పేరులన్నియు నేను వేంటఁగోనిపోయిన తెల్లకాగితముల పుస్తకము మీద తెలుఁగులో వ్రాసికొని వల్లించుచు వచ్చితిని. మెుదట దినమున నేనమాటలను వ్రాయుచుండగా నతఁడుచూచి యత్యాశ్చర్యపడెను కారనము మీకు ముందుచెదను. మికు విసుకు దలగా నుండును అంతేకాక ఇటువంటి వర్ణముల వలన మీకును నాకును గూడ లాభము లేదు. విశేష ప్రయాస పడి మూడు మాసములలో వారి బాష నొక రీతిగా నేను ధారాళముగా మాటాడుటకు నేర్చుకొన్నాను.


నాల్గవ ప్రకరణము

ఒకనాఁడు సెలవు దినమున బోజనము చెసి కూరుచున్న తరువాత నా యజమానుఁడైన ఫాండీ భంగీ నన్నుఁజూచి జాలితో నీపత్నిపోయినది కాదాయని రంఢిభాషలో నడిగెను. వారి దేశమును మనము స్త్రీ మళయాళమన్నను స్వదేశస్థులు దానిని రంఢీదేశమని వాడుదురు. నన్నతఁడా ప్రశ్న యడుగఁగానే యాతని జ్ఞానమునకు నేనత్యాశ్చర్యపడి, అతని జ్యొతిశ్శాస్త్ర పరిజ్ఞానము వలననే యీ సంగతి తెలిసినది యెంచుకొని, ఆ శాస్త్రమును గ్రహింపవలెనను తలంపుతో “అయ్యా! నా భార్య స్వర్గస్థరాలైనసగంతి మీకెట్లు తెలిసినది?" అని యడిగితిని.


ఫాంఢీ: (చిరునవుతో) నీ పత్ని పోయినసంగతి మత్రమే కాక యామె నీచిన్నతనములోనే పోయినదని కూడ నీ రూపము చేతనే నేను గ్రహించినాను.

నేను (ఇది జ్యొతిశ్శాస్త్రము చేతఁ కాదు సాముద్రిక శాస్త్రము చేతనని మనస్సులో భవించుకొని): ఆయ్యా! నా రుపములో నేమి వింతయున్నది?

ఫాంఢీ: నీవు గడ్డమును మీసమును గొఱిగించుకొన్నందున నీ పత్ని పొయినదని తెలుసుకొన్నాను. ముక్కునందున నీ పత్ని నీవు మిక్కిలి బల్యములో నున్నప్పుడే మృతినొందెనని గ్రహించినాను. ఇంతకంటే నీరుపములో వింత యేమికావలెను?

మొట్టమొదట నాకీమాటలకర్థమైనది కాదుగాని తరువాత మాయజమనానులతో దీర్ఘ సంభాషణ చేసి వారి దేశము యెక్క స్థితిగతులను జనుల యొక్క యాచారవ్యవహారములను కొంత తెలిసికొన్న పిమ్మట నాకామాటల యర్ధము బోధపడి వారి దేశము మీద నా కెంతో కోపము వచ్చినది. అసమర్థుడు తన కోపమును వెలిపుచ్చుట వలన పరులకు హాని చేయుటకు మారుగా తానే హానిని పొందునని యెఱిఁగి నాకోపమును నా మనస్సులోనే యడఁచుకోవలసిన వాఁడనయితిని. నాకపుడాదేశామువిడిచి పాఱిపోవలెనన్న బుద్ధి పుట్టినది గాని పరులకు దాసుఁడైన యున్నందున నాకదియు సధ్యముగా కనఁబడలేదు. దైవ మేకలమున కేవ్వరినేమి చేయఁదలఁచునో యెరుఁగుట యెవ్వరికి శక్యమగును?

