ఏది నీ కిత్తు నందువా హృదయనాథ!
Jump to navigation
Jump to search
ఏది నీ కిత్తు నందువా హృదయనాథ!
కాన్కగా నే మొసంగగా గలను నీకు?
తారకారత్న భాసుర తారహార
సుప్రభా మాలికాజాల శోభితుడవు,
రాజరాజేశ్వరుడ వీవు, ప్రభుడ వీవు,
హృదయపతి వీవు! భవదీయ పదసరోజ
మృదు రజోలేశ దివ్య సంపదను వలచి
వీథి వీథుల వాడల విపినములను
భిక్షుకునిబోలె తిరుగాడు పేద నోయి!
కాన్కగా నే మొసంగగా గలను నీకు?
గాఢ లజ్జానుతాప సంకలిత హృదయ
నీరజదళాల రాలు కన్నీటిచుక్క
గాక-మనసార, వల పూర, గలత దీర
గాన్కగా నే మొసంగగా గలను నీకు?