ఏడ జనిన మనోహరి జాడ లరసి

వికీసోర్స్ నుండి


ఏడ జనిన మనోహరి జాడ లరసి

కలగు హృదయంబు, నెమ్మది చలన మొందు

కనులు మూసిన, లోకమోహన మనోజ్ఞ

మూర్తి చిరునవ్వు జిలుకుచు మ్రోల నిలుచు.


హృదయ మక్కట! నవసుమ మృదుల మగుట

విరహ బాధ కన్నీరుగా వెడలరాదె?

అతి భయంకర సాంద్ర నీలాభ్ర పటలి

వాన గురిసిన ధవళిమ బూను గాదె?


పూత గోదావరీ స్రవంతీ తరంగ

మాలికా డోలికల నూగు మలయ పవన!

ఏల కొంపోవు, హృదయంబు నేర్చి వెడలు

వేడి నిట్టూర్పు గాడ్పుల వెలది కడకు?


పొంగి కిలకిల నవ్వి యుప్పొంగి పొరలు

తరగలార, నా బాధల దలప రయ్యొ!

ప్రాణనాథుండు మీ యుడురాజు మిమ్ము

వీడి నప్పుడు త్రుళ్ళింత లేడ కరుగు?


జలనిధులు దాటి యున్న తాచలము లెక్కి

హృదయ మది యేమొ క్రిందు మీ దెరుగకుండ

పక్షివలె రెక్కలం దాల్చి పరువు లిడును

మాటిమాటికి వలపుల పేతి కడకు!