నేను జేసిన దీర్ఘ సంభాషణవలన నా యజమానుఁ డాకస్మికముగా యజమానిరాలయ్యెను; నేను జూచిన రాజభటులు మొదలైన పురుషు లందఱును స్త్రీలైపోయినారు. ఇ౦తవఱకు నేనూహించినట్లే యైనది కాని యీ దేశములో పురుషులు లేకపొవుటయు గాలికి బిడ్డలు పుట్టుటయు మాత్ర మబద్దములై పొయినవి. ఆ దేశమూలోను పురుషులున్నారు కాని, వారున్నను లేనట్టే భావింపవలసియున్నది. అక్కడయజమాన్యమంతయు స్త్రీలది. రాజ్యపరిపాలనము చేయువారు స్త్రీలు; రాజకీయోద్యోగులు స్త్రీలు; మంత్రులు స్త్రీలు; విద్వాంసులు స్త్రీలు; సైనికులు స్త్రీలు. వేయేల? ఆ దేశమంతయు స్త్రీమయము. స్త్రీలే సర్వస్వతంత్రలు; పురుషులు వారిదాసులు. ఆహా! లోకములో నింతకంటె దుర్దశ మఱియొకటియుండునా? ఈ సంగతి విన్న పురుషాభిమాని యగువాని దేహము భగ్గున మండదా? పురుషుల యందభిమానము గలిగి, పురుషుల యాధిక్యమును నిలుపుటలోఁ బ్రతిష్ఠ వహించి, పౌరుష భూషణులైన యోభరతఖండవాసులారా! మన దేశమునందు పురుషజన్మ మెత్తిన వారందఱును ఆయుధహస్తులయి బయలుదేఱి, నేను చెప్పిన గుహామార్గమున ఈ దేశమునకు వచ్చి, అన్యాయముగా పురుషుల పయి నధికారము చెల్లించుచున్న స్త్రీలనందఱిని ఘోర యుద్ధములో జయించి, ఈ పాడు దేశములోఁ గూడ పురుషుల స్వాతంత్ర్యమును నిలుపుఁడు. మర్మజ్ఞుఁడనైన నేను మీకు సహాయుఁడనై యుండఁగా మికాపజయ మెప్పుడును గలుగదు. మీరు భయపడఁ బోకుఁడు.

