ఆకులో ఆకునై పూవులో పూవునై

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ఆకులో ఆకునై పూవులో పూవునై

కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై

ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?


గల గలని వీచు చిరుగాలిలో కెరటమై

జల జలని పారు సెలపాటలో తేటనై

ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?


పగడాల చిగురాకు తెరచాటు తేటినై

పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై

ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?


తరు వెక్కి యల నీలగిరి నెక్కి మెలమెల్ల

చద లెక్కి జలదంపు నీలంపు నిగ్గునై

ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?


ఆకలా దాహమా చింతలా వంతలా

ఈ కరణి వెర్రినై యేకతమ తిరుగాడ

ఈ యడవి దాగిపోనా ఎట్లైన నిచటనే యాగిపోనా?