ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు - దంపూరు నరసయ్య/నేటివ్ అడ్వొకేట్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

4

నేటివ్ అడ్వొకేట్

కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె మరణించిన తర్వాత ఆయన అనుచరుడు సి. వెంకటరాయులు నాయుడు ‘రైసింగ్ సన్' పత్రిక ప్రారంభించి, సంఘ సంస్కరణ, ఉదార విద్యావ్యాప్తి, లౌకికభావాలు ప్రోత్సహించడానికి కృషి చేసినట్లు, ఈ పత్రిక నిలిచిపోయిన తర్వాత, 1860 దశాబ్దంలో ఆరంభమైన నేటివ్ అడ్వొకేట్ ఆ ఆశయాలను కొనసాగించిందని, ఈ పత్రిక ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పడం తప్ప సుందరలింగం వివరాలేమీ ఇవ్వలేదు.1 అసైలం ప్రెస్ ఆల్మనాక్ 1867, 68, 69 మూడు సంపుటాల్లోని పత్రికల జాబితాలో ఈ పత్రిక పేరు కన్పించలేదు.

ఇద్దరు నరసయ్య సమకాలికులు నేటివ్ అడ్వొకేట్ పత్రికను గురించి రాశారు. వీరిలో మొదటి వాడు గోమఠం శ్రీనివాసాచార్యులు.2 మద్రాసులో ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ, రచయితగా, నటుడుగా, నాటకప్రయోక్తగా ప్రసిద్ధి పొందాడు. కొంత కాలం సూర్యాలోకం పత్రిక నడిపాడు.3 నరసయ్యను బాగా ఎరిగినవాడు. సూర్యాలోకం పత్రిక రెండేళ్ళు పూర్తిచేసుకొని, మూడో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో 1901 జూలై 18 సంచికలో తన ప్రత్యర్థి వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని 'స్వవిషయము' అనే శీర్షిక పెట్టి గొప్ప సంపాదకీయం రాశాడు. ఆ సంపాదకీయంలో మద్రాసు ప్రసిద్ధ పత్రికలను ప్రస్తావిస్తూ, పత్రికలకు పుట్టుక, చావు రెండూ సహజమే అంటూ ఈ విధంగా రాశాడు. .... సూర్యాలోకము పుట్టుటచే ఎవరికే గొప్ప లాభము కలిగెను? గిట్టెనేమి ఎవరికేమి నష్టము? రమారమి 25 సంవత్సరములకు ముందు “అథీనియం అండ్ డెయిలీ న్యూస్” అనబడు ఆంగ్లేయ దినవర్తమాన పత్రిక యొకటి యుండెను. అది జాన్ మిల్లర్ మొదలగు గొప్ప దొరలచే జరిపించ బడుచుండెను. చెన్నపురి గవర్నరులలో విశేషఖ్యాతి చెందిన లార్డ్ నేపియర్ గారితో దెబ్బలాడి, కోర్టుకెక్కి అపరాధమిచ్చి, మరునాడు శ్రీవారిని మరల నెదుర్కొని పత్రికా లేఖకులకుండు హక్కును స్థాపించెను. అట్టి పత్రిక యేమాయెను? దాని పేరు గూడా లుప్తమాయెనుగా !!! మె|| దంపూరు నరసయ్యగారిచే రమారమి 30 సం||లకు ముందు నేటివ్ అడ్వొకేట్ అనబడు నాంగ్లేయ వారపత్రిక యొకటి యారంభించబడెను. మన రాజధానిలో హిందువులలో, ఆంగ్లేయ భాషలో పత్రికను ప్రకటించుటకు ప్రారంభించినవారు ప్రప్రధమమున శ్రీ నరసయ్యగారే. వీరి పేరిపుడెవరికైనా తెలియునా?"

గోమఠం శ్రీనివాసాచార్యులు రాసినట్లు మద్రాసులో ఒక ఇంగ్లీషు పత్రికకు సంపాదకత్వం వహించిన తొలి దేశీయుడు నరసయ్య కావచ్చు. మద్రాసు పత్రికల చరిత్ర రాసిన వారెవరూ ఈ విషయాన్ని చర్చించలేదు. 1840 ప్రాంతంలో సి. నారాయణస్వామినాయుడు నేటివ్ ఇంటర్‌ప్రిటర్ (Native Interpretor) పత్రికను స్థాపించినా, ఆయన ఆ పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించాడో లేదో ఎవరూ స్పష్టంగా పేర్కొనలేదు. సి. వెంకటరాయులునాయుడు రైసింగ్ సన్ పత్రికను ప్రారంభించాడు. ఆయన తన పత్రికలోనే కాక, ఆనాటి ఇతర పత్రికలలో కూడా రాస్తూ వచ్చినట్లు తెలిసింది. ఒక ఇంగ్లీషు పత్రికకు సంపాదకుడైన మొదటి దేశీయుడు వెంకటరాయులునాయుడే అయి ఉండాలి. ఆయన తెలుగువాడు. ఆయన పత్రిక రైసింగ్ సన్‌కు మరొకరెవరైనా సంపాదకుడుగా వ్యవహరించి ఉంటే, మద్రాసులో ఒక ఇంగ్లీషు పత్రికకు సంపాదకుడుగా వ్యవహరించిన మొదటి స్థానికుడు నరసయ్యే అని తీర్మానించవచ్చు.