ఇక్కడ స్త్రీలది యాజమాన్య మన్నమాటయే కాని వారిలో నైకమత్యములేదు. వారిలోఁ గొందఱు పురుషులకు విద్య చెప్పించి వారికిఁ గొంతవఱకు స్వాతంత్ర్యము లియ్యవలెననువారు; బాహుసంఖ్యాకులైన రెండవ తెగవారు పురుషుల కెప్పుడును విద్య చెప్పింపఁగూడ దనియు విద్య చెప్పించుట వలన స్వేచ్ఛా విహరులై చెడిపొవుదురనియు భావించి పూర్వాచారమును నిలుపుటకు పాటుపడువారు. ఇది స్వతంత్ర రాష్టము సహితము కాదు. దొరతనము వారికిని ప్రజలకును ఐకమత్యము లేదు. పరిపాలనము చేయువారు స్వదేశస్ధులకంటె నెక్కువ నాగరికముగలవారై యాదేశమునకు దక్షిణముననున్న పర్వతములను దాటి వచ్చి దేశమును జయుంచిరి. వీరు తమ పురుషులకు విద్యచెప్పించికొని స్వాతంత్ర్యములనిచ్చి వారిని గౌరవముతోఁ జూతురు. వారా దేశములోని పురుషులనిమిత్తమై పాఠశాలలనుబెట్టి పురుష విద్య వ్యాపింపఁజేయవలెనని ప్రయత్నించుచున్నారుగాని గౌరవముగల కుటుంబములలోని మగపిల్ల లెవ్వరును బడికెక్కనందున వారిమనోరధమంతగా కొనసాగకున్నది. ప్రభుత్వమువారిప్పుడు పురుషుల నుపాధ్యాయులనుగా దిద్దుటకయి రాజధానిలో నొకపాఠశాలను క్రొత్తగాఁ బెట్టియున్నారు. దేశాచార విరుద్ధములయిన యిటువంటి కార్యములు చేయుచుండుట వలన దొరతనమువారియందు జనసామాన్యమున కనురాగము తక్కువగానున్నది. ఓ హిందూమహాజనులారా! ఇవియన్నియు మీ విజయమున కనుకూలనూచనలేకదా! నాయజమానురాలయిన ఫాంఢీభంగీగారు పురుషులకు విద్యచెప్పించి దేశమునకుఁ గ్రొత్తమార్పులను తేప్పింపఁగోరు తెగలోనివారు. తమ దేశములో పురుషులు చదువుటకును వ్రాయుటకును నేరనివారైయుండుట చేత తమభాషలోని పదములను నేను మన భాషలో వ్రాసికొనుచుండుట చూచి యితర దేశముల యందు పురుషులు వ్రాయనేర్చియుందురాయని నాయజమానురాలి కప్పుడత్యాశ్చర్యము కలిగినది. అప్పుడామె నామొగము వంకఁ జూచి నీవు మీ దేశములో భొగపురుషుఁడవాయని యడిగను. కాను కులపురుషుఁడనని నేను బదులు చేప్పితిని. ఆమె దొరతనమువారు నూతనముగాఁ బెట్టించిన పాఠశాల కెదిగిన పురుషుల నెవ్వరినైన సంపాదించవలెనని బహుదినములనుండి కృషిచేయుచు విఫల ప్రయత్నయయియుండి విద్యాభ్యాసము చేయుటకాసక్తి గలవాఁడనై యున్న నన్నుఁ జూచి సంతోషించి నన్నాపాఠశాలకుఁ బంపవలెనని యుద్దేశించుకొనెను. కొంతవఱకు భాషాభివృద్ది చేసినవారినిగాని యాపాఠశాలలోఁ జేర్చు కొనరుకనుక నాకింటికడ నిత్యమును రెండుగంటలసేపు విద్యచెప్పుటకెై భాంగీఫిండీయను పేరుగల యొక విద్యంసురాలిని నెల జీతమునుకుఁబెట్టెను. ఫీండీయను పదము మనదేశములోని శాస్త్రిపదముతో సమా నమైనది. కులపురుషునకు విద్యచెప్పుట వలన కులమువారుతన్ను బహిష్కారము చేయుదురేమో యని యామెకుమనస్సులో భయముకలిగినను, భీదదగుటచేత జీతమున కాశపడియు నాయజమానురాలు గొప్పరాజకియోద్యోగిని యగుటచెత నామె యనుగ్రహమును గోరియునాకుఁ బత్నీవ్రత ధర్మముల నుపదేశించి తనదేశమయొక్క యాధిక్యమును నకుబొధపరుపనెంచియు ఆ పండితురాలు నాకు విద్య చెప్పుట కొప్పుకొనెను. పత్నివ్రత శబ్దము వినఁగనే మీ మనస్సుల కద్భుతముగా నుండవచ్చును. ఆభాషలో భార్యకు ‘పంధీ’ యని పేరు. పంధీ శబ్ధమునకు యజమనురాలని యర్దము. భర్తను ‘భూదా’ యందురు. భూదాయనఁగా దాసుఁడని యర్థము. ఈ రెండు పేరులఁబట్టియే యక్కడ భార్యాభర్తలకుండు సంబంధమును మిరూహించి తెలిసి కొవచ్చును. మనదేశములో స్త్రీలకు పతివ్రతా ధర్మములుపదేశించునట్టే, ఆ దేశములో పురుషులకు పత్నివ్రతదర్మములు నేర్పుదురు మాయుపాధ్యాయిని ‘పంధీమేడిభూడీ’ యను గ్రంధములోని నూఱు పద్యములు నాకు నేర్పినది. ఆ పుస్తకమును ‘పత్నివ్రత ధర్మభోధిని’ యని తెనిఁగింపవచ్చును. వారిభాషలో ఒత్తక్షరము లధికముగానున్నవి. రెండేసియక్షరముల పదములు విస్తారము; పదములు తఱుచుగా ఆకారాంతములుగాను ఈ కారాంతములుగాను ఉండును; ఏకారము ప్రశ్నార్థకము. భాషసంగతి యటుండనిండు, ఫిండీగారు నాకుపదేశించిన పద్యములను మొదట నేను ప్రితితోవల్లించితినినిగాని నాకామెవానియర్దము చెప్పఁగానే నాకెక్కడలెని కొపమునువచ్చి, ఆమెనన్ను విడిచి యింటికి పొఁగానే దొడ్డిలొనిపొయి యెవ్వరును జూడకుండ నిప్పంటించి యాపుస్తకమును తగలఁబెట్టితిని. కానీ యిప్పటికిని నాకొపము తీరినది కాదు. ఆపద్యముల యర్థము విన్నపక్షమున నాకంటెను మికెక్కువ కోపమురావచ్చును. ఆకొపములవలన నైనను మిరీదేశమునకు వచ్చి యిక్కడిపురుషులను దాప్యమునుండి యుద్దరింతురేమోయను నమ్మకముతో వానిలోఁగొన్నిటి నిప్పుడు తెలిఁగించుచున్నాను. ఇవిరత్నములని చెప్పఁబడుట కర్హములయినవి కాక పొయినను మన దేశ సంప్రదాయమును బట్టి వీనికి నవరత్నములని పేరుపెట్టుచున్నాను.

