ఇదె వచ్చుచున్నాను ప్రియురాలా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ఇదె వచ్చుచున్నాను ప్రియురాలా!

ఇక నిలువలేను నా ప్రియురాలా!


చిరకాల మీ యెడద చెరలో నిమిడి నేడు

పొరలి పొంగెడు దుఃఖ ఝరులపై పరువెత్తి | ఇదె వచ్చుచున్నాను |


ఈ విరహసంతాప మీ ప్రవాసక్లేశ

మే పగిది సహియింతు నెటులు జీవింతున్? | ఇదె వచ్చుచున్నాను |


ఆవలి దరి నీ పిలుపు పవలు రేలును మ్రోయ

మివుల తొందర నసుపు నవసి తపియించున్! | ఇదె వచ్చుచున్నాను |


శూన్యలోకము దాటి శుష్కదేహము దాటి

యన్యోన్య నిబిడ నిత్యాశ్లేష కాంక్షతో | ఇదె వచ్చుచున్నాను |