నేటివ్ అడ్వొకేట్‌ను ప్రస్తావించిన రెండో సమకాలికుడు ఒంగోలు వెంకటరంగయ్య. “చిన్నతనమున మద్రాసులో నుండగా నేటివ్ అడ్వొకేట్ (Native Advocate) అను నాంగ్లేయ పత్రికను సాగించుచుండిరి. అద్దాని జాలించి కీర్తిశేషులగు వెంకటగిరి మహారాజా రాజగోపాలకృష్ణ యాచేంద్రుల వారికి ఇంగ్లీషు ఉపాధ్యాయులుగా వెంకటగిరి చేరిరి” అని రాశాడు.4

తమిళనాడు ఆర్కైవ్స్‌లో నేటివ్ అడ్వొకేట్ పత్రిక అధిపతి డి. కృష్ణయ్య మద్రాసు ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి రాసిన ఉత్తరం లభించింది.5 ఆ ఉత్తరం :--

To

The Hone R.S. Ellis, Esq.C.B.

Ag. Chief Secretary to the Government of Fort Saint George.

Sir, We have the honour to enclose a copy of the "Native Advocate" newspaper, a weekly publication lately started by us, and respectfully wish to be informed if the Madras Government will do us the honour of subscribing to the paper in question.

Ours being a Native newspaper, we have secured a large number of subscribers of some of the most respectable classes among the population. Information of a public character, such as is usually placed by the Government at the disposal of the Press, will therefore be very thankfully received by us, and given insertion to in our columns.

Our humble and respectful request to you therefore is that you would be pleased to obtain the sanction of Government to forward us for the use of the "Native Advocate", all the official papers weekly placed on the Editors' table.

We have the honour to remain, Your very obedient servants,

Kristnama Naick's Tank Street,

Madras, 31

7th August 1867

D. Krishniah Brothers

Proprietors of the

"Native Advocate" newspaper

ఈ ఉత్తరానికి సమాధానంగా ప్రభుత్వం ఈ క్రింది ఆర్డరు పాసు చేసింది.

"Order thereon, 21st August 1867, No. 1032

The proprietors of the Native Advocate are requested to furnish Government with one copy of their weekly periodical, and are informed that the Editor will have access to such official documents as are placed at the disposal of the Press.

Sd xxx

Acting Chief Secretary

ఈ ఉత్తరం వల్ల కృష్ణయ్య, ఆయన ఇద్దరు సోదరులు కలిసి పత్రిక ప్రారంభించినట్లు రూఢి అవుతూంది. పత్రిక ప్రారంభించే సమయంలో కృష్ణయ్య పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో 'టీచరు' గా పనిచేస్తున్నాడు. పార్థసారథిశాస్త్రి అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో 'క్లర్కు' ఉద్యోగంలో ఉన్నాడు. నరసయ్య పచ్చయ్యప్ప ఉన్నత పాఠశాలలో 'అసిస్టెంట్ టీచరు'. 1867 ఆరంభంలోనే నరసయ్య తన తొలి పుస్తకం 'లెటర్స్ ఆన్ హిందూ మేరేజస్' ప్రచురించాడు. ఆ సంవత్సరం ఆఖరులో "హిస్టారికల్ స్కెచెస్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్” పేరుతో తన రెండో పుస్తకాన్ని ప్రచురించాడు.6 అప్పటికే ఆయనకు ఇంగ్లీషు భాషలో మంచి ప్రవేశం ఉంది. పత్రికారచనలో అభినివేశం ఉంది.

ఈ లేఖతో పాటు కృష్ణయ్య నేటివ్ అడ్వొకేట్ సంచికను జత చేసినట్లు తెలిపాడు. దురదృష్టవశాత్తు ఆ పత్రిక కాపీ ఫైల్లో కనిపించలేదు. పత్రికకు గౌరవనీయులైన చందాదారులు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు కూడా తెలిపాడు. "Lately started" అని అనడంవల్ల పత్రిక 1867 ఆగష్టులోనో, అంతకంటే కొంచెం ముందుగానో ప్రారంభమైనట్లు తోస్తుంది. 1869 అక్టోబరు మాసంలోనో, ఆ మరుసటి నెలలోనో నరసయ్య మద్రాసు విడిచిపెట్టాడు. నేటివ్ అడ్వొకేట్ పత్రిక అంతకు కొంచెం ముందుగా ఆగిపోయి ఉండవచ్చని ఊహిస్తున్నాను. ఆర్ధికబలం, పాఠకాదరణ లేక పత్రిక నిలిచిపోయి ఉంటుంది. ఆ కాలంలో దేశీయులు నడిపే పత్రికలకు పాఠకుల ఆదరణ ఉండేదికాదు. 1870లో నరసయ్యకు ఒక ఇంగ్లీషు అధికారి రాసిన జాబులో “No one told me about your insolvency" అనే మాటలు నరసయ్య పత్రిక నడిపి, ఆర్థికంగా చితికిపోయిన విషయాన్ని సూచిస్తున్నాయి. నేటివ్ అడ్వొకేట్ జీవించిన కొద్దికాలం, సామాజిక విషయాలకు, సంస్కరణ భావాలకు అంకితమై ఉంటుంది. నరసయ్య పత్రికా నిర్వహణలో తొలి పాఠాలు ఇక్కడే నేర్చుకొని ఉంటాడు.