శ్రీ సత్యరాజాచార్య కృతాంధ్రీకృత నవరత్న మంజరి.
               క.   పురుషునమ్మహిఁబతత్నియె
                    పరమంబగు దైవతంబు పత్నీసేవన్
                    నిరతనముచేసెడి పురుషుఁడె
                    పరమున నిహమున సుఖంబుఁ బడయుంజుమ్మీ.  ౧
               గీ.   ప్రతిదినంబును బురుషుండు పత్నికంటె
                    ముందుగాలెచి నదిలోనమునిఁగి జలము 
                    కలశమునఁదెచ్చి నిజపత్ని కాళ్ళుకడిగి
                    తానుశ్రీపాదతిర్థంబు త్రాగవలయు.            ౨
               క.   స్త్రీపాదతీర్థసేవన
                    మేపురుషుడుచేయు నెన్నియేఁడులు ధరలో 
                    నాపురుషుఁ  డన్నియుగములు 
                    పావములంబాసి మోక్షపదవి సుఖించున్.       ౩
              గీ.    కుష్టరోగిణియైనను గ్రుడ్డిదైన
                    భూగివికలాంగియైనను ముసలిదైనఁ
                    బత్నియెంగిలి భుజియింపవలయుసతము 
                    పుణ్యలొకంబుఁగాంక్షించు పురుషవరుఁడు.       ౪
              క.    ఏపురుషుఁ డతివయెంగిలి
                    పాపవుమతినేవగించి భక్షింపండో                      
                    
                    యాపాపాత్ముఁడునారక
                    కూపంబునఁగూలుఁజూవె కోటియుగంబుల్‌.       ౫
              క.    దూరమునఁజూచి పత్నిని
                    గారవమునలేచి యొంటికాలునఁబురుషుం
                    డోరఁగవంగఁగవలయును
                    గూరిమిఁగూర్చుండనిల్వఁగూడదుసుమ్మీ.         ౬
              క.    పురుషుడును గార్థభమున్‌
                    స్థిరముగ దండనములేక చెడిపోదురిలన్‌
                    గరుణఁదలంపక నెలకొక
                    పరియైనన్‌ గొట్టవలయుఁ బత్ని పురువునిన్.     ౭
              గీ.    పత్ని గొట్టినఁదిట్టిన బాధయిడిన
                    భోగపురుషులఁ బొందినఁ బొందకీర్ష్య
                    దరుణియే వురుషునకును దైవమనుచు
                    భక్తిననయంబు సేవింపవలయుఁజుమ్ము.        ౮
              గీ.    అతివలకు స్వేచ్చభూపణమైనయట్లు
                    పురుషులకు లజ్జయే మహాభూషణంబు
                    సూర్యచంద్రులు మొగమైనఁజూడకుండు
                    పరమపత్నీవ్రతుఁడెపొందుఁబరమగతులు.       ౯

ఫిండీగారు నాకు బహు విషయములను గూర్చి నీతులను బోధించుచు వచ్చినను చదివి చెడిపోదునేమోయను భీతిచేత నాకు ముఖ్యముగా ప్రతిదినమును తప్పకయెంతో శ్రద్ధతో పత్నీవ్రత ధర్మముల నుపదేశించుచుండెను. ఒకనాఁడావిద్వాంసురాలు నేను తెనిఁగించిన నవరత్నములలో నేడవరత్నమయిన “పురువుండును గార్థభమున్ స్థిరముగదండనము లేక చెడిపోదురిలన్‌” అనుదాని మూలశ్లోకమును నాకుత్సాహముతో బోధించి, ఆదండనము పురుషుల మేలుకొఱకేయని హేతుకల్పనములతో వ్యాఖ్యానము చేసి పురుషదండనము వలని లాభములను తెలుపుచుండఁగా, నా మనోగతి నామె కెఱుకపఱుప కుండవలెనని నేనెంతప్రయత్నము చేసినను నా మనస్సులో హాలాహలము వలె పుట్టి పయికి పొంగుచున్న కోపాగ్నియాగక నా కన్నుల వెంట వెడలఁజొచ్చినందున అసూయతో మొగ మింకొకవంకకు త్రిపుకొంటిని. ఆ నీతి నాకు రుచింపకున్నదని బుధ్దిమంతురాలయిన యామె గ్రహించి, పురుషులను స్త్రీలు కొట్టక యాదరింపవలెనని బోధించెడు యా దేశపు నవనాగరికుల మతము నాకు సమ్మతమనుకొని, అప్పుడే విద్యాభ్యాసములను మతిమాఱి నేను చేడిపోవుచున్నానని నానిమి తమకొంత వ్యసనపడి, ఈ విషయమున మీ దేశములో నేమియాచారమని నన్నామెయడిగెను. "బ్రాహ్మణస్యక్షణంకోప" మన్న నీతిని బట్టి శాంతిజలము చేత నేను కోపాగ్నిని నిమిషముతో చల్లార్చుకొని నవ్వు మొగముతో "మా దేశమునందు పురుషులే స్త్రీలనుకొట్టుదురు." అని సత్యము జెప్పితిని. నేను నవ్వులకు సహిత మసత్యము పలుకునని యామెతెలిసికోలేక, నావి పరిహాసోక్తులని భావించి నా మాటలను నామె నమ్మినదికాదు. ఈ రఁఢీదేశములో సదాచారసంపన్నలయిన స్త్రీరత్నములు నిత్యమును తమ పురుషులను వేణూదండముతో దండించుచుందురన్నచో ప్రత్యక్షానుభవము లేక పోవుటచే మాఫింఢీగారి వలేనేమిరును నమ్మకపోవచ్చును. కాని నేనిక్కడ కన్నులార ప్రత్యక్షముగాఁజూచిన సత్యములను వేదవాక్యాములవలె చెప్పుచుండట చేత పురాణగాధలను నమ్మ నలవాటుపడిన మీరుమాత్ర మట్టి యవిశ్వాస పాపమును గట్టుకొనరని నేను దృఢముగా నమ్ముచున్నాను.

ఆమె నామాటలను నమ్మక యట్టి వైపరీత్య మిశ్వరసృష్టిలో సంభవింప నేరదని వాదించుటచేత నా సత్యసంధతను గూర్చి సంశయ పడినందున కెంతయుఁ జింతనొంది, నామాటలనిజ మామెకు తేట పఱువవలెనని యిచ్చట స్త్రీలు పురుషులను కొట్టుట యెంత సత్యమో మా దేశమునందు పురుషులు స్త్రీలను కొట్టుట యంత సత్యమేయనియు కావలసిన యెడల మీకు నమ్మకము పుట్టునట్లుగా మా శాస్త్రముల నుండి కావలసినన్ని ప్రమాణ వచనమును జూపెదననియు, జెప్పి స్మృతూలలోనెల్లను సర్వోత్కష్టమయిన మనుస్మృతి యెనిమిదవ యధ్యాయము నుండి యీక్రింది శ్లోకములను జదివితిని.

              శ్లో.    భార్యా పుత్రశ్చ దానశ్చ శిష్యో భ్రాతాచ సోదరః
                    ప్రాప్తాపరాధా స్తాడ్యాః స్యు రజ్జ్వా వేణుదండేనవా.
              శ్లో.    పృష్టతస్తుశరీరస్య నోత్తమాంగే కథంచన
                    అతోన్యధాతు ప్రహర్ర ప్రాప్తఃస్యా చ్చౌరకిల్బిషమ్.

అప్పుడామె వీనియర్ధమేమని నన్నడిగినది. భార్యాను, పుత్రుని, సేవకుని, శిష్యుని, భ్రాతను, సోదరుని, తప్పు చేనప్పుడు త్రాటితోనైనను వెదురుకఱతోనైనను కొట్టవలయునని మొదటి శ్లోకమున కర్ధమనియు, శరీరము యొక్క వెనుకటి భాగమందే కాని నెత్తి మీద కొట్టరాదు మఱి యొక చోట కొట్టినవాఁడు చోర పాపమున పొందునని రెండవ శ్లోకమున కర్థమనియు, చెప్పి యాపయిని "ప్రాప్తాపరాధా" యని మూలములో నున్నను కొట్టుట ప్రధానముగాని నేరము చేయుట ప్రధానము కాకపోవుట చేత మా దేశములో పురుషులు నేరము లేక యే భార్యలను కొట్టుచుండుట శిష్టాచారమైనదనియు, నెత్తిమీదకొట్టఁ, గూడదని కూడ మూలములోఁ గానఁబడుచున్నను నెత్తకూడా శరీరములోని భాగమేయైనందున నెత్తి మీఁద కూడ శాస్త్రార్ధము ముందు భాగముందు బెత్తెడు మేరవదలివేసి వెనుకతట్టున కొట్టవచ్చనని వాక్య సమస్వయము చేసి సిద్ధాంత మేర్పఱిచి కర్మభూమియైన మా దేశమందలి పెద్దలు భార్యలను శిరస్సుమిఁదనే కొట్టుట సదాచారమయిన దనియు, నేను మనుస్మృతికి వ్యాఖ్యానము చేసి యర్ధ వివరము చేసితిని. ఆందు మీఁద ఫిండీగారు నా చేత నీశ్లోకములను శ్లోకార్ధములను రెండు పారులు విని, కన్నులు మూసికొని కొంతనేపాలోచించి నిమోసమిప్పటికి తెలిసినదని చిటికెవేసి, మొదటి శ్లోకములో "భార్య" యను చోట "భర్త" యనియుండువలె ననియు, "పుత్రుడు దానుఁడు శిష్యుఁడు భ్రాతి సోదరుఁడు" అని శ్లోకములో చెప్పఁబడిన వారందఱును పురుషులయి యుండఁగా మొదటి "భార్య" యని యొక్క స్త్రీయుండుట సంభవింపదనియు, అందుచేత నిదికుడ "భర్త"యని యుండఁగా నేను పరిహాసార్థముగా "భార్య"యని మార్చి చదివితిననియు, సిద్ధాంతము చేసి యంతటితోనైన నూరకూండక పురషులకు చదువువచ్చిన యెడల నట్టియనర్థములు సంభవించునని యెఱిఁగియే బుద్ధిమంతులయిన తమ పూర్వులు పురుష విద్య కూడదని సిద్ధాంతము చేసిరని తనయభాప్రాయమును బయలపెట్టినది. అక్కడ నాపక్ష మవలంబించి మాటాడు వారెవ్వరును లేకపోయినందున నా వాదబలమును నేనెఱిఁగియు వివాదము కూడదని యూరకుండవలసినవాఁడనయితిని.

అయినను నేనంతటితో నూరకుండక మన దేశములో పురుషులే స్వతంత్రులనియు, స్త్రీలు పురుషులకు లోఁబడియుందురనియు, మనుస్మృతిలో నుండి నెనుదాహరించిన ప్రమాణములు సత్యమయినవనియు, ఆమెకేలాగూనైనను మననునపట్టింపవలెనని నిశ్చియించుకొని పతివ్రతాధర్మములను గూర్చి మన పురాణాదులలోఁగల విషయము లనేకము లామెకుఁజెప్పితిని. చిప్పినవానినెల్ల నామె యాదరముతో విన మొదలు పెట్టినందున నాకుఁ గొంతప్రోత్సాహము గలిగి పతివ్రతాధర్మముల నామె మనస్సుకుఁ జక్కగా పట్టించనెంచి భర్త యెంగిలి భుజించుట పత్నికి పరమధర్మమని చూపుటకయి నాలాయనికథ నారంభించి యిట్లు చెప్పుఁజొచ్చితిని.

పూర్వకాలమునందు నాలాయనియైన యింద్రసేన మౌద్గల్యునకు భార్యాయయ్యెను. అతఁడు కుష్ఠరోగపీడితుఁడు. ఆ మహా పతివ్రత యాతనియుచ్ఛిష్టమును ప్రతి దినమును అమృత తుల్యముగా భక్షంచుచుండును. భోజనము చేయుచున్న కాలమునం దొకనాఁడతని యంగుష్ఠము తునిగి యన్నములోఁబడెను. అట్లుపడినను పతివ్రతా శిరోమణియైన యామె రోఁతపడక యాబొట్టనవ్రేలిని దీసి భక్తితో దూరముగా నుంచి యెంగిలియన్నమును పరమాన్నమువలె తినెను. అదిచూచి...

ఇంతవఱకుఁ జెప్పునప్పుటి కామె చెవులమూసుకొని నామట కడ్డమువచ్చి, పురుషుఁడైనైన నేనిన్నికథ లొక్కనిమిషములో కల్పించుట సంభవింపదని యెంచి మనకు శాస్త్రములు న్నవనియు వానిలో భర్తృశుశ్రూషాదులు చెప్పుఁబడియున్నవనియు కొంత వఱకు నమ్మినను నన్నాకథను సాంతముగాఁ జెప్పనీక, దురాగ్రహగ్రస్తురాలయి మన శాస్త్రములు రాక్షసులు చేసిన పాడుకథలని దూషించెను. అప్పుడు నేనును కోపమునుపట్టఁజాలక గురుధిక్కారపాపము వచ్చినను సరేయని యెదురుకొని మాటకు మాఱుమాటయాడి కొంత సేపు వాక్కాలహమునకు డికొంటిని. నన్ను దూషించినను నేనూరకుందును గాని శాస్త్రములను దూషించిన తరువాత శాస్త్రబద్ధుఁడనైన నేనెట్లురకూండఁ గలుగుదును? మా వాక్కలహము వలన నాటి సంభాషణ యంతటితో ముగిసినది. అందమూలమున నేను జప్పుఁదలఁకొన్న స్త్రీ ధర్మముల నామెకుఁ జప్పులేకపోతినిగదాయని నాకు విచారము గలిగినదిగాని మించినదానికి వగచిన ప్రయెజనముండదు. నాకు పాఠాముచెప్పక కోపముతో నాటిదినమామె తనయింటికి పోయినది. అంతటితో నా చదువునకు విఘ్నము వచ్చునట్లు కానఁబడెనుగాని యామె దీర్ఘక్రోధురాలు కానందునను, నేనుపోయి యామెకు క్షమార్పణము చేసి ప్రార్థించినందునను నాలుగు దినము లయినతరువాత యాధాప్రకారముగా వచ్చి నాకామె మరల విద్యచెప్పనారంభించినది. ఆ దినము మొదలుకొని యిఁక నేనామెతో మన దేశమును గూర్చి మాటాడకూడదని యొట్టుపెట్టుకొంటిని. అటు తరువాత జరిగిన వృత్తాంతమును మీకు ముందు ప్రకరణములయందుఁ జెప్పెదను.

ఐదవ ప్రకరణము

వెనుకఁజెప్పినట్లు మాకలహముతీఱి మేమిద్దఱమును సమాధానపడిన తరువాత మా ఫిండీగారికి నా మీఁద అపరమితానుగ్రహము వచ్చినది. ఆయనుగ్రహము వచ్చుటకు కారణము నేనామెకు పరమభక్తుఁడనయి మనదేశములో శిష్యులు గురువులకు శుశ్రూష చేయునట్లుగా సమస్తోపచారములను చేయుచు అనువర్తనముకలిగి మెలఁగుటయేకాని మఱియొకటికాదు. స్త్రీలయినను పురషులయినను విద్యచెప్పినవారు దైవసమానులు గనుక నేను స్త్రీకి దాస్యము చేయుచుంటినని మీరు నన్ను నిందింపక నాగురుభక్తికి మెచ్చుకొనవలెను. అదిపోనిండు. అటు తరవాత శిష్యవత్సలురాలైన యామె యాదేశజనుల యాచార వ్యవహారములు మొదలయిన వన్నియు నాకు మర్మము విడిచి చెప్ప మొదలు పెట్టెను. ఆమె యొకఁనాడు భోజనము చేసి కూరుచుండి యుత్సాహముతో తాంబూలచర్వణము చేయుచు కూరుచున్నప్పుడు నేనుపోయి గరువందనము చేసి చేతులు జోడించుకొని యెదుట నిలుచుండి భక్తిపూర్వకముగా నిట్లదిగితిని.

అమ్మా! మీరూ సర్వమును తెలిసినవారు. స్వభాముచేత పురుషులే యెక్కవ బలముగలవారో స్త్రీలే యెక్కువ బలముగలవారో మీ శిష్యునకు సెలవియ్యవలెను.